మల్లీశ్వరి చూడలేని చేదు నిజం!

‘“ఒక ప్రాపంచిక దృక్పథం లేనప్పుడు మానవ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా, స్వేఛ్ఛగా వ్యక్తం చేయటం సాధ్యం కాదు. అలాంటి ప్రాపంచిక దృక్పథాన్ని సాధించనంత వరకు నవల (సాహిత్యం) కొత్త జీవితాన్ని పొందలేదు”.

-రాల్స్ ఫాక్స్ “నవల- ప్రజలు” (తెలుగుసేత-వల్లంపాటి వెంకటసుబ్బయ్య)

సమాజ జీవితం పట్ల అనేకులకు అనేక రకాల అవగాహన ఉంటుంది. శాస్త్రవేత్తలు, సామాన్యులు, కళాకారులు తమ అవగాహనను అభివ్యక్తం చేయడంలో బేధాలుంటాయి. చూచిన దానిని చెప్పటంలోనూ తేడాలుంటాయి. అందుకనే మామూలు సంభాషణకన్నా, వార్తకన్నా, సాహిత్య రచన భిన్నంగా వుంటుంది. అందువల్ల రచయితలు సమాజాన్ని చూడటంలోనే దృష్టి బేధాన్ని దానివల్ల వాళ్ళ సాహిత్య సృష్టిలో వచ్చే భేదాలను రచయితల సాహిత్యాన్ని పరిశీలించే ముందు తెలుసుకోవాల్సి వుంటుంది.

రచయితలు సమాజంలో భాగస్వాములు, సమిష్టి మానవ జీవితంలో వాళ్ళ అనుభవాలు కూడా వుంటాయి. రచయితలు వాళ్ళ సొంత లేదా వాళ్ళకు పరిచయమైన జీవితాన్ని రచనకు వస్తువుగా తీసుకుంటారు. అందులోని మంచి చెడులను విశ్లేషిస్తారు. పాఠకులను చెడుకు వ్యతిరేకంగా, మంచికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. చెడుకు చోటులేని ప్రత్యామ్నాయ సమాజాన్ని ప్రతిపాదిస్తారు. రచయితలు ఇంత పని చేయాలంటే ఒక దృక్పథం లేకుంటే సాధ్యం కాదు. సమాజ పరివర్తనలో రచయితలు క్రియాశీల సృజనాత్మక పాత్ర నిర్వహించడానికి వాళ్ళకు సహకరించేది వాళ్ళ ప్రాపంచిక దృక్పథమే. అయితే, అందరు రచయితల ప్రాపంచిక దృక్పథం ఒకటి కాకపోవచ్చు. అలానే అన్ని కాలాల ప్రాపంచిక దృక్పథమూ ఒకటి కాకపోవచ్చు. రచయిత నేపథ్యాన్ని బట్టి సమాజంలో ప్రచురంగా వుండే భావజాలాన్ని బట్టి రచయితల మీద సమాజ, ప్రభావాల్ని బట్టి ప్రాపంచిక దృక్పథం ఏర్పడుతుంది. రచయిత రచనకు పూనుకునే ముందు తన ప్రాపంచిక దృక్పథాన్ని నిర్ధారించుకొని రచన ప్రారంభిస్తాడు.

విమర్శకులు ఏ రచయితనైనా అధ్యయనం చేసేటప్పుడు మొదట ఆ రచయిత ప్రాపంచిక దృక్పథాన్ని పట్టుకుంటే తక్కిన సాహిత్యాంశాలు వాటంతట అవే విశదమైపోతాయి. విమర్శకులు ఈ పని చేయాలంటే విమర్శకులకే మొదట స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం వుండాలి. ఆధునిక సాహిత్య రంగంలోనూ, సాహిత్య విమర్శరంగంలోనూ ఈ కారణంగానే ప్రాపంచిక దృక్పథం ప్రధానాంశంగా వుంది. అయితే అనేక మంది విమర్శకులు ఈ ప్రధానాంశాన్ని ఇంకా జీర్ణం చేసుకొకుండానే విమర్శ రాస్తున్నందువల్ల గందరగోళం రాజ్యమేలుతోంది. విమర్శకుడు తమ ప్రాపంచిక దృక్పథమేమిటో స్పష్టంగా, నిర్ధిష్టంగా ఏర్పడక ముందే తమ అజ్ఞానాన్ని దాచుకొని, అరకొర కొలమానాలతో విమర్శకు పూనుకుంటే, నమ్మకంలేని వాటిని గురించి బలంగా మాట్లాడే ప్రమాదం వుంది. పైగా సాహిత్య విమర్శ అభివృద్ధి చెందలేదనే అభిప్రాయం కలుగుతుంది.

రచయిత సామాజిక చలన సూత్రాలను స్పష్టం చేసే పనిని నెత్తికెత్తుకున్నాడు. సంస్కర్తగా, జాతీయవాదిగా, అభ్యుదయ, విప్లవవాదిగా దిగంబరుడిగా, దళిత, స్త్రీ, మైనారిటీవాదిగా, ఆర్థిక, సాంఘీక, రాజకీయ, సాంస్కృతిక జీవిత వ్యాఖ్యాతగా మారాడు. రచయితలు గుర్తింపబడని శాసనకర్త అని ఒక నాడు మాథ్యూఆర్నాల్డ్ అన్నాడు గానీ ఇవాళ రచయితలు గుర్తింపబడిన శాసన కర్తల్లో ఒకడయ్యాడు. రచయిత దృష్టికి, రచయితలుకాని వారి దృష్టికి తప్పకుండా తేడా వుంటుంది. ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసిన, ఒక సామాజిక సంఘటనను చూసినా, ఒక సామాజిక పరిణామాన్ని పరిశీలించినా రచయిత దృష్టి నిశితంగా సృజనాత్మకంగా వుంటుంది. అయితే అందరి రచయితల దృష్టికోణం కూడా ఒకటే కాదు కనుక దృష్టి వైవిధ్యం కనిపించినా, దృష్టి వైచిత్రి మాత్రం అందరిలోనూ వుంటుంది. పారిశ్రామిక నాగరికత బలిసిపోయి మానవ సంబంధాలు కృత్రిమంగా తయారైన పాశ్చాత్య నాగరికత వల్ల ఎంతో మంది మానసికంగా ఆందోళన చెంది వుంటారు కానీ టి.ఎస్. ఇలియట్‍కు మాత్రమే అది ‘ఊసర క్షేత్రం’గా (waste land)గా కనిపించింది.

భారతీయ సామాజిక వ్యవస్థ, సంస్కృతులు విశ్వనాథ సత్యనారాయణకు వేయిపడగలుగా కనిపించాయి అదే వ్యవస్థ, అదే సంస్కృతి గుర్రం జాషువాకు నాల్గుపడగల నాగరాజుగా కనిపించాయి. విశ్వనాథ సత్యనారాయణ ’వేనరాజు నాటకానికి ప్రతిగా త్రిపురనేని రామస్వామి చౌదరి ’ఖూనీ’ నాటకం రాశారు. దృష్టి బేధమే ఇందుకు కారణం. సంప్రదాయవాదికి అమ్మ ’మాతృదేవోభవ’ అవుతుంది. స్త్రీవాదికి అమ్మ ’మండుతున్న పొయ్యిలా’ (విమల-వంటిల్లు) కనిపిస్తుంది. ఇంకాచెప్పాలంటే ’మసిగుడ్డ’గా(కుప్పిలి పద్మ) కనపడుతుంది. మరొకరి దృష్టికి ’త్రీ ఇన్ వన్‍గా’ (సి.సుజాత) కనపడుతుంది. అందువల్ల సాహిత్యాధ్యయనంలో రచయిత దృష్టి ప్రాపంచిక దృక్పథమంత ముఖ్యమైంది.

మామూలు మనిషి దృష్టి కన్నా రచయిత దృష్టి విశిష్టంగా వున్నప్పుడు రచయిత సృష్టి కూడా విశిష్టంగా వుంటుంది. మరి దాన్ని అందుకునే స్థాయి విమర్శకులకు కూడా అవసరం. మల్లీశ్వరి ఆ దృష్టి వైవిధ్యాన్నిఎంత బాగా అవగహన చేసుకుందో వర్తమాన కథకులైన గౌరు నాయుడు, అట్టాడ అప్పల నాయుడు కథల్ని తీసుకొని ఇద్దరినీ ఒకే గాట కట్టారు. గౌరునాయుడు ఆదర్శవాది, అప్పలనాయుడు విప్లవాచరణవాది. వాళ్ళిద్దరి కథా సాహిత్యాన్ని చదివిన సాధారణ పాఠకులకు సైతం ఇది అర్థమయ్యే విషయం. గౌరునాయుడికి గ్రామాలపట్ల, గ్రామీణప్రజలపట్ల, గ్రామీణవ్యవస్థపట్ల వర్తమానంలో చూస్తున్నదానిమీద వ్యతిరేకత వుంది. ఆవ్యతిరేకతతో ఒక ఆదర్శపూరిత గ్రామీణజీవనాన్ని ఆకాంక్షిస్తాడు. అదెలా సాధ్యమన్నది అతనికి పట్టని విషయం. ఇక సాధ్యాసాధ్యాల చర్చ వస్తే, అదే అతని కథలకు పరిమితి. సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో కూడా ఆయనకు వర్గాతీత భావన వుంది. కానీ అప్పలనాయుడు సమాజాన్ని భౌతికవాద దృష్టితో చూస్తాడు. సామాజికంగా జరిగే చలనాలను, ఘటనలకు వర్గదృక్పథం వుందని అతని కథలు చెబుతాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే, మార్క్సిస్ట్ దృష్టికోణమతనిది.

దాదాపు అతను కథారచన ఆరంభించిన ’పువ్వులకొరడా’ కాలం నుండి ఇప్పటి ’సంధిగ్ధాకాశం, వికృతి’ కథల వరకు సామాజికంగా, ప్రాకృతికంగా జరిగే అనేక మార్పులను, సంఘటనలను ఉత్తరాంధ్ర స్థానిక జీవితాన్ని నిర్ధిష్టంగా చిత్రించినా కొంచెంకొంచెం తేడాలతో, అన్ని ప్రాంతాల జీవితానుభవాల వ్యక్తీకరణ రూపాన్ని తన కథల్లో చిత్రించారు. ’క్షతగాత్రగానం’ (వంశధార కథలు-21ఫిబ్రవరి1999) ’షా’ (ప్రజాసాహితి నవంబర్ 2005) ఉత్తరాంధ్ర సామాజిక, సాంస్కృతిక ఆర్థిక పరిణామాలనేకాక తెలుగు నేల నాలుగు చెరుగుల విస్తరిస్తున్న సామ్రాజ్యవాద సాంస్కృతిక ప్రతిరూపాలుగా అలరారుతున్న నగరాలు మొదలుకొని పల్లెసీమల వరకు ఈ విషవలయంలోనే చిక్కుకున్నాయని నమ్మడం ఎంత వాస్తవమో అట్టాడఅప్పలనాయుడి కథలకు సార్వజనీన లక్షణం వుండడం కూడా అంతే వాస్తవం.

560804_290376897745258_1563925822_n’క్షతగాత్రగానం’ కథ గురించి మల్లీశ్వరి ’పెద్ద రైతు నేపధ్యంలో రాసినప్పటికీ వ్యవసాయ రంగంలోని ఫ్యూడల్, అర్థఫ్యూడల్ దోపిడీకి, వర్తమానంలోని పెట్టుబడిదారీ దోపిడీకి మధ్యనున్న తేడాగా మార్పుల్ని అర్థం చేస్తున్న కథ’ అన్నారు. నిజానికింతే కాదు ఇంకా అప్పటికి(1998) యెరుకలోకే రాని కార్పొరేట్ వ్యవసాయీకరణ ప్రవేశాన్ని చింత్రించిన కథ ఇది. ఈ అంశాన్ని గ్రహిస్తే, అది పెద్ద రైతుల పక్షాన మాత్రమే చెప్పిన కథగా కనిపించదు. ఈకథలోని రైతు పెద్ద రైతు కాదు. భూమి కోసం పడరాని పాట్లు పడి, తాతల తరం పొట్టచేతబట్టుకొని పరాయి దేశానికి(బర్మా) వలసపోయి, సంపాదించిన భూమిని, industrialized transformation జరిగిన తరవాతి తరం హరించేస్తుంది. దానికి కారణాలుగా రచయిత సామాజిక ఆర్థిక రాజకీయ భూమికలను కథలో అనేకచోట్ల చూపిస్తారు.

ఉదాహరణకు “వ్యవసాయంలో….వ్యాపార పంటలొచ్చాయి. షుగర్, జూట్ మిల్లు లొచ్చేయి. ఆ పంటల మార్కెట్ యెగుడూ దిగుళ్ళతో అప్పుల్తో మిగిలేరు”…
“పడమర దోవలో యెవరిదో మోడ్రన్ రైస్ మిల్లోకటి-పరాయిదేశ చక్రవర్తి స్థాపించిన విజయస్తంభంలా కన్పిస్తోంది. తూర్పుదారిలో-కాఫీ,టీ దుకాణాలు! కొత్తవీధి గుండా ఆటో-బలసిన పెనుమృగంలా నిల్చిన శంకర్రాజు ఎరువుల గోడాంని దాటింది. వీధులు, రోజ్ గార్ నిధుల కంకర రోడ్డుతో విశాలమయినట్లున్నాయి. వీధి మలుపులో “స్నోవైట్” కాన్వెంట్- చిలుకలను బొధించిన పంజరంలా వుంది!ఆటో ఆగిపోయింది”.(పే.నెం.282 అట్టాడ అప్పలనయుడు సాహిత్యం మొదటి సంపుటం కథలు కొన్ని 2013)

ఒకరకంగా, విద్యాసాగర్ గారి పుస్తకంలో ప్రతిపాదించిన విషయాలను, మల్లీశ్వరి వ్యాసాంతంలో చెప్పిన ’జీవితాలను అర్థంచేసుకొని అక్షరబద్ధం చేసిన బాధ్యతాయుత రచయిత’కథగా దీన్ని ఉదహరించవచ్చు. గానీ మల్లీశ్వరి….ఇందులో వైరుధ్యాన్ని ఇటీవలి కథల్లో అప్పలనాయుడుగారు అధిగమిస్తూ వస్తున్నారన్నారు. ఇందులోగల వైరుధ్యమేమిటో, దాన్ని ఆయన ఏకథల్లో ఎలా అధిగమించారో చెప్పలేదు. క్షతగాత్రగానం-మారిన గ్రామీణ పరిస్థితులను 1999 నాటికే ఎత్తిపట్టి చూపించిన గొప్పకథ. కార్పొరేట్ వ్యవసాయీకరణ, యాంత్రీకరణ, హైటెక్నాలజీ, కొత్తతరం జీవన విధానం, వారి ఆలోచనలు…….కోటేశ్వరరావు, పురుషోత్తం, భుక్త, ప్రవీణ్, తాత….సుభద్ర, పాలేరు…..అందరి జీవితాల్లోంచి విధ్వంసాలనెన్నింటినో చింత్రించిన కథ. పర ప్రాంత పెట్టుబడి, దాని విశ్వరూపం, అది నిర్ధిష్ట ప్రాంతపు రాజకీయ, ఆర్థిక రంగాలనెలా శాసిస్తుందన్న వస్తువుతో వచ్చిన కథ. ’షా’కథను మల్లీశ్వరి అర్థం చేసుకున్నట్టు……’పెట్టుబడి దారులందు స్థానిక పెట్టుబడిదారులుమేలయా’ అని కథలో ఎక్కడా రచయిత చెప్పలేదు. కథ కూడా అలాంటి భావనలకు ఎక్కడా ఊతమియ్యదు. ఈమె అపార్థంచేసుకుందనడానికి…..ఈ రెండు కథలపై ఆమె చేసిన వ్యాఖ్యానాలే ఉదాహరణలు.

పెట్టుబడిదారుల మధ్య వైరుధ్యముంటుంది. స్థానిక స్థానికేతర వైరుధ్యమది. ఆవైరంలో స్థానికులు ఓడిపోతారు. పెట్టుబడిని ఓడించేది, జనసమూహమే తప్ప వేరొకరుకాదన్నది ఈ కథ సారాంశం. ‘షా’ కథ పేరే దాన్ని సూచిస్తుంది. చదరంగం ఆటలో బంటుల్తో రాజును ముట్టడించటాన్నే ‘షా’ అంటారు. ఈ కథలో ముట్టడికి నాయకత్వం వహిస్తున్న రైతుకూలీ సంఘం నాయకుడు రైతుకూలీ సంఘం డిమాండ్లను స్థానిక పెట్టుబడి దారుడుగా ఎదిగిన శంభునాయుడు విని శభాష్ అనుకుంటాడు. శంభునాయుడి తండ్రి వ్యవసాయకూలీ ఉద్యమకారులతో పాటూ గొంతు కలుపుతాడు. కథలో ఎక్కడా స్థానిక పెట్టుబడిదార్ల మద్దతుగా వాక్యంగానీ, సంఘటనగానీ లేదు. అయితే మల్లీశ్వరి పొరబాటు ఎక్కడపడుంటుందంటే శంభునాయుని వైన్ షాప్‍లో పనిచేసే సేల్స్‍మేన్ తన అంతరంగం నుంచి శంభునాయుడి ఎదుగుదలని, బతుకు అవకాశాల్ని పాఠకులకు ఇలా వినిపించారు. ‘ఇతగాడంటే మోతుబరోడు…..తండ్రిని కాలవ భూముల ఊరిలో దించి, యితగాని పట్నంలో దిగేడు’. అని శంభు నాయుడి స్థానాన్ని అంచనా కడతాడు.

స్థానికులు స్థాపించిన మోడరన్‍రైస్‍మిల్లును, శంకర్రాజు ఎరువుల గోడౌన్‍ని ‘బలిసిన మృగంలా, స్నోవైట్ కాన్వెంట్‍ను చిలుకలను బంధించిన పంజరంతోనూ అప్పలనాయుడు పోల్చడం జరిగింది. మరి స్థానికులేర్పాటు చేసిన ఇంత చిన్న పెట్టుబడులను కూడా బహుళజాతి పారిశ్రామిక పెట్టుబడులకు ఉపయోగించాల్సిన ఉపమానాలనే ఎందుకు వాడారు? ఈ ఉపమానాల వాడకాన్ని బట్టి స్థానిక, స్థానికేతర పెట్టుబడుల వ్యత్యాసాలను పాటించినట్లుగా అనిపిస్తుందా మల్లీశ్వరి.

కథ ముగింపులో కూడా, నదీ జలాల వినియోగానికి సంబంధించిన డిమాండ్‍ను రైతు కూలీ సంఘం పెడుతోంది తప్ప స్థానిక పెట్టుబడిదారుడు కాదు. అసలు కథంతా స్థానిక పెట్టుబడిదారుడు. పరప్రాంత పెట్టుబడి పోటీలో ఓడిపోవడాన్ని సహించలేక, ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతాడు. అయినా వాళ్ళను ఎదిరించలేడు. వాళ్ళేదో ఎరగని ఆట ఆడుతున్నారనుకుంటాడు. ఆట కట్టించాలనుకుంటాడు కానీ కట్టించలేడు. కట్టించగలిగేది ప్రజాసమూహాలే అన్న పరిష్కారంతోనే ‘షా’ కథ ముగింపు ఉంది. ముగింపులో ఇంత స్పష్టంగా బోధపడుతుంటే, మల్లీశ్వరికెందుకు బోధపడలేదు చెప్మా!

‘కథంతటిలో కార్పొరేట్ పెట్టుబడి విశ్వరూపాన్ని చూపిన అప్పలనాయుడు దానిని ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని విశ్వసించారు. తమ ప్రాంతానికి చెందని ఏ పెట్టుబడినైనా వ్యతిరేకించటం కోసం స్థానికంగా వుండే అన్ని వర్గాలవారు కలిసి పనిచేయడాన్ని ఈ కథ ద్వారా ప్రతిపాదించారు.’ అని మల్లీశ్వరి అట్టాడచేసిన ప్రతిపాదనలుగా ప్రతిపాదించడం ఆమె అవగాహనాలేమిని తెలియజేస్తుంది. ఏదేశంలోనైనా, ఎప్పుడైనా, శ్రమజీవులే. పెట్టుబడిని, సామ్రాజ్యవాదాన్ని అడ్డుకుంటారు. ఓడిస్తారు. ఇది అనివార్యం.

అప్పలనాయుడు తన కథలో కిరణ్ పాత్రద్వారా ఈక్రమాన్ని చిత్రించారు తప్ప మల్లీశ్వరి ఆశించినట్లు, అర్థంచేసుకున్నట్లుగా, ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని చెప్పారె తప్ప, స్థానికవాద, ప్రాంతీయఉద్యమ ప్రబోధకంగా కథనం చేయలేదు. స్థానిక పెట్టుబడిని రక్షించుకోవాలి లేదా నిలుపుకోవాలనే ప్రయత్నం కథలో ఎక్కడా ప్రస్థావించలేదు. ఉద్యమించిన ప్రజలు శంభునాయున్నిగానీ, శంభునాయుని తండ్రినిగానీ పట్టించుకోలేదు. పెట్టుబడితో తమ పోరాటం తాము చేశారు. నాయకత్వ స్థానంలో నిలబడ్డారు. ప్రజలనాయకత్వాన్ని శంభునాయుడు మెచ్చుకుంటాడు, ఆశ్చర్యపోతాడు కూడా. అతని తండ్రికి మరోమార్గంలేక నాయకత్వం వెంట నడుస్తాడు. శంభునాయుడి తండ్రిది భూస్వామ్య మనస్తత్వం. తన రాజ్యంలో ప్రవేశించిన శత్రు సైన్యంలాగానే బహుళజాతి కంపెనీల వాహనాలను, వర్కర్స్ ను చూస్తాడు. మరి అతడు ప్రజాసంఘాల నాయకత్వంలోకి రావడానికి ప్రజా ఉద్యమాలపట్లగల మమేకత్వంతో కాదు.

స్వతహాగా భూస్వామికి స్థానిక ఉత్త్పత్తివనరులైన భూమి నదులపట్లగల ప్రేమతోనే. శంభు నాయుడు దూరమవుతున్న అతని మూలాల్ని గుర్తుచేస్తాడు. స్వతహాగా శంభునాయుడిది మోతుబర్ల కుటుంబం. అందుకే అతనిమూలాల్ని గుర్తుచేసే ఎరుకలో ఏమాయా మర్మం కనిపించలేదు. తననుతాను స్వఛ్చందంగానే ఆవిష్కరించుకుంటాడు. ఆ ఆవిష్కరణే శంభునాయుడ్ని తనతండ్రికి ప్రకృతి వనరులపట్లగల ప్రేమ అతన్ని ద్రవీభూతం చేస్తుంది. అతను తండ్రి ఆలోచనలపట్ల ఎప్పుడు? ఎందుకు? మూవ్ అవుతున్నాడు అన్న ప్రశ్న వేసుకుంటే, తన రాజకీయ జీవితానికి ముప్పు వాటిల్లిందనుకున్నప్పుడే శంభునాయుడు తండ్రిని గుర్తించగలుగుతున్నాడు, భూస్వామి మనస్తత్వం ,పెట్టుబడిదారీ మనస్తత్వాలలో కొద్దికొద్ది తేడాలున్నప్పటికి, ఇద్దరి లక్ష్యం ప్రజావ్యతిరేక పథాయే. అయితే, తమ ఉనికికే భంగం కలుగుతున్నప్పుడు శంభునాయుడు,అతని తండ్రిలాంటి వాళ్ళందరూ ప్రజాఉద్యమంలో కలవాల్సిన అనివార్యతను ‘షా’కథలో అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. అంతమాత్రంచేత అది ప్రజాపోరాటం కాకుండా పోదు. వీళ్ళందరూ తాత్కాలిక ప్రయోజనాల కోసం కలిసినంత మాత్రాన, అది సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం కాకుండాపోదు. అంతే తప్ప, ఒక ప్రాంతంలో వచ్చినంత మాత్రాన అది స్థానిక ఉద్యమం కాదు. ఏ ఉద్యమమైనా ఎక్కడో ఒకచోట మొదలుకాక తప్పదు. స్థానికత నుండే సార్వజనీనతను పొందుతుందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను. మరి అట్టాడ అప్పలనాయుడి కథల్లో మల్లీశ్వరి అస్థిత్వవాదమెందుకు తెచ్చిందో అర్థంకాదు.

ఈమే స్వయంగా పాలపిట్టమాసపత్రిక, ఆగస్టు, 2013. సంచికలో అట్టాడ అప్పలనాయుడుతో చేసిన ఇంటర్వ్యూలో కూడా రచయితను అస్థిత్వవాదంపై వేసిన ప్రశ్నకు జవాబుగా అట్టాడ ఇచ్చిన సమాధానంలో ఆయన ప్రాంతీయ, వర్గ దృక్పథాల పట్ల తనకుగల అభిప్రాయాలను స్పష్టీకరించిన దాన్ని అక్షరబద్ధం చేసింది. వాళ్ళ మాటల్లోనే గమనిద్దాం!

“వర్గచైతన్యం నుంచి ప్రాంతీయ అస్థిత్వవాదిగా మీ పరిణామం కేవలం సాహిత్య సంబంధమైనదేనా?” అనే ప్రశ్నకు అట్టాడ జవాబుగా, “నిజానికి మీరన్నట్లు నేను కేవలం ప్రాంతీయ అస్థిత్వవాదిని కాను. ప్రాంతీయ ప్రజాపొరాటాలనేవి రూపంలో అస్థిత్వ ఉద్యమాలలాగా కనిపిస్తాయిగానీ సారంలో అవి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు. అటువంటి ఉద్యమాలుగా అభివృద్ధి కాగలవు. ఆ భావనతోనే ప్రాంతీయ ఉద్యమాలను అర్థం చేసుకుంటాను. కనుక నిర్ధిష్ట ప్రాంతీయ పోరాటాలను అక్షరీకరిస్తున్నాను. వర్గచైతన్యానికి పోటీగానూ, ప్రత్యామ్నాయంగానూ ప్రాంతీయ అస్థిత్వాన్ని ఆహ్వానించటం లేదు. కాకపోతే వర్గ చైతన్యమనేది, నేడు అస్థిత్వ పోరాటాలను భూమికగా తీసుకొని అభివృద్ధి కావాలన్నది నాభావన.”

190291_290372241079057_1667688954_n

మల్లీశ్వరే స్వయంగా అట్టాడ అప్పలనాయుడి సమాధానాన్ని అక్షరాలా సాక్షీకరించింది. మరి ఈ సమాధానాన్ని ఎంతమాత్రం విని, రాసిందో లేక రాయించిందో కానీ మల్లీశ్వరి అట్టాడ అప్పలనాయుడ్ని ప్రాంతీయవాదిగా ముద్రవేసే విఫలయత్నం చేసింది.ఇలా తన అజ్ఞానాన్ని ‘వివిధ’ లాంటి ప్రతిష్టాత్మక సాహిత్య పేజీలో నలుగురితో పంచుకోవడమేకదా! దయచేసి ఇప్పుడైనా అప్పలనాయుడి ముఖచిత్రంతో వచ్చిన పాలపిట్ట ప్రత్యేక సంచికను మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మంచిది.

విద్యాసాగర్ ‘పల్లెను మింగిన పెట్టుబడి’ గ్రామీణ పరిశోధన గ్రంధం ఆధారంగా వర్తమాన కథను పరిశీలించదలచి, గౌరునాయుడు, అప్పలనాయుడుల రెండు కథలను మాత్రమే గ్రహించి, (తిరుగుడు గుమ్మి, నీటిముల్లు, ఒకరాత్రి రెండు స్వప్నాలు-గౌరునాయుడు; మమకారం, ప్రత్యామ్నాయం, భద్రయ్య, యజ్ఞం తరువాత- అప్పలనాయుడు కథలిన్ని ఉండగా)ఒకటి రెండు కథల్లో రచయిత దృక్పథాన్ని పోల్చడం, అంచనా కట్టగలగడం అంత సరైన పద్ధతీ కాదు. సాధ్యంకాదు. మల్లీశ్వరి ఈ వ్యాసాన్ని విద్యాసాగర్ పుస్తకాన్ని సమీక్షగా చేసుకొని తన వ్యాసాంతంలో రచయితల బాధ్యత గురించి, గ్రామాలలో మారిన పరిస్థితులను అర్థంచేసుకోవడానికి రచయితలు తప్పక చదవాల్సిన గ్రంధంగా చెప్పింటే ప్రయోజనముండేది. విద్యాసాగర్ అభిప్రాయాలకు- అప్పలనాయుడు, గౌరునాయుడు కథలకు గల సహజాత వైవిధ్యాన్ని ఒక లోపంగా, పొరపాటుగా చెప్పడం వలన అటు విద్యాసాగర్ పుస్తకానికీ న్యాయం జరగలేదు. ఇటు ఈ ఇద్దరి రచయితల కథలకు న్యాయం జరగలేదు. ఎందుకంటే, విద్యాసాగర్ పల్లెల్లోకి ప్రవేశించిన పెట్టుబడి విశ్వరూపాన్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా సేకరించిన గణాంకాలను ప్రచురించారు.

ఒకప్పటి పల్లెల్ని చూసిన అనుభవంలో నుంచి మాట్లాడుతున్న మేధో వ్యవసాయం చేసేవారికి, మారిన పల్లెల్ని చూడని వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ పరిశోధన గ్రంథం కళ్లు తెరిపిస్తుంది. అయినా, ఇది 2013సంవత్సరంలో వచ్చిన గ్రంథం. ఒక దశాబ్ధమున్నర ముందుగానే “క్షతగాత్రగానం”(1988) దానికి ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చిన ‘షా’ (2005)కథలు అప్పలనాయుడు రాశారు. విద్యాసాగర్ ప్రచురించిన గ్రామీణ ఆర్థికం ఈ పరిశోధన గ్రంథానికంటే ముందుగానే పల్లెల్లో అభివృద్ధిపేర కొనసాగుతున్న విధ్వంసాన్ని అట్టాడ తన కథల్లో చర్చనీయాంశం చేశారు. విద్యాసాగర్ పరిశోధించి ఆవిష్కరించిన సత్యాలను అట్టాడఅప్పలనాయుడు తన కథల్లో ఇంతకుముందే చిత్రీకరించారు. ఈ అంశాన్ని డా.మల్లీశ్వరి పరిశీలించలేకపోయారు. దృష్టిలోపమా? దృష్టికోణంలోనిలోపమా?.

– డా. కె. శ్రీదేవి

 అసోసియేట్ ప్రొఫెసర్

తెలుగు శాఖ

ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం .