మళ్ళీ మళ్ళీ అదే దారిలో…

 

 

ప్రపంచానికి సంబంధించి సమయం మాత్రం నిరంతరం కదిలెళ్ళిపోతూ ఉంటుంది. మనమే సంవత్సరాల తరబడీ ఒకేచోట ఆగిపోతాం! మరచిపోయో, అనుకోకుండానో కాదు.. కావాలనే ఒకే దారి గుండా పదే పదే వెళ్తుంటాం. 

ఏదో ఒక రోజు అధాటుగా తల ఎత్తగానే ఎదురుగా తను చూస్తుంటుందని, మనల్ని చూసిన సంతోషంతో ఎప్పట్లానే ఒక్కసారి రెప్పలార్పి, నవ్వుతో పలకరిస్తుందని… సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత, తడి పెదవుల గుండా వచ్చే ఆ నాలుగైదు మాటల కోసం ఎటూ వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ అదే దారిలో వెళ్తుంటాం!

ఒకటే ఆశ… ఆ దారిలో ఉన్న ఎర్రపూల చెట్టుకీ, గోపి రంగు డాబా ఇంటి అరుగులకీ, వీధి పేరున్న బోర్డుకీ, ఇంకా ఈ కవితలో చెప్పినట్టు దీపం స్థంభానికీ తన రాకపోకల సమయాలు, క్షేమ సమాచారాలు ఖచ్చితంగా తెలిసే ఉంటాయని! వేల నిరీక్షణల తర్వాత అయినా  కాస్తంత దయ తలచి అవి తన గురించి చెప్పేస్తాయనే ఆశ!!

ఇది అతి మామూలుగా చెప్పబడిన కవిత… కానీ, ఆఖరి లైన్ పూర్తి చేస్తూనే హఠాత్తుగా ఒక ముల్లు కాలిలో చివుక్కున దిగబడిన బాధ… ఆపైన కాస్త నిస్సత్తువ… ఒక సుదీర్ఘ నిట్టూర్పు.. అన్నీ కలిపి మనల్ని కూడా మనం వదిలేసిన, వదిలేయాలనుకున్న దారుల్లోకి లాక్కెళ్తాయి!

gulzar

 

అదే వీధి

 

 

 

నా వ్యాపారపు పనుల మీద

అప్పుడప్పుడూ తన ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆ వీధి గుండా వెళ్తుంటాను

 

ఆ కనీకనిపించనట్టుండే వీధి,

ఇంకా అక్కడ మలుపులో ఆవులిస్తున్నట్టుండే

ఒక పాత దీప స్తంభం,

దాని కిందనే ఒక రాత్రంతా తన కోసం ఎదురుచూసీ చూసీ

తన ఊరిని వదిలి వచ్చేశాను!

 

చాలా వెలవెలబోతున్న కాంతి ఊతాన్ని ఆనుకుని,

ఆ దీపస్థంభం ఇంకా అక్కడే ఉంది!

అదొక పిచ్చితనమే, కానీ నేను ఆ స్థంభం దగ్గరికి వెళ్ళి,

ఆ వీధిలో వాళ్ళ చూపుల్నించి తప్పించుకుంటూ

అడిగాను, ఇవ్వాళ కూడా, ఏమంటే..

 

‘తను నే వెళ్ళిపోయాక కానీ రాలేదు కదా!?

చెప్పు, వచ్చిందా తను?’

 

 

మూలం:

 

Main rozgaar ke silsile mein,

kabhi kabhi uske shaher jata hoon to guzarta hu us gali se

 

Wo neem-tariq si gali,

Aur usi ke nukkad pe uundhtaa-saa

purana sa ik roshanii ka khambha,

usii ke niiche tamam shab intezaar karke,

main chod aaya tha shaher uska!

 

Bahut hi khastha-sii roshni ko teke,

wo khambha aaj bhi wahi khada hai!

fatuur hai yah, magar main khambhe ke paas jaa kar,

nazar bachaake mohalle walon kii,

puuch letaa hoon aaj bhi ye –

wo mere jaane k bad bhii, aayi to nahi thi?

wo aayi thi kyaa?

 

painting: Satya Sufi

రాత్రంతా జీవిస్తూ ఉండడానికీ….

ఒకలాంటి ప్రశాంతమైన అలసటా, విరామపు రాత్రీ కలిసి వస్తే..
ఆలోచలన్నీ వదిలించేసుకోవడానికని తల విదిలించుకున్నప్పుడే, సరిగ్గా అప్పుడే, మరుగున పడ్డ జ్ఞాపకాలేవో పలకరిస్తే.. ముఖ్యంగా అవి ఒకప్పటి అపురూపాలైతే!?
అన్నిటినీ ముందేసుకుని..
సగానికి వంగిపోయిన నెమలీకలూ.. చిట్లిన సముద్రపు గవ్వలూ.. ఎండిన గులాబి రేకులూ… ఇంకు వెలిసి రాలి పోతున్న అక్షరాలూ…
అన్నిటినీ తడిమి, తరచి తరచి చూసుకుంటూ
సర్వం మరిచి, రెండు అలల మధ్య నిశ్శబ్దాన్ని చేజిక్కించుకున్నట్టు .. దాటిపోయిన వెన్నెల గాలిని అతి జాగ్రత్తగా ఇంకొక్కసారి ఒడిసిపట్టుకుని..
మనల్ని మనం తాకే ప్రయత్నం చేసుకోడానికి, కొన్ని రాత్రిళ్ళు సహాయం చేస్తాయి..
రాత్రంతా జీవిస్తూ ఉండడానికీ…. మొదటి వెలుగు కిరణంతోటే మళ్ళీ మరణించడానికీ చాలా రాత్రిళ్ళు సహకరిస్తాయి!
gulzar

రాత్రంతా

రాత్రంతా చల్లగాలి వీస్తూనే ఉంది
రాత్రంతా నెగడు రగిలిస్తూనే ఉన్నాము
నేను గతం తాలూకు ఎండిపోతున్న కొన్ని కొమ్మల్ని నరికేశాను
నువ్వు కూడా గడిచిపోయిన క్షణాల ఆకుల్ని విరిచేశావు
ఆపైన నేనేమో నా జేబులోంచి జీవం లేని కవితలన్నిటినీ తీశేశాను
ఇహ నువ్వు కూడా చేతుల్లోంచి వెలిసిపోయిన ఉత్తరాలని తెరిచావు
నా ఈ కళ్ళతో కొన్ని తీగల్ని తుంఛేశాను
చేతుల్లోంచి ఇంకొన్ని పాతబడ్డ గీతల్ని పారేశాను
నువ్వేమో కనురెప్పల తడి పొడినంతా వదిలేశావు
రాత్రంతా మన శరీరాలపై పెరుగుతూ మనకి దొరికినవన్నీ
నరికి మండుతున్న నెగడులోకి విసిరేశాము
రాత్రంతా మన ఊపిరి ప్రతీ జ్వాలలో శ్వాస నింపింది
రెండు శరీరాల ఇంధనాన్ని మండిస్తూనే ఉంది
రాత్రంతా ఒక మరణిస్తున్న బంధం వేడిలో చలి కాచుకుంటూనే ఉన్నాము.
satya

మూలం:

Raat bhar sard hawa chalti rahi
raat bhar hamne alaav taapa

maine maazi se kai khushk see shaakhien kaati
tumne bhi gujre hue lamhon ke patte tode
meine jebon se nikali sabhi sukhi nazmein
tumne bhi haathon se murjhaaye hue khat khole
apnee in aankhon se meine kai maanze tode
aur haathon se kai baasi lakeeren phenki
tumne palkon pe nami sookh gayee thee, so gira di
raat bhar jo bhi mila ugte badan par humko
kaat ke daal diya jalte alaawon main use

Raat bhar phoonkon se har lau ko jagaye rakha
aur do jismon ke indhan ko jalaye rakha
raat bhar bujhte hue rishte ko taapa humne…

————————-

Painting: Satya Sufi

పిల్లలు నేర్పించే ఫిలాసఫీ…

 

 

పిల్లలు.. మెరిసే ముఖాల పిల్లలు.. మట్టి నవ్వుల పిల్లలు.. అడుగుగులతో ఏ ప్రదేశాన్నైనా ఉద్యానవనంగా మార్చే పిల్లలు! వాళ్ళ ఆటల్నీ, చేష్టల్నీ ముద్దుగా మురిపెంగా చూస్తామే కానీ వాటిల్లో దాగి ఉండే జీవిత సారాంశాన్ని గుల్జార్ దర్శించినట్టు బహుతక్కువమంది చేయగలరు!

పిల్లల చర్యల్లో జీవితానికి సంబంధించిన రూపకాలూ, తాత్వికతా అనేక రూపాల్లో తారసపడతాయి!

చాన్నాళ్ళ క్రితం చదివిన ఒక తెలుగు కధలో ఒక పిల్లవాడు పటంలో ఉన్న దేవుడి చేతిలోని తామర పూవు చూసి, ‘తన దగ్గర ఉంది కదా చాలనుకుని వర్షాలు కురిపించడం లేదనీ, అందువల్లే చెరువులో నీళ్ళు ఇంకిపోయి, అందులోని తామరపూవులన్నీ ఎండిపోయాయనీ’ అనుకుంటాడు.. ఆయన చేతిలోని పూవుని లాగేసుకుంటే అయినా వర్షాలు కురిపిస్తాడేమో అని, పీట వేసుకుని మరీ ఆ పటాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాడు!

చదవడానికి అతి మామూలుగా అనిపించే ఈ కవితలూ, కధల్లో లోతైన తాత్వికత నిండి ఉంటుంది. చదవడం అయిపోగానే వాటిలోని భావాలు మనసుని దిగులుతో నింపివేస్తాయి. గంభీరతతో ఆలోచింపజేస్తాయి!

gulzar

 

ఇంధనం

చిన్నప్పుడు అమ్మ పిడకలు చేస్తుండేది
మేమేమో వాటి మీద ముఖాలు గీస్తుండేవాళ్ళం
కళ్ళు వేసి, చెవులు తగిలించి
ముక్కు అలంకరించి
తలపాగా అతను, టోపీ వాడు
నా పిడక
నీ పిడక
మాలో మాకు తెలిసిన పేర్లన్నీ పెట్టుకుని
పిడకలు అతికించేవాళ్ళం.

కిలకిలా నవ్వుకుంటూ రోజూ సూర్యుడు పొద్దున్నే వచ్చి
ఆ ఆవు పిడకల మీద ఆడుకునేవాడు.
రాత్రుళ్లలో పెరటిలో పొయ్యి వెలిగించినప్పుడు
మేమందరం చుట్టూ చేరేవాళ్ళం
ఎవరి పిడక మంటల్లోకి చేరుతుందని చూసుకుంటూ
అది పండితుడు
ఒకటి మున్నా
ఇంకోటి దశరధ్

చాన్నాళ్ళ తర్వాత నేను
స్మశానంలో కూర్చుని ఆలోచిస్తున్నా
ఇవాళ్టి రాత్రి ఆ రగులుతున్న మంటల్లోకి
మరొక స్నేహితుడి పిడక చేరింది!

satya1

మూలం:

Chote the, maa uple thapa karti thi
hum uplon par shaklein goontha karte they
aankha lagakar – kaan banakar
naak sajakar
pagdi wala, topi wala
mera upla-
tera upla-
apne-apne jane pehchane naamo se
uple thapa karte they

hunsta-khelta suraj roz savere aakar
gobar ke upalon pe khela karta karta tha
raat ko aangan mein jab chulha jalta tha
hum sare chulha ghe ke baithey rehte
kisi upale ki baari aayi
kiska upla raakh hua
wo pandit tha-
ek munna tha-
ek dashrath tha-

barson baad- main
shamshan mein baitha soch raha hun
aaj ki raat is waqt ke jalte chulhe mein
ik dost ka upla aur gaya!

—————————–

Painting: Satya Sufi

మనసు ఊసులన్నీ మనసు భాషలోనే…

 

మనిషి ఎంత కష్టపడి ఉంటాడో కదా…

తన ఉచ్ఛారణకి అక్షరాలు చిత్రీకరించి.. పదాలు సృష్టించీ… వాక్యాలు నిర్మించీ.. ఒక భాషగా మలచడానికి!

ఏం లాభం! నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పడానికి అది ఏమాత్రం సహకరించడంలేదు.

అంత కష్టమూ శుద్ధ వృధా కదూ!?

‘అయినా మాట్లాడిన ప్రతిసారీ నా ఇష్టాన్ని నీకు ఇలా మాటల్లో చెప్పాలా.. నీకు మాత్రం తెలీదూ?’ అని ఊరుకుందామనిపిస్తుందా.

ఉహూ.. ఎంత ఆపుకుంటే అంత గాఢంగా, మధురంగా చెప్పాలనిపిస్తుంది.

చాలాసార్లు ఎంతో మురిపెంగా నీకు వినిపించే ఆ రెండు మూడు పదాలు కూడా అలాంటప్పుడు నిస్సారంగా, ఒక తప్పని మొనాటనీలా అనిపించేసి చాలా చిరాకుతెప్పించేస్తాయి.

అసలు ఈ గుండె భాషని ఇలా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్నదున్నట్టుగా.. మొత్తంగా నీ గుండెకి చేరేసే ఉపాయమేమీ లేదంటావా!?
ఆ ఆపిల్ వాడు, ఐప్యాడ్లూ, ఐపాడ్లూ మీద కాన్సంట్రేషన్ తగ్గించి ‘ఐఫీల్యూ’ మీద కొంచెం దృష్టి పెట్టొచ్చు కదా!?

gulzar

కవిత

కవిత ఒకటి మనసునే పట్టుకు వేళ్ళాడుతోంది,

ఆ వాక్యాలన్నీ పెదవుల్నే అంటిపెట్టుకున్నాయి,

ఎగురుతున్నాయి అటూ ఇటూ సీతాకోకచిలుకల్లా

పదాలు కాగితం పైన మాత్రం కుదురుకోకుండా!

ఎప్పట్నించీ కూర్చున్నానో, బంగారం

తెల్ల కాగితం మీద నీ పేరు రాసుకుని..

ఒక్క నీ పేరు మాత్రం పూర్తయింది..

అవునూ, ఇంతకన్నా మంచి కవిత్వం ఏముంటుందేమిటీ!?

*****

ఒక పురాతన ఋతువేదో తిరిగొచ్చింది
తోడుగా జ్ఞాపకాల తూరుపునీ తెచ్చుకుంది.
ఇలా అరుదుగా జరుగుతుంది,
తన సమక్షంలోనే విరహమూ వేధిస్తుంటుంది!!

*****

నా నిశ్శబ్దం నడిచేది
నీ సుదీర్ఘ మౌనంగుండానే!
అదేమంటుందో వింటాను….
నా గురించేవో కూడా చెప్పుకుంటూ!!

మూలం:
Nazm uljhi hui hai seene mein
misare atke hue hain hothon par
udate phirte hain titaliyon ki tarah
lafz kaagaz pe baithate hi nahin
kab se baithaa hun main jaanam
saade kaagaz pe likh ke naam tera

bas tera naam hi mukammal hai
is se behtar bhi nazm kyaa hogi

*****

Ek Puraana Mausam Lauta, Yaad Bhari Purvayi Bhi
Aisa To Kam Hi Hotha Hai, Wo Bhi Ho Tanhaayee Bhi

*****

Khamoshi Ka Haasil Bhi Ik Lambi Si Kamoshi Hai
Unki Baath Suni Bhi Humne, Apni Baat Sunayi Bhi.

ప్రాణవాయువు ఊదే పేజీలు..

ఎన్నో మాటలానంతరం పరుచుకునే నిశ్శబ్దం.. ఎంతో పని ఒత్తిడి తర్వాత తొంగిచూసే ఖాళీతనం.. కదిలిపోతున్న మేఘాలతో పాటు మనమూ కదిలిపోయే ప్రయాణాలు.. నిద్ర రానప్పుడూ.. అసలు నిద్రే వద్దనుకున్నప్పుడూ..

అలవాటుగా, ఆత్మీయంగా కౌగిలించుకునే మిత్రుడు పుస్తకం!!

పొగమంచు ఉదయాలపై పరుచుకునే ఉదయకాంతిలా నులివెచ్చగా పొదవుకుంటాయి అక్షరాలు.
అశాంతితో ఉగ్గపట్టి, కొనఊపిరితో బ్రతికే ఘడియల్లోకి సవ్వడి లేకుండా  ప్రాణవాయువు ఊదే పేజీలు..

ఏ తలుపులూ మూయకుండానే మనలో మనం నిమగ్నమయ్యీ, ఒక సీతాకోకచిలుకై, రెప్పలు పడని తీరాలు చేరి, జీవన మృత్యు రహస్యాలకి అతీతంగా మనల్ని మనం బ్రతికించుకునే అవకాశఒ ఇచ్చే పుస్తకానికి కృతజ్ఞత కంటే ఇంకేమీ చెప్పలేని నిస్సహాయతతో….

 

ఒకే ఒక్క శబ్దంనేస్తం

ఏ స్నేహితుల సాయమూ లేకుండానే
వెళ్ళబుచ్చేశాను రోజంతా..
కాస్తంత నాకు నేనే అపరిచితుడనై,
ఇంకాస్త ఒంటరిగానూ, దిగులుగానూ
సముద్ర తీరాన రోజుని ముగించేసి
ఇంటికి తిరిగొచ్చాను
మళ్ళీ అవే నిశ్శబ్దపు, నిర్మానుష్యపు రహదారులన్నీ దాటుకుంటూ!
తలుపులు తెరిచానో లేదో
బల్ల మీద వదిలి వెళ్ళిన పుస్తకం
మంద్రంగా రెపరెపలాడుతూ అడిగింది కదా,

‘ఆలశ్యమయినట్లుంది నేస్తం!’


మూలం:

Be-yaaro-madadgaar hi kaata tha saara din..
kuchh khud se ajnabi sa,
tanha, udaas saa..
saahil pe din bujhaa ke main, laut aaya phir wahin,
sunsaan si sadak ke khaali makaan mein!

Darwaaza kholte hi, mej pe rakhi kitaab ne,
halke se phadphada ke keha,
‘Der kar di dost!’

————–

ఒకింత నిర్లక్ష్యంగా.. బోల్డంత ఇష్టంగా…!

 

మనం ఎక్కిన రైలో బస్సో ఇంకోటో మధ్యలో ఏవో తెలీని అవాంతరాల వల్ల దారి తప్పి, ఊరు కాని ఊళ్ళన్నీ దాటుకుంటూ, మనం వెళ్ళాల్సిన ఊరి నించి మాత్రం దూరంగా.. బహుదూరంగా వెళ్ళి ఆగిపోతే!

అక్కడ నించి మనం కొన్ని పగళ్ళూ, ఇంకొన్ని సాయంత్రాలూ, మరికొన్ని చీకట్లనీ తోడు తీసుకుని ఇంకొంచెం తప్పిపోతే!

నీతోనో, తనతోనో లేక మరెవరితోనో కాదు నాతో కలిసి నేను వెళ్ళిపోగలిగితే!
ఆమధ్యెప్పుడో వారాల తరబడి ప్లాన్ చేసి వెళ్లిన పిక్నిక్‌లో, రోజూల తరబడి వేసిన బడ్జెట్ డబ్బులతో కొన్న హెల్తీ స్నాక్స్ తింటూ, గోముగా పలకరిస్తున్న తేమ గాలిని విసుక్కుంటూ,  వెల్ మేడ్ హెయిర్ కి అదెంత హానికరమో నొక్కి వక్కాణిస్తూ అందరూ తమ తమ జీవితాల్లో బాగా ఎంజాయ్ చేసిన సమయాల గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు…
తెలీకుండానే ఉత్సాహంగా ముందుకు వంగి, బుగ్గ కింద చేయి పెట్టుకుని వింటున్నానా..
పరిగెత్తిన మారధాన్‌లూ, వెళ్ళిన లాంగ్‌ డ్రైవ్ లూ, ఇంకాస్త వెనక్కెళ్ళి చిన్నప్పుడు కొట్టేసిన పెన్నులూ, పట్టేసిన ఫస్ట్‌డే ఫస్ట్ షో టికెట్‌లూ!
సంతోషానికి డెఫినిషన్లు మారుతుంటాయి! తెల్సిన విషయమే మళ్ళీ కొత్తగా గుర్తొచ్చింది!!
సమయాన్ని గంటల్లో కాదు మైళ్ళల్లో కొలుచుకుంటానని హఠాత్తుగా ఉద్యోగానికి రిజైన్ చేసి, మూడునెలల పాటు హైకింగ్ చేయడానికి వెళ్ళిన ఒక స్నేహితుడు గురొచ్చాడు… కావాలని అడవుల్లో తప్పిపోయిన ‘వనవాసి ‘ రాహుల్ సాంకృత్యన్ కూడా మనసులో మెదిలాడు! అఫ్‌కోర్స్, చిన్నవాళ్ళే.. ఏ బాధ్యతలూ లేనివాళ్ళే! కానీ ముందు ముందు జీవితంలో ఇలాంటి ఎన్నెన్ని పిక్నిక్‌ల్లోనో, బాన్‌పైర్ చుట్టూనో వాళ్ళు వాళ్ళ కోసం గడిపిన సమయాలకి జీవం వస్తుంది.. అనుభవాలు కధలుగా మారతాయి!
ప్రతీ ఉదయం మనకి పాకెట్ మనీగా ఒక ఖాళీ దినాన్ని ఇస్తుంది సరే.. బ్రతుకు చక్రానికి పాజ్ ఇచ్చి, ఒకింత నిర్లక్ష్యంగా.. బోల్డంత ఇష్టంగా కుకీ కటర్ జీవితం నించి పారిపోగలిగిన ధైర్యాన్ని కూడా కొసరుగా ఇవ్వగలిగితేనో………..
ఒకే ఒక్క శబ్దం
చేతి ఖర్చు
మొత్తం పగలంతా నాకు చేతి ఖర్చుగా ప్రతిరోజూ దొరుకుతుంది
కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్ని చేజిక్కించుకుంటారు..
నానించి దూరంగా లాక్కెళ్ళిపోతారు!
ఒక్కోసారి జేబులోంచి అది పడిపోతుంది..
జారిపడిన శబ్దమైనా నాకు వినిపించకుండానే!
ఎప్పుడైనా ఒక మంచిరోజు పలకరించినా సరే
మరపుతో అదొక చెడు దినమే అనేసుకుంటాను.
ఇంకొన్నిసార్లు అయితే..
కొంతమంది చొక్కా పట్టుకుని మరీ ఆరోజుని కైవశం చేసుకుంటారు
‘తరతరాలకి సొంతమైన బకాయి ఇది..
నీ వంతు వాయిదాలు చెల్లించక తప్పదంటారు!’
మరికొందరేమో
బలవంతంగా తాకట్టు పెట్టుకుంటూ దయగా చెప్తారు,
‘కాసిన్ని క్షణాలు వాడుకో
కానీ మిగిలినదంతా తర్వాత జీవితానికి జమ వేయక తప్పదు..
అవసరమైనప్పుడల్లా ఖాతా లెక్కలు సరిచూడక తప్పదు!’
నాకొక ప్రగాఢ వాంఛ
ఒక మొత్తం పగలుని కేవలం నాకోసమే ఉంచేసుకోవాలని
ఆసాంతంగా నీతోనే ఖర్చు చేయాలని!
కేవలం అదొక్కటే నా నిజమైన కోరిక!
మూలం:

Mujhe kharchi mein pura din, har roz milta hai
Magar har roz koi cheen leta hai, jhapat leta hai, anti se!

Kabhi khise se gir padhta hai toh girne ki aahat bhi nahi hoti,
Khare din ko bhi mein khota samajh ke bhool jata hu!

Gireban se pakad ke mangane wale bhi milte hai!
‘Teri guzhri hui pushto ka karza hai,
Tujhe kiste chukani hai~’

Zabardast koi girvi bhi rakh leta hai, yeh keh kar,
Abhi do-char lamhe karch karne ke liye rakh le,
Bakaya umr ke khate mein likh dete hai,
Jab hoga, hisaab hoga

Badi hasrat hai pura ek din ek baar mein apne liye rakh lu,
Tumhare saath pura ek din bas kharch karne ki tamanna hai!

అప్పట్లో ఆ కాయితప్పడవ!

 

కాస్తంత ఊసుపోనితనమూ.. బోల్డంత ఉత్సాహమూ.. చినుకు వాసన తగలగానే, కాసిని వృధా కాగితాలు కనబడగానే!
గబగబా వాటిని సాపు చేసి, గోటితో గీరీ గీరీ అతిజాగ్రత్తగా చదరంగా చింపి, ఇంకెంతో ఏకాగ్రతతో మడతలు పెడుతూ ఒక కాగితం పడవని తయారు చేసుకుని, ఇక ఆ సాయంత్రమంతా కురవబోయే వానలో ముందుగా చేతులు జాచి  అరచేతిలోకి చినుకుల్ని ఆహ్వానించడం!

చిన్నప్పుడనేం కాదు.. ఇప్పటికీ కూడా!

వర్షం పెద్దదయ్యీ, కాస్త నీళ్ళు నిలవగానే మెల్లగా పడవని వదలడం.. అది ఒరగకుండా, మునగకుండా ఆ వర్షపు నీటి అలల్లో మెల్లగా ఊగుతూ నిలకడగా ఉండటం చూశాక ఇక అదో భరోసా. ఈ కొత్త ప్రయాణంలో అది భద్రంగానే ఉండగలదని!

కాసేపయ్యాక కూడా కదలకుండా అక్కడక్కడే తిరుగాడుతూ ఉంటే మెల్లగా చేతుల్తో నీళ్ళని ముందుకు తోయడం, ప్రవాహంలో నడవడ తప్పదని అప్పట్లో పడవకి అర్ధమైందో లేదో కానీ, తల్చుకుంటే మాత్రం కాలేజీ చదువుకని ఒంటరిగానే రైలెక్కించిన అమ్మ గుర్తొచ్చింది!

పైనా, కిందా చుట్టూ నీళ్ళల్లో…. ముసురు పట్టిన రాత్రిళ్లలో… సుళ్ళు తిరుగుతూ సాగిపోతుందా పడవ, ఒంటరిగా.. ఒక రహస్య సందేశం అందించే గురుతర బాధ్యతని చేపట్టిన సైనికుడిలా!!!

satya

కాగితం పడవ

 

కూడలి నించి నడచి, మార్కెట్ మీదుగా, బజారు దాటుకుంటూ

ఎర్ర వీధుల్లోంచి వెళ్తోంది కాగితం పడవ
వర్షాకాలపు అనాధ నీళ్ళల్లో ఊగిసలాడుతోంది నిస్సహాయ పడవ!

ఊరిలోని అల్లరిచిల్లర సందుల్లో కలత పడుతూ అడుగుతోంది,

‘ప్రతి పడవకీ ఒక తీరం ఉంటుందంటే

మరి నాదైన తీరం ఎక్కడా?’

 

ఎంతటి అమానుషత్వమో కదా,

ఒక అమాయక బాలుడు

నిరర్ధకమైన కాగితానికి

కాస్త అర్ధాన్ని ప్రసాదించడం!!

 

మూలం:

Chauk se chalkar, mandi se, baajaar se hokar

Laal gali se gujari hain kaagaj ki kashti

Baarish ke laawaris paani par baithi bechaari kashti

Shehar ki aawaaraa galiyon main sehamii sehamii puunch rahii hain

‘Har kashTi ka saahil hota hain to —

Mera bhI kya saahil hoga?’

Ek maasoom bachche ne

Bemaanii ko maanii dekar

Raddi ke kaagaj par kaisaa julm kiyaa hain!!

కిటికీ వెనక నిశ్శబ్దం

గుల్జార్  కవిత్వం చదువుతున్నప్పుడు నేనెప్పుడూ వొక తోటని ఊహించుకుంటాను.

వేల వర్ణాల పూలతో మాట్లాడుకుంటూ వుంటాను. అనేక రకాల ఆకుల చెక్కిళ్ళని  నా చూపులతో తాకుతూ వుంటాను. పూల మధ్య దూరంలో విస్తరించే పరిమళాన్ని కొలుస్తూ వుంటాను. ఈ తోటలో నడుస్తూ వున్నప్పుడు నా భాష మారిపోతుంది. లోకమంతా వొకే  ప్రతీకగా మారిపోయి కనిపిస్తుంది.

ఎన్ని పూలు..ఎన్ని ఆకులు…ఎన్ని పరిమళాలు…వొకటి ఇంకో దాన్ని అనుకరించనే అనుకరించదు. ప్రతి పూవూ, ఆకూ తనదైన లోకాన్ని తన చుట్టూరా ఆవిష్కరిస్తూ పరిమళిస్తుంది. 

గుల్జార్ అంటే తోట. కాని, గుల్జార్ కవిత్వమంతా ఈ తోటకి పర్యాయ పదమే!

వొక సారి ఈ తోటలోకి అడుగు పెట్టాక వెనక్కి తిరిగి వెళ్లాలని అనిపించదు. వెళ్ళినా, ఈ  తోట మన కలలనీ, వాస్తవాల్నీ వదిలి వెళ్ళదు. ఈ తోటలోని వొక్కో పూవునీ తనదైన ప్రత్యేకమైన ఎంపికతో ఇక నించి వారం వారం మన ముందు వుంచబోతున్నారు నిషిగంధ

nishigandha

నిషిగంధ

satya

సత్యా సూఫీ

నిషిగంధ ఇక్కడ కేవలం అనువాదకురాలు మాత్రమే కాదు. గుల్జార్ కవిత్వంతో ఆమెకేదో ఆత్మీయ బంధం వుంది. ఇద్దరిలోనూ వొకే గంధమేదో వుంది. అందుకే, ఈ అనువాదాల్లో రెండు ఆత్మలు వొకే భాషని వెతుక్కుంటున్న నిశ్శబ్దం వినిపిస్తుంది.

గుల్జార్ తేలిక మాటలే ఉపయోగిస్తాడు. అందరికీ తెలిసిన ప్రతీకలే వాడతాడు. సందర్భాలు కూడా మనకి తెలిసినవే కదా అనిపిస్తాడు. కాని, వొక తెలియని మార్మికతని ఆ సందర్భంలోకి లాక్కొని వస్తాడు. మనకి బాగా తెలిసిన లోకమే తెలియనట్టు వుంటుంది అతని భాషలో-  అలాంటి తెలిసీ తెలియని ఆ సున్నితత్వాన్ని నిషిగంధ ఈ అనువాదాల్లోకి చాలా సహజంగా తీసుకువచ్చారు.

అనువాదాలు వొక ఎత్తు అయితే, ఈ రెండీటికి తగ్గట్టుగా ఆ కవిత్వంలోని నైరూప్యతా, ఆప్యాయతా అందుకొని వాటిని రేఖల్లో ఎవరు బంధించగలరా అని ఆలోచిస్తున్నప్పుడు  వెంటనే తట్టిన పేరు సత్యా సూఫీ. కవితని చదువుకుంటూ దానికి రేఖానువాదం చేయడం అంత తేలికేమీ కాదు. ప్రత్యేకమైన తన నలుపూ తెలుపు వర్ణ ఛాయలతో  గుల్జార్ నీ, నిషిగంధనీ వొకే రేఖ మీదికి తీసుకువచ్చిన అరుదైన చిత్రకారిణి సత్యా.

– అఫ్సర్ 

~~

కిటికీ వెనక నిశ్శబ్దం

 

కిటికీలన్నీ మూసి ఉన్నాయి

గోడల హృదయాలూ గడ్డకట్టుకున్నాయి

తలుపులన్నీ వెనక్కి తిరిగి నించున్నాయి

ఆ బల్లా, కుర్చీ అన్నీ

నిశ్శబ్దపు తునకల్లా!

ఆ రోజుకి సంబంధించిన శబ్దాలన్నీ

నేల కింద సమాధి అయ్యాయి.

చుట్టూ అన్నిటికీ తాళాలు..

ప్రతి తాళం మీదా ఒక కరకు నిశ్శబ్దం!

gulzar1

ఒకే ఒక్క శబ్దం నాకు దొరికితే..

నీ స్వరం తాలూకు శబ్దం..

ఈ రాత్రి రక్షించబడుతుంది!

ఇక కలసి మనిద్దరం

ఈ రాత్రిని రక్షించవచ్చు!

   *****