ఒక స్నేహ దీపం ఆరిపోయింది!

ప్రముఖ కథా రచయిత, గేయ రచయిత, సంగీతజ్ఞుడు గిడుగు రాజేశ్వర రావు గారు (1932-2013) హఠాత్తుగా కన్ను మూయడం ఆయన అభిమానులనందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. చివరి దాకా ఆయన పూర్తి ఆరోగ్యంగా, తాజాగా,ప్రసన్నంగా వున్నారు.  ముఖంలోని చిరునవ్వుగానీ, ఆరోగ్యసూచకమైన వెలుగుగానీ ఏమాత్రం చెదరలేదు.ఆయన దినచర్యలో ఏమీ మార్పు రాలేదు. చదవడం, రాయడం, షికారుకు వెళ్ళడం, సాహిత్యకార్యక్రామాల్లో పాల్గొనడం అన్నీ మామూలుగానే చేసేవారు. యింకా 10 యేడ్లు యేమీ ఢోకా లేదనిపించేవారు, యితరులకు కూడా అలా ఉండాలనే ప్రేరణ కలిగించేవారు. ఒక వారం క్రిందట నేను ఉదయం నుండి సాయంత్రం దాకా ఆయన వద్దనే ఉన్నాను. అదే నేనాయనతో గడిపిన ఆఖరు రోజు.
ఆ రోజు ఆయన కొంత కాలంగా రాయడం మొదలుపెట్టిన  నవల లోని రెండు అధ్యాయాలు చదవమని నాకిచ్చారు. కొంత ఆత్మకథ కలగలసిన ఆ నవల అంశాలు చదివి  వినిపించాను. దాన్ని గురించి కొంత చర్చించుకున్నాము కూడా.యిక తన కాలాన్నంతా నవలకే కేటాయిస్తున్నట్లు, అహమదాబాదులోని ఒక సంస్థ ఆయనను ఆగస్టునెలలో సత్కరిస్తున్నట్లు, ఆ సంర్భంగా అక్క్కడికి ఎళ్తున్నట్లు చెప్పారు. అంతే కాక నేను అంతకు మునుపు మా సాహితీ మిత్ర మండలిలో చదివిన జైనేంద్ర కుమార్ హిందీ కథ–తాత్వికతతో కూడిన కథ— ’తత్సత్’ బాగా నచ్చినందువల్ల దాన్ని తెలుగు లోకి అనువదించాలనే కోరిక ఆయనకున్నందువల్ల ఆ కథ సాంతం మళ్ళీ వినిపించి అర్థాలు చెప్పాను. ఆయన అర్థాలన్నీ నోట్ చేసుకున్నారు.
మరుసటి రోజు అనువాదం పూర్తి అయిందని చెప్పడానికి ఫోను కూడా చేశారు.అంత దీక్షతో పనిచేసేవారు. ఇంతకు మునుపు  కూడా ఆయన ఈ విధంగానే మా మిత్రమండలిలో నేను చదివిన కొన్ని హిందీ కథలను అనువదించి ప్రచురించారు కూడా. ఉదాహరణకు యశపాల్ కథ ’కర్వా వ్రతం’(కర్వా కా వ్రత్) భీష్మ్ సాహనీ కథ ’సర్దార్నీ’. ఇలాగే మరికొన్ని కథలు కూడా అనువదించాలనే కోరిక ఆయనకు ఉండేది. ఈ అనువాదాల్ల్లో ఆయనకు సహకరించడం నాకు చాలా ఆనందం కలిగించేది. ఈ పనిగా ఆయన వద్దకు వెళ్ళి నప్పుడంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయనతో గడిపే అవకాశం నాకు లభించేది. కొన్ని సందర్భాల్లో  నేను హిందీ నుంచి తెలుగులోకి చేసిన అనువాదాలు  ఆయనకు చూపించేవాణ్ణి. ఆయన శ్రద్ధగా చదివి అవసరమైన మార్పులు సూచించేవారు. ఈ విధంగా మా సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఆయన హఠాన్మరణం గురించి తెలియగానే ఈ ప్రసిద్ద్ద శ్లోకం మనసుకు వచ్చింది:
అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం,
దేహాంతే తవ సాయుజ్యం, దేహి మే పార్వతీ పతే
(దేవా! పార్వతీ వల్లభా! బ్రతికినన్నాళ్లు దైన్యములేని జీవితమును, కాలము తీరినపుడు అనాయాస మరణమును, దేహమును  వదలినపిమ్మట నీలో కలియుటను ఈ మూడింటిని నాకు అనుగ్రహింపుము).ఇలాంటి కోరిక తీరిన వ్యక్తిలాగానే ఆయన వెళ్లి పోయారు. స్విచ్ ఆఫ్ చేసినట్లు. తానూ ఆయస పడలేదు, ఇతరులనెవ్వరినే ఆయాస పెట్టలేదు.  సార్థకము, సఫలము అయిన   జీవితం జీవించి, పలువురిని మన్ననలందుకొని   వెళ్లిపోయారు.
     భగవద్గీతలోని కర్మయోగి ఆయన. చివరి క్షణం వరకు క్రియాశీలుడుగానే ఉన్నాడు.  గొప్ప  యోగులు,సాధకులు యోగంద్వారా తనువు చాలిస్తారని అంటారు. రాజేశ్వర రావుగారు కూడా అలానే చేశారనిపిస్తుంది.
    నా ఒకనితోనే కాదు, డిల్లీ లోని మా సాహితీ మిత్రమండలిలోని ప్రతి ఒక్కరికి ఆయన సన్నిహితుడైపోయాడు. గత పది-పడ్రెండేళ్లలో– మధ్యలో కొంత కాలం తప్ప— డిల్లీలో  మా అందరికీ ఆత్మబంధువుగా, పెద్దదిక్కుగా,  ప్రేరక శక్తిగా ఉంటూ వచ్చారు . ఆయన సౌజన్యం మమ్మలనందరినీ కట్టి పడేసేది. అందరితో ఆప్యాయంగా మాట్లాడేవారు.  శ్రమపడి ఎంతో దూరం నుంచి  మా సమావేశాలకు వచ్చేవారు. వాటిలో తన రచనలు చదివి వినిపించేవారు, యిక్కడి రచయితల రచనల పైన తన అభిప్రాయం వెలిబుచ్చేవారు.
    సంగీతంలో ఆయనకున్న ఆసక్తిని గురించి, అభినివేశాన్ని గురించి, ఆయన చేసిన కృషి గురించి చాలా కాలం దాకా మాకు తెలియదు. తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. ఉత్తరాది, దక్షిణాది సంగీతాలను, జానపద సాహిత్యాన్ని తనివితీరా ఆస్వాదించిన రాజేశ్వర రావు గారు సందర్భం వచ్చినప్పుడంతా ఆ పాటల చరణాలను  లీనమై పాడేవారు.  హిందీ పెద్దగా రాకపోవడం ఆయన సంగీత సాధనకు అడ్డంకిగా ఉన్నట్లు  నాకు తోచలేదు. యెన్నో పాత హిందీ-తెలుగు పాటలు ఆయన జిహ్వాగ్రం పైన ఉండేవి. ఆయనకు సంగీతం అంటే ఎక్కువ ఇష్టమా, లెక సాహిత్యమంటేనా అనేది చెప్పడం కష్టమనిపించేది. సంగీతం బాగా తెలిసి ఉండడం ఆయన రాసిన గీతాలకు బాగా తోడ్పడిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. రేడియోలో, టీవీలో ప్రసారం పొందిన ఆయన అనేక గేయాలు శ్రోతలకు చిరపరిచితమే. శ్రీమతి రాజేశ్వర రావు గారు, ఆయన కుమార్తె స్నేహలతగారు కూడా సంగీతం బాగా తెలిసినవారే.
    రాజేశ్వర రావు గారు  ప్రధానంగా మానవీయ విలువలను, ఆదర్శ మానవ జీవితాన్ని  చిత్రించిన రచయిత.  మొత్తం ఆయన సాహిత్యంలోని భావాల్లో, ఆలోచనల్లో  యీ విలువల గురించిన చింతే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజుల్ల్లో మనుషుల్లో  సాధారణంగా కనిపించే స్వార్థపరత్వాన్నీ, అవినీతిని, విచ్చలవిడితనాన్ని, విలువలు లేకపోవడాన్నీ చూసి ఆయన తీవ్రమైన ఆవేదన చెందేవాడు. తన జీవితం ద్వారా, సాహిత్యం ద్వారా ఆ విలువలకు బలం చేకూర్చడం  కోసమే ఆయన తాపత్రయపడ్డారు, శ్రమించారు,. తన కల్పనలో ఉన్న గంభీరమైన మానవ జీవితాన్ని. బలమైన నైతిక భావాల్ని, సౌహార్ద్రం నిండిన మానవ సంబధాలను  చిత్రించారు. ఆయనలో కళా దృష్టి కంటే ప్రయోజనపరమైన దృష్టే ఎక్కువగా ఉంటుంది.  అయితే  భావాల్ల్లో తీవ్రత, ఉధృతి  ఉండవు.  సున్నితంగా, మృదువుగా. హితవు చెప్పినట్లుగా చెప్పడం ఆయనకు ఇష్టం.  ఆయన స్వయంగా కూడా సౌజన్యశీలి, మితభాషి, మృదుస్వభావి. ఉదాత్త వ్యక్తిత్వం కలవాడాయన.. తీవ్ర భావాభివ్యక్తి ఆయన ప్రవృత్తికి సరిపడదు. ఆ గుణమే ఆయన సాహిత్యంలో కూడా ప్రతిఫలించి అందులో సారళ్యం, మాధుర్యం చోటు చేసుకున్నాయి..  మానవుని జీవితాన్ని సృష్టి లయతో మేళవించడానికి, సృష్టితో దానికి సామరస్యం స్థాపించడానికి ఆయన తన సాహిత్యం ద్వారా కృషి చేశాడు. చెప్పదలచుకున్నది సూటిగా చెబుతారు. అందువల్లే ఆయన సాహిత్యంలో ఎలాంటి వాద వివాదాలకు చోటు లేకుండా పోయింది.
    ఆయన తత్వమేమిటో ఆయన మాటల్లోనే ఇలా చెప్పుకున్నాడు ” నిరంతరం తిరిగే సృష్టిచక్రానికి కందెన ప్రేమతత్వమే  కానీ పగ, ద్వేషం కాదు. మానవూడు ప్రకృతికి దూరంగా  జరిగిపోతున్నాడని వందేళ్ల క్రితం  డేవీస్  విచారించాడు.  కానీ ఇటీవలి పరిణామాలు చూస్తే చెప్పలేనంత దూరమే మళ్లిపోతున్నాడు.
    “ఈ సృష్టిని  వినయంతో ఆరాధించి, భావి తరాల  పట్ల శ్రద్ధ వహించడంలో తేనెటీగలు, వానపాములు వంటి అల్పజీవులు చూపిన పాటి దీక్ష, సహజీవన కాంక్ష బుద్ధిజీవులని విర్రవీగే  నరజాతి చూపకపోవడానికి కారణం ఒకటే.  ప్రేమ జీవితానికి అత్యవసరమన్న సత్యాన్ని గుర్తించక పోవడమే. విధ్వంసకారకాలైన పగ, ద్వేషం, జనాన్ని, ముఖ్యంగా యువతని తమవేపుకు లాక్కుంటున్నాయి…..ప్రకృతి దృశ్యాల వెనక అంతర్లీనంగా ఉన్న ప్రేమతత్వం, రానున్న తరాల పట్ల శ్రద్ధ, గమనించినప్పుడు  మానవ హృదయంలో కాసింత పరివర్తన, మృదుత్వం చోటు చేసుకుంటుంది.  విధ్వంసకోన్మాదమే సామాజిక సమస్యల పరిష్కారానికి ఒక మార్గం అన్న అభిప్రాయం తగ్గుముఖం పడుతుంది– అని నమ్ముతున్నాను. ప్రకృతిని ప్రేమించి ఆరాధించే సాధనకు మించిన భక్తి ఏమతంలోనైనా వేరే ఏముంటుంది? “
    గిడుగు రాజేశ్వర రావు గారు మొత్తం పధ్నాలుగు రచనలు ప్రచురించారు. (1)గిడుగు రాజేశ్వర రావు కథలు (2) రాగవీచికలు (లలిత గేయాలు) ఇది గరికపాటి సాహిత్య పురస్కారం పొందింది (1993) (3) కాళిందిలో వెన్నెల (కథల సంపుటి) (4)పూలతేరు (కథల సంపుటి)  (5) భావ వీచికలు ( ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాల్లో ప్రసారమైన లలిత గేయాలు)  (6)మల్లె పందిరి ( ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్నం వారి ’ముదిగొండ సాహిత్య పురస్కారం-2003 పొందిన బాలల గేయాల సంపుటి) (7) మా ’కంద’ స్పందనలు (కంద పద్య శతకం)  (8) శబ్ద చిత్రాలు (రేడియో నాటికలు)  (9) ఉదాత్త చరితుడు గిడుగు ( రామమూర్తి పంతులు గారి  జీవిత చరిత్ర)  (10) అమూల్యక్షణాలు (కథల సంపుటి) (11) పిల్లలకు పిట్టకథలు  (12)రాజమకుటాలు  (వ్యంగ్య  పద్యరచన) (13) కవన కదంబం (కవితలు) (14) సృష్టిలో మధురిమలు ((సచిత్ర  పద్య రచన)
     రాజేశ్వర రావు గారి కథలు జీవితంలోని అతి సున్నితమైన అంశాలను స్పృశిస్తాయి, ఏ అలంకారాలూ లేకుండా, నిరాడంబరంగా,  నిసర్గ సుందరంగా ఉంటూ తమ లక్ష్య శుద్ధి తో, నిజాయితీతో,  ఆర్ద్రతతో పాఠకుణ్ణి ఆకట్టుకుంటాయి,ఆలొచింపచేస్తాయి. సరళమైన భాష, కథను నడిపించడంలో మంచి నేర్పు, అందులోని సందేశం ఆయన కథల్లోని మరి కొన్ని విశేషతలు.  ఈయన అనేక కథలు  పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి.   వీరి  బాలల గేయాలు, లలిత గేయాలు  ఉదాత్తమైన భావాలతో నిండి, రాగ-తాళయుక్తంగా పాడడానికి అనువుగా ఉంటూ,పాడేవారికి, వినేవారికి, చదివేవారికి. అందరికి రసానుభూతిని కలగజేస్తాయనడంలో సందేహం లేదు.
  ఎంతో శ్రమపడీ సేకరించిన సమాచారంతో   తన తాత గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలను పొందుపరచి రాసిన ’ఉదాత్త చరితుడు’ ఒక విశిష్ట రచన . మునుపెన్నడు వెలుగులోకి రాని విశేషాలెన్నో ఇందులో ఉన్నాయి.
   రాజేశ్వర రావు గారి చివరి ప్రచురిత రచన ’సృష్టిలో మధురిమలు’  మరో విశిష్ట రచన. తాను తీసిన ఫోటోల్లోని, సేకరించిన ఫోటోల్లోని  ప్రకృతి  దృశ్యాలకు తగినట్లుగా  తానే రాసిన గీతాలను చేర్చి ప్రచురించిన  పలు రంగుల చిత్రాలతో కూడిన  రచన ఇది.  దాన్ని ఆయన ’సప్తవర్ణ దృశ్యకావ్య ప్రయోగం” అని అన్నారు.  ఈ రచన  రాజేశ్వర రావు గారు  ప్రకృతితో  ఎంత తాదాత్మ్యం చెంది ఉండేవారో,  ఎంత సూక్ష్మ పరిశీలన చేసేవారో స్పష్టంగా తెలుపుతుంది.
 “నిండు దోసిట పట్టిన నీరు కూడ
వేలి సందులలో జారి నేల రాలు,
మధురమైన క్షణాలను మరచి పోక 
భద్రపరచు ప్రయత్నమీ పద్య రచన!”
అని ఆరంభించిన ఈ  రచనలోపశు -పక్షులనుంచి, క్రిమికీటకాలనుంచి, ప్రకృతి నుంచి మానవుడు  తన మనుగడకు, తన ఉన్నతికి  నేర్చుకోవలసిన అనేక పాఠాలను దర్శింపచేసే చిత్రాలు, వాటిని హృద్యంగా వర్ణించిన  గేయాలు ఉన్నాయి.   సారిసారికీ  చూస్తూ, చదువుతూ ఉండడానికి  ప్రక్కనే ఉంచుకోదగ్గ పుస్తకం.
     తన ఆలోచనలను. ఆదర్శాలను, చింతలను వెలిబుచ్చే రెండు కథలు ఆయన ఈ మధ్యనే ప్రచురించారు. ఒకటి వన మహోత్సవం, రెండోది ధర్మసందేహం.
జె. ఎల్. రెడ్డి
Dr. J.L Reddy