విందు

Katherinemansfield

(కేథరీన్ మేన్స్ ఫీల్డ్ The Garden Party – తెలుగు అనువాదం శారద)

[రచయిత్రి పరిచయం  :  కేథరిన్ మేన్స్ ఫీల్డ్ (1888-1923)- న్యూ జీలాండ్ కి చెందిన రచయిత్రి. న్యూజీలాండ్  లో పుట్టి  ముఫ్ఫై అయిదేళ్ళకే  ఇంగ్లండులో మరణించారు ఆవిడ.  రచయిత్రిగానూ, వ్యక్తిగతంగానూ చాలా వివాదాస్పదమైన జీవితం ఆవిడది. ఆవిడని అమితంగా ప్రేమించిన వర్జీనియా వూల్ఫ్, ఇడా బేకర్ లాటి వాళ్ళూ వున్నారు, విపరీతంగా ద్వేషించిన డ్.హెచ్. లారెన్స్ లాటి వాళ్ళూ వున్నారు. “జీవితానికీ వృత్తికీ మధ్య విభజన రేఖ వుండనే కూడదని” నమ్మిన ఈవిడ జీవితం కూడా ఆవిడ రచనల్లానే వుంటుంది.

ధైర్యంగా, నిర్భయంగా, నిజాయితీగా, ఎవరికీ ఏ సంజాయిషీలూ ఇవ్వకుండా, కొంచెం తన తోటి వారికి భిన్నంగా, చాలా ఆసక్తికరమైన స్త్రీ, అంతకంటే ఆసక్తికరమైన రచనలు మేన్స్ ఫీల్డ్ వి.

న్యూజీలాండ్ లో వెలింగ్టన్ లో పుట్టిన కేథరిన్ పదేళ్ళకే స్కూల్ మేగజీన్ కోసం రాసే వారు. సంపన్నుల కుటుంబం వాళ్ళది. తండ్రి బేంకరు. 1903 నించి 1906 వరకు లండన్ లో చదువుకుని న్యూజీలాండ్ తిరిగ్ వెళ్ళారు. అయితే అక్కడ రెండేళ్ళకంటే ఎక్కువ వుండలేక మళ్ళీ లండన్ తిరిగ్ వెళ్ళి జీవితాంతం అక్కడే వున్నారు.  స్త్రీ-పురుషులతో ఆమె లైంగిక సంబంధాలు వివాదాస్పదం. 1918 లో జాన్ మిడిల్ టన్ మరే ని వివాహమాడారు. వాళ్ళిద్దరూ 1911  నించే సహజీవనం మొదలు పెట్టారు. అయితే ఆమె అంతకు ముందే వివాహం చేసుకున్న బౌడెన్ తో చట్ట రీత్యా విడాకులు తీసుకోకపోవడం వల్ల వీళ్ళిద్దరూ ఆగాల్సి వచ్చింది. బ్రతుకంతా రకరకాల వ్యక్తులతో సంఘర్షణ లోనూ, గర్భ స్రావాలతోనూ, అనారోగ్యంతోనూ, ఆర్ధిక ఇబ్బందులతోనూ బాధపడింది కేథరీన్ అనిపిస్తుంది.

తను స్వయంగా చెహోవ్ ని అభిమానించినా, ఆవిడ కథనం చాలా మంది ఇతర రచయితలని ప్రభావితం చేసింది. కేథరిన్ బ్రతుకే ఒక విచిత్రమైన కథలాగుంటుంది. ఇంకా వివరాలు కావలంటే ఇక్కడ చూడండి.

ఆమె శైలిలో నాకు చాలా నచ్చేది, కొంచెం స్పష్టాస్పష్టమైన పాత్ర చిత్రీకరణ. అంటే ప్రధాన పాత్రల గురించి కథ ఏమీ చెప్పదు. వాళ్ళ వయసు కానీ, సాంఘిక హోదా కానీ, ఇతర పాత్రలతో వారికుండే సంబంధ బాంధవ్యాలు కానీ ఏ వివరాలూ కథలో వుండవు. అవి మనం అర్థం చేసుకోవాలంతే. అంతే కాదు ప్రధాన పాత్రలు తమ చుట్టూ వుండే వారికంటే కొంచెం భిన్నంగా వుంటాయి. (అందుకే చాలా సార్లు ఆవిడ ప్రధాన పాత్రలు ఆవిడలాగే వుంటాయి.]

ఆ రోజు వాతావరణం చాలా బాగుంది. తోటలో విందుకొరకు ఆ కుటుంబం సరిగ్గా అలాటి వాతావరణమే కావాలనుకొంది. పెద్ద గాలులూ అవీ లేకుండా, ఆకాశమొక్క మబ్బు తునకైనా లేకుండా, వెచ్చగా, భలే బాగుంది. నీలాకాశంలో బంగారు చెంబు బోర్లించినట్టు సూరీడు! తోటమాలి పొద్దుణ్ణించీ తోటలోనే వున్నాడు. శుభ్రం చేస్తూ, ఊడుస్తూ, గడ్డి చెక్కేస్తూ, తోటంతా మిల మిలా మెరిసేలా చేస్తూ! అసలా గులాబీలు! తోటలో విందు ఇవ్వాలంటే గులాబీలు వుండి తీరాల్సిందేనని ఎవరైనా ఒప్పుకుంటారు. గులాబీలైతే అందరికీ తెలుస్తాయి, మిగతా పువ్వులు తెలిసినా తెలియకపోయినా. ఆ రోజు వందల కొద్దీ గులాబీలు పూచినట్టుంది తోటంతా.

పొద్దున్న కాఫీలూ, టిఫిన్లూ ఇంకా అవకముందే షామియానాలూ, పందిర్లూ వేసేవాళ్ళొచ్చేసారు.

“షామియానాలవీ ఎక్కడ వేయించమంటావమ్మా?” పిల్లలు అమ్మనడిగారు.

“ఇవాళ నన్నేం అడిగినా ప్రయోజనం వుండదు. నేను మీ అమ్మననే మాట మర్చిపోయి, నన్నూ ఒక అతిథిగా భావించండి. ఈ సంవత్సరం అన్ని బాధ్యతలూ మీకే వదిలేస్తున్నాను.”

మెగ్ ఎలాగూ పనివాళ్ళతో పని చేయించటానికి బయటికి వెళ్ళదు. అంతకుముందే తను తలంటుకోని తలకు తువ్వాలు చుట్టుకోని హాయిగా కాఫీ తాగుతూ కూర్చొనుంది. జోస్ ఎప్పుడూ పట్టు లంగా, కిమోనో లాటి జాకెట్టూ వేసుకొని వుంటుంది.

“లారా, నీకే వెళ్ళక తప్పదు. అలంకరణలవీ నీకే బాగా తెలుస్తాయి.”

చేసేదేమీ లేక లారా బ్రెడ్డు ముక్కని అలా చేత్తో పట్టుకోనే బయటికి పరిగెత్తింది. నిజానికి అలాటి వాతావరణంలో ఏదో ఒక వంకన బయటికి రావటమే ఇష్టం తనకి.

నలుగురు మగవాళ్ళు నిల్చొని వున్నారు తోటలో. కర్రలూ, షామియానాలూ, సామాన్లతో ఆమె కొసం ఎదురుచూస్తున్నారు. తను చేతిలోని బ్రెడ్డు ముక్కని ఇంట్లోనే ఎక్కడైనా పెట్టి రావాల్సింది అనుకుంది లారా. ఇప్పుడు పారేయటానికీ మనసొప్పలేదు. వాళ్ళ దగ్గరకొచ్చేసరికి కొంచెం సిగ్గుతో ఎర్రబడ్ద మొహాన్ని సీరియస్ గా పెట్టింది.

“గుడ్ మార్నింగ్!”  అచ్చం వాళ్ళమ్మలా గంభీరంగా అనటానికి ప్రయత్నించింది. కానీ, తన గొంతు చిన్న పిల్లల్లాగే అనిపించేసరికి ఇంకా సిగ్గుతో తడబడింది.

“మీరంతా వొచ్చినట్టేనా? ఇదేనా షామియానా?”

“అవును అమ్మాయిగారూ!” అన్నాడు వాళ్ళల్లో అందరికన్నా పొడ్డుగ్గా వున్న అతను.

సామాన్ల సంచీ పక్కకి జరిపి, తలపై వున్న టోపీని కిందికని ఆమె వంక చూసి చిరు నవ్వు నవ్వాడు. స్నేహంగా వున్న అతని చిరునవ్వుతో లారా కొంచెం సర్దుకొంది. స్వచ్ఛంగా నీలంగా వున్న అతని కళ్ళు చూసి, మిగతా అందరివైపూ చుసింది. అందరూ  “నిన్ను మేమేం తినేయం లేమ్మా! అంత భయమెందుకు?” అన్నట్టు నవ్వుతూ ఆమె వైపు చూస్తున్నారు. అసలు వీళ్ళంతా చాలా మంచి వాళ్ళలాగున్నారు, తనే అనవసరంగా భయపడింది. అందులో ఎంత అందంగా వుంది ఈ వుదయం. అయినా వుదయాల గురించి మాట్లాడటం కాదు, తను చాలా హుందాగా, బాధ్యతగా వుండాలి. తనకి తనే చెప్పుకుంది లారా.

“సరే! ఎక్కడ వేస్తారు షామియానా? ఆ లీలీ పూల పక్కన లాన్ లో వేస్తారా? అక్కడైతే బాగుంటుందా?”

అందరూ అటు వైపు చూసారు. పొట్టిగా లావుగా వున్న అతను పెదవి విరిచాడు. పొడుగాటి వ్యక్తి బొమ్మలు ముడేసాడు.

“అక్కడంత బాగుండదేమో అమ్మాయిగారూ. ఒక మూలకి వున్నట్టుగా వుంటుంది. ఇప్పుడూ, షామియానా అంటే ఎలాగుండాలంటే వచ్చిన అందరి దృష్టీ ఫేడీలమని పడి పోవాలన్నమాట, ” పొడుగాటి వ్యక్తి వివరించాడు.

అతని భాష అంతగా నచ్చకపోయినా, అతను చెప్పేది సరిగ్గానే వుందనుకుంది.

“అయితే టెన్నిస్ కోర్టు లో ఒక మూలకి వేస్తారా? కానీ, అక్కడ పాటల ప్రోగ్రాం కొరకు ఆర్కెస్ట్రా వాళ్ళు వుంటారు!”

“ఓ! అయితే బ్యాండు మేళం కూడా వుంటుందన్న మాట!” అన్నాడింకొక అతను. పాలిపోయిన మొహంతో, అలసిపోయిన కళ్ళతో ఒక్కసారి టెన్నిస్ కోర్టంతా పరికించి చూశాడతను. ఏమాలోచిస్తున్నాడో మరి!

“అబ్బే! బ్యాండంటే పెద్దదేమీ కాదు. చిన్న బ్యాండు!”

అంతలో మళ్ళీ పొడుగాటి వ్యక్తి కల్పించుకున్నాడు.

“అటు చూడండి అమ్మాయిగారూ! అక్కడైతే సరిగ్గా వుంటుంది.” అతను చూపించిన  చెట్ల వైపు చూసింది. అక్కడ షామియానాలు వేస్తే ఆ చెట్లేవి కనిపించవు మరి. కానీ ఆ చెట్లెంత అందంగా వున్నాయి! మిల మిలా మెరిసే ఆకులతో, బరువుగా వేళ్ళాడుతున్న పళ్ళతో, గర్వంగా, హుందాగా నిలబడి వున్నాయి.  అవన్నీ కనిపించకుండా షామియానా వేస్తే ఏం బాగుంటుంది?

ఆమె అభిప్రాయం వినకుండానే వాళ్ళంతా పని మొదలు పెట్టేసారు. పొడుగాటి వ్యక్తి మాత్రం అక్కడే ఆగిపోయి ఒక చిన్న పూవుని తెంపి వాసన చూడసాగాడు. లారా ఆశ్చర్యపోయింది. ఎంత మందికి పని మధ్యలో పూవుల వాసన చూసేంత ఓపికా, సహృదయమూ వుంటాయి, అనుకుందామె. పని వాళ్ళంతా చాలా మంచి వాళ్ళలాగున్నారు. కనీసం తనతో ఆదివారాలు రాత్రి భోజనానికొచ్చి డాన్సులు చేసే పెద్ద కుటుంబాల్లోని జులాయిలకంటే!  అసలు మనుషుల్లో ఎక్కువ తక్కువలేమిటి, విచిత్రం కాకపోతే!

“నాకైతే అలాటి తేడాలేవీ లేవు. హాయిగా వీళ్ళతోనైనా స్నేహం చేయగలను, ఏ మాత్రం సందేహం లేకుండా, ” అనుకుంది లారా. అంతలోకే పనివాళ్ళు పని మొదలు పెట్టిన సందడి వినబడింది. “వెయ్ రా దెబ్బా! హైసా!”  పని వాళ్ళు సరదాగా అరుపులూ, పాటలూ మొదలు పెట్టారు.

అసలు శ్రామిక జనం ఎంత స్నేహంగా, స్వచ్ఛంగా వుంటారో కదా! డబ్బున్న వాళ్ళలాగా మూతులు బిగించుకొని కుర్చోకుండా పాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, సంతోషంగా వుంటారు! తనూ వాళ్ళల్లో ఒకర్తినే అన్నది నిరూపించటానికి లారా బ్రెడ్డు ముక్క తింటూనే పొడుగాటి వ్యక్తి షామియానా కొరకు వేసిన డిజైను బొమ్మ చూడసాగింది.

“లారా! లారా! నీకే, ఫోన్!” ఇంట్లోంచి పెద్దగా వినపడింది.

“ఆ! వస్తున్నా!” ఎగురుతూ, గంతులేస్తూ, లారా తోటలోంచి ఇంట్లోకి పరిగెత్తింది. హాల్లో నాన్న గారూ, అన్నయ్య లేరీ, బయటికెళ్ళటానికి సిధ్ధమవుతున్నారు.

“లారా! ఒక్కసారి నా కోటు కొంచెం ఇస్త్రీ చేసిస్తావా? మధ్యాహ్నం వేసుకోవాలి!””

“ఓ! తప్పకుండా!” లారా పరిగెత్తి లేరీని ప్రేమగా హత్తుకుంది.

“అసలు పార్టీలంటే నాకెంత సంతోషంగా వుంటుందో చెప్పలేను.’

“అవుననవును. సరేకానీ, వెళ్ళి చూడు! నీకేదో ఫోన్ వచ్చింది.”

అయ్యో ఫోను సంగతి మర్చే పోయింది.!Sharada1

“హల్లో! ఎవరు? కిట్టీ? మధ్యాహ్నమా? భోజనానికా?వచ్చెయ్యి! పెద్ద వంటేమీ చెయ్యట్లేదు. ఊరికే బ్రెడ్డు! ఇవళ ఎంత అందంగా వుంది కదా? ఏదీ? తెల్లదా? చాలా బాగుంటుంది. ఒక్క క్షణం వుండు- అమ్మ పిలుస్తోంది. ”, లారా ఫోన్ మూసి పెద్దగా అరచింది, “అమ్మా! ఏమిటి? వినపడటంలేదు.”

శ్రీమతి షెరిడన్ గొంతు మెట్లమీదినించి తేలి వచ్చింది.

“కిందటి శనివారం పెట్టుకున్న టోపీ నే పెట్టుకొమ్మను ఇవాళ కూడా.”

“కిట్టీ ! అమ్మ నిన్ను కిందటి శనివారం పెట్టుకున్న టోపీనే మళ్ళీ పెట్టుకొమ్మంటుంది. సరే ! ఒంటి గంటకి! బై.”  లారా ఫోన్ పెట్టేసింది.

రిసీవర్ పెట్టేసి లారా చేతులు మడచి తల వెనక పెట్టుకుని నిట్టూర్చింది. కిటికీలోంచి మెత్తగా సూర్య రశ్మి గదిలోకి పడుతోంది. మనసంతా ఏదో తెలియని సంతోషంతో నిండి పోయిందా అమ్మాయికి.

ఎవరో ఇంటి ముందర బెల్లు మోగించారు. సేడీ తలుపు దగ్గరకు నడుస్తున్న చప్పుడు! సేడీ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. “ఏమో, నాకు తెలియదు. అమ్మగార్ని అడిగొస్తానుండు.” నిర్లక్ష్యంగా జవాబిస్తోంది.

లారా హాల్లోకి నడిచింది. “ఏమిటి సంగతి సేడీ?”

“పూలమ్మే అతను అమ్మాయిగారూ!”

పూలతను తెచ్చిన పూలు హాలంతా పరచుకొని వున్నాయి. రంగు రంగుల్లో గది నిండా లిలీ పూలు.

“అయ్యో! సేడీ! ఏదో పొరపాటు జరిగింది. ఇన్ని లిల్లీ పూలెవరు తెమ్మన్నారు? అసలు నువ్వెళ్ళి అమ్మను పిలుచుకొని రా!”

వాళ్ళ మాటల్లోనే శ్రీమతి షెరిడన్ అక్కడికొచ్చింది.

“ పొరపాటేం లేదు. నేనే తెమ్మన్నాను. ఎంత బాగున్నాయి కదా?” లారా వైపు తిరిగింది.

“నిన్న అక్కణ్ణించొస్తుంటే షాపు కిటికీలో చూసాను. వెంటనే అనుకున్నాను, ఇవాళ పార్టీలో అంతటా లిలీ పూలే కనిపించాలని.”

“కానీ ఇవాళ పార్టీలో అన్ని ఏర్పాట్లకూ మాదే బాధ్యత అన్నావు!” లారా తల్లి మెడ చుట్టూ చేతులేసి గారాబంగా అంది. సేడీ వంటింట్లోకి వెళ్ళిపోయింది. పూల కొట్టతను వెళ్ళి తన వాన్ దగ్గర నిలబడ్డాడు.

“బంగారు తల్లీ! అమ్మ ఎప్పుడూ మనసు మార్చుకోకూడదా?? ఇంకా పూలు తెస్తున్నాడు చూడు.” పూల కొట్టతను ఇంకొక లిల్లీ పూల ట్రేలు తీసుకొని లోపలికి తెచ్చాడు.

“అన్నీ లోపల వరండా అన్ని వైపులా పెట్టించు. ఏమంటావు లారా? అలా పెడితే బాగుండదూ?”

“అవునమ్మా. చాలా బాగుంటుంది.”

పక్కన ఇంకో పెద్ద హాల్లో మెగ్, జోస్, హేన్స్ అందరూ కలిసి పియానోని ఒక మూలకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

“ఆ సోఫాని అటు వైపు గోడ దగ్గరికి జరిపించి మిగతా అంత సామాను బయట వేయిద్దాము. సరేనా?”

“సరే!”

“హేన్స్, ఈ బల్లలన్నీ ఇంకో గదిలోకి మార్చు. పని ఆవిడని పిలిచి ఈ కార్పెట్ అంతా బాగా దులిపించాలి.”

జోస్ కి పని వాళ్ళతో పనులు చేయించటమంటే భలే సరదా. వాళ్ళకీ ఆమె చెప్పినట్టు చేయటం ఇష్టమే. అంతా ఏదో పెద్ద నాటకంలో పాత్రలు ధరిస్తున్న భావన వస్తుంది జోస్ పనులు చెప్పటం చూస్తే.

“అలాగే అమ్మనీ, చిన్న అమ్మాయిగార్నీ నేను పిలుస్తున్నానని చెప్పి వెంటనే తీసుకురా!” మళ్ళీ పురమాయించింది జోస్. మెగ్ వైపు తిరిగింది.

“మెగ్! ఒక్క సారి పియానో సరిగ్గా వుందో లేదో చూడు. ఇవాళ మధ్యాహ్నం ఎవరైనా పాడమంటారేమో నన్ను. రా, ఒకసారి ఏదైనా పాట వాయించి చూద్దాం.”

పాం- ట-ట-ట-టీ-ట, పియానో పెద్దగా నొరిప్పింది. అమ్మా లారా అప్పుడే గదిలోకి అడుగుపెట్టారు. జొస్ పాడుతూనే వుంది.

“అమ్మా, నేను బాగా పాడుతున్నానా?” ఇంతలో మళ్ళీ సేడీ వచ్చింది.

“మళ్ళీ ఏమిటి సేడీ?”

“ఏం లేదమ్మగారూ! వంట మనిషికి సాండ్ విచ్ ల దగ్గర పెట్టే పెర్లున్న కాగితాల కట్ట కనబడటంలెదు.”

“సాండ్ విచ్ ల పేర్లా? కాగితాలా? ఎక్కడ పెట్టానబ్బా?” శ్రీ మతి షెరిడన్ మొహం చూడగానే పిల్లలు ఊహించారు, అమ్మకి వాటి సంగతే గుర్తు లేదని. “సేడీ! పది నిముషాల్లో నేనా పేర్ల కాగితాలు పంపిస్తాను. వంట మనిషిని కంగారుపడొద్దని చెప్పు,” సేడీ ని పంపి వేసింది.

“లారా! నేనొక కవరు మీద ఆ పేర్లన్నీ రాసి వుంచాను. ఎక్కడ పెట్టానో మరిచిపోయాను. మళ్ళీ ఇంకొక మంచి కాగితం మీద రాద్దాం పద. మెగ్, ముందు నువ్వు తలచుట్టూ ఆ తువ్వాలు తీసి పారెయ్. జోస్, నువ్వెళ్ళి బట్టలు మార్చుకో. లేచి వెళ్తారా లేకపోతే మీ నాన్నతో చెప్పనా? అన్నట్టు జోస్, నువ్వు కొంచెం వంట మనిషి కంగారు పడుతుందేమో చూడు. మధ్యాహ్నం పార్టీ తలచుకుంటే నాకు వణుకొస్తూంది!”

భోజనాల గదిలో, గడియారం వెనక వాళ్ళకి పేర్లు రాసుకున్న కవరు దొరికింది. అది అక్కడికెలా వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు.

“ఈ కొంటె పిల్లలెవరో తీసి అక్కడ పడేసి వుంటారు. సరే అన్ని సాండ్ విచ్ ల పేర్లు వున్నాయో లేదో చూడు. ”

“సరే, పేర్లన్నీ చిన్న చిన్న కాగితాల మీద అందంగా రాద్దాం పద.”

అన్నీ రాసేసారు మెల్లగా. అ లేబుళ్ళ కట్ట పట్టుకుని లారా వంటింట్లోకి పరిగెత్తింది.

వంటింట్లో జోస్ పొగడ్తలతో వంటావిడని ఆకాశానికెత్తేస్తుంది. నిజానికి వంటావిడ సౌమ్యురాలు. ఆవిడని చూసి అంత భయపడటానికేమీ లేదు.

“ఇంత అద్భుతమైన సాండ్ విచ్ లు నేనెక్కడా చూడలేదంటే నమ్మండి! ఎన్ని రకాలు చేసారు? పదిహేనా?”

“అవును అమ్మాయి గారు, పదిహేను రకాలు చేసాను.”

“పదిహేను రకాల సాండ్ విచ్ లు. వామ్మో! ఎలా చేస్తారో ఎమో, అన్ని రకాలు.”

వంటావిడ సంతోషాన్ని దాచుకొంటూ చిన్న చిరునవ్వుతో వంటిల్లంతా ఊడ్చి శుభ్రం చేసుకుంటూంది. వున్నట్టుండి లోపలినించి సేడీ అరచింది, “గాడ్బర్ నించి మనిషి వచ్చాడు!” అంటూ. అంటే మిఠాయిలొచ్చాయన్నమాట. గాడ్బర్ చేసే మిఠాయిలు  ఊరంతా ప్రసిధ్ధి. ఎవరూ అసలు ఇంట్లో మిఠాయిలే చేయరు.

“సేడీ! మిఠాయిలు లోపలికి తెచ్చి ఆ బల్ల మీద పెట్టు,” వంటావిడ పురమాయించింది. సేడీ మిఠాయిలు లోపలికి తేవటానికెళ్ళింది. లారా, జోస్, నిజానికి తాము చాలా పెద్దయిపోయాం కాబట్టి మిఠాయిల గురించి పెద్దగా పట్టించుకోకూడదనుకొంటారు కానీ, ఆ మిఠాయిలు చూడగానే నోరూరింది వాళ్ళిద్దరికీ. వంటావిడ వాటిని అందంగా సర్ద సాగింది.

“ఇద్దరూ చెరొక మిఠాయి తీసుకుని తినండి. అమ్మకి చెప్పకపోయినా పర్వాలేదు,” వంటావిడ ఇద్దరికీ మిఠాయిలిచ్చింది.

పొద్దున్నే మిఠాయిలెలా తింటాం, అనుకుంటూనే ఇద్దరూ చెరొకటి తినేసారు.

“పద, అలా వెనకనించి తోటలోకి వెళ్ళి షామియానాలు వేయటం ఎంత వరకొచ్చిందో చూద్దాం!” లేచి నడిచింది లారా. కానీ వెళ్ళటానికి వీల్లేకుండా తలుపు దగ్గర అడ్డు నిలబడ్డారు సేడీ, మిఠాయిల అబ్బాయీ, వంట మనిషీ! ఏదో గంభీరంగా మాట్లాడుకుంటున్నారు.

వంటావిడ “అయ్యో! పాపం!” అంటోంది. సేడీ ఆశ్చర్యం, భయం కలిసిపోయినట్టు చెంపలు నొక్కుకుంటూంది. ఒక్క మిఠాయిల అబ్బాయి మాత్రం సంతృప్తిగా సంఘటన వివరిస్తున్నాడు.

“ఏం జరిగింది?” పిల్లలు అడిగారు.

“పెద్ద ప్రమాదం! ఒకతను చనిపోయాడు కూడా!” వంట మనిషి చెప్పింది.

“చనిపోయాడా? ఎక్కడ? ఎలా? ఎప్పుడు?”

“బయటికెడితే చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెల్లాటివి కనిపిస్తాయి చూడండి, అక్కడండీ అమ్మాయి గారు! మీకా గుడిసెలు తెలుసా?”

ఎందుకు తెలియదు. తెలుసు తనకి, అనుకుంది లారా.

“అక్కడ, స్కాట్ అనే గుర్రబ్బండి వాడుంటాడు. పొద్దున్న అతను ప్రమాదంలో పోయాడు.”

“పోయాడా? అయ్యో!”

“ఆ! అక్కడికక్కడే ప్రాణం పోయినట్టుంది! ఇక్కడికి నేనొస్తుంటే శవాన్ని ఇంటికి తీసికెళ్తున్నారు. పాపం, పెళ్ళాం, పిల్లలూ కూడ వున్నారతనికి.”

“జోస్, ఇలా రా!” అక్కని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది లారా. లోపలి తలుపుకానుకుని నిలబడి,

“జోస్! ఇప్పుడెలా? ఇప్పుడీ విందు ఎలా ఆపుతాం” అంది  ఆందోళనగా.

“విందు ఆపేయాలా? ఎందుకని?” ఆశ్చర్యంగా అడిగింది జోస్.

“అవును! విందు ఆపేయొద్దూ మనం?” జోస్ ఇంకా ఆశ్చర్యపోయింది.

“పిచ్చిదానివా ఏమిటి? మన విందు ఎందుకాపేయాలి? అసలు ఎవరంటారలా?”

“అది కాదు. మన ఇంటి దగ్గర ఇంట్లో ఎవరో పోయి ఏడుస్తూ వుంటే మనం విందు ఎలా చేసుకొంటాం?”

నిజానికి ఆ చిన్న చిన్న యిళ్ళు వీళ్ళ ఇంటికి అంత దగ్గరగా ఏం లేవు. వీళ్ళ వీధి చివరినించి మొదలై అలా సాగిపోతాయి. రెండు కాలనీలకీ మధ్య పెద్ద రోడ్డు కూడా వుంది. అసలా ఇళ్ళు చూస్తేనే మహా చిరాగ్గా వుంటుంది. మట్టి రంగు గోడలతో, చిన్న చిన్న యిళ్ళు! ఇంటి ముందర చిన్న చిన్న తోటల్లో ఎప్పుడు చూడూ కేబేజీ మొక్కలే వుంటాయి. గులాబీలో, అందమైన పచ్చికలో వుండనే వుండవు. ఆ కేబేజీ మొక్కల మధ్య కోళ్ళు! అసలు వాళ్ళ ఇళ్ళల్లోంచి వచ్చే పొగ కూడా నిరుపేదలా అనిపిస్తూంది. షెరిడన్ గారి ఇంటి పొగగొట్టంలోంచి వచ్చే అందమైన వెండి రంగు మబ్బుల్లాటి పొగకీ, ఆ యిళ్ళల్లోంచి వచ్చే మురికి పొగకీ పోలికే లేదసలు.

ఆ కాలనీలో, చాకలి వాళ్ళూ, చెప్పులు కుట్టే వాళ్ళూ, ఇంకా ఎవరెవరో వుంటారు. ఇళ్ళల్లో ఎక్కడ చూసినా పిల్లలు! షెరిడన్ గారి పిల్లలని చిన్నతనంలో అటు వైపు వెళ్ళనిచ్చే వారే కాదు. అయితే, కొంచెం పెద్దయ్యాక లారా, లేరీ అప్పుడప్పుడూ ఆ కాలనీలో కుతూహలంగా నడిచిచ్చే వాళ్ళు. చూడగానే అసహ్యమేసేది. కానీ జీవితం అన్నాక ఎన్నిటినో చూడాలి, ఎన్ని చోట్లకో వెళ్ళాలి మరి. అందుకే ఇద్దరూ వెళ్ళేవాళ్ళు.

“ మన బాండు వాళ్ళు పెద్దగా పాటలు పాడుతుంటే స్కాట్ భార్యకెలా వుంటుందో ఊహించు.”

జోస్ ఆశ్చర్యం కోపంలోకి దిగింది.

“లారా! ఎక్కడో ఎవరికో ప్రమాదం జరిగిన ప్రతీసారీ నువ్వు పాటలూ,ఆటలూ, సరదాలూ మానుకున్నావంటే, ఇక నీకు జీవితంలో మిగిలేదేమీ వుండదు. నాక్కూడా ఆ కుటుంబాన్ని తలచుకుంటే జాలి వేస్తుంది. కానీ దానికి మన ప్రోగ్రాం ఎందుకు మానేయాలో అర్థం కావటం లేదు. మనం పార్టీ మానుకున్నంత మాత్రాన చనిపోయిన ఆ తాగుబోతు బ్రతికొస్తాడా?”

“తాగుబోతా? ఎవరు తాగుబోతు? అతను తాగుబోతని తెలుసా నీకు? ” లారా కోపంగా లేచింది. “అసలు నేను అమ్మతో మాట్లాడతానుండు.”

“వెళ్ళు, వెళ్ళు! వెళ్ళి అమ్మేమంటుందో చూడు!”

“అమ్మా! నీతో కొంచెం మాట్లాడాలి,” తల్లి గది తలుపు దగ్గర నిలబడి అడిగింది లారా.

“రా లారా? ఏమయింది? మొహం అలా వుందెందుకు?” శ్రీమతి షెరిడన్ అద్దం మూందు కూర్చుని కొత్తగా కొన్న టోపీని పెట్టుకుని చూసుకుంటూ అంది.

“అమ్మా ! బయట ఒకతను చనిపోయాడు.”

“ఎక్కడ? మన తోటలోనా?”

“కాదు! బయట, వీధిలో.”

“హమ్మయ్య! బ్రతికించావు.” నిట్టూర్చి శ్రీమతి షెరిడన్ తల మంచి టోపీని తీసి పట్టుకుంది.

“అదికాదమ్మా! అసలేమయిందంటే,” లారా గబగబా మిఠాయిల అబ్బాయి చెప్పిందంతా వివరించింది.

“నువ్వే చెప్పు, బయట పక్క ఇంట్లో ఎవరో పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే మనం ఇక్కడ తోటలో పార్టీ ఎలా చేసుకుంటాం? మన పాటలూ, నవ్వులూ విని వాళ్ళు బాధ పడతారేమో. అసలిప్పుడేం చేద్దాం?” లారా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

అచ్చం జోస్ లాగే తల్లి కూడా ఆశ్చర్యపోయింది. ఇంకా చెప్పాలంటే ఆమెకి నవ్వు కూడా వచ్చింది.

“పిచ్చి తల్లీ! మనం వినడం వల్లే మనకా సంగతి తెలిసింది. వినకపోయి వుంటే? తెలిసేది కాదు, అవునా? అప్పుడు మామూలుగానే పార్టీ అయి వుండేది. మనలని ఎవరు తప్పుపట్టగలిగేవారు? ఇప్పుడూ అంతే. మనం వినలేదనుకుని మామూలుగానే వుందాం. అసలా యిళ్ళల్లో ఎలా బ్రతుకుతున్నారో అన్నది నాకెప్పుడూ అర్థం కాదు, నిజానికి.”

తల్లి మాటలకెలా బదులు చెప్పాలో తెలియలేదు లారాకి. అక్కడే సోఫాలో కూలబడింది.

“అమ్మా! అంత మొరటుగా ఎలా వుండగలుగుతాం?” అంది ఆవేదనగా.

“బంగారూ! ఎంత అమాయకురాలివమ్మా!” తల్లి లేచి వచ్చి కుతురి పక్కనే కూర్చుంది. తన కొత్త టోపీని లారా తల మీద పెట్టిచూసింది.

“అబ్బ, యెంత బాగుంది ఈ టోపీ నీకు! అది నీకే, వుంచేసుకో! నాకంటే నీకే అది అందంగా వుంది. కావాలంటే అద్దంలో చూసుకో,” అద్దం యెత్తి పట్టుకుంది.

“అది కాదమ్మా, ఒక్క సారి…..”

తల్లికీ జోస్ లాగే కోపం వచ్చింది.

“లారా, చిన్న పిల్లలా ప్రవర్తించకు.  అంతంత త్యాగాలేం చెయ్యక్కర్లేదు. అసలు ఎవరో ముక్కూ మొహం తెలియని వాళ్ళకోసం మన ఇంటికి వచ్చే అతిథుల్ని నిరాశ పరుస్తావా? నీ ఒక్క దాని పిచ్చితనం తో అందరి సరదా పాడుచేయొద్దు.”

“నాకేమి అర్థం కావడం లేదు,” బిక్క మొహంతో లారా లేచి తల్లి గదిలోంచి వెళ్ళిపోయింది. తన గదిలోకెళ్ళి కూర్చుంది. ఉన్నట్టుండి అద్దం లో చూసుకుంది. అందమైన నల్లటి హేటూ, దానికి పొడుగాటి వెల్వెట్ రిబ్బనూ, బంగారు రంగు వుంగరాల జుట్టుతో, ఎవరీ అందగత్తె అనుకుంది ఒక్క క్షణం. ఇంకెవరు, తనే!నిజంగా అమ్మ చెప్పినట్టు ఆ టోపీ తనకెంతో బాగుంది.

అమ్మ అన్నట్టు తను అతిగా ఆలోచిస్తుందా? అంతలోనే సంపాదించే భర్తను పోగొట్టుకొని, పిల్లలతో ఒంటరైపోయిన దీనమైన స్త్రీ ముఖం మనసులో మెదలింది. అంతలోకే మళ్ళీ మామూలై పోయింది. ఇహ దాని గురించి పార్టీ అయ్యాకే ఆలోచిస్తాను, అని నిశ్చయించుకుంది లారా.

భోజనాలు ముగిసేసరికి మధ్యాహ్నం ఒంటి గంటయింది. రెండున్నరకల్లా అంతా తయారయి తోటలోకెళ్ళారు. టెన్నిస్ కోర్టులో ఆకు పచ్చ రంగు యూనిఫారాలలో బేండు మేళం వాయిద్యాలను శృతి చేసుకుంటున్నారు.

“నన్నడిగితే ఆ ఆకు పచ్చ రంగు బట్టల్లో వాళ్ళంతా పెద్ద కప్పల్లాగున్నారు. అసలు వాళ్ళ స్టేజీ స్విమ్మింగ్ పూలులో పెట్టి వుంటే సరిగ్గా వుండేది,” కిట్టీ నవ్వుతూ అన్నాడు.

లేరీ బయట నించొచ్చి తన గదిలోకి వెళ్తున్నాడు, బట్టలు మార్చుకోవడానికి. అన్నని చూడగానే లారా కి చనిపోయిన స్కాట్ గుర్తొచ్చాడు. అతని వెంటే హాల్లోకి నడిచింది.

“లేరీ!”

వెనుదిరిగి చూసాడు లేరీ. చెల్లిని చూసి సన్నగా ఈల వేసి కళ్ళెగరేసాడు. “అబ్బో! యెవరబ్బా ఇంత అందగత్తె, మా ఇంట్లో?” నవ్వాడు. “లారా! నిజంగా ఇవాళ నీకా టోపీ చాలా బాగుంది.”

లారా నవ్వి అక్కణ్ణించి వెళ్ళిపోయింది.

మధ్యాహ్నానికి విందు ఊపందుకొంది. పాటలూ, ఆటలూ, మాటలూ, నవ్వులూ- అంతా సంబరంగా వుంది. షెరిడన్ గారి తోటలో వాలిన రంగు రంగుల పక్షుల్లా వున్నారందరూ. సంతోషంగా, చలాకిగా వుండే మనుష్యుల మధ్య వుండడం ఎంత సంతోషాన్నిస్తుంది! లారా ఆ రోజు పొగడ్తల్లో మునిగిపోయింది.

“లారా! ఇవాళ ఎంత అందంగా వున్నావో తెలుసా?”

“అసలా టోపీ నీకు బాగా నప్పింది.””

“స్పానిష్ అమ్మాయిలా వున్నావు. ఇంత అందంగా నిన్నెప్పుడూ చూడలేదు నేను.”

లారా మొహం ఆనందంతో వెలిగిపోయింది. అయినా అందరినీ మెత్తగా నవ్వుతూ పలకరించింది.

“కొంచెం టీ తాగుతారా?” “మీ జూస్ లో కొంచెం ఐస్ వేయనా?” “ఈ పళ్ళ ముక్కలు ఒక సారి రుచి చూడండి.”

మధ్యలో తండ్రి దగ్గరికి పరిగెత్తింది. “నాన్నా, ఒక్క సారి ఆ బేండు మేళం వాళ్ళేమైనా తింటారేమో, తాగటానికేమైనా కావాలేమో కనుక్కుంటావా?” అంటూ పురమాయించింది. మధ్యాహ్నం గడిచి సాయంత్రం అయేసరికి విరిసిన పూవు ముడుచుకున్నట్టయింది.

“భలే సరదాగా గడిపాం ఇవాళ!” , “చాలా బాగా జరిగింది పార్టీ!” అంటూ అతిథులంతా సెలవు పుచ్చుకున్నారు.

“అమ్మయ్య! అంతా సవ్యంగా జరిగిపోయింది.” నిట్టూర్చింది శ్రీమతి షెరిడన్.

“లారా! పార్టీ బాగా జరిగింది, కానీ  ఒళ్ళు హూనమైపోయింది. ఈ పిల్లలేమో పార్టీలు కావాలని ప్రాణాలు తోడుతారు. పద కొంచెం కాఫీ తాగుదాం లోపలికెళ్ళి. నువ్వెళ్ళి మిగతా అందరికీ వీడ్కోలు చెప్పి లోపలికి రా.”

అందరూ ఖాళీ అయిపోయిన షామియానా కింద కూలబడ్డారు అలసటగా.

“నాన్నా, ఒక్క సాండ్ విచ్ తింటావా? లేబుళ్ళ మీద ఈ పేర్లన్నీ నేనే రాసాను తెలుసా?”

“అబ్బో! అయితే ఇలా తే!” తండ్రి సాండ్ విచ్ అందుకొని కొరికాడు. “అన్నట్టు, ఇవాళ బయట ఒక పెద్ద ప్రమాదం జరిగింది తెలుసా?”

శ్రీమతి షెరిడన్ వెంటనే అందుకుంది. “ఆ ప్రమాదం గురంచి మాట్లాడకండి! ఇవాళ దాని వల్ల మన పార్టీ దాదాపు మానేసినంత పనయ్యింది. బయటెవరో మరణిస్తే మనం పార్టీ ఎలా చేసుకుంటామని లారా ఒకటే గోల,” నవ్వుతూ అంది.

“అబ్బ, ఏదో అన్నాను, వదిలెయ్యమ్మా!” సిగ్గుపడింది లారా.

“నిజంగానే చాలా బాధాకరమైన విషయం. పాపం అతనికి భార్యా పిల్లలూ కూడా వున్నారట.” షెరిడన్ గారు సాండ్ విచ్ కొరుకుతూ అన్నారు. ఉన్నట్టుండి అందరూ మౌనంగా వుండిపోయారు.

ఈయనకి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు, చిరాకు పడ్డారు శ్రీమతి షెరిడన్. వున్నట్టుండి ఆవిడకొక ఆలోచన వొచ్చింది.

“ఒక పనిచేద్దాం. చాలా వంట మిగిలిపోయింది. ఒక బుట్టలో పెట్టి మిగిలిన తినుబండారాలన్నీ వాళ్ళకి ఇద్దాం. పిల్లలు నాలుగురోజులు తింటారు.ఇప్పుడు వాళ్ళింట్లో వచ్చీ పోయే జనం కూడా వుంటారు. అందరూ తినడానికి పనికొస్తుంది. లారా! వెళ్ళి ఆ పెద్ద బుట్ట పట్టుకురా!”

“అమ్మా! నిజంగా అదంత మంచి పని అంటావా?”

లారాకి మళ్ళీ విచిత్రంగా అనిపించింది. తను ఒక్కర్తీ వేరేగా ఎందుకాలోచిస్తుంది? ఇంట్లో విందులో మిగిలిపోయిన తిండి ఇస్తే, అసలే బాధల్లో వున్నవాళ్ళు ఏమనుకుంటారు?

“ఎందుకు బాగుండదు? ఎంత వింతగా మాట్లాడతావు లారా నువ్వు! ఇందాకేగా వాళ్ళ మీద జాలితో కరిగిపోయావు? అంతలోకే ఏమొచ్చింది?” తల్లి విసుగ్గా అంది.

లారా పరిగెత్తుకుని వెళ్ళి బుట్టతో సహా తిరిగొచ్చింది. తల్లి బుట్టంతా రకరకాల తినుబండారాలతో నింపింది.

“నువ్వే తీసుకెళ్ళు లారా! వెళ్ళేటప్పుడు ఆ లిల్లీ పూలు కూడా తీసుకెళ్ళు. పాపం, పేదవాళ్ళకి లిల్లీ పూలు బాగా నచ్చుతాయి.”

“వద్దు, ఆ పూల కాడలు నీ గౌనంతా పాడు చేస్తాయి,” జోస్ హెచ్చరించింది.

“అదీ నిజమేలే. పూలేమీ వొద్దు. వుత్తి బుట్ట మాత్రం తీసుకెళ్ళు లారా. అన్నట్టు లారా, అక్కడ-” ఆగిపోయింది అమ్మ.

“ఏమిటమ్మా?”

తటపటాయించింది  తల్లి. “ఏమీ లేదులే, వెళ్ళు. తొందరగా వొచ్చేయి.”

తోట దాటి లారా బయటికొచ్చేసరికి చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. కొంచెం కిందికి, వీధి చివరగా వున్నాయి ఆ చిన్న ఇళ్ళు. మధ్యాహ్నం విందు హడావిడి తర్వాత అంతా నిశ్శబ్దంగా వున్నట్టనిపించింది లారాకి. వున్నట్టుండి తను ఎక్కడికి వెళ్తోందో గుర్తొచ్చిందామెకి. నిజానికి విందులో మాటలూ, హాస్యాలూ, గిన్నెలూ, పళ్ళేల చప్పుళ్ళూ, నవ్వులూ, పచ్చిక వాసనా,అన్నీ కలిపి ఆమె మనసులో ఇంక వేటికీ చోటూ లేకుండ చేసాయి. ఎంత విచిత్రం. ఆకాశం వంక చుసింది. “బలే బాగా జరిగింది పార్టీ!” అనుకుని మళ్ళీ ముందుకెళ్ళింది.

విశాలమైన రోడ్డు కొంచెం ఇరుకైంది. వాళ్ళ పెద్ద వీధి అంతమై ఒక చిన్న సందు మొదలైంది. ఆడవాళ్ళు షాల్ కప్పుకునీ, మగవాళ్ళు టోపీలు పెట్టుకునీ నడుచుకుంటూ పోతున్నారు. ఆ ఇళ్ళనించి చప్పుళ్ళూ వినొస్తున్నాయి. అక్కడక్కడా సన్నని వెల్తురు. లారాకి ఆ వీధిలో తన ఖరీదైన గౌను చూసుకొని కొంచెం సిగ్గనిపించింది. ఈ గౌను కనిపించకుండా  పైన ఒక కోటైనా తొడుక్కుని రావాల్సింది, అనుకుంది. దానికి తోడు పెద్ద సిల్కు రిబ్బను తో వున్న అందమైన తన టోపీ. అందరూ తననే వింతగా చూస్తున్నారేమో. అసలు ఇలా రావడమే తప్పేమో. పోనీ తిరిగి ఇంటికెళితే?

అంతలో ఆ ఇల్లు వచ్చేసింది. ఇక ఇప్పుడు వెనుదిరిగినా బాగుండదు. ఇదే ఇల్లు అయివుండాలి. బయట చిన్న గుంపు వుంది. లోపల చీకటిగా వుంది. గేటు పక్కనే ఒక ముసలావిడ కుర్చీలో కూర్చొనుంది. లారా దగ్గరకొచ్చేసరికి అందరూ మాటలాపేసారు. గుంపు కొంచెం పక్కకి జరిగి ఆమెకి చోటిచ్చారు.

లారాకి చాలా కంగారుగా వుంది. సిల్కు రిబ్బను ని పక్క జరుపుకుంటూ, పక్కనే వున్న ఆడమనిషితో, “స్కాట్ గారిల్లు ఇదేనా?” అని అడిగింది. ఆ మనిషి వింతగా నవ్వుతూ, “ఇదేనమ్మాయ్!” అంది.

త్వరగా ఈ బుట్ట ఇచ్చేసి ఇక్కణ్ణించి వెళ్ళిపోవాలి. భయంభయంగా దేవుణ్ణి తలచుకుంటూ లారా తలుపు దగ్గరికెళ్ళి తలుపు తట్టింది. తలుపు తెరుచుకుంది. నల్ల బట్టలతో దిగాలుగా వున్న స్త్రీ తొంగి చూసింది.

లారా తడబాటుతో అడిగింది, “స్కాట్ గారి భార్య మీరేనా?”

“లోపలికి రా అమ్మాయ్!” ఆవిడ వెనుదిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

“లేదు, లేదు. నేను లోపలికి రాను. అమ్మ ఈ బుట్ట ఆవిడకివ్వమంది.”

ఆవిడ విననట్టే లోపలికి వెళ్ళి, ఇంకో తలుపు దగ్గర ఆగి, “ఇలా లోపలికి రా అమ్మాయ్,” అంది. చేసేదేమీ లేక లారా లోపలికి అడుగుపెట్టింది. లోపల తనొచ్చిన గది వంటిల్లులా వుంది. చిన్న దీపం పొగచూరి వెలుగుతూంది. పక్కనే ఇంకొకావిడ కూర్చునుంది.

“ఎమిలీ! నీకొరకెవరో ఒక అమ్మాయి వచ్చింది,” చెప్పింది తలుపు తెరిచిన ఆవిడ. లారా వైపు తిరిగింది, “ఎమిలీ చెల్లెల్నండీ నేను! తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేకపోతుంది. మీరేమీ అనుకోవద్దండీ!”

“అయ్యొయ్యో! ఆవిడని చిరాకు పెట్టకండి. నేను వెళ్తున్నాను.” లారా కంగారుగా అంది.

ఇంతలో కూర్చున్నావిడ తిరిగి లారా వైపు అయోమయంగా చూసింది. ఆమె మొహమూ, కళ్ళు ఎర్రబడి, వాచి, చాలా అసహ్యంగా వుంది. ఆమెకేమీ అర్థమవుతున్నట్టు లెదు. లారా ఎవరు? తమ ఇంటికెందుకొచ్చింది? ఆమె కేమీ బోధపడుతున్నట్టులేదు.

“పోనీలే ఎమిలీ! నువ్వేమ మాట్లాడకు. నేను చూసుకుంటాను,” ఎమిలీ చెల్లెలంది. ఆమె మొహం కూడా ఏడ్చి ఏడ్చి ఉబ్బి వుంది.

“ఆమెని క్షమించమ్మా దయ చేసి,” ఇబ్బందిగా నవ్వుతూ లారాతో అంది. లారాకి అక్కణ్ణించి బయట పడటం తప్ప వేరే ఇంకే ఆలోచనలూ లేవు. మళ్ళీ తలుపు కేసి నడిచింది. ఇంకొక తెరిచి వున్న తలుపులోంచి వెళ్ళింది. అయితే ఆ తలుపు బయటికెళ్ళలేదు, కానీ ఇంకో గదిలోకి దారితీసింది. ఆమెకి ఆ గదిలోనే మృతుడి శవం వుందన్న సంగతి తెలిసేసరికే ఆలస్యమయింది.

“ఒక్క సారి శవాన్ని చూస్తావా అమ్మాయ్?” ఎమిలి చెల్లెలడిగింది. లారా భయంతో కొయ్యబారిపోయింది. “భయపడేందుకేమీ లేదమ్మాయ్, అలా పడుకుని నిద్ర పోతున్నట్టున్నాడు. రా చూద్దువు గాని.” లారా తొంగిచూసింది.

పేటికలో పడుకుని వున్నాడొక యువకుడు. హాయిగా కష్టాలనించి, సమస్యలనించీ, దూరంగా, శాంతిగా, కలలు కంటున్నట్టు- కళ్ళు మూసుకుని వున్నాడు. కాని ఆ కళ్ళు మరిక తెరుచుకోవు. ఇంకే కలలూ కనవు. విందులూ, మిగిలిపోయిన తినుబండారాలూ, అందమైన గౌనులూ, ఖరీదైన టోపీలూ వేటితోనూ అతనికి పనిలేదు. అన్నిటినుంచీ దూరంగా వెళ్ళిపోయాడు. తామంతా తోటలో పాటలు పాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతున్నప్పుడూ, అతను ఇలాగే వున్నాడు, శాంతిగా, సంతోషంగా. లారాకి ఏమనాలో అర్థం కాలేదు. “నా టోపీ చాలా అసహ్యంగా వుంది, నన్ను క్షమించండి,” అంది అసందర్భంగా. అంతే, అక్కణ్ణించి ఒక్క పరుగున ఇంటి బయటికొచ్చి పడింది. గుంపుని దాటుకుని గబగబా సందులోంచి నడిచింది. సందు చివర లేరీ ఎదురయ్యాడు.

“లారా? నువ్వేనా?”

“నేనే, లేరీ!”

“అమ్మయ్య! నీకోసం కంగారు పడి అమ్మ నన్ను పంపింది. ఏమయింది లారా? భయపడ్డావా?”

“అవును లేరీ!” అన్న చేయి గట్టిగా పట్టుకుంది లారా.

“ఏడుస్తున్నావా? ఏమయింది లారా?”

ఏమీ లేదన్నట్టు తల తిప్పింది లారా.

“ఏడవకు లారా? ఏమయింది? భయపడ్డావా?” అనునయంగా అడిగాడు అన్న.

“భయపడలేదు కానీ,” వెక్కుతూంది లారా.

“లేరీ, అసలు జీవితం……..” ఏమనాలో తోచలేదు. జీవితమంటే ఏమిటో ఆమె చెప్పలేకపోయింది. అన్నకి అర్థమైంది.

“అవును, కదా?” అన్నాడు.

  —–