రవి గాంచినది

Kadha-Saranga-2-300x268

 నాసా గాడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ కేఫ్‌టేరియాలో కూర్చున్నాము నేను, విజయ్, లంచ్ చేస్తూ. మామూలుగా వుండే విజయ్ లాంటి వుద్యోగులతో బాటు కాన్ఫరెన్స్ కొచ్చిన నాలాంటి వాళ్ళ వల్ల కేఫ్‌టేరియా రద్దీగావుంది. చేతుల్లో ట్రేలతో మేము కూడా టేబుల్ కోసం రెండు మూడు నిముషాలు నిలబడాల్సి రావడం వల్ల “మే ఐ జాయిన్ యు వీజే” అంటూ ఎవరో రావడం అంత పెద్ద ఆశ్చర్యం కలిగించ లేదు. ఇండియాలో రద్దీగా వుండే హోటళ్ళలో జరిగేదిదేగా! అయితే, ఈ వీజే ఎవరు?

“ష్యూర్ క్రిస్టీనా” అని విజయ్ అంటే గానీ తెలిసిరాలా వాడెవడో. “క్రిస్టీనా, మీట్ మై అంకుల్ రవి” అన్నాడు విజయ్.

“నైస్ టు మీట్ యు” అంది క్రిస్టీనా. మనిషి శ్వేతజాతీయురాలు. వయసు యాభై, అరవై మధ్యలో వుంటుంది. తెల్ల జుట్టు. నెరవడమో లేక సహజమైన రంగో తెలియలేదు. మనిషి అయిదున్నర అడుగుల కన్నా ఎత్తు కాకపోయినా భారీకాయమనే చెప్పచ్చు.

“డు యు లివ్ హియర్?” నన్నడిగింది క్రిస్టీనా టేబుల్ వద్ద మూడో కుర్చీలో కూర్చున్న తరువాత.

“నో. ఐ కేం ఫర్ ది కాన్ఫరెన్స్” అన్నాను.

“ఫ్రం ఇండియా. హి వర్క్స్ ఫర్ ది ఇండియన్ స్పేస్ ఏజన్సీ.”

“సారీ ఫర్ ఇన్‌ట్రూడింగ్ లైక్ దిస్. వేరే టేబుల్ చూసుకుని కూర్చునేదాన్నే. కానీ, టేబుల్స్ ఏవీ ఖాళీగా లేవు.” అంది క్రిస్టీనా అపాలజెటిక్‌గా.

“నో. నో. నాటె ప్రాబ్లం. నువ్వున్నావని కూడా చూడకుండా మా భాషలో మాట్లాడుకుంటాం,” అన్నాడు వాడు.

“గో ఎహెడ్,” అని కాసేపు కష్టపడి గుర్తు తెచ్చుకుని, “టెల్గూ – ఈజ్ఇంట్ ఇట్?” అంది.

“యస్. దట్స్ కరెక్ట్,” అని పిజ్జా నవుల్తూ మధ్యలో – “థాంక్స్‌గివింగ్ వస్తోంది కదా, బిజీగా వుండుంటావ్ పాన్‌ట్రీ వర్క్‌తో” అన్నాడు.

ఇదేమిటో అర్థం కాలా. నేను కూడా పిజ్జా నవుల్తూ శ్రధ్ధగా వింటున్నాను. కావాలంటే ఇంటి కెళ్ళేటప్పుడు వాణ్ణి అడగవచ్చులే అనుకుంటూ.

“ఈసారి వుద్యోగాలు పోయిన వాళ్ళు చాలా మంది హోంలెస్ వాళ్ళకు తోడయ్యారు. పాన్‌ట్రీని తిండి పదార్థాలతో, వంట పదార్థాలతో నింపుతాం ఎప్పటిలాగానే. అయితే తీసుకోమన్నదానికంటే ఎక్కువగా లాగేసుకుంటారని భయంగా వుంది. ” అంది క్రిస్టీనా.

“క్రిస్టీనా బీదవాళ్ళకోసం, ఇళ్ళులేనివాళ్ళకోసం చర్చ్ పాన్‌ట్రీని ఆపరేట్ చేస్తుంది. కొన్ని కంపెనీలు తిండి పదార్థాలని వీళ్ళకి ఉచితంగా ఇస్తే వీళ్ళు వాటిని అవసరమైన వాళ్ళకు పంచుతారు.” అన్నాడు విజయ్.

“హేయ్ వీజే” అంటూ వచ్చి పర్మిషన్ అడక్కుండానే మా టేబుల్ దగ్గర మిగిలిన ఒకే ఒక కుర్చీలో కూర్చున్నాడొకాయన. వయస్సు డెభ్భై దాటిందని విజయ్ చెప్పాడు తర్వాత.

“హాయ్ గేరీ. దిసీజ్ మై అంకుల్ రవి,” అన్నాడు విజయ్.

“హి కేం ఫ్రం ఇండియా!” అంది క్రిస్టీనా.

“కొరియానించీ వచ్చారని నువ్వు చెబితే నమ్మే వాణ్ణనుకున్నావేమిటి?” అన్నాడు గేరీ. “హి ఈజ్ ఎ బాడ్ ఇన్‌ఫ్లుయెన్స్” అన్నాడు నాతో, విజయ్ వైపు వేలు పెట్టి చూపిస్తూ.

“ఐ హాడ్ మై ట్రైనింగ్ ఫ్రం ది మాస్టర్” అన్నాడు విజయ్ అతన్నే చూస్తూ, కొంటెగా నవ్వుతూ.

“యు ఆర్ రైట్ అబవుట్ దట్” అన్నాడు గేరీ పెద్దగా నవ్వుతూ.

“ఈ వీకెండ్‌లోనేమో అన్ని పదార్థాలూ షెల్ఫుల్లో సర్దాలి.  వచ్చే వారం బుధవారం అంతా వంట చెయ్యడంతోనే సరిపోతుంది. గురువారం అంతా వడ్డించడానికి రెడీ అయ్యి, నాలుగ్గంటలకల్లా సర్వ్ చెయ్యాలి. అంతా అయి ఇంటికి చేరేసరికి గురువారం అర్థరాత్రి అవుతుంది. సోమవారం నాడు వర్కుకి రావాలంటే శుక్రవారం నించీ ఆదివారం దాకా ఎక్కడికీ కదలకుండా ఇంట్లో పడుకోవాలి.” అన్నది క్రిస్టీనా ఇందాక తను చెబుతున్నది కంటిన్యూ చేస్తూ.

సంవత్సరానికోసారి అమెరికాలో నవంబర్లో ఒక గురువారం నాడు దేశం అంతా సెలవు తీసుకుని పండగ చేసుకుంటుందని తెలుసు కానీ, కొన్ని సంఘసేవక సంస్థలకి సెలబ్రేషన్స్ అంటే ఏమీ లేనివాళ్ళకోసం పాటుబడడమని అప్పుడు తెలిసింది. క్రిస్టీనా ఇలా చెయ్యడానికి మత ప్రోద్బలం కారణం కాదని అప్పుడనిపించింది. అదే కారణమయితే, దీపావళి నాడు దేశంలో అసలు బీదా, బిక్కీ వున్నారన్న విషయానికి మనసు మారుమూలల్లో గోరీ కట్టిన హిందువులనందరినీ వెంఠనే క్రిస్టియన్లుగా మార్చెయ్యాలి.

“ఇండియన్స్ కూడా వున్నారని అన్నట్టున్నావ్ కదా?” నేను వినాలనే అడిగాడా?

“ఇండియన్స్, చైనీస్, బ్లాక్స్, వైట్స్. ఇండియన్సూ, చైనీసూ వాళ్ళని తీసుకోమన్న దానికంటే ఎక్కువ తీసుకుంటారు. నేను వాళ్ళతో చాలా స్ట్రిక్టుగా వుంటాను. ఒక చైనీసు ఆవిడ వుంది. ‘నాక్కావాలి ‘ అని గట్టిగా అంటుంది. ఆవిడతో గట్టిగా చెప్పాను – నీ వెనక వాళ్ళకి కూడా కావాలి, నా మాట వినకపోతే మళ్ళీ ఇక్కడకి రానివ్వను – అని.” కరువు కాటకాలున్న చోట్ల, వరద బాధితులకూ ఆహార పదార్థాలు పంచుతున్నప్పుడు వాళ్ళు కొట్టుకోవడం టీవీలో ఎన్ని సార్లు చూడలేదు? అది అమెరికాలో కూడానా?

“కమాన్ క్రిస్టీనా. వాటీజ్ వన్ మోర్ లోఫ్ ఆఫ్ బ్రెడ్?” అన్నాడు గేరీ. టీజ్ చేస్తున్నాడని అతని గొంతు చెప్పింది.

“ఐ యాం సీరియస్. ఎంతమంది ఈ మధ్యన వస్తున్నారో తెలుసా? ఎకానమీ ప్రాబ్లంస్ వల్ల ఇటు పక్కేమో, వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. అటు పక్కేమో, ఆహార పదార్థాలని దానమిచ్చే కంపెనీలు ఇంతకు ముందు ఇచ్చినంత ఇప్పుడు ఇవ్వట్లేదు. మధ్యలో ఫ్రస్ట్రేషన్స్ మాత్రం మాకు.” కొద్దిగా కోపంగానే అన్నది.

అమెరికాలో హోంలెస్ పీపుల్. తిండికి కూడా కరువే? కొత్తగా వుంది. అమెరికాకి బయలుదేరే ముందర విశాలాంధ్రకెళ్లి టైటిల్ ఇంటరెస్టింగ్‌గా వుందని ‘ఆటా జని కాంచె’ అన్న పుస్తకాన్ని కొనుక్కొచ్చాను విమాన ప్రయాణంలో చదవడానికి. ఇంతకుముందు రెండుసార్లు అమెరికాకి వచ్చినాకూడా నేను చూడనిది ఈయన ఏంచూశాడు అన్న కుతూహలం దానికి కారణం. అమెరికాలోని శ్వేతజాతి స్త్రీల స్తన సంపదగూర్చీ, ఘన నితంబాల గూర్చీ రాసిన వివరాల తరువాత ఇంక చదవలేకపోయాను. అప్పటికే విపులలో వచ్చిన ఒక కథ నా మదిలో బలంగా నాటుకుపోయింది. అందులో, పక్కా దేశీవాళీ స్టైల్‌లో ఒక అమ్మాయిని మోసం చేసి, “అమెరికాలో ఇవన్నీ మామూలే లేవే” అని జార్జ్ అని పేరు పెట్టుకున్న శేషాద్రి చేత పలికించడమే కాక ఆ కథకి “చెన్నైలోని మేన్‌హాట్టన్” అని పేరు కూడా పెట్టారొక తమిళ రచయిత్రి. వీటి వల్ల ఆంధ్రా నుంచీ బయట అడుగు పెట్టని వాళ్ళకి నిజంగా అమెరికా సంస్కృతేదో తెలిసే అవకాశముందా? క్రిస్టీనా అందజేస్తున్న సమాచారంమీద నాకు ఆసక్తి ఎక్కువయింది.

“ఇనఫ్ ఆఫ్ డిప్రెసింగ్ న్యూస్. లిజెన్. నా మనవరాలు కెన్నెడీ సెంటర్లో ఒక మ్యూజికల్‌లో పాడబోతోంది – చెప్పానా?” అన్నాడు గేరీ. అనవసరంగా మాట మార్చాడని ముందు లోపల్లోపల చిరాకుపడ్డానుగానీ అతనివద్దనుంచీగూడా ఆసక్తికరమయిన విషయాలని తెలుసుకున్నాను.

“నో” అన్నాడు విజయ్.

“చెప్పావు అని చెప్పినా నువ్వు ఆగుతావేమిటి?” ఈసారి టీజ్ చెయ్యడం క్రిస్టీనా వంతయ్యింది.

“మై సెకండ్ డాటర్ – షి ఈజ్ ఎ బ్రిలియంట్ లాయర్. షి అండ్ హర్ హజ్బెండ్ ఓన్ దిస్ మిలియన్ డాలర్ హవుస్. వాళ్ళ మూడో అమ్మాయి – పదేళ్ళు – అంతే. పాడుతుందని వాళ్ళమ్మ చెప్పింది. కానీ నా ముందు ఎప్పుడూ పాడేది కాదు. ఒక రోజు నేను డ్రైవ్ చేస్తూ దాన్ని తీసుకుని వెడుతున్నాను. కేథీ నాపక్కనా అది వెనుక సీట్లోనూ కూర్చున్నారు. పాడవే అన్నాను. ఏ మూడ్‌లో వుందో, పాడడం మొదలు పెట్టింది. ఎంత గొప్పగా పాడిందో తెలుసా? నా మనవరాలని చెప్పడం కాదు. చర్చిలో పాడేవాణ్ణి గనుక నాకు సంగీతంగూర్చి తెలుసు. వింటుంటే నా కళ్ళ వెంట ధారా పాతంగా నీళ్ళు రావడం మొదలు పెట్టాయి. కేథీ నన్ను చూసి మందలించింది – ‘ గేరీ, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, జాగ్రత్త!’ అని.” ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో అంతులేని ఆనందం, పలుచని నీటిపొరా కనిపించాయి. అట్లాంటి ఎమోషన్‌కి అతని భార్య కేథీ ఎందుకు గురికాలేదా అన్న నా అనుమానాన్ని విజయ్ తర్వాత తీర్చాడు – ఆ పిల్ల గేరీ మొదటి భార్య మనవరాలని.

“రాగ్‌టైం గూర్చి విన్నావా?” సమాధానం కోసం ఎదురు చూడకుండా గేరీ కంటిన్యూ చేశాడు. “ఇట్స్ ఎ గ్రేట్ షో. ఎ మ్యూజికల్. దానిని కెనెడీ సెంటర్లో (వాషింగ్టన్, డి.సి.,లో, చాలా గొప్ప థియేటర్ అని విజయ్ తర్వాత చెప్పాడు) ప్రదర్శించబోతున్నారు ఓ నాలుగు నెలల్లో. అందులో పాడగల పదేళ్ళ అమ్మాయికి ఒక రోల్ వుంది. నా మనవరాలు ఆ రోల్‌కి ఆడిషన్‌కి వెళ్ళింది. న్యూయార్క్‌నించీ డైరెక్టరూ, మ్యూజిక్ డైరెక్టరూ వేర్వేరుగా వచ్చి ఆడిషన్ చేసి మరీ దాన్ని ఆ రోల్‌కి సెలక్ట్ చేశారు. ఐ యాం వెరీ ఎక్సైటెడ్!” అతని మొహంలో గర్వాన్ని మర్చిపోవడం కష్టమే.

“ఆ టాలెంట్ నీ దగ్గర నుంచీ మాత్రం రాలేదు” క్రిస్టీనా టీజ్ చేసింది. వాళ్ళిద్దరిదీ బహుకాల పరిచయం అని తేలికగానే చెప్పొచ్చు.

“దట్స్ ట్రూ. ఇట్ కేం ఫ్రం హర్ మాం.” అమెరికాలో డైవోర్సులు అసాధారణం కాదని తెలిసినా, అతను మొదటి భార్య గూర్చి మంచిగానే మాట్లాడ్డం చూసి ఆవిడ పోవడం వల్ల రెండో పెళ్లి చేసుకున్నాడేమోననుకున్నాను. ఆవిడ బతికే వుందని విజయ్ తరువాత చెప్పాడు. “బట్, షి గాట్ ది గుడ్ లుక్స్ ఫ్రం మి.”

“ది జ్యూరీ ఈజ్ స్టిల్ అవుట్ ఆన్ దట్” అన్నాడు విజయ్.

“హి ఈజె స్మార్ట్ మేన్” అన్నాడు గేరీ నావైపు తిరిగి.

“యు డోన్ట్ వాన్ట్ టు నో వాట్ హి సేస్ బిహైన్డ్ మై బాక్” అన్నాడు విజయ్ నవ్వుతూ.

“నా అంత వాడయ్యే అవకాశముందని చెబుతాను” అన్నాడు కన్నుగీటుతూ.

కాసేపటికి గేరీ, క్రిస్టీనా వెళ్ళిపోయారు – “హావ్ ఎ గుడ్ టైం” అని చెప్పి. మళ్ళీ అర్జెంట్‌గా కాన్ఫరెన్స్‌లోకి వెళ్ళాల్సినంత గొప్ప టాపిక్స్ ఏవీ ఎజెండాలో లేవు. అందుకని అక్కడే కూర్చున్నాం వాడూ, నేనూను.

 

వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడిగాను. “క్రిస్టీనా లాంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది వుంటారంటావ్?”

“ఎంత మందో చెప్పలేను గానీ, కనీసం కొంత మంది నాకు తెలుసు. ఈ దేశంలో హాబిటాట్ ఫర్ హ్యుమానిటీ అని ఒక ఆర్గనైజేషన్ వుంది. దాన్లో అమెరికా మాజీ ప్రెసిడేంట్ జిమ్మీ కార్టర్, ఆయన భార్య మెంబర్లు. ఈ ఆర్గనైజేషన్ మెంబర్లు డబ్బులు పోగు చేసి కావలసిన వస్తువులని మాత్రం ఆ డబ్బుతో కొని, వాళ్ళ శ్రమ దానంతో ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తూంటారు – అమెరికాలోనే కాక ఇండియాలోనూ, శ్రీలంకలోనూ, బ్రెజిల్‌లోనూ, ఇంకా చాలా దేశాల్లో. నేను పని చేసిన మొదటి కంపెనీలోని వైస్ ప్రెసిడెంట్ రిటరయిన తర్వాత తన ఇంటిని అమ్మేసి, భార్యతో సహా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడ పని చెయ్యమంటే అక్కడికి వెడుతున్నాడని మొన్నా మధ్య పాత కొలీగ్ చెప్పాడు.  అంతెందుకు, మొన్నా మధ్య మేము పని చేస్తున్న కంపెనీలో కొలీగ్స్ కొందరు క్రిస్మస్ ఇన్ ఏప్రిల్ అన్న ఒక ఆర్గనైజేషన్ తరఫున ఒక వీకెండ్‌లో ఒక బీద వాళ్ళ ఇంటిని పూర్తిగా మరమ్మత్తు చేసి, పెయింట్ చేశారు.”

“అటు చూడు” అన్నాను హఠాత్తుగా.

“ఎక్కడ?” అన్నాడు విజయ్ అర్థం కాక.

కళ్ళతో చెప్పినా పట్టుకోలేక పోయాడు. నేను వాడికి చూపిస్తోంది, ఒక అసాధారణమైన దృశ్యాన్ని. ఒక గుడ్డి వాడు, ఒక్ కేన్ పుచ్చుకుని, ఎవరి ఆధారమూ లేకుండా పేర్చివున్న ట్రేలల్లో ఒక దాన్ని తీసుకున్నాడు. ఫుడ్ బార్ దగ్గరకెళ్ళి, తనకి కావలసిన వాటిని ప్లేట్లల్లో అమర్చుకుని, ట్రేలో పెట్టుకున్నాడు. అట్లాగే కేషియర్ దగ్గరకెళ్ళి డబ్బులు పే చేశాడు. మధ్య మధ్యలో అక్కడ పనిచేసే వాళ్ళు అతనితో మాట్లాడడం, అతను జవాబు చెప్పడం కనిపిస్తూనే వుంది. అతన్ని ఎప్పుడూ అక్కడ చూస్తాట్ట కనక అది విజయ్‌కి కొత్తగా ఏమీ అనిపించలేదు. ఆ గుడ్డి అతను నాసాలో వుద్యోగం చేస్తాడని విజయ్ చెప్పినప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది.

ఆ సాయంత్రం విజయ్ కార్లో కూర్చొని నాసా గాడర్డ్ మెయిన్ గేట్ బయట ట్రాఫిక్ లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ గుడ్డి అతనే రోడ్డు దాటుతూ కనిపించాడు. అతన్ని నేను చూస్తున్నానని తెలిసి, రోడ్డు పక్కన వున్న ఒక సైన్ బోర్డుని చూపించాడు విజయ్. డైమండ్ ఆకారంలో పసుపుపచ్చని బోర్డుమీద “బ్లైండ్ పెడెస్ట్రియన్” అన్న నల్ల అక్షరాలు కనిపించాయి. అంత బిజీ ఇంటర్‌సెక్షన్‌లో అతను అలా ఒంటరిగా కేన్ సహాయంతో మాత్రమే రోడ్డు దాటుతున్నప్పుడు చుట్టుపక్కల ఆగివున్న కార్లని చూస్తే, ఒక చీమ కోసం ఏనుగుల మందని ఆపినట్లనిపించింది.

అప్పుడు గుర్తొచ్చింది కాన్ఫరెన్స్‌లో స్పీకర్ పక్కన సౌంజ్ఞలు చేస్తున్న ఒకావిడ. ఆవిడ గూర్చి అడిగితే విజయ్ చెప్పాడు – వినికిడి శక్తి లోపించిన వాళ్ళుగానీ లేక అసలు లేని వాళ్ళు గానీ ముందుగా కోరితే, అలాంటి వాళ్ళకోసం సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్‌ని అరేంజ్ చేస్తారని, బిల్ క్లింటన్ ప్రెసిడెంట్‌గా వున్నప్పుడు పాస్ చేసిన చట్టప్రకారం అలా చెయ్యాలనీని. అలాగే, ప్రతీ బిల్డింగ్‌లోకీ మెట్లతో బాటుగా వీల్ చెయిర్ ఆక్సెస్‌కోసం రాంప్ వుండాలట. ప్రభుత్వ కార్యాలయాల్లో బాత్‌రూములు వీల్ ఛెయిర్లో తిరిగేవాళ్లు ఉపయోగించగలిగేలా వుండాలట. లిఫ్టుల్లో అయితే, వెళ్ళవలసిన అంతస్తులని సూచించే బటన్ల మీద, నంబర్లతో బాటుగా, గుడ్డివాళ్ళ కోసం, అవే నంబర్లని బ్రెయిల్ లిపిలో కూడా రాయాలట. ప్రజానీకంలో కొందరు ముందర గొణిగినా ఇప్పుడు అన్ని బిల్డింగులూ ఆ నిబంధనలని పాటించే కడతారట. లంచాలని ఇచ్చి అవ్వి లేకుండా చెయ్యరా అని అడగాలని నోటి దాకా వచ్చింది. కానీ, హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో మా ఎపార్ట్‌మెంట్ బిల్డింగులో లిఫ్ట్ పనిచెయ్యకపోవడంవల్ల మెట్లెక్కవలసివచ్చినప్పుడు పట్టుకోవడానికి హాండ్ రెయిల్ లేక మా అమ్మ కష్టపడడం గుర్తొచ్చి ఆగిపోయాను.

* * *

విజయ్ ముందరే చెప్పాడు – నువ్వు మాకు బిజీ టైంలో వస్తున్నావు, నిన్ను ఎక్కడికీ తీసుకెళ్ళడం కుదరకపోవచ్చని. వాడుండేది వాషింగ్టన్, డి.సి., కి దగ్గరగా కావడంవల్ల కాన్ఫరెన్స్ వారంలో మూడు రోజులు తీసుకోగా మిగిలిన గురు, శుక్ర వారాల్లో మాత్రం పొద్దున్నే ఆఫీస్ కెళ్ళే ముందు నన్ను మెట్రో స్టేషన్‌దగ్గర దిగబెట్టాడు. నేను ట్రైన్ ఎక్కి సిటీలోకి వెళ్ళి మ్యూజియంస్‌లో తిరుగుతూ కాలం గడిపాను – వాడి భార్య సంధ్య పాక్ చేసి ఇచ్చిన లంచ్ తీసుకుని. అంత ప్రశాంతతని ఈ మధ్యలో ఎప్పుడూ అనుభవించలే దనిపించింది.

శనివారం పొద్దున్నే సంధ్యకీ, వాడికీ తర్జన భర్జన లయ్యాయి – పిల్లలని ఎవరిని ఎవరు ఎప్పుడు ఎక్కడకి తీసుకు వెళ్ళాలనే విషయం గూర్చి. ఓ మ్యూజిక్ క్లాసూ, ఓ డాన్సు క్లాసూ మాత్రమే కాకుండా ఆ వారాంతపు స్కెడ్యూల్లో ఇంకేవో కూడా ఇమడాలి.

“ఓ.ఎం.కి నువ్వు దాన్ని తీసుకు వెళ్ళకపోతే ఎట్లా కుదురుతుంది?” అన్నది సంధ్య. “అది” అంటే వాళ్ళమ్మాయి శ్రావణి.

“నేను బాస్కెట్ బాల్‌కి రిక్కీని తీసుకు వెళ్ళాలి గదా? వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి ఎలా వస్తాను? ఎన్ని ట్రిప్పులని వేస్తాను?” అన్నాడు విజయ్. కొడుకు పేరు రాకేష్ కాస్తా రిక్కీ అయింది.

“చూస్తాను మేరీ తీసుకెళ్ళగలదేమో. లేకపోతే కష్టమే”నంది సంధ్య. అదృష్టవశాత్తూ ఆవిడెవరో శ్రావణిని పికప్ చేసుకోవడానికి ఒప్పుకుంది.

ఓ.ఎం. అంటే ఏమిటని అడిగాను. ఆడిస్సీ ఆఫ్ ది మైండ్‌కి అది షార్ట్ అని చెప్పాడు. అంటే – మెదడు చేసే యాత్ర అని దానికి ప్రతిపదార్థం. పిల్లలకి – ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకే గాక హైస్కూల్ పిల్లలకి గూడా – తరగతిని బట్టి ఛాలెంజ్ నిస్తారట. ఆసక్తి వున్న పిల్లలు గ్రూపులుగా ఏర్పడి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారట. చివరకి ఓ రోజున ఆ టీంస్ అన్నిటికీ పోటీ వుంటుంది. అంతా పిల్లలే చెయ్యాలని చెప్పాడు వాడు.

ఇందులో పెద్దలు వేలు దూర్చరని నమ్మకమేమిటని అడిగాను. “నేను జడ్జీగా చేశాను గనక చెబుతున్నాను. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అది ఇట్టే తెలిసిపోతుంది. అంతే గాక ఎనిమిదిమంది దాకా వున్న ఒక గ్రూప్ పిల్లల్లో అది టీం ఎఫర్టా లేక ఎవరో ఒకరో ఇద్దరో చేసినదా అనేది కూడ ఇట్టే పట్టుకోవచ్చు చిన్న చిన్న ప్రశ్నలు వేసి” అన్నాడు.

ఒక నాలుగు నెలలు ఎంతో కష్టపడ్డ తర్వాత ఒక జిల్లాలోని అన్ని టీముల మధ్య పోటీ ఏదో ఒక స్కూల్లో జరుగుతుందట. సమస్యలంటే అన్నీ టెక్నాలజీకి సంబంధించినవే అయివుంటయ్యనుకున్నాను. అది ఒక భాగం మాత్రమే అన్నాడు వాడు. పిల్లలు వాళ్ళే రాసి, కంపోజ్ చేసి పాడిన పాటలూ, వేసే స్కిట్సూ కూడా అందులో వుంటయ్యన్నాడు.

విజయ్, రిక్కీలతో బాటు నేను కూడా బాస్కెట్ బాల్ గేంకి వెళ్ళాను. అదొక ఇన్‌డోర్ ఫెసిలిటీ. కనీసం ఆరు కోర్టులు వున్నయ్. ఒక కోర్టులో హైస్కూలు అమ్మాయిలో లేక కాలేజీ అమ్మాయిలో వాలీ బాల్ ఆడుతున్నారు. ఒక కోర్టులో ఇరవైకి పైగా వయసున్న అబ్బాయిలు బాస్కెట్ బాలాడుతున్నారు. మిగిలిన నాలుగు కోర్టులలోనూ పదినించీ ఇరవై ఏళ్ళ మధ్యలో వున్న అబ్బాయిలూ, అమ్మాయిలూ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు.

రిక్కీ టీంలో వీడే కొద్దిగా బక్కపలచగా, పొట్టిగా వున్నాడు. మిగిలిన వాళ్ళందరూ అరవై కిలోలకు పైగానే బరువుండి, దాదాపు ఆరడగుల ఎత్తున్నారు.   పదిహేనేళ్ళకే ఎలాంటి పర్సనాలిటీలు వీళ్ళవి అని ఆశ్చర్యమేసింది. వీళ్ళ టీంకి కోచ్ తెల్లవాడైతే, అప్పొనెంట్ టీంకి కోచ్ ఒక ఇండియన్. పేరు సింగ్‌ట. అంతే కాక ఆటీంలో కనీసం నలుగురు ఇండియన్ పిల్లలున్నారు. కావాలనే అతను ఇండియన్లని తీసుకున్నాడా అని అనిపించింది.

అంతకంటే ఆశ్చర్యమైన విషయం, గేంకి వున్న ఇద్దరు రిఫరీలల్లో ఒకళ్ళు స్త్రీ – అది కూడా చైనా అమ్మాయి అని స్పష్టంగా కనిపించింది.

మూడు క్వార్టర్ల దాకా ఆట మంచి రసపట్టులో వుంది. మొదటి క్వార్టర్లో ఎనిమిది నిముషాలూ ఆడిన రిక్కీ మళ్ళీ చివరి క్వార్టర్లో ఆడడానికి వచ్చాడు. ఇదేమిటి, బాగా ఆడుతున్న వాణ్ణి తీసేసి వీణ్ణి పెట్టాడు కోచ్ అనుకున్నాను. ఇట్లా అయితే వీడి టీం ఇక గెలిచినట్టే అనిపించింది. అంటే రిక్కీ సరిగ్గా ఆడలేదని కాదు; ఆ తీసేసిన వాడయితే ఇంకా బాగా ఆడతాడు కదా అని.

రిక్కీ బాగానే ఆడాడు. కీలకమైన సమయంలో ఒక మూడు పాయింట్ల షాట్ కూడా వేశాడు. ఏమైతేనేం, మొత్తానికి వీడి టీం ఒక్క పాయింట్ తేడాతో గెలిచింది.

“బాగా ఆడుతున్న వాడిని లాస్ట్ క్వార్టర్లో తీసేశాడెందుకు వీడి కోచ్?” విజయ్‌ని అడిగాను.

“టీంలో ఎంత మంది వున్నా అందరూ దాదాపు ఈక్వల్ టైం కోర్టులో వుండాలి.   అది లీగ్ రూలు.” అన్నాడు రిక్కీ. “లేకపోతే ప్రతీ టీంలోనూ ఒక్క స్ట్రాంగ్ ప్లేయర్స్‌నే ఆడనిస్తారు తప్ప మిగతా వాళ్ళకి అవకాశమివ్వరు.”

“ఈ కోచ్‌లని స్కూల్ వాళ్ళు అప్పాయింట్ చేస్తారా?”

“దీనికి స్కూల్తో సంబంధం లేదు. ఒక యూత్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఈ యాక్టివిటీస్‌ని కండక్ట్ చేస్తుంది. బాస్కెట్ బాల్తో బాటు ఫుట్‌బాల్,   వాలీబాల్, టెన్నిస్. వేరే చోట్ల స్విమ్మింగ్ కూడా. వీటన్నిటికీ కోచ్‌లు నాలాంటి తండ్రులే. అక్కడక్కడా తల్లులు కూడా వుంటారు. నాసాలో నా కొలీగ్ ఒకావిడ ఫుట్‌బాల్ కోచ్ చేసింది. సాధారణంగా వాళ్ళు కోచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లో, లేక పిల్లాడో ఆ టీంలో వుంటారనుకో. కానీ ఈ కోచ్‌లు అందరూ నాలాగే బయట వుద్యోగాలు చేసేవాళ్ళే. కోచ్ చేసినందుకు పెన్నీ ముట్టదు.”

హైదరాబాద్‌లో చదువు మాత్రమే “యాక్టివిటీ”గా పెట్టబడిన హైస్కూళ్లల్లోనూ కాలేజీల్లోనూ చదివి వుద్యోగాలు చేస్తున్న నా పిల్లలు గుర్తొచ్చారు. వాళ్ళ “యాక్టివిటీ”కి కోచ్‌గా వుండకుండా వాళ్ళని కోచింగ్ సెంటర్లకి తోలిందీ, నా సమయాన్ని శనీ, ఆది వారాల్లో కూడా ఆఫీసులో కుర్చీకి కట్టేసిందీ, నా పిల్లలతో కాలాన్ని గడపకుండా చేసిందీ వుద్యోగంలో పైమెట్లు ఎక్కుతూనే వుండాలన్న నా ఆశయంవల్లనా లేక స్వార్థంవల్లనా? కారణ మేదైనా అది నా కుటుంబానికి మేలు చెయ్యలేదా? ఆఫీసులో కుర్చీకి కట్టి వెయ్యబడని తండ్రులలో మాత్రం? ఎంతమంది ఆదివారం నాడు స్నేహితులతో గాక పిల్లలతో గడుపుతున్నారు? నేనేదో పెద్దపొజిషన్లో వుండడం దీనికి కారణం అనుకుంటే మరి నాకింద పనిచేసే శంకరన్, అతని కింద పనిచేసే కృష్ణప్ప – మరి వాళ్ళూ నాలాగే కుర్చీకి అతుక్కు పోయిన వాళ్ళేగా!

“ఇంతకుముందు ట్రిప్పుల్లో చికాగోకీ, హూస్టన్‌కీ వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్టునించీ హోటల్‌కీ అక్కణ్ణించీ మళ్లీ వెనక్కీ షటిల్ కొట్టడం మాత్రం జరిగేది. ఈసారి మాత్రం నీతోబాటు వుంటూ ఈ సమాజంలోని దైనందిక జీవితాలని చూడ్డానికి వీలవుతోంది,” అన్నాను వాడితో.

* * *

శ్రావణిని ఓ.ఎం.నించీ పికప్ చేసుకోవడానికి మేరీ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు విజయ్ అన్నాడు. “నికోల్ శ్రావణి క్లాస్‌మేట్. నికోల్ వాళ్ళన్నయ్య మైకేల్. నేను లెగో లీగ్ కోచ్ చేసినప్పుడు దాని మీద అస్సలు ఆసక్తిని చూపించకపోవడమే కాక మిగిలిన వాళ్ళను కూడా డిస్టర్బ్ చేసేవాడు. చెప్పి, చెప్పి విసిగిపోయాను. ఈ తెల్ల పిల్లలు ఇంతే, అందుకే చైనీస్, ఇండియన్స్ ఇక్కడ ఎక్కువ రాణిస్తున్నారు అనుకున్నాను. అయితే, వీడు ఒక ఓ.ఎం. టీంని లీడ్ చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌కి కూడా తీసుకు వెళ్ళాట్ట. అది తెలిసిన తర్వాత పిల్లల గూర్చి సులువుగా అంచనా వెయ్యగూడదని నిర్ణయించుకున్నాను.” అన్నాడు.

“లెగో లీగేమిటి?” అడిగాను.

“లెగో బ్లాక్స్ అని ఇప్పుడే గాదు – చాలా ఏళ్ళ నించీ హైదరాబాద్‌లో కూడా అమ్ముతున్నారుగా! మీ యింట్లో నా చిన్నప్పుడే చూసిన గుర్తు. ఈ బ్లాక్స్‌తో రకరకాల బొమ్మలని, వెహికిల్స్‌నీ తయారు చేయచ్చు. అయితే, బహుశా అంత తేలిగ్గా అక్కడ దొరకనివి ఏమిటంటే, వాటికి సంబంధించిన మోటార్లు, సెన్సర్లు, ఎలెక్ట్రానిక్స్. ఓ.ఎం.కు లాగానే ఫస్ట్ లెగో లీగ్ అని ప్రతీ సంవత్సరమూ నవంబర్లో ఒక పోటీ పెడతారు. ఒక నాలుగడుగులు వెడల్పూ, ఎనిమిదడుగులు పొడవూ వున్న బల్ల మీద రకరకాల అడ్డాలు పెట్టి, ఈ మోటార్లనీ, సెన్సర్లనీ, రకరకాల బ్లాకులనీ, చక్రాలనీ వుపయోగించి రోబోటిక్ వెహికిల్ని తయారు చేసి, దానిని ప్రోగ్రాం చేసి, దానితో ఆ టేబుల్ మీద ఛాలెంజెస్‌ని అధిగమించి పాయింట్లని తెచ్చుకోవాలి. ఎవరెక్కువ పాయింట్లు తెచ్చుకుంటే వాళ్ళదే గెలుపన్నమాట. ఈ పిల్లలు చేసే ప్రోగ్రాములు చూస్తే నాకు మళ్ళీ పిల్లాడినై పోవాలనిపిస్తుంది.”

“నువ్వెందుకు కోచ్ చేశావ్?”

“ఇది స్కూల్లోనే జరిగినా, ఆఫ్టర్ స్కూల్ ఆక్టివిటీ కనక, ఓ.ఎం.లాగానే ఇట్లాంటివి చెయ్యాలంటే తల్లిదండ్రుల సహాయం కావాలి. పైగా రిక్కీ వున్నాడు గనక దాన్ని కోచ్ చెయ్యడం నాకు ఇన్సెంటివ్ కూడాను.”

“వుయ్ వన్ ట్రోఫీస్ ఫర్ టీం వర్క్” అన్నాడు రిక్కీ. వ్యక్తిత్వానికే ప్రాధాన్యత నిస్తుందనుకుంటున్న అమెరికాలో టీం వర్క్‌లో పిల్లలకు బహుమతులా?

శనివారం గేంలో గెలవడం వల్ల రిక్కీ టీం ఆదివారం మళ్ళీ ఆడవలసివచ్చింది.  గేంని చూడ్డానికి కొంతమంది పిల్లల తల్లిదండ్రులేగాక వాళ్ళ తాతలూ, బామ్మలూ/అమ్మమ్మలూ కూడా వచ్చారు. ఈ ఫైనల్ గేంలో రిక్కీ వాళ్ళు గెలిస్తే బావుండేది అనిపించింది.

ఇంటికి వస్తున్నప్పుడు హఠాత్తుగా విజయ్ “అరెరే! మర్చిపోయాను” అంటూ కార్లో రేడియో ఆన్ చేశాడు.

“నాట్ టుడే డాడీ,” అని ముందు నసిగి, తరువాత నాతో, “ఆదివారం సాయంత్రం 6-7 గంటల మధ్యలో రేడియోలో ఈ ప్రోగ్రాం వినడం డాడీకి ఇష్టం” అన్నాడు రిక్కీ. ఈ ప్రోగ్రాంలో దేశంలో బాగా టాలెంట్ వున్న పిల్లలు పెర్ఫార్మెన్స్ ఇస్తూంటారు అన్నాడు విజయ్.

రేడియోలో ఎవరో పియానో చాలా బాగా వాయిస్తున్నారు. అయిన తర్వాత హోరున చప్పట్లు. పన్నెండేళ్ళ మిషెల్ యంగ్. రేడియో హోస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ పిల్ల తల్లి మిషెల్‌ని ప్రతీ శుక్రవారం వాషింగ్టన్ నించీ న్యూయార్క్‌లో పేరుగన్న జూలియార్డ్ స్కూల్‌కి డ్రైవ్ చేసి తీసుకెడుతుందట. వాళ్ళున్న అపార్ట్‌మెంట్‌కి పైనా, కిందా వున్న వాళ్ళు ఈ పిల్ల అదే పనిగా పియానో వాయించడం గూర్చి కంప్లైంట్ చేసి, ఖాళీ చెయ్యమంటే ఎవరికో అది తెలిసి వీళ్ళని వాళ్ళ ఇంట్లో బేస్‌మెంట్లో వుండమన్నారట.

“పిల్లలకి టాలెంట్ వుంటే తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్ళుకూడా అమ్మేసి పిల్లలకి మంచి కోచింగులిప్పిస్తూ జీవిస్తారు. మైకేల్ ఫెల్ప్స్ గూర్చి తెలుసు గదా! ఒలింపిక్స్‌లో అన్ని గోల్డ్ మెడల్స్ సంపాదించే అమెరికన్ల కథలన్నీ ఇలానే వుంటాయి.” అన్నాడు విజయ్.

* * *

మతం వల్లనైతేనేం కాకపోతేనేం, బీద జనాలకి, వుండడానికి ఇళ్ళు కూడా లేని వాళ్ళ కోసం నిస్వార్థంగా సేవ చేసే క్రిస్టీనా; శ్రమదానంతో ఇళ్ళు కట్టించే అమెరికా మాజీ ప్రెసిడెంటూ, ఒక కంపెనీ వైస్ ప్రెసిడెంటూ, ఇంకా అలాంటి చాలా మందీ –

మనవరాలి పాట ప్రాభవాన్ని గర్వంగా చాటి చెప్పే శ్వేతజాతీయ తాత –

ప్రజల అంగ వైకల్యాలు దైనందిన జీవితానికి ప్రతిబంధకాలు కాకుండా వుండేటందుకు అమెరికాలో బధ్ధీకరణ చెయ్యబడ్డ సామాజికమైన మార్పులు –

పిల్లలని ఆట పాటల్లో ప్రోత్సహించడమేకాక సమయాన్నికూడా వాళ్ళతో గడిపే తల్లిదండ్రులూ; పిల్లల టాలెంటును గుర్తించి, వుద్యోగాలు కూడా మానేసి ఆ టాలెంట్ అభివృధ్ధినే ధ్యేయంగాపెట్టుకునే తల్లిదండ్రులూ –

వీళ్ళనిగూర్చి నాకిప్పటిదాకా తెలియకపోవడానికి కారణమేమిటి?

“తెలుగు రచయితలు తానాలకనీ ఆటాలకనీ ఇక్కడికి వచ్చారు గదా, వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత చేసిన రచనలలోనూ వ్రాసిన పుస్తకాలల్లోనూ ఇట్లాంటి అమెరికన్ల గూర్చి ఎందుకు లేదురా?” విజయ్‌ని అడిగాను ఇండియా తిరుగు ప్రయాణానికి విమానం ఎక్కబోయే ముందర.

“ఈ సమాజాన్ని చూసే అవకాశం వాళ్ళకి ఎక్కడుంది? ఇక్కడ వున్న తెలుగు వాళ్ల జీవన విధానాలని మాత్రమే వాళ్లు చూసింది. రెండువారాలకనో రెణ్ణెల్లకనో వస్తారు. తెలుగు వాళ్ల ఇళ్లల్లోనే వుంటారు. వాళ్లు తీసుకు వెళ్లిన చోట్లకే వెడతారు. వాళ్లతోనే చర్చలలో పాల్గొంటారు. ఇక్కడ చూడవలసిన వేమిటో లిస్టు రాసుకుని వస్తారు గనుక అవి మాత్రం చూసి వెడతారు.”

“భారత దేశం గూర్చి మొదటగా బయట తెలిసింది యువాన్ చువాంగ్ వ్రాతల వల్ల అంటారు. అతడూ ఇట్లాగే వ్రాసి వుంటాడంటావా?”

“రాయలేదనుకుంటా. ఎందుకంటే అతను కాలినడకన చైనానుంచీ వచ్చి, దాదాపు పదహారేళ్లు గడిపాడు ఇండియాలో. ఆ పదహారేళ్లలోనూ అటు తక్షశిలనుంచీ ఇటు అమరావతిదాకా ప్రయాణంకూడా చేశాడు. అయితే, అతను ఇండియా వచ్చినప్పుడు అతణ్ణి రిసీవ్ చేసుకోవడానికీ, చుట్టుపక్కల తిప్పడానికీ తక్షశిలలో ఎవరూ చైనీస్ లేరనే అనుకుంటున్నాను. అందుకని అతడు ముందు భాషని నేర్చుకొని, బౌధ్ధాన్ని స్వయంగా పాటించి తెలుసుకో గలిగాడు.”

“బారిష్టర్ పార్వతీశం గుర్తున్నాడా?”

“ఎందుకు లేడూ? హైస్కూల్లో వున్నప్పుడు ఆ పుస్తకాలు చదివి పడీ పడీ నవ్వడం ఇంకా గుర్తుంది.”

“అతడికి గూడా వారాల పాటు పట్టింది నౌకా ప్రయాణం చెయ్యడానికి.”

“నౌకలో ప్రయాణించేటప్పుడే కాక ఇంగ్లండులో వున్నప్పుడు కూడా ఒక ఎపార్ట్‌మెంట్‌లో అద్దెకు వుంటూ ఇంటావిడతో పడ్డ పాట్లు కూడా రాశాడు. అవ్వి అతని స్వీయ అనుభవాలు. అందుకనే వాటికి అంత సహజత్వం. ఆ జీవితానికి టూర్ గైడ్‌లు ఎవరూ లేరు.”

నా ప్రశ్నకి సమాధానం దొరికింది. కారణం టెక్నాలజీ. తప్పు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకు వెళ్ళగలిగే విమానంది; ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలోని అన్ని మూలలకీ ఆ వార్తని క్షణాలమీద చేరుస్తున్న ప్రసార మాధ్యమాలది.

ఆకాశ హర్మ్యాలని దర్శించడానికీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృధ్ధి చేసుకోవడానికీ మాత్రమే కాక ఈ ట్రిప్పులో అమెరికా జీవన విధానాలని అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం కలిగినందుకు ఆనందంగా వుంది.

* * *

ఇండియాకి తిరిగి వచ్చిన రెండువారాల తరువాత ఈ కథని వినయ్‌కి ఈమెయిల్ చేశాను.

“నా పేరులో ఒక్క అక్షరాన్ని మాత్రమే మార్చావ్!” అన్నాడు వాడు ఫోన్లో. తరువాత, అమెరికాగూర్చి అంతా మంచే రాశావ్. ‘అక్కడ అసలు చెడే లేదా? కథలో బాలెన్స్ లేదు,’ అని విమర్శ వస్తుంది.” అన్నాడు.

“పోనీ, నువ్వు చూసిన చెడేమిటో చెప్పు. దాన్ని కథలో వాడుకుంటాను,” అన్నాను.

కొంచెంసేపు ఆలోచించాడు. “చెడు అని అనలేనుగానీ, పిల్లలు హైస్కూల్లో ఎటువంటి చెడలవాట్లకి లోనవుతారోనని భయం. ముఖ్యంగా డ్రగ్స్‌కి.”

“ఎవరి పిల్లలని వాళ్లే నాలుగు కళ్లతో కాపాడుకోక తప్పుతుందా? నువ్వనుకునే భయాలు తెల్లవాళ్లకిగానీ, నల్లవాళ్లకిగానీ వాళ్ల పిల్లలగూర్చి వున్నయ్యేమో వాళ్లనెప్పుడయినా కనుక్కున్నావా? అక్కడ సమాజమంతా డ్రగ్స్‌కి లోనవలేదుగదా! అయినా, హైస్కూళ్లల్లో ‘డ్రగ్స్ మంచివికావు, వాటికి బానిసవకండి,’ అని బోధిస్తారని చెప్పావుగదా! ఇంకేంటి భయం? ఇక్కడి హైస్కూళ్లల్లో అలాంటి విషయాలనే చర్చించరు. కాలేజీలల్లో అయితే, అది అసలు వాళ్ల సమస్యే కాదంటారు. ఇక్కడయితే, అలాంటి సమస్యలు డబ్బున్నవాళ్ల పిల్లలకిలే,” అన్నాను.

“అదీ నిజమే. నేను కాలేజీలో వున్నప్పుడు మా హాస్టల్లోనే డ్రగ్స్ వాడేవాళ్లుండేవాళ్లు. వాళ్ల తల్లిదండ్రులు సింగపూర్లోనో, మలేషియాలోనో వుండేవాళ్లు గనుక, వీళ్లేం చేస్తున్నారో తెలిసేదిగాదు. నాకసలు డబ్బేదీ వాటివైపు మొహం చూపించడానికయినా?”

“నీ మొహం. నీ సంగతి నాకు తెలియదా? డెవిల్స్ అడ్వకేట్‌గా మాట్లాడావుగానీ దాన్లో ఫెయిలయ్యావ్. ఇంకో విధంగా ఆలోచించు. ఇండియానుంచీ అమెరికా వచ్చిన వాళ్లల్లో ఎంతమంది డ్రగ్స్‌కి అలవాటుపడిన వాళ్లయుంటారంటావ్?”

“ఒకవేళ అలాంటివాళ్లున్నాగానీ ఇక్కడ మనగలిగే అవకాశం వుండదు. ఫ్రతీ ఉద్యోగంలోనూ చేరే ముందర డ్రగ్ టెస్ట్ చేయించుకుని శరీరంలో అవి లేవని నిరూపించడం తప్పనిసరి. లేశమాత్రం అవి కనిపించినాగానీ వాళ్లు ఆ ఉద్యోగపు ఆఫర్‌ని విత్‌డ్రా చేస్తారు.”

“మరి, నువ్వింకేం చెడుని చూశావో చెప్పు,” రెట్టించాను.

“నువ్వడిగేది సమంజసంగా లేదు. నేనిక్కడ పాతికేళ్లుగా వుంటున్నాను. నాకు నచ్చనివి ఏవయినా వున్నాగానీ వాటిని చెడు అని ఎలా అనమంటావ్? అంత చెడు వుంటే నేనిక్కడ ఇన్నాళ్లెందుకుంటాను?” అన్నాడు.

“కోప్పడకు నాయనా. చెడుగూర్చి రాయమన్నది నువ్వేగా,” అన్నాను.

ఈ సంభాషణ జరిగి నాలుగేళ్లయిందండీ. వాడు ఇంకా ఆలోచిస్తూనేవున్నాడు. ఇంక నాకు వేచివుండే ఓపికలేదు. ఇదుగో, దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను.

— 0 —

 (ఈ కథలోని కొన్ని సంఘటనలు మాత్రమే కల్పితాలు; పాత్రల పేర్లు మారెయ్ గానీ, వ్యక్తులు సజీవులే.)

 -తాడికొండ కె. శివకుమార శర్మ