నొప్పిస్తూ తానొవ్వక…

  జొన్నలగడ్డ రామలక్ష్మి

 

తమదంతా ఒప్పూ, ఎదుటివాళ్లదంతా తప్పూ అనడమే రాజకీయంగా మారిపోయిన రోజులివి. నిజానికిప్పుడు ప్రజలే రాజులు కదా- మరి రాజకీయాన్ని ప్రజాకీయం అనాలేమో!

ప్రజలంటే- ఉన్నవాళ్లూ లేనివాళ్లూ, మేధావులూ అమాయకులూ, త్యాగమూర్తులూ స్వార్థపరులూ, దోచేవాళ్లూ దోచబడేవాళ్లూ, ఎన్నారైలూ కానివాళ్లూ- వగైరా వగైరా ఎన్నో రకాలు అనుకునే చాలామందిలో నేనూ ఉన్నాను చాలాకాలం. ఐతే ప్రజాస్వామ్యంలో ప్రజాకీయాన్ని శాసించే మెజారిటీ ప్రజలంతా ఒక్కటే అనడానికి ఒకరా ఇద్దరా- రాజుల్లాంటి ప్రజలు ఎందరో!

మచ్చుకి సాధారణ గృహిణి మా ఉమనే తీసుకోండి. తనకి తను, అస్మదీయులు ఏంచేసినా రైటే. తస్మదీయులు తనకి నచ్చే పనిచేస్తే అది తప్పైనా ఒప్పే. తనకి నచ్చని పనిచేస్తే అది ఒప్పైనా తప్పే.

ఉమతో నాది చిన్నప్పటి స్నేహమేమీ కాదు. ఇద్దరూ తెలుగువాళ్ళం. పదిహేనేళ్లుగా కెనడాలో పక్కపక్కనే ఉంటున్నాం. ఉమకి కాస్త వాగుడెక్కువ. ఆ వాగుడులో తన గురించి అన్నీ చెబుతూంటుంది.

ఆమధ్య కూతురి పెళ్లికని ఇండియా వెళ్లొచ్చింది ఉమ. రాగానే, ”ఎలా జరిగింది పెళ్ళి?” అనడిగాను.

”చాలా గ్రాండ్‌గా జరిగింది. కావడానికి నేను చాలా సింపుల్‌ అనుకో. కానీ- మన సంప్రదాయంలో పెళ్ళనేది జీవితంలో ఒకసారే కదా! అందుకే పది లక్షలు ఖర్చు పెట్టాం. ఒకోటి పాతికవేల చొప్పున మూడు పట్టుచీరలు కొన్నాం మా అమ్మాయికి” అంది ఉమ ఉత్సాహంగా.

”జీవితం మొత్తంలో ఆ పట్టుచీరలు ఎన్ని సార్లు కట్టుకుంటుంది?” అని మనసులో గుండెలు బాదుకుని, ”సరేలే కానీ, పెళ్లికి అన్ని వైపుల్నించీ చుట్టాలు బాగా వచ్చారా? విశేషాలేమిటి?” అంటూ మాట మార్చాను.

”ఆఁ- అంతా వచ్చారు కానీ మా ఆడపడుచు గౌరి మాత్రం రాలేదు. కావాలనే మానేసింది. అదే ఈ పెళ్లిలో ముఖ్య విశేషం” అంది ఉమ నిష్ఠూరంగా.

నాలో ఆశ్చర్యం, అపనమ్మకం. తన ఆడపడుచు చాలా మంచిదనేది ఉమ. తన పెళ్లప్పుడు పెద్ద గొడవై పెళ్ల్లాగిపోవాల్సిందిట. అప్పుడామె స్వంతవాళ్ళని కూడా కాదని ఉమవైపు అండగా నిలబడిందని ఓసారి ఉమే నాకు చెప్పింది. అది గుర్తు చేసి, ”కావాలని ఈ పెళ్లికి రావడం మానేసింది ఆ గౌరేనా?” అన్నాను.

”అవును. ఆ గౌరే. తను మాకెంత సాయం చేసినా, ఆ తర్వాత అంతకంతా తనకి మేమూ చేశాం. తన కూతురి పెళ్ళికి నెల్లాళ్లు మా బావగారింట్లోనే ఉంది. మేమంతా పూనుకుని పెళ్లి పనులన్నీ చేశాం, తెలుసుగా”

”గుర్తుంది. ఆ నెల్లాళ్ళలో మీకూ, వాళ్లకీ- దినవెచ్చాలకీ, కరెంటుకీ అయిన ఖర్చంతా తనే పెట్టుకుందనీ, వెళ్లేటప్పుడు అపరాలన్నీ మీకే వదిలేసిందనీ, ఇంకా మీకు చిన్న చిన్న కానుకలు కూడా ఇచ్చిందనీ చెప్పావు”

”అది వేరులే. అయినా పప్పులూ అవీ వదిలేయక- కూడా మోసుకెడుతుందా?” అంది ఉమ చిరాగ్గా.

”కావాలంటే వెనక్కిచ్చేయొచ్చన్నాడు దుకాణంవాడు, కానీ తనే ఇవ్వలేదన్నావు అప్పుడు” గుర్తు చేశాను.

”దానికీ ఏదో కారణం ఉండే ఉంటుందిలే కానీ- ఇప్పుడదంతా ఎందుకు? ఇప్పుడు నా కూతురి పెళ్లికి తను రాలేదు. అదీ సంగతి!” అంది ఉమ. విషయం మొదటికి రావడంతో నేనూ మొదటికొచ్చి, ”ఔనూ- వాళ్లమ్మాయి పెళ్లప్పుడు నువ్వెక్కడుండేదానివి?” అన్నాను. అప్పుడు తనూ ఆ ఊళ్లోనే ఉండేదని నాకు తెలుసు.

ఉమకి అర్థమైంది. మాట తప్పిస్తూ, ”ఎక్కడుంటే ఏమిటి- ఆపేక్షలు ముఖ్యం. మరి మా మేనకోడలు పెళ్లికే కాదు, పురిటికీ ఎంత సాయం చేసానో నీకు తెలుసుగా?” అంది.

”గుర్తుంది. అప్పుడు గౌరి నీకు చాలా మంచి కానుక ఇచ్చిందన్నావు కూడా”

”ఇచ్చిందనే కదా- నీక్కూడా చెప్పుకుని సంతోషించాను. అలా ఇచ్చి దానితో ఋణం తీరిపోతుందనుకుంటేనే బాధనిపిస్తుంది?” అంది ఉమ.

”సాయం దారి సాయానిదే, ఋణం దారి ఋణానిదే! ఆవిడలాగనడం చాలా తప్పు” అన్నాను ఏమీ ఎరగనట్లు.

”పాపం మాటలెందుకూ- ఆవిడ అలా అన్నట్టు నాకు తెలియదు. కానీ కానుకతో ఋణం తీరిపోయిందనేగా మరి ఈ పెళ్ళికి రాలేదు” అంది ఉమ.

ఈ తర్కం నాకు దుర్భరమనిపించి, ”ఔను. నీ ఉక్రోషంలో న్యాయముంది. పెళ్లికైతే ఊళ్లోనే ఉన్నావు కాబట్టి వెళ్లావనుకోవచ్చు. కానీ పురిటికి కూడా ఎక్కణ్ణించో సాయానికెళ్లావ్‌ నువ్వు” అన్నాను. అప్పుడూ తనక్కడే ఉందని నాకు తెలుసు.

ఉమ ముఖం మాడ్చుకుని, ”పురుడప్పుడు కూడా నేనక్కడే ఉన్నానులే” అంది.

నేను వదలదల్చుకోలేదు. తెలియనట్లు నటిస్తూ నిలదీయాల్సినవి చాలా ఉన్నాయి, ”సరే- ఒక పురుడైతే అనుకోవచ్చు. మరి రెండో పురిటికి అక్కడ లేవుగా?” అన్నాను. ఉమ అదోలా ముఖంపెట్టి, ”లేననుకో. ఆ పురిటికి నేను వెళ్ళలేదు కూడా. ఇంతదూరంనుంచి కష్టం కదా!” అంది.

”నిజమే- దగ్గిరున్నావు కాబట్టి మేనకోడలి మొదటి పురిటికి చాలా సాయం చేశావ్‌! ఆ తర్వాత కెనడా వచ్చేశావ్‌ కాబట్టి- ఆ అమ్మాయి రెండో పురిటికి ఇంత దూరంనుంచి వెళ్లి సాయం చెయ్యలేకపోయావ్‌. ఏదో వడుగు, పెళ్లి లాంటి విశేషాలైతే అది వేరు. దూరమైనా తప్పదు మరి. అవునూ- మరి నీ మేనల్లుడి వడుగు విశేషాలు నీనుంచి విన్న గుర్తు లేదు” అంటూ మరో బాణం వేశాను.

”ఉండేది పక్కపక్క ఊళ్లే ఐనా- పెళ్లికి వెళ్లడానికే ఒకటికి పదిమార్లు ఆలోచిస్తున్న రోజులివి. కెనడానుంచి ఇండియా వెడతామా- అదీ వడుక్కి!” చిరాగ్గా అంది ఉమ.

”అంటే నువ్వు నీ మేనల్లుడి పెళ్ళికే కానీ వడుక్కి వెళ్లలేదన్నమాట?” బాణంమీద మరోబాణం.

”అన్నీ తెలిసీ తెలియనట్లు ఎక్కదీస్తావేం? ప్రపంచం చిన్నదైపోతోందన్నమాట నిజమే కానీ- ఆ వడుగప్పటికీ ఆ తర్వాత పెళ్లినాటికీ- కెనడాకీ ఇండియాకీ దూరం అంతే ఉంది మరి” అంది ఉమ అసహనంగా.

”ఐతే నీ మేనల్లుడి పెళ్లికి కూడా వెళ్లలేదంటావ్‌! పోనీ ఆ తర్వాత గౌరీ వాళ్లూ కొత్తిల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకున్నారు కదా- వాటికి వెళ్లే ఉంటావ్‌! ఆ విశేషాలూ చెప్పలేదు నాకు”

”ఏం వెటకారం తల్లీ! గృహప్రవేశానిక్కాకపోయినా ఆ తర్వాత మూడేళ్లకి జరిగిన వాళ్ల షష్టిపూర్తికి వెళ్ళాన్లే”

”అంటే, అప్పటికి తగ్గిందన్నమాట దూరం! దూరం తగ్గినా టికెట్‌ తగ్గదుకదా- మీ ఇంటిల్లపాదీ వెళ్లడానికి బాగా తడిసి మోపెడయుంటుంది?” అన్నాను. నాకు తెలుసు- తనొక్కతే వెళ్లిందని.

”మర్చిపోయావా- వెళ్లింది నేనొకత్తినే. చీటికీమాటికీ ఇంతింత టికెట్‌ పెట్టుకుని అంతంత దూరాలు వెళ్లడం మాటలా? ఐనా మా అమ్మకి వంట్లో బాగాలేక చూడ్డానికెెళ్లాను చూడు- అప్పుడే జరిగిందా వేడుక”

”అంటే- ప్రయాణం ఛార్జీలు కలిసొచ్చాయ్‌. ఇంకేం- వాళ్ల షష్టిపూర్తికి మంచి గిఫ్టే ఇచ్చుంటావ్‌?” అర్జునుడు ద్రోణుడిపై ప్రయోగించినవి ఆయనకి తెలిసిన అస్త్రాలే కదా- నేనూ అదే చేస్తున్నాను.

”ఊఁ మావారి అన్నదమ్ముల మూడు కుటుంబాలు కలిసి- మా ఆడపడుచుకో సిల్కు చీరా, వాళ్లాయనకో పాంటూ షర్టూ పెట్టాం”

”అలాగా- మరి దానికావిడ- ‘కెనడాలో ఉన్నారు, ఇంత సంపాదించుకుంటున్నారు. అంతా కలిసి ఇచ్చేది ఉత్త బట్టలేనా’ అని నిష్ఠూరమాడలేదా? అందులోనూ షష్టిపూర్తి జీవితంలో ఒకేసారి వచ్చేది కూడాను” అన్నాను.

”ఏమో, తనేం అనలేదు, నేనూ పట్టించుకోలేదు. అయినా షష్టిపూర్తయితే జీవితానికోసారి కానీ- వాళ్ల పెళ్లై ఇన్నేళ్లయిందా? మావారి అన్నదమ్ములంతా కలిసి తనకి బిళ్లగొడుగుల్లా ఏటా అయిదొందలు పంపిస్తున్నారు. తెలుసు కదా!” అంది ఉమ గొప్పగా.

అన్నీ తెలుసు నాకు, ఐనా ”ఇన్నేళ్లంటే ఎన్నేళ్లేమిటి?” అన్నాను.

”ముప్పై ఏళ్లకి పైనే అనుకో. ఇది మా మామయ్య మొదలెట్టారు. ఆయన పోయినా కంటిన్యూ చేయాలని మా అత్తగారి పట్టు. కాదనలేక అన్నదమ్ములంతా కలిసి ఏటా పాటిస్తున్నారు. తప్పుతుందా మరి”

”తప్పదు సరేకానీ- గుడ్డిలో మెల్ల- దీనికి ఇన్‌ఫ్లేషనూ అవీ జోడించి పెంచకుండా, ఇప్పటికీ అదే ఎమౌంటుతో సరిపెట్టారు మీ అత్తగారు”

ఉమ అయిష్టంగా, ”ఊఁ” అని, ”ఐనా- ఏం సంప్రదాయాలో ఇవి. ఆడవాళ్లం, చదువుకున్నవాళ్లం- వీటిని మనమేనా వ్యతిరేకించకపోతే ఎలా అనిపిస్తూంటుంది నాకు. కానీ ఆడపడుచు విషయంలో అంటేే ఇంకోలా అనుకుంటారని- ఈ వ్యవహారంలో వేలెట్టడం లేదు”

”అదీ నిజమే మరి. ముందు నువ్వు నీ  పుట్టింటివాళ్లేమిచ్చినా కాదంటే సరి. చెప్పుచ్చుకు కొట్టినట్లౌతుంది నీ ఆడపడుచుకి” ఉపాయం చెప్పాను.

”భలేదానివే- లేనివాళ్లని వేధించకూడదు కానీ ఆడపిల్లకి పుట్టింటాశ తప్పు కాదు. మా వదినైతే ఏమంటుందో తెలుసా- అది చీర కానీ మరోటికానీ, అన్నయ్యలు పెట్టారూ అంటే అది వాళ్ల స్టేటస్‌కి తగ్గట్లు ఉండాలిట” గొప్పగా అంది ఉమ.

”ఔన్లే, మీ స్టేటస్‌కి తగ్గట్లు మీరు చేస్తున్నారు. ఐనా ఏటా ఐదొందలివ్వడంతో అయిపోదు కదా! ఇంటికొస్తే పెట్టుపోతలూ అవీ మళ్లీ వేరే” అని ఆగి, ”ఔనూ- గౌరి మీ ఇంటికి ఏడాదికెన్ని సార్లొచ్చేదేమిటి? ఇప్పుడు కాదు, ఇండియాలో ఉన్నప్పుడు”

”అక్కడుండగా, మా పెళ్లయ్యాక ఓ రెందుసార్లొచ్చిందిలే. రెండుసార్లూ చీరెట్టి పంపాను”

”ఔన్లే- ఎంత కలిగినవాళ్లమైనా చీర కాకపోతే బంగారం పెడతామేమిటి?” అని, ”ఇంతకీ మీ ఆడపడుచు మీ అమ్మాయి పెళ్ళికి రాకపోవడానికి కారణమేమైనా చెప్పిందా?” అనడిగాను.

”ఏం చెబుతుంది- కావాలనే రానప్పుడు?”

”పక్కనే ఉండి రానప్పుడు, కుంటిదైనా ఏదో సాకు చెప్పాలిగా”

”అంత పక్కనేం లేదులే- ఉంటే రాకేం చేస్తుంది?”

”పక్కనే లేకపోతేనేం- అయినవాళ్లింట్లో పెళ్లికి వెళ్లకపోతే- సాకు చెప్పడం కనీస మర్యాద కదా!”

”చెప్పిందిలే సాకు. మనవడుట్టాడు. చూడాలన్న ఉబలాటమొకటి. కొడుకూ, కోడలూ ఇద్దరికీ ఉద్యోగాలు. దేశం కాని దేశంలో తన సాయం లేకుండా కుదరదట”

”అదేమిటీ- ఆ మనుమడేమైనా సడెన్‌గా పుట్టాడా? పుడితే మాత్రం పెళ్లి ముహూర్తం తెలిసి కూడా ఆగకుండా వెళ్లిపోయిందా?”

”అదేంకాదులే- మా అమ్మాయి పెళ్లే సడెన్‌గా కుదిరింది. అప్పటికి మా ఆడపడుచు అమెరికాకి టికెట్‌ కొనేసుకుంది. రెండు నెలల్లో తన ప్రయాణముంది. ఈలోగా ముహూర్తం పెడితే పెళ్లికుండి వెడతానంది. మాకేమో మరో రెండు నెలలక్కానీ ముహూర్తం కుదర్లేదు. ఎవరికోసమో తనెందుకాగాలి అన్నట్లు- అంతకాలం తనుండనని పేలేసి చెప్పింది”

”నేనెళ్లలేదు కానీ మీ ఆడపడుచన్న ఆ టైంలో మా బంధువులవి చాలా పెళ్లిళ్లయ్యాయ్‌. మరి మీకు తను ఇండియాలో ఉండగా ముహూర్తాలే దొరకలేదా?”

”ఇది చాలా బాగుంది. ఆడపిల్ల పెళ్ళి. కెనడానుంచొచ్చి ఇండియాలో చెయ్యాలి. మా ఇబ్బందులు మాకుంటాయి. ఐనా మా వీలు మేం చూసుకుంటాం కానీ ఎవరికోసమో ముహూర్తాలు పెట్టుకోం కదా!”

”పేలేసి బాగా చెప్పావు- అచ్చం వాళ్లకిలాగే” విసిరాను.

ఉమ అడ్డంగా తలూపింది, ”అదీ ఇదీ ఒకటి కాదు. తను అమెరికాలో ఉంటేనేం- మేము మా ఖర్చుతో రానూపోనూ టికెట్‌ కొంటామని బ్రతిమాలాం. ఐనా ససేమిరా  అంది తెలుసా?”

”మీరలాంటి ఆఫరిచ్చినప్పుడు- రాననడం దారుణం- అదీ తనకి గ్రీన్‌ కార్డుండీ!”

ఉమ ముఖం మాడ్చుకుని, ”వాళ్లకి గ్రీన్‌కార్డ్‌ లేదులే. టెెనియర్స్‌ మల్టిపుల్‌ ఎంట్రీ వీసామీద రెండేళ్లకీ మూడేళ్లకీ వెడుతూవస్తూంటారు” అంది.

”అలా చెప్పు మరి. ఆ వీసాతో- అమెరికానుంచి మన ఇష్టమొచ్చినట్లు రావడం, పోవడం అన్నివేళలా కుదరకపోవచ్చని నీకూ తెలుసుగా”

”ఔననుకో- కానీ వాళ్లబ్బాయే హామీ ఇచ్చాడు మాకు- అమ్మానాన్నా ఈ పెళ్లయ్యాకే రావచ్చనీ, అంతవరకూ తాము అడ్జస్ట్‌ అవుతామనీ”

”నువ్విలాగంటే గుర్తుకొస్తోంది- నీ పురుళ్ళకి మీ అమ్మ దగ్గర నువ్వెన్నాళ్ళున్నావు?”

”పురిటికి ముందు మూడునెలలు, తరువాత అయిదు నెలలు. రెండో పురిటికైతే- నన్ను పంపేటప్పుడు- అమ్మ కూడా నాతోపాటు వచ్చి నా దగ్గిర మూడు నెలలుంది. ఇంకా ఉండేదే- తనకి చాలా ఇబ్బందౌతోందని నాన్న ఫోన్లమీద ఫోన్లు చెయ్యకపోతే”

”ఏమిటో- మన సుఖంకోసం పెద్దవాళ్లనిబ్బంది పెట్టడం అవసరమంటావా?”

 

”సుఖమా, పాడా? చంటిపిల్లల చాకిరీ ఎంత కష్టం? నేనెంత చేసినా- ఉడతాభక్తే కదమ్మా- అనేది అమ్మ. తెలుసా?”

”తెలుసు కానీ నేనంటున్నది వేరు. నువ్వుద్యోగం చెయ్యకపోయినా చంటిపిల్లలతో చేసుకోలేవనుకుంది మీ అమ్మ. మీ నాన్నకిబ్బందని తెలిసి కూడా- నీకు సాయానికొచ్చింది. మరి గౌరి కొడుకూ కోడలూ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మానాన్నా ఆలస్యంగా వచ్చినా ఫర్వాలేదనడం- నీ మేనల్లుడి మర్యాద. అన్నీ తెలుసు కాబట్టి- ‘పెళ్లికి రాకపోతేనేం- ముఖ్యావసరం మీది’ అనడం మన మర్యాద. ఇక గౌరి సంగతంటావా- ఆవిడకి మనవణ్ణి చూసుకోవాలని తొందరుండడం సహజం. మీ అమ్మ మీ నాన్న ఇబ్బందిని పట్టించుకోనట్లే, ఆవిడ మీ ఇంట్లో పెళ్లిని పట్టించుకోలేదనుకోవచ్చుగా. ఇక మీ టికెట్‌ ఆఫర్‌ విషయానికొస్తే- వడుక్కి, పెళ్లికి, గృహప్రవేశానికి, షష్ఠిపూర్తికి- స్వంతానికి దారి ఖర్చులకి వెనకాడినవాళ్లు- తనకిప్పుడు దారిఖర్చులు పెట్టుకుంటామంటే తనకి మనసొప్పలేదేమో ఆలోచించావా?” అన్నాను ఆగలేక.

ఉమకి కోపం వచ్చింది, ”చాలా బాగుంది- నువ్వు నా ఫ్రెండువా, గౌరి ఫ్రెండువా అని అనుమానంగా ఉందిప్పుడు. మరి నా సంగతే తీసుకో- మా అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు చూడ్డానికి ఇక్కణ్ణించి వెళ్లానా- ఎలాగోఅలా వీలు చేసుకుని అంత దూరాన్నుంచొచ్చానని సంబరపడింది. కానీ తనకి బైపాస్‌ చేసినప్పుడు సాయానికేమిటి, చూడ్డానికే వెళ్ళలేకపోయాను. అమ్మ అభిమానంతో అర్ధం చేసుకుందే తప్ప- ‘అప్పుడు పెట్టిన ఖర్చిప్పుడు పెట్టలేవా?’ అని నిలదియ్యలేదు. ఆ తర్వాత నా వీలునుబట్టి ఇంటియా వెళ్లినప్పుడు అది మనసులో పెట్టుకుని మతలబుగా మాట్లాడలేదు. అభిమానం, ఆప్యాయత ఉన్నచోటే నమ్మకమూ ఉంటుంది. అది లేనప్పుడే నువ్వన్నట్లు మనసొప్పకపోవడాలు”

ఉమ తన్ను తాను విమర్శించుకుందో, నాకు సంజాయిషీ ఇచ్చిందో అర్థం కాలేదు. నేను మాత్రం నా ధోరణి కొనసాగించాను, ”నీ ఫ్రెండుని కాబట్టే సంకోచం లేకుండా డౌట్స్‌ క్లియర్‌ చేసుకుంటున్నా. ఇంకా నా డౌట్స్‌ ఐపోలేదు. గౌరి అభిమానం, ఆప్యాయతల గురించి చాలాసార్లు నా దగ్గిర మెచ్చుకున్నావు కాబట్టి అడుగుతున్నాను. మీరు వాళ్ళింట్లో చాలా ఫంక్షన్సుకే వెళ్ళలేదు. ఆ విషయం తను మనసులో పెట్టుకుంది అనుకునేందుకు ఆధారాలేమైనా ఉన్నాయా? అంటే తనెప్పుడైనా ఎవరి దగ్గిరైనా మిమ్మల్ని ఆడిపోసుకుందా?”

”తనలా తేలే రకం కాదు. మా ఎదురుగా ఎప్పుడూ ఏమీ అనలేదు. చాటుగా అందేమో తెలియదు. మా సంగతంటావా- మాకైతే మనసులో ఏమీ లేదు. ఇంత జరిగినా వీలు చూసుకుని అమెరికా వెళ్లి తన కొడుకూ, కోడల్నీ చూసొస్తూంటాం తెలుసా? అఫ్‌కోర్స్‌- ఆ ట్రిప్పుతో సైట్‌ సీియింగ్‌ కూడా కలుపుతామనుకో”

”మరి నీ మేనల్లుడూ వాళ్లూ ఎప్పుడూ మిమ్మల్ని చూడ్డానికి రాలేదా?”

”రాకేం- సైట్‌సీయింగ్‌కొచ్చి ఆచేత్తో మమ్మల్నీ చూడ్డానికొచ్చారు”

ఆ ప్రజాకీయానికి వివశనై కాసేపు అవాక్కయ్యాను. తేరుకున్నాక చివరి ప్రయత్నంగా, ”ఇంతకీ పెళ్ళికొడుకు మీ పిన్నత్తగారి మనవడే కదా! మీ పిన్నత్తగారి కూతురు మంచిదికాదనీ, మీ పెళ్ళిలో గొడవ పెట్టిందనీ, ఆ తర్వాత మీ చేత బాగా చాకిరీ చేయించుకుని నీచంగా చూసిందనీ, ఆవిడ కొడుకు కూడా….”

నేనింకా ఏదో అనబోతూండగా మధ్యలో ఆపి, ”అబ్బా- పెళ్లైపోయిందిగా- ఆ పాత సంగతులన్నీ ఇప్పుడెందుకూ? పెళ్ళి చాలా చాలా బాగా జరిగింది. అన్ని వేడుకల్లోనూ మగ పెళ్లివారు కూడా మాతో కలిసిపోయారనుకో. అంత సరదాగా జరిగిన పెళ్లిలో మా ఆడపడుచు పాలు పంచుకోలేదన్న ఆత్మీయతాభావమే నా ఈ ఉక్రోషానికి కారణం. అర్థమైందా?” అంది ఉమ.

”నాకు తెలుసు, నీకు నీ ఆడపడుచంటే చెప్పలేనంత ఇష్టం. ఆవిడ పక్కనుంటే నీకు అదో తృప్తి. పెళ్ళి పనుల్లో శ్రమ కూడా తెలిసేది కాదేమో?”

”అంత శ్రమేముందిలే- ఐనా నేను పెళ్లికి మూడు నెలలు ముందునుంచీ ఇండియాలోనే ఉన్నానుగా”

”అంత ముందా? ఓహో- కాబోయే అల్లుడి వడుక్కి కూడా వెళ్లినట్లుంటుందనా?” అన్నాను. ఆ వడుక్కి తను వెళ్లలేదని నాకు గుర్తుంది.

”అబ్బే- నేనెళ్లడానికి రెండు నెల్ల ముందే మా అల్లుడి వడుగైపోయింది. మేమొచ్చాక పెట్టమన్నాం కానీ వాళ్లకి ముహుర్తం కుదరలేదు. పెళ్లికైనా ఫర్వాలేదు కానీ వడుగు ముహూర్తానికి పట్టింపు ఎక్కువ కదా! పోనీ వడుక్కి వెళ్లి మళ్లీ వెనక్కొచ్చి మళ్లీ పెళ్లికి వెడదామంటే- అన్నేసి ప్రయాణాలకి ఇదేమైనా దగ్గరా దాపా? అందుకే ఆ వడుక్కి వెళ్ళలేదు. అలాగని వాళ్లకేం లోటు చెయ్యలేదు- వియ్యపురాలికిి కంచి పట్టుచీరా, వియ్యంకుడికి పట్టుపంచా, అల్లుడికి తులం బంగారం ఉంగరం అందేలా ఏర్పాటు చేశాంలే”

ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి. కానీ టైమ్స్ నౌలో అర్నాబ్‌ గోస్వామిలా ఈ సంవాదాన్ని ఎక్కడో ఒకచోట ఆపేయాలిగా! ఈ ప్రజాకీయంలో మంచిచెడుల అన్వేషణ అసాధ్యమని అప్పటికి ధ్రువపడింది నాకు. అస్మదీయుల్నీ తస్మదీయుల్నీ వేరు చేసే ఆమె అవగాహన, ఆలోచన- సమకాలీనంగా మన సమిష్టి కుటుంబాల్నీ, సమాజాన్నీ, వ్యవస్థనీ ప్రభావితం చేస్తున్నవా- అన్న భావం నాకు కలిగింది.

మీడియాలో మన నేతల ధోరణి చూసినప్పుడు- వాళ్లలో మీకు ఉమ కనిపించొచ్చు. కానీ ఉమలో మీకు- మీరు, అస్మదీయులు కనిపిస్తే ఈ రచనకి సార్ధకత లభించినట్లే!

—0—