ప్రతి నాటకం ఓ సెన్సేషనే!

  డాక్టర్  వాణి  దేవులపల్లి

 

IMG_0978భారత ఆధునిక నాటక రంగం అనగానే మనకు మొట్ట మొదటగా గుర్తొచ్చే పేరు మరాఠీ నాటక రంగ దిగ్గజం విజయ్ టెండూల్కర్ !  మరాఠీ  నాటక రంగాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేసిన టెండూల్కర్ 1960 వ దశకంలో పేలవంగా, నిర్జీవంగా ఉన్న మరాఠీ థియేటర్ కు ఊపిరులూది నూతన జవసత్వా లందించాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి  అయిన టెండూల్కర్ నాటక రంగంలోనే కాక,  తన ప్రతిభను వివిధ రంగాల్లో చాటాడు. సినీ, టెలివిజన్, స్క్రీన్ ప్లే  రచయితగా, నవలా రచయితగా, సాహితీ వ్యాస కర్తగా , రాజకీయ జర్నలిస్టుగా,   గొప్ప వక్తగా, వ్యాఖ్యాతగా  పేరు  గాంచాడు.  టెండూల్కర్ తన మాతృ భాష మరాఠీ లో రాసిన అనేక నాటకాలు ఆంగ్లం లోకి  అనువదింపబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆధునిక భారతీయ ఆంగ్ల సాహిత్యం లోనూ తనకంటూ ఓ స్థానం సుస్థిర పరచుకున్నాడు  టెండూల్కర్. 

అతడు రాసిన నాటకాలు చాలా వరకు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్నవే !  నాటకాలు రచించడం పై అమెరికా విశ్వవిద్యాలయ విద్యార్థులకు పాఠాలను భోధించి,  అధ్యాపకుడుగా కూడా అవతారమెత్తిన   టెండూల్కర్ దాదాపు యాభై ఏళ్ళు పైగా భారతీయ నాటక రంగాన్ని ఏలడమే  గాక,  మరాఠీ నాటక  రంగంలో  ఓ సంచలనాత్మక శక్తిగా భారతీయ నాటక రంగానికి ఓ గొప్ప ప్రేరణ గా నిలిచిపోయాడు.

విజయ్ టెండూల్కర్ జనవరి 8, 1928  వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో, బాలవాలీకర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.  అతడి తండ్రి ఓ చిన్న ప్రచురణ సంస్థను నడిపేవాడు. ఆ విధంగా ఇంట్లో ఉన్న సాహితీ వాతావరణం సహజంగానే తెలివైన టెండూల్కర్ కు రచనా రంగం పై మక్కువ పెంచుకోవడానికి దోహద పడింది. తన ఆరేళ్ళ వయసు లోనే ఓ కథ రాసాడంటే ఆ వాతావరణం చిన్ని టెండూల్కర్ పై ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసికోవచ్చు.

ముఖ్యంగా, పాశ్చాత్య నాటకాలను ఎక్కువగా వీక్షించడం కూడా అతను నాటక రంగం పై ఇష్టాన్ని పెంచుకోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్ధర్ మిల్లర్ అమెరికా సమాజం లోని మధ్య తరగతి ప్రజల జీవన విధానాన్ని చిత్రీకరించిన తీరు, ఆ ప్రభావం టెండూల్కర్  రచనల్లో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల జీవన చిత్రణ ఆవిష్కరించిన తీరులో ప్రస్పుటంగా కనిపిస్తుంది.  పదునాలుగేళ్ళ వయస్సులో తన చదువును వదిలేసి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తన దేశభక్తిని చాటాడు. చదువుకు స్వస్తి పలికి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు  దూరంగా,  ఒంటరిగా ఉన్న టెండూల్కర్ కు ‘రచనా వ్యాసంగ’ మే లోకమైంది. మొదటగా, పత్రికలకు వ్యాసాలు రాయడం ద్వారా కెరీర్ ను ప్రారంభించిన టెండూల్కర్ తరువాత నాటక రంగం పై ఉన్న అభిమానంతో నాటక రచయితగా మారాడు.

తన కెరీర్ ఆరంభంలో టెండూల్కర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ముంబాయి లోని పూరి గుడిసెల్లో చాలీ చాలని అవసరాలతో జీవితాన్ని వెళ్ళదీసిన అతడు తాను చూసిన పట్టణాల్లోని మద్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల జీవితాల స్పూర్తిగా వారి జీవన విధానాన్ని తన రచనల్లో ప్రతిబింబించాడు. టెండూల్కర్ తాను చూసిందే రాసాడు. తాను విన్న సంఘటనలనే  కథా వస్తువుగా మలచుకున్నాడు. మానవ నైజాన్ని నిక్కచ్చిగా, నిష్కర్షగా ఆవిష్కరించాడు. మానవ స్వభావం లోని హింసను, దాని అనేక రూపాలను తనదైన శైలిలో ఎత్తి చూపాడు. తద్వారా సామాజిక వాస్తవికతకు పెద్ద పీట వేసాడు టెండూల్కర్.

ఓ చోట ఇంటర్వ్యూ లో ఇలా అంటాడతను. “నేను సమాజం లో చూసిందే నా కథా వస్తువుగా మలచుకున్నాను. లేనిది ఊహించి రాయడం గానీ, కలల్లో విహరించి రాయడం గానీ నేను చేయలేదు. నేను ఓ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాను. అనేకసార్లు జీవితంలో చేదు నూ చవిచూసాను. నేను అనుభవించినదే నా రచనల్లో చిత్రించాను…….” సామాజిక వాస్తవికత పట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది. టెండూల్కర్ లోని నిక్కచ్చి తనం, నిర్మొహమాటం, నిర్భీతి మనల్ని అబ్బురపరుస్తుంది. అతడు తన పదునాల్గవ ఏటనుండి నాటకాలు రాస్తున్నప్పటికీ,  1950 వ దశకం లో అతను రాసిన ‘శ్రీమంత్’ సంకుచితత్వంలో కొట్టు మిట్టాడుతున్న మరాఠీ    వీక్షకులను కదిలించింది. ఈ నాటక కథాంశాన్ని తీసుకుంటే పెళ్లి కాకుండానే తల్లయిన ఓ ఆగర్భ శ్రీమంతుడి  కూతురు సమాజ కట్టుబాట్ల కతీతంగా  బిడ్డను కనాలని నిర్ణయించుకుంటుంది. సహజంగానే, ఆమె తండ్రి దీనిని  వ్యతిరేకించి, ఈ విషయం బయటకు పొక్కకుండా తన డబ్బుతో కూతురికి భర్తను కొనాలని నిర్ణయిస్తాడు. ఈ విధంగా తన సామాజిక ప్రతిష్టకు భంగం కలగ కూడదని  అతని ఆశ. ఈ కథాంశం సమకాలీన  మరాఠీ నాటక రంగంలో  ఓ పెను తుఫాను సృష్టించింది.

టెండూల్కర్ రచనలు ఆధునిక మరాఠీ థియేటర్ ను తీవ్రంగా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా, 1950 మరియు 1960 వ దశకం లో ‘రంగయాన్’ లాంటి నాటక సంస్థలు,  అందులోని సభ్యులు శ్రీరాం లాగు, మోహన్ అగాషి, సుభాష్ దేశ్ పాండే మొదలగు వారు టెండూల్కర్ నాటకాలను ప్రయోగాత్మకంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో భాగంగా ఓ నూతన ఒరవడిని సృష్టించారు. అతని ప్రతి నాటకం ఓ సెన్సేషనే! సమాజం లోని కుళ్ళు, కుతంత్రం, కుత్సితత్వం, హింస, అవినీతి, అన్యాయాలకు టెండూల్కర్ రచనలు అద్దం పడతాయి.

1961 లో టెండూల్కర్ రాసిన  ‘ద వల్చర్స్ ‘ (The Vultures) కుటుంబ వ్యవస్థ లోని నైతిక విలువల పతనానికి పరాకాష్ట గా చెప్పుకోవచ్చు. కుటుంబ బంధాలు సైతం వ్యాపార బంధాలుగా మారుతున్న తీరు, ప్రబలే  హింసాత్మక ధోరణులు, ఏ విధంగా మానవ సంబంధాలు అడుగంతుతున్నాయో చెప్పిన తీరు నిజంగా విప్లవాత్మకమే! ఈ నాటకం సమకాలీన మధ్య తరగతి మరాఠీ ఆడియన్స్ కి మింగుడు పడ లేదు.ఎలాంటి హిపోక్రసి లేకుండా కుటుంబ హింస, అక్రమ సంబంధాలను టెండూల్కర్ దిగంబరంగా చూపించడం వారికి నచ్చలేదు. ఇక పోతే, ఫ్రెడ్ రిక్  డ్యురోన్ మాట్ ‘ట్రాప్ స్ ‘ (Traps) కథ ఆధారంగా రాసిన ‘సైలెన్స్ ! ద కోర్ట్ ఈజ్ ఇన్ సెషన్ ‘ (Silence! The Court is in Session) 1967 లో మొట్ట మొదటగా ప్రదర్శింప బడ్డప్పుడు నాటక రంగంలో టెండూల్కర్ పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. తదుపరి సత్యదేవ్ దూబే దాన్ని 1971 లో సినిమాగా మలచినప్పుడు టెండూల్కర్ స్క్రీన్ ప్లే రాసాడు. ఆ తర్వాత అతను రాసిన ‘సఖరాం ద బుక్ బైండ ర్ ‘ (Sakharam The Book Binder), కమల , (Kamala), ‘కన్యాదాన్ ‘ (Kanyaadaan) మరియు  ‘ఘాశీరాం  కొత్వాల్ ‘ (Ghashiram Kotwal);  ఈ ఒక్కో నాటకం సమకాలీన మధ్య తరగతి ప్రజల సమస్యలపై అతడు  సంధించిన ఒక్కో  ఫిరంగి  గుండు.  సామాజిక అసమానతలపై అతను పూరించిన శంఖా రావం.

‘సఖరాం ద బుక్ బైన్దర్ ‘ (Sakharam The Book Binder) కథాంశా న్నే తీసుకుంటే బుక్ బైందర్ గా పని చేసే సఖరాం అనే వ్యక్తి వివాహ జీవితంలో వైఫల్యం పొందిన స్త్రీలను ‘ఆదరిస్తున్న’ ముసుగులో చేరదీసి వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆసరాగా ఉన్న నెపంతో వారిని తన ఇంటి పనులు చేయడానికి మాత్రమే గాక భౌతిక అవసరాలు కూడా తీర్చుకునేందుకు ఉపయోగించుకునే తీరు అతని హిపోక్రసీని, కుటిలత్వాన్ని బట్టబయలు చేస్తుంది. ఆ తర్వాత అతని బంధం ఆ స్త్రీలతో తనకు ఇష్టమున్నంత కాలం కొనసాగుతుంది. తరువాత అతనికి వారిలో ఏ నచ్చని అంశం కనిపించినా బయటకు వెళ్ళ గొడతాడు. సఖరాం  చేరదీసిన లక్ష్మి, చంప ఇద్దరూ రెండు విభిన్న మనస్తత్వాలు. ఇద్దరూ వైవాహిక జీవితం లో ఓడిపోయిన వారే. లక్ష్మి పిల్లల్లేని కారణంగా భర్త నిరాదరణకు గురై వంచించ బడుతుంది. ఇకపోతే, చంప భర్త శాడిజాన్ని భరించలేక ఇంటి నుండి పారిపోయి వస్తుంది.

సఖరాం లక్ష్మి తో అన్న మాటల్లోనే అతని స్వభావం తెలుసుకోవచ్చు. ” నువ్వు ఎవ్వరి వైపు కన్నెత్తి చూడకూడదు. పల్లెత్తి మాటాడకూడదు. కొత్త వారి ముందు తలపై ముసుగు తీయకూడదు. నేను ఈ ఇంటి యజమానిని. ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం…. అంతే!……”  వైవాహిక బంధం పట్ల తనకు నమ్మకం లేదంటూనే వారిపట్ల కపట జాలిని, సహానుభూతిని చూపుతూనే తాను చేరదీసిన స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించడం టెండూల్కర్ అతని పాత్ర కిచ్చిన మరో కోణం.

ఈ నాటకం మరాఠి థియేటర్ లో ఒక రేవల్యుషన్  గా చెప్పుకుంటారు. టెండూల్కర్ రచనల్లోని మరో కోణం మానవీయ కోణం. స్రీలు మానవుల్లా చూడబడాలనే  ఆకాంక్ష అతడి రచనల్లో గోచరిస్తుంది. స్రీలు ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూడబడ టాన్ని, హింసకు బలి కావడాన్ని , అన్యాయానికి గురి కావడాన్ని అతని స్త్రీ పాత్రలు ప్రశ్నిస్తాయి; తిరగబడతాయి. అయితే ఆ పాత్రలు పరిస్థుతులకు తలొగ్గే విధానం మాత్రం విమర్శలకు లోనైంది. అతడి నాటకాలు ముగింపులో ఎలాంటి పరిష్కారాన్ని సూచించకపోవడం ఓ లోపం అంటారు విమర్శకులు. అయితేనేం, అతని స్త్రీ పాత్రలు అన్యాయాన్ని ప్రతిఘటించడం నేర్చుకుంటాయి. పోరాట పటిమను చాటుతాయి. బహుశా టెండూల్కర్ లోని ఈ దృక్కోణమే అతడు స్త్రీల పక్షపాతి అని ముద్ర పడడానికి దోహదం చేసిందేమో!

అతడి మరో నాటకం ‘కమల’ కూడా అశ్విన్ సరీన్ ‘ద ఇండియన్  ఎక్స్ ప్రెస్ ‘ కోసం నిజ జీవిత సంఘటన నేపథ్యంగా రాసిన కథనంతో ప్రేరేపింప బడి రాసిందే! ఎగువ మధ్య తరగతి కుటుంబ నేపథ్యంగా రాసిన ఈ నాటకం లో జైసింగ్ ఓ పేరున్న జర్నలిస్టు. అతని భార్య సరిత విధ్యాదికురాలు అయినప్పటికీ భర్త పురుషాధిక్యతను, నిరంకుశత్వాన్ని, హిపోక్రసీని మౌనంగా భరిస్తుంది. ఆ ఇంట్లో తన స్థానం కూడా  ఓ బానిస వంటిదనే విషయం జైసింగ్ మానవ సంతలో కొనుక్కొచ్చిన కమల అనే గిరిజన మహిళ ” సార్ నిన్నెంతకు కొన్నాడ మ్మా ?” అని ప్రశ్నించే వరకు సరిత గుర్తించదు. జైసింగ్ పేరుకు ఓ పేరున్న జర్నలిస్టు అయినప్పటికీ అతనిలో ఆదర్శ భావాలు, సమభావాలు మచ్చుకైనా కానరావు. పైగా, తన పేరు కోసం, ప్రమోషన్ కోసం చిరిగిన దుస్తుల్లోనే యధాతధంగా కమలను మీడియా ముందు ప్రవేశ పెట్టాలనుకోవడం జైసింగ్ అమానవీయ కోణాన్ని, మీడియా లోని ఎల్లో జర్నలిజాన్ని, హిపోక్రసీని ప్రతిబింబిస్తుంది.

ప్రచారాలను, పై పై మెరుగుల  సంస్కరణలను మాత్రమే  ప్రతిబింబించే నాటకాలకు  పరిమితమైన సమకాలీన మరాఠి థియేటర్ ను టెండూల్కర్ తన సామాజిక పరిశీలనా పటిమతో మరో కొత్త లోకంగా ఆవిష్కరించాడు. నిజాల నిగ్గు తేల్చి, మనిషి అసలు నైజాన్ని, వివిధ సందర్భాల్లో అతని ప్రవర్తనను, హింసా ప్రవృత్తిని, హిపోక్రసీని బట్టబయలు చేసాడు. సామాజిక అసమానతల పై అలుపెరుగని సైనికుడిలా పోరాటం చేసే వైనం అతని సమకాలీనులైన మోహన్ రాకేశ్, బాదల్ సర్కార్, గిరీష్ కర్నార్డ్ ల నుండి అతణ్ణి విభిన్నంగా, విలక్షణంగా, ప్రత్యేకంగా నిలబెడుతుంది.

టెండూల్కర్ తన రచనల్లో మానవ ప్రవర్తనకు, మానవ సంబంధాలకు, విలువలకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అతని కథా వస్తువు మనిషి- అతని చుట్టూరా ఉన్న ప్రపంచం. అతని రచనల్లో కుటుంబ ప్రాధాన్యాన్ని కూడా ఎక్కువగా  చూస్తుంటాము. ప్రేమానుబందాలతో అల్లుకున్న చక్కటి కుటుంబాలు, చక్కని సమాజానికి దోహదం చేస్తాయని అతని నమ్మకం. అందుకే, ‘కమల’ నాటకం లో విధ్యాదికురాలైన సరిత, భర్త పురుషాహంకారాన్ని, అమానవీయ ప్రవర్తనను, అణచివేత ధోరణిని, బానిస ప్రవృత్తిని భరించలేక , అతణ్ణి విడిచి వెళ్లి పోవాలని నిర్ణయం తీసుకున్నా, భర్త  ఉద్యోగం కోల్పోయి దిక్కుతోచక బాధలో కోట్టుమిట్టాడుతున్నప్పుడు అన్నీ మరిచిపోయి, తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తుంది ; ఆ క్లిష్ట సమయం లో అతనికి బాసటగా నిలవాలనుకుంటుంది. అంతేనా, భవిష్యత్ లో అతన్నెలాగైనా  మార్చుకుంటాననే ధీమాను, ఆశను వ్యక్తపరుస్తుంది.

విమర్శకులు టెండూల్కర్ ను పెసిమిస్ట్ గా ముద్ర వేసినప్పటికీ చాలా సందర్భాల్లో అతని నాటకాల్లో ఆప్టిమిజం ‘అండర్ కరెంట్ ‘ గా ప్రవహించి, ఆదర్శవంతమైన సమ సమాజ స్థాపనకు అర్రులు చాస్తున్నట్టు అనిపిస్తుంది. బలమైన కథా వస్తువులతో ప్రజల హృదయాల్ని బలంగా తాకిన అతని నాటకాలు మొత్తంగా మరాఠీ నాటక సమాజాన్నే ఓ కుదుపు కుదిపి ఓ సమున్నత మార్పుకు దారి తీసాయి. టెండూల్కర్ సంచలనాత్మక నాటకాలు నాటక ప్రపంచంలో అతణ్ణి ఓ డైనమిక్ నాటక రచయితగా నిలబెట్టి, అవార్డులు, రివార్డులివ్వడం మాత్రమే కాదు; సమాజం లోని కొన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను, విమర్శలను, అవమానాలనూ, ఓ దశలో అయితే చెప్పు దెబ్బలనూ మిగిల్చింది. అయితే రెంటినీ సమదృష్టితో చూడగలిగిన అతని ‘స్థితప్రజ్ఞత’ మనల్ని విచలితుల్ని చేస్తుంది. తన వ్యక్తిగత జీవితం లోనూ అనేక ఒడిదుడుకుల నెదుర్కున్న టెండూల్కర్  2008, మే 19 న  ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు.

నాటక రచయితగా, ముఖ్యంగా,   ‘మనీషి’ గా అతని కీర్తి కేవలం మరాఠి థియేటర్ కో, ఇండియన్ థియేటర్ కో మాత్రమే పరిమితం కాలేదు; ప్రపంచ నాటక రంగం లో విజయ్ టెండూల్కర్ ఓ కలికితురాయి.

*