ఇల్లు అమ్మకం

 1240341_10201534412895141_1067046383_n

 

మనసు జలజల్లాడుతోందని ఎలా చెప్పను!

ఇది రాతికట్టడం కాదు- రాగమాలిక.

 

నా భయాల్ని నిమిరి శాంతపరచిందీ యిల్లు

నా అనుమానాల్ని సముదాయించి నన్ను నిలబెట్టింది

సంతానం వల్లనో సంసారం కల్లనో

నిరంతరం కలుగుతూ వుండిన జయాపజయాల పరంపరల్ని

కాల్చి కాల్చి యీ ఇటుకలబట్టీ

ఎప్పుడూ నన్నొక పోరాటకుడ్యంగా నిర్మిస్తూనే వచ్చింది

నా ఆసలను ఎప్పటికప్పుడు సమరోత్సాహాన్ని అద్దింది

 

 

కాలేజీలో గొడవపడి వచ్చిన పెద్దవాడిని నేను ఓర్చుకున్నది యీ చల్లగాలి వల్లే!

టీజింగ్ నిష్కారణావమానానికి చిన్నబోయిన చిన్నారిని

నే సాంత్వనపరచి పురికొల్పింది యీ జామనీడనే!!

నా అలసిన సాయంత్రాల నిస్త్రాణని చిటికెలో మాయంచేసేదీ లేవెన్నెలలేపనం!

విరిసిన దిరిసెన పూల ప్రభాతాలతో

నిత్యమల్లె రంగు మధ్యాహ్నాలతో హృదయగగనానెప్పుడూ వెలిగించే యీ ఆవరణ

–      ఇక ఒక మసక జ్ఞాపకమా!

 

నేను వెళ్లిపోతున్నానని పూలపొద మొగ్గబిందువుల్ని రాలుస్తోందా?

లేక నాది అన్నది ఆవిరైపోతోందన్న నా దుఃఖాన్ని యీ ప్రకృతికి చెందజేస్తున్నానా?

నిన్నటి అందం ఇవాల్టి ఆక్రోశం ఎందుకవుతోంది-

మట్టి మీద ఆపేక్షా? ఆస్తిపైన అభిమానాతిశయమా??

నన్ను కునారిల్లజేస్తున్నది ఏది

పదిహేనేళ్ళ మాలిమే నను వ్యథపెడ్తుంటే-

ఇదే భూమి తమ సొంతమని తిరుగాడి

లక్షల కోట్ల సంవత్సరాలుగా తెలియని చోటుకి జారిపోతుండిన క్షుభితాత్మల సంగతేమిటి?

 

ఇంతకీ-

ఈ నీలి శంఖు పూల లోపలి హరిత ఛాయలో చిక్కుకున్న హృదయాన్నెలా విడదీయడం!

కొనలు సాగి చుట్టిన చిక్కుడు తీగని విదిలించడమెలా?

 

అయినా ఎందుకీ అమ్మకపు దుఃఖం –

ఈ యిల్లు నా యిల్లరికాన్ని ఖరారు చేసింది నిజం!

సొంతమన్న భ్రమల సాలెగూటిని

నేను పొద్దస్తమానం ఈగనై అలికిందీ

పాతరవేసిన తేగనై పొగచూరుకు పోయిందీ నిజం!!

 

అద్దాల యిల్లన్న మెప్పుమాటలన్నీ ఆనందపు అగరుధూపమైంది కూడా నిజమే!

అందుకా ఈ యీ అమ్మకపు దుఃఖం?

 

ఈ ఊడ్చిన యిన్నాళ్ళ చీపురులానే ఇవాళ నిరాశ్రయమైనందుకో

ఈ కడిగి కడిగీ కడిగిన చేతులు

మరోచోటికి నిరాస్తిగా నిరాసక్తిగా తరలిపోతున్నందుకో

కట్టడమూ కడగడమూ నా బాధ్యతే గానీ

అమ్మాలా అట్టిపెట్టాలా నిర్ణయించలేని అధికారరాహిత్యానికో

–      అందుకేనేమో యీ అమ్మకపు దుఃఖం?

 

ఇప్పుడిక్కడ –

వణికించే చలిగాలిలో వెచ్చబెడ్తున్న చలిమంట హఠాత్తుగా ఆరినట్టు

తాళంచెవుల ఆఖరి అప్పగింత మృత్యుశీతలమై నేను!

 

దోసిట నింపిన జాజిపూల వెన్నెల వేళ్ళ సందునే జారినట్టు

ఎవరినీ శలవడగక   ముఖం భూతలమై నేను!

nirmala ghantasala -ఘంటశాల నిర్మల