స్త్రీవాద విమర్శలో నిరసన, ప్రతిఘటన- కాత్యాయనీ మేలుమలుపు

                  కాత్యాయనీ విద్మహేకు ప్రాచీన ఆధునిక సాహిత్యాలలో సమాన ప్రవేశం వుండటం వల్ల రెండు కాలాల సాహిత్యాలలోని స్త్రీవాద దృక్పథాన్ని ఆవిష్కరించటంలో స్త్రీవాద విమర్శను ముందుకు నడిపించగలిగారు. ‘ స్త్రీవాద సాహిత్యం – స్త్రీవాద భూమిక పుస్తకంలోని వ్యాసాలను చాలా నిర్థిష్టంగా స్త్రీవాద సిధ్ధాంత భూమికలోంచి  ‘ఆధునిక సాహిత్యాన్ని విశ్లేషించారు. విమర్శ చేయాల్సిన పని సాహిత్యంలో అమూర్తంగానయినా ఆవిష్కరించబడిన భావాల వెనుక వున్న విషయాలను వెలికితీసి వాటి తాత్విక మూలాలను ఆవిష్కరించగలగటం. ఈ పనిని కాత్యాయనీ విద్మహే చాలా సమర్థవంతంగా ప్రాచీన ఆర్వాచీన సాహిత్యాలకు అనువర్తింపచేశారు.

                  స్త్రీ శరీరం స్త్రీకి చెందకుండా చేసింది పితృస్వామ్యం. కాబట్టి శరీరాన్ని గురించి మాట్లాడడం అనేది ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాదులకు అనివార్యమైనది.  Writing the body అనే భావం స్త్రీవాదంలో అంతర్భాగమైంది.

“Women in sexist society are physically handicapped. In so far as we learn to live out our existence in accordance with the definition that patriarchal culture assigns to us, we are physically inhibited confirmed, positioned and objectified” అంటుంది Iris Young అనే స్త్రీవాద విమర్శకురాలు దేహం లేదా శరీర స్పృహతో రాసిన కవిత్వం మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ విమర్శలకు సమాధానంగా కాత్యాయనీ విద్మహే ఇలా అన్నారు.

స్త్రీ అంటే శరీరంగా తప్ప మరోవిధంగా చూడలేని పితృస్వామిక సంస్కృతిని ధిక్కరిస్తూనే శరీరాన్ని గురించి ప్రపంచ సంబంధం  వలన ఏర్పడిన చైతన్యాన్ని, శరీర అనుభవ లక్షణాన్ని కవితా వస్తువుగా  చేసుకున్న స్త్రీవాద కవితలో శరీర స్పృహ ప్రధానాంశమైంది. పునరుత్పత్తి రాజకీయాలను అర్థం చేసుకునే క్రమంలో  ఇది సంభవించింది. మాతృత్వపు నిరాకరణ అయినా, హక్కు అయినా తమదిగా వుండాలనే ఆకాంక్షను అభివ్యక్తి రూపాలుగా ఆ కవితను గ్రహించాలని” ఆ కవితలకు గల  తాత్విక బలాన్ని ఆమె వివరించారు.

కాత్యాయనీ విద్మహే పై మార్క్సిస్ట్ సిధ్ధాంత ప్రభావం బలంగా వున్నప్పటికీ అది ఆమె ఆలోచనను నియంత్రించకపోవటం గమనించాల్సిన విషయం. ఆ నియంత్రణ లేకుండా ఆలోచించబట్టే రష్యా లాంటి దేశాలలో కూడా స్త్రీలు  సామాజికంగా అన్ని రంగాలలో పురుషులకంటే  వెనుక వున్నారని అనగలిగారు. “ గత శతాబ్దిలో స్త్రీవాదం – తెలుగు సాహిత్యం”  అనే వ్యాసంలో అస్థిత్వ స్పృహ, శరీర స్పృహ , పునరుత్పత్తి హక్కుల స్పృహ, శ్రమ స్పృహ, కుటుంబ అధికార స్పృహ అని ఆమె చేసిన విభజనలు, నిర్వచనాలు, వివరణలు స్త్రీవాదం ఒక సిధ్ధాంతంగా నిలదొక్కుకొనటానికి అనివార్యంగా వుండాల్సిన  విషయాలు. స్త్రీవాద సాహిత్యం లేకపోతే ‘తెలుగు సాహిత్యానికి విస్తృతి లేదు, వినూత్నత లేదు, విశిష్టత లేదు. అని ఆమె ప్రకటించగలగటం వర్తమాన సాహిత్య సందర్భంలో స్త్రీవాదానికున్న  ప్రాముఖ్యతను, అనివార్యతను నొక్కి చెప్పటమే.

కాత్యాయని విద్మహే

కాత్యాయని విద్మహే

కాత్యాయనీ విద్మహే రాసిన మరో వ్యాసం  “ తెలుగు సాహిత్య విమర్శకు స్త్రీవాద పరికరాలు” (అరుణతార – డిశంబరు 2006) ఇదే వ్యాసంలో భాష గురించి, సాహిత్య విమర్శ లక్ష్యాన్ని గురించి ఆమె చేసిన నిర్థారణలు స్త్రీవాద సాహిత్య విమర్శలో చాలా కీలకాంశాలు. ఈ పై రెండు అంశాలను గురించి కూడా ఆమె ఇలా అన్నారు.

“సాహిత్యంలో వస్తువు ఏదైనా భాషా మాధ్యమం ద్వారానే వ్యక్తమవుతుంది. పితృస్వామిక సంస్కృతిలో అభివృధ్ధి చెందిన భావజాలం ఎలాగైతే పురుష ప్రయోజనానుకూలమైందో భాష కూడా అదే విధంగా పురుష ప్రయోజనానుకూలమైందే. సూటిగా నిర్భయంగా, స్పష్టంగా భావాలను ప్రకటించడానికి వీలులేని వాళ్ళ ప్రయోగం పరిమితంగానైనా వుంటుంది, లేదా ప్రత్యేకంగానైనా వుంటుంది. పరాశ్రయతను, ఆధీనతను, తక్కువ స్థాయిని సూచించేదిగా వుంటుంది. సామాజిక అధికార సంబంధాలలో అధీన వర్గాల సామాజిక అనుభవం భాషతో వాళ్ళ సంబంధాన్ని భిన్నంగా నిర్మిస్తుందని అందులో భాగంగా జెండర్ కు, భాషకూ వున్న సంబంధాలను చూడాలని స్త్రీవాదం చెప్తుంది.( పే-9)

“సాహిత్యాన్ని విమర్శించటమంటే, ఆ సాహిత్యం వెనుక వున్న విశ్వాసాలను, విలువలను విమర్శించటం. ఆ విశ్వాసాలు, విలువలు ఒక సామాజిక అధికార  నిర్మాణ సంబంధాల నుండి రూపొంది వుంటాయి. కనుక వాటిని విమర్శించడమంటే, అధికార రాజకీయాలను విమర్శించటమే.” అని గుర్తించటంలో కాత్యాయనీ విద్మహే స్త్రీవాద భావజాల సైధ్ధాంతికతను సొంతం చేసుకోవటమేనని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

విమర్శకులకు ఒక సిధ్ధాంతం వుండటమే ముఖ్యం కాదు. ఆ సిధ్ధాంతాన్ని నిర్థిష్ట సాహిత్య వాచకానికి (Text) అనువర్తింపచేసి విశ్లేషించినప్పుడు ఆ విమర్శకుల  సామర్థ్యం బయటపడుతుంది. ఈ విషయంలో కాత్యాయనీ  స్త్రీవాద విమర్శనా దృక్పథాన్ని ఆవిష్కరించగలిగారు.

గతాన్ని వర్తమనంతో అనుసంధానం చేసుకోవడానికి, కొథ పాతల మేలు కలయికకు పునర్మూల్యాంకనం అవసరం. గత సాహిత్యంలో విస్మరింపబడిన  కోణాలను ఆవిష్కరించటానికి సాహిత్య అధ్యయనంలో మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దటానికి పునర్మూల్యాంకనం అవసరం. ఈ  విమర్శ రాయటానికి విమర్శకులకు ఎంతో అధ్యయనం, దైర్యం అవసరం. గతాన్ని సమర్ధించాలంటే కొత్తగా తలెత్తిన శక్తులు ప్రతిఘటిస్తాయి. గతాన్ని తిరస్కరించాలంటే గత అవశేషాలు విజృంబిస్తాయి. విభిన్నమైన రెండుకాలాల పరిణామాల మధ్య వారధి కట్టే సామర్థ్యం వుండాలి.  ఇలాంటి క్లిష్టమైన పునర్మూల్యాంకన  విమర్శ చేస్తున్న విమర్శకురాలు ఆచార్య కాత్యాయనీ విద్మహే. ప్రాచీన సాహిత్యం అంటే రాచరిక భూస్వామ్య వ్యవస్థను సమర్ధించే సాహిత్యం. ఇది పురుష స్వామ్య సాహిత్యం కూడా. ఈ రెండు సాహిత్యాలను స్త్రీ దృష్టికోణం నుంచి వ్యాఖ్యానిస్తూ ప్రాచీన సాహిత్యం మీద కొత్త దృక్పథాన్ని ఎనలైస్ చేశారు. సామాజిక ఆమోదం పొందిన సీత, దమయంతి, సావిత్రి, ద్రౌపది, సత్యభామ, చండిక , ప్రమీల, ప్రద్వేషిణి, గాంధారి, మాంచాల, నిపుణిక, విశాల వంటి పాత్రలు కుటుంబ వ్యవస్థ పట్ల నిరసన తెలపటాన్ని గుర్తించారు.

భారతీయ అలంకార శాస్త్రాన్ని కాత్యాయనీ స్త్రీ దృష్టికోణం నుంచి వివేచించారు. అలంకార శాస్త్రంలో స్త్రీ, రసము- మహిళ అనుభూతి, మహిళావాద భూమిక నుంచి కావ్య శాస్త్ర సందర్శనం అలంకారశాస్త్రం మనుషుల్ని గురించి మాట్లాడింది నాయికా ప్రకరణంలోనే. నాయిక చర్చంతా పురుషుడి చుట్టే తిరిగిందని అభిప్రాయపడ్డారు. అలంకారశాస్త్రం స్త్రీ వ్యక్తిత్వాన్ని గుర్తించలేదని, ఆమె వయసు, శరీరంచుట్టే తిరిగిందన్నారు. త్రివిధ నాయికలు, అష్ట విధ నాయికలు  ఏ పురషుడి దగ్గర ఉన్నారు లేదా ఏ పురుషుడి దగ్గరకు వెళ్ళారు అనే అంశం చుట్టూనే   విశ్లేషణంతా కేంద్రీకరించబడడాన్ని పురషస్వామ్య ప్రతిఫలన సాహిత్యంగా ధ్రువీకరించారు. ప్రాచీనులు అశ్లీలతను కావ్యదోషంగా పేర్కొంటూనే ఎంత అశ్లీలతను సాహిత్యంలో నింపారో అది ఆధునిక సాహిత్యంలో కూడా ఎలా కొనసాగిందో “సాహిత్యం – అశ్లీలం” అనే వ్యాసంలో తేల్చి తన స్త్రీవాద దృక్పథాన్ని వ్యక్తం చేశారు.

సాహిత్యం కూడా ఒక రాజకీయ భావజాల సాధనం. ఎందుకంటే, లింగ వివక్షతను, అసమానత్వాన్ని సాహిత్య వాచకాల్లో సమర్థించటం, సాధికారీకరించటం జరుగుతుంది. అలాగే అవి పితృస్వామిక భావజాలపు ప్రాసంగికతను బలపరుస్తాయి. అందువలన గత కాలపు సాహిత్యాన్ని విశ్లేషించి అందులోని స్త్రీ వ్యతిరేకత బహిర్గతం చేసి ఖండించడం స్త్రీవాదులు అనివార్యంగా చేయాల్సిన పని. అందువల్లనే Kate Millett తన Sexual Politics లోD.H.Lawrence, henry Millen, Normain Mailen, Jean genet లాంటి రచయితలు తమ రచనల్లో లైంగిక అధికార రాజకీయాలను ఎలా ప్రవేశపెట్టారో బహిర్గతం చేశారు. ఈ సందర్భంలోKate Millett `Sexual politics’ గురించి Toil Mai అన్న మాటలు గమనార్హం:

“……….Millett argued that social and cultural contexts must be studied it literature was to be properly understood”. (Sexual/Textual  Politics,p-24) Kate Millett భావాలు ఆ తరువాత స్త్రీవాద విమర్శకులకు గొప్ప ప్రేరణగా నిలిచాయి. ఆ ప్రేరణలోంచి అనేక మంది స్త్రీవాద విమర్శకులు వర్తమాన సాహిత్యాన్నే కాక ప్రాచీన సాహిత్యాన్ని కూడా కొత్త స్త్రీవాద విశ్లేషణ పరికరాల సహాయంతో విశ్లేషించే పనికి పూనుకున్నారు. క్రమంగా ప్రాచీన సాహిత్య విశ్లేషణ అనేది స్త్రీవాదులు చేయాల్సిన అత్యవసరమైన పనులలో ఒకటిగా గుర్తింపు పొందింది. తెలుగు సాహిత్య విమర్శ లోకంలో ఈ కృషిని స్త్రీవాద దృక్పథంతో మొదటగా కృషి చేసింది కాత్సాయనీ విద్మహే. తన “సాంప్రదాయ సాహిత్యం- స్త్రీవాద దృక్పథం” అనే రచన ఇందుకు తార్కాణం. ఈ రచనను చేకూరి రామారావు  ‘మహిళాభ్యుదయ విమర్శలో పెద్ద ముందడుగుగా”  గుర్తించటం చాలా సముచిత విషయం. ఎందుకంటే, ఈ పని అత్యంత క్లిష్టమైనదైనా అవసరమైన పని. ఆ పనిని అవలీలగా నిర్వహించగలిగారు కాత్సాయనీ విద్మహే గారు.

ప్రాచీన సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయటం వలన స్త్రీవాద దృక్పథంతో పునర్ మూల్యాంకనం చేయటం “ సంప్రదాయ సాహిత్యం- స్త్రీవాద దృక్పథం”  గ్రంథంలోని ప్రతి వ్యాసంలోనూ కనబడుతుంది. ఇంతకు ముందు స్త్రీవాదులు చేయలేని పనిని ఈమె చాలా సమర్థవంతంగా చేయగలిగారని చే.రా. అన్నారు.

స్త్రీల లైంగికత మీద పితృస్వామ్య నియంత్రణను ఈ రోజు స్త్రీవాదులు ప్రశ్నిస్తున్నారు. ఖండిస్తున్నారు. అందులోంచి విముక్తమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాక ప్రత్యామ్నాయ జీవన శైలుల్ని అవలంబిస్తున్నారు. తద్వారా తమ లైంగిక స్వేఛ్ఛను Assert చేసుకుంటున్నారు కూడా. అయ్యలరాజు నారాయణామాత్యుడు రాసిన ‘హంస వింశతి’ గ్రంధంలోని విశాల కథలో విశాల పాత్ర ఇలాంటి Assertion కలిగి వుండటం పాఠకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. కనకదుర్గ, కాత్యాయనీవిద్మహే సంప్రదాయ సాహిత్యంలో ప్రతిధ్వనించిన స్త్రీల ప్రతిఘటనా స్వరాల కోసం జరిపిన అన్వేషణలో విశాల కథ తగలటం కాకతాళీయం కాదు.

విశాల స్వతహాగానే భర్త శివదత్తయోగి పట్ల ప్రేమాదరణను కలిగి వుంటుంది. అందుకే అతని జంగమార్చనలో భాగస్వామి కాగలిగింది. కానీ ఆమెను భర్త రంకులాడిగా దూషించి తృణీకరించబడుతుంది. ఆమె తన లైంగికతను (Sexuality) కాపాడుకునే క్రమంలో పిత్రుస్వామ్య వ్యవస్థ ఏ అధికార రాజకీయాలతో ఆమె పాతివ్రత్యం పైన  నియంత్రణను అమలుచేసిందో, అదే వ్యవస్థ Promote చేసిన భర్త యోగిత్వాన్ని, వాక్శుధ్ధిని, తన లైంగికతను కాపాడుకోవడంలో వినియోగించుకోవటాన్ని కాత్యాయనీవిద్మహే గుర్తించారు. అందుకే  విశాల ప్రవర్తనకు దంపతీ వ్యవస్థలోని అసమానతల్నే కారణాలుగా చూపారు. స్త్రీలు దాంపత్యేతర సంబంధాలలోకి వెళ్ళే ప్రథాన కారణాలను ఈక్రింది విధంగా ప్రస్థావించడంలో స్త్రీవాద దృక్పథం స్పష్టంగా తెలుస్తుంది.

ఒక్క విశాల విషయంలోనే కాదు, శుకసప్తతి, హంసవింశతి లాంటి కథా కావ్యాలన్నింటిలోనూ దాంపత్యేతర సంబంధాల పట్ల వ్యక్తమైన ఆసక్తిగా పైకి కనబడినా, “ దాంపత్య సంబంధాలలోని అసమానతలు, అసంతృప్తులు, ద్వంద్వ విలువలు మొదలైన వాటి పట్ల  ఏర్పడిన ఏహ్యత నుండి పుట్టిన నిరసన, తత్పలితంగా కుటుంబ వ్యవస్థా చట్రాన్ని ధిక్కరించాలనుకోవటం, ధిక్కరించేందుకు విఫలయత్నాలు చేయటం, నిపుణిక చర్య, విశాల తెంపరితనాల్ని ఈ కోణం నుండి అర్థం చేసుకోవలసినవి” అని కాత్యాయనీ ఈ వ్యాసంలో ప్రస్థావించిన అయిదుగురు స్త్రీలతోనూ గాంధారి, మాంచాల తమ నిరసనను మౌనంగానూ, మాటల్లోనూ వ్యక్తపరిస్తే ప్రద్వేషిణి, నిపుణిక, విశాల ఆనాటి సామాజిక స్థితి కంటే భిన్నమైన చైతన్యాన్ని, భావస్వేఛ్ఛను అందిపుచ్చుకున్న పాత్రలుగా కనకదుర్గ గుర్తించిందని    కాత్యాయనీ విద్మహే అభివర్ణించటంలోని ప్రత్యేకత బహిర్గతమవుతుంది.

స్త్రీలను పునరుత్పత్తికే పరిమితం చేయడంతో మొదలై ఉత్పత్తి సంబంధాలలో స్త్రీల భాగస్వామ్యాన్ని గుర్తింపు కాకుండా చేయడంతో పితృస్వామిక వ్యవస్థ స్వభావాన్ని గుర్తించారు. స్త్రీలు సమూహాలుగా,, సామాజికులుగా కాక వ్యక్తులుగా మిగల్చబడిన తీరును ఆమె గుర్తించారు. అందుకే స్త్రీల మీద అమలవుతున్న అణచివేత వెనుక వున్న రాజకీయ స్వభావాన్ని బట్టబయలు చేయడంలో స్త్రీవాద దృక్పథాన్ని చాలా నిశితంగా ప్రదర్శించారు.

ప్రతిఘటన ప్రథమ రూపమైన నిరసనను కుటుంబ వ్యవస్థలోని పరిమిత పరిథిలో వ్యక్తమైన సాంప్రదాయ సాహిత్యంలోని స్త్రీల నిరసనలు,, ప్రతిఘటన చర్యలను ఈ గ్రంథంలోచర్చించటం ద్వారా తరతరాల స్త్రీల ప్రతిఘటన చరిత్రను అందించటంలో కాత్యాయనీ విద్మహే చేసిన కృషి, అధ్యయనం అభినందించదగింది.

 -డాక్టర్ కే. శ్రీదేవి