కంపనవడ్డ కాళ్ళు   

rafi1

Art: Rafi Haque

           -జూపాక సుభద్ర

~

“ సావు ముండా సావే నువు సచ్చినాపాపంలేదే……

కుంటి ముండ నీకు కాల్లేలేవాయెప్రేమ గావాల్సొచ్చిందానె…..తెచ్చి పెడ్తాంటె మదమెక్కి కాని పంజేసి కడుపు దెచ్చుకుంటివి” అని బిడ్డ ప్రశాంతను యేసన్న తిట్టుకుంట, గుద్దుతండు ఎక్కడ బడితె అక్కడ తంతండు. తల్లి మల్లక్క’ వో అయ్యా బిడ్డె జత్తది కొట్టకు బాంచెనని’ అడ్డంబొయింది అయినా ఆగకుంట దీన్ని నరికినా పాపంలేదే దీన్ని సంపి జేలుకు బోత’ అని మల్లా వురికి ప్రశాంత ఎంటికలు బట్టి గొర్ర గొర్ర గుంజుకొట్టి గోడగ్గొడ్తాంటే….ప్రశాంత ఓ….ఓ…..అని మొంద్తుకుంటాంటె తల్లి మల్లక్క “ దానుసురు దాక్తది కాల్లులేని కబోది పచ్చసోంటీది. దాన్ని ఎంత గొడ్తె ఎమత్తది సెప్పు…..ఎంతగనమని కొడ్తవు వూపిరి లేంది పానంబోతది నీ దండంబెడ్త “ అని అమాంతం బిడ్డ ప్రశాంతను బట్టుకొని మొగని సేతులున్నఎంటికల్ని యిడిపిచ్చింది యేడ్సుకుంట.

“ అసే లంజే నువ్విచ్చిన లాగంతోనే నీ బిడ్డకు యీ యేషమైందే…. అద్దు పద్దు లేకుంట కడుపు దెచ్చుకున్నదే” అని బార్య మల్లక్క మీదికెగబడి యేసన్న తల్లిమీద పిల్లను, పిల్లమీద తల్లిని పడేసి కొడ్తుంటె పిల్లలు బయంతోని మూలల కూసోని ఏడుస్తుండ్రు. యిల్లంత తిట్లతోని, ఏడుపులతోని దద్దరిల్లుతంది.

కోపందీరెదనుక కొట్టి బైటికొచ్చి కూసుండు యేసన్న అల్సిపోయి’ దీంతల్లి మండమొయ్య, వుండెకాడుండక లేని పోని నామర్దజేత్తివి. యియ్యాల రేపు కాల్జేతులు సక్కంగున్న ఆడిపోరగాండ్లనే గంగల గల్పుతుండ్రు నిన్నెవడడిగిండే కుంటి ముండా, నన్ను పజితజేత్తివి ‘ అని నెత్తి గొట్టు కుంట తిడ్తుండు.

ప్రశాంత యింట్ల ఏడ్సుకుంట తన కడుపును గుద్దుకుంటాంటె…… సేతులు వట్టుకొని ‘గిప్పుడు గుద్దుకొనేం ఫాయిదనే…. గిన్ని నెల్లు దాత్తివి దైద్రందాన మైల గాకుంటె నాకొక్క మాట జెప్పవైతివి. ఏ డాక్టర్ కాళ్లు గడుపులు వట్టుకోనన్నా తీయిద్దును. గిప్పుడు ముదిరిపొయినంక డాక్టరేమన్నడో యింటివి గద! ఒక్క నెల గాదు రొన్నెల్లు గాదు ఏన్నెల్ల కడుపు దీత్తె పెద్ద పానానికి గండమని చెప్పె. మీ నాయిన ‘సత్తెమాయె తీసెయ్యాండ్రంటె’ పోలీసు కేసుబెడ్తనని డాక్టరు బెదిరిచ్చె, ఏంజేతుము, కాల్లు లేందాని వాయె ఎంత జాగర్తగుండాలె. యిప్పుడు వాడు జాడకులేకపాయె పత్తకు లేకపాయె. కడుపు జేసి అవుతల బడ్డడు’,.. మల్లక్క బిడ్డ కండ్లపోంటి నీల్లు తుడ్సుకుంట. వూరికిబోతె ఎంత మందేమంటరో, పల్లెనిడిసి పట్నంబొయి పరువు దీస్కున్నరని యిల్లవల్లి మాటలు మాట్లాడ్తరు. ఏ మొకం బెట్టుకొని వూరికి బోదుము బగమంతా! కుంటిది గింతకత జేత్తదనుకోలె గీ కత యెట్ల గట్టెక్కాలె యేసయ్యా…..మల్లక్క సొద యెల్లబోస్కుంట బిడ్డకాన్నే కూసున్నది.

ప్రశాంత ఏసన్న మల్లక్కలకు రెండోబిడ్డ. ప్రశాంతకు చిన్నప్పుడే పోలియో వచ్చి రెండుకాల్లు సచ్చుబడ్డయి. ‘ప్రశాంత’ కుటుంబంల, చుట్టాలల్ల  నోరు దిరుగని పేరు. పశాంతా అని కొందరు పశ్శా అని కొందరు, జెర పరిగాషికంగా ‘ఓపాషాటో’ అని కొందరు బిలుస్తుంటరు. యింట్ల ప్రేమగ ముద్దుగ కుంటవ్వా, కుంటక్కా అని పిలుస్తుంటరు. “గీ కుంటి పోరికి దొర్సానసోంటి పేరు బెడ్తివికాని మల్లక్కా….ఏ మచ్చె కాల్లు లేకపాయె. దీపంతోలె యెర్రగ సూడసక్కని సుక్కోలె వుండె. బిడ్డకు దేవుడు కాల్లు లేకుంటజేసె” అని తెల్సి నోల్లు బాద పడ్తుంటరు.

ప్రశాంతకు కుంటవ్వా, కుంటీసు, కుంటా…అనే పేర్లు యిని యిని ‘నన్నట్ల బిలువద్దు’ అని పోరి…..పోరి అల్సిపోయి సివరాకరికి ఆ పేర్లకే అలువాటు పడ్డది అసహాయంగ.

ప్రశాంత తల్లి దండ్రులు యేసన్న మల్లక్క పల్లెల కూలినాలి దొర్కుతలేదని 5 గురు పిల్లలతో సహ పట్నమొచ్చి సుతారి పనిజేస్కుంట బతుకుతుండ్రు. ప్రశాంతకు పెండ్లయిన అన్న యిద్దరు చెల్లెండ్లు వొక తమ్ముడు. ప్రశాంత మూడో తరగతి దాకా యింటి పక్కనుండే గౌరుమెంటు బడిల చదువుకున్నది తర్వాత తమ్ముడు చెల్లెండ్లను చూసుకునే దానికి బడికి బోవుడు బందు వెట్టింది. ప్రశాంతకు సదువుకు బోవుడు షాన యిష్టం. తమ్ముడు చెల్లెండ్ల పుస్తకాలు రోజు సదువుకొని ‘అమ్మా వోపెన్ గ పది రాయొచ్చునంటనే ఫీజు గట్టరాదె’ అని తల్లినడిగితే ‘ కాల్లు రెక్కలున్నోల్లకే సదువు సక్కంగత్తలేదాయె నీకేడత్తది బిడ్డా.’…అంటే “నీయవ్వ కాల్లకు తెలివికేమ్ సమందమే…..కాలు కుంటిదైతె తెలివి కుంటిదైతదానె’ అనే ప్రశాంత మాటల్ని యెవ్వరు పట్టి పర్వజెయ్యలే ఆమె చదువు  గట్టుకు మొరిగిన కుక్క తీరే అయింది.

పనుల కాడ మాత్రం కాల్లు లేవు గదా పనులేంజేస్తదనేది లేదు యింటోల్లకు. యింట్ల సకులం పనులు ప్రశాంతనే జెయ్యాలె కూసోనే వూడుస్తది, గిన్నెలు తోముతది, బట్టలుత్కుతది తమ్ముడు సెల్లెండ్లకు తానాలుజేయించి తయారు జేసి తినబెట్టి బడికి తోల్తది. అన్నవదినెలకు అమ్మనాయినలకు టిపిండ్లు కట్టిచ్చుడు, యింటికొచ్చేటాలకు అన్నంగిన్నె నోటికందిచ్చే పనులన్ని ప్రశాంతనే కూసొని జేస్తది. సుట్టు పక్కల బస్తోల్లు అవ్వా! కాల్లున్నోల్లేంపని కొత్తరు, కాల్లులేకున్నా యింటితోనింటెడు పంజేత్తంది మల్లక్కా….. బంగారి బిడ్డెను గన్నవని మెచ్చుకుంటే…..ఆ…యెంతజేసినా ఏమున్నది, నా బిడ్డెకు కాల్లు యియ్యకపాయె దేవుడు. ఎంతజేసినా కుంటిదే అంటది లోకం పాడువడని దుక్కపడేది.

Kadha-Saranga-2-300x268

యిట్లా గడియపుర్సత్ లేని దమ్మిడాదాయంలేని ప్రశాంతోల్లయింటికి అన్నబామ్మరిది రమేషు కొలువు యెతుక్కోనీకొచ్చిండు. తల్లిదండ్రులు, అన్నవదినలు సుతారి పనికిబోతే, సెల్లెండ్లు తమ్ముడు బడికిబోతే ప్రశాంత వొక్కతే యింట్లుండేది. యిదర్తమై రమేషు పొద్దున లేవంగనే పొయి యింట్ల అందరు ఎటోల్లటు యెల్లిపోయినంక యింటికొచ్చేటోడు. ప్రశాంత పనులుజేస్కుంటాంటె…..సాయంజేస్కుంట మాటల మాటకలిపిండు.

గీ మసిగిన్నెలు తోమి బంగారమసోంటి సేతులు నల్లగైనయి, నువ్వు గీ యింట్ల పుట్టవల్సిందానివి గాదురా బంగారం, నువ్వు దేవకన్నెవురా! అని ప్రశాంతను పొగుడి ఆకాశం జూయించిండు, కాల్లులేక పోతేంది మెరుపు తీగెవురా. నువ్వు వూ………..అంటే నా కండ్లల్ల బెట్టుకోని సూస్కంట నువ్వు నా యింట్ల వుత్తగ్గూసున్నా సాలు లైటేసే పనుండది. నిన్ను పెండ్లిజేస్కుంటె నేను లక్ష్మిదేవిని జేస్కున్నట్లే. నీ నవ్వుసాలురా దీపమోలె యెలిగే ఆ మొకంజాలురా కన్నా………. ఒక్కజెన్మగాదు యెన్ని జెన్మలైనా ఇట్లా సూస్కంట బత్కుతరా అని ప్రశాంతను మైకంల బెట్టి మాయజేసిండు, యెన్నెల్లు పూయించిండు. కుంటిదానా, కుంటిది అని యింట్ల బైట యినీ యినీ సెదలుబట్టిన ప్రశాంత సెవులు, రమేష్ ప్రేమ మాటలకు తేనె గూల్లయినయి.

యింట్ల తల్లిదండ్రి దగ్గెర కూసుండబెట్టుకొని బిడ్డె మంచిసెడ్డలడిగే దానికి, మాట్లాడనీకి వాల్లకు పుర్సతేవుండది తన తోటోల్లు ఎవ్వరొచ్చి స్నేహంజెయ్యరు, తమ్ముడు చెల్లెండ్లతోని అల్లరితో ఎగిరే దునికే ఆటలు ఆడుకోలేదు ప్రశాంత. తన సంబురాలు, దుక్కాలు కోపాలు సెప్పుకొనే దగ్గెరి మనిషే లేదు. రమేష్ మాటలకు ప్రశాంత నిద్రబోలే…..ఆమె మనసు చెమ్మ చెక్కలాడింది, ఎగిరి దునికి దొమ్మరి గడ్డేసింది అట్లా రమేష్ ప్రేమలో వున్న ప్రశాంత ఓ నాడు “నాకు నెలొస్తలేదు” అని రమేష్ నెత్తి పునుక్కుంటన్నది. ఆ మాటినంగనే రమేష్ కండ్లు పచ్చబడ్డయి ‘ ఎండ్రోజులాయె’ అని వులిక్కి పడి కడుపు మీద చెయ్యేసి చూసిండు మామూలుకంటె ఎత్తుగున్నట్లు అర్తమైంది.

ప్రశాంత ‘ చానరోజులైంది నెలరాక ‘ అని చెప్పినాగూడ ఏమెరుగనట్లు ఏంగాదులే అని చెప్పి………ఆ రాత్రే మెల్లెగ జారుకుండు రమేష్.

ప్రశాంతకు జెరంవచ్చుడు, ఏందిన్నా ఓకారిచ్చుకుంటాంటె జెరంవల్లనేమో అనుకున్నరు గానీ అది నెలదప్పిన ఓకారమని కనిపెట్టలేక పోయిండ్రు. లేవ కుండా ఎప్పటికి కూసొనే వున్నందుకు ఎవ్వరు కడుపు గుర్తువట్టలేదు. ఓనాడు మల్లక్క,, బిడ్డ కూసోని కదలనీకి అవుస్త పడ్తాంటె తేరిపారజూసి పసి గట్టింది. యిగ ఆ కాన్నుంచి ప్రశాంతను తిట్టుడు, కోట్టుడు యింట్లంత లొల్లిలోల్లి. డాక్టరు దగ్గెరికి తీస్కపోతే పిండమ్ముదిరిందని వల్లగాదని చెప్పేటాలకు……..ఏంజెయ్యాల్నో తెలువక ప్రశాంతను యింటికి దీసుకొచ్చి,.,. అన్న, తండ్రి సావసావ గొట్టిండ్రు. ఎవడు ఏందని ఆరాలు దీసి  తర్వాత రమేషని తెల్సుకుండ్రు.

ప్రశాంత సొద యెవరింటరు? కండ్లల్లదుక్కం కడుపుల బిడ్డె ఒక చిన్నప్రేమ మాటకోసం, ఓదార్పుకోసం, తియ్యటి పిలుపుకోసం యెనుకముందేవి ఆలోసించుకోలేక అది మోసమని యెర్కలేని యెడ్డితనంతోని బొందల వడ్డది.

కడుపు తీయించుడు వల్లగాదని డాక్టరన్నంక ప్రశాంత తండ్రి, అన్న పారిపోయిన రమేష్ ని యెతికి యెతికి పట్టుకొని, రమేష్ వూల్లెనే కుల పంచాయితి పెట్టిచ్చిండ్రు.

“యింట్లున్న కుంటిపోరిని యేన్నుంచో నా యింట్ల జొరబడి నా బిడ్డెబతుకాగమ్ జేసి గిప్పుడు తప్పిచ్చుక తిరుగుతుండు నా బిడ్డెకు నాయం జెయ్యాండ్రయ్యా అని ప్రశాంత తండ్రి యేసన్న, పంచాయితి పెద్దకు దండంబెట్టిండు. పంచాయితి పెద్ద నివద్దే యింట్లున్న కుంటి పిల్లకు కడుపుజేసి పోతివి, ఆపాపం నీదే గద పెండ్లి జేసుకో! ఎవలు జేసిన కర్మ వాల్లనుబవించాలె గద’’ “ ఎందీ పెండ్లా!”…………గా కుంటి దాన్నెట్ల జేస్కుంటరు రమేష్ కోపంతోని మరాపిల్లను తల్లింజేసినపుడు కుంటి తనం కనబల్లేదా! ఆ పిల్ల జోలికెందుకు బొయినట్టు ! ఆ పిల్లేమన్న కాల్లున్నదా నీ యెన్కబడనీకి, యింట్లున్న పిల్లను తల్లింజేసి,కుంటిదాన్ని నేనెందుకు జేస్కుంటంటే ఎట్ల! “అని పెద్ద మనిషి కోపానికొచ్చిండు.

ప్రశాంత తల్లిదండ్రులు కోపాన్నంత అనుసుకొని వున్నరు. ఏమంటె ఏంతప్పులవడ్తమో బండకింద సెయ్యున్నదని ఎక్కువ తక్కువ ఏమ్మాట్లాడ్త లేరు

“అయ్యో కాల్లులేందని మాగ మాట్లాడ్తండ్రుగానీ, కాల్లులేంది కాల్లులేని జాగల వుండాలె…..అది సక్కంగుంటే గిదంతెందుకు జరుగు, మీ పిల్లను అద్దుల వెట్టుకోకుంట మా పిలగానికి, గా కాల్లు లేందాన్నంట గట్టి ఆని బత్కునాగం జేత్తరా” రమేష్ తల్లి

“ఏహే అంటగడితె వూకుంటమా ఎట్లెట్లంటగడ్తరు? గిదెవడన్న మెచ్చే కతేనా’ అని రమేష్ తండ్రి అడుగు తాంటె రమేష్ యిగో మీరేంజేసినా, ఎక్కడికి బొయినా కేసులు బెట్టినా….జేల్లనన్న వడ్తగని గా కుంటిదాన్ని జేస్కునేది లేదని ఖరాఖండిగ తెగేసిండు.

పంచాది పెద్దమనుషులు గూడ కుంటి మెడకోడమ్ ను ఎట్లాజేస్కుంటడు అనే అంటన్నారు  గానీ ఒక అమాయక ఆడపిల్ల బత్కును మోసకారితనంగ అగాయిత్యంజేసి బుగ్గి జేసిన సెడ్డతనాల మీద ప్రశాంత తల్లిదండ్రులు మాట్లాడే న్యాయాలను బేఖాతరు జేస్తుండ్రు. పంచాది పిలగాని తరపున్నేవున్నదని అర్తమైనంక, మల్లక్క,యేసోబు కూడ బలుక్కున్నరు. మల్లక్క,. యేసోబు కోపంగ మాట్లాడితె ఎటుబొయి యెటత్తదోనని మల్లక్కనే కోపమంత దిగమింగుకొని “అయ్యా బాంచెన్ మీకందరికి ఆడిపిల్లలున్నరు యియ్యాల నా బిడ్డైంది రేపు మీ బడ్డెలక్కావచ్చు, గిట్ల నాయింట్ల కచ్చి నా పిల్లను బద్నాం జేసుడు మంచి రీతేనా ! పలానోల్ల బిడ్డె పెండ్లిగాకుంట కడుపైందాటనే మాట నలుగుట్లె తలెత్తుకునేటట్లుంటదా! మాకింక యిద్దరాడ పోరగాండ్లున్నరు, రేపు గాల్ల పెండ్లీలెట్లగావాలె! మీరే సెప్పుండ్రి దండంబెడ్తమ్. మీ బాంచన్, మీ కాల్లు మొక్కుత వాయ్యలార.,! కాల్లేని పచ్చి అన్యాలం జెయ్యకుండ్రి, రేపది ఎట్ల బత్కాలె మీరే జెప్పుండ్రి దానికి పుట్టిన బిడ్డకు తండ్రెవలంటే ఎవల పేరు జెప్పుదుము. నెత్తిమాద యిత్తులు బడ్డదారి వేరేవుంటది” అని మల్లక్క మాట పురంగ యినకుంటనే

“అరే మల్లా నెత్తి మీద యిత్తుల సంగతి మాట్లాడ్తవేందే, లేదంటె పాడుమంటన్నవ్” అని వురిమినట్లు రమేష్ తల్లి మాట్లాడంగనే…….అరే ఏందమ్మా ఆడిపిల్ల అండ్ల కాల్లులేని పిల్ల తల్లి ఏంజెప్తదో సొద యిననియ్యరాదు అని అదులాయించంగనే,. మల్లక్క “పెండ్లి పేరంటం లేకుంట కడుపొచ్చుడు కనుడు కులానిగ్గూడ బర్కద్దక్కువే, దానిగోస, ఏడుపు పిల్లపిల్ల తరాలకు తాకుతది వూకెనే పోదు ఆపాపం ఏమన్న జెప్పుండ్రయ్యా, ఏమన్నజెయ్యుండ్రి ఎటుదిరిగి దానికి పెండ్లిజెయ్యాలె బాంచెన్, లేకుంటె నా బిడ్డెబత్కది మేంబత్కము,” అని నిక్కచ్చిగ గుంజ బాతినట్లు మాట్లాడింది మల్లక్క.

ముందుగాల”గా కుంటిముండనేంజేస్కోను,మెడకేసుకొని తిరుగనా,” అస్సలే వద్దన్న రమేషును పెద్దమనుషులు “వాల్లుకేసులకు బోతె శాన తిప్పలవడ్తవు, జేలుకు బోతవు. వాల్లు మేదుగులయే పట్కె నువ్వు బచాయించినవు, నువు సొక్కంగున్నట్లు మీదికి బోతెట్ల తప్పు నీది జెర తగ్గుండ్రి” అని రమేషుని వాల్ల తల్లిదండ్రులను భయపెట్టిండ్రు.

చాలాసేపు ప్రశాంత తల్లిదండ్రులు ‘పెండ్లంటే’,., రమేష్ వాల్లు ‘చేస్కోము’ బైసు నడ్సినంక పెద్దమనుషులు ఒక తీర్మానాని కొచ్చిండ్రు. ‘మీయిద్దరి తరుపున పంచాది పెద్దమనుషులు ఒక నిర్ణయాని కొచ్చినమ్ యినుండ్రి’. “యిగో పిల్లగా ఆ పిల్లను యింట్లున్న దాన్ని బైటేసి బద్నామ్ జెసి తప్పుల వడ్డవు ఆ తప్పుకు నువ్వు ఆ పిల్లను పెండ్లిజేస్కోవాల్సిందే,…..ఎందుకంటె పెండ్లి లేకుంట పిల్లను కనుడు కుటింబానికి కులానిగ్గూడ అపకీర్తే… యిగ పెండ్లయినంక సంసారానికి తెచ్చుకుంటవా లేదా అనేది మీ యిష్టం పెండ్లయితె సేస్కునుడు సేసుకునుడే… యిగ పెండ్లిగాకుంట ఆ పిల్లను ఆగం జేసినందుకు దండుగ 50 వేల రూపాలియ్యాలె, యిగ దీని మీద ఎవ్వలు మాట్లాడద్దు యిటోల్లటోల్లు అని… యిగ తిరుగు లేదన్నట్లుగ పంచాది తీర్మానంజెయ్యంగనే……

ప్రశాంత తల్లిదండ్రులు సంసారం సంగతెట్లున్నా పెండ్లయితంది గదా! అని జెర సల్లబడ్డరు. రమేష్ వాల్లు ఏదో పెండ్లియిందనికండ్లు మూసుకుంటె అదటు మనమిటు, అది గుదిబండోలెయింట్ల వుండది గదా! ఏదో! జరిగిన తప్పుకు యాబై వేలేసిండ్రు అడిగినప్పుడు సూద్దాంలే అని….. అటోల్లు యిటోల్లు రాజి పడ్డరు. పిల్లకు పొద్దులంటండ్రు కతజెల్దిగానియ్యాలె, యీ వారంల ఫలానా తేది బెట్టుకోండ్రి పెండ్లి. ఆ రోజు కల్లా పిల్లందీసుకొని రాండ్రి పెండ్లిజేద్దామని రెండు కుటుంబాల్ని సమదుజేసి సాగనంపిండ్రు పంచాది పెద్దలు. బిడ్డె మీద నింద లేకుంట నలుగుట్లె పెండ్లయిందనిపిచ్చుకుంటెసాలు మనం బత్కినన్నాల్లు, మనతోటి కలో గంజో కాగిబత్తది. కూల్నాలి జేసుకొని బత్కెటోల్లము. నా బిడ్డెను సంసారానికి తోల్కపొమ్మని ఆల్లింటి సుట్టు పంచాదులు పెడావులు జేస్కుంట యాడ దిరుగుతము, నా పిల్లనాగంజేసిన రమేష్ గాడు మాగజత్తడు పురుగులవడి. అని ఒక్కసిత్తం జేస్కొని ప్రశాంత తల్లిదండ్రులు యింటికొచ్చిండ్రు.

పంచాది తీర్మానంయిన్నకాన్నుంచి ప్రశాంతకు కడుపంత సలసలమరుగుతుంది పెండ్లి లేకుంటేది అసోంటి అవుమానంపెండ్లి అయితేంది కాకుంటేంది వాని కాల్లకింద యీగినట్టు వాన్నిపెండ్లిజేసుకొని సంసారానికి పోకుంట వుండేటట్లు ఆ పెద్దమనుషులెట్ల పంచాజ్జేసిండ్రు? నా అసోంటి బిడ్డె వాల్లకు లేదా! వాడు జేసిన మోసానికి వాని మొకంజూడొద్దు. మోసంజేసింది వాడైతె శిక్ష నేను మొయ్యాల్నా! దొంగ బాడ్కావ్ ఎంత బెల్లమ్మాటలు సెక్కర మాటలు మాట్లాడిండు? నన్ను నడింట్ల బొండిగ్గోసి పొయిండు. ఏంజేద్దు దేవుడా గీ బతుక్కంటె బాయిల దునికి సచ్చింది మేలు “ఓ అమ్మా, ఓ,నాయినా నన్నిట్లనే సంపుండ్రే నాకీ పెండ్లద్దే——ఆ లుచ్చబాడ్కావుకు నేందండెయ్యనే, యీ కడుప్పాడుగాను అని యిల్లంత బొబ్బవెట్టి, బోండ్రిల్లాలనే’’ దేవిపోతున్నది———కాని అట్లజేత్తె తప్పంత నాదని నాకు మదమచ్చి కడుపుదెచ్చుకున్ననని నా మాదికే యెగవడ్తరు. అవన్ని యిని యిని సెవులు పుండ్లయినయి ప్రశాంతకు.

కాల్లతో పాటు మనసుగూడ సచ్చుబడితె బాగుండను కున్నది దరిలేదు దాపులేదు, దిక్కులేదు దెశ లేదు ఎటుజూసినా యీ సావు పెండ్లి నాపే ఆసరకన బడ్తలేదు ప్రశాంతకు. సావనన్న జత్తగాని యీపెండ్లి మాత్రం జేసుకోను, ఏంజెయ్యా లెనని వల పోస్కుంటనే వున్నది.

ప్రశాంతకు పొద్దులు నిండి కుండంత బొత్త కూసుంటె నేల మీదనేవుంటంది. యించు మందంగూడ కదులుడు కష్టమైతంది. పన్నెది పన్నట్లే వుంటంది. నీల్లు తాగితే, అన్నందింటె బాత్రూమ్ లకుపోవాల్సి వస్తదని అవి గూడ ఎక్కువ తాగుతలేదు తింటలేదు తల్లే ఎత్కపోయి మల్లా మంచాల పండుకో బెడ్తంది. గింత పస్తున్నా నాకు సావస్తలేదాయె, సద్దామంటె గూడ సచ్చేదారుల్లేవాయె యీ గోస యెట్లతెల్లారాలె దేవుడా! అని రాత్రులు గూడా గుండెలు పిండి పిండయే దుక్కం యెగబోస్కుoటంది.

పెండ్లి రేపనంగ మల్లక్క, ఏసన్న ప్రశాంతను తీస్కొని కుటింబంతోని పయనమైండ్రు. ప్రశాంత అల్లకల్లోలమైన అశాంతితోని, ఆందోళనతో కడుపుల పిండం గూడ ఆరగోలు బారగోలయి డాక్టరమ్మ యిచ్చిన తేది కన్నా పదిరోజుల ముందే బసుల్నే నీల్లాడింది ప్రశాంతి. పిలగాడు బుట్టిండు. యీ దుక్కాలల్ల నీల్లాడే నొప్పులు గూడ దిగ దుడుపైనయి.

“ఓ బగమంతా! గీ బిడ్డె మీద నీకెందుకు గింత పగ. ఎందుకు నా బిడ్డెను గింత సెరబెట్ట వడితివి. గీ కుంటిపోరి ఎవ్వలకేమన్యాలం జేసిందని దానికింత గోస! గీ బాలెంతం దీసుకొని యెట్లబోదుము పెండ్లని” మల్లక్క శోకాలు దీత్తాంటె……

“సోకాలెందుకే.. సోకాలు బందువెట్టు అని బార్యనదిలిచ్చి, ప్రశాంతంజూస్కుంట ఏసన్న “దీంతండ్రి పెండ్లమ్ముండమొయ్య, లోకంలున్న దైద్రమంత దీన్నెత్తి మీన్నేవున్నదేంజేద్దామ్, యెన్కకు బోతే, పంచాది మల్లా…యెన్కకత్తది, కతమొదటి కత్తది. ఏమన్నగానీ, యెట్లన్నబోనీ…. పెండ్లయిందని పిచ్చుకోనద్దాంపా ! అని బార్యకు సగ జెప్పిండు. అదే పచ్చిబాలెంత తోని, పసిగుడ్డుతోని పయనమైండ్రు.

పెండ్లి రమేష్ వూరిల చర్చిముందట.పెద్ద మనుసులు చెప్పినట్లు టెంటు కుర్చీలేయించిండ్రు. అదే వూల్లె సుట్టాలింట్ల దిగిండ్రు ప్రశాంత కుటింబమంత. అవ్వా! బాలెంతకు పెండ్లా…. బల్లె పిలగాన్ని బెట్టుకొని పెండ్లా! అని వూరోల్లు, బందువులు ముక్కిరిసిండ్రు మూతిరిసిండ్రు. కొందరు అయ్యో!బిడ్డా ఏం రాతరాసుకచ్చుకున్నవే…. గిసోంటి కష్టం ఎవ్వలకు రావొద్దే అని జాలి పడ్డరు.

ప్రశాంతకు సెవు నిండ దూదులుబెట్టి కడుపుసుట్టునడికట్టేసి మీదికెలి కొత్తబట్టలు గట్టిచ్చిండ్రు పచ్చి తల్కాయని దువ్వెన బెట్టక ఎంటికలు సరిజేసి జెడేసిండ్రు పెండ్లంటే….సందడిగ, లొల్లి లొల్లిగ సుట్టాలతోని బందువుల తోని బ్యాండుసప్పుల్ల తోని సంబురంగ వుంటరు. అట్లాంటి సంబురాలు, సంతోషాలు లేవు ప్రశాంత పెండ్లిల. ఎవరో సచ్చిపోయినట్లు,అందరు దిగాలుగ, దిగులుగున్నరు పెండ్లికచ్చినట్లు లేరు సావుకొచ్చినట్టేవున్నరు.ప్రశాంత తల్లిదండ్రులు,అన్న,యివన్నేంబట్టిచ్చుకుంటలేరు. పెండ్లయిందని పిచ్చుకుంటెసాలు అన్నట్లున్నరు. కానీ ప్రశాంతకు యివన్ని అవుమానంగనే వున్నయి, కడుపును కత్తికోత బెడ్తున్నయి.

చర్చిల అడుగెత్తు గద్దెమీద రెండుకుర్చీలేసిండ్రు చర్చిల పంచాది పెద్దలు అటుబందువులు యిటు బందువులోల్లు కూసుండ్రు కాల్లులేని ప్రశాంతను తండ్రి ఎత్తుకోనొచ్చికుర్చిల కూసుండబెట్టిండు. తర్వాత రమేష్ వచ్చికూసునేటాలకు ప్రశాంత పచ్చిపెయి నరాలన్ని పొంగినయి ‘నన్నుబొంకిచ్చి బోర్లిచ్చి, నన్ను నలుగురు నవ్వే బత్కును జేత్తివి గదరా! అని కడుపంత సలసల మసిలింది. ప్రశాంతకు ఎదురుగ కూసున్న రమేష్ని బూడిది సేసేటట్టు చూసింది.

చెర్చిపాస్టరు ఏందేందో పెండ్లివాక్యాలు జెప్తుంటె అవి సావు వాక్యాలోలె యినబడ్తన్నయి ప్రశాంతకు. .వాక్యాలన్ని అయి పోయినంక పాస్టరు, పిల్ల పిల్లగాని తల్లి దండ్రుల్ని గద్దెమీనికి బిలిసిండు. దండలు, తాలిపుస్తె, పల్లెంబట్టుకొని ప్రశాంత తల్లిదండ్రులు గద్దెక్కి పిల్ల పిలగాని ముందటున్నసిన్న బల్లమీన బెట్టిండ్రు.’ ‘పరిశుద్ధాత్ముడైన దేవుని సన్నిధిలో యీ బిడ్డలు భార్యా భర్తలు కాబోతున్నరు వీరినాశీర్వదించుము ప్రభువా’ అని పాస్టరు దండలు మార్చుకొండని చెప్పి రమేష్కి దండ అందిచ్చిండు రమేష్ దర్జాగ దండవట్టు కొని బింకంగా నిలుసొని ప్రశాంత మెడల దండెయ్యబోతుండంగనే…….ప్రశాంతకు యేన్నుంచి వచ్చిందో ఏమో ఏనుగంత బలము, యిన్నిరోజులు మూసుకొని, దాసుకున్నదుక్కం వొక్కసారే మరుగుతున్న నిప్పుల వుప్పెనోలె ఎగదన్నింది. పచ్చిపెయంత యీనినావోలె రెచ్చిపొయింది. దండ గుంజుకొని రమేష్ మొక్కమ్మీన గొట్టింది సిప్ప సప్ప ‘’అరేయ్….నువ్వు బత్కద్దురా సావురా….. నాబత్కును బండల్జేత్తివి గదరా! యింట్లున్నదాన్ని బజార్లేసి నలుగుట్లె నవ్వుల పాల్జేసినవురా, అని అంగిబట్టుకొని గుంజి అప్పుడు కనబల్లేదుర నేను కుంటిదాన్నని, దబ్బ దిబ్బ దంచి అంగిసింపి పక్కన పల్లెంలున్న దండ, తాలిపుస్తె దీసి నేలగ్గొట్టింది కాల్లులేనోల్లంటె గింత లోకువార! బాడ్కావు! నీతోని పుస్తె గట్టిచ్చుకొని నీ పెండ్లాన్ననే పేరు జెప్పుకోని నేంబత్క నాకీ పెండ్లే వద్దు.. యీ అడ్డమైన పెండ్లినాకద్దు. గింత లుచ్చ పెండ్లి నాకద్దు,గింత లఫంగి పెండ్లి లత్తకోరు పెండ్లి నాకద్దు………..అని చర్చంత దద్దరిల్లేటట్లు బొబ్బ బెట్టుకుంట ‘’ఓ అమ్మా నన్ను సంపుండ్రే…. నేను సావనన్న సత్తగాని, నాకీ సావుపెండ్లి జెయ్యకుండ్రే గీ బట్టెబాజిగాని పేరు నేను మొయ్యనే నాయినా అని కడుపులున్న దుక్కం, బాద కోపం, కసి, అవుమానమంతా కాండ్రికిచ్చి థూ…… అని తుపుక్కున రమేష్ మొకం నిండ వూంచింది.

యింత అధాటుగ యిట్ల జరుగంగనే చెర్చిల అందరు బీరిపొయి సూత్తాంటె….. సల్ల సేముటలు బెట్టి వణుకుతున్నప్రశాంతను మల్లక్క ఏసన్నలు ఎత్తుకొని బైటికెల్లి పోయిండ్రు. కాల్లు కంపన వడితేంది మొకమ్మిద మంచిగ దన్నిందనుకుండ్రు చెర్చిల కొందరు.

*