అమ్మే కావాలి!

srilalitha(g.s.lakshmi)

జి.ఎస్. లక్ష్మి పూర్తి పేరు గరిమెళ్ల సుబ్బలక్ష్మి. జిఎస్ లక్ష్మి పేరుతో రచనలు చేస్తున్నారు.  ఇంతవరకు 40 కథలు, రెండు నవలలు రాశారు. మొదటి కథ “ఇది ఇలా సాగవలసిందేనా?” 1982లో ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురితమైంది. తర్వాత పదేళ్లపాటు ఏమీరాయలేదు. తిరిగి 2002లో రచనలు చేయడం మొదలుపెట్టారు. వివిధ  పోటీల్లో ఈమె కథలు బహుమతులు అందుకున్నాయి. వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సొంత ప్రాంతం. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ, కర్నాటక సంగీతంలో డిప్లొమా చేశారు.  నాన్న చూపిన దారి, భర్త అందించిన ప్రోత్సాహమే తనతో రచనలు చేయిస్తున్నాయంటారు జిఎస్ లక్ష్మి. -వేంపల్లె షరీఫ్

“అది కూడా నాకేనా…?”

అరవైయేళ్ళ తాయారమ్మ కూతురు సరళని అమాయకంగా అడిగింది.

“నీకే.. ఇవన్నీ నీకే..” అంటూ మరో వలిచిన కమలాపండుని తల్లి చేతిలో వుంచింది సరళ. తల్లిని చూస్తున్న సరళ మనసులో వేదన ఉవ్వెత్తుగా ఎగసిపడుతోంది. ఎలా వుండేది తన తల్లి…? ఎలాగైపోయిందిప్పుడు..?

తెల్లారకుండా లేచి , సూర్యోదయం కన్నా ముందుగా ఇంటి ముందు రంగవల్లికలు తీర్చేది. ఒక్క ధనుర్మాసంలోనేకాదు. సంవత్సరం పొడవునా ఆమె లేవగానే చేసే మొట్టమొదటి పనే అది. ఎన్నెన్ని రకాల ముగ్గులు వేసేదో.. పండగరోజులయితే వాటిని రంగులతోనూ, పూలరేకులతోనూ అలంకరించేది. అలాగ ఇంటి ముందు ముగ్గు వెయ్యడమన్నది ఆమె చేసే దినచర్యలో మొట్టమొదటి పని అంతే.. ఆ తర్వాత ఆమె చేసే ప్రతిపనీ కూడా అంత కళాత్మకంగానూ వుండేది. తండ్రికి కావల్సినవి కూడా అంత అందంగానూ అమర్చేది. అన్నయ్యనీ, తననీ కూడా చూసేవారు అబ్బురపడేటట్లు పెంచింది.

ఇంట్లో ప్రతి మూలా, ప్రతివస్తువూ శుభ్రంగా, అందంగా వుండేవి. వండే వంటలయితే మరీనూ. ఒక్క రుచే కాదు, చూడడానికి కూడా అంత బాగుండేవి.

ఇంట్లో పనే కాకుండా స్వభావరీత్యా కూడా ఆవిడ స్నేహశీలి. అందరితో సంబంధబాంధవ్యాలు చక్కగా నడిపేది. అవసరమైనప్పుడు సలహాలిస్తూ, ధైర్యం చెపుతూ అందరికీ తలలో నాలుకలా వుండేది. ఆఖరికి నాన్నగారి పేరు సోమసుందరం అన్నది మరుగున పడిపోయి అందరూ తాయారమ్మగారి మొగుడు అనేంత స్థితికి వచ్చింది. తండ్రి అప్పుడప్పుడు ఉడుక్కున్నా ఇంత చురుకైన భార్యని చేసుకున్నందుకు లోలోపల మురిసిపోయేవారు.

రెండేళ్ళక్రితం వరకూ అలా వుండే అమ్మ ఇప్పుడిలా…ఎందుకు భగవంతుడు అమ్మనిలా శపించేడు..? ఏం పాపం చేసిందని ఇంతలా శిక్షించేడు..?

ఆరోజు తనకి బాగా గుర్తు. సంక్రాంతి పండుగ కని పిల్లలిద్దరితో కలిసి తనూ, ఆయనా భోజనానికొచ్చారు. సాయంత్రం వెనక్కి ఇంటికి తిరిగి వెడదామనుకుంటుంటే తన పిల్లలడిగినదేదో కొని తెద్దామని నవ్వుతూ మార్కెట్ కి వెళ్ళిన నాన్నగారు, అన్నయ్య యాక్సిడెంటులో చిక్కుకుని, విగతజీవులై యింటికొచ్చారు. ఆ షాక్ కి తట్టుకోలేని అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత ఎప్పుడో స్పృహ వచ్చినా కూడా ఆవిడ మళ్ళీ ఈ లోకం లోకి రాలేకపోయింది. మెదడులో నరాలు దెబ్బతిన్నాయనీ, మరింక ఆమె జీవితమంతా అలాగే వుంటుందనీ డాక్టర్లు చెప్పారు.

ఒక్కసారిగా మీద పడిన ఈ దుస్సంఘటనలకి సరళ కాస్తైనా తట్టుకోగలిగిందీ అంటే అది ఆమెకి భర్త శ్రీధరం అందించిన ధైర్యమే. పక్కనే వుండి అన్నిరకాలుగానూ సహాయం చేస్తూ, తల్లికి అన్నివిధాలుగానూ తోడుగా వుండే సహనం, ఓర్పూ, ఓదార్పూ అన్నీ శ్రీధరం తోడ్పాటుతోనే నేర్చుకుంది.

అప్పటివరకూ తనకేది కావాలన్నా నాన్న, అన్నయ్య  పెదవి విప్పి చెప్పకుండానే గ్రహించి  తెచ్చిచ్చేవారు. అమ్మయితే తను ఇద్దరి పిల్లలకి తల్లయినా కూడా వాళ్ళతో పాటు తనని కూడా ఒక పాపగానే చూస్తూ అన్నీ నోటి దగ్గరికి అందించేది. కాని ఇప్పుడు ఆ తల్లే ఏమీ తెలీని చంటిపాపాయిగా మారిపోయింది. తనమీద ఒక్కసారిగా ముగ్గురు పిల్లలను చూసుకోవలసిన బాధ్యత మీదపడినట్టయింది.

శ్రీధరం చెప్పిన మాటల వల్ల అలా కూడా  అనుకోబుధ్ధికావటంలేదు. ఇన్నేళ్ళు నిన్ను చిన్నపిల్లలా చూసుకున్నావిడకి అనుకోకుండా ఇంత విపరీతం జరిగితే ఆవిడని నువ్వింకెంత జాగ్రత్తగా చూసుకోవాలో ఆలోచించు  అంటూ తనకి చేతనైనంత తనూ సాయం చేయడం మొదలుపెట్టాడు.

ఈ రెండేళ్ళనుంచీ తన షెడ్యూల్ అంతా మార్చేసుకుంది. స్కూల్ నుంచి పిల్లల్ని తెచ్చుకునే బాధ్యత శ్రీధరం తనమీద వేసుకున్నాడు. అమీర్ పేటలో వుండే తను , హిమాయత్ నగర్ లో స్కూల్ లో పనిచేస్తోంది. రోజూ స్కూల్ అవగానే ఇంటికొచ్చేసే తను , ఇంటికి రాకుండా ఉప్పల్ లో వున్న తల్లి దగ్గరికి వెడుతుంది. అక్కడ ఇరవై నాలుగ్గంటలూ తల్లిని చూసుకోడానికి ఒక మనిషిని పెట్టింది. అయినా సరే, రోజూ సాయంత్రం స్కూల్ అవగానే అటే పరిగెడుతుంది మనసు. తనని చూడగానే అమ్మ మొహంలో కనపడే రిలీఫ్ చూడగానే తనకే అమ్మయ్య అనిపిస్తుంది. ఏదో ఒకటి తినడానికి తీసికెడితే, ఎంతో ఆతృతగా, సంబరంగా తినేది. మనసు స్థిరంగా లేకో..ఏమో.. ఎన్ని పళ్ళు తిన్నా.. “ఇంకా లేవా..” అనేది. కడుపు నిండినట్టు కూడా తెలిసేదికాదు. చంటిపిల్లలకి చెప్పినట్టు “ఇంక చాలు..” అని చెపితే బుధ్ధిగా విని మళ్ళీ అడిగేదికాదు. కాని అమ్మకి అలాగ “ఇంక చాలు..” అని తను చెప్పలేకపోయేది. ఏదో తప్పు చేసినట్టు అనిపించేది. ఈ ఒక్క లోపం తప్పితే అమ్మకి మరేమీ విపరీత చేష్టలు వుండేవికావు. చక్కగా స్నానం చేసి, ఉతికిన చీర కట్టుకుని అలా కూర్చునేది. అంతే. ఒక మాటా వుండదు. మంతీ వుండదు. ఏదైనా పెడితే తింటుంది. లేకపోతే అడగదు. ఒక్కొక్కసారి కంచంలో పెట్టిన అన్నం కూడా రెండు మూడుసార్లు తినమని చెపితే కాని తినాలని తెలియనంత అమాయకురాలిగా అయిపోయింది. అంతకన్న ఆవిడ ఎవర్నీ ఇబ్బంది పెట్టదు.

కనీసం అలాగ కూడా రోజులు గడవకుండా ఇప్పుడు తల్లి కోసం పెట్టిన మనిషి మానేస్తానంటోంది.  ఇరవై నాలుగ్గంటలూ తల్లితో ఒకరు పక్కన వుండి తీరాల్సిన పరిస్థితి. పదిరోజుల్నించి ప్రయత్నిస్తున్నా ఎవరూ దొరకలేదు. ఇంక ఆరాత్రి శ్రీధరం అన్నాడు.

“పోనీ మీ అమ్మగార్ని ఇక్కడికే తీసుకొచ్చెయ్యొచ్చుకదా. ఎలాగూ ఆ పక్కనున్న రెండుగదుల వాటా ఖాళీ అయింది. ఇంకెవరికీ అద్దెకివ్వకుండా ఒకదాంట్లో మీ అమ్మగారుంటే, ఇంకోటి పిల్లలు చదువుకుందుకు పనికొస్తుంది. వాళ్ళు కూడా పెద్దక్లాసులకొస్తున్నారు. నీకు కూడా రోజూ బస్సుల్లో పడి అంతంత దూరం  తిరిగే శ్రమ తప్పుతుంది.”

శ్రీధరం అన్నమాటకి ఏం చెప్పాలో తెలీలేదు సరళకి.

ఒక రకంగా అతను చెప్పింది బాగానే వుంది. లంక మేత గోదావరీత లాగ తనకి రోజూ ఈ తిరుగుడు తప్పుతుంది. కాని ఇక్కడకంటే తన అత్తగారికి కష్టంకదా.. ఈ వయసులో ఆవిడ మీద తన తల్లి భారం పెట్టడం ఉచితంగా అనిపించలేదు సరళకి. అదే అంది శ్రీధరంతో.

శ్రీధరం ఇంకా హైస్కూల్ లో చదువుతున్నప్పుడే అతని తండ్రి చనిపోయాడు. అప్పట్నించీ ఉన్న స్వంత ఇంటిలో ఒకవాటా అద్దెకిచ్చి, వున్న డబ్బుని ఫిక్సెడ్ లో వేసి, దాని మీద వచ్చే వడ్డీతో శ్రీధరాన్ని చదివించి, ప్రయోజకుణ్ణి చేసి ఒక ఇంటివాణ్ణి చేసిందావిడ. ఒక్కత్తీ జీవితంలో ఆటుపోట్లని ఎదుర్కుంటూ కొడుకుని ప్రయోజకుణ్ణి చెయ్యడమంటే మాటలుకాదు. దానికోసం ఆవిడ ఎన్నో నియమనిబంధనలు పెట్టుకుంది. కొడుకుని కూడా అలాగే క్రమశిక్షణతో పెంచింది.

ఒక్క పైసాకూడా వృధాగా ఖర్చు చేయదావిడ. అలాగే ఒక్క అన్నం మెతుకు కూడా వృధా చెయ్యదు. కాంతమ్మ సరిగ్గా అన్నీ కొలిచి వండుతుంది. ఆవిడ ఎంత పెడితే అంతే తినడం అలవాటయింది శ్రీధరానికి ఒకరోజు కడుపు నిండలేదనీ, మరోరోజు అన్నం ఎక్కువయ్యిందనీ అనడు. తను ఇంతే తినాలి అన్నట్టు తినేస్తాడు ..అంతే.

పెళ్ళయ్యేక కూడా వండిందంతా తనకి, కొడుక్కి, కోడలికీ ముగ్గురికీ మూడు కంచాల్లోనూ సరిగ్గా వడ్డించేసేది ఆవిడ. కూరలు కూడా అంతే. ఎక్కడా పడెయ్యడం కానీ, మిగిలిపోవడం కానీ వుండదు.

పెళ్ళైన కొత్తలో సరళకి ఇదంతా అలవాటు లేక కొంచెం కొంచెమే తినేసి వదిలేసేది. అమ్మ కొసరి కొసరి పెట్టడం అలవాటు వల్ల ఒక్కసారి తినలేకపోయేది. కాని శ్రీధరం తల్లి కాంతమ్మ, మర్నాడు కోడలికి కూర తగ్గించి వేసేది పడెయ్యకుండా.

తినే తిండే కాదు..కట్టుకునే బట్ట, ఖర్చు పెట్టే ప్రతి పైసా ఆవిడ అజమాయిషీలో జరుగుతుందక్కడ.

మామూలుగా అయితే సరళకి ఏమీ అభ్యంతరం లేదు. పైగా ఆవిడ అంత చక్కగా కొడుకుని పెంచి, ప్రయోజకుణ్ణి చేసినందుకు కాంతమ్మ నిర్వాకానికి అబ్బురపడుతుంది కూడా..
సరళ ఆలోచిస్తున్నది ఒక్కటే. ఇంకా ఈ వయసులో కూడా ఆవిడ తన ఉద్యోగం వల్ల మనవళ్ళని చూసుకోడం తప్పటంలేదు. పొద్దున్న ఇంట్లో వున్నంతసేపు ఆవిడకి ఎంత సాయం చేసినా, సాయంత్రం తను తల్లిని చూసుకుని వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది. సాయంకాలమనగా వచ్చిన పిల్లలకి కాస్త తినడానికేదైనా పెట్టి, వాళ్ళని చదువుకుందుకు కూర్చోపెట్టడమంటే అంత చిన్న విషయమేవీ కాదు. దానికావిడ పాపం ఏమాత్రం విసుక్కోకుండా చేస్తోంది.

అటువంటప్పుడు ఇప్పుడు ఏపనీ చేయలేని, మతి సరిగా లేని తన తల్లిని కూడా తెచ్చి ఆవిడ నెత్తి మీద పెట్టడం ఏం బాగుంటుంది.. సరళకి ఆ మాట అస్సలు నచ్చలేదు. అదే చెప్పింది శ్రీధరంతో.

“మరింక మనిషి దొరకకపోతే ఏం చేస్తావ్?” అనడిగేడు.

“అదే అర్ధం కావటంలేదు. ”

“పోనీ..ఏదైనా హోమ్ లో చేరుస్తావా..?” మళ్ళీ అడిగేడు.

ఆ ఊహకే కడుపు లోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చేసింది సరళకి.

చిన్నప్పట్నించీ అబ్బరంగా తనని కని, పెంచిన తల్లిని అనాధ లాగ అలా హోమ్ లో పెట్టడం అనుకుంటేనే బాధేస్తోంది. రాత్రి పడుకున్నప్పుడు తండ్రి కలలో కొచ్చి, “ఇలా చేసేవేంటమ్మా..?” అని అడిగినట్టు అనిపించి ఉలిక్కిపడి లేస్తోంది.

“పోనీ ఉద్యోగం మానేస్తేనో”.. అనుకుంది.

కాని ఏదో వేన్నీళ్ళకి చన్నీళ్ళలాగ శ్రీధరం తెచ్చే డబ్బు ఇంటి ఖర్చులకి వాడుకుంటూ, తన జీతం రేప్పొద్దున్న పిల్లల చదువులకీ, పెళ్ళిళ్ళకీ అని ఒకచోట చేరుస్తోంది. ఇదీ తన అత్తగారిచ్చిన సలహాయే.

సంసారంలో ఖర్చులకి అంతు ఉండదనీ, సంపాదించుకుంటున్నప్పుడే  కొంచెమైనా దాచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందవుతుందనీ కోడలికి చెప్పిందావిడ. వేరే వ్యాపారాలూ, వ్యవహారాలూ లేవు కనుక ఉన్నదానినే జాగ్రత్త చేసుకోవాలని హితవు చెప్పిన అత్తగారి మాట శిరోధార్యమైంది సరళకి. అందుకని ఉద్యోగం మానలేదు.

ఇంక ఏదారీ కనపడక శ్రీధరం చెప్పినట్టే చెయ్యక తప్పలేదు సరళకి. దానికి సరళ అత్తగారు కాంతమ్మ కూడా సమర్ధించింది. ఆవిడంతట ఆవిడే సరళతో చెప్పింది.

“సరళా, అబ్బాయి చెప్పినట్టు చెయ్యమ్మా.. మతిస్థిమితం లేనంతలో ఆవిడ ఎవర్నీ తిట్టదు, కొట్టదు కదా. అందరికీ వండినప్పుడే ఆవిడకీ ఇంకో గుప్పెడు బియ్యం ఎక్కువేస్తే సరిపోతుంది. ఆవిడని ఇక్కడికి తెచ్చుకుంటే ఆ ఇంటికి అద్దే వస్తుంది. పైగా నెల నెలా ఆవిడకోసం మనిషికి పెట్టే  డబ్బూ మిగులుతుంది. నీకు కూడా స్కూల్ లో ఆవిడ గురించి టెన్షన్ వుండదు.”

పైకి చూడ్డానికి అన్నీ బాగానే వున్నాయి. శ్రీధరం, అత్తగారూ కూడా సమస్యని సానుభూతి తోనే పరిష్కరించారు.

కాని, సరళకే… ఏమిటో.. అత్తగారి దగ్గర తల్లిని వదలాలంటే మనసు ఒప్పుకోవటంలేదు. ప్రతీ చిన్న విషయాన్నీ సున్నితంగా అలోచించే దృష్టి తల్లి దయితే.. అదే విషయాన్ని ప్రాక్టికల్ గా అలోచించే మనిషి కాంతమ్మ. ఇద్దరి మనస్తత్వాలకీ చాలా తేడా వుంది. మెదడుతో అత్తగారు ఆలోచిస్తే, మనసుతో తల్లి ఆలోచిస్తుంది. రాగద్వేషాలు లేకుండా ప్రాక్టికల్ గా అత్తగారు ప్రవర్తిస్తే, ప్రతి చిన్న విషయాన్నీ మనసుకి పట్టించేసుకుని బాధ పడిపోయే మనస్తత్వం తల్లిది. తనకి కావల్సినదానికోసం శత్రువుతో నైనా మంచిగా మాట్లాడి పని చేయించుకునే తెలివితేటలు అత్తగారి వయితే, తనకి ఏమైనా కావాలని కూడా తెలియని మనసు ఆ పిచ్చితల్లిది.

ఎంత మనసు ఒప్పుకోకపోయినా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సరళకి తల్లిని తెచ్చుకుని ఇంట్లోనే వుంచుకోక తప్పలేదు.

ఇంట్లో తల్లి ఒంటరిగా లేదు, ఏమైనా అయితే చూసుకుందుకు ఆ ఇంట్లో అత్తగారు వుంది అన్న ఒక్క విషయమే సరళని స్కూల్ లో శాంతిగా వుండనిస్తోంది. ఉదయం స్కూల్ కి వచ్చే ముందే పిల్లలతో పాటు తల్లికి కూడా ఏమైనా తినడానికి పెట్టి వద్దామంటే అంత ఉదయమే ఏడుగంటలకే ఏమీ తినలేకపోతోంది. ఇది చూసిన కాంతమ్మ తను తింటున్నప్పుడు తాయారమ్మకి కూడా పెడతానన్నట్టు చెప్పింది. అలాగే జరుగుతోంది.

కాని కాంతమ్మ పెట్టిన అన్నం తాయారమ్మ ఒక్కొక్కరోజు తింటోంది.. ఒక్కొక్కరోజు ఆ కంచం అలాగే వుంటోంది. ఈ మధ్య వారంలో రెండుమూడుసార్లు సరళ సాయంత్రం వెళ్ళేసరికి తాయారమ్మ గదిలో నిండుగా వడ్డించిన కంచం అలాగే వుంది. చుట్టూ చీమలు పట్టేసి వున్నాయి. తాయారమ్మ ఒళ్ళు తెలీకుండా నిద్రపోతోంది. నీరైపోయింది సరళ. పోనీ మళ్ళీ అన్నం తెచ్చి పెడదామంటే కాంతమ్మ సరిగ్గా సరిపడా వండి అందరికీ సద్దేస్తుంది. ఇంక తిందామన్నా ఇంట్లో అన్నం వుండదు. మళ్ళీ రాత్రి వంట అయాక తీసికెళ్ళి దగ్గర కూర్చుని తినిపించేది సరళ. అప్పటివరకూ తల్లి తాయారమ్మ కన్న ఎక్కువగా అత్తగారు కాంతమ్మ వంట ఎప్పుడు పూర్తి చేస్తుందా అని సరళ కొట్టుకుపోయేది.

ఆరోజు స్కూల్ లో పిల్లలకు పరీక్షలుండడం వల్ల సరళ రోజూ కన్న తొందరగా స్కూల్ కి వెళ్ళిపోయింది. అప్పటికింకా కాంతమ్మకి వంట అవలేదు. ఈ ఒక్కరోజుకీ వచ్చి తింటానని చెప్పి వెళ్ళిపోయింది సరళ.

స్కూల్ లో పరీక్ష అయ్యాక మేనేజ్ మెంట్ టీచర్లందరికీ మీటింగ్ పెట్టింది. అది పూర్తయేసరికి  సాయంత్రం అయిపోయింది. పొద్దున్న తాగిన కాఫీ సరళకి అంతే.. ఆ స్కూల్ లో ఏమైనా కొనుక్కుని తిందామన్నా కూడా దొరకవు. పరీక్ష అవగానే ఇంటికి వెళ్ళిపోతే బాగుండును.. కాని ఈ మీటింగ్ వల్ల మరీ ఆలస్యమయింది.

ఉదయం నుంఛీ కడుపులో ఏమీ పడకపోవడం వల్ల లోపలంతా తిప్పుతున్నట్టుగా వుంది సరళకి. ఇంటికి రాగానే గబగబా కాళ్ళూ చేతులూ కడుక్కుని వంటింట్లో కెళ్ళింది సరళ. అప్పటిదాకా సరళ ఎప్పుడొస్తుందా అని చూస్తున్న కాంతమ్మ సరళ రాగానే తలుపులు చూసుకోమని చెప్పి గుళ్ళొ పురాణం వినాలంటూ వెళ్ళింది. వంటింట్లో కాంతమ్మ తనకోసం మూతపెట్టి వుంచిన అన్నం కంచంలో పెట్టుకుని తినబోతూ ఎందుకో తలెత్తి చూసిన సరళకి తల్లి తాయారమ్మ కిటికీలోంచి చూస్తూ కనపడింది. ఒక్క ఉదుటన తల్లి గదిలోకి వెళ్ళింది సరళ. ఆవిడ భావరహితంగా కూతురినే చూస్తోంది. తాయారమ్మ తిన్న కంచం కోసం చూసిన సరళకి అక్కడే ఒక పక్కన నిండుగా వున్న ఆ కంచం కనిపించింది. దగ్గరికెళ్ళి చూసింది. ఎప్పుడో పొద్దున్న కంచంలో పెట్టిన అన్నం, కూరా గాలికి ఆరిపోయి, ఎండిపోయినట్టు వున్నాయి. అన్నం చుట్టూ చీమలు చేరి అది ఒక చీమల పుట్ట లాగా కనిపిస్తోంది. అంటే అత్తగారు ఆవిడ పధ్ధతి ప్రకారం తాయారమ్మకి అన్నం వండి పెట్టేసారు.. అంతే.. అది ఆవిడ తిన్నారో లేదో చూసుకోవలసిన అవసరం ఆవిడకి లేదు. ఆవిడ పని అయిపోయింది అంతే. అది చూస్తుంటే సరళకి కడుపు తరుక్కుపోయింది. ఎవరిని తప్పు పట్టాలో తెలీలేదు.

“ఆకలేస్తోందా… అన్నం తింటావా..” తల్లిని నెమ్మదిగా అడిగింది.

“పెడతావా…?”

అంతకన్న నెమ్మదిగా తాయారమ్మ అడిగింది.

పొంగుకొచ్చే దుఃఖాన్ని అదుముకుంటూ, కంచంలో పెట్టుకున్న అన్నాన్ని తెచ్చి, కొంచెం కొంచెంగా తల్లి నోటికి అందించింది సరళ..

ఆతృతగా తింటున్న తల్లిని చూస్తుంటే కడుపు నిండిపోయింది సరళకి…

కడుపునిండిన తాయారమ్మకి కన్ను మడతపడింది.

నిద్రలోకి జారిన తల్లిని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి ఇవతలికి వచ్చిన సరళకి పిచ్చి పట్టినట్తైంది.

ఏం చెయ్యాలో తెలీలేదు. తన భర్తని చూసుకుందుకు అతని తల్లి వుంది. తన పిల్లల్ని చూసుకుందుకు వాళ్ల తండ్రి వున్నాడు. తనని చూసుకుందుకు భర్త వున్నాడు. మరి తన తల్లిని చూసుకుందుకు తను తప్పితే మరెవరూ కనిపించలేదు సరళకి.

“ఎంత డబ్బుంటే అంతలోనే గడుపుకుంటాను. ఏడాదికి ఒక్క బట్టే కొనుక్కుంటాను. అంతగా అయితే ఒక్కపూటే తింటాను. అంతేకాని అమ్మని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఎక్కడికీ పోను” అని నిర్ణయించేసుకుంది.

మళ్ళీ మనసు మారిపోకుండా వెంటనే ఒక కాగితం తీసుకుని తన ఉద్యోగానికి రాజీనామా రాసేసింది.

తేలికపడిన మనసుతో తల్లికి చల్లగాలి తగలకుండా జాగ్రత్తగా దుప్పటి కప్పింది సరళ.

***