మరొక ప్రయాణం మొదలు

1vadrevu

ఏప్రిల్ సాయంకాలం. కురిసి వెలిసిన వాన .

కనుచూపు మేరంతా ఒక ప్రాచీన నిశ్శబ్దం,

కరెంటుపోయింది. ఇంకా ఎలక్ట్రిక్ తీగలు పడని

నీ చిన్నప్పటి గ్రామాల వెలుతురు నీ చుట్టూ.

 

ఆకాశానికి అడ్డంగా పిండి విదిలించి చెట్ల

కొమ్మలమీద ఆరేసిన ఎండ.ఆకులకొసలు

కురుస్తున్న కాంతితునకలు, రోడ్లమీద

మళ్ళా మనుష్యసంచారపు తొలిక్షణాలు

పల్చనిగాలిలాగా చీకటి. అపార్టుమెంట్ల టవర్లు

ఎక్కుతూ పున్నమిచంద్రుడు. ఎవరో సైగ

చేసినట్టు మేడపైకి వెళ్తావు,పిట్టగోడదగ్గర

కుర్చీలాక్కుని కూచుంటావు, మళ్ళీ కిందకి.

 

నీకు చాలా ఇష్టమైన మనిషి ఇంటికివచ్చినట్టు

నీలో ఒక కలవరం. సంభాషణ మొదలుపెట్టలేని

అశక్తత. వినాలో మాట్లాడాలో అర్థంకానితనం

ఏదో పుస్తకం తెరిచి పుటలు ఊరికే తిరగేస్తావు

 

నీలో ఏదో జరుగుతోందని నీకు తెలుస్తుంది

మళ్ళీ పైకి వెళ్తావు, మేడమెట్లమ్మట విరిగి

పడుతున్న అలలు. తళతళలాడే నీడలమధ్య

నావలాగా డాబా. మరొక ప్రయాణం మొదలు.