సూదంటు రాయి లా ఆకట్టుకునే నాటకం ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’

friz

మరాఠీ నాటకరంగం 1944లో శతాబ్ది ఉత్సవాలని జరుపుకొంది. నాటకకర్త, నటీనట వర్గం, సంగీతం- ఈ ముగ్గురి ప్రాభవాన్ని సమావిష్ట పరుచుకొని ఈ రంగం ముందుకు సాగుతున్నది. మరాఠీ నాటక రంగానికి, భారతీయ నాటక చరిత్రలో ఒక విలక్షణ స్థానం ఉంది. మరాఠీలు గొప్ప అంకితభావంతో ఈ రంగాన్ని నిర్మించుకుని పెంపొందించుకుని, నిలబెట్టుకున్నారు. నాటక ప్రక్రియ వాళ్ళ జీవనశైలిలో అభిన్న అంగం. దానికోసం వాళ్ళు ఎక్కువగా కష్టపడ్డట్టుగా చెప్పుకోరు కూడా. కష్టం అనివార్యం అని తెలిసిందే. రోజువారీ జీవన క్రమంలో భుక్తి కోసం వృత్తిలాగే, మానసికానందం కోసం నాటకం, అభినయం ప్రవృత్తి. దాన్ని వాళ్ళు సహజతతో నిభాయిస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియలో అంతర్భాగంగా ఆధునిక నాటకం సామాజిక తత్పరతని కూడా తనలో సంతరించుకోవడంతో నాటకం ఆయుధం అయింది. ప్రజల దృష్టికోణాన్ని ఆలోచనా విధానాన్ని నిర్దేశించగలిగింది.

ఇందులో భాగంగా కళాకారుల కృషి ఒకెత్తయితే మరాఠీ నాటకరంగాన్ని తమ రసజ్ఞతతో ఇముడ్చుకున్న ప్రేక్షకుల కళా హృదయం మరొక ఎత్తు. థియేటర్ జనజీవన సంస్కృతిలో భాగం. ఇరవై ఒకటవ శతబ్దారంభంలో మల్టీమీడియా అస్సాల్ట్ కాలంలో తమ ‘రంగ్ మంచ్’ని యధాతథంగా పదిలపరుచుకున్న ఘనత వాళ్ళది.
ఎన్నో పరిషత్తులు, అకాడెమీలు, సంఘాలు, సభాగృహాలు- ఉత్సవాలు, పోటీలు, అమెచ్యుర్స్, ప్రొఫెషనల్స్ కళని పండించుకొని తృప్తిపడే కళా పిపాసులు.
ఈ నేపథ్యంలో 1964 లో స్థాపించబడిన అఖిల భారతీయ మరాఠీ నాట్య పరిషత్, నాందేడ్ శాఖ వాళ్ళు 2006 లో జరిపిన నాటక ప్రదర్శనల్లో సచిన్ కుండల్కర్ ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ ఒకటి. నేను నాందేడ్ లోని శారదా భవన్ విద్యాసంస్థలో పని చేస్తున్నప్పుడు ఆ నాటకాన్ని చూసాను. మొదటగా ఈ నాటకాన్ని మహారాష్ట్ర సుదర్శన్ రంగ్ మంచ్ ప్రదర్శింపబడిందన్న అతి స్వల్ప పరిచయంతో పట్టణంలోని ప్రేక్షకులని సూదంటు రాయిలా తన వైపు మరల్చుకోగలిగింది. అందులోనూ నాటకకర్త శైలి అతి కఠినమైనది. సగటు ప్రేక్షకుడు సభాగృహాన్ని వదిలివెళ్ళలేడు, ఎందుకంటే సింబాలిక్ గా అర్థం అయీ కానట్టు చెప్పే కథ తనదిగానే ఉన్నట్టుంది. కూర్చుని ఏకాగ్రతతో చూద్దామా అంటే తన జీవితం ఇంత రసహీనంగా, ప్రేమ రహితంగా మారిందన్న సత్యాన్ని చెప్తున్న ఆ నాటక దృశ్యాల్లో తన జీవితపు సత్యాన్ని అంగీకరించాలి. అర్థం అయీ కానట్టున్న సందిగ్ధం. మొత్తానికి నాటకం ముగిసింది. ‘అమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని బయటపడి, తిరిగి ఆ నాటకపు చేదు నిజాన్ని నెమరువేసుకోవలసి వచ్చినప్పుడు ఈ నాటకపు ప్రాముఖ్యాన్ని గుర్తించాల్సి వస్తుంది. ప్రేక్షక, పాఠకులని అలరించడం కళలో ఒక భాగమైతే, కలవరపరచడం మరోభాగం. ఈ నాటకం ప్రేమ రాహిత్యాన్ని ఎత్తిచూపి కలవరపరిచి ప్రేమ మార్గంలో ఎలా తిరిగి ఊపిరి పీల్చుకోవచ్చో చెప్పి అలరిస్తుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో కొరవడిన ఒకే ఒక్క అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది.

సచిన్ కుండెల్కర్

సచిన్ కుండెల్కర్

ఈ పుస్తకానికి శాంత గోఖలే ప్రస్తావన చదివి తీరాల్సిన నాటక విశ్లేషణ. ఆంగ్ల, మరాఠీ సాహిత్యాల్లో పేరు పొందిన రచయిత్రిగా ఆమె ఈ పుస్తకాన్ని తన ప్రస్తావనలో ఆధునిక సాహిత్య వేదికల్లో సమీక్షిస్తూ విశ్లేషించారు.కుండల్కర్ కి మంచి ఆశీర్వచనం ఈ ప్రస్తావన.పాఠకులని కలవరపరిచి ఆలోచన ప్రేరేపిస్తుంది.
దీన్ని తెలుగు పాఠక ప్రేక్షకులు చదివితే బాగుండునన్పించి నాటక కర్తతో ఈ విషయం చర్చించినపుడు ఆయన వెంటనే అంగీకరించారు. మరాఠీ సినిమా దర్శకత్వంతో తన స్థానాన్ని పలు అవార్డులతో పటిష్టం చేసుకుంటున్న సచిన్ కుండల్కర్ నాటకాలు మొన్ననే హైదరాబాదులోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ లాంటి ఎకాడెమిక్ ఇన్స్టిట్యుషన్స్ లో చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త పంథాలో సాగే లక్షణాలున్న ఈ నాటకం ఇక్కడి పాఠకులని కూడా అలరిస్తుందని నమ్మవచ్చును.

-జి. మనోజ
పాలమూరు విశ్వవిద్యాలయం
మహబూబ్ నగర్.