‘మాట’ కోసం దేశం దాటిన తస్లీమా!

Innaiah discussing with Taslima

2006 ఫిబ్రవరి 24న తస్లీమా  ఇంటివద్ద ఆమెతో చర్చిస్తున్న ఇన్నయ్య

శటానిక్ వర్సెస్ రచయిత సల్మాన్ రష్డీ ఫత్వాలకు గురయి న్యూయార్క్ లో స్వేచ్ఛగా వుంటున్నారు.  ఆయనే మహిళా సల్మాన్ రష్డీ అని తస్లీమాను సగర్వంగా పిలిచారు.

సుప్రసిద్ధ మానవవాది, ఇస్లాంలో  మూఢ నమ్మకాలకు వ్యతిరేకిగా ప్రసిద్ధి చెందిన తస్లీమా నస్రీన్ ను మొట్టమొదటిసారి  1994లో అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీలో నేను, నాతోపాటు నా భార్య కోమల, కుమార్తె డా.నవీన కలిశాము. యూనివర్సిటీలో ఇరాన్ విద్యార్థుల సెక్యులర్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో తస్లీమా  తన కవితలు చదివి వినిపించింది. ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆమె ఇంగ్లీషులో నెమ్మదిగా మాట్లాడింది. రాతలో ఉన్న బలం మాటలలో కనిపించలేదు.

సమావేశానంతరం ఆమెను కలిసి, మాట్లాడి ఫొటోలు తీయించుకుని యింటికి ఆహ్వానించాము. అప్పటికే ఆమెపై ఛాందస ముస్లిములు ఫత్వా జారీ చేయటం, ఆమె తన స్వదేశమైన బంగ్లాదేశ్ వదలి స్వీడన్ ఆశ్రయం పొందటం ఒక చరిత్ర. తస్లీమా తన జీవితాన్ని కవితా రచనలతో ప్రారంభించి వచన రచనలకు విస్తరించింది. ‘ది గేమ్ ఇన్ రివర్స్’ అనే కవితల సంపుటితో ఆరంభించింది.

1996లో రెండవసారి న్యూయార్క్ లో వారెన్ ఎలెన్ స్మిత్ (‘హూ ఈజ్ హూ ఇన్ హెల్’ ఫేమ్) తో కలిసి చేసిన విందులో తస్లీమా నస్రీన్ తో చాలాసేపు కాలక్షేపం చేశాం. అప్పట్లో తస్లీమా విపరీతంగా సిగరెట్లు తాగేది. నేను చనువుగా అది మానేయమని సలహా ఇచ్చాను. నా సలహా వలన కాకపోయినా ఉత్తరోత్తరా మానేసింది. అప్పటినుండీ వారెన్ ఆమెకు సంరక్షకుడుగా ఉంటూ, ఆమె వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ఎన్నో విధాల తోడ్పడ్డాడు.

తస్లీమా కవితలు అనేకం వెలువడ్డాయి. ఆమె అనుమతితో వాటిలో కొన్నిటిని నా భార్య కోమల తెలుగులోకి అనువదించింది. హేతువాది ఇసనాక మురళీధర్, కొన్ని గేయాలు తెలిగించారు. తస్లీమా బెంగాలీలో ప్రధానంగా రచనలు చేస్తుంది. వాటిని వివిధ భాషలలోకి అనువదించారు.

తస్లీమా విదేశాలలో పర్యటించటం, ఐక్యరాజ్య సమితి బహుమతులందుకోవడం, సెక్యులర్ హ్యూమనిస్టులు ఆమెకు మద్దతుగా నిలవడం, క్రమేణా ఆమె కీర్తి ప్రతిష్ఠలు  ఇనుమడించడం జరిగింది. మరోవైపు ఆమె రచనలను ఖండిస్తూ, ఇస్లాం పైన దాడి చేసినదని కనుక ఆమెను చంపేయాలని ముస్లిం సనాతనులు పిలుపు ఇచ్చారు. అందువలన భారత దేశంలో కూడా ఆమె రహస్యంగానే బతకవలసి వచ్చింది.

ఢిల్లీలో పునర్వికాస సంస్థ (రినైజాన్స్) వారు ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించింది. నేను సభలో పాల్గొన్నాను. ఇది 2002లో జరిగిన విషయం. గాంధీ పీస్ ఫౌండేషన్ లో ఆమెకు వసతి కల్పిస్తే బొత్తిగా సౌకర్యాలు లేవని బాధపడింది.అక్కడ కేవలం శాకాహరమే ఉన్నది. ఆమెను ఢిల్లీలో కానాట్ సర్కస్ లో హోటలుకు తీసుకువెళ్లి భోజనాలు చేశాం. ఢిలీ్లో చాలామంది  ముస్లింలు ఉన్నప్పటికీ తస్లీమాకు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు.

తరువాత 2006లో నేను, ఇసనాక మురళీధర్ కలకత్తాలో ఆమె నివాసానికి వెళ్ళాము. అప్పట్లో ఆమె రౌడెన్ వీధిలో వుండేది. ఆమె స్వయంగా వంట చేసి వడ్డించింది. తన పెయింటింగులు చూపింది. ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం. కలకత్తాలో సమావేశాలకు వెడుతూ వుండేది. శిబ్ నారాయణ్ రే మాట్లాడుతున్న సమావేశానికి వచ్చింది. అది కలకత్తా మధ్యలో రినైజాన్స్ సంస్థలో ఉన్నది.  అయినప్పటికీ ఆమెకు ఇబ్బంది కలుగలేదు. కానీ, రెండవ అంతస్తులో ఉన్న సమావేశానికి రావడానికి మెట్లు ఎక్కలేక కిందనే వుండిపోయింది. మేము కిందకు వెళ్ళి కాసేపు మాట్లాడి పంపించేశాము. కలకత్తాలో ఆమెకు శిబ్ నారాయణ్ రే పెద్ద అండగా వుండేవాడు. ప్రభుత్వం ఆమెకి సెక్యూరిటీ ఇచ్చింది.

బెంగాలీ రచయితలను కలుసుకోవటం చర్చించడం ఆమెకు ఇష్టం. బెంగాలీ సంస్కృతిలో పెరిగిన తస్లీమా ఆ వాతావరణంలోనే వుండడానికి ఇష్టపడింది. కానీ, ఆమె భావాల వలన ముస్లింలు ఆమెను ఉండనివ్వలేదు.

తస్లీమా ‘లజ్జ’ అనే పుస్తకంలో బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిములు జరిపిన అత్యాచారాలను ఏకరువు పెట్టి తీవ్ర నిరసన తెలిపింది. అంతటితో ముస్లిములు విచక్షణ విస్మరించి ఆమెపై విరుచుకు పడ్డారు. తస్లీమాకు డాక్టరుగా ప్రాక్టీసు ఉండేది. అది వదిలేసి పారిపోవలసి వచ్చింది. మళ్లీ తల్లి చనిపోయినప్పుడు రహస్యంగా వెళ్లి చూచి ఏదో ఒక విధంగా బయటపడింది. ఆమె విస్తృతంగా తన జీవిత చరిత్రను రాసి ముస్లిం సమాజాన్ని స్త్రీలపట్ల వారి అమానుషత్వాన్ని, చిన్నతనం నుండీ ఇస్లామును నూరిపోసి, పురుషులలో నిరంకుశత్వాన్ని ప్రబలింప చేయడాన్నితీవ్రంగా విమర్శించింది. ఆమె గ్రంథాలన్నీ బంగ్లాదేశ్ లో నిషేధించారు. చివరకు చాలా అభ్యుదయ వాదులమని చెప్పుకునే కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్ లో పరిపాలిస్తూ కూడా ఆమె రచనలు నిషేధించటం సిగ్గు చేటు. కలకత్తా హైకోర్టు ఆ నిషేధాన్ని తొలగించింది.

protecting Taslima

2008లో ప్రెస్ క్లబ్ హైదరాబాదులో ముస్లింలు దాడిచేసినప్పుడు తస్లీమా రక్షణకు ప్రయత్నిస్తున్న ఇన్నయ్య

‘షోద్’ అనే తస్లీమా రచనను ‘చెల్లుకు చెల్లు’ అనే పేరిట తెలుగులో కోమల అనువదించింది. దాని ఆవిష్కరణకు తస్లీమా 2007 ఆగస్టు 9న హైదరాబాదు వచ్చింది. హైదరాబాదు బేగం పేట ఎయిర్ పోర్టులో ఆమెకు స్వాగతం పలికి ఈనాడుకు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ కు తీసుకువచ్చాము. ఆమె రాక గురించి పబ్లిసిటీ ఇవ్వలేదు. భద్రతా దృష్ట్యా పరిమితంగానే విలేఖర్లను, కొందరు మిత్రులను ఆహ్వానించాము. ఆనాడు వేదిక మీద ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్ ఎమ్. నాగేశ్వరరావు, సుప్రసిద్ధ రచయిత్రి ఓల్గా, కోమల, నవీన ఉన్నారు. తస్లీమా చాలా మృదువుగా తన తీవ్రభావాలను వెల్లడించి, షోద్ నవల గురించి సంక్షిప్తంగా చెప్పింది. ఆ నవలలో ఇస్లాం ప్రస్తావన లేదు. మతపరమైన వాదోపవాదాలు లేవు. ఆమెపై ఉన్న ఫత్వా కారణంగా ఛాందస ముస్లింలు వెంటపడ్డారు.

కోమల అనువదించిన యంగ్ చాంగ్ పుస్తకం ‘అడవి గాచిన వెన్నెల’ (చైనాలో దీనిని నిషేధించారు.)ను ఆగస్ట్ 9, 2007 న తస్లీమా, ‘చెల్లుకు చెల్లు’ తోపాటు విడుదల చేశారు. రంగనాయకమ్మ దీనిపై 100 పేజీల సమీక్ష రాసి కోమల అనువాదాన్ని మెచ్చుకుంటూ అందరూ చదవాలన్నారు.

ప్రెస్ క్లబ్బులో కార్యక్రమమంతా ముగిసిన తరువాత ముగ్గురు మజ్లీస్ శాసన సభ్యులు తమ అనుచరులను వెంట బెట్టుకుని తస్లీమాపై అమానుషంగా దాడి చేశారు. పోలీస్ సహాయంతో ఆమె కలకత్తా వెళ్లినా ముస్లిం సంఘాలు వెంటబడ్డాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ ఆమెకు అండగా నిలవలేదు. దేశంలో ఉండనిస్తామంటూ జైలులో పెట్టినట్లు ఆంక్షలు విధించారు. దేశం వదిలి వెళ్ళిపోయి కొన్నాళ్ళకు తిరిగి వచ్చినా పరిస్థితి మారలేదు. సెక్యులర్ ప్రభుత్వమని చెప్పుకునే వారు ఇలాంటి ధోరణి అవలంబించటంతో తస్లీమా వెళ్లిపోవలసి వచ్చింది. కలకత్తాలో ఉంటే బెంగాలీ మాట్లాడుకోవచ్చని, తను పుట్టి పెరిగిన సంస్కృతికి చేరువగా ఉంటానని ఆమె ఆశించింది. చివరకు సాల్మన్ రష్డీ, అయన్ హర్షీ అలీ విదేశాలలో ఉండవలసి వచ్చింది.

తస్లీమా బంగ్లాదేశ్ కు పనికిరాకపోయినా ప్రపంచానికి, ప్రజాస్వామ్యవాదులకు హీరోయిన్. ఎన్నో దేశాలు ఆమెను ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తున్నాయి. అనేక రచనలు వెలువరిస్తూనే వుంది. ప్రస్తుతం కొన్ని నిబంధనలకు లోబడి ఢిల్లీలో వుండనిచ్చారు. బయటి ప్రపంచం మాత్రం ఆమెను స్వేచ్ఛగా పర్యటించడానికి, అభిప్రాయాలు వెల్లడించడానికి పిలుస్తున్నది. ఆమెతో స్నేహంగా వుండగలగడం నాకు ప్రత్యేక విశేషం. అనేక నాస్తిక, మానవవాద, హేతువాద సభలలో నిరంతరం పాల్గొంటున్నది. ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకుంటున్నది. బాల్య, యౌవన దశలో బంగ్లాదేశ్ లో మతపరమైన చిత్రహింసలు అనుభవించినా స్వేచ్ఛా లోకంలో మాత్రం స్త్రీలకు ఆమె ఆదర్శప్రాయంగా నిలిచింది. వేబ్ సైట్ లో ట్విట్టర్లో ధైర్యంగా, శాస్త్రీయంగా ఆలోచనలను అందిస్తున్నది. అక్కడక్కడా కొంతమంది ముస్లింలు భావ బంధాలు తెంచుకుని స్వేచ్ఛగా రచనలు సాగిస్తున్నారు.

Taslima,me, prof Amlan Datta

ఇన్నయ్య, తస్లీమా, ప్రొఫెసర్ అమ్లాన్ దత్

వారితో కూడా ఆమెకు పరిచయాలున్నాయి. ‘నేనెందుకు ముస్లింను కాదు’ అనే పేరిట ఇబన్ వారక్ రాసిన సుప్రసిద్ధ రచన కూడా బహుళ ప్రచారంలోకి వచ్చింది. ఇరాన్, సోమాలియా తదితర దేశాలలో రచయిత్రులు బయటకు వచ్చి స్త్రీలకు స్వేచ్ఛ కావాలని రచనలు చేస్తున్నారు. అయన్ హర్షీ అలీ అలాంటివారిలో ప్రముఖులు. ఆమె రచనలు కూడా కొన్ని కోమల తెలుగులోకి అనువదించింది. తస్లీమా చరిత్రలో నిలుస్తుంది. ఆమెతో స్నేహంగా వుండగలగడం మానవ వాదిగా నాకు గర్వకారణం.

తస్లీమా ప్రధానంగా బెంగాలీలో రాస్తుంది. ఇంగ్లీషులో వ్యాసాలు, కొన్ని కవితలు రాసింది. ఆమె ఉపన్యాసాలన్నీ రాసి, చదువుతుంది. అవి చాలా ఆలోచనతో ఉద్వేగంతో  జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ, సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం ఆక్రందించేవిగా వుంటాయి. ప్రపంచంలో ఆమె ఉపన్యాసాలు చాలా ఆకట్టుకున్నాయి. బెంగాలీ రచనలలో ముఖ్యంగా ఆమె జీవిత చరిత్ర ‘లజ్జ’ వంటి నవల, బంగ్లాదేశ్ లో నిషేధించారు. జీవితచరిత్ర ఏడు భాగాలుగా ప్రచురితమైంది.

అందులో ఇంకా కొన్ని ఇంగ్లీషులోకి రావలసినవి ఉన్నాయి. ‘ఫ్రెంచి లవర్’ అనే నవల చాలా గొప్పగా వుంటుంది. అందులో ఆమె స్వీయగాథ కూడా తొంగి చూస్తుంది. ఆమె రచనలు స్పానిష్, జర్మన్, ఫ్రెంచి భాషలలోనికి అనువాదమయ్యాయి. భారతదేశంలో హిందీ, మరాఠీ, తెలుగుతో సహా వివిధ భాషలలోకి కొన్ని పుస్తకాలు వ్యాసాలు వచ్చాయి. ఆమె వెబ్ సైట్ (taslimanasrin.com) నిర్వహిస్తున్నది.

– నరిసెట్టి ఇన్నయ్య

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సంజీవదేవ్ జీవితమే ఒక కళ!

san2

అమెరికా సందర్శించే యాత్రికులెవరైనా న్యూయార్క్ నగరంలో అప్ టౌన్ లో 107 వ వీధిలోకి వెడితే నికొలస్ రోరిక్ మ్యూజియం కనిపిస్తుంది. అందులో సంజీవదేవ్ కు రష్యన్ చిత్రకారుడు రోరిక్ కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు భద్రపరిచారు. లోగడ ఈ మ్యూజియంను సందర్శించినవారిలో మిత్రుడు చలసాని ప్రసాద్ ఉన్నారు. ఆయన ఆసక్తిని వెతుక్కుంటూ వచ్చిన ధోరణిని గమనించిన మ్యూజియం డైరెక్టర్ ఆయనకు ప్రత్యేకంగా ‘ఆర్ట్ పిక్చర్స్’ పుస్తకాన్ని బహూకరించారు. సంజీవదేవ్ చివరి రోజులలో ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను మ్యూజియంకు బహూకరించమని నేను కోరాను. ఆయన ఒక పట్టాన ఒప్పుకోలేదు. నేను పట్టు వదలక నేడు ‘మిసిమి’ సంపాదకుడుగా ఉన్న వల్లభనేని అశ్వనీకుమార్ ను తుమ్మపూడి పంపించాను. అమెరికా నుండి సంజీవదేవ్ కు ఫోన్ చేసి ఆ ఉత్తరాలు నికొలస్ రోరిక్ మ్యూజియంలో ఉంటే వాటికి భవిష్యత్తు ఉంటుందని, సరైన చోటికి చేరినట్లుంటుందని నచ్చచెప్పాను. ఆయన ఆ ఉత్తరాలను కుమార్ కు అప్పగించగా అవి భద్రంగా మ్యూజియంకు చేర్చారు. ఎంతో సంతోషించాను.

జీవిత చివరి దశలో కులు వాలీలో స్థిరపడిన నికొలస్ రోరిక్ ను కలిసి కొన్నాళ్ళు ఆయనతో గడిపిన సంజీవదేవ్ ప్రకృతిని ఆయనతో కలిసి ఆస్వాదించి, కబుర్లు చెప్పుకుని పరస్పరం చిత్రాలు వేసుకున్నారు. కళాకారుడుగా సంజీవదేవ్ కు అది గొప్ప అనుభూతి.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తుమ్మపూడి గ్రామంలో పుట్టి, చిన్నతనంలో కొన్నాళ్ళు కృష్ణాజిల్లాలో బంధువుల దగ్గర పెరిగిన సంజీవదేవ్ చదువులో స్కూలు దాటి పోలేదు. పిన్న వయసులోనే ఉత్తరాది సాహస పర్యటన చేసి అనేక అనుభవాలతో తిరిగి వచ్చారు. ఆయనలోని ప్రతిభను పసిగట్టిన నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర ప్రభ సంపాదకుడుగా సంజీవదేవ్ రచనలను, జీవితాన్ని దినపత్రికలో ప్రచురించి ప్రజలకు అందించారు. అంచెలంచెలుగా జీవిత అనుభవాలను రాసిన సంజీవదేవ్ ‘గతంలోకి’, ‘స్మృతిబింబాలు’, ‘తెగిన జ్ఞాపకాలు’ అంటూ గ్రంథస్తం చేశారు. బెంగాలీ ప్రభావం మరికొంత హిందీ ప్రభావం ఆయనపై ఉన్నా, రచనలలో కొత్తరకమైన తెలుగుదనాన్ని చూపారు. వాక్య నిర్మాణం, పదప్రయోగాలలో వినూత్నత కనిపిస్తుంది.

సంజీవదేవ్ కు విస్తృత పరిచయాలున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్, అసిత్ కుమార్ హల్దార్, భగవాన్ దాస్ (లెన్స్ లైన్ పత్రిక సంపాదకుడు), దేవులపల్లి కృష్ణశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, ఆచంట జానకిరామ్, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వంటివారి పరిచయాలతో చాంతాడంత జాబితా తయారవుతుంది.  ఆయన లేఖారాక్షసుడు. ఎవరిదగ్గర నుంచైనా ఉత్తరం వచ్చిందే తడవుగా సమాధానాలు రాసి పోస్టు చేసేవారు. కొందరికి తాను గీసిన బొమ్మలు కూడా జతపరిచేవారు. ఆ లేఖలన్నీ చాలావరకూ గ్రంథాలలో తొంగిచూశాయి. సంజీవదేవ్ చేత పీఠికలు రాయించుకున్నవారు చలం దగ్గర నుండి తపస్వి వరకు ఎందరో ఉన్నారు. సంజీవదేవ్ మాత్రం తుమ్మపూడి గ్రామం వదలలేదు. పెద్దా చిన్నా అందరూ ఆయన దగ్గరకే వచ్చేవారు. కొందరు రోజుల తరబడి ఆయన భార్య సులోచన ఆతిథ్యం స్వీకరిస్తూ ఇంట్లోనే ఆయన చెప్పేవి వింటూ ఆనందించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఒక దశలో డాక్టరేట్ డిగ్రీ ఇవ్వబోగా సంజీవదేవ్ నిరాకరించారు. అప్పుడు డిలిట్ డిగ్రీ ఇవ్వగా ఆయన స్వీకరించారు.

san1

సంజీవదేవ్ తో నా సన్నిహిత పరిచయ వయస్సు 35 ఏళ్ళు. కొన్నిసార్లు  ఆయన మా ఇంటికి రావడం మా పిల్లలకు బొమ్మలు గీసి ఇవ్వటం, మరికొన్నిసార్లు నేను కోమలతో సహా తుమ్మపూడి వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి, బోలెడు కబుర్లు చెప్పుకోవడం మంచి మధురానుభూతి. 1970 ప్రాంతాలలో నేను, చీమకుర్తి భాస్కరరావు, వెనిగళ్ళ వెంకటరత్నం, శ్రీరమణగా మారిన రాధాకృష్ణ కలసి సంజీవదేవ్ పుస్తకాలు ప్రచురణకు పూనుకున్నాం. ఇంగ్లీషులో రెండు, తెలుగులో రెండు స్టేట్ బుక్ క్లబ్ పేరిట ప్రచురించాము. అంతటితో ఆ ప్రయత్నం ఆగిపోయింది.

సంజీవదేవ్ తో నేను కొన్ని విశిష్టమైన వ్యాసాలు రాయించాను. తెనాలిలో మిత్రులు సూర్యదేవర హనుమంతరావుతో కలసి తుమ్మపూడి వెళ్ళి, ఆచార్య నరేంద్రదేవ్ రాసిన ‘బౌద్ధధర్మదర్శన్’ గ్రంథాన్ని ఇచ్చి, దాని ఆధారంగా వ్యాసం రాయమన్నాను. ఆయన నిర్దుష్టమైన వ్యాసం రాసి, ‘ప్రసారిత’ సామాజిక త్రైమాస పత్రికకు అందించారు. ఆ పత్రికను నేను, పోలు సత్యనారాయణ సంపాదకులుగా హైదరాబాదు నుండి కొన్నేళ్ళు నడిపాము. సంజీవదేవ్ కు ఎవరైనా కోరితే రాసే అలవాటు ఉంది. చాలా పత్రికల వాళ్ళు అలాగే రాయించుకునేవాళ్ళు. అందులో చిన్నా పెద్దా అనే తారతమ్యం చూసేవారు కాదు. అదీ ఆయన గొప్పతనం.

సంజీవదేవ్ హైదరాబాదు వచ్చినప్పుడల్లా తెలుగు యూనివర్సిటీలో గాని, అకాడమీలో గాని చిన్న సమావేశం ఏర్పాటు చేసేవారు. సంజీవదేవ్ రంజింపజేసే ఉపన్యాసకుడు కాదు. విషయ పరిజ్ఞానం ఉంటుంది కానీ, ఆకర్షణ కనిపించదు.

ఇంగ్లీషులో కొన్ని రచనలు, కవితలు, రాసిన సంజీవదేవ్ ఒక విధంగా పరోక్ష జీవిత చరిత్రను – హర్ లైఫ్ – అనే రచనలో ప్రతిబింబించారు. నేను అది చదివి అందులోని హీరోయిన్ మానస నీ జీవితాన్ని అద్దం పడుతున్నట్లున్నదే అన్నాను. కాదనలేదు గాని సమాధానంగా నవ్వి ఊరుకున్నారు.

san3

సంజీవదేవ్ కు నాకూ కామన్ గా అనేక మంది మిత్రులున్నారు. అందులో కొందరితో కలిసి మేము తుమ్మపూడి వెళ్ళి వస్తుండేవాళ్ళం. ‘రేపు’ పత్రిక సంపాదకుడు సి. నరసింహారావు, తుమ్మల గోపాలరావు, మండవ శ్రీరామమూర్తి ఉన్నారు. నేనూ, కోమల వెళ్ళినప్పుడు  కలసి భోజనం చేస్తుండగా ఆయన ఆవకాయ పచ్చడితో అన్నం కలిపి ఎర్రని రంగును సూర్యోదయం వలె ఉన్నది కదూ అంటూ భుజించేవారు. నాకు మాత్రం చూస్తుంటేనే కళ్లలోకి నీళ్ళొస్తున్నాయి, తింటే ఎలా వుంటుందో అనే వాణ్ణి. జీవితంలో కళాత్మకంగా గడవడం సంజీవదేవ్ ఆర్ట్. హైదరాబాదు వచ్చి, నార్ల వెంకటేశ్వర రావు ఇంట్లో ఉన్నప్పుడు నార్ల ‘గ్రంథాలయంలో ఉంటున్నాడు ఇంట్లో కాదు’ అనేవారు. నార్ల ఇల్లంతా పుస్తకాల మయం కావటమే అందుకు కారణం. జగదీష్ మిట్టల్, పి.వి.రెడ్డి వంటి కళాకారులతో సంప్రదిస్తుండేవారు. తెలుగు అకాడమీ సంజీవదేవ్ ను ఆహ్వానించి, ఆయన చేత రచనలు చేయించుకున్నది. అప్పుడే శ్రీధర్ (ఆర్టిస్ట్)  వంటివారు ఆయనకు తోడ్పడ్డారు. ఒకేఒకసారి అమెరికా వచ్చి తానాలో కూడా పాల్గొన్నారు.

మేమిద్దరం కలిసి కొన్ని సందర్బాలలో ఆలపాటి రవీంద్రనాథ్ (జ్యోతి, మిసిమి పత్రికల సంపాదకులు) ఇంట్లో ఇష్టాగోష్ఠిగా కాలక్షేపం చేసేవాళ్ళం. తనకెలాంటి నియమాలూ పట్టింపులూ లేవని సంజీవదేవ్ అన్నారు. లోగడ ఆయన ఆవుల గోపాలకృష్ణమూర్తిని ఒక విందులో సరదాగా ఏడిపించారు. అది శాకాహార, మాంసాహార విషయాలలోనూ, సిగరెట్టు పీల్చే విషయంలోనూ వచ్చింది. అది గుర్తుంచుకొని ఆయనకు చిన్న పరీక్ష పెట్టాము. భోజనానికి ముందు వేదోక్తంగా కొంచెం ఔపోసన పడదాం అన్నాము. మన రుషుల సంప్రదాయంలో మనం కూడా సోమపానం సేవిద్దాం అన్నాము. మా ముందు విదేశీ విస్కీ ఉన్నది. గ్లాసులలో పోసి ఇవ్వగా, అన్నమాట తిప్పుకోలేక ఆయన కొంచెం చప్పరించక తప్పలేదు. ఈ విషయం తెలిసిన ఆయన శిష్యపరమాణువులు కొందరు గురువుగారి చేత విస్కీ సేవింపచేసిన మీ సాహసం చాలా గొప్పదని అన్నారు. మేము కేవలం చమత్కారంగా చేసిన పని అది.

సంజీవదేవ్ పై అనేక వ్యాసాలు కవికుమార్ సేకరించగా, నేను ఎడిట్ చేసిన ‘సంజీవదేవ్ రచనల సమీక్ష, విశ్లేషణ’గా వెలువరించాము.

సంజీవదేవ్ చనిపోతున్న రోజులలో నేను అమెరికాలో ఉన్నాను. ఆ తరువాత మిత్రులు భాస్కరరావు వెబ్ సైట్ (www.sanjeevadev.tripod.com) ఏర్పరచగా అందుకు నేను పూర్తిగా సహకరించాను.

Photograph (197)

ఒక సభలో ఇన్నయ్య, సినారె, సంజీవ దేవ్

సంజీవదేవ్ తన అవగాహనలోకొచ్చిన ఏ విషయాన్నయినా తెలుగులో గాని, ఇంగ్లీషులో గాని అవలీలగా రాయగలరు. ఆయన రచనలు ఇంచుమించు అన్నీ వెలుగు చూశాయి. వాటిలో కొన్ని పునర్ముద్రణ కావలసి ఉన్నది. చలం ‘గీతాంజలి’కి సజీవదేవ్ రాసిన సుదీర్ఘ పీఠికను ఉత్తరోత్తర వచ్చిన ప్రతులను ఎందుకోగాని తొలగించారు. జెన్ బౌద్ధంపై ఎంతో బాగా రాశారు. వీటన్నింటికి మించి, సుప్రసిద్ధ చిత్రాలెన్నో వేయగా ఎస్వీ రామారావు మొదలైన చిత్రకారులు ఆశ్చర్యపడ్డారు కూడా.

జుట్టుతో ఉన్న సంజీవదేవ్ ను ఎవరైనా చూశారా అని, కనీసం ఫోటోలైనా ఉన్నాయా అని నేను అడుగుతుండేవాడిని. చూశామన్నవారు నాకు కనిపించలేదు. సంజీవదేవ్ పెళ్ళి ఫోటోను సి. భాస్కరరావు సేకరించి వెబ్ సైట్లో పెట్టినట్లు గుర్తు. ఏమైనా ఒక అరుదైన విశిష్ఠ మానవుడు సంజీవదేవ్. తన తత్వాన్ని లోతుపాతులతో కూడిన ఆలోచనలను Bio symphony  అనే ఇంగ్లీషు రచనలో ఆయన స్పష్టీకరించారు.

బాలబంధు బి.వి.నరసింహారావు అత్యద్భుతంగా రాసిన పాలపిట్టలు గేయాలను సంజీవదేవ్ ఇంగ్లీషులోకి అనువదించారు. అది పునర్ముద్రణ కావలసిన అంశం. సంజీవదేవ్ కు మూఢనమ్మకాలు, మతఛాందసాలు, బాబాలకి ప్రదక్షిణలు లేవు. ఆయన స్వేచ్ఛా ప్రియుడైన కళాజీవి.

 

ఒక అడుగు ముందుకీ…రెండడుగులు వెనక్కీ…గోపీచంద్!

AnnaiahTripuraneniGopichand (1)

‘ఎంత గుండె గలవాడికి గుండెపోటు’ అని గోపీచంద్ మరణించినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’లో సంపాదకీయం ఎత్తుగడగా ప్రస్తావించారు. గోపీచంద్ 52 సంవత్సరాలకే చనిపోయారు. అప్పటికే ఆయన రచనల ప్రభావం తెలుగు పాఠకులపై బాగా ఉన్నది.
స్వాతంత్రోద్యమం ముమ్మరంగా 1940 ప్రాంతాలలో సాగుతుండగా గోపీచంద్ కొత్తదారులు తొక్కి రాజకీయ చిన్న కథలు ప్రవేశపెట్టారు. అవి రష్యాలో చెకోవ్ కథలవలె ఆకర్షించాయి. కాంగ్రెసు వారిని సోషలిస్టు కమ్యూనిస్టు వర్గాలను వినూత్నంగా విమర్శిస్తూ రాడికల్ ప్రజాస్వామిక పద్ధతులలో చిన్నకథలు రాశారు. ఎంతో విషయాన్ని కుదించి కార్టూన్ లో చూపినట్టే గోపీచంద్ చెప్పదలచుకున్న విషయాన్ని చాకచక్యంగా చిన్న కథలలో చెప్పారు.
త్రిపురనేని గోపీచంద్ తెలుగులో ఈ పక్కీని అనుసరించిన తొలి రచయిత అనవచ్చు.  ‘భార్యల్లోనే ఉంది’., ‘దేవుడి జీవితం’ వంటి కథల్ని రాసి 1940 ప్రాంతాలలో ఎందరికో ఉత్తేజాన్ని కలిగించిన భావ ప్రచారకుడు. త్రిపురనేని రామస్వామి ఆయన తండ్రి. 1930 నాటికే తండ్రి రచనల, భావ వికాస ఉద్యమాల ప్రభావంతో గోపీచంద్ కాలేజీ చదువులు సాగించారు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ. చదువుతుండగా ‘శంభుక వధ’ ఇతివృత్తంతో కళాశాల మేగజైన్ లో పదునైన వ్యాసం రాశాడు.
కొప్పరపు సుబ్బారావు రాసిన ‘శాస్త్ర దాస్యం’ అనే విమర్శనాత్మక గ్రంథానికి గొప్ప పీఠిక రాశాడు. రాజకీయోపన్యాసాలు చేస్తూ అధ్యయన తరగతులలో ఎందరినో సుశిక్షితులను చేశారు.
గందరగోళం పడిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో చూపడానికి ఒక కథలో రైల్వే ప్లాట్ ఫారం మీద బండి వచ్చి ఆగినప్పుడు జనం హడావుడిగా వున్న సన్నివేశంలో ఒక వృద్ధుడు కాసేపు తన చుట్టను గొడుగు కర్ర అనుకుని, గొడుకర్రను చుట్ట అనుకోవటం గోపీచంద్ చమత్కారంగా వర్ణిస్తాడు. మానసిక విశ్లేషణ చేయడంలో ఆయన చెయ్యి తిరిగిన వ్యక్తి.
“భగవంతుడు లేడు. సంఘంలోని ఈ హెచ్చు తగ్గులు భగవంతుడు సృష్టించాడని చెప్పటం మోసం. నీతి నియమాలు ప్రకృతిలో నియమబద్ధతకు సంబంధించినవే” అనే తార్కిక అంశాలు మానవవాద శాస్త్రవేత్త ఎమ్. ఎన్. రాయ్, తన తండ్రి రామస్వామి వలన ఆయనకు సంక్రమించాయి. (పుటలు : సత్యాన్వేషణ. పేజీ- 145,149) అంతటితో ఆగక గోపీచంద్ ఇంకా ముందుకు వెళ్ళి ఇలా రాశాడు. “ఆధ్యాత్మిక నాగరికత అనే మత్తులో పడిఉండటం విదేశీ ప్రభుత్వానికి మంచిది కనుక అదే ప్రోత్సహిస్తుంది”. (ప్రాచ్య పాశ్చాత్య నాగరికత – 1938 ప్రజామిత్ర – పేజీ-70). గూడవల్లి రామబ్రహ్మం సంపాదకత్వాన వెలువడిన ప్రజామిత్రలో గోపీచంద్ అలాంటి వ్యాసాలు రాయడం వల్ల అనేకమంది యువకులపై ఆయన ప్రభావం పడింది.  “ఏ దృక్పధమైనా మానవుడి పరిణామానికి దోహం ఇచ్చేదిగా ఉండాలి. అతని మీద పెత్తనం చెలాయించేదిగా ఉండకూడదు” (పేజీ-171). 1939లో  గూడవల్లి రాంబ్రహ్మం తీసిన రైతుబిడ్డకు గోపీచంద్ డైలాగు రాశారు. అందులో శక్తివంతమైన సంస్కరణాయుతమై ధోరణి వ్యక్తమైంది.  ఇది 1938 నాటికి మద్రాసులో ఆరంభమైన చైతన్య దశ.
“పదార్థం తనకు తానే పరిణామం చెందుతుంది. ప్రకృతి నియమ బద్ధత గలది” (సత్యాన్వేషణ, పేజీ-145). గోపీచంద్ కు సంక్రమించిన తాత్విక ధోరణి. శాస్త్రీయ దృక్పథం కూడా. త్రిపురనేని గోపీచంద్ రచయితగా రంగప్రవేశం చేసే నాటికి (1930 ప్రాంతంలో) ఉన్నవ లక్ష్మీ నారాయణ ‘మాలపల్లి’, అప్పుడే వెలుగు చూచింది. ఆచార్య రంగా ఆరోజుల్లోనే ‘హరిజన నాయకుడు’ పేరిట అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ నవల రాశారు.   త్రిపురనేని రామస్వామి అప్పట్లో జస్టిస్ పార్టీ  ప్రభావంలో వుండేవారు. ‘సూతపురాణం’, ‘శంబుక వధ’, ‘భగవద్గీత’, వంటి రచనలతో తెలుగువారిలో కదలిక తెచ్చిమార్పులకు పునాది వేశారు. పెళ్ళిళ్ళలో సంస్కృత మంత్రాలు బదులు తెలుగులో ప్రమాణాలు ప్రవేశపెట్టారు. గోపీచంద్ నేపథ్యం అది.
అటువంటి కీలక దశలో రెండో ప్రపంచ ఆరంభ సమయంలో పునర్వికాసోద్యమ కర్త మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రలో ప్రవేశించాడు. కాంగ్రెస్ విధానాలకు మార్గాంతరంగా రాడికల్ ప్రజాస్వామిక పార్టీ పెట్టారు. శాస్త్రీయ ఆలోచనలు ప్రజలు తమ స్వామ్యాన్ని నిలదొక్కుకునే ధోరణులు రాయ్ స్టడీ క్యాంపుల ద్వారా వెలుగులోకి తెచ్చారు. అవి గోపీచంద్ ను ఆకట్టుకున్నాయి. అప్పుడే పట్టాభి సోషలిజం వంటి రచనలు గోపీచంద్ చేశారు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. మార్క్సిజాన్ని ఔపోశనం పట్టి ‘మార్క్సిజం అంటే ఏమిటి?’ అనే పుస్తకం రాశారు. ఆనాడు సోషలిస్టు భావాలు కూడా యువతను ఆకట్టుకుంటుండగా సోషలిస్టు ఉద్యమ చరిత్ర రాశారు.
ఎ.సి. కాలేజీ నుండి వివాహ జీవితంలో అడుగిడిన గోపీచంద్ న్యాయవాద వృత్తి కోసం లా చదివారు. కాని ఆ వృత్తిలో ఆయన రాణించలేదు. అయితే మద్రాసులో వుండగా గూడవల్లి రాంబ్రహ్మం గారితో పరిచయమైంది. అదొక మలుపు. రాంబ్రహ్మం కృష్ణాజిల్లా నుండి మద్రాసు వచ్చి, ‘ప్రజామిత్ర’ పత్రిక నడిపారు. సినిమా రంగంలో సంస్కరణ చిత్రాలు తీశారు. మరోపక్క ఎం.ఎన్. రాయ్ ను ఆహ్వానించి, ఆయన వ్యాసాలు, వార్తలు తన పత్రిక ద్వారా జనానికి అందించారు. అప్పుడే గోపీచంద్  ఎం.ఎన్. రాయ్ వ్యాసాలు కొన్ని తెలుగులోకి ‘ప్రజామిత్ర’ ద్వారా అందిచారు.
ఆనాడు ఎం.ఎన్. రాయ్ రచనలు పత్రికలు ప్రచురించేవికావు. ఆయన కొత్త విశేషాలు, శాస్త్రీయ పంథా రాజకీయాల్లోకి తెచ్చారు. భారతీయ చరిత్రను వైజ్ఞానిక పంథాలో రాసి, పుక్కిటి పురాణాలు ఆధారాలు లేని గాథలు దూరంగా పెట్టాలన్నాడు. కాంగ్రెస్ పార్టీని అట్టడుగు నుండీ బలోపేతం చేసి, ప్రజలు పాల్గొనేటట్లు చేయాలన్నాడు. దేశానికి పునర్వికాసం అవసరమన్నాడు. స్వాతంత్ర్యం రాకముందే రాజ్యాంగాన్ని ముసాయిదా రూపొందించుకోవాలన్నాడు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తూ, మతాల్ని వ్యక్తిగత స్థాయిలో అట్టెపెట్టుకోవాలన్నాడు. రాజకీయాలలో శాస్త్రీయ పంథా సాధ్యమేనన్నాడు. గాంధీని విమర్శించటం, మితవాద కాంగ్రెస్ ను వ్యతిరేకించటం కారణంగా ఎం.ఎన్. రాయ్ ను, ఆయన పెట్టిన పునర్వికాస ఉద్యమాన్ని నాటి మీడియా కూడా ఆదరించలేదు. ఆ భావాల్ని తెలుగులో రాసిన గోపీచంద్ వ్యాసాలు కూడా చిన్న పత్రికలకే పరిమతమయ్యాయి.
తెనాలిలో ప్లీడర్ గా గోపీచంద్ ఏమంత పేరులోకి రాలేదు. కాని రాడికల్ హ్యూమనిస్ట్ గా ఖ్యాతి ఆర్జించాడు.
ఎం.ఎన్. రాయ్ ఉత్తరోత్తరా తెనాలి వచ్చినప్పుడు త్రిపురనేని రామస్వామి, చలం గార్లతో చర్చా సమావేశం జరిగింది (1941-42). గోపీచంద్, ఆవుల గోపాలకృష్ణ మూర్తి యీ సమావేశ కర్తలు. ఆ తరువాత కొద్ది కాలానికే త్రిపురనేని రామస్వామి చనిపోయారు (1943 జనవరి) గోపీచంద్ పూర్తి స్థాయిలో ఎం.ఎన్. రాయ్ భావ ప్రపంచంలో నిమగ్నమయ్యారు. చాలా లోతుకు వెళ్ళారు.
గోపీచంద్ మిత్రులలో సహచరులలో అబ్బూరి రామకృష్ణారావు, జీవి కృష్ణారావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, పాలగుమ్మి పద్మరాజు, ఆలపాటి రవీంద్రనాథ్, పి.వి.సుబ్బారావు మొదలైన వారు ఉండేవారు.
ఆనాటి గడ్డు రాజకీయ సాంఘిక వాతావరణంలో గోపీచంద్ గట్టిగా నిలిచాడు. ఒకవైపు రచనలు చేస్తూ, మరో పక్క అధ్యయన తరగతులలో పాల్గొంటూ, పార్టీని పటిష్ట పరచాడు. రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో కమ్యూనిస్టులు “సామ్రాజ్య వాదయుద్ధం” అంటూ దానిని వ్యతిరేకించారు. చరిత్ర తెలిసిన ఎం.ఎన్. రాయ్, బి.ఆర్. అంబేద్కర్ లు యుద్ధ స్వభావాన్ని వివరించారు. జర్మనీ, జపాన్, ఇటలీలు కలసిన నేపధ్యంలో చూడాలన్నారు. వారు గెలిస్తే ఫాసిజం, నాజీయిజం మళ్ళీ ప్రపంచాన్ని ఏలుతాయని, ఇండియా మరో 200 ఏళ్ళు పరాయి పాలనలోకి పోతుందన్నారు. యుద్ధంలో ఇంగ్లండ్ గెలిస్తే, యుద్ధానంతరం దేశాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి తప్పని సరిగా వస్తుందన్నారు. కనుక బ్రిటన్ ను యుద్ధంలో సమర్థించాలన్నారు. కమ్యూనిస్టులు దీనిని వ్యతిరేకించి, ఎం.ఎన్. రాయ్ ను తిట్టారు.
అప్పట్లో హిట్లర్ తో సంధి రాయబారం నడిపిన రష్యా నియంత స్టాలిన్, భజనలో కమ్యూనిస్టులు నిమగ్నమయ్యారు. కాని అచిర కాలంలోనే రష్యాపై జర్మనీ దండెత్తడంతో కమ్యూనిస్టులు గుక్క తిప్పుకోలేక పోయారు. సామ్రాజ్యవాదయుద్ధం కాస్తా ప్రజా యుద్ధంగా మారింది. రష్యా ఎలా చెబితే అలా నడచిన కమ్యూనిస్టులు, సొంత ఆలోచన చేయలేక పోయారు. గుడ్డిగా దేశంలో ఎం.ఎన్. రాయ్ ను, వ్యతిరేకించారు.
మరో వైపు కాంగ్రెస్ వారు దూర దృష్టి లేకుండా ప్రవర్తించారు. సుభాష్ చంద్ర బోస్ ఉద్రేకంగా హిట్లర్ ను వెనకేసుకొచ్చాడు. రాయ్ అందులోని లోపాన్ని చూపి హెచ్చరించాడు.
అలాంటప్పుడు ఎం.ఎన్. రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టారు. శిక్షణ తరగతులు నడిపారు. అంతర్జాతీయ రాజకీయాల విడమరచి చెప్పారు. రచనలు చేసి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయ ధోరణి తెచ్చారు. గోపీచంద్ ఆ పంధాలో తెలుగులో రచనలు చేశారు.
ఆనాడు బలంగా వున్న సోషలిస్టు ఉద్యమాన్ని పరిశీలించి, చరిత్ర రాసి అందించారు. జయప్రకాశ్ నారాయణ, రాం మనోహర్ లోహియా, మధు లిమాయే, అశోక్ మెహతా, అరుణా అసఫ్ అలీ వంటి వారు ప్రముఖ పాత్ర వహించిన సోషలిస్టు పార్టీ, ఉద్యమ చరిత్రను గోపీచంద్ విశ్లేషించారు.
మరో వైపు గాంధీ అనుచరుడుగా పట్టాభిసీతారామయ్య 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. బోస్ ను ఓడించారు. పట్టాభి  సీతారామయ్య కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాశారు. గాంధీకి సన్నిహితుడుగా బందరు నుండి ఇంగ్లీషులో పత్రిక నడిపారు. ఆయనకు వంట బట్టని సోషలిజం గురించి గోపీచంద్ విమర్శనాత్మక రచన చేశారు.
అటు కమ్యూనిస్టులకూ ఇటు కాంగ్రెస్ వారినీ ఎడాపెడా ఎదుర్కొన్ని, విమర్శలు చేస్తూ, వ్యంగ్య రచనలు చేసిన గోపీచంద్ తొలి సారిగా తెలుగులో రాజకీయ కథలు రాశారు. సిద్ధాంతాలను అతి తేలిక భాషలో విడమరచిచెప్పారు. రాడికల్ డెమొక్రటికీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మూఢనమ్మకాలను ఎదుర్కొన్నారు. కవితలు, సాహిత్య రంగంలో విశ్వనాధ సత్యనారాయణ వంటి తిరోగమన వాదుల్ని బాగా తిప్పి కొట్టారు.
బెజవాడ నుండి బండి బుచ్చయ్య నడిపిన ‘ములుకోల’ పత్రిక, తెనాలిలో ప్రారంభమైన ‘రాడికల్’ పత్రిక, గూడవల్లి రాంబ్రహ్మం ‘ప్రజామిత్ర’ మాత్రమే గోపీచంద్ రాజకీయ రచనలు ప్రచురించేవి.  దిన పత్రికలు ‘ఆంధ్రప్రభ’,   ‘ఆంధ్రపత్రిక’,  మిగిలిన పత్రికలు ‘కృష్ణా పత్రిక’ వంటివి గోపీ చంద్ రాడికల్ విమర్శలు ప్రచురించేవిగావు. ఆ మాట కొస్తే వార్తలు సైతం వేసేవి కావు.
1942లో ‘ప్రజామిత్ర’ ఆగింది. 1943 జనవరిలోనే త్రిపురనేని రామస్వామి చనిపోయారు. ఆయన తుది వరకూ పురాణాల్ని, ఛాందసాల్ని, మూఢనమ్మకాల్ని ఎదుర్కొంటూ పోయారు. రాను రాను కులతత్వం పై ధ్వజం ఎత్తి, తన పేరులో ‘చౌదరి’ కూడా చివరలో తొలిగించుకున్నారు. కాని ఆయన 50 సంవత్సరాలకే చనిపోయారు. ఆయన భావ ప్రభావం మాత్రం గోపీచంద్ పై ముద్ర వేసింది. ఆ తరువాత ఎం.ఎన్. రాయ్ రావడంతో గోపీచంద్ భావ పరిణితి బాగా విస్తరించి, ఆలోచనా పరిధిలోతు పాతుల్ని చవిచూచింది. శాస్త్రీయ పంథా అంటే ఏమిటో గోపీచంద్ గ్రహించారు.
తెనాలిలో గోపీచంద్ సూతాశ్రమంలో ఒక ఆకర్షణీయ వ్యక్తి అయ్యారు. ఆయన చుట్టూ రచయితలు, కవులు, కళాకారులు, ఎందరో కొలువు తీర్చేవారు.  గోపీచంద్ తెనాలిలో పీఠాధిపతి అయ్యారు. ఇది 1945 వరకూ సాగింది. ఈలోగా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ మేధావులలో కొందరిని ఆకట్టుకున్నది. కొందరు రచయితలు పదునైన పుస్తకాలు వెలువరించారు. వారిలో కోగంటి రాధా కృష్ణమూర్తి, పి.వి. సుబ్బారావు వంటి వారి రచనలకు గోపీచంద్ పీఠికలు రాశారు.
గోపీచంద్ స్థానంలో గుత్తి కొండ నరహరి రాష్ట్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శి అయ్యారు. తెనాలిలో ఆనాడు ఆవుల గోపాలకృష్ణమూర్తి రాడికల్ హ్యూమనిస్ట్ గా, ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా చాలా ప్రాముఖ్యత వహించాడు. ఆయన వ్యాసోపన్యాసకుడు, అడ్వకేట్. అనువాదాలు కొన్ని చేసి రాయ్ భావ ప్రచారం గావించాడు. ఎం.ఎన్. రాయ్ ను త్రిపురనేని రామస్వామికి, చలానికి పరిచయం చేసిన కీలక వ్యక్తి, ఆయన చుట్టూ ఎందరో యువకులు, కవులు, గాయకులు, కళాకారులు, విద్యార్థులు వుండేవారు. ఆకర్షణీయమైన ఉపన్యాసాలు, పదునైన ఘాటైన విమర్శలు ఎజికె బలం.
గోపీచంద్ కు యిదంతా యిష్టం వుండేది కాదు. తన పీఠాధిపత్యానికి ఎదురుండరాదని ఆయన అభిమతం. కాని ఎజికె ఆకర్షణముందు గోపీచంద్ పనికిరాలేదు. చివరకు గోపీచంద్ తమ్ముడు గోకుల్ చంద్ కూడా ఎజికె అంటే విపరీత అభిమానం చూపేవాడు. ఎందరో రచయితలు తమ పుస్తకాలకు ఎజికె చేత పీఠికలు రాయించుకున్నారు. ఎజికె అంటే గోపీచంద్ కొంత బెరుకుగా వుండేవాడు. ఎదుటబడి ధైర్యంగా మాట్లాడే వాడు కాదు.
అఖిలభారత రాడికల్ హ్యూమనిస్ట కాంప్ లలో సైతం ఎం.ఎన్. రాయ్ ను ఎదుర్కొగలిగిన ఎజికె తన పీఠాధిపత్యానికి ముప్పు అని గోపీచంద్ భావించాడు.
1946  మళ్ళీ సినిరంగంలో ప్రవేశించడానికి మద్రాసు వెళ్ళారు. అదొక పెద్ద మలుపు. గోపీచంద్ సినీరంగంలో అన్ని పాత్రలు నిర్వహించారు. అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, సంభాషణలు యిలా వివిధ కోణాలు చూశారు. సినీరంగం భిన్నలోకానికి చెందినది. అక్కడ తళుకు బెళుకులూ, ఆకర్షణలు, రామణీయకతలు, కష్ట నష్టాలు, రసవత్తర రమ్యతలు అన్నీ గోపీచంద్ ను చుట్టుముట్టాయి. డబ్బు రాలేదు. శృంగార సుడిగుండాలు సరేసరి. ‘లక్ష్మమ్మ’ సినిమాతో గోపీచంద్ సాధారణ జీవితం గడపడం కష్టమైంది. మద్రాసులో సినీ కళాపోషణ రామణీయకతల నుండి గోపీచంద్ ను బయటపడేయడానికే ఆయన్ను పాండిచేరి అరవిందాశ్రమం ఆచంట జానకీ రాం తీసుకెళ్లారు. అంతటితో కొన్నాళ్ళు అరవిందుడి ఆధ్యాత్మిక అయోమయంలో పడిపోయాడు. దానిని సమర్థించడానికి పూనుకున్నాడు. కాని బ్రతుకు దెరువు ఆధ్యాత్మికతలో కష్టం, సంసారం యీదాలిగదా. కనుక కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ గా చేరారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వంలో ఆకాశవాణి ఉద్యోగిగా హైదరాబాద్ లో వున్నారు.
వయస్సు వచ్చేకొద్దీ కొందరు మెదడుకు పదను పెడతారు. ఎదుగుతారు. బెర్ట్రాండ్ రస్సెల్ అందుకు ఆదర్శం. మనమధ్యలో నార్ల వెంకటేశ్వరరావు ఉదాహరణ. గోపీచంద్ అందుకు భిన్నంగా మానవ హేతువాదం నుండి ఆధ్యాత్మిక అంధ విశ్వాసంలోకి దిగజారి పోయాడు. అది సమర్థించుకోడానికి రాతలు చేబట్టాడు. పాత జ్ఞాపకాలు, అనుభవాలు యితివృత్యాలుగా తీసుకొని, తన రచనా పాటవంతో, సమర్థించుకున్నాడు. అలా వెలువడిన వాటిలోనే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, మెరుపులు మరకలు పేర్కొనవచ్చు.
తెనాలిలో తన సహచరులుగా రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో వున్న వారిని, తన తండ్రిని, తనను పాత్రలుగా చిత్రించి రాసిన పుస్తకమే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. అదంతా అరవింద పూర్ణయోగం చేబట్టిన కారణంగా, దానిని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రాసిందే. దానికి తోడు తన పీఠాధిపత్యం ఆరు పువ్వులు మూడు కాయలుగా తెనాలిలో వెలగకపోడానికి అడ్డొచ్చిన వారిని దుష్ట పాత్రలుగా పెట్టారు. జి.వి. కృష్ణారావు, ఆలూరి బైరాగి, కోగంటి రాధాకృష్ణమూర్తి, ఆవుల గోపాలకృష్ణమూర్తి ప్రభృతులు పాత్రలు కాగా, తనను ఉత్తమ వున్నత ఆదర్శపాత్రగా సమర్దించుకున్నాడు.
వడ్లమూడి గోపాలకృష్ణయ్యను ‘సజ్జలు’ అని ఎద్దేవ చేస్తూ చిత్రించాడు. అయితే తను అంతగా చెప్పేదేమీ లేదని ఉన్నది ఉన్నట్లే కక్కేస్తాడనే అర్థంలో అలా రాశాడు.  ఆద్యాత్మిక వాదిగా గోపీచంద్ లో రాగ ద్వేషాలు రోజు రోజుకూ పెరిగిపోగా తన సహచరులపై మరొక నవల ‘మెరుపులు మరకలు’ రాశాడు. ‘రేడియో కేంద్రంలో పాత్రలు ఎందుకు మౌనం వహిస్తాయి?’ ఆ నవలకు దీటుగా మళ్ళీ నవలలు వెలువరించి, బాగా తిప్పికొట్టారు.
అలా దిగజారుతూ పోయిన గోపీచంద్ చివరి దశలో సాయిబాబా భక్తుడుగావడం పరాకాష్ఠ. ఆలోచన చచ్చిపోయిన దశ అది.
గోపీచంద్ ప్రతిభావంతుడైన తెలుగు రచయిత. బాగా చదివాడు. బాగా చదివించగలడు. అటువంటి గొప్ప తనం అతని తత్వవేత్తలు రచనలో చూడవచ్చు.  గోపీచంద్ తాత్మిక విద్యార్థికాదు. బి.ఏ చదివి, లా ప్రాక్టీసు చేసిన వ్యక్తి. సొంతగా   తత్వశాస్త్రాలు చదివాడు. అంత వరకూ బాగానే వుంది. చివరి దశలో అరవింద్ ఆధ్యాత్మిక పులుముడు సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడాడు. దానిని సమర్థించడానికి తత్వవేత్తలు లో ప్రయత్నించడం దారుణం.
ఇక అరవిందో ఒక కల్ట్ శాఖాధిపతి. నమ్మకాలు ప్రచారం చేసిన వ్యక్తి. ఆయన చెప్పే అడ్డదిడ్డమైన పూర్ణయోగం, క్రమం అన్నీ మూఢనమ్మకాలే. వీటిని తెగబలిసిన భాషలో యిమిడ్చాడు. కాని తత్వం ఏదీ లేదు. అందుకే తాత్వికులలో ఆయన యిమడడు. అయితే గోపీచంద్ అరవిందో భక్తుడుగా ఆయన్ని సమర్థిస్తూ పుస్తకాన్ని ముగించాడు.
గోపీచంద్ సన్నిహితులు ఆయనవలె, రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో ఆ తరువాత మానవ వాద ఉద్యమంలో కృషి చేసిన వారు రావిపూడి వెంకటాద్రి, ఎన్.వి. బ్రహ్మం. వారిరువురూ వివిధ సందర్భాలలో గోపీచంద్ ను మద్రాసులో హైదరాబాద్ లో కలిశారు.
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాలో పాత్రల్ని గురించి, తెనాలిలో కొందరిని దృష్టిలో పెట్టుకొని రాసిన తీరు గురించి ప్రశ్నించారు. గోపీచంద్ దాటేశారు. ఎన్.వి. బ్రహ్మం పట్టు విడవక, ఆవుల గోపాలకృష్ణమూర్తి గురించి నవలలో రాసింది  విఫలమైందని కూడా ఎత్తి పొడిచారు. గోపీచంద్ తప్పించుకోడానికే ప్రయత్నించారు. అంతకు మించి ఆయన బయట పడలేక పోడానికి కారణం ఆయన గిల్టీ మనస్తత్వమే. బాపు చేత వేయించిన ముఖ చిత్రంలో ఎ.జి.కె, జి.వి.కె, రామస్వామి, గోపీచంద్ పోలికలు వున్నాయి.
ఆద్యాత్మిక వాదానికి, హేతువాదానికి సమన్వయం చేయటానికి గోపీచంద్ రచనలు ఉద్దేశించాయని కొందరు సందర్ధించబోవటం అపహాస్యమైన విషయం. ఆధ్యాత్మిక వాదంలో ఆలోచన తాకట్టు పడుతుంది. అందులో మనిషి పెరగడు. హేతువాతం అనంతం. నిరంతర శాస్త్రీయ దృక్పదంతో సాగిపోతూ కొత్త విషయాలను స్వీకరిస్తూ తమ పాత విషయాలను సరిదిద్దుకుంటూ పోతుంటుంది. ఇది అభ్యుదయ విధానం. ఇలాంటిది ఆధ్యాత్మికతలో ఉండదు.
ఇలా సాగిపోయిన గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’ రచన చేశారు (ఇది ఆలూరి భైరాగి కవిని ఉద్దేశించినది అనే అభిప్రాయం లేకపోలేదు).
‘తత్వవేత్తలు’   రెండు భాగాలుగా మార్క్స్ తో మొదలెట్టి అనిబిసెంట్ తో ముగించాడు. అరవిందో తో ముక్తాయింపు పలికాడు. ఇంగ్లీషులో విల్ డ్యురాంట్ రాసిన ‘దిస్టోరీ ఆఫ్ ఫిలాసఫి’ ప్రధాన ఆధారం చేసుకున్నాడని, దీనితొలి ప్రచురణ కర్త, బొందలపాటి శివరామకృష్ణ సదుద్దేశ్యంతోనే నాతో చెప్పారు. ఎవరైనా సరే ఆధార గ్రంథాలను స్వీకరించక తప్పదు. గొప్ప తత్వవేత్తలు-బెర్ట్రాండ్ రస్సెల్, దాస్ గుప్త, ఎం.ఎన్. రాయ్ వంటి వారు తమ రచనలకు ఆధారాలు చూపి, తరువాత తమసొంత అభిప్రాయాలు చెప్పారు. గోపీచంద్ తత్వవేత్తలలో అలాంటి చిత్త శుద్ధిలోపించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాసినట్లున్నది.
చాలామంది తత్వవేత్తల గురించి అతి సులభశైలిలో చెప్పారు. అది హర్షించదగింది. అయితే గోపీచంద్ కు ఏది తత్వశాస్త్రం,  ఏది కాదు అనే విచక్షణ లేదు. అందుకు తగిన అకడమిక్ జ్ఞానం, క్రమశిక్షణ లేదుగనుక యీ దోషం వచ్చింది.
రష్యాలో బయలుదేరిన ఒక మూఢనమ్మకాల మాత బ్లా వెస్కీ చెప్పిన అంశాలే దివ్య జ్ఞాన సమాజం అయింది. ఆమె భక్తురాలుగా అనిబిసెంట్ చివరలో ఇండియా వచ్చి ఆ ప్రచారం చేసింది. కథలు అల్లింది. అలాంటి ఆమెను తత్వవేత్తలలో చేర్చడం తత్వశాస్త్రానికి అవమానం.
ఆర్య సమాజం హిందూ మతానికి సంస్కరణ వాదంగా బయలుదేరి కొంత వరకు వ్యాపించి, ఆగిపోయింది. దీనికి వేదాలు ప్రమాణ గ్రంథం. అది తప్ప మిగిలినవి పక్కన బెట్టాలన్నారు. దానిలో భాగంగా అనేక సంస్కరణలు అమలు పరచడంలో దయానంద సరస్వతి కృషి చేశారు. వివాహ పద్ధతి కూడా ఒకటి వున్నది. అయితే వీరికి తత్త్వ శాస్త్రం ఏదీ లేదు. కాని గోపీచంద్ వీరిని చేర్చడం అసంబద్ధం.
ఇక చివర చివరకు పేరా సైకాలజీ పేరిట అతీంద్రియ శక్తుల విషయాలు ప్రచారంలోకి తెచ్చిన డా. జె.బి. రైన్ ప్రభావంలోకి గోపీచంద్ కూరుకుపోయాడు. చైతన్యం కాని మరి కొన్ని స్థాయిలున్నాయని, మహర్షులు ఆ స్థాయికి చేరుకున్నారని వారి అనుభవాలే వేదాలని రాశాడు. అంతేకాక వేదాలను ప్రశ్నించటానికి వీలు లేదని  కూడా గోపీచంద్ అన్నాడంటే, అతని ఆధ్యాత్మిక ధోరణి ఏ స్థాయికి తీసుకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. మనం కింది స్థాయిలో ఉన్నామని, మహర్షులు పై స్థాయిలో ఉన్నారని కనుక వారిని ప్రశ్నించరాదని గోపీచంద్ నమ్మాడు.
ఉత్తరోత్తరా జె.బి. రైన్ వంటి వారి పేరా సైకాలజీ అశాస్త్రీయమని, స్పష్టంగా రుజువైంది. ఆయన అమెరికా యూనివర్సిటీలో దుకాణం మూసివేసి తాను చేసిన పనికి క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. అప్పటికి గోపీచంద్ లేడు. మొత్తం మీద శాస్త్రీయ ఆలోచనకు దూరమైంతర్వాత గోపీచంద్ సొంత ఆలోచన అంటూ చేయలేదని స్పష్టమైంది. “దారి తప్పిన మానవుడు” అనే వి.ఎస్. రమాదేవి నవలలో గోపీచంద్ పాత్ర కనిపిస్తున్నదని పరిశీలకులు అంటారు. ఇది పరిశోధన చేయవలసిన అంశం.
మాకూ ఉన్నయి స్వగతాలు అనే శీర్షికన రిక్షా కార్మికుడు మొదలు అనేకమందిని ఇతివృత్తంగా తీసుకుని రాయటం చాలా బాగుంది. (గోపీచంద్ శత జయంతి (1910-2010) సందర్భంగా ఆయన రచనలు సాధ్యమైనన్ని కూర్చి, 10 సంపుటలుగా, కమిటీ వెలువరించింది. ఇవి విజయవాడలోని అలకనంద ప్రచురణల వారందించారు. చలసాని ప్రసాద్, కృష్ణాబాయి కూర్పు చేసి, చిన్న పరిచయ పీఠిక రాశారు. అయితే 1937 నుండి 1945 వరకు ఎం.ఎన్. రాయ్, మానవ వాద ప్రభావంలో గోపీచంద్ రాజకీయ రచనలు, విమర్శలు అనువాదాలు యీ సంపుటాలలో లేవు. మార్క్సిజం అంటే ఏమిటి? సోషలిస్ట్ ఉద్యమ చరిత్ర అనేవి లభించలేదని అన్నారు. ఈ వ్యాసంలో ఉదహరించిన విషయాలు, చూపిన పేజీలు పైన పేర్కొన్న సంపుటాలలోనివే. గోపీచంద్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ రోజులలో రాసిన రచనలు కావాలనే సంపుటాలలో చేర్చలేదని అంటారు.
narisetti
నరిసెట్టి ఇన్నయ్య

తెలుగు కోసం కలవరిస్తూ… వెళ్ళిపోయిన మన ధర్మారావు

గోరా శాస్త్రి, పీ.వీ. నరసింహారావుల తో కలిసి పాల్గొన్న సభలో ప్రసంగిస్తున్న ధర్మారావు

గోరా శాస్త్రి, పీ.వీ. నరసింహారావుల తో కలిసి పాల్గొన్న సభలో ప్రసంగిస్తున్న ధర్మారావు

తెలుగు ప్రజానీకానికి నూరు మంచి పుస్తకాలు ఏర్చి, కూర్చి, వెదజల్లిన చలమాల ధర్మారావు (1934-2013) కళాప్రియుడు, సాహిత్యాభిమాని, అన్నింటికి మించి సహృదయుడు. మా యిరువురికీ వున్న ఏభై ఏళ్ల పరిచయం ఎన్నో అనుభవాలను సంతరించి పెట్టింది.

ధర్మారావుకు చదువుకునే రోజుల్లో మిత్రులుగా వున్న వెల్చేరు నారాయణరావు, ముక్తేవి లక్షణరావుతో సహా ఉత్తరోత్తర హైదరాబాదులో ఆప్త మిత్రులుగా మారిన శ్యామలరావు కోడూరి కాశీవిశ్వేశ్వరరావు శుభలేక నిర్మాత శాస్త్రిగారు, నాటక కర్త ఎ.ఆర్. కృష్ణ ఆయన్ను అంటిపెట్టుకుని విడిపోకుండా కొనసాగటం ఆయన ఆప్యాయతకూ, మానవతకూ నిదర్శనం.

ధర్మారావు మాటవరసకి ప్రభుత్వ ఉద్యోగే కాని ఆచరణలో బహుముఖ కార్యదక్షుడు. సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కళానికేతన్ అనే సంస్థను స్థాపించి, ఎన్నో నాటకాలు, సాహిత్య ప్రదర్శనలు చేసారు. దానికి తొలుత బాబుల్ రెడ్డి అధ్యక్షుడుగా ధర్మరావు కార్యదర్శిగా వుండేవాడు.

ధర్మారావు వివిధ సంఘాలలో వున్న ఆసక్తికి నిదర్శనగా ఆయన హీరోగా నటించిన ‘సినిమా పిచ్చోడు’ అనే చలన చిత్రం పేర్కొనవచ్చు. రఘునాథ రెడ్డి ప్రొడ్యూసర్ గా ఉన్న సినిమాలో ధర్మారావు హీరో. వాణిజ్యపరంగా అది సఫలం కాలేదు. బి.నరసింగరావు చేసిన ‘హరివిల్లు’ సినిమాలో చిన్నపాత్ర కూడా ధర్మరావు వేశారు.

ఇవన్నీ అలా వుంచి రచనా వ్యాసంగం ఆయనకు ఇష్టమైనది. తెలుగు స్వతంత్రలో ప్రారంభించి ఎన్ని పత్రికలకు తన వ్యాసాలందించాడో లెక్కలేదు. హైదరాబాదు నుండి వచ్చిన ప్రజాతంత్ర వారపత్రికలో దేవీప్రియ సంపాదకత్వాన వెలువడిన రోజులలో నేను ధర్మారావు సీరియల్ గా రచనలు చేశాం. ‘విస్సన్న వేదం’ అనే పేరిట ధర్మారావు ఒక కాలం నిర్వహించారు. విజయవాడ నుండి వెలువడిన ‘నడుస్తున్న చరిత్ర’ కొన్నాళ్ళు ధర్మారావు సంపాదకత్వాన సాగింది కూడా. ఇక దిన పత్రికలలో, వారపత్రికలలో ఎన్నో విలువైన వ్యాసాలు రాశారు. ఈనాడులో సి.ధర్మారావు అనే పేరిట వ్యాసాలు వస్తే చాలామంది అవి రాసింది ఈయనే అనుకునేవారు. కానీ, ఆ ధర్మారావు వేరు.

చలం పట్ల ధర్మారావుకు వీరాభిమానం వుండేది. ఇంచుమించు ఈ విషయంలో రంగనాయకమ్మకు ధర్మారావుకు పోలిక వున్నది. చలం సాహిత్యాన్ని కొంతమేరకు ఎంపిక చేసి, అందులో స్త్రీలపట్ల చలం రచనలు వాటి ప్రాధాన్యతను చూపిన ధర్మారావు, చలానికి విజయవాడలో ఒక కంచు విగ్రహం వేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ధర్మారావు హాస్యప్రియుడు. సున్నిత విమర్శకుడు. మార్క్సిజం ఎక్కడ మిగుల్తుంది అంటే రంగనాయకమ్మ దగ్గర అని చమత్కరిస్తే మిత్రులు నవ్వుకున్నారు. ఆయన చేసిన వుద్యోగాలలో ఆయనకు అత్యంత ఇష్టమైనది అధికార భాషా కమీషన్ కు కార్యదర్శిగా వుండడం. నండూరి రామకృష్ణమాచార్యులుగారు అధ్యక్షులుగా వున్నప్పుడు, విధానాల నిర్ణయంలోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగును వ్యాపింపచేసే తీరుకు మార్గదర్శకత్వాలను నిర్ణయించటంలోనూ ధర్మారావు నిగర్విగా పాత్ర వహించారు.

ధర్మారావుకు సొంత నినాదం ఒకటున్నది. అదేమంటే ‘రాజ్యాంగం తెచ్చిన భారతీయ భాషలన్నిటికీ సమాన ప్రతిపత్తి వున్నది. కనుక హిందీని మాత్రం జాతీయ భాష అనటం తప్పని, అన్నిటికీ ఒకే స్థాయి సమకూర్చాల’ని అనేవాడు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావుతో కలసి, తాను కార్యదర్శిగా ‘జనహిత’ అనే సంస్థ స్థాపించి, మంచి పుస్తకాల ఎంపిక కార్యక్రమం చేపట్టారు. అందులో పురాణం సుబ్రహ్మణ్య శర్మ, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారి సహకారంతో రాత్రింబగళ్ళు, పుస్తకాలను దుర్భిణి వేసి చూసి లిస్టు చేసి సెంచరీ కొట్టారు. ఆ వంద పుస్తకాల లిస్టు వివాదాస్పదం కాకపోవటం ధర్మారావు ప్రతిభకు నిదర్శనం.

తెలుగు భాషను అభివృద్ధి చేయటానికి అవలంబించాల్సిన మార్గాలను అన్వేషించి నిరంతర చెపుతూనే వుండేవాడు. ఒక అనధికార సంఘాన్ని కూడా తెలుగు భాషా సమాఖ్య పేరుతో ఏర్పరచారు.

భారత సాహిత్య చరిత్రలో సంచలనం సృష్టించిన కేరళ కవయిత్రి కమలాదాస్ స్వీయ చరిత్రను తెలుగులోకి అనువదించారు. కమలాదాస్ హిందువైనా ముస్లింగా మారి, అటు కవితలలోనూ, వచన రచనల్లోనూ, కొత్తదారులు తొక్కి అందరి దృష్టీ ఆకర్షించారు. అందుకే ధర్మారావు ఆమె స్వీయచరిత్రను అనువదించారు.

ఇక అతి ముఖ్యమైన విషయం ధర్మారావుకు ఇష్టమైన గోరాశాస్త్రి స్నేహం. అందులో నేనూ భాగస్వామిని. మేమిరువురం కూడబలుక్కుని మండవ శ్రీరామమూర్తిని కలుపుకుని గోరాశాస్త్రి అర్థశతాబ్ది జన్మదినోత్సవాన్ని జరిపాము. అసలు విషయం ఆ పేరిట ఆయనకు ఆర్థిక సహాయం చేయాలని సంకల్పించాము. గోరాశాస్త్రి ఎప్పుడూ ఆర్థిక మాంద్యంలో వుండేవారు. అనారోగ్యం సరేసరి. కర్నూలులో 1968లో పెద్ద సభ జరిపి నాటి విద్యామంత్రి పి.వి.నరసింహారావు జిల్లాపరిషత్ అధ్యక్షుడు కోట్ల విజయభాస్కర రెడ్డిని పిలిచి వారి చేతుల మీదుగా గోరాశాస్త్రికి పర్సు ఇప్పించాము. ధర్మారావు, నేను ఒక సంచికను వెలువరించాము.

ధర్మారావుకు బహుముఖాల మిత్రత్వం వుండేది. చాలా పెద్ద జాబితా. విప్లవ కవుల్లో ఒకరైన నగ్నముని (కేశవరావు), కుందుర్తి ఆంజనేయులు, గోల శాస్త్రి (గోపాల చక్రవర్తి), శీలా వీర్రాజు (సుప్రసిద్ధ ఆర్టిస్టు) యిలా చాంతాడువలె జాబితా దొరుకుతూనే వుంటుంది.

రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి) హైదరాబాదు వచ్చినప్పుడల్లా నియో మైసూర్ కేఫ్ లో వుంటూ మాకు కబురు చేసేవాడు. అక్కడ గోరా శాస్త్రి, నేను, ధర్మారావు తదితరులం చేరి జోకులతో కడుపు చెక్కలయ్యేటట్లు ఆనందించిన రోజులు మరువరానివి. రిటైర్ అయిన తరువాత కూడా ధర్మారావు సాహిత్య కాలక్షేపం భాషా సేవతోనే గడిపారు.

ధర్మరావు భార్య వరలక్ష్మి నలుగు సంతానాన్ని ఆయనకందించి, చాలా పిన్న వయసులోనే చనిపోయింది. అప్పటి నుండి ధర్మారావు తన యిద్దరు కుమారులు, యిద్దరు కుమార్తెలను పెంచి వాళ్ళను ఒక ఇంటివారిని చేశారు. చాలా నిబ్బరంగా హుందాగా వుండేవాడు. కాలక్షేపానికి కుదువలేకుండా మిత్రులు కలసి పేకాడుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. ఆఖరి క్షణాలవరకూ ఆయన సన్నిహిత మిత్రుడు అమెరికాలో వున్న ప్రొఫెసర్ వెలిచేరు నారాయణరావుతో, నాతో ఫోను పలికరింపులు సాగించారు.

చివరి దశలో ధర్మారావు వుద్యోగ విరమణ చేసిన వారి నిమిత్తం ‘ఆవలితీరం’ అనే మాసపత్రిక పెట్టి కొన్నేళ్ళపాటు నడిపారు. అందులో ఆయన సంపాదకీయం వుండేది. వాటిని ‘ప్రేమించుకుందాం రండి’ అనే శీర్షికతో పుస్తకంగా వెలువరించారు. ‘రవ్వలు, పువ్వులు’ అనే మరో వ్యాస సంకలనం కూడా వెలువడింది. ఒకసారి అమెరికా వచ్చి, తానావారి సత్కారాన్ని అందుకున్నారు (2006).

చెట్టుకవి ఇస్మాయిల్ అంటే ధర్మారావుకు ఎంత యిష్టమో చెప్పజాలం. మరొక ఇస్మాయిల్ ఏలూరులో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా వుండేవాడు. ఆ ఇరువురి కవితలను మెచ్చుకోవటం పదిమందికీ చెప్పటం ప్రచారం చేయటం ధర్మారావు నోట అనేకమంది వినేవారు. సెక్రటేరియట్ లో అధికార భాషా సంఘ కార్యాలయంలో కూర్చొని కిటికీ ద్వారా కనిపిస్తున్న రావిచెట్టును దాని ఆకులు చేసే గలగల శబ్దాన్ని వింటుంటే ఇస్మాయిల్ గుర్తొస్తున్నాడని అనేవారు.

ధర్మారావు మిగిల్చి పోయిన సాహిత్య సంపద చాలా విలువైనది.

(తెలుగు భాషా పరిరక్షణ కోసం నడుం కట్టి తెలుగు కోసమే కడ వూపిరి దాకా జీవితాన్ని అంకితం చేసిన సీ. ధర్మా రావు గారు నిన్న కన్నుమూశారు.  ఆయనకి ‘సారంగ’ నివాళి)