ఒక్కోరోజు..

1173881_719118168118659_732866424_n

ఒక్కోరోజు..
ఎవరి భారాన్నో
వీపుమీద మోస్తున్నట్టు
ఆలోచన తిప్పుకోదు ఎటువైపు

ఒక్కోరోజు..
కాకి రెక్కలు కట్టుకొని
ఎక్కడికీ ఎగిరిపోదు
రావిచెట్టు రాలు ఆకుల నడుమ
ఏ పిచ్చుక పిచ్చిరాగం తీయదు

ఒక్కోరోజు..
శూన్యం మరీ సంకుచితమై
మూసుకున్న తలుపులు, కిటికీల మధ్య
అలికిడి లేని అలజడి అవుతుంది
బయటకు నడిచిపోదు గది ఎప్పుడు

1932330_10202661888241320_485832493_n

ఒక్కోరోజు..
ఒక కరస్పర్శ కోసం
ఒక కమ్మని కంఠధ్వని కోసం
అలమటిస్తుంటాం- స్వీయశిథిలంలో

ఈ మానవ మహా సముద్రం మీద
ఇరుకిరుకు ఒంటరి ప్రయాణం
కాసింత ఉప్పునీటి ద్రవం కోసం
ఒక ఎడారి గుండె గాలింపు.

– కాంటేకర్ శ్రీకాంత్

చిత్రరచన: అన్నవరం శ్రీనివాస్