
Art: Rajasekhar chandram
ఒక్కో సారంతే
గుండెలమీద గుసగుసగా తగలాల్సిన శ్వాస
ఉన్నట్టుండి బుసకొడుతుంది
కన్రెప్పలకు కత్తులు మొలుచుకొస్తాయి
నాలుక నాగుపాము అవుతుంది
మాట ఇపుడు
మనస్సరస్సు లోంచి ఎగిరే చేపపిల్ల కాదు
కల్లోల కడలిలోంచి ఎగిసి దుమికే తిమింగళం
ఒక్కోసారంతే
విషపు పెదవులను ముద్దాడినట్టుగా
రేగు పొదతో సమాగమంలా
అబద్ధం అంత అసహ్యంగా
అబద్ధాన్ని నిజం చేయడమంత నీచంగా
ఒక్కోసారంతే
ఎవరో విసిరిన పాచికతో
పరాయి ఆటలో పావులవుతాం
హఠాత్తుగా మొలుచుకొచ్చిన గోడల మధ్య
ఆత్మలు నలిగిపోతూ ఉంటే
కచ్చగా పౌల్ ఫౌల్ అని అరుస్తూ ఉంటాం
అరుపుకు ఆర్తనాదానికి మధ్య అభేదమై విలవిల్లాడుతూ ఉంటాం
ఒక్కోసారంతే
*
తాజా కామెంట్లు