కనువిప్పు

 

  కరుణాకర్

~

 

మొన్న మేడమ్ గారి రౌద్రోపన్యాసం విన్నపటినుండి నాలో చిన్న భయం మొదలైంది. కొంపతీసి నేనుగాని దేశద్రోహుల లెక్కలోకి రాను గదా అని. ఇదే మాట మా ఝాన్సీతో( అంటే మా ఆవిడ)అన్నాను. దీనికి కారణం లేకపోలేదు.

అపుడెప్పుడో ఎన్టీయార్ దానవీరకర్ణ సినిమాలో దేవతలు దేవుళ్ళ జుగుప్సాకర పుట్టుపూర్వోత్తరాల్ని గుక్కతిప్పుకోకుండా తూర్పాలు పట్టగావిని, ఓ నాలుగు ముక్కలు బట్టిబట్టి నోరూరుకోక వాళ్ళదగ్గరా వీళ్ళదగ్గరా వాగేసి ఉన్నాను కదా. వీళ్ళల్లో ఎవరన్న ఉప్పందిస్తే నాగతి ఏంగాను.

“ముందు ఆ డైలాగులు రాసినోళ్ళు, పలికినోళ్ళ తర్వాత కదా మీ వంతు” అని ధైర్యం చెప్పబోయింది మా ఆవిడ. “వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు కదా “అని అంటుండంగానే ఎదురుగా ఉన్న పుస్తకాలా ఆరమరలో అడ్డంగా నిలబడి తాపిధర్మారావు దేవాలయాల మీదబూతుబొమ్మలు కనబడ్డాయి.

పెరుమాళ్ మురుగన్ మనసులో మెదిలాడు. ఒక్క పరుగున వెళ్ళి తీసి వంటగదిలో మచ్చుబల మీద పెట్టేశాను. హమ్మయ్య అనుకునేలోపు మొన్ననే కొన్నఇదండీ మహాభారతం గుర్తొచ్చింది. అది సరే అసలు అప్పుడెప్పుడో కొని అందరిచేతా చదివించిన రామాయణ విషవృక్షం? రావణాసురుడు ఉత్తముడనీ రామూడే అల్పుడనీ…వామ్మో రంగనాయకమ్మకి ఏమన్నా అవనీ. ముందు మన సేఫ్టీ ముఖ్యం. లోపలెక్కడో ఉన్న ’విషవృక్షాన్ని’ బయటకులాగాను.

ఇలా కాదని పాతలుంగీలో మూటకట్టాను.  మధ్యలో ఎక్కడో త్రిపురనే ని రామస్వామి చౌదరి తగిలాడు. పురాణ పాత్రలను తిరగేసి, బోర్లేసి చీల్చిచెండాడాడు కదా. పక్కనే పెరియార్. వీళ్ళందరికీ ఇట్లాంటి అలోచనలకు కారణమైన కోశాంబీ..అందర్నీ కట్టకట్టి మూటలోకి తోసాను. ఇంతలో వంటగదిలోనుంచి ఝాన్సీ గొంతు ’దేశమును ప్రేమించుమన్నా…’ పిల్లలకి నేర్పించడానికి ప్రాక్టీసు చేస్తున్నట్లుంది. ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది…అ,,,దొరికింది. దేశమును ప్రేమించుమన్నా అన్నడు కానీ భారతదేశమును ప్రేమించుమన్నా అనలేదు.

ఇక్కడ కొండల్నీ గుట్టల్నీ…ప్రవహించే పుణ్య నదుల్నీ మాటలైనా తలవనేలేదు కదా. ఇన్నాళ్ళూ ఎందుకు తోచలేదు. ’మతములన్నియు మాసిపోవును మానవత్వమే నిలిచి వెలుగును. మతములన్నీ మాసిపోతాయా…ఒక మతం కాదు అందరూ కట్టకట్టుకోని వస్తారేమో….మూటకు అర్హుడే. మతమంటే గుర్తొచ్చింది. సైన్సు నా మతమన్నడు కదా సి.వి.రామన్. సైన్స్ అరకేసి చూశాను. భౌతికశాస్రం, రసాయనశాస్త్రం ఈ శాస్త్రాలన్నీ కలసి విశ్వాసాలను వెక్కిరించినట్లనిపించింది. సైన్స్అర ఖాళీ అయింది. ఆ మాటకొస్తే ఆలోచన, వివేకమూ కలిగించే పుస్తకాలన్నీ ఏదో ఒకమేరకు విశ్వాసాలను కాదనేవే. రిఫరెన్స్ కోసం కొన్న భగవద్గీత, ఏవో యోగాసనాల పుస్తకాలూ తప్ప అన్నీ ప్రమాదంగానే తోచాయి. లుంగీ చాల లేదు.

అనవసరంగా పుస్తకాలకోసం ఒక అరకట్టించి తప్పుచేశా. ఈసారి విష్ణుసహస్రనామాలు, హనుమాన్ చాలీసాలాంటి పుస్తకాలన్నా కొనాలి. విశాలాంద్రకూ ప్రజాశక్తికీ కాదు. రామకృష్ణ మఠానికో టిటిడికో పోవాలి. ఈ ఆలోచనతో మనసు కాస్త కుదుట పడింది. ఒక నిముషం సోఫాలో కూలబడ్డాను.

~