ప్రశ్నల లాంతరు

 

 

-చల్లపల్లి స్వరూప రాణి

~

 

అవును రోహిత్!
నువ్వన్నది నిజమే!
పుట్టుకతో నేరస్తులమౌతున్న చోట
మన పుట్టుక ఎంత వేదనా భరితం!
అవును!
ఇది ఒంటరి అలగా బాల్యం
పచ్చితనాలను
నులివెచ్చదనలాను
నరికి పాతరేసుకున్న బాల్యం
ఒనుకులదాకా తరుముకొచ్చే
వెలివేతల బాల్యం
ఎంత గెల్చినా
ఏ మన్ననకి నోచుకోని బతుకులు
ఇక్కడ ప్రేమ నిషిద్ధం!
ప్రశ్న నిషిద్ధం!
మననమ్మకాలకు రంగులద్దుతారు
నలుగురు నడిచే దారినే నడవలేక పోవడం
ఎంత నేరం!
రాజు గారికి బట్టలు లేవనడం
ఎంత పాతకం!
ఇక్కడ బతకడం అంటే
కుయ్యో మొర్రోమని
కాళ్ళీడ్చుకుంటూ నెట్టుకు రావడమని
తెలుసుకోలేక పోవడం
ఎంత తప్పు!
రాముడు మంచి బాలుడెందుకయ్యాడని,
ఈ దేశంలో ఎక్కడ చూసినా
సీతమ్మోరు స్నానమాడిన
గుంటలే ఎందుకున్నాయని
అడగడం ఎంత ఘోరం!
ఇక్కడ కలలు కనమంటారు
కానీ నిద్ర పట్టనివ్వరు
ఇక్కడ బడులుంటాయి, గుడులుంటాయి
కానీ జ్ఞానార్జన నిషిద్ధం
రోహిత్!
చదువంటే ప్రశ్న కదా!
మనుషులని వస్తువులుగా
డబ్బులుగా, ఓట్లుగా
కాదంటే బంగారంగా చూసే కళ్ళకి
మనిషంటే మెదడని
మనిషంటే చలనమని
మనిషంటే ప్రేమని చెప్పడానికే
నువ్వొచ్చి వెళ్ళావా రోహిత్!