ఇది మనిషి కాలం

కె.ఎన్.వి.ఎం.వర్మ

పువ్వులు వాడిపోవడం చూసాం
ఆకులు రాలిపోవడం తెలుసు
చెట్టే చచ్చిపోవడం వయసు మించిపోవడం.
ఒక సందర్భంలో
పూవులు ఆకులు సంగతేమో కానీ
అసలు చెట్టే బతికుందో లేదో
తెలవకపోవడం విషాదం.,
అవును దానికి విపత్తని పేరు
తుఫాను అనీ పిలుస్తారు
హుద్ హుద్ అని నామకరణం కూడా చేసారు.
పంచవర్ష ప్రణాలిక పేరు చెప్పో
హరిత విప్లవం మాటునో
దిగుమతి చేసుకొన్న ఎరువులు
పారిశ్రామిక అభివృద్ది
ప్రపంచీకరణ తెచ్చిపెట్టిన
లెడ్ నిండిన విషమో
అంతా తింటున్నదంతా
పురుగు మందుల ఆహారం
ఈ కాలానికీ
ఓ పేరు పెట్టాలి
కలియుగాన్ని మింగిన ఆకలికి
ఆకలి ఎత్తుతున్న పలు అవతారాలకి
ఇది మనిషియుగం అని సరిపెట్టుకోవాల్సిందేనా!
ఎంత తినాలో
ఏమి తాగాలో
ఎప్పుడు పనిచేయాలో
మరెప్పుడు పడుకోవాలో
ఎన్నడు చావాలో
తెలియని పుట్టుక రోజులివి
పకృతికి మనిషికి సంభందాలు తెగిపోయిన
వేరు కాపురాలివి
పకృతి వికృతి ఏకీకృతాలైన
వికటహట్టహాసాలివి
కొబ్బరిమొక్కకి క్రోటన్సుకి వ్యత్యాసం తెలియని
ఆది ప్రాసలివి
ఇది మనిషి కాలం.
ఇప్పుడు
మొక్క మోడుకావడం వికృతి కాదు
విపత్తులే నేటి ప్రాకృతం.
క.నా.వెం.మ.వర్మ