తత్వ దీపం వెలిగితేనే దారి తేటపడుతుంది: సుప్రసన్న

kovela1

వ్యక్తమయ్యే చైతన్యం ఎప్పుడూ అనంత రూపాలలో ఆవిష్కృతమవుతుంది. బీజం నాటినా వ్యక్తమయ్యే వృక్షం ఏ ఆకృతిలో పెరిగి వస్తుందో ఎవరూ చెప్పలేరు. మనిషి బ్రతుకూ అంతే.. నా బ్రతుకూ అంతే. ఎవరి బ్రతుకూ సరళరేఖాకారంగా ఉండదు. ఎన్నో మలుపులు మార్పులు తప్పనిసరి.
మాది వరంగల్ పట్టణం. నేను మార్చి 17, 1936లో పుట్టాను. నేను పుట్టిన నాటికి నిజాం రాష్ట్రంలో మేలుకొనబోతున్న స్వాతంత్య్ర సంగ్రామం, మేలుకొని తరంగాలు తరంగాలుగా రూపొందుతున్న తెలుగువారి సామాజిక సాహిత్య ఉద్యమాలు, తెలుగు భాషను, సారస్వతాన్ని  రక్షించుకోవాలన్న తీవ్ర సంకల్పం గాలిలో వ్యాపించి ఉన్న కాలం. బ్రిటిష్ ఇండియాలో దృఢమైన సంకల్పంలోకి సాగుతూ వున్న స్వాతంత్య్రోద్యమం. భారత దేశాన్ని ఆవరించిన గాంధీజీ వ్యక్తిత్వం, సాహిత్యరంగంలో విశ్వంలోనే తన ఉనికిని నిలబెట్టుకున్న రవీంద్రుని కవితా మూర్తిమత్త్వం జీవనాన్ని దాని చైతన్య మూలాలను స్పృశిస్తున్న భారతీయ తాత్త్విక మథనం జరుగుతున్న కాలం. ఇదీ వాతావరణం.
మా తాతగారు కోయిల్ కందాడై రంగాచార్యులు గారు. వారి పూర్వులు అదే జిల్లాలోని నెల్లికుదురు, మునిగలవీడు, చిట్యాల గ్రామాలలోని వారు. చివరకు వారు చిట్యాల(వరంగల్ జిల్లా తొర్రూరు దగ్గర) నుండి వరంగల్లుకు వచ్చి చేరుకున్నారు. వారి మేనమామ గారు వరంగల్లులో ఉండేవారు. వారి కుమార్తెను వివాహమాడి వారికి పురుషసంతతి లేకపోవటంతో తాతగారు వరంగల్లుకు వచ్చినారు.
మొదటి నుంచీ బీద కుటుంబమే. జీవిక కోసం కరణాల యిండ్లలో వంటలు చేస్తూ కడుపు నింపుకున్నారు. చదువుకోవాలని బలమైన కోరిక ఉండేది. అవకాశాలు లేవు. దొరికిన పుస్తకం చదువుతూ- స్వయం వ్యక్తులుగా రూపొందుతూ వచ్చారు. వరంగల్లుకు రాగానే ముదిగొండ మల్లికార్జున శాస్త్రి, అమరవాది నారాయణాచార్యుల వద్ద సంస్కృత సాహిత్యము, ఇతర ప్రాథమిక శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేసినారు. అయినా దానితో తృప్తి కల్గలేదు. విద్యాపిపాసతో విజయనగరం వెళ్లారు. 1905 ప్రాంతాలలో (20 ఏండ్ల వయసులో) అక్కడ సంస్కృత కళాశాలలో తాతా సుబ్బరాయ శాస్త్రి మొదలైన దిగ్ధంతుల వద్ద శాస్త్రాభ్యాసం చేసినారు. తునిలో రాజావారి ఆస్థాన విద్వాంసులు సద్విద్యాప్రకరణాది గ్రంథకర్తలు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల చిన రంగాచార్య స్వామి వారి వద్ద శ్రీభాష్యం పూర్తి చేసుకున్నారు.

ఇంచుమించు 1910 నాటికి ఎన్న దగిన ఉభయ వేదాంత విద్వాంసులయ్యారు. స్వయం కృషితో పురాణేతిహాసాలను, శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసినారు. క్రమంగా విశిష్టాదై్వతంలో ఇటు కాంచి నుంచి, అటు విజయనగరం దాకా మహా విద్వాంసులుగా పేరొంది అనేక బిరుదులు సన్మానాలు గ్రహించారు. మా ఇంట్లో సంస్కృత విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. వారికి భోజనాల వసతీ యిక్కడే.
మా తాతగారి సంతానం నలుగురు కుమారులు. పెద్దవారు వెంకట నరసింహాచార్యులు నా తండ్రి. మిగిలిన ముగ్గురిలో చివరి వారు సంపత్కుమారాచార్యులు గారు. నలుగురిలో ముగ్గురూ ఉభయ వేదాంతాలలో పండితులే. చివరి వారు మీ అందరూ ఎరిగిన ఛందోవ్యాకరణాలంకార శాస్త్రాలలో సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న సంపత్కుమార.
నేను పెరిగిన ఈ వాతావరణానికి కొంచెం వేరైనది మా అమ్మగారి పుట్టిల్లు. మా మాతామహులు ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు. వారిది వరంగల్లులోని గోవిందనగరం (ఎల్లంబజారు) శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాతల కుటుంబం. వారు తెలుగులో అనేక ప్రబంధాలు, క్షేత్ర మాహాత్మ్యాలు, చిత్రబంధ కవితలు, యక్షగానాలు, నాటకము, ప్రహరి వంటి రచనలు చేసినవారు. కవినాథ బిరుదాంకితులు. వారి యింట వాస్త జ్యోతిషాది శాస్త్రములు కూడా అధ్యయనంలో  ఉండేవి.
మా మాతామహులకు అయిదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుటుంబం. వచ్చిపొయ్యేవాళ్లు ఎట్లా గడిచేదో సంసారం. అందరిలో మా అమ్మ మూడవ సంతానం. మొదటి ఆడబిడ్డ. ఆడపిల్ల కావాలని మా అమ్మమ్మ కొడవటివంచ లోని లక్ష్మీనృసింహస్వామి సేవకు వెళ్లిందట. ఆ వూరి స్వామి ఆమె కలలో కనిపించి తన కోరిక తీర్చటానికి ఒక రూపాయి ఇమ్మన్నాడట. ఆమె పావులా ఇస్తానన్నదట. చివరకు ఏదోవిధంగా స్వామియే అంగీకరించాడు. అమ్మ పుట్టింది 1918లో. అమె పేరు లక్ష్మి. (ఈ విషయం  మాతామహులు రచించిన కొడవటివంచ క్షేత్ర మాహాత్మ్యంలో ఉన్నది.) తరువాత ఆమె పేరు లక్ష్మీ నరసమ్మ. నా వ్యక్తిత్వం మీద ఒత్తిడులు ఈ రెండు ఇండ్లలో నుంచి వచ్చినవే. శాస్త్రీయ సంప్రదాయ, విద్య ఒకవైపు, కవిత్వం పొంగే వాతావరణం మరొకవైపు. పాంచాలరాయ శతకంలో నేను వ్రాసిన పద్యం యిది.

ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాము
డటు చేసి వేసిన తాత ఆధ్యాత్మ విద్యానిధాను
డిటుల నా తలిదండ్రు లిర్వురీ చెట్ల మధుర ఫలములు
చిటిలిన మధువేనొ కానొ చేకొమ్ము పాంచాల రాయ

నా కోసమూ మా అమ్మ వ్రతాలూ ఉపవాసాలూ చేసిందిట. నేను వరమున పుట్టినాను. చిన్నతనంలో ఎన్నో బాలారిష్టాలు. అవన్నీ దాటుకుంటూ వచ్చాను. అమ్మ తన తమ్ముడి వివాహం నిమిత్తం వేల్పుగొండ (ఇప్పుడు జఫర్‌గఢ్)కు వెళ్లగా అక్కడ నేను పుట్టినాను. వేల్పుగొండ అతి పురాతన క్షేత్రం. అక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయం వ్యక్తమూర్తి. ఆయన నీడలో పుట్టడం వల్ల ఆయన నేత్రకాంతులు నా మీద ఆవేళ ప్రసరించాయేమో! అది పంచ నారసింహ క్షేత్రం. ఆ కొండమీద కోటగోడలున్నాయి. ఆదిరాజు వీరభద్రరావు గారు వేల్పుగొండ కాకతీయుల తొలి రాజధాని కావచ్చునన్నారు. ఆ కొండకు నైఋతి భాగంలో సుప్రసన్న నారసింహ క్షేత్రం ఉన్నది. అక్కడ పన్నిద్దరాళ్వారులూ ఒకే బండమీద ఉన్నారు. మా నాన్న యింట్లో, అమ్మ ఇంట్లోనూ పరంపరగా వస్తున్న ఇలవేలుపు వేల్పుగొండ స్వామియే. ఈ సుప్రసన్న నారసింహస్వామి పేరు నాకు పెట్టారు. నా జీవితాన్ని వేల్పుగొండ, కొడవటంచలలో నెలకొని ఉన్న నరసింహస్వామి మూర్తులూ, మాతామహులర్చించే సీతారామచంద్రస్వామి పరిపాలిస్తూ వచ్చారు.
ఇంట్లో సాయంకాలాలలో అరుగుల మీద పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, వామన చరిత్ర, రుక్మిణీ కళ్యాణం మొదలైన ఘట్టాలు చెప్పేవారు. ఆ మాధుర్యం హృదయంలోనికి అప్రయత్నంగా ప్రవేశించింది. సంస్కృత స్తోత్రాలు, ద్రావిడ వేదంలోని తిరుప్పల్లాండు మొదలైనవి సంత చెప్పేవారు. మా నాయనమ్మ వరదరాజుల పెండ్లి, సీతాకల్యాణం మొదలైన జానపద గీతాలు పాడేది. ఆ నాళ్లలో మా యింటి దగ్గర ఉండే బురుజు దగ్గర కూచిపూడి నాటక ప్రదర్శన చూచినాను. శ్రీవైష్ణవ సంప్రదాయ కుటుంబంలో ఆయా సందర్భంలో తిరునామాలు గానం చేసేవారు. ఆంధ్ర దేశంలో ద్రావిడ దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ విద్వాంసులు ఈ ప్రాంతం వస్తే మా యింట్లోనే దిగేవారు. వారి శాస్త్ర చర్చలూ, సాహిత్య చర్చలూ కొనసాగేవి. తాతగారు శ్రీమద్రామాయణము, భగవద్విషయమూ ఇతర సంప్రదాయ గ్రంథాల ప్రవచనాలు చేసేవారు. అప్రయత్నంగానో, సప్రయత్నంగానో చెవుల్లోకి వెళ్లేవి ఈ అంశాలన్నీ. శ్రుతమైనదంతా ఒక సంస్కారంగా, ఆత్మలో ముద్రించుకొని పోయింది.
నాకు మనస్సులోకెక్కిందంతా శ్రుతపాండిత్యమే. గురుకుల క్లిష్టత లేని నాకు అధ్యయనం అంతా స్మృతిలగ్నమైందే. నా చిన్నతనంలో మరొక ముఖ్య ప్రభావ కేంద్రం రెండిండ్లలో ఉన్న గ్రంథాలయమే. దాదాపు 500 సంస్కృత, ద్రావిడ గ్రంథాలు ఒక్కోచోట ఉండేవి. వాటిల్లో కొన్ని కొత్తవి. కొన్ని పాతవి. ఇండ్లలోకి శ్రీవైష్ణవ పత్రిక, రామానుజ పత్రిక, ప్రపన్న సుధ వంటివి వచ్చేవి. గోలకొండ కవుల సంచికలో మా మాతామహుల పద్యాలు (ఫోటోతో సహా) మా పెద్ద మేన మామల ఇద్దరి పద్యాలున్నాయి. వాటితో పాటు మా నాన్నగారి పద్యాలూ ఉన్నవి.
మా యింట్లో ఉన్న శ్రీవైష్ణవ సంప్రదాయం ఉదారమైంది. స్మార్త పండితులూ, ఆరాధ్య శైవులూ మా యింటికి వస్తూవుండేవారు. అందరికీ ఆదర సత్కారాలు ఉండేవి. తాతగారికి ఆ నాళ్లలో తెలంగాణంలోని జమీందారుల ఆశ్రయం ఉండేది. కల్లెడ, పర్వతగిరి, రంగాపురం మొదలైన చోట్లలో కొన్ని నెలల కొద్దీ ఉండి కాలక్షేపాలు కొనసాగించేవారు. వారిచ్చిన భూముల మీద కొంత ఆదాయమూ వస్తూ ఉండేది. కుటుంబ పోషణలకు సరిపోయేది.

kovela2
2.
రాజ్య వ్యవస్థ ప్రజల సంస్కృతికీ, భాషా సంప్రదాయాలకు, విద్యకు, జీవన పురోగమనానికి, విరుద్ధంగా ఉన్నప్పుడు సమాజం నూతనంగా సమాంతర వ్యవస్థను నెలకొల్పుకుంటుంది. నిజాం సంస్థానంలో సరిగ్గా అదే జరిగింది. తెలుగు భాష అణచివేతకు గురయింది. సంస్కృతి, సంప్రదాయాలకు ఆదరణం లేదు. అట్లాంటి స్థితిలో భాషా సాహిత్యాల రక్షణ కోసం గ్రంథాలయాలు, వీధి పాఠశాలలు వృద్ధి పొందాయి. మాదిరాజు రామకోటేశ్వరరావు ఆత్మకథలో వరంగల్లులో ఆనాళ్లలో ఉన్న వీధిబడులు సుమారు వందకు పైగా ఉన్నట్లు పట్టిక ఇచ్చారు. దేవోత్సవాలు, హరికథలు, బతుకమ్మ పండుగలు, పురాణ ప్రవచనాలు, గణేశోత్సవాలు, పంచాంగ శ్రవణాలు, ఆర్యసమాజ సనాతన ధర్మ సభలు ఇలా ఎన్నెన్నో సంస్కృతిని నిలువబెట్టే సంస్థలు ఏర్పడ్డాయి.
నేను తొలుదొల్త అలాంటి వీధి బళ్లలోనే చదివాను. ఒకటి మా యింటికి దగ్గరలో ఉన్న ‘పొట్టి పంతులు’ జగన్నాథం గారి బడి. రెండవది నాకు అక్షరాభ్యాసం చేసిన మోటుపల్లి కృష్ణమాచార్యుల గారి బడి. ఇది ఇంటికి అరకిలోమీటరు దూరం ఉండవచ్చు. ఆ తరువాత నియత విద్యాభ్యాసం విషయం ఇంట్లో చర్చకు వచ్చినట్లున్నది. ఇంట్లో మా ‘నాన్న’ల వలె ప్రాచ్య విద్యలోకి  చేరిపోవటమా లేక పాఠశాల విద్యలోకి వెళ్లటమా అన్న సందేహం. మా చిన్న మేనమామ రంగాచార్యులు అప్పటికే ఇంటర్ పూర్తి చేసి బిఏ కోసం హైదరాబాద్‌లో చేరినట్లున్నారు. అప్పటికే ఆయన వీలైనప్పుడు ట్యూషన్‌లు చెప్పుతూ కొంచెం కొంచెం తన చదువు కోసం సంపాదించుకునేవారు. అప్పుడు మా అమ్మ పట్టుబట్టి నన్ను స్కూలు చదువుల్లోకి చేర్చాలని కోరింది. మా తాతగారు అంగీకరించినారు. నాకు మే 10, 1943న ఎనిమిదవ ఏట ఉపనయనము జరిగింది. అప్పుడే మా తాతగారి అన్నగారి చేత పంచ సంస్కారాలూ జరిగాయి. ఒకసారి ఏదో ఉత్సాహంతో రామలింగేశ్వర దేవాలయంలో ఉన్న సంస్కృత పాఠశాలలో ‘రామ’ శబ్దమూ నేర్చుకున్నా. అయితే మళ్లీ వీధి బడిలోకి వెళ్లవలసి వచ్చింది.
ఆనాళ్లలో తెలుగులో విద్యాబోధన చేయటానికి ఒక పాఠశాల ఏర్పరచవలెనని జాతీయోద్యమ నేతలిక్కడ భావించారు. అప్పటికే ఎన్‌కే రావు ఈ ప్రయత్నంలో
రాష్ట్రంలో దేశీయ విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. చందాకాంతయ్య అనే వర్తకుడు తెలుగు పాఠశాల నెలకొల్పటం కోసం లక్ష రూపాయలు దానం చేస్తానని ప్రకటించినాడు. ఆంధ్ర విద్యాభివర్ధినీ పాఠశాల ప్రారంభం అయింది. దానికి కాంగ్రెస్ నాయకులు ఎం.ఎస్ రాజలింగం కార్యదర్శి. భండారు చంద్రమౌళీశ్వరరావు, అడవాల సత్యనారాయణ, పాములపర్తి సదాశివరావు మొదలైన వాళ్లు దానిలో అధ్యాపకులు. (జీతాలు కూడా ఉన్నవో లేవో సరిగా తెలియదు) ఈ పాఠశాల మా అమ్మమ్మగారి యింటికి వెనుక వీధిలో అప్పుడు ఉండేది. మిక్కిలి దగ్గర కావటంతో మా అమ్మ నన్ను ఆ పాఠశాలలో చేర్పించటానికి అనువుగా, చదువు
నిమిత్తం అమ్మమ్మ యింట్లోనే ఉంచింది. నేను 1945-46లలో నాటి మూడవ తరగతిలో చేరినాను. మా మేనమామ రంగాచార్యులే తొలుతగా ఏ,బీ,సీ,డీలు నేర్పించారు.  ఆ పాఠశాల నేను నాల్గో తరగతిలో ఉన్నప్పుడు మట్టెవాడలో నేరెళ్ల వాళ్ల స్థలంలోకి మారిందని గుర్తు.
ఆ పాఠశాలలో తొలి నుంచీ ఒక సాంస్కృతిక పునరుజ్జీవన చైతన్యం ప్రస్ఫుటంగా ప్రకాశించేది. నిజాం రాజు చందాకాంతయ్యకు ఒక బిరుదం యిచ్చి సత్కరించినాడు.
చందాకాంతయ్య నిరంతర దానశీలి. యజ్ఞములు చేసేవాడు. వేదాంతి. యాత్రాచణశీలి. ఎప్పుడో అనుకోకుండా బుట్టనిండా మిఠాయి పెట్టుకుని బడికి వచ్చి పిల్లలందరికీ ఆ పిఠాయి పంచి తాను ఆనందించేవాడు. ఆజీవమూ ఆ పాఠశాల సమితిలో సభ్యుడే కాని, కార్యదర్శి కాలేదు. అధ్యక్షుడు కాలేదు. స్కూలుకు తన పేరు
పెట్టనీయలేదు. అప్పటికే పాఠశాలలో ఏకనాథ గ్రంథాలయము అని ప్రత్యేక గ్రంథాలయము ఉండేది. జాతీయోద్యమంలో భాగంగా జాతీయ విద్యార్థి సంఘం అనే సంస్ఖ యువకులకు ప్రేరణ యిచ్చేదిగా పని చేస్తూ వుండేది. వ్యాస రచన, వకృ్తత్వ పోటీలు నిర్వహించేది. ఆ సంఘానికి మా మేన మామ రంగాచార్యులు, మా పినతల్లి భర్త
ఎంఎన్ రంగాచార్యులు క్రియాశీల కార్యకర్తలు. గోసేవా సమితి కార్యక్రమాలుండేవి. ముఖ్యంగా ఈ అశాంతభావంలోనే సంఘ సంస్కారం, ప్రజలకు సంస్కృతి పట్ల ఆలోచింపజేసేవి. ఆర్యసమాజం, సనాతన ధర్మసభల సమావేశాలు నిరంతరంగా జరిగేవి. ఆర్య సమాజం సంస్కరణవాది. విగ్రహారాధనకు, శ్రాద్ధాది కర్మలకు, అవతార వాదానికి వ్యతిరేకం. సనాతన ధర్మ సంస్థలు వీటిని సమర్థించేవి.

Image (7)
ఎంఎస్ రాజలింగం వార్ధాలో గాంధీగారి వద్ద శిక్షితులై వచ్చి వరంగల్లులో సుభాను చేతి పరిశ్రమశాల నెలకొల్పినాడు. నవారు నేత, గ్లోకోజు తయారు చేయటం
వంటివి వారు చేస్తుండగా నేను చూచినాను. ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలు తొమ్మిది రోజుల్లో వైభవంగా జరిగేవి. ఉపన్యాసాలు, సంగీత కచ్చేరీలు, సాహిత్య స్పర్థలు, అవధానాలు, కవిసమ్మేళనాలు కొనసాగేవి. ఆంధ్రపత్రిక రోజూ మధ్యాహ్నానికి ఊళ్లోకి వచ్చేది. వరంగల్ చౌరస్తాలో వేముల వారి యింటి ముందు గద్దెపై కూర్చొని పత్రికలో వార్తలు అన్నీ చదివేవారు. అనేకమంది శ్రోతలు శ్రద్ధగా అదంతా వినేవారు. అదీ జాతీయ నిష్ఠయే. ఈ వాతావరణంలో నా మనస్సులో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని గొప్ప భావాలకు ప్రతీకలైన ఆచారాలను ప్రతీకలుగానే కాక అనివార్యంగా ఆచరించవలననే భావం క్రమక్రమంగా సడలిపోవటం ప్రారంభం అయింది. వాటి మీద విరోధము లేదు. భిన్న భిన్న ఉపాసనామార్గాలు, సంప్రదాయాలు మానవుని చిత్తశాంతి కోసం ఏర్పడ్డవి. ప్రాతిభాసికంగా కనిపించే భేదాలు అన్నీ తాత్కాలికంగా రూపొందినవే. వాటికి సార్వజనీనత సార్వకాలీనత లేదు. వేషభాషలు, ఆచారాల వ్యవహారాల పట్ల పట్టుదలలు, విభేదాలు, పరస్పర అనిష్టాలు ఇవన్నీ వ్యర్థములనే నిశ్చయం ఏర్పడుతూ వచ్చింది.
భారత దేశానికి స్వాతంత్య్రం రావటం, పాకిస్తాన్ ఏర్పడటం ఆనాటి ఉద్విగ్న క్షణాలు అనుభవంలోకి వచ్చేవి. ఒకనాడు స్కూలు నుంచి తిరిగి వస్తున్నప్పటికి
ఒక గుర్రం కడుపులో ఎవరో బాకు గ్రుచ్చారు. ప్రాణావసాన స్థితిలో ఉన్నది. అమ్మమ్మ యింటికి చేరేప్పటికి ఎవరో దుండగులు నారాయణరెడ్డి అనే డాక్టరును,
మొగిలయ్య అనే జాతీయ పతాకనెగురవేసిన యోధుని చంపినట్లు, వారు రజాకార్లనీ తెలియ వచ్చింది. స్వతంత్ర  భారత దేశంలో విలీనం కాకుండా తాను స్వతంత్ర రాజుగా ఉండాలని కోరుకోవటం, ప్రతి ముస్లిం  రాజే అన్న ఒక సూత్రాన్ని ముస్లిం సంస్థలు ప్రచారంలోకి తేవటం కారణంగా నిజాంను నిలబెట్టేందుకు రజాకార్లనే ప్రత్యేక
సేన ఏర్పడింది. ప్రజలకొక ప్రాణరక్షణ లేకుండా పోయింది. అప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణా సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. రెండు
విభిన్న శక్తుల సంఘర్షణలో ఎన్నో ప్రాణాలు, మానాలు, ఆస్తులు గాలిలో కలిసిపోయినాయి.
మా కుటుంబం వరంగల్లులో రక్షణ లేదని భావించి కల్లెడ దొరవారైన ఎఱ్ఱబల్లి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు కల్లెడకు చేరుకుంది. అక్కడ మొత్తం కుటుంబమూ
ఉన్నది. తాతగారు ఉదయం భగవద్విషయాన్ని, సాయంకాలం శ్రీమద్రామాయణాన్ని కాలక్షేపం చెప్పేవారు. నేను దాదాపుగా రెండు సమయాలకూ వెళ్లేవాడిని. అనేక
వేదోపనిషత్ ఇతిహాస పురాణాంశాలు ఆ కాలక్షేపాలలో ప్రసక్తములయ్యేవి. వాటి అర్థము, సమన్వయము అద్భుతంగా ఉండేది. సర్వ సమర్పణ, శరణాగతి, మానవుని ఆర్ద్ర సంబంధాలు ఈ కాలక్షేప సమయంలో మరొక అద్భుత లోకమన్నట్లుగా సాక్షాత్కరించేవి. నా జీవనంలో ఎంతో విద్యను సేకరించుకున్న సమయం అది. సామాన్యులు వర్ణభేదాలకు అతీతంగా భగవంతునికి చేరువకావటం వింటూంటే, వారందరూ నా చుట్టూ తిరుగుతున్నారన్న స్ఫురణ కలిగేది.
నాన్నగారికీ, పినతండ్రులిద్దరకూ ఉదయం గడిలో కాలక్షేపం కంటే ముందే ఇంట్లో ద్రావిడ వేదాంత రహస్య గ్రంథాలను తాతగారు అధ్యాపన చేసేవారు. గడిలో
కాలక్షేపంలో వీరిలో ఎవరో ఒకరు పాఠ్యం చదివేవారు. తాతగారు విశదంగా విపులంగా వ్యాఖ్యానించేవారు. ఇంట్లో నేనూ, మా చిన్నాయన సంపత్కుమారలకు
వేరే చెప్పుకోదగిన పనులు లేవు. ఈ సందర్భంలో ఒక అద్భుత సన్నివేశం జరిగింది. అది మేమిద్దరం కలిసి కవిత్వాభ్యాసం చేయటం. మేముంటున్న యింటికి ఇంచుమించు ఎదురుగా శ్రీనివాసమూర్తి ఇల్లు ఉండేది. వారి చెల్లెలు భర్త ప్రతాపపురం రాఘవాచార్యులు మా వలెనే వరంగల్లు నించి భద్రత కోసం అత్తవారి ఇంటికి వచ్చినారు. వారు చిక్కగా పద్యాలు రాసేవారు. అప్పటికి బీజభూతంగా ఉన్న పద్యం మాలో చివురించి పుష్పించటం అక్కడే ఆరంభం అయింది. వారి దగ్గరనే తిరుపతి వేంకట కవుల పేరు విన్నాము. ఆ ఆరునెలల కాలంలో ఎన్ని పద్యాలు వ్రాసినామో తెలియదు. కానీ, పద్య ధోరణి అలవాటయింది. సాధన జరిగింది. నాకు ఛందో లక్షణం తెలిసేది కాదు. అయినా పద్యం నిర్మించే సందర్భంలో ఇక్కడ లఘువు, ఇక్కడ గురువు ఉండాలని నాకు అనిపించేది. దానికి కారణం అంతకు ముందే మౌఖికంగా నేర్చుకున్న భాగవత పద్యాల మూసలు కావచ్చు.
కల్లెడలో మా చిన్నాయనగారితో నాకు ఏర్పడ్డ గాఢానుబంధం ఆయన జీవితాంతం దాకా అంతే సజీవంగా కొనసాగింది. ఆయన మిత్రుడు, గురువు. నాయెడ వాత్సల్యం గలవాడు. కల్లెడ దొరలు ప్రజల విషయంలో ఎలా ఉండేవారో తెలియదు కానీ, సంప్రదాయాన్ని పోషించేవారు. శ్రీరంగంలో ఒక సత్రం నిర్మించారు. కందాడై శేషాచార్యులు, ప్రతివాది భయంకర అణ్ణంగణాచార్యుల వారి గ్రంథ ముద్రణకు ఆర్థిక సహాయం చేసేవారు. ఈ కాలంలోనే సాయుధ కమ్యూనిస్టులు రాత్రులలో పాటలు పాడుకుంటూ వచ్చేవారు. జనం కొందరు చాటుగా పరుగెత్తి దాక్కునేవారు. ఆర్నెల్లకు ఆ ఊరు విడిచి బెజవాడ చేరుకున్నాము మొత్తం కుటుంబం. అయితే గడవటం కష్టమని కొందరు రాజమండ్రికి, కొందరు రేపల్లెకు వెళ్లినారు. తాతగారు బెజవాడలో ఉన్న శిష్యుల ప్రోత్సాహంతో గ్రంథ ప్రవచనాలు చేస్తూ సంసారం నిర్వహించేవారు. ఆ రోజుల్లో మేం కొంతకాలం అద్దెకున్న యిండ్లలో ఒకటి గూడవల్లి రామబ్రహ్మం గారి యిల్లు. పారుపల్లి వారి వీధిలో ఉండేదనుకుంటా.
బెజవాడలో ఉన్న రోజులు నేను కొంతకాలం అక్కడ మునిసిపల్ స్కూలులో చేరి చదువుకున్నా. తాతగారి వెంట కాలక్షేపాలకు వెళ్లటం ఉండనే ఉన్నది.

సంపత్కుమార గారు రేపల్లెలో ఉన్నారు. కల్లెడ తరువాత మేమిద్దరం మళ్లీ ఒక కప్పు కింద ఉన్న రోజులు దాదాపుగా లేవేమో. అక్కడ ఉన్ననాళ్లలోనే నా మీద
గాంధీ ప్రభావం ఎక్కువయింది. ఆయన హత్య జరిగిన రోజులవి. బెజవాడలో ఏడెనిమిది నెలలున్నాము. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌పై పోలీస్ యాక్షన్ జరిగిన
తరువాత నెమ్మదిగా దీపావళి వరకు యింటికి చేరుకున్నాము. బెజవాడలో ఉన్న రోజుల్లోనే ఎక్కడో వ్రాతప్రతిగా లభించిన వేదాంత కవి పద్యాలు చదువుకున్నాను. ఆ పద్యాలు మొన్న మొన్నటి దాకా గుర్తుండేది. అక్కడి నుంచి వెలువడే ‘విజయవాణి’(మల్లెల శ్రీరామ మూర్తి సంపాదకులు)లో మా పెద్ద మేనమామ
వార ఫలితాలు వ్రాస్తుండేవారు. నిజాం ప్రాంతం నుంచి వచ్చిన కాందిశీకులను బెజవాడ ప్రజలు ఆదరించలేదు. అద్దెలు విపరీతంగా పెంచారు. భాషను వెక్కిరించారు. ఒక తీవ్రమైన అనిష్టం యిక్కడి ప్రజలలో అందువల్ల నెలకొన్నది. తరువాత వచ్చిన నాన్‌ముల్కీ, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాల వెనుక ఈ అసంతుష్ఠి ఉన్నది.
3
ఒక మత సంబంధంమైన తాత్త్వికానుబంధం గల వాతావరణంలో నేను పెరిగిన సంగతి తెలుసుకోవలసి ఉంటుంది. అయితే ఆర్యసమాజం మొదలైన ఉద్యమాల బలం వలన బాహ్యాచారాల ఆడంబరాల పట్ల విశ్వాసం సడలిన విషయం చెప్పుకున్నాను. అసలు భక్తి ఉద్యమం ఈ లోకం నుంచి పారిపోవటం నేర్పదు. ఈ జగత్తు నిండా ఈశ్వరుని సాక్షాత్కరించుకుంటుంది. ‘సర్వభూతేషుచాత్మానం సర్వభూతానిచాత్మని, ఈక్షతే యోగ యుక్తాత్మా, సర్వత్ర సమదర్శనః ’ అన్న గీతావాక్యం భౌమ జీవన దివ్యీకరణ భావాన్ని వ్యక్తం చేస్తుంది. సగుణోపాసనకు ఆధారం ఇదే. శ్రీవైష్ణవం పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతారాలుగా భగవంతుని దర్శించినా, మనకు అంత్యంత సన్నిహితమైంది అర్చావతారమే అన్న అంశం శ్రీవచన భూషణాది సంప్రదాయ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. మరొక అంశం భక్తుని-భగవంతునిగానే చూడటం, అతని అర్చనాసేవ భగవదర్చనమే. మానవ సేవయే మాధవ సేవ అన్న ఆధునిక భావన దీనిలోనుంచి పుట్టిందే.
భక్తి ఉద్యమం ఈ లోకాన్ని ఈశ్వర స్థానంగా ఎన్ని దీన్ని అతని లీలా విభూతిగా భావించింది ‘నాహం వందే తవచరణే యోర్ద్వద్యమద్వంద్వహేతోః’ అన్న ముకుందమాల మోక్షం నాకు వద్దు. జన్మ జన్మలకూ నిన్ను భావిస్తూ, సేవిస్తూ ఉండటం కావాలి అంటున్నది. శ్రీ శఠగోపులు తమ తిరువాయ్ మొళి ప్రబంధంలో భక్తి ధర్మం వలన లోకం ఎలా పరివర్తన చెందిందో వివరించారు.
పుడమికిని కల్గు శాపమ్ము పొలిసె, యముడు
కార్య నిరృ్వత్తుడయ్యెను, కలి దొలంగె
నరకములు మారిపోయెను నరుల పాప
సంతతి నశించె, భక్తుల సముదయమ్ము
కడలి వన్నె గలుగు స్వామి గాధలెల్ల
పాడుచును నృత్యమాడుచు పరవశింప
కన్నులార గంటిమి-వృద్ధి కలుగుగాక
కలుగుగాకమేలు సమృద్ధి కలుగు గాక(5-2-1)
పాండురంగ మాహాత్మ్యంలో రామకృష్ణ కవి ‘నిత్యనైమిత్తికముల నిర్ణిద్రబుద్ధి నాచరించుచు, హరిభుక్తమాత్మ భార్య భక్తినిడ భుక్తి నిడుచున్కి ముక్తిగాని
నిదురవంటిది, రాతివంటిదియు గాదు’ గార్హస్థ్య జీవితం ఎంత శ్రేష్ఠమైందో- ‘నిదుర వంటిది రాతి వంటిదియు గాదు’ అనినాడు కేవల స్థితిని ముక్తి భావాన్ని కాదంటున్నాడు. ఆళ్వారులు కొంతమంది తాము ఈ జన్మలో తిరుమల కొండమీద రాయిగానో, మొక్కగానో పుట్టి ఉంటే ధన్యులమని భావించినారు. ఈ భావన వైకుంఠ, కైలాస, భూలోకాది పరలోక భావనలను కాదంటున్నది. ఆ భావనలు ఒక విధంగా చూస్తే లోకంలోని దివ్యజీవన భావనకు ప్రతిబింబాలు మాత్రమే. ఇదంతా ఎందుకు చెప్పటమంటే, అప్పటికి శ్రీఅరవిందుల తత్త్వం నన్ను ఆకర్షించటమే. ఈ భూమిక నా చేతనలో స్పష్టాస్పష్టంగా ఉండటం కారణం కావచ్చు.
ఎక్కడికో పారిపోవటం కాకుండా ఈ లోకాన్ని అవిద్యాపరిమితుల నుండి దూరం చేసి దివ్యచైతన్యాన్ని ఆవహింపచేయటం లక్ష్యంగా శ్రీఅరవిందుల తత్త్వం ఏర్పడింది.
అదై్వతుల జగన్మిథ్యాత్వభావన కానీ, కైవల్యరూప ముక్తి కానీ, బౌద్ధుల నిర్వాణం కానీ, నన్ను ప్రభావితం చేయలేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడూ
సత్యమేనని ఒకదానికొకటి శరీరం వంటిదని చెప్పిన విశిష్టాదై్వతం తాత్త్వికంగా ఈ భావనకు అతి సన్నిహితం. అంతా ఈశ్వరమయమే. ఈశావాస్యమిదగుమ్
సర్వం. అందువల్ల జగత్తును దివ్యపరిణామం వైపు ప్రయాణింపజేసేది సౌందర్యభావన, ప్రేమ భావన, శాంతి భావన, ఆనంద భావన.
1950 డిసెంబర్‌లో శ్రీఅరవిందులు శరీరం విడిచిపెట్టిన తరువాత ఆయన తత్త్వమును గురించి భారతిలో వచ్చిన వేలూరి వారి వ్యాసాలు నా సాహిత్య
తత్త్వదృష్టికి పునాదిని ఏర్పరిచినాయి. మానవుని సర్వజీవనానికి ఇహలోకము, భూమి ముఖ్యవేదిక. ఆసురీ తత్త్వాన్ని ఏరూపంగా ఉన్నా దాన్ని పరిహరించి దైవీ
గుణాలను పృథ్విమీద స్థాపించటమే వ్యష్టి ముక్తి కాక, సమష్టి ముక్తి అవుతున్నది. ఈ నిశ్చయానికి నేను వచ్చేసరికి నా వయస్సు ఇంచుమించు 16
సంవత్సరాలు.
అప్పటి నుంచి నా సాహిత్యం, కవిత్వం, విమర్శ, వ్యాఖ్యానం ఏదైనా ఈ భూమిక మీదనే నిలబడి ఉన్నాయి. నా తొలి రచన హృద్గీతలోని తొలి పద్యాలలో – ‘జడమై,
ప్రాణమవై, మనస్సువయి విజ్ఞానంబవై’ అని బ్రహ్మ పదార్థాన్ని వర్ణించటం జరిగింది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ భూమికల గురించి స్పష్టంగా చెప్పటమే. 1949-50లలో ఆంధ్రప్రాంతం నుంచి మా పాఠశాలకు తెలుగు మాధ్యమంలో పాఠం చెప్పటానికి అధ్యాపకులు ఒక సమూహంగా వచ్చినారు. వారికి నాయకులు ప్రధానోపాధ్యాయులుగా వచ్చిన యద్ధనపూడి కోదండరామశాస్త్రి. వారు దివ్యజ్ఞాన సమాజం వాతావరణంలో పెరిగి వచ్చినారు. మేడం బ్లావట్స్‌కీ, కల్నల్ ఆల్కాట్, అనిబిసెంట్, జిడ్డుకృష్ణమూర్తి ఈ పేర్లన్నీ అప్పుడు విన్నవే. ఈ తరంగం ముంపులో తాత్త్వికలోని విశ్వజనీనత అర్థమైంది. జాతీయ భావన కేంద్రంగా
విశ్వజనీనత చుట్టూ వలయంగా నా భావ పరిధి విస్తరించుకుంటూ పోయింది.

1986లో అడయార్‌లో జిడ్డుకృష్ణమూర్తి, చివరి ఉపన్యాసం (జనవరి, 4) విన్నాను.
వైకె శాస్త్రి వచ్చిన తరువాత పాఠశాలలో పరివర్తన వచ్చింది. పోతన జయంతి ఉత్సవాలు ప్రారంభం అయినాయి. నేను పదో తరగతిలో ఉండగా పోతన జయంతి ఉత్సవాలలో వక్తృత్వము, వ్యాసరచన, గ్రంథపఠన పోటీలలో మూడు ప్రథమ బహుమతులు నాకే వచ్చినాయి. ప్రథమ బహుమతి దేనికైనా పోతన భాగవతమే కానుక. నాకు ఆ సంవత్సరం పోతన భాగవతంతో పాటు కవిత్రయ భారతము బహుమతిగా ఇచ్చారు. ఇది నా జీవితంలో ఊరిలో పెద్దల ముందు కలిగిన తొలి పరిగణన. తొలి అవార్డు కూడా కావచ్చు.
నేరెళ్ల వేణుమాధవ్ నాకన్నా మూడేళ్లు స్కూల్లో సీనియర్. మా ప్రధానోపాధ్యాయులు భాగవతంలోని నృసింహావతార వర్ణన ఘట్టం అద్భుతంగా చదివేవారు. నన్ను ఒక విధంగా పోతన మోహం లోకి నెట్టి పడవేసినారు. ఆ గద్య పద్యాల చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్తు. ఇదీ అప్పటి మనః స్థితి.
4
కల్లెడలో ప్రారంభమైన పద్యరచనాభ్యాసం సాగుతున్నది మా యిద్దరకూ. సంపత్కుమార 1949లో చిట్టిగూడూరులో భాషాప్రవీణ కోర్సులో చేరినారు. అక్కడికి దగ్గరయిన బందరులోని ఉద్దీప్త సారస్వత సంభార సామగ్రి నెమ్మది నెమ్మదిగా ఆయన ద్వారా వరంగల్లుకు నా దగ్గరకు వస్తూ ఉన్నది. మా ఊళ్లోని శబ్దానుశాసన
ఆంధ్రగ్రంథాలయం పుస్తకాల ద్వారా పరోక్ష గురుస్థానం వహించింది.
హైదరాబాద్‌లో అప్పటికే తెలుగు బిఏ చేసిన మా చిన్న మేనమామ రంగాచార్యులు పారిజాతాపహరణం లోని పద్యాలను, రాయప్రోలు పద్యాలను, జాషువా, కరుణశ్రీల పద్యాలను పరిచయం చేసేవారు. ఒక్కోసారి ఆయన ‘విజయశ్రీ’ని కమ్మని గొంతుతో మాకు వినిపించేవారు. ఆయన ఇంట్లో మధ్యాహ్నం వేళ ఆయన తల్లికి, వదినలకు కాలక్షేపంగా వావిలకొలను సుబ్బారావు రామాయణానువాదం వినిపించేవారు. ఆ వరుసలో కొన్నిరోజులు వరుసగా ‘వేయిపడగలు’ కూడా చదివి వినిపించారు. నా జీవితంలో విశ్వనాథ ప్రవేశించింది అలాగే అనుకుంటా. బందరు నుంచి కదలి వచ్చే సాహిత్య సామగ్రిలో రాయప్రోలు, కృష్ణశాస్త్రి, అడవిబాపిరాజు, నాయని, వేదుల ఇలా కాల్పనిక కవులంతా కదలివచ్చేవారు. ‘వైతాళికులు’ చదవటం ఒక అచ్చెరువు గొలిపే అనుభవం.

నెమ్మది నెమ్మదిగా విశ్వనాథ సత్యనారాయణ సపరివారంగా కవితలతో, నవలలతో, నాటకాలతో, విమర్శతో, కల్పవృక్షంతో తరలి వచ్చారు. చిట్టిగూడూరులో సంపత్కుమార పద్యరచనాభ్యాసం పెరిగింది. ఇక్కడ నేనూ అభ్యసనం సాగిస్తున్నాను. 1951లో విశ్వనాథవారి సోదరులు వెంకటేశ్వరులు మా పాఠశాలలో తెలుగు అధ్యాపకులుగా వచ్చారు. ఆయన నా పద్యాలు చూసి తలవూపారు. అప్పుడే 1951 నుంచి అప్పుడప్పుడూ రాసుకున్న పద్యాలు యిద్దరం కలిసి ఒక శతకంగా తెద్దామని అనుకున్నాం. మకుటం ‘సర్వేశ్వరా!’ అని.. దాంట్లో ఇద్దరి పద్యాలు కలగలపుగా కూర్చినాము. ఆ రోజుల్లో వరంగల్లు నుంచి వివేకానంద అనే ఒక
ద్విభాషా పత్రిక వచ్చేది. దానిలో ఒక కమ్మ నిండా ఈ పద్యాలు అచ్చు వేసేవారు. నెలకు పన్నెండు పద్యాలు వచ్చేవి. ఆ ముద్రితమైన కాగితాలు సంపాదకులు కొమ్ము సుబ్బారావు 200 విడిగా అచ్చు వేసి యిచ్చేవారు.
పుస్తకంగా రూపొందటానికి ఆంధ్రప్రింటింగ్ ప్రెస్ వారు ఉచితంగా ముఖ పత్రము, పీఠిక ముద్రించి యిచ్చారు. 1954 మధ్యభాగానికి అలా ముద్రితమైంది మా తొలి
పుస్తకము. విశ్వనాథ వెంకటేశ్వర్లు దాన్ని పట్టుకువెళ్లి విశ్వనాథవారితో పీఠిక వ్రాయించి తెచ్చినారు. దానిని హృద్గీత అని పేరు పెట్టి మా తాతగారికి అంకితం చేశాము.
ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రస్తుత అధ్యక్షులు ఆచార్య సి.నారాయణరెడ్డి అప్పటి తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శి. మా రచనలను పత్రికలకు పంపి అచ్చయ్యేటట్టు చూసేవారు. తెలుగు స్వతంత్రలో అవి అచ్చయినప్పుడు మా పేర్ల చివరనున్న ఆచార్య శబ్దం తొలగించివేశారు. మేము సుప్రసన్న, సంపత్కుమారలము అయ్యాము. ఎంత అందమైన కత్తిరింపో అది. అప్పటి నుంచి నారాయణ రెడ్డి నాకు అన్నయ్యనే.
1954లో తెలుగు స్వతంత్రలో నా వచన పద్యాలు అచ్చయ్యాయి. గోలకొండ పత్రికలో ఉదాహరణాలను గురించిన నా వ్యాసం పెద్దది అచ్చయినది. మే 28 1954నాడు జరిగిన నా పెళ్లిలో సంపత్కుమార రవీంద్రుని ఊర్వశి కవితా సంపుటాన్ని (బెజవాడ గోపాలరెడ్డి అనువాదం) నాకు అత్యంత ప్రీతితో తనకన్నా ప్రతిభావంతుడననే
అతిశయోక్తితో బహూకరించారు. ఆ సందర్భంలో దాశరథి అభినందిస్తూ ఒక లేఖ వ్రాశారు.  తన పదకొండవ ఏట నా జీవితంలోకి నడచివచ్చిన నా మేనమామ కూతురు శారద. తన జీవితం చివరి క్షణం దాకా నాకు నెచ్చెలియే. ప్రియురాలే. నా కావ్యాలలో శేఫాలికకు నాయిక. కులపాలిక. నాకు సాధనలోనూ సహచరి. ఆత్మసఖి. నిడుదవోలు వారి ఉదాహరణ వాజ్మయ చరిత్ర చదివి నేను పోతన్నను గూర్చి రససిద్దోదాహరణము వ్రాసినాను. అది కరీంనగరం నుంచి వెలువడే సారస్వత
జ్యోతిలో అచ్చయినది. ఆ రోజుల్లోనే కొన్ని గేయాలూ అచ్చయినాయి. అంటే రూపనిష్ఠతో సంబంధం లేకుండా పద్యము, గేయము, వచనపద్యము మూడు నా రచనా
మార్గంలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి.
1953-54 నాటికి వరంగల్లులోని సామ్యవాద మిత్రులతో నా పరిచయం పెరిగింది. వారిలో అతి సన్నిహితులు పి.నరసింహ స్వామి. అతడు ఒక అడవిచెట్టు వంటివాడు. శ్రీశ్రీ, ఆరుద్ర, అనిశెట్టి వంటి వారి రచనలు వినిపించేవారు. సమ్మోహముద్ర వేసేవారు. ఆయనకు ప్రేరకులు పాములపర్తి సదాశివరావు. పివి నరసింహారావు ఈయనా  కలిసి కాకతీయ పత్రిక నడిపేవారు. కాకతీయ కళాసమితి పేర ప్రతి సంవత్సరమూ సంగీత సాహిత్య సభలు నిర్వహించేవారు. ఒక కవిసమ్మేళనములో నేను సున్నా అని చివర వచ్చే ఒక గేయాన్ని చదువగా సభంతా కరతాళ ధ్వనులు చేసింది. పివి, సదాశివరావులకు కాళోజీకి గార్లపాటి రాఘవరెడ్డి గురువు. రాఘవరెడ్డి ఏ పూర్వయుగాల నుంచి ఋష్యాశ్రమాల నుంచి కదలివచ్చిన యోగివలే ఉండేవారు. స్వామి దగ్గర నుంచి రాఘవరెడ్డి వరకు వచ్చేసరికి సంవాద దశ నుండి సంభావన దశదాకా వచ్చినట్టుంది. నా రచనలలో అవికలితంగా కలిసిపోయిన సామ్యవాద ధోరణికి ఈ సాంగత్యం కారణం అనుకోవాలె. 1953-55లలో వరంగల్లు కాలేజీలో ఇంటర్‌మీడియట్ చదివినాను. అక్కడ చలమచెర్ల రంగాచార్యులు, ప్రత్యేక తెలుగువారికి పాఠం చెప్పేవారు. ఆయన మాకు గబ్బిలం పాఠం చెప్పినారు. ఆయన పాఠం వింటే ఆ పద్యాలన్నీ ఒకపాటి సారస్వత ప్రియునికి కంఠస్థం కావలసిందే.
సాహితీబంధుబృందం అనే సంస్థను నేను, నా సహపాఠి పేర్వారం జగన్నాథం మిగిలిన మరికొందరు మిత్రులం 1955 ఫిబ్రవరిలో స్థాపించినాము. దానికి విశ్వనాథ
సత్యనారాయణ ప్రారంభకులుగా వచ్చినారు. నేను ఆ సంస్థకు స్థాపక అధ్యక్షుడిని. కాళోజీ, హయగ్రీవాచారి వేదికమీద ఉన్నారు. పివి సభలో కూర్చున్నారు. ఆ సందర్భంలోనే పివి, విశ్వనాథ వారిని కలిసి వేయిపడగల హిందీ అనువాదానికి అనుమతిని కోరినారు. తెలంగాణా రచయితల సంఘం 1955 మొదట్లో ఒక కవిత్వపు పోటీ పెట్టింది. దానికి నేను ఎవరెస్టు అనే గేయం పంపించినాను. ఆ పోటీలో తెన్నేటి పూర్ణచంద్రరావు రాసిన దయ్యాల మఱ్ఱిచెట్టు అన్న వచన పద్యానికి మొదటి బహుమతి, నా గేయానికి రెండో బహుమతి వచ్చింది. బహుమతులు 50, 30, 20 రూపాయలు. మూడో బహుమతి ఎవరికి వచ్చిందో గుర్తు లేదు. ఎవరెస్టు అన్న నా గేయంలో కాల్పనిక ప్రగతివాద ధోరణులు కలసిఉన్నాయనుకుంటున్నాను. న్యాయ నిర్ణేతలుగా నార్ల, పుట్టపర్తివారున్నారు. నార్లవారి పట్టుదల మీద
మొదటి బహుమతి తెన్నేటి వారికి వచ్చినట్లు, కానీ, పుట్టపర్తివారు నా గేయానికి మొదటి బహుమతిని సూచించినట్లు అప్పట్లో విన్నాను. ఇది నాకు
రాష్ట్ర స్థాయిలో వచ్చిన మొదటి బహుమానము. కవిగా గుర్తింపబడటం దీనివల్ల జరిగింది. ఆ గేయం స్రవంతిలో అచ్చయినది.
వరంగల్లులో కాకతీయకళాసమితి వారు భారతీయ సంగీతం గురించి వ్యాసం రాసే పోటీ పెట్టారు. దానికి సామగ్రి కావాలంటే మా చెలమచర్ల వారు ది హిస్టరీ ఆఫ్
క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ అన్న పుస్తకం చదవమన్నారు. అది ఆధారంగా నేనో వ్యాసం రాసి పంపించినాను. దానికి ప్రథమ బహుమతి వచ్చింది. కాలేజీ
మ్యాగజైన్‌లో నా పేరి రచనలతో పాటు, మారు పేరుతో ఒక కథ వ్రాసినాను. అంతకుముందే విశ్వనాథ సాహిత్యంతో పరిచయం ఉన్నా, 1951లో వరంగల్లులో
ఆంధ్రసారస్వత పరిషత్ వరంగల్ శాఖ వార్షిక సభలకు ముఖ్యఅతిథిగా వచ్చినప్పుడు వారి రెండుమూడు ఉపన్యాసాలు వినటం, ఆయన పద్యం చదవగా ముగ్ధుడనవటం, మాస్కూల్లో ఉపన్యసిస్తూ, మా స్థాయికి దిగివచ్చి మాట్లాడటం అన్నీ  నా మనస్సును పట్టివేశాయి.
విశ్వనాథ సాహిత్యంలో అంతర్బహిర్లోకాల అద్భుతమైన ఆవిష్కరణ పద్యంలో ఉండే సంభాషణ శైలి, అతి విపులమైన శబ్దార్థ సందోహం, అనంత కల్పనాచతురత, చరాచర ప్రకృతి అంతా సజీవమై సాక్షాత్కరించటం, ఋతువులు, కొండలు, అడవులు, వాగులు, వంకలు, పశుపక్షులు ఆపూర్వరీతిలో ప్రవృత్తం కావటం, నాణ్యతో దర్శనీయం కావటంతో అదేదో పూర్వ యుగాల బంధువు చేరవచ్చినట్లయింది. ఉద్వేగం పొందిన గడియలలో ఆ సాహిత్యం చిత్తశాంతిని కలిగించే సాధరణీకరణ లక్షణం నన్ను లోగొన్నది. ఆ విధంగా విశ్వనాథ సాహిత్య అధ్యయనం నా జీవనంలో అవిభాజ్యమైన భాగంగా మారిపోయింది. నేను విశ్వనాథను సర్వప్రకృతిని వివిక్తంగా సాక్షత్కరింపజేసే మహాకవిగా అంగీకరించినా, ఆయన విశ్వసించే జగన్మిథ్యాభావాన్ని అంగీకరించలేకపోతున్నాను. సామాజిక దృక్పథంలోనూ ఆయనకున్న కొన్ని పరిమితులు నాకు లేవు. అట్లాగే సంపత్కుమార శ్రీవైష్ణవ తాత్త్విక దృక్పథంతో విభేదించలేక నాకు దూరంగానే ఉన్నారు. నా వలె శ్రీఅరవిందుల చైతన్యం ఆరోహణ,
అవరోహణల జంట నిచ్చెనల లక్షణాన్ని ఆయన అంగీకరించలేదు. పద్య నిర్మాణంలో ఆయనకు రాయప్రోలు అంటే అంత ఇష్టం లేదు. నాకైతే రాయప్రోలు పద్యం మధుర రసవాహినులు ప్రవహించే కోన. సంస్కృత పాండిత్యం సంపత్కుమార పద్యాన్ని ప్రౌఢంగా చేసింది. నా పద్యం తీయదనాన్ని పుంజుకొని వెలువడింది. ఈ విధంగా యిద్దరి మధ్య రచనా విషయంలో ఎడం పెరుగుతూ వచ్చింది.  అయినా ఆయన చివరి క్షణం దాకా నేను ఆయనకు అనుగు బిడ్డనే.
5
హైదరాబాదుకు పై చదువులకోసం వెళ్లి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాలు గడిపినాను. 1955-62 వరకు సాగిన ఈ కాలంలో బిఏ, ఎంఏ,
పిహెచ్‌డిలు పూర్తయినాయి. దేశంలోని అనేక రంగాల ప్రముఖులను అక్కడ వినే అవకాశం వచ్చింది. ఉస్మానియాలో అధ్యయనం సర్వతోముఖ వికాసం కలిగించింది.
తెలుగుశాఖలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని, రామరాజు, చలమచర్ల ఇత్యాదుల అంతేవాసిత. ఖండవల్లివారి సౌజన్యం ఎంతో గొప్పది. వినీతి, ఆర్ద్రత, తెలుగు భాషా సాహిత్యాల పరివ్యాప్తికి ఏ పరిమితులు లేకుండా ఆయన సాగించారు. ఆయన కృషి ఫలితమే ఈనాటి తెలంగాణాలోని
సాహిత్య వికాస స్థితి. ఆయన శిష్య వాత్సల్యం అపారం. విద్యార్థులతోనూ సమస్థాయిలో ఆదరించి మాట్లాడేవారు.

అప్పుడే ఆంధ్రప్రాంతం నుంచి విద్యార్థుల రాకడ ప్రారంభమైంది. కళాశాలల్లో తెలుగుభాషాబోధన అవకాశాలు విస్తరించాయి. ప్రాచ్యవిద్యా పరివ్యాప్తి కలిగింది. ఖండవల్లివారికి పరిశోధక పర్యవేక్షక స్థితి కలిగింది. రామరాజు, అవధాని, దుర్గయ్య, సినారె, ఆనందమూర్తి, గోపాలకృష్ణారావు, రాజేశ్వరశర్మ, పిఎస్‌ఆర్ అప్పారావు ఇలా ఎంతోమంది దిగ్గజాలు పరిశోధన మార్గాన్ని బహు విస్తృతంగా నిలబెట్టారు. వారి సాహిత్య శోధ క్షేత్రాలు అతి విశాలమైనవి. ఆ నాళ్లలో పరిశోధనకు చేరుకున్న
వాళ్లలో నేనూ ఒకణ్ణి. నేను ఏ హాస్టల్‌లో ఉండేవాడిని. మాదిరాజు రంగారావు అక్కడే ఉండేవాడు. మాకు తరగతుల తరువాత గ్రంథాలయం, ఊళ్లో సాహిత్య
సమావేశాలు, హాస్టల్లో రాత్రివేళ్లల్లో సాహిత్య గోష్టులు… ఇదీ నిరంతర చైతన్య స్ఫూర్తి. నారాయణగూడలో పల్లాదుర్గయ్య ఇంట్లో రామరాజు, దాశరథి,
రామలింగం ప్రభృతులు ఉండేవారు. సినారె, ఆళ్వారుస్వామి మొదలైన వారు అక్కడ జతకూడేవారు. నేను, రంగారావు అక్కడికి సాయంకాలాలలో చేరుకునేవారం. ఎక్కువ సమావేశాలు కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలోనే జరిగేవి.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం, ఆంధ్రప్రాంత కవిపండితుల రాకపోకలు పెరగటం, వాతావరణంలో కొత్త వెచ్చదనం అప్పటి స్థితి. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంలో
తెరసం వరంగల్ శాఖ ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది. దాని వెనుక నా కృషి ఉన్నది. నేను స్థానిక సాహిత్య సమీక్ష పేరున వరంగల్ జిల్లా సాహిత్య వికాసం
గురించి దానిలో విపులమైన వ్యాసం వ్రాసినాను. నేను బిఎ విద్యార్థిగా ఉన్న రోజుల్లో వట్టికోట ఆళ్వారు స్వామి నాతో సాహిత్యము-నీతి అనే ప్రసంగం
చేయించి, వ్యాసము రాయించి ప్రభాస అనే వ్యాససంపుటిలో చేర్చి ప్రకటించినారు.
6
ఆ నాళ్లలో నేను కాళోజీ నాగొడవ మీద వ్యాసం రాస్తే, ఆయన దాన్ని మెచ్చి ఆ గ్రంథం రెండవ కూర్పులో పీఠిక వలె చేర్చినారు. ఎంకిపాటలమీద నా వ్యాసం
నాలుగు నెలలు స్రవంతిలో వరుసగా వచ్చింది. నేను ఎమ్మే విద్యార్థిగా ఉన్నప్పుడు సంస్కృత రూపకములు, తెలుగు అనువాదము అనే వ్యాసాన్ని సెమినార్లో
సమర్పింపగా దాన్ని నాటి సభాధ్యక్షులు భూపతి లక్ష్మినారాయణ దాన్ని మంచి పరిశోధన వ్యాసం అన్నారు. ఇంకా ఆళ్వారుస్వామి, వానమామలై మొదలైన వారికి
కూడా నా వ్యాసంగం మీద అభిమానం ఉండేది. పోతన చరిత్ర వర్తమాన కవిస్తుతిలో నా పేరును పేర్కొనటం నా పూర్వభాగ్యఫలంగా భావిస్తాను.

కరీంనగర్‌లో విశ్వనాథ షష్టిపూర్తి సందర్భంలో నా కవితను అధ్యక్షత వహించిన పివి మెచ్చుకున్నారు. నాకు సంపత్కుమారల రచన ఒక గేయకావ్యం చదవటానికి తెరసం ప్రత్యేక కావ్యగాన గోష్టి ఏర్పాటు చేసింది. అక్కడ మమ్మల్ని సన్మానించింది. అదే మాకు మొదటి సన్మానం. ఆ సభకు కప్పగంతుల వారు అధ్యక్షులు. 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పడింది. అంతకుముందే అఖిలాంధ్ర సాహిత్య పరిషత్ అనే సంస్థ ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉండేది. ఆ ప్రయత్నంలో పివి, కాళోజీ మొదలైన వారు ప్రముఖులు. దాని త్రోసిరాజని సాహిత్య రాజకీయాల కారణంగా ప్రభుత్వం చేత అకాడమీ ఏర్పాటు చేసి గోపాలరెడ్డి
అధ్యక్షుడు, విశ్వనాథ ఉపాధ్యక్షుడుగా సంస్థ ఏర్పడింది.
విశ్వనాథ సంపాదకత్వం గౌతమరావు నిర్వహణలో ఆ నాళ్లలోనే జయంతి పత్రిక 1955లో ప్రారంభమైంది. దానిలో నా రచనలు ఎక్కువగా వచ్చేవి. రసధుని అనేపేర కొందరు మిత్రులము ఒక సాహిత్యసంస్థను స్థాపించి విశ్వనాథను గూర్చి, శ్రీశ్రీని గూర్చి రెండు గోష్టీ కార్యక్రమములు ఏర్పాటు చేసినాము. ఒకసారి కోఠీ మహిళాకళాశాలలోని దర్బారు హాలులో ఆర్ట్స్ కాలేజీ తెలుగు సాహిత్యసంఘం వారు విశ్వనాథ కల్పవృక్ష ఉత్సవాలు నిర్వహించారు. ఒక సదస్సుకు తాపీ ధర్మారావు అధ్యక్షత వహించి ప్రశంసాపూర్వకంగా ప్రసంగించారు. ప్రశంసకో, నిందకో భాగ్యనగర సాహిత్యలోకంలో మాకు విశ్వనాథ అభిమానులనే కాకుండా, భక్తులనే
ముద్రపడింది. అంతవరకు మమ్మల్ని అభిమానించిన కవిమిత్రులతో ఈ అంశం ఎడం పెంచింది.
ఈనాళ్లలో నా పద్యాలు భారతిలో అచ్చయ్యేవి. ఆ పద్యాలను దాశరథి ప్రభృతులు ప్రశంసించేవారు. బాపురెడ్డి, చేకూరి రామారావు నాకు మంచి మిత్రులు. చేరా
కోసం నేను నిజాం కాలేజీ హాస్టల్లో అప్పుడప్పుడూ కొన్ని రాత్రులు గడపడం ఆయన నాకోసం యూనివర్సిటీకి వచ్చి మా హాస్టల్లో గడపడం పరస్పర స్నేహ గాఢతకు
దారి తీసింది. ఆ రోజుల్లో నేను తేజశ్చక్రము రాశాను. ఇది మధ్యాక్కర వలె కన్పిస్తుంది. యతిప్రాసలు కూడా ఉంటాయి. అయితే గణనిబద్ధత ఉండదు. తొలుదొలుత కొన్ని భాగాలుగా జయంతిలో వచ్చినవి. అయితే 1958 అక్టోబరులో ఇది పుస్తకరూపంలో వచ్చింది. ఈ పుస్తకంలో దుఃఖయోగిని అన్న గీతపద్య బహుళ కావ్యమూ చేరింది.
కుందుర్తి వచనపద్యోద్యమం నడుపుతున్న కాలమది. తన ఆఫీసులోనే ఒక ఆలస్య మధ్యాహ్న వేళలో నా తేజశ్చక్రము చదివించారు. అప్పుడు నవయుగ అనే
వారపత్రికలో దాన్ని ఆయన సమీక్షించారు. కుందుర్తికి నా పద్యాలంటే  ఇష్టం. అయితే ఆయన వచన పద్యాన్ని ఆధ్యాత్మిక వాదులు ఆక్రమించగలరని సంకోచం
పొందేవారు. అయినా, ఆయన విశ్వనాథ శిష్యుడే కావటం వల్ల ఈ పరస్పర ఆదరణానికి ఇబ్బంది కలుగలేదు. కుందుర్తి వల్ల వచ్చిన సమస్య రూపనిష్ఠ. నాకెన్నడూ
రూపనిష్ఠ లేదు. నేనే కాదు, దాశరథి దగ్గర నుంచి తెలంగాణా కవులు ఎవరూ ఈ రూపనిష్ఠకు కట్టుబడలేదు. కొంతలో కొంత ఈ రూపనిష్ఠ ప్రచురణ విషయంలో మా
రంగారావుకు ఉండేది. పద్యం రాసి మనం మెప్పించేది ఏముంటుంది అని ఆలోచించేవాడు. 1959 ఏప్రిల్ భారతిలో నా ‘సాహస్రమాన్మథము’ అనే పద్యాలు అచ్చయినాయి. ఆ సంవత్సర సాహిత్య సమీక్ష చేస్తూ సాళ్వకృష్ణమూర్తి ఈ కవితను ఆ ఏటి ఉత్తమ కవితగా పేర్కొన్నారు.
1959లో నేను పరిశోధన కోసం చేరినాను. అంశము రామరాజభూషణుని కృతులు-అధ్యయనము అని. వసుచరిత్రను గూర్చి నాకొక సందేహము ఉండేది. ప్రతి పద్యమూ శబ్దశక్తి చేత అనేకార్థాలను ప్రసరింపచేస్తున్నప్పుడు వస్తువును భావించటం దుర్లభమని, కావ్యానుభవం ఎలా కలుగుతుందని. నేను 1961 జనవరిలో విజయనగరం నుంచి మద్రాసు దాకా  ఈ ప్రశ్నను మోసుకొని సాహిత్యయాత్ర చేసినాను. ఎంతోమంది విద్వాంసులను కలుసుకున్నాను. అనేక సాహిత్య గోష్టులలో పాల్గొన్నాను. అయినా సందేహం తీరలేదు. ఈ పరిశోధన వ్యాసం నా సాహిత్య దర్శనాన్ని విస్తృత పరచిన మాట వాస్తవమే. ఎంతోమంది విద్వాంసులను దర్శించి సంభాషించి వారి వాత్సల్యాన్ని అనుభవించి ఒక పరితృప్తిని పొందినాను. త్రిపురనేని గోపీచంద్-నేను వసుచరిత్ర మీద పరిశోధన చేస్తున్నానని తెలుసుకుని ఒకసారి నన్ను కలుసుకోమన్నారు. సాదరంగా నాతో చర్చించినారు. బహు అర్థ సంయోజనలో ప్రధానార్థానికి ఇతర అర్థానికి ఉపమాన, ఉపమేయ భావం
చెప్పుకోవచ్చునేమో చూడమన్నారు. అలాగే వసుశబ్దార్థం తెలుసుకోమన్నారు. తరువాత సంశయం తొలగిపోయింది. కావ్యము మూడు పొరలలో ఉన్నదని, ఒకటి జలం లోకంలోకి ప్రవహించటం, రెండు ఇంద్ర వృత్రాసురుల కథ, మూడు కావ్య స్ఫుట వస్తువైన ఉపరిచర వసు కథ. ఈ బహుస్తర గాథా నిర్మాణానికోసం కవి అనేకార్థ
ప్రతిపాదకమైన శైలిని ఎన్నుకొన్నాడని నాకు స్ఫురించింది. శ్రీఅరవిందుల ‘సావిత్రి’ కావ్య అధ్యయనం ఈ అంశాన్ని విపులంగా ప్రస్ఫుటం చేసింది. ఇది ప్రాచీన కావ్యాధ్యయనంలో నూతన మార్గావిష్కరణంగా ప్రశంస పొందింది. 1962 జూన్‌లో నాకు డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. వరంగల్ కళాశాలలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది.
1970 ప్రాంతాలలో పద్యరచనం మీద ఒక నిరసనం తీవ్రమైంది. పద్యం చచ్చిపోయిందంటూ వ్యాఖ్యానించేవారు. ఆ తీవ్రతను తొలగించేందుకు నేను 1973లో
తొలి అష్టావధానం చేసినాను. ఆ తరువాత తెలంగాణాలో చాలా ప్రాంతాలలో 80 దాకా అష్టావధానాలు చేసినాను. శ్రీశృంగేరీ పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ
స్వాముల సమక్షంలోనూ, శ్రీపివి సమక్షంలోనూ అష్టావధానాలు చేసే అవకాశం లభించింది. వారి ఆశీఃస్సులు లభించాయి.
వరంగల్లు ప్రాంతంలో సాహిత్య చరిత్ర గురించి, చరిత్ర గురించి కొంత తీవ్రంగానే కృషి చేసినాను. ఇంటాక్ సంస్థవారి ప్రోత్సాహం ఇందుకు కారణం. ఏకశిలా సాహిత్య సౌందర్యం అనేపేర ఈ ప్రాంత సాహిత్య చరిత్రను సంపాదకుడుగా ప్రచురించినాను. విద్యారణ్యస్వామి సాహిత్య సమగ్ర తాత్త్వికతపై ఒక గోష్ఠి నిర్వహణకు పరిస్థితులు ఏర్పరచటం విద్యారణ్య విద్వద్గోష్ఠి అనే పేర రెండు సంపుటాలను ప్రచురించటం మరొక మౌలిక కృషి.
మా తాతగారు కోయిల్ కందాడై రంగాచార్యుల వారి స్మారకంగా 2005 నుంచి ఒక ట్రస్టు ఏర్పరచి ప్రసిద్ధులైన ఉభయ వేదాంత పండితుల చేత స్మారకోపన్యాసం
చేయించి, ఆ వేళకు దాన్ని ప్రచురించి వారిని పండిత రత్న బిరుదంతో సత్కరించి యథోచితంగా సన్మానం చేస్తున్నాము. నేను ఎమర్జెన్సీ రోజులలో దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రహస్యంగా పాల్గొన్నాను. అప్పుడే వందేమాతరం గీతం శతజయంతి ఉత్సవాలు జరిగితే ఒక ప్రత్యేక సంచికను వెలువరించారు.
7.
జీవనగమనంలో మార్పు. ఉద్యోగం, సంసారం ఒక పార్శ్వమైతే, కవిత్వం, విమర్శ మరో పార్శ్వం. ఉద్యోగ జీవితంలో ప్రతిరోజూ ప్రతి తరగతి పాఠమూ, నూతన అధ్యయన స్థానమే అయింది. బయట కానవచ్చే ఇతరాంశాలు ఏవీ నన్ను వికలం చేయలేదు. వృత్తి నిర్వహణ సందర్భంలో చివరవరకూ ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు కలుగుతూనే వున్నాయి. 1964లో అధునా అన్న కావ్యసంపుటి వచ్చింది. దానికి ముందుమాట వ్రాస్తూ దేవులపల్లి రామానుజరావు-‘‘సుప్రసన్న తెలుగు సరస్వతికి సహస్ర కమలపూజ చేయగలర’’ని ఆశించారు. ఈ ఖండకావ్య సంపుటిలోని పద్యాలు 1957 నుంచి వివిధ పత్రికలలో వచ్చినవే. కవికి సొంత గొంతు క్రమంగా ఏర్పడుతుంది. పేర్వారం జగన్నాథం సంపత్కుమార, నర్సింహారెడ్డిలతో కలిసి 1967లో చేతనావర్తం తొలిసంపుటం నా పీఠికతో వెలువడింది. ఈ సంపుటం వెలువడగానే సాహిత్యలోకంలో సంచలనం. ఈ సంకలనం పార్టీలకు లొంగిపోయే సాహిత్యాన్ని దూరం చేసింది. ప్రజాస్వామ్య దృక్పథానికి బలమిచ్చింది. మానవుడు కేవలం అర్ధవశుడుగా కాక ఆధ్యాత్మిక ఆధిదైవిక, ఆధి భౌతిక స్తరాలలో పరిపూర్ణంగా వికసించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పింది. దివ్యజీవన ఆవిర్భావాన్ని పృథ్విమీద జరగాలని స్వప్నించింది.
జాతీయ జీవన ధోరణితో విరోధం పెంచుకుని పార్టీల వ్యక్తుల తీరులు వెనక్కి తగ్గాయి. ప్రతిభావంతమైన సంస్కృతి ప్రకాశంలో సమాజంలోని వైరుధ్యాలను,
ధోరణులను ఈ సంపుటి సమీక్షించింది. మరి నాలుగేళ్లలో సంపత్కుమార పీఠికతో రెండవ సంపుటం వచ్చింది. ఎవరేమని నిరసించే ప్రయత్నం చేసినా చేతానవర్త
స్ఫూర్తి ఆధునిక తెలుగు కవితారంగంలో తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించింది. ఈ నడిమి కాలంలో వరంగల్లు నుంచి వారపత్రికగా వెలువడే జనధర్మ దై్వమాసిక సాహిత్యానుబంధాన్ని ప్రకటించింది. నేను దీనికి సంపాదకుణ్ణి. విలువగల సాహిత్య పత్రికను పదకొండు సంచికలను ప్రకటించింది. స్వాతంత్య్రోత్తర కాలాన తెలుగు కవిత ఇది వెలువరించిన విలువైన ప్రత్యేక సంచిక. అట్లాగే జ్ఞానపీఠ పురస్కార సందర్భంలో విశ్వనాథను గురించి మరొక ప్రత్యేక సంచికను వెలువరించింది.
1971లో ఆధునిక సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని గురించి నేను వ్రాసిన వ్యాసాలను సాహిత్య వివేచన పేరిట ప్రచురించాను. ఇది వెలువడిన వెంటనే
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ఉత్తమ విమర్శ గ్రంథంగా బహుమతి ప్రకటించింది. దానితో నాకు విమర్శక స్థానం లభించినట్లే భావించాను.
అబ్బూరి రామకృష్ణారావు వంటి వారు నా విమర్శలోని సమతులా లక్షణాన్ని ఎంతగానో అభిమానించారు. నా అదృష్టం ఏమిటంటే తొలితరం కవులు చాలామందితో నా పరిచయము కలిగి ఉండటం. వారి వాత్సల్యాన్ని నేను పొందగలగటం నా అదృష్టమే. విశ్వనాథ వారితో పాటు కాటూరి వెంకటేశ్వరరావు, శివశంకరస్వామి, నోరి నరసింహశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, నాయని సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వీళ్లందరితో నాకు ఆప్తమైన సంబంధం ఉండేది. తరువాత తరం కవులతో కూడా నా సంబంధాలు ప్రీతిపాత్రాలే అయినవి.
నా జీవితం ఉద్యోగంలో కుదురుగానే సాగింది. మెట్లు ఎక్కడమూ జరిగింది. నా జీవితంలో ఎంతోమంది నా సంపూర్ణ వికాసానికి దోహదం చేసినారు. వారికి నేను
ఏమి చేసినానో చెప్పలేను కానీ, కొంతమంది పురోగమనానికైనా నా చేతనైన సహాయం చేసినాను. 1987లో శతాంకుర వచ్చింది. కావ్య సృజనశక్తికి విలక్షణమైన
అభివ్యక్తి ముద్ర కలిగింది. సాహిత్యవేత్తలు దీన్ని స్వాగతించి దాని అభినవతను మెచ్చుకొన్నారు. సృష్టిలోని అనేక పార్శ్వాలు ఈ ముక్తక సంపుటిలో వ్యక్తమయ్యాయి. నా తాత్త్విక జీవన పరమార్థ దృష్టి ఈ కావ్యంలో సంగ్రహంగా ప్రకటితమైంది. నా కావ్య ప్రస్థానంలో ఇది ఒక విశిష్ఠమైన ఘట్టమే. ఈ సందర్భంలోనే నాకు ఆధ్యాత్మిక సాధనలో కొంత సంక్లిష్టమైన ఘట్టంలో ఉన్నట్టు అనిపించేది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. కొన్ని సంశయాలు తీరే అవకాశాలు లేకుండెను. నా తపోమార్గంలో హఠాత్తుగా నిరోధం ఏర్పడ్డట్టు అనిపించింది. ఆ సందర్భంలో నా జీవనంలోకి ఒక అరుదైన వ్యక్తి, సనాతన అధునాతన జీవన తాత్పర్యాన్ని తనలో సమన్వయం చేసుకున్న వ్యక్తి అవతరించారు. వారి పేరు సద్గురు శివానందమూర్తి. అంతకుముందు నా జీవనంలో ప్రవేశించిన తత్త్వ స్ఫూర్తిని కలిగించిన వారు శ్రీఅరవిందులు, శ్రీమాత, రమణమహర్షి, సాయిబాబా వంటి వారు వీరిలో లీనమైనారు. వారి మార్గదర్శనం నన్ను నాజీవితాన్ని స్పష్టమైన అసంక్లిష్టమైన మార్గంలో తీర్చిదిద్దుకోవటానికి దోహదం చేసింది.
సద్గురువుల అనుగ్రహం నాకు అనంతమైన చిత్తశాంతిని కలిగించింది. వారి సన్నిధి అసంతృప్తి లేకుండా నాకు సమచిత్తతను ప్రసాదించింది. వారి సన్నిధి నాకు ఈశ్వర సన్నిధానమే అయింది. వారు స్థాపించిన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన శ్రీరామనవమి పురస్కారం లభించటం గొప్ప ఆశీర్ అనుగ్రహం.
అలాగే శ్రీముత్తేవి లక్ష్మణ యతీంద్రుల అనుగ్రహం కూడా లభించింది. వారు ఉత్తమ కవితకు స్వయంగా వశీకృతులయ్యేవారు. తొలి పరిచయంలోనే 1982లో
తేజశ్చక్రము రాసిన కవివి కదా అని కౌగిలించుకున్నారు. అది శ్రీరాముడు మారుతికి అనుగ్రహించిన పరిష్వంగం. నన్ను మధురకవి అని పిలిచేవారు.
తరువాత నా కావ్యాలు ఎన్నో వెలువడ్డాయి. ఋతంభర, కన్నీటి కొలను, కృష్ణరశ్మి, శ్రీనిరుక్తి, శ్రీనృసింహ ప్రపత్తి ఇలా ఎన్నో. అయినా నేను భావిస్తున్న సమగ్ర కావ్యం రూపు కట్టలేదు. అనుకోకుండా పదిహేను రోజులు జ్వరంలో పడ్డ తరువాత ఆ వేదనలో 2002లో సాంపరాయం కావ్యం ఒక ప్రవాహం లాగా వెలువడింది.
సాంపరాయం 12 అధ్యాయాల్లో సృష్టి ఆరంభం నుంచి జీవన పరిణామం వర్ణించి మానవుడు మృత్యువును అతి తరించేదాకా ప్రయత్నాన్ని వ్యక్తీకరించే ఇతిహాస
కావ్యం. శతాంకుర లాగా ఇదీ వచన పద్యమే. అయినా ప్రతిపద్యమూ లయ కలిగిన నాలుగు పాదాలతో నిర్మితమైంది. మృత్యువును జయించి దివ్యమైన సమాజం
భూమండలంలోనే ఏర్పడవలసిన రీతిని కలగన్నది. భావుకులు తత్త్వవిదులు, కవిత్వగ్రహణ పారీణులు దీని ఔన్నత్యాన్ని ప్రశంసించినారు. ఈ కావ్యాన్ని మిత్రులు డాక్టర్ ఎల్‌ఎస్‌ఆర్ ప్రసాద్, డాక్టర్ విబి రామారావులు ఇంగ్లీషులోకి అనువదించారు. సాంపరాయం తరువాత వచ్చిన కావ్యాలు శేఫాలిక, ప్రీతి పుష్కరిణి, మణిసేతువు,
మణికర్ణిక మొదలైనవి దేనికవి వైలక్షణ్యం కలవే. బింబప్రతిబింబ భావాన్ని ఓర్వలేవు.
1983లో వెలువడిన సహృదయచక్రం వ్యాస సంపుటి తరువాత నా విమర్శ గ్రంథాలు మరో 11 వెలువడ్డాయి. అనేక అంశాలకు సంబంధించిన వినూత్న అంశాలు ఈ వ్యాసాల్లో ఉంటాయి. వీటిల్లో అధ్యయనానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శ గ్రంథంగా పురస్కరించింది. అదే విశ్వవిద్యాలయం ఉత్తమ పరిశోధకునిగా ప్రతిభా పురస్కారాన్ని అందించింది.
నా పీఠికల సంపుటి అంతరంగం. శ్యాంసంగ్ వారు కేంద్ర సాహిత్య అకాడమీ వారు సంయుక్తంగా ప్రకటించిన తొలి ఠాగూర్ సాహిత్య పురస్కారాన్ని పొందింది. తరువాత శ్యాంసంగ్ కంపెనీ వారి ఆహ్వానం మీద కొందరు పురస్కార గ్రహీతలతో కలిసి దక్షిణ కొరియాకు వెళ్లటం, అక్కడ సాహితీవేత్తలను కలుసుకోవటం జరిగింది. అఖిల భారత ప్రాచ్యవిద్వన్మహాసభలలో పాల్గొని 1977 నుంచి ఎన్నో పరిశోధన పత్రాలను సమర్పించాను. 1987లో కలకత్తాలో ఈ మహాసభలు జరిగినప్పుడు ద్రావిడ అధ్యయన సదస్సు విభాగానికి అధ్యక్షత వహించగలగటం నాకు సమకూడిన గొప్ప గౌరవం. జీవిఎస్ పేర ఏర్పడ్డ సాహిత్యపీఠం వారి ఉత్తమ విమర్శక పురస్కారం 2001లో నాకు లభించింది.
వేద రహస్యాన్ని సామాన్య పాఠకులకు అందించే సంకల్పంతో వేద సూక్త సౌరభం అనేపేర వాటిలోని ఆధ్యాత్మిక భూమికను ఆవిష్కరించే ప్రయత్నం చేసినాను. ఈ
గ్రంథానికి మంచి స్పందన లభించింది. ఇదే పద్ధతిలో ఇటీవల శ్రీకృష్ణోపనిషత్ వ్యాఖ్య కూడా ప్రకటించాను. దీపవృక్షం అనే పేర జీవనములోని అన్ని పార్శ్వాలకు సంబంధించిన మనోభావాల సంకలనం వెలువరించాను.
సాహిత్యంలో జాతీయ భావధోరణి బలపరిచే నిమిత్తం 1974లో జాతీయ సాహిత్య పరిషత్ ఏర్పడింది. దాని స్థాపన ప్రయత్నంలోనూ, పురోగమనంలోనూ నేను ప్రముఖమైన కృషిని నిర్వర్తించాను. విశ్వనాథ శతజయంతి సందర్భంలో గ్రంథరూపంలోకి రాని ఆయన అనేక రచనలను విశ్వనాథ అసంకలిత సాహిత్యం అనే పేర నేను, సంపత్కుమార కలిసి ఆరు సంపుటాలుగా వెలువరించినాము. దాన్లో మూడు నాలుగు సంపుటాలకు నేను సంపాదకుడిని. నేను సంపాదకత్వం వహించిన అనేక గ్రంథాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంపుటాల అనువాదంలో అయిదవ భాగం ఒకటి. సాహితీబంధుబృందం, కులపతి సమితి, జాతీయ సాహిత్యపరిషత్, విశ్వనాథ భారతి, సృజనలోకం, వంటి అనేక సాహిత్య సంస్థల నిర్మాణంలో పురోగతిలో నా ప్రయత్నం ముఖ్యమైందే. 1964-73 సంవత్సరాల నడుమ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా నేను సాధ్యమైన కృషి నిర్వర్తించాను. 1982లో రాష్ట్ర స్థాయిలో పోతన పంచశతి ఉత్సవాలను నిర్వహించిన సందర్భంలో నా భూమిక ముఖ్యమైందే. ఆ సంకల్పం దగ్గర నుంచి పూర్తయ్యే దాకా నా కృషి ఉన్నది. ఈ ఉత్సవాలు అయిదు రోజుల పాటు వరంగల్లులో అపూర్వంగా జరిగినాయి. దీనికి ప్రధాన ఆధారం బలం పివి నరసింహారావు. ఈ ఉత్సవాల ఫలితంగా పోతన విజ్ఞానపీఠం 1987లో ఏర్పడింది. ఆ పీఠం 1992లో భవనం నిర్మించుకోవటం జరిగింది.
అంతకుముందు, తరువాత ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. నిర్వహిస్తున్నది. నేను చాలాకాలం దానికి సంయుక్త కార్యదర్శిగా ఉన్నాను. ఆరేడేళ్లుగా కార్యదర్శిగా నా కృషి  కొనసాగిస్తున్నాను. ఈ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం పురోభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. దీనిలో సభాభవనం, గ్రంథాలయం ఉన్నాయి. వరంగల్లు ప్రాంతంలో సాంస్కృతికంగానే కాక ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగించటంలో ఈ సంస్థ ఎంతో దోహదం చేస్తున్నది.
నా జీవితం సుఖదుఃఖ మిశ్రీతం. ఎన్నో వెలుతులు, ఎన్నో పొంగిపొర్లటాలు. 2008 చివర మా పెద్దబ్బాయి గుండెపోటుతో పరమపదించటం, 2010 ఆగస్టులో మా చిన్నాయన సంపత్కుమార పరలోక గతులు కావటం, మొన్న డిసెంబరులో నా ధర్మపత్ని కాలగతి చెందటం ఇవన్నీ ఒకేకాలంలో సంభవించిన విషాదాలు. ఇప్పుడొక విచిత్రమైన శూన్యస్థితిలో మనస్సు ఉన్నది. ఈ మృత్యువు చేసే ఒత్తిడి జీవన పరమార్థాన్ని వ్యాఖ్యానించే దివ్యద్వారమే అవుతుందని నా విశ్వాసం.
శతాంకురలో ఎక్కడో అన్నాను. జీవితం ఎటర్నల్ స్క్రిప్చర్ అని. అలాగే దీన్లో వెలుగులు చూచుకుంటూ ఆ మార్గంలో నడుస్తున్నాను. ఋతుచక్రంలో శిశిరం తరువాత
వసంతం వస్తుంది. ఇదంతా చక్రనేమిక్రమం.

– కోవెల సుప్రసన్నాచార్యClose