బహుజన బంధమే “అలాయి బలాయి”!

ఖాజా

1

తన కవిత్వంతో తెలుగు సాహిత్యంలో బలమైన ముద్రవేసిన స్కైబాబ, కథకుడిగా అట్టడుగు వర్గాల జీవితాన్ని  శక్తివంతంగా వినిపిస్తున్నాడు.  ఇప్పటికే అధూరే పేరిట తన కథల సంపుటి ప్రచురించి కథా సాహిత్యంలో ముస్లిం జీవితాల వెతలను ఆవిష్కరించాడు. ఇప్పుడు అలాయి బలాయి పేరుతొ బహుజన కథలు ప్రచురిస్తున్నాడు. బీసీ, ఎస్ సీలను కలిపి చెప్పడానికి స్కైబాబ ‘బహుజనుల’నే మాటను ఉపయోగించాడు. అలాయి బలాయి అంటే హృదయానికి హృదయాన్ని చేర్చి హత్తుకొని అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసే ముస్లిం సాంప్రదాయం. స్కై బాబ ఈ కథా సంపుటి ద్వారా బహుజన సమాజాన్ని తన గుండెలకు హత్తుకుంటున్నాడు… ఇక్కడి గ్రామీణ సమాజంతో, బహుజన సమూహంతో, తనలాంటి ముస్లిములకు వున్న బలమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తున్నాడు.

భారతీయ గ్రామీణ సమాజాన్ని తరచి చూస్తె  ప్రతి గ్రామం భారత దేశపు మినియేచర్ లా కనిపిస్తుంది..  వూరి పాలనను, సంపదను అనుభవిస్తూ పెత్తనం చెలాయించే అగ్రకుల వర్గం ఒక పక్క, వూరి విసర్జితాలని నెత్తిమీద మోస్తూ, వూరికి వూడిగం చేస్తూ, నిచ్చెన మెట్ల వ్యవస్థకి మరింత కింద, వూరి జనానికి మరింత దూరంగా, అంటరానితనంలో, పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్న దళిత సమాజం ఊరికి దూరంగా మరొక పక్క! ఈ రెండిటి మధ్య అటు అగ్రకుల సమాజాన్ని అందుకోలేక, ఇటు తన కన్నా కింద వున్న దళిత సమాజాన్ని హత్తుకోలేక నడుమన ఊగిసలాడుతూ BC సమూహం. హిందూత్వం హీనంగా చూసి, ఎదగనీయకుండా తోక్కేసిన  దళిత, బిసి కులాల సమాహారమే బహుజన సమాజం.

ఇది మన గ్రామీణ సామాజిక చిత్రం. ఈ గ్రామీణ సామాజిక చిత్రం అస్తిత్వ సాహిత్యం కన్నా ముందు తరం  కథల్లో, కవిత్వంలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ప్రవాహం పైకి ఎంత తేటగా కనిపించినా దీని అంతర్లీన ప్రవాహం అత్యంత మురుగు. అది అప్పుడప్పుడూ పైకి తేలుతూ తన స్వభావాన్ని ప్రదర్శించి మళ్ళీ మరుగై పోతుంది. మురుగై పోయిన పైన ప్రవాహం మళ్ళీ కుదురుకొని తేటగా మారడానికి చాలా కాలం పడుతుంది.  అస్తిత్వ సాహిత్యం ఈ సమాజపు లోపలి పొరలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. గ్రామీణ సమాజపు లోపలి పొరల్లోని కుళ్ళిన ఈ భావజాల అవశేషాల్ని బహిరంగ పరచడం మనం ఇప్పుడు స్కైబాబ బహుజన కథల్లో చూడవచ్చు.

*

skyఈ సంపుటి లోని పదకొండు కథల్లో సోయి కథ ఒకటి.. గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే ఈ కథలో సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి పర్స్పెక్టివ్ నుంచి కథ నడుస్తుంది. శేకర్ రెడ్డి ని స్కై బాబ బహుజన గుంపులోనుంచి తప్పి పోయిన వాడిగా చూసాడు. నిజానికి ఈ దేశంలో రెడ్డి, చౌదరి వంటి కొన్ని శూద్ర కులాలు పాలక వర్గ స్థాయికి ఎదిగి నిజంగానే తమను తాము శూద్రత్వం నుంచి తప్పించేసుకున్నాయి. మంచిదే! ఆర్థికంగా, పాలన పరంగా  శాశించె స్థాయికి చేరుకున్నాయి. సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి భద్ర జీవితంలోకి వెళ్ళిపోయాడు. గ్రామీణ జీవితంలోని ఆర్ధిక, సామాజిక సంఘర్షణ నుండి కొంత మేరకు బయట పడ్డాడు.   ఈ కథలో యాదగిరి గ్రామీణ బహుజన సమాజానికి ప్రతినిధి. ఎదుగూ బొదుగూ లేని జీవితం. భద్రత, భరోసా లేని ఉపాధి తో కష్టంగా సాగే బతుకు. తాగుడు కారణంగా విచ్చిన్నమవుతున్న కుటుంబాలు. సాధారణ గ్రామీణ బహుజనుల జీవితం ఈ కథలో అంతర్లీనంగా ప్రతిబింబిస్తుంది.

ఐతే సాధారణ  సమాజం కన్నా భిన్నంగా  తర్వాత తరాల పట్ల ఒక బాధ్యత గా యాదగిరి కొడుకు చైతన్యవంతుల ప్రతినిధిగా నిలబడటం ద్వారా భవిష్యత్తులో అయినా బహుజన సమాజం చైతన్యవంతమై స్వయం గుర్తింపు సాధిస్తుందని ఆశను రచయిత ప్రకటించాడు.

‘జమ్మి’, ‘అంటు’ కథలు రెండూ కూడా మానవ సంబంధాలన్నీ కుల సంబంధాలే అని చెప్పిన కథలు. దళిత కులాల మధ్య వున్న అసంబద్ధ అనైక్యతను ‘జమ్మి’ కథ ప్రతిబింబించింది. ‘అంటు’ కథ ముస్లిం సమాజానికి దళిత సమాజానికి మధ్య వున్న ఘర్షణను ఎత్తి చూపింది. కుల నిర్మూలన జరగాలంటే  కులాంతర వివాహాలు జరగాలన్నది అంబేద్కర్ ఆలోచన. కానీ ఏ కులం అందుకు సిద్ధపడి లేదు. గ్రామీణ సమాజంలో వున్న పిలుపుల్లోని బంధం ఏ అవసరానికైనా ఉపయోగ పడవచ్చేమో గాని సామాజిక మార్పుకు, ఉపయోగపడవు.  మొత్తానికి  అన్ని బంధాల్లో కుల, మత  బంధాలే  అత్యంత  బలమైనవి అని చెప్పె కథలు ఇవి.

‘జవాబ్’, ‘అంటు’ కథలు ముస్లిం సమాజానికి బహుజన సమాజానికి వున్న  ఘర్షణను ప్రతిబింబించిన కథలు. జవాబ్ కథ గుజరాత్ లో ముస్లిముల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యం తో రాసిన కథ. ఇందులో సైదులు పాత్ర బీసీ పాత్ర. ఈ సైదులు చేసిన ఒక పనికి వూరు ఊరంతా కలిసి పంచాయితీ పెడుతుంది.   అప్పుడు సైదులు తన లోపలి దుఖాన్ని మనిషిగా తన ఘర్షణని వ్యక్తీకరిస్తాడు. కొందరు స్నేహితులతో   కలిసి గుజరాత్ వెళ్లి అక్కడ పరిస్థితులు చూసి వచ్చిన సైదులు పంచాయితీలో అక్కడి ముస్లిముల స్థితి గురించి  ఆవేదన చెందుతాడు

*

గ్రామీణ బహుజన సమాజంతో ముస్లిం సమాజానికున్న బంధాన్ని, ఇబ్బందినీ కూడా చెప్పిన ఈ కథలలో అంతర్లీనంగా వున్న ముస్లిం ఆవేదన బహుజన సమాజానికి అర్థం అవుతుందని నేను భావిస్తున్నాను. స్కై బాబ ప్రచురిస్తున్న ఈ 11 కథలు, బహుజన సమాజానికి మైనారిటీ సమాజానికీ మధ్య ఒక చర్చకు తావిచ్చే సందర్భానికి అవకాశం కల్పిస్తాయని అనుకుంటున్నాను. ఈ కథల్లోని అన్ని అంశాలు సుదీర్ఘ చర్చనీయాలే అయినా నేను కొన్ని కథల్ని మాత్రమె ఉదాహరించాను. ఈ ముందు మాటను స్కై బాబ కథల రివ్యూ లాగా కాక, ఈ కథల సందర్భం చుట్టూ వున్న సామాజిక చారిత్రిక తాత్విక పరిణామాల పరిశీలన కోసం కొన్ని అంశాలను ప్రస్తావనకు తెచ్చాను. ఇంకా ఈ కథల నేపథ్యంగానే చర్చించాల్సిన అంశాలు చాలా వున్నాయి. బహుశా ఈ పుస్తకం బయటికి వచ్చాక ఉద్యమ, పరిశోధక మిత్రులు ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి చర్చకు సందర్భాన్నిచ్చిన మిత్రుడు స్కైబాబ కు అభినందనలు.

*