హృదయము సుమ్మీ!  

myspace

ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో

చిక్కటి చీకటిలో కలిసిపోయిన కొత్త సమాధి. దాని మీద దాదాపు ఆరిపోడానికి సిద్ధంగా వున్న ఆముదపు దీపం వెలుగు పడుతోంది. నూనె పూర్తిగా అయిపోయినా కూడా మిణుగురు పురుగులాగా వెలుగుతూ ఆరుతూ వుంది. దానిని దీపమమని ఎలా అంటాం?
మరి, శ్మశానంలో పెనుచీకట్లలో చిక్కుకుని వెలుగుతున్నది ఏమిటి?

అది, పుట్టిన కొద్ది రోజులకే గిట్టిన బిడ్డను చూసి గుండెచెదిరిన ఓ దిక్కులేని తల్లిది. ఆ చిట్టి సమాధి చెంతనే హృదయం వదిలి పెట్టిపోయింది. ఆమె ప్రాణం అక్కడే కొట్టుమిట్టాడూతూ వుంది. బహుశా, కన్నపేగుకోసం అల్లాడి పోతూ కొడిగట్టుతోంది.

***

ఇది గుర్రం జాషువ గారి ‘శ్మశాన వాటి’ పద్య ఖండిక లోనిది. ఇందులో కేవలం తొమ్మిది పద్యాల్లో ఇదొకటి. ఈ తొమ్మిదిలో కనీసం రెండు (ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….) వినని గ్రామస్తులెవరూ వుండరు. బహుశా , కొన్ని లక్షలమందికి ఈ పద్యాలు కంఠతా ఉంటాయి.

***

ఎంత గొప్పటి పద్యం! తన బాణానికి ఒరిగిన పక్షి పక్కన రోధించిన సహచరుని బాధను వాల్మీకి పట్టుకున్నట్టు , జాషువ పట్టుకున్నాడు. బిడ్డల్ని కోల్పోయిన తల్లుల వేదనని ఎంత గొప్పగా చెప్పేడు! ఎంత సహానుభూతి చెందక పొతే  అంత గొప్పటి expression వస్తుంది!

ఈమధ్య ఈ ‘కాటిసీను’ పద్యాలున్న యూట్యూబ్ లింక్ ని మిత్రుడు పల్లంరాజు గారు షేర్ చేస్తే విన్నాను ఎన్నో ఏళ్ల తర్వాత.

అరుణోదయ రామారావు ఎక్కడ, ఎప్పుడు కనబడినా పద్యాలు పాడించుకోవడం అలవాటైనా అయినా అప్పటి ఆర్టిస్ట్ పాడగా వినడం ఎన్నో ఏళ్లయింది. ఓ నెల రోజులుగా ఈ లింక్ లోని పద్యాలు మళ్ళీ మళ్ళీ వింటున్నా. కాకతాళీయంగా జాషువ గారి రచనల్ని మళ్ళీ చదువుతుండటం వల్ల ఈ పద్యాల్లో కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి. జాషువ శైలి, వస్తు వైశాల్యం, సూక్ష్మ దృష్టి అచ్చెరువు కలిగిస్తున్నాయి.

ఈ పద్యాల్ని కొన్ని వందల సార్లు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. పండుగలప్పుడు, ముఖ్యంగా శివరాత్రికి, అమ్మ తల్లుల పండగలకి — సత్య హరిశ్చంద్ర నాటకం తప్పని సరి. నాటకం వేయించకపోతే ఊరికి పరువుతక్కువ. కాబట్టి ఎలాగో ఒకలా డబ్బులు వసూలు చేసి వేయించేవారు.

అన్ని గ్రామాల్లో వలెనే  హీరమండలం (శ్రీకాకుళం జిల్లా)లో కూడా వేసేవారు – సంవత్సరానికి ఒకటీ లేదా రెండుసార్లు. దీంతో   పాటు రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం లాటివి వేసినా ‘హరిశ్చంద్ర ‘ నాటకం, అందులోనూ ‘కాటి సీను’ చాలా పాపులర్. హరిశ్చంద్ర లోని మిగతా ఘట్టాలు బలిజేపల్లి వారివి అయినా, ఏ నాటక కంపెనీ అయినా కాటి సీను లో మాత్రం  జాషువ పద్యాలు ఉండాల్సిందే . ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….ఈ పద్యాలు రెండు మూడుసార్లు పడాల్సిందే.

రిహార్సలప్పుడూ , నాటకం వేస్తున్నపుడూ రాత్రంతా పొలం గట్ల మీద కూచుని ఈ నాటకం చూడడం, చాంతాడంత రాగాలు తీస్తూ పద్యాలు పాడడం ఇంకా జ్ఞాపకాల్లో తాజాగా వున్నాయి. నాటకంలో సందర్భం బట్టి , మూడ్ బట్టి రాగం పొడవు , కంఠ స్వరం ఆరోహణావరోహణలు ఉండేవి. కోపాన్ని, కరుణని, ప్రేమని , దర్పాన్ని — అన్ని భావనలని రాగాలతోనూ , పద్యాల్లోని పదాలను పలకడం ద్వారానూ చాలా గొప్పగా పలికించేవారు.

ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప ట్రాజెడీ, హరిశ్చంద్ర. సత్యంకోసం మనుషులు ఎన్ని కష్టాలు భరించి నిలబడతారో చూపిస్తుంది. కాటి సీనులో నాటకం లోని సంఘటనలు పతాక స్థాయికి వస్తాయి. కీలకమైన ఘట్టానికి జాషువ రాసిన పద్యాలు గొప్ప బలాన్ని తీసుకువచ్చాయి . బహుశ , జాషువ తప్ప ఇంకెవ్వరూ అంత బాగా రాయగలిగి ఉండేవారు .

తొమ్మిది పద్యాల్లోనే పేద-ధనిక బేధాలు, అసహజ మరణాలు కలిగించే వేదనలు, కాటిని కూడా వదలని చట్టాలు — ఎన్నో విషయాల్ని తీసుకువస్తారు. బిడ్డలకోసం ఎన్ని వేలమంది తల్లులు “అల్లాడి, అల్లాడి” పోయారో అని అంటాడు. ఎంత వేదన పడిఉంటారంటే , వాళ్ళ రోధన విని కన్నీళ్ళలో రాళ్లు కూడా కరిగిపోయాయంటాడు.

దిక్కూ మొక్కూ లేని వాళ్ళకోసం ఏడ్చే వాళ్ళు సమాజంలో ఎవరూ లేరని విమర్శిస్తాడు. అందుకే, అర్ధరాత్రి పూట ఎవరితోడూ లేకుండా నిస్సహాయురాలై వచ్చిన హంసనారి (చంద్రమతి) దైన్యాన్ని చూసి కరిగిపోతాడు. ఎందుకట్లా ఏడ్చి ఏడ్చి బాధపడతావు, కొంచెం తెరిపినపడు అని ఓదారుస్తాడు.

అప్పుడు, రాస్తాడు ‘ముదురు తమస్సులో …’ పద్యాన్ని. పసిపాపని కోల్పోయిన తల్లి వేదనని చెప్పడం మాత్రమే కాదు, నాటకంలో కొద్ది సేపట్లో తాను, తన  సహచరి ఎదుర్కోబోయే విపత్తును సూచన ప్రాయంగా చెప్పడానికి ఒక సాకు. లోహితాస్యుడి మరణాన్ని, అది విని చంద్రమతి ఎంతగా దుఃఖిస్తుందో చెప్పడం జాషువ ఉద్దేశం.
ఆసక్తి వున్నవాళ్లు ఆ పద్యాలు ఇక్కడ వినొచ్ఛు.

ఈ పద్యంలోని ఉదహరించినట్టు, సమాధులమీద దివ్వెలుగా వెలుగుతున్నహృదయాలు హంసనారిదో,  చంద్రమతిదో, Alan Kurdi తల్లిదో, మాయమైన కొడుకు గురించి అల్లాడిన ‘హజార్ చౌరాషిర్ మా’ దో. లేక ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధరంగాల్లో ఒరుగుతున్న వేలమంది పిల్లల తల్లులవో.
అది, అలాటి వ్యధలననుభవిస్తున్న తల్లుల వేదన పట్ల సహానుభూతి చెందిన జాషువాది.

అది హృదయమ్ము సుమ్మీ!

 

 

కబాలి గురించి ఎందుకు మాట్లాడాలంటే….

 myspace
    ఇప్పుడే ఓ మిత్రుడు ఫోన్ చేసేడు, “కమర్షియల్” సినిమా గురించి నువ్వు రాయడాన్ని (నా బ్లాగ్ పోస్టు చూసి) ఎవరో తప్పు పట్టేరని చెప్పేడు.
  నేను చెప్పేను, నా ఫ్రెండ్ కి, కబాలి గురించి ఎందుకు రాసేనో. సినిమా చూసివచ్చిన వెంటనే నా అభిప్రాయం చెప్పాలనిపించి అక్కడ కొంచెమే రాసేను. ఇంకొంచెం వివరంగా ఇక్కడ.
  దాదాపు పదేళ్ళ క్రితం నేను మలేసియా వెళ్ళేను, ఆఫీసు పనిమీద. కౌలాలంపూర్, పెనాంగ్ ప్రాంతాల్లో తిరిగేను వార్తల కోసం. మిత్రులతో కలిసి ఈ రెండు ప్రాంతాల్లోని తమిళులను కూడా కలిసేను. హోటళ్లలో, చిన్న చిన్న షాపుల్లో, కొన్ని బస్తీల్లో వున్న ఇండియన్లతో (అంటే, ప్రధానంగా తమిళులతో) మాట్లాడేను.
   మొట్టమొదటి సారిగా కబాలీశ్వరన్ గురించి నేను విన్నది అప్పుడే. అక్కడ వున్న తమిళులకు ఆయన ఒక ఫోక్ హీరో అని అర్ధం అయింది. వందల ఏళ్ల క్రితం అక్కడికి వెళ్లి సెటిలై, ఆ దేశవాసులైన తమిళులకు ఆయన ఓ ముఖ్యమైన నాయకుడు. అంతకంటే ఆ తర్వాత ఆయన గురించి విన్నాలేదు. ఆయన రాజకీయాలు, నడిపిన మాఫియాల గురించి తెలీదు. తెలుసుకోవాలని ప్రయ్నత్నించిందీ లేదు.
   అప్పటికే కమర్షియల్ హీరోగా పేరు సంపాదించిన రజనీకాంత్ సినిమా ‘శివాజీ’ కూడా అప్పుడే రిలీజ్ అయింది. ఆ సినిమా చూడడం కోసం అక్కడ బారులుతీరిన జనాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.   ఆయన ప్రధానంగా, తమిళనాడు నుంచి ఉద్యోగాలకోసం, చిరుద్యోగాలకోసం 1947 తర్వాత వలస వెళ్లిన వాళ్లకు (సినీ) హీరో.
   రజనీకాంత్ కబాలీశ్వరన్ పాత్ర చేస్తున్నాడంటే నాకు అందుకే పెద్ద ఆశ్చర్యం కలగలేదు. కబాలీశ్వరన్, రజనీకాంత్ — ఇద్దరూ అక్కడ పాపులరే.  రెండు పాపులర్ ఇమేజెస్ కలిస్తే హిట్టవుతుందనేది నిర్మాతల లెక్క.
  రజనీకాంత్ కి కబాలి మార్కెట్ విలువ తెలుసు. అటు డయాస్పోరా మార్కెట్, ఇటు దేశంలో అసలు మార్కెట్. దళితుడైన పా. రంజిత్ కు రజనీకాంత్ లాటి కమర్షియల్ హీరో, దేశం కాని దేశంలో అణచివేతకు గురైన తమిళులవైపు నిలుచున్న కబాలి పాత్ర వేస్తే విషయం నలుగురికీ చెప్పవచ్చుకున్నాడు.
  కబాలి గురించి రంజిత్ పరిశోధన బాగా చేసేడు. ఇది నేను చెప్పిన మాట కాదు. కబాలి సినిమా గురించి మలేసియా తమిళుల వైపునుంచి ‘కౌలాలంపూర్ పోస్ట్ లో విశ్లేషించిన విసిత్ర మాణికం రాసేరు. కబాలి సినిమా గురించి మనకి ఎందుకు అని అనేవాళ్ళందరూ తప్పక చదవాల్సిన వ్యాసమిది.
సినిమా చూసేముందు — ముఖ్యంగా మలేసియాకి బయట వున్నవాళ్లు — చదివితీరాలని ఆమె అంటుంది. ఈవ్యాసం చదవక ముందొక సారి (తెలుగు వెర్షన్), చదివిన తర్వాత ఒకసారి (తమిళ వెర్షన్) చూసిన కొలీగ్ చెప్తోంది — ఎంతగా కెనెక్ట్ అయిందో.
  కబాలి పాత్రని అడ్డం పెట్టుకుని పా. రంజిత్ ఎంత గొప్పగా మలేసియా తమిళుల (ముఖ్యంగా మలేసియా దేశ వాసులైపోయిన తమిళుల) జీవితాన్ని చిత్రీకరించాడో ఆమె చెప్తుంది. ఉద్యోగాల్లో, సమాజంలో మైనారిటీలైన తమిళులు అనుభవించిన, అనుభవిస్తున్న వివక్షని దర్శకుడు గొప్పగా పెట్టుకున్నాడని చెప్తుంది.
 ఓ వంద, రెండొందల సంవత్సరాల తమిళుల వ్యథాభరిత జీవితంలోని కొన్ని భాగాల్ని తీసుకుని కథ రాసుకున్నాడని ఆమె అంటుంది. సరిగ్గా ఇంతే కాలంలో దళితులు అనుభవించిన అవమానాలపై, దాష్టీకాలపై సత్యనారాయణ గారు రాసిన ‘మా నాన్న బాలయ్య’ పుస్తకంతో రంజిత్ అందుకే కనెక్ట్ అయ్యాడు.
     ఆఖరికి, సినిమా ముగిసేక కబాలీని కాల్చడానికి వఛ్చిన ‘టైగర్’ కూడా ఎంత రియలిస్టిక్ పాత్రో ఆమె రాస్తుంది.
   మలేసియా జనాభాలో ఏడు శాతం మాత్రం వున్న, అట్టడుగున వున్న ప్రజల (పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చేవాళ్లు కాదు) గురించిన కథ ఇది. స్కోప్ చిన్నదే కావచ్చు. కానీ, ఇది మెయిన్ స్ట్రీమ్ సినిమా కథా వస్తువు కావడం, కథకు ప్రొటాగనిస్ట్ రజనీకాంత్ కావడం విశేషం.
  రజనీకాంత్ సినిమా ఇలా ఎందుకుంది, దీనికన్నా బ్రహ్మోత్సవం బెటర్ అని, బోయపాటి శ్రీను, వినాయక్  లాటి వాళ్ళు రజనీకాంత్ కి ఓ గొప్పహిట్ ఇచ్చి ఉండేవారని రాసేవాళ్ళు తప్పక చదవాల్సిన వ్యాసమిది. (బోయపాటి, వినాయక్ ఎలా తీసి వుండేవాళ్ళు? కబాలీలో ‘కెవ్వుకేక’ లాటి పాట పెట్టివుండేవాళ్ళు. ఓ అరవై సుమోల్ని ఎగిరించి పేలించి వుండేవాళ్ళు.)
 పా. రంజిత్ కాని, రజనీకాంత్ కాని — They are limited by the character. ఈ సంగతి అర్ధం చేసుకోకపోతే ఈ సినిమా ఓ ‘రోబో’ లాగో, ‘శివాజీ’లాగో, లేకపోతే ‘బాషా’లాటి ఓ గాంగ్ స్టర్ సినిమాలా లేదని అనిపిస్తుంది.
  ఆ మూసలోకి వెళ్లకుండా పా. రంజిత్ ఎంత కష్టపడ్డాడో సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. సూపర్ మేన్, బేట్  మేన్, స్పైడర్ మేన్, టార్జాన్ – అన్ని సూపర్ హీరోల కంటే ఎక్కువ శక్తివంతుడైన రజనీకాంత్ కాదు ఈ సినిమాలో వున్నది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర అంతకంటే ఎక్కువ నిడివివున్న, లోతువున్న రక్తమాంసాలతో ప్రజలమధ్య తిరిగిన ఓ నాయకుడు, ఓ డాన్. అందుకే, రజనీ గిమ్మిక్కులకు ఈ సినిమాలో చోటులేదు. ఆ సంగతి రంజిత్ ముందుగానే చెప్పేడు.
  పా. రంజిత్ ట్విట్టర్ id @beemji . ఇది సరిపోతుంది, ఆయన కబాలి పాత్రని ఎలా చూపించదలుచుకున్నాడో. అందుకే, ‘కబాలి’ మా నాన్న బాలయ్య’ పుస్తకం పట్టుకుంటాడు. నల్ల రంగు మీద వున్న వివక్షగురించి మాట్లాడగలుగుతాడు.సూటు, బూటు ఎందుకువేసుకోవాలో మాట్లాడతాడు. వ్యవస్థీకృతమైన హింసని, అందులో భాగమై, అలాటి పరికరాలతోనే ఎదిరించాలనుకున్నాడు కబాలి. ఇది సరైన పరిష్కారం కాదని, ఈ పోరాటాలకి శాస్త్రీయమైన రాజకీయ దృక్పథం తోడవకపోతే అవి నిలవవన్నది వేరే చర్చ. కానీ, ఈ సినిమా కథ ప్రధానంగా కబాలి జీవితంనుంచి తీసుకున్నది. అది దాని పరిమితి.
  ఈ నేపథ్యంతో చూడకకుండా, బాషాలాగా, సుల్తాన్ లాగా, లేకపోతే ఇంకో బ్లాక్ బస్టర్ సినిమాలాగా, లేకపోతే వాటికి మించిన సినిమాలాగా ఉంటుందని ఊహించుకుని, అలా లేదని సినిమాని write off చెయ్యడం ఏం న్యాయం.
  సినిమాలో ‘మాయానది’ పాట, దాన్ని చిత్రీకరించిన విధానం గొప్పగా వుంది. రాధికా ఆప్టే హుందా నటన చాలా బాగుంది.
   అందరికీ సినిమా నచ్చాలనేం లేదు. ఇంకా బాగా తీసివుండొచ్చని కూడా అనొచ్చు.  కానీ, బయో పిక్ లను చూసే విధానం ఇది కాదేమో?
(కబాలి సినిమా చూసొచ్చేక రాసిన చిన్న బ్లాగ్ పీస్: http://kv-kurmanath.blogspot.in/2016/07/blog-post.html)
*

కాళ్ళూ చేతులూ లేని కవిత్వం…

 

గురూగారు పతంజలి  చనిపోయి మరో సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు ఆయన మన సామూహిక జ్ఞాపకంలో అపురూపమైన భాగమైపోయారు. ‘నలుగురు కూచుని నవ్వే వేళల’ మాత్రమే కాదు, నలుగురు కూచుని రోధించే వేళ, కుట్రదారులైన పాలకులపై కుపితులైన వేళ పతంజలి గారు గుర్తుకువస్తారు.

ప్రజాస్వామ్యం నగుబాటైన, అవుతున్న సందర్భాల్లో, మెజారిటీ మత దాష్టీకాలు పెచ్చరిల్లుతున్న సందర్భాల్లో పతంజలి గారు గుర్తుకు వస్తారు.
పతంజలి గారు ఏ పదమూ, ఏ వాక్యమూ నిద్రపోయినట్టు వుండదు. నీరసంతో, ఉదాసీనతతో జీవచ్ఛవం లా వుండదు. పతంజలి గారి పదాలు, వాక్యాలు కరెంటు తీగల్లాగా వుంటాయి. అవి కల్లోలాలని చిత్రించే గొప్ప చిత్రకారుడి చేతులు. అవి ముడి జీవితాన్ని ప్రేమించిన అక్షరాలు.
జీవితమే కాదు దాన్ని చిత్రించే సాహిత్యం కూడా స్తబ్దుగా వుంటే పతంజలి గారికి ఇష్టం వుండదు. 1996-97 మధ్య రాసిన ఈ కవిత చదివితే మీకు అర్ధం అవుతుంది పతంజలి గారికి నంగిరి మనుషులంటేనే కాదు, నంగిరి కవిత్వమన్నా చాలా అసహ్యమని. జవాసత్వాలు లేని సాహిత్యాన్ని ఆయన కాళ్ళూ చేతులూ లేని కవిత్వమని, అది దుర్వాసన వేస్తోందని అంటారు. నేలలోకి వేళ్ళు దిగని, కలల్ని కనని, భూమితో మాట్లాడని కవిత్వమంటే పతంజలి గారికి పట్టరాని ఆగ్రహం.
రాజ్యం చేస్తున్న కుట్రల్ని, మతం చేస్తున్న దాడుల్ని, సమాజంలోని కల్లోలాల్ని, బతుకులోని హింసనీ, జీవితంలోని సున్నిత అంశాల్నీ పట్టుకోకుండా గాలిలో విన్యాసాలు చేస్తున్న కవిత్వం పట్ల పతంజలిగారికి contempt.
   చచ్చు పుచ్చు కవిత్వం పట్ల ఎప్పటెప్పటి కోపం పేరుకుపోయిందో ఏమోగానీ, పతంజలి గారు ఈ కవితని అప్పటికప్పుడు (‘మహానగర్’ సాహిత్య పేజీలో వెయ్యడానికి మంచి కవిత దొరకక) రాసేశారు. తన పేరు పెట్టుకోకుండా కాకుండా, గనివాడ కారునాయుడు పేరుతో కంపోజింగ్ కి పంపించారు.
ఆయనతో (ఆయన కింద, ఆయన దగ్గర వంటి expressions వాడితే ఆయనకి కోపం వచ్చేది. మనిద్దరం వీళ్ళ కింద పనిచేస్తున్నామని MD రూమ్ వైపు చూపించి అనేవారు) ‘మహానగర్’ లో పనిచేసిన ఆ కొద్ది నెలలూ గొప్ప అనుభవాన్ని మిగిల్చాయి.
myspace

*

ఏమో?

– గనివాడ కారునాయుడు (పతంజలి)

తెల్లవారగట్ట మెలకువ వచ్చినప్పుడు
కరగడానికి ఇష్టపడని చీకట్లో
దెయ్యాలో, నా భయాలో
నా కాంతి ముందు చనిపోయిన వాళ్ళో
కదిలినట్టయి, అట్టిటు నడిచినట్లయి
నాకు భయమేసిందని, గొంతు తడారిపోయిందని
రాయొచ్చునో లేదో?
పొద్దున కిటికీలో పేరుకున్న మట్టిలోంచి
జానెడెత్తు మొలిచిన కుక్క గొడుగు
పొద్దుటి గాలికి తలైనా వూపలేదని
మధ్యాహ్నానికి దాని శిరస్సుని
ఎవరో నరికి కింద పారేసినట్టు
నాకు అనుమానంగా వుందని
రాయొచ్చునో లేదో
శవ పేటికల్లాంటి పుస్తకాల్లో
చనిపోయిన అక్షరాలు
కంపుకొడుతున్నాయనీ
కడుపులో తిప్పుతున్నాదనీ
రాయొచ్చునో లేదో?
కొన్ని రకాల జంతువుల వలె
కొన్ని రకాల పక్షులవలె
కొన్ని రకాల కీటకాలవలె
కొన్ని రకాల మాటలు కూడా అంతరించిపోతున్నాయనీ
కొన్ని పదాలు కనుమరుగౌతున్నాయనీ
రాయొచ్చునో లేదో
కాళ్ళూ చేతులూ లేని కవిత్వం
నరవాహనం లేనిదే కదలలేక పోతున్నాదనీ
దాన్దగ్గిర కొంచెం దుర్వాసనలొస్తున్నాయనీ
కొంచెం కాలిన వాసనొస్తున్నాదనీ
దాని కంట్లో పువ్వులు పూసాయనీ
రాయొచ్చునో లేదో?
ఉంచుకున్న దానికి పిల్లలు పుట్టకుండా
జాగ్రత్త పడినట్టు
ఉంపుడు కవిత్వానికి కలలు రాకుండా
జాగ్రత్త పడుతున్నారనీ
జ్యోతిష్యం కార్డు తీయడానికి మాత్రమే
చిలకను ఉపయోగిస్తున్నారనీ
రాయొచ్చునో లేదో?
చెలమలోంచి ఊరిన నీరులాగా కాకుండా
కొబ్బరిలో ఊరిన నీరులాగా కాకుండా
చెడు భూమిలో ఇంకని వాన నీరులాగా
తాటి బురికెలో పోసిన నిలవ నీరులాగా
ఈ కవిత్వం తేడాగా వున్నదని
రాయవచ్చునో లేదో?
ఎవరైనా ఏమైనా అనుకొంటారో ఏమిటో?
( మార్చి 29, 1952 – మార్చి 11, 2009)

షరీఫూ, నేనూ – మా చమ్కీ పూల జ్ఞాపకాలు

 

 

‘చమ్కీ పూల గుర్రం’ కథ ఆంధ్రజ్యోతిలో వచ్చి రెండు వారాలైంది. ఏదో అనువాదం పనిలో వుండి నిన్న రాత్రి దాకా చదవడం కుదరలేదు. తీరా చదవడం మొదలు పెడితే నా కథ చెబుతున్నట్టనిపించింది. అవును ఇది నా కధా, జీవితంలో నా మొట్టమొదటి స్నేహితుడు షేక్ షరీఫ్ కధా, లేదా మా ఇద్దరి కథ. మున్నీయే షరీఫ్. నేను అపూ. తేడా అల్లా, అపూ వాళ్ళ నాన్న సురేష్ లా కాకుండా మా నాన్న ఏనాడూ మా స్నేహానికి అడ్డుతగల్లేదు. నిజానికి మా జీవితాల్లో, మా వూళ్ళో అప్పటికి మతం మనుషుల్ని విడదీయలేదు.

మా కుటుంబాల మధ్య ఎప్పుడూ మతం ఓ చర్చ కాలేదు, మా స్నేహానికి ఎప్పుడూ అడ్డం కాలేదు. మా కుటుంబాలు ఎన్నడూ మా స్నేహానికి అడ్డు చెప్పలేదు కానీ, మతమే నేరుగా ఆ పని చెయ్యబోయింది. కానీ, మేమిద్దరం ఆ ఎత్తుల్ని సాగనివ్వలేదు. అందుకే, దాదాపు 38 ఏళ్ల క్రితం నాలుగో క్లాసులో మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. వేరే వూరినుంచి వచ్చి నాలుగో క్లాసులో చేరిన నాకు ఏర్పడిన స్నేహితులు మల్లి, షరీఫ్. ఆ తర్వాత డేనియల్, పూర్ణా. షరీఫ్ కీ నాకూ ఎంత స్నేహామంటే, పుస్తకాలపై మా పేర్లు షేక్ కూర్మనాథ్ అనీ, కంచి షరీఫ్ అని రాసుకునేంత. స్కూలు అయిపోయినంత వరకూ స్కూల్లోనూ, స్కూల్ అయిపోయాక వాళ్ళ ఇంట్లోనూ గడిపేవాళ్లం. మల్లీ, నేనూ, షరీఫూ, డేనియల్ తిరగని వంశధార రేవులేదు. మేం తిరగని తోటల్లేవు. మేం ఆడని ఆటల్లేవు. అప్పటికప్పుడు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి మాకో సినిమా కథ చెప్పేసే వాడు ఖాళీ పీరియడ్లలో, స్లో మోషన్ షాట్లతో సహా. అన్నిట్లో క్రిష్ణే హీరో, ప్రభాకర రెడ్డి విలన్. అనకాపల్లి నూకాలమ్మ గుడి దగ్గరి నూతిలోంచి పాతాళ లోకానికి వున్న మార్గం గురించీ, అక్కడి ప్రజల జీవితం గురించి కథలెన్నో చెప్పేవాడు.

మేం ఆరోక్లాసులోనో ఏదో క్లాసులోనో వున్నపుడు మా వూళ్ళోకి (హీరమండలం, శ్రీకాకుళం జిల్లా) ఆరెసెస్ ప్రవేశించింది. ఎక్కడో మారుమూల, ‘నాగరికత’కి దూరంలో, కొండల నడుమ వున్న ఆ చిన్న వూళ్ళోకి మత పరంగా మనుషుల్ని విడదీయగల ఆరెసెస్ ప్రవేశించింది. అప్పటికే అనకాపల్లిలో మా పెదనాన్నగారి పిల్లలు ‘శాఖలకి’ వెళ్తుండడం వల్ల, సెలవుల్లో అక్కడికి వెళ్ళినపుడు నాకూ పరిచయం అయింది ‘శాఖ’. అందువల్ల మా వూళ్ళో ‘శాఖ’ పెట్టినపుడు అక్కడికి నేను వెళ్ళడం సహజంగానే జరిగిపోయింది. అంతే కాదు, షరీఫ్ ని కూడా చేర్పించా. బలిష్టుడైన, చురుకైన షరీఫ్ తొందర్లోనే కలిసిపోయాడు మాతో (ఇప్పటికీ బలిష్టుడే. గంటసేపు ఆగకుండా ఈత కొట్టగలడు). ఎక్కడో కిలోమీటర్ దూరంలో జరిగే ‘శాఖకి’ వెళ్ళేవాళ్ళం. ఇలా ఓ రెండు సంవత్సరాలు గడిచేక బీజేపీ మొట్టమొదటిసారి హిందూ సెంటిమెంటుని ప్రచారం చెయ్యడానికి గంగాజల యాత్ర మొదలుపెట్టింది. టీవీలు, ఇంటర్నెట్లూ అస్సలే లేని రోజుల్లోనే దానిగురించి ఈనాడు వంటి పత్రికలు విపరీతంగా రాశాయి.

ఆ గంగాజల యాత్ర ఎక్కడికెక్కడికొచ్చిందో, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందో వివరంగా రాసేవి పత్రికలు. అలా ఆ గంగాజలం శ్రీకాకుళం వచ్చినపుడు దానికి రక్షణగా వుండడానికి ఏర్పాటు చేసిన బాల రక్షక దళంలో నేనూ, షరీఫూ సభ్యులం. అలా ఎన్నో ఆరెసెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న షరీఫ్ క్రమంగా దూరమవడం మొదలుపెట్టేడు. దేశభక్తి గురించి మాట్లాడి మమ్మల్ని రప్పించిన శాఖల్లో తనులేని సంధార్భాల్లో విచిత్రమైన భాష వినబడేది. మనం వేరు, వాడు వేరు అన్న టోన్ వినబడేది.

బహుశా, తానక్కడ unwanted అని పోల్చుకుని వుంటాడు షరీఫ్. వాళ్ళు చెప్తున్నది మనుషుల్ని విడదీసే భాష అని గ్రహించి వుంటాడు. బాధితుడు కాబట్టి తను తొందరగా గుర్తించి వుండొచ్చు. దళితులైనా, మైనారిటీలైనా స్త్రీలైనా – బాధితులు కాబట్టి అవమానాల్ని, అసహనాల్ని, అంతర్యాల్ని లేశమంత వున్నా గుర్తించగలుగుతారు. ఎంత సహానుభూతి చెందినవాళ్ళైనా, ఆ అవమానాల, అసహనాల వల్ల కలిగిన వేదనల లోతుల్ని తెలుసుకునే అవకాశమే లేదు. ఆ లోతులు తెలిసే అవకాశం లేదుగాని సహానుభూతి చెందేవాళ్ళకి ఆ వేదన ఎంతోకొంత అర్ధం కాకుండా పోదు. వాళ్ళు దగ్గరవాళ్ళైనపుడు ఇంకొంచెం ఎక్కువే అర్ధమవుతుంది, మనసుపెడితే.

తనని ఏం గాయపరిచిందో షరీఫ్ అప్పుడు నాకు అప్పుడూ చెప్పలేదు, ఇప్పుడూ చెప్పలేదు. నేనూ అడగలేదు. కానీ, తను లేని సందర్భాల్లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ జరిగిన సంభాషణల్లో నాకు అర్ధం అయ్యేది, ఆరెసెస్ దేశభక్తిలో ముస్లింలకు ప్రవేశం లేదని. వున్నా, అది వాళ్ళతో మమేకం అయినంతవరకూ మాత్రమేనని.

షరీఫ్ ‘శాఖ’కి దూరం కావల్సిన పరిస్థితులే మొదటి సారిగా నాలో ఆరెసెస్ పట్ల సందేహాలు కలగడానికి కారణమయ్యాయి. ఆ తర్వాత మా father బదిలీ వల్ల నేను చోడవరానికి వెళ్ళడం, అక్కడ నారాయణ వేణూ, వర్మల పూనికతో ఏర్పడ్డ ‘లైబ్రరీ స్టడీ సర్కిల్’ వల్ల ఆరెసెస్ నిజస్వరూపాన్ని పూర్తిగా అర్ధం చేసుకోగలిగేను. దానివల్ల pluralityకి హానే కానీ మేలు లేదని అర్ధం అయ్యింది. ఈ మొత్తం transformation పూర్తికావడానికి ఓ అయిదారేళ్లు పట్టింది. Undoing takes much longer time. అయితే మార్పు మొదలవడానికి కారణం మాత్రం చిన్నపుడు షరీఫ్ ఎదుర్కొన్న పరిస్థితే.

నిన్న రాత్రి అఫ్సర్ కధ చదువుతుంటే ఒక్కసారి నలబై ఏళ్ల క్రితంనాటి సంగతులు గుర్తొచ్చాయి. I felt like reliving my childhood.

మనుషుల వ్యక్తిగతమైన ప్రేమానురాగలని శాసించడానికి రాజ్యం ప్రయత్నిస్తే మన జీవితాలు ఎలా అల్లకల్లోలమవుతాయో ‘మల్లీశ్వరి’ సినిమాలో చూస్తాం. మనుషుల మధ్యలోకి మతం ప్రవేశిస్తే మనసుల్లో ఎలాటి హింస జరుగుతుందో ‘చమ్కీపూల గుర్రం’లో చూస్తాం. As it is, we make the lives of kids miserable by denying them the time they deserve to play. మత వైషమ్యాలతో సృష్టించే హింస దీనికి అదనం. నాకైతే మున్నీ, అపూలు మళ్ళీ ఎప్పటివలెనే ఆడుకోవాలని ఆకాంక్ష. ఒక్క నాకేంటి, అది చదివిన వాళ్ళందరికీ బహుశా అలాటి కోరికే కలిగివుంటుంది. ఆ సామూహిక ఆకాంక్షే, కృషే మనల్ని నిలబెడుతున్నది.

చదివేక, ఇంట్లో అందరికీ ఈ కధ చెప్పేను. “అసలు ఈ కధ నిజంగా జరిగిందా,” అని ఆరేళ్ళ మా పాప అల పదే పదే అడిగింది. ఎప్పుడూ బొమ్మలకి పేరుపెట్టుకు ఆడే అలకి సందేహం – మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటారా అని. “వాళ్ళ అమ్మ రేపు తీసుకెళ్తుందట మున్నీ వాళ్ళింటికి,” అని చెప్తే గాని సమాధానపడలేదు.

అసలు ఆ ప్రశ్నే ఇవ్వాళ దేశంలో అందర్నీ కలచివేస్తుందని, కోట్లమందికి నిద్రలేకుండా చేస్తోందని అల కి ఇప్పుడే ఎలా తెలుస్తుంది? మతం పేరుతో మనుషుల్ని విడదీసే మూకలు పెట్రేగిపోతున్నాయని, అవి మనుషుల మధ్య విద్వేషాన్ని రగిలించేపనిలో వున్నాయని అప్పుడే ఎలా అర్ధం అవుతుంది?

ఇప్పటి సందర్భం రక్తసిక్తమై వున్నది. వ్యధా భరితంగా వున్నది. ఈ దేశంలోని కొందరు పౌరులు భయం గుప్పిళ్ళో బతుకుతున్నారు. ఆటవికపాలన రాజ్యం చేస్తున్నది. ఇప్పుడు ఇలాటి కధలు ఇంకేన్నో రావాలి. అనుమానపు బీజాల్ని ఎవరు వేస్తున్నారో, అసహనపు జ్వాలల్ని ఎవరు ఎగదోస్తున్నారో, ద్వేషగీతాల్ని ఎవరాలపిస్తున్నారో రాయాలి. వాటి గురించి పిల్లలకి చెప్పాలి. వాళ్ళ మధ్య ఎవరెవరు ఎలాటి చిచ్చు పెడుతున్నారో వివరించి చెప్పాలి. పిల్లల మనసులు విరగకుండా కాపాడుకోవాలి.

 

PS: ఈరోజు పొద్దున్నే షరీఫ్ కి ఫోన్ చేశా. ఈ కథ అది మనగురించేనని, నువ్వు చదివితీరాలని.

రాయడం ఎవరి కోసం? దేని కోసం?!

 

A work of art is regarded, not as an ephemeral event, but as an action with far-reaching consequences. Born of reality, it acts back upon reality. Young people will argue a whole night long over a poem. – Ernst Fischer (The Necessity of Art)

 

“ఈ ఎండని నాకు వెండిలా మండించాలని వుంది; ఈ వెన్నెల్ని మంచినీటితో కడగాలని వుంది; ఈ గాలికి ప్రాణంపోసి పరిగెత్తించాలని వుంది; ఈ కొమ్మల్ని కెరటాల్లా లేపించాలని వుంది. ఆ నీడల్ని చెలరేగిపించాలని వుంది; ఈ సంద్రాన్ని ఉడుకులెత్తించాలని వుంది; ఈ నదులన్నీ నయాగరా జలాలు కావాలని వుంది.

బ్రహ్మజెముడు దొంకల్ని దుంపనాశనం చెయ్యవలిసి వుంది; అక్షర ఆజ్ఞానాన్ని తన్ని తోసివేయవలిసి వుంది. పాలకుల బందూకుల ప్రాణాల్ని జనసేన తీయలవలసి వుంది.

అవును, నాకు రాయాలని వుంది.”

— ఇది నాకు అత్యంత ఇష్టమైన రావి శాస్త్రి గారు ‘నాకు రాయాలని’ అన్న వ్యాసంలోది. ( రావిశాస్త్రీయం, పే. 49-50)
మనం రాసింది ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడుకు ఉపకారం చేస్తుందో చూసుకు రాయమని హెచ్చరించిన మహా రచయిత.

 

ఇప్పుడు రచయితల బాధ్యత లేదా బాధ్యతారాహిత్యం గురించి చర్చ నడుస్తున్నది. కవులైనా, రచయితలైనా ఏం చెయ్యాలి? నమ్మినదాని గురించి రాస్తారు. నమ్మిన దాని గురించి మాత్రమే రాయాలి. చెడుకు ఉపయోగపడనిది రాయాలి. కానీ ఇప్పటి చర్చ నేపథ్యంలో అనిపించింది, రచయితగా ఏమైనా తప్పు చేశానా అని. అనుకుని, చదువుతున్నాను  నాకు అత్యంత ఇష్టమైన రావిశాస్త్రి, కొ.కు, చెరబండరాజు వంటి రచయితల రచనల్ని (వీటికోసం వెతకక్కర్లేదు – నా చేతికి అందే దూరంలోనే నా టేబుల్ పై వుంటాయి.) మళ్ళీ ఓసారి. వాళ్ళ రచనలు, జీవితమూ రచయితలకు ఓ ప్రియాంబిల్. ఓ మేనిఫెస్టో.

రచన దానంతట అదే సామాజిక చర్య అంటాడు కొకు. సమాజంలో అసహాయులుగా వున్న వారిలో చైతన్యమూ, బెదిరి వున్నవాళ్లకు ధైర్యమూ, వ్యక్తిత్వం కోల్పోయిన వాళ్ళకు వ్యక్తిత్వమూ ఇవ్వటం కన్న రచయిత చేయగల ఉత్తమమైన పని లేదంటాడు.

గత శతాబ్దపు చివరి దశాబ్దంలో తెలుగు సమాజంలోని విధ్వంసం, అణచివేత, చీకటిలో ప్రజలు చెప్పలేని ఇబ్బందులు ఎదుర్కున్నారు. నా కథారచనకు అది నేపథ్యం. కొత్త శతాబ్దం మొదలవుతూనే జరిగిన పౌరహక్కుల నాయకుడు పురుషోత్తం పాశవిక హత్య నన్ను తీవ్రంగా కలవరపరిచింది. ఎలాటి వనరులూ, మద్దతూ లేని ప్రజల హక్కుల కోసం నిస్వార్ధంగా పోరాడుతున్న ఓ మంచి మనిషిని రాజ్యం నడిరోడ్డు మీద హత్య చేసింది. ఆ హత్య, ఎందరిలో వలెనే, నాలో క్రోధం రగిల్చింది. నాకు బాగా తెలిసిన కుటుంబం కాబట్టి, స్వేచ్ఛని ఎత్తుకుని ఆడించేను కాబట్టి, జ్యోతక్క నాకు తెలుసు కాబట్టి నన్ను ఆరోజులు మరింత కల్లోల పరిచాయి.

ఇంత దుర్మార్గం ఎలా సాధ్యం? ఇన్ని దశాబ్దాల, ఇన్ని శతాబ్దాల పోరాటాల, అధ్యయనాల తర్వాత సమాజం తయారుచేసుకుంటున్న గొప్ప మనుషుల్ని ఎందుకింత దుర్మార్గంగా అంతమొందిస్తున్నారు?

ఆ హత్యకు ఎవరు ఎలా స్పందిస్తారు? హక్కుల సామాన్య ప్రజలు, కార్యకర్తలు, మహిళలు, జర్నలిస్టులు, ఆటోవాళ్లు, ఆర్టీసీ కార్మికులు, డాక్టర్లు, లాయర్లు — వాళ్ళ వాళ్ళ అవగాహనమేర, చేయగలిగే కార్యరంగం బట్టి స్పందిస్తారు. పురుషోత్తం ఏయే విలువలకోసం నిలబడ్డాడో ఆ విలువల్ని వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రతిఫలించే ప్రయత్నం చేస్తాడు. తమ జీవితాల్లోకి తనెలా పరిష్కారాల్ని తీసుకొచ్చాడో మాట్లాడతారు.

మరి రాయగలిగే వాళ్ళు ఏం చేస్తారు? వాటి గురించి రాస్తారు. లేదా మాట్లాడతారు. లేదా రాసి పాడతారు.

నేను రాసేను, ”ఒక జననం గురించి….” అన్న కధ.

gabrielGarciaMarquez1981-Eva-Rubinstein

ఏం రాస్తారు ఎవరైనా? ఎలా రాస్తారు ఎవరైనా? అది అవగాహన మీద, రాయగలిగే శక్తి మీద ఆధారపడి వుంటుంది. అనుకోకుండా ఆ అస్థిర, క్రోధపు, కల్లోలపు రోజుల్లో అనుకోకుండా నేను మార్క్వెజ్ ‘వందేళ్ల ఒంటరితనం’ చదువుతున్నాను. అందులోని ఓ వాక్యం నన్ను కుదిపేసింది. ఓ పాత్ర అంటుంది, “I will kill you again,” అని.

నామీద ఒక్కసారి వంద పిడుగులు పడ్డట్టు, ఒక్కసారి ఓ విస్పోటనంలో చిక్కుకున్నట్టు, ఓ గొప్ప దాహంలో అనంతంగా చిక్కుకున్నట్టు అనిపించింది నాకు. I will kill you again అని అంటున్నాడంటే వాళ్లెవరో మళ్ళీ మళ్ళీ పుడుతున్నారని, వాళ్లెవరో మళ్ళీ మళ్ళీ చంపబడుతున్నారని అనిపించింది. మనలో వాళ్ళని కొంచెం వదిలేసి వెళ్తున్నారని, ఆ వ్యధ మనలో మళ్ళీ మళ్ళీ రగులుతున్నదని.  ఆ విలువలు మనలో ఎంతో కొంత మిగిల్చి పోయారని.

మరి నేను ఆ తీరని దుఖ్ఖాన్ని, ఆ మోయలేని భారాన్ని, ఆ విడువని క్రోధాన్ని, ఆ అసహనాన్ని ఎలా ప్రకటించాలి? రాయకుండా ఉండలేని తనంతోనే కదా. ఎవరైనా రాసేది. మనలోంచి దుర్మార్గంగా విసిరివేయబడ్డ మనిషి గురించి, మనలోపల అనంతంగా విత్తుకుంటున్న ఆ మనిషి జ్ఞాపకం గురించి రాయకుండా వుండగలరా ఎవరైనా?

అప్పుడు రాసేను నేను, ఆ కధ. అది నా రెండో కధ.
“నేను, నేను,” అని రాసుకోవడం ఇప్పటిదాకా నేను చేయలేదు. కానీ, ప్రస్తుత చర్చ సందర్భంలో ‘ఎందుకు రాసేను’ అని గురూ గారు రావిశాస్త్రిగారు రాసింది చదువుతుంటే అనిపించింది – నేను రాసింది ఏ మంచికి ఉపకారం చేసిందా లేదా అపకారం చేసిందా, అని. మనస్సాక్షికి మించిన విమర్శకులు ఎవరుంటారు?

అవును మరి నేను ఆ కధ రాసేను. ఎవరికి ఎలా అర్ధం అయిందో, అవుతుందో నాకు తెలీదు. అప్పటి నా మానసిక పరిస్థితి ఏంటంటే, ఆ క్రోధాన్ని ప్రకటించడం. అప్పటికది నా రెండో కధ మాత్రమే అయినందువల్ల ఇంకోలా రాయలేకపోకపోయి కూడా కావచ్చు.  చదివిన వాళ్ళల్లో అది ఎలాటి ఊహలు కలిగిస్తుందో రచయితకు కొంత ఊహ వుంటుందేమో కానీ, పూర్తిగా తెలిసే అవకాశం లేదు.

“లోకంలో మంచీ చెడ్డా అనేవి వుంటూ వస్తున్నాయి. వాటి మధ్య నిత్యం పోరాటం జరుగూతూనే వుంటుంది. ఆ పోరాటపు స్థాయి ఒకప్పుడు ఉన్నంత తీవ్రంగా ఇంకొకప్పుడు వుండకపోవచ్చు. కానీ మంచి చెడ్డల మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతూనే వుంటుందని నేను అనుకుంటాను. ప్రతి రచయిత కూడా, రెండు, మూడు లేక ఎన్నో కొన్ని మజిలీలు చేసి చివరికి ఈ మంచి చెడ్డల క్రాస్ రోడ్స్ కి వస్తారనీ రాక తప్పదనీ నేను నమ్ముతాను. అప్పుడు అతను పాఠకుడికి తను ఏ మార్గం చూపించాలో నిశ్చయం చేసుకుంటాడు. ఆ దారంట వెళ్ళమని అందరికీ చెప్తాడు.” – రావిశాస్త్రి (1965) (రావిశాస్త్రీయం, పే. 48-49)

ఆప్తులనుకున్న వాళ్ళు, ఇష్టమైన నాయకులు సహజంగానో, అసహజంగానో మరణించినపుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ రాయడం అనాదిగా వస్తున్న ఓ అలవాటు. వాళ్ళు మనకోసం చేసిన త్యాగమూ, పోరాటమూ గుర్తు చేసుకోవడం ఓ మానవీయమైన విలువ. మా వూరికి దగ్గరలో వున్న సవర జాతికి చెందిన ఆదివాసులైతే ఆ మరణాన్ని గోడమీద బొమ్మగా వేసుకుని గుర్తు పెట్టుకునే వాళ్ళు.

‘ఒక జననం గురించి…’ రాసిన చాలా ఏళ్ళకు ‘పూల గుర్తులు’ అని ఓ కధ రాసేను. అది మళ్ళీ కొందరి అమరత్వం గురించి. చనిపోయిన వాళ్ళ గుర్తుగా పూల మొక్కలు నాటే ఓ వృధ్ధుడి గురించి. అమరులైన వాళ్ళు, మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు ఓ పూవుగా, ఓ వాసనగా ఎలా మిగిలిపోతారో, మనం ఎలా గుర్తుంచుకుంటామో చెప్పిన కధ.

ఎవరో రచయిత తన నవలని సినిమా తీయడానికి ఒప్పుకోలేదని చదివేను. ఆమె (లేదా ఆయన?) చెప్పిన కారణమేంటంటే, “నా నవల చదివిన వేలమంది వేలారకాలుగా ఊహించుకుని appreciate చేస్తారు. సినిమా తీస్తే దర్శకుడికి అర్ధం అయిన వెర్షనే వస్తుంది,” అని.

ఆ కధ చదివి అఫ్సర్ pustakam.netలో (2009) ప్రతిస్పందన రాసేడు. అది తన ఆప్తుల మరణాల్ని ఎలా గుర్తు చేసాయో. (link — http://pustakam.net/?p=1564) ఓసారి ఓ రచన చేస్తే అది బతికిన రోజుల్లో ఎవరికి అర్ధం అయిన ప్లేన్ లో వాళ్ళకి అర్ధం అవుతుంది. కొందరికైతే nonsense అనిపించవచ్చు. Some others might have thought that it should have been told better. ఇంకొందరికి ఎవ్వరెవ్వరి మరణాలు గుర్తొచ్చి వ్యాకుల పడవచ్చు. The writer will have no control whatsoever on the text once he penned it. ఓసారి రాశాసేక, ఇక ఆ రచనతో రచయితకు సంబంధం వుండదంటారు రావిశాస్త్రి గారు.

జీవిత పరిణామం ప్రజా పోరాటం మీద ఆధారపడి వున్నది. ఆ పోరాటంలో ప్రజలచేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం. అదే విప్లవ సాహిత్యమంటాడు కొకు.

కవులే గానీ, రచయితలే గానీ వాళ్ళ కార్యరంగం రచన. రాయాలి. రాయాల్సిన వాళ్ళు రాయాల్సినంతగా రాయకపోతే రాయకూడని వాళ్ళు రాయకూడనంతగా రాస్తారని ఎవరో అన్నారు. కాబట్టి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని రాయగలిగే వాళ్ళు రాయకుండా వుండరు. రాస్తారు.

ravisastry

“ఈ ఎండకి పసలేదు. ఆరీ ఆరని గాయం చాలా వుంది. ఈ వెన్నెల వెలివెలి బూడిదలా వుంది. ఈ గాలంతా బిగిసిపోయి చచ్చింది. ఈ నీడలన్నీ కొరడబారిపోయాయి. ఈ సముద్రమంతా చల్లారిపోయింది. ప్రభువులంతా ఏడు రంగుల నీడల్లో మునిగితేలి మురుస్తున్నారు. పచ్చినెత్తుర్ని పరమాన్నం వండుకొండుంటున్నారు……అవును నాకు రాయాలనే వుంది. నాకు ఈ ప్రభువుల్ని ఈడ్చి ఎండబెట్టాలని వుంది; కూలి కులాలన్నీ ఏకం కావాలని వుంది. జ్ఞానదీపం వెలగాలి. మబ్బులన్నీ తొలగాలి. మంచిగంధం తీయాలి.” ( రావిశాస్త్రీయం.)

అవును, అందుకే నాకూ రాయాలని వుంది. వాటిగురించి రాయాలని వుంది.  వాటి గురించి మాత్రమే రాయాలని వుంది. షరతుల్లేని, శశబిషలు లేని, సందేహాల్లేని, నిరుత్సాహం లేని రచనలు చేయాలని వుంది. ఎలాటి వనరులూ లేని, శక్తులూ లేని  ప్రజలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకోసం రాయాలని వున్నది. వాళ్ళ కధలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ వ్యధలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఉక్కపోతల జీవితాలు, వాళ్ళ పోరాటాలు – వాటి గురించి మాత్రమే రాయాలని వున్నది.

–వాళ్ళకోసం మాత్రమే రాయాలని వున్నది.

*

చలసానికి మావోయిజం ఒక way of life!

 

 కూర్మనాథ్

ఒక శిఖరం కూలిపోయింది.
మా ఉత్తరాంధ్ర పెద్దదిక్కు పోయింది.
తెలుగు సాహిత్యం ఓ చుక్కానిని,
విప్లవోద్యమం ఓ సహచరుడ్ని కోల్పోయింది.
తెలుగు ప్రజలకి ఒక తోడు లేకుండాపోయింది.
యారాడ కొండ చిన్నబోయింది.

***
స్వార్ధంలేని మనిషి వుంటాడా? వ్యాపారమయమైన, వస్తుమయమైన ఈ ప్రపంచంలో స్వార్ధంలేకుండా వుండగలిగే అవకాశం వుందా? ఉందనే నిరూపించాడు ప్రసాద్. విప్లవాసాహిత్యోద్యమానికీ, మిత్రులకీ సీపీగా తెలిసిన చలసాని ప్రసాద్ తనని తాను రద్దు చేసుకుని బతికేడు. రెండు రాష్ట్రాల్లో వందలాదిమందికి ఆయన ఆప్తుడు. మానవసంబంధాలు నిలబెట్టుకోవడంలో ఆయన తర్వాతే ఎవ్వరైనా.

ఆయన పరిచయాల  విస్తృతి చూసి ఎవరైనా ఆశ్చర్యపడక తప్పదు. వరంగల్ రైల్వే స్టేషన్లో కావచ్చు, నాంపల్లి పోస్టాఫీసులో కావచ్చు, పుస్తక ప్రచురణ కేంద్రాల్లో కావచ్చు, పత్రికాఫీసుల్లో కావచ్చు, రచయితల్లో కావచ్చు – ఆయనకి విస్తారంగా పరిచయాలుండేవి. అవి ఏవో మొక్కుబడి పరిచయాలు కావు. ఒకసారి పరిచయం అయితే, ఆయన లేదా ఆమె ఇక ఎప్పటికీ మిత్రుడో, మిత్రురాలో.

జీవితమంతా సాహిత్యం, సాహిత్య ప్రచారం, విప్లవం, పౌరహక్కులు తప్ప ఇంకోటి తెలియని సీపీ. అత్యంత నిరాడంబరుడు. జీవితంలో ఒక్కసారికూడా దువ్వెన వాడని, ఒక్కసారికూడా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని, ఒక్క క్షణం కూడా టీవీ చూడని – సీపీ. ఆకలి దప్పులు లేనివాడు లేదా పట్టించుకోని వాడు. కానీ, ఆకలి దప్పులతో, అవసరాలతో వున్నవాళ్లని అనుక్షణం పట్టించుకున్నవాడు. సరిగ్గా యేనన్ ప్రసంగంలో మావో చెప్పినట్టు, నిజమైన మేధావి ప్రజల్లో ఒకడిగా, ఎలాటి బేషజాలు లేకుండా కలిసిపోవాలని చెప్పాడో, నిరాడంబరంగా వుండాలని చెప్పాడో, సీపీ సరిగ్గా అలా వుండేవాడు. మార్క్సిజాన్ని, మావోయిజాన్ని ఒక జీవిత విధానంగా మార్చుకుని, ఒక శ్వాసగా మార్చుకుని బతికినవాడు ప్రసాద్.

cp8

సీపీలేడన్న దుఖం రక్తంలోకి ఇంకుతున్నకొద్దీ ఆయన లేని లోటు లోతు పెరుగుతూ కనిపిస్తూవున్నది. ఏ కృష్ణా తీరాన్నుంచి ఎప్పుడు విశాఖ వచ్చాడోగాని ఉత్తరాంధ్రని సొంత వూరు చేసుకున్నాడు. శ్రీకాకుళం వుద్యమం ఆయన్నెంత కదిలించిందో, ఉత్తేజపరిచిందో, దిస్టర్బ్ చేసిందో ఆయన “ఈ విప్లవాగ్నులు ఎచటివని….” పాడినపుడు తెలుస్తుంది.
“మా ‘పంచాది’ ఎలావున్నాడు,” అని అడిగేవాడు, మా అమన్ గురించి అడుగుతూ. సీపీకి మనుషులు సతతహరితాలు. అంతిమంగా మనిషి నిలుస్తాడు అని నమ్మినవాడు.  అందుకే విప్లవోద్యమం ఒడిదుడుకులకు గురైనపుడు, సెట్ బేక్లకు గురైనపుడు, ఎదురుకాల్పుల్లో విప్లవకారులు మరణించినపుడు మ్రాన్పడి, దిగులుపడి ఏనాడూ కూచోలేదు. అసలు అలుపన్నదే, అనారోగ్యమన్నదే తెలియదు ప్రసాద్ కి.

పుస్తకాల మీద ప్రసాద్ కి ఎంత ప్రేమో చెప్పక్కర్లేదు. ఆయన ఇంట్లో మేడ మీద ఓ పెద్ద లైబ్రరీ.
వామపక్ష ఉద్యమాలకి, సాహిత్యానికి సంబంధించి ఎవరు ఏ యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నా, ఎవరికి ఏ సందేహం వచ్చినా విశాఖలో ఆయనింటికి వెళ్ళాల్సిందే. ఎక్కడ ఏ పుస్తకం వుందని చెప్పడమే కాదు, ఏ పుస్తకంలో ఏముందో, ఎవరు ఏం చెప్పారో అలవోకగా చెప్పేసేవాడు. ఇక శ్రీశ్రీ, రావిశాస్త్రి, కొకుల సాహిత్యం మీద ఆయనకున్న పట్టు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది? ఆయనలేకుండా, వాళ్ళ సాహిత్య సర్వస్వాల ప్రచురణ ఊహించలేం.

అక్కడికెళ్లకుండా పని అయేది కాదు. ఓ మూడు సంవత్సరాలుగా లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేసేడు – మా కొలీగ్  ఒకాయన ఇరవైఏళ్ల క్రితం తన దగ్గర తీసుకున్న పుస్తకాల గురించి. ఓ రోజు, రాసుకో ఏయే పుస్తకాలు తీసుకెళ్లాడో అని పేర్లు చెప్పేడు. అడిగేవా, ఇస్తానన్నాడా, ఎప్పుడిస్తాడట, అసలు ఇస్తాడా – అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేవాడు. మా కొలీగ్ రెస్పాన్స్ చాలా పూర్ గా వుండేది. వున్నాయనీ చెప్పేవాడు కాదు, లేవనీ చెప్పేవాడు కాదు. ఇస్తానని ఒకసారి, ఇంతకుముందే ఇచ్చేశానని ఇంకోసారి, వున్నాయో లేదోననీ చెప్పేవాడు.

మూడేళ్ళ గొడవ తర్వాత మొత్తానికి ఆ పుస్తకాల్లో కొన్నిటిని ఇచ్చేడు ఈ మధ్యనే. ఆ సంగతి ఫోన్లో వెంటనే చెప్తే ఎంత సంతోషించాడో! కానీ ఆ పుస్తకాలు చూసుకోకుండానే వెళ్లిపోయాడు.

నాకు ప్రసాద్ పరిచయం చోడవరం లైబ్రరీ స్టడీ మిత్రులు వర్మ, వేణుల ద్వారా. ఆ తర్వాత విశాఖలో జర్నలిజం చదువుతున్నపుడు పరిచయం కొంచెం పెరిగినా, అనుబంధం ఏర్పడింది మాత్రం నేను హైదారాబాద్ వచ్చాక, విరసంలో చేరేకే. తనకి ఇష్టమైన చిన్ని నా సహచరి అయ్యాక, ఎంత సంతోషించాడో.

***

ఫోటోలు: కూర్మనాధ్ 

పెరుమాళ్, పెరుమాళ్!

myspace

 

ఓ వారం అవుతోంది. పెరుమాళ్ మురుగన్ గురించి రాద్దామని. చచ్చిపోయిన పెరుమాళ్ గురించి. కానీ, ఎంతకీ పెన్ను ముందుకు కదలడం లేదు. నిస్సత్తువ వెనక్కి గుంజుతున్నది. రక్తమాంసాలతో, గుండెలో ప్రాణంతోవున్న పెరుమాళ్ బతికే వున్నాడు కావచ్చు. కానీ, రచయిత పెరుమాళ్ చనిపోయాడు. అలా అని, పెరుమాళ్ ప్రకటించి వున్నాడు. తను రాసిన పుస్తకాల్ని వెనక్కి తీసుకున్నాడు.

మనగురించి లేదా మనలాటి వాళ్ళ గురించి రాసిన ఆ రచయిత పెరుమాళ్ చనిపోలేదు. హత్యకు గురయ్యాడు. అంతకంటే దారుణం ఏంటంటే, మనం చూస్తుండగానే చంపేశారు. మనలో కొందరు పెరుమాళ్ కి మద్దతు చెప్పి వుండొచ్చు. ఇదేం అన్యాయం అని అరచి వుండవచ్చు. కానీ, మన మద్దతు మన అరుపులు హంతకుడి చేతుల్ని భయపెట్టలేక పోయాయి.

పెరుమాళ్ లాటి రచయితలకే అభద్రత ఈ సమాజంలో. ఈమధ్య కాలంలో దాడులు ఎదుర్కొన్న రచయిత ఒక్క పెరుమాళే కాదు. పుదుక్కోటై లోనే కణ్ణన్, దురై గుణ అనే ఇద్దరు రచయితలు కూడా భౌతిక దాడులకు గురయ్యారు.    బూతు రచనలు చేసిన వాళ్ళు, పులిహార సాహిత్యం సృష్టిస్తున్న వాళ్ళు, జవసత్వాలు లేని, రంగూ రుచీ వాసనాలేని పుస్తకాలు రాస్తున్నవాళ్లు హాయిగా వర్ధిల్లుతున్నారు. జుగుప్సా సంస్కృతికి చెందిన సాహిత్యకారులు సత్కారాలు అందుకుంటున్నారు. విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి హానీ జరగదు. వాళ్ళు గొప్ప సృజనకారులుగా చలామణీ అవుతారు. కానీ జీవితాన్ని జీవితంగా చూపించిన, అపురూమైన సంక్లిష్టమైన సంబంధాల్ని చిత్రీకరించిన, చరిత్ర నేపథ్యంలో కలలాటి నిజాన్ని చెప్పిన పెరుమాళ్ మాత్రం ఉరికంబం ఎక్కాల్సివస్తున్నది.

సత్యాన్ని చెప్పినందుకు, సృజనాత్మక వ్యక్తీకరణ వున్నందుకు హత్యకు గురైనవాళ్లు, బహిష్కరణకు  గురైన వాళ్ళు, వేధింపులకు గురైన వాళ్ళు ఎంతమందిలేరు చరిత్రలో. సోయెంకా, ఎమ్ ఎఫ్ హుస్సేన్, తస్లీమా నస్రీన్, రష్దీ, చెరబండ రాజు – ఇలా ఎంతమంది లేరు రాజ్యం చేతిలో, రాజ్యం అండతో చెలరేగిపోయే మౌడ్యుల చేతిలో!

ఇంతకీ, పెరుమాళ్ రాసిందేమిటి? ‘అర్ధ నారీశ్వరుడు’ అన్న నవల. ఏదో కపోలానికి ఆదాటుగా తట్టిన ఏదో ఒక ఇతివృత్తంతో కాదు. ఓ అరవై డెబ్బై ఏళ్లక్రితం వుండిన ఓ జంట గురించి. వాళ్ళ చుట్టూ కనిపిస్తూ, కనిపించకుండా వున్న జీవితం గురించి, దాని పరిష్వంగం గురించి. పిల్లలు కలగని మహిళ ఒకానొక సమూహంలో మరొకరితో జతకట్టి సంతానం కోసం ప్రయత్నించగలిగే ఒకానొక సాంఘిక వెసులుబాటు గురించి.

images

ఇది నచ్చలేదు మౌడ్యులు కొందరికి. అది కూడా మతమే ప్రధానమైన ఎజెండాగా వున్న ఓ భావజాలం అధికారంలోకి వచ్చేక. పెరుమాళ్ పై వచ్చిన వత్తిడి అంతా ఇంతా కాదు. చిత్రమేమిటంటే, బ్రాహ్మిణీకల్ వ్యవస్థపై తీవ్రమైన వ్యతిరేకత కనబరిచిన తమిళనాడులో ఈ వత్తిడి రావడం. ఇక తమిళనాడులోనే ఈ పరిస్తితి వచ్చిందంటే ఇక సాంఘికంగా ఎంతో వెనుకబడిన రాష్ట్రాల్లో మత మౌఢ్యం రెచ్చిపోతుంది.

ఫ్రాన్సులో, సిరియాలో జరుగుతున్న అన్యాయాలపై ‘నేను చార్లీని’ అని తనివితీరా సాలిడారిటీని ప్రకటించే వాళ్ళు, పత్రిక స్వేచ్ఛ హననం గురించి, భావప్రకటనా హక్కు గురించి  పోరాడే వాళ్ళు పెరుమాళ్ గురించి ఎందుకో పట్టించుకోరు. ఆయనెవరో, ఆయనను ఎందుకు రక్కసి మూకలు వేటాడుతున్నారో పట్టించుకోరు. లేదా, కావాలనే ఉపేక్షిస్తారు.   ఎందుకంటే, పెరుమాళ్ తెల్లగా లేడు. ఆయన రాసింది ‘మన’ గురించి కాదు. ఎక్కడో సమాజపు అట్టడుగుపొరల్లో వున్నవాళ్ల గురించి రాసేడు. ఆయనపై దాడి చేస్తున్నది ‘మన’ వాళ్ళు. కాబట్టి ‘I am Charlie’ అని మనం గొంతెత్తి అరుస్తాం గానీ, అదే సమయంలో మన పెరట్లో ‘నేను చచ్చిపోతున్నా రచయితగా,” అని అరుస్తున్న, ఏడుస్తున్న, భయపడుతున్న, కలవరపడుతున్న పెరుమాళ్ మనకి కనబడడు.

మన కళ్ళు, మన చెవులు, మన మనసు, మన ఊహలు – అన్నిటిని ‘వాళ్ళు’ నియంత్రిస్తున్నారు. ఇది స్పష్టంగా రెండు విభిన్నమైన ప్రపంచాల వ్యవహారం. ఈ రెండు ప్రపంచాల అవసరాలు, విలువలు, బలాలు, ఊహలు, ప్రయోజనాలు భిన్నమైనవి. చిత్రంగా, మన ప్రపంచాలకు భిన్నమైన అవసరాల గురించి, ప్రయోజనాల గురించి, ఊహల గురించి, విలువల గురించి మనం పోరాడుతున్నాం. రెండు ప్రపంచాల్లో కేవలం ఒక ప్రపంచం దగ్గర మాత్రమే అన్ని వనరులు, సమాచార, సాంస్కృతిక ప్రసార సాధనాలు వున్నాయి. అవి కేవలం తమ ప్రపంచంలోని వారిని మాత్రమే కాక, అవతలి ప్రపంచంలో వాళ్ళను కూడా తీవ్రంగా ప్రభావితం చెయ్యగలవు.

ఫ్రెంచి పత్రిక చార్లీ హెబ్డే మీద జరిగిన ఆటవికమైన, అమానుషమైన దాడిని ప్రపంచమంతా ఖండిస్తుంది. ఖండించాలి కూడ. కానీ దురదృష్టవశాత్తూ మన ఖండన పాశ్చాత్య ప్రసార మాధ్యమాల ప్రభావం వల్లనే. గాజా పిల్లల్ని ఇజ్రాయిల్ హననం చేసినపుడు మనకి ఇంత కోపం రాలేదు. ‘I am Gaza kid’ అని ఆవేశంతో ఊగిపోలేదు. ఎందుకంటే, పాశ్చాత్య ప్రసార సాధనాలు పూనకంతో ఊగిపోలేదు. పిల్లల రక్తం కళ్ల చూసిన ఇజ్రాయిల్ ప్రధాని పారిస్ వీధుల్లో సిగ్గులేకుండా నిరసన ప్రదర్శనలోకి జొరబడితే కూడా మనకి కోపం రాదు.

పెరుమాళ్, కణ్ణన్, గుణ – మన ప్రపంచానికి చెందిన మనుషులు. మట్టి మనుషుల వేదన గురించి, నలిగిపోతున్న జీవితం గురించి, వాళ్ళు పడుతున్న హింస గురించి, వాళ్ళ సంతోషాల గురించి, అంతరించిపోతున్న వాళ్ళ చరిత్ర గురించి – అంటే మన గురించి – ఎంతో ప్రేమతో రాస్తున్నారు. అది మన సొంత ప్రపంచం గురించి.

అందుకే, పెరుమాళ్ లో చచ్చిపోయిన రచయితను మళ్ళీ బతికించుకోవాలి. పెరుమాళ్ లాటి రచయితలు చనిపోకుండా చూసుకోవాలి. మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి.  అందుకే, I am Perumal.

*

ఏది రాయాలి? ఏది వదిలెయ్యాలి?

myspace

ఏది రాయాలి? ఏది వదిలెయ్యాలి? రాయగలమని చెప్పి తోచినవన్నీ రాసేయ్యాలా? సహజమైన ఫ్లో రాకపోయినా ఏదన్నా అనుకుంటే కృతకంగానైనా ఏదో ఒకటి రాసేయ్యాలా? ఇలాటి సందేహాలు ఎన్నో వస్తాయి రచయితలకు. వేధిస్తుంటాయి అనుక్షణం. కథావస్తువులు, పాత్రలు, సంభాషణలు వెంటాడుతూనే వుంటాయి.

రచయితలకి గీటురాయి ఏంటి? ఏది కొలమానం? నావరకు నాకు గురూగారు రావిశాస్త్రి గారు చాలా చక్కటి మాట చెప్పారు — ఏది రాసినా ఏ మంచికి అపకారం జరుగుతుందో, ఏ చెడుకు ఉపకారం జరుగుతుందో చూసుకొమ్మని. ఇది ఆయన రాసిన ‘రావిశాస్త్రీయం’లో వున్నది. ఆయన్ని ఒకటి రెండుసార్లు కలుసుకున్నా ఎక్కువ మాట్లాడే అవకాశం కలగలేదు.

కానీ కాళీపట్నం రామారావు మాస్టారుతో ఎన్నోసార్లు ఎంతో సేపు మాట్లాడే అవకాశం కలిగింది. రచయితలకు ఆయన సూచించిన స్కేలు ఇంకా చిన్నగా, సూటిగా వుంది. లేదా, రావిశాస్త్రిగారు చెప్పినదానికి దోహదం చేస్తుంది.

“నువ్వు సత్యానికి, ఇంకా ప్రజలకు జవాబుదారీ అని గుర్తుపెట్టుకోవాలి,” అని.

ఇప్పుడు కారా మాస్టారి గురించి ఎందుకు అంటే, ఆయనకు 90 ఏళ్ళు నిండిన సందర్భం. ఆయన గురించి అందరూ మాట్లాడుకునే ఓ సందర్భం. ఇంకో సందర్భం కూడా వుంది అది చివర్లో చెప్తాను.

సరిగ్గా ఏ కథావస్తువు గురించో గుర్తులేదు గాని, ఏదో వస్తువు గురించి ఆయన సలహా తీసుకుందామని ప్రస్తావించాను. ఫలానా సందర్భం గురించి, ఫలానా విధంగా చెప్దామని అనుకుంటున్నానని వివరిస్తున్నాను. కాసేపు నిశ్శబ్దంగా వుండిపోయారు, కళ్లుమూసుకుని. అది ఆయన స్వభావం, ఎవరైనా . నిమ్మళంగా ఆలోచించడానికి కావచ్చు.

“నువ్వు ఎలా చెప్పదలుచుకున్నావో చెప్పకు. కానీ, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. ఏదో సత్యాన్ని అనుకుని దాన్ని నిజం చెయ్యడానికి కథ రాయకు. సమాజాన్ని గమనించు. జీవితాన్ని చదువు. నీకు ఎక్కడైనా నువ్వకున్నసత్యం రూఢి అయిందనిపించిందనుకో కథ రాయి. అంతేకాని నువ్వు నమ్మిన భావజాలాన్ని ఎలాగైనా సపోర్టు చెయ్యాలని మాత్రం రాయకు,” అన్నారు.

“నువ్వు సత్యానికి, ఇంకా ప్రజలకు జవాబుదారీవి అని గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మిన భావజాలాన్ని వదిలిపెట్టకు. నువ్వు గమనించిన విషయం రాస్తే నీకు ఇబ్బంది అనుకుంటే రాయడం మానేయి. ఒక కథ ఆగిపోతుంది. అంతే. కానీ, నువ్వు రూఢి చేయలేని సత్యాన్ని సత్యంగా మార్చి చెప్పకు,” అన్నారు.

ఇవే కాదు కాని, ఈ అర్ధం వచ్చే మాటలు అన్నారు. సత్యంపట్ల, ప్రజలపట్ల జవాబుదారీగా వుండటం అన్న మాట నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే అది కేవలం నా రచనలకే కాదు, నా వృత్తికి కూడా ఎంతో ఉపయోగపడ్డది ఎన్నో సార్లు.

ఒక ఉదాహరణ చెప్తాను. బేగంపేట ఎయిర్ పోర్ట్ శంషాబాద్ కి మారే ప్రక్రియను చాలా దగ్గరగా కవర్ చేశాను. ఉద్యోగుల నిరసనలూ, కొత్త ఎయిర్ పోర్టు యాజమానుల పధకాలూ, ఉపయోగాలూ, అనార్ధాలూ ఎన్నో వార్తలు రాశాను. కానీ, సెర్వీసులు కొత్త ఎయిర్ పోర్తుకి మారిన రోజు ఓ హ్యూమన్ ఇంటరెస్ట్ వార్త రాద్దామనుకున్నాను. మా వాళ్ళని ఎలర్ట్ కూడా చేశాను. స్టోరీ పెగ్ లిస్ట్ లో పెట్టాను.

కానీ పాత ఎయిర్ పోర్టు చుట్టుపక్కల వున్న పిల్లలూ, పెద్దలూ విమానాల్ని ఎలా మిస్ అవుతున్నారో తెలుసుకు రాద్దామని. ప్రధాన వార్తల పని అవగొట్టుకుని అక్కడ ఇళ్లకు వెళ్ళేను కదా, అక్కడ తెలుసుకున్న విషయాల్ని చూసి దిమ్మ తిరిగిపోయింది. పిల్లలూ, పెద్దలూ ఎవరూ అక్కడి విమానాల్ని మిస్ కాలేదు. సరికదా అందరూ, చాలా అనందంగా వుండడం చూశాను. ఇక ఈ జన్మకి ఈ నరకంనుంచి విముక్తి కలగదేమోనని పెద్దవాళ్లూ, హాయిగా పొద్దున్నపూట నిద్రపోతున్నామని చిన్నవాళ్లూ ముక్తకంఠంతో చెప్పేరు. ఇది నేను ముందు ప్రోపోజ్ చేసిన వార్తకి పూర్తిగా భిన్నంగా వుంది. కానీ, వాస్తవం ఇంకోలా వుంటే చూస్తూ చూస్తూ అబధ్ధం ఎలా రాస్తాం?

***

కారా మాస్టార్ని ఇప్పుడు నేను తలుచుకోడానికి రెండో కారణం – కథల పట్ల ఆయనకున్న ప్రేమ, ఆపేక్ష. కథే ఆయన ఊపిరి. కథ కాకుండా ఇంకేదైనా ఆయన మాట్లాడడంగాని, వినడంగాని నేను ఎపుడూ చూడలేదు. దాదాపు డెబ్బై ఏళ్లపాటు కథే జీవితంగా, కథ మాత్రమే జీవితంగా బతకడం సామాన్యమైన విషయం కాదు.

మొన్నీ మధ్య ఫోన్లో మాట్లాడుతూ, “విశాలాంధ్ర వాళ్ళు వేసిన ఉత్తరాంధ్ర కథల పుస్తకంలో నీ కథ వుంది. ఈసారి కనిపించినపుడు దాని నేపధ్యం చెప్పాలి,” అన్నారు. నాకైతే ఆ పుస్తకం వచ్చినట్టు కూడా తెలీదు. ఇంత వయసులో కూడా కొత్తగా వస్తున్న పుస్తకాలని సంపాదించడం, చదవడం నాకైతే ఎంత ఆశ్చర్యo, సిగ్గూ వేసాయో. అప్పటికప్పుడు ‘నవోదయా’కి వెళ్ళి (విశాలాంధ్ర షాపులు ఆడిట్ కోసమని మూసేశారు కొన్ని రోజులు) చూశాను కదా, 1028 పేజీలున్న పుస్తకంలో 110 కథలున్నాయి!

అంతే కాదు, ‘దిద్దుబాటు’ కంటే ముందు వచ్చిన 87 కథల గురించీ, రాబోయే ఆ సంకలనం గురించీ, దానికి తాను సజెస్ట్ చేసిన ‘దిద్దుబాట’ అనే టైటిల్ గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడారు.

ఏదో హాబీలాగానో, ఖాళీ వున్నపుడు ఎవరికో ఏదో ఫేవర్ చేస్తున్నట్టు రాయడమో చేసే నాలాటి కొందరికి కారా మాస్టారు గారి దగ్గర ఎంతో నేర్చుకోవాలి. అది ఒక జీవనవిధానం కాకుండా వుంటే, రాయడం అనేది ఓ passion ఎలా అవుతుందీ?

  • -కూర్మనాథ్

చదువుకీ, మనకీ మధ్య ఎందుకూ అంత దూరం?!

myspace

నా అమెరికా ప్రయాణాలు – 3

 

అమెరికాని వ్యతిరేకించడానికి నాకు లక్ష కారణాలున్నాయి. అసహ్యించుకోడానికి కూడా ఎన్నో కారణాలున్నాయి. కానీ, ఆ కారణంతో అక్కడి ప్రజల్లోని ప్రజానుకూలత గురించి, చదువుపట్ల వాళ్ళ ప్రేమగురించి చెప్పకుండా వుండలేను.

పబ్లిక్ లైబ్రరీలు, యూనివర్సిటీ లైబ్రరీలు ఇంకా పుస్తకాల షాపులు కళకళలాడుతుంటాయి చిన్న చిన్న కమ్యూనిటీలకు కూడా మంచి లైబ్రరీలు వుంటాయి. ఖరీదైన పుస్తకాలు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఆ పుస్తకాల్ని చదివేశాక దగ్గర్లోని లైబ్రరీకి ఉచితంగా ఇచ్చేస్తారు. వాళ్ళు ఒక డాలరుకో, రెండు డాలర్లకో అమ్మకానికి పెడతారు.
మన దగ్గరైతే ఎవరైనా చదువుతూ కనిపిస్తే ఒక వింతగా చూడడం అలవాటైపోయింది మనకి. ఎవరైనా పుస్తకం వేస్తే వెయ్యి కాపీలువెయ్యడం అందులో సగం పంచగా, మిగతావి పుస్తకాల షాపులో మూలుగుతుండడం చూస్తుంటాం.
కానీ అక్కడ ఇంకా చదువుతున్నారు. కిండిళ్లూ, నూక్ ఇంకా ఇతర రీడర్లలో కూడా చదువుతున్నారు. విమానాల్లో, పార్కుల్లో, మెట్రో రైళ్లలో ఈ పుస్తకాలు చదివేవారు కనిపిస్తుంటారు మనకి పుస్తకాలతో, ఈ-రీడర్లతో. పుస్తకాల షాపులు కూడా కళకళ లాడుతుంటాయి జనాల్తో. మనకి వున్న పుస్తకాల షాపులే తక్కువ. అవి నానాటికీ కురచ అయిపోతూవుంటాయి. జ్ఞానం డిజిటల్ రూపాన్ని తీసుకుంటున్నక్రమాన్ని తొందరగా అర్ధం చేసుకోబట్టే, ఈ-రీడర్లు, వికిపీడియా లను సృష్టించుకున్నారు. జ్ఞానం ప్రాజాస్వామీకరించిబడితే, జాక్ లండన్, అప్టాన్ సింక్లయిర్ లు ఫిక్షన్లో కలలుకన్న ప్రజా పోరాటాలు ఏదో ఒకనాటికి రూపుదిద్దుకోపోవు. రెండేళ్లక్రితం నాటి ‘ఆక్కుపై’ ఉద్యమాలు ఎంతోకొంత ఆశని కలిగించకపోవు.

bookworm

నడుస్తూ నడుస్తూ ఒక ‘పుస్తకం పురుగు!’

అమెరికా ప్రజల జ్ఞాన తృష్ణ గురించి నాకు మొట్ట మొదట తెలిసింది టెక్సాస్ యూనివర్సిటీ లైబ్రరీ చూశాక. అఫ్సర్, కల్పనలతో వెళ్ళినపుడు చూశాను కదా, నాకైతే అంతపెద్ద లైబ్రరీ నాకిదివరకు కనబడలేదు. మన తెలుగు పుస్తకాలు కూడా వున్నాయి అక్కడ. నాకిష్టమైన ఇటాలో కాల్వినో గురించయితే పూర్తిగా ఓ రాక్ నిండా వున్నాయి పుస్తకాలు. నేను అనుకున్నాఅప్పటిదాకా, ఆయన రాసినవి అన్నీ చదివేశాను కదా అని. కానీ, చూశాక కానీ తెలీలేదు ఆయన గురించి ఎంత విమర్శా సాహిత్యం వచ్చిందో. ఇక డికెన్స్, జాక్ లండన్ లాటి పేరున్న రచయితల పుస్తకాల గురించి చెప్పనక్కర్లేదు.

క్లాసులు కూడా ఎక్కడపడితే అక్కడ పెట్టుకుంటారు. నాలుగురైదుగురు విద్యార్ధులు, ప్రొఫెసర్ ఏ చెట్టుకిందనో లేకపోతే కేంటీన్లో నో ఆ పూట క్లాసు నడిపేస్తారు.
టెక్సాస్ యూనివర్సిటీ లైబ్రరీకి దాదాపు నడిచే దూరంలో వుంది ఓ హెన్రీ ఇల్లు. చిన్నకధల, మెరుపు ముగింపుల నిపుణుడైన ఇంటిని ఓ స్మారక చిహ్నంగా చేసి నడుపుతున్నారు. అక్కడ ఓ వాలంటీర్ చెప్తుంది, హెన్రీ జీవితం గురించి. అతడి కధల్లోని విభ్రమ కలిగించే మలుపులు ఆయన జీవితంలో కూడా వున్నాయి.

ఇది ఒక ఉదాహరణ మాత్రమే. లండన్ పేరిటా, ఇంకా ఎంతో మంది కవులూ రచయితల పేరిటా ఇలాటి స్మారక చిహ్నాలు ఎన్నో వున్నాయి అక్కడ.

twain

శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక వీధికి మార్క్ ట్వైన్ పేరు…

మనకి వెంటనే అనిపిస్తుంది, మన రచయితల్ని మనం ఎలా గుర్తిస్తున్నామని. ఎలా గౌరవిస్తున్నామని. హోటల్ కార్మికులుగా పనిచేసి బతికిన నాలుగురోజుల్లో గొప్ప సాహిత్యాన్ని అందించిన శారద, భుజంగరావుగారు, అలిసెట్టి ప్రభాకర్, బ్రాహ్మణీయ కవులకు ఏమాత్రం తీసిపోకుండా శతాబ్దం కిందటే గొప్ప కవిత్వం రాసిన గుర్రం జాషువా లాటి ఎంతోమంది ప్రతిభావంతమైన రచయితల గుర్తులు మనపిల్లలకు ఎలా అందకుండా చేస్తున్నామో కదా అనిపించింది. ప్రజలకి ఏమాత్రమూ ఉపయోగపడని, మంచి చెయ్యని రాజకీయనాయకులకోసం వందల ఎకరాల్లో కడతారు సమాధులు. కానీ, ప్రజల దుఖ్ఖాన్ని, సంతోషాల్ని, పోరాటాల్ని, అవమానాల్ని, సంస్కృతిని పొదివిపట్టుకుని భవిష్యత్తుకోసం నిక్షిప్తం చేసే రచయితల్నీ, కవుల్నీ, కళాకారుల్నీ మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యనేచెయ్యం.

 

impromptu

టెక్సాస్ యూనివర్సిటీ లైబ్రరీలో ఈ కాఫీ షాప్ పేరు “J. Alfred Prufrock Love Song ” అది మహాకవి టి. యస్. ఎలియట్ ప్రసిద్ధ కవిత. కవిత పేరే కాఫీ షాప్ పేరు అన్న మాట.

వీకెండ్ సాయంత్రాలు ఎదో ఒక పుస్తకాల షాపులో poetry recitalజరుగుతూనే వుంటుంది. ఒక recital లో కల్పన, అఫ్సర్.

వీకెండ్ సాయంత్రాలు ఎదో ఒక పుస్తకాల షాపులో poetry recitalజరుగుతూనే వుంటుంది. ఒక recital లో కల్పన, అఫ్సర్.

పుస్తకాలపట్ల, రచయితలపట్ల అమెరికా ప్రజలు చూపే ఈ ప్రేమే బహుశా అన్నీ కళారూపాలపై పడుతుంది. న్యూయార్కులో బ్రాడ్వేలో ఇప్పటికీ ఎన్నో రంగస్థలాలున్నాయి. ముందుగా బుక్ చేసుకోకపోతే టికెట్లు దొరకనంత నిండిపోతాయి హాళ్ళు.

అక్కడి లైబ్రరీలు చూశాక దిక్కూదివాణంలేక, కొత్త పుస్తకాలులేక, పాత పుస్తకాల కొత్త ఎడిషన్లులేక నిర్వీర్యమైపోయిన మన యూనివర్సిటీ లైబ్రరీలు గుర్తొస్తాయి మనకి వెంటనే. ఏ యూనివర్సిటీ లైబ్రరీ చూసినా, పోటీ పరీక్షలకి తలపడే విద్యార్ధులేకానీ, మిగతా పుస్తకాలని చదివే వారే కనబడరు. దానికి మనం విద్యార్ధుల్ని తప్పుపట్టలేం. అది వ్యవ్యస్థకి సంబంధించిన అంశం. చదువుకునే సమయంలో చదవనీకుండా చేసే పోటీ ప్రపంచపు దివాళా సంస్కృతి అది. మనం చదువుకోవడం దానికి ఇష్టం వుండదు. అందుకే మెజారిటీ ప్రజలకి చదువుని దూరం చేశాం. ఇప్పటికీ చేస్తున్నాం, ఇంకో రూపంలో.

(ఆఖరి భాగం)

-కూర్మనాథ్

కాందిశీకుడి ప్రేమ

 kurma

రెండునెలలుగా ప్రయత్నిస్తున్నాను తప్పించుకోడానికి. కానీ, ఇక తప్పింది కాదు. అఫ్సర్ పట్టుదలముందు నా ప్రయత్నాలు ఫలించలేదు. కాలమ్ రాయడమంటే సాహసమే కదా. నెలా నెలా రాయాలంటే ఎంత కష్టం. డెడ్ లైన్లను అసహ్యించుకునే అనేకానేక జర్నలిస్టులలో నేను కూడా ఒకడిని. పీకమీదకొచ్చేదాకా అక్షరం కదలదు. అట్లని రాయడానికి ఏమీ లేదని కాదు. కేవలం రాయడం వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రాయాలి. తమకు మాత్రమే తెలిసిన, తాము మాత్రమే చూసిన, అర్ధం చేసుకున్న ప్రపంచాన్ని తప్పనిసరిగా అందరూ రాయాలి.

ఇంత సంక్లిష్టమైన, విశాలమైన, సుందరమైన, నీచమైన, ప్రేమాస్పదమైన లోకాన్ని గురించి ఎంతెంత మంది, ఎన్నెన్ని తీర్ల చెప్తే తప్ప ఎలా పూర్తిగా వర్ణించగలం?

పతంజలిగార్ని ఏదైనా సభలో మాట్లాడమంటే అనేవారు, మాట్లాడడం ఎందుకండీ అని. “ఏవో నాలుగు ముక్కలు రాసుకోవడం సులభం కదండీ. మాట్లాడే పని ఎందుకు మనకి” అనేవారు.

నన్నోసారి అడిగారు, ఈ మధ్య ఏం రాసేరండీ అని. నేనన్నాను, “రాయడం ఎందకండీ, రాయడం కంటే చదవడం సులభం కదండీ,” అని. గురువుగారికి తనమాటల్నితనకే అప్పచెప్తున్న విషయం అర్ధం అయి నవ్వేరు. ఆయన నవ్వే అందమైనది.

తప్పించుకోడానికి అంటాం కానీ, జర్నలిస్టులకు రాయడం తప్ప ఇంకేం చేతనవుతుంది? కొందరు జర్నలిస్టులు (రచయితలు కూడా అయిన పతంజలిగారి లాటి వాళ్ళ గురించి చెప్పనే అక్కర్లేదు) గొప్పగా రాస్తారు. ఇంకొందరు ఓ మోస్తరు రాస్తారు. కానీ, రాయడం రాయాలి కదా ఏదో ఒకలాగా. జర్నలిస్టు సాక్షి కదా — సమస్త వైతరణీ నదులకూ, హింసా-ప్రతిహింసలకూ, వింతలకీ, వినోదాలకీ, చారిత్రక సంక్షోభాలకీ, వేదనలకీ, ప్రేమలకీ, వంచనలకీ. ఏదో ఒకటి రాస్తూనే వుండాలి, ప్రతిరోజూ.

అందుకే మొత్తానికి రాద్దామనే నిర్ణయించుకున్నాను. నాకళ్లతో చూసింది, నాకు అవగతమైంది, నాకు సాధ్యమైనంతమేర రాద్దామని. సరిగ్గా రాద్దామనుకున్న సమయానికి తెలంగాణా వచ్చేసింది. ఇక తెలంగాణ గురించి కాకుండా ఈ ఉద్వేగభరితమైన సందర్భంలో ఎవరైనా ఇంకేం రాయగలరు? జరిగేది అధికారమార్పిడి మాత్రమే. రాత్రికి రాత్రి ఏదో స్వర్గం వచ్చేస్తుందని కాదుకాని, ఇది ఒక తప్పనిసరి పోరాటం. ఒక అనివార్యమైన మజిలీ.

charminar

నా జీవితంలో దాదాపు సగం హైదరాబాద్ లోనే గడిచిపోయింది. పుట్టి పెరిగి, చదువుకున్న ఉత్తరాంధ్రలో ఎన్ని సంవత్సరాలు వున్నానో, ఇక్కడ కూడా అన్నే సంవత్సరాలు వున్నాను. ఇరవై ఏళ్ల పాటు చాలా దగ్గరి నుంచి చూశాను తెలంగాణాని, ఇక్కడ ప్రజల్ని. జిల్లాల్లో ఎన్నో సార్లు తిరిగాను, రైతులతో మాట్లాడాను. కేవలం జర్నలిస్టు కళ్ళతో మాత్రమే కాదు, విప్లవోద్యమం దృక్కోణంతో కూడా చూశాను. ఇక్కడి అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి తెలంగాణా ప్రజలు ఎదుర్కొనే కనిపించని దాడిని కూడా చూశాను. మా బంధువులు కొందరు, “అదేవిట్రా, వీడికి తెలంగాణా భాష వచ్చేసింది,” అని మొహం మీదే అనడం చూశాను.

“మదర్ టంగ్ కదా, వస్తుంది,” అని అప్పటికైతే వాడు సమాధానం ఇచ్చాడు. కానీ, వాడి మనసు విరిగే వుంటుంది.

ఇలాటి ఎన్నో సందర్భాలకి సాక్షి అయినవారెవరైనా తెలంగాణాకు బేషరతు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం గాని, ఇస్తే ఏం ఆశ్చర్యం. ఇక ఈవాదనల్ని చేస్తున్నందుకు అక్కల దగ్గర్నుంచి, కజిన్ల దగ్గర్నుంచి, ప్రాణమిత్రుల్నించి ఎదుర్కొన్న ప్రశ్నలు అన్నీ ఇన్నీ కాదు. ఆస్తికి సంబంధించిన, ఆధిపత్యానికి సంబంధించిన ఎవరివో వాదనల్ని మనం మీదేసుకుంటున్నామని వాదించేను. కొందరు నిజంగానే కలిసివుంటే మంచిది కదా అన్న మానవ సహజమైన, న్యాయబధ్ధమైన వాదన చేశారు. మా ఫాదర్ కూడా అన్నారు, కలిసి వుండాలి అనుకోవడం తప్పెలా అవుతుందని.

అవును, కలిసి వుండాలనుకోవడం తప్పెలా అవుతుంది? మనం మనుషులం కదా. ప్రేమికులం కదా. నలుగురు మనుషులు కలిసి జీవించడాన్ని కలగన్న వాళ్ళం కదా. కానీ, మరి కలిసి వుండడానికి మనం అర్హులం అయివుండాలి కదా. అంటే, కలిసివుండాలి అనుకునేవారు అందరూ అర్హులుకాదని కాదు. ఒక జాతిగా మరో జాతిని ఎలా చూసేం అన్నదాని బట్టి వుంటుంది కదా ఆ అర్హత.

అందుకే, తెలంగాణా వచ్చిన రోజున విజయనగరం నుండి మా ఫాదర్ ఎస్ ఎమ్ ఎస్ ఇచ్చారు, “అభినందనలు” అని. అవును, మాది ఉత్తరాంధ్రనే. మా శుభాకాంక్షలు మా పిల్లలకి, పోరాడినవాళ్ళకి, తెలంగాణకి. వాళ్ళు ఇక మానవీయ, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం కొనసాగించాలి. మొన్నటి లాగానే, రేపు కూడా మా మద్దతు వుంటుంది.

– కూర్మనాథ్

పాడని పాట

kurma

మేరి భీగి భీగిసి , పల్కోన్ పే రెహ్గయీ

జైసే మేరే సప్నే బిఖర్ కె

కిశోర్ కుమార్ పాడుతున్నాడు గొప్పగా, ముక్కలైపోయిన సుందర స్వప్నం గురించి. శోకంలో తడిసిన హృదయం కారుస్తున్న కన్నీళ్లు అతడి గొంతులోంచి పాటలా అనువాదం అవుతున్నాయి.

 జలే మన్ తెరాభీ, కిసీ కె మిలాన్ కొ

అనామికా, తు భీ తర్సే

తుఝే బిన్ జానే, బిన్ పెహ్ చానే

మైనే హృదయ్ సే లాగాయా

 గుర్తుచేస్తున్నాడు, తననెట్లా ప్రేమించిందీ. ఎంత గొప్పగా ఊహించుకున్నదీ.

కానీ నేను వింటున్నది అది కాదు. కిశోర్ కుమార్ గొంతులో పలికిస్తున్న వేదనని పలికించడానికి హీరో తంటాలు పడుతున్నాడు. నేను చూస్తున్నది అదికాదు. ఆయన పాటకి విలవిలా కొట్టుకుంటున్న కథానాయికని చూస్తున్నాను. బాణం గుండెల్ని నిలువునా చీలిస్తే అమాంతం విరుచుకు పడిపోయిన లేడిలా వుంది ఆమె. తప్పు చేసిన దానిలాగానో, అపరాధభావం కుంగదేస్తుంటే నోట మాట రానిదైన లాగానో ఆమె అతడిని తప్పించుకో చూస్తోంది.

కానీ, అతడు వెంట పడుతున్నాడు. దొరికింది ఇక నలుగురిలో, ముక్కలు ముక్కలు చేద్దామన్నట్టు వున్నాయతడి చూపులు. గుర్తు చేసి మరీ కొడుతున్నాడు. లేడి ఇంకా ప్రాణాలతోనే వుండగా చర్మాన్ని కొంచెం చీరి, కొంచెం వుప్పు కారం వేసి చూస్తున్నట్టు చూస్తున్నాడు.

నాకు హిందీ పూర్తిగా రాదు. కానీ కిశోర్ కుమార్ మీద అభిమానం తో ఈ పాటని వందల సార్లు చూసివుంటాను. నాకు తెలిసిన పదాల అర్ధాలతో కిశోర్ పాటకి అర్ధాన్ని వెతుక్కున్నాను. భాషది ఏముంది. కిశోర్ శోకాన్ని, వేదనని పలికిస్తుంటే ఇక ఆ భాష రాకపోతే ఏం? కవి హృదయాన్ని మాత్రమే కాదు, పాత్ర హృదయాన్ని పూర్తిగా ఆవాహన చేసుకుని కిశోర్ పాడుతున్నాడు.

 

పర్ మేరే ప్యార్ కె బద్లేమే తూనే

ముఝ్కో యే దీన్ దిఖ్ లాయా

 

కానీ, నా ప్రేమకు బదులుగా నువ్వేమిచ్చేవు. ఎడబాటు. నరకం, అని సాధిస్తున్నాడు. ఇక తప్పించుకోలేవు నువ్వు. ఇంతమందిలో, ఈ వేడుకలో నువ్వు నాకు అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడేం చేస్తావు, అంటున్నట్టు నిలదీస్తున్నాడు.

 

ఆడదానితో స్నేహం నిప్పుతో సావాసం లాటిది

ఈ విషయాన్ని నేను ఎందుకు అర్ధం చేసుకోలేకపోయాను?

నాకేమైంది అసలు. ఒక విశ్వాస ఘాతుకురాలితో

ఎందుకు పడ్డాను ప్రేమలో……

అంటూ, ఆమెను చూపుల, పదాల పిడిబాకులతో గుచ్చుతూ వున్నాడు. ఆమె పారిపోలేక, కాళ్ళు పాతాళంలో పాతుకుపోయినట్టయి ఒక పల్చటి పరదా వెనుక దాగుంటుంది. ఛిద్రమైన గుండెని బయటికి కనిపించనీయకుండా అన్నట్టు కొంగుని భుజాలమీద నుంచి తీసి వడిసి పట్టుకుంది. కత్తులవాన నుంచి, శాపాల వెల్లువనుంచి ఆ పరదా కాపాడలేదని తనకి తెలుసు. కానీ, ఈ పెను వరదలోంచి ఆ చిన్న గడ్డిపోచ కాపాడక పోదా అని కావచ్చు. లేకపోతే, కొంచెం కనికరించి కొన్ని శూలాల్ని వదలకుండా వుంటాడని, కొన్ని ఆరోపణల్ని చేయకుండా వదిలేస్తాడని ఆమె ఆశ.

కానీ, ఆ కథానాయకుడికి జాలి లేదు. మనిషి లాగా కనిపించడం లేదు. ఆ గడ్డిపోచని కూడా కసితో లాగేసి, కొరికి నమిలేసి ఇలా అంటున్నాడు, ఆమెను హేళన చేస్తూ.

….తేరీ బేవాఫాయిపే, హసే జగ్ సారా

గలిగలీ గుజరే జీధార్సే

జలే మన్ తేరా

(నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని చూసి లోకం నవ్వుతోంది

ఇక, నువ్వెళ్లే చోటల్లా అది వింటావు

నీ హృదయం కూడా మండుతుంది, అవి విని)

తన ప్రేమకు ప్రతిగా ప్రేమనందించనందుకు నిందిస్తున్నాడు. శాపనార్ధాలు పెడుతున్నాడు. ఇక ఈ శిలువ వేసుకుని ఇక నీ జీవితమంతా తిరగాల్సిందేనని, లోకం తీర్పు కూడా ఇదేనని ప్రకటించేస్తున్నాడు. నేలదిగిన చూపుల్తో ఆమె ఏమైనా చెప్తామనుకుంటున్నట్టు చూస్తోంది. బెరుకు కళ్ళతో భయాన్నో, అశక్తతనో ప్రకటిస్తూ వుంటుంది. అసహాయారాల్నని అందామనుకుంటుంది. (లేదా, నాకు అలా అర్ధమయ్యింది.)

తన నిర్ణయం వెనుక ఏదైనా కారణం వుంటుందా అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు అతడు. వున్న ఆయుధాలన్నీ గుక్కతిప్పుకోకుండా వదులుతున్నాడు. గురితప్పకుండా, కళ్లలోకి చూసి పాడుతున్నాడు.

నేరారోపణా తానే చేసి, విచారణా తనేచేసి, తీర్పూ తానే ప్రకటించి, శిక్షనూ తానే అమలుపరుస్తున్నాడు. పాట అయిపోయింది. పాట’ అయితే అయిపోయింది కానీ, ఆ పాట దెబ్బకి ఆమె అపరాధభావంతోనో లేకపోతే అవమాన భారంతోనో చితికిపోయింది. ఆమె బహుశా ఆమె వున్నచోటనే కుంగి పోయివుంటుంది. బహుశా ఎన్నటికీ చెప్పలేని వేదనను కంటి రెప్పలవెనుక దాచుకుని వున్నది. ఆ మానసిక పరిస్థితిని ఆ నటి గొప్పగా అనువదించి చూపిస్తోంది.

పాట ముగియగానే చప్పట్లు కొట్టారంతా, అన్నిటికీ తమ మద్దతు వుందన్నట్టుగా — నీ బాధ సబబైంది, తన విశ్వాసఘాతుకం నిజమే, నీ తీర్పూ సహేతుకమే అన్నట్టు.

ఇప్పటికి ఈ పాటని వందల సార్లు విని వుంటాను. లేదా చూసి వుంటాను. మిగతా అన్ని పాటల్లాగా కేవలం కిశోర్ కుమార్ కోసమేనా? కాదేమో.

***

     అకారణంగా నేను కాదన్నపుడు, కనీసం మాట్లాడడానికి నిరాకరించినపుడు, లేదా సమయం లేదన్నపుడు  తను కూడా అప్పుడు ఇలాగే మదనపడి వుంటుందా? వేటగాడి దెబ్బకు దొరికిపోయిన లేడిలాగా తల్లడిల్లిపోయి వుంటుందా? ఏదో వత్తిడితోనే తప్ప, నీకు ద్రోహం తలపెట్టే వుద్దేశం లేదని చెప్దామనుకుంటుందా? ఆరోపణా నేనే చేసి, విచారణా నేనే చేసి, తీర్పు నేనే ఇచ్చేసి వుంటానా?

ఇది జరిగిన ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఏళ్ళు గడుస్తాయి జీవితంలో భారంగానూ, సులభంగానూ. కానీ ఆ తోవల వెంబడి గుచ్చుకున్న ముళ్ళు కొన్ని సలుపుతూ వుంటాయి ఎన్నటికీ. ఆ తలపుల బరువు మౌనంగా మోస్తూనే వుండాలి ఎవరైనా. మోసేవాళ్ళకి తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు.

ఇక ఎవరి తోవలు వాళ్ళు చూసుకున్నాక, తన సంగతి చెప్పాను విష్ణుకి. “అసలు ఈ విషయం తేల్చకముందే చూశావా ఎలా చేసిందో,” అని. సాధ్యమైనంత సానుభూతిని సంపాదించుకునే ప్రయత్నం నాకు స్పష్టం కనిపిస్తూనే వుంది. కానీ విష్ణు కొట్టిపడేసింది.

“అమ్మాయిల పరిస్థితి నీకెపుడు అర్ధం కావాలి? ఎన్ని వత్తిళ్ళు ఎంతలా పనిచేస్తాయో నీకేం తెలుస్తుంది. నువ్వే అంటున్నావు కదా కొద్దిపాటి పరిచయమేనని. నీకు చెప్పే అవతలి వాళ్ళతో మాట్లాడి వుండాల్సిందని ఎందుకు అనుకున్నావు” అన్నది, నాకు అసలు benefit of doubt అస్సలే ఇవ్వకుండా.

“అసలు సంభాషణే పూర్తిగా మొదలు కాలేదంటున్నావు. ఎలా అనుకున్నావు నువ్వు తను నీకు అన్నీ చెప్పే చేయాలని,” అని అంది.

ఆ మాటలతో గూబగుయ్యి మన్నట్టయింది. కూడబెట్టుకున్న self-pity కుప్పకూలిపోయింది రెండు క్షణాల్లో. ఆ రోజు విష్ణు అంత కటువుగా చెప్పి వుండకపోతే ఆ self-pity బరువుకింద ఏనాడో అణిగిపోయి వుండేవాడిని. ఆలోచించడం మొదలుపెట్టాను అప్పుడే, తన వైపు నుంచి.

ఇప్పుడు ఇలా ఇన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అనిపిస్తుంది, ఎంత తక్కువగా ఆలోచించానా అపుడు, అని.

***

   బహుశా అప్పటినుంచే ఈ పాటలోని హీరో వంకర సంభాషణలు చికాకు పెట్టడం మొదలుపెట్టాయి నాకు. ఆ రోత  మాటలు నేనే అన్నట్టు, నేనే నిలదీసి కుంగదీసినట్టు అనిపించేది. ఇక ఆరోజంతా సోంపకుండా అయిపోయేది.

ఈ పాటలో కధానాయికలాగా, మౌనంగా ఎవరికీ అర్ధం కాని, వినబడని పాట ఏదో తను పాడి వుంటుందా? నేను వినడానికి నిరాకరించి వుంటానా? ఇక, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వినబడని పాటేదో వెంటాడుతోంది. బహుశా, వెంటాడుతుందేమో ఎన్నటికీ — మళ్ళీ ఎప్పుడైనా, ఎక్కడైనా తనని కలిసి ఒక కరచాలనం చేసి కడిగేసుకునేవరకూ. లేదా కళ్ళతోనే చెప్పుకునే వరకూ.

(ఎన్ ఆర్ అనుభవం విని)

–కూర్మనాథ్