అమ్మ … 

 

 మాగ్జిమ్  గోర్కీ

అనువాదం: నౌడూరి మూర్తి 

 

“ప్రతి తల్లీ మృత్యువుకి వ్యతిరేకమే. అంతే కాదు, ప్రజల ఇళ్ళల్లోకి మృత్యువును జొప్పించే హస్తాలన్నా, తల్లులందరికీ ద్వేషమూ, కోపమే.”

 

అప్పటికి చాలా వారాలబట్టి సైనికులతో ఆ నగరం చుట్టుముట్టబడి ఉంది. రాత్రిపూట నెగళ్ళు లేస్తున్నాయి, చీకటిలో గోడలవైపు కొన్ని వేల జతల ఎర్రబడిన తీక్షణమైన కళ్ళు చూస్తున్నాయి. ఆ చలినెగళ్ళతీరు అశుభాన్నిసూచిస్తూ, ఆ నగరప్రజలని హెచ్చరిస్తున్నట్టుంది. అవి రేకెత్తించే ఆలోచనలూ భయంకరంగా ఉన్నాయి.

నగరప్రాకారపు గోడలనుండి పరికిస్తే, శత్రువు నగరం మీద తన ఉచ్చును రోజు రోజుకీ గట్టిగా బిగిస్తున్నాడని అర్థమైపోతుంది.  ఆ మంటల చుట్టూ నల్లని నీడలు అటూ ఇటూ కదలాడడం తెలుస్తుంది; బాగా మేపిన అశ్వాల శకిలింపులతో పాటు, ఆయుధాల మోతలూ, గెలుపుమీద ధీమా ఉన్న సైనికుల వికటాట్టహాసాలూ, ఆనందంతో పాడేపాటలూ వినిపిస్తాయి.  శత్రువుల పాటలూ, నవ్వులూ వినడం కంటే బాధాకరమైనది ఏముంటుంది?

నగరానికి నీరు సరఫరా చేసే ఏటిని శత్రువు శవాలతో నింపేసేడు; నగరానికి చుట్టూ ఉన్న ద్రాక్షతోటలని తగలబెట్టేడు; పంటలని ధ్వంసం చేసేసేడు; చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ నరికేయడంతో నగరం నాలుగువైపులనుండీ బోసిపోయి దాడిచెయ్యడానికి అనువుగా మారిపోయింది; దానితో ప్రతిరోజూ నగరంపై శత్రువు ఫిరంగులతో తుపాకులతో గుళ్ళు కురిపిస్తూనే ఉన్నాడు.

యుద్ధంలో అలిసి, అర్థాకలితో మాడుతున్న సైనికులు ఇరుకైన నగరపు వీధుల్లోంచి వెళుతున్నారు.  ఇంటి కిటికీలలోంచి గాయపడ్డవారి మూలుగులూ, అపస్మారకంలో ఉన్న వ్యక్తుల సంధిప్రేలాపనలు, స్త్రీల ప్రార్థనలూ, పిల్లల ఏడుపులూ వినవస్తున్నాయి. ప్రతివారూ లోగొంతులో, నెమ్మదిగా మాటాడుకుంటున్నారు… మధ్యమధ్యలో, శత్రువు మళ్ళీ నగరం మీద గుళ్ళ వర్షం కురించడం లేదుగదా అని చెవులు రిక్కించి వినడానికి, మాట్లాడుతున్న వారిని ఆపమని సంజ్ఞచేస్తూ.

వాళ్లు ఇళ్ళల్లో దీపాలు వెలిగించడానికి భయపడుతున్నారు; నగరాన్ని దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. ఆ పొగమంచులో, నదికి అడుగున అటూ ఇటూ తిరిగే చేపలా ఒక స్త్రీ ఊరల్లా కలయతిరుగుతోంది… ఆపాదమస్తకం ఒక నల్లని  ముసుగు కప్పుకుని.

ఆమెను గుర్తించిన కొందరు ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు

“ఆమేనా?”

“అవును. ఆమే.”

అంటూ తమ తలలు పక్కకి తిప్పుకుని, ఆమెదారిలో తప్పుకుందికి అయితే దొరికిన దగ్గరగుమ్మం ఎక్కిపోవడమో, లేకుంటే మౌనంగా ఆమెని దాటుకుంటూ వడివడిగా  వెళ్ళిపోవడమో చేస్తున్నారు. రాత్రి పహారాకాస్తున్న దళం నాయకుడు ఆమెని తీవ్రంగా మందలించేడు: “చూడు మరియమ్మా! కొంచెం జాగ్రత్తగా తిరుగు! వాళ్లు నిన్ను కాల్చిపారెయ్యగలరు. అప్పుడు ఎవడాపని చేసేడో పట్టించుకునే నాథుడుకూడా  ఉండడు.”

ఆమె నిటారుగా నిలబడి చూస్తోంది. పహరాకాసే వాళ్లు ఆమెకు కష్టం కలిగించడం ఇష్టలేకో, లేక సందేహిస్తూనో పక్కనుండి తప్పుకున్నారు. ఆమె చుట్టూ సాయుధులు నడుచుకుంటూ వెళ్ళేరు, ఆమె ఒక శవమైనట్టూ, వాళ్ళు ఆ శవాన్ని మోసుకెళుతున్నట్టూ. అయినా ఆమె చీకటిలో తచ్చాడడం మానలేదు. ఆ నగరానికి పట్టిన దురదృష్టంలా … ఒంటరిగా, మౌనంగా, నెమ్మదిగా, నల్లని ముసుగు కప్పుకుని ఒక్కొక్క వీధీ తిరుగుతోంది. ఆమెను అనుసరిస్తున్న శోకంలా… మూలుగులూ, ఎక్కిళ్ళూ, ప్రార్థనలూ, ఇక గెలవలేమని నిరాశచేసుకున్న సైనికుల సంభాషణలూ… ఆమెను వదలలేదు.

Akkadi-MeghamFeatured-300x146

ఆమె ఒక తల్లీ, ఆ నగర పౌరురాలు కూడా . ఆమె ఆలోచనలన్నీ ఆమె కొడుకు చుట్టూ, ఆమె పుట్టిన ఆ నగరం చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె కొడుకు చాలా అందమైన హుషారైన కుర్రాడే గాని, హృదయంలేని వాడు. ఆ నగరాన్ని నాశనం చేస్తున్న సైన్యానికి నాయకుడుగా ఉన్నాడు. మొన్నమొన్నటిదాకా తనకొడుకుని తలుచుకుని తన జన్మభూమికి ఆమె అందించిన కానుకగా; తను పెరగడమేగాక, తనకొడుకుని కనిపెంచిన ఆ నగరసంక్షేమానికి ఆమె సృష్టించిన ఒక ప్రయోజనకర వస్తువుగా చాలా గర్వంగా భావించేది. ఆ ప్రాచీన నగరపు ప్రతి రాయితోనూ ఆమెకు విడరాని అనుబంధం ఉంది; ఎందుకంటే ఆ నగరపు గోడలూ, ప్రతి ఇల్లూ ఆ రాళ్లతో ఆమె పూర్వీకులు కట్టినవే. ఆ మట్టిలో ఆమె వంశీకుల అస్థికలు నిక్షిప్తమై ఉన్నాయి; అక్కడి కథలతో, చరిత్రతో ఆశలతో, గీతాలతో ఆమె అనుబంధం విదదీయరానిది. అటువంటి హృదయం ఇప్పుడు అంత అమితంగా ప్రేమించిన ఆ కొడుకుని పోగొట్టుకుని రెండు ముక్కలైపోయింది. నగరం పట్ల ఆమెకున్న ప్రేమా, కొడుకుపట్ల ఆమెకున్న ప్రేమా త్రాసులో వేసి ఎవరో తూచుతున్నట్టు ఉంది ఆమె స్థితి. ఇప్పుడు ఆమె మనసు ఎటుమొగ్గుతోందో చెప్పడం కష్టం.

ఈ మానసిక స్థితిలో ఆమె రాత్రిపూట వీధులు తిరిగేది; గుర్తుపట్టలేని చాలా మంది ఆమెను చూసి వాళ్ళకి అతి సమీపంగా సంచరిస్తున్న మృత్యుదేవత ఆకారమేమోనని జడుసుకుంటే, ఆమెను గుర్తుపట్టగలిగినవాళ్ళు ఆ దేశద్రోహి తల్లిని తప్పించుకుందికి ఆమె మార్గంనుండి తప్పుకునే వాళ్ళు.

ఒక సారి, ఆ నగరపు సరిహద్దు గోడకి సమీపంగా జనసంచారం లేని ఒక మారుమూలన ఆమెకు మరొక స్త్రీ తారసపడింది.  ఆమె తన ముందున్న శవం దగ్గర మోకాళ్ళపై కూచుని ఆకాశంకేసిచూస్తూ ప్రార్థిస్తోంది. ప్రాకారపు గోడమీద పహారా కాస్తున్న సైనికులు మంద్రస్వరంలో మాటాడుకుంటున్నారు. వాళ్ళ చేతిలోని తుపాకులు ముందుకి చొచ్చుకువచ్చిన రాళ్ళు తగలగానే, చప్పుడు చేస్తున్నాయి.

ఆ దేశద్రోహి తల్లి ఆ స్త్రీని అడిగింది:

“నీ భర్తా?”

“కాదు.”

“అన్నదమ్ముడా?”

“కొడుకు. నా భర్త పదమూడురోజులక్రిందటే చంపబడ్డాడు. ఇవాళ వీడు.”

మృతుని తల్లి చేతులు పైకెత్తి వినయంగా ఇలా అంది:

“మేరీ అన్నీ చూస్తుంటుంది. ఆమెకు అన్నీ తెలుసు. ఆమెకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.”

“ఎందుకు?” అని అడిగింది మరియమ్మ. దానికి ఆమె,

“ఇప్పుడు వీడు గౌరవప్రదంగా, దేశంకోసం పోరాడుతూ మరణించేడు కాబట్టి నిర్భయంగా కొన్ని విషయాలు చెప్పగలను: వీడు నన్ను కొన్నిసార్లు చాలా ఆందోళనకు గురిచేసేవాడు; నిర్లక్ష్యంగా తిరుగుతూ, సుఖాలవేటలో ఉండేవాడు; ఆ కారణంగానే, శత్రువులకు నాయకత్వం వహిస్తూ, దేశానికీ, ప్రజలకీ ద్రోహం చేసిన మరియమ్మ కొడుకులా, వీడుకూడా ఎక్కడ ద్రోహం చేస్తాడోనని భయపడే దాన్ని. వాడూ, వాడిని కన్న ఆ తల్లీ నాశనం అయిపోవాలి!”

gorky

చేతుల్లో ముఖం దాచుకుని మరియమ్మ అక్కడనుండి పరిగెత్తింది.

మరుచటిరోజు నగర రక్షకులదగ్గరకి వెళ్లి ఇలా అంది:

“నా కొడుకు మీ శత్రువుగనుక నన్ను చంపనన్నా చంపండి లేదా నగరద్వారమైనా తెరవండి నేను వాడి దగ్గరకిపోడానికి వీలుగా.”

వాళ్ళు సమాధానంగా,

“మీరు ఈ నగర పౌరులు. మీకు ఈ నగరమే ప్రాణప్రదమైనది.  మీ కొడుకు మాకు ఎంత శత్రువో మీకూ అంతే,” అన్నారు.

“నేను అతని తల్లిని. అతనంటే నాకు ప్రేమ. అతను ఇలా తయారవడానికి నేనే బాధ్యురాలిని అని అనుకుంటున్నాను.”

అపుడు వాళ్లందరూ ఈ విషయమై ఏమి చెయ్యాలో చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చేరు .

“మీ కొడుకు చేసిన పొరపాటుకి మిమ్మల్ని చంపడం భావ్యం కాదు.  మీరూ ఇటువంటి పాపాన్ని చెయ్యమని మీ కుమారుడికి సలహా ఇస్తారని మేము భావించలేము. అది మీకు ఎంత బాధాకరమో మేము గ్రహించగలము. ఆ రాక్షసుడు మిమ్మల్ని మరిచిపోయేడని మేము భావిస్తున్నాము.  అదే మీకు పెద్ద శిక్ష, మీరు దానికి అర్హులనుకుంటే.  మా దృష్టిలో అది చావుకన్నా భయంకరమైనది. ”

“అవును, అది చాలా బాధాకరం. ”

వాళ్ళు నగర వాకిలి తెరిచి ఆమెని బయటకి పోనిచ్చారు.

ఆమె కుమారుడివల్ల రక్తసిక్తమైన ఆమె జన్మభూమిని విడిచిపెడుతూ … విడిచిపెడుతూ … ఆమె వెళ్లడాన్ని వాళ్లు చాలసేపు గోడని ఆనుకుని గమనించేరు. ఆ బురదలో ఆమె మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ, నగరరక్షణలో ప్రాణాలర్పించిన వారి దేహాలదగ్గర వినమ్రంగా తలవాల్చుతూ, త్రోవలో పడి ఉన్న మారణాయుధాలని కోపంగా కాలితో విసరికొడుతూ వెళ్లడం గమనించేరు. ఎందుకంటే, తల్లులెప్పుడూ వినాశకరమైన వస్తువుల్ని ద్వేషిస్తారు; ప్రాణాల్ని నిలిపే వస్తువులపట్లే వారికి మక్కువ.

తన ముసుగుక్రింద ఏదో ద్రవాన్నీ తీసుకెళుతున్నట్టూ, అదెక్కడ ఒలికిపోతుందో అని భయపడుతున్నట్టూ ఉన్నాయి ఆమె అడుగులు.  అలా  అలా వెళుతున్న కొద్దీ… ఆమె రూపం చిన్నదయిపోతున్న కొద్దీ… నగర వాకిలినుండి గమనిస్తున్న వాళ్లకి ఆమె పట్ల అంతకు ముందున్న నిర్వేదము, విచారమూ తగ్గినట్టనిపించింది.

ఆమె సగందూరం గడిచిన తర్వాత ఆగి, తన పైనున్న ముసుగు వెనక్కి తొలగించి, నగరాన్ని ఒక సారి వెనక్కితిరిగి చూడడం వాళ్ళు గమనించారు. దూరంగా శత్రుశిబిరాలలోని వాళ్ళుకూడా మరుభూమినుండి ఆమె ఒంటరిగా రావడం గమనించారు. ఆమెలా నల్లని ముసుగులు ధరించిన ఆకారాలు ఆమెని సమీపించాయి.  ఆమె ఎవరో, ఎక్కడికి వెళుతోందో కనుక్కున్నాయి.

 

“మీ నాయకుడు నా కుమారుడు,” అందామె. ముసుగులలోని వ్యక్తులెవ్వరూ ఆమె మాటలని సందేహించలేదు. వారి నాయకుడి తెలివితేటలూ, ధైర్యసాహసాలు కొనియాడుతూ ఆమె ప్రక్కగా నడిచేరు. ఆమె ముఖంలో ఎక్కడా ఆశ్చర్యం పొడచూపకుండా గర్వంగా తలెత్తుకుని నడిచింది. ఆమె కొడుకంటే అలాగే ఉండాలి మరి!

పుట్టకముందు తొమ్మిది నెలల ముందునుండే పరిచయమున్న వ్యక్తి ఎదురుగా నిలబడింది. మునుపెన్నడూ ఆమె తన మనసులోని భావాలని అతనికి వ్యక్తపరచి ఉండలేదు. ఆమె ఎదురుగా అతను మెత్తని పట్టు వస్త్రాలు కట్టుకుని, రత్నాలు పొదిగిన కత్తి ధరించి నిలబడ్డాడు. ఆమె తన కలల్లో అతన్ని ఎలా రూపు కట్టుకుందో, ఏది ఎలా ఉండాలో అది అలా ఉంటూ… పేరూ, ప్రఖ్యాతీ, సంపదతో సాక్షాత్కరించాడు ఆమె కళ్ళకి.

“అమ్మా!” అంటూ ఆమె చేతులు ముద్దాడాడతను. ” నువ్వు నా దగ్గరకి వచ్చేవు అంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావన్న మాట. రేపే ఆ పాపిష్టి నగరాన్ని వశపరచుకుంటాను.”

“నువ్వు అక్కడే పుట్టావు.”

అతని విజయాలు తలకెత్తిన మత్తులో, మరింత కీర్తి సంపాదించాలన్న కాంక్షతో, యవ్వనసిద్ధమైన అహంకారంతో మాటాడేడు.

“నేను ఈ ప్రపంచంలో పుట్టేను… ఈ ప్రపంచం కోసం, దాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తడానికి పుట్టేను. నీ కారణంగా ఈ నగరాన్ని ఇన్నాళ్ళూ ఉపేక్షించేను. నేను అనుకున్నంత తొందరగా యశస్సు సంపాదించడానికి అడ్డంగా కాలిలో ముల్లులా ఉంది ఇన్నాళ్ళూ. నేడో రేపో నా దారికి అడ్డంగా మొండిగా ఎదిరిస్తూ నిలబడిన వారిని హతమారుస్తాను.”

“అక్కడి ప్రతి రాయీకీ నువ్వూ, నీ బాల్యమూ గుర్తే.”

‘రాళ్లకేముంది, అవి మూగవి. అవి నాగురించి మాటాడలేకపోతే పర్వతాలనే నాగురించి మాటాడేలా చేస్తాను. నాకు కావలసింది అదే.”

“మరి మనుషుల సంగతో?” ఆమె అడిగింది.

“ఆహా! అమ్మా వాళ్ల నెందుకు మరిచిపోతాను. వాళ్ళు నాకు అవసరం కూడా. ప్రజల జ్ఞాపకాలలోనే గదా వీరులు చిరంజీవులుగా మిగిలేది.”

దానికి సమాధానంగా, ఆమె

“ఎవడు ప్రాణాన్ని సృజిస్తాడో, మృత్యువుని ద్వేషించి దాన్ని జయించగలడో వాడూ నిజమైన వీరుడంటే!”

“కాదు,” అన్నాడతను ఆమె మాటలని ఖండిస్తూ, “నగరాల్ని నిర్మించినవాడికి ఎంత కీర్తి ఉంటుందో, వాటిని నిర్మూలించినవాడికికూడా అంత కీర్తి దక్కుతుంది. ఉదాహరణకి  ‘ఈనియస్’, ‘రోమ్యులస్’ రోము నగరాన్ని నిర్మించోరో లేదో నాకు తెలియదు గాని, దానిని నాశనం చేసినది ‘అలారిక్’ అని మాత్రం తెలుసును.”

“ఆ పేరు అన్ని పేరులకన్నా చిరంజీవిగా మిగిలిపోయింది.”

ఈ రీతిగా వాళ్ళ సంభాషణ సూర్యాస్తమయం దాకా కొనసాగింది.  రానురాను అతని వ్యర్థ ప్రలాపాలని ఆమె అడ్దుకోవడం తగ్గడంతో పాటు, అంతవరకు గర్వంతో విరుచుకున్న ఆమె గుండె రానురాను కుదించుకుపో సాగింది.

తల్లి ప్రాణాన్నివ్వడమే కాదు, ప్రాణాన్ని నిలబెడుతుంది; ఆమె సన్నిధిలో వినాశము గురించి మాటాడడమంటే, ఆమెకు ప్రాణం గురించి ఉన్న అవగాహనని త్రోసిపుచ్చడమే. అది తెలియక, ఆమె కొడుకు  ప్రాణం గురించి ఆమె చెబుతున్న అన్ని విషయాలనీ పక్కన బెడుతున్నాడు.

painting: Satya Srinivas

painting: Satya Srinivas

ప్రతి తల్లీ మృత్యువుకి వ్యతిరేకమే. అంతే కాదు, ప్రజల ఇళ్ళల్లోకి మృత్యువును జొప్పించే హస్తాలన్నా, తల్లులందరికీ ద్వేషమూ, కోపమే. కానీ, నిర్దాక్షిణ్యమైన కీర్తికాంక్ష మెరుపులకు కళ్లు గప్పుకుపోయి, మనసు చచ్చిపోవడంతో కొడుకు ఆ విషయాన్ని గ్రహించలేకున్నాడు.

ఏ తల్లి ‘ప్రాణానికి’ ప్రాణంపోసి పెంచుతుందో, ఆ తల్లే ఆ ప్రాణాన్ని పరిరక్షించే విషయం వచ్చేసరికి జంతువులా ఎంత నిర్దాక్షిణ్యంగా, ఉపాయశీలిగా ఉండగలదో అతను ఎరుగడు.

వినివిని, శక్తి సన్నగిల్లి, తల వంచుకుని ఆమె అలా కూలబడిపోయింది. సుసంపన్నమై, తెరచి ఉన్న నాయకుడి గుడారం ముఖద్వారంనుండి… తన నగరాన్నిచూస్తోంది… తన తొలిసంతానం … కొడుకు … కడుపులోపడినపుడు తను అనుభవించిన పులకింతలూ, పురిట్లో తను పడ్డ బాధలూ అన్నీ గుర్తుచేసుకుంది; ఇపుడు వాడికి ఆ ఊరిని నాశనం చేయడమే ఏకైక ధ్యేయం.

సూర్యుడు తన రక్తారుణిమ కిరణాలతో నగరాన్నీ, అక్కడి గోడల్నీ ముంచెత్తుతున్నాడు. కిటికీలు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నాయా అన్నట్టు మెరుస్తున్నాయి. నగరం నగరమంతా గాయపడ్దట్టూ, దాని వందల గాయాల్లోంచి రక్తం స్రవిస్తున్నట్టూ అనిపిస్తోంది. కాలం కరిగిపోయింది. నగరం శవంలా నల్లబారింది.  శోకచిహ్నంగా వెలిగించే కొవ్వొత్తులా నక్షత్రాలు ఆకసంలో వెలిగాయి.

శత్రువు దృష్టిని ఎక్కడ ఆకర్షిస్తాయోనన్న భయంతో నగరంలోని ప్రజలు దీపాలు వెలిగించకుండా చీకటిలో ఉండడం తన మనోనేత్రంతో దర్శించింది. నగరంలోని వీధులన్నీ శవాలనుండి వెలువడే దుర్గంధంతోనూ, మృత్యువుకి ఎదురుచూస్తున్న ప్రజల గుసగుసలతోనూ నిండిపోయాయి. అన్నిట్లోనూ ఆమెకి తనే కనిపించింది. ఆమెకు అక్కడపుట్టిన ప్రతివస్తువూ, పరిచయమున్న ప్రతివస్తువూ ఎదురుగా నిలబడి ఆమె నిర్ణయానికై ఎదురుచూస్తున్నట్టు అనిపించింది; తన కొడుకు ఒక్కడికేగాక, ఆమె తను పుట్టిన నగరంలోని ప్రజలందరికీ తల్లిని అని అనిపించింది.

ఎత్తైన కొండశిఖరాలనుండి  మేఘాలు లోయలోకి దిగిపోయాయి, రెక్కలున్న వార్తాహరుల్లా  నగరమంతా కమ్ముకున్నాయి.

“బహుశా ఈ రాత్రికి దాడి చెయ్యవచ్చు,” అన్నాడు ఆమె కొడుకు. “రాత్రి అంతా చీకటిగా అనుకూలంగా ఉంటే. కళ్ళల్లో సూర్యుడు పడినా, ఆయుధాల మిలమిలలు కంట్లోపడినా శత్రువుని చంపడం కష్టం. చాలా దెబ్బలు వృధా అయిపోతాయి,” అన్నాడు తన కత్తిని మరొకసారి  పరీక్షగా చూసుకుంటూ.

“నాన్నా ఇలా రా,” అంది తల్లి: “రా, నా గుండెమీద కాస్త విశ్రాంతి తీసుకో. నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా, దయాళువుగా ఉండేవాడివో, అందరూ నిన్నెంత ప్రేమించేవారో  ఒక్కసారి గుర్తుచేసుకో.”

ఆతను ఆమె మాటని మన్నించాడు. ఆమెపై వాలి, కళ్ళు మూసుకుని ఇలా అన్నాడు:

“నాకు నవ్వన్నా, కీర్తిప్రతిష్టలన్నా ఇష్టం, ఎందుకంటే నువ్వు నన్ను కనిపెంచేవు కాబట్టి.

“మరి స్త్రీలో?”, అతని మొహం మీద  మొహం వాల్చి అడిగింది.

“చాలా మంది ఉన్నారు జీవితంలో.  కాని త్వరలోనే వాళ్ల పట్ల విముఖత వచ్చేస్తుంది, తియ్యనివన్నీ త్వరలో వెగటుపుట్టించినట్లు.”

“నీకు నీ వంశాన్ని ఉద్ధరించాలని లేదా?”

“ఎందుకూ? ఎవడో ఒకడు వాళ్ళని చంపడానికా?  నాలాంటి వాడెవడో వాళ్ళని హతమారుస్తాడు.  అది నన్ను దుఃఖంలో ముంచుతుంది. అప్పటికి తప్పకుండా నేను ముసలివాణ్ణై, శక్తి సన్నగిలి ప్రతీకారం తీర్చుకోలేని స్థితిలో ఉంటాను.”

ఆమె నిట్టూరుస్తూ, “నువ్వు చాలా అందగాడివి. కానీ, మెరుపులా అనపత్యుడివి.”

అతను నవ్వుతూ అన్నాడు: “నిజం. నేను మెరుపులాంటి వాడిని.”

అతను చిన్నపిల్లవాడిలాగే ఆమె గుండెమీద నిద్రపోయాడు.

ఆమె అతని ముఖంపై తనపైనున్న నల్లని వస్త్రాన్ని కప్పి గుండెలో కత్తితోపొడిచింది.  ఒక్క సారి అతను వణికి, వెంటనే ప్రాణాలు విడిచాడు, ఎందుకంటే తల్లిగా ఆమెకు తన కొడుకు గుండె ఎక్కడ చప్పుడు చేస్తోందో బాగా తెలుసు.  శవాన్ని తన కాళ్ళమీదనుండి ఆశ్చర్యంలో మునిగిన కాపలాదారుల కాళ్లమీదకి త్రోసి, తన నగరం వైపు వేలు చూపిస్తూ ఆమె ఇలా అంది:

“ఒక పౌరురాలిగా నా జన్మభూమికి నేను చెయ్యగలిగినదంతా చేశాను; కాని తల్లిగా నేను నా కొడుకుతోపాటే ఉంటాను. నాదిపుడు పిల్లలని కనే వయసు కాదు. నా జీవితం ఎవరికీ పనికిరాదు కూడా,” అని అంటూ, తనకొడుకు రక్తం … తనరక్తం.. వేడి ఇంకా చల్లారని అదే కత్తిని తన గుండెల్లోకి దించుకుంది. నిస్సందేహంగా అది గుండెలోనుండి దూసుకుపోయి ఉండాలి.  హృదయం వేదనకు గురయినప్పుడు దాన్ని తప్పిపోకుండా గురిచూడడం సులభం!

.(Courtesy: Phoenix, Vol 3 July-Aug 1915 No 2-3  pp 45 – 51)