రోజువారీ స్త్రీల జీవితం పై ఓ కొత్త చూపు సజయ ‘ ప్రవాహం’ !

pravaham1pravaham2ఈ నెల 19 న హైదరాబాద్ లో సజయ ‘ ప్రవాహం’ పుస్తకావిష్కరణ

ఈ పుస్తకానికి ముందుమాట రాయమని సజయ అడిగితే వెంటనే ఒప్పుకున్నాను. తనతో ఉన్న సాన్నిహిత్యం ఒక కారణమైతే, ఈ సంకలనంలోని వ్యాసాలు, వ్యాసాలలోని స్త్రీవాద రాజకీయాలతో నాకున్న సంబంధం రెండవదని నేననుకుంటున్నాను.

సజయతో పరిచయం అయి దాదాపు పాతిక సంవత్సరాలయిందనుకుంటా! ఏదో సమావేశంలో ఉపన్యాసాలన్నీ అయిన తర్వాత చర్చ జరుగుతున్న సందర్భంలో సజయ, రెండు నిముషాలు తన అభిప్రాయాల్ని అనుభవాల్ని పంచుకోవటం చూశాను. పక్కనున్న వాళ్ళని అడిగాను ఈ అమ్మాయెవరు అని. తర్వాత చాలా సార్లు సమావేశాల్లో సజయతో కలవటం జరిగేది. అన్వేషిలో నాతోపాటు మనరాష్ట్రంలోని పాతగ్రంథాలయాలన్నీ తిరిగి పంథొమ్మిదవ శతాబ్దం నుంచి వచ్చిన స్త్రీల పత్రికల్ని కాపీలు చేయించి అన్వేషి లైబ్రరీలో చేర్చే ప్రాజెక్టులో కలిసి పని చేసింది. భూమిక స్త్రీవాద పత్రికకు జన్మనిచ్చింది సజయ ఆలోచనలు, కృషీ అనే చెప్పాలి. మమ్మల్నందర్నీ చర్చల్లోకి దింపి, ఒక స్త్రీవాద పత్రిక మనకెంతో అవసరమైనదని అందర్నీ ఒప్పించి భూమిక ప్రారంభించటానికి కారకురాలు అయింది సజయ.

ఆ రోజుల్లో తను శంషాబాద్‌ వెళ్ళేదారిలో వున్న శివరాంపల్లిలో ఉండేది. రోజూ వెనక్కి ఆలస్యంగా వెళ్ళడం, బస్‌ ప్రయాణాలు, ఆ సమయంలో తనుపడ్డ బాధలే, బహుశ తనను ఈ అంశాల మీద వ్యాసాలు రాయటానికి పురికొల్పి ఉంటాయి. ఆ రోజుల్లో స్త్రీలని ఇబ్బందిపెట్టే డ్రైవర్లు, కండక్టర్ల తోటి తరచూ ఘర్షణ పడటం,  వాళ్ళు తననైనా తోటి స్త్రీలనైనా అవమానపరిస్తే, ఇబ్బంది పెడితే కొట్టటానికి సిద్ధమైపోవటం చాలాసార్లు జరిగింది. మేం వారించేవాళ్ళం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు బుద్ధిచెప్పటానికి ప్రయత్నిస్తే, పరిస్థితులు మనకు ఎదురు తిరుగుతాయేమోనని, జాగ్రత్తగా ఉండమని.

అందరితో పరిచయాలు, నచ్చిన వాళ్ళతో స్నేహాలు, నచ్చని వాళ్ళతో నిర్మొహమాటంగా వాదనలు ఘర్షణలు`ఇవన్నీ కలిపితే సజయ అవుతుంది. అన్నీ సమర్థించుకుని రాగలిగే వ్యక్తి తను. ఎంతో మందికి అవసరాలకు అండగా ఉండే తత్వం. ఇదీ క్లుప్తంగా సజయ.

ఇక ఈ సంకలనం గురించి. ఇందులోని స్త్రీవాద రాజకీయాల గురించీ, స్త్రీవాద దృక్పథంలో మన జీవితాల్ని, సమాజాన్ని చూడాల్సిన అవసరం గురించీ ఇంతవరకూ మన దగ్గర కావల్సినంత చర్చ జరగలేదనే చెప్పాలి. ఒక సంవత్సరంపాటు ‘వార్త’ దినపత్రికలో కాలమ్‌గా రాసిన వ్యాసాలనన్నింటినీ ఒక చోట కూర్చిన ఈ ‘‘ప్రవాహం’’ సంకలనంలో మనం అటువంటి చర్చలకనుకూలించే సందర్భాల్ని చూస్తాం. ఇందులో యాభై చిరువ్యాసాలున్నాయి. వాటిని సుమారుగా ఏడెనిమిది భాగాలుగా విడదీసి చూడచ్చనిపిస్తుంది. స్త్రీవాద రచనల్లో, పుస్తకాల్లో తరచూ   కనిపించే అంశాలు, ఉదాహరణకి`స్త్రీల ఉద్యమ చరిత్ర, లైంగిక నిర్బంధాలు, దౌర్జన్యాలు, కుల రాజకీయాలు, ఎన్నికల రాజకీయాలవంటివి కొన్ని ఉంటే, ఇంకొన్ని వివిధరకాలైన విషయాల్ని పాఠకులకి పరిచయం చేసేవిగా ఉన్నాయి. అవి పుస్తకాలు, సినిమాలే కాకుండా చాలా ఆసక్తికరమైన చర్చలతో చిత్రలేఖనాలు (లక్ష్మణ్‌ ఏలే వంటి చిత్రకారులు) నృత్యనాటకాలు (అస్మిత ప్రదర్శించినది) వంటి అంశాలను పరిచయం చేసేవి, ఎంతో మందికి మంచి స్నేహితుడనిపించుకున్న హసన్‌ గురించి ‘‘వెలుగుతున్న జ్ఞాపకం’’ చదివితే ఆయన జీవితం, ఆయన ఇంటి వాతావరణం కళ్ళకి కట్టినట్లుగా సజయ చిత్రించటం మన మనస్సుల్ని స్పృశిస్తుంది. ఎవరికీ అంతగా పరిచయం లేని మహాభారతంలో మాధవి పాత్రను మనకు పరిచయం చేయటం కూడా సజయ చాలా ఆలోచించి చేసిన పనే అనటంలో సందేహం లేదు. ఇక హిందూసుందరి లాంటి పంథొమ్మిదో శతాబ్దం పత్రికల్ని పాఠకులకి పరిచయం చేయటం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

నాకు అన్నింటికంటే నచ్చినవ్యాసాలు కొన్ని ఉన్నాయని చెప్పాలి. ప్రయాణాల్లో`బస్సుల్లో, రైళ్ళల్లో, బయట ప్రదేశాల్లో మనం ఎదుర్కొనే ఇబ్బందులు, సమస్యల గురించి ఉన్న వ్యాసాలు అవి. మరుగు దొడ్లు సౌకర్యాలు లేని ప్రదేశాల్లో స్త్రీల అవస్థలు, ప్రయాణాల్లో తోటి ప్రయాణికులతో (మొగవాళ్ళతో) పడే ఇబ్బందులు, అవమానాల గురించి, ఇంకా వివరంగా రాస్తే బాగుండేది కదా అని అన్పించేంత సూటిగా నిర్మొహమాటంగా నిలదీసినట్లు రాసిన వ్యాసాలు. స్త్రీవాద రాజకీయాల మీద ఎన్ని రచనలొచ్చినా ఇటువంటి కంటికి కనిపించని అసౌకర్యాలు, ఇబ్బందులు, అవమానాల గురించి మనం ఇంకా చాలా రాయాల్సిన చర్చించాల్సిన అవసరం   ఉంది. ఒకటో అరో కవితలు, పాటలు ఉన్నా లోతుల్లోకి వెళ్ళి విషయాల్ని పరిశీలించిన స్త్రీవాద రచనలు  మనకు లేవనే చెప్పాలి. వ్యాసాల్లో సూటితనంతో విషయాన్ని తమాషాగా హాస్యభరితంగా చెప్పి బలహీన పరచకుండా, పాఠకుల్ని, సభ్య ప్రపంచాన్ని ప్రభుత్వాన్ని నిలదీసినట్లుంటాయి సజయ రచనలు.

కల్చరల్‌`పాలిటిక్స్‌ అనే అంశానికి సంబంధించిన రచనలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా వస్తుంటే మనదేశంలో కొంతవరకు ఆ పని జరిగినా, చాలావరకు అది ఇంగ్లీషులోనే జరిగిందని చెప్పాలి. సంస్కృతి రాజకీయాల గురించి స్త్రీవాద దృక్పథంతో వచ్చిన రచనలనే నేను ప్రస్తావించేది. అంటే దైనందిన జీవితంలో స్త్రీలున్న ప్రతిచోటా కనిపించే సూక్ష్మ స్థాయి రాజకీయాల గురించి, అవి స్త్రీశరీరం గురించిన ప్రకటనలు కావచ్చు, రజస్వల అయినప్పటి బాధల గురించి కావచ్చు,  ఇంటి చాకిరీ గురించి కావచ్చు. ఇవన్నీ పరిశీలించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సజయ వ్యాసాలన్నింటిలో ఈ అంశాల గురించి చర్చలే నాకు చాలా విలువైనవి అని చెప్పదల్చుకున్నాను.అయితే ఇందులోని వ్యాసాలు విషయాన్ని తడిమి వదిలేసి నట్లుంటాయనిపిస్తుంది. దానికి కారణం కాలమ్‌ రాయటంలో ఉన్న పరిమితులు మాత్రమే. అందుకే ఈ విషయాల గురించి ఇంకా లోతైన చర్చలతో, వ్యాసాలు, పుస్తకాలు సజయ దగ్గరనుంచి వస్తాయని నాకు నమ్మకం.

( సజయ వ్యాస సంకలనం ‘ ప్రవాహం’ కు కె. లలిత రాసిన ముందు మాట ఇది)