నీకు ఉక్కు రెక్కలుంటే….!

photo

లోహగాత్రీ, గగన ధాత్రీ, విమానమా!

మనో పుత్రీ! నీ గమన శక్తి నిరుపమానమా?

పక్షుల రెక్కలలో ప్రాణం పోసుకున్న దానా

నీవు ఈ మానవునితో సమానమా?

నీకు ఉక్కు రెక్కలుంటే, నాకు ఊహా రెక్కలున్నాయి

నీవు ఆకాశంలోకి ఎగరగానే

అంతరాంతరాన సమాంతర ఆకాశం పరుచుకుంటుంది

వాయువేగంతో నీవు మనోవేగంతో నేను

సరదాగా పోటీపడదాం రా!

నీవు నడుము బెల్టు సేఫ్టీ పాఠం చెప్తుండగానే

నయాగరా అందాలను నయనాలతో ఉత్ప్రేక్షిస్తాను

ఉప్పునీటి సముద్రాలను

ఆనంద బాష్పాలలోకి ప్రతిక్షేపిస్తాను

నీవు ముప్పై వేల అడుగుల ఎత్తును చాటుకుంటుండగానే

తల మీద తారను ధరించి

కంటి వైద్యుడిలా మింటిని శోధిస్తుంటాను

‘టీ, కాఫీ, డ్రింక్స్’ అంటూ నీవు గోల పెడుతుండగానే

వెన్నెలను తాగేసి చంద్రున్ని బికారీని చేస్తాను

రైట్ సోదరుల అడుగుజాడల్ని

అంబర వీధులుగా మార్చుకున్న ఉక్కుపక్షీ

నీతో నాది లవ్ ఎట్ ఫస్ట్ ఫ్లయిట్

నీ పైలెట్లు మమ్మల్ని మోసుకువెళ్ళే వీర హనుమాన్లు

ఎయిర్ హోస్టెస్ లు – ఫ్లయింగ్ స్మైల్ల నెమళ్లు

విమానమా! నిజమే నీది ఒంటరి యాత్ర

రోడ్లూ, వంతెనలు లేని శూన్యంలో సాహస యాత్ర

ఆకాశం ఒక పెద్ద ఎండమావి

బోర్లేసిన వజ్రాల బావి

మానవ స్పర్శ లేని మార్మిక మైదానం

అనేక ఆకర్షణ వికర్షణల కేంద్రం

అగణిత శాస్త్రసూత్రాల రహస్య పత్రం

20110615-WN-14-Famous-Picasso-Painting-Could-be-Yours-for-20-Million

అంతరిక్షంలోకి దూసుకుపోతున్న నిన్ను చూస్తుంటే

పగలు వినీల సముద్రాన్ని ఈదుతున్న

కాగితపు పడవ అనిపిస్తావు

రాత్రుల్లో – ఖగోళ వర్ణమాలను నేర్చుకుంటున్న

వయోజన విద్యార్థివనిపిస్తావు

అజ్ఞాతాన్ని అన్వేషిస్తున్న తత్వవేత్తవనిపిస్తావు

రెండు ఊహా బిందువులను కలిపే

గణిత శాస్త్రజ్ఞుడివనిపిస్తావు

కాలం దూరం వేగం లెక్కలను సాపేక్షంగా తేల్చేసుకుంటూ

నన్నొక కలగా మార్చేసి

అలల తీరాలకు చేర్చిన నీకు

మానవజాతి తల పైకెత్తుకునేటట్లు చేసిన నీకు

ఇదే వీడ్కోలు

సూర్యుడు అస్తమించని సామ్రాజ్య రాణీ!

అదిగో మహా పర్వతాల మంచు శిఖరాలు

హరితారణ్య వృక్ష శాఖలు

సముద్రాల ఉన్మత్త కెరటాలు

గమన సూచికలైన గగన తారకలు

నీకు చెప్తున్నాయి టాటా!

రెక్కల ఐరావతమా! అల్విదా!!

శాస్త్రనేత్రీ! సుగాత్రీ! శుభయాత్రా!!

-డా. అమ్మంగి వేణుగోపాల్