కలవక కలవక కలిసినప్పుడు నిజమైన ముఖాముఖి…

drushya drushyam -22అవును. మీకు తెలుసు. ‘ముఖాముఖి’. ఇది పాత్రికేయంలోని ఒకానొక అంశం. అది ఇద్దర్ని చూపిస్తుంది. కానీ, ఒకరు ఒకర్ని ప్రశ్నించి అవతలి వ్యక్తిని ఆవిష్కరించే అంశంగానే ధ్రువ పడింది. కానీ, మనిషి ఒక మనిషిని కలవడం, ముఖాముఖి. ఇరువురూ ఆత్మీయంగా పరస్పరం అవలోకించుకునే సౌజన్యం ముఖాముఖి. ఒకరినొకరు ఆదరించుకుని విడిపోవడమూ ముఖాముఖే. కానీ, ఇది రిపోర్టు చేసే విషయం అయినప్పుడే ముఖాముఖిగా మన తెలివిడిలో పడిపోయింది. ఆ లెక్కన మళ్లీ ‘ముఖాముఖి’లోకి రావాలంటే ఏ కమ్యూనికేషన్ మీడియా లేకుండా, కనీసం మీ సెల్ ఫోనుకూ పని చెప్పకుండా, నేరుగా మీరు ఒక మనిషిని కలవడం…కలిసినప్పుడు కడుపునిండా మాట్లాడుకోవడం… తర్వాత కార్యక్రమం ఏమిటీ? అని అడగకుండా, నిరంతరాయంగా ఆ క్షణాలను ఆస్వాదించడం… అట్లే నిలబడి లేదా కూచుని కాదంటే నడుచుకుంటూ  ఏ వాణిజ్య ప్రకటనల అంతరాయం లేకుండా, పక్కన ఏమున్నా పట్టించుకోకుండా… ఒకరికొకరు ఒకే లోకంగా ఉండటం….ఒక అంశంపై లోలకంలా రెండు హృదయాలూ కదలాడటం…ముఖాముఖి.ఇది ఇప్పటి అత్యవసర పరిస్థితి. ప్రసారాల్లో నిమగ్నమై ప్రేక్షకులుగా మారిన ప్రజారాశులంతటికీ, మనకే…మనందరికీ ఆ సాధనాల నుంచి విడివడి ముఖాముఖిలోకి దిగవలసిన అనివార్య స్థితి.ఇది వాక్ ది టాక్  కాదు, హార్డ్ టాక్ కాదు, ఎన్ కౌంటరూ కాదు. ఇది కేవలం మీ కోసమే. ప్రత్యక్ష ప్రసారాల కోసం మాత్రం కాదు, రేటింగుల కోసం అసలెంత మాత్రమూ కాదు. మీ లోవెలుపలి నదుల్ని స్పర్శించుకునేందుకు… మీ అంతరాయాల్ని అధిగమించేందుకు… మీ అంతర్లోకాల్లో అంతులేని బడబాగ్నులను ఆర్పివేసేందుకు…మనుషుల్లా నిర్మలంగా నవ్వేందుకు, అందుకు దారిచూపే దృశ్యాదృశ్యం ఈ చిత్రం – ఒబి వ్యాను దగ్గరి అమ్మలక్కలు.

+++

ఒట్టి కలయిక. పనిమీద పోతూ పోతూ అట్ల నిలబడి చివరకు ఆ పనినే మర్చిపోయేంతటి కలయిక. ఒక భాషణం. దేహం కూడా చేతులు ముడుచుకుంటుంది. పెదాలపై వేలుంచుకుని విస్మయం వ్యక్తం చేస్తుంది. అంత సూటిగా, నిశితంగా సాగే ముఖాముఖి.

ఇరువురూ మాటలాడుతూ ఉండగా ఒకింత బీరిపోయి, వింటూ వింటూ కొంగుతో కన్నీళ్లు తుడ్చుకుని లేదంటే ఆ కొంగునే నోట్లో దోపుకుని దుఃఖాన్ని ఉగ్గబట్టుకోవడం, అదీ కాకపోతే ఎవరేమనుకుంటున్నారో చూడనైనా చూడకుండా గొడగొడ ఏడ్వడం,  అల్మిచ్చుకుని వెన్నుతట్టడం,…ఇట్లా ముఖాముఖిలోనే అన్నీనూ…

+++

‘ఓసినీ’  అని అశ్చర్యపడేందుకు, “ఏ పోవే…’ అని పరాష్కాలు ఆడుకునేందుకు, “సుప్పనాతి’ అని చురచుర తిట్టుకునేందుకు కూడా ఈ ముఖాముఖి.

+++

పక్కపక్క గల్లిలోనే ఉంటాం. కానీ కలిసినప్పుడు ఇట్లా ముఖాముఖి.
కావలసి కలసినప్పుడూ ఇట్లా ముఖాముఖి.
వీలైనంత వరకూ కలవక కలవక కలిసినప్పుడు నిజమైన ముఖాముఖి…
ఎన్నో రకాలుగా ముఖుమాఖిగా అదొక సుఖం దుఃఖం.

ఇది జగను ఓదార్పు కాదు. మరొక రాజకీయ విజయోత్సవ సభా కాదు. సిసలైన సామాజికం ఇట్లా ఎదురుపడటం. కలవడానికి విరామంలేని జీవితంలో అట్లా కలయిక. అంతే.

గన్ మైకూ లేదు. టెలీ ప్రాంప్టర్ లేదు. టేకులూ లేవు. నేరుగా ప్రసారం. ప్రత్యక్ష ప్రసారం.
ఒకరి మనసులో ఇంకొకరి స్థానంతో జరిగే నిజమైన జీవన ప్రసరం.

ఇదంతా బహిరంగం. మాట్లాడుతున్నప్పుడే రహస్యం. ఎంత వాల్యూం పెంచాలో మరెంత తగ్గించాలో, ఎలా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలో ఆ అక్కలకు తెల్సినంత మనకెవరికైనా తెలిస్తే అది నిజమైన ముఖాముఖి.

+++

ఈ ఇద్దరి ఏకాంత ప్రపంచం అంతా చుట్టూ ఉన్న రణగొణ ప్రపంచంలోనే!  అదే నిజమైన కమ్యూనికేషన్. మిగతాదంతా గాలివాటం. అదే ముఖాముఖి.

ఇది ఎక్కడంటారా?
హైదరాబాదులోని పార్సిగుట్టలో దండోరా కేంద్ర కార్యాలయం ఉన్నది. అక్కడ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ మాదిగ తరచూ పెద్ద ఎత్తున్న పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తుంటాడు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి టెలివిజన్ చానళ్లు తమ ఒబి వ్యాన్లను కూడా పంపుతాయి. అవన్నీ ఆ ఇరుకు రోడ్డులో… నాలుగైదు, ఒక్కోసారి ఐదారు నిలిచి ఉంటై.  చిత్రమేమిటంటే, ఒక వర్షం వెలిసిన ఉదయం ఒక వ్యాను పక్కన ముచ్చట్లలో మునిగిపోయిన ఈ అమ్మలక్కలను చూశాను. చూస్తే! ఈ వారం దృశ్యాదృశ్యం.

+++

ఒక చిన్న తుంపర కురిసి వెలిసింది. అప్పుడీ ముఖాముఖి.
మనసులోని రందిని పెంచే ఒక తుంపర. అలాగే మనసును పంచుకున్నాక వెలిసిన తుంపర కూడా.
ఇది కవిత్వం కాదు, కళా కాదు- సమస్తం. అది కనుల ముందు తారాడి వెలసిపోకుండా ఒక దృశ్యంగా ఉంచేందుకే ఛాయచిత్రణం. అదే నా ముఖాముఖి.

ధన్యవాదాలు, అమ్మలక్కల్లా కలిసిన మనందరికీ.

~ కందుకూరి రమేష్ బాబు

కళారవికి అభివాదం

drushya drushyam-21...

ఒక సామాన్యమైన విషయాన్ని పంచుకున్నట్టే పంచుకున్నాడు గానీ ఆ మనిషి ఓ అసామాన్యమైన విషయాన్నే బోధించాడు. మరేం లేదు. “మానవుడు అన్నవాడు ఒక గంటలో కనీసం ఐదు నిమిషాలైనా ఆనందంగా గడపాలి’ అని చెప్పాడాయన.

ఆ మాటలు చెప్పింది ఏసు. ఆయన నేను పని చేసే ఆఫీసు క్యాంటీన్లో పని చేస్తాడు. ఎప్పుడూ తానొక అద్భుతం. టీవీలో ఒక పాట వస్తుంటే, అందులోని సాహిత్యం వింటూ ఆ పదలాలిత్యాన్ని అనుభవించి పలవరిస్తాడు. పంగీతం వింటూ తానే తరంగమై తనలో తాను చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. అతడితో మాట్లాడితే ఒక ఎడ్యుకేషన్. ఒకసారి, ‘సమోసా ఎలా తినాలో తెలుసా?’ అని అడిగాడాయన. బిత్తరపోయాను. అడిగితే, ఇలా వివరించాడు. “మూడు భుజాలు ఉండే సమోసాను ఏ భుజం నుంచి తినాలీ అంటే మసాలా ఉన్న వైపు కాకుండా ఇవతలి నుంచి తినాలి’ అని చెప్పాడు. ‘…అంటే, ఒకేసారి సమోసాలో కూరిన మసాలాను తినేయ కూడదు. అది కొంచెం కొంచెంగా రుచి చూడాలి. అందుకోసమే ఈ భుజాలు…మసాలా కూర్చిన రెండు భుజాలను ఒదిలి ఇవతలి భుజం నుంచి కొంచెం కొంచెం తింటూ పోవాలి. మూడవ భుజం తినేశాక సమోసా రుచిని పూర్తిగా ఆస్వాదించినట్టవుతుంది’ అని కూడా విశదం చేశాడు.

ఆయన మాస్టర్.
చిన్న చిన్న విషయాల పట్ల ఆసక్తిని పెంచే ఒకానొక మాస్టర్ నాకు.
“ముందే ఇటువైపు నుంచి తినేస్తే చివరికంటా ఏమంత మజా ఉండదు…అందుకే తినే పద్ధతి కూడా తెలియాలి’ అంటూ ఆ సంగతిని అలా తెలియబర్చాడు. ఇట్లా ఆయన చెబుతూ, అంతకు ముందు విన్న ఒక పాట చరణాన్ని మరోసారి మననం చేసుకుంటూ, ఆనందంతో అరమోడ్పు కనులతో ఆగాడొక క్షణం. అప్పుడు చెప్పాడు పై మాటల్ని.

‘మానవుడనే వాడు కనీసంలో కనీసం గంటకు ఐదు నిమిషాలైనా ఆనందించాలని!’ ఆ ఆనందం ఏ విధంగానైనా కావచ్చును. కానీ, ఒక స్పృహతో, అవగాహనలో ఉంటూ జరగాలన్నాడు. అప్పట్నుంచీ క్యాంటిన్ కు వెళుతుంటే ఒక ఉత్సాహం. అతడు ఈ రోజు ఏం చెబుతాడా! అన్న సంతోషం. తానే కాదు, ఇటువంటి ఎందరో, ఎన్నో జీవిత రహస్యాలు తెలియపరుస్తుంటారు. అప్పుడు నిదానంగా ఆనందించే ఘడియలను అనుభవంలోకి తెచ్చుకుంటూ జీవితానందాన్ని పెంచుకుంటూ పోవడం, ఇదొక జీవన శైలి. అందులోకి చేరిన సరికొత్త రచనే దృశ్యాదృశ్యం. ఆ క్రమంలోనే ఈ చిత్రం కూడా.

+++

తండ్రి చిత్రం ఇది.
మా వీధిలో ఉండే వ్యక్తే అతడు.
చిన్న ఇల్లు. బీరువాలు తయారు చేసే చిరుద్యోగం…అతడు.
ఆ ఇంట్లో తానూ భార్యా కాపురం పెట్టినప్పట్నుంచి చూస్తూనే ఉన్నాను.
ఆమె ప్రెగ్నెంట్ అవడం, సీమంతం చేసుకోవడం, బంధువుల హడావిడీ… అన్నీ నవమాసాలుగా చూసిన వాణ్ని.
కొంతకాలం కనిపించలేదు. ఆ తర్వాత పాపతో తిరిగి రావడం, వాళ్లమ్మ మరికొన్ని నెలలు ఇక్కడే కనిపించడం… అటు తర్వాత ఇద్దరే మిగిలారు, ఈ పాపతో….

ఒకానొక ఉదయం ఆ నెలల పాపాయిని సూర్యరశ్మి తాకేలా ఉంచడం చూశాను. అంతకుముందూ చూశానుగానీ ఇంత బాగా చూడటం అన్నది “గంటలో ఐదు నిమిషాలైనా’ అన్న పాఠం తర్వాతే బాగా కుదురుకున్నది. వాళ్లిద్దరినీ చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగా ఇద్దరూ ఒకర్నొకరు చూస్తూ ఉండటం చూశాను. అప్పుడు క్లిక్ మనిపించాను ఈ దృశ్యాన్ని.
అదొక సమోస. వేచి ఉండి, ఎలా తినాలో తెలిశాక వేచి వేచి ఉండి, పూర్తిగా ఆస్వాదించిన త్రిభుజం వంటి చిత్రం నాకు.

గంటలో కాదు, రోజులో కూడా కాదు, పక్షానికి ఒక రోజైనా ఇటువంటి చిత్రం తీసినప్పడు పొందిన ఆనందం వంటిది అనుభవించడం అదృష్టం. ఏసు గుర్తొచ్చాడు ఈ అదృష్టం కలిగినప్పుడు!

+++

మళ్లీ ఈ చిత్రం. ఇందులో ఉన్నది ఆనందమే. అందులో ఉన్న వెచ్చని వెలుతురే ఆ గొప్ప ఆనందం.
మామూలుగా వెలుతురు రోజూ పడుతుంది. సూర్యుడు రోజూ ఉదయించినట్లే చూడగా చూడగా అది మామూలే అయిపోయింది. కానీ, ఒక తండ్రి తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ వెలుతురులో కాసేపు కూచున్నప్పుడు ఏదో ఒక వెలుతురు…జీవితాన్ని ఆనందించమని చెప్పే వేకువ వెలుతురు…అది మొత్తం మానవ నాగరికతలో ఉదయించే ఒకానొక ఉదయం వంటి ఆనందాతిశయం. గర్వకారణం వంటి చిత్రం. దాన్ని తీశాను నేను…

చిత్రమేమిటంటే, మెల్లగా మెల్లగా ఆ బిడ్డకూ చూపు ఆనడం, తల్లిని గుర్తుపట్టడం, తండ్రి కళ్లల్లోకి సూటిగా చూసి నవ్వేయడం! అదొక అద్భుతమైన పర్యవసానం. దాన్ని బంధించడం మాటలు కాదు. ఒక అపూర్వమైన చేతనమే!

తండ్రి అవడాన్ని ఆనందంగా అనుభవించే మహోన్నతమైన ఒక ఘడియను దృశ్యం చేయడం ఒక వెలుతురు రచన.
సూటిగా. కళ్లు కళ్లు కలిసే ఆ రెండు తరాల స్పర్శ, అదొక మానవీయ వెలుతురు కావ్యం. దాన్ని బంధించిన వైనం నిజానికి ఒక ఐదు నిమిషాలు కూడా కాదు. రెప్పపాటు క్షణమే. కానీ, గంటకు ఐదు నిమిషాలైనా మనతో మనం ఉన్నప్పుడే ఇటువంటిదేదో నిలుస్తుంది. తద్వారా అ నిమిషాలు నిలిచిపోయే ఆనందాలైతాయి. అలాంటిదే ఈ.దృశ్యం చిత్రితమై నిలిచిపోవడం…అది ఎప్పటికీ జ్ఞాపకాలను తారాడించడం…అదొక చిరస్మరణీయమైన ఆనందం.

+++

నిజానికి ఛాయా చిత్రలేఖనం అన్నది వెలుతురు రచన. ఆ వెలుతురును ఆస్వాదిస్తూ ఆ ఉదయానంతర రశ్మిలో నవశిశువు ఉల్లాసాన్ని, తండ్రి అభిమాన ధృక్కుల్నీ పరిచయం చేయగలగడం అన్నది చిత్రకారుడికీ కూడా ఆ పాప వలే పొందే ‘విటమిన్ డి’ అనే చె్ప్పాలి. ఇటువంటి ఫొటోలు తీస్తూ పొందే బలం వేయి రచనలు చేసిన దానికన్నా ఎక్కువే అనుకోవాలి. అందుకే నిలబడాలి. గంటలో ఒక ఐదు నిమిషాలైనా ఒక లిప్తకాలంలో పొందే ఇలాంటి దృశ్యంలో ఉండటం కోసం జీవించాలి.

అలా నిలబడితేనే జీవితం. వాళ్ల జీవితంలో మనమూ జీవిస్తాం. అదే చిత్రం…దృశ్యం.
అలా జీవించేందుకు పాఠం నేర్పిన ఏసుకు, అవకాశం కల్పించిన ఆ బిడ్డకూ తల్లిదండ్రులకూ, మీదుమిక్కిలి వెలుతురు రచనకు ప్రామాణికమైన కళారవికి శిరసు వంచి అభివాదాలు.

~ కందుకూరి రమేష్ బాబు

బుగ్గ – శుభాకాంక్ష

DRUSHYA DRUSHYAM 20
క్రమక్రమంగా జీవితపు రహస్యాలు అవగతం అవుతున్నప్పుడు ఎంత సంతృప్తి కలుగుతుంది, ఏ వయసు వాళ్లకైనా!ఇదీ అదీ అని అనుకోవాల్సిన అవసరం లేదు.
అది కేవలం ఒట్టి బుగ్గ ఊదుతున్న బొమ్మే కావచ్చు, కానీ, ఒక చిన్న పాపాయి దాన్ని పొందుతున్నాను అన్న ఆనందం ఎంత అపూర్వం.
ఆ బిడ్డ మురిసిపోవడాన్ని ఆస్వాదిస్తున్న తాతయ్యకూ ఎంత తృప్తి! చిద్విలాసమూ!!

వయసు పెరుగుతూ ఉంటుంది.
ముందు అందుకున్న వాళ్లు పిదప ఓపిక పట్టవలసి వస్తుంది.
ఆ పనే ఆ బాబు చేస్తాడు, ఈ చిత్రంలో.

అవును. ముందు ఆ నవ్వుల పాపకి, ఆ తర్వాతే ఆ బాబుకు ఆ బెలూను అందుతుంది.
కానీ, కాసేపు నిరీక్షించడం వాడికీ అలవాటే అవుతుంది.
అదీ ఎంత బాగుంటుందో!

చిత్రమేమిటంటే, వాళ్లకు బెలూన్లు కొనిచ్చిన తాతయ్యకూ బెలూను అందుకున్న తృప్తే.
ఇప్పించడమూ అందుకోవడమే కదా!

అట్లా ఒకటి సాకారం అవుతున్నప్పుడు ఖరీదుకు ఇస్తున్నప్పటికీ ఆ బెలును అమ్మే మనిషికీ ఆనందమే..
తన కార్యం జరగమూ ఒక ఆనందమే మరి!

పిల్లల విషయమనే కాదు, నిజానికి మనందరం ఒక్కో దశను దాటుకుంటూ ఎన్నింటినో అందుకుంటూ వచ్చిన వాళ్లమే!
ఇంకా ఇంకా జీవితం ఇచ్చే వాటికోసం నిరీక్షిస్తున్న వాళ్లమే!

ఇక ఆ తాతయ్య.
తానూ ఇవన్నీ దాటినవాడే. అందుకున్న వాడే.
ఇప్పుడు ఈ వయసులో పిల్లల్ని సంతోషపెడుతూ పొందే ఎన్నెన్ని సంబురాలో తనకి!
అన్ని దశలనూ దాటి ఈ వయసుకు రావడంలో మరెన్ని అనుభూతుల మూటలో!
అయినా, అవన్నీ కాకుండా పిల్లలని చూసుకుంటూ ఉంటే తననీ, తనలోని చిన్నతనాలను, పెద్దరికాలనూ ఆస్వాదించడం…అదొక సంతృప్తికరమైన ఆరోగ్యం కదా!

ఇక ఆ బొమ్మలోని మరికొన్ని అంశాలూ…సంబురమే!
ఇందులో వయసులు ఉన్నట్టే రంగులూ ఉన్నయి. ఒక కులాసా అయిన తరుబడిలో లభించే ఉత్పాహవంతమైనప్పుడు కానవచ్చే దేహభాష ఉన్నది.  నవ్వేప్పుడు ఆ చిన్నది చెంపకు చేయించుకున్న పద్ధతి చూడాలి. ఎంత భద్రత, మరెంత విశ్వాసం. నవ్వుతో ముడతలు పడ్డ ఆ కళ్లలో చిగుర్లు తొడిగి, మొగ్గై, పువ్వయినట్లున్న మొత్తం జీవన పర్యంతం అవశ్యమైన ప్రేమేమిటో లేదూ! అది తప్పక అంతటా పరివ్యాప్తం కావాలనే ఈ చిత్రం!:

మరి, ఆ చిన్నోడు!
వాడు నిలబడ్డ తీరు, నడుముకు చేతులు ఆన్చుకున్న లక్షణం…
వాడి జుట్టూ, ఆ తాత నెరిసిన జుట్టూ, బుగ్గలమ్మే కష్టజీవి క్షవరమూ…అన్నీఈ దృశ్యంలో మాట్లాడుతూ ఉంటాయి.
రంగులూ పలకరిస్తాయి. లేత, ముదురు ఆకుపచ్చలూ పసుపు నారింజ నీలాలూ అన్నీ ఒక పచ్చటి జీవితాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తయి.

+++

జీవితచక్రం ముందుంచుకుని ఈ చిత్రం కారణంగా ఒక చిత్రకారుడిగా నేను మళ్లీ చిన్ననాటి బాల్యంలోకి వెళ్లి ఆ బుగ్గను ఊదుతూ ఉన్నాను. అదే ఈ చిత్రం. దాన్ని ఆ పాపలా అందుకుంటున్నాను, అదే చిత్రం. అట్లా నిలబడి నా వంతు కోసమూ, మీ వంతు కోసమూ వేచి ఉంటూ ఉంటాను. అదీనూ చిత్రమే. చివరాఖరికి ఈ చిత్రాన్ని మీకందజేసే తాతనూ నేనై చిత్రంగా ఈ వారం తప్పుకుంటూ ఉన్నాను, ఇస్తూ.

ఇరువురుకీ, మనందరికీ…
శుభాభినందనలతో…

~ కందుకూరి రమేష్ బాబు

బాటసారులు ఒక తరగతి….!

drushya drushyam -19
ఎప్పుడు చూసినా ఈ చిత్రం ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది.
ఎందుకూ అంటే, చూపు నేర్పే పాఠాలు ఎన్నో అని!
అవును.  కళ్లున్నంత మాత్రాన చూపున్నట్టు కాదు కదా!
చూపును ఎప్పుడూ విస్తరించుకోవచ్చును, చూస్తూ ఉంటే!అందుకే ఈ సారి ఒక చిన్న పాఠం.
కొంచెం నాతో వస్తారా?
జస్ట్ కళ్లతో.రానక్కర్లేదు కూడా.
మీరున్న చోటు నుంచే పరీక్షగా చూద్దాం.

మరేం లేదు.
మీ కంటిని కెమెరా చేసుకుని ఒకసారి చూడ ప్రయత్నించండి.

ముందు నేరుగా మీ చూపు ఎంత దూరం పోతుందో అంతదూరం చూడండి.
చూసి ఆగండి.  అటూ ఇటూ చూపు తిప్పకుండా అట్లే అక్కడే మీ చూపు పెట్టండి.
అటు తర్వాత ఆ చూపును అట్లే మెల్లగా వెనక్కు తీసుకుని, మీ ముందు, కళ్ల ముందుంచండి.
అక్కడ దగ్గర్లో ఏది ఉందో ఆ వస్తువుపై అక్కడే చూపు నిలపండి.

మంచిది.
మరొకసారి.

మళ్లీ మీ కళ్లను లేదా కంటి చూపును ముందు చూసిన దూరం దగ్గరకు వెళ్లి ఆపండి.
తిరిగి కళ్లను మీ కళ్ల ముందున్న వస్తువు దగ్గరకు తెచ్చి పెట్టండి.

ఒక రకంగా జూమ్ అవుట్ జూమ్ ఇన్ అన్నమాట!

పిదప మెల్లగా కంటి చూపును దగ్గర్నుంచి లేపి దూరంగా ఇంతకుముందు చూసిన దగ్గరకు నిలిపి, అక్కడ్నుంచి తల తిప్పుతూ ఎడమ నుంచి కుడి దాకా మెడ ఎంత మేరకు సహకరిస్తుందో అంతదాకా తిప్పి ప్రతి దృశ్యాన్ని లాంగ్ షాట్లో చూస్తూ రండి.

ఆగండి.
ఆగింతర్వాత మళ్లీ వెనక్కువెళ్లి మధ్యన దూరంగా నిలిపిన మీ చూపు వద్ద ఒక్క క్షణం ఆగి వెంటనే అట్నుంచి ఎడమ వైపు తల తిప్పుతూ మెడ సహకరించినంత మేరకు వస్తూ చూస్తూ ఉండండి.  అదే లాంగ్ షాట్లోనే!

ఇదంతా చూస్తున్నప్పుడు మీరు లాంగ్ షాట్లో ఉన్నారు కనుక ఆదంతా కనిపిస్తూ ఉంటుందిగానీ క్లోజప్ లో అంతా ఔట్ ఐయినట్లే లీలగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని పట్టించుకోకండి.

అలా నే చెప్పినట్టు చేయగా మీరిప్పుడు ఒక రౌండ్ కొట్టారన్నమాట, కంటితో.

+++

ఇక ఇప్పుడు ఏదైనా మీ ముందున్న వస్తువును చూడండి. చప్పున అక్కడ్నుంచి దూరంగా ఉన్న ఒక వస్తువు దగ్గరకూ వెళ్లండి. అక్కడ్నుంచి తల తిప్పి కుడివైపు దృష్టి సారించండి. అలాగే ఎడమ వైపూ చూడండి.
కాకపోతే మీకు కొద్దికొద్దిగా అవగతం అవుతూ ఉంటుంది.
మీరు దూరం చూస్తున్నారా దగ్గర చూస్తున్నారా అన్నది  తెలుస్తూ ఉంటుంది.
ఆ తెలివిడితో మళ్లీ మీరు మధ్యలోకి రండి. అక్కడ్నుంచి దగ్గరి వస్తువుకు రండి. ఇక్కడ్నుంచి దూరమూ వెళ్లండి.
మెలమెల్లగా మీకిష్టమైన చోటికి కంటిచూపును ప్రసరించండి.

అటు పిమ్మట అసలు విషయం అర్థం చేసుకోండి.

అవును మరి.
మీరు ఒక దృశ్యం లేదా దృక్పథం అనుకుంటూ మీ కిష్టమైన దాన్ని చూడటం మొదలెట్టండి.
ఇంతదాకా నేను చెప్పినట్టు చేశారు. ఇప్పుడు మీరు అలాగే చేయండి. కానీ చూడండి.
బాగా చూడండి. మీరు చూస్తున్న రీతి క్లోజప్ షాట్ అనుకోండి లేదంటే లాంగ్ షాట్ అనుకోండి. చూడండి.
మళ్లీ అక్కడ్నుంచి ఇంకో చోటుకు వెళ్లి చూడండి. ఆ లాంగ్ షాట్లోకి వెళ్లినాక కూడా దాన్ని క్లోజప్ గా చూడ ప్రయత్నించండి. ఇంకా క్లోజ్ గానూ చూడ ప్రయత్నించండి.
క్లో……జ్ గ!

నిజమే. మీరు ఆ వస్తువు దగ్గరకు వెళ్లకుండానే ఇక్కడే ఉండి దాన్ని క్లోజ్ గా గమనించవచ్చు.
అయితే, ఇదిట్లా ఉండగా మరొక చిన్న ప్రయత్నం. కేవలం ఏదైనా ఒకే వస్తువును లాంగ్ షాట్లో చూడండి.
ఇక్కడ్నుంచి చూపును ఎత్తుకెళ్లి అక్కడ పెట్టి దాన్ని నిశితంగా క్లోజ్ గా చూడండి. చూస్తూ ప్రత్యేకంగా దాని ఉనికిని అబ్జర్వ్ చేయండి. దాని రంగు, విస్తీర్ణం, నీడలు, గాలికి కదలాడే తీరు అన్నీ శ్రద్ధగా పరికించండి.

అటు తర్వాత దాన్ని ప్రత్యేకంగా కాకుండా సాధారణం చేయండి. అంటే మరేం లేదు. దాన్ని కాకుండా అంటే దాని నుంచి వెనక్కి చూపును జరపండి. అది ఔట్ అయిపోయి ఇంకా విశాలమైన దృశ్యం కనిపిస్తుంది.
వేరే ఏవేవో అక్కడున్న అన్నిటిపై  లాంగ్  షాట్ లా ఆ దృశ్యం కనిపిస్తుంది.
అదంతా చూడండి.

ఇప్పుడు మీరు మరింత దూ …………రంగా చూపును జరిపి వైడాంగిల్ లో చూడండి.
మెడను తిప్పకుండానే మొత్తం మీ రెండు కళ్లు చూడగలిగినంత మొత్తం దృశ్యాన్ని చూడండి.
కానీ. ఇది చూపు కాదు. అన్నీ అగుపిస్తుంటాయి. కానీ, ఏదీ చూడరు.

మన జీవితం అట్లే సాగుతూ ఉంటుంది.
అన్నీ ఉంటాయి. కానీ దేనిపై దృష్టి నిలవదు.

అందుకే దయచేసి మళ్లీ నాతో రండి.
ఈ సారి ఒకానొక వస్తువు అని భావిస్తూ దాన్ని చూసేందుకు అంత క్లోజ్ గా కాకుండా ఓ జనరల్ లుక్ వేయండి.
ఈ సారి కొన్ని ఎక్కువ విషయాలు చూస్తారు. కానీ ఇంకా తెల్సుకోవాలంటే మళ్లీ క్లోజ్ లోకి వెళ్లాల్సిందే…
క్లోజ్ లోకి వెళ్లి వైడ్ కావాల్సిందే…ఇంకా వైడ్ అవుతూ ఉంటే దాని ఉనికిని మొత్తంగా అర్థం చేసుకో వీలవుతుంది కూఆ…

ఇట్లా,  ఇలా ఒకట్రెండు సార్లు చేస్తూ ఉంటే మీకొక వ్యూ ఫైండర్ ఏర్పడుతుంది.
మీరు కెమెరా కొనుకున్నట్టే అవుతుంది.

అవును ప్లీజ్. మీరు కెమెరా గుండా ఒక వస్తువును పరికించే లక్షణాన్ని ఫీల్ అయ్యే గుణాన్ని నిదానంగా సంతరించుకుంటారు. కావాలంటే పైన రాసిందంతా మరొకసారి ప్రాక్టీస్ చేయండి, కళ్లతో పరికిస్తూ.
నా కంటే మీరే బాగా చూడగలరనీ అర్తం అవుతుంది. రాసిందంతా బాగుండక పోయినా కాసేపు మీరు కంటితో ఫొటోగ్రఫి చేయ ప్రయత్నించండి ప్లీజ్.

‘అదృశ్యం’ గురించి ‘దృశ్యం’ గురించి మీకే ఎరుక అవుతుంది.
అదే చూపు మహిమ!

+++

క్రమక్రమంగా తెలిసి వస్తుంది.
అన్నీ అక్కడ ఉన్నవే అని!
అయితే, మనం అక్కడుండటమే ‘చూపు’ అనీ!

ప్రతిదీ ఉనికిలో ఉన్నదే.
కానీ మనం చూడమనీ!

ఇట్లా దృశ్యాదృశ్యంగా ఉన్నదే జీవితం అనీనూ!

అందుకే దృక్పథం అంటుంటాం.
మనం, మన పరిసరాలు, అందులోని అనేకానేక విషయాలను చూసే దృక్పథం ఒకటి ఉంటే కళ్లముందు జీవితం సాక్షాత్కారం అవుతుందేమో! ఈ చిత్రమూ అటువంటిదే.
ఉదాహరణకు ఇందులోని ఇద్దరు మనుషులు. వాళ్లని బంధించిన ఒక ఫ్రేం లేదా చూపు.

+++

వీరిద్దరూ ఒకటే వీధిలో నడుస్తున్నారు.
నా చూపును ఒక్కరిపై క్లోజ్ చేసి ఉంటే అ బిక్షగాడినే దర్శించేవాడిని.
కానీ, నేను ఇద్దర్ని చూశాను..

ఆ ఇద్దరినీ నేను భిన్నంగా చూడదల్చుకోలేదు.
ఒకరు జీవితం ఏం చేసిందో ఏమోగానీ పిచ్చివాడైపోయాడు.
మరొకరూ అంతే. జీవితాన్ని ఏం చేస్తున్నాడో ఏమోగానీ అలా ఉన్నాడాయన.

రెండో వ్యక్తి తలకు మఫ్లర్. ఒంటిపై సరిగా గుడ్డలు కూడా లేవు.
కానీ చేతుల్లో సంచులు. భుజానికీ వేలాడుతున్న సంచులు.
మొత్తంగానే ఒక చెత్త సంచి వంటి మనిషయ్యాడాయన.

గడ్డం, సంచులు, మొత్తం ఆ మనిషే ఒకానొక రంగులోకి మారిపోయి మాసిపోయాడు.
ఒక్కొక్కటినీ చూడండి. దగ్గరకు మీ చూపును తీసుకెళ్లి మరీ పరిశీలించండి. ఇట్లా మీరు కూచున్న చోటునుంచే ఈ మనిషిని అతడి వస్తువుల్ని బతుకు సంచి వంటి జీవితాన్ని లోతుగా, సన్నిహితంగా దర్శించండి.

చూశాక బయటకు వెళ్లాక, ఇంతకు ముందర చదివినట్టు కళ్లకు పని చెప్పండి.
ఇటువంటి మనిషిని చూడండి.
దగ్గర దూరం
కుడి ఎడమలు…
అటూ ఇటూ ప్యాన్ చేస్తూ…
మనుషుల్ని, వస్తువుల్నీ…నిశితంగా..ఇట్లా ఎంతైనా ఎన్ని కోణాలనుంచైనా దర్శించవచ్చు.

ఇదంతా ఫొటోగ్రఫియే!

+++

అవును. అయితే ఒక నిజం ఏమిటంటే, ఫొటోగ్రఫిలో నిమగ్నమైన మనిషికి ఆయా మనుషులను ఫొటో తీయకముందు కూడా ఇట్లా చూడటం అలవాటుగా ఉంటుంది.
అందుకే కొన్ని ఫీచర్లు అర్థం కావాలంటే మనం అక్షరాలను చదువుతున్నట్టే దృశ్యాలనూ కళ్లతో చదవడం అలవాటు చేసుకోవలసిందే. అప్పుడు దృశ్యంలోని అంశాలు తేటతెల్లం అవుతుంటాయి.

ఉదాహరణకు ఇంకో మనిషి.
ఈ దృశ్యంలోని మనిషే.

+++

అతడు, అతడి నెరసిన జుట్టు చూడండి.
ఫుల్ హ్యాండ్స్ చొక్కా చూడండి.
వెనకాల అతడి చేతుల బాడీ లాంగ్వేజూ చూడండి.
ఆ ప్యాంటు, మొకాలు, నడక రీతినీ చూడండి.
చెప్పుల్ని కూడా…

ఏదో ఒక దీర్ఘ ఆలోచనలతో,  బతుకు భారంతో నడుస్తున్న తీరునూ చూడండి.
నడుస్తూ ఉండగా అతడి ముందు, ఆ రోడ్డు పక్కనే ఉన్న చెత్తనూ చూడండి.
ఆ చెత్తనుంచి అడ్డంగా సాగుతున్న ఎర్రని మెట్ల రంగు చారల్నీ చూడండి.
అవి అతడి మేరా వచ్చి ఆగిపోవడమూ చూడండి.

ఇవతల మరో షట్టరు.
దాని రంగు, రేఖలూ చూడండి.
వాటికున్న తాళం కప్పలూ చూడండి.

ఆదంతా బేక్ గ్రౌండ్ అనుకుంటే మళ్లీ ఆ పిచ్చివాడినీ చూడండి.
అతడున్నంత మేరా…ఒక షట్టరు అనుకుంటే ఇతడున్నంత మేరా మరో షట్టరనుకోండి.
కానీ వీధి ఒక్కటే అనుకుంటే, అందులో ఇద్దరు.

ఇద్దరూ ఇద్దరే.
ఒకరొక ప్రపంచానికి, మన భద్రలోక ప్రపంచానికి ప్రతీక అనుకుంటే
మరొకరు అధోజగత్ సహోదరత్వానికి సూచిక.

కానీ ఇద్దర్నికలిపి చిత్రించడంలో నా దృశ్యం ఏమిటంటే..
ఈ సమాజంలో నా చూపు ఇద్దరిపై నిలుస్తుందని!

వర్గాలు, తరగతులు అన్నీ ఒకే దృశ్యంలో ఉంటాయనీనూ!
రెండు షట్టర్లు…..కానీ చిత్రించేటప్పుడు ఒకే షట్టరు.

ఒక ప్రపంచం ప్రధాన స్రవంతి అనిపించుకుంటూ ఉన్నప్పుడు మరొక ప్రపంచంతో కలిపి చిత్రించడం ఒక అదృశ్యానికి దృశ్య భాష్యమని! ఆ ప్రయత్నంలో భాగంగానే ఇద్దర్నీ చిత్రించండం! ఒకే చిత్రంలో…అదీ విశేషం.

+++

చివరగా, ఇట్లా వీధిలోకి వెళ్లినప్పుడు ఎన్నో రకాలుగా చూసి, ఒక రకంగా ఆగి క్లిక్ మనిపించడమే ఫొటోగ్రఫి.
ఈ సారి మీ కంటిని కెమెరా చేసుకుని పరికిస్తూ ఉండండి.
ఎన్ని దృశ్యాల్ని చూస్తారో!  అవన్నీ ఎన్ని విషయాలను మీకు విశేషంగా చూపుతాయో!

నా ఫొటోగ్రఫీ మిత్రులారా…ఈ సందర్భంగా శుభాకాంక్షలతో…

~ కందుకూరి రమేష్ బాబు

ఆదిమ రంగుల సంబురం!

drushya drushyam-18

ఎవరైనా ఎన్నో ఫొటోలు తీస్తూ ఉంటారు.
తీస్తూ ఉండగా లేదా తీశాక అందులో గొప్ప ఫొటో ఏదో తెలుస్తూ ఉండవచ్చు.
లేదూ తీరుబాటుగా ఉన్నప్పుడు ఏది ఉత్తమ చిత్రమో గుర్తు రానూ వచ్చు.
ఒక్కోసారి అంతకు ముందెప్పుడో తీసిన వాటిని యధాలాపంగానో, పరిశీలనతోనో మరోసారి చూస్తూ ఉండగానో కూడా ఆ గొప్ప చిత్రం తనకే తెలియవచ్చు.
చప్పున దాన్నితీసి విడిగా పెట్టనూ వచ్చు.ఇంకొన్నిసార్లు ఎవరో ఆ ఫొటో గొప్పదనం చెప్పనూ వచ్చు. అప్పుడైనా దాన్ని గుర్తించి ప్రత్యేకంగా దాచి పెట్టుకోవచ్చు.
అయితే, గొప్ప ఫొటో కాకుండా తాను తీసిన సామాన్యమైన చిత్రం గురించి చెప్పమని ఎవరైనా అడిగితే ఎంత బాగుండును!+++

మామూలు చిత్రం.
అవును. ఏ మాత్రం ప్రత్యేకత ఆపాదించలేనంత మామూలూ చిత్రం గురించే!
అటువంటిది ఒకటి చూపమని పదే పదే ఎవరైనా అడిగితే ఎంత బాగుండును!
ఒక్కరని కాదు, పదులు, వందలు, వేలాది మంది అట్లా ఒక ఫొటోగ్రాఫర్ను ఒత్తిడి పెడుతూ ఉంటే అదెంత బాగుంటుందో!!

మామూలు అని, సామాన్యం అని, ఇంకా ఇంకా మరింత సింప్లిసిటీలోకి వెళ్లేలా యాతన పెడితే  మరెంత మంచిదో!

ఒక్క ఫొటోగ్రాఫర్నే కాదు, గొప్ప గొప్ప కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు…వీళ్లందరినీ ఎవరైనా పని గట్టుకుని, ‘మీరు సృజించిన లేదా ఆవిష్కరించిన ఒక మామూలు విషయం చెప్పమని లేదా చూపమని’ అడిగితే, “అబ్బ! ఈ దునియా ఎంత అందమైంది అయిపోయేదో!’

+++

ఆశ.
కల.

+++

ఇటువంటి ఆశావాదిని కనుకే నది కన్నా మేఘం నచ్చుతుందని అంటాను.
చంద్రుడికన్నా నక్షత్రాలే మిన్న అంటూ ఉంటాను.
సామాన్యమే మాన్యం అని ఇట్లాగే సతాయిస్తూ ఉంటాను.

అయినా, చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ కదా…
బాల్యం తాలూకు నిర్మలత్వం…
అనాది ఆనందం…
పురాతన సౌజన్యం…
జానపద చిత్తమూ చిత్రమూ…వీటిలోని ‘సాదా’తత్వం, ‘సాధారణత్వం’ ఎంత మంచిగుంటుంది!

+++

అందుకే ఆశ. కళ…
ఆ ఒరవడి కోసమే సామాన్యం అని నేను చూపే చిత్రం ఇదే ఇదే.
నా వరకు నాకు, ఈ ‘జాజూ – సున్నం’  చిత్రం ‘మామూలు చిత్రం’ కాదు, ‘అతి మామూలు చిత్రం’.

+++

ఒకానొక శుభదినం…నేనూ, ప్రముఖ చిత్రకారులు మోహన్ గారు, వారి సోదరులు, జర్నలిస్టూ అయిన ప్రకాష్ గారూ హైదరాబాద్ నగరంలోని చింతల్ బస్తీలో ఛాయ తాగడానికి వెళుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఈ చిత్రం నా కంట పడింది.

చూస్తే ఒక  ముసలామె…
రెండు ఇనుప తట్టల్లో ఒక దాంట్లో సున్నం, ఇంకో దాంట్లో జాజూ పోసి, వాటిని చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్ముతోంది.

ఒక చిత్రాన్ని ఆమెతో, ఇంకో చిత్రాన్ని వీటితో చేసుకుని జన్మ ధన్యం అయిందని అక్కడ్నుంచి నిశ్శబ్దంగా తప్పుకున్నాను.
ఇదిగో మళ్లీ ఇలా చూపుతున్నాను. వందలు వేల చిత్రాల్లోంచి మళ్లీ దీన్నే ఎత్తి పట్టాను.
చూడండి….ఇదొక పురాతన చిత్రం. అది ఇల్లయితే చాలు, చిన్నదా పెద్దదా అన్నది కాదు.
గుడిసె అయినా సరే, ఇంత సున్నం ఇంత జాజు ఉంటే చాలు అది కళతో వెలిగిపోతుంది.
అందుకు, ఆ ‘కళ’కు మార్గం వేసే ఓ మామూలు మనిషి జీవన వ్యాపకాలను చెప్పే చిత్రం కూడా ఇది.

+++

మనిషి పుట్టిన నాటినుంచి వున్న ఈ primary colors గురించి నాకెప్పుడూ గొప్ప ఆశ.
జీవితాన్ని celebrate చేసుకోవడం అన్నది అనాది ముచ్చట కదా, జీవకళ కదా… అని ఎంతో సంబురం.
దాన్ని simple గా చెప్పడానికి మించిన అదృష్టం ఏముంటుంది!

ఈ చిత్రం అలా నా అదృష్ఠం.

దీన్నిగానీ ఇటువంటి చిత్రాలనుగానీ కోట్లు పెట్టి కొనే రోజు ఒకటి వస్తుందన్నదే భయం!
అటువంటి పీడదినాలకు దూరంగా ఉండాలని కూడా ఆహ్లాదమూ ఆరోగ్యవంతమూ అయిన ఈ జాజూ సున్నమూ…అలుకూ పూతా నా చిత్రలేఖనమూ…మరి కృతజ్ఞతలు.

~ కందుకూరి రమేష్ బాబు

దిసమొల: నిశ్శబ్ధంగా వినిపించే ఒక సంకీర్ణ దృశ్యం!

drushya drushyam-17
ఫొటోగ్రఫీకి సంబంధించి ఏది ముఖ్యం, ఏది కాదు – అన్న చర్చ కాదుగానీ, నా వరకు నాకు దృశ్యం, అదృశ్యం రెండూ ముఖ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ చిత్రం…నిజం.
అర్థవంతమైన లేదా అవతలి వారికి అర్థమయ్యేట్టు ఒక ప్రధాన దృశ్యం ఉంటుంది.
అలాగే, అగుపించీ అగుపించని అప్రధాన అదృశ్యమూ ఉంటుంది చిత్రంలో.
ఈ రెండింటి సమాసమే ఈ దృశ్యం.

+++

నిజానికి ఈ చిత్రం తీసి చాలా రోజులే అయింది. కానీ, ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది!
పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు.

అయితే, నా ఆశ్చర్యం నాది. అవతలి వారికి మల్లే ఆ బొమ్మను నేనే చిత్రీకరించినప్పటికీ నాకూ మరో వ్యాఖ్యానం ఉంటుంది. అది అవతలి వాళ్లు తమ వ్యాఖ్యానాన్ని విన్పించినప్పుడు గుర్తొచ్చి ఆశ్చర్యపోతూ ఉంటాను.
‘ఇటువంటిది నాకూ ఒకటి ఉంది’ అని చెప్పకుండానే కాలం గడచిపోతుంది! నావే ఎన్నో చిత్రాలు ప్రచురితమై, దానికి ఎందరెందరో వివిధ వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే నా వ్యాఖ్యానం నా చిత్రం ముందే అదృశ్యంగా ఉంటుంది.
అదే సిసలైన ఆశ్చర్యం నా వరకు నాకు!

నాకే అని కాదు, కళ ముందు ఏ మనిషైనా ఇలాగే ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటారు కాబోలు!
అయినా సరే, అవతలి వ్యాఖ్యానాలతో చిత్రం మొదలుపెడతాను.

+++

ఒకరంటారు ఇది ‘క్రాంక్రీట్ జంగల్’ అని!
‘నగర జీవనంలో మనిషి అమానుషత్వానికి  సజీవ దృశ్యం’ అనీ!

ఇంకొకరంటారు ‘ప్రేమ’ అని!
అది స్త్రీపురుషులను ఎట్లా ఒకటిగా ఎట్లా కట్టిపడేసి, ఒకే ప్రపంచానికి ఇద్దర్నీ వేలాడదీసి, ఇక నిదానంగా పెంచే ఆ తీయటి బాధ ఉంటుంది చూడండి. అదీ ఈ బాధనట!  ఎడబాటు, విరహమూ కూడా నట!
వాళ్లు ఎంతో ప్రేమతో చెప్పారా మాటలు.
ఆశ్చర్యమే,  ఈ బొమ్మ ప్రేమకు ప్రతిబింబం అంటే ఆశ్చర్యం కాక మరేమిటిఝ

సరే, ఇంకొకరంటారు…ఇద్దరి మధ్య అకస్మాత్తుగా పరుచుకునే దూరం, అడ్డుగోడ అని!
అది క్రమంగా ఆ ఇద్దరి మనసుల్ని గాయపర్చే గునపమై తీవ్రమైన బాధకు గురిచేస్తుందని!

చూసిన వారికి చూసినంత…
ఇవన్నీ చెబుతుందీ పిక్చర్!

కానీ, నేనైతే హైదరాబాద్ లోని ‘సాక్షి’ కార్యాలయం వద్ద ఉన్న ఫుట్ పాత్ పై ఒక టీ బంకు ఉంది. అక్కడ తీశాను దీన్ని.
అక్కడకు వెళ్లి ముందు నిలబడ్డాను. టీ తాగుతూ ఉన్నాను. ఇంతలో అక్కడొక చెట్టు, దానికి కొట్టిన మొలను(మేకు) చూశాను. వెంటనే కెమెరాను చేతుల్లోకి తీసుకుని దాన్ని ‘క్లిక్’ మనిపించాను.
ఆ క్షణాన అప్పుడొక మొలను మాత్రమే చూశాను.

ఆ తర్వాత మెల్లగా వ్యూఫైండర్ లోంచి కన్నుతో చూడసాగాను.
మొలను అలాగే వుంచి ఆ చెట్టును దాని బెరడును క్లియర్ చేసుకుని మరో చిత్రాన్ని చిత్రించాను.
ఆ చిత్రం మాత్రం వేరుగా ఉంది. బహుశా అదేం చెబుతుంతో తెలియదు!

ఆ తర్వాత అలాగే చూస్తూ ఉన్నాను.
వ్యూ ఫైండర్ నుంచి చూస్తూ ఉండగా బ్యాగ్రౌండ్ లో మనుషులు…వాళ్లు వేళ్లేదీ వచ్చేదీ కనిపించసాగింది.
చూడసాగాను.

సడెన్ గా ఒక పిచ్చితల్లి వచ్చింది వ్యూ లోకి!
కెమెరాలోంచి కళ్లెత్తక తప్పలేదు.

+++

ఆమె లావుగా ఉంది. బొద్దుగా ఉంది. జుత్తు రేగి ఉంది.
అది కాదు ఆశ్చర్యం…. ఆమె ఒంటిపై దుస్తులు సరిగా లేవు. సరిగా అనేకంటే పైన వక్షం ఓపెన్గా ఉంది. ఆమెను కళ్లారా చూడలేం. మన పేదరికం నిర్లక్ష్యం నిర్లజ్జగా కనబడుతోంది మరి!
పైన అలా ఉండగా కింద మాత్రం ఒట్టి లంగా ఉంది.
దిసమొలగా ఆ లంగా ఒక్కటే… అది కూడా చిన్నది…అది కూడా కాదు… ఆ లంగా పూర్తిగా రక్తంతో తడిసి ఉన్నది.

ఆమె అలా నడుస్తూ నడుస్తూ ఈ మొలదాకా వచ్చేసరికి హఠాత్తుగా కెమెరా వ్యూ ఫైండర్ గుండా నా కంట పడీపడగానే వెంటనే భయమేసి కెమెరాలోంచి తలెత్తి చూశాను. కనిపించిన నిజం ఇది.

ఆమె లంగా… మెన్సెస్ కారణంగా అనుకుంటాను, పూర్తిగా తడిసిపోయి ఉంది.
ఆమె ఏదో గొణుక్కుంటూ ఉన్నది. ఆ రణగొణ ధ్వనుల్లో గొణుక్కుంటూ ఆమె అట్లా నడుచుకుంటూ వచ్చేసరికి..అంటే అక్కడ ఆ క్షణాల్లో ఒక దృశ్యం అట్లా ఆమె నడుచుకుంటూ వచ్చేది ఉందన్నమాట.
ఇటువైపు దృశ్యం ఏమిటంటే, అది నేను….అప్పటిదాకా మొలను, చెట్టు బెరడును, వెనకాలి బ్యాక్ గ్రౌండును చూస్తూ నేను. ఈ దృశ్యాల మధ్య కెమెరా వ్యూఫైండర్లో ఒక దృశ్యం. అందులో  మొలా ఆ చెట్టు బెరడు…వెనకాలి బ్యాగ్రౌండ్లో కొంత ఆవరణ… ఆమె ‘ఆ ఆవరణ’ను దాటేసి వెళ్లిపోవడమూ ఉంది.
ఆము “ఆ ఆవరణను’ దాటేయడం క్లిక్ మన్పించనందున అది దృశ్యంగా కెమెరాలో రికార్డుకాలేదు.
ఆ తర్వాతి దృశ్యం నేను తల పైకెత్తడం…ఆమెను నేరుగా చూస్తూ ఒకట్రెండు ఫొటోలు తీసుకోవడం.

ఇవీ దృశ్యాదృశ్యాలు, ఈ చిత్రానికి సంబంధించి!

+++

చిత్రమేమిటంటే, ఇక అప్పట్నుంచీ నాకు ఈ ఫొటోను చూడగానే చెట్టు బెరడుకు దిగిన “ఆ మొల’ కనిపించడం మానేసి ‘ఆమె’ కనిపించడం మొదలౌతుంది. అప్పుడు గుండె లయతప్పిన సంగతి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది.

ఆమె వెళ్లిపోయేదాకా చూసి కెమెరాను సవరించుకుని మళ్లీ వ్యూ ఫైండర్లోకి చూశాను.
మళ్లీ ఆ మొలను చూశాను. నిజానికి ఎప్పుడైతే ఒక కదలని మెదలని వస్తువునో రూపాన్నో చిత్రిస్తున్నప్పుడు దానికి మరింత జీవితం ఇవ్వడానికి వెనకాల కదిలే బ్యాగ్రౌండ్ ను చిత్రించడం అలవాటులోకి తెచ్చుకుని చాలా రోజులే అయింది.
ఈ సారి కూడా అట్లా తీయాలా అనిపించింది. ఎందుకంటే, ఇంతకుముందే చెప్పినట్టు, ఆ మొల నాకు గుచ్చుకుంది. ఇంతకుముందరి అర్థనగ్న స్త్రీ మూర్తిని చూశాక ఇక ఆ మొల గునపమే!

కానీ, ఎంతైనా నేను అనుకున్నదే ఫొటో కాదు. ఫొటో ఎవరి అనుభవాన్ని వారికి పంచుతుంది కదా!  అనుకుని మళ్లీ నా నుంచి దూరం జరిగి మరొక ఫొటో చేయాలని ప్రయత్నించసాగాను. మెల్లగా వ్యూ ఫైండర్ లోంచి చూడసాగాను. ఇంతలో ఒక మగమనిషి ఇటు పోయాడు. మరో ఆడమనిషి అటు పోయింది.
అప్పుడు తట్టింది. కాసేపు వేచి ఉండి ఆ అధోజగత్ స్త్రీ వంటి వారు మన మధ్య, మన వీధుల్లో, మన రోడ్ల మీదే తారాడుతున్నప్పటికీ జీవితంలో మనం ఎవరి అవసరాలతో వాళ్లం వెళ్లిపోతూనే ఉంటాం కదా! దాన్ని చిత్రిద్ధాం అనుకున్నాను.

అలా అనుకున్నానో లేదో ఒక యువకుడు వచ్చి ఆ చెట్టును ఆనుకుని టీ త్రాగుతూ ఉన్నాడు.
అతడికి ఆ స్త్రీ అలా ఇదే ఆవరణలోంచి నడిచి వెళ్లిన సంగతి తెలుసో లేదో!
ఆ ఆలోచనను అదిమేసి మళ్లీ చూడసాగాను, వ్యూ ఫైండర్లోంచి!

ఇంతలో ఒక యువతి వచ్చింది ఫ్రేంలోకి…
ఇటు మగా ఇటు ఆడా ఇద్దరినీ ఒకే ఫ్రేంలో ఉండేలా ఆ మొలను క్లియర్ చేసుకుని క్లిక్ మనిపించాను.
ఇదే ఆ చిత్రం.

+++

నిజానికి ఇది మొల కావచ్చు…
కానీ, నా వరకు నాకు దిసమొల అంతా రక్తసిక్తమైన చిత్రం.
నిశ్శబ్ధంగా వినిపించే ఒక సంకీర్ణ దృశ్యం.

~ కందుకూరి రమేష్ బాబు

“అది కాలిబాట కాదు, నా ఇల్లు!”

drushya drushyam -17కాలి బాట మీది జీవితం గురించి నాకెప్పట్నుంచో ఒక జీవగ్రంథం వెలువరించాలని ఉంది.
ఎప్పట్నుంచీ అంటే ఐదేళ్ల క్రితం కుమారిని కలిసినప్పటినుంచి…ఆమెకు చేతులు లేవు. కానీ, కాళ్లతోనే ముంగురులు సర్దుకుంటుంది. తల దువ్వుకుంటుంది. కళ్లకు కాటుకా పెట్టుకుంటుంది. బట్టలు ఉతుక్కుంటుంది. ఒక్కమాటలో తనకు చెయ్యెంతో కాలంత!

అందరూ ఉండీ అనాధగా మారినాక ఆమెకు కాలిబాటే ఇల్లయింది.
ఫుట్పాత్ ను ఆశ్రయించి బతుకుతున్న ఆమె జీవన సమరం ఒక జ్ఞానపీఠం!

+++
ఒకానొక శుభరోజు ఆ మనిషి తెలియజెప్పింది, ఫుట్ పాత్ మీది జీవితం తనదని, కింది జీవితం మనదని!

దెబ్బతిన్నాను.అప్పటిదాకా తలకిందులుగా ఉన్న నా అవగాహనను ఆమె సరిచేయడంతో పెద్ద ఆశ్చర్యం, ఆనందమూ…
ఆ మధ్యన పాత అవగాహన పగులు పెట్టడంతో లోపలి ఇల్లు కూలిపోవడంతో ఒకలాంటి అనారోగ్యం కూడా…ఏదైనా తెలియగానే లోపల చాలా నశిస్తుంది. దాంతో వచ్చే సిక్ నెస్.
కోలుకున్నాక అర్థమైంది.అవును. మనం రోడ్డుపై నుంచి పయణించే మనుషులం. రోడ్డు మన జీవన సరళి. అది మన జీవన స్థాయిని చెబుతుంది. మన మూస ధోరణిని చెబుతుంది. భద్ర జీవితాన్నీ సూచిస్తుంది.

నేనూ రొడ్డును వాడుకునే మనిషినే గనుక…ఇంట్లోంచి బయటకు వచ్చాక రోడ్డు…పనిచేసుకోవడానికి రోడ్డు…మళ్లీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడానికి రోడ్డు…మొత్తంగా రోడ్డు నాకు జీవన వాహిక…రోడ్డు లేకపోతే నేను ఏమైతానో నాకే తెలియదు!
అటువంటి రోడ్డుమీది బతుకు గురించి ఆమె అన్యాపదేశంగా అంది, ‘మీరున్నది దిగువన కదా!’ అని!

లోవెలుపలి ప్రధాన స్రవంతి అప్పుడు దెబ్బతిన్నది.

+++
అప్పటిదాకా ఫుట్ పాత్ జీవితం అన్నది నాకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న జీవితంగా తెలుసు.
లేదంటే రోడ్డుకు దిగువ జీవితంగా గుర్తు. కానీ ఆమె అంది ‘మేం పైన ఉన్నం. నువ్వు కింద ఉన్నవు’ అని!
అలా, రోడ్డుమీది జీవితాలపై ఉన్న భ్రమనుంచి నన్ను రోడ్డుమీదికి తెచ్చింది కుమారి. ఇక అప్పట్నుంచీ నాలోపల ఒక జీవగ్రంథపు రచన సాగుతూ ఉన్నది అక్షరాలా, ఛాయల్లోనూ…

+++
నిజానికి ఆమె అపూర్వ. కాళ్లతోనే సూదిలో దూరం ఎక్కించే కుమారమ్మ…
ఆమె తర్వాత విమలమ్మ.. అంధురాలు. ధర్మం అడిగి సేకరించిన డబ్బులతో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన ధీర వనిత. ఇంకా శంకర్….పదో తరగతి ఫేలయ్యాక ఇంట్లో ఒప్పుకోరని బయటపడ్డ మనిషి…ఇలా ఇంకొందరు…కొందరు అసలు సిసలు నేలమాలిగ గురించి వవరించారు…

ఇక అప్పట్నుంచీ నాకు ఫుట్ పాత్ అన్నది అధోలోక సహోదరులు నివసించే ఆవాసం అన్న భ్రమంలోంచి అదొక ఊర్ధ్వ లోకం అనీ, అదే పదిలమనీ తెలియజెప్పారు. దాన్ని హైలైట్ చెయ్యడం అని కాదుగానీ అది మన సంఘ జీవనంలో… హిపోక్రటిక్ జీవనంలోంచే ఉద్భవించిందనీ వివరించారు..నిజానికి మనల్ని మనం కుదించుకున్నందున పుట్టిందే అది అని రుజువుగా చెప్పారు వారు… వాళ్ల అనుభవాల నుంచి నన్ను మేల్కొలిపారు.

అందుకే, అప్పట్నుంచీ ఫుట్ పాత్ పై ఉన్న మనుషులను ఫొటో తీసేటప్పుడు వాళ్లను పై నుంచి కాకుండా కిందినుంచి, ఒళ్లొలంచి, ఒంగి ఫొటో తీయడానికి ప్రయత్నిస్తుంటాను. కనీసం సమానంగా నైనా చూసుకుని వాళ్లను ఛాయాచిత్రాల్లో నిమగ్నం చేస్తుంటాను. ఈ ఫొటో అటువంటిదే.

+++

ఆయన ఎవరో…ఏమో…అనుకునేరు.
ఆయనకూ పేరుంది. ఊరుంది. నివాస స్థలం ఉంది.
ప్రస్తుతానికి తనకంటూ ఒక దగ్గర ఫుట్ పాత్ ఉంది.
దానిపక్కనుంచి హాయిగా వెళ్లే రోడ్డు…అందులోని జనమూ ఉన్నారు.
కానీ తానొక్కడే.

ఒక్కడే తాను…విశ్వమంతా ఈ పిట్టగోడే అన్నట్టు హాయిగా విశ్రమించి ఉండగా తీసిన ఫొటో ఇది.
తన పక్కనుంచి వేగంగా దూసుకుపోతున్న రోడ్డు….సారీ కారు…
అది కిందే ఉంది కదా!
హమ్మయ్య! థాంక్స్!

+++
మరేం లేదు. కుమారమ్మ చెప్పింది, విమలమ్మా విడమర్చింది.
గోడలన్నవి అసలే లేని ప్రపంచంలో మేం బతుకుతున్నాం అని!

వాళ్లంటారు…
”అది కాలిబాట ఎట్లయితది? నిజానికి అది మీకు కాలిబాట…రోడ్డు ఉండగా వెళ్లే మీకు మాత్రం మేం నివసిస్తున్నది కాలిబాట! మాకు మటుకు అది ఇల్లే” అన్నరు.

“గోడలన్నవి లేనే లేని ఇల్లు…ఇదే అందరి ఆదర్శం కావాలి. అప్పుడే కొందిరికి ఇండ్లు..ఇంకొందరికి రోడ్డు…దాని పైన ఉన్న ఫుట్ పాత్ ఇంకొదరికి…ఇన్ని తేడాలుండవు. అప్పుడు జగమంత విశ్వం ఒకే మాదిరి ఇల్లు అవుతుంది. అంతదాకా కాలిబాట మీద జీవిస్తున్న వాళ్లను, దిగంబరులుగా లేదా తమకంటూ ఏమీ లేకుండా జీవిస్తున్న మహాజనులెందరినో..

నేనైతే ఎత్తుమీదే ఫొటో తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.
ఈ మనిషి మాదిరి.

~ కందుకూరి రమేష్ బాబు

సంక్రాంతి, స్త్రీలూ, ముగ్గులూ…!

drushya drushyam-15...
చాలామంది అడుగుతున్నారు.
ముగ్గుల బొమ్మలు అన్నప్పుడు అందరూ అదే అడుగుతున్నారు…
ఎన్ని రకాల ముగ్గులు చిత్రించావూ అని!చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, రంగవల్లులు…
ఈ మూడు రకాల ముగ్గులూ ఉంటాయి గనుక, ఒక్కొక్క రకంవి ఎన్ని ప్రదర్శిస్తున్నవూ అని!

కొంచెం భయంగానే ఉన్నది.
అయితే, వారు ఊహించినవి కాకుండా చూపి, ఇవీ ముగ్గులే కదా అంటే ఏమంటారో!
తిట్టినా కొట్టినా నేను మటుకు భయభక్తులతోనే ఉన్నాను గనుక భరోసా!

ఏమైనా ఒక కుతూహలం, సంబురం.
ముగ్గులు స్త్రీల చిత్రలిపిలు కనుక.
స్త్రీ అంటే ప్రకృతి కదా కనుక!

నాకైతే సూరీడు తన కిరణాలతో భూమాత హృదయంపై నర్తించడమే తొలి ముగ్గు.
అటు పిమ్మట పకృతి ఒడిలోంచి నిదానంగా నిద్రలేచిన ఓ మాత వొంగి చుక్కలు పెడుతుంటే…ముగ్గూ…ఆ తల్లీ….ముగ్గుబట్ట వంటి తన తలను ముగ్గులో వొంచి చిత్రిస్తుండటం మలి చిత్రం.
ఇంకా చాలా…

అయితే, అన్నీనూ ఒక ఛాయా చిత్రకారుడిగా వెలుగు నీడలను వాకిట్లో చూసుకుంటూ, వీధుల్లో అడుగులు వేసుకుంటూ పోవడమే నా చిత్రలిపి.

నిజమే. ఇంటికి శుభప్రదం అని ముగ్గులు వేస్తారు. దుష్టశక్తుల నివారణకూ ముగ్గులను గీస్తారు.
అవన్నీ చెప్పినా చెప్పక పోయినా, రాళ్లబండి గారు అన్నట్లు జీవితాన్ని ముగ్గులోకి దింపే ప్రయత్నమే నా చిత్రాలు.
ఎవరైనా చూసి ఆశీర్వదిస్తారని అభిలాష…

కందుకూరి రమేష్ బాబు

ఏకాంత లు ….. ఒక ఏకాంతం !

drushya drushyam-14..పురుషులకు కావాల్సినన్ని స్థలాలున్నాయి.
బయటి ప్రపంచం అంతా వారిదే. ఇంట్లో కొచ్చినా వారి ప్రపంచమే.
ఎంతైనా, మగవాళ్లకు అన్ని స్థలాలూ, అన్ని కాలాలూ యోగ్యమైనవే.
ఎక్కడ ఫొటో దిగినా అది వారి సామ్రాజ్యమే.
కానీ, లేడీస్ అలా కాదని, వారివే అయిన ఫొటోలు చాలా తక్కువ అనీ అనిపిస్తుండగా ఈ ఫొటో….

ఈ ఫొటో ఒక్కటే కాదు, నా ఫొటోలూ మీ ఫొటోలూ అని కాదు, మొత్తం ఫొటోగ్రఫిని చూడాలి.

మొత్తంగానే, ‘స్త్రీలు మాత్రమే’ అన్న ఫొటోలు చాలా తక్కువ.
స్త్రీలుగా వారు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్న తీరును సగర్వంగా ఆవిష్కరించే ఛాయాచిత్రాలు బహు తక్కువ!ఒకసారి మీ ఫొటోలు మీరు చూసుకోండి.
ముఖ్యంగా మహిళలు.
మీవి మీరే మళ్లీ మళ్లీ చూసుకుని చూడండి.ఆ చిత్రాలన్నీ ఒక రిలేషన్ లో భాగంగా చూపేవి కావా?
ఎక్కడ దిగినా గానీ, ఆ మహిళల చుట్టూ నిర్మాణమైన నిర్మాణాలే కదా!
+++

దిగిన ప్రతి ఛాయా చిత్రమూ వ్యక్తిగతం. అది రాజకీయాలూ పలుకుతుంది.
ఇల్లూ, వంటిల్లు, లేదంటే ఉద్యోగంలో పనిచేసే చోటు.
నిజానికి అదీ ఇల్లే. చాకిరీకి మారుపేరు కదా ఇల్లు.
ఇష్టంగా నిర్మించుకునే పక్షి ఖానా కదా ఆ జైలు.

పక్షుల ఫొటోలు కానవస్తాయిగానీ స్వేచ్ఛ జాడ లేదు.
అదీ నేటి ఛాయాచిత్రణం, మహిళల వరకు!

+++

 

చాలా ఫొటోలు…
ఉద్యోగిగా విధి నిర్వహణలో ఉండగా కూడా ఎన్నో దిగుతారు.
అక్కడా మళ్లీ పనిలోఉండగానే తప్పా విరామంగా ఉండగా ఫొటో దిగడం కొంచెం కష్టమే!
అందుకే చాలా ఫొటోలు ఒంటరిగా కంటే మరొకరి తోడుతో దిగేవే అయి ఉంటున్నాయి.

+++

 

social network sites గొప్ప ఉదాహరణ.
అంతా ముఖచిత్రాలే.
జీవన చిత్రాల జాడలేదు.
తమవైన జీవ చిత్రాల ఊసు లేదు.
తమను తాము నిర్మొహమాటంగా, నిర్భయంగా ఆవిష్కరించుకునే చిత్రాలు బహు అరుదు.

+++

 

ఎవరికి వారు ఆలోచించి చూడండి. మీ ఫొటోల్లో మీరు ఏ విధంగా అచ్చయ్యారు?
ఏ కార్యాకారణ సంబంధాల్లో ఉండగా మీరు ఆ ఛాయాచిత్రాల్లో బందీ అయ్యారు.
అసలు మిమ్మల్ని అలా బంధించిందెవరు?

ఖచ్చితంగా మీ భర్తో లేదా మీ అన్నయ్యో నాన్నో అయి ఉంటాడు.
లేదా మిమ్మల్ని కట్టుకునేవాడూ అయి ఉంటాడు.
ఎంత లేదన్నా రిలేషన్.
అది స్త్రీ అయినా కావచ్చును. ఆమెకు కూడా అది ఒక రిలేషన్.
చెల్లెలు, అక్క, వదిన యారాలు. తోటి కోడలు…ఇట్లాంటివే ఏదో ఒకటి.
వాటితో తీసిన చిత్రాలే అధికం.

+++

 

మరేం లేదు.
ఎవరేం చేసినా వాళ్లు భద్రంగా ఉండే ప్రత్యేక పరిస్థితుల్లో  మీరు భద్రంగా ఉండాలనే అర్థంతోనే!
అంతేగానీ, మీరొక పక్షి అని రెక్కలల్లారుస్తూ ఎగిరేటప్పుడు తీయాలని  వాళ్లకు తోచదు!
పంజరంలో ఉండగా అదే సమస్య.
అవే చిత్రాలు వస్తయి.

ఒక ఛాయాచిత్ర గ్రాహకుడిగా ఉండగా ఫొటోలు తీయడమే కాదు, దిగడంలోనూ అనేక పరిమితులు ఉన్నాయన్న స్పృహ ఇలా మెలమెల్లగా తెలిసి వస్తున్నది.

నా వరకైతే, ఛాయా చిత్రణం చేస్తూ ఉండగా ఎందుకో తెలియకుండానే మహిళల పబ్లిక్ స్పేస్ గురించి బెంగ కలుగుతుంది.
ఏది తీసినా ఆమె ఉంటుంది. కానీ, ఆమె ఎవరో తెలుస్తుంది. అదీ విషాదం.

వాళ్లను ఎప్పుడు ఫొటో తీసినా అది ‘మన’ దృష్టికోణం నుంచే ఉండటం బాధిస్తుంది.
అయితే అందంగా లేదంటే శ్రమజీవులుగా కాకుంటే ఇల్లాలిగా ఇంకా కాదంటే ఉద్యోగిగా చూడటమే గానీ, స్త్రీలను మనుషులుగా, నిర్వ్యాపకంగా, నిర్భయంగా చూడటం, చూపటం అన్నది కష్టం.
అందుకు తెగించవలసే ఉంటుంది. చిత్రకారుడే కాదు, చిత్రణ పొందే మనుషులూనూ!

+++

 

దీనర్థం ఒక ఫొటోను వాళ్లు స్త్రీలుగా తమవైన రోల్ ప్లేయింగుల్లో భాగంగా కాకుండా చూడాలని!
అలా అని ఈ రోల్స్ లేదా పాత్రలపై విమర్శ అని కాదు. ఈ ఫొటోల్లో వాళ్లు బాగానే ఉంటారు.
అమ్మ, అక్క, వదిన, చెల్లి, స్నేహితురాలు, భార్య, ప్రియురాలు, సహచరి, ఇష్ట సఖి, విరాగి, యాంకర్, సినీ నటి, అపరిచితురాలు…ఇట్లా చాలా…

సమస్య బాగుండటం కాదు…ఉండటం.
ఒక మనిషిగా ఆమె కనిపించడం…అదే మహాకష్టం.

ఆమెను చూస్తే ఏ సంబంధాలు లేకుండా ఒక అస్తిత్వంగా కనిపించడం ఎంతో కష్టంతో కూడి ఉన్న ఘటన.
ఒకరి అపూర్వమైన చిరునవ్వు చూస్తే, తప్పిపోయిన స్నేహితురాలిగా ఉంటుంది.
ఇంకో నిండుదనాన్ని చూస్తే మా అమ్మే అనిపిస్తుంది.
అల్లరి చిల్లరి పిల్లను చూస్తే చెల్లెలే కనిపిస్తుంది. కానీ, మనిషిగా ఆమె నిండైన వ్యక్తిత్వంతో కనిపించనే కనిపించదు.

కారణం?
ఒక్కటే, అలాంటి జీవితం సమాజంలో ఒకటి ఉండటం, దానికి మనం ఎక్స్ పోజ్ కావడం జరగాలి.
ఆ తర్వాత అలాంటి ఛాయాచిత్రాలు వాటంతటవే దృశ్యబద్ధం/expose అవుతాయి.

కానీ, మానవ సంబంధాల్లో అలవోకగా మనకిష్టమైన పాత్రోచిత సందర్భాలే కావాలనుకుంటాం.
అందులో భాగంగానే మనం వాళ్లను చూస్తుంటాం.
అలా కాకుండా ఉన్నప్పుడు కొన్ని సంభవం!
ఉదాహరణకు ఈ ఫొటో చూడండి.

 

+++

బహుశా, వీళ్లు పూర్తిగా తమ ప్రపంచంలోనే ఉన్నారు.
భార్యలుగా వంటింటి కుందేళ్లుగా కాకుండా మగువలుగా, స్వతంత్రంగా కనిపించారు.
తిరగేసిన బిందెలపై మగువలు.

వీళ్లను అమ్మలక్కలు అని కొట్టిపారేయ గలిగే దృష్టి ఇక్కడ సవరించుకోవాలి.
ఎందుకంటే, అమ్మలక్కల కబుర్లంటే పురుషుడి దృష్టిలో అక్కరకు రానివి.
కానీ, వాళ్లకు పూర్తిగా అవసరమైనవి.
వాళ్ల ప్రైవేట్ లైవ్స్ సెలబ్రేట్ అయ్యేది అక్కడే, ఆ ముచ్చట్లలోనే!

జాగ్రత్తగా చూడండి…
బిందెలు తిరగేసి వాళ్లు కూచున్న విధానం….
ఇది వాళ్ల వ్యక్తిగత రాజ్యం గురించి చెబుతున్నది.
ఒకరితో ఒకరు పంచుకుంటున్న తీరుతెన్నులూ ఉన్నయి.
అన్నీ ఉన్నయి. వాళ్ల వ్యక్తిత్వం, వాళ్లను బిందెలుగా మార్చిన వైనమూ ఉన్నది.
సమ్మక్క సారాలమ్మ… మేడారం జాతరలో తీసిన చిత్రం ఇది.
చూడ ప్రయత్నిస్తుంటే మెలమెల్లగా ఇవన్నీ కానవస్తున్నయి.

+++

 

నిజానికి ఇది కూడా ఒక సగం చిత్రమే.
వాళ్లు అమ్మలక్కలు కూడా కాదు.
పాత్రలు.
పాత్రలు లేని స్థితిమంతులు.
’వాళ్లు.’..
అంతే!
జాతరలో వాళ్లు కలిశారు. అంతకుముందరి మనుషులే. ఆత్మీయులే. బంధువులే.  స్నేహితులే.
కానీ, జాతరలో వారు తమను తాము వ్యక్తం చేసుకున్నారు, ఇలా.
అందుకే ఈ చిత్రం ఒక అపూర్వ చిత్రం- నాకైతే!తమని తాము సరికొత్త పాత్రలుగా చూసుకున్న వైనం, ఈ చిత్రం.
వాళ్లను మనమూ చూడాలి. ఆ పాత్రల్ని తిరగేసి కూచున్న వైనాన్ని నలుగురికీ చెప్పాలి.
అప్పుడే పాత్రోచిత ఛాయచిత్రాల అందం ఏమిటో చూడగలం.ఇక్కడైతే ఎవరూ లేరు. ఏకాంతలు. ఇంకేమీ లేదు.కేవలం స్త్రీలు మాత్రమే.

వాళ్లకు ధన్యవాదాలు.

~ కందుకూరి రమేష్ బాబు

పాదం మీది పుట్టుమచ్చ!

druhttps://i0.wp.com/saarangabooks.com/retired/wp-content/uploads/2013/12/drushya-drushyam-13-1024x693.jpg?resize=717%2C485shya drushyam-13

డావిన్సీ చిత్రించిన మోనాలిసా చిరునవ్వు గురించి చాలా చర్చ జరిగింది. ఇంకా జరుగుతుంది కూడా.
కానీ, దైనందిన జీవితంలో చిరునవ్వులతో జీవించే సాదాసీదా మనుషుల గురించి అంత చర్చ జరగదు.
జరగాలనీ లేదు. కానీ, ఈమెనే చూడండి.ఈమె మోనాలిసా కాదు, మేరీమాతా కాదు.
మామూలు మనిషి.
లక్ష్మి!
ఇంతకన్నా మంచిగ చెప్పడం నాకు చేతకావడం లేదు!ఇటువంటి వరలక్ష్ములతో, నడయాడే వారి పాదాలతో మా ఊరూ వాడా గొప్ప సంబురాన్నే పొందుతాయి.
ఆమె తిరుగాడినంత మేరా వాతావరణం పరిశుభ్రం అవుతుంది. ముషీరాబాద్లో మొదలయ్యే ఆమె బంజారాహిల్స్ దాకా నడుస్తుంది. తలపై భారం తీరాక ఆమె మళ్లీ వడివడిగా ఇంటికి చేరుకుంటుంది. అంతదాకా చిరునవ్వే!
ఒక శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆత్మీయమైన చాలనం.

+++

తాను మాదగ్గరి మనిషి. మేమంతా ఒకే వీధిలో ఉంటాం.
“చీపుర్లమ్మో…” అనుకుంటూ తిరగాడే ఈ వనిత నిజానికి సంచార జాతికి చెందిన స్త్రీ.
బిబూతీ భూషణుడు రాసిన ‘వనవాసి’ నవల్లో కనబడే ‘నాగరీకమైన’ మనిషి.
ఏదీ దాచుకోకుండా, దేనికీ సంశయించకుండా, మనసులో ఒకటి – మాటలో ఒకటి కాకుండా, నిర్భయంగా సంభాషించే సిసలైన సంస్కారి ఆమె.

+++

తన మోములో తాండవమాడే కళ చూడండి.
ఆమె పెదవులపై విరిసే దరహాసం చూడండి.
ఒద్దికగా ఒంటిని చుట్టుకున్న ఆ కొంగును, అందలి అభిమానం చూడండి.
తలపై దాల్చిన చీపురుకట్టలను, వాటిని సుతిల్ తాడుతో కట్టి ‘దూ’ ముడి వేసిన తీరు చూడండి.

చెంపలకు పసుపు, పచ్చటి రుమాలు, జాతీయ పతాకం వంటి చీరా…
అంతా వర్ణ సంచయం…శోభ.

ఇంకా కేవలం ఆమె…
ఆమెలో గొప్ప ఆత్మవిశ్వాసం….డిగ్నిటీ ఆఫ్ లేబర్…
స్త్రీత్వం, అందులో జనించే ప్రేమాభిమానాలు,
ఆదరణ, సిగ్గూ కలగలసిన హాసం…

కష్టజీవి స్వేదంనుంచి ఇంద్రధనుస్సు విరిసినట్టు అన్నీ కలిసిన ఆమె చిత్రం
నా వరకు నాకు ఈ చిత్రం ఒక అపూర్వమైన కానుక.
మాస్టర్ పీస్.

+++

ఇలాంటివి ఎన్ని చిత్రాలో…

తనను ఇలా వీధుల్లోకి వెళ్లేప్పుడు చూస్తాను. వెళ్లక ముందూ చూస్తాను.
పిల్లలతో ఉంటుంది. వాళ్ల ఆలనా పాలనా చూస్తుంది.
భర్తతో ఉంటుంది. అతడి అవసరాలను చూసుకుంటుంది.
స్నేహితులతో ఉంటుంది. అప్పుడు నవ్వులే నవ్వులు.
విశ్రాంతిగా ఉన్నప్పుడు శిరోజాలు విరబోసుకొని తలకు నూనె పట్టిస్తుంటుంది.
అత్తమ్మతో పేండ్లు చూయించుకుంటూ కూడా కనిపిస్తుంది.

నీళ్లు పడుతున్నప్పుడు, ఏదో పనిమీద కిరాణా దుకాణంలోకి వెళుతున్నప్పుడు,
వాడకట్టులో అకస్మాత్తుగా తప్పిపోయిన పిల్లవాడిని వెతుకుతూ ఉన్నప్పుడు, ఎన్ని చిత్రాలో!
అన్నీ వేటికవే సాటి.

+++

ఇట్లా అనేకానేక ఘడియల్లో ఆమెను, ఆమె వంటి ఎందరినో చూస్తూనే ఉంటాను.
కొన్నిసార్లు కెమెరాతో ఆ ఘడియలను పదిలపరుస్తుంటాను. అదొక అదృష్టం.
బహుశా ఈమెవే నా వద్ద పదిపదహారు అదృష్టాలున్నయి.
ప్రతిదీ దేనికదే సాటి. ఇంత గొప్పవే అవన్నీనూ!

కానీ, దురదృష్టం ఏమంటే, తనను ఇలా మోనాలిసాతోనో మరొకరితోనో పోల్చవలసి వస్తుండటం!
అదొక బలహీనత కాబోలు! నిజమే మరి! మోనాలిసాను తలదన్నే జీవితాలు ప్రధాన స్రవంతి అయ్యేదాకా
ఇట్లా నావలె ఎవరో ఒకరు, ఏదో రకంగా వాపోవడమూ, పోల్చుకోవడమూ బలహీనతే!

అయినా పరవాలేదు. బలహీనతే బలం అనుకొని మరికొందరు అదృష్ట దేవతలను చిత్రీకరిస్తూ ఉంటాను.

+++

నమ్ముతారో లేదోగానీ, ఇట్లా ఈ జనసామాన్యం జీవనచ్ఛాయల్లో తొణికిసలాడే నిండుతనం, తృప్తీ, శాంతి,
వాటితో వర్ధిల్లే చిరునవ్వు…వాటిని ఒడిసి పట్టుకోవడాన్ని మించింది ఇంకేమైనా ఉంటుందా?
వారి నడకలో, నడతలో, బింబప్రతిబింబాల్లో తారాడే ఆ వెలుతురు, దాని నీడన జీవించడాన్ని, జీవనచ్ఛాయను కావడాన్ని మించిన భాగ్యం మరొకటి ఉంటుందా? ముఖ్యంగా నగరంలో రాంనగర్, ముషీరాబాద్ వంటి పరిసరాల్లో జీవించే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవితాలకు ఇలాంటి బతికిన క్షణాలే చిరునవ్వులు!

అయితే, ఒకటి మాత్రం నిజం. ఉన్నతిని పొందేకొలదీ మనుషులు మారతారని కాదు. కానీ, వాళ్ల పోకడ వేరుగా ఉంటుంది. దాంతో ఇంత నిర్మలమైన చిరునవ్వులు చూడటం కష్టమేమో! వాటిని ఒడిసి పట్టుకోవాలనుకునే తాపత్రాయులకూ కొరతేనేమో! ఏమో! అది వేరే వాళ్ల కష్టం!

+++

ఏమైనా ఈ మనిషిని మళ్లీ చూడండి.ఎంత అద్భుతంగా ఉంది.
ఆమె వైభవానికి శీర్షిక పెడితే… ‘చిరునవ్వూ – చీపురు కట్టలూ – రాజరికం’ అనాలేమో!

+++

నిజానికి, ఇలాంటి కష్టజీవులను అందంగా చిత్రీకరించడం తేలిక.
ఎందుకంటే వాళ్ల కీర్తికిరీటాలన్నీ కష్టార్జితం. అది సామూహికం.
కాయకష్టంతో జీవించే వారిలో ఒక వర్ఛస్సు, కళ. అలౌకికత్వం, ఆత్మసౌందర్యం మహత్తరం.
అది కాసులకు లొంగనిది. పేరుప్రఖ్యాతులతో కునారిల్లనిదీనూ.
అందుకే ఈ మహిళ ఒక చూడముచ్చట.

ఆమె ఒక నిరాడంబరమైన కవిత.
మన సోదరి. దీవించండి.

+++

గద్దరన్న రాస్తాడు, “నీ పాదం మీది పుట్టమచ్చనై చెల్లెమ్మా…” అని!.
ఇటువంటి సోదరీమణుల చెంత దినదినం ప్రవర్థమానం అవుతున్న కళ…అది ఎవరిదైనా కానీ…
నిజంగానే అదొక చూడముచ్చట. దాన్ని నలుగురికీ పంచడమే నిజమైన చిరునవ్వు!

కృతజ్ఞతలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

మూగవాడి పిల్లనగ్రోవి

drushya drushyam-12

అజంతా గుర్తొస్తాడు చాలాసార్లు.
చెట్లు కూలుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు.
కూలకుండా చెట్టు అలా నడుస్తూ వెళుతున్నప్పుడు కూడా.

+++

ఇతడు కూడా అలాంటివాడే.
రిక్షా లాగి పొట్టపోసుకుంటాడు.
నిజానికి “రిక్షా తొక్కి’ అని రాయాలి. కానీ, తనకి రిక్షా తొక్కే పరిస్థితి లేదు. బోదకాలు మరి!
దాంతో రిక్షా లాగి తన జీవికను తాను వెళ్లదీస్తున్నాడు.

ఒకానొక ఉదయం.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ డివిజన్ సమీపంలోని మేకలమండి. అక్కడ అతడ్ని చూశాను.
ఆ వీధిలోకి వెళ్లే ముందే ఒక గుడి వస్తుంది. ఆ గుడి దగ్గరకు రాగానే ఎందుకో నాకు తనను ఫొటో తీయబుద్ధి అయింది.
ఆ టైమ్ కి అక్కడ గుడి ఉందని కూడా నాకు తెలియదు. అతడు అలా రిక్షా లాక్కుంటూ వస్తున్నాడు. చూశాను. ఒకట్రెండు చిత్రాలు తీసుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది, వెనకాల నర్సింహస్వామి ఉన్నాడని.
దాంతో మరొక మెరుగైన ఫొటోకోసం వ్యూ ఫైండర్లోంచి చూస్తున్నాను. అప్పుడు తెలిసింది, నర్సింహస్వామి ఏమోగానీ అతడికి బోదకాలు ఉందని!
ఆ కాలుతో రిక్షాను లాగుతున్న తీరు చూశాక ఇక చాలనుకున్నాను.

నిజానికి ఆ ఒక్క చిత్రం ఇక చాలనే అనుకున్నాను. కానీ మనసూరుకోలేదు.
అతడు చెట్లు కూలుతున్న దృశ్యమే. కానీ కూలకుండా నడుస్తున్న చెట్టు కూడా అని అర్థమైంది.
తీస్తూనే పోయాను. అతడితో పాటు నేను పోతూనే ఉన్నాను. పోతూ ఉండగా అర్థమైంది!
అతనొక వృక్షమని. తాను నలుగురికీ నీడనిచ్చే వృక్షమేగానీ పిల్లలో మరొకరో తనను పట్టించుకోవడం లేదంటూ విచారంతో కృంగిపోయే మనిషి కాదని!

ఏవో వేళ్లను నాలో నాటాడు.
కొత్త లిపినేదో నేర్పాడు. ఇక ఆ వృక్షం శాఖోపశాఖలై నాలో కుదురుకున్నది.
సరికొత్త పద చిత్ర దృశ్యాలు వాటంతటవే పేనుకొని నేనే ఒక చిత్రమై పోయి కొత్త కొత్త పాటలు పాడుతున్నాను.
ఏవోవో కవితలు అల్లుతున్నాను.

+++

తీరుబడిగా చూస్తూ ఉంటాను నన్ను నేను.
ఒకానొక రోజు మళ్లీ ఆ చిత్రాలన్నీ చూశాను.
వాటిల్లో అతను మరింత ఉత్సాహంగా కనిపించాడు. నోట్లో వేపపుల్లతో అతడు…ఏమీ ఆలోచించకుండా కులాసాగా నడుస్తూ రిక్షాను లాక్కెళుతున్న వయో వృద్ధుడు!
వెనకాల నర్సింహస్వామి! గాఢమైన రంగుల లిపితో కూడిన ఈ ఛాయాచిత్రాన్ని ఎంపిక చేసుకున్నాను.
అతడి వెనకాల ఉన్న కారు కూడా అతడు బతుకుతున్న స్థితిపట్ల కొన్ని భావ ప్రకటనలు చేస్తూ ఉన్నది.
అదీ మంచిదే అనుకున్నాను.

+++

ఈ ఫొటోను తర్వాత కాలంలో పెద్దది చేసి ప్రదర్శనకు పెట్టినప్పుడు, ఆ ఫొటో ప్రింట్ చేసిన శేఖర్ తన భార్యతో సహా ఎగ్జిబిషన్ కు వచ్చాడు.
అప్పుడు అతడి భార్య పవిత్ర ఈ చిత్రం వద్ద ఆగి ఆ ముసలాయన్ని గుర్తు పట్టి ఆశ్చర్య పోయింది.
“ఈ తాత నాకు తెలుసు. నీకెలా తెలుసు?” అని అడిగింది.
ఏకవచనం! ఎంత బాగుందో’ అనుకుంటూ, “నేను ఆ తాతను చూశాను’ అని మెల్లగా చెప్పాను.
“మేకలమండిలోనేనా?’ అందామె.
అవునన్నాను.
“ఇతడు మా ఇంటికి దగ్గర్లోనే ఉంటాడు. చాలా మంచివాడు. ప్రేమగా మాట్లాడుతాడు’ అంది.
“పిల్లలు పట్టించుకోరు. దాంతో ఇప్పటికీ కష్టపడుతుంటాడు” అని కూడా వివరించింది.
“అవును. పాపం…బోదకాలు’ కదా!” అన్నాను నేను.
ఆమె నా వైపు సాలోచనగా చూసి, “ఇతడికే కాదు, ఈయన భార్యకు కూడా’ అని ఆగింది.

+++

నాకు నోట మాట రాలేదు.
“ఇద్దరికా?” అన్నానో లేదో గుర్తులేదు గానీ, ఒక్కపరి నా జీవగ్రంథం రెపరెపలు పోయింది.
ఒక తల్లివేరు నిస్సత్తువగా తలవాల్చినట్టయింది.
నేను మెల్లగా మామూలు స్థితికి రావడానికి కొంత టైం పట్టింది.
ఇంకా ఆమె చెప్పింది, “ఇతడు రిక్షా లాగి కాసిన్ని డబ్బులు తెస్తే, తాను కూరగాయలు అమ్మి మరికొంత సంపాదిస్తుంది, కూచున్న చోటే!’ అని వివరించింది.
ఇప్పుడు నాకు మళ్లీ ఆశ్చర్యం కలిగింది.
“నయమే!” అన్నాను నేను.

“ఏం నయమో ఏమో! ఈ వయసులో కూడా వాళ్లు కష్టపడాలా?’ అంది తాను.
ఈ మాటకు మళ్లీ డోలాయమానం. ద్వైతం.

“తప్పదు. అనివార్య జీవన ప్రస్థానం” అనుకున్నాను నేను, మనసులో!

+++

ఏమైనా ఇదంతా జరిగింది.
ఇంకా చాలా జరిగింది, ఈ ఫోటో వల్ల.
తాత గురించి, తాత అవస్థ గురించి, తాత భార్య దుస్థితి గురించి…
వీటన్నిటీనీ మించి ఉల్లాసంగా వేపపుల్లతో నడుస్తున్న ఒక యువకుడి గురించి కూడా.
మస్తు మాట్లాడుకున్నాం.

విశేషం ఏమిటంటే, ఇదంతా మాట్లాడుకునే వీలు కల్పించిందీ చిత్రం.
అందుకే అంటాను, ఒక దృశ్యం చెట్లు కూలుతున్న వైనాన్ని చెబితే,
మరో చిత్రం కూలకూడదని చెబుతుంది.  ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది.
ఉన్నదానికీ ఉండాల్సిన దానికీ మధ్య ఒక ఊహ, ఒక ఆశ, మరి ఆదర్శం….
ఇవన్నీ ఉంటేనే…ఒకానొక స్వప్నలిపి గురించిన ప్రేమపూర్వక ఆకాంక్షలు ఇలాగే ఉనికిలోనికి వచ్చినయి.

కళ ఆదర్శం బహుశా ఇదేనేమో!

అందుకనే దృశ్యాదృశ్యంగా జీవితం – కళ పెనవేసుకుని జీవించాలని నాకు మహా ఇది!
అటువంటి దార్శనికతను పంచిన ఎందరికో…
కేశవరెడ్డికి, అజంతాలకి కృతజ్ఞతలు.
ఆ తాతకు, తాతమ్మకు వందనం!!

~ కందుకూరి రమేష్ బాబు

వర్తమానంలో భవిత!

 

pictureచాలామంది అడుగుతుంటారు, ఫొటోగ్రఫి నేర్పమని!
నేర్చుకున్న వాళ్లూ అడుగుతుంటారు, మీరెందుకు తీస్తూ ఉంటారని!
నా సంగతీ సరేగానీ, ఎందుకు తీస్తున్నారో చెప్పే వాళ్లను మాత్రం నాకైతే ఒకటి అడగాలనిపిస్తుంది,మీరు తీసిన ఫొటోలేమిటీ? అని.
ఫోటో తీస్తూ తీస్తూ మీరు తీసిన ఫోటోలేమిటా అని!

ఈ రెండోది ముఖ్యమనే ఈ కథనం.

+++

అర్థమయ్యేలా చెప్పాలంటే మన కన్ను ఒకదానిపై పడుతుంది. తీయాలనిపిస్తుంది. తీస్తాం.
అదొక రకం.తర్వాత మనం తీయాలనుకున్న ఫొటో తీసేందుకు కెమెరా వ్యూ ఫైండర్లో కన్ను పెట్టి చూస్తాం, చూడండి.
అలా చూసినప్పుడు మనకు అంతకుముందు కనిపించనిది కనిపిస్తుంది. ఇక దాన్ని తీయాలన్పించి తీయడమూ ఉంటుంది. ఇది రెండో రకం.నా సోదరసోదరీమణులను అడగాలనిపిస్తుంది. ఈ రెండో రకం చిత్రాలెన్ని తీశారూ అని!
అలా తీసిన చిత్రాలు చూపరూ అని వారిని అభ్యర్తించాలనుకుంటూ ఉంటాను.

+++

ఇక నా విషయానికి వస్తే, ఈ చిత్రం కూడా అలాంటిదే.
కెమెరాలో కన్ను పెట్టాక తెలిసి తీసిన ఫొటో.

అవును. నిజానికి నేను ఫొటో తీయాలనుకున్నది ఇద్దరు శ్రామికులను.
కానీ తీసేప్పుడు తెలిసింది, వాడూ ఉన్నాడని.
అప్పుడు వాడిపై కన్ను పడి, వాడినే తీయాలనుకుని, వాళ్లనూ తీసినప్పటి చిత్రం ఇది.
అలా తీసిన ఫోటోనే మీరు చూస్తున్నది.

+++

మళ్లీ వెనక్కి వెళ్లి, తీసినప్పటి విషయం చెబితే…
ఫొటోలో ఉన్న బాబు. వాడిని నేను చూడనేలేదు. వాడికోసం ఏ మాత్రం తాపత్రయ పడనూ లేదు. కానీ, వాడు దొరికాడు.
ఆ ఫొటోలోని వాడిని పదే పదే చూడండి. నిమ్మళంగా తల్లి గొప్పదనమూ తెలుస్తుంది. ఆ తల్లి, ఆ తల్లి పక్కనున్న తల్లీ, వాళ్ల తలపై ఉన్న పనిముట్లూ, వాటి గొప్పదనమూ తెలుస్తుంది.
అదీగాక వాళ్లేదో సంభాషణలోనూ ఉన్నారని తెలుస్తుంది. కానీ నాకైతే వాడే గొప్పగా ఉన్నాడు.
శ్రమజీవుల కష్టసుఖాల్లో, పాలూ చెమటల్లోంచి ఉద్భవించిన ఒక నూతన మానవుడూ వాడే నని నా నిశ్చితాభిప్రాయం.
వర్తమానం మాత్రమే తీయాలనుకుని భవిష్యత్తూను చిత్రించిన సంబ్రమం ఈ ఛాయాచిత్రం అనుకుంటూ ఉంటాను.

+++

అయితే, నేను దించాలనుకున్నది వేరు.
సెక్రెటేరియేట్ దగ్గరున్న బస్టాండ్ దగ్గర దాకా వచ్చాక ఈ ఇద్దరు స్త్రీలను, నెత్తిపై తమ పనిముట్లతో చకచకా నడిచి పోతుంటే చూశాను.
చూస్తుండగానే వాళ్లు నన్ను దాటిపో్యారు.
నన్ను దాటిపోయాక నేనూ మరికొన్ని మైళ్లు దాటిపోయాను.
పోతూ ఉండగా మెల్లగా ‘నిర్ణయాత్మక క్షణం‘ …Decisive moment గురించిన ఎరుక యాదికి వచ్చింది.

అది ఆధునిక ఫొటో జర్నలిజం పితామహుడిగా భావించే Henri Cartier-Bresson  ఖాయం చేసిన ఒక ఒరవడి…పదబంధం. ఛాయచిత్రణంలో నిర్ణయాత్మక క్షణం గురించి…ఎంతో అప్రమత్తంగా ఉండి… లాఘవంగా బంధించే ఒకానొక అరుదైన క్షణం గురించిన ముచ్చట గుర్తుకు వచ్చింది.
బ్రెస్సెన్ గురించి చదవగా చదవగా ప్రతి ఛాయాచిత్రకారుడికి ఒక నిర్ణయాత్మక క్షణమైతే ఎదురవుతుంది. ఆ క్షణంలో అతడి స్పందన ఎటువంటిదీ అన్న విషయం స్ఫురించింది. అనుకోకుండా తారసపడ్డ ఆ లిప్తకు అనుగుణంగా స్పందించి దాన్ని చిత్రీకరిస్తాడా లేదా? అదే ముఖ్యం అన్న విషయం గుర్తొచ్చింది. కాలాతీతం కాకుండా తీశాడా…ఆలోచిస్తూ కూచున్నాడా అన్నది చాలా ముఖ్యం. అలా ఆ క్షణానికి అణుకువగా ఉన్నాడా లేదా పరధ్యాసలో ఉన్నాడా అన్నదే కీలకం. పట్టుకోకపోతే అది కదిలి మాయమైతుంది.

చలమో/ శ్రీశ్రీయో  కూడా వేరే సందర్భంలో అంటాడు…ఒక అపూర్వమైన క్షణం దృశ్యమానం చేయడంలో  ప్రకృతికీ తనకూ కుదిరే సమన్వయం వంటిదేదో అదే బ్రెస్సన్ చెప్పడమూ, ఆ విషయమే మళ్లీ అలవోకగా ఆ ఇద్దరు స్త్రీల మీదుగా నాకు గుర్తుకు రావడమూ అదృష్టమే అయింది. ఇక వేదన…నీకూ సమాజానికీ మధ్య తాదాత్మ్యతే అనుబంధమై చిత్రమయ్యే నిర్ణయాత్మక క్షణాల గురించిన చింతన మొదలైంది. ఇక మనసున పట్టలేదు. ఒకింత బాధకు గురయ్యాను. గుర్తు రావడమూ మొదలైంది. ఒకానొక రోజు…నేనైనా మరెవరైనా వారి వారి జీవన వ్యాపకాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండగా ఎన్నిసార్లు ఫోటో తీయాలనిపిస్తుందో అన్ని సార్లు ఫొటో తీయగలగడం ఒక మహత్యం అన్న విషయమూ… ఆ నిర్ణయాత్మక క్షణంలోనిదే అన్న విషయమూ…ఇక ఆ ఎరుక నన్ను ముందుకు పోనీయలేదు. అప్పుడు ప్రసిద్ధ భారతీయ ఛాయాచిత్రకారుడు రఘురాయ్ గుర్తుకు రావడం నా వరకు నాకు యాదృచ్ఛికం కాదు. అవును మరి.  Decisive moment తాలూకు అనుభవైక వైద్యాన్ని నేను వారివద్దే గమనించాను.

+++

ఎప్పుడూ ఆయన తప్పిపోలేదు. ఆ ప్రసక్తే లేదు.
‘ఒక ఛాయ నిన్ను ‘దించు’ అని డిమాండ్ చేస్తుందా ఇక ఆ డిమాండ్ కు తలొగ్గాలి. అప్పుడే నువ్వు అదృష్టవంతుడివి. లేదంటే నువ్వు దుర్మార్డుడివి కూడా.’
– అవును. ప్రకృతి ప్రసాదించే భాగ్యాన్ని చేజేతులా జారవిడుచుకున్న అబాగ్యుడివే అవుతావు. అలా దురదృష్టవంతుడిగా మిగిలిపోని మహోన్నత ఛాయాచిత్రాకారుల్లో ఒకరే రఘురాయ్.
ఆయనెప్పుడూ అప్రమత్తుడే. ప్రకృతికి విధేయుడే…అది చెప్పినట్టు నడుచుకునే తాను అంతటి భాగ్యవంతుడయ్యాడు.

నమ్మతారో లేదోగానీ, అతడు ఫోటోలు తీయడు. He never captured pictures. Picture captures him.
ఆ సంగతిని సన్నిహితంగా చూశాక నా అదృష్టాన్ని నేను పరీక్షించుకోవడమూ మొదలెట్టాను.

+++

అయితే, ఎందుకో ఏమో ఫలనాది కనిపిస్తుంది. ఫొటో తీయబుద్ధి అవుతుంది. తీస్తుంటాను.
రీజనింగును వదిలిపెట్టడమే ఛాయాచిత్రణం. బుద్ధికి పదును పెట్టకపోపవడమే ఆ మహోన్నత కార్యం.
అయినా, మనసు చెప్పినా కూడా, ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా రోజుకు నాలుగైదు బొమ్మలను మిస్ అవుతూనే ఉంటాను. అంటే నేను నూటికి నాలుగైదే శాతం అజాగ్రత్తపరుడిని అని అర్థమౌతోంది. ఇప్పుడు కూడా…ఈ ఇద్దరు స్త్రీలు తమ తోవలో తాము నడుచుకుంటూ వెళుతుంటే వాళ్లను గమనించి, స్పందించి కూడా నా తోవలో నేను పోవడం అంటే దుర్మార్గం అని భావించాను. అంత అజాగ్రత్త పనికిరాదన్న స్పృహ కలిగింది. ఇక వెంటనే బండి వెనక్కి తిప్పాను ఒక చోట సైడ్ స్టాండ్ వేశాను. బ్యాగులోంచి కెమెరా తీశాను. వాళ్లు నా ముందు నుంచి వెళ్లేదాకా కెమెరాను క్లిక్ మనిపిస్తూనే ఉన్నాను.

తీస్తూ ఉండగా అప్పుడు చూశాను, ఆ బాబును!
క్షణంలో నిర్ణయమైంది, వాడే నన్ను పిలుస్తున్నాడని!
ఇక అదీ మొదలు… వాడిని వదిలిపెట్టలేదు.
వాడిని ఎన్ని విధాలా ఆ తల్లి చంకలో ఉండగా తీశానో…లెక్కలేదు.

శ్రమజీవుల సన్నిధిలో భద్రంగా రూపొందుతున్న భవితకు రూపం వాడు.
ఆ బాలుడికి, వాడి బాల్యానికి నేను బందీ అయిన అపూర్వ నిర్ణయాత్మక క్షణాల్లో ఒకానొక లిప్త, మీ కోసం!

+++

మొత్తంగా కృతజ్ఞుణ్ని…
ముందు బ్రెస్సెన్ తాతకి… అటు తర్వాత తల్లులకూ బిడ్డలకూ…
మీది మిక్కిలి.. నాకు వ్యూ ఫైండర్లో కన్ను పెట్టి చూడాలని చెప్పిన రఘరాయ్ కి!

~ కందుకూరి రమేష్ బాబు

హత్యనో, ఆత్మహత్యనో, సహజ మరణమో తెలియని అవస్థ!

drushya drushyam-10ఎందుకో చిన్నప్పటి నుంచీ నడక ఒక అలవాటు.
ముందు ఒక్కడిని…తర్వాత దోస్తులు కలిసేవారు.
చిన్ననాడు భుజంపైన పుస్తకాలు పెట్టుకుని నడుచుకుంటూ బడికి వెళ్లేవాళ్లం.
చిన్న చిన్న గల్లీలనుంచి నడుస్తూ నడుస్తూ పెద్ద రోడ్డు వచ్చేదాకా అలా సానుపు చల్లిన ఇరుగు పొరుగు వాకిళ్ల మధ్య నుంచి చిన్నదారి…అందులో స్లిప్పర్లతో నడక….అది క్రమంగా పెద్ద రోడ్డును కలిపేదాకా నడిచేవాళ్లం.
కొంచెం పెద్దయ్యాక ఇంటినుంచి బస్టాండ్ దాకా గబగబా నడక. ఆ నడకలోనూ మళ్లీ చిన్ననాటి అనుభవాలతో మళ్లీ రోడ్డును చూస్తూ, ఆ డాంబర్ రోడ్డుపై చూపు ఆనిస్తూ నడిచేవాళ్లం.
బస్టాండ్లో బస్సెక్కి కాలేజీ ఉన్న సిరిసిల్లకి వెళ్లాక మళ్లీ బస్టాండ్ నుంచి కాలేజీ దాకా నడక.
కొద్ది దూరమే అయినా కొంచెం పట్నంలో నడక.
తర్వాత నిజామాబాద్, అటు తర్వాత హైదరాబాద్…ఇక్కడా చాలా ఏళ్లు నడకే.
జీడిమెట్ల, హైదరుగూడ, బషీరుబాగ్, నల్లకుంట, రాం నగర్, డీడీ కాలనీ, మళ్లీ రాం నగర్, ఇప్పుడు పార్సీగుట్ట…గంగపుత్ర కాలనీ…బండి కొన్నాక కూడా నడక ఉండనే ఉన్నది.
అయితే నడక నేర్పిన చూపు ఒకటి అప్పుడూ ఇప్పుడూ ఉండనే ఉన్నది.
ఆ చూపే అనేక చిత్రవిచిత్రాలు పోతూ ఉన్నది.నిజమే మరి.
అప్పుడు వీధుల్లో చూపు సాగేది. పెద్దయ్యాక విశాలమైన రోడ్డుపైనా చూపు ప్రసరిస్తూనే ఉన్నది.
అప్పుట్లో ఒకసారి పది పైసల బిళ్ల దొరికేది. ఇంకోసారి పిన్నీసు కనిపించేది. గుండీలూ కనిపించేవి.
మరోసారి రెవెన్యూ స్టాంపూ కనబడేది. అలాగే దువ్వెన, ఇంకా పెద్దవీ కనిపించేవి.
అయితే, ఇప్పుడూ నడకలో అవి కనబడుతూనే ఉన్నయి. కనబడ్డప్పుడల్లా వాటిని తీసుకునే తీరు మారింది.

నడకతో వయసు నడుస్తుందేమో లేదా అనుభవమేమో!
ఇంకా చెబితే చాదస్తమూ కూడా…

నడవగా నడవగా అది అక్షరాల్లోకి అనువదించడమూ మొదలైంది.
మళ్లీ ఛాయచిత్రాల్లో వాటిని ఒడిసి పట్టుకోవడమూ జరూరు అయింది.
ఎందుకూ అంటే అది బాల్యం అనాలా? గతంలో సాగిన నడకకు కొనసాగింపు అనుకోవాలా?
తెలియదు.

కానీ మూడేళ్లలో నడక ఒడిసి పట్టిన చిత్రాలోన్నో…
ఆగి నడిచిన దాఖలాలూ ఎన్నో…
అలాంటి ఎన్నో చిత్రాల్లో ఇదీ ఒకటి.

+++

చిన్నప్పుడు నడుస్తూ ఉంటే, ఎండలో ముందుకు సాగుతూ ఉంటే, నా చిన్ననాటి మిత్రుడు సొన్నాయిల శీను ఒక గమ్మత్తు నేర్పించాడు.  కుడిచేతి పిడికిలి బిగించి …మధ్యన చిన్న సందు వదిలి ..ఆ వదులు పిడికిలితో ఎండలో అలా నడుస్తుంటే ఆ రంధ్రం గుండా ఒకానొక గుండ్రటి ఛాయ నేలమీద పడుతూ ఉంటే మనకిష్టమైన ఛాయచిత్రం ఒడిసి పట్టుకున్న తృప్తి. అదీగాక ఒంటరితనం తెలియనివ్వని సరదా అది!
మనతోపాటు ఒక నీరెండ వంటి అపూర్వమైన ఛాయ నొకదాన్ని మోసుకెళ్లడం అప్పటి ప్రయత్నం. జ్ఞాపకం!

ఇప్పుడు ఫొటోలు తీస్తూ ఉంటే, ముఖ్యంగా నేలమీద పడ్డ వాటిని కెమెరా కంటితో భద్రపరుస్తూ ఉంటే, ఎన్ని జ్ఞాపకాలో…మరెన్ని బాధలో…ఎంత అపూర్వమైన నడకో అనిపిస్తుంది, బతుకుది. అలాగే, మరెంతటి విషాద సమ్మోహనమో ఈ ప్రయాణ భరితమూ అనిపించేది.

ఒకటని కాదు, కొన్ని వందలు.
నా కలెక్షన్లో అలాంటి మహత్తరమైన జ్ఞాపకాల ఛాయలు వందలకు వందలున్నాయని సగర్వంగా చెబుతాను.
వాటిల్లో రాలిపడిన పారిజాతాలు నాకిష్టమైన ఒకానొక అందమైన చిత్రం. అలాగే పొగడపూల వాకిలి నేనే మెచ్చిన మరో  చిత్రం. అంతేకాదు, ఒకనొక ఉషోదయాన ఒక పేపర్ ప్లేట్ తడిసి నేలను అతుక్కుపోయి ఉండగా చూశాను. అది అచ్ఛం చందమామను తలపిస్తే ఎగిరి గంతేశాను. ఆ చిత్రమూ నా ఛాయాచిత్ర వాకిలిలో కదిలీ కదలాడే వెన్నెల దోసిలి.

ఇంకా పిన్నీసూ తీశాను, పండ్లు వూడిపోయిన దువ్వెననీ తీశాను.
ఒక మగువ తన భర్తను అభిమానంగా కావలించుకుని స్కూటర్ మీంచి వెళుతుంటే, పాపం! నా దిష్టే తగిలిందేమో, తన జుట్టులోంచి రాలిపడ్డ గులాబీని చిత్రించాను. చితికిపోయిన టమాటనూ చిత్రించాను.
ఇక ఈ కప్ప సంగతి సరేసరి, అది నన్ను ఇంకెంతో గాయపర్చింది.

+++

జీవితం సాగుతూ ఉంటే, నడక మున్ముందుకు కొనసాగుతూ ఉంటే, సుఖమే కాదు, దుఃఖమూ ఉండనే ఉంటుంది.
దాన్నీ అంగీకరించి నడిస్తేనే బతుకు నిండుదనం తెలిసి వస్తుందేమో!

బహుశా ఎన్నో జ్ఞాపకాలు. చూస్తూ చూస్తూ ఉండగానే ఎందరో పోయారు.
తాతమ్మ పోయింది. నాయినమ్మ మరణించింది. బాబాయి కూడా చనిపోయాడు. వాళ్లను చివరగా మంచం మీంచి నేలమీదికి అక్కడ్నుంచి కాటికి తరలిస్తుంటే చూడనే చూశాను.

బంధువులూ మిత్రులూ సహచర కార్యకర్తలూ ఎందరో పోయారు. హత్యకు గురైన పౌరహక్కుల పురుషోత్తం అయితే ఆ నేల, దిల్ సుఖ్ నగర్లో ఆ నేలపైన నెత్తుటి చెమ్మని ఇప్పటికీ వెళ్లి తడుముకుంటుంటాను.

ఆయన స్మారకార్థం ఒక పాటల క్యాసెట్టు తెచ్చినప్పుడు మిత్రులు “వొద్దు వొద్దూ’ అన్నా వినకుండా రక్తం చిందిన నేలమీద ఆ తెగిపడిన తల, దేహాన్నీ, పక్కనే భోరున విలపిస్తున్న జ్యోతక్కను – ఆ ఫోటోను అట్లే ముద్రించాను, రంగుల్లో- కవర్ పైన!

ఇదంతా అప్పటి వర్తమానం కోసం. ఒక భయ విహ్హలమైన గతం…దాన్ని మరచిపోకుండా ఉండే భవిష్యత్తు కోసం,
ఒక వాస్తవికతను చెప్పడానికి అలా ఆ ఛాయచిత్రాన్నీ అట్లే ప్రకటించాను.

ఇప్పుడూ అంతే. చిన్న చిన్న ఛాయల్లో ఒదిగే చరిత్రను, స్థితీగతినీ చిత్రాలు చెప్పక తప్పక చెబుతూనే ఉంటే చూస్తూనే ఉన్నాను, ప్రేక్షకుడినై!

అనుకుంటాం గానీ నేలమీద కనిపించే ఇసుక, కంకర, మొరం, డాంబరు, పూలు, ఇనుప రజను, కోడి రెట్ట, ఇంకా ఇంకా  నిదానంగా శిథిలమౌతున్న కప్పా ..అంతా కూడా వికృతి కాదు, ప్రకృతే. ఒక పురావలయం. చరిత్ర.

మట్టిలో వికసించి మట్టిలో కలిసే మహా కవిత్వం. చరిత్ర చరణాల ధూళి.
అది వినిపిస్తుంది తీసింది మీరైనా కూడా! అదీ చిత్రమే!!

చిత్రం నాదా మీదా అనికాదు, చూస్తూ ఉంటే- నడిచినంత మేరా ఎవరికైనా అనుభవాలు తగులుతూ ఉంటై.
మనం సుప్తావస్థలో ఉన్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకి వస్తనే ఉంటయి.

ఇదొక అనివార్యమైన అవస్థ.

మరి, ఆ నడకకు వందనం. అది పంచే బతుకు చిత్రాలకూ అభివందనం.

~ కందుకూరి రమేష్ బాబు

బానిసకొక బానిసకొక బానిస!

drushya drushyam-9 photoఒకరిని చిత్రించడం ఒకటి.
-అది మనిషిదైతే అతడి అంతర్ముఖం కనిపిస్తుంది.ఇద్దరిని చిత్రించడం మరొకటి.
-అది ఆలుమొగలదైతే వాళ్లిద్దరి అనుబంధం కనిపిస్తుంది. స్నేహితులదైతే అనురాగం వ్యక్తమవుతుంది.ముగ్గురిని చిత్రించడం మాత్రం పూర్తిగా భిన్నం.
ఎందుకో అది సమాజాలనూ, ప్రపంచాలనూ చూపినా చూపుతుంది!

+++

అవును. ఒక చిత్రంలో గనుక ముగ్గురు ఉన్నారూ అంటే ఆ చిత్రం వ్యక్తులను దాటుతుంది. సామూహికతను మెలమెల్లగా చెప్పడానికి ఆ ఛాయాచిత్రం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ముగ్గురు లేదా నలుగురు ఉన్నారూ అంటే అది సంఘమే అవుతుంది. మనిషి హఠాత్తుగా ఒక సంఘటనలో భాగంగా లేదా ఒక సన్నివేశంలోని పాత్రలుగా వ్యక్తమవుతారు. ఒక ప్రవహిస్తున్న ధారకు సంబంధించిన వాహికగా మారి మనల్ని ఆశ్చర్యపరుస్తారు. కలవర పరుస్తారు. లేదా ఆనందపారవశ్యానికి గురిచేస్తారు. ఈ చిత్రం అటువంటిదే. కాకపోతే ఇది మనల్ని మనకు పట్టి చూపే కాలమ్, అనుకుంటాను!

+++

ఒకానొక రోజు దీన్ని మన దేశ రాజధానిలో చిత్రించాను.

ముగ్గురూ ముగ్గురే.
ఒక బస్టాఫ్ వద్ద కూచున్న ఒక దినసరి కూలి, నిలబడ్డ ఒక సాఫ్టు వేరు ఉద్యోగి. ఒక చిరు కంపెనీలో పనిచేసే మరొకతను…ముగ్గురూ ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నది బస్సుకోసమే.

నిజానికి వేచిచూపు.
ఆ వేచిచూపు అందరిదీ.
కానీ, వ్యక్తులు మాత్రం ఎవరికి వారు.

ఒక్కొక్కరు ఒక్కో రకం. ఒక్కొక్కరిదీ ఒక స్థితి.
చిత్రం చూస్తుంటే ఎవరి వయసేమిటో తెలుస్తున్నది. ఎవరి ఆర్థిక స్థోమత ఏమిటో కూడా అగుపిస్తూ ఉన్నది.
మనం ప్రభుత్వం నుంచి మనం ఏదేనీ ధృవీకరణ పత్రం తీసుకోవాలంటే, నింప వలసినవి ఉంటాయి గదా!
అవన్నీ ఈ చిత్రంలోనూ దాదాపుగా నిండి ఉండనే ఉన్నాయి.

అంతా ఒకే చిత్రము.
కులమూ మతమూ జాతీయతా నివాస స్థలమూ ఆర్థిక స్థోమతా అన్నీ ఏదో విధంగా తెలుపుతున్న చిత్రము.
అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే, ఇది మూడో ప్రపంచ చిత్రం.

వేర్వేరు స్థాయి భేదాలతో…ధనికా పేదా మధ్యతరగతిగా కానవస్తున్న ఆ చిత్రం  అచ్చమైన మన దేశీయ చిత్రమే.
– The third world.

+++

ముగ్గురున్నారని కాదు.
బానిసకొక బానిసకొక బానిస గనుక!

విడగొట్టబడి…
అందరూ చౌరస్తాలో అపరిచితులై ఎదురుచూస్తూ ఉన్నారు గనుక!

~కందుకూరి రమేష్ బాబు

అడుక్కునే ఆ వేళ్ళల్లో…ఒక హరివిల్లు!

DRUSHYA DRUSHYAM-8
నిజాం కాలేజీ గ్రౌండ్స్ వద్ద తరచూ అనేక రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతూ ఉంటై. సామాజిక ఉద్యమకారులూ పెద్ద పెద్ద సభలూ నిర్వహిస్తరు. దగ్గర్లోనే విద్యుత్ ఉద్యమకారులపై చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరపగా అప్పటి అమరుల స్మతి చిహ్నమూ అక్కడే ఉంది. నక్సలైట్ల మందుపాతరలో మరణించిన మాధవరెడ్డి ప్రతిమా ఉన్నది. ప్రెస్ క్లబ్బూ ఉంది. పోలీస్ కంట్రోల్ రూమూ ఉన్నది. ఇంకా చాలా ఉన్నయ్. విద్యార్థులున్నారు. మేధావులున్నారు.  అక్కడే ఈ మనిషీ ఉన్నడు.

ఇతడు కుష్టు వ్యాధిగ్రస్థుడు. వీధి భిక్షువు. అందరూ ఉన్న అనాథ.

తనను తాను తోలుకునే ఒక వీల్ చెయిరు వంటి ప్రపంచంలో తానొక అర్భకుడు…
ఊరూ పేరూ కులమూ మతమూ ప్రాంతమూ దేశమూ ఎముకలూ చీమూ నెత్తరూ ఆత్మా ఉండి కూడా ఏమీ లేని మనిషి. అభాగ్యుడు. అపరిచితుడు. పాపి.

అవును. ఎవరున్నా లేకున్నా…కొత్తగా ఎన్ని లేచినా ఏమున్నది గనుక అన్నట్టు, మట్టికొట్టుకుపోతున్న దేహమూ, దేనిపైనా ఆశలేని విరాగమూ, ఎండకు ఎండి, వానకు తడిసి, శీతలానికి తట్టుకోలేని నిస్సహాయ ప్రాణమూ, దాన్ని తనంతట తాను వదలలేక ఆ శిలువ వేసిన క్రీస్తును తలుచుకుంటూ కానవచ్చే పాపి.

అతడు వినా ఏదీ ఆ వీథిలో నన్ను ఆకర్షించదేమీ? అని చింతిస్తూ, నిర్దయగా నా నగరమూ ప్రజలూ అని వాపోతూ బతుకును చిత్రిక పడుతూ పోవడం పరిపాటయింది నాకు!

తెలుసునా?..ఒక దృశ్యం చిత్రించేటప్పుడు గుండె కలుక్కుమంటుంది. ఆ దృశ్యం చెంత నుంచి చప్పున అదృశ్యం కావాలనిపిస్తుంది. కానీ అది మెదడు.

గుండె వేరుగా పనిచేస్తుంది. ఆగిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఆ జీవితాన్ని శ్వాసించినాకే అడుగు ముందుకు వేయనిస్తుంది.

ఆ క్షణంలో ఏదీ గుర్తుకు రాదు. కానీ ముందూ వెనకా మనసు పరిపరివిధాలా పోతుంది.
ఆ వృధ్దుడి దీనావస్థకు మనసు కలికలి అవుతుంది. కలకలా అనిపిస్తుంది.

కళ కళ కోసమేనా, కాసుల కోసమేనా అన్న చర్చకాదు గానీ మనిషి మనిషి కోసమేనా? కాదా అన్న బాధతో కడుపు రగిలిపోతుంది.

కవులైతే కవిత్వం, గాయకులైతే పాట, తాత్వికులైతే మీమాంస, రాజకీయ నేతలైతే హామీలవుతున్నారు. ఇక దేవుండ్లయితే బద్మాష్ లే అవుతూ తప్పుకుంటున్నారని వాపోతుంది.
ఇదంతా ఆలోచన. కానీ, అంతకన్నా విలువైనది తాదాత్మికత.

అందువల్లే చిత్రం మహత్తరం అవుతుంది.
అందలి జీవితం గురించి స్పందించేలా చేసి మనుషుల్ని మహానుభావుల్ని చేస్తుంది.

unsung unwept unnoticed unhonored  అని భావించే ఎన్నిటిపైనో ఆ మనిషి మనసును లగ్నం చేసేలా చేస్తుంది.
అందుకే ఆస్కార్ వైల్డూ, నువ్వన్నది నిజమే!జీవితం చిన్నదైనా కళ అపూర్వం. art is long.

శివలీల

drushya drushyam-7...

చాలా సామాన్యమైనవే. మామూలు ముఖాలే. ఎక్కడ పడితే అక్కడ కానవచ్చే మనుషులే అయి ఉండవచ్చు.

రాలిపడ్డ ఆకులు, చితికిన టమాట పండు, తెగిపోయిన చెప్పు, వాకిట్లో కురిసిన పారిజాతాలు, చెట్ల కొమ్మల్లో చిక్కిన గాలిపటం, ఈల వేస్తున్న యువకుడు, చింగులు సర్దుకుంటున్న మగువ, చుట్టను చప్పరిస్తున్న ముదుసలి, బీడీలు చుడుతున్న నాయినమ్మ, ఈదురుగాలికి చెల్లాచెదురైన గుడిసెలు, ఏం కానున్నదో తెలియక నవ్వుతున్న పిల్లలూ…

ఇవన్నీ మామూలు విషయాలే కావచ్చును. కానీ, ఒక కుతూహలంతో చూడటం, ఒక అవ్యాజమైన అనురాగంతో చేయి చాచడం, అభిమానంతో ఆలింగనం చేసుకోవడం, ఒక అనురాగ చేష్ట, ఛాయా చిత్రలేఖనం. కానీ, నమ్ముతారో లేదో, ఒక్కోసారి అసంకల్పితం ఈ లేఖనం. ఒక్కోసారీ కాదు, అనేకసార్లూ మన అలక్ష్యమే లక్షణం. అపుడే దృశ్యం మనల్నిఆకట్టుకుంటుంది. ఇక ఆ లేఖనం మహత్త్తు అపూర్వం. అందులోనిదే ఈ తట్టా పారా…ఒక లిప్త.

+++

భాగ్యనగరంలో పార్సీగుట్ట నుంచి ముషీరాబాద్ చౌరస్తాకు వెళ్లే దారిలో, చౌరస్తాకు చేరుకోక మునుపే కుడివైపు, ఈ చిత్రం జీవం పోసుకుని కానవస్తుంది. అది ఇసుక అమ్మే స్థలం. ‘తట్టకు ఇంత’ అని అమ్ముతూ ఉంటారు. ఇండ్లళ్లో చిన్న చిన్న రిపేర్లు చేసుకోదలచిన వాళ్లు, లేదంటే వీథి మేస్త్రీలు ఆ ఇసుకను ఖరీదు చేసుకుని వెళుతుంటారు. అందుకు సౌకర్యం కల్పించే ఒక వీథి అమ్మకం స్థలం ఇది.

ఇక్కడ ఎప్పుడూ ఒక ఇద్దరు కూర్చుని ఉంటారు. ఒక మహిళ, ఒక పురుషుడు. వాళ్లు ఎప్పుడు అమ్ముతారో తెలీదుగానీ ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూచుని ఏవో ముచ్చటించుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అక్కడికి రాగానే, ఈ చిత్రం తీసిన స్థలానికి చేరుకోగానే, హాయిగా నవ్వుకునే ఆ జంట కూడా ఒక ముచ్చటైన చిత్రం. వారిద్దరినీ ఒక ఎండపొడ వాలున, ఒకే గొడుగు నీడన ముచ్చటిస్తూ ఉండగా మరో నాడు తీసిన చిత్రమూ ఒకటుంది నా వద్ద!  అయితే, వారిరువురి జీవన వ్యాపారంలోని అతి కీలకమైన విషయమూ, ఒకానొక decisive moment, దాని స్థల మహత్యమూ, అందలి పురాణ కాలక్షేపమే ఈ చిత్రం.

+++

చిత్రమేమిటంటే, ఇక్కడే నా భవిష్యత్తు కళా ప్రదర్శన తాలూకు ముఖచిత్రం నమోదైంది, మూడేళ్ల క్రితం.

అంటే గతంలోనే నా భవిష్యత్తు నమోదై, అది సరిగ్గా ఆ నిర్ణయాత్మక క్షణంలో వర్తమానమూ అయి మళ్లీ ఇప్పుడు గతమూ అయి, ఎప్పటికీ చెదరని ఛాయా చరిత్రా అయింది. ఇదంతా తెలియకుండానే…అదొక విచిత్రం.
అయితే, ఛాయాచిత్రలేఖనం అన్న ప్రక్రియలో చిత్రకారుడు లేదా రచయితా ప్రేక్షకుడే అవడం మరో చిత్రం!

+++

మళ్లీ మూడేళ్ల క్రితానికి వస్తే, ఆ రోజు సన్నగా వర్షం కురుస్తూ ఉన్నది.
కొంచెం తెరపి ఇచ్చాక బయలుదేరాను. ఇక్కడకు చేరుకున్నానో లేదో అకస్మాత్తుగా నా దృష్టి పామరశాస్త్రంపై…ఈ తట్టా పారలపై పడింది. ఒక “కనికట్టు’ అనే అనిపిస్తుంది.  విస్మయమే! ఎందుకు ఏ దృశ్యం మనల్ని లోబర్చుకుంటుందో ఏమో తెలీని స్థితి! నేను ఆగిపోయాను. ఆ దృశ్యంలోకి చూశాను. చూడగా వర్షం వెలిసినాక ఆ తడి తడి ఇసుక, పైనా…కిందా… కొంచెం గాఢ గోధుమ వర్ణంలో ఆ ఇసుక …రేణువులూ…అవన్నీ ఎంత సౌందర్యాత్మకం అంటే ‘పిండారబోసిన వెన్నెల’ అన్న సమాసం కూడా బహుశా తక్కువే. లేదా ‘ఇష్టమైన పిండి పదార్థం నైవేద్యం’గా పెట్టడం అన్నా వృథాయే!
ఆ దృశ్య సమాసం నన్ను సుతారంగా లోబర్చుకున్నది.

బండి ఆపేశాను. దిగలేదు. భూమిపై కాళ్లు ఆనించుతూ ఉన్నానో లేదో…ఒడుపుగా నేను కెమెరాకోసం చేయి చాచానో లేదో…కెమెరా అన్నది బ్యాగులోంచి ఎప్పుడు ఎలా బయటకు వచ్చిందో, అది నా కెమెరా కంటికి ఎప్పుడు ఆనిందో, వ్యూ ఫైండర్ నుంచి ఎప్పుడు చూశానో ఏమీ తెలియదు. ‘క్లిక్’ మన్న సవ్వడీ లేదు. కానీ, ఒకే ఒక షాట్ ఎక్స్ పోజ్ చేశాను.
ఆ తర్వాత చూశాను, కెమెరా స్కీన్లో…అప్పుడు కనిపించాయి. నిగనినగలాడుతున్న పనిముట్లు..వాటి బలిమి… ఇసుకలో దాచుకున్న వాటి లావణ్యం,…అంతకు మించి ఒక పారపై అమర్చినట్టున్న తట్ట. దానిపైన ఎరుపు పూవు….అంతా అలౌకికం…

పైనా కిందా కన్ను తడుముతూ ఉంటే, చెట్టుపై నుంచి వర్షంతో జాలువారిన లేత ఆకుపచ్చ ఆకులూ, ఎర్రెర్రెని పువ్వులు రెమ్మలు అంతా దళాలూ…రేణువులూ…

+++

అన్నీ ఆశ్చర్య పర్చినవే.
they are in the world but not worldly…అనిపిస్తుంటే …
ఒక physical… metaphysical…అంతా ఒక సంయోగం…లీనం…ధ్యానం…
పువ్వులూ రెమ్మలూ పనిముట్లూ…తడితడి పూజా ద్రవ్యమూ…అంతా ఒక గర్భగుడిలోని దివ్య మంత్ర పుష్ఫ సంచయం.ఆ దృశ్యంలో అవన్నీ కెమెరా స్ర్కీన్ పై ఎంత భావ గర్భితంగా లాస్యమాడుతున్నాయి అంటే తెలియక రాసిన కవితలా ఏదో ఒక కవితాన్యాయం…”అబ్బ! దర్శనం’ అనుకున్నాను. మానవుడి అవిశ్రాంత యానంలో ఒక శాంతి ఉంటుందే అదే ఇది అని తృప్తిల్లాను. ఒకానొక రుతువులో ప్రకృతి శోభ ఉంటుందే అదే ఇదేమో అని కూడా అనిపించింది.
ధ్యానం చేయడానికి యోగ్యం లేని పామరులుంటారే, వారికి ఇదే శివాలయం…గర్భగుడి…లింగధారణా అనిపించింది.
ఆ చిత్రానికి లోబడి ఇక మళ్లీ మరొక చిత్రం ప్రయత్నించలేదు. దొరికింది చాలనుకుని మళ్లీ నా లౌకిక జీవనంలోకి పయణమయ్యాను.+++ఈ చిత్రాన్ని తర్వాత చక్కటి ప్రింటు తీసుకున్నాను. ఎంతదనుకున్నారు! పే…ద్దది. ముప్పయ్ ఇంటూ నలభై అంగుళాల చిత్రం అచ్చువేయించాను. దానికి మరింత అందం పెరిగేలా చుట్టూ జాగా వదిలి మరింత మంచిగా ఫ్రేం చేయించాను. నా తొలి చిత్ర కళా ప్రదర్శనలో మకుటామయమైన చిత్రంగా దీనిని ప్రదర్శించాను. అంతేకాదు, నా బ్రోచర్ పైనా ముఖచిత్రంగా దీనినే అచ్చు వేయించాను. ‘ఎందుకో తెలుసా’ అని అడిగితే చెప్పలేను.
+++

చాలా మంది అడిగారు కూడా, ‘ఇదేమిటీ?’ అని.
నవ్వి ఊరుకున్నాను.
ఇంకా చాలామంది అడగలేదు కూడా, ‘ఏమిటేమిటీ’ అని!
అందుకూ చాలా సంతోషించాను.
అయితే, ఇదొక్కటే కాదు, ప్రదర్శించే ప్రతి చిత్రానికీ ఒక ప్రాధాన్యం ఉంటుంది. అప్రయత్నమూ ఉంటుంది.
బహుశా దీనికి కారణం ఆ చిత్రం ‘మనం తీయనిది’ అయి వుండటం!
ఆ రచన మనం వాంచితంగా “చేయనిది’ అవడం!

 

+++

 

నిజమే మరి.
చిత్రాలు రెండు రకాలు. ఒకటి, మనం తీసుకునేవి. రెండు, మన చేత తీయించుకునేవి.
నా చిత్ర కళా ప్రదర్శనలో నేను ఎంచుకున్న రచనా పద్ధతి కూడా ఇదే. నేను తీయని చిత్రాల ప్రదర్శనే అది!
అందులో ఎన్నో…

ఒక రాలి పడిన ఆకు. బెలూను ఊదుతున్న మనిషి. అఖండదీపం ముందు ఒక భక్తురాలు.
ఇంకా…ముందు చెప్పిన చిత్రాలెన్నొ. అందులో ఈ దేవాలయం కూడా ఒక అప్రయత్నం.

 

+++

 

చిత్రమేమిటీ అంటే, దీన్ని ఎందరో దర్శించుకున్నారు…
ఒకరికి తెలిసి, మరొకరికి తెలియక. తెలిసీ తెలియక, సేమ్, నాలాగే ~ ఒకానొక కనికట్టుకు లోబడి.

అంతిమంగా అంతా ఒక ప్రేక్షకపాత్ర. మానవుడి నిమిత్తం లేని నిర్ణయానిదే తొలిపాత్ర.
తట్టా పారలకు వందనం అభివందనం.

~కందుకూరి రమేష్ బాబు

ఇద్దరు

IDDARU
కొన్ని కొన్ని పదాలతో ఎటువంటి సమాసాలు నిర్మితమౌతాయో!
అలాగే, కొన్ని కొన్ని జంటలు జీవన సమరంలోంచి బహుళ సందేశాన్నీ దృశ్యమానం చేస్తాయి.
ఈ ఛాయాచిత్రం అటువంటిదే.

+++

నిచ్చెనమెట్ల వ్యవస్థలో తమ కులం పట్ల లేదా తమ వృత్తిపట్ల వాళ్లకు మనవలే విశ్లేషణలు లేవు.,
తమదైన ప్రయత్నం, ఒక అనుభవం, దానివెంట అలసట తప్ప.

ధనికా పేదా వర్గ దృష్టీ లేదు., కఠోరశ్రమ, తదనంతర విశ్రాంతీ తప్ప!

ఇదంతా లేకపోవడం వల్ల, అప్పుడప్పుడు జీవితం మరీ భారం అయినప్పడు ‘కర్మ’ అనుకోవడం తప్పా వీరికి ప్రత్యేక  విచారాలేమీ లేవు.

తమ విధి లిఖితం ఈ గారడి అనుకుని అభ్యాసంతో, అనుభవంతో, గొప్ప ఒడుపుతో చేసే పరంపరానుగత ప్రదర్శన వీరిది. కంప్లేంట్స్ లేవు, కాంప్లిమెంట్ల పట్ల ఆసక్తీ లేదు.

మనకోసం తమదైన లోకంలో ఉంటూ తాము వేసే దొమ్మరిగడ్డలపట్ల వారికి ఎంతమాత్రం ఏహ్యభావం లేదు. గౌరవమూ లేదు. అందువల్లే సబాల్ట్రన్న్, మెయిన్ స్ట్రీమ్ అన్న తేడాలూ లేవు. గమనిస్తే అది వారి జీవకలోంచి పుట్టే జీవన సారస్వతం. ఒక మరులు గొలిపే కళా ప్రదర్శన. కానీ, అలవోకగా ఇలా తాము లిఖించే విఖ్యాత రచనపట్ల వాళ్లలో ఎటువంటి గర్వమూ కానరాదు. తమ ప్రదర్శనలో తలమానికమైన ఈ రచన వారికి ఎంతమాత్రమూ సాహసం కాదు.

చిత్రమేమిటంటే ఇందులో ఉన్నది ఒక్కరా, ఇద్దరా లేదా ఒక బృందమా సమూహమా?
వైయుక్తికమా? సార్వజనీనమా?

ఏమిటది?

+++

నా మటుకు నాకు ఇది పురుషుడి గురించి, ఒక మనిషి పురుషుడిగా ఈ సమాజంలో మోస్తున్న బరువు బాద్యతల గురించి చెబుతుంది. తానే ఆమెను, మొత్తం కుటుంబాన్నీ పోషిస్తున్న భావననూ చెబుతుంది.

మరొకసారి స్త్రీ ప్రధానంగా ఈ చిత్రం సందేశాన్నిస్తుంది. ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని ఎత్తులు వేసినా,  అతడి తలపై పాదం మోపినా కూడా అది పురుషుడి ఆధీనంలోని  ప్రపంచంలో, అతడు నిర్మించిన లోకంలో, తాను పునాదిగా వేళ్లూనుకున్న వ్యవస్థలోనే కదా అనిపిస్తుంది. అందుకే ఆమె ఎంత స్థిరంగా ఉన్నా కూడా అది అతడి సమక్షంలో, అతడి సంరక్షణలోనే కదా అనిపిస్తుంది.

మరొకసారి జీవన సమరంలో దంపతులుగా కనిపించి, ఒకరికొకరు తోడూ నీడగా మెలిగే సందర్భంలో, పయణించే మజిలీలోని ఒకానొక దృశ్యం ఈ చిత్రం అనిపిస్తుంది. సమవుజ్జీలుగా బతుకు నావను ఈదుతున్న పరస్పరాధారాలుగానూ కానవస్తుంది. అప్పుడు ఈ చెట్టు ఒక్క కొమ్మ పుష్పాలే అనిపిస్తుంది కూడా.!

మానవులుగా వీరు ఇద్దరు. కానీ, ఇదొక్కటే కాదు, ఇంకెన్నో విధాలుగా గారడీలు చేసి మనకి వినోదం పంచి నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ, వీరిద్దరేనా అన్న సంశయం ఈ చిత్రం నాకు కలిగిస్తూనే ఉంటుంది.
వీరిద్దరూ ఇద్దరేనా?

+++

ఇంట్లోంచి కెమెరాతో బయటపడ్డ మరుక్షణం నుంచి నాకు ఇలాంటి “ఇద్దరులు’ ఇద్దరిద్దరుగా, పదులు వందలు వేలు లక్షలుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ల జీవనచ్ఛాయలు సాధారణమైనవే. కానీ వాటన్నిటిలో ఒక సాధారణత్వం ఉంటుంది. అదే సమయంలో తమకు మాత్రమే ప్రత్యేకమైన విశిష్టతా  అభివ్యక్తం అవుతుంటుంది. వాళ్లను అధోజగత్ సహోదరులుగా చూపటం ఒకటైతే, సృజనశీలురుగా, అధోజగత్ సృజనశీలురుగా, వాళ్లను పౌరులుగా చూపడం ఒక లక్ష్యం.

మనం వాళ్లను సగటు మనుషులుగా చూడటం ఒకటి. ప్రత్యేకాంశాల కలబోతగా పరిశీలించడమూ వేరువేరు. అయితే, వారి ఉనికి తామరాకు మీది నీటి బిందువు ఒకటైతే, నైలు నది నాగరీకతలో ఈ జీవనానికి ఉన్న రీతి, రివాజు, ఒకానొక కౌశలం, పారంపర్యతలతో విస్తరించడం మరొకటి. ఇవేవీ కానిదీ ఉండవచ్చు.  అదేమిటీ అంటే, ఒక్కొక్కప్పుడూ వీళ్లు ఇద్దరూ ఒక్కటిగా సృష్టికర్త సందేశాలను అలవోకగా మోసుకొస్తున్న భగవంతుడి లీలగా తాండవించడమూ జరుగుతుంది, అరుదుగా! .

+++

ఏమైనా నదిని ఆనుకుని జీవితం ప్రవహించినట్టు వీళ్లు అడుగడుగునా కానవచ్చి ఇద్దరు ముగ్గురు కాదు, సమాజం అన్న విషయం నాకు అవగతం అవుతూ ఉంటుంది. అప్పుడు పాత్రికేయ ప్రపంచంలో కేవలం మానవాస్తక్తికరమైన కథనాల్లో దాగుండే ఇలాంటి బతుకు చిత్రాలు మార్మికత నాకు ప్రధానం అవుతాయి. వీళ్లిద్దరూ మన విలువలను తలకిందులు చేసే మెయిన్ స్ట్రీమ్ అయి, నదీనదాలై ప్రవహిస్తయి. నన్ను ముప్పిరిగొంటయి. నా కెమెరా గుండా మీ దాకా ఇలా ఒక్కో ఖండిక ధారావాహిక ఐ ప్రవహిస్తయి.

అందుకే నా ఛాయాచిత్రాలు గురజాడలు. ఈ దేశమంటే మట్టికాదు మనిషని రుజువు చేసే ఆలూరి బైరాగులు. బావిలోని గొంతుకలు. దుఃఖం వస్తే గొడగొడ ఏడ్చే, సంతోషంలో ఆనందబాష్పాలు కార్చే కాళోజీలు. ఇవి గొప్ప విశ్వాసాలకు నకల్లు. అస్తిత్వపు దిక్సూచీలు. ఊరూవాడా ఒక్కటి చేసే మూడో ప్రపంచపు మా పెద్దబడి పక్కన ఎగిరే పీరీలు.

+++

ఆమె బారానికి అతడి కాయం నుంచి వచ్చే ఉచ్ఛాస నిశ్వాసాలు నా ఛాయాచిత్రాలు.
నిజమే. ఈ  చిత్రం ఇద్దరిదే. మీదీ నాదీ. మరి కృతజ్ఞతలు.

~ కందుకూరి రమేష్ బాబు

అనిపిస్తోంది…మనిషి ఉనికి మనిషితోనే లేదని…!

manishi -uniki
కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనిషి.
+++

చాలా ఏళ్ల క్రితం వదిలేసిన కెమెరాను మళ్లీ పట్టుకున్నాక మనిషి రహస్యం ‘మనిషి’ మాత్రమే కాదన్న విషయం అవగతమవుతూ ఉన్నది. మనిషితోసహా పరిసర ప్రపంచం పట్ల తెలియకుండానే ఒక అవగాహన ఏదో మెల్లగా కలుగుతూ ఉన్నది.  ఎలాగంటే తీస్తున్నది మనిషి ఛాయనే. కానీ ఆ ఛాయ అన్నది మనిషిదే కాదన్నవిషయం బోధపడుతూ ఉన్నది.కెమెరా కన్నులతో చూడగా ‘మనిషిని చూస్తున్నాననే’ అనుకున్నాను. కానీ అతడు పెరుగుతున్నాడు. అతడి ఆవరణా పెరుగుతున్నది. మీదు మిక్కిలి, అతడున్న ఆవరణ పట్ల స్పృహా కలుగుతున్నది. కానీ రచయితగా దర్శించినప్పటిలా కాకుండా- కెమెరాతో చూసినప్పుడు ఆ మనిషి ఫొటో నేను ఇదివరకు గమనించినట్టు రాలేదు. రావడం లేదు. అదొక ఆశ్చర్యం!

అంటే నేను భావించినట్లు కాకుండా-ఉన్నది ఉన్నట్టుగా- ఆ మనిషిని సరిగ్గా చూపించే మాధ్యమంతో పనిచేస్తున్నాను అన్న గ్రహింపు కూడా వచ్చింది, క్రమక్రమంగా. ఇది నిజం. ఒక మనిషి మనకు బాగా పరిచితుడే అనుకుంటాం. కానీ అతడిని లేదా ఆమెను ఫొటో తీసినప్పుడు ఆ మనిషిలోని అనేకానేక మార్పులు, ఛాయలు కనిపిస్తయ్. అంతకు ముందు మనం చూడలేనివి, బహుశా చూడ నిరాకరించినవీ కనిపించడమూ అగుపించి, ఆశ్చర్య చకితులం అవుతాం. మీరు చూస్తున్నదృశ్యం అలాంటివాటిల్లో ఒకటి.

+++

ఆమెను నేను ఎరుగుదును. పార్సీగుట్ట దాటి పద్మానగర్ చేరుకున్నాక ఆ స్కూలు చప్టా దగ్గర ఉంటుంది.   కానీ ఒకానొక ఉదయం ఆమెను ఫొటో తీశాక నేను వెనక్కి వెనక్కి జరిగాను. ముందు ఆమెను  చూశాను. తర్వాత ఆమె మౌనంగా ఏకాంతంలో ఒకానొక నిర్లిప్త ధ్యానంలో, వైరాగ్యంలో ఉన్న సంగతి కెమెరాలో గ్రహించి వెనక్కి జరిగాను. తర్వాత్తర్వాత ఆమె  చట్టూ ఉన్న ఆవరణ అంతా కూడా గ్రహించడం మొదలెట్టి ఆమెను ఇదిగో ఇలా అర్థం చేసుకున్నాను, ఫొటో ద్వారా.
ఒక వ్యధార్థ బాధిత హృదయం తాలూకు ఖండిక ఇలా చిత్రీకరించిన పిదపే తెలిసింది, ఆమె వీధి మనిషి అని. ఆమెతో పాటూ ఒక శునకమూ అనీ. ఇంకా చాలానూ…అప్పటినుంచీ ఆ ఫోటో నాకు నేర్పిన అనభవంతో ఆమెను నేన గమనించడం మొదలెట్టాను. గమనిస్తూ ఉన్నాను, కెమెరాతో….
+++

తీసిన ఫొటోలు చూస్తూ ఉండగా, నేను మామూలుగా చూసన దానికీ చిత్రీకరించి చూసిన దానికి ఆశ్చర్యంతో పాటు ఒక సహానుభూతిని ఫీలయ్యాను. నా బాధ్యతను గుర్తెరిగినట్టు అనుభవాన్ని పొందాను. ఇదే విశేషం అనుకుంటే మరో విశేషం, ఆ మనిషితో పాటు చుట్టుముట్టున్న విషయాలన్నీ  black humor లాగానూ, స్పష్టంగానో అస్పష్టంగానో నమోదయ్యాయి. ఇంకా ఇంకా ఫొటోలు తీసుకుంటూ పోతుంటే, ఇంకా ఇంకా… విషయాలు అనుభవ గ్రాహ్యం కావడం మొదలైంది. ఇది ఎలా ఉన్నదీ అంటే, రచనా వ్యాసంగంలో కంటే ఈ వెలుతురు రచనలో, కెమెరా ప్రపంచం కారణంగా, ప్రస్ఫుటంగా నా వరకు నాకే అర్థమవుతూ ఉన్నది. ఇదొక తారతమ్యం. ఇదొక ఆశ్చర్యం! ఒక experience…అలాగే సత్యం తాలూకు ఒక experiment అని కూడా అనిపిస్తూ ఉన్నది.+++

ఈ ఫొటో అనేకాదు, ఎట్లా అంటే ఒక మనిషిని లాంగ్ షాట్లో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి తీరు వేరు. బస్టు సైజులో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి వేరు. ఆ మనిషి ఏదైనా పనిలో -అంటే యాక్షన్లో ఉన్నప్పుడు అతడు అగుపించే విధానం మరీ వేరు. ఇక అతడు నలుగురిలో ఉన్నప్పుడు మరీ భిన్నం. పదుగురిలో ఉన్నప్పుడు వేరు. అప్పుడు తన అస్తిత్వం ఒక్కటే ప్రాధాన్యం వహించని కారణంగా- బృందంలో ఒకడిగా, ఒక్కోసారి ‘గుంపులో గోవిందయ్య’గా అతడి వ్యక్తిత్వం అప్రధానం కావడమూ జరిగి అతడు వేరుగా అగుపించసాగాడు.

ఒక మనిషిని జూమ్ చేయడమూ, క్లోజపులో చూపడమూ కాకుండా లాంగ్ షాట్లో, వైడాంగిల్లో తీయడమూ చేస్తూ ఉండగా ఆ మనిషి తాలూకు మనిషితత్వం విడివడుతూ అంతకు ముందు పరిచయమైన మనిషి కాకుండా సరికొత్త మనిషి ఆవిష్కారం అవడమూ మెలమెల్లగా అర్థమైనది.

అంటే మరోలా చెబితే, అతడు లేదా ఆమె స్థానం మనకు తెలిసిందే అనుకుంటాం. కానీ కాదు. కెమెరా తన స్థలమూ కాలమూ విశ్వమూ సరిగ్గా పట్టిస్తుంది. ఆ కెమెరా ఆమెను భిన్న కోణాల్లో నమోదు చేయడమూ జరుగుతున్నది. కావున మనిషిని చూడటంలో కన్నుకు ఉన్న పరిధి కెమెరా కన్ను దాటింది, దాటి చూపుతున్నదనీ కూడా. ఈ  గ్రహింపు వల్ల  మనిషి చిత్రం బహుళం అని, సామాజికమూ అని అవగతం అవుతూ ఉన్నది.

+++

మరీ చిత్రం ఏమిటంటే-  ఆ మనిషి మామూలుగా కనిపించడానికీ తలపై కొంగు చుట్టుకుని ఆగుపించడానికీ తేడా విపరీతంగానూ ఉన్నది. ఇంకోసారి దగ్గరగా తీసినప్పుడు, ఆ మనిషి పెదవులు ముడుచుకుని ఇచ్చిన ఫోజుకు పెదవులు తెరచి ఉండగా తీసిన ఫొటొకూ జీవన వ్యాకరణంలోనే పెద్ద తేడా కనిపించింది.

ఒక రకంగా- పెదవులు ముడిచినప్పుడు అతడు అతడుగా లేదా ఆమె ఆమెగా అంటే ఒక నామవాచకంగా, ఒక ప్రత్యేక అస్తిత్తంలో ఫ్రీజ్ అయిన మానవుడిగా ఉండటం గమనించాను. కాగా,  పండ్లు కనిపిస్తూ ఉండగా తీసిన ఫొటోలో అతడు సహజంగా అగుపించి, ఒక క్రియలాగా తోచడమూ మొదలైంది. అది ఆ మనిషికి తెలియకుండా జరిగే చర్యలాగూ ఉన్నది. ఇంకా,  ప్రత్యేకంగా ఒకరిని ఒక స్థలంలో అమర్చి, తగిన వెలుగు నీడల్లో అందంగా, విశిష్టంగా ఫొటో తీసుకోవడం ఉందే అది ఒక విశేషణంగా తోచింది. మొత్తంగా, మనిషి ఒక్కడే – అక్షరమాలలోని పదం మామూలే. కానీ అతడితో కర్తకర్మక్రియలన్నీ మారిపోతూ ఉన్నవి, అక్షరం- పదం -వాక్యమైనప్పుడు. అయితే ఇదంతా తనతో కాకుండా తనతోటి పరిసర ప్రపంచంలో ఆ మనిషి మార్పు నాకు అవగతం అవుతూ ఉన్నది.

+++

ఇదంతా ఒకెత్తయితే నేను సూటిగా చెప్పదలచుకున్న విషయం,  ఈ మనిషి కేవలం సాహిత్య వస్తువుగా ఉన్నప్పుడు చీమూ నెత్తురూ రక్తమాంసాలు మూలుగు ఆత్మా ఉన్న వాడుగా, అనుభవాల సెలయేరుగా, ముందు చెప్పినట్టు ఒక చెట్టులా ఉన్నాడు. ఉన్నది. గతంలో నేను అలా ఆవిష్కరించాను కూడా. ఇది పరిమితమే అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకంటే, ఛాయాచిత్రలేఖనానికి వస్తే ఆ మనిషి ఒక ఉమ్మడి అంశంగా, పంచభూతాల్లో ఒకరిగా ప్రతిబింబించసాగాడం నాకే ఆశ్చర్యంగానూ ఉన్నది. చూడగా చూడగా తనకంటూ ఒక ప్రపంచం, అతడికో ఆమెకో ఒక ప్రపంచం అన్నది లేదు. విశ్వంలో మపిషి ఉన్నాడనే అనిపిస్తున్నది.

దాని విస్తీర్ణం ఛాయాచిత్రలేఖనంలో కొంచెం కొంచెం అగుపిస్తూ ఉన్నదన్న నమ్మకమూ కలుగుతున్నది.

దాన్నే ఇలా చెబితే, మనిషి ఫొటోగ్రఫి కారణంగా ప్రకృతిలో భాగంగా, ఒక ఎండుటాకుగా లేదా ఒక వికసిస్తున్న ఫలంగా సమైక్యంగా కనిపిస్తూ ఉన్నాడనిపిస్తూ ఉన్నది.  వేరు వేరు చ్ఛాయలు. కానీ అవన్నీ తనవే కావనీ తెలుస్తున్నది.

+++

చివరగా, మనిషి పంచభూతాల్లో ఒకడిగా, నేలా నింగితో, నీరూ నిప్పు గాలితో ప్రాణిగా ఉన్నాడు. వీటన్నిటి ప్రయోజనంగా, సంక్షిప్తమై ప్రత్యేక అస్తిత్వంగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అందుకే అతడిని చూస్తే, తన స్థిరమైన లక్షణాన్ని గమనిస్తే మట్టిలా పరిమళంలా ఉంటాడు. ఆ సజల నేత్రాలను చూస్తే అది నీరు… ఆవేశకావేశాలతో ఎగిరిపడే అతడి హృదయం నిప్పు… ఆహ్లాదంతో తేలియాడినప్పుడు గాలి…. తన ఊహా ప్రపంచం, కల్పానమయ జగత్తును చూస్తే అది ఆకాశమో స్వర్గమో అనిపించసాగింది. ఒక్కోసారి ఇవన్నీ కాకుండా  దిక్కుతోచని స్థితిలో ముడుచుకుని ఉన్నప్పుడు, తన పట్ల తనకే అనాసక్తి కలిగినప్పుడు, ఒక గడ్డిపరకలానూ ఉన్నాడు. అదీ ఒక అస్తిత్వం అన్న సంగతీ తెలుస్తూ ఉన్నది.

తీయగా తీయగా అనిపిస్తూ ఉన్నది ఇదే…మనిషి ఉనికి మనిషితోనే లేదని!

~కందుకూరి రమేష్ బాబు

ramesh

శుభ్రజ్యో్త్న నడయాడిన క్షణాలను ఒడిసి పట్టిన అనుభూతి!

drushya drushyam
ఫొటోగ్రఫి అన్నది ఒక వాహ్యాళి కావచ్చు. ఒక విహారయాత్ర కావచ్చు. వీధి భాగవతమూ కావచ్చును. ఎపుడైనా అది దైవ దర్శనమూ అయి వుండవచ్చు. ఇది అలాంటి ఘడియలో తీసిన ఒకానొక లిప్త. భగవంతుడికీ భక్తుడికీ మధ్య గోచరమైన ప్రసాదం. చెదిరిన కన్నయి,  కొవ్వొత్తి క్రీనీడల్లో రెపరెపలాడే దయామయమైన వెలుగునీడై దృశ్యమానమైన ఒక ఛాయఖండిక..

ఆలయంలో ఇదొక స్థితి-స్థాపకత. ఇక్కడి ఛాయాచిత్రణం ఒక ప్రత్యేక నాదం. హృదయంతరాలల్లో ఏదో ఒక శుభ్రజ్యో్త్న నడయాడిన క్షణాలను ఒడిసి పట్టినప్పటి అదృష్టం. ఓం ప్రథమం అనదగ్గ వినిర్మల, అలౌకిక చ్ఛాయ కు ఆధారమైన బీజాక్షరాలు వినిపించినప్పటి తన్మయత్వం. ఇక్కడ అరుదెంచిన మానవుడు మరెక్కడా ఇంత వినయ విధేయతలతో కానరాని స్థితికి పారవశ్యం. అందుకే ఇదొక దర్శనం. మానవుడి ప్రయత్నమంతా నిమిత్తమైన అరుదైన బతికిన క్షణాలు- ప్రణామములు.

+++

“మతమే రాజ్యమేలుతూ ఉన్నప్పడు ఆధ్యాత్మిక స్రవంతి ఎక్కడ కానవస్తుంది లే’ అనుకుంటాం. కానీ, “గోవిందా…గోవిందా’ స్మరణల మధ్య మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకపరి లయతప్పి మళ్లీ స్థిరపడి సజావుగా సాగే అపురూప లోగిలి ఒకటి ఉన్నదని, మనసు నిమ్మళించిన వైనము…

ఇక్కడికి మనిషి కలివిడిగా వచ్చినప్పటికీ మళ్లీ ఏకాకి అయి, ఒంటరి ముద్రలో తన హృదయమే తాను వింటున్నప్పటి, వినడమూ మరచి దైవంలో లీనమైతున్పప్పటి, లీల గోచరమైనప్పడు సందేహాలు తెల్లబోయినప్పటి చిత్రములెన్నో…

కులమూ మతమూ లింగమూ… అలాగే, రాజూ పేదా అన్న స్థాయి భేదాలులేని  ప్రపంచం ఒకటి, కొన్నిలిప్తలే కావచ్చును, ఒకానొక బహిరంగ ఉద్యమమై గోచరించడం, ఒకరి వెనుక ఒకరు,ఒకే ఒక క్రమంలో, ఒక ‘మార్చ్’ అయి, ఒకే నిష్ఠతో నడవడం, మళ్లీ అంతా ఒకే చోట ఆగిపోయి దర్శనం చేసుకోవడం, ఇదంతా అవలీలగా కెమెరా కన్ను  దర్శించడం…ఓ గొప్ప అనుభవం.

+++

తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక సాయంత్రం ఇదే పని…
సుమారు ఒక వేయిమందిని అయినా చూసి ఉంటాను. “చూడటం’ అని ఎందుకు అనడం అంటే మామూలుగా చూస్తే కంటికి కనిపించనిది, కెమెరా గుండా భక్తులను, వాళ్లు లీనమయ్యే తీరుతెన్నులను, వ్యూ ఫైండర్ నుంచి చూడటం అంటే నిజంగా అదీ చూపు. అది మార్పు కాదు, ప్రతిబింబం కాదు, కేవలం గాజు. అటూ ఇటూ కన్నూ, చూపు ప్రసారమయ్యే కేవలం దర్శనం, దివ్య దర్శనం.

అది లౌకికం కాదు, అలౌకికమే.  అదొక ఆశ్చర్యం, ఆనందం. an exposure.
కెమెరా కంటితో పొందిన బ్రహ్మానందం. development. కండ్లు తెరవడం అంటామే! కెమెరాతో తేరుకోవడం!

+++

చేతులు జోడించి ఒకరు, కన్నార్పకుండా మరొకరు.
కంట కన్నీరొలికి ఒకరు. ఆనందభాష్పాలతో మరొకరు.
కరుణ, ప్రేమ, భయవిహ్హలత….అంతేనా? కుతూహలం, ఆనందం, తృప్తినూ.
తల తిప్పుకున్నవారూ ఉన్నారు, దైవాన్ని చూడలేక!
లీనమైన వాళ్లూ ఉన్నారు, మళ్లీ జీవన సమరాన్ని ఈదలేక!

గంపెడు పిల్లలున్న తల్లీ ఒక్కత్తే…అష్టదరిద్రం అనుభవిస్తున్న మధ్య వయస్కుడూ… ఒక్కడే… అంతా సమూహంలో ఏకాంత ప్రపంచం. దంపతులు దంపతులూ కాదు. భర్త భర్తా కాదు. దగ్గరితనం అంతా దైవంపైనే. అతడే బిడ్డా, తండ్రీ! అంగీకారం కుదిరేదాకా మనిషి లోవెలుపలా ఒక పెనుగులాట. తర్వాత శాంతి, ప్రేమ…
లీనమయ్యారా ఇక  భక్తుడికి భగవంతుడికీ మద్య ఒకే ఒక ఆత్మానుగత వారధి….వర్దిల్లే దయాపారావతం…లీలామృతం.

చిత్రమేమిటంటే అందరూ అపరిచితులే. అంతా ఒక మరుపు. దర్శనం సమయంలో మైమరుపు. అదే అపూర్వం. విశ్వాసమే బలమై అంతా మోకరిల్లడమే. దైవం చెంత అందరూ మానవులైన వాళ్లే… కంటి ముందు కెమెరా వెలిగించి చూస్తే అందరూ భక్తులైన వాళ్లే.

వాహనంలో వేంకటేశ్వరస్వామి నిదానంగా ఊరేగుతూ ఉంటే ఆదర్శాలు లేవు. ఆశయాలు లేవు. విశాలత్వం లేదు, సంకుచితత్వమూ లేదు. అంతా ఒకే ప్రపంచం. తారతమ్యంలేని ప్రాపంచికత్వం. ఒక్కొక్కరూ హారతి కర్పూరంలా దహనమైతున్న వాళ్లే.

అదేం విశేషమో గానీ, అది మహత్యమే! మనిషి దైవం చెంత నిమిత్తమయ్యే మహా ఛాయాచిత్ర లేఖనం అది!

capture చేస్తున్నది మనిషినా దైవాన్నా మెలమెల్లగా అర్థమవుతున్నది!

ధన్యుణ్ని, ఒక ఘడియకైనా!
ఏ గడియలూ లేని కెమెరా కారణంగా!

 ~ కందుకూరి రమేష్ బాబు

Unfinished Painting

DRUSHYA DRUSHYAM PHOTO

ఆది అంతమూ లేని జీవనాడి ఒకోసారి ‘చిత్ర’మై ఘనీభవించి, మళ్లీ కాలవాహికలో దొర్లుతూనే ఉంటుంది, అక్షరమై………….

*
ఒకానొక ఉదయం మధ్నాహ్నమైంది.

ఒక చిత్రకారుడి ఇంటిలోకి ప్రవేశించగానే అక్కడ అనుకున్నదేమీ లేదు. శాంతి లేదు. స్వప్నమూ కానరాలేదు. సమాధిలో ఉంది జీవితం. లేదంటే ఒకానొక పురాతన ఆవాసంలో సరికొత్తదేమీ లేనంత నిర్లిప్తత తాండవిస్తున్నది. ఆయనింకా లేవనూ లేదు. ఇల్లంతా నిర్విరామ నిశ్శబ్దపు అలికిడికి ఉల్లాసం హరించుకుపోగా విసుగు పెరుగుతున్నది. పావుగంట తర్వాత మెత్తటి అడుగులతో, ఒకానొక అందమైన ఒడిషా పల్లెపడచు లయాత్మక ప్రవేశం.

చిత్రం. ఆమె చిత్రకారిణి కాదు. కాదుగానీ అప్పటిదాకా లేని కళ ఏదో అకస్మాత్తుగా తెచ్చింది. ప్రేమగా పాలు, బిస్కట్లు ఇచ్చింది. ఎక్కడి వస్తువులు అక్కడే గప్‌చుప్‌గా ఉండగా, పేరుకున్న దుమ్ము మాత్రమే చిర్నవ్వులు చిందిస్తుండగా ఆమె నిదానంగా నడుం వంచి ఊడ్చింది. అప్పుడు అక్కడ సోఫాలోంచి లేచి నిలబడటం.. ఆ పరిసరాలు ఊడ్చినాక కూచోవడం, ఎవరింట్లోనైనా అంతే అన్నంత మామూలు తర్వాత ఆమె అదృశ్యమై అతడు ప్రత్యక్షమయ్యాడు, నిద్రకళ్లతో…

చిత్రాతిచిత్రం. అతడు కన్ను తెరిచి మూయగానే, ఒక్కపరి వేల పక్షుల రెక్కల చప్పుడు, కువకువలు మళ్లీ సద్దుమణిగిన సవ్వడి అతడి విశ్వసనీయమైన కరచాలనంతో…

మళ్లీ వెళ్లిపోతున్నాడు ఆ ఇల్లేమో ఒక నిర్వ్యాపారమై ఒక బద్దకించిన స్త్రీలా బరువైన కురులతో, నిండు చనులతో మెల్లగా మళ్లీ వైరాగ్య మండపంలా మారపోతుండగా మళ్లీ ఆ ఇల్లు బావురుమన్నది.

మళ్లీ పనిమనిషి కనిపించగానే మళ్లీ ఆ ఇల్లు ఉయ్యాలలా ఊగుతోంది. మెల్లగా శిశువు ఏడ్పు పసిప్రాయం ఎక్కడా దరిదాపుల్లో లేదు. తల్లీ కానరాలేదు. అంతా అలికిడిలేని విరాగమే.

‘ఇక్కడికి కాదు, స్టూడియోకి వెళ్లాల్సింది’  ఆ పనిమనిషి ఓదార్పు వచనం.

‘తెలియక వచ్చాను’  నా జవాబు.

అరగంట తర్వాత మళ్లీ ఆయన వచ్చాడు. ఈసారి చెట్టు కదులుతున్నట్టు వడివడిగా ఆలీవ్ గ్రీన్ దుస్తులతో తయారై వచ్చి సడెన్‌గా జీపు స్టార్ట్ చేసి నన్ను కూచోబెట్టుకుని వెళ్లసాగాడు.

పావుగంటలో స్టూడియో. అక్కడకు చేరుకుంటూనే ఆయన ఇంట్లోంచి వీధిలోకి ప్రవేశించినంత ఆత్రంగా, ఆనందంగా దిగాడు. చకచకా మెట్లెక్కసాగాడు. ఉత్సాహంగా కనిపించసాగాడు. ఇక స్టూడియో. అందులోకి ప్రవేశించగానే అతడి గొంతు మార్దవమైంది. మాటలు కలిపాడు. ఊట బావి గుర్తుకు వచ్చింది. దప్పిక తీర్చే తీయటి నీళ్ల జలజల క్రమక్రమంగా దోసిలి పట్టాను. కానీ తీరదే దాహం?

అతడు, తన చిత్రాలు, పుస్తకాలు, చిత్రకళతో పాటు తాను సేకరించే విసన కర్రలు, మన రుమాలు కాదు, దొరటోపీలు-హ్యాట్స్-వాటి కలెక్షన్-అలాగే తన స్టాఫ్, మూడు నాలుగు అంతస్థుల్లో తాను గీసిన చిత్రాలు, రూపొందించిన మ్యూరల్స్, కొన్ని శిల్పాలూ, కవితా చరణాలూ, వీటన్నిటి గురించి చెప్పగా క్షణాలు గడిచిపోతున్నాయ్. నా మనసంతా ఇంటిమీదే. అక్కడ ఆ స్త్రీ బాగున్నది. ప్రేమగా, శాంతంగా, కళలా…

కానీ ఇతడు మాటలు మాటలు.. వాటితో ఇతడు. ఉక్కిరిబిక్కిరవుతూ నేను, నా చూపులు. ఒక్క పరి నా కన్నులు అసంపూర్ణమైన ఈ చిత్రంపై పడ్డాయి. అప్పటిదాకా సుషుప్తిలో జోగుతున్న నా త్రినేత్రం టక్కున మేలుకున్నది. ఇదిగో, ఇక్కడే కన్నులు, నా కెమెరా కన్నూ ‘ఫినిష్’ – ఒక్కటైంది, క్లిక్ మని!

ఎందుకనో, ఏమిటో, ఎంతగానో అంతదాకా ఏదీ ఫొటో తీయబుద్దవలేదు. కానీ, దీంతో ప్రారంభం. ఇక ఎన్ని ఫొటోలో!

బహుశా ఇదీ అతడు. ఈ చిత్రమే అతడు. అతడెవరో తెలిపే చిత్రమే ఇది.

ఇల్లూ వాకిలీ స్టూడియో ఇవేవీ కాదు, కాన్వాసు. అదే అతడి వినువీధి, వాహ్యాళి. అదే అతడి చిత్తరువు.

అది దేహమా ఆత్మా, ఆడదా మగాడా అన్నది కాదు. ఆడమ్ అండ్ ఈవ్ తిన్న ఆపిల్ పండంత హృదయమే అతడిది. కానీ, తనది అసాధారణమైన శాక్తేయం. స్థలమూ, కాలమూ లేని పురాగానమో ఆధునికానంతర పునర్నివాసమో గానీ కాన్వాసుపై అతడు స్త్రీపురుషుడు. వట్టి మనిషి. సంయుక్తం కాని వ్యక్తిత్వం. పూర్ణం కానీ కాయం. తృప్తినివ్వని గాయం.

అతడి చిత్తమూ చిత్రమే అన్నట్టు అక్కడ ఆయన.

క్షణాలు, నిహిషాలు, ఘడియలూ దాటి ఒక పూటంతా వెచ్చించిన తర్వాత, అటు తర్వాత రెండేళ్లకు మళ్లీ ఈ బొమ్మ, తిలక్ అన్నట్టు, ‘చిమ్మ చీకటి కరేల్మని కదిలింది’, ఇలా…

బహుశా, అసంపూర్ణమే సంపూర్ణం.
ఇంకా ఎన్నో ఉన్నా ఇదే సంపూర్ణం, అసంపూర్ణం.

ప్రసిద్ధ చిత్రకారులు జతిన్‌దాస్‌కు, ముఖ్యంగా మీతో పంచుకుంటున్న తన ‘Unfinished paintingకు ధన్యవాదాలు.

~కందుకూరి రమేష్ బాబు

పదనిసల ఈ పిల్ల!

పదనిసలు
ఈ బొమ్మలో కాదుగానీ దీనికి ముందూ తర్వాతా ఈ చిన్నారిని చూస్తే మీ హృదయం ద్రవించిపోతుంది. చేతులు చాపే అభాగ్యులు, నిస్సహాయులు, అధోజగత్ సహోదరులెవరిని చూసినా మనసు కలుక్కుమంటుంది. చిత్రమేమిటంటే మన కళ్లలో ప్రతిఫలించే భావాలను వాళ్లూ గ్రహించగలుగుతారు. కానీ బయటపడరు.

మనకిష్టం లేదని వాళ్లకు తెలుసు. కానీ కిమ్మనరు. మనవి జాలిచూపులని తెలుసు. కానీ క్షమిస్తారు. మనం విదిల్చే కాసులకు మనలోనే తృప్తిల్లే ఏవో అజ్ఞాత ఆదర్శాలకూ వాళ్లు  నిందించరు. కానీ సతాయిస్తారు.

రూపాయో రెండ్రూపాయలో ఇచ్చేదాకా విసిగిస్తారు. అయితే, కొన్నిమార్లు తమనూ మననీ మరచిపోయి వాళ్లూ గెంతులేస్తారు. ఈ పిల్ల అలాంటిదే.

రింగ్ ఆఫ్ ట్రూత్ అంటాడు సత్యజిత్ రే – సాంగ్ ఆఫ్ ది రోడ్-పథేర్ పాంచాలి గురించి. సత్యం కాదు, ధర్మం నాలుగు పాదాల చెంత నిమ్మళంగా ఒకేచోట కేంద్రీకృతమైనప్పుడు ఇలాంటి చిత్రాలే అధికంగా కానవస్తాయి. అలా అని నిత్యనృత్యం  ఆగిపోతుందా? లేదు. అదే ఇక్కడి విశేషం.

భారతదేశపు రాజధాని ఢిల్లీలో ఒకానొక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద – వాహనాలు, అందులోని బడాబాబులతో నిమిత్తం లేకుండా చిన్నగా నృత్యం చేస్తున్న ఈ దృశ్యం అప్రమేయంగా, అనాలోచితంగా చిందులేసే వ్యధార్థ మానవుడి హృదయ సంగీతానికి  తొలి అడుగు అనే అనిపిస్తుంది. ‘తొలి అడుగు’ అనడం ఎందుకూ అంటే, ఏమో! ఆ పాప పెద్దయినాక ఏమవుతుందో! మానవేతిహాసంలో ఆ ఎద ఎలాంటి స్వరాలు సంకలనపరుస్తుందో! అందుకు మనని సంసిద్ధం చేయడంలో భాగమో ఏమో, ఈ పిల్ల పదనిసలు.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

ఈ వీధి నాటకం ఈ మనిషికి ప్రత్యేకం!

ramesh

  పాత్రికేయ రచయిత, ఛాయాచిత్రకారుడూ అయిన కందుకూరి రమేష్ బాబు ‘సారంగ’ కోసం వారం వారం మానవ జీవన దృశ్యమాలికను తనదైన పద్ధతిలో పరిచయం చేస్తారు.

*

maanavudu

కన్నంటుకోని నగరం కోల్‌కత. అలుపు సొలుపూ లేని జనారణ్యం కోల్‌కోత. ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు రఘురాయ్ మాటల్లోనైతే ‘అది ఎప్పుడు మేలుకొంటుందో తెలియదు. ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియదు.’ అటువంటి మహానగరంలో కుమార్‌టౌలీ ఒక దివ్యధామం. అక్కడి వీథులన్నీ గర్భగుడికి దారులే. ఇండ్లూ వాకిళ్లూ దేవీ విగ్రహాల లోగిళ్లే.

చూస్తుండగానే, దశమి సమీపిస్తుంది. మానవుడు కనుమరుగై మహోన్నతమైన దుర్గామాత ప్రత్యక్షమౌతుంది. ఇక దేవత యజమాని పరం అవుతుంది. నిజానికి వారికది విగ్రహమే కావచ్చును. కానీ, అదొక తపస్సు. ఆహోరాత్రులూ నవరాత్రుల కోసమే అంకితమయ్యే మహోపాసన. మానవ మహత్కార్యానికి ఒక చిత్రమైన కొలుపు. ఇదంతా ఒక పార్శం. మరొక పార్శం జీవన సమరం.

తొలుత పని చిన్నగానే మొదలౌతుంది. అది అనేక దశల్లో సాగుతుంది. చివరాఖరికి రంగులద్దిన పిదప మాత కన్ను తెరుస్తుంది. విస్తుపోయే వర్ఛస్సుకు లొంగిపోతాడు మనిషి. చిత్రమేమిటంటే, తమ బొమ్మ తమ కార్ఖాణాల్లోనే తల్లిగా మారి పూజలందుకుని వీడ్కోలూ తీసుకుంటుంది. అప్పుడు చిన్నబోవడం వీళ్ల వంతు. అంతదాకా తామే భగవంతులు. ఆ పిదప పూజారులూ కూడా కాదు, చిల్లర దేవుళ్లు.

ఈ వీథి నాటకం ఈ మనిషికి ప్రత్యేకం. కుమార్‌టౌలికీ, కోల్‌కోతాకు ప్రత్యేకం.
వందనం మనిషి! జగమంత విస్తరించే కడుపేద మనిషీ, వందనం!!