తావి

తాయమ్మ కరుణ

తాయమ్మ కరుణ

 

 

 

 

 

 

anvi with dolly

అలతి అలతి పదాలతో కథలు అల్లే కరుణ అసలు పేరు పద్మ. తాయమ్మ కథ రాసి “తాయమ్మ కరుణ” గా మారారు. తనకు బాగా పేరు తెచ్చిన “తాయమ్మ” కథే ఆమె మొదటి కథ. 1996 లో “మహిళా మార్గం” లో ఈ కథ అచ్చయ్యింది. ఇంతవరకు పాతికకు పైగా కథలు రాసారు. అనేక పురస్కారాలు అందుకున్నారు.

“తాయమ్మ మరికొన్ని కథలు ” పేరుతో ఒక సంపుటి తెచ్చారు. పలు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న కరుణ ప్రస్తుతం హైదరాబాద్ లో జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు.—వేంపల్లె షరీఫ్

***

 

 

గట్టిగా ఏడుపు వినిపించడంతో కిట్టు, కల్పన వంటింట్లోంచి పరుగెత్తుకుని వచ్చారు.

‘డాలీ’ని పట్టుకుని ఏడుస్తోంది తావి.

‘‘ఏమైంది బుజ్జమ్మలు’’ అంటూ కిట్టు తావిని ఎత్తుకున్నాడు.

తావి ఎందుకు ఏడుస్తుందో కిట్టుకి వెంటనే అర్థమైంది.

కల్పన ఆందోళనగా… ‘‘ఏమైంది? ఎందుకేడుస్తుంది కిట్టూ’’ అడిగింది.

‘‘ఏం లేదు. ఏం లేదు. నేను తర్వాత చెప్తాలే’’ కల్పనతో అని,

‘‘బుజ్జమ్మలు డాలీకి దెబ్బ తాకిందామ్మా?’’అని ఊరిస్తుంటే… ఇంకా గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది తావి.

తావికి రెండున్నర ఏళ్లు. కిట్టూ కల్పనల ఏకైక కూతురు. తావికి ఏమన్నా అయిందంటే అల్లాడిపోతారు. వాళ్లమ్మ చనిపోయిన సంవత్సరంలోనే పుట్టింది కాబట్టి.. తన తల్లే పుట్టిందని కిట్టు అనుకుంటాడు. దాని బుద్ధులు కూడా తల్లి లాగానే ఉన్నాయని మురిసిపోతాడు. తావి చిన్నదైనా దానికి చిన్నప్పటి నుంచే అన్నీ అర్థమవుతాయంటాడు కిట్టు. ఒకసారి తావి చేతిలోంచి గ్లాసు కిందపడి నీళ్లు పోయాయట. కిట్టువైపు చూసి తప్పు చేసినట్టుగా తల కిందకు వేసుకుని అలాగే నిలబడి పోయిందట. అప్పుడు అది చూసిన చూపు అలాంటి సందర్భంలో తన తల్లి చూసినట్టుగానే చూసిందట. వెంటనే వెళ్లి కూతుర్ని ఎత్తుకుని ముద్దులతో ముంచేశాడట కిట్టు. ఇండియాలో ఉన్న తన అక్క సుమకు ఫోన్‌ చేసి మరీమరీ చెప్పి మురిసిపోతాడు.

బుద్ధులే కాదు.. పోలికలు కూడా తల్లివేనంటాడు. కన్పించిన వాళ్లందరికీ కొత్త పాత తేడా లేకుండా చిరునవ్వు విసిరేస్తుంది.

ఇక కల్పనకైతే కూతురే సర్వస్వం. మొదట కిట్టు ‘‘పిల్లల్నే కనొద్దు. ఎవర్నైనా పెంచుకుందాం’’ అన్నాడు.

ప్రకృతి సహజంగా పిల్లల్ని కనాలని ఉంటుందని, కనకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఏది ఏమైన తనకు పిల్లలు కావాలని తన అభిప్రాయం చెప్పింది. కల్పన అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవిస్తాడు. కల్పన అలా తన అభిప్రాయం చెప్పేసరికి కాదనలేదు.

అలా పుట్టింది తావి వాళ్లకు  పెళ్లైన ఆరేళ్లకు. అప్పటికే కల్పనకు ముప్పై రెండేళ్లు. కిట్టుకి ముప్పైనాలుగు ఏళ్లు.

‘భార్య’ అనే పదానికి వారిద్దరి మధ్య అర్థం లేదు. స్నేహితులుగానే మెలుగుతారు. కల్పన మనసును చూసి చేసుకున్నాడు కిట్టు. కల్పనను చూసిన చాలామంది ‘‘ఈ అమ్మాయి ఎలా నచ్చిందిరా బాబు నీకు’’ అన్నారు. వాళ్లు అనడానికి కారణం.. కిట్టు చాలా బాగుంటాడు. ‘‘మనసుతో చూస్తే నచ్చుతుంది’’ అన్నాడు కిట్టు. అందం అంటే కిట్టు దృష్టిలో మానసికమైంది. శారీరకమైన అందానికి కిట్టు ఎన్నడూ ప్రాముఖ్యత యివ్వలేదు. తామిద్దరూ కలిసి హాయిగా జీవించగలం అనుకున్నాడు. అలాగే చేసుకున్నారు.

కిట్టు, కల్పనలు  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వేర్వేరు కులాలు. కల్పన పుట్టిన తర్వాతనే కలిసి వచ్చిందని కల్పన తల్లిదండ్రులకు ఆమె మీద విపరీతమైన  ప్రేమ. అలాంటిది  ప్రేమించిందని తెలిసి, చస్తామని బెదిరించి వేరే పెళ్లి చేయడానికి తల్లితండ్రీ ఒత్తిడి చేశారు. కల్పన అప్పటికి చప్పుడు చేయకపోయినా కిట్టుకి ఈ విషయం తెలిస్తే… తప్పక వచ్చి తనను తీసుకుపోతాడని నమ్మకం. కానీ ఉద్యోగరీత్యా జర్మనీకి వెళ్లాడు. కల్పన గృహనిర్బంధం. వాళ్ల అన్నా, వదినలకు కల్పన బాధ్యత అప్పచెప్పి పోయాడు. వదిన తన చిన్నమ్మ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉంది. సహజంగానే కల్పన గురించి పట్టించుకోలేదు. కిట్టు ఫోన్‌ చేసి కల్పన ఎలా ఉందని అడిగితే బాగానే ఉందని చెప్పేవాళ్లు. ఎందుకో కిట్టుకి అనుమానం వచ్చి, కల్పనవాళ్ల ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ చేశాడు. కల్పన తండ్రి ఫోన్‌ ఎత్తాడు. తమ  ప్రేమ వ్యవహారం వాళ్లకి తెలిసిందని కిట్టుకి తెలియదు. కల్పన అన్నకు ఫ్రెండ్‌ కాబట్టి అలానే ఫోన్‌ చేశాడు.

‘‘నీ వల్ల నా కూతురి చనిపోతుంది. మొన్న నిద్రమాత్రలు మింగింది. ఇంకోసారి నువ్వు గనక ఫోన్‌ చేశావంటే మర్యాదగా ఉండదు’’ అని నానా మాటలు అన్నాడు కల్పన తండ్రి . కల్పనకు వేరే పెళ్లి చేస్తున్నారని, తను ఆత్మహత్యకు ప్రయత్నించిందని కిట్టుకు అప్పుటికిగానీ తెలియలేదు. వెంటనే జర్మనీ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. సినిమా ఫక్కీలో కల్పనను తీసుకెళ్లిపోయాడు. అంతకుముందు ఫ్రెండ్స్‌ ద్వారా లాయర్‌ నోటీసు అన్నీ తయారు చేసిపెట్టుకున్నారు. ఇద్దరూ మేజర్లు కాబట్టి పోలీసులకూ చెప్పి పెట్టి ఉంచారు.

కల్పనతో  ప్రేమలో పడ్డాకనే తను కూడా సీరియస్‌గా చదవడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఫ్రెండ్స్‌తో కాలక్షేపమే ఎక్కువగా ఉండేది.

ఒక సంవత్సరంలో కల్పన తల్లిదండ్రులు వచ్చి కలిసిపోయారు. కిట్టుని చూసి ఫిదా అయిపోయారు. ‘‘ముందే అబ్బాయి గురించి ఎందుకు చెప్పలేదే.’’ అని కల్పనవాళ్లమ్మ అన్నది. ఆ తర్వాత రెండేళ్లకు అమెరికా ప్రయాణం. కల్పన తన తల్లి వాళ్లింట్లోనే ఉండపోయింది. సంవత్సరం తర్వాత కల్పన కూడా కిట్టు దగ్గరికి అమెరికా వెళ్లింది.

ఆ తర్వాత మూడేళ్లకు తావి పుట్టింది. తావికి ఏ చిన్నది జరిగిన కల్పన, కిట్టూ భరించలేరు. దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. ఇప్పుడలా ఏడ్చేసరికి కల్పనకు అర్థంకాక విలవిల్లాడుతుంది,  తన కూతురు ఎందుకేడుస్తుందో తెలియక.

తావికి ‘డాలీ’ అనే బొమ్మ ఉంది. తను ఎక్కడకి వెళ్లినా డాలీ వెంట ఉండాల్సిందే. డాలీకి అన్నం తినిపిస్తది, నీళ్లు తాపిస్తది, వాళ్లమ్మ తనకు చేసేవన్నీ తను డాలీకి చేస్తుంది తావి.  చిత్రమేంటంటే వాళ్లింటో ఉయ్యాల లేదు. అయినా కార్టూన్స్‌ చూసి రెండు చైర్లకు కలిపి టవల్‌ను చుట్టూ డాలీని అందులో పడుకోబెడుతుంది తావి. ఎంత ఆశ్చర్యమో కిట్టు, కల్పనలకు. దీనికెలా తెలుసు అని. అంత చిన్న వయసులో చైర్లకు టవల్‌ను చుట్టడం.. దాని తెలివికి మురిసి ముద్దయిపోతారు.

డాలీకంటే కూడా అందంగా ఉండే తావిని ఎక్కడ కి వెళ్లిన అందరూ ముద్దు చేస్తారు. ‘క్యూట్‌ గర్ల్‌’ అంటారు. అయినా  కిట్టు తన అక్కలకు ఫోన్‌ చేసి తన కూతురు అందం గురించి పొగిడించుకుంటాడు. ‘‘నిజంగానే అందంగా ఉంటదాక్కా’’ అంటాడు. ‘‘నిజంగా .. చాలా అందంగా ఉంటది’’ అని చెప్తుంది అక్క సుమ. కిట్టు కుష్‌.. నవ్వుతాడు.

ఇక తావి ఏడిస్తే తట్టుకుంటారా? ..

ఇందాక ఇల్లు సర్దుతూ కిట్టు డాలీని బొమ్మల బుట్టలో విసిరేశాడు. ఇంటి నిండా బొమ్మలన్నీ పర్చి ఆడుకుంది అంతసేపు. ‘‘కిట్టు, ఇల్లంత సర్దవా. నేను వంట మొదలుపెడుతున్నా’’ అని కల్పన వంటింట్లోంచి అంది.

ల్యాప్‌టాప్‌ మీద వర్క్‌ చేస్తున్న కిట్టు సిస్టమ్‌ బంద్‌ చేసి లేచాడు.

ఇళ్లంతా బీభత్సం. గబగబా బొమ్మలన్నీ బుట్టలోకి విసిరేస్తూ డాలీని కూడా విసిరేశాడు. విసిరే ముందు ఒక్క క్షణం అన్పించింది  బుజ్జమ్మలు బాధపడుతుందేమోనని.

అన్నీ సర్దేసి వంటింట్లోకి వెళ్లి అంట్లు కడగడం మొదలుపెట్టాడు. అమెరికాలో ఉన్న ఒక భాగ్యమేమంటే పనిమనుషులు దొరకరు. మనుషులను బద్దకస్తులుగా తయారు చేయరు. దొరికినా .. వాళ్లకు జీతాలు చెల్లించడం కష్టం. అందుకే ఎవరి పని వాళ్లే చేసుకుంటారు. అందున ఇండియా నుంచి వెళ్లినవాళ్లు సాధ్యమైనంత తక్కువ ఖర్చు చేసుకుని, మిగిలించుకుని దాచుకోవాలనుకుంటారు.

తావి బొమ్మను విసిరేయడం చూసింది. నెమ్మదిగా లేచి వెళ్లి బుట్టలోంచి బొమ్మను తీసుకుంది. అప్పటికే దానికి దు:ఖం ఎగిసివస్తోంది. బొమ్మను చేతిలోకి తీసుకునేసరికి ఇక దానికి ఏడుపు ఆగలేదు. పెద్దగా ఏడుస్తూ బొమ్మను హత్తుకుంది.

కిట్టు ఎంతో సేపు ఊర్కోబెడితే గానీ దానికి దు:ఖం ఆగలేదు. ఈ విషయం కల్పనకు చెప్పాడు తర్వాత.

‘‘దానికి ఆ బొమ్మంటే ఇష్టమని తెలుసుగా కిట్టూ’’ అంది కల్పన,  ఎందుకట్లా విసిరేశావు అన్నట్టుగా.

‘‘విసిరేసేటప్పుడు ఒక్క క్షణం అన్పించింది. బుజ్జమ్మలు ఇంతలా గమనిస్తుందనుకోలేదు.’’

‘‘అయినా  మేడంగార్కి కోపం వస్తే విసిరేస్తది. మనం విసిరేస్తే మాత్రం దు:ఖమే’’ ఇందాక తను అన్నమాటకు కిట్టూ బాధపడతాడేమోనని, దానిని కవర్‌ చేస్తూ మురిపెంగా కూతుర్ని చూస్తూ అంది కల్పన.

కిట్టు, కల్పన కూడా బొమ్మను జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టారు.

***

ఆ రోజు ఆదివారం కిట్టు కూడా ఇంట్లోనే ఉన్నాడు. పొద్దుటి నుంచి ల్యాప్‌ట్యాప్‌ మీంచి దిగలేదు. టిఫిన్‌, భోజనం కల్పన పిలిస్తే లేచి తిని వచ్చి మళ్లీ కూర్చున్నాడు. ఒకోసారి తెల్లవార్లూ పనిలో మునిగిపోయి వుంటాడు కిట్టు. శనివారం కూడా ఎక్కడికీ వెళ్లలేదు. సరే కల్పనకి కూడా బోర్‌గా ఉంటుందని సాయంత్రం లేచాడు. ముగ్గురూ కలిసి షాపింగ్‌కు వెళ్లారు. అలాగే చికెన్‌ తీసుకొచ్చారు.

చికెన్‌ చేయడంలో కిట్టుది నలభీమ పాకం. చికెన్‌ ఒక్కటనే కాదు. ఏ మాత్రం సమయం చిక్కిన వంటింటి పనిలో పాలుపంచుకుంటాడు.

‘‘ఆఫీసు వర్క్‌ ఇంకా చాలా వుంది. నువ్వు అన్నీ ప్రిపేర్‌ చేసి పిలువు. నేను వండుతా ’’ చెప్పాడు కిట్టు.

కల్పన వంటింట్లో పనులు చేస్తోంది.

కిట్టుకి దగ్గర్లో బొమ్మలతో ఆడుకుంటున్న తావి వాంతి చేసుకుంది. డాలీ మీద, తన గౌను మీదా పడింది. తావిని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకొచ్చారు. తావి చూడకుండా బొమ్మ డ్రెస్సును ఉతికేసి బొమ్మను బకెట్లో నానబెట్టారు.

తావిని పడుకోబెట్టి ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఎప్పుడు లేచిందో లేచింది బొమ్మ లేదనే విషయం కనిపెట్టి ఇల్లంత తిరుగుతూ బాత్రూమ్‌లోకి వెళ్లింది. నీళ్లల్లో బొమ్మను చూసి…

‘‘లాలీ… లాలీ…’’ అంటూ హృదయం ద్రవించేలా ఏడుపు.

పరిగెత్తుకుని వెళ్లిన కిట్టు, కల్పన ‘‘లేదు బుజ్జమ్మలు. డాలీకి స్నానం చేపిస్తున్నాం. దానికేం కాలేదు. నీకు చేపించాం కదా. అలాగే డాలికి కూడా చేపిస్తున్నాం’’ అని తావిని సాటిస్‌ఫై చేసేసరికి తలప్రాణం తోకకొచ్చింది.

ఆ బొమ్మ ఎక్కడైనా మర్చిపోతే దానికి జ్వరం వస్తుందని అలాంటిదే ఇంకో బొమ్మ కొని దాచి పెట్టాలి అనుకున్నారు.

కల్పన, తావి నిద్రపోయారు. కిట్టు పని అయేపోయేసరికి రాత్రి రెండున్నర గంటలు కావస్తోంది. తిన్నది ఎప్పుడో అరిగిపోయింది. ఆకలి అనిపించి, కిచెన్‌లోకి వెళ్లి బ్రెడ్‌ కాల్చుకుని తిన్నాడు. ఏంటో చాలా అలసటగా వుంది. ఏదో వెలితిగా వుంది. ఏంటో తెలియదు. వచ్చి బుజ్జమ్మలు పక్కన పడుకున్నాడు.

సాయంత్రం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. హఠాత్తుగా తల్లి జ్ఞాపకం వచ్చింది. అమ్మ కూడా ఇలాగే తన, పర భేదం లేకుండా అందరితో  ప్రేమగా వుండేది కదా. అమ్మను అందరూ కల్మషంలేని మనిషి అనేవారు. ముసలితనంలో పిల్లల పలకరింపు కోసం అల్లాడిన అమ్మ. బొమ్మలేకపోతే తన కూతురు ఏమైతుందో అని ఆలోచిస్తున్నాడు తను. ప్రాణంతో వున్న పిల్లలం అమ్మకీ వుండీ లేనివాళ్లమే అయినాం కదా. పిల్లల కోసం ఎంత కష్టపడింది. పిల్లలే తన సర్వస్వం అనుకుంది. తనకుంటూ మిగిల్చుకోవాలనే ధ్యాసలేదు. పిల్లలే తన ఆస్తి అనుకుంది. అమ్మ పిల్లలం. అమ్మకేం చేశాం? అమ్మ నేం చేశాం? కిట్టు కళ్లల్లో ధారలు… అప్రయత్నంగా కూతురిని దగ్గరికి తీసుకున్నాడు కిట్టు.

–తాయమ్మ కరుణ