త్రేన్పు

 

-ధీరజ్ కాశ్యప్

~

 

పాత ఇంటి అపార్ట్ మెంట్ ప్రతి ఫ్లాట్ నుంచి ఒక్కొక్కరు వస్తూ వెళ్తున్నారు .

వాళ్ళు వెళ్ళాక, వెక్కి వెక్కి  ఏడ్చిన  కన్నీళ్ళు ఆరాక గాని వచ్చి వెళ్లారు అని ఒక్క క్షణం నాలో గుర్తుండి పోవట్లేదు పేరు మాత్రానికి.

వస్తూ వస్తూ గంపెడు బాధను ఇంతకు ముందే చిందర వందరైన పూల మధ్యలో ఉన్న ఖాళీలను పూడ్చడానికి అన్నట్టు వచ్చి తెచ్చి నా చుట్టూ పారబోసి పోతున్నారు.

 

ప్రతి మనిషి తో నా భాష ఏడుపే.

ప్రతి పరామర్శ లో నా భావం బాధే.

తేడా ఏమి లేదు.

గుక్కెడు నీళ్ళు తాగనిచ్చే రెండు  నిమిషాలు తప్ప .

 

బాధ తో ఉన్న గుండె చెదిరింది నాలో నేను అనుకున్న భావాలు మాటలై వినబడుతుంటే, ” పదేళ్ళు సుఖ పెట్టి వచ్చే జీవితం మొత్తం కష్టాల్లో ముంచి వెళ్ళిపోయాడు ” అని.

”మేము”, ”మాది”  అనే స్వార్ధం ఇక ”నేను”, ”నాది” అనే బాధ్యత గా మార్చి వెళ్లిపోయారు.

నేను ఆయన పక్కన.

పిల్లల్ని నా పక్కన ఉండనివ్వట్లేదు ఎవ్వరు.

 

బతకడానికి బలం ఇవ్వాల్సిన భగవత్ గీత బాధలో నిండా ముంచుతుంది నన్ను.

మాటి మాటికి చాలా సార్లు ” మరణించిన వారికి జననం తప్పదు. . .” అని తాత్పర్యం మాత్రం వినపడుతుంది.

ఆయన లేరు ఇక రారు అని గుర్తు చేస్తూ. . .

 

అందరు రావడం ఎక్కువవుతుండడం తో అడగరాని ప్రశ్నలు మౌనాలై వినపడ్తున్నాయి.

” ఎలా”, ”ఎందుకు”, ” ఎప్పుడు జరిగింది” అని.

”మందు”, ”అలవాట్లు”, ”కోపం” , ”గుట్కా కూడా కావొచ్చు” . . ఏది  ఏమైనా అన్నీ ఎక్కువే అని సమాధానాలు.

ప్రేమ కూడా ఎక్కువేనని చాలా తక్కువ మందికి తెలిసిన సమాధానం.

 

నా భర్తని – పోయిన ఆయనని- నేను వెనకేసుకు రావాల్సిన సమయం.

సమాజం- కట్టుబాట్ల కంచెలు ” లైఫ్ స్టైల్” అని అనడం తో నాకు నోరు తెరవాల్సిన అవసరం తప్పి పోయింది.

 

పెద్దోడి  ముఖం లో అయోమయం .

చిన్నదాని ముఖం లో అమాయకత్వం.

అయోమయాన్ని నిజం తో తుడిచేయోచ్చు అనిపించి

ఆయన నాతో అన్న చివరి మాటలే వాడికి చెప్పా.

”నాన్న కి వాళ్ళ నాన్న గురుతొచ్చాడు అంట. వెళ్ళిపోయారు. ఇంక రారు ” అని.

వాడి ముఖం లో అమాయకత్వం. ఆ అమాయకత్వం పెట్టె బాధ ఒర్చుకోలేనిది.

 

నలుగురు  నాలుగు దిక్కులా భూజాల పైకి ఎత్తుకుంటున్నారు ఆయనని.

చిన్నోడికి చలి నీళ్ళ స్నానం చేయించి తడిగా ముందు నడిపిస్తారట.

నాకు బాధతో వణుకు వాడు చలిలో వణకడం చూసి.

ఆయన పడుకున్న చోట తెల్లని బట్ట ఒకటి పరిచారు ఆయనని ఎత్తుకోగానే.

ఆయన వెళ్ళిపోవడం తో ఆయన ఫోటో ఒకటి కొత్త గా వచ్చింది ఇంట్లోకి.

నేను పిల్లలు లేనిది. ఆయన మాత్రమే ఉన్నది.

విడిపోయాం అని తెలిసి శోకం తన్నుకొచ్చింది.

” డాడీ నవ్వట్లేదు అమ. . . సీరియస్ గా ఉన్నాడు. పాత డాడీ ని రమ్మను ” అని చిన్నది. ఆ ఫోటో ని చూస్తూ .

నాలుగు గదుల మధ్యలో నరకం ఆ మాటలు వినడం.

చిన్నోడు వాడి చెల్లెలి మాటలకి సమాధానం చెప్పే రోజు ఎప్పుడు వస్తుందో . . .

 

కర్మ కి వెళ్లి ఆయన్ని వదిలేసిన  నిజాన్ని మోసుకుంటూ  వస్తాడు .

వాళ్ళ నాన్న చివరి చూపు కి వెళ్లి అది చివరి చూపు అని తెలియనంత అమాయకత్వం.

 

కుండ పట్టుకు నడిచి, తడి బట్టలతో తడిసి ఎప్పుడో అలసి నిద్రపోయాడంట .

భూజాల పై పడుకోబెట్టుకొని తెచ్చారు వాడిని. నా వొళ్లోకి వాణ్ణి దించుతుంటే నిద్ర లేచాడు.

 

మన ఆచారాలు ఆడడానికి చాలా దూరం చేసాయి. కావాల్సిన వాళ్ళ  చివరి .చూపులా.

చాలా తక్కువ మిగిల్చాయి . కర్మ చేసొచ్చిన చిన్నోడికి నేను అన్నం తినిపియడం ఇప్పుడు, ఇక్కడ  వాటిల్లో ఒకటి.

చెక్కర కలిపిన  పెరుగన్నం పెట్టాను.

ఆచారం అని వాడి కడుపు నిండింది.

నా కడుపులో నుంచి ఒక త్రేన్పు.

లోపల ఉన్న  శూన్యాన్ని బయటకి తోసే లాగా.

నిజం తెలియని వాడు మళ్ళి నిద్రపోయాడు.

 

ఎల్లుండో ఆ పైనో వాడి బర్త్ డే .

వాళ్ళ నాన్న పెద్ద కారు గిఫ్ట్ ఇస్తా అన్నారట.

ఆ రోజు అది ఆయనే ఇచ్చారని ఇచ్చి చెక్కర పెరుగన్నం తో వాడి నోరు తీపి చేస్తే

మళ్ళి నా కడుపు లో నుంచి ఇలా ఒక శున్యపు త్రేన్పు వస్తే . .

ఆ త్రేన్పే చిన్నోడి కి వాడి చెల్లలి జీవితానికి వాటి కల్యాణానికి ఒక ఆరంభం.

నా జీవితానికి ఆధారం.

— త్రేన్పు

*