ఒక శంక !

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

 

పాదులు వేసి

నీరు పోసి

ఎరువులు వేసి

నెమ్మదిగా

పురికొసపందిరి మీదికి

పాకిస్తున్న ఈ ప్రేమపంచే చేతులు

ఏ నిశీధివీధిలోకో నిష్క్రమిస్తే,

ఈ రక్తరాగాలు అనునయగీతాలు

ఆలపించడం ఆపివేస్తే,

చిదిమితే ఇంకా

పాలు కారుతున్న ఈ రెండు పూలమొక్కలు

తరిమే ఎండలోనూ

ఉరిమే వానలోనూ

కరిచే పెనుగాలులలోనూ

అడ్డుపడే అరచేతులు కానరాక…

అప్పుడెలా… ?

 

( ఇవా పిల్లలు చిన్నారి ఆకాంక్ష, చిన్నారి ఆర్యదేవ్ ల కోసం, ఒకానొక ఉద్వేగ సందర్భంలో )

భయప్రాయం

index

 

 

కలం ఒంటి మీద

సిరా చెమట చుక్కలు గుచ్చుకుంటున్నాయి

గాలి బిగదీయకముందే

ఊపిరి ఆగిపోతున్నట్టయిపోతోంది

 

ఊగుతున్న నీడలేవో

నా మీద తూలిపడుతునట్టు

ఎన్నడూ చూడని రంగులేవో

నా ముందు చిందులేస్తున్నట్టు

ఎప్పుడూ ఊహించని ఉప్పెన యేదో

పక్కన యెక్కడో పొంచివున్నట్టు…

నేనకుంటున్నట్టు నా గుండె

కొట్టుకుంటున్నది నాలోపల కానట్టు,

నేననుకుంటున్నట్టు నేను ఇన్నాళ్ళు

వింటున్న అంతర్ స్వరం నాది కానట్టు,

నాలోంచి నన్నెవరో బయటికి నెట్టి

లోలోపల అంతా ఆక్రమించుకుంటున్నట్టు

నా కంటి రెప్పలు వేరెవరికో

కాపలా కాయడానికి వెళ్ళిపోయినట్టు

 

జీవనవేదన యేదో కొత్తగా

పుట్టి ఇన్సులిన్ సూదిలా చర్మంలోకి ఇంకుతున్నట్టు,

జంకెరగని నడక ఇప్పుడు

కొత్తగా తడబడుతున్నట్టు…

 

అవునేమో ఇది

మరొక మరణమేమో

అవునేమో ఇది

మరొక జననమేమో…!?

 

-దేవిప్రియ

***

(ఉ. 6.55 గం.లు, 27 మే, 2014)