రెండు డాలర్లంత వర్షం

 (డొమినికన్ రిపబ్లిక్ కథ)

Juan_Bosch_escritor

ఖ్వాన్ బాష్ (1909 – 2001):  ఇతడు డొమినికన్ రిపబ్లిక్ దేశానికి చెందిన వాడు. కథారచయితే కాక రాజకీయ వేత్త, చరిత్రకారుడు, వ్యాస రచయిత, విద్యావేత్త. 1939లో Dominican Revolutionary Partyని, 1973లో Dominican Liberation Partyని స్థాపించాడు. 23 సంవత్సరాల కాలం ప్రవాసంలో గడిపి వచ్చాక 1963లో దేశాధ్యక్షుడయ్యాడు. 1969లో ప్రత్యర్థులు అతని పాలనను కూలదోయటంతో మళ్లీ పోర్టోరికోకు శరణార్థిగా వెళ్లాడు. నాలుగు కథా సంపుటాలు, రెండు నవలలు, 26వ్యాస సంపుటాలు రాశాడు.

***

ముసలి రెమిజియా గుర్రపు వీపును గట్టిగా కరచుకుని, తన చిన్న ముఖాన్ని పైకెత్తుతూ  “నరకం లోని ఆత్మల కోసం ఇదిగో నా దమ్మిడీ, ఇక వర్షం పడుతుంది ఫెలిపా” అన్నది.

ఫెలిపా చుట్ట తాగుతూ ఏ జవాబూ ఇవ్వలేదు. కరువు గురించిన యెన్నో శోకాలను విన్నది ఆమె. అంతిమంగా చెయ్యి పైకెత్తి ఆకాశాన్ని ఒక కొస నుంచి మరో కొస వరకు పరీక్షగా  చూసింది. ఆకాశం నిర్మలంగా వుంది. ఒక్క మబ్బు కూడా లేదు. ఆకాశపు తెల్లదనం రెమిజియా  కు ఆగ్రహాన్ని తెప్పించింది.

ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు  అనుకుని మళ్లీ తన చూపును దించుకుంది.  గోధుమవర్ణపు పొలాల నేల పగుళ్లను చూపుతోంది. దూరాన కొండ మీద ఒక గుడిసె వుంది. ఆ గుడిసెలో, పక్క గుడిసెలో, దాని పక్క గుడిసెలో, ఇంకా చుట్టుపక్కల వున్న ఇతర గుడిసెల్లోని వారంతా ఆమె లాగా, ముసలి రెమిజియా లాగా అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎన్నో నెలలుగా వర్షమే లేదు. కొండ అంచుల మీది పైన్ చెట్లను మగవాళ్లు కాల్చేశారు. ఆ మంటల వేడిమి మొక్కజొన్న కాండాలకు వేలాడే ఆకుల్ని కాల్చేసింది. అగ్నికణాలు పిట్టల్లాగా ఎగురుతూ,  కాంతిచారల్ని వదులుతూ మహా జ్వాలలై మండాయి. ఇదంతా యెందుకంటే ఆ పొగంతా పై  లోకం వైపు పోయి వర్షం కురుస్తుందని వాళ్ల ఆశ. కానీ అలా జరగ లేదు.

“మన బ్రతుకులు అంతమయ్యే రోజు వచ్చింది రెమిజియా” అన్నది ఫెలిపా

“ఎన్నో సంవత్సరాలుగా మనం నేలను సాగు కోసం తయారు చేస్తూ…”     రెమిజియా ఏదో చెప్పటం ప్రారంభించింది.

పంటల్ని నాశనం చేస్తూ కరువు ప్రారంభమైంది. నేల లోని తేమనంతా పీల్చేసాక అది నదుల మీద, కాలువల మీద తన ప్రభావాన్ని చూపించటం మొదలు పెట్టింది. కొంచెంకొంచెంగా నదుల అడుగు భాగాలు పైకి తేలి, పాకుడు పట్టిన బండరాళ్లు తమ తలల్ని పైకి లేపాయి. చిన్న చేపలన్నీ నది దిగువ భాగానికి తరలి పోయాయి. ఒక్కో వానా కాలం గడిచిన కొద్దీ నదులు ఎండి  పోవటమో, బురదగుంటలుగా మారటమో లేక చిత్తడినేలలుగా మారటమో జరిగింది. దాహమూ, నిరాశా నిండిన ఎన్నో కుటుంబాలు పొలాలను వదిలేసి, తమ గుర్రాల మీద ఎక్కి , వర్షాభావం లేని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.

కాని వృద్ధురాలైన రెమిజియా అందుకు నిరాకరించింది. ఏదో ఒక రోజు వర్షం వస్తుందనీ, ఒక మధ్యాహ్నాన ఆకాశం మీద మబ్బుల గుంపులు బారులు తీరుతాయనీ, ఏదో ఒక రాత్రి వేళ ఎండిపోయిన తన గుడిసె మీద పడే వర్షపు చినుకుల శబ్దం తనకు వినపడుతుందనీ   ఆశ పడిందామె.

తన కొడుకును స్ట్రెచర్ మీద తీసుకు వెళ్తూ మనవడినొక్కడినే తనకు వదిలిన నాటి నుండి రెమిజియా ముభావంగా వుంటూ పొదుపును అవలంబించ సాగింది. తన సొరకాయ బుర్ర  ను కొంత బూడిదతో నింపి, ఒకటొకటిగా నాణాలను అందులో వేస్తూ పోయింది. గుడిసె వెనుక వున్న నేలలో మొక్కజొన్న, చిక్కుడు వేసింది. మొక్కజొన్న గింజలు కోళ్లకూ, పందులకూ పనికొ   స్తాయి. చిక్కుడేమో తనకూ, తన మనవడికీ. ప్రతి రెండు మూడు నెల్లకో సారి ఆమె బాగా పెరిగిన కోడిని తీసుకుని, దాన్ని అమ్మటానికి పట్నం వెళ్తుంది. పందుల్లో ఒకటి బాగా బలిసి వుంటే ఆమె దాన్ని చంపి, ఆ మాంసాన్ని తనే అమ్ముతుంది. అందులోంచి ఆమె వెన్నను కూడా తయారు చేస్తుంది.  దాన్నీ, పంది తోలునూ కూడా ఆమె పట్నానికి తీసుకుపోయి అమ్ముతుంది. గుడిసె తలుపును మూసేసి, తన వస్తువుల్ని జాగ్రత్తగా చూడవలసిందిగా పొరుగింటి వాళ్లకు చెప్పి,  మనవణ్ని బుల్లి గుర్రం మీద కూచోబెట్టి, తాను వెనకాల నడుస్తూ పోతుంది. ఇంటికి తిరిగి వచ్చే సరికి రాత్రవుతుంది.

ఈ విధంగా మనవణ్ని గుండెకు వేలాడదీసుకుని, జీవితాన్ని స్వీకరించింది ఆమె.  “నేను బతుకుతున్నది నీ కోసమే బిడ్డా. నువ్వు కూడా నీ తండ్రి లాగా జీవితం కోసం విపరీతమైన తంటాలు పడటం, లేక వయసు మీరక ముందే చనిపోవటం నాకిష్టం లేదు” అంటుంది ఆమె ఆ పిల్లవాడితో. ఆ పిల్లవాడు ఆమె వైపు చూస్తాడు. వాడు మాట్లాడుతుండగా ఎవరూ వినలేదు.  మూడడుగుల ఎత్తు కూడా లేకున్నా వాడు సూర్యోదయంకన్న ముందే లేచి, చంకలో ఇనుప తవ్వుడు కోలను పెట్టుకుని, పొలం లోకి పోయి పని చేస్తుంటే అప్పుడు సూర్యోదయమౌతుంది.

ముసలి రెమిజియా ఆశల్ని హృదయానికి హత్తుకుంటూ బతుకుతోంది. తన మొక్కజొన్న, చిక్కుడు పెరుగుతుంటే, దొడ్లో పందులు గురగురమని శబ్దం చేస్తుంటే ఆమె మనసుకు నిమ్మళంగా వుంటుంది. రాత్రి వేళల్లో కోళ్లు ఎగిరి చెట్ల కొమ్మల మీద కూర్చున్నప్పుడు  ఆమె తన గుడిసెలో వున్న కోళ్లను లెక్క పెడుతుంది. మధ్యమధ్య సొరకాయ బుర్రను కిందికి దింపి, రాగి నాణాల్ని లెక్క పెడుతుంది. అందులో అవి బాగా జమ అయ్యాయి. కొన్నాళ్ల తర్వాత అన్ని సైజుల సిల్వర్ నాణాలు కూడా జమ అయ్యాయి.

ఆమె వణికే చేతులతో నాణాలను ప్రేమగా నిమిరి, మనససులో ఒక స్వప్నాన్ని దర్శిం చింది. ఆ కలలో యుక్తవయస్కుడైన తన మనవడు మంచి గుర్రం మీద స్వారీ చేస్తూనో  లేక కౌంటరు వెనక రమ్ సీసాలనో, గుడ్డలనో, చక్కెరనో అమ్ముతూనో కనిపించాడు. ఆమె నవ్వి , నాణాల్ని తిరిగి సొరకాయ బుర్రలో వేసి, ఆ బుర్రను కొయ్యకు తగిలించి, గాఢనిద్రలో ఉన్న పిల్ల   వాని పైకి వంగింది.

అంతా సవ్యంగా జరిగిపోతోంది. కానీ కొన్నాళ్ల తర్వాత ఎందుకు ఎలా అని తెలియ  కుండా కరువొచ్చింది. ఒక నెల వర్షం లేకుండా గడిచింది. తర్వాత రెండు నెలలు, ఆ పైన మూడు నెలలు. ఆమె గుడిసె ముందు నుంచి పోయే మగవాళ్లు పరామర్శ చేస్తూ  “వాతావరణం  భయంకరంగా వుంది రెమిజియా” అంటారు.

ఆమె నిశ్శబ్దంగా అంగీకరిస్తుంది. ఒక్కో సారి  “నరకంలో ఉన్న ఆత్మల కోసం కొవ్వొత్తుల్ని వెలిగించాలి” అంటుంది.

Akkadi MeghamFeatured

కానీ వర్షం కురవలేదు. ఎన్నో కొవ్వొత్తుల్ని వెలిగించినా మొక్కజొన్న చేను వడలి పోయింది. వసంత రుతువులు అడుగంటి పోయాయి. పందులు దొర్లే బురద ప్రదేశం ఎండి పోయి మట్టిబిళ్లలు తయారైనాయి. అప్పుడప్పుడు ఆకాశం మీద కొన్ని మబ్బులు కమ్ముతాయి.  దూరాన ఎండిపోయిన మందమైన గట్లు కనిపిస్తున్నాయి. కొండ మీది భాగం నుండి ఒక తేమ నిండిన గాలి వీచి, ధూళిమేఘాల్ని లేపింది.

తన గుడిసె ముందు నుండి పోయే మనుషులు  “ఈ రాత్రికి వర్షం వస్తుంది రెమిజియా” అంటూ నమ్మకమిచ్చారు.

“ఇన్నాళ్లకు వాన వస్తోంది” అన్నది ఒకామె.

“ఇక యీ రోజు వర్షం కురిసినట్టే” అన్నది ఒక నీగ్రో స్త్రీ.

ముసలి రెమిజియా పడక మీదికి పోయి, దేవుణ్ని ప్రార్థించింది. నరకం లోని ఆత్మలకు మరిన్ని కొవ్వొత్తుల్ని వాగ్దానం చేసి, నిరీక్షించింది. ఆమెకు కొండ శిఖరాల మీద వర్షం కురుస్తున్న చప్పుడు వినిపించినట్టనిపించింది. ఆశాభావంతో రాత్రి ఆమె నిద్ర పోయింది. కానీ ఉదయం లేచి చూసే సరికి ఆకాశం తెల్లని తాజా దుప్పటిలా ఖాళీగా, నిర్మలంగా వుంది.

జనాలకు ధైర్యం సడలి పోయింది. అందరి ముఖాలూ వెల్ల వేసినట్టు తెల్లబడి పోయాయి. నేలను ముట్టుకుని చూస్తే అది వేడిమితో కాలిపోతోంది. చుట్టుపక్కల ప్రదేశాల్లోని నదులు, సెలయేళ్లు అన్నీ ఎండిపోతున్నాయి. కొండ చుట్టుపక్కల ఉన్న చెట్టూ చేమా అంతా మాడిపోయింది. పందులకు వేయటానికి మేత లేదు. చెట్ల మీది ఎండిన కాయల కోసం గాడిదలు తిరుగుతున్నాయి. పశువులు చిత్తడి నేలలకు తరలి పోయి, చెట్ల వేర్లను చప్పరిస్తున్నాయి. ఒక డబ్బా అంత నీళ్ల కోసం వెతుకుతూ పిల్లలు ఒక పూటంతా గడుపుతున్నారు. గింజల్ని, పురుగుల్ని దొరికించుకోవటానికి కోళ్లు అడవుల్లోకి వెళ్లి పోయాయి.

“ఇది ప్రళయం రెమిజియా, ప్రళయకాలం” అంటూ దుఃఖించారు ముసలి స్త్రీలు.

ఒక చల్లని ఉదయం పూట రొసెండో తన భార్య, ఇద్దరు పిల్లలు, ఆవు, కుక్క , బక్కచిక్కిన గాడిదను తీసుకుని వెళ్లిపోయాడు. సామానునంతా గాడిద వీపు మీద తీసుకెళ్తూ , “దీన్ని నేను తట్టుకోలేను రెమిజియా. ఈ వూరి మీద ఏ దుష్టశక్తిదో పాడు దృష్టి పడింది”  అన్నాడు. రెమిజియా గుడిసె లోపలికి పోయి, రెండు రాగి నాణాలతో బయటకు వచ్చింది.  వాటిని రొసెండోకు యిస్తూ, “నరకం లోని ఆత్మల కోసం నా పేరు మీద యీ డబ్బుతో కొవ్వొత్తుల్ని కొని వెలిగించు” అన్నది. రొసెండో ఆ నాణాల్ని తీసుకుని, వాటిని చూసి, తల పైకెత్తి, ఆకాశాన్ని చాలా సేపు చూశాడు.

“నీకు రావాలనిపించినప్పుడు టవేరాకు వచ్చెయ్. అక్కడ మాకు చిన్న భూమి చెక్క దొరికింది. నీకు ఎప్పుడూ మా స్వాగతం వుంటుంది” అన్నాడు.

“నేనిక్కడే వుంటాను రొసెండో. ఈ కరువు ఇట్లానే వుండి పోదు” అన్నది రెమిజియా.

రొసెండో వెనక్కి తిరిగాడు. తన భార్యాపిల్లలు చాలా దూరం వెళ్లిపోయారు.  దూరాన వున్న కొండలు సూర్యకాంతి మంట మీద వున్నట్టు అనిపించినయ్.

రెమిజియా మనవడు ఎండల ధాటికి నీగ్రో లాగా నల్లబడి పోయాడు.“నానమ్మా!  ఒక పంది చచ్చిపోయినట్టుంది” అన్నాడు వాడు. రెమిజియా పందుల దొడ్డి వైపు పరుగెత్తింది.  ముట్టెలు వడలిపోయి, తీగల్లాగా తయారయి, పందులు గురగురమంటూ రొద చేస్తూ ఒగరుస్తున్నాయి. అవి అన్నీ ఒక చోట గుమిగూడాయి. వాటిని పక్కకు తరిమి చూడగానే, చచ్చి పడి వున్న ఒక పంది కనిపించింది ఆమెకు. అది బతికి వున్న పందులకు ఆహారంగా పనికి వచ్చిందని ఆమెకు అర్థమైంది. తనే స్వయంగా వెళ్లి నీళ్లు తెస్తే పందులు బతుకుతాయి కనుక  అలా చేయాలని నిశ్చయించుకున్నది ఆమె.

సూర్యోదయం కాగానే ఆమె ముదురు గోధుమ రంగులో వున్న తన చిన్న గుర్రాన్ని తీసుకుని బయలుదేరింది. తిరిగి వచ్చే సరికి మధ్యాహ్నమైంది. మౌనంగా, మొండిగా,  అవిశ్రాంతంగా ఇదే ప్రణాళికను పాటించించింది. ఆమె నోటి నుండి ఒక్క ఫిర్యాదు మాట కూడా బయటికి రాలేదు. సొరకాయ బుర్ర బరువు తగ్గింది. అయినా నరకం లోని ఆత్మలు జాలి చూపుతాయని తను పొదుపు చేసిన డబ్బులో కొంత భాగాన్ని ఆమె వెచ్చించింది. గుర్రానికి శ్రమ ఇవ్వకూడదని ఆమె నడిచి వెళ్లటం ప్రారంభించింది. నదికి పోయి రావటానికి ఆమెకు చాలా సమయం పట్టసాగింది. గుర్రం డొక్కలు కత్తి అంచుల్లాగా మొనదేలాయి. దాని మెడ యెంతగా సన్నబడి పోయిందంటే, అది తల భారాన్ని మోయలేని విధంగా తయారైంది. ఒక్కో సారి దాని ఎముకలు చేసే చప్పుడు వినపడింది.

జనాలు ఆ వూరిని వదిలి వెళ్లటం ఆగలేదు. ప్రతి రోజూ ఒక గుడిసె ఖాళీ అవుతోంది. నేల బూడిద రంగుకు మారి, దాని మీద పగుళ్లు కనపడ సాగినై. ఒకటి రెండు ముళ్ల  జాతి మొక్కలు మాత్రమే పచ్చగా వున్నాయి. నదికి వెళ్లిన ప్రతిసారీ నీటి మట్టం అంతకు ముందు న్న దానికంటె తక్కువైపోసాగింది.  ఒక వారం తర్వాత, నీళ్లు ఎన్ని వున్నాయో అంతే బురద వుంది.  రెండు వారాల తర్వాత, నది అడుగు భాగం మెరిసే రాళ్లతో నిండిపోయి, పాత రోడ్డు లాగా తయారయింది. తినటానికి ఏదైనా దొరికించుకోవాలని గుర్రం ఎంతగానో నిరాశతో ప్రయత్నించింది. కాని లాభం లేకపోయింది. ముసిరే ఈగల్ని అది తన తోకతో పారద్రోలుతోంది.

రెమిజియా ఆశను పోగొట్టుకోలేదు. వర్షం వచ్చే సూచనల కోసం ఆమె ఆకాశాన్ని పరీక్షగా చూసింది. తన మోకాళ్ల మీద వంగి, “నరకం లోని ఆత్మలారా! మీరు సహాయం చేయకపోతే మేము మాడిపోతాము” అని వేడుకుంది.

కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయాన గుర్రం తన కాళ్ల మీద నిలబడలేక పోయింది. అదే రోజు మధ్యాహ్నం ఆమె మనవడు జ్వరంతో కాలిపోతూ మంచం పట్టాడు.  రెమిజియా ప్రతి గుడిసెకూ పోయింది. చాలా దూరంలో వున్న గుడిసెలకు కూడా వెళ్లింది. ఆ గుడిసెల వాసులతో  “మనం సెయింట్ ఇసిడోరోకు రుద్రాక్షల దండ చేయిద్దాం” అన్నది.

వాళ్లు ఒక ఆది వారం పొద్దున పెందరాళే బయలుదేరారు. ఆమె తన మనవణ్ని చేతుల్లో పెట్టుకుని నడుస్తోంది. జ్వరంతో బరువెక్కిన ఆ పిల్లవాని తల నాయనమ్మ బుజం మీద గుడ్డ పేలిక లాగా వాలిపోయింది. పదిహేను ఇరవై మంది పురుషులు, స్త్రీలు, ఎండకు నల్లబడిన శిథిల దేహాల పిల్లలు బంజరు నేలల మీది తోవల మీదుగా సాగిపోతూ శోకాలు పెడుతున్నారు.  వాళ్లు మేరీ కన్య బొమ్మను, వెలిగించిన కొవ్వొత్తుల్ని పట్టుకుని, నడుమ నడుమ ఆగి, మోకాళ్ల మీద వంగుతూ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. ఒక బక్కపలుచని వృద్ధుడు మండే కళ్లతో, నగ్నమైన ఛాతీతో, పొడవుగా పెరిగిన గడ్డంతో ఆ వూరేగింపు మొదట్లో నడుస్తున్నాడు. ఆకాశం వైపు చూస్తూ –

 

“సెయింట్ ఇసిడోరో, ఓ కర్షకుడా

సెయింట్ ఇసిడోరో, ఓ హాలికుడా

సూర్యుణ్ని కప్పేసి వర్షాన్ని తెప్పించు

సెయింట్ ఇసిడోరో, ఓ కృషీవలుడా” అంటూ వేడుకుంటున్నాడు.

అందరూ వెళ్లిపోయారు. రొసెండో వెళ్లిపోయాడు. బుద్ధిమాంద్యం వున్న తన కూతుర్ని తీసుకుని టోరిబియో వెళ్లిపోయాడు.  ఫెలిపె, ఇతరులు, ఇంకావేరే వాళ్లు, అందరూ వెళ్లిపోయారు. కొవ్వొత్తులు వెలిగించటానికి ఆమె వాళ్లందరికీ డబ్బు యిచ్చింది. ఆఖరున వెళ్లినవాళ్లు ఎవరో ఆమెకు తెలియదు. వాళ్లు ఒక రోగిష్టి అయిన వృద్ధుణ్ని తీసుకునిపోయారు.  దుఃఖభారంతో వాళ్లు కుంగిపోయారు. రెమిజియా వాళ్లకు డబ్బులిచ్చింది, కొవ్వొత్తులు వెలిగించటం కోసం. గుడిసె గుమ్మం నుండి దూరాన వున్న కొండల దాకా నేల మీద అంతా మాయమై, ఖాళీగా వుంది. ఎండిన నేల తప్ప ఏ చెట్టూ చేమా లేదు. నీళ్లు ఆవిరైపోయి, పైకి తేలిన నదుల అడుగు భాగాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక వర్షం పడుతుందనే ఆశ అందరిలో అడుగంటిపోయింది. ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లే ముందు వృద్ధులు “దేవుడు యీ ప్రాంతాన్ని శిక్షిస్తున్నాడు” అనుకున్నారు. యువకులు, పిల్లలు

అక్కడేదో దుష్ట శక్తి తన పాడు దృష్టితో కీడు కలిగిస్తున్నదని అనుకున్నారు.

రెమిజియా ఆశను వదులుకోలేదు. ఆమె కొన్ని నీటి చుక్కల్ని సేకరించింది. మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాలని అనుకున్నదామె. ఎందుకంటే సొరకాయ బుర్ర దాదాపు ఖాళీ అయింది. తన చిన్న తోట లోని భూమి రహదారిలా అయిపోయి, అంతటా ధూళి నిండింది.  ‘మానవుడి దుష్ట చేష్టల పట్ల దేవుడి శాపం ఇక్కడ ప్రభావాన్ని చూపిస్తోది’ అనుకుంది. కాని దేవుడి శాపం కూడా ఆమె నమ్మకాన్ని నిర్వీర్యం చేయలేకపోయింది.

నరకం లోని ఒక మూలలో నడుముల దాకా వున్న మంటల్లో కాలుతూ,  ఆత్మలు పరిశుద్ధమౌతున్నాయి. భూమ్మీద వర్షాన్ని కురిపించి, జలమయం చేసే శక్తి ఆ ఆత్మలకే వుండటం  విడ్డూరం, వ్యంగ్యభరితం. గడ్డం వున్న ఒక వికృతమైన ముదుసలి స్త్రీ ఇలా అన్నది  “కారంబా!  పాసో హోండో అనే వూళ్ళో ముసలి రెమెజియా కొవ్వొత్తుల కోసం రెండు డాలర్లను వెచ్చించింది.   కాబట్టి అక్కడ వర్షం కురవాలి.”

ఆమె సహచరులు అప్రతిభులయ్యారు.

“రెండు డాలర్లా?  అయ్య బాబోయ్!”

మరొక ఆత్మ అన్నది ఇలా “ఆమెకు యింకా ఎందుకు సహాయం అందలేదు? మనుషులతో మనం వ్యవహరించేది ఇలాగేనా?”

“ఆమె కోరికను మనం మన్నించాలి” అని గర్జించింది మరొక ఆత్మ.

“పాసో హోండోకు రెండు డాలర్లంత వర్షం కురిపించాలి”

“అవును రెండు డాలర్లంత వర్షం, పాసో హోండోకు”

“పాసో హోండోకు వర్షం, రెండు డాలర్లంతది”

ఆ ఆత్మలన్నీ చాలా సంతోషించాయి. ఎంతో సంతుష్టి చెందాయి. ఎందుకంటే వర్షం కోసం అంత పెద్ద మొత్తాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎవ్వరూ చెల్లించలేదు. అందులో సగం కోసం కూడా, మూడో వంతు కోసం కూడా ఎవ్వరూ ఆర్డరివ్వలేదు. రెండు సెంట్ల కొవ్వొత్తులకు ఇంతకు ముందొక సారి ఆ ఆత్మలు ఒక రాత్రంతా వర్షం కురిపించాయి. మరొకసారి ఇరవై సెంట్ల కొవ్వొత్తులకు ఒక చిన్న వరదనే ప్రసాదించాయి.

“రెండు డాలర్లంత వర్షం, పాసో హోండోకు” అని ఆ ఆత్మలన్నీ ఏక కంఠంతో గర్జించాయి.

అంత డబ్బు వెచ్చించి కొవ్వొత్తులు వెలిగించినందుకు ఎంత పుష్కలమైన వర్షాన్ని కురిపించాలో తలుచుకునే సరికి నరకం లోని ఆ ఆత్మలన్నీ అదిరి పడ్డాయి. దేవుడు తమను తన దగ్గరికి పిలిపించుకునే దాకా, ఇలా మంటల్లో కాలుతున్నంత కాలం వర్షాన్ని కురిపిస్తూనే వుండాలి కదా అని నివ్వెరపోయాయి ఆ ఆత్మలు.

పాసోహోండోలో ఒక ఉదయాన ఆకాశం నిండా మబ్బులు కమ్మినయ్. రెమిజియా తూర్పుదిక్కున వున్న ఆకాశాన్ని చూసింది. ఆమెకు ఒక పలుచనైన నల్లని మేఘం కనిపించింది. అది శోకించే వాళ్లు ధరించే నల్ల పట్టీ లాగా, సన్నని తోలు దారం లాగా పలుచగా వుంది. ఒక గంట తర్వాత పెద్ద పెద్ద మేఘాల గుంపులు జమ కూడి, ఒకదాన్నొకటి తోసుకుంటూ వేగంగా కదల సాగినయ్. రెండు గంటల తర్వాత చిక్కని చీకటి ఏర్పడి, రాత్రి అయిందా అనిపించింది.

తనకు కలుగుతున్న సంతోషం సున్నా అవుతుందేమోనన్న భయం కమ్ముకోగా రెమిజియా ఏమీ మాట్లాడకుండా కేవలం చూస్తూ ఉండిపోయింది. ఆమె మనవడు ఇంకా జ్వరంతో మంచం మీద పడి వున్నాడు. వాడు ఎముకల గూడులా  చాలా బక్కగా వున్నాడు.  వాడి కళ్లు రెండు గుహల్లోపల నుండి బయటకు చూస్తున్నట్టు వున్నాయి.

పెద్ద ఉరుము ఉరిమింది. రెమిజియా గుమ్మం దగ్గరకు పరుగెత్తింది. దౌడు తీస్తున్న రేసు గుర్రంలా ఒక వర్షపు జల్లు కొండ వైపు నుండి గుడిసె దిశగా వస్తోంది. ఆమె తనకు తానే నవ్వుకుని, చేతులతో చెంపలను గట్టిగా పట్టుకుని, కళ్లను విశాలం చేసింది. చాలా కాలం తర్వాత మళ్లీ వర్షం పడుతోంది.

వేగంగా కదులుతూ టపటపమనే చినుకులతో పాట పడుతున్నట్టుగా వర్షం రోడ్డును చేరి, గుడిసె పైకప్పు మీద చప్పుడు చేస్తూ గుడిసెను దాటేసి, పొలాల మీద కురవటం ప్రారంభించింది. రెమిజియా వెనక గుమ్మం వైపు పరుగెత్తి , చిన్న వరద లాంటి నీరు పారుతూ వస్తుంటే నేల అణగిపోయి దట్టమైన ఆవిరులను చిమ్మటం గమనించింది. ఆమె విజయోత్సా  హంతో బయటికి పరుగెత్తింది.

“వర్షం వస్తుందని నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు” అంటూ బిగ్గరగా అరిచింది.

వర్షపు నీరు ఆమె తల మీద శబ్దంతో పడి, కణతల మీదుగా కిందికి జారుతూ  వెంట్రుకల్ని పూర్తిగా తడిపేసింది.

ఆకాశం వైపు చేతులు చాస్తూ  “వాన పడుతోంది… వర్షం కురుస్తోంది…     ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు” అంటూ కేరింతలు కొట్టింది.

ఆమె యింట్లోపలికి పరుగెత్తి మనవణ్ని చేతుల్లోకి తీసుకుని, గుండెలకు హత్తుకుని, వాడికి వర్షాన్ని చూపించింది.

“తాగరా, తాగు, నీళ్లు తాగు. చూడు. ఈ నీళ్లను చూడు. ఇవిగో నీళ్లు” అన్నది వేగిరిపాటు కలిసిన ఆనందంతో. మనవడిలో చల్లని నీటి శక్తిని నింపాలనుకున్నట్టు వాణ్ని వూపి  గుండెలకు హత్తుకుంది.

బయట తుఫాను చెలరేగుతుంటే గుడిసె లోపల రెమిజియా కలలోకి జారి పోయింది.  ఆమె యిలా అనుకుంది. సాగు కోసం నేల తయారవగానే బంగాళా దుంపలు, వరి,  చిక్కుడు, మొక్కజొన్న నాటుతాను. విత్తనం కొనటానికి నా దగ్గర ఇంకా కొంత డబ్బు మిగిలింది.  పిల్లవాడు బాగవుతాడు. పాపం చాలా మంది వూరొదిలి వెళ్లిపోయారు. ఈ వర్షం గురించి విన్నప్పుడు టోరిబియో ముఖం యెలా వుంటుందో చూడాలనిపిస్తోంది నాకు. అందరం యెన్నో ప్రార్థనలు చేశాం కాని నేనొక్కదాన్నే లాభం పొందబోతున్నాను. వర్షం పడిందని తెలిస్తే వాళ్లంతా తిరిగి వస్తారనుకుంటాను.

ఆమె మనవడు నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాడు. పాసో హోండో లోని ఎండిపోయిన నదుల అడుగు భాగాల మీద మట్టి కలిసిన నీళ్లు ఉరకలెత్తినయ్. వర్షం ఇంకా బాగా పుంజుకో  లేదు గాని, బండరాళ్ల చుట్టూ తిరుగుతూ నీటి ప్రవాహాలు సుళ్లు తిరిగాయి. కొండ దిగువ భాగాన రేగడి మట్టి కలిసిన చిక్కని నీళ్లు ప్రవహించాయి. ఆకాశం నుండి వర్షం ధారాపాతంగా కురుస్తోంది.  వర్షపు చినుకుల బలమైన తాకిడి ధాటికి తాటాకుల గుడిసె పైకప్పు పగులుతోంది. రెమిజియా కళ్లు మూసుకుని కొన్ని దృశ్యాల్ని దర్శించింది. విరగ కాసిన తన పంట చేను చల్లని గాలి తరగల్లో కదలాడుతోంది. పచ్చని మొక్కజొన్న, వరి, చిక్కుళ్లు, ఉబ్బిన బంగాళా దుంపలు ఆమె కళ్ల ముందు నాట్యమాడాయి. చివరకు ఆమె గాఢనిద్ర లోకి జారిపోయింది.

బయట ఎడతెరిపి లేకుండా బీభత్సంగా వర్షం.

వారం రోజులు, పది రోజులు, పదిహేను రోజులు గడిచాయి. వర్షం ఒక గంట సేపు కూడా ఆగక ఇంకా కురుస్తూనే వుంది. బియ్యం, వెన్న, ఉప్పు అన్నీ నిండుకున్నాయి. ఆహార పదార్థాల్ని కొనటానికి రెమిజియా వర్షంలోనే నగరానికి బయలుదేరింది. పొద్దున్న బయలుదేరిన ఆమె తిరిగి మధ్యరాత్రి ఇల్లు చేరింది. నదులు, సెలయేళ్లు, నీరు నిండిన చిత్తడి నేలలు, రోడ్లను కప్పేస్తూ మెల్లగా పొలాల్లో నిండుతూ ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయా అనిపించింది.

ఒక మధ్యాహ్నం వేళ పెద్ద కంచర గాడిద మీద పోతున్న ఒకతణ్ని ఆపి  “స్వామీ,  ఆగండి” అన్నది.

అతడు గుమ్మం దాకా వచ్చాడు. కంచర గాడిద తలను లోపలికి దూర్చింది.

“కిందికి దిగి లోపలికి వస్తే కొంచెం వెచ్చగా వుంటుంది” అన్నదామె.

కంచర గాడిద బయటే వుండిపోయింది.

అతడు  “ఆకాశం నీళ్లుగా మారిపోయింది. నేను నీ పరిస్థితిలో వుంటే ఈ లోతట్టు ప్రదేశాన్ని వదిలి ఆ కొండమీదికి పోయే వాణ్ని” అన్నాడు.

“నేను యిక్కణ్నుంచి వెళ్లిపోవటమా? లేదు స్వామీ, ఈ వర్షం ఒకటి రెండు రోజుల్లో ఆగి పోతుంది” అన్నదామె.

“చూడమ్మా, ఇది వరద పరిస్థితి. నేను కొన్ని భయంకర దృశ్యాల్ని చూశాను. వరద నీరు జంతువుల్నీ, ఇళ్లనూ, చెట్లనూ, మనుషుల్నీ లాక్కుపోతోంది. నేను దాటివచ్చిన నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. పైగా నదుల జన్మస్థానాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది” అన్నాడతడు.

“స్వామీ, కరువు భయంకరంగా వుండింది. అందరూ పారిపోగా నేనొక్కదాన్నే తట్టుకుని ఇక్కడే వుండిపోయాను” అన్నది రెమిజియా.

“కరువు చంపకపోవచ్చు. కాని వరద ముంచేస్తుంది తల్లీ” అన్నాడు ఆ ఆసామి. మళ్లీ చేతితో వెనక్కి చూపుతూ “అక్కడంతా వరదతో నిండిపోయింది. పొద్దున్నుంచి మూడు గంటల పాటు  ప్రయాణం చేసి వచ్చాన్నేను. నా కంచర గాడిద పొట్ట వరకు నీళ్లు వచ్చాయి” అన్నాడు.

చీకటి పడుతుండటంతో అతడు వెళ్లిపోయాడు. ఆ రాత్రి వేళ వెళ్లొద్దని ఆమె బతిమాలింది.  కాని అతడు వినలేదు. “పరిస్థితి మరింత విషమించబోతుందమ్మా. నదులు గట్లను తెంపుకుని అంతా జలమయం అవుతుంది” అంటూ వెళ్లిపోయాడు ఆ వ్యక్తి.

రెమిజియా గుడిసె లోపలికి పోయింది. లోపల పిల్లవాడు జడుసుకుంటున్నాడు.

ఆ ఆసామి చెప్పిందే నిజమైంది. అబ్బ, అది ఎంత భయంకరమైన రాత్రి! మధ్యమధ్య ఉరుములు మెరుపులతో అత్యంత ఉధృతమైన కుంభవృష్టి ఎడతెరిపి లేకుండా కురిసింది.  మురికి నీళ్లు సుళ్లు తిరుగుతూ, గుమ్మం తలుపులోని సందులోంచి లోపలికి వచ్చి, నేల మీద నిండిపోయాయి. దూరాన గాలి ఈల వేస్తోంది. చెట్టు విగిన చప్పుడు ఫెళఫెళమని వినిపించింది.  రెమిజియా తలుపు తెరిచింది. దూరాన మెరిసిన మెరుపు పాసా హోండోను వెలుతురు మయం  చేసింది. కొండ వాలు మీంచి నీళ్లే నీళ్లు…. రహదారి నదిగా మారిపోయింది.

‘ఇది వరద కావచ్చునా’ రెమిజియాకు మొదటి సారిగా అనుమానం వచ్చింది.

కాని ఆమె గుమ్మం తలుపులు మూసి లోపలికి పోయింది. గడచిన కరువు తీవ్రత కన్న,  రాబోయే వర్షపు తీవ్రత కన్న, బలమైన ఆశాభావం కలిగింది ఆమెకు. గుడిసె బయట ఎంత తడిగా వుందో లోపల కూడా అంతే తడిగా వుంది. పైకప్పు లోంచి కారుతున్న నీటి ధారల్ని తప్పించుకోవ  టానికి ప్రయత్నిస్తూ పిల్లవాడు ముణగదీసికున్నాడు.

ఒక మధ్యరాత్రి వేళ గుడిసె పక్క గోడ నుంచి దభీమని చప్పుడు రావటంతో ఆమెకు మెలకువ వచ్చింది. మంచం లోంచి కిందికి దిగేసరికి తన మోకాళ్ల దాకా నీళ్లు వచ్చిన సంగతి తెలిసింది ఆమెకు.

అబ్బ , ఎంతటి కాళరాత్రి! నీళ్లు ప్రవాహరూపంలో లోపలికి దూసుకు వచ్చి, లోపల మొత్తం నిండిపోయాయి. మరో మెరుపు మెరిసింది. పెద్ద ఉరుముతో ఆకాశం వణికినట్ట నిపించింది.

“మేరీ కన్యకా, మేరీ కన్యకా, కరుణించు” అంటూ యేడ్చింది. కాని యీ పరిణామానికి కారణం మేరీ కన్యక కాదు, నరకం లోని ఆత్మలు. అవి “ఈ వర్షం సగం డాలరుకే సమానం, సగం డాలరుకే” అంటూ అరిచాయి.

ఎప్పుడైతే ఆ వరద నీరు గుడిసెను కదపటం మొదలెట్టిందో అప్పుడు రెమిజియా ఆశాభావాన్ని వదలి, తన మనవణ్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె వాడిని సాధ్యమైనంత గట్టిగా ఎదకు హత్తుకుని, నీళ్ల లోంచి అతి ప్రయత్నపూర్వకంగా నడిచింది. ఎలాగో ఆమె గుడిసె తలుపును తీసి బయటికి నడిచింది. నీళ్లు ఆమె నడుము దాకా వచ్చినయ్. ఆమె అతి కష్టంగా మెల్లమెల్లగా ముందుకు నడిచింది. తను ఎక్కడికి పోతోందో ఆమెకు తెలియదు. గాలికి ఆమె వెంట్రుకలు విడివడి పోయాయి. దూరాన ఒక మెరుపు మెరిసింది. నీటి మట్టం ఇంకా ఇంకా పెరుగుతోంది.  తన మనవణ్ని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆమె. తూలి పడబోయింది కాని ఎలాగో  నిలదొక్కుకుని  “మేరీ కన్యకా, మేరీ కన్యకా” అంటూ గట్టిగా యేడ్చింది.

ఉధృతంగా వీస్తున్న గాలి ఆమె కంఠస్వరాన్ని కబళించి, దాన్ని జలమయమైన ఆ ప్రదేశం మీద పరిచింది.

“మేరీ కన్యకా, మేరీ కన్యకా”

ఆమె గౌను నీళ్ల మీద తేలింది. ఆమె జారిపోతోంది. ఏదో వస్తువు తన వెంట్రుకలకు తట్టుకుని తలను ముందుకు పోకుండా ఆపినట్టనిపించింది ఆమెకు.

“ఇదంతా ముగిసింతర్వాత బంగాళా దుంపలు నాటుతాను” అనుకున్నదామె.

తన మొక్కజొన్న చేను మురికి నీళ్లలో మునిగిన దృశ్యం కనపడింది ఆమెకు. ఆమె తన వేళ్లను మనవడి ఛాతీ లోకి గుచ్చి పట్టింది.

“మేరీ కన్యకా, మేరీ కన్యకా”

గాలి ఊళ వేసింది. ఆకాశాన్ని పగలగొడుతున్నట్టు పెద్ద ఉరుము ఉరిమింది.

ఆమె వెంట్రుకలు ఒక ముళ్ల చెట్టుకు తట్టుకున్నాయి. గుడిసెల్నీ, చెట్లనూ లాక్కెళ్తూ వరద నీరు పొర్లింది. నరకం లోని ఆత్మలు “ఈ వర్షం సరిపోదు. రెండు డాలర్లంత వర్షం, రెండు డాలర్లంత వర్షం కురవాలి” అంటూ ఉధృతంగా గర్జించాయి.

– ఖ్వాన్ బాష్

                                                 (Juan Bosch)

                                                             అనువాదం: ఎలనాగ

(సెప్టెంబర్ 2వ తేదీ వెలువడనున్న  ‘ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు’ అనే నా అనువాద కథల సంపుటిలోంచి-)

 

***

elanaga invitation