ముస్లిం ఆకాంక్షల “చమన్” 

 chaman

దేశానికి స్వాతంత్రం సంభవించి డెబ్భై వసంతాలు గడిచిపోయాయి. గడిచిపోయాయి అని చెప్పటం చాలా తేలిక. కానీ…మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అంత సులభం గా మనకు చిక్కలేదంటే రాబోయే తరాలకు నమ్మశక్యం కాకపోవచ్చు. అంతగా స్వేచ్ఛకు అలవాటు పడిపోయాం. కానీ ఈ ఫలాలు మనకు అందించడానికి ఎంతోమంది వారి ప్రాణాలను ఫణంగా పెట్టారు. అప్పట్లో వారికి ఒక్కటే లక్ష్యం. భారత్ ను దాస్య శృంఖాలలనుంచి విముక్తి పొందించాలనేదే ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం ముందు ఎంతటి సమస్య అయినా దిగదుడుపే. అందుకే హిందూ,ముసల్మానులు స్వాతంత్య్రోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వర్తించారు. అమరులయ్యారు.

గతం గడిచింది. భారత యవనికపై ఎన్నెన్ని మార్పులు సంభవించాయో. అన్ని రకాలుగా ఎదుగుతున్నాం. సాంకేతికంగా అందనంత ఎత్తుకు దూసుకుపోయి అరుణ గ్రహానికి నిచ్చెన వేశాం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత యాభై ఏళ్లు ఒకలా గడిస్తే, ఆ తరువాత ఇరవయ్యేళ్లు వేగంగా దూసుకుపోయాయి అని చెప్పవచ్చు. కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇంటర్నెట్, ఎల్సీడీలు, ఎల్యీడీలు, బ్లూటూత్, వైఫై, కార్డ్ రీడర్….ఇలా సాంకేతిక భాషను వంటబట్టించుకోనివారు లేరు. పూట గడవనివారైనా సాంకేతికతకు అనుసంధానం కాకుండానైతే లేరు.
 మరి ఇంతటి వర్తమానంలోనూ ఒక వర్గం అత్యంత వెనకబాటుకు గురై చైతన్యలేమితో బాధపడుతోంది. అదే ముస్లిములు. వీరి వెనుకబాటు పాలకుల దృష్టికి వెళ్లలేదా? అంటే లేదు అని చెప్పడం అసత్యమే అనిపించుకుంటుంది. ఎందుకంటే..ఎన్నికలకు ముందు ప్రత్యేక బ్యాంకుగా ఆ వర్గం పాలకును ఆకర్షిస్తుంటుంది మరి. అటువంటి వర్గం నుంచి ఒక విద్యావేత్త, ఒక వైద్యుడు, ఒక ఇంజనీరు, ఒక పైలట్, ఒక లాయరు…బయటకు రావాలంటే ఆ కుటుంబం ఎన్నెన్నో త్యాగాలు…త్యాగాలంటే ఇక్కడ మిగతావారిలాగా చేసే పనులు వాయిదా వేయడం లాంటివి కాదు. పొట్ట మాడ్చుకోవడం. తాము తినాల్సిన తిండిని కూడా సదరు చదువుకునే కొడుకుకో, కూతురికో పెట్టడం లాంటివన్నమాట. ఆ వర్గమే మైనారిటీ వర్గం. చాలామంది అంటుంటారు. “ఏం…వాళ్లు మాత్రమే నిర్లక్ష్యానికి గురయ్యారా? మిగతావారిలోనూ పేదరికమే ఉంది కదా?” అని. నిజమే! లేదని కాదు. కానీ మిగిలిన వర్గాలలో ఎంతమంది అక్షరాస్యులున్నారో, ఎంతమంది ఉద్యోగస్తులున్నరో గమనిస్తే సరిపోతుంది. అంతేకాదు నిత్యం మన కళ్లముందు కనిపించేవారిపైనే కాస్త దృష్టి పెట్టండి చాలు. మిగిలిన వారు ఎటువంటి వృత్తులు చేస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఏ వృత్తులలో కొనసాగుతున్నారో. సైకిల్ పంక్చర్ చేసేవాడు, గాజులు అమ్మేవాడు, హోటల్ లో చాయ్,పాన్లు అమ్మేవారు ముసల్మానులే. అక్షరాస్యులు తక్కువ. రాబడీ తక్కువే. సంతానం ఎక్కువ. చైతన్య పరిచేవారు కూడా సరైన విధివిధానాలతో ముందుకు రావట్లేదేమో అనిపిస్తుంటుంది.
“చమన్” అవసరం చాలా ఉంది
ముస్లింలు అనగానే ఒకప్పుడు పరిపాలించిన రాచరికపు మర్యాదలనే ప్రస్తావిస్తుంటాయి చాలా పత్రికలు. గతం విడిచి వర్తమానంలో జీవించాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటిదాకా మనకు పత్రికలు రాలేదని కాదు. సమాచారం అందుబాటులో లేదనీ కాదు.ముస్లిముల అవసరాలను గుర్తించిన పత్రికలు ఉర్తూలో వెలువడ్డాయి. ఉర్దూ చదవగలిగిన వారికే ఆ పత్రికలు చేరాయి. చేరుతున్నాయి. ముస్లిముల ఉనికి సమాజానికి చేరువ కావాలంటే తెలుగు భాషలోనే ప్రత్యేక పత్రిక రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ బాధ్యతను చమన్ ఎత్తుకుంది. ముస్లింలకు కావాల్సిన అంశాలను స్పష్టంగా ప్రభుత్వానికి, ప్రజలకు చేర్చడానికి చక్కటి వారధిగా నిలుస్తుందనడంలో సందేహంలేదు. పాత్రికేయులుగా, కవిగా, రచయితగా, ఉద్యమకర్తగా అందరికీ స్కై బాబాగా సుపరిచితమైన ఎస్.కె.యూసుఫ్ బాబా సంపాదకత్వం వహిస్తూ త్రై మాసిక పత్రికగా త్వరలో  మన అందరిముందుకు రాబోతుంది “చమన్”. ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలను ఊపిరిగా చేసుకుని, జర్నలిజంలో అనుభవం సంపాదించి, జనజీవనంతో మమేకమైన ఉద్ధండుల సారథ్యంలో మలి ప్రతిగా వస్తున్న చమన్ లో ముస్లింలకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నింటిని స్కై బాబా గారు ఎంతో ధ్యానంతో తీర్చిదిద్దారు.
“చార్ సవాల్” అంటూ దున్న యాదగిరి, కోడూరి విజయ్ కుమార్, వి.బాలరాజు, వేదన భూపతి…వేసిన ప్రశ్నలు, సమాధానాలు పాజిటివ్ నెగెటివ్ అంశాలను ప్రస్తావించడం పత్రికకు  ప్రత్యేకతను ఆపాదించాయి. ముస్లింవాదంపై ప్రత్యేక గళమెత్తిన సారా అబూబకర్ ఇంటర్వ్యూ. మన అందరికీ సుపరిచితమైన, ఇష్టమైన కవి అఫ్సర్ ఇంటర్వ్యూను కూడా ఇదే ప్రతిలో చూడవచ్చు. అంతేనా…ముస్లింల మూలాలెక్కడ ఉన్నాయో, వారి పేదరికానికి కారణాలేమిటి?, వారెందుకు వెనుకబడ్డారు, ఈ వెనుకబాటుతనంలో ముస్లిం మహిళల వెనుకబాటు ఎక్కడ దాగుంది, ముస్లింలంటే ద్రోహులా?, రాజకీయంగా వారిపై జరుగుతున్న, జరిగిన కుట్రలేమిటి?…ఇలా అనేక అంశాల సమాహారంగా ఈ పత్రిక మనముందు ఉంటుంది.
చదవడానికి అందరూ సిద్ధమే కదా?!
*