శాంతికీ కాంతికీ లోగిళ్ళు!

 

chettinadu-mansion

తుప్పరలతోబాటు వీచిన గాలి కి గోధూళి అలుముకుంటుంది. ఉరుములు మెరుపులతోబాటు చిలికిన జల్లులకి కోనేరు నిండిపోతుంది. అప్పటిదాకా ఆడుకుంటున్న పిల్లల ఆటవిడుపుకి మరో నిర్వచనం వచ్చి చేరుతుంది. వడివడిగా ఎవరిళ్లకు వారు పరిగెడతారు.   అల్లిబిల్లి ఆడుతూ మండువా లోగిళ్లలోనూ, పూరిళ్ల చూరు కిందనూ వాననీటిని ఒడిసిపట్టుకున్న చిట్టి ఆటల చేతులు! వాననీటికి మట్టిమిద్దె గంధపు పవనాలు! వాన వస్తే ఇంటికి రావాల్సిందే!

కార్తీక దీపంతో చలికాచుకుంటుంది తులసికోట. చేమంతులు పూసే హేమంతవేళ…. వెన్నెల్లో .. గోరుముద్దలు తినిపిస్తుంటే పెరడంతా తిప్పే పిల్లలు ఆ చిట్టి చేమంతుల్లా విరగబూస్తారు! అయినా చలిగాలులు ఊపేస్తుంటే ఆ సుకుమారమైన  పూలకు, మొక్కలకు ఉన్న శక్తి బలవంతులైన మనుషులకెక్కడ ఉంటుంది? వణికే చల్లటిగాలులకు వెచ్చదనాన్ని అందించే కంబళి ఇల్లు!

పేరుకు మధుమాసం.  వసంతమే కానీ, మండిపడే సూర్యుడికీ, వడగాడ్పులకీ మామిడిపండ్లు, తాటిమున్జెలు తట్టుకునే ఉపాయాన్ని చెప్తాయి. అ ఊరటతో ఇంట్లోనే సాయంకాలందాకా ఇంటి ఆటలు,  గిల్లికజ్జాలతో సరిపోతుంది పిల్లలకి. పగలంతా ఇల్లే బుజ్జగించి కూర్చోబెడుతుంది.

ఇల్లు….. ఋతువులకనుగుణంగా, ఆదరాభిమానాలు అను-గుణాలకు మరోరూపంగా ఉండేది!  బంధుమిత్రుల్ని ఆదరించేది! ఎంత చిన్న ఇల్లైనా ఎంతమందివచ్చినా పుష్పకవిమానంలా మరొకరికి చోటునిచ్చేది! పదిమందికిపైగా కూర్చోబెట్టుకొని కబుర్లాడిన అరుగులు! పెళ్ళిల్లు జరిగినా, పేరంటాలు జరిగినా  గొప్ప వేదిక అరుగు!ఆటలు ఆడినా, పాటలు నేర్చినా ఈ అరుగు ఆసరా.

ఈ ప్రహరీ గోడల్లోనే జాజులు పూయించినా, సంపెంగలు పూయించినా  అరటిపాదులు వేసినా, కూరమళ్లు నాటినా అదో గొప్ప విజయం!

ఈ అంగణంలో కల్లాపి జల్లి ముగ్గులు దిద్దినా, చిన్నిపాపలు దోగాడినా అదో మురిపెం!

శుచిగా, రుచిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకునేందుకు అనువైన మట్టి కుండలు; కంచు,  ఇత్తడి, రాగి, ఇనుప వస్తు సామాగ్రి; రాతి తో చేసిన చిప్పలు, తిరగళ్లు, రోళ్లు;  వెదురు పుల్లలతొ అల్లిన బుట్టలు..ఇవన్నీ వంటింటి ఆరోగ్య సంపత్తులు!

పాడిపంటలకు, వృత్తి ప్రవృత్తిలకు అనుగుణమైన వెసులుబాటు ఉన్న ఇల్లు! .ఒకవైపు ఆవులు దూడల చావిడి మరోవైపు నట్టింట ధాన్యపు గాదెలు లేదా గరిసెలు!

ఇల్లు పుస్తకాల నిలయం! మంచి ఙ్ఞాపకాల చాయాచిత్రాల సమాహారం! లోపల దూలాలు, వాసాలతో ఉన్న ఇంటిపైకప్పు లోపలిభాగం , దూలానికున్న ఇనుప కొక్కేలకు తగిలించిన ఉయ్యాలబల్ల గొలుసులు, అమరిన ఉయ్యాలబల్ల, లాంతర్లు వేలాడదీసే ఇనుపరింగులు, పిచ్చుకలు ఉయ్యాలలూగే ఇనుపరింగులు,   ఆ  రింగు కు వేలాడుతున్న ఒక తీగకు గుచ్చిన ఉత్తరాల కట్ట తో ఎంత కళాత్మకం!

ఒక్కసారి ఇటువంటి ఇంటి ముంగిట్లోకి అడుగుపెట్టినట్లు ఊహించుకుంటే..సెపియా వర్ణ  యుగంలోకి అడుగుపెట్టినట్లుంటుంది.

ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తమ చిన్నప్పటి అనుభవాలే!

కానీ ఇంతటి ఆనందమైన , కాంతిమయమైన అనుభవాలన్నీ ఎకోఫ్రెండ్లీ నిర్మాణాలతో కూడినవే!

అవును..గచ్చుఇళ్లు, బంకమట్టి ఇళ్లు ప్రకృతితో మేళవింపు కలిగి, నివసించేవారిక్కూడా మేలుచేసేవి.

కొన్ని దశాబ్దాల కిందటిదాకా కూడా సంప్రదాయాలకు లోబడే ఇల్లు రూపుదిద్దుకునేది.  అక్కడక్కడే లభ్యమయ్యే పదార్ధాలతోనే అక్కడక్కడి వాతావరణానికి అనుకూలంగానే కట్టబడేది. మార్పు చాలా సహజం.కొండగుహల్లో తలదాచుకున్న మనిషి అద్భుతమైన సౌధాలని నిర్మించలేదూ!?

కౌరవుల రాజధాని నగరంలో ఇళ్లు రెల్లుగడ్డిపై తాపడం చేసిన బంకమన్ను భవంతులు. అని మా పితామహులు చెప్పారు.

512px-dakshina-chitra-kerala-house

హంపి కట్టడాలు – లోటస్ మహల్, ఉదయపూర్ రాజస్థాన్ నీర్ మహల్, త్రిపుర  నీర్ మహల్….రాజులు, జమీందారుల వాతావరణ అనుకూల కట్టడాలు, ఆ కాలపు సాంకేతికత మనల్ని అబ్బురపరుస్తాయి.  ఏన్నో పురాతన హవేలీలు ఉత్తరభారతమంతటా నిలువెత్తు నిదర్శనాలుగా అనిపిస్తాయి. కొండరాళ్లని తొలిచి నిర్మించిన కోవెళ్లలో , చారిత్రిక  కట్టడాలలో, పురాతనంగా నిర్మించబడిన  గుడి, మసీదు, దర్గా, చర్చి లాంటి దేవాలయాల్లో కూడా చల్లటిగాలులు ఒదిగి ఒదిగి వీస్తాయి.  చిన్ని పూరిళ్లలోనూ, మట్టిమిద్దెల్లోనూ, పెంకుటిళ్లలోనూ అవే చల్లటిగాలులు ఆప్యాయంగా  వీస్తాయి. కలిమి లేముల ప్రసక్తి ప్రకృతికి లేదు కదా! ఆంతా సమానమే దాని దృష్టిలో!

సామాన్యమానవుడైనా, ఎంత గొప్ప మహారాజైనా వాతావరణనికి అనుకూలంగానే నిర్మించాడు కదా!

సామాన్యుడి ఇంటి గోడలు బంకమట్టిలో, వడ్లపొట్టు ని కలిపినవి అయితే, కలవారి ఇంటి గోడలు  ఎండిన లేదా కాల్చిన మట్టి ఇటుకలతో ఉండేవి!  అయితే ఇద్దరి ఇళ్ల గోడలకి మాత్రం  సారూప్యంగా సున్నపురాయి పూత ఉండేది.  సున్నపురాయి క్రిమి కీటకాలను రానీయకుండా చేయటమేగాకుండా ,  సూర్యకాంతిని పరావర్తనం చేసే శక్తి కలిగుండి,  వేసవిలో ఇంట్లో ఉండే  వేడి తీవ్రతని తగ్గిస్తుంది.  బాగా నూరిన సముద్రపు చిప్పల పొడి, సున్నపురాయి, బెల్లం కరక్కాయ ల మిశ్రమాన్ని కూడా గోడలకు పైపూతగా పూస్తారు. ఈ విధానం  వర్షాకాలం, చలికాలం లో ఇంటి ని తేమ  బారి నుండి కాపాడుతుంది. గోడలు చిరకాలం పాటు మన్నుతాయి. పైగా గోడలు చాలా నున్నగాకూడా ఉంటాయి.  సున్నపురాయి పూత పూసిన గోడలు వాన చినుకులు పడినా, నీటి జల్లు పడినా  పరిమళాలు వెదజల్లేవి.

నా చిన్నప్పుడు ఉలగరం గా ఉన్నట్లుంది అంటే, మా బామ్మ “నోట్లో మంచినీళ్లు పోసుకొని పుక్కిలించి గోడమీద ఉమ్మేసి వాసన చూడు” అనేది.  నీళ్లు పడగానే,  గోడనుంచి కమ్మని సున్నపు గచ్చు వాసన. గుండెలదాకా దాన్ని పీల్చటం అదో సరదా! అదో రసాస్వాదన! అదో ఆరోమా థెరపి.

ఇప్పుడేవి శోభాయమానంగా ఉండే ఈ స్వర్ణకాంతులు?

ఇప్పుడేవీ ఈ ఎకోఫ్రెండ్లీ నిర్మాణాలు అని ప్రశ్నించుకుంటే దక్షిణచిత్ర అని చెప్తుంది మనసు రూఢీగా!

దక్షిణచిత్ర  Deborah Thiagarajan స్థాపించిన , చారిత్రిక జీవనశైలిని ప్రతిబింబించే పద్ధెనిమిది ఇళ్ల సముదాయపు హెరిటేజ్ మ్యూజియం. architects : Laurie Baker,  Benny Kuriakose .

ఇది ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణమైన  గృహాలను తరలించి , పునర్నిర్మించిన సారస్వత వైభవ చిహ్నం!  ఇది  దక్షిణభారతం లోని నాలుగు రాష్ట్రాల లోని ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, వృత్తిప్రవృత్తులకు సంబంధించిన జానపద జీవనశైలిని మన కళ్లముందు ఉంచుతుంది కాలుష్య రహితమైన వాతావరణాన్ని  గుర్తుచేయిస్తుంది. ప్రకృతి సామరస్య కట్టడాల ప్రాశస్త్యాన్ని నొక్కిచెప్తుంది.

చెన్నాపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లేదారిలో  సంప్రదాయ పురాతన భవనాలతో అలరారే దక్షిణచిత్ర ని మనం చూసితీరాల్సిందే! ఇక్కడ ప్రతిఒక్క ఇంటిలోనూ ఆయా వృత్తిపనులు కొనసగుతూనేఉన్నాయి. దీన్ని ఒక జీవనచిత్రమనొచ్చు. చెప్పానుగా సెపియా టిన్ టెడ్ కాలంలోకి వెళ్లిపోయిన అనుభూతి అని!

మొదట తమిళనాడు విభాగం  తో  హెరిటేజ్ టూర్ మొదలుపెడదాం. ఈ తమిళ ఇళ్ల నమూనాలలో  అన్నింటికంటే ఆకర్షణీయమైనది చెట్టినాడు ఇల్లు. ఇది చెట్టియార్ల మండువాలోగిలి.  స్తంభాల తో ఉండే వరండా, అరుగులు , మండువా చుట్టూ గచ్చుడాబా గదులతో,మండువా అంతా ఎర్రటి మంగుళూరు పెంకులతో ఇల్లు విశాలంగా ఉంటుంది.

చెట్టియార్ల ని నట్టుకొట్టై  చెట్టియార్లు అంటారు. వీళ్లు  వర్తకులు. బాగా శ్రీమంతులు. వాళ్ల ఇళ్లంతా బర్మా టేకు తో చేసిన సీలింగులతో ఇంటి దూలాలు, స్థంభాలేకాకుండా ఇంటిలోపలి భాగమంతా టేకుతో చేసిన నగిషీలు చెక్కిన ద్వారబంధాలు,    మార్బులు ఫ్లోరింగులతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. నగిషీలు చెక్కి, ఇత్తడి గుబ్బలు పొదిగిన ప్రధాన ద్వారము, ద్వారబంధరము పై చిక్కని నగిషీలుచెక్కిన దేవుడి బొమ్మలు ఈ దేశవాళి ఇళ్ల  ప్రత్యేకత.

చెట్టియార్ల ఇళ్లని మనం అధ్యయనం చేస్తే వీళ్లు ప్రకృతి సామరస్యంగా ఎలా ఇళ్లని నిర్మించుకున్నారో మరింతగా తెలుసుకోవచ్చు.  ఎత్తైన సీలింగులు, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే అనువైన కిటికీలు, తలుపులు అన్నీ టేకు కలపతో చేసినవే. అన్నీ . ఈ ఇంటి గదులు ప్రత్యేకమైన పూత వేయబడినవి.

కరైకుడి  అనే ప్రాంతం చెట్టినాడు. హెరిటేజ్ బంగ్లాలకు పెట్టింది పేరు

ఇవి పురాతన వైభవం, సాంస్కృతిక సంపత్తుకి ఆలవాలంగా ఉంటాయి.

agraharam

తరువాత సంప్రదాయ బ్రాహ్మణ ఆగ్రహరము. దీన్ని దక్షిణచిత్ర లో విష్ణు అగ్రహారము అని అంటారు. ఇది తిరునెల్వేలిలోని అంబూరు గ్రామపు  సంప్రదాయ బ్రాహ్మణ అగ్రహారాన్ని పోలిఉంటుంది/తలపిస్తుంది.  మద్రాస్ టెర్రస్ లు, బర్మా టేకుతో చేసిన దూలాలు, స్తంభాలు, సున్నపురాయి పూతలున్న గోడలు, సరైన గాలి, వెలుతురుల సదుపాయాలతో ఉన్న ఇళ్ల సముదాయము. అగ్రహారపు వీధి అంతా వరుస ఇళ్లతో ఒకదానినొకటి ఆనుకొని ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. ఈ వీధి చివర ఒక విష్ణు అలయం కూడా ఉంటుంది. ఈ ఇళ్లు రెండంతస్తులచిన్న భవనాలు.  కలప స్తంభాలతో అరుగు, లోపల హాలు, చిన్న గదులు, పూజగది, వంటిల్లు , పెరడు, పై అంతస్తులో గదులుంటాయి.  గాలి వెలుతురు ప్రసరించటానికి పై అంతస్తులో చిన్న కిటికీలు ఉంటాయి.   ఈ వీధికి ఒక చివర పెద్ద వేపచెట్టు నీడనిస్తూ ఉంటుంది.  ఈ వీధి ఓ  సామాజిక  జీవనచిత్రాన్ని మన కళ్లముందు ఉంచుతుంది.

ప్రతింటికీ ఉన్న అరుగు …పెద్దవాళ్లు, బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగు వాళ్లు   చర్చించిన సామాజిక, రాజకీయ విశేషాలకు వేదిక ఇదే! చిన్నపిల్లలు ఆడుకున్న  గొప్ప ఆటస్థలమిదే! చుట్టువైశాల్యం ఎక్కువగా ఉన్న అరుగుమీది స్తంభాలు దాక్కునేందుకు మంచి జాగాలు. అంతేనా

ఉదయం మొదలుకొని సాయంత్రందాకా భయమన్నదే తెలియక ఎప్పుడూ తలుపులు తెరిచుంచిన ఇళ్లలో అసంఖ్యాకమైన  పిల్లల దాగుడుమూతల ఆటకు ఎన్ని జాగాలు!  ..నట్టింటిలో ధాన్యం గాదెలు, బస్తాలు, గరిసెలు, అటకలు..ఇలాంటివెన్నో!  ఇటువంటి నేపథ్యం నుంచి ఉన్నతంగా ఎదిగిన పిల్లల సమాజం ..తలచుకుంటే చాలు ఒక రీలులా తిరుగుతుంది.   ఏవరికివారే తమ చిన్ననాటి అనుభూతుల్ని నెమరివేసుకునేలా చేస్తుంది.

మాతామహుల ఇంటికి వేసవిసెలవులకు వెళ్లినప్పుడు, మధ్యాహ్నపు వడగాడ్పులకు మమ్మల్ని ఇంట్లోనే కట్టిపడేసేంతపనిచేసేవారు. ఆంత పెద్ద మధ్యహాలు బేతంచర్ల బండలు నల్లగా నిగనిగలాడుతూ ఉండేవి. పిల్లలందరం హాల్లోనే పడిదొర్లుతుండేవాళ్లం. విసనకర్రలు తప్పించి విదుత్ పంఖాలు ఇంకా ప్రవేశిన్చని కుగ్రామమది. మరి అంతమంది  ఉన్నా ఉక్కబోత ఉండేదికాదు. ఉన్డుండి వీచే సెగ గాలులు ఇంట్లో ప్రవేశించేసరికి చల్లని సమీరాల్లా మారిపోయేవి. ఆ ఇల్లు చేసిన మాయాజాలమిది!  ఈ కబుర్లు కొరతలేనివి. వీటిని కొద్దిసేపు పక్కనపెట్టి  హోం టూర్ కి మళ్లీ వచ్చేద్దాం.

dakshinachitra-traditional-chikkamagaluru-house1

మరో ఇల్లు తమిళనాడు పట్టునేత వాళ్లది. పట్టునేత అనగానే గుర్తొచ్చేది కాంచీపురం.  కంచిపురం నుండి తరలించిన ఇంటి నమూనానే ఇది. రంగురంగు పట్టుదారాలతో మగ్గము ఉన్న లోపలి వరండా కనిపిస్తుంది.  కళకళలాడే పట్టుచీరలు, వాటిని కట్టుకునే  పుత్తడిబొమ్మలు. ఆ శోభని ఏమని వర్ణించగలం!? కళామయమైన ఈ మగ్గపు ఇళ్లు , ఆ నేతకారుల రంగులమయ స్వప్నాలకు ప్రతీకగా కనిపిస్తుంది.

ఇక మరో ఇల్లు వ్యవసాయదారుని ది. ఇది కొంచెం చెట్టినాడు ఇంటిని పోలి ఉంటుంది. ఇవే కాకుండా కుమ్మరి, మేదరవాళ్ల(బుట్టలల్లేవారి) ఇళ్లుకూదా ఉన్నాయి.  అవి బంకమట్టితో నిర్మించిన ఇళ్లు. ఇళ్ల పైకప్పుగా తాటాకులుంటాయి. ఈ ఇళ్లక్కూడా ఇంటిముందు అరుగు ఉంటుంది.

మరిక ఆంధ్రప్రదేశ్ విభాగానికి వస్తే ప్రస్తుతానికి రెండిళ్లు మాత్రమే ఉన్నాయి. వరంగల్ జిల్లా గ్రామపు ఇల్లొకటి , దాన్ని ప్రాంతీయంగా “భవంతి” అని అంటారు. ఇది చేనేతకారుల గృహం. ఇంటిముందు రెండువైపులా పొడవాటి అరుగులు ఉంటాయి. ఇంకొకటి విశాఖపట్టణ ప్రాంతపు చుట్టిల్లు అని పిలవబడే ఇల్లు. చుట్టిల్లు అంటే గుండ్రంగా ఉన్న ఇల్లు అని అర్ధం. సముద్రతీర ప్రాంతం లోని ఇళ్లు ఇలా గుండ్రంగా ఉండటం వల్ల తరచూ వచ్చే తుఫాన్ తాకిడికి తట్టుకుంటాయి. గోడలుకూడా గుండ్రంగానే ఉండి,

పూర్తిగా బంకమట్టి తో కట్టినవి.

ఇంకా మరికొన్ని ఆంధ్రప్రదేశ్ ఇళ్లను రీలొకేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రెండే ఉన్నప్పటికీ, తమిళనాడులోని అగ్రహారం, వ్యవసాయదారుడి, కుమ్మరి, మేదర, పద్మశాలీల ఇళ్ల వాతావరణమే  తెలుగునాట కూడా కనిపిస్తుంది.

ఇక కర్ణాటక గృహాల విషయానికొస్తే బాగల్ కోట్ లోని ఇల్కాల్ చేనేతకారుని ఇల్లు. పూర్తిగా బండరాళ్లతో కట్టబడింది.

ఈ ఇంటిని చూడగానే సత్రాలు గుర్తుకువస్తాయి. బన్డలు పరిచిన బండ్ల మిద్దె.  చుట్టు రాతి గోడ కలిగి మధ్యలో రాతి కూసాలు ఏర్పాటు చేసి ఆ రాతి స్థంబాల మధ్యన రాతి దూలాలను అమర్చి వాటిపై పై రెండడుగుల వెడల్పు కలిగి నాలుగంగుళాల మందం కల రాతి బండలను వరుసగా పేర్చి వాటి సందులలో సిమెంటు చేసి బండల పైన  అంతా సున్నము వేస్తారు.  కాని వీటిలో విశాలమైన గదుల ఏర్పాటు చేయలేరు. పుణ్య క్షేత్రాల సమీపాన నిర్మించిన సత్రాలు అన్నీ ఇటివంటివే. ఇవి చిరకాలము నిలుస్తాయి. త్రిపురాంతకేశ్వరుడు, , బాలా త్రిపుర సుందరి ఆలయాల ధర్మకర్త మా మాతామహులు. ఆ ఆలయకొండ దగ్గరే మా సత్రం కూడా ఉండేది.  మరి ఇటువంటి సత్రం, చుట్టూ చింతచెట్లగాలి..ఉగాది సమయంలో, ఎండ తీవ్రతని కలిగించనీయని ఈ సత్రంలో దేవుడి ఉభయం అత్యంత సందడిగా జరిపించేవారు మా తాతయ్య.

ఇల్కాల్ చేనేతకారుని ఇంటికి బండరాళ్లతో,  చెక్కతో ఉన్న ఒక పెద్ద ప్రవేశద్వారాన్ని నిర్మించారు. ఈ ఇంటిపైకప్పు  చదరమైన బండలు, మట్టి సాయంతో పేర్చబడింది.

ఈ ఇంటిలో ఏకొద్దిపాటి చెక్కను వాడినా, అదిమాత్రం వేపచెక్కనే వాడారు. ఉత్తరకర్ణాటకలో ఎక్కువగా దొరికేది వేప కలపనే. దాన్నే వాడుకున్నారు.

వేప త్వరగా పుచ్చిపోదు. ఇళ్ల కిటికీలకు, తలుపులకు, గుమ్మాలకు వాడొచ్చు. టేకుని వాడేంత ఆర్ధికస్థితి లేనప్పుడు వేపచెక్కని వాడటమే శ్రేష్ఠం.

మరొక ఇల్లు చిక్ మంగుళూరులోని సంప్రాదాయ రెండంతస్తుల భవనం. ఇది ముసల్మానుల గృహం.  చిక్ మంగుళూరు లోని కొండప్రాంతంలో సమృద్ధిగా దొరికే కలపతో నిర్మించారు. ముస్లిముల వైభవాన్ని, కొంత అరబ్, టర్కీ దేశాల వాస్తు ప్రభావాన్ని కలిగున్న 1914 నాటి కట్టడమిది.  దక్షిణచిత్రకి తరలించి తిరిగి అలాగే నిర్మించారు. దీని వరండా విల్వంపు కమానులతో, నిలువెత్తు స్తంభాలతో , అందంగా చెక్కిన ముఖద్వారంతో  ఉంటుంది.  కిటికీలు కలప, సున్నపుపూతతో అద్దిన డిజైన్స్ తో అందంగా అమరించిఉన్నాయి.  ఇంటిలోపల పింగాణీ కళాకృతులు, మేజాలు, సోఫాలతోనూ ఐశ్వర్యమయంగా ఉంటుంది.

ఇక కేరళ ఇళ్లు..వీటిగురించి తెలియనిదేముంది?  ఎర్రటి దేశవాళీ పెంకుల వాలు వసారాలతో, పైకప్పులతో ప్రతిఒక్క వాననీటిబొట్టు తిరిగి ధరిత్రిని చేర్చే సహృదయంతో ఉంటాయి ఈ ఇళ్లు.

dakshinachitra_traditional_kerala_syrian_christian_house1

ఇక్కడ దక్షిణచిత్రలో నాలుగు రకాల కేరళ ఇళ్లు ఉన్నాయి. మొదటిది సిరియన్ క్రిష్టియన్ ఇల్లు . ఇది ట్రావెంకూర్ ఇళ్ల నమూనాలా ఉంటుంది. ఇది 1850 లో కట్టబడినది. దక్షిణచిత్రలో  తిరిగి దీన్ని నిర్మించారు. ఇల్లంతా పూర్తిగా కలపతోనే నిర్మితమై ఉంటుంది.  కలప మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారిదీ గృహం. ఇ ఇంటి వరండాకి ఒక పడవ వేలాడదీసి ఉంటుంది.

ఇక పుట్టుపల్లి ఇల్లు. ఈ ఇంటిలో కలపతోచేసిన ధాన్యాగారము, ఆవుల చావిడి కూడా ఉంది. ఈ ఇల్లు కొంచెం బ్రిటీష్ వాస్తుని పోలి ఉంటుంది. తిరువనంతపురం లోని నాయర్ ఇల్లు ఇక మూడవది. ఇది కూడా పుట్టుపల్లి ఇంటిలానే ఉన్న పెద్ద భవనం. పూర్తిగా టేకుతోనే కట్టారు. ఇది దక్షిణ కేరళ ఇళ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఉత్తర కేరళలోని కాలికట్ ఇల్లు మరొకటి,  దీన్ని కంకరతో కట్టారు. ఇది ఒక మేనన్ కుటుంబానికి చెందినది.  దీని ఇంటిమండువాని  నడుముట్టం అని పిలుస్తారు. ఎత్తైన టేకు స్తంభాలతో ఇంటి మధ్య లోగిలి తో ఉంటాయి. పైనుంచి తొంగిచూసే కాంతి, ఉండుండి వీచే చల్లటిగాలి , అప్పుడప్పుడు చప్పుడు చేసే వాన చినుకులతో మంచి ఙ్ఞాపకాల్ని అందిస్తుందీ నడుముట్టం.  ఈ ఇంటినిండా చిన్న చిన్న  గదులు చాలా ఉన్నాయి. కాంతి చాయలు పరుచుకున్న ఈ నడుముట్టం వరండాలలో కేరళలో ప్రాశస్తమైన మ్యూరల్ పెయింటింగ్స్ ఉన్నాయి.

ఈ దక్షిణచిత్రని చూస్తే మళ్లీ మనకు అవసరమైన సాంఘిక, ప్రకృతిమయ జీవితం తిరిగి పొందినట్లు ఉంటుంది. పిల్లల ఆటపాటలతో , పెద్దల సామరస్య జీవన కట్టుబాట్లతో ఒకప్పుడు సామాన్య ప్రజలు  ఎలా జీవించారో తెలియచేస్తుంది.

కేరళ వాళ్లు ఇటువంటి ఇళ్లని, భవనాల్ని ఇంకా కాపాడుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఇళ్లు అడపాదడపా ఎక్కడో అక్కడ మనము పుట్టిన తెలుగునాట మొదలుకొని దేశమంతటా కనిపిస్తూనే ఉంటాయి.  స్పెయిన్, ఫ్రెంచ్ . ఫొర్చుగీసు , బ్రిటీష్ వారి వాస్తుశైలికి ప్రభావమై నిర్మించిన  హెరిటేజ్ కట్టడాలను కలకత్త, తమిళనాడు, పాండిచ్చేరి, గోవా, కూర్గ్, కేరళలలో హోంస్టే లుగా టూరిస్ట్ లకి వసతిని కల్పిస్తున్నారు. కొన్ని  హెరిటేజ్ బంగ్లాలు అధునాతన హోటళ్లుగా రుపుదిద్దుకున్నాయి. యాంటిక్ శైలికి ప్రభావితులైనవారకి  సెలవుల్లో విడిదిగృహాలవుతున్నాయి. .

ఈ దక్షిణచిత్రని సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకుంటే, చిన్నపిల్లలు సరికొత్త అనుభూతులకు లోనౌతారు.  ఉదయం నుంచి సాయంత్రందాకా తిరుగుతూ ఆ ఇళ్లమధ్య తమని తాము తిరిగి పొందవచ్చు!

గుండెలోతుల్లో నిక్షిప్తమైన ఆ రోజుల్ని కళ్లముందు తిరిగి ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది ఈ దక్షిణచిత్ర!

మున్ముందు అవసరమయ్యే ప్రకృతి సామరస్య జీవన విధానానికై కనువిప్పు కలిగించి, స్ఫూర్తిని అందిస్తుంది ఈ దక్షిణచిత్ర!

*

ధ్యానముద్రలోని తపస్వినిలా త్రిపుర!

 

చింతలచెరువు  సువర్చల

         పేరుకి భారతదేశంలో ఉన్నా  ఏడుగురు అక్కచెల్లెళ్లు, వారి కష్టసుఖాలు వారివే! వారి సాధకబాధకాలని వారే పరిష్కరించుకోవాల్సిందే! ఆ ఏడుగురిలో ఒకరైన “త్రిపుర”.. పచ్చాపచ్చని కొండలు, పురాతన రాజభవనాలతో, నొక్కులజుత్తు జడలో తెల్లచేమంతులచెండుని తురుముకున్న అమ్మాయిలా ఉంటుంది . రాచరికపు కళ ఉట్టిపడుతున్నప్పటికీ అదంతా గతకాలపు వైభవమే అని స్పష్టమౌతూనే ఉంది.  1949 అక్టోబర్‌లో  భారత దేశములో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టముతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించిన సామ్రాజ్యమిది.

త్రిపురని సందర్శించాలన్న ఆలోచన వచ్చినప్పుడు చిన్ననాట  ఎక్కడో చూసిన తెల్లని బొమ్మ లీలగా గుర్తుకువస్తుంది. పచ్చని కొండ కనుమల్లో పెద్ద తెల్లని భవనం! వెంటాడే తలపే త్రిపుర వెళ్లాలన్న ఆపేక్ష ని పెంచింది.

త్రిపుర రాజధాని అగర్తలాకి కలకత్తా మహానగరమునుండి విమానంలో పొద్దున తొమ్మిది గంటలకల్లా వెళ్లాం మేమూ మా పిల్లలు.  మేము ముందుగానే త్రిపుర ప్రభుత్వ టూరిజం లో మా యాత్రాఏర్పాట్లు చేసికొని ఉండటం వల్ల విమానాశ్రయానికి కారు తీసుకుని డ్రైవర్/గైడ్  బాదల్ దాసు వచ్చాడు.

అగర్తలా లో ముందుగా ఉజ్జయంత ప్యాలెస్ ని చూద్దురుగానీ అంటూ దాసు  నగరం నడిబొడ్డునే ఉన్న ఈ రాయల ప్యాలెస్ కి  కారుని నడిపించాడు.   దారిలో దాసు చెప్పిన మాట విని నా మనసు ఆప్లావితమైంది. అదేంటంటే ఉజ్జయంత ప్యాలెస్ కి ఆ పేరు రవీంద్రనాథ్ టాగోర్ పెట్టారుట. ఆయన తరచూ త్రిపురకు వచ్చేవారుట. రాజకుటుంబం తో   తాతగారైన ద్వారకానాథ్ ఠాగోర్ తరం నుంచీ స్నేహసంబంధాలు ఉండటమే అందుకు కారణం. రవీంద్రుని కుటుంబంతో త్రిపుర రాజ కుటుంబానికి సన్నిహిత స్నేహసంబంధాలు ఉండటం త్రిపుర చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయిన ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పుకోవాలి.  

ఉజ్జయంత ప్యాలెస్ త్రిపుర రాజధాని అగర్తలా లోని గొప్ప వాస్తుకళ ఉన్న అధునాతన రాజభవనం.  ఇది నియొ క్లాసికల్ నిర్మాణము. అంటే గ్రీకు, రోము నగర భవనాల సారూప్యతను పోలి ఉంది. దీన్ని 1901 లో అప్పటి రాజు  రాధా కిశోర మాణిక్య కట్టించాడు . అప్పుడు దీనికి అయిన ఖర్చు ఒక మిలియన్ రూపాయలు(పది లక్షలు). దీన్ని నిర్మాణాన్ని  కలకత్త మహానగరంలోని Martin & Brun Co అనే ప్రసిద్ధ భవన నిర్మాణపు సంస్థ కి అప్పగించారు. 1972 లో త్రిపుర ప్రభుత్వం, రాజకుటుంబం నుంచి రెండున్నర మిలియన్లకి(25 లక్షలతో) కొన్నది. ఈ లెక్కల ప్రకారం ఇప్పుడు మధ్యతరగతి వాళ్లు ఒక చిన్న ఫ్లాట్ ని సామాన్య పట్టణాలలో కొనుక్కొనేంత విలువ మాత్రమే!

ఇప్పుడు ఉజ్జయంత ప్యాలెస్ ని త్రిపుర ప్రభుత్వం మ్యూజియం గా మార్చివేసింది. ఇప్పటికీ రాజపరివారము, భవనపు కుడివైపునున్న చిన్న భాగంలో ఉంటోంది.

ఇది మూడు గోపురాలుండే రెండంతస్తుల ప్రాసాదం. దీనికి ఎదురుగా  రెండు కొలనులు స్వాగతం  పలుకుతున్నాయి. మేము రాజప్రాకారంలోకి అడుగు పెట్టగానే మనసుకు ఆహ్లాదాన్నిగొలుపుతూ  ప్రాంగణం లో మొఘల్ గార్డెన్స్ ని పోలిన ఉద్యానవనము, నీటి చిమ్మెరలు (fountains)ఉన్నాయి. ఓ కమ్మగాడ్పు మనసులను స్పృశించినట్లైంది. విశాలమైన మెట్లను ఎక్కి ప్యాలెస్ లోపలికి అడుగుపెట్టగానే   నూకమాను,(రోజ్ ఉడ్) శాక మాను (టేకు)  కలపలతో చెయ్యబడి,  నగిషీ చెక్కిన  వాసాలు, దర్వాజాలు, ఆర్నమెంటల్ ఫర్నీచర్ (మేజా బల్లలు, కుర్చీలు) మనోహరం గొల్పుతున్నాయి.  సమావేశ మందిరం, కొలువు మందిరం, (దర్బార్ హాల్) గ్రంధాలయం, చైనీస్ గది, ఆతిథ్య మందిరం తమ మనసుల్ని కూడా విశాలంచేసుకుని అతిథులను ఆహ్వానిస్తున్నట్లుగా కనిపించాయి. అవును మరి ఎన్ని సమావేశాలకు, అతిథి సత్కారాలకు కొలువైనవో కదా! తమ అసలు స్వభావాన్ని ఎల్లప్పుడూ ప్రకటిస్తూ, ప్రకాశిస్తూనే  ఉంటాయి మరి!

suvar1

పై అంతస్తులో ఉన్న పెద్ద హాలు అత్యంత ఆకర్షణీయం. రాజ్యాన్ని పాలించిన పూర్వ రాజులు, ఆ కుటుంబీకుల నిలువెత్తు చిత్ర పటాలు హాలంతా ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. ఈ తైలవర్ణ చిత్రాలన్నింటినీ రాజకుటుంబం ఈ మ్యూజియానికి ఇచ్చివేశారు.

ఈ మ్యూజియం లో 16 కొలువుకూటములు (Galleries)ఉన్నాయి. ప్రతి ఒక్క గదీ త్రిపుర  ముఖవైఖరులని చాటిచెపుతోంది.  ఇవన్నీ ఈశాన్య భారతదేశపు కళ, సంస్కృతి, సంప్రదాయం, చారిత్రక సంఘటనల నమూనాలు, పత్రాలు,   త్రిపుర నైసర్గిక స్వరూపము, అటవీ సంపద, సామాజిక జీవన శైలి, ఇక్కడ నివసించే విభిన్న గిరిజన తెగల గురించి చాటిచెప్తున్నాయి. శిల్పాలు, నాణాలు, కాంస్య విగ్రహాలు, చేనేత వస్త్రాలు, బంకమట్టి(టెర్రకోట) మూర్తులు, తైల చిత్రాలు, చిత్ర పటాలు, గిరిజనుల ఆభరణాలు, సంగీత పరికరాలు, జానపద కళారూపాలు, హస్తకళలు ప్రదర్శన లో ఉంచారు.

ఈ ప్యాలెస్ కి ఎదురుగా ఉన్న కొలను పక్కనే జగన్నాథ స్వామి  బరి (బడి గా ఉచ్చరిస్తారు)ఉంది.  ఈ గుడిని కూడా మాణిక్య రాజులే కట్టించారు. ఇది పైకి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తోను, ఆలయం లోపలిభాగమంతా హిందూ శిల్ప నైపుణ్యంతోనూ కనిపిస్తుంది.  మొత్తమ్మీద హేమద్ పంత్, అరబిక్ శైలి ల సంగమంగ రూపొందించబడింది. (హేమద్ పంత్ 13 వ శతాబ్దపు కన్నడవాడు, మహారాష్టలోని దేవగిరిని పాలించిన యాదవ వంశపు రాజాస్థానంలో మహామంత్రి. ఆయన మంచి అడ్మినిస్ట్రేటరే కాదు. గొప్ప ఆర్కిటెక్ట్ కూడా! కొన్ని ప్రసిద్ధ ఆలయాల రూపశిల్పి ఆయన)   పూరీలోని నీల మాధవుని విగ్రహం ఈ ఆలయం నుండే ఇవ్వబడిందట.  జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు పూజింపబడే ఆలయమిది.భక్తులు విరివిగా సందర్శిస్తున్నారు.

ప్రతిఏటా రధయాత్ర జరుపుతారు. ఆవరణలోనే రధము కూడా ఒక నిలువైన మంటపములో ఉంది. చందన పుకూర్ అనే కోనేరు కూడా ఉంది. ఇక్కడ రాధా మదనమోహనుని మందిరం కోనేటి మధ్యలో ఉంది. హంస పడవలో రాధా, మదనమోహనలు విహారం చేయించే తెప్పోత్సవాన్ని  పూజారులు నిర్వహిస్తారు. చైతన్య గౌడ్య మఠము, శ్రీల పరమదేవుని భజన కుటీరం, నాట్య మందిరం, బ్రహ్మచారులు,సాధువులుండే గదులు, భక్తుల సౌకర్యార్ధం విశ్రాంతి గదులు ఉన్నాయి. గోశాల కూడా ఉంది..   చైతన్య మఠం బ్రహ్మచారి ఒకరు మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించారు. అతనికి పాతికేళ్లు కూడా ఉండవు . తెల్లని ధోవతి, బొత్తాములున్న తెల్లని కుర్తా, కొద్దిగా క్రాఫ్, పిలక తో ఉన్నాడు. ఆలయంలో అడుగుపెడుతూనే మమ్మల్ని వేరే భాషా ప్రాంతం వాళ్లమని గ్రహించి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పలకరించాడు తమ నివాస మందిరానికి తీసుకుని  వెళ్లి మఠం గురించి, హరినామ సంకీర్తన, వైష్ణవ తత్వాన్ని, క్రిష్ణభక్తిని ప్రచారం చేయటం, భగవద్గీత, వేదాలు,ఉపనిషత్తుల సమగ్ర అధ్యయనం, పర్యావరణం లో గోవుల మహోపకారం , గో సం రక్షణ  గురించి వివరించారు. దేశవ్యాప్తంగా ఈ మఠం ఢిల్లి, హైదరాబాద్, చండీగఢ్, మధుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ మొదలైన చోట్ల తమ శాఖలు విస్తరించి ఉన్నాయని చెప్పారు.  ఇస్కాన్ కంటే ఈ చైతన్య మఠమే ముందు నెలకొన్నదని చెప్పారు. వైష్ణవ మత ప్రచారమే వీరి ముఖ్యోద్దేశం.  ఎదుటివారికి హాని చేయని , తమని తాము మూఢంగా చేసుకోనిది ఏ మతమైనా సమ్మతమే! సార్వజనీనమే కదా!

మహాత్మాగాంధీకి ప్రియమైన గీతం,  గుజ రాతీ కవి నరసింహ మెహతా రచించిన

“వైష్ణవ జనతో తేనే కహియే

జే పీడ పరాయీ జాణే రే” గుర్తొచ్చింది.

ఈ గీతానికి అర్ధం చూడండి. అందుకే గాంధీగారిని అంతగా ఆకట్టుకుంది.

“పరుల బాధలను అర్ధం చేసుకొన్న వాడే పరమేశ్వరు డైన విష్ణువుకు పరమ ఆప్తుడు .

ఇలాంటి విష్ణు జనులు విశ్వం లో అందర్నీ గౌరవిస్తారు. పర దూషణ చేయరు ,విమర్శించరు .

అందర్ని సమదృష్టి తో చూస్తారు . పర స్త్రీలు అతనికి మాత్రు సమానం . వైష్ణవ జనులు అసత్యమాడరు. పర ధనా పేక్ష లేకుండా జీవిస్తారు. వారు  సంగత్వం ,నిస్సంగత్వాలకు అతీతులు. నిస్సంగత్వం లోను స్తిర చిత్తం తో వ్యవ హరిస్తారు . వారికి ఆశా, మోసం, వంచన తెలియవు . భోగాన్ని ,కోపాన్ని విసర్జిస్తారు . అలాంటి వ్యక్తియే భగ వంతుని అర్చించ టానికి అర్హుడు .అతడే సకల మానవ జాతి ని ఉద్ద రించగలడు.”

ఈ వైష్ణవ జనులు  ప్రతిఫలాపేక్ష లేకుండా ఇక్కడ  చేస్తున్నదిదే అనిపించకమానదు .

గుడి ప్రాంగణమంతా వృద్ధులైన స్త్రీలు శుభ్రం చేస్తూ కనిపించారు.  కొంతమంది పూలమాలలు అల్లుతూ కనిపించారు. వంటశాల దగ్గర మరికొంత మంది స్త్రీలు కూరలు తరుగుతూ కనిపించారు.  స్త్రీలు, పురుషులు వృధ్ధులై, నిస్సహాయులై ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. బహుశ జగన్నాధుడు ఎంతమంది నిరాశ్రయులకు ఆశ్రయమిచ్చి కాపాడుతున్నాడో కదా అనిపించింది. దేవాలయ ప్రాంగణం లో మానవత తో  నిరాశ్రయుల్ని ఆదరిస్తున్న ఈ మఠం వారి ఔదార్యం చూస్తే వీరు భగవంతుని ప్రతిరూపాలే అనిపించకమానదు.

దర్శనం చేసుకున్నాక భోజనం చేసే వెళ్లమని మరీ మరీ చెప్పారు. అలాగేనని చెప్పి   మేము అతన్నుండి సెలవు తీసుకుని ప్రధాన ఆలయం వైపుకి వచ్చాం.  భోజనం సమయము ఇంకా కానందున , ఇంకా వేరే ప్రదేశాల్ని చూసే సమయం అవటంతో ప్రసాదం మాత్రమే తీసుకున్నాం. ఆపిల్, సొరకాయ ముక్కలతో చేసిన పెసరపప్పన్నం ప్రసాదం. (పప్పొంగలి, కదంబం ఈ రెండింటి మిశ్రమంలా ఉంది. ) చాలా రుచిగా ఉంది.

suvar2

ఉజ్జయంత ప్యాలెస్ కి ఒక కిలోమీటర్ దూరంలో కుంజబన్ ప్యాలెస్ ఉంది. మొదట దీనికి పుష్పబంత ప్యాలెస్ అని పేరు. దీన్ని మహారాజా బీరేంద్ర కిశోర్ మాణిక్య కట్టించారు. మహారాజు కళాత్మక హృదయుడు. ఈ ప్యాలెస్ రూపాన్నిఆయనే చిత్రించి మరీ  కట్టించారట. ఈ ప్యాలెస్ ప్రాంగణంలో  ఉద్యానవనాలు, పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆయన ఆహ్లాదపు విడిదిగా దీన్ని నిర్మించుకున్నారు. తమ ఆతిథ్యాలకు, ఆరామాలకు, షికార్లకు, విందులు, వినోదాలకు ఈ అంతఃపురము నెలవై ఉండేది. రవీంద్రుడు వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారు. ఈ రాజభవనపు కుడివైపు నుంచి ఉండే వలయాకారపు వసారా దీని ప్రత్యేకత. ఈ వరండా రవీంద్రుడి అద్బుతమైన గీతాలు ఎన్నింటికో పుట్టిన వేదికైంది. ఈ భవనం విశ్వకవి సృజనాత్మకతకు  సాక్షిగా, శ్రోతగా నిలిచింది.

ఈ ప్యాలెస్ ని త్రిపుర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. ప్రస్తుతానికిది రాష్ట్ర గవర్నర్ నివాసంగా మార్చారు. సందర్శకులకు అనుమతిలేదు.

ఈ భవనం పక్కనే మలంచా నివాస్ అనే భవనం కూడా ఉంది. దీనిలో భూమి లోపలి గదులు కూడా ఉన్నాయిట.

దీనికి దక్షిణంగా రబీంద్ర కానన్ అనే ఉద్యానవనం ఉంది. దీన్ని అందరూ సందర్శించవచ్చు.

ఇక్కడ రిక్షాలు చాలా తిరుగుతున్నాయి. నగరం లో అన్నీ ప్రదేశాలు అంతంత దూరంకాకపోవటంతో రిక్షాలలోనూ తిరగొచ్చు.

జగన్నాథుని మందిరం పక్కనే ఉన్న ఓ హోటెల్లో మధ్యాహ్న భోజనం చేశాక, దాసు ఉదయపూర్ కి   బయలుదేరుతున్నామని చెప్పాడు. త్రిపురలో 60 శాతం కొండలు, అడవులే ఉన్నాయి. అడవుల మధ్యలో తారురోడ్డు మీదుగా ఉదయపూర్ వైపుకి ప్రయాణం సాగుతోంది.  రోడ్లన్నీ మెత్తగా సాగే ప్రయాణానికి సానుకూలంగా ఉన్నాయి. వీటిని  “బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్”(B.R.O) వారు నిర్మించినవని దాసు చెప్పాడు.  దారిపొడవునా మంద్రంగా వినిపించే రవీంద్రుని సంగీతం. దాసు అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేం!

మధ్యలో విశ్రాం గంజ్ అనే చిన్న బస్తీ వచ్చింది. అక్కడ  తేనీరు కోసం ఆపాడు దాసు. ఇక్కడ తేనీరు తాగేదేమిటి అంటూ క్రిష్ణ రసగుల్లాలు కొనుక్కొస్తానంటూ వెళ్లారు. ప్రద్యుమ్న వాళ్ల నాన్నననుసరించాడు.ఆ చిన్న హోటెల్ పేరుని చదవాలని ప్రయత్నించాము నేను, విభావరి.  త్రిపురలో విభిన్న తెగల వారు, విభిన్న భాషలవారు   నివసిస్తున్నప్పటికీ ఎక్కువశాతం  బెంగాలీలే ఉండటం వల్ల ప్రధాన భాష బెంగాలీ నే! “కొక్ బొరొక్” భాష ఇక్కడి ట్రైబల్ లాంగ్వేజ్. మణిపురి వారు కూడా ఉండటంతో ఆ భాష కూడా ఇక్కడ ఉంది.  అయితే  షాప్స్, హోటెల్స్, కార్యాలయాలన్నిటికీ బెంగాలీ లిపిలోనే బోర్డ్స్ పై పేర్లు రాసుంటాయి.  బెంగాలీ లో రాధా అర్ధం అవుతోంది కానీ పక్కనున్న మూడు అక్షరాలేమిటో ఎంతకీ బోధపడలేదు. కృష్ణ అయితే కాదు రెండక్షరాలే కాబట్టి. “మోహన్, మాధవ్ “…అలా కనిపించటంలేవు ఆ అక్షరాలు. బెంగాలీ “మ” అక్షరం హింది “మ” కి దగ్గరగా ఉంటుంది కాబట్టి, పరిచయమే!  బుర్ర చించుకొని చించుకొని ఇక లాభంలేదని అప్పుడే వచ్చిన దాసుని అడిగాం. అది రాధా- “గోవింద్” అని చెప్పాడతను. ఆ ఆధారంతో మరికొన్ని అక్షరాలు గుర్తుపట్టే ప్రయత్నం చేస్తూ, రసగుల్లాలు ఆరగిస్తూ మళ్లీ ప్రయాణం కొనసాగించాం . సాయంత్రానికి ఉదయపూర్ తీసుకుని వచ్చాడు దాసు. ఉదయపూర్ ఒకప్పటి రాజధాని అని చెప్పాడతను.  అగర్తల రాజధానిగా మారక ముందు  గోమతీ నది తీరాన రంగమతిగా పేరుపొందిన  ఉదయపూర్ మాణిక్య రాజవంశీకులకు అధికార నివాసంగా ఉండటమే కాకుండా రాజధానిగా కూడా వ్యవహరించింది.

అతను ప్రభుత్వ అతిథిగృహం దగ్గరకు తీసుకొచ్చాడు. అదే గోమతీ నివాస్. గోమతి నది ఒడ్డున ఉన్న పట్టణం కాబట్టి దానికి గోమతీనివాస్ అని పేరు పెట్టారన్నమాట!  గోమతీ నివాస్ లో మా బస.  వెనుకవైపు చిన్న బాల్కనీ,  కొలను ముఖముగా ఉంది. రాత్రికి అన్నంలోకి బంగాళాదుంపలు చెక్కుతీయకుండానే చేసిన కూర, ఆవ పెట్టిన రుచి వచ్చింది. పెరుగు, ఏదో ఊరగాయ. పర్వాలేదు భోజనం ఆ మాత్రం దొరకటం అపురూపమని దాన్నే తృప్తిగా తిన్నాం. అక్కడ ఒక రెసెప్షనిస్ట్, ఒక అటెండర్ మాత్రమే ఉన్నారు. స్ఫోటకం మచ్చలతో, మెల్లకన్నుతో రిసెప్షనిస్ట్ భయం కలిగించేలా ఉన్నాడు. కానీ అతను మాకు అన్నం దగ్గరుండి కొసరి కొసరి వడ్డించాడు. చాలా మృదు స్వభావి. అతనికి హింది, ఇంగ్లీష్ రాదు. మాకు బెంగాలీ రాదు. మా చిరునవ్వు పలకరింపుకి, మా కృతఙ్ఞతాపూర్వక అభివాదాలకి  అతని చూపులు, ముఖాభినయంతో మార్దవంగా బదులివ్వలేకపోవచ్చు గానీ, అతని స్వభావశైలి ఆదరంగా ఉంది.

ఉదయపూర్ చాలా చిన్న పట్టణం. అంతగా ఏ సౌకర్యాలూ లేని ప్రాంతం. ఉదయాన్నే ఫలహారంకోసం అదే వీధిలో ఉన్న ఒక చిన్న హోటెల్ కి నడుచుకుంటూ  వెళ్లాం.  తండ్రీ, కొడుకులు నడుపుతున్నారా హోటెల్. ఆ అబ్బాయి 14 ఏళ్లవాడు. స్కూల్ లో చదువుకుంటున్నాడు . ఈ చిన్న హోటెల్ లో వాళ్ల నాన్నకు సాయం కూడా చేస్తాడు. అంత చిన్న వయసులో అంత బాధ్యతని ఫీల్ అవుతున్నందుకు ముచ్చటగా అనిపించింది మాకు. న్యూస్ పేపర్ని చింపిన ముక్కలలో  ప్లెయిన్ పరాటాలను పెట్టిచ్చారు. చిన్న స్టీలు పళ్లెంలో క్యాలీఫ్లవర్, కాబేజీ, దుంపలు, టమాటాల కలిపి చేసిన కూర పెట్టిచ్చారు. పరాటాలు ఎన్ని కావాలో అన్ని తినొచ్చు. మళ్లీ మళ్లీ అడిగారు. రసగుల్లాలు, సందేష్ స్వీట్స్ ఉండనే ఉన్నాయి మరి! అక్కడున్న ఒక్కటే ఒక్క చెక్కబల్లపై కూర్చుని తినేశాం. ఇవన్నీ కలిపి రెండువందల రూపాయిలు దాటలేదు. ఇదే ఆహారం మనం స్టార్ హోటల్స్ లో తింటే మనల్ని బిల్లుతో బాదేయటం ఖాయం.  మనం ఆహారాన్నే కాదుకదా అక్కడి వాతావరణాన్నీ ఆ కొద్దిసేపూ  కొనుక్కుంటాం కదా మరి!

ఫలహారం చేయటం అయిపోగానే ప్రయాణం మొదలైంది. బాదల్ దాస్ మమ్మల్ని గోమతీనది వైపుకి తీసుకెళ్లాడు. ఆ  నది ఒడ్డున శిధిలమైపోయిన ఒక కోట దగ్గర ఆపాడు. విస్మయం కలిగించిన విషయమేంటంటే  అది  మహాభారత కాలమునాటిది.  అప్పటి రాజు, సైన్యం మహాభారత యుద్ధములో కౌరవల పక్షాన పోరాడారట.

ఈకోట దగ్గరే  భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. దీన్ని  17 వ శతాబ్దం లో మహారాజా గోవింద మాణిక్య నిర్మించారు.  నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చే ‘రాజర్షి  ‘ అనే నవలలో మరియు ‘బిశర్జన్’ ( విసర్జన్) అనే నాటకం లో భువనేశ్వరి ఆలయం సజీవం గా చిత్రింపబడింది.   భువనేశ్వరీ దేవికి తరచూ మనుష్యులను బలి ఇస్తుండటం చేత రవీంద్రుడు ఆ మూఢాచారాన్ని రూపుమాపాలన్న సత్సంకల్పంతో ఈ నాటకాన్ని రచించాడు. రాజావారి సహాయం తో ఆ నాటకాన్ని ప్రదర్శించి ప్రజలను చైతన్య పరచి, చివరకు అమ్మవారి విగ్రహాన్ని అక్కడి గోమతీ నదిలో విసర్జించారు.   మనుష్యులను సాటి మనుస్యులే అమానుషంగా, మూఢభక్తితో నరబలి ఇవ్వటం ఎంత హేయం! ఒక కవికి తన ఊహల్లోను, రచనల్లోనే కాదు, లౌకిక వ్యవహారాల్లోనూ, తోటి జీవులపట్లా కారుణ్యం ఉండాలి.  రవీంద్రుడు దయామూర్తి గా ఇక్కడ కనిపిస్తారు మనకు.

ఈ ఆలయం మూడు అడుగుల మేర ఎత్తు కలిగిన వేదికపైన నిర్మించబడింది. నాలుగు భాగాల పైకప్పు, ప్రవేశ ద్వారం వద్ద స్తూపం, గర్భగుడి  ఈ ఆలయ నిర్మాణం లో ముఖ్యమైనవి. పుష్పం లా తీర్చిదిద్దబడిన రూపకాలు (Motifs), ఈ ఆలయం స్తూపాలు ఇంకా స్థంబాలు  ప్రధాన ఆకర్షణలు .గుడిలో అమ్మవారి విగ్రహం లేకపోవటం తో అప్పటినుంచి పూజల నిర్వహణా ఆగిపోయింది. ఒట్టి గుడి మాత్రమే నిలిచి చరిత్రలో ఒక సత్కార్యానికి గుర్తుగా ఉండిపోయింది.

గుడి ఎత్తైన భాగం లో ఉండటం వల్ల వెనుక భాగమంతా ఓ కోనలా ఉంది. మరి ఆ కోన నిండా కొబ్బరి చెట్లు. ఆకాశంతో కబుర్లు చెప్తున్నట్లు, పక్కనే ఉన్న గోమతీ నది నెమ్మది ప్రవాహంలో  వయ్యారంగా తమ ముస్తాబును చూసుకుంటున్నట్లు ఉన్నాయి. ఇంత పచ్చదనం త్రిపురంతా కనిపిస్తుంది మనకు.

ఇంత పచ్చని త్రిపుర పేదగానే ఎందుకు ఉండిపోయింది అన్న అనుమానం వచ్చింది నాకు. దానికి సమాధానం మధ్యాహ్నానికిగానీ తెలియలేదు. ఉదయపూర్ నుంచి నీర్ మహల్ కి వెళ్లేటప్పుడు మళ్లీ విశ్రాం గంజ్ ద్వారానే వెళ్లాల్సివచ్చింది. అక్కడ క్రిష్ణ పనిచేసే సిండికేట్ బ్యాంక్ తాలూకు ఒక శాఖ ఉంది. మేము అక్కడ ఆగాం. అందరం బ్యాంక్ లోకి వెళ్లాం. బ్రాంచ్ మేనేజర్ కలకత్తా వారు. మమ్మల్ని నవ్వుతూ ఆహ్వానించారు. టి తెప్పించారు మాకోసం  మాటల మధ్యలో అక్కడి రైతులు, ఋణాల గురించి అడిగారు క్రిష్ణ. ఆయన చెప్పిన విషయం ఆశ్చర్యం వేసింది. పంటలు అంతంత మాత్రం పండుతాయి. పాడి పరిశ్రమ చాలా తక్కువ. నీటి సమస్య పుష్కలం. ఒక్క రబ్బరు మొక్కల పెంపకం మాత్రం విరివిగా ఉంది. దానిమీదనే రైతులు లోన్లు తీసుకుంటున్నారు.

suvar3

ఉదయపూర్ కు దగ్గరలో రాధా కిషోర్ పూర్ అనే గ్రామం ఉంది .ఇక్కడే త్రిపుర సుందరీ దేవి ఆలయం ఉంది .మహా శక్తి పీఠాలలో ఒకటిగా ప్రాముఖ్యం పొందిన ఆలయం. ఇక్కడే అమ్మవారి కుడి పాదం  పడటం వల్ల శక్తి పీఠమైంది .. 1501 లో దేవా మాణిక్య వర్మ మహా రాజు ఈ ఆలయాన్ని నిర్మించి నట్లు తెలుస్తోంది .అమ్మవారి పీఠం కూర్మం ఆకారం లో ఉండటం విశేషం .అందుకని కూర్మ పీఠం లేక కూర్మ దేవాలయం అనే పేరు కూడా ఉంది .   శ్రీ త్రిపుర సుందరీ దేవి విగ్రహం సుమారు 7 అడుగుల ఎత్తులో ఉన్న భారీ విగ్రహం .ఈ విగ్రహానికి దగ్గరలో అమ్మవారిదే రెండడుగుల చిన్న విగ్రహం ఉంది .దీనిని “చోటే మా” అని భక్తులు పిలుస్తారు . ఇక్కడి ప్రసాదం-ఆవుపాలను మరగకాచి గోధుమ రంగుగా మార్చి పంచదార కలిపి చేసిన  “దూద్ పేడ్ “. యెర్ర గోగు పూలు అమ్మవారికి ప్రీతికరం గా భావించి సమర్పిస్తారు . గుడి ప్రాంగణంలో మేకలు ఉన్నాయి. బాధ కలిగించే విషయమేమంటే ఇంకా జంతు బలి ఆచారం ఉంది.

దేవాలయానికి వెనుక కళ్యాణ సాగరం అనే పెద్ద సరోవరం ఉంది ఈ సరస్సు పెద్ద ఆకర్షణ గా నిలుస్తుంది .ఇందులో లెక్కలేనన్ని తాబేళ్లు చేపలు కనిపిస్తాయి. యాత్రీకులందరూ వీటికి ఆహారంగా చిన్న చిన్న గోధుమపిండి ముద్దలు,  మరమరాలు వేస్తారు. అవి సరస్సు ఒడ్డునే అమ్ముతారు.  అక్కడ అమ్ముతున్న వారిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మూఢ నమ్మకాలని పెంచుకుని నీటిని కలుషితం చేసేది భక్త నామధేయులే!

తర్వాత మేము సందర్శించాల్సినది నీర్ మహల్. ఇది రాజా వారి వేసవి విడిది. ఇది మేలాఘర్ అనే ప్రాంతంలో  రుద్రసాగర్ అనే పెద్ద కొలను మధ్యలో ఉంది. ఈ మేలాఘర్ లో బోట్ రేస్ జరిగే జాతర ప్రతి ఏటా నిర్వహిస్తారు ఇక్కడి బెంగాలీ ప్రజలు. జాతర అంటే.. మేలా.  మేలా చేసే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని మేలాఘర్ అన్నారని అనుకోవచ్చు. ఉదయపూర్ నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాం. సాయంకాలం అవటంతో, ఈ సమయంలో అక్కడికి అనుమతించరనీ, రేపు ఉదయం దాని సందర్శనానికి వెళ్లొచ్చని చెప్పాడు దాసు. ఒడ్డునే ఉన్న సాగర్ మహల్ టూరిస్ట్ లాడ్జ్ కి తీసుకుని వెళ్లాడు. ఇది కూడా త్రిపుర టూరిజం వారిదే! దీన్ని కొత్తగా కట్టించారులా ఉంది. రూములన్నీ విశాలంగానూ, శుభ్రంగానూ ఉన్నాయి. కొన్ని గదులు నీర్ మహల్ కనిపించే విధంగా ఉన్నాయి. మేము గదిలోనుంచి బయటికి వచ్చి భోజన శాల ముందు ఆరుబయట మాకై  వేసిన నాలుగు కుర్చీల్లో కూర్చున్నాం. సాగర్ మహల్ భోజనశాల ఇంకొంచెం ముందుకు, కొలను ఒడ్డుకి దగ్గరగా ఉంది.  దీపాలు పెట్టే వేళ అయింది.  కొలను మధ్యలో ఉన్న నీర్ మహల్,  దీపాలకాంతితో నీటిమీద తేలియాడు ప్యాలెస్ లా, అదో కలల దీవిలా కనిపించింది. ఆ వెలుగులన్నీ కొలనులో కార్తీకదీపాల్లా నిర్మలంగా, నిమ్మళంగా ప్రజ్వలిస్తున్నట్లున్నాయి. ఆ దీపశిఖలకు నీలాకాశం ఎర్రబారుతోందనిపించింది. కొద్దిసేపు చూస్తూనే ఉంటే.. నిరీక్షిత లా కనిపిస్తున్న ఆ సౌధం ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్న మనస్వినీలా  అనిపించింది.  ఆ అనుభూతికి సాటి అయినది మరొకటి చెప్పలేం మన మాటల్లో!  ఆ భావుకత తీవ్రతనుండి బయట పడ్డాక, నిజంగా అక్కడేమి ఉందోగానీ అంతా మన మనసులోనే ఉంది అనుకొని నవ్వుకున్నాను.  ఏదేమైనా సరే, ఎవరైనా సరే ఈ సౌందర్యాన్ని చూడాలంటే ఓ సాయంకాలం నుండి ఉండితీరాలి.

రాత్రి భోజనం తయారని చెప్పటంతో లోపలికి వెళ్లాం. అక్కడ మాకు రొట్టెలు, మిక్స్డ్ వెజ్ కూరతో బాటు, కొద్దిగా అన్నం అందులోకి ఆవకాయ..నిజమండీ ఆంధ్రా ఆవకాయ ప్రియ వారిది వడ్డించాడు. బంగాళాదుంప కారప్పూస  కూడా వడ్డించాడు. తెలుగువాళ్లు వేపుడు, ఆవకాయ తింటారని విని ఉన్నాడట. ఆమాత్రం అతనికి తెలిసినందుకు అతన్ని మెచ్చుకోవాల్సిందే!  ఇక మన ఆవపెట్టిన కూరలు, కొబ్బరి తురుము వేసిన కూరలు,అన్ని రకాల పప్పులు, చారు,  పప్పులుసు, దప్పళం, రోటి పచ్చళ్లు, పులిహోర, చక్ర పొంగలి, పూర్ణాలు, బొబ్బట్లు ఇంకా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు.  ఇవన్నీ తింటామని తెలిసున్నట్లైతే అతనికిక  సన్మానం చేసెయ్యొచ్చు. స్వర్ణ కంకణం తొడగవచ్చు మరి!

ఉదయాన్నే చపాతీల ఫలహారం పెట్టారు. తినేసి రుద్రసాగర్ ఒడ్డుకి వెళ్లాం. మోటారుబోటులున్నాయిగానీ, మేము మామూలు పడవనే మాట్లాడుకున్నాం. పడవవారికి, వీటిని నడపటం, ఆ కొలనులో చేపలు పట్టటం జీవనభృతి. అక్కడే అమ్ముతున్న రేగుపండ్లు కొనుక్కొని పడవెక్కాం. రెండు కిలోమీటర్ల ప్రయాణం నీటిలో. రాత్రి అందంగా కనిపించిన కొలను నీళ్లు ఎంతో మురికిగా కనిపించాయి.  ఆ నీళ్లను ఎక్కడా తాకేలా అనిపించలేదు. ఎక్కడచూసినా చేపల వలలు, బురద మేటవేసిన కొలను.  రాజా తన వేసవి విడిదిగా నిర్మించిన ఈ భవనం చుట్టూ ఇంత పెద్ద కొలనుని తవ్వించాడట. రాజ పరివారం ఆహ్లాదంగా తమ స్వంత బోటుల్లో జలవిహారం చేసిన కొలను! జనాలకు చల్లటి గాలిని వీచిన కొలను!  తాగునీటిగా, చుట్టూ పొలాలకు పంట నీరుగా ఉన్న ఈ నీరు ఇప్పుడు కలుషితం. ఈ సరస్సు ఇప్పుడు చాలా నిస్సారమైపోయింది. ఇదే కొనసాగితే పర్యావరణం, టూరిజం రెండూ నష్టపోయే అవకాశం ఎక్కువగానే ఉంది. ఈ సరస్సుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అనిపించింది.

భవనం దగ్గర పడే కొద్దీ కొద్దిపాటి ఉద్విగ్నత ఉన్న మాట వాస్తవం. దర్పంగా నిలిచిఉన్న ఈ హర్మ్యాన్ని తలెత్తి చూడాల్సిందే. నీటి మధ్యలో కట్టిన నాటి వాస్తు కళా శిల్పుల నైపుణ్యానికి హాట్సాఫ్!      రాజా బీర్ విక్రం మాణిక్య డిజైన్ చేసి కట్టించిన ఈ ప్యాలెస్ కూడా  హిందూ, ముస్లిం మిశ్రమ శైలి నిర్మాణానికి ప్రతీక. ఎరుపు తెలుపుల మిశ్రమవర్ణాలతో కనిపించే ఈ భవనం ప్రధాన ద్వారం గుండా వెళితే పడమటి వైపు అందర్ మహల్. ఇందులో రాజ పరివారం నివసించేందుకు వీలుగా 24 గదులున్నాయి. కుడివైపు సాంస్కృతిక కార్యక్రమాలకోసం కట్టించబడిన ఓపెన్ ఎయిర్ థియేటర్. రాజ సైనికులు ప్రహరా కాసేందుకు వీలుగా బురుజులు, రాజ పరివారం సరస్సులో బోటులో విహారం చేసేందుకు లోపలినుంచి ఉన్న రాజఘాట్.  బురుజులు, సౌధపు పై మేడ పై కొద్దిసేపు తిరిగాం. పాతబడిన ఈ మేడ పై, పిట్టగోడనానుకుని చుట్టూ వరిపొలాలని చూస్తుంటే నా చిన్ననాట  పల్లెటూరులోని మా ఇంటి మేడపై పిట్టగోడనానుకుని మావూరి వరిపొలాలు చూసిన అనుభూతి మెదిలింది. కొన్ని అనుభూతులు అంతే..కాలంతోబాటు మనల్ని వెన్నంటే ఉంటాయి. ఏ కొద్దిపాటి సారూప్యత కనబడినా చాలు మనల్ని కదిలిస్తాయి.

ఈ భవనపు ప్రాంగణంలో కూడా మొఘల్ గార్డెన్ ఉంది. దీనికి కూడా నీర్ మహల్ అని రవీంద్రుడే పేరుపెట్టారు. ఇక్కడ జనరేటర్లు కూడా ఉన్నాయి. లైట్ & సౌండ్ షో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు .కానీ ప్రస్తుతం దాన్ని ఆపివేశారట. భవనం కూడా శిధిలావస్థలో ఉంది. కాపాడుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. త్వరగా పునరుధ్ధరణ పనులు చేపడితేనేగానీ రాయల్ హెరిటేజ్ కి గుర్తుగా మిగిలిన ఈ ప్యాలెస్ శోభ కలకాలం నిలువగలదు.

పడవదిగి ఇవతలికి రాగానే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి కనబడ్డారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామని తెలిసి చాలా సంతోషపడ్డారు. “మా త్రిపుర చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు నిజాయితీగా ఉంటారు” అని చెప్తుంటే ఆయన కళ్లల్లో మెరుపు, గర్వం కనిపించాయి. అవును, పుట్టిన గడ్డపై గర్వం, గౌరవం చూపించాలి!

పక్కనే వెదురు బొంగులతో చేసిన డబ్బాలు, ఫ్లవర్ వేజ్ లు, పెన్నులు, గ్లాసులు, బొమ్మలు అమ్మే దుకాణం ఉంది. దాంట్లో అతి తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఎటువంటి బేరం ఆడాల్సిన అవసరం లేదు. వారి కష్టానికి ఆమాత్రం మూల్యం చెల్లించాల్సిందే! అదే మన నగరాలలో పెట్టే హ్యాండిక్రాఫ్ట్స్ ప్రదర్శనలలో ఇంతకు నాలుగింతల ధరలని చెప్తారు. వస్తువులకు ముచ్చటపడితే మారుమాటాడకుండా కొనుక్కోవాల్సిందే! ఇక్కడ ఎంతో ఓపికగా వారు చేసిన కళాకృతులను చూపించాడు దుకాణాదారుడు. అతని పనితీరుని అభినందించి, చెప్పిన ధరనే చెల్లించి,  బంధువులకు, మిత్రులకు కానుకలు కొని బయటికొచ్చాం.

అక్కడ్నుంచి సెఫాహీజల వెళ్లటం కోసం ముందుకు కొనసాగాం.. సేఫాహీ జల వచ్చిందని రోడ్డు మీదనే కారాపేశాడు దాసు. అక్కడ్నుంచి లోపలికి అడవి లోనే  వేసిన తారు రోడ్డుపై నడకసాగించాం. ఒక క్రోసెడు దూరం ఆ దారిగుండా నడిచాక పేద్ద గేటు వచ్చింది. అప్పుడే డ్యూటీకి వచ్చిన అక్కడి అటెండర్ గేటు తీయగానే విశాలంగా ఆకాశంలా పరచుకున్న సరస్సు, అందులో  రోజా,ఊదా రంగుల కలబోతతో పూసిన తామరపూలు.  ఒక్కసారిగా  దేవలోకానికి తీసుకెళ్లినట్లు అనిపించింది.  అది ఓ సహజసిద్ధమైన సరస్సు. ఆ సరస్సులో కొద్దిసేపు బోటులో విహారం చేయాలనిపించింది.  అటెండర్ మాకు బోటు ఎక్కటానికి సహాయంచేశాడు. మా కలకలం వినగానే ఒక్కసారిగా ఎగిరిన పక్షి సమూహాలు  కనిపించేంత మేరకు సరసుపై ఓ అద్భుత చిత్రాన్ని రచించాయి. వింత ద్వనుల సందడిని చేస్తూ అవతలి ఒడ్డువైపుకు తరలిపోయాయి. సరసుకి ఆవలి ఒడ్డు మళ్లీ అడవే!   దూరంగా కనిపించి మురిపించిన తామరపూవులు మా విహారంలో ఎదురొచ్చి స్వాగతం చెప్తున్నట్లు తోచింది. స్త్రీ హృదయం కదూ పూవులను చూడగానే దయలేనివారిగా మారిపోయేవారం కదూ నాకూ, విభావరికి వాటిని స్వంతంచేసుకోవాలనిపించింది.  ఇవి సుకుమార పూబాలలేగానీ, వాటిని కోయాలంటే చాలా  కష్టం. సుకుమారంగా కనిపించే స్త్రీలు ఎంత ధృఢచిత్తులో, అటువంటివారికి ప్రతీకగా అనిపిస్తాయి ఇవి. బలమంతా ఉపయోగించి పీకితేగానీ రాలేదు. ప్రద్యుమ్న కోసి చెరొక కమలాన్ని ఇచ్చాడు.  మురిపెంగా అందుకున్నా. విరిసీ విరియని తామరలు ముద్దొచ్చేట్లు ఉన్నాయి. ఒక్క క్షణం మైమరచినా తర్వాత అనిపించింది …చూసినప్పటి మానసిక సంతోషం చేతికి అందాక అంత ఉండదని! కొన్నింటిని అలాగే చూసి ఆనందించాలి. పంకిలాన్ని అంటని పూలు, నీటి బొట్టుని అంటించుకోని ఆకులు!! ఎంత ఫిలాసఫీని నేర్చుకోవాలి మనం వీటి  భాష ఎరుగని బోధనలతో!

అక్కడ్నుంచి కమలా సాగర్ వైపుకి వెళ్తున్నామని చెప్పాడు దాసు.దారిపొడవునా విశాలమైన ముంగిళ్లతో, వెదురు కంచెలతో పూరిళ్లు , వాలుగా కప్పిన  రేకుల ఇళ్లు. నిజానికి రూరల్ త్రిపుర మొత్తం ఇలాంటి ఇళ్లే!  ప్రతి ఇంటి ఆవరణలో అరటి, పోక, పనస, కొబ్బరి చెట్లు.  ఇంకా పూరిళ్ల లోగిళ్లలో ముగ్గులు. దక్షిణభారతదేశంలోలా ఇక్కడా ముగ్గులు పెడతారా అని దాసు ని అడిగాను. సంక్రాంతి సమయంలో పెడతారని చెప్పాడు. అవును మేము వెళ్లింది సంక్రాంతి సమయంలోనే!

కమలాసాగర్ ఇండోబంగ్లా సరిహద్దులో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ కాళికా మాత ఆలయం, దాని కెదురుగా కమలాసాగర్ అనే పెద్ద కొలను ఉన్నాయి. ఈ కమలా సాగర్ నిండా రోజా రంగులో సంభ్రమం గొలుపుతూ కమలాలు!  విచిత్రం ఏమంటే   ఆ కమలా పుష్పాలలో సగం మన దేశానివి. మిగతా సగం బంగ్లాదేశ్ వి.  అవునండీ సరిహద్దు రేఖ అలాగే నిర్ణయించింది మరి! అక్కడే కొమిల్లా వ్యూ పాయింట్ అని టూరిజం వారి వసతి గృహం. అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఈ వసతి గృహం డాబా మీదకు వెళ్లాం. పక్కనే ఉన్న ఓ డాబా ఇల్లు, మామిడి చెట్టుని చూస్తూ నిల్చున్నాం. ఇంతలో అతి సమీపంగా రైలు శబ్దం వినిపిస్తే పక్కకు తిరిగిచూశాం. అతి దగ్గరగా వెళ్తున్న ఓ గూడ్స్ బండి..అది నిజానికి మన దేశం లోది కాదు. బంగ్లాదేశ్ లోది. పక్కనే ఇనుప రాడ్స్ తో సరిహద్దు కంచె అప్పుడుగానీ  కనిపించలేదు.   కిందకుదిగి భోజనానికి వచ్చాం. అన్నంలోకి మళ్లీ బంగాళాదుంపల కూర టమాటాతో కలిసి. ముఖం మొత్తిపోయింది. టమాటా పచ్చడి తియ్యగా ఉంది. అస్సలు తినలేకపోయాం. ఏంచేస్తాం?  .  ఇంట్లో అంతగా అనిపించకపోయినా ఇలాంటప్పుడే బయట ప్రదేశాలలో మాత్రం నాకు అనిపిస్తుంది. గోంగూర, చింతకాయో, మాగాయ, ఆవకాయో వేసుకుని ఇంత అన్నం తినాలని.  లేదూ, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలనిపిస్తుంది.  అదే చేశాం. గోధుమ వన్నెలో ఉన్న పాలకోవా, అరటిపండ్లు కొనుక్కుని తిని. కొబ్బరి బోండాలు తాగి కడుపు నింపుకున్నాం.  నిజానికి బెంగాలీ ప్రాంతాలలో శాకాహారులకు సరైన ఆహారం ఉండదనే చెప్పాలి. శాకాహారులం అని చెప్పినప్పటికీ ఎక్కడ జలపుష్పాలను వడ్డిస్తారేమోననే కంగారు.  సరే ఆ విషయం వదిలేస్తాను.

తిరిగి అగర్తలాకి వచ్చేశాం. నగరంలోకి రాగానే ఇదే S.D బర్మన్ ఇల్లు అని చూపించాడు దాసు. ప్రముఖ సంగీత దర్శకుని ఇల్లు అది. S.D బర్మన్ కొడుకు R.D బర్మన్. ఈయన త్రిపురలో ఒక రాజ కుటుంబానికి చెందినవారు. ఖగేశ్ దేవ్ బర్మన్ కూడా త్రిపుర రాజ కుటుంబానికి, బర్మన్ వంశానికీ చెందినవాడు. ఈయన ఎస్.డి బర్మన్ (సచిన్ దేవ్ బర్మన్)పై రాసిన పుస్తకం “సచిన్ కర్తార్ ఘనేర్ భుబన్” దీనికి త్రిపుర ప్రభుత్వం “సచిన్ సమ్మాన్” అనే గౌరవ పురస్కారాన్ని ఇచ్చింది. The world right of this book has been taken up by Penguin India.

చంద్రకాంత్ మురసింగ్ కూడా త్రిపురలో ప్రఖ్యాతిగాంచిన కవి. ఈయన ఇక్కడి ట్రైబల్ లాంగ్వేజ్ అయిన కోక్ బొరొక్ లో చాలా పుస్తకాలు రాశారు.  ట్రైబల్ జానపద సంస్కృతి  త్రిపురకు విశిష్టతను చేకూర్చినదని చెప్పొచ్చు.

 

ఇక త్రిపురని మాణిక్య రాజులు పరిపాలించినట్లే, త్రిపుర ప్రతిష్టని పెంచినవారు మరో మాణిక్యం..మాణిక్య సర్కార్. ముఖ్యమంత్రిగా అవినీతి రహితంగా, నిజాయితీగా, నిరాడంబరం గా ఉండే ఈయన ప్రజలు మెచ్చిన మనీషి.  దేశం మొత్తం గర్వించదగ్గ, అనుసరించాల్సిన నాయకుడు.  పుత్రోత్సాహాన్ని కలిగించిన త్రిపుర మాత ముద్దుబిడ్డ. ఈయన భార్య పాంచాలీ భట్టాచార్య ఇంటిపనులకై రిక్షాలో వెళ్తుందని అందరికీ తెలిసిన విషయమే!

సరే అసలు విషయంలోకి వస్తాను. బర్మన్ ఇంటిముందునుంచి వెళ్లి రాజా మహా బీర్ బిక్రం కట్టించిన M.B.B కాలేజ్ ముందు కొద్దిసేపు కారు ఆపాడు దాసు. పిల్లలిద్దరూ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. పాత భవనం విశాలమైన ప్రాంగణంతో, చెట్ల ఛాయల మధ్య వెలిగిపోతూ ఉంది.  ఇది 264 ఎకరాల్లో నెలకొలబడిన కళాశాల.  ఇక్కడి లైబ్రరీలో  గ్రంధాలు, జర్నల్స్ లేనివి లేవు. ప్రయోగ శాలలు, సాంస్కృతిక సమావేశాల వేదికలతో “విద్యామృతమస్నుతే” (Knowledge is the key to immortality అనే మోటో తో సాగుతున్న ఈ విద్యాలయాన్ని కలకత్తా యూనివర్శిటికీ అనుసంథానం చేసిన ఘనత త్రిపుర మాణిక్య రాణీ “కాంచన ప్రభాదేవి” దే! మహారాజు,  యువకులను మేథావంతుల్ని చేయాలన్న సత్సంకల్పానికి ఈవిడ మరింత కృషి చేశారు. ఈమె బీర్ బిక్రం మహారాజు భార్య. భారతదేశం లో విలీనమయ్యే కాలంలో త్రిపురని పరిపాలించిన ధీర! భారత విభజన సమయం లో త్రిపుర లో శరణార్ధులకు పునరావాసాల్ని కల్పించి ఈమె కీలకమైన పాత్రని పోషించింది. ఈ ధీరోదాత్త గురించి వింటుంటేనే మనసు పులకితమయింది. ఇక్కడ కాలేజీకి సంబంధించే ఈ రాజా వారు పెద్ద క్రికెట్ మైదానం కూడా ఏర్పాటుచేశారు.

అక్కడ్నుంచి వేణూబన్ విహార్ కి వెళ్లాం.

వేణుబన్ విహార్..పేరు వినగానే ఇది ఖచ్చితంగా వేణుమాధవుని ఆలయమనుకుంటారు. అవునా? కాదు. ఇది బుద్ధదేవుని మందిరం. చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంది. తీర్చిదిద్దినట్లున్న పచ్చని మొక్కలు, పసుపుపచ్చని సువర్ణగన్నేరు పూలు ఏదో దివ్యరాగానికి తలలూపుతున్నట్లున్నాయి. ఆ నిర్మలచిత్తుని నుంచి ప్రసరించే తరంగాలు ఆవరణంతా ఆవరించాయనిపించింది. కొద్దిసేపు కూర్చుని అక్కడి శాంతాన్ని మనసుకు పట్టించుకునే ప్రయత్నంలో పడ్డాం.

అక్కడ్నుంచి మా కోరికమీద “పూర్భష” కి తీసుకెళ్లాడు దాసు. అది ప్రభుత్వ చేనేత, హస్త కళాకృతుల ఎంపోరియం. పట్టు, నేత వస్త్రాలు మాత్రమే చూడాలనుకున్నాం. వస్త్ర విభాగంలోకి వెళ్లాం. ఇక్కడి ట్రైబల్ నేసిన వస్త్రాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వీరి చేనేత పని విభిన్నంగ ఉంటుంది. కొంత షాపింగ్ చేసి బయటకు బలవంతంగా వచ్చాం. అంత బాగున్నాయక్కడ. ఏది కొనుక్కోవాలో, ఏది వదలాలో తెలియదు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతపు సంస్కృతికి సంబంధించిన విశేషమైనవాటిని  కొనుక్కోటం ఆచారంగా చేసుకున్నవారిలో మేమూ ఉన్నాం. సరదాగా అంటున్నానులేండి.

ఇంకా ఇక్కడ పాత అగర్తలా చూడాలి అంటూ రాజా వారి పాత హవేలి, చతుర్దశ దేవతా ఆలయం అవీ చూపించాడు దాసు. ఈ 14 దేవతా విగ్రహాలను ఉదయపూర్ నుండి అగర్తలాకు మహారాజా వారు తరలివచ్చేటప్పుడు ఇక్కడకు వాటినీ తెచ్చి ప్రతిష్ట చేశారట.

ఆ రోజుకిక గీతాంజలి గెస్ట్ హౌస్ లో బస. ఇది అధునాతన భవనం. కుంజబన్ ప్యాలెస్ కి దగ్గరలోనే ఉంది. చాలా బాగుంది. వసతి, భోజనం అన్నీ బాగున్నాయి.

త్రిపురలో ప్రభుత్వ టూరిజం వారి వసతి గృహాలలో ఉంటూ, వారి ప్యాకేజ్ టూర్లలో వెళ్లొచ్చు. ఎటువంటి ఇబ్బందీ కలుగనీయకుండా వారు చూస్తారు.

త్రిపుర అంతా జీవ వైవిధ్యమున్న అటవీప్రాంతం. జంపూ హిల్, త్రిష్ణ  వైల్డ్ లైఫ్ సాంక్చురీలు, బర్డ్ సాంక్చురీ,   ఉనకొటి లాంటి బౌద్ధ విహారాలు ఇంకా చూడాల్సినవి ఉన్నాయి.  సమయాభావం వల్ల వెళ్లలేకపోయాం. బాదల్ దాస్  మమ్మల్ని విమానాశ్రయం దగ్గర దించాడు. అతనికి కృతఙ్ఞతలు చెప్పి,  త్రిపురని సెలవిమ్మని అడిగి విమానమెక్కేశాం. గూటికి చేరాం .

ఇంటికి వచ్చాక నెమరువేసుకుంటే ..

త్రిపుర మొత్తం కొండ-కోన, కొలను-కోటల సమాహారం. వీటన్నిటి చాయలలో ఈ బుజ్జి రాజ్యం ధ్యానముద్ర లోని ఓ తపస్వినిలా   అనిపించింది.

 

*****