ఒక్క శ్వాస

 

 

 

– ధనుష్ లక్కరాజు                                                తెలుగు: కొల్లూరి సోమ శంకర్

~

కిటికీలోంచి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చిన చల్లటిగాలి నన్ను తాకి, మేల్కొలిపింది. చల్లటి వాతావరణంలో తెల్లవారుజామున అయిదు గంటల సమయంలో వీచే చలిగాలులు ఏమంత ఆహ్లాదంగా ఉండవు. ఓ శీతల పవనం నన్ను నిలువెల్లా వణికించడంతో లేచి కూర్చున్నాను. ఓడ కుదుపులు తెలుస్తున్నాయి. ఈ కుదుపులు చాలామందిలో వాంతులకు కారణమవుతాయి, కానీ చిరపరిచితమైన కారణంగా నాకు మాత్రం ఆ భావన కలగడం లేదు. ఏదో చైతన్యం నన్ను నిలువెల్లా ఆవరించింది, కానీ నా మనసు మాత్రం అంతఃశ్చేతన కల్పించిన ఓ భ్రమలో ఉండి ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా లేచి నిలుచున్నాను. గచ్చంతా చల్లగా ఉంది; మంచుకొండ మీద నిలుచున్నట్లుంది. నెమ్మదిగా కిటికి వైపు కదిలాను, పై నుంచి కురుస్తున్న మంచు బిందువులను చూడసాగాను. అదో అద్భుతమైన దృశ్యం, వణికించే అనుభవం.

కిటికి మూసేసాను, అయినా ఆ దృశ్యంపైనే కొన్ని క్షణాలపాటు దృష్టి నిలిపాను. నా శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. కాస్తంత తాజా గాలి వస్తుందని నేనే తెరిచానా కిటికిని నిన్న రాత్రి. అయితే ఈ అనుకోని అతిథి నన్ను పలకరిస్తాడని ఊహించలేదు. అక్కడ్నించి కదిలి వెళ్ళి నా మంచం మీద కూర్చున్నాను. బద్దకాన్ని వదిలించుకునేందుకు కాళ్ళు చేతులు సాగదీసి, గట్టిగా ఆవులించాను. ఇవాళ నాకెంతో విశేషమైన రోజు. గడ్డకట్టిన శరీరావయవాలతో, పడుతూ లేస్తూ పక్కగదిలోకి నడిచాను. అక్కడున్న సోఫావైపు అడుగులేసి, నేను ధరించిన దుస్తులని బిగుతు చేసుకుంటూ సౌకర్యంగా సోఫాలో కూలబడ్డాను.

నా మేనేజర్, నా చిరకాల మిత్రుడు, ఎప్పుడో నిద్ర లేచి కాఫీ తాగుతున్నాడక్కడ. నా పక్కకొచ్చి కూర్చున్నాడు.

“గుడ్ మార్నింగ్ స్టీవ్” అని గొణిగాను. ఆ నిరుత్సాహపూరితమైన వాతావరణంలో ఏదో ఉత్తేజం కలిగించాలని విశాలంగా నవ్వాను.

స్టీవ్ నాకేసి చూస్తూ మొక్కుబడిగా నవ్వాడు, ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తూ, “ఈ ఉదయం నీకెలా ఉంది?” అని అడిగాడు.

కాని నాకర్థమైంది. అతను చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు. కాబిన్‌లో అందరిలానే మృత్యువంటే భయపడుతున్నాడు. నేను నీట మునిగిపోతాననే భయం, నేనెన్నటికి పైకి రాలేనేమోనన్న భయం కాబిన్ అంతా వ్యాపించింది.

నేనొక ప్రొఫెషనల్ స్క్యూబా డైవర్‌ని, అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్‌ని. భూమి మీద అతి పెద్ద మానవ వైజ్ఞానిక సాహసయాత్రకి సంబంధించిన ఒప్పందంపై ఇటీవలే సంతకం చేశాను. దానిలో భాగంగా భూమిపై అత్యంత లోతైన అగడ్త అయిన “మరియానా ట్రెంచ్”లోకి నేను దూకాలి. అక్కడ ఒత్తిడి ఎంతో తీవ్రంగా ఉంటుంది. పూర్తిగా అనావిష్కృతమైన వాతావరణం! వెళ్ళగలిగినంత దూరం నేను వెళ్ళాలని; అడుగుపొర వరకూ (కనీసం మధ్య వరకూనైనా) చేరాలని నిర్ణయమైంది. నా శరీరానికి అమర్చే సెన్సార్ల ద్వారా శరీరంలోపలా, బయటా ఏం జరుగుతున్నా – మధ్య పసిఫిక్ ప్రాంతానికి నేను ప్రయాణిస్తున్న ‘అడిలైడ్’ అనే ఓడ డెక్ పైన ఉండే మానిటర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఎక్కడ తప్పు జరగవచ్చో ఎవరూ ఊహించలేకపోతున్నారు. కానీ చాలా మందికి తెలుసు – ఇది ఒక వైపు ప్రయాణమేనని! ఓ స్నేహితుడిని, కొడుకుని, పరిచయస్తుడిని, బంధువుని పోగొట్టుకుంటామేమోనని అందరూ భయపడుతున్నారు. నా గురించి నాకన్నా ఎక్కువగా భయపడుతున్నారు. నేనెలా ఉండాలని ప్రపంచం అనుకుందో, అలాగే ఉన్నాను. వాళ్ళకి నేను “అందమైన, యువ సాహసిని, లోతైన సముద్రాల అన్వేషిని, సముద్ర శాస్త్రవేత్తలకు కొత్త ఆప్తమిత్రుడిని” అని ఓ పత్రిక రాస్తే, మరో పత్రిక ఇంకో అడుగు ముందుకేసి, “విజ్ఞానశాస్త్రం కోసం జీవితాన్ని ధారపోస్తున్న సముద్రాన్వేషి” అని పేర్కొంది. నిజానికి సైన్స్ కోసమంటే, నేను ఏ ప్రాజెక్ట్‌నయినా ఒప్పేసుకుంటాను. నిజానికి – సముద్రపు లోతుల్లో నన్ను నేను తెలుసుకోడానికే ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నాను. ఆలోచనల్లోంచి బయటపడి ఒళ్ళు విరుచుకున్నాను. బాహ్యపరిసరాలకు తగ్గట్టుగా నా హైపోథలమస్ నా శరీర ఉష్ణోగ్రతని సవరించింది.

“మనం ఇంకా చేరలేదా?” అడిగాను మేనేజర్‌ని, బార్ కౌంటర్ వద్ద కొత్తగా అమర్చిన కాఫీమెషిన్ వైపు నడుస్తూ

“లేదు… లెఫ్టినెంట్ ఉర్కెల్ ప్రకారం మనం అక్కడికి చేరడానికి కనీసం ఇంకో రెండు గంటలు పట్టచ్చు. నువ్వు విని ఉండకపోతే, మళ్ళీ అడుగుదాం..” అంటూ అతనేదో చెప్పబోతుంటే – మధ్యలో జోక్యం చేసుకుంటూ – “మా ఇంటికి ఫోన్ చేసి కనెక్షన్ ఇస్తావా? ఒకసారి…. బహుశా ఆఖరిసారి వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తోంది!” అన్నాను. నాలో ఏదో నిరాశాభావం!

అపరాధభావంతో చూస్తూ, “అలాగే…” అన్నాడు.

తన శాటిలైట్ ఫోన్ నుంచి మా ఇంటికి ఫోన్ చేశాడు. అక్కడ చాలాసార్లు మ్రోగుతోంది కాని ఎవరూ ఫోన్ తీయడం లేదు. ఎంత అత్యాధునికమైన పరికరాలు ఉన్నా, టైమ్ జోన్స్ ఎప్పటికీ సమస్యే.

అతను ఏదైనా మాట్లాడడానికి ముందే, “సరే అయితే, నేను వెళ్ళి సిద్ధమవుతాను..” అన్నాను

ఓ చిరునవ్వు నవ్వి, నా గది వైపు కదిలాను. గదిలోకి వెళ్ళి తలుపు మూసాను. తలుపుని ఆనుకుని నిలుచున్నాను. సముద్రపు నీటికన్నా ఉప్పనైన ఓ కన్నీటి చుక్క నా బుగ్గలమీదకి జారింది. హాస్యాస్పదం కదూ! కన్నీరు కార్చాల్సిన అవసరమే లేదు. మృత్యుభయం నన్ను ఆవహించే లోపే ప్రత్యేకంగా రూపొందించిన డైవింగ్ సూట్ బయటకి తీసి, మంచం మీద ఉంచాను. ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకునేలా సుప్రసిద్ధ కంపెనీ ‘టీమ్ స్పిరిట్’ తయారు చేసిందా సూట్‌ని. నేను ధరించిన బట్టలు విడిచి, శరీరానికి సెన్సార్లు, వైర్లు తగిలించుకున్నాను. తరువాత ఆ బరువైన డైవింగ్ సూట్‌ని ధరించాను.

ఇరవై లీటర్ల ఆక్సీజన్ సిలిండర్లు నాలుగు, పీడన వాయువుల సిలిండర్లు చిన్నవి రెండు నా వీపుకి తగిలించుకోవాలి. ఇవి నా దిశలను మార్చుకోడానికి, తేలే శక్తిని కాపాడుకోడానికి అవసరం. సూట్ ధరించాకా, నౌకా సిబ్బందిలో ఒకడైన గ్యారీని పిలిచి, సిలిండర్లను తగిలించుకోడంలో సాయం చేయమన్నాను. ఓడ కదలడం ఆగిపోయిందని తెలుస్తోంది. నేను సన్నద్ధమయ్యాను. బ్రహ్మాండమైన ఆ ఓడ డెక్ మీదకు నడిచాను. అక్కడ నా కోసం కెప్టెన్, మానేజర్‌తో సహా సిబ్బంది అందరూ ఎదురుచూస్తున్నారు.

“వచ్చేసామన్న మాట” అన్నాను గట్టిగా.

కానీ నా మాటలు అక్కడ ఎవరికీ వినిపించలేదు. హోరున వీస్తున్న పసిఫిక్ గాలులు – గత పదిహేను సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్న వ్యక్తులకు నా చివరి మాటలు వినబడకుండా చేశాయి. బరువైన దుస్తులు, చేతిలో హెల్మెట్‌తో వాళ్ళవైపు నడిచాను. కెప్టెన్ ఉద్వేగంతో నన్ను గట్టిగా హత్తుకున్నాడు.

“మిత్రమా, నీకు ఇరవై గంటల పాటు సరిపోయే ఆక్సీజన్ అందుబాటులో ఉంది.. ఒక వేళ నువ్వు వెనక్కి వచ్చేయదలచుకుంటే ఎనిమిది గంటల ముందు ఆగిపోయి, అక్కడే.. సముద్రతలంలోని ఓ గుట్ట మీదో లేదంటే ఏ కొండచరియ మీదో నిల్చో. సముద్రంలో ఈ భాగం… చాలా వరకు అనావిష్కృతంగానే ఉంది.. అందుకని ఈ ఆయుధం ఉంచుకో..” అంటూ ఓ తుపాకీ లాంటి యంత్రాన్ని నా చేతిలో ఉంచాడు. దానితో పాటు పది మిల్లీ లీటర్ల ట్రాంక్విలైజర్ సీసాలు నాలుగు ఉన్నాయి.

“ఒక్కో సీసా – నీకు ప్రమాదం కలిగించే జీవిని అరగంట నుంచి గంట వరకు మత్తులో ఉంచుతుంది. వీటిని తక్కువ మోతాదులో ఎందుకు ఇస్తున్నామంటే – సొరచేపలు గానీ, ఇతర సముద్రజీవులు గానీ ఈదడం మానేస్తే మునిగిపోతాయి. ఈ సాహసయాత్రలో ప్రాణనష్టం జరగడం మంచిది కాదు…”

నేను అతని కళ్ళలోకి చూసాను. కనుబొమలు ముడిచాను. ఇలా మాట్లాడినందుకు ఆయన బహుశా తనని తానే కొద్దిగా అసహ్యించుకుంటున్నాడేమో. నా జీవితం ఎలాగూ ప్రమాదంలో ఉంది, అందువల్ల ఆ మాటలు కొద్దిగా వ్యంగ్యంగా అనిపించాయి. ఆ సీసాల్ని జేబులో పెట్టుకుని జిప్ వేసేశాను. స్టీవ్ వైపు నడిచి, అతడిని హత్తుకున్నాను. “నేను తిరిగొస్తానని వాళ్ళకి చెప్పు” అని అతని చెవిలో గొణిగాను. అతను నాకేసి మౌనంగా చూస్తూండిపోతే, కన్ను గీటాను.

హెల్మెట్ బిగించుకున్నాను, బెల్ట్‌ బిగుతు చేసుకున్నాను. మరి ఇక ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకేశాను.

అప్పుడు సమయం ఉదయం 5 గంటల 45 నిమిషాలు.

ఉత్తరపుగాలుల ప్రకోపం వలె నీళ్ళు మరీ చల్లగా ఉన్నాయి. ఏదో తెలియని అనిశ్చితి, భయం, సాహసకృత్యం చేయబోతున్నాననే ఉత్సాహం నాలో కలిగాయి. కొన్ని క్షణాల పాటు చూపు మసకగా ఉన్నా, సముద్రాంతర భాగాలపైకి దృష్టి సారించాను. దిగువన సముద్రంలోని విశాలమైన, అందమైన దృశ్యాలను చూస్తుంటే… సముద్రానికి ఎగువన ఉన్న జీవితం సూక్ష్మమైనదిగా అనిపిస్తుంది.

నీలం! నీళ్ళలోకి దూకిన కాసేపటి వరకూ నా కళ్ళు గ్రహించినది ఇదే! ఆక్వా బ్లూ! ఇంతలో హఠాత్తుగా నా కర్తవ్యం గుర్తొచ్చింది.

అన్ని అవయవాలను సవరించుకుని, అంతులేని అంధకారపు అగాధంలోకి జారసాగాను. కాళ్ళను వేగంగా కదిపాను. జలదృశ్యం వైపు ఈదసాగాను.

క్రమక్రమంగా… ఉదయించే సూర్యుడి కిరణాల గుండా సాగరం నాకు తనలోని జీవరాశులను చూపించసాగింది. నేను వెంటనే నా హై రెజల్యూషన్ వాటర్ రెసిస్టెంట్ కెమెరాని ఆన్ చేశాను. పసుపుపచ్చ రంగులో మెరిసిపోతున్న జల్లిచేపలు పైపైకి చేరాలని ప్రయత్నించడం కనిపించింది. వాటి మీసాలు మెడుసా కేశాల్లా పొడవుగా ఉన్నాయి, చేపలు పైకి ఈదాలని ప్రయత్నిస్తున్నడప్పుడల్లా అవి మెలి తిరుగుతున్నాయి. అయితే వాటి స్థితిలో మాత్రం మార్పు లేదు. బలిష్ఠమైన చేపలెన్నో నా పక్కనుంచి ఈదుతున్నాయి. కొన్ని నన్ను ఢీకొట్టాయి, మరికొన్ని – జలాంతర్గత నగరంలో తీరికలేని పాదచారుల్లా – నన్ను పట్టించుకోలేదు. తమ పనులలో నిమగ్నమైపోయి, తమలోకంలోకి వచ్చిన ఈ అన్యజీవిని అవి గుర్తించలేదు. దాదాపు 100 అడుగుల మందాన పేరుకుపోయిన సముద్రపు పాచిని చూసాను. నీటి ప్రవాహంతో పాటు అదే దిశలో కదులుతోంది అది. పాచి ఉందంటే, అడుగున ఎక్కడో రాతి గుట్ట ఉంటుంది. ఈ అనంతమైన నీలి జలరాశి మధ్య నేనెంత అల్పుడనో అర్థమైంది, ఎంత అణఁకువగా ఉండాలో తెలిసింది.

పసిఫిక్ మహాసముద్రంలో అంతగా లోతు లేని ఈ ప్రాంతంలో తీరికగా రెండు గంటలపాటు సముద్రపు అందాలని ఆస్వాదిస్తూ గడిపాను. ఇంక లోతులకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఏం జరిగినా సరే, సంయమనం కోల్పోకూడదు, కంగారు పడకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆక్సీజన్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. గబగబా లెక్కలు కట్టాను. ఇప్పటికే ఒక సిలిండర్‌లో ఐదో వంతు ఉపయోగించేశాని అర్థమైంది. గట్టిగా తల విదిల్చి, నా విధిని అనుసరించాను. లోపల మరింత చీకటిగా మారుతుంది. మల్టీపర్పస్ డివైజ్‌ని చెక్ చేశాను. సముద్ర ఉపరితలానికి 300 మీటర్ల దిగువన ఉన్నాను. మరియానా ట్రెంచ్ సముద్రమట్టానికి 10,810 మీటర్ల అడుగున ఉంది. నేను అంత దూరానికి – మరియానా ట్రెంచ్ అట్టడుగు ప్రాంతానికి వెళ్ళకపోయినా (అది అసాధ్యం, సాధ్యమైతే మాత్రం అద్భుతమే) – 2000 నుంచి 2500 మీటర్ల లోతుకి వెళ్ళగలను. అసలైన మరియానా ట్రెంచ్ ప్రస్తుతం నేనున్న చోటుకి ఇంకో 2 కిలోమీటర్ల అడుగున ఉంటుంది.

ఏదో తేడాగా అనిపిస్తుంది. సముద్రం అసాధరణంగా చాలా ప్రశాంతంగా ఉంది. అండర్‌వాటర్ డైవింగ్‌లో నాకున్న విశేష అనుభవం దృష్ట్యా… అది ప్రమాదానికి సూచన అని గ్రహించాను. ఉత్పాతానికి ముందుండే ప్రశాంతత అది అని నాకు తెలుసు.

కొద్ది దూరంలో ఓ చిన్న ప్రాణి యొక్క నీడ కనబడింది. దాని ముందు భాగం నల్లగానూ, వెనుక భాగం వెండి రంగులో ఉంది. తూరమీను? బహుశా కాదేమో! అదేంటే నాకు అర్థమయ్యేసరికి ఓ భారీ జీవి నా వెనుక నిలిచింది. సుగ సుర జాతికి (Carcharhinus falciformis) చెందిన సొరచేప. పసిఫిక్ సముద్రం వీటి సహజావాసం. అది బాగా అనుకరిస్తుంది, పైగా దాని భారీ పరిమాణం మానవులకి ప్రమాదకరం.

మానవులకి ప్రమాదకరమైనది అదొకటే కాదు. రెండో ఆలోచన లేకుండా మరింత లోతుకి ఈదసాగాను. ఈదుతూనే నా జేబు తెరిచి, ట్రాంక్విలై‌జర్లు బయటకి తీసాను. నీటిలో మరింత లోతుకు దూసుకుపోతు, జేబు జిప్ మూసేశాను. ఈతలో కొద్దిగా పట్టు జారేసరికి, ట్రాంక్విలైజర్లు జారిపోయాయి. ఎలాగొలా రెండు సీసాల్ని చేజిక్కించుకోగలిగాను. మిగతా రెండు సీసాల కోసం ప్రయత్నించే అంత బలం, వెనక్కి తిరిగి చూసేంత ధైర్యం నాకు లేకపోయాయి. నాకు తెలిసిందల్లా నా వెనుకగా సోకుతున్న సొరచేప ప్రకంపనాలే! వాసనని అనుసరిస్తూ అది నా వెనుకే వస్తోంది. సాగరం దానికి అనుకూలం కావడంతో నేను దాని నుంచి తప్పించుకుని ఎక్కువ దూరం పోలేను. దానికి మత్తు ఇవ్వడమే ఉత్తమం. తుపాకీలో ఇంజక్షన్ లోడ్ చేసి వెనక్కి తిరిగాను. అంతే! 346 కిలోల భారీ ప్రాణి నా ఎదురుగా ఉంది. నేను ఊపిరి పీల్చుకునేలోపు, అది నా చేతిని పట్టుకుంది.

నేను భయంలో బిగుసుకుపోయాను, నిస్సహాయుడనయ్యాను. నా చెయ్యి తెగిపోతోంది. దాని పదునైన దంతాలు నా చేతిలోకి గుచ్చుకుపోతున్నాయి. చేతిని విదిలించుకోడానికి గట్టిగా ప్రయత్నించాను. చిక్కటి రక్తం బయటకొచ్చింది. నేనున్న ప్రాంతంలో నీలి రంగు కాస్తా మాజెంటా రంగులోకి మారింది. భరించలేని నొప్పి నా వెన్నంతా పాకింది. అసంకల్పిత ప్రతీకారచర్యగా నేను నా చేతిలో ఉన్న ఇంజెక్షన్‌ని దాని వెనుక భాగంలో గుచ్చాను. అఘాతపు ప్రభావాన్ని తగ్గించుకునేందుకు మరింత క్రిందకి జారడానికి ప్రయత్నించాను. అది అక్కడితో ఆగలేదు, నా వెనుకే నీటిని చీల్చుకుంటూ వేగంగా వస్తోంది. నా వీపు పై ఉన్న సిలిండర్లను లక్ష్యంగా చేసుకుంది. నేను వెనక్కి తిరిగి తాను పొట్ట మీద వీలైనంత గట్టిగా తన్నాను. ఈ క్రమంలో నా సిలిండర్ స్టాండ్ విడిపోయింది, నా సూట్ చిరిగిపోయింది. సిలిండర్లు స్టాండ్ నుంచి ఊడిపోయి పైకి తేలసాగాయి.

ఉన్నట్లుండి అధిక పీడనం వల్ల నా వీపు మీద భారం పెరిగిపోయింది. వెనక్కి తిరిగి సొరచేప వైపు చూసాను. ట్రాంక్విలై‌జర్ ప్రభావం చూపుతోంది. గురుత్వాకర్షణకి దారిచ్చాను. ఈ సంఘటనని పైన మా వాళ్ళు చూసి ఉంటారు, లేదా చూసుంటారని ఆశించాను. నా ఈ దుస్థితికి కారణమైన ప్రదేశానికి చేరాలని ప్రయత్నిస్తుంటే ఊపిరి అందడం లేదు. ఊపిరితిత్తులు నిండిపోయానని, గట్టిగా దగ్గి నీళ్ళని బయటకి తెద్దామని చూసాను. అధిక పీడనం వల్ల నా రక్తనాళాలు చిట్లిపోతాయని అనిపించింది. తెగిన చేతి నుంచి రక్తం ధారపాతంగా కారుతూనే ఉంది. రక్తం వాసన గ్రహిస్తే, మరికొన్ని సొరచేపలు నా మీద దాడి చేయడం ఖాయం.

నాకున్న అతి కొద్ది సమయంలోనే, నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఇక నాకు చావు తప్పదా? నేను దేని కోసం జీవించాను? ఏం సాధించాను? అసలు నేనెందుకు చావాలి? నా జీవితంలో నేను ఎక్కవగా ఏం కోరుకున్నాను? ఇవన్నీ అలా ఉంచితే, ప్రస్తుతం నాకు కావల్సింది ఒక్క శ్వాస! ఒక్క శ్వాస నాక్కావాలి. పైకి చేరేందుకు, కుటుంబాన్ని కలిసేందుకు, మరణాన్ని తప్పించుకునేందుకు – ఒక్క బలమైన శ్వాస కావాలి. గాయపడిన నా శరీరం ఏదో గట్టి రాయికి కొట్టుకుంది, దాంతో వీపు నొప్పి మరింత అధికమైంది. ఇంతలో నాకేదో ఆలోచన స్ఫురించింది. మంగోలియన్ గడ్డి మైదానాలలో నేను నల్ల గుర్రమెక్కి తిరుగుతున్న భావన నన్ను వణికించింది. ఈ వైజ్ఞానిక సాహసయాత్ర ద్వారా పొందే మిలియన్ డాలర్లు నాకు అక్కర్లేదు, పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, నా కుటుంబాన్ని ఆఖరిసారి మాత్రమే చూడాలనుకోవడం లేదు. గడ్డి మైదానాలలో గుర్రమెక్కి తిరగాలనుకోవడం లేదు. నా అవయవాలన్నీ తెగిపోయినా పర్వాలేదు, సొరచేప నన్ను తినేసినా పర్వాలేదు, నేను బ్రతకకపోయినా పర్వాలేదు…. కానీ ప్రస్తుతం నాక్కావలసింది మాత్రం ఒకే ఒక్క శ్వాస! ఓ జంతువు ఎలా ఊపిరి తీసుకుంటుందో, నేనూ అలాగే శ్వాస తీసుకోవాలనుకుంటున్నాను. మనిషి కూడా జంతువే కదా! నన్ను మగత కమ్మేస్తోంది. నీలి రంగు నీళ్ళు నల్లగా మారుతున్నాయి. పైకి లేవాలనుకున్నాను, కాని లేవలేకపోయాను. కాసేపటికే… నా ఆలోచనల్ని శుభ్రం చేసిందుకో, నా పాపాల్ని తొలగించేందుకో… నన్ను చీకటి కమ్మేసింది. నేనిప్పుడు ‘అందమైన, యువ సాహసిని, లోతైన సముద్రాల అన్వేషిని, సముద్ర శాస్త్రవేత్తలకు కొత్త ఆప్తమిత్రుడిని’ కాను, ‘విజ్ఞానశాస్త్రం కోసం జీవితాన్ని ధారపోస్తున్న సముద్రాన్వేషిని’ అసలే కాను; శ్వాస కోసం పరితపిస్తున్న ఓ సాధారణ మానవుడిని. మృత్యుదేవతకి ఎవరైనా ఒకటే!

కాసేపటికే నాకు స్పృహ తప్పింది. మళ్ళీ నాకు స్పృహ వచ్చాకా తెలిసింది – నేను మా ఓడ అడిలైడ్ డెక్ మీద ఉన్నాననీ; మా లెఫ్టినెంట్ నా చాతీఎముకని ఒత్తుతున్నాడనీ. నా చేతి గాయానికి బ్యాండ్ ఎయిడ్ వేసి ఉంది, నాకు ఇన్సులిన్ ఎక్కిస్తున్నారు. నేను గట్టిగా దగ్గి, నీళ్ళని కక్కాను. దీర్ఘ శ్వాస తీసుకున్నాను. “అమ్మయ్య! నువ్వు ఊపిరి తీసుకోగలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది” అంటూ కెప్టెన్ అరిచాడు.

నేను చిన్నగా నవ్వి, “నాక్కూడా” అని గొణిగాను.

సముద్రంలోని నీటిని చూస్తూ, “నేను మత్తు మందు ఇచ్చిన ఆ సొరచేప క్షేమంగానే ఉండి ఉంటుంది కదా…” అన్నాను.

కళ్ళ నుండి నీళ్ళు జారుతుంటే… కెప్టెన్ ముసిముసిగా నవ్వాడు.

(సమాప్తం)

 

 

మూలకథ “Breath” అనే పేరుతో మ్యూస్ ఇండియా డాట్ కామ్ అనే వెబ్‌సైట్ లో(మే – జూన్ 2016 సంచిక) ప్రచురితమయ్యింది.

మూలకథని ఈ లింక్‌లో చదవవచ్చు.

http://museindia.com/regularcontent.asp?issid=67&id=6555