పాపం పాకావిలాస్‌..!

 

కేరళా పాల్ఘాట్‌ నించి పారొచ్చేరు. తమిళ కంచినించి కదిలొచ్చేరు. కన్నడ బళ్లారినుంచి దౌడాయింపుతో వచ్చేరు. వచ్చి వచ్చి చోడవరంలో పడ్డారు. అంతా అయ్యర్ల మేళమే. ఊరి బస్టాండ్‌లో సోమయ్యరు పాల్ఘాట్‌ కాఫీభవన్‌ తెరుచుకుంది. చినబజార్‌లో తంబీ హోటల్‌ మెరిసింది. కొత్తూరులో గణపతీవిలాస్‌ గలగలమంది. లక్షిందేవిపేట సిగన కేశవ్‌కేఫ్‌ కుదురుకుంది. పోలీస్‌ ఠాణా ఎదురుగా మణికంఠా లంచ్‌హోమ్‌ రెడీ అయ్యింది.

పచ్చగా దోసపళ్లలా ఉండీవారు వచ్చిన అయ్యర్లు. విభూది పిండికట్లు ఒళ్లంతా పెట్టి, పాలతెలుపు పంచెలుకట్టి, భుజంమీద పట్టువాణీలు పెట్టి, రుద్రాక్షపూసలదండలు మెళ్లో చుట్టి, అప్పుడే కైలాసంనించి దిగొచ్చిన శంభోశంకరుని ప్రతినిధుల్లా ఉండీవారు. స్ఫటికాల్లాంటి వాళ్లరూపాలు చూసే మేం సగం పడిపోయేం. ఆనక వాళ్ల మాట తీరు మమ్మల్ని మరో సగం వొంచీసింది. వాళ్ల మర్యాద, మన్నన పూర్తిగా దిగలాగీసింది. వాళ్లు మాట్లాడే పగిలిన తెలుగు మమ్మల్ని ముచ్చటపరిచీసింది.

అయితే, వాళ్లొచ్చీదాకా మావూరి జనానికి అల్పాహారం గురించి స్వల్పంగా నయినా తెలీదని కాదు. మేం మరీ అంత దారుణంగా బతుకుతున్నామనీ కాదు. పెద్దబజార్లో పద్మనాభుని బుల్లబ్బాయి కాఫీహోటల్‌ మాకు తెలియందా. పీర్లపంజా దగ్గర్లోని కురందాసు పాపారావు పాకావిలాస్‌, ఎడ్లవీధిలో సింహాచలం నాయుడు తాటాకు వొటేలు తెలీకనా. తాలూకాఫీస్‌ పక్కనుండే అమ్మాజమ్మ టీ దుకాణం, ఫకీర్‌సాహెబ్‌పేట దార్లో ఉండే ఇప్పిలి మోహనరావు టీకొట్టూ, పూర్ణా సినీమాహాలు దరినున్న అగ్గాల సన్నాసి గొడుగుబండి మా బుర్రలో లేకనా. ఇవన్నీ  బాగానే తెలుసును. వీటన్నిట్లోనూ మేం తిన్నవాళ్లమే. కాపోతే, అయ్యర్లొచ్చేక  మా తిండి మొత్తం తిరగబడిపోయింది.

అప్పటివరకూ, పాపారావు పాకావిలాస్‌లో ముగ్గురు చేరేరంటే, నాలుగోవాడు నిలబడే  తినాలి. పదేళ్ల కిందట నేయించిన తాటాకు పైకప్పునుంచి నల్లటి నుసి గోధుమరంగు ఇడ్డెన్ల మీద పడుతున్నా భరించాలి. పోనీ అని సింహాచలం టీ దుకాణానికి వెళ్లేవనుకోండి. అక్కడ గోలెంలోని కుడితినీళ్లలాటి తెల్ల జలాల్లో అందరు తిన్న సివరి ప్లేట్లూ ముంచితీసీడవే. అన్నీ ఎంగిలిమంగలాలే. సర్వమంగళ మాంగల్యమే. అమ్మాజమ్మ టీ చిక్కం కుట్టించింది ఎప్పుడో ఎవడికీ తెలీదు. అది నల్లపీలికలా అయిపోయి మా చిన్నప్పటినించీ డికాషను ఒడకడుతూనే ఉండీది. సన్నాసి కొట్టూ తక్కువకాదు. అంచులన్నీ  చుట్టుకుపోయిన లొత్తల పేట్లుండీవి. మోహనరావు  వొటేల్లో కూర్చునీ కుర్చీకి మూడు కాళ్లు పొడవు. ఒక  కాలు కురచ. పద్మనాభునివారు ఉప్పుపిండి తప్పనిచ్చి మరోటి వడ్డిస్తే ఒట్టు. రుచుల సంగతి చెప్పుకుందావంటే అవీ నేలబారే. ఎక్కడికెళ్లినా ప్లేట్లో ఇడ్లీ పడీడం. వాటి మీద వేపిన శెనగపప్పు టుర్రు చెట్నీ పోసీడం. ఆటు మీదట పసుపుపచ్చ బొంబాయి చెట్నీ ఒలిపీడం. పోనీ అని, చెమ్చాతో తిందామని నోరుతెరిచి అడిగితే, చెయ్యిలేదేటి.. అనీది సమాధానం.  అన్ని పచ్చళ్లూ మీద పడిపోయిన ఇడ్లీలు ఎలా ఉండీవంటే, గంధాలు మెత్తిన సింహాద్రప్పన్న నిత్యరూపంలా ఉండీవి. ఏడాదికోమారయినా అప్పన్నబాబు నిజరూపాన్ని సింహాచలంలో చూడొచ్చు. మా ప్లేట్లో ఇడ్లీలెప్పుడూ మాక్కనబడిందే లేదు. అన్నీ కలిపికొట్టీసీ కావేటిరంగా అనీడవే. మూతి తుడుచుకుని పోడవే.

అట్టు విషయమైతే అసలు చెప్పక్కర్లేదు. అది మినపట్టో, రవ్వట్టో, పెసరట్టో నరమానవుడు పోల్చలేడు. ఉల్లిపాయుంటే అది ఉల్లి అట్టు. జీలకర్ర కనబడితే అది పెసరట్టు. అలా అంచనాగా అనీసుకోడవే. ఉప్మా అంటే గోడకి సినీమా పోస్టర్లు అంటించుకునీ బంకలాగుండీది. పీటీ ఉషలాగ పరిగెడుతుండీది. అయితే ఒకటి లెండి. మేవిచ్చీ పావలాకీ, బేడకీ అంతకంటే ఎవడు పెట్టగలడు లెండి. పైగా ఈ ఫలహార దుకాణాలు నడిపీవాళ్లంతాను, ఏరోజుకారోజు సామాన్లు తెచ్చి చేసీవాళ్లే.  డబ్బున్నవాళ్లేం కాదు. కాబట్టి మాటిమాటికీ కుర్చీలు కొత్తవి ఎలా కూర్చగలరు. బెంచీలు ఎలా మార్చగలరు.

అయ్యర్లు వచ్చేక మాకు కొత్త తిండి సంగతులు కొంచెంబానే తెలిసినట్టయింది. మాకు తెలీని మద్రాసు సాంబారు ఘుమఘుములు ముక్కుకు తగీలివి. వేడివేడి సాంబారిడ్లీ జుర్రుకు తినీసీవాళ్లం. సింగిలిడ్లీ.. బకెట్‌సాంబారు.. నినాదం ఒక జాతీయవిధానంగా మావూళ్లో స్థిరపడిపోయిందప్పుడే. అట్టు అనే మా మాట ఎక్కడికి పోయిందో తెలీదు. దోశ పదం దొరసానయింది. రవ్వదోశ, మావుదోశ, పెసరదోశ మాముందుకు వచ్చీవి. మామూలు ఉప్మా ఉండీదా. అది అయ్యర్ల చేతుల్లో పడ్డాక టమాటా బాత్‌ అయిపోయీదంటే నమ్మండి. ఎన్నడూ పెద్దగా ఎరగని మసాలాదోశ, తైర్‌వడ, బోండా, పొంగలి మానోటికి అందీసీటప్పటికి లజ్జుగుజ్జులు పడిపోయీవాళ్లం.

మసాలాదోశలోకి కూర ఎలా చేరిందో, గారెలోకి పెరుగు మరెలా దూరిందో, బోండాలోకి  బంగాళాదుంప ఇంకెలా చొచ్చుకుపోయిందో.. బాపతు సందేహాలతో మా ఊరి ముసిలాళ్లు కొందరు అదోలా అయిపోయీవారు. చెట్నీ వ్యవహారమూ చిన్నది కాదు. కొబ్బరి చెట్నీ అంటే కొబ్బరికాయ పచ్చడే తప్పనిచ్చి శెనగపప్పు పెద్దగా తగిలీదికాదు. వేగిన ఉల్లిపాయతో చేసిన సరికొత్త చెట్నీ చేతులోకొచ్చేక ఎవరి మాట మేం వినగలవండీ. మేమెప్పుడూ ఎరగని రసం ఉండనే ఉంది. అవియల్‌, పొరియల్‌ సిద్ధమయ్యేయి. స్వీట్లు, డ్రింకుల సంసారం గురించి చెప్పాంటే మాటలు చాలవు. జాంగ్రీలు, బాద్‌షాలు, బాదంగీర్లు రాజ్యం చేసీవి. కవురుకంపు టీలు తాగిన మాకు అయ్యరుబాబులు కమ్మని కాఫీ కప్పులు నోటికందించేరు. మా కళ్లముందే కాఫీగింజలు మిషన్లలో ఆడి ఫిల్టర్లకెత్తీవారు.

వాళ్ల శుచి, వాళ్ల శుభ్రతా మామూలేంటి. పరిమళాలు వెదజల్లే ఊదొత్తులు వెలిగించేరు. పొందికయిన కుర్చీలు వేసేరు. పాలరాతి పలకలున్న ఒబ్బిడి టేబుళ్లు పరిచేరు. తళతళలాడే స్టీల్‌ప్లేట్లు మాముందుపెట్టేరు. అందుకే, మేవంతా నిత్యమూ అయ్యర్ల హోటళ్లమీదేమీదనే ఉండీవాళ్లం. ఆ దెబ్బకి ఊరి పాకావిలాసున్నీ విలాసం లేకుండా పోయేయి. మామూలుగానే ఎప్పుడూ ఈగలు ముసురుకునీ ఈ హొటేళ్లు, ఒక్కసారిగా దోమలు కూడా తోలుకోడం మొదలెట్టేయి. ఒక్కడంటే ఒక్కడూ వాటి మొహం చూసీవాడు కాదు. అరువిద్దామన్నా వచ్చీదాతాదైవం కనిపించలేదు. మరంచేతే, అనతి కాలంలోనే, వీటిని నడిపేవాళ్లంతా  నిలువూ నిపాతంగా నీరయిపోయేరు. అడ్డంగా మునిగిపోయేరు. చెట్టోపిట్టగా ఎగిరిపోయేరు.

అయ్యర్ల భోజనసామ్రాజ్యం ఊళ్లో ఆ విధంగా నాలుగైదు దశాబ్దాలు నడిచింది. ఒక్కరిగా వచ్చిన అయ్యరు బాబులు, వాళ్ల దేశాలెల్లి పెళ్లిళ్లు చేసుకుని అడ్డబొట్టు కామాక్షమ్మల్ని తీసుకొచ్చేరు. చిమ్మిలి ముద్దల్లాంటి విశాలాక్షమ్మల్ని తెచ్చుకొచ్చేరు. పిల్లల్ని మాత్రం మావూళ్లోనే కన్నారు. వాళ్లూ చోడవరం గుంటల్లో ఒకటయిపోయేరు.

తొలినాళ్లలో వచ్చిన అయ్యర్లు,  తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం కలగలిపీసీవారు. సంకరభాషగా పనగలిపీసీవారు. ఆ తర్వాత మాత్రం మన భాషా నేర్చీసేరు. అయినప్పటికీ వారి పలుకుల్లో అరవయాస, మయాళీ ఘోష కనిపించీది. వాళ్ల  పిల్లలు మా మధ్యలో పడ్డారు కాబట్టికి, ఏట్రా, గీట్రా అని మాలానే మాటాడీవారు. అలా హాయిగా సాగిపోతున్న అయ్యర్లకి పదిపదిహేనేళ్ల కిందటినించీ గొప్ప దెబ్బతగుల్తూ వచ్చీసింది.

ఎక్కడినుంచో వెళిపొచ్చీసిన వాళ్లెవరో ఆంధ్రాలో రాజ్యం చేయడమేంటని అనుకున్నారో.. తిండికి మించిన వ్యాపారం మరోటి ఉండదని తలపోసారో.. మనవాళ్లని తినే హక్కు మనకే ఉందని భావించారో..  మనకి తెలీదు.  కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్నించి ఎవరెవరో పరుగుల మీద మావేపు వచ్చీసేరు.  రియల్‌ఎస్టేట్‌ ధర్మమాని వాళ్ల ఊళ్లో ధరలు పెరిగిన ఊర భూములు కొన్నింటిని భారీ డబ్బుసంచుకి అమ్మీసుకున్నారు. భవిష్యత్తులో బాగుపడిపోతుందనుకున్న విశాఖపట్నం ప్రాంతానికి వెల్లువెత్తీసేరు. ఉత్తరం పత్తరం లేకుండా మా ఉత్తరానికొచ్చి పడిపోయేరు.

వచ్చినవాళ్లు పట్టణాలకే కాదు. పల్లెలకీ పాకీసేరు. వాళ్లకి డబ్బంటే భయం లేదు. రిస్కంటే రస్కంత ఇష్టం. అడ్డంగా సొమ్మొచ్చి పడిపోతే ఆలోచన సరళమైపోతుంది. ఇందువల్లే, ధనాన్ని వెదజల్లీగలిగేరు. నెల్లూరుమెస్‌ అన్నారు. బెజవాడహోటల్‌ అన్నారు. గూడూరుసదన్‌ అన్నారు. గుంటూరుగృహ అన్నారు. ఒంగోలు కాఫీహౌస్‌ అన్నారు. మెస్‌ మీద మెస్‌ పెట్టీసేరు. మెస్సు సంస్కృతి మాకు మప్పీసేరు. నీరు పల్లమెరుగు. నీరు లాంటిదే పెట్టుబడీను. దానికీ పల్లమే తెలుసు. పల్లంలోకి ప్రవహించి పదింతలు కావడమే తెలుసు. చోడవరం కూడాని పల్లంలోనే ఉంది కదేంటి.

మెస్సు వస్తాదులు వస్తూవస్తూ కొత్తరుచులు వెంటతెచ్చీసేరు. మా అయ్యర్లకి బొక్క బద్దలయిపోయింది. విజయవాడ ఉలవచారు ముందు చెన్నై సాంబారు చెదిరిపోయింది. గుంటూరు గోంగూర దెబ్బకి అవియల్‌ అయిపులేకుండాపోయింది. కృష్ణా పులుసుకూరలు హూంకరించీసరికి పొరియల్‌‌ పులిసిపోయింది. నెల్లూరు మొలకొలుకుల ముంగిట కళింగ హంస బియ్యాలు  కడదేరిపోయేయి. ఎర్రగా వర్రగా నోటికి తగిలే అల్లం పచ్చడి ముందర మద్రాసు శాకం చిన్నబోయింది. ఫ్రైకర్రీ ముఖం చూ సీసరికి అరవ కొబ్బరికూర హడలెత్తిపోయింది. చుక్కకూర పప్పు పుల్లపుల్లగా విరగబడ్డంతో అయ్యరుగారి ముద్దపప్పు ముణగదీసుకుపోయింది. చివరాఖరికి, చవులూరించే సరికొత్త పాకం ముందు పాల్ఘాట్‌ పడకేస్సింది.  అయ్యర్లు వెజిటేరియన్లు. మెస్సుయితే నాన్‌ వెజ్జూ వడ్డించగవు. అయ్యర్లకి అరువివ్వడం భయం. మెస్సులు అరువు ఇవ్వాగగలవు.  అరిచి రిచి వసూలు చేసుకోనూగలవు. దానాదీనా, ఊరి జనం నాలుకలన్నీ కొత్తవేపు మొగ్గుచూపించేయి. మా అయ్యర్ల హోటళ్లన్నీ బోసిపోయేయి. లాభం లేకపోతే పోయే. నష్టాలు తగులుకోడం మొదలయ్యింది.

మావూళ్లో అయ్యర్లు ఎంత సంపాదించుకున్నా ఎప్పుడూ గజం భూమి  కొనలేదు. మెస్సు మారాజులు అలా కాదు. రూపాయొచ్చినా స్థలాలే కొనీవారు. మజ్జిగచార్లు గట్రా మాచేత మట్టసంగా తాగించీసి, మాభూములే క్రయిచీటిలు రాయించీసుకునీవారు. ఇంకోమాట ఏంటంటే, అలగ.. ఇలగ.. ఎలగ..  అని మాట్లాడే మా సొంత మాటలకి బదులుగా, అట్టాగ.. ఇట్టాగ.. ఎట్టాగ.. అని మేవందరూ కొత్త పలుకు నేర్చడమూ ఆ మహానుభావుల పుణ్యమే. వాళ్ల తెలివితేటలకి, వ్యాపారదక్షతకి మోకరిల్లిపోయి, ఆ మాటలే అసలైన తెలుగుభాషని మావూళ్లో చాలామంది అనుకోపోలేదు కూడాను.

తమ హోటళ్లు ఆకులు నాకి పోతూ, మెస్సులన్నీ కస్టమర్లతో కళకళలాడిపోతున్న తరుణంలో, దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకునే తత్వంగల అయ్యర్లకి లైటు వెలిగింది. చోడవరంనించి పొందింది చాలనుకుంటూ తమ సొంత ప్రదేశాలకు ప్రయాణాలు కట్టీయాలని నిర్ణయించీసుకున్నారు. మెల్లగా దుకాణాలు మూసీసి, వచ్చినంతకే కుర్చీలు, బెంచీలు మెస్సుల వాళ్లకే అమ్మీసుకుని బయలెల్లిపోడం ఆరంభించేరు. ఎక్కడ చదువుతున్న పిల్లల్ని అక్కడే ఉద్యోగా లు చూసుకోమన్నారు. లేదా వ్యాపారాలు పెట్టుకోమన్నారు. చదువూసంధ్యాలేని కుర్రాయిల్ని   చోడవరంలోనే తగలడమన్నారు. వాళ్లిక్కడే గంతకి తగ్గ బొంతల్ని లవ్‌మేరేజ్‌లు గట్రా చేసుకుని మెస్సుల్లోనే సూపర్‌వైజర్లుగా, వెయిటర్లుగా స్థిరపడిపోయేరు. పూలమ్మినచోట కట్టెలమ్మడమూ ఒక కళే అనీసుకున్నారు.

చోడవరం నుంచి ప్రయాణం కట్టిన కొందరు ముసలి అయ్యర్లు ఓపికలు పోయి, మోకాళ్లు వీకయిపోయి, ఉన్నదేదో బ్యాంకులో వేసీసుకుని, కంచి కోవెల్లో పూజార్లయిపోయేరు. మరికొందరేమో పాల్ఘాట్‌ వెళ్లిపోయి  కాఫీగుండ దుకాణాలు తెరుచుకున్నారు. మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే, ఇప్పుడు ఒక్కటంటే ఒక్క అయ్యరు హోటలూ మావూళ్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అయితే,  ఒకటి మాత్రం నిజం. పాకావిలాసుల్ని అయ్యర్లు సాగనంపీగలిగేరు. అయ్యర్లని మెస్సులు తగిలీగలిగేయి. కానీ, మెస్సుల్ని దారిపెట్టీడం మటికి అంత సులువుకాదు. అలుణ్ని బలుడు కొడితే, బలుణ్ని బ్రెమ్మదేవుడు కొడతాడంటారు. అలాంటిదేదో జరగాలంతే..!

*

 

 

పాదాలకు తగిలిన ప్రశ్నలు..!

 

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

ఆ రోజు మా చోడవరం ఊళ్లో పూసిన పువ్వులన్నీ ఆలయాల్లోకో, ఆడవాళ్ల కొప్పుల్లోకో చేరిపోలేదు. భక్తప్రజాళి చెవుల ఇరకల్లోకి దూరిపోలేదు. అన్నీ కలిసికట్టుగా మా జాన్‌ మేస్టారి మెళ్లోకి జేరీసేయి. దండలుగా మారిపోయి ఆయన గుండెలమీద కులాసాగా కూచున్నాయి. దిలాసాగా ఊగీసేయి. మా మేస్టారు మాత్రం ఆ పూలమాలల మధ్యన భలే సిగ్గుసిగ్గుగా అయిపోయేరు. అందరూ జేజేలు కొడుతుంటేను.. భుజాలకెత్తుకుని ఊరేగిస్తుంటేను.. ఇంత ధైర్యవంతుడూ అదొకలాగ మొహమాటంగా మొగం పెట్టీసేరు.

మరి, ఆ రోజు మాములు రోజేంటి. మా ఊరికి, మా మేస్టారికీ కూడాను చాలా స్పెషలే. మాకే కాదు. మా ఇరుపంచాల గ్రామాల జనాలకీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. మేస్టారు నెంబర్‌వన్‌ మగాళ్లా మా మారకమ్మ రేవులో ఎలుగుబంటిని  తుపాకీతో పేల్చిచంపీసిన రోజు. చచ్చిన భల్లూకాన్ని వీపుమీద మోసుకుంటూ ఊరివైపు మొనగాళ్లా నడిచొచ్చీసిన రోజు.

అప్పటికి పదిహేను రోజులవుతుంది. సిలవరి బిందిలట్టుకుని మా ఊళ్లో ఆడంగులెవరూ మారకమ్మరేవు గట్టుకి నీళ్లకెళ్లడమే లేదు. ఏటి స్నానాలు చేసి పుణ్యం సంపాదించుకోవాలనుకునే పతివ్రతలూ అటేపు కన్నెత్తి చూడ్డం లేదు. ఏటి వార మావిడితోటల్లోనూ, తాటిపెండెల్లోనూ, మొక్కామోడుల్లోనూ జనసంచారం అస్సల్లేదు. అంతెందుకు. పేద్ధ చెంబట్టుకుని సిగ్గులజ్జాల్లేకుండా గొప్ప రాజసంగా ఏటి కొసాకి డైలీ దొడ్డికి పోయే మా కరణం సరిపిల్లి సత్తిబాబుగారు సైతం ఆ వైపు తొంగి చూసిందే లేదు. దీనంతటికీ కారణం ఒకానొక ఎలుగుబంటి అంటే నమ్ముతారా. నమ్మితీరవలసిందేను.

మా ఊరెలాటిదంటే, మా విశాఖపట్నం జిల్లా అడవులకి ద్వారబంధం లాటిది. మమ్మల్ని దాటీసే ఎవురైనా ఏజెన్సీకెళ్లాలి. ఊరికి ఆనుకుని ఉండే మారకమ్మ రేవు దగ్గర పొలాల్లోకి, ఏటి సైడు డొంకల్లోకి తరచుగా అరణ్యంలోంచి నానాజాతి నక్కలు, దొంగవరళ్లు, దెష్ట ఎలుగుబంట్లు జొరబడిపోయీవి. వచ్చినవి వచ్చినట్టు దొరికిందేదో తినీసి పాడేరు కొండలమీదికో, గంగరాజు మాడుగుల గిరుల్లోకో పోతుండీవి. ఈసారే ఆలా జరగలేదు. అదే వచ్చిన చిక్కు.

ఈ దఫా మా రేవుకొచ్చీసిన ఓ ఎలుగుబంటి ముండ సామాన్యమైన ముండ కానట్టుంది. కాయ కసరు తింటూ రేవు పొదల్లోనే రోజుల తరబడి తిష్టేస్సింది. వేసింది వేసినట్టుగా ఉండిపోయిందా. అదీ లేదు. పక్కనున్న చాకిరేవులో గుడ్డలారేసుకుంటున్న మడియాలు గంగరాజుమీదికి దూకీసింది. ఆడికి దూదేకీసింది. దుంపతెంచీసి ధూపంవేసీసింది. దొరికినవాణ్ణి దొరికినట్టుగా చీరిపారీసింది.

శనిలా పట్టీసిన ఎలుగును తప్పించుకునేందుకు గంగడు చేయనిపనంటూ లేదు. రక్తాలు కారుకుంటూనే పరిగెట్టేడు. ఏం ఉపయోగం. అదొట్టి బాజోటుమృగం. వీడేమో మంచిమనిషి. ఎలా సాలగల్డు. పరిగెట్టలేపోయేడు. ఆఖరికి ఆ ఎలుగుబంటినుంచి వాణ్ణి విడిపించడానికి మా రజకులంతా నానా సంకలు నాకీసేరు. రాయీ రప్పా, కర్రా కంపా తీసుకుని నాలుగిసర్లు ఇసిరితేనే గానీ అది ఒగ్గింది కాదు.

Kadha-Saranga-2-300x268
ఎలుగు దాడిలో చావసిద్ధమైన గంగరాజును తీసుకొచ్చి ఊరిమయాన ధర్మాసుపత్రిలో పడీసేరు. విషయమంతా తెలిసిపోవడంతో ఊరు ఊరంతా ఒంటేలు పోస్సింది. పరుగుల మీద గవర్నమెంటు ఆస్పట్లకొచ్చీసింది. చర్మం లెగిసిపోయి, ఒళ్లంతా తొక్కలూడిపోయి, మాంసం ముద్దలా అయిపోయిన గంగణ్ణి తనివితీరా తిలకించీసి ముక్కు చీదీసింది. ప్చ్‌…ప్చ్‌…ప్చ్‌లు కొట్టీసింది.

మా ఊరనే ఏంటి. ఇరుగుపొరుగునున్న గోవాడ, ఆంభేరుపురము, రాయపరాజుపేట, ఎంకన్నపాలెం ఇలా అన్ని గ్రామాలూ మా గ్రామం మీదికే వచ్చిపడిపోయేయి. ఎలుగుబంటిని అమ్మలకీ పెళ్లాలకీ తిట్టిపోస్సేయి.

ఈ తిట్లు ఇంకా ఆగేలేదు. మరో దయిద్రవయిన కబురొచ్చీసింది. గంగణ్ణి కొట్టీసిన ఎలుగుబంటి ఇంతలోనే మరో ఉన్మాదానికి దిగీసింది. రేవు మావిడి తోట్లో గంజి తాగుతున్న కాపలాదారు అన్నాబత్తుల కోటేసు సంగతీ తేల్చీసింది. లొట్టలేసుకుంటూ కుండమూకుట్లో గంజి జుర్రుకుతింటున్న కోటేసుగాడిని ఎనాకతల్నించి ఎలుగ్గొడ్డమ్మ ఎక్కీసి తొక్కీసింది. తెల్లపళ్లు, నల్ల బొచ్చు ఉన్నదేదో ఉన్నట్టుండి పీకిమీదకొచ్చీడంతో కోటిగాడి పై ప్రాణాలు పైనే పోయాయి. తొలీతా అదేదో దెయ్యం అనుకున్నాట్ట. వదిలించుకుందామంటే కుదర్లేదట. ఎలుగుబంటి చమడాలు రేగ్గొడుతుంటే రేవురేవంతా ధ్వనించేలా కేకేలేశాట్ట. దాపల్నున్న చెరుకు రైతులు బరిశెలు, బాడిదల్తో తెగబడి తరిమితే తప్ప ఎలుగు పారిపోలేదట. అలా ఆడికి చావు తప్పి కన్నులొట్టపోయింది. ఆస్పట్లో గంగరాజు పక్క మంచం మీద కెక్కీసేడు. ఇకనంతే. ఆ రోజు నుంచీ మా మారకమ్మరేవు వైపు వెళ్లాలంటే జనానికి వణుకు మొదలైపోయింది.

ఇదే సందు అదే మందు అనుకుందేమో ఎలుగ్గొడ్డూ బాగానే చెలరేగీసింది. పిచ్చెక్కిన పీరండంలా అయిపోయింది. చెరుకుతోటల్లోకి దిగిపోయి మేసినంత మేయడం, ధ్వంసం చేసినంత చేసీడం మొదలెట్టింది.

వాస్తవం మాటాడుకోవాల్సివస్తే, ఏటికీ మా ఊరికీ ఉన్న బంధం మామూల్ది కాదు. తల్లీబిడ్డల పేగు బంధం లాటిది. ఆ బంధాన్ని ఈ ఎలుగుమహాతల్లి పుటుక్కున తెంపీసినట్టయింది. ఇలా రోజులు గడిచీసరికి ఊరిజనానికి కంటిమీద కునుకులేకపోయింది.

సంగతి తెలిసి ఫారెస్టు ఆఫీసోళ్లంతా కంగరెత్తిపోయేరు. చోడవరానికి క్యాంపు కట్టేరు. పోలీసోళ్లూ వారికి సాయం చేస్తామన్నారు. విలేజి ప్రెసిడెంటు కురుముద్దాలి పాపారావు ఆళ్ల కాళ్లు పట్టుకున్నాడు. మునసబు కోట్ని మహాలక్ష్మినాయుడు, కరణం సత్తిబాబు ఆ పని చేయలేదు గానీ అంతకు తగ్గ చాలా పనులు వారికి చేస్సేరు.

ఒకేపున పోలీసు బాబులు, ఫారెస్ట్‌ గార్డులు, మరో దిక్కున మా ఊళ్లో ముదురుటెంకలని అందరూ చెప్పకునే ఆకుల వీరేశు, దేవరాపల్లి రంగడు, కిస్తా గోవిందు ఇలాగందరూ కలిసికట్టుగా ఎలుగుబంటిని చంపీడానికి రేవుకు బయలెల్లేరు. కొందరు కత్తులు, మరికొందరేమో కర్రలు, ఇంకొందరేమో కొడవళ్లు పట్టేరు. ఫారెస్టోళ్లు మాత్రం సరిగ్గా పేల్తాయో లేదో తెలీని రెండో మూడో తుపాకుల్తో వేట మొదలెట్టేరు.

రేవు దగ్గిరివరకూ మహా సూరుమానంగానే వెళ్లిన ఈ మారాజులంతా ఎలుగ్గొడ్డును వెతికీటప్పుడు మాత్రం దడదడలాడిపోయేరు. ఏ బొక్కలోంచి అది పారొచ్చీసీ బొక్కబద్దలు గొడతాదోనని నంగినంగిగానే వెతుకులాడేరు. వీళ్లంతా రేవు ఎక్కనున్న గుబురు పొదల్ని జట్లు జట్లుగా గాలిస్తుండగానే కాస్త దూరంగా వెళ్లి ఎలుగుకోసం తంటాలు పడుతున్న వీరేశుగాడి కేకొకటి గట్టిగా వినిపించీసింది.

”చచ్చాన్రోయ్‌”.. అని వాడు కెవ్వుమనడంతో మిగతా వాళ్లంతా బిక్కసచ్చిపోయేరు. పెద్ద పోటుగాళ్లా చెరుకు పొలాల్లో కాలు మోపిన వీరేశుడు గారిని మడిలోకి దిగీ దిగ్గానే ఎలుగుబంటి ఠక్కున పట్టీసింది. సుబ్బరంగా రక్కీసింది. ఎక్కడబడితే అక్కడే కొరికీసింది. ఆడి నోట్లో కాలుతున్న గుర్రం బీడీ ఉన్నాది కాబట్టి బతికేడు. అగ్గి దాన్ని భయపెట్టింది గనక బతికేడు. లేదంటే పనయిపోను. దెబ్బల్తో పొలాల్లోంచి బయటకొచ్చి వాడు చెబితేనే ఇదంతా అందరికీ తెలిసింది.

ఇక ఈ ఎలుగ్గొడ్డు యవ్వారం మనశక్తికి మించిందని తీర్మానించి వేటజట్టంతా ఊళ్లోకొచ్చీసింది. పంచాయితీ బోర్డు బల్లల మీద కూర్చుని బుర్రలు బద్దలు గొట్టుకుంది. ఊరి పెద్దలూ వీరితో కలిసి వీలయినంతసేపు బుర్రలు పాడు చేసుకున్నారు. చివరాఖరికి ఈ జంతుగోల తప్పించే నికార్సయిన మనిషెవరన్నప్పుడు మా జాన్‌ మేస్టారి పేరు ప్రస్తావన కొచ్చీసింది.

మా జాన్‌ మేస్టారంటే మామూలు మేస్టారు కాదు. ధర్మప్రభువు. మా బోర్డు హైస్కూల్లో పంతులు. మా పిల్లలందర్నీ కంటికి రెప్పలాగ కాపాడీవారు. ఆయనకి పెళ్లాం పిల్లల్లేరు. అలా అని బాధ్యతలేవీ లేవని అనుకోడానికి లేదు. మేమంతా ఆయనకు బాధ్యతలమే. మాకు చిన్న జ్వరం వచ్చినా అల్లాడిపోయీవారు. మా పుస్తకాలు చిరిగిపోతే కొత్తవి కొనిచ్చీవారు. ఆయన తినీది తక్కువ. మాకు మేపీది ఎక్కువ. పక్కోడికోసం పీకతెగ్గోసుకునీరకం.

మేస్టారి ధైర్యం గురించి చెప్పాలంటే చాలా ఉంది. గొప్ప హీరో. ఆయనకు భయం అన్నదే తెలీదు. తాగీసి మా ఊళ్లో ఎవరు తన్నులాడుకున్నా జాన్‌బాబు వచ్చేరంట సైలెంటయిపోయీవారు. ఒకేళ చుక్కేసుకున్నోడు ఎక్కువ మాటాడనే అనుకుందాం. తొలి పాలి మెల్లిగా చెప్పీవారు. రెండో పాలి మాత్రం రెండు తగల్నిచ్చి ఇంటికి తొవిలీసీవారు. తగూ అంటే ఆపడానికి ముందునుండీ ధర్మప్రభువని పేరు తెచ్చుకున్నారు. మనిషి ఆజానుబాహువు. చేతులు చేపాటి కర్రల్లాగుండీవి. కాళ్లు స్థంభాల్లాగ, పాదాలు ఏనుగు పాదాల్లాగా ఉండీవి. ఆయన చేతులు పడితే ఎవడికేనా పులుసులోకి ఎముకలుండవు అన్నట్టుండీవారు.

ఊరందరితోనూ కలిసిపోయి నెత్తురుకి నెత్తురుగాను, ప్రాణానికి ప్రాణంగానూ జాన్‌మేస్టారు బతికీవారు. అన్నట్టు. ఆయన దగ్గరో తుపాకీ ఉండీది. దానికి లైసెన్సూ ఉండీది. చిన్నప్పుడెప్పుడో కుమిలిగాటీల మీద, రైవాడ కొండలమీద మేస్టారు అడవిపందుల వేట చేసీవారని పెద్దలు చెప్పగా విన్నాం.

ఇలాంటి మేస్టారికి, ఆయన తుపాకీకి ఇన్నాళ్లకి మళ్లీ పని పడింది. ఎలుగుబంటి దౌర్జన్యానికి హడలెత్తిపోయిన ఊరి మోతుబరులందరూ ఓనాడు తూరుపు తెల్లారకుండానే ఆయనింటికెళ్లిపోయేరు. లబోదిబోమంటూ జరిగిందంతా ఆయన చెవుల్లో వేస్సేరు. ఎలుగ్గొడ్డు దెబ్బకి చెరుకుతోటలు నాశనమైపోతున్నాయని మొర పెట్టుకున్నారు. ఫారస్టోళ్లంతా చేతులెత్తీసేరనీ చెప్పుకున్నారు. గంగడు, కోటి, వీరేశులు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనీ విన్నవించేరు. తుపాకీ తీసి ఎలుగుని చంపితేనే గానీ సుఖం లేదని కోరీ, ప్రార్థించీ, మనవి చేసుకున్నారు. అయినాగానీ, మేస్టారి గుండె ముందయితే కరగలేదు.

”పశు ప్రవృత్తి అలాగే ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపయినా అడవుల్లోకి పోతుంది లెండి”. అనీసేరు తడుముకోకుండా.

”అమ్మమ్మా అలగనీకండి. రోజులెల్లిపోతన్నాయి. ఊల్లో వొవులికీ కంటిమీద కునుకులేదు. నా మొగుణ్ణి నాసనం చేసీనాది. నా బతుకు పాడయిపోనాది..”

ఎల్లుగ్గొడ్డు  దెబ్బకి చావసిద్ధమైపోయిన గంగడి భార్య రత్తమ్మ గగ్గోలు పెట్టింది.

వీరేశు పెళ్లాం లచ్చిమి కూడా రత్తమ్మకి వంత పాడింది. ”నా పెనిమిట్నీ అన్నేయంగా సీరీసింది దేవుడోయ్‌. దేవుడే మమ్మల్ని రచ్చించాల్రోయ్‌” అనీసి నెత్తి కొట్టీసుకుంది. ఎప్పుడైతే ఈ ఆడకూతుళ్లు పడీపడీ దు:ఖిస్తున్నారో అప్పుడిక మా మేస్టారి గుండె లుక్కుమనిపోయింది. ఇంకెంతమందిని ఎలుగ్గొడ్డు యాతన పెడుతుందోననే బెంగ ఆయనలో ఆరంభమైపోయింది.

” ఏం భయం లేదు. నేనీరోజు మారకమ్మ రేవుకి బయలెల్తాను. నాతో మాత్రం ఎవరూ రావద్దు. ఇల్లూ పొల్లూలేని ఒంటిగాణ్ణి. నేను దాని చేతిలో పోయినా పర్లేదు. అదో నేనో తేల్చుకొస్తాను.” మేస్టారు గంభీరంగా భరోసా ఇస్తూ పలికేరు. ఆ మాటలకు జనం తెగమగా సంబరపడిపోయేరు.

ఆ వెంటనే ఇంట్లోకెళ్లిన మేస్టారు పడగ్గదిలోని కర్రబీరువా తెరిచేరు. అందులో ఎప్పట్నుంచో దాచిపెట్టిన ఖాకీ చొక్కా, ఖాకీ ఫేంటు తీసి తొడుక్కున్నారు. తుపాకీ తుడుచుకున్నారు. టార్చిలైట్లో ఏసే బేటరీల్లాంటి మందుగుళ్లను తీసి బందూకు గొట్టంలో వాటంగా దోపీసేరు. మారకమ్మరేవు వైపు ప్రయాణమయ్యేరు. ఆయనతో పాటుగా చాలా మందిరి రేవు పొలిమేరల దాకా వెళ్లేరు. మేస్టారిని లోనికి సాగనంపి వెనక్కి వచ్చీసేరు.

అప్పటికి ఉదయం తొమ్మిదే అయింది. ఊళ్లోని పిల్లా మేకా అందరూ రామకోవెల్లో చేరిపోయి మేస్టారి కోసం భజన్లు చేస్తున్నారు. ఆయన క్షేమంగా వస్తే ఆకు పూజ చేయిస్తానని రైతు కూలీ రాములమ్మ ఆంజనేయస్వామికి మొక్కులెట్టుకుంది. మేస్టారు ఎలుగుబంటి పాలపడకూడదంటూ ఎవరెవరో వేనవేల దేవుళ్లకి దండాలెట్టుకున్నారు. అసలాయన్నెందుకు దాని కాడికి పంపేరని బోడి రాముడు, గెడ్డం సన్నాసిలాంటి మానమర్యాదలు గల అమాయకులు కొందరు ఊరి ప్రముఖుల మీద తిరగబడ్డారు. ఆళ్లని సముదాయించీసరికి పెద్దోళ్లకి పెద్ద పనయిపోయింది.

ఈ లోగానే మధ్యాహ్నం అయిపోయింది. ఎలుగుబంటితోనూ, మేస్టారితోనూ, ఆ మాటకొస్తే అసలు చోడవరంతోనూ నాకేటీ లింకు లేదన్నట్టుగా పడమట కొండల్లో కుంగీడానికి సూరీడు రెడీరెడీచ్‌ అంటున్నాడు. ఇంతలో మునసబుగారు ఆగలేక మాటాడీసేరు.

”ఏట్రా… ఇంతమందిమి ఉండి ఒక్కణ్ణి రేవులోకి పంపీనాం. ఆ తోటల్లో, ఆ తోపుల్లో ఆ సెట్ల మయాన మేస్టారు బాబు అన్నాయంగా ఏం బాదలు పడతన్నాడో. ఒకేపు యేల మించిపోతంది. ఇప్పటికీ మనం ఒల్లక్కూకుంతే మనం మొగోళ్లవే కాదెహే..’ నిష్ఠూరంగా మాట్లాడ్డం మొదలెట్టేడు. మునసబు మాటల్ని అక్కడున్న అందరూ నిజమేస్మీ.. నిజమేస్మీ.. అన్నట్టుగా తలపంకించేరు. పదండి.. పదండంటూ కేకలేసుకున్నారు. అంతా కలిసి రేవు వైపు నడక తీసేరు.

రేవు దాకా చేరేక అక్కడ గోర్జీదారుల్లో బితుకుబితుకు మంటూ అడుగులేస్తున్నారు. తాటాకు కదిల్తే చాలు. దడదడలాడిపోతున్నారు…ఉడతలు పరుగులెడుతున్నా ఎలుగ్గొడ్డే వచ్చి మీద పడిపోయినంతగా హడలి ఛస్తున్నారు. చేతులు చేతులు కలుపుకుని మెల్లిగా ఆడపెళ్లివారిలా జిడ్డోడుకుంటూ నడుస్తున్నారు.

కరక్టుగా వీరంతా అరమైలు నడిచేరో లేదో భీకరాకారంగా, రొప్పుతూ మహావీరుళ్లా ఎదురొస్తున్న జాన్‌మేస్టారు కంటబడ్డారు. ఆయన చొక్కా, ఫేంటు చెమటధారలతో ముద్దకట్టీసేయి. ఒక భుజం మీద తుపాకీ. మరో భుజం మీద నల్లటి మూటలాంటిదేదో మరోటీ ఉంది. ఊరివారిని చూడగానే ఆయన ” ఓహో.. రండర్రోహో..” అని ఆనందంతో కూడిన గావుకేకలాంటిదేదో వేసేరు.

మామూలుగానే మేస్టార్ని చూస్తే ఎప్పుడూ ఆనందపడే జనం ఆవేళ ఆయనంటే మరీ పిచ్చెక్కిపోయేరు. మారాజు క్షేమంగా వచ్చీసేడంతే చాలనుకుని ఆయన కాడికి మూగీసేరు. జనమంతా దగ్గరకి రాగానే జాన్‌మేస్టారు మరీ సంతోషపడిపోయేరు. భుజానున్న నల్లమూటని భళ్లున నేలకేసికొట్టీసేరు. కిందపడ్డ మూటని చూసి జనానికి మూర్ఛపోయినంత పనయిపోయింది. అది మూట కాదు. ఒకటోరకం ఎలుగ్గొడ్డు. చచ్చిన ఎలుగ్గొడ్డు. మేస్టారి చేతుల్లో, ఆయన తుపాకీ గుళ్లకి చచ్చిన ఎలుగ్గొడ్డు. జనం కేరింతలకి హద్దు లేదు. తుళ్లింతలకి హద్దూ పద్దూ లేదు. ఒకటే ఈలలు. ఒకటే గోల. మేస్టార్ని భుజానికెత్తుకుని ప్రజానీకమంతా డేన్సులు కట్టేరు. చచ్చిన ఎలుగ్గొడ్డును ఆనందంతోనూ, ఆశ్చర్యంతోనూ తేరిపార చూస్సేరు.

”బాబూ.. ఊరికి పట్టిన దయిద్రాన్ని వదలగొట్టీసేవు. ఎలుగును సంపీసి మమ్మల్ని, మా పొలాల్నీ రక్షించీసేవు. నువ్వయ్యానాయినా మొగోడివి. మా కోసమే జనమ ఎత్తినావు నాయనా. నాయినా..” బాగా పొగిడీసేరు.

”అసలింతకీ ఈ ముదనష్టపు గొడ్డు ఎలా సచ్చింది బాబూ..” ఉండబట్టలేక వివరాలడిగీసేరు.

ముందూ వెనుకా జనాలు నడుస్తుండగా..ఇద్దరు మనుషులు కావిడి కట్టి ఎలుగ్గొడ్డు కళేబరాన్ని కొయ్యమీద మోస్తుండగా.. పెద్ద గొంతెట్టుకుని మేస్టారు మొదలెట్టారు. ఉదయంనుంచీ తనని ఎన్ని తిరకాసులకి ఎలుగుబంటి గురి చేసిందో పూసగుచ్చేరు.

ఆఖరికి వెంటబెట్టగా వెంటబెట్టగా రేవుగట్టుమీదికి పోయిన దొంగసచ్చిన ఎలుగు సాయంత్రం నాలుగ్గంటలకి గానీ ఏట్లోకి దిగి నీళ్లు తాగలేదట. అదే సమయంలో అక్కడే మాటేసి కూచున్న మేస్టారు తుపాకీ గురి చూసి ఠక్కుమనిపించేరట. గుండు దాని గుండెల్లోకి దూరీసిందట. ఠపీమని  చచ్చూరుకుందిట. దాన్ని మూటలా కలీగట్టీసి సంబరంగా మేస్టారు మోసుకుంటూ వచ్చేరన్నమాట.

మొత్తానికి ఎలుగ్గొడ్డును చంపిన మేస్టార్ని ఊరేగింపుగా ఊరి రామమందిరానికి తీసుకువచ్చారు ప్రజ. వెనువెంటనే అప్సరా ఫోటో స్టూడియో రమణగాడికి కబురెళ్లింది. ఈలోగానే తాటి తడపలతో నాలుగు వెదురు కర్రముక్కలు తెచ్చేడు షరాబు నీలకంఠం. నాలుగు కర్రల్ని చచ్చిన ఎలుగుకాళ్లకి కట్టి చేటపెయ్యిలా నిలబెట్టేడు. వస్తూవస్తూనే ఫోటోగ్రాఫర్‌ రవణ చాలా ఫోజులు కొడుతూ వచ్చేడు. చాలా ఫోజుల్లో మేస్టార్నీ, ఆయన తుపాకీని, చచ్చిన ఎలుగునీ, ఊళ్లో పెద్దల్నీ కలిపి రకరకాలుగా ఫోటోలు తీస్సేడు. ఆనకేమో అంతా కలిసీసి ఎలుగ్గొడ్డుని సొసానంలో గొయ్యి తీసి కప్పెట్టీసేరు. ఇదంతా ఫారెస్టోళ్లు సూసీ సూణ్ణంట్టుండిపోయేరు.

ఫోటోల రవణగాడు అమర్నాడు కాక మర్నాడనుకుంటా. ఫోటోలన్నీ పెద్ద పెద్ద బొమ్మలుగా కడిగీసి పలచటి అట్టముక్కలకి అంటించీసి మేస్టారికి, ఊరిబడాబాబులికీ ఇచ్చీసేడు. దీనంతట్నీ ఊరి కుర్రనాయాళ్లందరం కళ్లారా చూసేం. కళ్లింతింతలు చేసుకుని చూసేం. ఒకానొక ఉద్వేగంతో చూసేం. అప్పటికి మా వయసు పదేళ్లుంటుందేమో. మా మాస్టారుగారికి ఏభయ్యుంటుంది. చదువులు అవీ పూర్తి చేసుకుని మా గుంటజట్టంతా ఉద్యోగాల కోసం వైజాగు నగరం పట్టీసినా మాస్టారిని, ఎలుగ్గొడ్డు వ్యవహారాన్ని చాలా మాట్లే గుర్తు తెచ్చుకుంటుంటాం.

ఇదంతా ఇలాగుండగానే, ఈ మధ్యనోసారి నేను మా ఊరు వెళ్లవలసివచ్చింది. జీవితం పట్ల తీవ్రంగా భయం పుట్టిన ఒకానొక బలహీన క్షణంలో మా ఊరి కరకచెట్టు పోలమాంబకి నేను కొన్నేళ్లకిందట రకరకాల మొక్కులు పెట్టీసుకుని ఉన్నాను. పెట్టుకున్న మొక్కుబళ్లన్నీ పెట్టుకున్నట్టే ఉండిపోయేయి. ఇంట్లో ఆడోళ్లు పోరుతుంటే ఆ మొక్కులేవో తీర్చేసుకుంటే వదిలిపోతుందని చోడవరం వెళ్లేను.

బస్టాండ్లో దిగానో లేదో పెడ అరిటిపళ్లు కొనీసేను. డైరెక్టుగా అమ్మవారి గుడికే కాళ్లు కదిపీసేను. మా పోలమాంబకి ధూళి దర్శనమంటే మహా మక్కువ. అందుకే కాళ్లయినా కడుక్కోకుండా అమ్మ విగ్రహం పాదాల దగ్గర పండూకాయా పెట్టీసి చేతులు జోడించేను. తీసుకెళ్లిన చీర, రవికెల గుడ్డ సమర్పించేను. నన్ను, నా ఇల్లు పిల్లాద్రినీ చల్లగా చూడమ్మా.. అని దండం పెట్టేను. ధ్వజస్థంభం చుట్టూ మూడు సుట్లు తిరిగేను. అమ్మవారి తమ్ముడు పోతురాజు బొమ్మ దగ్గరకెళ్లి భక్తిగా ఊదొత్తు పుల్లలకి అగ్గి పెట్టేను. నైవేద్యంగా ఇంటినుంచి పట్టుకెళ్లిన బెల్లం అచ్చులు వదిలీసేను. కోవెల బయటకొచ్చీసేను.

సరిగ్గా అప్పుడే గుర్తుకొచ్చేరు మా జాన్‌ మేస్టేరు. ఆయన్ని చూడాలనిపించింది. తొంభయ్యో పడిలో పడ్డారు కదా. ఒకసారి వెళితే మంచిదే అనుకున్నాను. వెంటనే ఆయన ఇంటిదారి పట్టేను. గుడికీ మేస్టారింటికీ పెద్ద దూరం ఉండదు. త్వరగానే వచ్చీసిందది.

రకరకాల పచ్చాపచ్చని మొక్కల్ని దాటి చిన్న పర్ణశాలలాంటి మేస్టారి ఇంటికి చేరేను. వసారాలో పడక్కుర్చీలో దేవుళ్లా వాలి కూచోనున్నారాయన. మనిషి బాగా లొంగిపోయేరు. వృద్ధాప్యం ముంచుకొచ్చీసింది కాబట్టి ఆరముగ్గిన అంటిపండులా అయ్యేరు. మిగలపండిన మావిడిపండులా కానొచ్చేరు. కంఠం మాత్రం ఖంగుఖంగుమంటోంది.

”నమస్కారం మేస్టారు..” అనగానే కళ్లు పెద్దవి చేసుకుని తేరిపారచూసేరు. అయినా గుర్తు పట్టలేపోయేరు. ఫలానా పంతులుగారి కొడుకునని చెప్పుకున్నాను.

”ఓరేయన నువ్వట్రా..” అంటూ నా చేతులు పట్టీసుకుని ఎంతగా ఇదయిపోయేరో చెప్పలేను. ఎదురుగా ఉన్న బల్లమీద కూచోబెట్టేరు. చాన్నాళ్లకి చూసినందుకో మరెందుకోగానీ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నా నేత్రాలూ తడిసిపోయేయి. ఎలాంటి మేస్టారు. ఎలాగయిపోయేరు. కమ్మిచ్చువు తీసనిట్టుండే కండలన్నీ ఎక్కడికిపోయేయి. దెబ్బ.. దెబ్బ.. వస్తే చావుకయినా సిద్ధపడిపోయే అంత బలిష్టమైన శరీరం ఏటైపోయింది. మనిషిని వయస్సు ఎంతగా వంచేస్తుందో.. ఇలా రకరకాల ఆలోచనలు తలని పట్టీసేయి.

ఇంతలోనే, నా చూపు వసారా గోడకు తగిలించిన ఫోటో మీదికి పోయింది. అప్పుడెప్పుడో ఎలుగుబంటిని చంపినందుకు గుర్తుగా దాంతో కలిపి మేస్టారికి తీసిన చిత్రం అది. దాదాపు నలభైయ్యేళ్లయిపోయింది కదా. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోకి కొన్ని కొత్త రంగులేవో పట్టీసినట్టు అదోరకంగా తయారయింది. నేను దగ్గరకెళ్లి మేకుకి తగిలించిన ఫోటో చేతుల్లోకి తీసుకుని రుమాలుతో తుడిచేను. ఆనాటి ఎలుగ్గొడ్డు సంహారం గురించి మేస్టారికి నవ్వుతూ గుర్తు చేసేను.

”మీసారూ మీరెంత దైర్యవంతులండీ” అన్నాను.

”మేస్టారూ మీకెంత తెగువ ఉండేదండీ” అనీ అన్నాను.

”మనిషంటే మీరే మనిషండీ” అంటూ ప్రశంసలు కురిపించేను. నాటి నా జ్ఞాపకాలన్నీ ఆయనతో చకచకా పంచీసుకున్నాను. అంతా విన్న ఆయన మెల్లగా గొంతువిప్పేరు.

” పోనిస్తూ. అవన్నీ వదిలిద్దూ. అప్పుడేదో అలా అయిపోయింది. ఎలుగుబంటిని చంపినంత మాత్రాన పెద్ద మొనగాడయిపోతానేంట్రా. అడివి జంతువుని హత్య చేసినంత మాత్రాన పులిసిబలిసిన ముల్లుడనయిపోతానేంట్రా. నోరు లేని జీవిని చంపడమూ ఓ గొప్పేనేంట్రా.” అన్నారు నిస్సారంగా.

ఆ మాటలు ఆయన తేలిగ్గా అంటున్నట్టుగా పైకి వినిపించినా వాటి వెనుక ఒక బాధ, ఒక యాతన ఏదో అన్నట్టుగా నాకయితే అనిపించింది. ఆ మాటలంటున్నప్పుడు ఆయన గొంతులో శోకమేదో ధ్వనించింది. ఇంతలో ఆయనే మళ్లీ అందుకున్నారు.

” మన ఊరికి అప్పుడు ఒక్క ఎలుగుబంటే వచ్చిందిరా. దాన్ని చంపీగానే దరిద్రం తీరిపోయిందిరా. ఇప్పుడు దాన్ని మించిన క్రూర జంతువులు ఊళ్లోకి దిగిపోయేయిరా. వాటిని నేను ఏం చేయగలిగేన్రా. ఎలుగుబంటిని చంపేనుగానీ, మన ఊరి బక్క రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుని మందుల ఫ్యాక్టరీ పెట్టీసిన ఉప్పల సూర్యనారాయణదొరని ఏదయినా చేయగలిగేనేంట్రా..? మన ఊరి జనం వద్దు వద్దంటున్నా వినకుండా న్యూక్లియర్‌ ప్లాంటు పెట్టిన మార్వాడీ సేట్‌ ఉదయ్‌లాల్‌ వెంట్రుక ముక్కయినా తెంపగలిగేనేంట్రా..? సమ్మెకట్టిన మన జనపనార మిల్లు వర్కర్లని పిట్టల్లా కాల్పించీసిన ఫ్యాక్టరీవోనరు పానకాల రాయుడి అంతు తేల్చీగలిగేనేంట్రా..? చెప్పరా.. చెప్పు.. చెప్పు..” అంటూ ఆవేశంగానూ చాలా కోపంగానూ కడిగీసినట్టుగా నన్నడిగీసేరు. ఆ సమయంలో ఆయన మాటాడుతుంటే సింహాచలం ఉగ్రనరసింహస్వామిలాగ, అనకాపల్లి నూకాల్తల్లిలాగ, గంధవరం మరిడిమాంబలాగ భయంకరంగా ఆవుపించారు.

దెబ్బకి నా గుండెకాయ గొంతులోకి వచ్చీసినట్టయింది. తొంభైయ్యేళ్ల అమావృద్ధుడైవుండి కూడా జనకంటకులమీద మీద నిప్పులు కురిపిస్తూ మేస్టారు మాట్లాడుతుంటే నాకయితే దడుపు పుట్టీసింది. ఆయన హృదయంలో ఎంతటి దావాగ్ని దాంకుందో అర్థమైపోయింది. ఏదో అనబోయేను. ఈలోగానే, ఎలుగుబంటితో అప్పుడెప్పుడో దిగిన ఫోటోను గభాల్న నా దగ్గర్నించి ఆయన లాగీసుకున్నారు. దాన్ని పరపరా చింపీసేరు. చిరిగిన ఆ ముక్కల్ని వీధులో విసిరీసి చక్కావచ్చి కుర్చీలో మౌనంగా కూచుండిపోయేరు. ఆ వయసులో మేస్టారు అలా ఊగిపోవడం చూసి నాకు భయం వేస్సింది. ఆ వేళ ఆయన్ని మరింక ఎక్కువగా కదపకూడదనుకున్నాను. నమస్కారం పెట్టీసి మెల్లగా ఇంట్లోంచి బయటపడిపోయేను.

రోడ్డుమీదికొచ్చీసి గాభరా గాభరాగా నడుస్తున్నాను. నాలుగే నాలుగు అడుగులు పడ్డాయో లేదో. మేస్టారు చంపీసి పారీసిన పాత ఫోటో ముక్కలు వీధిలో ఎదురుపడ్డాయి. గాలికి రెపరెపలాడుతూ నా పాదాలకూ అడ్డం పడ్డాయి ” బాబూ! మీ జాన్‌ మేస్టారు ఆవేశంగా మాటాడిన మాటల్లో తప్పేటయినా ఉందా..? ఒకేళ ఉంటే గనుక, ఆ తప్పేంటో బేగా చెప్పీ..  బేగా చెప్పీ బాబూ..!” అంటూ అవన్నీ నన్ను నిలువునా నిలదీసినట్టుగా ఆ క్షణంలో నాకు తోచింది. ఉన్నపళంగా ఉక్కిరిబిక్కిరయిపోయేను.


డా. చింతకింది శ్రీనివాసరావు