మూడు మెలకువలు నీలోకి…

Artwork: Satya Sufi

Artwork: Satya Sufi

1

ప్రేమంటే పొదువుకునే హృదయమే కాదు

చీకటి భ్రమల్లో కృంగిపోతున్న జీవితానికో మేల్కొలుపని

ప్రతి కదలికలో తోడయ్యే నీ చూపు కదా చెప్పింది!

ఘనీభవించిన భయాలను ఒక్కొక్కటిగా సింహదంతిలా సాగనంపుతూ

నా చేతి వేళ్ళను నీవేళ్ళతో అనువుగా హత్తుకుంటుంటే

అప్పుడేగా తెలిసింది మన ప్రాణాలొకటేనని!

ఎగసే భావాలకు అర్థాలెరుగని నా పిచ్చిదనాన్ని

నిలువెత్తు నిలబడి నీలో కలిపేసుకుంటావే

అదిగో ఆ ఆప్యాయతే కదా నా కాలమెరుగని సుఖం!

ఎడబాటు వెలిగించే అభద్రతలో

నమ్మకాల నలుపు తెలుపుల నా వూగిసలాటచూసి  నువ్వు నవ్వేస్తుంటే

వూదారంగేదో నా కన్నుల్లో  నెమ్మదిగా నిండుకుంటోంది !

నీ మెడవొంపులో వొదిగే సమయం మంచుకరిగేంత

స్వల్పమే అయినా మరో కలయిక కోసం

నన్ను సజీవంగా ఉంచే సంజీవనే అదే కదా!!!

 

2

వేళ్ళ కొసల్లో జారుతున్న ముగ్గులా

జ్ఞాపకాల ధార …

ఆరోజు మాటలేవో కలిపానా

మనసునలాగే నిలిపేసుకున్నావ్ !

అందమో ఆనందమో మృదువుగా తాకుతుంటే

దాని కేంద్రమై విస్తరిస్తావ్ !

సన్నాయిలా నీ ఊపిరేదో నాలో వూదేసి

వొంట్లో గమకాలై  వొణికిస్తావ్ !

దూరాన్ని ముద్దాడుతూ పెదవిపైనే వుంటావ్

నాలో కలిసిపోయి మధురగానమై వేధిస్తావ్ !

 

చీకట్లో పరుగును బిగికౌగిలితో ఆపి

రెండు ప్రాణాల కలయికలో..ప్రియా! నీవు చేసిన అద్భుతం

హరివిల్లుగా  ప్రేమ సుగంధం …తెలుపు నలుపుల జీవితానికి రంగులద్దుతూ!

 

3

అల్లరి కళ్ళూ …కొంటె నవ్వులూ

ప్రాణవాయువుని ప్రసాదించే మెత్తటి పెదవులు

ప్రేమగా శిరసు నిమిరే నీ వేలి కొసలూ

బలంగా హత్తుకునే బాహువులూ

మనసు నింపేస్తుంటే

ఇక చేరాల్సిన తీరమేదో తెలిసిపోయింది

 

వేలయుగాలుగా ఆగని పరుగు నీ చేరికకేనని

తెలిసిన ఈ  క్షణం ఉనికిని మరిచి పెనవేసుకొనీ

ఏకత్వాన్ని అనుభవించనీ

ప్రేమతీవ్రతను  ప్రకటించే దేహబంధాలూ

నీ పెదవులు దాటి నను తాకే ప్రతి పదబంధమూ

ఒక్కో మృత కణానికీ మళ్ళీ  పురుడుపోస్తోంది ప్రియతమా!

*

రెండూ నువ్వే!

 

-ఝాన్సీ పాపుదేశి

~

 

ఈరోజు ఉదయం నుంచీ తార ఎందుకో చాలా ఎక్కువగా గుర్తొస్తోంది.

తారంటే నాకు చాలా ఇష్టం. కానీ ఒకరిపట్ల ఒకరికి ఇష్టం కలగడానికి, స్నేహం పెనవేసుకోవడానికి , గౌరవం పెరగడానికి ప్రేమించే మనసు సరిపోతుంది. కానీ దాన్ని బహిరంగంగా ప్రకటించాలంటే … సమాజం వొప్పుదల కావాలి. లేదంటే మనకున్న మర్యాద గంగలో కలిసిపోదూ!   ఒక శరీరం ..ఒక మనసు రెండు రకాలుగా ఎలా ఆలోచిస్తుందో..ఎలా ప్రవర్తిస్తుందో తలుచుకుంటే నాకెప్పటికీ ఆశ్చర్యమే!

తారతో నా పరిచయం ఆరునెలలు. ఈ ఆర్నెల్లలో తనను చాలాసార్లే కలిశాను. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎప్పుడూ కలలో జీవిస్తున్నట్టు ఉంటుంది తార. తన అసలు పేరు తార కాదు. అసలేమిటో చెప్పడానికి తనకు ఇష్టం వుండదు. అందుకే ఎప్పుడూ నేను కూడా అడగాలని ప్రయత్నించలేదు. తారను కలిసిన ప్రతిసారీ తన అందానికి, దానికి చాలా వోపికగా మెరుగులు దిద్దే తన నైపుణ్యానికి నాకెప్పుడూ ఆశ్చర్యంగా వుంటుంది. అంత అందంగా వున్న తారను చూస్తే ఒక్కోసారి అసూయగా కూడా వుంటుంది. నేనెందుకు అంత అందంగా లేనని దిగులుగా కూడా వుంటుంది.

ఎప్పుడూ తానో కురిసే జడి వానలా వుంటుంది. గడగడా మాట్లాడుతుంది. అందరినీ ఆటపట్టిస్తూ నవ్వుతూ తుళ్ళుతూ వుంటుంది. చాలా సున్నిత విషయాలకు స్పందిస్తుంది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. బలంగా వుంటూనే బలహీనంగా కనిపిస్తుంది. అన్నట్టు తారతో నా పరిచయం ఎలా జరిగిందో చెప్పలేదు కదూ!

ఆర్నెల్ల క్రితం నా మరో స్నేహితురాలు చంద్రిక ఒక మీటింగ్ కి తోడుగా రమ్మంటే తనతో వెళ్లాను. చంద్రిక ఒక ఎన్జీవో నడుపుతుంది. అనాధ పిల్లల సంక్షేమం కోసం తను పని చేస్తుంది. నాకూ ఆరోజు ఇంట్లో ఉండాలంటే కాస్త బోరు కొట్టి చంద్రిక ఫోన్ చెయ్యగానే వెళ్ళిపోయాను. అదుగో ..అక్కడే పరిచయం అయింది నాకు తారతో. నాకు కొత్త వ్యక్తులతో మాట్లాడటమంటే ఏదో తెలియని భయం. కానీ కొత్త వ్యక్తిత్వాలను పరిశీలిస్తూ వారిని అర్థం చేసుకోవడం చాలా ఇష్టమైన పని. ఆ మీటింగ్ లో చాలామందే వున్నా తార ఒక్కటే నా దృష్టిని ఆకర్షించింది.

తార అమ్మాయిగా మారిన ఒక అబ్బాయి.  పెద్దకొడుకుగా పుట్టినా పదేళ్ళు రాగానే తన శరీరంలో వచ్చిన మార్పుల్ని అపనమ్మకంతో , భయంతో అర్థం చేసుకున్న ధీర. ఇంట్లో వారికంటే ముందు తన శరీరంలోని మార్పుల్ని స్నేహితులు గుర్తించి పెట్టిన పేరు ఆమె మనసులో సుడిగుండాల్నే రేపాయి. స్కూలుకు వెళ్ళకుండా యేడాది పాటూ అర్థంకాని శరీరాన్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయి స్నేహితుల హేళన తప్పించుకున్నా అమ్మానాన్న, తమ్ముడి దృష్టిని తప్పించుకోవడం తన వల్ల కాలేదు.  శరీరంలో కరుకుదనం కంటే పెరుగుతున్న లాలిత్యం, సౌకుమార్యం వారికి తారపై ప్రేమను చంపేసింది. ఆడదాన్లా ప్రవర్తించద్దని వారు తిడుతుంటే ..ప్రవర్తించడం ఏమిటి…తాను ఆడదైతే! మగవారి బట్టలేసుకుని మగవాడిలా తిరగడం ఏంటని ప్రతిరోజూ రాత్రిళ్ళు ఏడ్చేది. శరీరంలో ఇమడని తన మనసుని ఎప్పటికప్పుడు వోదార్చుకునేది. చివరకు కన్నవాళ్ళను వొదిలేసి తనలాంటి వాళ్ళను కలుసుకున్నప్పుడు పూర్తిగా తారలా మారిపోయింది.   అలా మారిన తారనే నేను కలిశాను. అసలు తార జీవితం గురించిన కుతూహలమే నాకు ఆమెతో స్నేహం చేసేలా ప్రోత్సహించింది.  ఎందుకంటే అప్పటి వరకు నాకు ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ లేదు మరి.  తార పరిచయం అయినప్పటి నుంచి తనను పూర్తిగా పరిశీలించడం మొదలుపెట్టాను.

తార బొంగురు గొంతుతో మాట్లాడుతుంది. అదొక్కటే తనలాంటి వాళ్ళతో ఉన్న పోలిక. అందర్లాగా చూడగానే తనేమిటో తెలిసిపోయేలా వుండదు.  చక్కగా పోనీటైల్ వేసుకుంటుంది. గోళ్ళు పొడవుగా పెంచుకుని ఎప్పుడూ మంచి నెయిల్ పెయింట్ తో చాలా గ్రూమ్డ్ గా కనిపిస్తుంది. లోపల టీషర్టు వేసుకుని పైన పొడవాటి షర్టు, జీన్స్ ప్యాంట్ వేసుకుంటుంది. పైకెలా అందంగా అనిపించేలా జాగ్రత్త పడుతుందో తను అంతే సౌందర్యవతి …ఆలోచనల్లో ..ప్రవర్తనలో. చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది…అలాగే ప్రవర్తిస్తుంది. అందుకేనేమో నాకు తారంటే స్పెషల్ ఇంటరెస్ట్. కొంచెం భయం కూడా…తన బోల్డ్ నెస్ చూసి.

మొదటిసారి తారను కలిసినప్పటి నుంచీ నేనే చంద్రికకు ఫోన్ చేసి మీటింగ్స్ ఎప్పుడవుతున్నాయో కనుక్కొని మరీ వెళ్తున్నా. తారతో పాటూ ఇంకో పదిమంది వొస్తారు ఆ మీటింగ్స్ కి . కానీ ఎవరూ తనంత మర్యాదపూర్వకంగా మాట్లాడరు.

నాలుగు నెలల ముందు ఒకరోజు మీటింగ్ లో చాలా ఉత్సాహంగా చెప్పింది సమీర్ తో తన పెళ్లి జరగబోతోందని. వినగానే వింతగా అనిపించింది. తనకి పెళ్ళేమిటి…విచిత్రం కాకపోతే… కానీ, ఈ మాట తనతో అనలేదు. అంటే తను నా గురించి ఏమనుకుంటుందో !  అయితే ఇంటికెళ్ళి మరో స్నేహితురాలితో చెప్పి నవ్వుకున్నాను. తారంటే నాకు నవ్వులాట కాదు. తన ముందు నా ప్రవర్తన తార అంగీకరించేలానే వుంటుంది. తన నుంచి బయటకొచ్చాక ఆటోమేటిగ్గా మారిపోతుంది.  తార తో నా పరిచయం తర్వాతే నాకు హిజ్రా జీవితాలు ఎలా వుంటాయో తెలవడం. తార ఇంట్లో అమ్మానాన్నలతో కలిసి వుండటం లేదు. అభిప్రాయబేధాలొచ్చి స్నేహితులతో కలిసి ఉంటోంది. తననెప్పుడూ అమ్మానాన్నలు ప్రేమించలేదని…అనవసర సంతానంగానే భావించారని ఒకసారి చెప్పింది. వాళ్ళు వుండమన్నట్టు తాను ఉండాలే కానీ నేను నాలా ఉండటాన్ని వారెప్పుడూ అంగీకరించరని చెప్పి ఏడ్చేది. ఇల్లొదిలి ఏడాదిపాటూ వెళ్ళిపోయానని…తరువాత వొచ్చినా ఇంట్లోకి రానివ్వలేదని…తనకిప్పుడు ఎవ్వరూ లేరంటూ వొంటరితనాన్ని ఫీలయ్యేది. చుట్టూ ఎందరున్నా హృదయానికి దగ్గరగా మిమ్మల్ని మాత్రమే తీసుకోగలుగుతున్నానంటూ చేతులు పట్టుకునేది. అప్పుడు తారతో పాటూ నేనూ కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆమె బాధను నేనూ అనుభవించాను.  ఇంటికి రాగానే నా ఆలోచనల్లో కూడా మార్పు వచ్చేది.

సమీర్ తన స్నేహితుడిగా నాకు తెలుసు. వారిద్దరూ కలిసే ఉంటున్నారని కూడా విన్నా. పెళ్ళయితే ఇన్నేళ్ళ తార వొంటరితనం పోతుందని అనిపించింది. చంద్రికతో పాటూ తార పెళ్ళికి నేను కూడా వెళ్ళాను . తార కోసం కాదు. వారి పెళ్లి ఎలా వుంటుందో చూడాలని. పెళ్లి చాలా సింపుల్ గా జరిగినా తన స్నేహితులంతా పెళ్ళికి రావడంతో పొంగిపోయింది తార. ఆ రాత్రంతా ఆటపాటలతో సరదాగా గడచిపోయింది. కానీ నాకు అక్కడున్నంత సేపు నన్ను ఎవరైనా చూస్తే ఎలా అన్న కలవరం వెంటాడుతూనే వుంది.

తరువాత నెల రోజులకే నీరసంగా కనిపించింది. తార సంపాదనంతా లాక్కొని  సమీర్ పారిపోయాడని విని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆరోజు తార సమీర్ ని తిట్టినన్ని తిట్లు నేను నా  జీవితంలో అప్పటివరకు వినలేదు. నవ్వుతూనే తిట్టేది. కళ్ళల్లో దిగులు కన్నీళ్లను కనిపించకుండా అవసరం లేనిది కూడా మాట్లాడేది అప్పటినుంచి. ఇన్నాళ్ళూ ఎంత అమాయకత్వం, నిజం ధ్వనించేదో అంత నటన కనిపించడం ప్రారంభించింది తనలో. తనేమిటో పూర్తిగా అర్థం చేసుకున్న నాకు తన ప్రవర్తన అసహజంగా కనిపించడానికి ఎంతోసేపు పట్టలేదు.  తార కలలన్నీ కరిగిపోయాక మళ్ళీ వొంటరిగా రోడ్డుమీద నిలబడింది.

ఈ ఆడపిల్లలంతా ఇంతేనా? కలల్లో జీవించడం …వాస్తవాలు తెలిసే సరికి జరిగిపోయిన తప్పిదాన్ని సరిదిద్దలేని పరిస్థితిలో పడిపోవడం…మానసికంగా కృంగిపోయి దాన్నుంచి బయటకు రాలేక పోవడం.  తార మరింత బలహీనంగా కనిపిస్తోంది నాకిప్పుడు.  తన జీవితం గురించి పూర్తిగా తెలిసిపోయాక తార స్నేహం పట్ల నాకు ఆసక్తి తగ్గడం ప్రారంభించింది.

దాంతో పాటూ ఇంకో భావన. అసలు తను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎలా?తను ఆడదానిగా మారడానికి ప్రయత్నించినంత మాత్రాన ఆడదై పోతుందా? అసలు తార ఇలా ఆలోచించడమే తప్పు కదా! అందుకే ఇలా జరిగిందని అనుకునేదాన్ని. వాళ్ళ జీవితాలు అలాగే ఉండాలి అనుకునేదాన్ని కూడా!

ఇవ్వన్నీ జరిగాక తార చంద్రిక దగ్గరికి రావడం కూడా మానేసింది. తన ప్రాజెక్టు ఫండింగ్ ఆగిపోవడంతో తార వుద్యోగం కూడా పోయింది. అయినా తను నన్ను మర్చిపోకుండా  ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడేది.

mandira1

art: Mandira Bhaduri

తరువాత కొద్దిరోజులకు తెలిసింది నాకు…తను డబ్బుకోసం ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర అడుక్కుంటూ వుందని … రాత్రిళ్ళు వొళ్ళమ్ముకుంటుందని. నా మనసు విరిగిపోయింది. తనకేదయినా సహాయం కావలిస్తే నన్ను అడగొచ్చు కదా? ఇలాంటి నీతిమాలిన పనులు చెయ్యడం దేనికి? ముందు నుంచి తను ఇలాగే ప్రవర్తించేదేమో! అందుకే తన ఇంట్లో వాళ్ళు తరిమేసి వుంటారు. తనకు ఇవ్వన్నీ తెలియకుండా తారతో ఇన్నిరోజులు మంచిగా మాట్లాడేసింది.  ఇక ఈ స్నేహం కొనసాగుతుందా? సమాజాన్ని ఎదిరిస్తూ, మర్యాదలేని పనులు చేస్తూవున్న తారతో తను మాట్లాడ్డం ఎవరికైనా తెలిస్తే తన గురించి ఏమనుకుంటారు? ఇక తనతో మాట్లాడ్డం తగ్గించేయాలి. వీలైనంత దూరంగా వుంటేనే తనకు గౌరవం. … ఇలా తార గుర్తొచ్చిన ప్రతిసారీ మనసుకు సమాధానం చెప్పుకునేది.

చాల రోజుల తర్వాత ఒకసారి తార పదే పదే ఫోన్ చెయ్యడంతో మాట్లాడక తప్పలేదు.  మామూలుగానే మాట్లాడేసింది. తను చెప్తోంది. బాగానే వున్నా మేడం..మిమ్మల్ని చూడాలని అనిపిస్తోంది. ఇప్పటివరకు నాతో మీ అంత ప్రేమగా ఎవరూ మాట్లాడలేదు. అస్సలు మనిషిలా కూడా చూడలేదంటే నమ్మండి. మీరు చాలా మంచివాళ్ళు …ఇలా చాలా అభిమానంగా మాట్లాడుతుంటే…ఒకవైపు ఆ పొగడ్తలకు పడిపోతూనే మరోవైపు…నువ్విలా ప్రవర్తిస్తుంటే నీతో ఎవరు మాట్లాడుతార్లే అనుకుంటున్నా.

బావుండదని అడిగాను …ఏం చేస్తున్నావు? ఏమైనా డబ్బుకావాలా …ఇబ్బంది పడుతున్నావా? అని

పర్వాలేదు మేడం..సర్దుకుంటున్నా అంది.

వొళ్ళమ్ముకుని సర్దుకున్నావా  అడగబోయి మానేశాను. నాకు తెలుసు తన సంపాదన ఎలా వుందో. ఇంక అడగడం దేనికి.  సరేనని ఫోన్ పెట్టేశాను. కానీ పదే పదే తనే గుర్తొస్తోంది. కలుద్దామంటే ఎక్కడ కలవాలి. తన భర్తకు తార గురించి తెలుసు. తనతో నీకేంటి మాటలు అన్నాడుకూడా ఓసారి. ఒకసారి కలిసి మాట్లాడుదామంటే,మంచి మాటలు చెబుదామంటే రోడ్డుమీద ఎలా కలవడం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. దాంతో నేరుగా కలవాలన్న ఆలోచనను ఉపసంహరించుకుంది.

 

క్రమంగా అప్పుడప్పుడు మాత్రం లీలగా గుర్తొచ్చేది. ఎలా వుందో అనిపించేది. తార కూడా ఈమధ్య ఫోన్ చేయడం తగ్గించేసింది. తను ఫోన్ తియ్యకుంటే ఏం చేస్తుంది మరి. ఆ బొంగురు గొంతు వింటేనే చిరాగ్గా ఉంది. తొలినాళ్ళలో తారను కలిసినప్పుడు కలిగిన ఉత్సాహం ఇప్పుడు కొంచెం కూడా లేదు. తార కాస్త పద్దతిగా ఉండుంటే స్నేహం కొనసాగేదేమో. పద్దతంటే ? మనసు అడుగుతోంది. సమాధానం తనకూ తెలియదు. తారను అసహ్యించుకోవడం తప్ప. తన  గురించి మొత్తం తెలిసిపోయాక ఇక తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కడుంటుంది అయినా? వీళ్ళంతా ఇంతే అనిపిస్తోంది.

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. తియ్యాలని లేదు. కానీ తనేమైందో  తెలుసుకోవాలన్న కోరిక.. ఒక రకంగా చెప్పాలంటే …ఎదుటివాడి జీవితంపై ఉన్న ఆసక్తి… ఫోన్ తీశాను. ఈసారి తను సాయం అడిగింది. డబ్బేమో అనుకున్నాను. కానీ ఎక్కడైనా వుద్యోగం ఇప్పిస్తారా అని అడిగింది.. తార డిగ్రీ వరకు ప్రైవేటుగా చదువుకుంది సరే… కానీ తనకు ఎవరు వుద్యోగమిస్తారు. గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన. నేను చెయ్యగలనా? అందుకే వెంటనే చెప్పాను….

చూడు తారా నీకు కొంచెం డబ్బు కావలిస్తే సర్దగలను …ఉద్యోగమంటే ఎవరికి చెప్పను …నాకంత సామర్థ్యం లేదు అని.

కొంచెం నిరుత్సాహపడింది.

ప్రయత్నిస్తానని చెప్పాను. కానీ మనస్ఫూర్తిగా సహాయం చెయ్యాలని లేదు. తనకు బాగా పరిచయమున్న ఇద్దరు ముగ్గురిని మాత్రం అడిగింది. సరే అన్నవాళ్ళంతా తార ఇంటర్వ్యూ కి వెళ్ళగానే, తనను చూడగానే మనసు మార్చుకున్నారు. తనకు పని తెలియదని ఒక్కరంటే….తనలాంటి దాన్ని ఆఫీసులో కూర్చోబెడితే ఏమవుతుందో అన్న భయాన్ని మరొకరు ప్రకటించారు.  ఇది నాకు ముందే తెలుసు.

తారతో అదే విషయాన్ని చెప్పాను. తను చేస్తున్న పనుల వలన చెడ్డపేరు వొచ్చిందని …అవన్నీ మానెయ్యమని  సలహా కూడా ఇచ్చాను.  పగలబడి నవ్వింది. తార గుర్తొచ్చినప్పుడంతా ఆరోజు ఆమె అన్న మాటలు ఇప్పటికీ నా చెవిలో వినిపిస్తూనే వుంటాయి.

“మేడం…ఇన్ని రోజులనుంచి మనిద్దరం స్నేహితులం కదా ….రోడ్డులో కనీసం మీరు నా పక్కన నడవగలరా… ఎక్కడైనా కనిపించి పలకరిస్తే మాట్లాడగలరా…కనీసం ఒక్క రోజైనా మీ ఇంటికి ఆహ్వానించగలరా? నన్ను సమాజం స్వీకరించదు. మీరు నాగురించి ఇంత ఆలోచిస్తారు కదా!  మరి ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి పిలవలేదేం? మీ ఇంట్లో వాళ్లకు, పక్కింటోల్లకు పరిచయం చెయ్యలేదేం ? అంతెందుకు ..మొన్న బస్టాండులో నేను కనిపిస్తే చూడనట్టు మీరు మొహం తిప్పుకుని వెళ్లిపోలా ?” తార  ప్రశ్నించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో చెప్పలేని అసహనం పుడుతోంది వొంట్లో. తారతో స్నేహం చేసి తానేదో సాయం చేసినట్టు కదూ అనుకుంటోంది. మరి తననే ప్రశ్నించడమా?

“ఈ తిరస్కారం నాకు ఎప్పుడో అలవాటైపోయింది. కానీ మీరంటారు చూడూ …సమాజంలో బతకండి…సమాజపు కట్టుబాట్లలో నడవండి…అందరిలాగా గౌరవంగా నడుచుకోండి అని…ఆ కపటత్వాన్ని వదలండి. వాస్తవాలు చూడండి. నేనూ మనిషినే మేడం…కానీ మీ జీవితాల్లో నా అస్తిత్వం ఏదీ? స్వీకారం ఎక్కడా?? నాకు ఏ పనిలో బతకడానికి సాయం అందుతుందో అది దైవ సమానం. రోజంతా ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చుకదా అని నీతులు చెప్పే మగవాళ్ళు రాత్రి కాగానే వొంటరిగా కనిపిస్తే రాళ్ళేసి పిలుస్తారు. నన్ను గౌరవప్రదమైన స్థానంలో చూడాలనుకుంటే నన్ను నన్నుగా చూడగలిగే స్థాయి ఉన్నచోట ఏదైనా చిన్న వుద్యోగం ఇప్పించండి. కానీ అది మీకు ఎప్పటికీ సాధ్యం కాదు. కన్న తల్లిదండ్రులే నన్ను స్వీకరించలేక పోయాక ఇంకెవరికైనా నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకుంటుంది. మీక్కూడా నేను అడుక్కోవడం, వ్యభిచరించడం మాత్రమే తెలుసు. కనీసం నాతో కళ్ళు కలపడానికి, పెంపుడు జంతువుల మీద చూపినంత ప్రేమ చూపడానికి కూడా ఎవరూ ముందుకు రారు. మేము చేసే పనిని చెడుగానే ముద్ర వేసేసింది సమాజం. నేను ఏపని చేసినా హేళనగానే చూస్తుంది. మీరు నాకు సాయం చెయ్యాలనుకుంటే నన్ను స్వీకరించండి ..కానీ నాలో తప్పుల్ని ఎత్తిచూపడం, నామీద జాలిపడటం చెయ్యకండి. నాకోసం మీరు చాలా శ్రమపడ్డారు. నాలాంటి దానితో స్నేహమేంటని కూడా కొందరికి మీపై అనుమానం వొచ్చేవుంటుంది. ఇలా పుట్టడాన్ని నేనెలా ఎంచుకోలేదో బ్రతకడానికి ఏం చేయాలో కూడా ఎంచుకోలేని అశక్తత నాది. నాలాంటి వాళ్ళు నా చుట్టూ చాలామంది వున్నారు. వాళ్ళెలా బ్రతుకుతారో నేనూ అలాగే. కాస్త భిన్నంగా వుండాలని నాకు కూడా వుండేది. కానీ సహాయం చేసేదెవరు? “ తార గొంతు మరింత బొంగురుగా మారడంతో ఫోన్ పెట్టేసింది.

తార సమాజాన్ని ఉద్దేశించే ఈ మాటలన్నా తననే అన్నట్టుంది. తను కూడా అంతేనా? విభిన్నంగా వుండే తారను స్నేహితురాలని అనుకోవడంలోనే హిపోక్రసీ ఉందా? తనది నిజమైన స్నేహమే అయితే ఆ స్నేహాన్ని నాలుగ్గోడల మధ్యే ఎందుకు ఉంచాల్సి వొచ్చింది? తన విభిన్నతను అంగీకరించిన తాను తార బ్రతుకు గడవడం కోసం ఎంచుకున్న వృత్తి పట్ల అసహ్యంతో తారను కూడా అసహ్యించుకుందా ? సహాయం చెయ్యగలిగే శక్తి వుండీ సమాజానికి భయపడి చెయ్యలేకపోయిందా ?

మరోసారి ఫోన్ మోగింది. మళ్ళీ తార. “ ఎవరేమనుకున్నా పర్లేదు మేడం. మీరు నన్ను అసహ్యించుకోకండి.  మా జీవితాలింతే. మిమ్మల్నెప్పుడూ మరిచిపోలేను. బయటెక్కడా కలవనులే ..భయపడకండి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా..మాట్లాడండి చాలు”  చేతిలో ఫోన్ మెల్లగా కిందికి జారుతుంటే తార రూపం మళ్ళీ లీలగా ప్రత్యక్షమైంది.

ఈసారి తార అందమైన శరీరం తో పాటూ  తల్లిదండ్రులు కాళ్ళు విరిగేలా కొట్టినా మారని తన నడక గుర్తొచ్చింది. శరీరంలో వొస్తున్న మార్పులను అంగీకరించని మనసుతో  చిన్న వయసులోనే  ముంబాయికి పారిపోయిన తార తెగింపు కనిపించింది. రోజంతా ముంబాయ్ రోడ్లమీద అడుక్కుని…రాత్రిళ్ళు వొళ్ళమ్ముకుని కూడబెట్టుకున్న సొమ్ముతో తార పొందిన బాధాకర నిర్వాణ గుర్తొచ్చింది. మగ లక్షణాలను వొదిలించుకుని తిరిగి తల్లిదండ్రుల ముందుకొచ్చి కూతురిగా స్వీకరించమంటూ కాళ్ళు పట్టుకుంటే …బయటకు తోసి తలుపేసిన తార నాన్న ఆమె నుదుట చేసిన గాయం కనిపించింది. ఎన్జీవోలో వుద్యోగం చేసుకుంటూ పోగేసుకున్న రూపాయిలతో మామూలు ఆడదానిలా కుటుంబం కోసం పడిన ఆరాటంలో నిలువెల్లా మోసపోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ అబల కళ్ళముందుకొచ్చింది. కళ్ళముందు కన్నీటి పొరలోంచి తార ఆడ శరీరం కనిపించినా ఆమె మొహంలో ఛాయగా మొలిచిన మీసాలు…బొంగురు గొంతు …ఇప్పుడు మరింత ప్రస్పుటంగా  కనిపించాయి.

తార శరీరమేగా మారింది. మరి తాను…?? సాయం చేయలేక పోయినందుకు మళ్ళీ బాధగా వుంది.

*

 

 

 

అరుణ్ సాగర్ రాసిన ఏకైక నవల!

 

-ఝాన్సీ  పాపుదేశి

~

jhansi papudesiసమాజ చీకటి  కోణాల పై సీరియస్ రచనలు చేసిన అరుణ్ సాగర్ అంతర్లీనంగా హాస్యప్రియుడు. అందుకే అతడి కవితల్లో ఎంతటి ఆలోచింపజేసే విషయం ఉన్నా దాన్ని ప్రకటించిన విధానం పెదాలపై చిరునవ్వును రప్పిస్తుంది. కవితల్లో సినిమా పాటలు రాసినా, వాణిజ్య ప్రకటనలు వినిపించే విధంగా తన వాక్యాలను చదువుకోవాలని చెప్పినా ఒక వెక్కిరింత చదువరులను నవ్విస్తుంది.

సమాజం నడిచే తీరుపై తనలో ఉన్న అసహనాన్ని ప్రకటించే తీరులో అరుణ్ సాగర్ వొక వైవిధ్య కెరటం.  ఎప్పుడూ కవిత్వమేనా…కథలు రాయొచ్చు కదా..అంటే చాలా ఏళ్ళ  క్రితం తాను రాసుకున్న ఒక పెద్ద కథో ..చిన్న నవలో..కామెడీ సినిమా నో చెప్పలేని ఒక “లస్కుటపా” ను నాకు పంపించారు.  నేను తన అభిమాని అయినా…పదే పదే నేను చదివానో లేదో అడిగేవారు. ఇంకా చదవలేదని చెబితే తొందరగా చదివి అభిప్రాయం చెప్పమన్నారు. నా సహజమైన లేజీనెస్ నన్ను ఇప్పటిదాకా చదవనీయలేదు.

నిజం చెప్పాలంటే ఆయన సహజ శైలికి పూర్తి భిన్నంగా ఈ కథ ఉండటం…నన్ను చదవనీయలేదు. అరుణ్ సాగర్ లేరన్న షాక్ లో కన్నీళ్ళతో అర్దాంతరంగా ఆపిన ఈ హాస్య రచన చదవడం  పూర్తి చేశాను.

నైంటీన్ నైంటీఫోర్ …ఎ లవ్ స్టోరీ .

సూరీ.. కిట్కీ గళ్ భాగీల ప్రేమ కథ.

పదిహేడు రీళ్ళుగా రాసిన ఈ కథ సూరి చందుల స్నేహంతో ప్రారంభమవుతుంది. ఇద్దరు స్నేహితులే కాబట్టి స్నేహనౌక కాస్తా స్నేహ డింగీ గా మారి హుస్సేన్‌సాగర్ లో సాగిపోతోంది. వాళ్ళిద్దరూ అమ్మాయిల విషయంలో ఎంత ఉద్దండులంటే డాక్టర్ ఆఫ్ బీట్, సైటు రత్న అవార్డులు అందుకునేంత. అలాంటి స్నేహితులు  విధి ఆడిన వింత నాటకంలో విడిపోయారు. సూరి నాన్నకు ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్రికా లాంటి వూరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. రేకుల షెడ్డులతో, విరిగిపోయిన బల్లలతో పశువుల కొట్టంలా సీతకోకచిలుకల్లాంటి స్టూడెంట్స్ తో అలరారే కాలేజ్ నుంచి సూరి టిసి తీసుకున్నాడు.

తన స్నేహం గురించి ఆలోచిస్తూ ఆటోలో కూర్చుని  తను వదిలిన నిట్టూర్పు విని స్కూటర్లో వెళ్తున్న వ్యక్తి హారన్ అనుకుని ఆటో డ్రయివర్ తో గొడవ పడటం , ఆగిపోయిన ట్రాఫిక్ మీద దయతలిచి తన బాధను రాత్రికి ఫోన్లో వివరిస్తానని సూరి చెప్పడం కథలో పెద్ద ట్విస్టు.

చేసిన ప్రామిస్ ను నిలుపుకోవడానికి ఆ రాత్రి ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి స్కూటరిస్టుకు ఫోన్ చేసి 48 గంటల తన స్నేహ వియోగాన్ని చెప్పడం, ఆ ఇంట్లోనుంచి తన కథకు కోరస్లో వెక్కిళ్ళు వినిపించడంతో సూరి మనసు కుదుటపడినా  అతిపెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. బూత్ లోంచి బయటకు రాగానే సమయానికి తన గర్ల్ ప్రెండ్ కి ఫోన్ చెయ్యలేక బ్రేకప్ అయిన ఆనంద్, పక్కింటి కిట్కీ గాళ్ ఫ్రెండ్ భాగీ ప్రేమను తట్టుకోలేక గట్టిగా గెంతిన గెంతుకు ఫ్యాన్ ఊడి పడి సంసారానికి పనికి రాకుండా పోయిన ఇంటి వోనర్ రాఘవేందర్ సూరిపై పగబట్టడమే ఆ అతి పెద్ద ప్రమాదం.

ఆంధ్రా యూనివర్సిటే లో ఆంథ్రోపాలజీ చదువుతున్న రోజుల్లో ల్యాబ్ నుంచి ఆస్ట్రలోపితికస్ పుర్రెను కొట్టేసి కోట్లు సంపాదించి విలన్ గా అవతారమెత్తిన రాఘవేందర్ క్లాస్మేట్  జబ్బల్ భాయ్ ను పగతీర్చుకోవడం కోసం పిలిపించడం తో క్లైమాక్స్ ప్రారంభమవుతుంది. ఇదే సమయానికి అన్నిరోజుల విరహం తట్టుకోలేని చందూ , సూరి దగ్గరకు రావడం.. ఇద్దరూ కలిసి జబ్బల్ భాయ్ కిడ్నాప్ చేసిన భాగీ ను విడిపించడం, భాగీ నాన్న తనకు మేనమామే అని తెలియడంతో కథ సుఖాంతం అవుతుంది.

నా మేనమామే నా మామా! అని సూరి ఆశ్చర్యపోవడం నవ్విస్తుంది.

క్యుములోనింబస్ మేఘాలను గన్ తో కాల్చి విలన్ వెళ్ళే సెకండ్ హ్యాండ్ హెలీకేప్టర్ లోకి నీళ్ళు రప్పించడం క్లైమాక్స్ హాస్యం.

ఈ రచన ప్రారంభం నుంచీ మనల్ని విపరీతంగా నవ్విస్తుంది. అరుణ్ సాగర్ రచనల్లో సాధారణంగా కనిపించే సీరియస్ నెస్ ఇందులో వెదికినా కనిపించదు. ప్రతి పదంలో కామెడీ నర్తిస్తుంది. ఆంత్రోపాలజీ సబ్జెక్ట్ పై తనకున్న మొహం మాత్రం అన్ని రచనల్లో కనిపించినట్టే ఇందులో కూడా విలన్ బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించేటప్పుడు కాస్త కనిపిస్తుంది. కళ్ళనిండుగా నీళ్ళను…కడుపులో నొప్పిని తెప్పించే ఈ రచన అరుణ్ సాగర్ మరణం తరువాత కన్నీళ్ళతో పూర్తిచేయడం, ఆయన రాసిన ప్రతి అక్షరాన్ని ప్రేమించే అభిమానిగా మనసునిండుగా ఈ కథలో నవ్వుతూ కనిపించే అరుణ్ సాగర్ ను మీకు కొత్త కోణంలో పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తాను.

“తప్పు తనది కాదు నీది.. ఎప్పటికైనా వీడ్కోలు చెప్పక తప్పదని తెలిసీ…నువ్వే అపరాధి”…వీడ్కోలు మిత్రమా!

నవల లింక్: http://saarangabooks.com/retired/wp-content/uploads/2016/02/laskutapa.pdf

 

peepal-leaves-2013

 

 

 

 

మొగుని రోగం !

పూరింట్లో తలుపుకడ్డంగా నీల్ల బాన , నవారు మంచం పెట్టేసి కుట్టుమిసను పట్టుకోని, బలంగా ఈడస్తా, యాడస్తా వుండాది  మల్లిక . ‘ముండాకొడుకు …ఆ పాడు సారాయి తాక్కుండా వుంటే ఎంత మరేదగా వుంటాడో … తాగినాడంటే అంత ఎదవై పోతాడు’ . పెండ్లైన మూడేండ్లు తాగేసొచ్చి దినామూ కొడ్తే గూడా యాపొద్దూ మల్లిక అడ్డం జెప్పలా . మత్తంతా దిగినాక మొగుడొచ్చి అడుక్కొంటే మూతి ముప్పై సొట్లు దిప్పి, నెత్తిన రెండు మొట్టి … నెత్తిన బెట్టుకునిందే గానీ, ఈదినానికి గూడా…వోన్ని ఒగ  మాట అనింది  ల్యా . సుట్టుపక్కలోల్లు మద్దెలో వొచ్చి మద్దిస్తానికి  కుచ్చుంటే గూడా మొగుడన్నేక  కొట్టడా … తిట్టడా  అని మరేదగా పొమ్మనే సిండాది  శానా తూర్లు . ఇప్పుడు యౌర్నన్నా పిల్సినా వోల్లింటి కల్లా తిరిగిమల్లి గూడా సూడరు . మీసావు మీరు సావండని తుపుక్కున మూసేసి పోతారు.

రెండ్నెల్ల నించి మొగుడ్నుంచి వొల్లు కాపాడుకోవాలంటే సచ్చేసావుగా వుండాది. ఎవురికన్నా సెప్పుకోవాలంటే మానంబోతా వుండాది. మొగుడూ పెళ్ళాలు కలిసేటప్పుడు జాగర్తగా వుండాలని పెద్ద డాకట్రు జెప్పినాడు. ఈడికేమో మందు లోపలికిబోతే వొళ్ళూ పై దెలవదు. బద్రంగా  లేకపోతే మొగుడికుండే  రోగం మల్లిగ్గూడ వొస్తుందని ఇవరంగా సెప్పినారు. అదేవన్నా సిన్నరోగమా. దుడ్డులేనోల్ల పాణం తీసేరోగం. మొగుడు కాలందీరిపోతే వుండే వొక బిడ్డిని ఎట్ట సమాలించాలో తెలీక అల్లాడిపోతా వుంది మల్లి. ఇంత మనేదలో వుంటే రాజుగాడికి ఈ వుపద్రం బట్టింది. సారాయితాక్క పోతే ఏ కబురైనా గెట్టిగా సెప్తే ఇంటాడు. తాగేస్తే ఇగ అంతే. నోరిప్పితే కొట్టనొస్తాడు.  మొగుడంటే యిష్టం లేగ్గాదు. బతుకంటే బయిం బట్టుకునింది మల్లికి. ఈపూట వోడ్ని పక్కలోకి రానీను గాక రానీనని వోట్టేసుకొని, బొళువుగా  వుండే మిసన్ని తలుపుకడ్డంగా ఈడ్సి పైటకొంగు తో కారే సెమటని తుడ్సుకుంట కింద కుచ్చోని అట్టా కన్నుమూసింది మల్లి.

 ***

సమర్తైనాక  రెండేండ్లు గూడా మల్లిక అమ్మగారింట్లో ల్యా . ఆబిడ్ని మల్లయ్య మావ కొడుక్కిచ్చి  ఉండూర్లోనే  పెండ్లి జేసేసినారు . రాజు దిట్టంగా ఉంటాడు . ముగ్గురి తిండి  వొకడే తింటాడు … ముగ్గురి పనీ వొకడే జేసేస్తాడు. కాలు కొంచెం అవుడు. కుంటోన్ని నేను జేసుకోనని మల్లి మొండికేస్తే ,  “గుడ్డి పోగోర్తాది..కుంటి రాగోర్తాది” అని బలవంతాన మల్లిని పెండ్లికి వొప్పించినారు. అవుడైతే ఆస్తులు కూడబెడ్తాడని పెండ్లైన ఆర్నెల్లు  మొగుడు మల్లిని వొదిలి పక్కకుబోలా. కడుపులో కొడుకు పడ్నాకనే మళ్ళీ రాజు పనికిబోయిండేది. ఈతూరి సేద్దిగం వొదిలేసి శానా దుడ్డు వొస్తాదని లారీ పనికిబొయ్ నాడు. వొగ తూరి  లారీ  ఎక్కితే మల్లీ రెండ్నెల్లు ఐనాంకనే పెడ్లాం బిడ్లను జూసేది.

లారీ పనికి బొయ్ నాక  మొదల్తూరి వొచ్చినప్పుడు బాగనే వుణ్ణాడు. దుడ్డు తెచ్చిచ్చి అంగిడికి  బొయ్యి ఒగ కోక దెచ్చుకో మన్నాడు . లారీ పని బాగుండా దని మల్లి గూడా సత్తెమ్మకు పొంగిలి బెట్టుకోనొచ్చి వూరంతా పెసాదం తలారొంత ఇచ్చి మొగుడుణ్ణె  పదైదు దినాలూ పండగ జేసింది . వోడు మల్లీ పనికిబోతాంటే దొక్కలోనుంచి దుక్కమోస్తాంటే గూడా యిన్ని నీల్లు బోసుకోని మింగేసి, బద్దరంగా పొయ్యిరమ్మని  లారీ యెక్కించి ఉత్త సేతుల్తో  ఇంటికొచ్చేసింది.

నిండునెల్లు  వొచ్చేటప్పిటికి మొగుని మాట వొదిలేసి సీమంతం  జేసుకొని అమ్మగారింటికి ఎలబారి పొయ్యింది. అటక మిందుండే కొయ్య వుయ్యాల దింపిచ్చింది . నూలుకోకలన్నీ జవిరి వైరుబుట్టిలో ఎత్తి పెట్టింది. పెద్దిల్లు పేడతో అలికిచ్చి, సుబ్బరంగా తెల్లసున్నం పుయిపిచ్చింది. మొగబిడ్డి పుడ్తిందో … ఆడబిడ్డి పుడ్తిందో అనుకుంటా నొప్పులకోసరం ఎదురుసూస్కుంటా కుచ్చునింది .

ఆరోజు మల్లిక్కి బాగా గెవనం వుండాది. తెల్లార్తో నుండి కొంచిం వొంట్లో నలతగా వుణ్ణిన్ది . సగించకుంటే గూడా కడుపులో బిడ్డి కోసరం కొంచిం వుప్పిండి దినేసి గడపమింద కుచ్చోని ఎగదీసుకుంటా వుణ్ణిన్ది. కడుపులో నొప్పి మొదులయ్యే టప్పిటికి  మంత్రసాన్ని తొడుకోనొచ్చింది వోళ్ళమ్మ. దీపం గూడులో కాయితం కింద ఎత్తిపెట్టిన బ్లేడు, ఉడుకు నీళ్ళు, పాత నూలుకోకలు మంత్రసానికి ఎత్తిచ్చింది. తొలి కానుపాయ…ఒగ రాత్రి ఒగ పొగులు అల్లాడిపొయ్యింది నొప్పుల్తో. ఆస్పిటల్ కి పోదారంటే మొగుడింట్లో లేకపాయె. మాలపల్లంతా ఒగచేతి మింద కానుపులు జేసిండే మంత్రసానిగ్గూడా బిడ్డి అడ్డం దిరిగి పోయిన్దేవోనని కాల్లూ సేతులూ ఆళ్లా. ధనియాల కసాయం దాపిచ్చి…కడుపుకు ఆందెం రుద్ది ఎట్టో వొగట్ట పువ్వాలుండే మొగబిడ్డిని బయటకు దీసేసింది. ‘నాబట్ట బిడ్డె …ఎంత ఏడిపిచ్చినాడు వోల్లమ్మను అనేసి ..మేయ్…ఇప్పుడే నీకొడుకు ఇట్ట ఏడిపిస్తావుండాడు …పెద్దయితే ఇంగేం జేస్తాడో’ అంటా వక్కాకు లో బెట్టిచ్చిన నూర్రూపాయలు దీసుకొని మంత్రసాని నవ్వుమొగం తో ఎలబారిపొయ్యింది.

ఇంత జరిగినా మొగునికి ఇవేమీ దెలీలా… పురిటికి గూడా రాలా.  ఇంత కస్టంలో మొగుడు పక్కన లేడని మల్లి శానా తూర్లు ఎవురికీ దెలీకుండా ఏడ్సుకునింది. పక్కలో బిడ్‌ను జూసుకుని మొగుని మింద కలవరాన్ని తగ్గిచ్చుకునింది. మల్లెప్పుడో ఒగనెలకు వొచ్చినాడు రాజుగాడు.  వొల్లంతా కాలిపోతా వుంది. వారం దినాల్నుంచి జొరమని జెప్పినాడు. ఏం దిన్నా వాంతులు ..బేదులు. లారీ పనికి బొయ్యేది మొదులు బెట్నాక గొంతుదాక సారాయి దాగే పని బట్నాడు. వొళ్ళు వూనమైపోతే గూడా సారాయి అంగిడికి బొయ్యేది ఇసిపెట్లా.  పక్కన పెద్ద పల్లిలో వుండే అరెమ్పీ డాకట్ర దెగ్గిరికి పొయ్యి సూదేసుకొని వొస్తే కొంచిం కుదురుకునింది వొల్లు.

అట్ట వొచ్చినోడు మూడ్నెల్లు ఇల్లు వొదల్లా.. కొడుకుతో ఆట్లాడుకుంటా వుండిపోయినాడు. మొగుడుంటే వొగపక్క సంతోసంగుంటే గూడా వోని తాగుడు జూస్తావుంటే మల్లిక్‌కు బయంగా వుండాది. సంపాయిచ్చుకొని వొచ్చిందంతా ఈమారి తాగేస్తా వుండాడే అని మనేద బట్టుకునింది. దాంతో బాటు రాత్రయ్యిందంటే వొల్లు బాగాలేదంటే గూడా యినకుండా పక్కకు రమ్మని ఒకటే సతాయిస్తావుండాడు. రెండో నెలకే ఈతూరి కడుపు నిలిచిపొయ్యింది. సంకలో బిడ్డి సంకలో ఉండంగానే కడుపులో ఇంగోటి. లారీ వోనరు పిలస్తావుండాడని కబురొచ్చినాక  వొదల్లేక వొదల్లేక యలబార్నాడు రాజుగోడు. బిన్నా వొస్తానని చెపేసి పొయ్ నాడు. వోడు పోతే సాలని సూసిన మల్లి కంట్లో నీల్లు రాలా ఈతూరి. మొగుడు అట్టబోగానే పక్కూర్లో వుండే ఆరెమ్పీ డాకట్రు దగ్గిరికిబొయ్యి కడుపుదీయించుకొని వొచ్చేసింది. మొగుడికివేమీ జెప్పలా.

పొయ్ నోడు …పొయ్ నోడు ఈ తూరి పదైదు దినాలు గూడా గాకనే తిరుక్కో నొచ్చేసినాడు. మళ్ళీ వొల్లు బాగలా. ఇట్ట మూడుదినాలకోసారి  పడవబడి పోయ్యేవోడి తో పనికి పంచేటని వోనరు ఇంగోసారి పనికి రావొద్దని ఇంటికొచ్చి ఎచ్చరించి  పొయినాడు. సారాయి  దాగేది నిలిపైమని ,  ఆ దరిద్దరపు తాగుడే వొల్లు పాడుజేసేస్తా ఉండాదని మల్లి రంపు బెట్టుకునింది. పనికి బొయ్యేదాని గురించి రాజుగానికిప్పుడు మనేదే లేదు. తెల్లారి లేస్తే వంక కాడుందే సారాయి అంగిడికి బొయ్యేది…తాగేసొచ్చి నోటికి ఎంత మాటొస్తే అంత మాటా అనేది… బండ మాట్లన్నీ మాట్టాడుకుంటా అరుగుమింద గుచ్చోనుండేది …మత్తు దిగిపోయినాక మల్లీ సందేళ కాడ ఇంగోతూరి సారాయంగిడికి బొయ్యొచ్చేది…వూరంతా రాజుగాడి మొకాన కారిమూస్తే గూడా వాడికి లెక్కలేకుండా వుండాది.  దీనికితోడు మూడూమూడ్రోజులకు జొరమొకటి. కొడుకుని అమ్మగారింటి దగ్గిర వొదిలేసి కూలికి బోతావుంది మల్లి.

శనారం మద్దేనం పినపెద్ద ఇచ్చిండే ఆర్నూరు రూపాయిలు దీస్కోని, మొగున్ని దొడుకోని తిరప్తి లో వుండే రుయాస్పత్రికి ఎలబారింది. వొల్లు కొంచిం కుదురుకుంటే ఎట్టోకట్ట పనిలో బెట్టేయాలని జూస్తావుంది మల్లి. ఆసుపత్రిలో రగతం పరీచ్చజేసేస్తే ఏం రోగమొచ్చిందో తెల్సిపోతుందని  డాకట్రు జెప్పినాడు. అట్నే అని రగతం ఇచ్చేసి, రెండ్రోజులు ఆసుపత్రి లోనే వుండిపోయినారు. మంగలారం కాయితాలు జూసి డాకట్రు జెప్పిన మాట ఇన్నాక మల్లికి నోట్లో మాట రాలా. అట్నే యాడస్తా కూలబడి పొయ్యింది. రాజుగాడు మాత్తరం ‘ యాడవద్దు మే … ఏం గాదులే. ఎప్పుడో ఒగప్పుడు పోవాల్సిందే గదా .. నా టయుము ఐపోయిందనుకో..పైకి లెయ్ ‘ అంటా జబ్బ బట్టుకోని మల్లిని పైకి లేపినాడు. వోల్లిచ్చిన మందులు తీసుకొని నెత్తీనోరూ కొట్టుకుంటా….నా బతుకు ఎందుకిట్టా అగ్గిబడి పోయిందాని యాడస్తా ఇంటికొచ్చింది . అందురూ… “ఆస్పత్రికి పొయ్యి వోచ్చినారు గదా? ఏవిజెప్పినార”ని అడగతా వుంటే సెప్పలేక మల్లికి బేజారుగా వుండాది.  నా మొగుడికి ఎయిడ్సని ఎట్ట జెప్పుకునేది. సెప్తే కడుపుకిన్ని నీల్లుబోస్తారా ఎవురైనా?

Mogani Rogam katha illustration

రోగం ఏందో తెలిసిపోయ్యినాక పదైద్దినాల నుంచి రాజుగాడు గొమ్మునే వుంటా వుండాడు. అప్పుడప్పుడు మల్లితో, కొడుకుతో కుచ్చోని యాడస్తా ‘నేను బోతే ఎట్ట బతకతారో!’ అంటా కుమల్తా ఉంటాడు.   మాయదారి జబ్బు రానన్నా వొచ్చింది… మనిషి మారిపొయ్యినాడులే అనుకునేలోపల వాడికి ఇంకో రోగం బట్టుకునింది. ‘నేను సచ్చిపోతే నాపెళ్ళాo ఎందుకు బతకల్ల? ఆ బిడ్డె ఇంగ ఎవుర్నన్నా పెండ్లి జేసుకునేస్తిందా? నేను లేనప్పుడు  వాల్లెందుకు వుండల్ల?’ మల్లి నీల్లు పట్టకచ్చే దానికి కొళాయి కాడికి పొయ్యినా, ‘ఎవుడితో ఏం మాట్లాడేస్తా వుందో’ అని బయిపడతా ఆబిడ్డికి కాపలా గాస్తా వుండాడు. ఎవుర్తో మాట్లాడ్నా,’ వాల్‌తో నీకేం పని?’ అని మల్లిని తిడ్తా కొడ్తా వుండాడు.

రోగం యాడ అంటుకునేస్తిందో అని రాత్తిరైతే దూరదూరంగా తిరగతా వుండే మల్లిని జూస్తే వాడి కోపమింకా ఎక్కువైపోతా వుండాది. మామూలుగా ఉండేప్పుడు కొడ్తే ఊరంతా వొగిటై పోతిందని బయిపడి, తాగేసొచ్చి కొడ్తా వుండాడు. ఈరోజెట్టయినా మల్లిని లొంగదీసు కోవాలని వాడుగూడా వొట్టేసుకున్నాడు.

తలుపులు కొట్టీ కొట్టీ రాజుగాడి బలం సచ్చిపోతా వుండాది. దాలముందరం కాడనే నిద్దర బొయ్యినాడు. తెల్లార్నీ … మొగుడి కతేందో జూద్దారని మల్లి గూడా నడిజాముకాడ నిద్దరబొయ్యింది.

  టయిము నాలుగైంటింది. ఈపు మింద ఎవురో కొట్టినట్టు నిద్దర మత్తు వొదిలిపోయ్యింది రాజుగాడికి. మెల్లిగా పైకి లేసి తలుపుసందులో నుంచి ఇంట్లోకి తొంగి సూసినాడు. మల్లి మంచి నిద్దర్లో ఉండాది. గెడేసేసి తలుపుకడ్డంగా సామాన్లు పెట్టేసిండాది. సిన్నంగా తలుపు పక్కన్నే ఉండే గూట్లో కాలుబెట్టి గుడిసె పైకి ఎక్కినాడు. మెల్లిగా మనిసి పట్టేంత బోద ఎత్తి పక్కన పెట్టేసి, ఇంట్లోకి దిగి మల్లిమింద పడ్నాడు. మల్లి తప్పించుకునేదానికి వోడు సందీలా. వాడ్నించి కాపాడుకోను తలుపుకడ్డంగా పెట్టిన సామాన్లన్నీ ఆరోజు మల్లి పాణం మీదికి తెచ్చినాయి. వోడ్ని కొట్టి, తిట్టి, సాపనార్తాలు బెట్టినా లొంగిపోక తప్పలా మల్లికి.

***

ఇంత జరిగిపోయ్యినాక బతికేం జెయ్యాలని గన్నేరు పప్పు తినేసి సచ్చిపోదారని జూస్తే కొడుకుని జూసన్నా దైర్నంగా ఉండమని వోల్లమ్మ పోరుబెట్టుకునింది. ఇప్పుడు రాత్తిరైతే మల్లికి బయిం లేదు.  మొగోడంటేనే కడుపుగాల్తా వుండాది. మొగుడ్నే గాదు…కొడుకుని జూస్తే గూడా. ఇట్టాంటి కొంపలో పెద్దోడై వాడెంత మంది కొంపలు కూలస్తాడో అని. మొగోడు కనిపిస్తే సాలు, దొరికిండే రాయి ఎత్తుకొని పిచ్చిదాన్లా తరుమ్కుంటా వుండాది.

ఇంగోపక్క ఆరోజు రాత్తిరి నించీ రాజుగాడికి నెత్తినుండే మూటబొళువు దిగిపోయినట్టుగా వుండాది. వొంట్లో ఉండే రోగం అప్పుటికప్పుడు మానిపోయినట్టు తేలిగ్గా వుండాది. ‘ఇప్పుడు నాపెళ్ళాం యాడికి బోతింది, ఎవుర్తో తిరిగితిందో జూస్తా…నేనెన్ని దినాలు బతికితే అన్ని దినాలు అది గూడా నాతో వుంటింది. నేను సస్తే నాతోగూడా సస్తింది. పిల్లోడిని  వోల్లవ్వ మొగోన్ని జేస్తింది’ అనుకుంటా వుండాడు. ఇన్నిదినాలూ వోడికుండే రోగాన్ని దాసిపెట్టుకొన్నోడు ఇప్పుడు పెళ్ళాం కొచ్చిన రోగం గురించి తోటి ఈడోల్లందరికీ జెప్పుకుంటా వుండాడు.

శెప్తేనే గదా పెళ్ళాం గురించి అందురికీ తెల్సేది…ఎవురూ దాని జోలికి రాకుండా వుండేది! అది సచ్చిపోయినా, పిచ్చిదై పొయ్ నా సరే… దానికి నా తర్వాత, నేను లేని బతుకక్కరలేదు.

jhansi papudesi    —ఝాన్సీ పాపుదేశి

(జర్నలిజం చదివి, తిరుపతి రిపోర్టరుగా ఆంధ్రజ్యోతి దిన పత్రికలో పనిచేస్తూ చివరిదాకా ఇదే నా వృత్తి అనుకున్న సమయంలో అనుకోకుండా  రిపోర్టరు ఉద్యోగాన్నే కాకుండా, సొంత రాష్ట్రాన్ని కూడా వొదిలి బెంగుళూరులో స్థిరపడాల్సి వచ్చింది.  వృత్తి ఏదైనా ప్రతి రచనకో ఆత్మ సంతృప్తిని పొందుతూ,  రాయడం ఆపకూడదన్న పట్టుదలతో రాస్తున్నా. బ్లాగుల్లో రాసుకుంటున్న నేను కొందరు మిత్రుల ప్రోత్సాహంతో ఇంటర్నెట్ పత్రికలకు పంపడం మొదలుపెట్టా. నా స్వస్థలం చిత్తూరు జిల్లా అరగొండ గొల్లపల్లె. మాండలికాలు మర్చిపోయి పుస్తక భాషకు మారిపోతున్న సమయంలో చిత్తూరు మాండలికంలో రాయాలన్న ఆలోచన వచ్చింది. అచ్చంగా నా వూరి భాషలో రాస్తున్నా. మహిళగా పుట్టినందుకు తోటి మహిళల జీవితాల్ని అందరితో పంచుకోవాలని అనుకున్నా. తొలి కథ “దేవుడమ్మ” సారంగ లోనే వచ్చింది.

email : papudesijc @gmail.com)