నిక్కచ్చి మనిషి మాలతి చందూర్!

Gowri

గౌరీ కృపానందన్

మాలతి చందూర్  అంటేనే తెలుగు వారికి “వంటలు పిండి వంటలు”  పుస్తకం గుర్తుకు వస్తుంది. అప్పట్లో వంటల గురించి పుస్తకం తెలుగులో రావడం, సులభమైన శైలిలో అందరికీ అర్థం అయ్యే విధంగా ఉండటం అందరినీ చాలా ఆకర్షించింది.

ఈ పుస్తకం యొక్క తొలి ఎడిషన్ కాపీ నా దగ్గర ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాను.

85865329_45a5e50811

మాలతి చందూర్ గారి ప్రమదావనం అప్పట్లో ఆంధ్రప్రభలో నలబై ఏళ్ళు నిర్విరామంగా వచ్చింది. ఎటువంటి సమస్యలకైనా, అది ప్రపంచ చరిత్ర గురించి కానీయండి, అప్పలమ్మ ఇంట్లో వచ్చిన సమస్య అయినా కానీయండి ఆమె చెప్పే విషయాలు, సూచించే పరిష్కారాలు మిగిలిన వాళ్లకి కూడా మార్గదర్శకంగా ఉంటాయి.

1955లో ‘ప్రమదావనం’ లో ఆమె ఇచ్చిన జవాబులు నా డైరీలో వ్రాసుకుని పెట్టుకున్నాను.

“ఎంత మహోజ్వలమైన ప్రేమ అయినా ఆరు నెలలు దాటే సరికి వెచ్చాల ఖర్చు అడుగుతుంది.”

“ముసలి అత్తగార్లను వృద్ధాశ్రమానికి తరిమేసే కోడళ్ళు, ముందు ముందు తమకీ ఆ గతి పట్టడానికి ఆస్కారం ఉందని గ్రహించాలి.”

ఎవరూ లేని వాళ్లకి వృద్ధాశ్రమం ఆసరాగా ఉండడం సబబు. కానీ కన్నవాళ్ళు ఉన్నా చూసుకునే దిక్కులేక జీవితపు చరమ దశను ఆశ్రమంలో గడపాల్సి రావడం నిజంగా దుర్భరం.

ఆమెతో నా పరిచయం దాదాపు పదేళ్ళ క్రితం జరిగింది. తమిళ సినిమా డైరక్టర్ శ్రీ  ముక్తా శ్రీనివాసన్  గారికి విశ్వనాధ సత్యనారాయణగారి గురించి, ఆయన రచనల గురించి వివరాలు సేకరించి తమిళంలో తనకి ఇవ్వమని అడిగిన సందర్భంలో(రేడియోలో ఇతర భాషా రచయితలు పరిచయం చేసే ఒక కార్యక్రమం కోసం) మాలతి చందూర్ గారిని వారి ఇంటికి వెళ్లి కలిసాను. చిన్న వయస్సులో ప్రమదావనంలో ప్రశ్నలు – జవాబులు శీర్షిక ద్వారా పరిచయమైన ప్రఖ్యాత రచయిత్రిని నేరుగా కలుసుకున్నప్పుడు ఎంత ఉద్వేగం చెందానో మాటల్లో చెప్పలేను. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియచేసే మనిషి.

తెలుగు నుంచి తమిళంలోకి, తమిళంనుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నానని నన్ను నేను పరిచయం చేసుకున్నప్పుడు నా రచనల గురించి అడిగి తెలుసుకున్నారు.

మాటల మధ్యలో ఆమె రచయితకీ పాఠకులకీ మధ్య కొంచం అంతరం ఉంటేనే బాగా ఉంటుంది అని అంటూ వివరణ ఇచ్చారు. రచనలు చదివిన  పాఠకుడు రచయిత గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటాడు. వాళ్ళు గానీ రచయితతో ఎక్కువగా  పరిచయం పెంచుకుంటే, వాళ్ళు ఊహించుకున్నంత గొప్పగా ఆ రచయిత ఉండక పోతే చాలా నిరాశ చెందుతారు. రచయితలు దివినుంచి దిగి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకీ కొన్ని బలహీనతలు, అంతో ఇంతో స్వార్థం ఉండొచ్చు. ఆ పార్శ్వం పాఠకులకి తెలియకుండా ఉండడమే మంచిది అని ఆవిడ అన్నప్పుడు నిజమే కదా అనిపించింది.

ఒక సారి చెన్నైలో రచయిత్రి డి.కామేశ్వరి గారి చెల్లెలి ఇంట్లో కామేశ్వరి, మాలతి చందూర్, ఆమె సహోదరి శ్రీమతి శారద  వాళ్ళందరితో నేను, అందరూ కలిసి చిన్నపాటి విందు భోజనం, సాహిత్య చర్చ జరిగిన ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మరిచి పోలేను. ఆరోజు శారద గారు నా మొహమాటం చూసి “సిగ్గు లేకుండా తినండి” అని జోక్ చేస్తూ సిగ్గు పడకుండా తినండి అని చెప్పడమే తన ఉద్దేశ్యం అయినా తిండి ముందు సిగ్గు పడితే పని జరగదు కదా అని వ్యాఖ్యానించారు.

భర్త చందూర్ తో మాలతి గారు

భర్త చందూర్ తో మాలతి గారు

“హృదయనేత్రి” అన్న నవలకి మాలతి చందూర్ గారికి సాహిత్య అకాడమి ఆవార్డు వచ్చింది. ఈ నవలను శ్రీమతి శాంతాదత్ గారు “IDHAYA VIZHIKAL” అన్న పేరుతో తమిళంలో అనువదించారు.

భూమిపుత్రి, మనసులోని మనసు, శిశిర వసంతం, కలల వెలుగు, ఆలోచించు, రెక్కలు ముక్కలు ఇలా వాసిలో ఆమె చేసిన రచనలు కొన్ని మాత్రమే అయినా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలను బేలగా కాకుండా ఆత్మ గౌరవంతో సమస్యలను ఎదుర్కునే విధంగా చిత్రీకరిస్తారు.

ఎన్నోఆంగ్ల నవలలను కధా మంజరి అన్న పేరిట పరిచయం చేసారు. తమిళ రచయిత D.జయకాంతన్ గారి నవలను “కొన్ని సమయాలల్లో కొంత మంది మనుషులు”, N. పార్థసారధి గారి నవలను “సమాజం కోరల్లో”, శివశంకరి గారి నవలను “ఓ మనిషి కధ “ అన్న పేరిట తెలుగు పాఠకులకి అందించారు.

ఆమె రచనల్లో నాకు చాలా నచ్చిన నవల “శతాబ్ది సూరీడు.” దాన్ని తమిళంలో అనువదించడానికి ఆమె అనుమతి తీసుకున్నాను గాని ఇంకా మొదలు పెట్టలేదు. ఆమెకి నివాళిగా వెంటనే ఆ నవలను తమిళంలో తేవాలని, తమిళ పాఠకులకి ఆమెను పరిచయం చేయాలని నా కోరిక.

రచనా వ్యాసంగంలోరాణించి, అందరి మన్ననలనూ పొంది, తన రచనల ద్వారా సమాజానికి మంచి మార్గం చూపించిన మాలతి చందూర్ గారు చిరస్మరణీయులు.

గౌరీ కృపానందన్