రంగు రెక్కల వర్ణ పిశాచం

 

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

 

 

మీరెప్పుడైనా పిశాచాన్ని చూశారా…?

భయపడకండి… !!

పిశాచమంటే తెల్లని చీర అందంగా  కట్టుకొని….తెలుగు సినిమా పాటలు పాడే పిశాచం కాదు. కనపడకుండానే జనాన్ని మింగే పిశాచం. రంగు రంగుల పిశాచం. రక్త వర్ణ పిశాచం. ఈ పిశాచం గురించి మొదట నాకూ తెలీదు. నా చుట్టూ ఆవహించి ఉన్నా.. నేను గుర్తించని పిశాచాన్ని ఫకీర్ కనిపెట్టి నాకు చూపించాడు. మీకూ చూపిస్తాను.
***
ఆరోజు నాకు బాగా గుర్తు…..
“దర్మశోణం…కర్మాసిహం…రిందమేయం…నందవోనం”  ఎవరో మంత్రాలు జపిస్తున్నారు. మేడ మీద పడుకొన్న నేను మెల్లగా కళ్లు తెరిచి ఆకాశం వైపు చూశాను.

రైతు పొద్దంతా దున్ని చదును చేసిన దుక్కిలా ఆకాశం ఎర్రమన్ను పూసుకుంది. లోకమంతా మోదుగుపూల వనంలా మెరుస్తోంది. తొలి పొద్దు చూసేందుకే  నేను రోజూ డాబాపైన పడుకుంటాను. ఆ పొడిచే పొద్దులా నేనూ కొత్తగా పుడతాను.
“దర్మశోణం…కర్మాసిహం…రిందమేయం…నందవోనం…” అంటూ పక్కనే మా తమ్ముని
కూతురు  లావుగా ఉన్న పుస్తకంలో చూసి ఏవో మంత్రాలు బట్టీ పడుతోంది.
” ఏం పాఠం రా తల్లీ అదీ. నేనెప్పుడూ విన్నట్లు లేదు” ఆరా తీశాను.

“మా స్కూల్లో ఈ పుస్తకంలోని మంత్రాలు కంఠస్తం చేసే పోటీలు పెడుతున్నారు పెదనాన్న….. గెలిచిన వాళ్లను హైదరాబాద్ కు తీసుకుపోతారట. అక్కడ కూడా గెలిస్తే ఢిల్లీకి తీసుకుపోతారట. అందుకే పొద్దున్నే లేచి బట్టీపడుతున్నా.” ఆశగా చెబుతోంది.
“స్కూల్లో పాఠాలు చెప్పకుండా ఇప్పుడు మంత్రాలు చెబుతున్నారా…?” అనుకుంటూ మెట్లు దిగి కిందికొచ్చాను.
” అన్నా సర్పంచ్ ఫోన్ చేసిండు పంచాయతీ ఆఫీసు దగ్గర గొడవ అవుతోందట..”
అంటూ తమ్ముడు ఫోన్ ఇచ్చాడు. “వస్తున్నా” అని ఫోన్ పెట్టేసిన.
మాది చాలా మారుమూల  గ్రామం. చుట్టు పట్టు పెద్ద ఊర్లు కూడా లేకపోవడంతో మండల కేంద్రం చేశారు. మా తాతల కాలం నుంచి ఊళ్లో మా కుటుంబానిదే పెత్తనం. మా నాయిన పోయిన కాన్నుంచి ఇంటితో పాటూ ఊరి బాధ్యత నా మీద పడింది. నానా కులాలు, మతాలు ఉన్నా అంతా కలిసి మెలిసి బతుకుతున్నాం.గబగబ ముఖం కడుక్కోని పంచాయతీ ఆఫీసు దగ్గరకు వచ్చిన. అక్కడ జనం గుంపులు గుంపులుగా ఉన్నరు.
“మా గుడి దగ్గర మీ పుస్తకాలు పంచుడేంది?…నాలుగు తన్నండి..బుద్ధి వస్తుంది.” అంటూ జనం గోలగోలగా అరుస్తున్నారు.
సర్పంచ్ తో పాటూ ఐదారుమంది ఊరి పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు. సర్పంచ్ నన్ను చూడంగనే “నమస్తే అన్నా” అంటూ ఎదురొచ్చాడు.

అక్కడున్న వేప చెట్టుకు ఇద్దరు ఆడమనుషుల్ని తాళ్లతో కట్టేశారు. ఇరవై ఏళ్లలోపు అమ్మాయి, ఇంకో నడి వయసు ఆడామె. కొందరు ఆడోళ్లు వాళ్ల జుట్టుపట్టి లాగుతున్నారు. పిడిగుద్దులు గుద్దుతున్నరు. బెదిరిపోయిన వాళ్లిద్దరూ “కొట్టొద్దు” అని దండం పెడుతున్నారు.

మాఊళ్లో ఏటా జాతర జరుగుతుంది. కానీ ఇట్లాంటి గొడవ ఎప్పుడూ  కాలే.

‘మాకేం తెలవదు నాయనా..నీ కాళ్లు మొక్కుతా.  రోజు ఐదొందలు కూలీ ఇస్తమంటే ఈ పుస్తకాలు పంచుతున్నం. ఇది నా బిడ్డ. కాలేజీల చదువుతున్నది. పొట్ట తిప్పలకు చేస్తున్నం తప్పితే ఇయ్యేం పుస్తకాలో, ఏందో మాకు తెల్వదు” ఏడుస్తోంది  పెద్దామె.
“వీళ్లను ఏం చేద్దాం…? కేసు పెట్టమంటరా..?” ఎస్సై అడిగిండు .

వాళ్లను చూస్తేనే అర్థమైతోంది. వాళ్లేదో బతుకుతెరువుకోసం చేస్తున్నరని. వాళ్లమీద ఏమని కేసు పెడతాం..!? వద్దని చెప్పిన.

” ఏమ్మా బతకటానికి ఇదే పని చేయాలా. మీ మతం పుస్తకాలు ఇంకెక్కడైనా పంచుకోండి. ఇలాంటి జాతరలు, గుళ్ల దగ్గర కాదు. చదువుకునే బిడ్డ భవిష్యత్తు నాశనం కావొద్దని వదిలేస్తున్నం..పో” అని పంపిచాను.
ఎవని బతుకు వాడు బతకొచ్చు కదా..? ఒకరి గుడి దగ్గరకు వేరేవాళ్లు వచ్చుడెందుకు..? ఈ పుస్తకాలు పంచుడెందుకు.?
ఇప్పుడు చెప్పండి. మీకు పిశాచం కనిపించిందా..? రంగు రంగుల పిశాచం కనిపించిందా..? లేదా…?
మనకు తెలీకుండానే మనల్ని ఆవహిస్తున్న పిశాచం…రంగు రంగుల పిశాచం….రక్త వర్ణ పిశాచం. నాకు ఫకీర్ చూపించాడు. అవునూ,  ఫకీర్ ఎవరో మీకు తెలీదు కదా…?
ఫకీర్ ది మావూరు కాదు. ఎక్కడో చైనా-కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న ఊరు. అక్కన్నుంచి శాలువాలు, చద్దర్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతరు. హైదరాబాద్ దాకా సరుకు రైలులో తీసుకొచ్చి, అక్కడ ఓ గది కిరాయి తీసుకుని గోడౌన్ లాగా పెట్టుకుంటరు.

హైదరాబాద్ లో కొంతమంది పుట్ పాత్ మీద అమ్మితే… ఇంకొందరు ఊర్లు తిరిగి అమ్ముతరు. ఫకీర్ మా సరుకుతో మా ఊరుకు వచ్చి  మా ఇంట్లోనే సరుకు దింపుతడు.
***
అప్పుడు నాకు పదేళ్లు. బజారులో పాటలు వినిపిస్తుంటే పిల్లలతో పాటే నేను కూడా పరిగెత్తాను. ఏదో సినిమా ప్రచారం చేసే రిక్షా అనుకున్నాను. కానీ అది దుప్పట్లు, శాలువలు అమ్మే బండి. ఆ బండి మీద ఓ ముసలాయన, నా ఈడు పిలగాడు ఉన్నారు. ఆ చప్పుడుకు చాలా మంది బండి చుట్టూ మూగారు.

రంగు రంగుల రగ్గులు.

వాటి మీద అందమైన బొమ్మలు –

ఆ చద్దర్లు, శాలువలు ఆరుద్ర పురుగుల్లా… అందంగా, మెత్తగా ఉన్నాయి. అంత సుతి మెత్తని చెద్దర్లు నేనెప్పుడూ చూడలేదు. పట్టుకుంటేనే జారిపోతాయేమో అనిపిస్తూ…. పసిపాపల్లా ఉన్న వాటిని వొకసారి పట్టుకుంటే వదల్లేము.

మా బజారోళ్లు చాలా మంది వాటిని తీసుకు పోయారు కానీ మళ్లీ వెనక్కు రాలేదు.
రెండు రగ్గులు తీసుకున్న వాళ్లు ఒక్క రగ్గుకే డబ్బులు తెచ్చారు. ఇక్కడి భాష తెలీని వాళ్లు కావడంతో మోసం చేద్దాం అనుకున్నరు.
“యా అల్లా… ఇంత దోఖా చేస్తరా.? ఎక్కడో కాశ్మీర్ నుంచి బతికేటందుకు వచ్చినం. మాది పొట్టకొట్టొద్దు.” అంటూ పెద్దాయన బతిమాలుకుంటున్నాడు.  ఈ గొడవకు  పెద్దాయనతో ఉన్న పిల్లగాడు గట్టిగా ఏడుస్తున్నాడు.
ఇంతలో ఊరి పెద్ద మా నాయనకు సంగతి తెలిసి అక్కడకి వచ్చిండు.
జరిగిదంతా చెప్పి ఆ పెద్దాయన భోరుమన్నాడు.

మా నాయన అక్కడున్నవాళ్లని గద్దించాడు. “ఏదో పొట్టతిప్పలకోసం  దూరదేశం నుంచి వచ్చిన మనిషిని మోసం చేస్తారా..? మర్యాదగా డబ్బులు ఇచ్చారా సరే. లేదా పోలీసుల్ని పిలుస్తాను” అనడంతో జనం భయపడి డబ్బులిచ్చారు.
డబ్బులన్నీ లెక్క సరిపోయాక వాళ్లని మా ఇంటికి తీసుకొచ్చాడు నాయన.  అమ్మతో చెప్పి అన్నం పెట్టించాడు. “మీకేం భయం లేదు. మీరు ఎప్పడైనా ఇటువైపు వస్తే మా ఇంట్లోనే ఉండండి .” అని  భరోసా ఇచ్చాడు.
‘నా పేరు సులేమాన్’…నా కొడుకు పేరు ఫకీర్’ అంటూ వాళ్ల వివరాలు చెప్పాడు పెద్దాయన.
ఫకీర్ తల్లి …అతని చిన్న వయసులోనే చనిపోయిందట. అప్పటినుంచీ తనతోనే వ్యాపారానికి తీసుకొస్తున్నాడట.
మరి పిల్లవాన్ని చదివించరా అంటే…” ఎంత చదివినా ఏదో ఓ పని చేయాల్సిందే కదా సాబ్..అందుకే  వ్యాపారం ఎలా చేయాలో నేర్పుతున్నాను” అన్నాడు సులేమాన్.
ఫకీర్ దీ,  నాదీ ఒకటే ఈడు కావడంతో  మంచి జంటగాల్లమయ్యాం. ఫకీర్ మెల్లగా తెలుగు నేర్చుకున్నాడు. ఫకీర్ బడికి
పోకున్నా లెక్కలు బాగా చేసేవాడు. మా నాయన కూడా ఫకీర్ తెలివికి ఆశ్చర్యపోయేవాడు. ఫకీర్ ఒక్కో సారి నాతో స్కూలుకు వచ్చేవాడు.

మా స్కూల్లో అప్పుడు ఉర్దూ మీడియం  ఉండేది. ఫకీర్ ఉర్దూ రాత  చూసి పంతుళ్లు మెచ్చుకునే వారు. ముఖ్యంగా అతడు పాడే పాటలంటే మా సార్లకి చాలా ఇష్టం.

ఫకీర్ ఎప్పుడో ఓ సారి మా స్కూలుకు వస్తే  పిల్లలకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే మధ్యాహ్నం ఫకీర్ పాటలు వినిపించేందుకు పిల్లలందరినీ ఒకదగ్గర కూర్చోపెట్టేవారు. పాఠాలు వినే బాధ తప్పినందుకు పిల్లలు సంతోషించేవారు.
” దునియాకే ఏ ముసాఫిర్…..మంజిల్ తేరీ కబర్ హై….” ఫకీర్ గొంతెత్తి పాడితే పిల్లలంతా పక్షుల్లాగా ఆలకించేవారు. అర్ధం తెలీకున్నా పిల్లలంతా ఆ పాటలు పాడుకునే వారు.

పాట భావం తెలియకున్నా…ఏదో భావన ఆవహించేది. వొక మత్తులాగ. వొక మాయలాగా…

అతను నాకు ఉర్దూ నేర్పాడు. నాకంటే వేగంగా తెలుగు నేర్చుకున్నాడు.

బడిలోనే కాదు… బయట కూడా ఫకీర్ చాలా హుషారుగా ఉండేవాడు.

ఆదివారం వాగుల్లో ఈతలు కొట్టేవాళ్లం. చేపలు పట్టేవాళ్లం. నేను ఒక్క చేపను పట్టేందుకే నానా తంటాలు పడేవాన్ని. ఫకీర్ నీళ్లల్లో చేతులు పెడితే చాలు,  చేపలే పరిగెత్తుకొచ్చేవో …అతడే ఒడుపుగా పట్టుకునేవాడో కానీ చాలా చేపలు
పట్టేవాడు. కొన్ని చేపల్ని  అక్కడే కాల్చి తినేవాళ్లం. ఇంకొన్ని  ఇంటికి తెచ్చేవాళ్లం. అమ్మ వాటితో కమ్మగా పులుసు చేసేది.

Kadha-Saranga-2-300x268

నాయనకు నేనంటే ఎంత ఇష్టమో ఫకీర్ అన్నా అంతే ఇష్టం. అలా అతను  మా ఇంట్లో మనిషయ్యాడు. మా ఇంట్లోనే కాదు. ఊరు ఊరంతా ఫకీర్ మాయలో పడిపోయారు. ఊరందరికీ  ఫకీర్ చుట్టమే. ఇక పీర్ల పండగ వచ్చిదంటే చాలు. ఫకీర్ కు చెప్పలేని సంబరం.  పెద్ద పీరును ఎత్తుకుని.. “అస్సైదులా” అంటూ ఎగిరేవాడు. రాత్రిపూట నిప్పుల గుండంల ఉరికేటోడు.

ఫకీర్ మా దగ్గర ఉన్న నెల రోజులూ పండగలాగా ఉండేది.
తెచ్చిన సరుకు అంతా అమ్ముడు పోగానే వాళ్లు వాళ్ల ఊరు కాశ్మీరు వెళ్లిపోయేవాళ్లు.  ఫకీర్ పోతుంటే చెప్పలేని బాధ. తను మళ్లీ వచ్చేది సంవత్సరం తర్వాతే. ఆ సంవత్సరం మొత్తం అతని కోసం ఎదురుచూసే వాళ్లం.
ఏళ్లు గడిచాయి. చూస్తుండగానే మా జీవితాలు  మారిపోయాయి. ఫకీర్ వాళ్ల నాన్న సులేమాన్ కాలం చేశాక వ్యాపార బాధ్యతలు ఫకీర్ మీద పడ్డాయి.
పగలంతా వ్యాపారం… రాత్రికి ఇంటికి రావడం.  రాత్రి అయిందంటే చాలు… ఫకీర్ ఖవ్వాళి కోసం జనం మా ఇంటి ముందు కూచునే వాళ్లు.

అతను అమ్మే చద్దర్లు, శాలువాల్లాగనే అతని గొంతు కూడా మెత్తగా, కమ్మగా ఉండేది.
” దమాదమ్ మస్త్ కలందర్…దమాదమ్ మస్త్ కలందర్ ….” ఫకీర్ ఖవ్వాలికి జనం పూనకం వచ్చినట్లు ఊగిపోయేవారు.
ఫకీర్ నాకు ఉర్దూ  నేర్పాడు కదా. అతని పాటల్లోని భావాలు  నాకు బాగా అర్థమయ్యేవి.
” నాదేహం…నా సర్వం నీదే….ఓ దేవుడా,  ప్రియుడా నన్ను పవిత్రంగా ఉంచు……”

ఎంత గొప్ప భావన…!?
దేవున్ని ప్రేమిస్తున్నావా…? అవును,  ప్రతిక్షణం అతన్నే ప్రేమిస్తున్నాను.
సైతాన్ను ద్వేషిస్తున్నావా…లేదు,

నాకు అంత తీరిక లేదు…!

ప్రతీ గీతంలో అంతులేని తాత్విక భావనలు. అట్ల ఒక పాట తర్వాత ఇంకో పాట.
చుట్టూ కమ్ముకున్న చీకట్లను చీలుస్తూ అతని గీతాలు కొత్త వెలుగునిచ్చేవి.
తెల్లవారుతున్న సంగతి సైతం జనం మరిచిపోయేవాళ్లు.
గుడి గంటల సవ్వడిలో మేలుకొలుపు…నమాజ్ లోని గుండెతడి….చర్చి ప్రార్థనలో క్షమాగుణం… అన్నీ  ఫకీర్ గొంతులో వినిపించేవి.

ఫకీర్ రాముని గుడి దగ్గరా భజన చేసేవాడు.

” రామ్ కా జిక్ర్ హర్ నామ్ మే హై…..రామ్ సబ్ మే హై”  ( రాముుడు అన్నింటా…ఉన్నాడు,
అణువణువూ రాముడే నిండి ఉన్నాడు. ) అంటూ పాడేవాడు. భక్తులతో కలిసి ఊగిపోయేవాడు.

అతని పాటకు మతం లేదు. ప్రేమ మాత్రమే ఉంది.
ఫకీర్ నీకీ పాటలన్నీ ఎవరు నేర్పారు..? అంటే

” ఇవన్నీ సూఫీ గీతాలు. భూమ్మీద ఎక్కడైనా రాత్రంటే చంద్రుడు, చుక్కల వెలుగులే. కానీ మా కాశ్మీరంలో రాత్రి ఖవ్వాలీ వెలుగులతో నిండిపోతుంది. మా కాశ్మీర్ లో ఉన్నది ఇస్లామే…కానీ అది సూఫీ. అది ఒక్క మతం కాదు. సర్వమత సారం.
మేము దేవుడిని పూజించం. ప్రేమిస్తాం.

అతని కోసం విరహ వేదనలో తపించిపోయే ప్రేమికుల్లా… పిచ్చిగా.

దేవుడు-నేను,  నేను-దేవుడు…ఇద్దరూ ఒక్కటై పోతాం.

అతడంటే భయం కాదు, ప్రేమ ఉండాలి. ఆరాధించాలి. అతనిలో లీనమై పోవాలి.”  ఫకీర్ చెప్పే మాటలు నాకు దేవున్ని మరింత చేరువ చేసేవి.

“ భాయ్….మతం ఐనా భక్తి ఐనా… భార్యభర్తల మధ్య గుట్టుగా జరిగే కాపురం లాగా ఉండాలి. భార్యతో చేసే కాపురం పదిమందికి  చెప్పుకోం కదా… అలాగే భక్తి కూడా,  దేవునికి మనకూ మధ్య రహస్యంగా ఉండాలి.” అనేవాడు.

ఫకీర్ మా ఊరు విడిచి వెళ్లినా మమ్మల్ని మరిచిపోయేవాడు కాదు. అక్కడ కాసే
ఆపిల్ పళ్లను మాకు పంపేవాడు.  కాశ్మీర్ లో దొరికే ప్రత్యేకమైన క్రికెట్ బ్యాట్లు తెచ్చి పిల్లలకు క్రికెట్ నేర్పించాడు.

మా ఇంటిని వాళ్లనే కాదు ఊరంతటినీ తన కుటుంబం చేసుకున్నాడు ఫకీర్. మా కన్నా మిన్నగా మా ఊరిని ప్రేమించాడు. మా అందరికీ ప్రేమ అంటే ఏమిటో చూపించాడు. మా ఊరిలోని పిల్లా పాపలే కాదు…చెట్టూ -చేమ, రాయి-రప్పా అణువణువూ ఫకీర్ ని ప్రేమిస్తుంది.
అలా సంవత్సరాలు గడిచిపోయాయి.
***
ఎప్పటిలాగే పోయిన ఏడాది కూడా ఓ రోజు మా ఊరు వచ్చాడు ఫకీర్. సరుకుతో కాదు. మాసిపోయిన గడ్డంతో. పిచ్చోడిలా ఉన్నాడు. వస్తూనే “ఐపోయింది. అంతా అయిపోయింది భాయ్” అంటూ భోరుమన్నాడు.
పోయినేడాది వ్యాపారం చేసుకుని అక్కడకి పోయేలోపు జరగరాని ఘోరం జరిగిపోయిందిట.
అక్కడ కాపలాగా ఉన్న వొక దళంలోని దుర్మార్గులు కొందరు… ఫకీర్ కూతురును దారుణంగా అత్యాచారం చేసి చంపారట. ఒక్కడు కాదు ఇద్దరు కాదు…పశువుల్లా పదిమంది పైనే…భార్య, చిన్న కొడుకును అందరి ముందే కాల్చిచంపారుట. తనతో పాటే వ్యాపారానికి వచ్చిన  పెద్ద కొడుకు మాత్రం బతికిపోయాడు.

సర్వం కోల్పోయిన ఫకీర్ ఎటు పోవాలో తోచక కొడుకుని తీసుకుని మా ఊరు వచ్చాడు.
తలచుకుంటేనే ఒళ్లు జలదరించే దారుణం.
పదేపదే ఆ దారుణం గుర్తుకు రావడంతో ఫకీర్ చాలా కాలం పాటూ కోలుకోలేక పోయాడు.
ఫకీర్ పరిస్థితే అలా ఉంటే  కొడుకు రియాజ్ సంగతి చెప్పేదేముంది. .?

తిండి లేదు…నీళ్లు లేవు. గంటలు గంటలు ఆకాశంలోకి చూస్తూ ఉండేవాళ్లు. ఫకీర్ కైతే పిచ్చోడికి మల్లే మరింత గడ్డం పెరిగింది. మా ఊరి చెరువు గట్ల దగ్గర ఒంటరిగా పాటలు పాడుకుంటూ తిరిగేవాడు. మామూలు మనిషి కావడానికి చాలా కాలం పట్టింది.
చాలా రోజుల తర్వాత ఓ రోజు తన ఊరు వెళతానని అన్నాడు.

“ ఇంకా అక్కడ ఏముందని వెళతావు నీ కొడుకు రియాజ్  నువ్వు ఇక్కడే ఏదైనా వ్యాపారం పెట్టుకుని మాతో పాటే కలిసి ఉండమని ” బతిమాలాను.

సరేనన్న ఫకీర్ కాశ్మీర్ వెళ్లి సరుకు తెచ్చుకుంటానని వెళ్లాడు.
అలా నా మాట మీద గౌరవం తోనో…..మా ఊరి మీద ప్రేమ తోనో మొత్తానికి ఫకీర్ కొడుకుతో మా ఊరు వచ్చాడు. నాతో సహా ఊరంతా సంతోషించింది. ఇంతకాలం మా ఊరికి అతిథిగా వచ్చే ఫకీర్ ఇప్పుడు మా ఊరివాడయ్యాడు.
ఫకీర్ ను మా ఇంట్లోనే ఉండమని చెప్పినా ఒప్పుకోలేదు. వ్యాపారం చేసి కూడబెట్టిన డబ్బు నా చేతిలో పెట్టాడు. ఊళ్లోనే ఎక్కడన్నా ఓ చిన్న ఇల్లు చూసి పెట్టమని చెప్పాడు. తెచ్చిన సరకుతో ఫకీర్ ఒక ఊరు….కొడుకు రియాజ్ మరో ఊరు వెళ్లి చద్దర్లు అమ్మి సాయంత్రానికి మా ఇంటికి వచ్చేవాళ్లు.
ఫకీర్ వచ్చి చాలారోజులైనా ఇంకా ఖవ్వాలీ పెట్టలేదని  ఊరి జనం అడుగుతున్నారు. రేపో మాపో వీలు చూసుకొని తప్పకుండా ఖవ్వాలీ పెడతానని హామీ ఇచ్చాను.
ఫకీర్ ఖవ్వాలీ కోసం జనమంతా ఎదురుచూస్తున్నారు.
***
‘ సాబ్ మీరే న్యాయం చెయ్యాల’  అనుకుంట ఇంట్లెకు వచ్చిండు పీర్ సాబ్.
‘ ఏమైంది పీర్ సాబ్. ఏం సంగతి..? ఎడ్ల వ్యాపారం ఎలా ఉంది..? ‘  అని అడిగిన.
” ఏం చెప్పమంటవ్ సాబ్. నిన్న మొన్న ఊళ్లే తిరిగి నాలుగు ఎడ్లు, రెండు ముసలి బర్లు కొన్న… కానీ వాటిని అమ్మకూడదు అంటూ  గొడవ చేస్తున్నరు. జర మీరె న్యాయం చెప్పాలే.”  బతిమాలిండు పీర్ సాబ్.
మాఊరిలో దూదేకులోళ్లు చాలా మంది ఉన్నరు.  వాళ్లు రైతుల దగ్గర వ్యవసాయానికి పనికిరానివో, ముసలివో ఎద్దులు, ఆవులు కొని పట్నంల అమ్ముతరు. ఇది ఇవాళ కొత్తగా జరుగుతోంది  కాదు. వాళ్ల తాతల కాలం నుంచీ అదే పని చేస్తున్నరు.
‘ఆపింది ఎవరు.?’ అని అడిగిన.
ఇంకెవలు సాబ్ మీ కొడుకు వెంకట్… కొంతమంది పోరగాళ్లను తెచ్చి ” ఎద్దులు, ఆవులు ఇప్పటి నుంచి అమ్మొద్దు,కొనొద్దు. దూదేకులోళ్లని ఎద్దుల బేరం మానెయ్యమని బెదిరిస్తున్నడు. తాతల కాలం నుంచి ఇదే బతకు తెరువుగా బతుకుతున్నం. ఇప్పుడు ఒక్కసారిగా మానెయ్యమంటే ఎట్ట సాబ్.” ప్రాధేయపడుతున్నడు.

“ నేను మాట్లాడుత గనీ నువ్ పో ” అని పీర్ సాబ్ ను పంపిన.
నాకు ఒక్కడే కొడుకు. పట్నంల ఇంజనీరింగ్ చదువుతున్నడు. చదువు సంగతి
ఏమోగానీ రాజకీయాలు మాత్రం బాగా నేర్చుకున్నడు. దేవుని పేరుతోని
రాజకీయాలు….!
” ఏరా వెంకట్…దూదేకులోళ్లని పశువులు కొనొద్దని బెదిరించినవట నిజమేనా…?”  కోపంగా అడిగాను మా వాణ్ని.
“అవును నాయన. జంతువుల్ని చంపడం పాపం కద నాయిన.”
“ మరి మనం కోళ్లను, గొర్రెల్ని చంపితే పాపం కాదా. మనం చేస్తే పుణ్యం,వాళ్లు చేస్తే పాపమా…? వాళ్లు వాటిని కోపంతోనో, పగతోనో చంపడం లేదు. తినడం కోసం కోసుకుంటున్నరు.

జంతువులను చంపకూడదు  అన్న మీ వాదం గొప్పదే కానీ…జంతువును చంపకుండా బతికే స్థాయికి మనిషి ఇంకా ఎదగలేదు. ఒకలిద్దరు ఎదిగి ఉండొచ్చు. జనమంతా ఆ స్థాయికి చేరినప్పుడు ఒకడు నిషేధించాల్సిన
పనిలేదు. ఎవడికి వాడే మానేస్తాడు. నీ బలవంతం ఎందుకు…? ”

నా ప్రశ్నకు బదులు చెప్పలేదు. కోపంతో గబగబ అక్కన్నుంచి వెళ్లిపోయిండు.
***
chandram2“ మీ కాశ్మీర్ లో చాలా మందికి ఎందుకు మన దేశమంటే ప్రేమ లేదు.? ఎందుకు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు. పబ్లిక్ గా పాకిస్తాన్ జండాలు పట్టుకుని ఊరేగుతారు” మా వాడు వెంకట్,  ఫకీర్ కొడుకు రియాజ్ తో వాదనకు దిగాడు.
నేను , ఫకీర్ ఆసక్తిగా గమనిస్తున్నాం.
” అందరూ ఒకలాగా ఉండరు కదా….ఒక్కో మనిషి ఒక్కోలాగా ఆలోచిస్తడు భాయ్.’
రియాజ్ బదులిచ్చిండు.
” మా సైన్యం లేకుంటే….మిమ్మల్లి పాకిస్తాన్ ఎప్పుడో ఆక్రమించేసి ఉండేది. కాదంటారా.?”
” అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు. పేపర్లో, టీవీల్లో వచ్చేదంతా నిజం కాదు.”
“ఏది నిజం కాదు. మా కాశ్మీరీ పండిట్లను బలవంతంగా తరిమేశారు. అది నిజం కాదా. వాళ్లు బిచ్చగాళ్లలా ఢిల్లీ వీధుల్లో ఇబ్బందులు పడేది నిజం కాదా. హిందువులు కాబట్టే కదా వాళ్లని తరిమేశారు”..ఆవేశంగా అడిగాడు మావాడు.
“ హిందువుల మీద మాకు ఎప్పుడూ కోపం లేదు భాయ్.  ప్రతీ సంవత్సరం వేలాది మంది హిందువులు అమర్ నాథ్ యాత్రకు వస్తున్నారు కదా. వాళ్లు మా నేలమీద అడుగు పెట్టిన దగ్గరనుంచీ డోలీల్లో  మోసుకెళ్లడం, గుర్రాలపైన తీసుకెళ్లడం, దేవుడ్ని దర్శనం చేయించడం … ప్రతీ పని ముస్లింలే చేస్తారు తెలుసా భయ్యా.? ”
“ మీ కోసం కోట్లు ఖర్చు చేసి సెక్యూరిటీ ఇస్తున్నాం. ఐనా మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారు..? ”
“ సెక్యూరిటీ అంటే ఏది భయ్యా. మా ఆడవాళ్లను అందరి ముందే బలవంతం చేసి పాడు
చేయడం…యువకుల్ని పిట్టల్లా కాల్చేయడం… ఆఖరుకు స్కూలుకెళ్లే పిల్లల్ని కూడా  రాక్షసంగా…” మాట రాక భోరుమన్నాడు రియాజ్.
మావాడికి ఏం చెప్పాలో తోచక చూస్తూ ఉండిపోయాడు.
” రియాజ్ భేటా ఏమీ అనుకోకు. వాడికి నీ మీద కోపం లేదు. మా దగ్గర జనం అనుకునేదే నీతో అన్నాడు ” అంటూ రియాజ్ ను దగ్గరకు తీసుకున్నాను. ఆవేశంలో రియాజ్ ఏదో అన్నాడు కానీ…తర్వాత వాడు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. వెళ్లి పడుకోమని చెప్పాను.

నేను ఫకీర్ డాబాపైకి వచ్చాము.
” ఫకీర్ మావాడి మాటలకు బాధపడుతున్నావా..”
” లేదు భయ్యా. ఆ ప్రశ్నలు మీ వాడివే  కాదు. మిగతా దేశమంతా మమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలని తెలుసు. భయ్యా.., ఇప్పుడంటే కాశ్మీర్ పేరు చెపితే ఉగ్రవాదం….మతం అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు మాది ఈ దునియా మొత్తం మీద అత్యంత సుందర ప్రదేశం.
మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఓ సారి కాశ్మీర్ కు  వచ్చాడట. అందమైన పర్వతాలు…సరస్సులు, అంతకన్నా అందమైన మనుషుల్ని చూసి పులకించి పోయాడట. స్వర్గం అనేది ఉంటే అది కచ్చితంగా కాశ్మీరే  అన్నాడట.

ఒకప్పుడు హిందూ, ముసల్మాన్ రెండూ విడదీయలేనంతగా అల్లుకుపోయిన పోయిన సంస్కృతి మాది. కాశ్మీర్ లో ముస్లింలు-హిందువులే కాదు, బౌద్ధ మతస్తులు చాలామంది ఉన్నారు. సిక్కులూ ఉన్నారు. చాలా మందికి తెలీని సంగతి ఏమంటే యూదు మతస్తులు కూడా ఉన్నారు. అసలు మతమంటేనే తెలియని గిరిజనులూ ఉన్నారు. ఆకాశంలో ఇంధ్రధనస్సులా  అందంగా  మేమంతా కలిసిపోయాం.   అటువంటి మా  ప్రాంతం…. కొన్ని రాజకీయ సైతాన్ ల వల్ల  రావణకాష్టంగా మారింది.

మాతో సంబంధం లేకుండానే…మా ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ లేకుండానే మా నసీబ్ మార్చేశారు. మా జిందగీ  మా చేతుల్లో లేకుండా చేశారు. ”
” ఐతే ఫకీర్ దీనికి పరిష్కారం లేదంటావా…? ”
”  ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది భాయ్ సాబ్….”
” ఉంటే ఎందుకు పరిష్కారం కావడం లేదు…!!?”
”  భాయ్ సాబ్. నిజంగా నిద్రపోయే వాన్ని లేపొచ్చు. మెలకువతో ఉన్న వాన్ని లేపొచ్చు. కానీ నిద్ర నటించే వాన్ని ఎప్పటికీ నిద్రలేపలేం కదా…!?” విషాదం, వైరాగ్యం కలిసిన ఒకలాంటి నవ్వు నవ్వుతూ అన్నాడు ఫకీర్.
నాకర్థమైంది. అంతా అర్థమైంది.  ” నిద్ర నటించేవాన్ని లేపలేం కదా..?”
రాత్రంతా ఆ మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి. కళ్లు మూసినా తెరిచినా ఫకీర్ నవ్వే కనిపిస్తోంది.
***

నేను నిదుర లేవకముందే  ఫకీర్, రియాజ్ చద్దర్లు అమ్మేటందుకు పోయిన్రు.
పేపర్ చదువుతుంటే సెల్ ఫోన్ మోగింది. ” భయ్యా…ఎక్కడున్నావ్. అర్జంటుగా పోలీస్ స్టేషన్ కొస్తావా..”  గాభారాగా అడిగాడు ఫకీర్.
” ఏమైంది భాయ్…” కంగారుగా అడిగాను. ” రియాజ్, రియాజ్ ను పోలీసులు పట్టుకున్నరు.” ఫోన్ లో చెప్పలేక పోతున్నాడు ఫకీరు.  సరే నేను వెంటనే వస్తున్నా అని చెప్పి బండి తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లాను.
ఫకీర్ నాకు పరిచయమై ముప్పై ఏళ్లపైనే అయింది. కానీ ఎప్పుడు పోలీసు స్టేషన్ తో పని పడలేదు. ఏమై ఉంటుంది..? బహుశా లైసన్స్  లేదని పోలీసులు పట్టుకుని ఉంటారా..? ఆలోచల్లోనే స్టేషన్ దగ్గరకు చేరుకున్నాను.

అక్కడంతా గుంపులు గుంపులుగా జనం. ఐదారు ఛానళ్ల రిపోర్టర్లు కెమెరాల ముందు ఏదో చెబుతున్నారు. గబగబా లోపలకి వెళ్లాను.

అక్కడ దూరంగా ఫకీర్ చేతులు కట్టుకుని దీనంగా నిలబడి ఉన్నాడు.  నన్ను చూడగానే ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా కావలించుకుని “భాయ్ “అని ఏడ్చిండు.
‘వీళ్లు మీకు తెలుసా సాబ్”  ఎస్సై ఆశ్చర్యంగా అడిగిండు. చాలా కాలం నుంచి పరిచయమేనని చెప్పిన.
” ఈ ఏరియాల టెర్రరిస్టులు తిరుగుతున్నరని మాకు ఇంటలిజెన్స్ రిపోర్టు ఉంది. అందుకే  నిఘా పెట్టినం. ఈ కుర్రాడు అనుమానస్పదంగా తిరుగుతుంటే ఎవరో కంప్లైట్ చేసిన్రు. కాశ్మీర్ అంటున్నాడు.  అందుకే అనుమానం వచ్చి అరెస్టు
చేసినమన్నా”డు ఎస్సై.
లోకల్ ఎమ్మెల్యే తోని ఫోన్ చేయించి మొత్తానికి ఫకీర్ ను, రియాజ్ ను ఇంటికి తీసుకొచ్చాను. ఇంటరాగేషన్ల దెబ్బలు బాగా కొట్టినట్టున్నారు..
రియాజ్ నడవలేక పోతున్నాడు.
కొడుకు వంటిమీద దెబ్బలు చూసి….ఇంటికొచ్చిన తర్వాత కూడా ఫకీర్ ఏడుస్తనే ఉన్నడు. రాత్రికి పెట్టాలనుకున్న ఖవ్వాలీ కూడా జరగలేదు.
” భాయ్.. ” మెల్లగా పిలిచాడు ఫకీర్.

ఎన్నడూ లేనిది ఫకీర్ కళ్లల్లో మొదటిసారి భయం చూశాను.
” భాయ్ నేను కాశ్మీర్  వెళ్లిపోతాను”  అన్నడు.

”  అదేంది భాయ్..ఇపుడేమైందని.నేను చూసుకుంటాను. కదా…?’
” . మేం ఇక్కడ ఉండలేము భాయ్. తెల్లవారక ముందే బస్ లో హైదరాబాద్ వెళ్లిపోతాము ”  కరాఖండిగా చెప్పాడు ఫకీర్.
***

టైం తెల్లవారు ఝాము నాలుగవుతోంది. ఫకీర్ గబగబ కొడుకుని లేపాడు. నేను ఇంట్లోకి వెళ్లి కొంత డబ్బు తెచ్చి చేతిలో పెట్టాను. ‘వద్దు భాయ్. ఛార్జీలకు మాత్రం చాలు’ అని ఓ రెండు నోట్లు తీసుకుని మిగిలిన డబ్బు మళ్లీ నా చేతుల్లోనే పెట్టాడు.

ఆ చీకట్లోనే కిలోమీటర్ దూరంలో ఉన్న బస్టాపు దాకా నడిచి వచ్చాం.
” ఫకీర్ భాయ్ ఇంకో సారి ఆలోచించు.  పోక తప్పదా”  అన్నాను.
”  లేదు భాయ్….ఇక్కడ జరిగిన దానికి భయపడి పోవడం లేదు. మేం గొడవల్లోనే పుట్టాం. గొడవల్లోనే పెరిగాం. అక్కడ బతికే దారిలేక ఇలా దేశాలు తిరుగుతూ బతుకుతాం. అక్కడ మాకు అందమైన ప్రకృతి ఉంది. కానీ ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు. మీ ఊరు నాకెందుకు ఇష్టమో తెలుసా.  మీ ఊరు మొదటిసారి వచ్చినప్పుడు వింతగా చూశాను. ఎందుకంటే ఇక్కడ మతం లేదు. పీర్ల పండగను అందరం కలిసి చేసుకున్నం. రాముని పండగకు భజనలు చేసినం. క్రిస్మస్ కు ప్రార్థనలు చేసినం. కులం, మతం అన్నీ మర్చిపోయి…. ఖాళీ మనుషుల్లాగా బతికినం.  అందుకే మీ ఊరు నా ఊరు కన్నా బాగా నచ్చింది.  కానీ ఇప్పుడు ఈ ఊరుకు మతం సైతాన్ పట్టింది.

మతం పేరు చెప్పి చేసే రాజకీయం సైతాన్ లాంటిది భాయి. ఒకసారి పట్టిందంటే చంపేదాకా వదలదు. మతం-రాజకీయం కలిసి చేసే మారణహోమం ఎంత విధ్వంసంగా ఉంటుందో మేం కళ్లారా చూశాం. అది ఇప్పుడు మీదాకా
పాకింది. జాగ్రత్త భాయ్. ”
ఫకీర్ మాటలు నాకు మా ఊరిని కొత్తగా చూపిస్తున్నయి. ఇంతకాలం ఈ ఊరిలోనే ఉంటూ నేను గ్రహించని నిజం అతను రెండు రోజుల్లోనే గ్రహించాడు.
బస్సు వచ్చింది. ఫకీర్, రియాజ్ ఎక్కారు. బస్సు దుమ్ము లేపుకుంటూ కదిలిపోయింది.

మెల్లగా మా ఊరి వైపు నడిచాను.
“ఊరు మారిపోయింది భాయ్. మతం పిశాచి ఆవహిస్తోంది…..జాగ్రత్త భాయ్..”అంటూ
ఫకీర్ చేసిన హెచ్చరిక మళ్లీ మళ్లీ గుర్తుకువస్తోంది.
జాతరలో మత ప్రచారాలు…
పిల్లలచేత మత గ్రంథాలు బట్టీ పట్టించడం…
మేం చెప్పిందే తినాలని భయపెట్టడం…
పరాయి మతస్తుడైన ఫకీర్ కొడుకును ఉగ్రవాదిగా అనుమానించడం…
ఇవన్నీ ఊరికే జరిగినవి కావని ఫకీర్ చెప్పాక అర్థమవుతోంది.
పూర్తిగా తెల్లవార వచ్చింది.
దూరంగా కొండల మధ్యనుంచి రకరకాల వర్ణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ రంగులు
పూసుకున్న భూతాల్లా పైకి లేస్తున్నాయి.

రక్తం లాంటి వర్ణం ఆకాశమంతటా పరచుకుంది.

ఎప్పడూ అందంగా కనిపించే ఆ పొద్దు ఇవాళ ఎందుకో వికృతంగా కనిపిస్తోంది. అప్పటి వరకూ ప్రశాంతంగా మా ఊరిలాగే ఉన్న ఆకాశాన్ని….ఆ రంగు భూతం అల్లకల్లోలం చేసింది. భయంకర బ్రహ్మ రాక్షసి చేసుకున్న రక్తపు వాంతిలాగా ఉంది ఆ రంగు. లోకమంతటినీ కబళిస్తూ…రాకాసిలా చీలికల నాలుకలు చాచుకొంటూ వస్తోంది.

విధ్వంసం…వర్ణ విధ్వంసం, ఆవాహనం వర్ణవాహనం……

మొదటి సారిగా ఆ వర్ణాన్ని చూసి వెన్నులో వణుకు పుట్టింది.  ఆ రంగు ఇప్పుడు మా ఊరివైపు వెళుతోంది.

ఆ రంగుల సైతాన్  నుంచి మా ఊరిని కాపాడుకోవాలి.

పరిగెత్తుతున్నాను…..పరిగెత్తుతున్నాను.

 

*

ఇతివృత్తాలూ….లక్ష్మణ రేఖలూ…

 

-చందు తులసి

~

తెలుగు కథల్లో సామాజిక అంశాలు మరీ పెరిగిపోతున్నాయి! వస్తువుకు మితిమీరిన ప్రాధాన్యం ఇస్తున్నారు!!
కొన్ని రకాల ఇతివృత్తాలతో రాస్తేనే మంచి కథ అనుకుంటున్నారు!!! ఫలితంగా మూసలో తెలుగు కథ చిక్కుకుపోయింది!
ఫలితంగా కథకు నష్టం జరుగుతోంది.  కథకుండే కళాత్మకత దెబ్బతింటోంది! ప్రమాణాలు పడిపోతున్నాయి. పాఠకులు తగ్గిపోతున్నారు!
ఈ మధ్య తెలుగు కథ గురించి వినిపిస్తున్న వాదనలు, ఆరోపణలివి….

సామాజిక అంశాలు పెరగడం వల్ల కథకు నష్టం జరుగుతుందా…?
వొక అంశం వల్ల  పాఠకులు దూరమో, దగ్గర అవుతారా…?
ఈ విషయం గురించి ఎవరేమనుకుంటున్నారు.? ఈ అభిప్రాయాలు మీ చర్చ కోసం

peepal-leaves-2013

కథకు, రచయితకు తను ఉద్దేశించిన పాఠకుల వర్గం వుంటుంది.  ఎవరి కోసం రాస్తున్నామో అనేది కూడా ముఖ్యం కదా. అలాంటపుడు చెప్పే తీరులో తేడా రావచ్చు. అలాగే సామాజిక ఇతివృత్తాలతో కథలు రాసేవారు కూడా కేవలం సమస్యను చెప్పడం దగ్గరే ఆగిపోకుండా…సమస్య లోతుల్లోకి వెళ్లి చర్చించాలి.  అపుడు
ఇటువంటి విమర్శకు అవకాశం వుండదు.  ఐతే విమర్శకులు కూడా గమనించాల్సింది రాసేవాళ్లని రాయనీయండి. మీ విమర్శ కూడా కథకుల్లో అధ్యయనం పెంచేలాగా ఉండాలి. నిర్మాణాత్మక సూచనలు చేయాలి. రచయిత తన కథను మెరుగుపెట్టుకునేలా వుండాలి.

– ఓల్గా

_________________________________________________________________________________________________

రాజకీయం వద్దనడమే పెద్ద రాజకీయం. కేవలం కళాత్మకంగా లేదనే పేరుతో సామాజిక ఇతివృత్తాలపై వచ్చే కథలని తక్కువ చేయలేం. సామాజిక ఇతివృత్తాలు రాయకూడదనుకుంటే ఎవరి జీవిత చరిత్రలు వారే రాసుకోవాల్సి వస్తుంది.  కళ ప్రజల కోసం, సామాజిక ప్రయోజనం కోసమే సాహిత్యం అనే వాదనను…తక్కువ చేయడం కోసమే వస్తున్న వాదన ఇది. ఉద్యమ సాహిత్యం కొంత తగ్గుముఖం పట్టినపుడు ఇటువంటి వాదనలు తలెత్తుతాయి. గురజాడ,  వీరేశలింగం కాలం నుంచి ఇప్పటి దాకా ..అనేక సార్లు ఈ వాదన వచ్చినా… ఎన్నడూ ఈ వాదన నెగ్గింది లేదు.  సామాజిక సాహిత్యం కోసం ఆలోచిస్తున్నవారు …ఇటువంటి వాదనలు వచ్చినపుడు మరింత అప్రమత్తంగా వుండాలి.  సాహిత్య కృషి మరింత పెరగాలి. రచయితలు ఆ దిశగా మరింత కృషి చేయాలి.

-ఎన్. వేణుగోపాల్

_________________________________________________________________________________________________

అసలు సమస్య …..సామాజిక ఇతివృత్తాలు పెరగడం, తగ్గడం కాదు.  కేవలం సామాజిక ఇతివృత్తాలతో కథలు రాసినా అది వ్యక్తిగతంగా రచయితకే తప్ప కథా సాహిత్యానికి జరిగే నష్టం ఏమీ లేదు. పైగా ఓ రచయిత రాసిన వొకటి రెండు కథలతో …అతని దృక్పథం అంచనా వేయలేము.  వెబ్ మ్యాగజైన్లు వచ్చిన తర్వాత….కొత్త తరహా పాఠకులు వస్తున్నారు. రచయితకు, పాఠకులకు మధ్య చర్చకు అవకాశం పెరిగిపోతోంది.  కాబట్టి సంప్రదాయ రీతిలో ఆలోచించి ….కొత్త తరం సాహిత్యానికి విలువలు ఆలోచించలేము.  అసలు ఇపుడు చర్చించాల్సిన విషయాలు వేరే వున్నాయి. కొత్త తరం రచయితల్లో చాలామంది….విషయాన్ని, సమస్యను లోతుగా అధ్యయనం చేయకుండానే కథలు రాస్తున్నారు.  రచనను సీరియస్ గా తీసుకుంటున్న వారూ తగ్గిపోతున్నారు. ఇవాళ మనం దృష్టి సారించాల్సిన అంశం
ఇది తప్ప…సామాజిక సమస్యలు పెరగడమే, తగ్గడమో కాదు.

-జీఎస్ రామ్మోహన్

_________________________________________________________________________________________________

సామాజిక స్పృహ అనేది రచయితకు వుండడం, తన రచనల ద్వారా వ్యక్తి తనలోనికి తను చూసుకునే విధానాన్నో, వ్యక్తి సమాజాన్ని చూసే చూపునో మార్చాలనుకోవడం తప్పు కాదు. బాధ్యత ఉన్న ఏ రచయిత ఐనా అదే పని చేస్తాడు. రచనకు అవసరమైన విషయం, అసలైన ప్రయోజనం కూడా అదే. ఐతే రచయిత తన బాధ్యత ఎంత ప్రతిభావంతంగా నెరవేరుస్తున్నాడనేది కథ ప్రమాణాలను నిర్ణయిస్తుంది. విమర్శకులు చేయాల్సింది అలాంటి గుణాత్మకమైన విశ్లేషణ.

ఇక మంచీ చెడు అన్ని కాలాల్లోనూ వుంటాయి. ప్రమాణాలు లేని రచనలూ ఎల్లపుడూ వుంటాయి. ఆ మంచి చెడ్డల నిష్పత్తి కొంచెం అటు ఇటుగా మారుతుండవచ్చు అంతే. పాతకాలం నాటి సాహిత్యం ప్రమాణాలతో ఇప్పటి సాహిత్యం పోల్చి గతమే మంచి అనుకోవడం మాత్రం పొరపాటు. ఈ రోజుకీ సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించే రచయితలు వున్నారు. అందులో కొంతమందైనా మంచి కథలు రాస్తూనే ఉన్నారు.

-రమణమూర్తి

_________________________________________________________________________________________________

రచయితలతో పాటూ, పాఠకులు కూడా రకరకాల స్థాయిల్లో వుంటారు. ఆ క్రమంలో నువ్వెక్కడ వున్నావు అనే ప్రశ్న వుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికిన రచయితలు ప్రకటించుకుంటారు. దొరకని వారు వెతుక్కుంటారు. ఆ అవసరమే లేదనే వారికి కూడా నిర్వచించలేని పరిధి ఏదో వుండి వుంటుంది. సమాజంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక పరిణామాలు ఏదో మేరకు సాహిత్యాన్ని కూడా
ప్రభావితం చేస్తాయి కనుక…లాభం, నష్టం కేవలం కథవి మాత్రమే కాదు. ఇవాళ తెలుగు కథలో బహుళ తాత్వికతల సమన్వయం జరుగుతోంది. మార్క్సిజం-అంబేడ్కరిజం, మార్క్సిజం-స్త్రీవాదం…వంటి కాంబినేషన్స్ ను రచయితలు స్వీకరిస్తున్నారు. ఇవి తక్షణ ప్రయోజనాలా, దీర్ఘ కాలిక ప్రయోజనాలా అన్నది వేరే చర్చ. నలుగురి మేలు కోరే ..భావాల్ని పంచుకోవాలనుకోవడం ప్రధానం. అది ఎంత గాఢంగా, కళాత్మకంగా ఉంటే అంతగా సాహిత్యం ఉత్తమ స్థితిలోకి వెళ్తున్నట్లు.

-కె.ఎన్ మల్లీశ్వరి.

_________________________________________________________________________________________________

కథకులు ఎంచుకునే అంశాల వల్ల కథకు నష్టాలుండవు, లాభాలూ ఉండవు. మంచి కథని ఎంచేటప్పుడు అందులో అంశం సామాజికమా, సాంస్కృతికమా, శాస్త్రీయమా అన్నది లెక్కలోకి రాదు. అంశమేదైనా, దాన్ని కథగా ఎలా మలిచారనేది ముఖ్యం. ఆ పని సవ్యంగా చేసినప్పుడు – ఇతివృత్తం ఏమిటనేదానితో సంబంధం లేకుండా అది కథకి మంచే చేస్తుంది. అయితే మంచి కథ రాయటం చాలా కష్టమైన విషయం.

మరి అంత కష్టపడటం ఇష్టం లేనివాళ్లు కథలు రాయాలంటే ఎలా? దానికో దగ్గరి దారుంది. అదే సీజనల్ సాహిత్యం. ఏదేని విషయంపై దేశంలో సంచలనం చెలరేగుతున్న తరుణంలో ఆ ఇతివృత్తంతో వచ్చే కథలకి ఎంతో కొంత డిమాండ్ ఉంటుంది. చిక్కటి కథనం, బలమైన పాత్రలు, పదునైన సంభాషణలు, ఇలాంటివేమీ లేకపోయినా కేవలం ఆ ఇతివృత్తానికి ఆ సమయంలో ఉన్న ‘గ్రావిటీ’ ఇలాంటి కథలకి లేని బరువు సమకూరుస్తుంది. తెలుగులో ఈ తరహా కథలు రాన్రానూ పెరిగిపోతున్నాయి. దారుణ సంఘటనల దరిమిలా జనాల్లో నెలకొనే తాత్కాలిక ఉద్వేగాలు, ఉద్రేకాలే ఇంధనంగా బండి నడిపించే ప్రయత్నాలివి. ఈ కథల్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వీటిలో చాలావరకు ఉదాత్తమైన వస్తువే తప్ప మంచి కథకుండాల్సిన లక్షణాలేవీ ఉండటం లేదు. ఆ విషయం ఎత్తిచూపిన వాళ్లని – ఆ కథలోని ప్రధానాంశాన్ని బట్టి – దురహంకారులనో, ప్రగతి నిరోధకులనో, మైనారిటీ వ్యతిరేకులనో, ఇంకోటనో ముద్రలేసే పరిస్థితి! దాంతో నికార్సైన విమర్శకులు నోళ్లు మూసుక్కూర్చుంటున్నారు. కథ ఎలా ఉన్నా చప్పట్లే రాలుతుంటే, అది చూసి, కథంటే ఇలాగే ఉండాలి కాబోలనుకుని యువకథకులూ అదే దారి పడుతున్నారు. హారర్, సస్పెన్స్, డిటెక్టివ్, క్రైమ్, హాస్యం – మొదలైన విభాగాల్లో మంచి తెలుగు కథొకటి చదివి ఎన్నేళ్లయిందో గుర్తు తెచ్చుకోండి. వెల్లువలా వచ్చి పడుతున్న ‘సందేశాత్మక’ కథల దెబ్బకి ఇతర తరహా కథలిష్టపడే పాఠకులు పారిపోయారు. ఫలితం? ప్రస్తుతం తెలుగులో పాఠకులకన్నా కథకుల సంఖ్య అధికం!

కాబట్టి నష్టం కలిగేది కథాంశం వల్ల కాదు. వస్తువుకి మితి మీరిన ప్రాధాన్యత ఇవ్వటం వల్ల; కొన్ని రకాల అంశాలని కళ్లకద్దుకుని కొలిచే ధోరణి వల్ల.

– అనిల్ -ఎస్-రాయల్

_________________________________________________________________________________________________

తెలుగు సాహిత్యం వికాసం. అభివృద్ధి, మొదటి నుంచీ వివిధ సంఘటనలతోనే ముడిపడి వుంది. మొదటి సంస్కరణ వాద కథల నుంచీ, అటు తర్వాత వామపక్ష ఉద్యమ ప్రభావం నుంచీ…ఇవాళ్టిదాకా అది విడదీయలేనంతగా కొనసాగుతూనే వుంది.

భవిష్యత్ లోనూ కొనసాగుతుంది. ఐతే  వ్యక్తి ప్రయోజనాలకే పెద్ద పీట వేసే పశ్చిమ దేశాల సాహిత్యం ప్రభావంతో మన దగ్గర కొందరు ఇటువంటి వాదన చేస్తున్నారు.  వర్తమానంతో సంబంధం లేని సాహిత్యం వుండదు.  కథలో కానీ, సాహిత్య రూపాల్లో కానీ వ్యక్తికి, అతని భావాలకు తప్పక ప్రాధాన్యం వుంటుంది. వుండి తీరాలి.  కానీ సమాజంలో కొన్ని సంఘటనలు జరిగినపుడు వ్యక్తి తప్పక ప్రభావితం అవుతాడు. అది కథగా మలిచినపుడు చెప్పిన తీరులో కొంత హెచ్చు తగ్గులుండవచ్చు. ఆ చెప్పిన తీరుపైన చర్చ చేయవచ్చు కానీ అసలు సామాజిక అంశాలే కథల్లోకి రాకూడదు అనడం అవగాహనా రాహిత్యమే.

-కరుణాకర్ ఎనికపాటి

_________________________________________________________________________________________________

ఫలానా అంశాల వల్ల కథకు నష్టం జరుగుతోందనే వాదన నేను విశ్వసించను. వొక రచయిత కథ చెప్పిన తీరులో తేడాలుండవచ్చు. వొక సారి ఉత్తమ స్థాయిలో చెప్పవచ్చు. కొన్ని సార్లు యథాతథంగా రచయిత చూసింది… జరిగింది రాయొచ్చు. ప్రతీ అంశాన్ని కళాత్మకంగా చెప్పే వెసులుబాటు రచయితకు ఉండకపోవచ్చు. చెప్పిన తీరుపైన చర్చ చేయవచ్చునేమో కానీ….ఫలానా అంశం చెప్పకూడదని అనలేం
కదా.

-పింగళి చైతన్య

_________________________________________________________________________________________________

మొత్తంగా ఈ అంశం సున్నితమైనదే కాదు… విస్తృతమైనది కూడా. కనుక ఈ అంశంపైన సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరముంది.
కథను సీరియస్ తీసుకున్న కొత్త తరం రచయితలకు, కథకు ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశమే ఈ చర్చలోని అసలు ఉద్దేశం. ఈ దిశగా మీ ఆలోచనలు, భావాలను పంచుకోవాలని కోరుతున్నాం.

పండు వెన్నెల…ప్రతి చోటా!

 

 

-చందు తులసి 

~

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వ్యాప్తిలో వున్న ఓ పోస్టు….
ఓ పాప వాళ్లమ్మను అడిగిందట…..
”అమ్మా…మీరు మన బీరువా తాళాలు మన ఇంటి పనిమనిషికి ఎందుకివ్వరు…?” అని…తల్లి ఆశ్చర్యపోయింది. ఐనా అడిగింది తన చిన్నారి తల్లి కాబట్టి ఓపికగా….
” నువ్వు చిన్నపిల్లవు కదా…నీకు తెలీదమ్మా. అలా ఇవ్వకూడదు …”అని చెప్పింది.
 

మళ్లీ ఇంకో ప్రశ్న.
”పోనీ మీ ఏటీఎమ్ కార్డు…మన వంటమనిషికి ఎందుకివ్వవు…?”
తల్లి ఈ సారి…ఆశ్చర్యపోతూనే కోప్పడింది.
”నీకు ఇపుడు చెప్పినా అర్థం కాదమ్మా…చిన్న పిల్లవు కదా”  అంది.
” పోనీ మన దగ్గర ఎంత డబ్బు ఉందో మన ఇంట్లో పనిచేసే తోటమాలికి ఎపుడైనా చెప్పావా..?”
 

ఈ సారి తల్లికి విసుగు, అంతకన్నా కోపం వచ్చింది.
” వొక్క సారి చెబితే అర్ధం కాదా.. మన దగ్గరున్న విలువైన వస్తువుల గురించి పరాయివాళ్లకు చెబుతామా..? చెబితే వాళ్లు దోచుకోరూ…”అంది.
” డబ్బులు, ఏటీఎమ్ కార్డులు, మాత్రం జాగ్రత్తగా చూసుకుంటారు. మరి నన్ను మాత్రం ఎందుకు ఆయా దగ్గర వదిలేసి వెళతారు.  నేను మీకు విలువైన దాన్ని కానా..? ”  అని ఏడుస్తూ అడిగిందట చిన్నారి.

***
కొంత అతిశయోక్తిగా అనిపించినా……ఆ పాప అడిగిన ప్రశ్నలో మాత్రం నిజం వుంది.  ఆ ప్రశ్న కేవలం ఆ చిన్నారిదే కాదు. మన సమాజంలోని అందరి చిన్నారులది.  కారణాలేవైనా కావచ్చు కానీ ఇవాళ అన్నిటికన్నా ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతోంది బాల్యం.
సరైన తిండి పెట్టక పోవడం, వయసుకు మించిన పని చేయించడం, చిత్రహింసలు పెట్టడం….ఎంత నేరమో వాళ్లకు అవసరమైన జ్ఞానాన్ని అందించకపోవడమూ అంతే నేరం. వాళ్ల ఆలోచనలను పట్టించుకోకపోవడం, వాళ్లను సక్రమ మార్గంలో తీర్చిదిద్దక పోవడమూ అంతే నేరం.
పిల్లలంటే కేవలం…ఇంటర్నేషనల్, టెక్నో, కాన్సెప్ట్….ఇలా రకరకాల ముసుగులు తగిలించుకొన్న కార్పోరేట్ కోళ్లఫారాల్ని నింపడానికే పుట్టే అభాగ్యులు కాదు కదా….??
తల్లిదండ్రుల సాధించలేని కోరికలు,  సాధించి పెట్టడానికి దొరికిన కోరికల కొనసాగింపులూ కాదు కదా……??
మరో ఇరవై ఏళ్ల తర్వాత…..మల్టీ నేషనల్ కంపెనీల అవసరాలు తీర్చడం కోసం….తయారవుతున్న రోబోలు కాదు కదా..! …??
 

హరివిల్లుపై జారాలనో, నెలవంకకు ఊయల కట్టి ఊగాలనో…వెన్నెల్లో గోరు ముద్దలు తినాలనో కాకున్నా…..
అమ్మా నాన్నతో కబుర్లు చెప్పాలనో, నాన్నమ్మ, తాత దగ్గర కథలు వినాలనో….లేదా తమకు నచ్చినట్లు తామే కథలు చెప్పుకోవాలనో ఉంటుంది కదా….!
పిల్లలకూ ఆలోచనలుంటాయని, వాళ్లకూ అంతులేని సృజన ఉంటుందనీ ఎవరు గుర్తించాలి…? అవకాశం ఇవ్వాలే కానీ వాళ్లూ సృజనాత్మకత విషయంలో పెద్దవాళ్లకూ తీసిపోరని ఎవరు నిరూపించాలి…? పంజరాల్లాంటి తరగతి గదుల్లోంచి బయటకు తీసుకొచ్చి…. పాఠాలు, పంతుళ్లు, పుస్తకాలకు అందనంత దూరంగా తీసుకెళ్లి, ఓ పెన్నూ పేపరూ ఇచ్చి…. ” పిల్లలూ మీకోసం మీరే ఏం రాసుకుంటారో రాసుకోండర్రా”  అని అంటే….పిల్లలు ఏం రాస్తారు…? ” పిల్లలూ మీకు రెక్కలొచ్చాయి అనుకోండి….అపుడేం చేస్తారు….” అని అడిగామే అనుకోండి. ఊహకైనా అందని ఆ ఆనందాన్ని పిల్లలు ఎలా పంచుకుంటారు.? అలాంటి అబ్బుర పరిచే ఆలోచనల సమాహారమే  సంస్కృతి పబ్లికేషన్ ప్రచురించిన పండు వెన్నెల పుస్తకం. తమ లాంటి చిన్నారుల కోసం…తామే కవులూ, రచయితలూ అయిపోయి కలాలు భుజాన వేసుకుని రచనల సంకలనం.  ఇంతకీ ఈ పండు వెన్నెల ఎలా మొదలైందో చెప్పాలంటే ఓ నెల వెనక్కు వెళ్లాలి.
 

చిన్నారుల్లో దాగి ఉన్న సాహిత్యాభిలాషను, అభిరుచులను, కళలను వెలికి తీసేందుకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు సంస్కృతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం నవతరంతో యువతరం అని ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్నంతా భుజాల మీద మోసింది  ప్రముఖ కథా రచయిత్రి  డా. కె.ఎన్. మల్లీశ్వరి ( ప్రజాస్వామిక రచయితల వేదిక),  కత్తి పద్మ ( మహిళా చేతన సంస్థ),  నిశాంత్ లు. చిన్నారి సాహిత్య కారులు….యువతరం రచయితలతో సమ్మేళనం చేసే ఈ కార్యక్రమంలో సీనియర్ రచయితలూ చాలామంది పాల్గొని తమ ఆలోచనలూ పంచుకున్నారు.
 

కేవలం కథలు చదవడం, రాయడం…వాటి గురించి చర్చించడమే కాదు. పక్కనే ఉన్న గిరిజన ప్రాంతాన్ని సందర్శించారు. దోపిడీని ప్రతిఘటిస్తున్నందుకు అణచివేతను ఎదుర్కొంటున్న అడవిబిడ్డలతో మీకు తోడుగా మేమున్నాం…అని ధైర్యం చెప్పారు.  ఇలా సాహిత్యం, సామాజిక స్పృహ కలగలిసిన ఈ కార్యక్రమం  కేవలం విశాఖ జనాన్నే కాకుండా….తెలుగు సాహిత్య కారులందరినీ ఆకట్టుకున్నది.
 
ఆ నవతరంతో యువతరం కార్యక్రమంలో పాల్గొన్న నేటి, రేపటి తరం సాహిత్య కారుల ఆలోచనలని పండు వెన్నెల పేరుతో ప్రచురించింది సంస్కృతీ పబ్లికేషన్ సంస్థ. ఈ పుస్తకంలో అనుభవాలే కాకుండా బాల రచయితల కథలు, కవితలు కూడా ఉన్నాయి. రాసింది చిన్నారులే ఐనా ….పెద్ద రచయితలకు తామే మాత్రమూ తీసిపోమని నిరూపించారు.
 

కంటనీరు కూడా కలుషితమవుతున్న కాలమిది…అంటూ తన కవితలో ఆవేదన వ్యక్తం చేస్తుంది సోనా-శాంతి. సాహిత్య కారులు ఎటువైపు నిలబడాలో సూచిస్తాడు పృధ్వీ.  పెన్నుతో కాదు భావోద్వేగంతో రాస్తున్నానంటాడు జస్వంత్.   ప్రకృతి విధ్వంసాన్ని ప్రశ్నిస్తుంది…. మన్విత.   అంతం కాదిది ఆరంభం అంటుంది మహాలక్ష్మి. శ్రీశ్రీని గాఢంగా అభిమానించడమే
కాదు…శ్రీశ్రీలా కవిని అవుతానంటాడు మరో చిన్నారి. ఇలా ఈ బుల్లి సాహిత్య కారులు తమ రచనల్లో వయసుకు మించిన పరిణతి ప్రదర్శించారు.  చిన్నారులతో పాటూ కార్యక్రమంలో పాల్గొన్న యువ రచయితలు, సీనియర్ రచయితలూ తమ అనుభవాలనూ, పరిశీలనలూ వివరించారు.
 
సంపాదకులు చెప్పినట్లు ఈ పుస్తకం బాల సాహిత్యం మాత్రమే కాదు…పెద్దల సాహిత్యమూ కాదు. ఈ పుస్తకం విడి విడిగా రాసిన రచనల సంకలనమూ కాదు. అందరి ఆలోచనల సమాహారం.  ప్రతీ పేజీని అందంగా,  చిత్రాలతో రూపొందించడం వల్ల
పిల్లలను ఆకట్టుకుంటుంది.

చివరగా ..ఇలా రేపటి తరం సాహిత్య కారులను గుర్తించి, వారికి సానబెట్టి సమాజానికి అందించే అరుదైన కార్యక్రమాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ముఖ్యంగా …ప్రభుత్వ పాఠశాలల్లో చేపడితే ఎంతో మేలు జరుగుతుంది. తెలుగు నాట అనేక సాహిత్య కార్యక్రమాలు జరుగుతుండడం అందరికీ తెలిసిందే. సన్మానాలు, అభినందన సభల కన్నా…ఇటువంటి కార్యక్రమాల వల్ల సాహిత్యానికి ఉపయోగం. సాహిత్య సంస్థలు, సాహిత్య కారులు  దృష్టి సారించాల్సిన విషయమిది.

(ఈ నెల 16వ తేదీన విశాఖలో పండు వెన్నెల పుస్తకం ఆవిష్కరణ సభ సందర్భంగా…..)

రేపటి మీదే ఆశ!

 

చందు తులసి

~

chanduకథంటే…
కథంటే సమస్యలు కాకపోవచ్చు….
కథంటే పరిష్కారాలు కూడా కాకపోవచ్చు, కానీ…, కథంటే జీవితం. కథలో జీవితం వుండాలి. ఇదైనా ఒప్పుకుంటారా…? ఇది ఇటీవలే జరిగిన కథసాహితీ పాతికేళ్ల సభలో ప్రముఖ రచయిత, విమర్శకులు ఎన్. వేణుగోపాల్ అడిగిన ప్రశ్న .

కథలెలా పుడతాయి. జీవితంనుంచా..? సమాజం నుంచా..? లేక కేవలం సృజనకారుల ఆలోచనల్లోంచేనా..? సృజన అంటే కల్పనే. కానీ ఏ తరహా కల్పన. జీవితాన్ని మరిపించే కల్పనా…? జీవితాన్ని నడిపించే కల్పనా..?
***
గత ఏడాది సారంగ కథల్లో సమకాలీన సమాజానికి దూరంగా వున్న కథలు కొన్నైతే… సమాజాన్ని, జీవితాలను చిత్రించిన కథలు కొన్ని వున్నాయి. అన్నదాత ఆత్మహత్యలాంటి సీరియస్ సమస్యను ఇతివృత్తంగా తీసుకొని కలాన్ని ఛర్నాకోలలా ఝళిపించిన కథ ప్రసాద మూర్తి – ఓ రైతు ప్రార్థన. తెలుగులో అరుదైపోతున్న…వ్యంగ్య రచనా శైలిలో వచ్చిన కథ. రాజకీయ చదరంగంలో రైతుల జీవితాలు ఎలా పావులుగా మారుతున్నాయో ప్రభావవంతంగా చెప్పిన కథ.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని భూ సేకరణ నేపథ్యంలో….అమరావతి, దాని చుట్టుపట్టు పల్లెల్లో వచ్చిన సామాజిక పరిణామాలను చర్చించిన కథ ఎమ్వీ రామిరెడ్డి త్రిశంకు స్వప్నం . కలలో కూడా ఊహించని విధంగా అమాంతంగా పెరిగిపోయిన భూముల ధరలు….ఆ ప్రాంతంలోని మానవ సంబంధాల్ని ఎలాంటి మార్పులకు దారితీస్తున్నాయో ఆసక్తికరంగా వివరించిన కథ.  ఇంచు మించు అదే ఇతివృత్తంతో ఆ ప్రాంతంలోనే జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను వివరిస్తూ వచ్చిన కథ బుద్ధి యజ్ఞమూర్తి మాయ.
అలాగే తెలుగులో దాదాపూ అంతరించి పోతోందేమో అని ఆందోళన కలిగించే ప్రక్రియ ఆరోగ్యకరమైన హాస్యకథ.  ఆ లోటునూ తీర్చిన కథ డా.కోగంటి విజయ్ బాబు రాసిన ఎవరు కవి. నిజాయతీ, చిత్తశుద్ధి లేని కవులు, వారి కవిత్వం దండగ అని తేల్చిచెప్పి, ఆత్మీయంగా స్పందించే చిన్న మాట గొప్ప కవితకు ఏ మాత్రం తీసిపోదు అని విలువైన సందేశం ఇచ్చిన కథ. వెర్రితలలు వేస్తున్న మతమౌఢ్యం, భక్తి పేరిట జరుగుతున్న మోసాల గుట్టు విప్పిన కథలు కే.సుభాషిణి- నీలకంఠం పి.హెచ్.డీ, శివ్-అపరిచితులు కథలు. మూఢాచారాలను ప్రశ్నించిన ఇంద్రగంటి మాధవి- భోక్త కూడా అలాంటిదే. ఈ కథలు చదివిన తర్వాత…మొత్తానికి తెలుగు కథకులు అప్రమత్తంగానే వున్నారన్న సంతోషం తప్పక కలుగుతుంది.
బలవంతులు తమ అధికారం, బలం ఉపయోగించి ప్రకృతి వనరులు కొల్లగొట్టడం….ప్రత్యక్షంగా కనిపించని దోపిడి. ఈ నేరం ఎవరిదైనా శిక్ష మాత్రం అందరూ అనుభవించాల్సిన దుస్థితి. అందుకే ఈ దిశగా పాఠకులని మరింత చైతన్యం చేయాల్సిన బాధ్యత సాహిత్య కారులపైన ఉంటుంది. ఈ బాధ్యతనే స్వీకరిస్తూ… పర్యావరణ మార్పులు, పర్యవసానాలు… సైంటిఫిక్ ఫిక్షన్ తరహాలో ఆసక్తి కరంగా చెప్పిన కథ కొట్టం రామకృష్ణారెడ్డి 3456జీబీ. భవిష్యత్ లో తెలుగు కథలు విరివిగా రావడానికి అవకాశం ఉన్న విభాగం పర్యావరణ పరిరక్షణ. ఐతే ఈ దిశగా మరింత పరిశోధన, అధ్యయనం చేయాల్సి వుంటుంది.

ఇక ఈ కథల్లో అస్తిత్వవాద కథలూ ఒకటి, రెండు వచ్చాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కథ కృష్ణజ్యోతి  నేను తోలు మల్లయ్య కొడుకుని. వర్ణం, కులం, లింగం అన్ని వర్గాల వేదనల్ని సున్నితంగా చర్చిస్తూనే…పరిష్కారాన్ని కూడా చూపించిన కథ. ఇతివృత్తంతో పాటూ…రాసిన తీరు కూడా కొత్తగా ఉన్నకథ.  అలాగే కత్తి మహేశ్ నా హీరోకోసం కూడా మరో మంచి కథ. హాలీవుడ్ స్థాయికి ఎదిగాం అని సంబరపడిపోతోంది తెలుగు సినిమా.  ఓ వైపు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయడానికి ఆరాటపడుతూ…మరోవైపు ఇక్కడే వున్న దళిత, అణగారిన వర్గాల కళాకారులని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమపై సంధించిన ప్రశ్న కత్తి మహేశ్ కథ.  దగ్గర దగ్గర వందేళ్ల చరిత్రకు చేరువవుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో ..ఒక్క దళితుడు హీరోగా లేకపోవడాన్ని, కనీసం ఓ గుర్తింపు పొందిన కళాకారుడు లేకపోవడాన్ని ఏమనాలి. ?  తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన…ముఖ్యంగా అద్భుతమైన పాటను సృష్టించిన దళిత సృజనకారులు సినిమారంగంలో కనీసం ప్రవేశాన్నికూడా ఎందుకు పొందలేకపోయారు…? పోయే కొద్దీ లోతైన చర్చకు దారితీసే అంశమిది. మొత్తానికి ఆ దిశగా ఓ చర్చను
లేవనెత్తిన కథ నా హీరోకోసం.

ఇక ఫెమినిస్టు కథలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే చాలా కథలు మహిళలే రాయడం “సారంగ” కథల్లో కనిపించిన ఒక ప్రత్యేకత.  గ్లోబలైజేషన్ తదంతర పరిణామాలు మహిళల్ని కూడా వేగంగా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములని చేశాయి.  పర్యవసానంగా….కొత్త ప్రపంచాన్ని, కొత్త మనుషుల్ని, మనస్తత్వాల్ని మగువలు ఎదుర్కొంటున్నారు. సహజంగానే కొంత సున్నితత్వం, స్పందించే తత్వం ఉన్న స్త్రీ ఈ ఇతివృత్తాల్ని సాహిత్య రూపంలోకి అనువదించేందుకు ఆరాటపడుతోంది. ముఖ్యంగా వెబ్ పత్రికలు వచ్చిన తర్వాత…ప్రచురించే అవకాశాలు బాగా పెరిగాయి. ఫలితంగా అటు కవిత్వంలోనూ, కథా ప్రక్రియలోనూ మహిళలు అధికంగా రావడం మొదలైంది. తరతరాలుగా తమలోనే ఇంకిపోయిన భావాలను…బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చేందుకు…చర్చించేందుకు మహిళలకు అవకాశం లభిస్తోంది. ఐతే రకరకాల కారణాల వల్ల అంతర్జాల పత్రికల్లో సంపాదకీయం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అవకాశం తక్కువ.  అక్షర దోషాలు, అన్వయ దోషాలు కూడా సవరించకుండానే పాఠకుల ముందుకు రావడం దీన్నే రుజువు చేస్తోంది.  పెరుగుతున్న వెబ్ పత్రికల అవసరాల్ని తీర్చే సంఖ్యలో రచనలు రాకపోవడం వల్ల…సంపాదకులు ప్రమాణాల విషయంలో ఓ మేర రాజీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.  ఫలితంగా వెబ్ పత్రికల వల్ల ప్రమాణాలు తగ్గుతున్నాయనే విమర్శా వినిపిస్తోంది. ఈ విమర్శలో వాస్తవం ఉన్నా, క్రమక్రమంగా రచయితల సంఖ్య పెరుగుతున్నందున… వాటంతటవే ప్రమాణాలు కూడా పెరిగే రోజు రాక తప్పదు.
ఏదైమైనా వెబ్ పత్రికల పుణ్యమాని…మున్ముందు సరికొత్త ఇతివృత్తాలను, భిన్న కోణాలు తెలుగు కథల్లో చూసేందుకు అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఆ పరిణామానికి సూచనలుగా కనిపించే కథలు…రాధిక-ఆలోక.  ఆర్. దమయంతి-అమ్ములు,  రాజ్యలక్ష్మి కథ-మహాలక్ష్మి , పాలపర్తి జ్యోతిష్మతి- వారిజాక్షులందు. . అన్నీ ఉదాత్త పాత్రలున్న ఆలోక కథ ఓ మంచి అనుభూతినిచ్చే కథ. రేపటి తరం గురించిన ఆవేదన వ్యక్తం చేస్తూ….వారిని నిర్లక్ష్యం చేస్తే
వచ్చే పరిణామాలను చూపిస్తూ హెచ్చరించే కథలు… శాంతి ప్రభోద-బాల్యం మోస్తున్న విషాదం,  అన్వీక్ష-తొలి కలుపు,  మమత కొడిదెల-బరువు. ఈ కథలు బహుశా మహిళలు మాత్రమే రాయగలిగినవి. అలాగే సారంగలో వచ్చిన చిన్న కథలు నిడివిలో చిన్నవైనా…. పెద్ద కథలకు ఏ మాత్రం తీసిపోనివి. మా రోజుల్లో అంతా బాగుండేది….అంటూ పెదవి విరచడం కన్నా… కాలంతో పాటూ మనం మారాలని చెప్పే కథ లక్ష్మీ రాఘవ –అనుబంధాల టెక్నాలజీ.  కణ్ణగి-
పిచ్చుకలు, వినోద్ అనంతోజు- చింటూ అమ్మెక్కడ..? లాంటి కథలు.., సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా…తక్కువ పరిధిలోనే ఎక్కువ ప్రయోజనాన్ని సాధించిన కథలు.
చిన్న కథల్లో ఎక్కువగా….కొత్తగా రాస్తున్నవారు, యువత వుండడం గమనార్హం. బహుశా కొత్త తరం రాస్తున్న కథల ద్వారా… తాము ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారో….చెప్పకనే చెపుతున్నారని అనుకోవచ్చు.

ముఖ్యంగా మేడి చైతన్య, ఎండ్లూరి మానస, ప్రజ్ఞ వడ్లమాని చిన్న కథలు విరివిగా రాస్తూ ఆకట్టుకుంటున్నారు. తెలుగు కథల్లో ఇటీవల తాత్విక చింతన, అంతరంగ అన్వేషణ కథలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరలో వచ్చిన కోడూరి విజయ్ కుమార్-చివరాఖరు ప్రశ్న,  బి.హరిత-అన్వీక్షణ కథలు ఆ కోవకు చెందినవే. మానసిక ప్రపంచంలోని అలజడిని, అంతస్సంఘర్షణను కవితాత్మకంగా చిత్రించిన కథ చివరాఖరు ప్రశ్న. అన్వీక్షణ కథ ఆంగ్ల కథా రచయిత ఎండీ వెయిర్ రాసిన ది ఎగ్ స్ఫూర్తితో రాసిన కథ అని స్పష్టంగానే తెలుస్తోంది.( మూల కథను అనిల్.ఎస్.రాయల్ బ్రహ్మాండం పేరుతో సారంగలోనే అనువదించారు.) ఐనా తొలి కథలోనే రచయిత్రి చూపిన పరిణతి,  చేసిన ప్రయోగం అభినందించేలా చేస్తుంది.

ఇక ప్రాంతీయ అస్తిత్వ వాద కథలు ఒక్కటి కూడా లేకపోవడం లోతుగా తరచి చూడాల్సిన అంశం. ఇతర ప్రాంతాల సంగతి ఎలావున్నా….తెలుగు సాహిత్యంలో  ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్న…తెలంగాణ ప్రాంతీయ ఇతివృత్తంతో ఒక్క కథ కూడా లేకపోవడం గమనార్హం.  అల్లం వంశీ (రెండు పట్టాలు...) కథ,  స్కైబాబా-అన్ మోల్ రిష్తే...కథ కనిపించినా అవీ కూడా పూర్తిస్థాయి ప్రాంతీయ కథలుగా చెప్పుకోలేం. తెలంగాణ జీవితాల్ని కానీ, సమస్యలను కానీ పట్టించిన కథలు కానీ లేకపోవడం… ఈ ప్రాంత రచయితల్లో నెలకొన్న ఒక స్తబ్ధతను (ఆన్ లైన్ పత్రికలకు సంబంధించినంత వరకైనా) తెలియజేస్తుంది.  అసలు కథలు రావడం లేదా..వచ్చినా వెలుగులోకి రావడం లేదా…? అని తరచి చూసుకుని ఆ దిశగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ఆ ప్రాంత సాహితీకారులపై వుందన్నది స్పష్టం.

స్థూలంగా చూస్తే రాసిన కథలు బాగానే వున్నా రాయాల్సిన కథలు ఇంకా చాలా  వున్నాయనిపిస్తుంది.  సమాజంలో అనునిత్యం చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనించకుండానో, నిర్లక్ష్యం చేస్తూనో, లేదా ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తూనే రావడం కొంత మింగుడు పడని అంశం. ప్రపంచంలోని ఏ భాషా సాహిత్యం లేదా సాహిత్య ప్రక్రియలో అయినా ఆయా కాలాల్లో వచ్చిన సాహిత్యం ద్వారా ఆనాటి ప్రజల జీవితాల్ని, జీవన విధానాల్ని, సమాజాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించడం సహజం. ఆ రకంగా సాహిత్యం సమకాలీన జీవితాల్ని ఎంతో కొంత తప్పక ప్రతిబింబించాలి.
గత ఏడాది సారంగలో వచ్చిన కథలు సామాజిక కోణంలోంచి చూసినపుడు కొంత నిరాశ కలిగిస్తాయి.  ఇతివృత్తాల ఎంపికలో, కథలను నడిపించిన తీరులో, ముగింపులో ఇలా అడుగడుగునా ఒక కొత్త ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నవారు….సమకాలీన సామాజిక అంశాలను  ఇతివృత్తాలుగా స్వీకరించేందుకు  వెనుకంజవేయడం బాధాకరం.
రచయిత ఏ కథ రాయాలనేది అతని స్వేచ్ఛ. అందులో సందేహం లేదు.  ఆ విషయం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ సామూహికంగా చూసినపుడు ఆ (రచయితలు, సృజనకారుల ) సమాజం మొత్తం దూరంగా ఉండడం వెనక కోణాల్ని, కారణాల్ని మాత్రం తప్పక చర్చించాల్సి ఉంటుంది.  సమాజాన్ని విస్మరించి వచ్చే సాహిత్యం…పెయిన్
కిల్లర్ లాగా తక్షణ సంతృప్తినివ్వవచ్చునేమో కానీ ….దీర్ఘకాలంలో నష్టాన్ని చేస్తుంది. తాత్కాలిక ఆనందాన్నిచ్చే సాహిత్యం….దాని అసలు ప్రయోజనాన్ని, సమాజపు అవసరాల్ని తీర్చలేదు. మొత్తంగా ఇటు వెలుగు, అటు చీకటి అన్నట్లుగా….సారంగ కథలన్నింటిని సింహావలోకనం చేసుకుంటే ఒకింత ఆశ, మరింత నిరాశ కలుగుతుంది. సీనియర్ల స్తబ్ధతను చీల్చుకుంటూ…ఎప్పటికప్పుడు కొత్త కలాలు వెలుగుచూడడం ఆశాభావాన్ని కలిగిస్తుండగా, ఆ రచనల్లో సామాజిక జీవితాన్ని ప్రతిబింబించకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది.

సాహిత్యం సమకాలీన జీవితంతో ఎంతోకొంత ప్రభావితం కావాలి. అలాగే తానూ సమాజాన్ని ప్రభావితం చేయాలి.

మొదటి వ్యాసంలో చెప్పినట్లు ….చాలా మంది  కాలమే  మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం. ఈ మార్పు కొత్త సంవత్సరం కథల్లోనైనా కనిపిస్తుందని ఆశిద్దాం.

***

వారిదే కథాకాశం..!

 

-చందు తులసి

~

 

చందు“రాయడమంటే ……నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం..!

రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.”

ఈ వాక్యాలు  గత ఏడాది సారంగలోనే వచ్చిన వెంకట్ సిద్ధారెడ్డి-సోల్ సర్కస్ కథలోనివి.

***
నిజమే. రాయడమంటే మన లోపల మనం చేసే అన్వేషణ. ప్రస్తుత మన స్వరూపమేమిటో తరచి చూసుకొనే పరీక్ష. ఆదర్శాలు, విలువల రాళ్లతో ఘర్షణ పడి కుబుసం వదిలించుకొని…సరికొత్త రూపం పొందటానికి పడే ఘర్షణ.  ఈ ప్రయాస ఎదుర్కొనేందుకు చాలా కష్టపడాలి. బహుశా అందుకేనేమో ఒక దశ దాటిన కథకుల వేగం తగ్గిపోతుంది.  ఒక్క అక్షరం రాయడానికి వేయి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకంటే తెలుగులో ఇప్పుడు సీనియర్ కథకులు చాలామంది అస్త్ర సన్యాసం చేశారు. ఒకరిద్దరు మాత్రం అప్పుడప్పుడూ చాలా తక్కువగా రాస్తున్నారు.  ఓ వైపు  సీనియర్ కథకులు క్రమంగా తెరమరుగవుతుంటే ఏడాదికేడాది కొత్త కథకులు వేదికపైకి వస్తున్నారు.

గత ఏడాది నామిని రాసిన కథ కోరిన కొండ మీద వాన. తిరుపతి నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ తిరిగే కథ.  భూములకు పెరుగుతూ , మనుషులకు తగ్గిపోతున్న ”విలువ” గురించి జమునమ్మ  అనే పాత్ర నేపథ్యంలో చర్చిస్తుంది. అలాగే మరో సీనియర్ కథకుడు రామా చంద్ర మౌళి రాసిన కథ దిగడానికి కూడా మెట్లు కావాలి. చక్కని శిల్పంతో పాటూ…చిక్కని కథనంతో సాగిపోయే కథ. జీవితంలో ఎదుగుదల కోసం ఉష అనే గాయని సాగించిన గాథ… కథలా కాకుండా ఒక వ్యక్తిత్వ వికాస పాఠం లాగా అనిపిస్తుంది. ఎదుగుతున్నామనుకుంటూ…ఎటు దిగజారుతున్నామో లోతుగా చర్చిస్తుంది.

పురుషాధిక్య భావజాలం, పేద ముస్లింల జీవితాలు, పేదరికంలోని అనుబంధాలను సున్నితంగా వివరించిన కథ  స్కైబాబా రాసిన అన్ మోల్ రిష్తే. టీవీ ప్రోగ్రాములు, ప్రకటనల ద్వారా మనం ఏం కోల్పోతున్నామో, దానికి పరిష్కారమేంటో కొత్తగా చెప్పిన కథ అరిపిరాల సత్యప్రసాద్ రాసిన  అబ్సలీట్ రియాలిటీ.  మహలక్ష్మమ్మ అనే చారిత్రక పాత్ర చుట్టూ అల్లిన ప్రయోగం దాట్ల దేవదానం రాజు కథ మన్యం వోరి మేడ. ఇలా సీనియర్ కథకులు తమదైన ముద్రతో సాగిపోతుంటే….కొత్త రచయితలు కూడా విభిన్న రకాల ప్రయోగాలతో ఆకట్టుకున్నారు.

గత ఏడాది వచ్చిన కొత్త తరం కథకుల్లో ప్రత్యేకించి చెప్పాల్సిన వాళ్లు కొంతమంది ఉన్నారు. రకరకాల కారణాలతో…రంగురంగుల ముసుగులు కప్పుకొని…పైకి ఆనందపు భ్రమల్లో జీవిస్తూ, అంతర్లీనంగా మౌనంగా కుమిలి కుమిలి రోదించే అంతరాత్మలకు, పరదాలను తొలగించి… అసలు జీవించడం అంటే ఏమిటో చూపించిన కథ వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్.  కథ  పేరు దగ్గర నుంచి… కథను నడిపించిన తీరు, కొటేషన్లలా దాచిపెట్టుకోదగిన వాక్యాలు, కథ ముగింపు…ఇలా అన్ని రకాలుగా ప్రత్యేకత సంతరించుకున్న కథ.  సారంగలో మాత్రమే కాకుండా గత ఏడాది వచ్చిన తెలుగు కథల్లోనే ఉత్తమ కథగా సోల్ సర్కస్ ను చెప్పుకోవచ్చు.  అలాగే ఈ కథలోని చిత్వాన్ పాత్ర కూడా పాఠకులను చాలా కాలం వెన్నాడుతుంది.  వెంకట్ సిద్దారెడ్డి రాసిన కాక్ అండ్ బుల్ స్టోరీ, టైం ఇన్ టూ స్పీడ్ కథలు కూడా పాఠకులను ఆకట్టుకున్నాయి. ఐతే కాక్ అండ్ బుల్ స్టోరీ మాత్రం..కథను నడిపించడంలో కొంత సమన్వయం తప్పినట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఇతివృత్తం ఎలాంటిదైనా శిల్పంతో ఆకట్టుకోవడం వెంకట్ సిద్దారెడ్డి కలం బలం.

“జీవితమంటే ప్రయోగం చెయ్యాలి. ధైర్యం చెయ్యాలి. కష్టాలుంటాయి. కన్నీళ్ళుంటాయి. ఒంటరితనం ఉంటుంది. ఏకాంతం ఉంటుంది. ప్రేమించేవాళ్ళు ఉంటారు. ద్వేషించే వాళ్ళు ఉంటారు.  జీవితం…ఎవరికి వారు వారి జీవితానికి తగినట్లు చేయాల్సిన సాధన”  అంటూ చిన్నచిన్న పదాలతోనే జీవితానికి సరికొత్త భాష్యం చెప్పిన కథ పింగళి చైతన్య తనదే ఆ  ఆకాశం.  సహజంగా,  సరళంగా…ఒక ప్రవాహంలా సాగిపోయే కథ.  ఒక ఒంటరి మహిళపట్ల సమాజానికుండే అభిప్రాయాలు, సందేహాలకు …తనదైన సొంత వ్యక్తిత్వంతో సమాధానం ఇచ్చిన లక్ష్మి కథ. సాధారణ ఫెమినిస్టు కథలకు భిన్నంగా ఉండడంతో పాటూ లక్ష్మి పాత్రను నడిపించిన తీరు, రచయిత్రి శైలి కూడా పాఠకులను ఆకట్టుకుంటుంది. అలాగే కులాంతరం వివాహం చేసుకున్న మహిళ సమస్య…నామాలు కథ కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Untitled-2

అల్లం కృష్ణ చైతన్య రాసిన …చుక్కలు తాకిన చేతులు కథ కూడా శైలి పరంగా భిన్నమైన కథ. రెండు వేరు వేరు కథలను…రషోమాన్ తరహా టెక్నిక్ తో చెప్పిన ఈ కథలోని మార్మికత పాఠకులను మెప్పిస్తుంది. ఇక భిన్న నేపథ్యంతో పాటూ, తనదైన భాషను, తనదైన ముద్రతో దూసుకొస్తున్న మరో కలం అల్లం వంశీ. ఒక సమస్యను కేవలం ఏకరవు పెట్టడం  కాకుండా…సున్నితంగా చర్చించడం,  మానవ సంబంధాలను బలంగా చెప్పడం వంశీ బలాలు. రిజర్వేషన్ అంశాన్ని మిరకిల్ కథలోనూ, తెలంగాణ-ఆంధ్ర జీవితాల్లో వైవిధ్యాన్ని రెండు పట్టాలు-ఒక రైలు కథలో చర్చించిన తీరు….సహచరి కథ నడిపించిన తీరూ ఆకట్టుకుంటాయి.

వైవిధ్యమైన ఇతివృత్తాలను, కవితాత్మకంగా చెపుతున్న మరో రచయిత్రి వనజ తాతినేని.  ఫేస్ బుక్ అనుబంధాలకు మతం, లింగ బేధం లేదని చెప్పే స్నేహితుడా! రహస్య స్నేహితుడా.., మీడియా రంగంలో మహిళలపై వేధింపులను చర్చిస్తూ కుక్కకాటుకు-చెప్పుదెబ్బ లాంటి పరిష్కారాన్ని చూపిన కథ పిడికిట్లో పూలు. ఇతివృత్తాన్ని అందంగా చెప్పే వనజ తాతినేని కథలు ఆసాంతం చదివిస్తాయి. శైలి పరంగా షాజహానా-మనిషి పగిలిన రాత్రి ప్రత్యేకమైన కథ. అద్భుతమైన చైతన్య స్రవంతి పద్ధతిలో,  ఒక మహిళ భావాలకు అద్దం పట్టిన కవిత్వం లాంటి కథ.
బొట్టు, అదే ప్రేమ లాంటి కొత్త తరహా ఇతివృత్తాలతో ఆకట్టుకున్న మరో యువ రచయిత్రి ఎండ్లూరి మానస. ముఖ్యంగా అదే ప్రేమ కథలో ఒక సున్నితమైన అంశాన్ని చర్చకు పెట్టారు. స్వేచ్ఛ, లెటర్స్ , కీమాయ కథలతో ప్రజ్ఞ వడ్లమాని కూడా మెప్పించారు.  మైడి చైతన్య రాసిన నెర్లిచ్చిన అద్దం, అసంపూర్ణం కథలు శిల్పం, శైలి పరంగా ఆలోచింపజేస్తాయి. ది ప్రొఫెషనల్ కథతో గమన,  కృష్ణజ్యోతి కథ- పతి పత్నీ ఔర్ జస్ట్ నథింగ్, స్నాప్ ఔట్ కథతో మమత కొడిదెల, మయూఖ కథతో సెలవు లాంటి రచయితలు కొత్త తరం….భవిష్యత్ కథపై ఆశాభావాన్ని, భరోసాని కలిగిస్తారు. మొత్తంగా కొత్త తరం రాస్తున్న కథలని పరిశీలిస్తే  ఇతివృత్తం కన్నా శైలికి, శిల్పానికి ప్రాధాన్యం పెరగడాన్ని మనం గమనించవచ్చు. కొత్త కొత్త ప్రయోగాలు, భిన్న పోకడలతో  ప్రత్యేక గుర్తింపు కోసం,  తెలుగు కథని ఇంకో మెట్టు ఎక్కించడానికి కొత్త తరం కలిసి కట్టుగా చేస్తున్న ప్రయత్నించడం నిజంగా సంతోషకరం.

శైలి, శిల్పం పరంగా కె.ఎన్. మల్లీశ్వరి రాసిన రూబా, శైలజా చందు-వాన కథ, మైథిలి అబ్బరాజు- రాజహంస,  జి. వెంకట కృష్ణ-స్మృతి, ఉత్తమ కథలు. ఇంకొన్ని కథల్లో అసలు తీసుకున్న ఇతివృత్తాలే చర్చకు దారి తీసిన కథలూ ఉన్నాయి. వాటిల్లో పి. వసంత లక్ష్మి రాసిన వారిజ కథ ప్రధానంగా చెప్పుకోవచ్చు. తల్లి కావడానికి పెళ్లి చేసుకోకుండా…జీవితంతో కొత్త ప్రయోగం చేసిన మహిళ కథ వారిజ.  సహజీవనాన్ని కేవలం మాతృత్వానికి మాత్రమే పరిమితం చేసిన వారిజ నిర్ణయం కొత్తగా ఉన్నా …ఆచరణ సాధ్యమా అనే సందేహాన్ని, ఆ తర్వాత పర్యావసానాల గురించి ఆలోచింపచేస్తుంది. తాత్కాలిక ఆకర్షణలకు లోనై వివాహ బంధాన్ని చిన్నాభిన్నం చేసుకున్న మహిళ కథ బుద్ధి యజ్ఞమూర్తి రాసిన తెగని గాలి పటం. ఈ కథలో కమలిని పాత్ర ప్రవర్తన, అందుకు ఆమె భర్త శేఖర్ ప్రతిస్పందన విచిత్రంగా ఉంటాయి.

ఇదే తరహా అంశంతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ గురించి చర్చించిన మరో కథ కృష్ణవేణి రాసిన తెగిన గాలిపటం. ఈ తరహా కథలన్నీ ఆధునిక మహిళల ఆలోచనలకు అద్దం పడుతూ… వివాహ వ్యవస్థలో ఇమిడిపోలేక ఎదుర్కొంటున్న సంఘర్షణను చూపిస్తాయి. కానీ వాటికి రచయితలు చూపిన పరిష్కారం సమంజసమా ( ముఖ్యంగా వారిజ కథలో ) అనే సందేహం కలుగుతుంది.
ఇక్కడో ఆసక్తి కరమైన విషయమేమిటంటే…మిగతా సాహిత్య ప్రక్రియల సంగతి ఏమోకానీ ఇటీవలి కాలంలో కథా ప్రక్రియలో పురుషుల కన్నా మహిళా రచయితలే అధికంగా రాస్తున్నారు. ఒకప్పుడు నవలా ప్రక్రియను మహారాణుల్లా ఏలిన మహిళలే…సమీప భవిష్యత్తులో తెలుగు కథను కూడా తమ చేతుల్లోకి తీసుకొనే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐతే ఇందుకు దారితీస్తున్న పరిస్థితులేమిటి..?  ఏ కారణాల చేత మహిళా రచయితలు అధికంగా రాస్తున్నారు.?  ఏ అంతర్గత సామాజిక పరిస్థితులు వారిని ఈ దిశగా నడిపిస్తున్నాయన్నదీ తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

( ముగింపు వచ్చేవారం )

2015: కొత్త కలాల కథాకళి

      

( కథా సారంగ-2015 సమీక్ష )

~

chanduఅనంత గమ్యం వైపు సాగిపోతున్న మహా ప్రవాహం కాలం.  చాలా మంది  కాలం మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం.
***

గడిచిన ఏడాది 2015 మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపింది.  మన చుట్టూ తనదైన ముద్రలను ఎన్నో వదిలి వెళ్లింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాల వల్లనే కాక సాహిత్య పరంగా కూడా గత సంవత్సరానికి ఓ విశిష్టత ఉంది. సాధారణంగా సాహిత్యం, సాహిత్య కారులు…రాజకీయ పాలనా అంశాలను ప్రభావితం చేసే సందర్భాలు చాలా తక్కువ. ఏ అవార్డులో, పురస్కారాల సందర్భంలో తప్ప… సాహిత్యం,  రచయితలు ప్రధాన వార్తా స్రవంతిలో ఉండడం చాలా అరుదు. అలాంటిది… గడచిన ఏడాదిని సృజనకారులే నడిపించారని చెప్పుకోవచ్చు. వివిధ రకాల అంశాలపై వారి స్పందన పట్ల…. విభిన్న రకాల అభిప్రాయాలున్నా కూడా, మొత్తానికి సృజన కారులు అప్రమత్తంగానే ఉన్నారన్న భావన ఎవరికైనా సంతోషాన్ని కలిగించేదే.  మన తెలుగు నాట కూడా ఇదే సందడి కొనసాగింది.  రకరకాల వాదనలు, చర్చలు, అభిప్రాయాలు, నిరసనలు…ఇలా 2015  వేగంగా గడిచిపోయింది.

వీటన్నింటిని నేపథ్యంగా తీసుకుంటూ సారంగ పత్రికలో గత ఏడాది కాలంలో వచ్చిన కథలను పరిశీలిస్తే… మనకు చాలా విషయాలు అవగతమవుతాయి.  గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ సంవత్సర కాలంలో యాభై మూడు పెద్ద కథలు, పందొమ్మిది చిన్న కథలు వచ్చాయి.  ఇవి కాకుండా  అనిల్-ఎస్-రాయల్  అనువాద కథ బ్రహ్మాండం,  అనురాధ నాదెళ్ల రాసిన గూడెం చెప్పిన కథలు లాంటి ఇతర కథలు కూడా వచ్చాయి. నామిని,  రామాచంద్రమౌళి లాంటి సీనియర్ కథకులు ఎప్పటిలాగే తమ కథాయజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.  అలాగే వెంకట్ సిద్ధారెడ్డి,  పింగళి చైతన్య, అల్లం ‌వంశీ, రేఖా జ్యోతి వంటి….చాలామంది  కొత్త రచయితలు వెలుగు చూడడం సంతోషకరం. పేరుకే కొత్త రచయితలైనా…వస్తువు ఎంపిక, శైలి, శిల్పం పరంగా మంచి పరిణతిని చూపిస్తున్నారు.

Artwork: Bhavani Phani

Artwork: Bhavani Phani

ఈ ఏడాది కథలన్నీ చదివిన తర్వాత…ముందుగా ఒకటి చెప్పాలి. “తెలుగు భాష త్వరలోనే అంతరించిపోతుందని” ప్రచారం చేసే వారికీ, “అవునా..?” అని భయపడేవారికి.  మరేం ఫర్వాలేదు,  తెలుగు భాషకే కాదు… తెలుగు కథకు కూడా ఇప్పట్లో ఏ ప్రమాదమూ లేదని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.

ముద్రణా పత్రికల కథలతో పోలిస్తే…, సారంగలాంటి అంతర్జాల పత్రికల కథలకు కొన్ని తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. రకరకాల కారణాలతో దినపత్రికలు లేదా ఇతర వార పత్రికలు  కొన్ని రకాల ఇతివృత్తాలను అంగీకరించలేని పరిస్థితి. పైగా ఎంత కాదన్నా అక్కడ సీనియర్ కథకులు, పేరు మోసిన వారి కథలకే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటోంది. ఎప్పడో తప్ప కొత్త రచయితల కథలు రావు. ఇందుకు ఇతర కారణాలూ ఉండొచ్చు.  ఆ రకంగా ఆన్ లైన్ పత్రికల కథల్లో కొత్త రక్తం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటోంది.  దాంతోపాటూ ఏ తరహా ఇతివృత్తానికైనా ఆన్ లైన్ పత్రికలు కొంత వెసులు బాటు ఇవ్వడం కూడా కొత్త దనం కనిపించడానికి కారణమవుతోంది. అలా కథా సారంగ ద్వారా పాఠకులకు చాలా కొత్త కలాలు పరిచయమయ్యాయి.

ఆ రకంగా వస్తున్న కొత్త తరంలో విభిన్న ఇతివృత్తాల ఎంపిక,  శైలి శిల్ప పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ కొందరు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అప్పటికే చాలామంది రాసిన ఇతివృత్తాలని కూడా…. మూలాల్లోకి వెళ్ళి అన్వేషించి కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. కొన్ని కథలైతే..అనుభవజ్ఞులైన రచయితలకూ తీసిపోని విధంగా ఉన్నాయి.

ఐతే ఇదంతా ఒకవైపే. మరో వైపు ఊహాజనిత సమస్యలు,  కృత్రిమ ఇతివృత్తాలు సృష్టించిన వాళ్లూ ఉన్నారు.  తమ సొంత గొడవలనే కథల పేరుతో దేశం మీదికి ప్రయోగించిన వాళ్లూ లేకపోలేదు.  కొన్ని కథలైతే డైరీలో దినచర్యను తలపించినవి కూడా లేకపోలేదు.  అయినా కూడా  కథలు రాయాలన్న తపనతో… ఓ అడుగు ముందుకు వేసినందుకు వీరినీ భుజం తట్టాల్సిందే. చిన్న చిన్న లోపాలున్నా… కొత్త కథకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వారినీ పరిగణనలోకి తీసుకుంటున్న సారంగ సంపాదకులనూ అభినందించాల్సిందే.

చాలా మంది కొత్త రచయితలు  తమకు ఎదురైన సాధారాణ సంఘటనలనే కథలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. కథలు రాసే కొత్తల్లో ఏ రచయితలకుండే ఆవేశం, అత్యుత్సాహం వల్ల… కనిపించే ప్రతీ ఘటననూ కథలుగా రాయాలనుకుంటారు. పొద్దున సిటీ బస్సులో సీటు దొరక్క పోవడం నుంచీ…రాత్రికి సీరియల్ లో లేడీ విలన్ ప్రవర్తన  దాకా…కనిపించే ప్రతీ ఘటనను కథలుగా సంధించాలనుకుంటారు. అది మంచిదే. కథలు రాయాలన్న తపన అభినందనీయమే కానీ ప్రతీ అనుభవమూ కథ కాదని తెలుసుకోవాలి.  కథకు సంబంధించిన కొన్ని మౌలిక లక్షణాలపై  కొత్త రచయితలు మరింతగా అధ్యయనం చేయాలి. కవితకు సరిపోయే తక్షణ భావావేశం… కథగా మారినపుడు మాత్రం సంతృప్తి పరచదు.

అలాగే  కొత్త రచయితలే కాక…సీనియర్లు కూడా దృష్టి కోణంలో వ్యక్తిగత జీవిత పరిధిని దాటలేక పోతున్నారు. తమకు తెలిసిందే రాయాలన్నదే మంచి నిర్ణయమే ఐనా కేవలం తమ కతలే….కథలు కాబోవని కూడా గుర్తించాల్సి ఉంది.   సృజనకారులకు వ్యక్తి గత జీవితం, వ్యక్తిగత బాధ్యతలే కాదు… సాంఘిక జీవితం, సామూహిక బాధ్యతా ఉంటాయి.  తమ వ్యక్తిగత దృక్కోణంలోంచే కాకుండా….సమాజ కోణంలోంచి కూడా  అంశాలను తప్పక పరిశీలించాలి.

artwork: Srujan

artwork: Srujan

ఇక ఇక్కడ లోతుగా చర్చించాల్సిన విషయమూ ఇంకొకటి ఉంది. మాండలికం కథల గురించి.  ఏదీ మాండలికం..? ఏదీ యాస…? ఏదీ గ్రామ్యం…ఏది వ్యవహారం…? అంటూ ప్రశ్నించాల్సిన అవసరమూ ఉంది. ఎందుకంటే కొందరు మాండలికం పేరుతో….కేవలం గ్రామ్యం రాస్తున్నారు.  నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొన్ని పదాల ఉచ్ఛారణను తమకు అనుగుణంగా మార్చుకున్న వాటినే మాండలికం అనుకుంటున్నారు. కథకు తగిన విధంగా, పాత్రకు అనుగుణంగా  ఏభాష వాడినా అభ్యంతరం ఉండదు. కానీ ఓ పక్క గ్రామ్యం రాస్తూ….మళ్లీ మధ్య మధ్యలో  సంస్కృత భూయిష్ట సమాసాలు, ఆంగ్ల భాష పదాలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి…?

కొంచెం ఇష్టం కొంచె కష్టం అన్నట్లుగా….కొంచెం కథ రాసి, ఇంకొంచెం కవిత్వం కలిపి రాసిన వాళ్లూ ఉన్నారు.  తెలుగు కథల్లో వస్తున్న ఓ ఆధునిక పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది.     అలాగే  ఒక సున్నిత సమస్యను తీసుకొని …దాన్ని వ్యతిరేకించేవారు కూడా అద్భుతం అని మెచ్చుకునేలా రాసిన కథలూ ఉన్నాయి.  వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్ కథ, పింగళి చైతన్య -తనదే ఆకాశం, అల్లం వంశీ మిరకిల్…ఎండ్లూరి మానస అదే ప్రేమ..కథలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంచుకున్న ఇతివృత్తాలు వివాదాస్పద అంశాలైనా…చెప్పిన కోణం, ఒప్పించిన తీరుతో పాఠకుల్ని ఆకట్టుకున్నాయి.

రైతు ఆత్మహత్యలు, కొత్త రాజధాని కోసం భూ-సేకరణ, కరువు, వివేక్, శృతి ఎన్ కౌంటర్… లాంటి అంశాలు గత ఏడాది తెలుగునాట తీవ్రంగా చర్చకు వచ్చాయి. కానీ ఈ కథల్లో అలాంటివేమీ కనపడవు. రైతు ఆత్మహత్యలు, భూ సేకరణ మీద మాత్రం ఒక్కో కథ వచ్చాయి.  అంటే సామాజిక సమస్యలు రచయితలను స్పందింప జేయలేకపోయాయా..? లేదా రచయితలు స్పందించలేకపోయారా..?

వివాహేతర సంబంధాల పట్ల ఆసక్తి, స్వలింగ సంపర్కుల  సమస్యలు వంటి సున్నిత అంశాలపైన కూడా స్పందిస్తున్న మన కథకులు … సామాజిక సంక్షోభాల్ని, సమాజాన్ని కుదిపేస్తున్న తీవ్ర పరిణామాలను మాత్రం ఎలా పక్కకు పెట్టగలుగుతున్నారు…?  ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నారా అన్న సందేహమూ కలుగుతుంది…?
ఇలా రకరకాల అభిప్రాయాలకు తావిస్తున్న కథా సారంగ కథలను వివరంగా చర్చిద్దాం.

                                      (మిగతా వచ్చే వారం)

బుక్కెడు బువ్వ