అమ్మకు జై, అన్నకు జై

gopi

కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం జనార్ధన వరంలో ఒక పేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టాను. హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. తరవాత లయోలా కాలేజీలో చేరాను. అక్కడ ఒక ఫాదర్ నాకు లిబరేషన్ థియాలజీని పరిచయం చేసారు. తొలినాళ్ళలో పరిచయమయిన మార్క్సిజమూ, తరవాతి ఈ థియాలజీ నన్ను ‘గుడిసె ఏసోబు’ కథలు రాయడానికి ప్రేరేపించాయి. దళిత క్రైస్తవ వాస్తవికతని ప్రతిబింబించే కథకుడిగా నాకు గుర్తింపు లభించింది. అఫ్సర్ గారు నా కథలలోని దళిత క్రైస్తవ వాస్తవికత గురించి విమర్శ వ్యాసాల్లో విశ్లేషించారు. అది నాకు ఉత్సాహాన్నిచ్చింది. మధ్యలో ఇంగ్లీష్ జర్నలిజంలో పడిపోయి, తెలుగుకి దూరమయ్యాను. కథలకూ దూరమయ్యాను. మళ్ళీ నన్ను కథారచనకు పురికొల్పిన మిత్రులు అఫ్సర్, కృపాకర్ మాదిగ, దుర్గం సుబ్బారావు. దళితేతరులు రాజయమేలే మీడియాలో నిలదొక్కుకోవాలంటే  నాలాంటి దళితుడు అనుదిన పోరాటం చేయాల్సిందే. తప్పదు. కాని, నా దళిత అస్తిత్వమే నాకు బలాన్నిచ్చింది. నాకు పోరాట స్పూర్తిని నేర్పింది. జీవితాన్ని పోరాడి సాధించుకునే శక్తి నిచ్చే దళితుడై పుట్టినందుకు గర్వంగా వుంది నాకు—డి. గోపి

*

చానాళ్లకి జానుబాబు వచ్చిండు మావూరు. ఆయనొచ్చిండంటే మాకు పండగే. చిన్న, పెద్ద  తేడా లేకుండా అందర్నీ పలకరిత్తడు జానుబాబు. మావోళ్లు అంతే.  యింటిమనిసిలాగే సూత్తారు. పిలుత్తారు.

ఆయనొచ్చిండంటే సుట్టం వొచ్చినట్లే. కుర్సీ యెయ్యాలని, మర్యాదలు సెయ్యాలని ఆయన  యెదురుచూడ్డు. ఆయనే యేది దొరికితే దానిమీద కూసుంటడు. అన్నం కూడా యేదో సెయ్యాల్సిన పని లేదు. మేం యేది వొండుకుంటే అదే తింటడు. యేడ పడుకుంటే ఆయనకూడా ఆడనే పడుకుంటడు. అందుకే ఆయనంటే మాలో మనిసే. మా మనిసే అని అందరం నమ్ముతం. అంతేకాదు. ఆయనకి తెలిసిన విసయాలన్నీ మాకు అర్ధం అయ్యేలాగ వివరంగ చెపుతడు.

పొద్దుగూకిందంటే ఇళ్లల్లో తలోముద్ద తిని మెల్లగా ఆయన సుట్టూ చేరతం. పిల్లోళ్లు. పెద్దోళ్లు, ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరం ఆయనకాడ కూశుంటం. ఆయన సెప్పేది వింటం.

మొదట్లో ఆయన మాటలు పెద్దగా అర్ధమయ్యేయి కావు. కొంతమందికైతే అసలు నచ్చేయి కాదు. శానామంది ఆయన మాటలకు ఎదురు తిరిగేవోళ్లు. కొంతమందైతే తేలిగ్గా కొట్టిపడేశోళ్లు. ఆడోళ్లు పట్టిచ్చుకునోళ్లు కాదు. కానీ రాను రాను మావోళ్లలో మార్పొచ్చింది. ఒక్కొక్కళ్ళుగా ఆయన సుట్టూ చేరి వినటం, ఆయన సెప్పే మాటల్లో గ్యానం తెల్సుకోవటం అలవాటైంది. ఆడోళ్లు, పిల్లోళ్లు, కుర్రకారోళ్లు అందరూ ఆయన సుట్టూ సేరి ఆయన సెప్పే మాటలు యినటం, అర్ధం కాకపోతే యివరం అడగటం అలవాటు చేసుకున్నం.

జానుబాబు వల్ల ఇన్నేళ్ళల్లో మాలో కొంత మార్పొచ్చిందనే సెప్పాల. పిల్లోళ్లని పనికి పంపటమ్మానేసి బడికి పంపుతున్నం. శానామంది మా పిల్లలు కాలేజీలు కూడా సదువుతున్నరు. మా సంటిగాడి తర్వాత శానామంది దొరకాడ పాలేరుతనం మానేసి బడికెల్తున్నారంటే మరి జానుబాబు తెచ్చి మార్పే.

అటువంటి జానుబాబు శానాకాలం  తర్వాత మావూరొచ్చిండు. ఆచ్చర్యంగాదు మరి!

 

“రా జానుబాబు.. యిట్టకూసో.. బాగుండవా? శాన్నాళ్ళకొచ్చినవే? యేంటి సంగతి?” అని ప్రశ్నల మీద ప్రశ్నలేసి పలకరించిన జానుబాబుని.

ఇంతలో మా ఆడది జానుబాబుకి యెదురెల్లి చెంబుతో నీళ్ల్లిచ్చి “కాళ్ళు కడుక్కో బాబు” అంది.

ఆయన కాళ్లు కడుక్కొని పందిరికిందికి వచ్చేలోగా మంచం యేసి మీద దుప్పటేసింది. సేతిలో కండవా పట్టుకొని జానుబాబుకిచ్చి ‘ముకం కాళ్లు తుడుసుకో బాబు’ అంది.

మా ఆడదాని సేతిలో కండవా అందకొని ‘మంచినీళ్లియ్యమ్మా’ అనుకుంటా ఆ మంచమ్మీద కూలబడ్డడు.

‘యేంటి బాబు అందరూ బాగుండరా?’ అని మల్లీ పలకరించిన.

‘ఆ.. అందరూ బాగనే ఉన్నారు. మీరంతా ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? పిల్లలంత చదువుకుంటున్నారా?’

‘అందరం బాగనే ఉన్నం బాబు. పిల్లోళ్లు శానామంది సదువుతున్నరు. ఏయో పెద్ద సదువులే సదువుతున్నరు బాబు. శానామంది కాలేజి బళ్లకెల్తన్నరు.’

‘అలాగా.. ! మంచి మార్పే వచ్చింది ఊర్లో’

‘అవును బాబు.. అంతా మీ సలవే’అన్నడు అప్పుడే గుమ్మలోకొచ్చిన యెంకటేసు.

‘రా వెంకటేశు. అంతా బాగున్నారా?’ అని జానుబాబు యెంకటేసును పలకరించిండు.

‘బాగనే ఉన్నం బాబు. మీరెట్టున్నారు?’

‘నాకేం. నేను బాగనే  ఉన్న. బాగుండబట్టేకదా మళ్ళీ మీ ఊరొచ్చిన?’

‘అవున్లే బాబు’ అనుకుంటా యెంకటేసు భుజమ్మీద కండవాతో అరుగుమీద దుమ్ముదులిపి కూసుండు.

మేం ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుండగానే వొక్కొక్కళ్లు వొచ్చారు.

యేసేబు, మోసెపెదనాన్న, కుట్న, గోపాలం, శీను, రాములు, అందరూ వొచ్చారు. ఆడోళ్లు కూడా ఒక్కొక్కల్లే వొత్తన్నారు.

వొచ్చినోళ్లందర్నీ పేరుపేరున జానుబాబు పలకరిచ్చిండు.

వొకల్లిద్దరు పిల్లోళ్లు ఆయనకి తెలిసినట్టూ లేరు. ఆళ్ల పేర్లడిగి యెవురి పిల్లోళ్లో తెలుసుకుంటుండు. అప్పుట్లో ఆయనొచ్చినప్పుడు యీ పిల్లోళ్లు శానామంది బంతాడుతుండోళ్లే. ఆనకే నడకనేర్సి, బళ్లో కెల్లి. యిప్పుడు కాలేజీ కెల్తన్నారు.

‘యేంటి బాబు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్లుండవ్?’ అని అడిగిండు యేసేబు.

చిన్నగా నవ్వి, యేసేబు మొకంలోకి చూసి ‘మర్చిపోలేదు. మర్చిపోతే ఇప్పుడొస్తానా?నాకూ వయస్సు మీద పడ్డంలేదు? అయినా ఇప్పుడు వేరే గ్రామాలు తిరుగుతున్నా..’అన్నడు జానుబాబు.

‘బాబు.. యీ తిరుగుడు యింకా మాన్లేదా?’ అడిగిండు మోసే పెదనాన్న.

‘ఎలా మానమంటావ్ మోషే? నాకు తెలిసిన విషయాలు తెలియనివాళ్లకు చెప్పాలి కదా? నా వరకు నేను తెలుసుకున్న విషయాలు ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉంటే ఎలా? భగవంతుడు మాకు తెలివి ఇచ్చింది ఎందుకు? తోటివాళ్లకు ఉపయోగపడటానికే కదా?’

‘అంతేలే బాబు.. మీరట్టా ఆలొచించబట్టేగా ఇప్పుడు మా బుడ్డోళ్లు పాలేరుతనం మానేసి బడికెల్తన్నారు?’ అన్నడు మోసే పెదనాన్న.

‘భగవంతుడిచ్చిన తెలివి బుర్రలో ఉన్నంతకాలం, ఆయనిచ్చిన ఓపిక, శక్తి వంట్లో ఉన్నంతకాలం ఇలాగే ఉండాలనుకున్న. అలాగే ఉంటున్న.’

‘బాబూ. తెలియకడుగుతున్న.. వొంట్లో వోపికయ్యాకేం చేత్తవ్? యేడుంటవ్? నీ సంగతెప్పుడైనా ఆలోచించినవా?’ అన్నడు గోపాళం.

జానుబాబు సిన్నగా నవ్వి ‘ నాగురించి ఆలోచించడానికి మీరు లేరా? ఓపికలేనప్పుడు మీ ఇంటికొస్తే రానివ్వరా? అన్నం పెట్టరా?’ అన్నడు.

‘అదెంతమాట బాబు.. మీరు రావాలెగాని ఆ మాత్రం అన్నం పెట్టలేమా యేంటి?’ మాట కలిపేసిన నేను. నా మాటకి అందరూ అవునన్నట్లు తలూపారు. అందర్నీ అలా చూసిన జానుబాబు కళ్లల్లో నీళ్లు తిరిగినట్లున్నయ్.. సేత్తో కళ్లు తుడుసుకుని.. ‘నేను అంత దూరం ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతం ఓపిక ఉంది… తిరుగుతున్నా..’ అన్నడు.

‘సర్లే బాబు ఇంకేంటి సంగతులు?’

‘ఏముంది. తెనాలి, పునాదిపాడు అని రెండూళ్లు ఉన్నయ్. అక్కడికెళ్లి వస్తున్నా. ఈ రెండు మూడు రోజులు అక్కడే ఉన్నా.’

‘యేంటిబాబు యిసయం? యెవురున్నారక్కడ? సుట్టాలున్నారా?’ శీను అడిగిండు.

‘చుట్టాల్లేరు. కానీ అంతా మనవాళ్లే… మీలాగే.. యేం మీరంతా చుట్టాలు కారా?’

‘అయ్యో యెంతమాట! మీరు మాకు అంతకంటే యెక్కువే బాబూ .. అందరం అనేశాం.

‘అందుకేగా ఇక్కడికొచ్చింది.. సరే.. ఆ ఊర్లలో ఈ మధ్యకాలంలో రెండు సంఘటనలు జరిగాయి. వాటిగురించి మీరు పేపర్లో చదివే ఉంటారనుకున్న. టీవీల్లో కూడా చూసే ఉంటారు.’

వొకళ్లిద్దరు తెలిసినట్టు తలూపారు.యింకొంతమందైతే అయోమయం ముకాలు పెట్టి జానుబాబును సూత్తన్నారు.

‘నేను చదివాను సారు’ అన్నడు మా యాకోబుగాడి పెద్దకొడుకు యేసురాజు.

జానుబాబు ముకంలో నవ్వు కనపడింది.

‘ఎవరబ్బాయివిరా నువ్వు? నీ పేరేంటి?’ అన్నడు యేసురాజు వైపు చెయ్యి చాపి.

యేసురాజుగాడు దగ్గరకొచ్చి నుంచోగానే జానుబాబు ఆడి ఈపు మీద చెయ్యేసి మెల్లగా నిమిరి ‘ ఏం చదివావో చెప్పు’ అన్నడు.

ఆడు పదోతరగతి అయ్యాక ఇప్పుడు కాలేజి బడికెల్తుండు.

నేనెప్పుడో యాకోబుగాడికి సెప్పిన పిల్లోణ్ని బాగా సదివియ్యరా అని.

జానుబాబు పక్కనే సేతులు కట్టుకొని నుంచున్న యేసురాజు మెల్లగా సెప్పటం మొదలుపెట్టిండు.

  ‘తెనాలిలో కొంతమంది మందు తాగి రోడ్డుమీద వెల్తున్న ఒక అమ్మాయిని ఏడ్పించారంట. ఆ అమ్మాయితోపాటున్న వాళ్ల అమ్మ వాళ్లను తిట్టిందంట. దాంతో వాళ్లు కొంతమంది అమ్మాయిని పట్టుకొని రోడ్డుపక్కకి లాక్కెళ్లారంట. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ల అమ్మ వెంటపడి పెద్దగా అరుస్తూ వాళ్లల్లో కొంతమందిని కొట్టిందంట. అందుకని వాళ్లు ఆమెని కూడా కొట్టి ఎదురుగా లారీ వస్తుంటే దానికిందికి తోసేశారంట. ఆమె చనిపోయిందంట.’

ఆడు సెపుతుంటే మాలో శానామందికి కళ్లెంమ్మట నీళ్లు తిరిగినయ్. కొంతమందైతే నోరెల్లమెట్టుకొని యింటన్నారు. జానుబాబు మాత్రం తలవూపుతూ యింటన్నాడు.

‘మరి పునాదిపాడు సంగతి కూడా చదివావా? జానుబాబు ఆణ్ని అడిగిండు.

‘ఆ. చదివాను సాఋ అన్నడాడు.

‘మరి దాని గురించి చెప్పూ’

‘అది కూడా అంతే సార్.. రాత్రిపూట అన్నాచెల్లెళ్లు ప్రార్ధనకెళ్లి తిరిగి ఇంటికెళ్తుంటే రోడ్డెమ్మటే ఉన్న బార్‌లో తాగిన ముగ్గురు ఆ అమ్మాయిని అల్లరి చేశారంట. అది అడ్డుకున్న ఆ అమ్మాయి అన్నని మోటార్‌సైకిల్‌తో గుద్ది కిందపడేసి కొట్టారంట. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించారంట. తర్వాత రెండు రోజులు ఆస్పత్రిలో ఉండి అతను చనిపోయాడంట.

‘వోర్నియవ్వ.. లోకం యేంవైపోతంద్రా? యేంటీ గోరాలు?అన్నడు మోసే పెదనాన్న.

‘ఆడ మనుసుల్లేరేంట్రా? అదసలా ఊరేనా?’ నాకు కోపం వచ్చింది.

యింత జరుగుతుంటే ఆ వూళ్లో జనం యేంజేత్తన్నట్టు అనిపించింది. జానుబాబుని కూడా అదే అడిగిన.

‘జనం ఎందుకు లేరు. ఉన్నారు.పునాదిపాడులో అర్ధరాత్రి జరిగింది. అందుకే అక్కడెవరూ లేరు. కాని తెనాలిలో నడిరోడ్డుమీద.. చుట్టూ జనం  చూస్తుండగానే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే.. ఇదంతా జరుగుతుంటే ఆ దగ్గర్లోనే డ్యూటీలో ఉన్న పోలీసు కనీసం కన్నెత్తి కూడా చూడ్లేదు. ఆ తల్లిని లారీకింద పడేసి వాళ్లు పారిపోయిన తర్వాత అప్పుడు ఆ పోలీసు ఒచ్చి రక్తపు మడుగులో ఉన్న అమ్మను అంబులెన్సులో ఎక్కించి ఆస్పత్రికి పంపించాడు. చుట్టూ ఉన్న జనం సినిమా చూస్తున్నట్టుండిపోయారే తప్ప ఆ అమ్మకు సాయం చేసే ప్రయత్నం చేయలేదు.’

జానుబాబు జెప్తూనే ఉన్నడు. నాకు కళ్ళల్లో నీళ్లు నిండినయ్. శానామంది పరిస్థితి కూడా అదే.

మనుషులు ఎంత మారిపోయారు? సాటిమనిషికి సాయం చేసోళ్లే లేకపోతే ఎట్లా?

‘ఇంతకీ తర్వాతేమైంది బాబు?’ అందరం వొకేసారి అడిగినట్టు జానుబాబు ముకంలోకి సూసినం. మా ప్రస్న అర్ధం అయినట్లు జానుబాబు  వూపిరి పీల్చుకొని మళ్లీ సెప్పటం మొదలెట్టిండు.

‘ఆస్పత్రిలో అమ్మ చనిపోయింది. ఈలోగా పోలీసులు ఆ పాప దగ్గరకెల్లి తెల్లకాగితంపై సంతకం పెట్టమని వత్తిడి చేశారు.’

‘అదేంటి బాబు? యెంత అన్యాయం? పోలీసులు అట్టా ఎందుకు సేసినట్టు?’ జానుబాబు మాటల్ని మద్దెలోనే ఆపి అడిగిన.

‘ఏముంది? తాగి గొడవచేసిన వాళ్లు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మనుషులు, వాళ్లని కాపాడ్డం కోసం ఆయన పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును పక్కదారి పట్టించేందుకు అలా చేయించాడు.’

‘యెంత అన్యాయం బాబు. ఎమ్మెల్లే అంటే మనబోటోళ్లని కాపాడాలగాని, ఆ తాగుబోతుల్ని  కాపాడాల్సిన అవసరం యేమొచ్చింది?’

‘అంతేమరి మంత్రులు, ఎమ్మెల్లేలు ఇప్పుడు చేస్తున్నది అదేగా!? రౌడీలు, గూండాలు, నేరస్తుల్ని కాపాడటం, ఎలక్షన్లప్పుడు వాళ్లని వాడుకోవడం మనం చూడ్డంలేదా?’

‘యిది మరీ చిత్రంగా ఉంది బాబు. మన్సి ప్రాణం పోయాక కూడా రౌడీల్ని, తాగుబోతుల్నే కాపాడతారా? మరి మనబోటోళ్ల సంగతేంటి?’

‘ఏముంది? మీబోటోళ్లంతా ఓటుకి డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికేనే ఓటేస్తున్నారా? అందుకే వాళ్లు రౌడీలను, నేరస్తులను నమ్ముకుంటున్నారు. వాళ్లకే సాయంగా నిలబడతారు.’

జానుబాబు చెప్పిన యీమాటా మా చెంపలమీద చెళ్లున చరిసినట్టయింది. వోట్లప్పుడు నోట్లిత్తుంటే యెగబడి తీసుకుంటున్న మాకు జానుబాబు మాటలు గట్టిగనే గుచ్చుకున్నయ్.  యీదారి బాగున్నట్టు అనిపించలేదు. పానం పోతున్న మాబోటోళ్లకి ఎమ్మెల్లే సాయం చేయట్లేదంటే కిటుకు మా వోటులోనే ఉందని ఆయన సెప్పకనే సెప్పిండు. ఎమ్మెల్లేకి ఉచితంగా వోటెయ్యమని మాకు కస్టాల్లో ఉన్నప్పుడు ఆయన సాయం చేత్తాడని యెట్టా కోరుకుంటం?

నేను ఆలోసెత్తన్న. నాలాగే మావోళ్లంతా ఆలోసెత్తన్నారనుకుంట. అందరూ మాట్లాడకుండా అలా జానుబాబును చూత్తూ కూసున్నారు.

‘సరే.. ఆలోచించండి. అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. నేరాలు చేసేవాళ్లు కాపాడబడుతున్నారు. నష్టపోయే మీలాంటివాళ్లు నష్టపోతూనే ఉన్నారు.

‘మరెలా బాబు? ఏం చేయాలి? అక్కడ మీరేం చేప్పారు.?’

‘నేనే కాదు. నాలాంటివాళ్లు చాలామంది ఈ రెండు గ్రామాలు  సందర్శించారు. బాధిత కుటుంబాల వారిని పరామర్శించారు. మేం అక్కడ కొన్ని విషయాలు చెప్పాం. ఓటు మన హక్కు. హక్కుని అమ్ముకుంటే కొనుక్కున్నవాడు అధికారానికి వచ్చి తన మనుషులకే అండగా ఉంటాడుగాని ఓటు అమ్ముకున్న మనబోటివాళ్ళకు అండగా  ఉండడు.’

జానుబాబు వొక్కొక్కమాట నెమ్మదిగా  చెపుతుండు మాకు అర్ధం కావాలని. అందరివైపు సూచి సెపుతుండు ఆలోసించమని.

‘వోటు అమ్ముకోవడమే కాదు. మనం ఇంకా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలి. తెనాలిలోగాని, పునాదిపాడులో గాని జరిగిన రెండు సంఘటనలు బార్ల వద్దే జరిగాయి. బార్లు రోడ్డుపక్కనే ఉన్నాయి. మందు తాగిన వాళ్లు రోడ్డుమీద వెళ్లే ఆడవాళ్లపై దాడి చేస్తున్నారు. ఇది మనం గమనించాలి. ఇటువంటి దాడి రేపు మన ఊర్లో కూడ జరగొచ్చు. మనింటి అమ్మాయిలమీదా జరగొచ్చు.. అందుకే మనం ఒక విషయం ఆలోచించాలి. ఇటువంటి దాడులకు కారణం అవుతున్న ఈ బ్రాందీ షాపులు, బార్లు, ఇళ్ల మధ్యలో, రోడ్డు పక్కనే ఉండటాన్ని మనం వ్యతిరేకించాలి. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కాని ఇప్పుడు మనం ఆలోచించడం మొదలుపెడితే ఏదో ఒక రోజుకి ఇది సాధ్యం అవుతుంది.”

‘బ్రాందీ సాపులు తీయటం కుదురుద్దా బాబు?’

‘ఎందుకు కుదరదు? పట్టణాల్లో చేపల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, పూల మార్కెట్లు, రైతుబజార్లు విడివిడిగా లేవా? అలాగే బ్రాందీ షాపులు కూడా విడిగా, ఊరికి దూరంగా, రోడ్డుకి దూరంగా ఏర్పాటు చేసుకోమనాలి. మన పల్లెల్లో కూడా వారానికి ఒకసారి ఏర్పాటు చేసుకునే సంతల్లాగే ఈ బ్రాందీషాపులు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాలి. సంత ఉన్నరోజు మాత్రమే బ్రాందీ, విస్కీలు అమ్ముకోవచ్చు. మిగిలిన రోజులు అమ్మటానికి వీల్లేదు. ఒకవేళ అమ్ముకోవాలంటే వాళ్లు ఊరికి దూరంగా ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలి.’

అందరం యేం మాట్లాడకుండ మౌనంగా ఉన్నం. ఆలోశన మొదలైంది.

‘ఈ విషయాలన్నీ ఆ రెండు ఊర్లలో చెప్పాం. నేను ఏమంటున్నానంటే మాన్లో ఈ మార్పు రాకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ మందు మీద చాలా ఆదాయం వస్తోంది. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కంటె బ్రాందీ అమ్మకాలపై వచ్చే ఆదాయమే ఎక్కువ. కాబట్టి మనం ఆలొచించాలి. ఆడపిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఒక అమ్మ, ఒక అన్న మనకు నేర్పిన పాఠం. ఇప్పటికిప్పుడే ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆలోచించండి. మన బిడ్డలను కాపాడుకోవలసిన బాధ్యత మనది కాదా? అందుకోసం మనం ఇటువంటి ఆలోచన చేయలేమా?’

‘……………………’

నేను, నాలాంటివాళ్లు చాలామంది ఈ విషయాలన్నీ చెపుతూనే ఉన్నాం. అర్ధం చేసుకోండి. ఈ ఆలోచన చాపకింద నీరులా సాగాలి.’

‘…………………….’

‘రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మన ఓటు హక్కు మన హక్కు. ఆ హక్కుని కాపాడుకుందాం. అలాగే ఊర్లో మద్యం షాపులు ఉండకూడదు. ఈ రెండు విషయాలు మనం ఆలోచించడం మొదలుపెడితే మార్పు అదే వస్తుంది. మరో అమ్మ, మరో అన్న తాగుబోటుల దాడిలో చనిపోయే అవకాశం ఉండదు. మరో ఎమ్మెల్యే తాగుబోతుల్ని కాపాడే ప్రయత్నం చేయ్యడు.’

అంతా నిసబ్ధంగా ఉంది.  యెవురూ మాట్లాడలేదు. యెవళ్లకి ఆళ్లు గట్టిగా వూపిరి పీల్చి వదులుతున్నారే తప్ప మాట్లాడే ధైర్యం చెయ్యటం లేదు.

జానుబాబు మాటలు మమ్మల్ని ఆలోశన్లో పడేసినయ్. నిజమే. యిది అన్యాయమే.. యేదోవొకటి సెయ్యాల. యేదోవొకటేంటీ.. జానుబాబు సెప్పింది బాగనే వుంది. కానీ అది జరిగేనా?.. జరగాలి మరి.. యేదోసెయ్యమని గవర్నమెంటోళ్లని అడిగే ముందు మనం కూడా యేదో వొకటి సెయ్యాలని యింతకు మునుపెప్పడో జానుబాబు సెప్పిండు.

జానుబాబు మాటల్లోనుండి యింకా కోలుకోకముందే ‘అన్నం పెడతా రా బాబు’ అంటూ మా ఆడది జానుబాబుని పిలిసింది. ఆయన అట్లనే లేచి గుడిసేలోకి ఎల్లిండు.

మావోళ్లంతా ఒక్కొక్కల్లే లేచి ఇళ్లదారి పట్టారు. ఎవురూ మాట్లాడలేదు. ఆలోచిత్తన్నారనుకుంట… మంచిదే.. ఆలొచించాల్సిందే మరి.

బిడ్డని కాపాడుకోవటానికి ఆ అమ్మ సేసిన పని గుర్తొచ్చింది. సెల్లిని కాపాడుకోవటానికి ఆ అన్న సేసిన పని గుర్తొచ్చింది. ఆళ్లు గొప్పోళ్లనిపించింది. మనసులోనే అనుకున్న ‘అమ్మకు జై.. అన్నకు జై..’