నేను కథ ఇలా రాస్తాను..!

daggumati

1986 లో ‘దేవుడు’ పేరుతో తొలి కథ రాశారు దగ్గుమాటి పద్మాకర్.  అప్పటినుంచి ఇప్పటి వరకు 15 కథలు రాశారు.  పుస్తకం రాలేదు. 2 సార్లు ప్రధమ బహుమతులు వచ్చాయి. పరిధులు-ప్రమేయాలు, s/o అమ్మ, పతనం కాని మనిషి, యూ టర్న్, ఈస్తటిక్ స్పేస్, సెవెన్త్ సెన్స్ (చివరికథ 2010) కథలు చాలా మందికి నచ్చాయి.

పద్మాకర్ కథ ‘యూ టర్న్’ గురించి   జాన్సన్ చోరగుడి గారు (చినుకు, డీసెంబరు 2007) యిలా అన్నారు…

కొందరు కథకులు వర్తమానంలో వుంటూనే, భవిష్యత్తుని ఒడిసి పట్టుకుని దాన్ని వెనక్కి తెచ్చి దానికి గతాన్ని చూపించి వర్తమానం కోసం భవిష్యత్తు యేమి చేయాలో కర్తవ్యబోధ చేస్తారు. యునెస్కో, ప్లానింగ్ కమీషన్ వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థలు  చేయాల్సిన విధాన రూపకల్పనని దగ్గుమాటి పద్మాకర్ ఒక కథ ద్వారా చూపే సాహసం చేశాడు. అతడు మన తెలుగు కథకుడు కావడం మన అదృష్టం.

పద్మాకర్ కథ రాసే విధానం ఆయన మాటల్లోనే వినండి:

*

సీనియర్లకి చెప్పగలిగేంత వాడిని కాదుగాని, కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళకి నాకు తెలిసిన నా అనుభవాలు మూడు నాలుగు ముక్కలు చెబుతాను, కేవలం నా గురించే… అంతకు ముందుగా నాదృష్టిలో ‘కథ’ గురించి రెండు ముక్కలు చెబుతాను…

*    *    *

 

రచయితలకెంత ఆశ ఉన్నాకూడా కథలు ఎప్పుడు తక్షణమే యే సమస్యలనీ పరిష్కరించవనేది ఒక నిజం.

తమని తాము గమనించుకుంటూ జీవించేవారిలో మాత్రమే ఒక మంచికథ తగిన సమయంలో తన ప్రభావాన్ని చూపుతుంది.

సహజంగా మనకి ఎదురయ్యేవారిలో…  జీవన గమనం లో సరయిన నడక రాని వాళ్ళు, నడుస్తూ నడుస్తూ దారి తప్పినవాళ్ళు,  సమస్యల రద్దీలో ఇరుక్కుని దారి కనిపించనివాళ్ళు, ధగద్ధాయమైన వెలుగుల మధ్యకూడా కళ్ళ ముందు చీకటి కమ్మినవాళ్ళు, అన్నీ సమకూరినా సంతోషం రుచి తెలియనివాళ్ళు, ఇతరులకు సహాయ పడాలని ఉన్నా మనుషులపై నమ్మకంపోయి పట్టుకెళ్ళి తిరుపతి హుండీలో వేసేవాళ్ళు, ఇకపోతే కుటుంబ సమస్యల్లోంచి బయటపడలేని వాళ్ళూ,  ఇలా రకరకాల సమస్యలున్న ప్రజలు మన కళ్ళముందు కదులుతూ ఉంటారు. అయితే నావరకు నేను ఇలాటి ప్రజల దైనందిన సమస్యలకి సంబందించిన ఇతివృత్తాలను కాకుండా… దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా అపరిష్కృతంగా వున్న కొన్ని సమస్యలపై తార్కికంగా ఒక సూచన అందించగలిగేలా  వున్న ఇతివృత్తాలను ఇష్టపడతాను.

నేను కథ రాయాలనుకున్న తరవాత ముందుగా ఆ కథని చదివే వాళ్ళని గుర్తు చేసుకుంటాను.  నా గత అనుభవాలు తీసుకుంటే, కథ అచ్చయిన తర్వాత, హోటల్ సర్వర్ల నుండి, మెకానిక్కులు, గృహిణులు, సైకియాట్రిస్టుల వరకు రకరకాల వాళ్ళు ఫోన్ లు చేశారు. కాబట్టి, కథని చదవబోయే పాఠకులందరి రసాస్వాదక సామర్ధ్యాన్ని ఒక రచయితగా గౌరవించాలి అని నిర్ణయించుకుంటాను.

పాఠకులు నా కథ చదవాలనుకుని పేజీలు తెరిచినపుడు, విస్తరాకు ముందర కూర్చున్న అతిధుల్లా కనిపిస్తారు నాకు. అప్పుడొక ఇల్లాలు పొయ్యిదగ్గర వంట దినుసులతో పడే జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను. మనమొక ఇంటిలో ఆతిధ్యం స్వీకరించి, ఆ సాధారణ ఇల్లాలిని మెచ్చుకుంటే తనకెంత తృప్తో తెలిసిందే కదా. సరిగ్గా అలాంటి తృప్తినే పాఠకుల నుండి ఎదురు చూస్తాను.

కథ రాయమంటూ ఏ అర్ధ రాత్రో అపరాత్రో నాలో అప్పటికే రాజుకుంటున్న ఒక ఆలోచన ప్రవేశిస్తుంది. ఇక మాపాప ఖాళీనోట్సు ఒకటి తీసుకుని  రాయడం ప్రారంభిస్తాను. అప్పుడిక అలోచనల వేగంతో చేయి పోటీపడలేక గెలుక్కుంటూ పోతాను. ఎంతగా అంటే ఒక్కోసారి నారాత నాకే అర్ధంకాదు కొన్నిచోట్ల! ఐతే మొత్తానికి ఒక సిట్టింగ్ లోనే పాత్రలూ, సంఘటనలూ, ప్రధాన డైలాగులు పూర్తి అయిపోతాయి. ఆ అర్ధరాత్రి ఒక ‘అస్తిపంజరం ‘ అలా సిద్దం అవుతుంది.  ఇక మళ్ళీ దానిజోలికి కొద్ది రోజులపాటు  వెళ్ళలేను.(నిజానికి నెలలు, ఇది నా వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే). ఇక అలమారలో దాచిపెట్టిన ఆ ‘అస్తిపంజరం’ నన్ను చాలారోజులపాటు పలకరిస్తూ ఉంటుంది, ఎప్పుడు జీవం పోస్తావంటూ!

జీవం పోయడం నాపని కాదని, నేను ఒక రూపాన్ని మాత్రమే ఇవ్వగలనని, జీవం అనేది అన్ని అక్షరాలమద్య తగు బంధం ఏర్పడినప్పుడు అదొక అసంకల్పిత ప్రతీకార చర్యలా పుడుతుందని చెప్పినా వినదు. సరే ఏదోవొకటి చెయ్యమంటుంది. అప్పుడు కాస్త ఏకాంతాన్ని వెతుక్కుని మళ్ళీకూర్చుంటాను.

ఇక అప్పుడు నా రఫ్ స్క్రిప్టును ముందేసుకుని చదువుతాను. కొంత కాలం గడిచినందువల్ల కథకి ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో అప్పుడు ఈజీగాతెలుస్తుంది. A*, B*, Z* , @ , § , # వంటి కొండ గుర్తులు పెట్టి మధ్య ఖాళీల్లో ఇరికించాల్సిన మేటర్ ని వేరేపేజీల్లో రాసుకుంటాను. ఇదంతా అస్థి గారికి కండరనిర్మాణం అనుకోవచ్చు. ఆనాటి నాశక్తి లేదా ఓపిక అంతటితో సమాప్తం అయిపోతుంది.

ఇక మళ్ళి ఇంకో రోజు కూర్చుని, స్క్రిప్టంతా కంటిన్యుటీ ఉందోలేదో చూస్తాను. కచ్చితంగా ఉండదు. అప్పుడు వరసగా అన్ని వాక్యాలు  చిన్నప్పుడు హిందీ,ఇంగ్లీషు సైలెంట్ గా ఎలా బట్టీపట్టానో అలా   అయిదారు సార్లు చదువుతూ కంటిన్యుటీ చెక్ చేసి తప్పులు సవరిస్తూ పోతాను. కంటిన్యుటీ లేని దగ్గర పాఠకులు కచ్చితంగా దాటవేస్తారు. అంటే భోజనంలో 2 ముద్దలు కలుపుకుని పక్కకు నెట్టినట్టు. ఇప్పుడు అస్థిగారికి  నరాలు, రక్త నాళాలు కూడా  సిద్దమయినట్టే. తర్వాత మీకు తెలిసిందే. నాకు నీరసం వచ్చేస్తుంది. పక్కన పెట్టేస్తాను. ఆయితే, ఇప్పుడు మాత్రం ఈ దశలో కథ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది. కాస్త సంతోషం కూడా  వేస్తుంది.

ఇప్పుడిక చివరి సమావేశం.

ఆలోచనకి పెద్దగా పని వుండదు గాని అయితే జాగ్రత్తగా ఉంటాను.

1] కథ కంటిన్యుటీని చెక్ చేయడానికి ముందుగా వేగంగా చదువుతాను.

2] పాత్రలు తమ ప్రవర్తనలో సందర్భానికి, వయసుకి, జ్ఞానానికి తగిన పదాలు లేని చోట మార్పు చేస్తాను. ఉదా: కోపంతో, ఆవేశంతో, రగిలిపోతూ, భగ్గుమంటూ… ఇలాంటి  పదాల్లో సన్నివేశానికి తగినది మారుస్తాను.

3] ఇక పోతే అన్ని కొటేషన్ల తర్వాత ఉన్న ముగింపులు సరిచేస్తాను. (ఆమె అన్నది/ ఆమె నవ్వుతూ అన్నది/ ఆమె అతన్ని చూస్తూ అన్నది)

4] ఇక అచ్చు తప్పులు, గుర్తులు సరిచేసుకుంటాను.

5] ప్రారంభం వేటగాడి ఉచ్చులా, ముగింపు కూరలో ఉప్పులా సరిగ్గా అమరాయో లేదో చూస్తాను.

6] సాధారణంగా కథకి తగ్గ పేరు ఈ దశవరకు తోచదు నాకు. కాన్సంట్రేషన్ అంతా కథపై ఉండటం వల్లకావొచ్చు. ఇప్పుడు పుస్తకం పక్కన పెట్టి, లేచి టీ తాగాలని బయలుదేరతాను. పెద్దగా ఆలోచించకుండానే 1 లేదా 2 పేర్లు గుర్తొస్తాయి. సాధరణంగా మొదటిదే ఫైనల్ అవుతుంటుంది నాకు.

7] తర్వాత టైపింగ్ అయ్యాక  చూస్తుంటే, ఆప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకున్నట్టే ఉంటుంది.

 

–దగ్గుమాటి పద్మాకర్