సగం చెక్కిన శిల్పం

 

 

చూరు మీంచి వర్షం ధారగా పడుతోంది. అక్కడే నిలబడి అరచేతులతో ఆ ధారని పైకి కొడుతూ ఆడుతున్నాడు మోహన్.

“వర్షంలో ఆడకు. లోపలికి రారా మోహన్.” అరిచింది తల్లి.

“నేను వర్షంతో ఆడుకుంటున్నా. వర్షంలో కాదు” అన్నాడు మోహన్.

“చెప్పిన మాట ఎప్పుడైనా విన్నావా” అంటూ రెక్క పట్టుకుని లోపలికి లాక్కొచ్చి కంచం ముందు కూర్చోబెట్టి “తిను ..” అంది. అప్పుడే మోహన్ తండ్రి ఇంటికి వస్తూ “ఏరా జేబులో ముప్పై రూపాయలు కనిపించడం లేదు తీసావా?” అనడిగాడు. అలానే తలొంచుకొని తింటున్నాడు ఏమి ఎరగనట్టు.

“నిన్నేరా అడుగుతోంది చెప్పు, తీసావా?” అనడిగింది తల్లి.

“నాకేం తెలియదు” అన్నాడు మోహన్.

“వాడిని అలా అడిగితే ఎందుకు చెప్తాడు.” అంటూ పైన షెడ్ రేకులో ఉన్న బెత్తాన్ని లాగాడు.

“నిజంగా నాకేం తెలియదు నాన్న” అన్నాడు భయంగా.

“తెలియదా?” కోపంగా చూస్తూ అడిగాడు తండ్రి. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరినీ చూస్తున్న మోహన్ తల్లికి విషయం అర్ధమైంది. మోహన్ తల మీద ఒక మొట్టికాయ మొట్టి “ఏం చేసావ్ రా ముప్ప్పై రూపాయలు?” అనడిగింది మోహన్ని.

“వాడిని అలా అడిగితే ఎందుకు చెప్తాడే,,” అంటూ రెక్క పట్టుకుని పక్కకు లాగాడు. కాళ్ళ మీద బెత్తంతో కొడుతూ “బొమ్మలు చెక్కుతాడంత ఈడు. ఉలి కొన్నాడు. అది వంద రూపాయలు అయితే ముప్పై ఇచ్చి డెబ్బై అరువు పెట్టాడు. ఆ కొట్టు వాడు ఇంటికొస్తుంటే నన్ను అడిగాడు డెబ్బై ఇమ్మని. ఇచ్చాను. దొంగతనం చేయడం కూడా నేర్చుకున్నాడు ఈ ఎదవ ” అంటూ తట్టు తేలేలా కొట్టాడు.

“ఇంకెప్పుడు చేయను నాన్నా, కొట్టకు నాన్నా” అన్నాడు బతిమాలుతూ.

దూరంగా నెట్టేసి “ఇయాల ఈడికి అన్నం పెట్టకు. కడుపు మాడితే తెలుస్తాది ఎదవకి.” అని చెప్పి విరిగిన కర్రను విసిరేసి వెళ్ళిపోయాడు. అక్కడ కర్రతో పాటు మోహన్ మనసు కూడా విరిగిపోయింది.

 

*             *             *

ఉదయాన్నే మోహన్ అన్నయ్య మురారి వచ్చాడు. వస్తూనే “అమ్మా తమ్ముడేడి?” అడిగేడు బ్యాగ్ కింద దించుతూ. మంచి నీళ్ళు అందించి “వాడేం చేస్తున్నాడో ఏమి అర్ధం కావడం లేదురా మురారి” అంది తల్లి.

“ఏం చేసాడమ్మా?” అనడిగాడు మురారి.

“ఏం చేసాడా! దొంగతనం చేసాడు.” అన్నాడు తండ్రి టిఫిన్ తింటూ.

“ఎక్కడున్నాడు?”

“అదిగో పెరట్లో ఎక్కడో ఉంటాడు. ఏం తినడంట. కోపం వచ్చిందంట నిన్న అన్నం పెట్టకు అన్నాను. ఈరోజు ఎందుకు తెచ్చారు అని పొమ్మన్నాడు. పౌరుషానికేం తక్కువ లేదు ఎదవకి.” అన్నాడు తండ్రి టిఫిన్ తినేసి చేతులు కడుగుకుంటూ.

“ఎందుకు నాన్న వాడిని అలా చేస్తారు” అని తమ్ముడి కోసం పెరట్లోకి వెళ్ళాడు టిఫిన్ ప్లేట్ తీసుకుని.

నూతిలోకి చూస్తూ ఏడుస్తున్నాడు మోహన్. అతని కన్నీరు అందులో పడుతుంటే నీటిలో అలజడి అవుతుంటే చూస్తూ ఉన్నాడు.

“తమ్ముడూ..” పిలిచాడు. వెంటనే వెనక్కి చూసాడు. ఆనందంతో పరిగెత్తికెళ్ళి అన్నయ్యని పట్టుకుని ఏడ్చాడు. “అన్నయ్య నన్ను కొడుతున్నారన్నయ్యా.. చూడు నాన్న ఎలా కొట్టాడో అంటూ కాలు చూపించాడు. నేను ఇక్కడ ఉండను అన్నయ్య. నన్ను నీతో తీసుకెళ్ళిపో అన్నయ్యా , ప్లీజ్ అన్నయ్యా ” అని బతిమాలాడు మోహన్.

“సరే తీసుకెళ్ళిపోతాను. ముందు టిఫిన్ చేయి” అని టిఫిన్ ప్లేట్ ఇచ్చాడు. రాత్రి కూడా ఏమి తినలేదేమో ఆబగా అంతా ఆవురావురు మంటూ తినేసాడు.

కాసేపు అయ్యాక  “చెప్పు ఎందుకు తీసావ్ ముప్పై రూపాయలు?” అనడిగాడు మురారి.

“ఉలి కొన్నాను” అన్నాడు మోహన్ తలొంచుకుని.

“ఎందుకు?” అనడిగాడు మురారి చిరు నవ్వుతో.

“ఎందుకేంటి అన్నయ్యా, మొన్న మనూరి శివుడి గుడికెళ్ళాను. అక్కడ ఎవరో ఫారనర్స్ వచ్చి గుడి మీద చెక్కిన బొమ్మలు ఫొటోస్ తీసుకుంటున్నారు. మా సోషల్ సార్ కూడా వచ్చారులే అప్పుడు, ఆయన వాళ్ళకు మన దేశ శిల్ప కళ చాలా గొప్పదని చెప్తున్నారు.. అప్పుడు నేను సార్ ని అడిగాను. నాకేలాగో చెక్క మీద బొమ్మలు చేయడం వచ్చు కదా, అందుకని ఇలా రాళ్ళ మీద ఎలా చేస్తారు అని అడిగాను. ఉలితో అని చెప్పారు. ఉలి ఎలా ఉంటుంది అని అడిగాను. చెప్పారు. మన సాంబడి కొట్లో దొరుకుతుంది అన్నారు. వెంటనే కొనేయాలి అనిపించింది. నా దగ్గర డబ్బులెక్కడివి? అందుకే నాన్న జేబులో తీసాను. నాకేం తెలుసు మిగిలిన డబ్బులు వాడు నాన్నని అడుగుతాడని? నువ్వొచ్చాక నీ దగ్గర తీసుకుని ఇద్దాం అనుకున్నాను.” అని ముగించాడు.

“సరే, బాగుంది. కాని ఈసారి డబ్బులు కావాలంటే నన్ను అడుగు సరేనా. అంతేగాని ఇలా డబ్బులు తీసి తన్నులు తినకు. ” అని చెప్పాడు మురారి.

“సరే అన్నయ్యా” అని మాట ఇచ్చాడు. మురారి హైదరాబాద్ లో ఎం.బి.బి.యస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ టెన్త్ పరీక్షలు రాసి రిసల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

నాలుగు రోజులు ఉండి వెళ్ళడానికి సిద్ధ పడ్డాడు మురారి. అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అంటే మోహన్ కి అప్పుడే బెంగ పట్టుకుంది. “ఇంకో రెండు రోజులు ఉండు అన్నయ్యా” అనడిగాడు మోహన్.

“నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయిరా. వచ్చేస్తాను. వచ్చేవారం నీ రిసల్ట్ రోజు ఇక్కడే ఉంటాను. ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయు సరేనా .” అని చెప్పి బయలుదేరాడు మురారి.

 

*             *             *

 

మురారి వెళ్ళినప్పటి నుండి మోహన్ అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు. పొద్దున్నే బయటకు పోయి రాత్రికి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు మోహన్ ఎక్కడున్నాడో చూడమని మోహన్ ఫ్రెండ్ రాంబాబుకి చెప్పింది మోహన్ తల్లి. మోహన్ ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఊరవతల కొండ మీద రాయి మీద ఏదో చెక్కుతూ కనిపించాడు మోహన్.

“ఇక్కడేం చేస్తున్నావ్ రా ?” అనడిగాడు రాంబాబు ఆయాస పడుతూ.

“చూడు,” అన్నాడు మోహన్  వెలిగిపోతున్న మొహంతో.

ఆ కొండ మీద ఉన్న ఒక పెద్ద రాయి మీద ఆ ఊరు ఎలా కనిపిస్తోందో చెక్కే పనిలో ఉన్నాడు. ముందుగా సుద్దతో దాని మీద బొమ్మ గీసుకుని చెక్కుతున్నాడు. ఆశ్చర్యంగా చూసాడు రాంబాబు. “ఓడియమ్మ, భలే చెక్కావ్ రా,” అన్నాడు రాంబాబు.

అప్పుడే అక్కడికి వచ్చిన మరో ఫ్రెండ్ గిరి “ఏం చేస్తున్నార్రా ఇక్కడ?” అనడిగాడు.

“చూడరా, మనోడు ఎలా చెక్కాడో.” అని చేయి పెట్టి చూపించాడు రాంబాబు.

“బానే ఉందిరా, రేపు మన రిసల్ట్స్, తేడా వస్తే వాడికి బడిత పూజే” అని అన్నాడు గిరి. మతాబులా వెలిగిపోతున్న మోహన్ ముఖం భయంగా మారిపోయింది.

Kadha-Saranga-2-300x268

 

*             *             *

హాస్టల్ లో మురారిని అతని ఫ్రెండ్ పలకరిస్తూ “రేపే కదా టెన్త్ రిసల్ట్? అన్నట్టు మీ తమ్ముడే టెన్త్ క్లాసే కదా” అనడిగాడు.

“అవును. వాడికి చదువు అంతగా అబ్బలేదు. కాని బొమ్మలు బాగా చెక్కుతాడు. మన ల్యాబ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవకపోతే ఈరోజే వెళ్ళేవాడిని. కాని రేపు ఎగ్జామ్ అయ్యాక బయలుదేరుతాను. ఇదిగో చూడు వాడు చెక్కిన బొమ్మ” అని ఒక చెక్క బొమ్మను తీసి చూపించాడు మురారి.

“చాలా బాగా చెక్కాడు రా” అని మెచ్చుకున్నాడు అతని ఫ్రెండ్.

“ఓకే. ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను. ఎందుకైనా మంచిది, తమ్ముడిని కంగారు పడద్దని చెప్తాను.” అని చెప్పి కాల్ చేసాడు.

పెరట్లో ఉన్న మోహన్ ఫోన్ రింగ్ విని అన్నయ్యే అయి ఉంటాడని ఇంటిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో తండ్రి ఫోన్ ఎత్తాడు. “హలో..”

“హలో నాన్నా , నేను మురారి. రేపు సాయంత్రం బయలుదేరి వస్తాను. అదే రేపు తమ్ముడి రిసల్ట్ కదా. వాడితో చెప్దామని చేసాను. తమ్ముడు ఉన్నాడా?” అనడిగాడు మురారి.

“లేడు, బయట ఆడుకుంటున్నాడు అనుకుంట!!” మోహన్ ని చూస్తూనే చెప్పాడు.

“సరే, నేను కాల్ చేసానని చెప్పండి. ఉంటాను .” అని ఫోన్ కట్ చేసాడు. మోహన్ ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్నాడు.

“ఏరా రేపు నీ రిసల్ట్ అంట, చెప్పలేదే? పాస్ అవకపోతే చచ్చావన్నమాటే ” అన్నాడు తండ్రి.

“అన్నయ్య ఫోన్ చేస్తే నాకు ఎందుకు ఇవ్వలేదు ” గట్టిగా అరిచాడు మోహన్ .

“ఆడేమైనా నీలా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడా? లేక పిచ్చి బొమ్మలు చేసుకుంటున్నాడా? ఆడు డాక్టర్ ,, నా కొడకు,” గర్వంగా చెప్పుకున్నాడు తండ్రి.

“నేను నీ కొడుకునే ” రోషంగా అన్నాడు మోహన్.

“ఏంటిరా నోరు లెగుత్తాంది?” అనడిగాడు తండ్రి.

“మీరు మాట్లాడించకపోయినా పరవాలేదు. నా దగ్గర డబ్బులున్నాయి. నేనే అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతాను” అని చెప్పి ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు. తండ్రి వెనకాలే ఎంత అరిచినా పట్టించుకోకుండా గేటు దాటి వీధిలోకి దారి తీసాడు.

నాలుగు వీధుల తరువాత ఉన్న కాయిన్ బాక్స్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. కాసేపు అక్కడే ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. ఆయన అలానే మాట్లాడుతున్నాడు. షాప్ మూసేసే టైం అయిందని కొట్టు వాడు చెప్పాడు. అది విని ఆ మాట్లాడే ఆయన దగ్గరకు వెళ్లి  “సార్, ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. మా అన్నయ్యకు కాల్ చేసుకుంటాను. ఒక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాను” అని బతిమాలాడు. ఆయన మొహాన్ని పట్టించుకోలేదు. లాభం లేదు.. షాప్ వాడు వచ్చి ఫోన్ వైర్ పీకేసి ఆ పెద్దమనిషిని విసుక్కుంటూ ఫోన్ ని లోపలికి పట్టుకుపోయాడు. చేసేది లేక ఇంటికి పరిగెత్తాడు. ఇంటి దగ్గర తండ్రి “ఏరా ఎక్కడ తిరుగుతున్నావ్? వచ్చి తిను. మీ అన్నయ్య రేపు బయలుదేరి వస్తానని చెప్పమన్నాడు” అని చెప్పాడు. మోహన్ కి అన్నం తినాలనిపించలేదు. ఉదయం ఎలా అయినా అన్నయ్యతో మాట్లాడాలి అని అనుకుంటూ నిద్రపోయాడు. తొమ్మిదింటికి మెలకువ వచ్చింది. గబగబా ముఖం కడుగుకుని వీధిలోకి పరిగెత్తాడు.

 

అప్పటికే గిరి, రాంబాబులు ఇంటర్నెట్ సెంటర్ కి వచ్చేసారు. ఇంకో అరగంటలో మన జాతకాలురా అన్నాడు గిరి నవ్వుతూ. మోహన్ కి చాలా దడగా ఉంది. కంగారులో హాల్ టికెట్ నెంబర్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఒరేయ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంటికి పరిగెత్తాడు. తిరిగి వచ్చేసరికి గిరి, రాంబాబులు ఇద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి. “ఒరేయ్ మేము పాస్ రా” అన్నాడు గిరి.

“నీ నెంబర్ ఎంతరా?” అనడిగాడు రాంబాబు. ముఖం మీద ఉన్న చెమటను తుడుచుకుని జేబులోంచి నలిగి ఉన్న హాల్ టికెట్ భయంగా అందించాడు మోహన్. లోపలికి వెళ్లి వచ్చి ఒరేయ్ పది రూపాయలు అడుగుతున్నాడురా ఇంటర్నెట్ వాడు అన్నాడు గిరి. లోపలే ఉన్న రాంబాబు నెంబర్ చెక్ చేసాడు. కనిపించలేదు. మోహన్  బయటే నిలబడే లోపల ఉన్న జనాల మధ్యలోంచి రాంబాబుని చూస్తున్నాడు. రాంబాబు మోహన్ ని చూసి పెదవి విరిచాడు ఫెయిల్ అయ్యావ్ అన్నట్టుగా. అందరు మోహన్ ని చూసారు. బయటకు వచ్చి “ఒరేయ్ మోహన్, నువ్వు  ఫెయిల్ అయ్యావు రా” అని చెప్పాడు గిరి.

మోహన్ బీతావహుడు అయిపోయాడు. అన్నయ్య గుర్తొచ్చాడు. ఫోన్ చేద్దాం అనుకున్నాడు కాని జేబులో ఉన్న డబ్బులు ఇంటర్నెట్ వాడికి ఇచ్చేసాడు. ఒరేయ్ డబ్బులున్నాయా మా అన్నయ్యకు ఫోన్ చేయాలి అని అడిగాడు మోహన్.

“లేవురా, ఉంటే ఇందాక నిన్ను ఎందుకు అడుగుతానురా, నేనే ఇచ్చేవాడిని కదా” అన్నాడు గిరి.

“నా దగ్గర కూడా లేవురా, ” అన్నాడు రాంబాబు.

“ఇప్పుడెలారా? మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా?” అన్నాడు గిరి మరింత భయపెడుతూ.

 

ఇంటర్నెట్ షాప్ లోకి పరిగెత్తి రెండు కాగితాలు తీసుకున్నాడు. అక్కడే ఉన్న పెన్ తీసుకుని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొండ మీదకు చేరుకొని పెద్ద బండ రాయి నీడలో కూర్చుని ఏడ్చాడు. సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాడు. పెన్ తీసుకుని కాగితం ఏదో రాసాడు. రాసిన దాన్నే మళ్ళి మరో పేపర్ లో ఎక్కించాడు. దాన్నే హాల్ టికెట్ వెనకాల ఎక్కించాడు. హాల్ టికెట్ ని చొక్కా జేబులో పెట్టుకున్నాడు. రెండు కాగితాలను ప్యాంటు జాబుల్లో కుక్కాడు. సూర్యాస్తమయానికి సమయం అయింది. అదే సమయంలో మురారి ఉరికి బయలుదేరాడు. బస్సు లో ఉండగా ఇంటికి ఫోన్ ట్రై చేసాడు కాని సిగ్నల్ కలవలేదు. ఉదయం చేరుకుంటాం కదా అని ఊరుకున్నాడు. “ఏంటే మోహన్ ఇంకా రాలేదు” అనడిగాడు అన్నం కలుపుతూ తండ్రి భార్యతో.

“ఏమో .. చెప్పి వెళ్తున్నాడా?” అందావిడ ఇంకొంచెం కూర వడ్డించి.

 

రాంబాబు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. రొప్పుతూ నిలబడ్డాడు. అంకుల్ … మన మోహన్ గాడు రైలుకి ఎదురెళ్ళిపోయాడంట!!” అని చెప్పాడు.గబుక్కున లేచాడు. కంచం కాలికి తగిలిందన్న స్పర్శ కూడా పరిగెత్తాడు. ఆ మాట వినగానే మోహన్ తల్లి శోష వచ్చి పడిపోయింది. రాంబాబుకి కంగారు అనిపించి అక్కడి నుండి పారిపోయాడు. “కుర్రాడు కావాలనే ఇలా చేసాడట. చూసినోళ్లు ఆపాలనుకున్నారు. కాని కుదరలేదట” అని చెప్పాడు ఊరిలో పెద్దమనిషి. విడివడిన భాగాలను అతికించినట్టుగా పెట్టారు. శవాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు.  సూర్యోదయం దాదాపుగా అయింది. మురారి ఊరిలో దిగాడు. ఇంటి ముందు అంత జనం ఉండటం కొంచెం కీడు శంకించింది. కాని మనిషి కీడు అంటే ఒప్పుకోడు. ఒప్పుకోలేడు. మురారి చేతిలో బ్యాగ్ వదిలేసి ఇంటిలోకి పరిగెత్తాడు. స్థాణువైపోయాడు. “తమ్ముడూ ,,, ” అని వెర్రిగా అరిచాడు. కళ్ళల్లో కన్నీటి కెరటాలు ఎగసి పడ్డాయి. “ఎందుకిలా చేసావురా? చెప్పా కదరా, అవసరమైతే నాకు ఫోన్ చేయి అని” అంటూ రోదించాడు. రోదిస్తూ తమ్ముడి మీద పడ్డాడు. అంతే ఒక్కసారిగా వెనక్కి జరిగిపోయాడు. భయంగా వెళ్లి కప్పి ఉన్న గుడ్డ ఎత్తి చూసాడు. ఇంకా గట్టిగా రోదిస్తూ అరిచాడు. ప్యాంటు జేబులో రక్తంతో తడిసిన కాగితం కనిపించింది. ఎదురుగా కూర్చుని ఒక్కొక్క మడత విప్పాడు. అంతా నిశబ్ధం ఆవహించింది. అందరు ఆ కాగితాన్ని చూడసాగారు. అందులో ఈ విధంగా రాసి ఉంది

 

అనయ్య,

నెను పదొతరాగతి ఫయిల్ అయాను. అమ్మ, నాన నను కోడతరాని బయంతో చచ్చిపోతన. నన్ను క్షమిచు. ఇంట్లో నను నన్నుగా ఎవరు చుడటం లెదు. ఎప్పడు కొడుతూనారు. చాల నెప్పిగా ఉంటొంది అనయ్య. నువ్ బాగ చదవటం నాకు కూడ గొప్పె కాని ఆ సదువు నకు సరీగా రాలెదు అనయ్య. దానికి నెను ఏమి చయను అనయ్య . నీ మీద కొపంతో కాదన్నయ చచ్చిపోతున్నాది , నా మీద కొపంతోనే..! నీకొసం ఒక డాటర్ బొమ్మ చేక్కాను, అది నా గూట్లో ఉంది , తీసుకో.. ఫయిల్ అయి ఇంటికి ఎల్తే నను ఎలాగో అమ్మ నాన చంపెతారు. అందుకే నేనే చచ్చిపోతున్న ,, మల్లి నీకు బాగ చదివే తమ్ముడిగా పుటాలని కోరుకుంటున్న అనయ్య. నన్ను క్షమిచు. నెతో మాట్లాడదాం అనుకున్న, న దగ్గారున్న పది రూపాయలు నెట్ సెంటర్ లో కర్చు అయిపొయాయ్. . – ని తమ్ముడు మోహాన్.

 

ఉత్తరం చదివాక ఇంటి లోపలికి పరిగెత్తాడు. గూట్లో ఉన్న డాక్టర్ బొమ్మని తీసుకున్నాడు. వాకిట్లోకి వచ్చాడు నిస్తేజంగా. తండ్రి దగ్గరకి వెళ్లి నిలబడ్డాడు. ఆయన కళ్ళు కూడా ఏడ్చి అలసిపోయాయి. తలెత్తి మురారి చేతిలో ఉన్న బోమ్మ మీదుగా అతన్ని చూసాడు.

“నాన్న, ఈ బొమ్మని తమ్ముడు చెక్కాడు. జీవం లేని బొమ్మకు రూపం ఇచ్చాడు. నువ్వు చెక్కగలవా?” ప్రశ్నించాడు. మౌనం వహించాడు. తల్లి వైపు చూసి “నన్నేదో డాక్టర్ ని చేస్తున్నావని సంబరపడిపోతున్నారు గాని మా డాక్టర్స్ పోతున్న ప్రాణాలను కాపాడగలరేమో కాని పోయిన ప్రాణాలను తేలేరమ్మా” అని గద్గదమైన గొంతుతో చెప్పాడు.

కాసేపాగి కోపంతో” మీరే వాడిని చంపేశారు” అని అరిచాడు. “అవును, మీ వల్లే తమ్ముడు చనిపోయాడు. కాదు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి చదువు అబ్బకపోతే ఏమైంది? మీరేం చదువుకున్నారు? నేనొక పోసిషన్ కి వచ్చాక మిమ్మల్ని కూడా మీరు వాడిని నిర్లక్ష్యం చేసినట్టే చేస్తే మీరేం అయిపోతారు? అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నలభైకి పైబడిన మీకే ఇంత భయమేస్తుంటే చిన్న పిల్లాడు అమ్మా వాడు. పరిక్ష పోతే మళ్ళి రాసుకోవచ్చు, ప్రాణం పోతే.? అసలు నా చదువే వాడికి శాపం అయింది అమ్మా. ఇంట్లో ఏ ఇద్దరు ఒక్కలా చదవాలని లేదు. వాడికి వాడంటే కోపం అంట అమ్మ, అందుకే చచ్చిపోతున్నాను అని రాసాడంటే ఎంత కృంగిపోయుంటాడో కదా నాన్న? వాడు రాసిన ఉత్తరంలో ప్రతి లైన్ లో రెండు మూడు తప్పులున్నాయి. కాని ప్రతి అక్షరంలో వాడు పడ్డ  బాధ, భయం ఉన్నాయి నాన్న. పుట్టగానే ఎవడు మేధావి అవడు నాన్నా, ఎవరి ప్రతిభ ఎవరి నైపుణ్యత వారిది. నాన్న, తమ్ముడికి చదువు రాకపోవచ్చు కాని దేవుడు వాడికి ఎవరికీ రాని బొమ్మలు చెక్కే కళ ఇచ్చాడు. వాడి ఇష్టాన్ని మెచ్చుకోలేదు. అసలు పిల్లల నుండి ఏదో ఒకటి ఆశించడం తప్పు నాన్నా.. ఆశించి కనడం అనవసరం.  ఎందుకంటే కన్నాక పుట్టిన వాడుమీ ఆశలకు దూరంగా బతుకుతుంటే మీరు జీర్ణించుకోలేరు. అతని ఆశయాలకు మీలాంటి తల్లిదండ్రుల ఆశలకు మధ్య నరకం అనుభవించాలి. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా తమ్ముడు రాడు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన వచ్చిందంటే ఎంత నలిగిపోయుంటాడో కదా నాన్నా? ప్రతి పిల్లవాడికి అమ్మంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందులో చిన్న వాళ్ళకు మరీను, పాపం ఆ రైలు గుద్దినపుడు ఆ నొప్పితో వాడు అమ్మా..!! అని ఎంత గట్టిగా అరిచి ఉంటాడో కదా అమ్మ!?”  అని తమ్ముడి ముందు మోకాళ్ళపై పడి అతని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు.

 

పది రోజులు పోయాక రాంబాబు మురారిని కొండ మీదకి తీసుకెళ్ళాడు. అక్కడ రాయి మీద అత్యంత అద్భుతమైన ఊరుని చెక్కిన తీరు మురారికి కించిత్ ఆశ్చర్యం కలిగించింది  ఆ సగం చెక్కిన శిల్పాన్ని తడిమి చూసాడు. “వాడేం చేస్తాడు పాపం దేవుడు కూడా వాడిని సగమే చెక్కి పంపాడు.” అని అన్నాడు.

 

*                   *