నలుగురికి ‘కథా కోకిల’ అవార్డులు

 

ప్రసిద్ధ కథకుడు మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు 2011 కి స.వే రమేశ్, అఫ్సర్ లకు, 2012 కి మహమ్మద్ ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావులకు ఇస్తున్నట్టు మధురాంతకం నరేంద్ర ప్రకటించారు. ఈ అవార్డులు మే 18 న హోసూరులో జరిగే కథకుల సదస్సులో ప్రదానం చేస్తారు.

తెలుగులో కథాసాహిత్య రంగానికి సంబంధించి ఇస్తున్న అవార్డులలో మధురాంతకం పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు ఒక ప్రత్యేకత వుంది. ఆయా సంవత్సరాలలో కథా రచనలో, కథాసాహిత్య విమర్శ రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇస్తూ వుంటారు. ప్రతి ఏటా ప్రచురితమయ్యే కథావార్షికలోంచి ఒక ఉత్తమ కథకి, ఆ కథా వార్షికకి సింహావలోకనం రాసే విమర్శకుడికి ఈ అవార్డు లభిస్తుంది.

గత కొన్ని సంవత్సరాలుగా కథా వార్షిక ప్రచురణ ఒక సత్సంప్రదాయంగా తెలుగు సాహిత్యంలో స్థిరపడింది. ప్రతి ఏడాది ప్రచురితమయ్యే అనేక వందల కథలు చదివి, వాటిల్లోంచి డజను కథల్ని ఎంపిక చేయడమూ, వాటి గురించి విపులమయిన సింహావలోకనం రాయించడమూ ఒక ప్రయోగంగా మధురాంతకం నరేంద్ర చేపట్టారు. ఇందులో కథలన్నీ ఒక ఎత్తు అయితే, సింహావలోకనాలు ఇంకో ఎత్తు. ఆ ఏడాది వెలువడిన కథలని గురించి ఒక అవగాహన ఏర్పరచడం లో ఈ వార్షికలు విజయవంతమవుతున్నాయి.