ఇల్లే మనిషికి భరోసానా?

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిజమే! మనిషికే కాదు. పశు పక్ష్యాదులకు కూడా గూడు తప్పనిసరి అవసరం. వానరుడి నుండి నరుడు చలికీ, వానకీ, ఎండకీ గుహలు వెతుక్కుంటూనే వున్నాడు. కూడు, గుడ్డ, గూడు జీవికి ఎప్పటికీ ప్రాధమిక అవసరాలే. వీటి కోసం మనుషులు వారి వారి స్థాయిలకు తగినట్టుగా కొందరు కష్టపడుతున్నారు, మరికొందరు అలవోకగా అంతస్థులు కట్టగలుగుతున్నారు.

అలా చిన్న గూడు కోసం తపనపడ్డ ఒకానొక అల్పజీవి కధే .. కాళీపట్నం రామారావుగారి “ఇల్లు”.

ఈ కధకు కేంద్రం పావనరామయ్య కావచ్చుగానీ, మనుషులు సొంతానికి ‘గూడు’ వంటిదైనా సరే చిన్న కొంప కోసం పడే యాతన ఎలా వుంటుందో చూపించారు. ఇల్లు అనేది నెత్తి మీద నీడ కోసమే కాక, మనిషికి భరోసా ఎలా కలుగుతుందో … ఆ భరోసా మనిషి ధైర్యంగా నిలబడటానికి ఎలా ఉపకరిస్తుందో చెప్పిన కధ.

పావనరామయ్య అప్పు చేసి మరీ కట్టాడు. ‘ఆ అప్పు తీరే దారీ కనబడటం లేదు. ఇంకా ఇంటికి చేయవలసిన పనులూ అట్టాగే వున్నయ్యి. వాటికీ డబ్బు లేదు. ఇంకో వైపు ఎదిగిన ఆడపిల్ల పెళ్ళికుంది. ఆ పిల్ల బాధ్యత తీరాలి, పిల్లాడింకా చేతికంది రాలేదు! అయినా ఇంటికోసమే ఆ వున్న కొద్ది మొత్తం ఖర్చు చేశాడు, – “కనీసం తులం బంగారం గానీ, సెంటు భూమి గానీ, చేరడు ఇల్లుగానీ ఉంటే నేనానాడు అంత పిరికి బ్రతుకు బ్రతిక ఉండనక్కర లేదని, ఆ రోజుల్లో నేను తరచుగా అనుకునేవాణ్ణి.” .. ఇది పావనరామయ్య లాంటి వారి ఆవేదన. ఇలాంటి వారందరికీ ఇల్లు అందుకు అవసరం, – అంతే తప్ప, విలాసానికో, సొంత ఆస్తి పెంపకానికో కాదు.

రెక్కల కష్టం తప్ప సొంతాస్తి చిల్లీ గవ్వలేని వాళ్ళకు పిల్లలే ఆస్తి. చివరి దశలో ఒక ముద్ద పెట్టి కడ తేరుస్తారని ఆశ పడతారు. ఆ ఆశ ఎంత బరువైందంటే ప్రతి క్షణం పిల్లలు ఎక్కడ దారి తప్పుతారోనని కాపలా కాసుకునే ఆందోళన అంత హింసాత్మకమైంది. – “వాడికి చెప్పించిన చదువంతా నా కోసమే చెప్పించుకున్నాను. బ్రతికి వుంటే వాడికి పెండ్లి నా శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని చేసే వాణ్ణి.” .. చనిపోయిన తన పెద్ద కొడుకు మీద కుటుంబ భారం వుందని తలచి, ఆ పిల్లవాడిని క్రమశిక్షణ పేరుతో తిట్టిన తిట్లు, పెట్టిన చీవాట్లు తలుచుకుని పశ్చాత్తాప్పడతాడతను. అందుకే భార్య దుఃఖం మీద ఎవరేమన్నా అతను మాత్రం ఏమీ అనుకోడు.

శేష జీవితం కొడుకు మీద ఆధారపడి వుందన్న అభద్రత ఆయన్ను క్షోభ పెట్టింది. అది తలుచుకుంటూ, “మనిషిలోసాహసానికైతేనేమీ, బ్రతుకులో ఆనందానికైతేనేమీ మూలం భరోసా – అది లేనినాడు మనిషి జీవచ్ఛవంగా తప్ప, మనిషిగా బతకలేడు” … ఇదీ పావనరామయ్య అభిప్రాయం. అట్లా ఆయనకు జీవితంలో భద్రతనిచ్చే చిన్న పిసరు ఆశ ఏ కోశానా లేకుండా పోయింది.

అయితే బ్రతుకులో భరోసా అందరికీ వుందా? వస్తుందా? అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఏదో మేరకైనా ఇల్లుగానీ, తిండిగానీ అందరికీ సమకూరే అవకాశాలు లేని చోట కొందరికైతే ఇవి సమకూర్చుకోవడం ఎప్పటికీ ఒక జీవిత కాలపు యుద్ధమే! ఆ విషయం ఈ కధలో చెప్పకనే చెప్పారు. అద్దె కొంపలు కూడా లేని వాళ్ళను గురించి ప్రస్తావిస్తూ … ‘పోనీ పూరిపాకలు వేసుకోవచ్చు గదా! నామోషి అనుకోకపోతే …’ అన్న దానికి సమాధానంగా అవైనా వేసుకుని చూస్తే తెలుస్తుందంటారు.

నాలుగు తాటాకులు వేసుకున్నవాళ్ళు, అవి పీకి పారేయకుండా మున్సిపాలిటీ వాళ్ళ నోళ్ళు మూయించడం కోసం పడే నానా తిప్పలూ, సమర్పించుకునే నజరానాలు, ఎట్లా వుంటయ్యో చెప్తారు. అదే కాదు అసలు – “మీ గుడిసెలు అంటుకుంటే మా మేడలు కాలిపోతయ్యనే’ వర్గం, … ఆ వర్గాన్ని కాపాడే పాలనా యంత్రాంగం పని మీద ఇక్కడ విమర్శ పెడతారు.

పాలనా యంత్రాంగం కాపాడేది పై వాడి మేడల్నే కాదు … కింద వాళ్ళు ఎప్పటికీ మేడ కట్టకుండా తగు జాగ్రత్తలతో కనిపెట్టి వుండే బాధ్యత కూడా దాని నెత్తి మీదనే ఉంది. దాని కోసం చట్టాలు చేస్తుంది, ఆ చట్టాలు చేసే వాళ్ళు ఎప్పుడూ పైతరగతి వాళ్ళే!

పిల్ల పెళ్ళి కన్నా, ఇల్లు కట్టడానికే నిర్ణయించుకున్నావ్?”… అన్న బావమరిది ప్రశ్నకు – “ఈ ఇల్లు కొనడమొక్కటే నేను నా జీవితంలో ఆడగల జూదం – ఇల్లు కొంటే నేను నా ముసలితనాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను. అదృష్టం బాగుండి ఇల్లు దక్కించు కోగలిగితే నా కన్నా, నా పిల్లలు గొప్ప అదృష్టవంతులు కాగలరు. దక్కించుకోలేక పోవడానికి చాలా కాలం పడుతుంది. ఈ లోగా దేవుడు హాని చేయకపోతే నేను కన్ను మూసేయకపోను”… ఇంత అంతిమ కోర్కెగా ‘ఇల్లు’ ఎట్లా రూపు దిద్దుకుందీ?

మనిషి సొంతింటిలో చనిపోవాలనే కోరికా? లేక ఇల్లుంటే పిల్లలు, తల్లిదండ్రులను కనిపెట్టి చూస్తారన్న జిజ్ఞాసా? ఏది ప్రధానం? ఇందులో ఏది ముఖ్యమో తరువాత సంగతి గానీ, ఆ ఇంటికోసం జీవిత కాలమంతా పడే ఆందోళన అంతింతా కాదు.

“పశువులకూ, పక్షులకూ కూడా తమ స్వంత గూడంటూ వుంటుంది. మనిషి చచ్చిందాకా బతికి కూడా గూడు కట్టుకోలేక పోతున్నాడు.” దీనికి ఎవరిని ఏమనాలో తెలియడం లేదు,” .. “బ్రతుకు బ్రతుకల్లా శ్రమ పడి కూడ పెట్టిందంతా ధార పోసినా కానీ ఒక గూడు రాక పోవడం చాలా అన్యాయం.”

అట్టా మిగిల్చిన ‘ఫ్రావిడెంటు ఫండే’ గాక మరి కొంత అప్పు కూడా చేసి కట్టిన ఇల్లు ఎట్లాంటిదీ? ‘బొమ్మరిల్లంత’! కొడుకు పెళ్ళయి కోడలొస్తే ఎక్కడుండటమనే సమస్య ఇంటి కొచ్చిన వాళ్ళకే అర్ధమయినంత చిన్నది. గట్టిగా లావుగా వుండే వాళ్ళు ఒకరు నిల్చుంటే, రెండో వాళ్ళు వొరిగి నడిచేటంత ఇరుకు గది. ఆ ఇంటి కోసం పావన రామయ్య జీవితమంతా తపస్సు చేసి మరీ కట్టాడు.

అంత చిన్న ఇంటి కోసం కష్టపడటం సరే! మరి అంత చిన్న కొంప అతనికి భరోసా ఎలా అయ్యిందీ? ఎలా వచ్చిందీ? అసలు ప్రశ్న ఇది. ఈ దేశంలో భూమి లేని వాళ్ళు, గుడిసె లేనివాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు కోట్లాదిమంది వున్నారనే స్పృహ పావనరామయ్య వంటి వాళ్ళకు లేక పోవడానికి కారణం యాదృచ్ఛికం కాదు.

ఉద్యోగమొక్కటే జీవికగా ఎంచుకోవడం, ఏ పనైనా చేసి బతకగలమనే ధైర్యం లేకపోవడానికి కారణం ‘శారీరక శ్రమ’ చేయలేక పోవడం, ‘శ్రమ’ మీద నమ్మకం, విశ్వాసం లేకపోవడమే, ‘పావన రామయ్య’ పిరికితనానికి మూలం. ఇది అతని అస్థిత్వంలోనే ఉంది.

తను అలా జీవించలేదు … తన పిల్లలూ ‘శ్రమ’ మీద జీవించగలరన్న నమ్మకమూ లేక పోవడమే ఈ హింస కంతా కారణం. ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది లేరూ? అనుకుంటాడు తప్ప … వీధిలో ‘పునుగు’ లేసుకునైనా బ్రతుకుతారులే అనే సంకల్పం పావనరామయ్యకు కలగక పోవడమే అసలు సమస్య. అందువల్లే అన్నిటా లొంగుబాటునే ప్రదర్శిస్తాడు. చివరికి దేవుడు దయదలిస్తే కన్ను మూసేయకపోను!’ అని దుఃఖంతో తన కధను వినిపిస్తాడు.

శ్రమ మీద, శ్రమశక్తి మీద ఆధారపడక, దాని మీద విశ్వాసం లేకపోవడమే. ‘ఇల్లుంటే’ భరోసా వుంటుందని ఆశ పడతాడు. అయితే ‘ఇల్లు’ నిలుపుకోవడం అంతా సులువైందా? ఆ భరోసా నిలుస్తుందా?

-నల్లూరి రుక్మిణి

 10620207_1377561999204331_349738008332540516_o1970 నుండీ విద్యార్ధీ , మహిళా, పౌరహక్కుల ఉద్యమాలతో కలిసి నడిచిన నల్లూరి రుక్మిణి తన సామాజిక కార్యక్రమాల్లో భాగంగానే సాహిత్యం వైపు మళ్ళారు. అయితే ఇప్పటికీ సామాజిక ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. నల్లూరి రుక్మిణి ‘జ్ఞానం అందరిదీ’, ‘పరామర్శ’ అనే సాహిత్య వ్యాసాలు వెలువరించారు. ‘ప్రశ్నే ప్రశ్నార్ధకమైన వేళ’ ఆమె కవిత్వం. ఇంకా ‘నర్రెంక చెట్టు కింద’, ‘ఒండ్రు మట్టి’ ఆనే నవలలు రాశారు. ‘గీతల కావల’, ‘జీవన స్పర్శ’, ‘నెగడు’ ఆమె కధా సంపుటిలు. విప్లవ రచయితల సంఘంలో సభ్యురాలైన రుక్మిణి తన రచనలు బడుగు, బలహీన వర్గాలకు అండగా వుండాలని ఆకాంక్షిస్తారు.    

 

వచ్చే వారం ‘నో రూమ్ ‘ కధా పరిచయం కె.పి అశోక్ కుమార్

“ఇల్లు” కథ ఇక్కడ: