వచ్చేవారం “వీలునామా” అనువాద నవల ప్రారంభం !

catherine helen spence

కేథరిన్ హెలెన్ స్పెన్స్

కేథెరీన్ హెలెన్ స్పెన్స్ (1825-1910)

ఆస్ట్రేలియా గురించి రాసిన మొదటి రచయిత్రీ, స్త్రీవాదీ, పాత్రికేయురాలూ, మత బోధకురాలూ అయిన కాథెరీన్ హెలెన్ స్పెన్స్ 1825 లో స్కాట్లాండ్ లో జన్మించారు. కేథరీన్ పద్నాలుగేళ్ళ వయసులో వున్నప్పుడు, బేంకరూ న్యాయవాదీ అయిన తండ్రి డేవిడ్ ఆస్తంతా పోగొట్టుకోగా, కట్టు బట్టల్తో కుటుంబమంతా దక్షిణ ఆస్ట్రేలియా చేరుకున్నారు. అడిలైడ్ మున్సిపల్ కౌన్సిల్ లో డేవిడ్ గుమాస్తాగా పనిచేసారట.

ఆస్ట్రేలియాకి చేరిన వెంటనే డబ్బున్న వారిళ్ళల్లో గవర్నెస్ గా పని చేసింది కేథరీన్. అటు పిమ్మట ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తూ, “క్లారా మారిసన్” అనే నవల రాసి ఆస్ట్రేలియా గురించి రాసిన మొదటి మహిళ అయింది.

తన సమకాలీన సాహిత్యంలో వచ్చే స్త్రీ పాత్రలని కేథరీన్ ఎంతగానో చీదరించుకునేది. అప్పట్లో ఇంగ్లండు నుంచి విడుదలయ్యే సాహిత్యమంతా అసూర్యంపశ్యలూ, అతి నాజూకైన వాళ్ళూ అయిన స్త్రీలతో నిండి వుండేది. జేన్ ఆస్టిన్ నవలా నాయికలనించి ఎమిలీ బ్రాంట్ వరకూ, అందరూ ప్రేమే లోకంగా జీవిస్తూ అందగాడైన హీరో కోసం ఎదురు చూసేవారే.

అలాంటి వ్యవస్థలో కేథరీన్ స్త్రీవాద రచనలూ, సమాజరీతికి విభిన్నంగా తమ కాళ్ళ మీద తామే నిలబడాలనుకునే స్త్రీ పాత్రల వల్ల ఆవిడ రచనలు వివాదాస్పదమయ్యాయి. “కుటుంబ వ్యవస్థని నిర్వీర్యం చేస్తాయనీ, సోషలిస్టు దృక్పథం ఎక్కువగా వుంటుందనీ” ఆవిడ రచనలు ఆవిడ బ్రతికుండగా ఎక్కువ ప్రాచుర్యం పొందలేదంటారు.  నిరుత్సాహపరచే ఎడిటర్లూ, ఏమాత్రం ప్రోత్సాహమివ్వకపోగా అనుమానంగా చూసే వ్యవస్థతో విసిగిపోయి ఆవిడ తనని తాను రచయిత్రిగా కంటే పాత్రికేయురాలిగా గౌరవించుకునేవారట.

దాదాపు ఏడెనిమిది నవలలు రాసి, పిమ్మట జీవితంలో పాత్రికేయురాలిగానే స్థిరపడ్డారు.

ఆస్ట్రేలియాలో స్త్రీలకు వోటు హక్కు కోసం పోరాటం నించి, నిరాశ్రయులైన పిల్లలకు సహాయం చేయడం వరకు, కేథరీన్ చాలా సామాజిక కార్య కలాపాల్లో పాల్గొంది. అడిలైడ్ లోని యూనిటేరియన్ చర్చిలో మత బోధకురాలిగా కూడా పని చేసారు.

రచనల్లో ఆవిడ అన్ని ప్రక్రియలూ ఉపయోగించారు. దిన పత్రికల్లో కథలూ, కవితలూ, బాల సాహిత్యం, రాజకీయ వ్యాసాలు, పుంకానుపుంఖాలుగా రాసేదావిడ. పత్రికల్లో రాజకీయ వ్యాసాలు మారు పేరుతో రాసేది. ఆవిడ మారు పేర్లతో రాసిన వ్యాసాల గురించి ఆస్ట్రేలియాలో చాలా పెద్ద యెత్తున పరిశోధనలే జరిగాయి.

అడిలైడ్ నగరంలో ఆవిడ స్మారక  చిహ్నాలు చాలానే వున్నాయి. యూనివర్సిటీల్లో, లైట్ స్క్వేర్ లో, స్టేట్ లైబ్రరీలో కేథరీన్ స్పెన్స్ భవనాలు చాలా వున్నాయి. ఆమె చిత్రాన్ని ఆస్ట్రేలియన్ అయిదు డాలర్ల నోటు పైన ముద్రించీ, 1975 లో విడుదలైన పోస్టేజీ స్టాంపు విడుదల చేసీ, ప్రభుత్వం ఆమెని గౌరవించింది. ఎనభై అయిదేళ్ళ వయసులో అవివాహితగానే మరణించింది ఆవిడ.

Mr.Hogarth’s will నవలలో ఆవిడ ఆనాడు ఆడవాళ్ళ దుస్థితినీ, పరాధీనతనీ నిర్మొహమాటంగా వివరించారు.

ధనవంతుడైన  ఎస్టేటు సొంతదారు  హొగార్త్.  భార్యా భిడ్డలు లేకుండానే మరణిస్తాడు. ఇద్దరు మేనకోడళ్ళున్నా, వారిని కట్టు బట్టలతో బయటికి పంపుతాడు. ఆడవాళ్ళు కేవలం గృహ సంబంధమైన పనులో,కుట్లూ, అల్లికలూ చేసుకొంటూనో డబ్బు సంపాదించాలే తప్ప, మగవారికి పోటి ఇచ్చే యే వృత్తీ ఎన్నుకోరాదన్నది అప్పటి బ్రిటిషు నాగరికత. అలాటి పరిస్థితిలో ఆ అమ్మాయిలు ఎలా నెగ్గుకొచ్చారన్నదే కథాంశం.

 (“వీలునామా”వచ్చేవారం  ప్రారంభం– అనువాదం- శారద)