వొక జ్ఞాపకం తరువాత…

artwork: satya sufi

artwork: satya sufi

 

~

మాటలను నోట్లోకెత్తుకుని
జీవించడం చాలాకాలమే అయింది
లిప్తకాలంలో
సముద్రపు భాషా సాయంత్రాలు
అల్పపీడన గాలుల్లో
నిన్ను నువ్వు చూసుకుని సంవత్సరాలు గడించింది
యిసుకను వేళ్ళ మధ్యన నుండి రాల్చడం
మర్చిపోయి యేళ్ళు దాటింది
తుషారబిందువుల్లో
ప్రతిబింబాలను పోల్చుకోవాలి రోజుల పిల్లికూనలల్లే
వాటి నుదురు పైన
నీ తడిపెదవుల స్పర్శ వొకటి మళ్ళా యివ్వు
వో జ్ఞాపకం
వో చిరునవ్వూ
జీవితానికి సరిపడా కవిత్వమూ
కిటికీల్లో నుంచి కోల్పోయిన వెన్నెల బాల్యమూ
అందుకే నువ్వంటే నీకో తృష్ణ
మట్టిగూళ్ళను సర్ది చెప్పు మళ్లీ నీలో నువ్వింకా వున్నావనీ
నీ చూపుల్లో
ఆ నీటిపుష్పాలు
యింకా స్పృశిస్తున్నాయనీ
*

రంగుల గవ్వ

 

-తిలక్ బొమ్మరాజు 
~

కొన్ని సీతాకోకచిలుకలు

రెక్కలు ముడులు పడ్డ వర్ణాలు
మధ్యాహ్నం అమ్మ వంచిన గంజి నీడలో నాకోసం యెగిరే
వెచ్చని పక్షులవి
ఆబగా వచ్చేస్తాయి యీ పక్కగా యెవరి కోసమో చెప్పనే చెప్పావు
యెన్నెన్ని నవ్వులో పూలముత్యాల్లా
అక్కడెక్కడో మోచేతికి తగిలిన గాయం
పచ్చిగా నానుతూ చెక్కట్టిన తలాబ్ పై బాధతో వాలినప్పుడు
నా కళ్ళు వాటి వీపును యెలా నిమురుతాయో
ఆ ప్రేమనూ,స్పర్శనూ చెప్పలేకపోవచ్చును
రాత్రంతా వొకటే ఆవిర్లుగా మారిన యింటి వరండాలో నుండి
రివ్వురివ్వున వేసంకాలాన్ని నాలోకి తోడిపడేసిన
తేనెపిల్లలు నా యీ శిలీంద్రాలు
దశలుదశలుగా నన్ను అల్లుకున్న గర్భకోశ సముద్రాలు
కోకిలపుళ్ళకు కోనేటి ఆసరా వీటి తిరుగుళ్ళు
నే నమ్ముకున్న కుంకుమ మిణుగురులు
వో హృదయమంత నిశ్శబ్దాన్నీ
వో ముదుసలి యొక్క ముఖచిత్రాన్ని తవ్వే కాన్వాసులేగా
యీ మొక్కలు తమవి కావు
యీ మకరందాలూ తమవి కానేకావు
వో ఆప్తబాటసారి ప్రేమతో పేర్చిన వసుధైక
నిర్మాణంలో తామూ వున్నామని యిలా
రెక్కలు చరిచి రెప్పలు విసిరి చెప్తున్న
శిలా జగత్తు శాసనం యిది
యెవ్వరికీ  కనబడకుండా నాకోసం నవ్వే తడిగవ్వలు.
*

నల్ల దివిటీ 

 తిలక్ బొమ్మరాజు

 

 వొక యేకాంతం పాయలు పాయలుగా చీలి
కొంత అన్వేషణ మొదలు పెడుతుంది
కొన్ని మౌనాలు మాటలుగానూయింకొన్ని మాటలు సంభాషణలుగానూ రూపాంతరం చెందుతాయి

 

నువ్వో నేనో వో ప్రచ్చన్న దిగ్భందంలోనే వుండిపోయినప్పుడు

యిక స్వప్నాలెలా దొర్లుతాయి

కాస్త వర్షమూ మనలో కురవాలి

మరికొంత చినుకుల చప్పుడూ మనమవ్వాలి

 

మన ఆత్మలు దేహపు వంతెనల కింద కొన్నాళ్ళు మగ్గాక యెక్కడ స్థిరపడగలవు

మళ్ళా నీలోనో నాలోనోనేగా వుండిపోవాలి

 

విశ్వరూపానికి ప్రతీకల్లా యెన్నాళ్లు నిలబడి వుండగలం

యిప్పుడో ఆ పిదపో వొకళ్ళలో మరొకళ్ళం యింకిపోవాల్సిందేగా

అస్తిత్వాలు వొక్కటిగా కాస్త మానవత్వాన్నీ తోడుకుంటాంగా

వదిలి వెళ్ళకుండా

 

పయనాలు నీళ్ళలోని ప్రతిబింబాలే మనకెప్పుడూ

వొకరి ముఖంలో యింకొకరం వెన్నెల చిహ్నాల్లా వెలుగుతుంటాం

వెళదాం యిక మరో ప్రాకారంలోకి-

15-tilak

నువ్వేనా ?

తిలక్ బొమ్మరాజు

ఓ క్షణం ఆగి చూడు
ఇక్కడేంటి ఇవి ?
నీ ఆనవాళ్ళేనా
ఇలా నువ్విప్పుడు ప్రకృతిలో మరణించడం కొత్తగా వుంది
రాత్రుళ్ళను కౌగిలించుకునే నీ ఆ చేతులేవి
యే మూలన పారేసుకున్నావు
చూడోసారి సరిగ్గా ఇక్కడే ఎక్కడో వదిలి ఉంటావు
ఇవన్నీ నీకేం కొత్త కాదుగా!
శవాల గుట్టలూ
దుమ్ము పట్టిన సమాధులూ
వాటి కింద నువ్వు
ఒక సుఖం అనుభవిస్తూ
మోసి తెగిన భుజాలు
ఇప్పుడు తెగుతూ మోస్తున్న నీ ఆలోచనలూ
ఆ పక్కగా గమనించావా ?
నీలాగే ఇంకో నువ్వు
ముందుకీ వెనక్కీ కళ్ళ చిహ్నాలు
ఇవి కూడా నువ్వేనా
ప్చ్ అసలేంటిది అచ్చు ఇలా ఎలా ఉన్నావు
దిగంబరుడిలా చీకట్లలో తచ్చాడే వెన్నెల బైరాగివి
ఇప్పుడేమిటిలా నిన్ను నువ్వు కోల్పోయావు
ఈ రాతి బండల కిందా
చెరువుగట్టు పక్కన ఉన్న నాచులోనూ
పచ్చగా మెరిసే నీ నవ్వు
స్వచ్ఛత నీదా?
నీ దేహానిదా?
వానపువ్వులను పేర్చుకోకలా
ముసురు ముగియగానే రాలిపోతాయి
మట్టి వాసనై మిగులుతాయి
నిన్న కాంచిన నువ్వు
నీలోని నువ్వు
బయట తడుస్తున్న సముద్రకెరటంలా
లోనుండి విసిరికొట్టే శూన్యంలా
ఇక్కడ యిసుకగూళ్ళు కడుతున్నాయి నీ మునివేళ్ళు
కన్నీళ్ళు  ఊరుతూనే వున్నాయి
నువ్వేనా మళ్ళా…
*
15-tilak

పేనిన పావురం

OLYMPUS DIGITAL CAMERA

ఫోటో: కొట్ర ధనుర్ధర్ (పదేళ్ళు)

నన్ను నేను దూరంగా విసిరేస్తున్న క్షణం

నా నుండి విడిపోయి ఎక్కడో పడతాను ఎవ్వరికీ కనబడకుండా

నాలుగు రాళ్ల మధ్య ముఖం తొలుచుకుంటూ  అద్దం మీద జారే చెమట చినుకునవుతాను


నువ్విలారా అంటూ ఎవరో పిలుస్తారు కొంతకాలానికి

నిర్లిప్తతను  రువ్వుతున్న తాయిత్తు ఉన్నపళాన అడ్డుపడుతుంది

తటాలున కళ్ళలో కొన్ని సమాధులు పుడతాయి

వాటిని  కడుగుతూ కాలం  గడిపే పనిలో ఇంకొన్నాళ్ళు


ఒత్తుకుపోయిన ఈతముళ్ళు పాడుబడిన సముద్రంలో కట్టుకున్న కాంక్రీట్  పాలస్

కెరటాల గోడల నడుమ నీ శరీరాన్ని తాకుతున్న పరాన్న బ్యాక్టీరియాలు

మళ్లీ  మళ్లీ నిన్ను గుర్తుచేస్తూ పాడుబడిన జ్ఞాపకాలు ఓ పక్కన 


క్షణానికో జననం చూసుకుంటూ మరుక్షణమే మరణానికి చుట్టమయ్యే 

రేగిపూల  ఆత్మలు నీళ్ళలో కాలుతూ బూడిదయ్యే  నేను 

కొత్త గీతలకు  చుక్కలద్దుతూ ఉదయం 


పచ్చని పావురాలు  కక్కుతున్న నీలపు రక్తం పూసుకున్న ఆకాశం 

మరోసారి కిందకు దూకుతూ మిగిలిన స్థాణువులు  మిణుగురులై 

ఈదుతున్న నేల  పెల్లుబీకుతున్న కాగితపు ఆలోచనలు 


ఇప్పుడిక ఏరుకోవాలి  నన్ను నేను అన్ని మూలల్లో మూలాలుగా

-తిలక్ బొమ్మరాజు

15-tilak

నువ్వో నియంతవి

 

painting: Rafi Haque

painting: Rafi Haque

నువ్వో నియంతవి ఈ రాత్రికే

రాత్రి గుడ్లను పాలించే చీకటి స్వప్నానివి

నిద్దురలోనో మెలకువలోనో ఒకసారి జీవిస్తావు

కళ్ళలో ఇంత ఆశను నాటుకుంటావు

నువ్వో సేవకుడివి ఈ రాత్రికే

యే ఒంటరి చెరువుతోనో నాలుగు మాటలు పంచుకుంటావు

పొద్దూకులా కబుర్లాడతావు

చెట్ల ఆకుల మీదో వాటి పువ్వుల మీదో కొన్ని పదాలను రాస్తావు నీకొచ్చినట్టు

నీ వెన్నెముక ఇప్పుడొక పసుపుకొమ్ము

సరిగ్గా చూడు వీపునానుకుని

నువ్వో నిశాచరుడివి

ఖాళీ స్మశానంలో సమాధులు కడిగే అనుభవజ్ఞుడివి

తలతో శవాల మధ్య తమాషాలను దువ్వుకునే ఒకానొక ఆత్మవి కాదూ

నిరంతర శ్రవంతిలో కొన్ని ఆలోచనలను వింటూ

గడిపే ఒంటరి క్షణాలకు యజమానివి

నువ్వో శ్రామికుడివి

భళ్ళున పగిలే నడకల్లో అడుగులు మిగుల్చుకునే సంపన్నార్జున మనిషివి

ఒకటో రెండో అంతే పంచభూతాలను అంటుకట్టడం  తెలిసిన నిర్మితానివి

కళ్ళల్లోని అనాధ స్వప్నాలకు ఈ పూటకు భరోసా

కనురెప్పలు కిటికీలై తెరుచుకునేదాకా

ఇంకేమిటి

ఇప్పుడొక తాత్వికుడివి ఈ కాసిని వాక్యాల్లో.

-తిలక్ బొమ్మరాజు

15-tilak

వేళ్ళ గులాబీలు

 15-tilak
కొత్తగా ఒక చితి
చేతి వేళ్ళ మీద నుండి తెగిపడుతూ గోర్ల శవాలు భూమి నిండా
నువ్వో నేనో తొక్కుతాం వాటి నీడలనో
పదునుగా కనిపించే తలల తనువులనో
ఇన్నాళ్ళు అందంగా పెరిగి
నీ నుండి ఒక్కసారే అలా విడివడడం కొత్తేమి కాదు వాటికి
ఆకులను పువ్వులను తాకుతూ ఇన్నాళ్ళు నీలో నుండి
తడియారని ఒక పచ్చిక ముఖాలకు పులుముకుంటూ ఉండని రోజులను నదుల్లో గదుల్లో దాచుకోవడం కూడా అలవాటే
చీము నెత్తురుతో సహవాసం చాన్నాళ్ళ కిందదే
స్పర్శ తెలియని అనుభూతి
అలంకారమో
మరోటో
గీసిన గీతలు ఒకచోట మొదలయి ఎక్కడికో తప్పిపోవడం గమనించనేలేదు నువ్వు
వాటి ఆనవాళ్ళను ఇక్కడే ఎక్కడో పారేసుకున్నావు
సరిగ్గా వెతుకు మరోక్షణం
నీ ఆలోచనలను విస్తరింపజెయ్యి
గులాబీ రెమ్మలు కొన్ని
వర్షంలో పూర్తిగా తడిసిపోయాక స్పృశించుకోవడం ఎంత బాగుంటుంది
అవింకా మన మధ్య ఆరని మరీచికలేగా ఎప్పుడూ
అద్దుతూ
ఈదుతున్న పరాన్న జీవులేగా ఇప్పటికీ వేలు వేలు చివరనా.
                                                  -తిలక్ బొమ్మరాజు

ఇంకో నేను

15-tilak

 

 

 

 

నేను నేను కాదు అప్పుడప్పుడూ

రాత్రి నిదట్లో స్కలించిన స్వప్నాన్ని

అస్తిత్వాలు తెలియని నిర్వేదాన్ని

అసంకల్పితంగా

రాలే ఋతువులు

నాలో కొన్ని

నిర్లిప్తాలో

నిస్సంకోచాలో

గోడ మీద అందంగా పేర్చబడ్డ సగం పగిలిన ఆత్మలో

గుర్తులేదు కానీ ఇంకా ఎన్నింటినో

వెలిసిన వర్షం తర్వాత కరెంటు తీగను పట్టుకుని వేలాడే నీళ్ళ బిందువులు

ఆత్మహత్యకు తయారవుతూ

మునుపో

నేడో

ఎప్పుడో

నిశ్శబ్దం నవ్వులో నుండి

పదాలన్ని వెచ్చని పందిర్లుగా

తెరిచి మూసిన తలుపులు

ఒరుచుకున్న ఆకాశపు మట్టి

భావాలు ఇంకొన్ని

కళ్ళనూ

కడుపునూ కన్నీళ్ళతో కుట్లేస్తూ

పగలో ఆకలి పొట్లం

ఇప్పుడు మళ్ళా నేను కాదు

మధ్యాహ్నం కడుకున్న ఎంగిలిని

కూసింత ఎర్రటి ముసురు

ఒక నిద్ర

మరో మెలకువ

రెండూ నాలోనే

నాతోనే

రాళ్లు పడ్డ పదార్థం

తరంగాలుగా పగులుతూ

నన్ను గుర్తుచేస్తూ

మనిషి నిక్షేపాలు

చెరిగిన చెమ్మ అంచు అంచుపై నిలబడుతూ

నన్ను నేను శోదిస్తూ

 

-తిలక్ బొమ్మరాజు

ప్రాణం

నేను చూసాను గూటి నుండి కింద పడి పగిలిన ఓ పక్షి గుడ్డుని
అందులో నుంచి అప్పుడే ప్రాణం పోసుకుంటున్న మాంసపు ముద్ద

గర్భస్రావమైనట్టు
దానికి ఆసరా ఇస్తూ చేతులు చాపిన మట్టి దేహం
తనలోకి దిగమింగడానికి ప్రయత్నిస్తూనే ఉంది రాలిపడ్డ రక్త మాంసాలను

మిగిలిన కొన్ని శకలాలు వాటంతట అవే ఆకాశంలోని కొన్ని అంచులను తాకుతున్నాయి
ఇప్పుడిప్పుడే

నేను చూసాను మళ్ళీ
పసికందు ఆత్రాన్ని
ఓ కీచు శబ్ధాన్ని
తల్లి రొమ్ములో కుతిక నింకున్న ఓ జీవాన్ని
ఆబగా దప్పిక తీర్చుకుంటున్న కణాన్ని

నేను చూసాను
దేహ ప్రక్షాళన గావిస్తున్న ఒక పదార్థాన్ని
పరాన్న జీవి దశ నుండి పరిణమం చెందిన గుండెరెక్కల చప్పుళ్ళను

ఇంకా కంటూనే ఉన్నా రాలిపడుతున్న కొన్ని మాంసపు ముద్దలను నా కళ్ళనుండి
నెత్తురు ఉబికినప్పుడల్లా..
తిలక్ బొమ్మరాజు

నువ్వు మళ్ళీ!

Thilak

కొన్ని సంభాషణల వల్లో
మరిన్ని సందిగ్దాల వల్లో
నిన్ను నువ్వు కొత్తగా రాసుకోడానికి యత్నిస్తుంటావు చూడు…

అప్పుడే రాలిపడుతున్న పక్షి రెక్కల్లాగా
బొడ్డుతాడుతో కుస్తీ పడుతూ గర్భాశయంలో అప్పటిదాకా పాతుకుపోయిన తనని తాను
లోకానికి పరిచయం చేసుకునే మాంసపు ముద్దలా
నువ్వుహించుకున్నపుడు

నిన్ను మరచి నీది కాని స్తన్యంలోకి ఆబగా చొచ్చుకుంటూ వడగళ్ళ దాహార్థిని
మునివేళ్ళ సందుల్లో బందిస్తూ పసిపిచ్చుక తపన

అప్పుడనుకుంటావు నీకునువ్వుగా ఏదో సాదించావులే ఈ వెదవ జీవితాన ఎందరో
మనసులకు అంత్యక్రియలు జరిపినతరువాత

చినుకుల్ని లెక్కెడుతూ
మబ్బుల్ని తోసేస్తూ
దొరికిన కూసింత స్థలంలోనే ఆరడుగుల స్వార్థ పీలికలను ఒక్కొక్కటిగా నీలోకి
చేర్చుకుంటూ ఒదిగిపోతావు మళ్ళీ నీలోకి నిన్ను దాచేస్తూ….

తిలక్ బొమ్మరాజు