నీ ఉనికి ఏ రంగు?!

drushya druhyam-52

ఒక ఛాయా చిత్రం చేస్తున్నప్పుడు ‘తొలుత ఏది ఆకర్షిస్తుందీ’ అంటే చెప్పలేం. దీనత్వమా ధీరత్వమా అంటే, నలుపా ఎరుపా అంటే ఏమని చెబుతాం?

కష్టమేగానీ, ఒకటి సత్యం. ప్రధానంగా ‘మనిషి ఉనికి’ అని చెప్పాలి. అయితే, ఆ మనిషి ఉనికిలో వర్ణమూ ఉంటుంది. అది ముదురు వన్నెలతో వెలుగుతున్నప్పుడు ‘ఆ ఛాయ’ ధీరత్వానికి, నిబ్బరానికి సూచికే అవుతుంది. ఎరుపు ‘వర్ణమే’ అవుతుంది.

అయితే, అందరికీ తెలుసు, ఛాయా చిత్రలేఖనంలో రంగుకూడా చిత్రాన్ని ప్రధానం చేస్తుందీ అని! కానీ, అది మరింత చక్కగా ఫొటోగ్రఫీ చేసేలా దానంతటదే సూచనలు ఇస్తుందని తెలుసా? తెలిసింది. అదే ఈ చిత్రం.

+++

నిజానికి మనిషి స్థితీ గతీ ఎటువంటిదైనా జీవితానికి రంగు, రుచీ, వాసనా… వీటన్నిటితో కూడిన ‘ఉనికి’ ఉన్నది. సాహిత్యంలో శ్రీశ్రీ కాబోలు, ‘రసన’ అన్నట్టు, ఛాయాచిత్రలేఖనంలో కూడా ఈ ‘రసన’ ఉన్నది. అదే ఈ చిత్రం.

జీవితం ప్రకాశవంతంగా ఉంటుందని, మనిషి ఎక్కడున్నా, ఎలా జీవిస్తున్నాచీమూ నెత్తురూ ఉన్నంత వరకూ కళను పోగొట్టుకోడని…ఆ ‘రసన’ అన్న దానిని అడుగడుగునా, అణువణువునా ఛాయాచిత్రం రికార్డు చేసినంత వాస్తవికంగా చిత్రలేఖనం కూడా చేయదని ఒక నమ్మిక కలుగుతున్నది. ఈ చిత్రమూ ఆ నమ్మికకు దాఖలు.

ముఖ్యంగా మహిళ. ఆమె చీర సింగారమే, ఆమె ఉనికి బంగారమే. ఎక్కడున్నా ఒక శోభ. తృప్తి.

అయితే, తనను తాను రక్షించుకోవడానికి ఆమె ధరింపు అంతా కూడా ఒక చిత్రం. అదే ఈ చిత్రం.

నిజానికి ఫ్లెక్సీపై విశ్రమిస్తున్నఈ మహిళా, అమె పరిసర జీవితమూ అంతా కూడా ఒక దీనావస్థకు ప్రతిబింబమే. అట్లని మనిషిని వారి ఈస్తటిక్స్ ను పేదరికం కారణంగా విస్మరించడం కూడదనే ఈ చిత్రం. అదే ఈ దృశ్యం.

ఆమె తనను తాను అనువుగా మలుచుకున్నది. అంతా కూడా ఆ చీరలోనే, అట్లే, ఆ ఫ్లెక్సీపై. ఆ అనుభవం ఈ చిత్రం.

ఎక్కడున్నా తనకు అనువైన పరిసరాలలో, వీలైనంత భద్రంగా, శాంతిని ఎరిగి, కాసింత విశ్రాంతిని కళాత్మకంగా అసుసంధానం చేసుకోవడమూ ఈ చిత్ర విశేషం. లైఫ్@ఆర్ట్ – ఈ చిత్రం.

తానే అని కాదు, ఎందరినో చిత్రిస్తుండగా బతుకు ఎక్కడున్నా దివ్యంగా శోభిల్లడం చిత్రమేమీ కాదు. అది సహజత్వం. ముఖ్యంగా వీధుల్లో జీవించే వారెందరినో చిత్రిస్తూ ఉండగా ఇంకొక విశేషమూ గమనంలోకి రావడం అదృష్టం.

భరించలేని దుర్గంధం వస్తున్న చోట కూడా ఎన్నోజీవితాలు స్థిరంగా నిలబడటం విశేషమే. అటువంటి ఒకానొక చోట, ఒక వృద్ధ మహిళ అగర్ బత్తీలు వెలిగించుకుని ఉండటం ఒక గమనింపు. ఆ చిత్రం చేసి పెట్టాను కూడా. దీనర్థం మనిషి అనివార్యమైన జీవన ప్రస్థానంలో ఓడిపోలేదని! గుబాళింపు కోసం కాదు, సహజంగా జీవించలేని నిస్సహాయతలో ఒక వెలుగింపు. నిరాశ్రయంలో కూడా ఒక ఆశ్రయం. అంతే. అటువంటిదే ఈ చిత్రం. ఆమెను చూడండి.

ఒకరని కాదు, వందలు, వేలు, లక్షలు కూడానేమో! మహానగరంలో ఎందరో సామాన్యులు. అందరికీ వందనాలు.

+++

ఆమె, ఇంకా ఎందరో, వాళ్లంతా లతలూ, పూవులూ అన్నిటినీ దగ్గరే వుంచుకోవడం…ఫలమూ, పుష్ఫమూ జాగ్రత్త చేసుకోవడం… నగరంలో వీధి మనిషి జీవితం… ఒక రంగుల కళ. చూడండి, ఆర్ట్@స్ట్రీట్. అదే ఈ చిత్రం.

+++

ఆమె వరకైతే అది చీర కొంగు డిజైన్ కావచ్చు, ఎర్రటి గాజుల గలగలలు కావచ్చు. వేపాకు రంగు జాకెట్టూ కావచ్చు. ముందరి పేపర్ ప్లేట్ కావచ్చు.ఆమెది జీవకళ. అందునా కళ అన్నది జీవితంలో సహజాతం అన్నట్లు తాను జీవితాన్ని కళాత్మకంగా ధరిస్తుంది. ఆ ఫ్లెక్సీ కూడా అదే. అది కూడా తన ఎంపిక. ధరింపు,.

అందులోనూ మనుషులున్నరు. అది కూడా చిత్రం.

తానే కాదు, ముఖ్యంగా శ్రామిక జనం… ఎర్రెర్రటి, పచ్చపచ్చటి, ముదురు ముదురు రంగుల్లో జీవితాన్ని పచ్చగా గడుపుతూ ఉంటారు. చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. ముల్లు గుచ్చుకున్నా బాధపడతారు. కడుపు నొచ్చినా చెప్పుకుంటారు. శోఖాలు పెట్టి ఏడుస్తారు. రాగాలు తీసి దుఃఖిస్తారు. నవ్వినా అంతే. జీవితాన్నిజీవిస్తారు. అందుకే వారి చుట్టూ ఒక శాంతి వలయం ఉంటుంది. అదే వారిని భద్రంగా కాపాడుతుంది. మళ్లీ రంగులు…వారి చుట్టూరా ఇంధ్ర ధనుస్సుగా విరుస్తయి. అదే వాళ్ల మహత్యం.

ఈ చిత్రం ఇవన్నీ గుర్తు చేస్తున్నది.

ఆమె ఎర్రని చీర, ఈగలు ముసరకుండా తలను కప్పేసిన ఆ అందమైన కొంగు, ఆమె ధరించిన ఎర్ర గాజులూ, పడుకోవడానికి ఆమె ఎంచుకున్నఅందమైన రంగురంగుల జాతీయజెండా వంటి ఆ ఫ్లెక్సీ,

అందులోని మనుషుల కళ, ఆమె వెనకాలి గోడమీద జాజు చిత్రణమూ….ఇంకా వైడ్ షాట్ ఉంది. అందులో మరింత అందమైన, గాఢమైన వర్ణలేఖనమూ ఉన్నది. ఇది, ఇవన్నీ అంతా కూడా ఆ పరిసర

సౌందర్యాత్మను పట్టిస్తుంది. ఆ ఆడ మనిషిలోని ‘రసన’ తాలూకు చిద్విలాసాన్ని దృశ్యమానం చేస్తున్నది.

అజంతా మృత్యువు హాస్య ప్రియత్వం ఒక బొరుసు. ఇది బొమ్మ .జీవితపు అనివార్య ప్రస్థానాన్నిహుందాగా అంగీకరించిన ‘రసన’

ఆమె, ఇంకా ఎందరో, వాళ్లంతా లతలూ, పూవులూ అన్నిటినీ దగ్గరే వుంచుకోవడం…ఫలమూ, పుష్ఫమూ జాగ్రత్త చేసుకోవడం… నగరంలో వీధి మనిషి జీవితం… ఒక రంగుల కళ. చూడండి, ఆర్ట్@స్ట్రీట్. అదే ఈ చిత్రం.

+++

చిత్రమేమిటంటే, ఇదంతా కూడా జీవితంపట్ల గొప్ప అనురక్తి ఉన్నదని చెప్పకనే చెప్పే చిత్రం. చిత్రణమూ. అదే దృశ్యాదృశ్యం.

మరి ధన్యవాదం.

 ~ కందుకూరి రమేష్ బాబు

 ramesh

ఒక్కేసి పువ్వేసి చందమామ

DRUSHYA DRUSHYAM -51

జీవితం ఎంత గమ్మత్తయిందో చెప్పలేం.
అదొక పాట. ఆట.

కళ్ల ముందే ఆడనక్కర్లేదు.
వినిపించేంత దూరంలోనే పాడనక్కరా లేదు.

లోపలంతా ఆటే.
బయటంతా పాటే.అదృశ్యంగా ఉన్నా సన్నిహిత దృశ్యమే.
వినిపించకపోయినా సరాగాలాపనే.ఒక సాంసృతిక పరాగ సంపర్కం.
పండుగలో ప్రతి మనిషీ పువ్వవడం.

ఒక్కేసి పువ్వేసి చందమామ
ఒక్క జాము ఆయె చందమామ

వినీ వినిపించని రాగం.
జ్ఞప్తికి వచ్చీ రానీ తంగేడి పువ్వు పరిమళం.

ఎక్కడ కూచున్నాఒక పిలుపు.
పువ్వు ముడుచుకున్నట్లు, విచ్చుకున్నట్లు ఆటా, పాటా

అది దృశ్యాదృశ్యం. మదిలో పావనమైతున్నది.
సిద్దార్థ కవిత్వంలా బిడ్డ తన్మయమైతున్నడు.

ఒక్కేసి  పూవేసి చందమామ…
శివుడు రాకపాయె చందమామ

విరాగం.
రాగం.

ఒక చోట అని కాదు.
ఊరూ వాడా ఇల్లూ వాకిలీ టీవీ అంతాటా రాగరాజ్యం.
పాట పవనం.

ఒకరిద్దరు కాదు, బృందం.
ఒక జపమాల వంటి కంఠమాల పవిత్రమైన లీల ఏదో మెలమెల్లగా సమీపించి హృదయాన్ని బతుకమ్మ పేరుస్తున్నట్టు పేరుస్తున్నది.

స్త్రీ మహత్యం. గౌరమ్మ
ఇక ఏది చూసినా గౌరవం.

నేననే కాదు, అది ఎవరైనా, కాగితాల మీద పెరిగే జీవితం ఎవరిదైనా
పాత్రికేయుడైనా, ఫొటోగ్రాఫరైనా
పాఠకుడైనా లేదా ఫొటో జాగ్రత్త చేసుకునే ప్రేమికుడికైనా
ఎవరికైనా కాగితం ఒక అద్భుతమైన బతుకమ్మే.

చివరాఖరికి ఇది కూడా.
నేలపై పేపర్ ప్లేట్.

ఇదీ నాకు గౌరవమే. బతుకమ్మే.
నాకివ్వాళ బతుకమ్మ.

పండుగ కదా!
ప్రతి ఛాయా బతుకమ్మే!

సమస్త జీవితం బతుకమ్మే.
సెలబ్రేషన్.
సమస్త జీవితం బతుకమ్మే.
సెలబ్రేషన్.

చిత్రం.
నా ప్రతి చిత్రం ఒక లయ. జోల. ఉయ్యాల.
అందులో మీరు చందమామ.వినాలె.ఒక్కేసి పూవేసి చందమామ..
ఒక్క జాము ఆయె చందమామ.

-కందుకూరి రమేష్ బాబు

ఒక బతుకమ్మ, గౌరమ్మ లేదా ఒక పసుపమ్మ ….

drushya drushyam

ఫొటోగ్రఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఎందుకంటే, వేయి పదాల్లో చెప్పేది కూడా ఒక్క చిత్రం చెబుతుంది.

నిజానికి వేయి పదాలు, లక్ష పదాలు అని ఎందుకుగానీ…
మాటలన్నీ వెలవెలబోయిన చోట ఛాయాచిత్రం కళకళలాడుతుంది.

గొంతు దాటి ఎన్ని మాట్లాడినా చెప్పలేని, అర్థమై కూడా కాని మార్మికత్వాన్ని,
మరెన్నోజీవన రహస్యాలను చిత్రం అలవోకగా బోధపరుస్తుంది.

చీకటీ వెన్నెలనే కాదు…
మనం చూడ నిరాకరించిన బూడిద వర్ణపు అనేకానేక రంగులనూ ఒక జీవనచ్ఛాయ సైతం విశదం చేస్తుంది.

చిత్రమే.
నిజం. ఆత్మీయతలను, అనురాగాలనూ అక్షరాల్లో వ్యక్తం చేసి, అది సరిగా అందలేదని భంగపడకుండా చేసే శక్తి ఛాయాచిత్రానిది.
అది ఏదైనా సరే, ఒక ఛాయ అన్నింటినీ అవతలి మనిషికి నిమ్మళంగా ముట్ట చెబుతుంది.

ఉదాహరణకు ఈ చిత్రం.

+++

పిల్లలు ఎలా ఎదుగుతారు… ఎలా తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి నేర్చుకుంటారో చెప్పే ఒక పెద్ద వ్యాసం రాయవచ్చు.
కానీ రాయనవసరం లేదు.

అలాగే, పిల్లలు తల్లి చేత గోరుముద్దలు తింటూ ఎంత హాయిగా బాల్యాన్ని గడుపుతారో,
తల్లి ప్రేమతో తనవితీరా ఎంత ముద్దుగా ఎదిగి వస్తారో కూడా ఒక గొప్ప ఖండకావ్యం రాయవచ్చు.
కానీ అక్కరలేదేమో!

నిన్నూ నన్నూ కలిపే గొప్ప స్రవంతి ఏదైనా ఉన్నదీ అంటే అది అచ్ఛమైన జీవితమే.
ఆ జీవితాన్ని పెద్ద బాలశిక్షలా చదువుకోవాలంటే చిన్న చిన్న జీవన ఘడియలను సైతం అపూర్వంగా ఒడిసి పట్టుకునే ఒకానొక మాధ్యమాన్నినమ్ముకోవాలి. ఆ నమ్మికే నా వంటి ఎందరిచేతో కెమెరా పట్టించింది.

కొందరు వదిలారు. ఇంకొందరు వదలలేదు.
కానీ, వదలకుండా పట్టుకునేది మనం మాత్రం కాదని నా ఎరుక.

+++

మాధ్యమానికి ఒక స్పృహ ఉంటుంది, కాలానికి మల్లే!
ఎంపిక అన్నది దాని స్వభావం కూడా అని నమ్మాలి.
లేకపోతే మీరు తీసిందే ఫొటో అవుతుంది. మీ చేత తీయించింది పాపం…మసక బారుతుంది.

సరే, ఇది నమ్మిక. విశ్వాసం.
ఒక తెరిచిన కన్ను, మరొక మూసిన కన్ను తాలూకు జీవితానుభవం.
‘లిప్త’జ్ఞానం.

ఒక ప్యాఫన్.
ఆరోగ్యకరమైన పిచ్చి. దృశ్యాదృశ్యం.

+++

ఒక బిడ్డకు తల్లి ఎంత నేర్పుతుందో ఛాయా చిత్రలేఖనమూ అంతే నేర్పుతూ ఉంటది.
నేర్చుకునే కుతూహలం ఈ పిల్లల మల్లే ఉంటే!

లేకపోతే ఈ చిత్రమూ లేదు.
అందులో పరంపరానుగతంగా సాగుతున్న పోషణ, పూజ, పునస్కారాలూ లేవు.

ఏమైనా ఈ చిత్రం నాకిష్టం.
ఇందులో తరతరాలున్నయి. తల్లులు ఒక్కొక్కరూ ఒక దశకు ప్రతీక.
సంలీనం ఉంది. మమేకతా ఉంది. అన్నిటికన్నా స్వచ్ఛత, నిర్మలత్వం ఉన్నది.

మొత్తంగా ఒక బతుకమ్మ, మించిన గౌరమ్మ
లేదా ఒక పసుపమ్మ ఈ చిత్రం.

+++

లక్ష పదాలు, వేయి వాక్యాలు, వంద పేరాగ్రాఫులు, యాభై పేజీలు, ఓ పది పుస్తకాలు, ఒక మహా కావ్యం ఈ చిత్రం.
లేదా ‘అమ్మ’ అన్న ఒక్క తలంపు చాలు…

మాతృక. అంతే.
అదే ఈ ఛాయ చిత్రం.

‘మాతృదేవోభవ’ అన్న శ్లోకం ఒక రకంగా త్రినేత్రాలు పనిచేసే ఛాయా చిత్రలేఖణం గురించే అనిపించే ఈ మాధ్యమానికి,
అందులో జనించిన ఈ అమ్మవారి ఫొటో, తల్లుల ఫొటో, బిడ్డల ఫొటో… ‘దృశ్యాదృశ్యం’ యాభయ్యవ వారానికి ఒక కానుక.

ఆనందం, అభిమానం, తృప్తితో.
వచ్చేవారం మళ్లీ కలుద్దాం. మరి, ధన్యవాదం.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

వాలకం

drushya drushyam 49...
చాలా మామూలు దృశ్యం.
ధాన్యం బస్తాలపై పక్షులు.

బజార్లలో…
ముఖ్యంగా రోడ్లపై ధాన్యం బస్తాలు తీసుకెళుతున్నలారీలు, ట్రాలీలు…
వీటిని చూసే ఉంటారు.
వాటిపై వాలిన పక్షులను, ఆ గుంపులను చిర్నవ్వుతో చూసే ఉంటరు.
ఎవరికైనా వాటిని చూస్తే నవ్వొస్తుంది.

అవి ముక్కుతో పొడుస్తూ ఆ ధాన్యం గింజలను ఏరుకుని తింటూ ఉంటై.
చప్పున లేస్తూ, ఒక బస్తా నుంచి ఇంకో బస్తా వద్దకు దుముకుతూ ఉంటై.
చిన్నపిల్లల మాదిరి నానా సందడి చేస్తూ ఆ గింజలను ఆరగిస్తుంటై.
దూరం నుంచి చూస్తున్నవాళ్లకు నవ్వాగదు.

ఒక్కోసారి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలుచున్నప్పుడు ఇటువంటి వాహనం, పైన పక్షుల గుంపు కానవస్తుంది.
చూస్తూ ఉంట.

కెమెరా కన్ను తెరిచి, ఫొటో తీసేంత టైం ఇవ్వవు.
‘ప్చ్’ అనుకుంట.

నిజానికి ఆ పక్షులు, ఆ వాహనపు డ్రైవరూ …ఎవరూ నన్ను పట్టించుకోరు గానీ అప్పుడు నన్ను చూడాలి.
ఒక అపరిచిత దృశ్యం బంధించి సంతోషించే నేనూ… వేగంగా పరిగెత్తుతున్న ఆ లారీపై వాలిన పక్షీ వేరు కాదని తెలుస్తుంది.
గింజల ఆశ – ఛాయాచిత్రణం వంటిదే అంటే నమ్మాలి.
అందుకోసం దేనిమీద వాలతామో తెలియదు, నిజం!

కానీ, గమనించే ఉంటారు.
ఆ పక్షులు…వాటి కేరింతలు.
వాటి పని వాటిదే.

ఏమో!
దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు వాటికి తెలుసో లేదో.
కానీ, అవి మహా బిజీగా ఉంటై.
ఒకట్రెండు కాదు, ఆ వాహనాన్ని ఏకంగా ఒక పక్షుల గుంపే ఆక్రమించుకుంటుంది.
ఇది కూడా ఒక రకంగా నా దృష్టిలో – సీరిస్ ఆఫ్ ఫొటోగ్రఫి.

క్లిక్ క్లిక్ క్లిక్.
పక్షుల రొద వంటి ఛాయాచిత్రణం.
వస్తువుపై పడి నానా హింస చేయడం.
తర్వాత తుర్రున ఎగిరిపోవడం.

ఎవరికీ తెలియదుగానీ పక్షి వేరు, విహంగ వీక్షణం తెలిసిన ఛాయా చిత్రకారుడూ వేరు కాదు.
ఆక్రమించుకుని, కాస్త సమయంలోనే అబగా అలా గింజల కోసం ఆరాట పడటమే.
అదే సహజం. అట్లే ఇతడూనూ.

సంతృప్తి ఉంటుందని అనుకోను.
కానీ ఒక పక్షి ప్రయత్నం.

ముక్కుతో కరుచుకుని, మంచి గింజ వెతుక్కుని అట్లా కాసేపు పొట్ట పోసుకున్నట్టు
ఈ ఛాయా చిత్రకారుడూనూ అంతే.
ఏదో ఒడిసి పట్టుకున్నట్టు శాంతిస్తడు.

పక్షి అని కాదు, ప్రేమ పక్షే.
ఫొటోగ్రఫీ అన్నది ముందూ వెనకాల ఊహించకుండా వాలిపోవడమే.
అందుకే, పక్షులు వాలినప్పుడల్లా నాకు ఫొటోగ్రఫీ జరుగుతున్న దృశ్యం ఒకటి మనసును ఆనంద పారవశ్యం చేస్తుంది.

ఒక విస్తరణ.
an experiment

తర్వాత?

తిరిగి రావలసిందే?

నిజమే. అప్పటికే కొన్ని మైళ్లు ప్రయాణిస్తయి.
ఆ పక్షులు భారంగా తిరిగి రావలసిందే.
వస్తయి కూడా.

నేనూ అంతే.

ఒక ఛాయా చిత్రకారుడెవరైనా అంతే.
ఆ ఛాయ గడిచినంతసేపూ ఏదీ గుర్తు రాదు.
తర్వాత మళ్లీ మామూలే.
వెనుదిరగాలి, దైనందిన జీవనచ్ఛాయల్లోకి.

వాటికీ తెలుసేమో!
అది వాహనమే అనీ,!
ఆ ధాన్యపు వాహనం ప్రయాణంలో ఒక ఆటవిడుపే అని.
కానీ, తెలిసినా తెలియకపోయినా ఒక వాలకం. అంతే.
అలవడిన వైనం. అంతేనేమో!

కానీ, మనందరి గురించి ఒకమాట.
పక్షి అనో, ఛాయా చిత్రకారుడనో కాదు, మనందరమూ అంతే కదా!
తెలియకుండా మనం వెంపర్లాడే విషయాలు ఎన్నని ఉంటై?

అప్పుడు గుర్తురావు గానీ…
మన పనీ అంతే కదా అంటే ఇప్పుడొకసారి అంగీకరించవచ్చు కదా!

నిజమే కదా!
ఆ వాహనం యజమాని దయగలిగిన వాడైనా, కాకపోయినా
వాటిని అదిలించినా, అదిలించకపోయినా …అవి కొద్దిదూరం తప్పక ప్రయాణిస్తయి.
తర్వాత మళ్లీ ఇంకో పక్షుల గంపు.
మళ్లీ అదే దృశ్యం.

కానీ, ఈ దృశ్యం ఇంకా ఏదో చెబుతుందని తీయాలనిపించింది.
చాలాసార్లు ప్రయత్నించాను. పక్షులు వాలిన చెట్టువలే ఉన్న లారీలను తీయ ప్రయత్నించాను.
కానీ, వేగం వల్ల…అంత ఒడుపుగా ఆ దృశ్యాన్ని పట్టుకోకపోవడం వల్ల ఈ ఒక్క చిత్రమే తీయగలిగాను.

ఇందులో ఏ గొప్పా లేదు.
కానీ తప్పదు. అలా వాలిపోయింది మనసు.
అదే దృశ్యాదృశ్యం.

+++

ఎవరో పిలిచినట్టు వినిపిస్తే తలుపు తీసి చూసినట్టు
అవీ అట్లా రోడ్డు వారగా ఒక కన్నేసే ఉంచుతై…
ఏదైనా ఇలా కనిపించిందా..
కేకేసి అమాంతం ఆ వాహనం వెంటపడ్తయి.

నాకైతే చెట్టపై వాలిన పక్షులకన్నా
బస్తాల లారీపై వాలిన పక్షులే ఆసక్తి.

మానవాసక్తి.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

De-framing స్వేచ్చ!

drushya drushyam 48

పక్షిని చూస్తే మనసు తేలికవుతుంది.
ఒక్కోసారి అలా ఎగురుతున్న పక్షితో చూపును పరిగెత్తిస్తే మనసూ తేలికవుతుంది.

కానీ, చూపు మధ్యలోనే తప్పిపోతుంది.
లేదా ఆ పక్షి మధ్యలోనే మనల్ని తప్పుకుని మాయమైతుంది.
మళ్లీ వట్టి ఆకాశమే మిగులుతుంది.

అయితే, సాధారణ దృష్టి కన్నాకొంచెం స్పందించే హృదయంతో చూస్తే ఏదీ తప్పిపోదనిపిస్తుంది.
నిదానంగా పరికిస్తే, ఇష్టంగా పయనిస్తే, మనసు పక్షితో కవిత్వమై కొన్ని చరణాలైనా అలా గుండెల్లో గంతులేస్తుంది. అలాంటి ఒకానొక చరణం ఈ చిత్రం.

అయితే, కెమెరా కన్ను తాలూకు చూపు ఇది.
చిత్రం – ఒక్క పక్షి కాదనే ఈ దృశ్యాదృశ్యం.

+++

మళ్ళీ చూడండి.
ఈ ఛాయాచిత్రాన్నిచూస్తూ ఉండగా మనం పక్షిని మాత్రమే చూడం.
ఆకాశమూ దృశ్యం అవుతుంది.

అదే ఈ చిత్రం.

పక్షి, ఆకాశమూ కాకుండా ఆ నల్లటి నలుపులో ఉన్నదేమిటి?
అది భవనం.

అదీ కానవస్తుంది చిత్రంలో.
అదే ఈ చిత్రం.

అవును. ఎగిరే పక్షి…ఎగరని ఆకాశమూ…నిశ్చలమైన ఆ భవనపు ఆర్చీ-ఇవన్నీ స్థిరంగా ఉండగా మనసు అలవోకగా గంతులేస్తుంది. అప్పటి రెక్క విప్పిన క్షణం కూడా ఈ ఛాయాచిత్రం.

ఇక దృశ్యాదృశ్యం…

+++

చిత్రమేమిటంటే ముందు పక్షి లేదు.
ఆకాశమే ఉంది.

ఆకాశంతోపాటు ఒక్కోసారి ప్రతీకాత్మకం ఇంకేమైనా ఉన్నయా అని వాటిపై దృష్టి పడినప్పుడు ఆ ఎగిరే పక్షి తట్టింది.

ముందు గుంపులుగా వచ్చాయి. చేయలేకపోయాను. క్షణంలో పారిపోయాయి.
వేచి ఉన్నాను.

ఈసారి రెండు పక్షులు..జంటగా వచ్చి అటొకటి, ఇటొకటి వెళ్లాయి.
తీశాను. కానీ, నచ్చలేదు.

మళ్లీ వేచి ఉన్నాను.
ఒక పక్షి వచ్చింది. మొదట్లో తీశాను.
అదలా వుంచి, ఆ పక్షే ఇలా మధ్యలోకి వచ్చేదాకా వేచి ఉండి తీశాను.
అదే ఇది.

ఇంకో చిత్రమూ చేశాను.
ఆ పక్షి చివరిదాకా వెళ్లాక తీశాను.
ఆ తర్వాత ఆగిపోయాను.

పక్షి లేదు.
బహుశా అదే పక్షి స్వేచ్ఛ.

చిత్రం. అది నా కెమెరా ఫ్రేంలోంచే కాదు, కెమెరా వ్యూ ఫైండర్ గుండా చూస్తుండగా, ఈ భవనం ఫ్రేంలోంచీ పోయింది. నేను బయటకు వచ్చి ఆకాశంలోకి చూస్తే కూడా కానరాలేదు.

అది ఎటో అదృశ్యమైంది.
అదే దృశ్యాదృశ్యం.

మన ఫ్రేంలోంచే కాదు, దృష్టి పథంలోంచి వెళ్లిపోవడమే స్వేచ్ఛనా?
అవుననే అనిపిస్తుంది. అందుకే ఆ చిత్రమూ నచ్చింది.

తీయలేని ఆ ఛాయ…
అదెంత స్వేచ్ఛ! చిత్రమూ!!

+++

ఇట్లా, ముందు మొదట్లో ఒకటి చేశాను.
మధ్యదాకా వచ్చాక ఒకటి చేశాను.
చివరికి వెళ్లాక ఒకటి చేశాను.

చేయడం ఒక స్వేచ్ఛ.

సరిగ్గా పక్షి ప్రధానంగా, అంటే మధ్యలో ఉన్నప్పుడు చేసిన ఈ చిత్రం నా దృష్టిలో ఒక స్వేచ్ఛ.
ఈ చిత్రానికి అందుకే ‘స్వేచ్ఛ’ శీర్షిక.

కానీ ఇంకా చాలా స్వేచ్ఛలు ఉన్నయి అనిపిస్తోంది!
మనకంత స్వేచ్ఛ దొరకదు, ప్రతిదీ చూడటానికి, చేయడానికీ అని!
అందుకే దొరికిందే ‘స్వేచ్ఛ’ అనుకుని మురిసిపోవడమూ ఒక ఛాయ.
అదే చిత్రణం కాబోలు!

+++

కానీ, ‘స్వేచ్ఛ’ను తీశాక, అది మన చూపులో ఇమిడేదే కాదని తెలిసింది.
ఇమడనిదీ ‘స్వేచ్ఛ’ అని అర్థమైంది.

అందుకే ఛాయా చిత్రం అన్నది ఎంత లేదన్నా మన దృష్టి.
అది కేవలం మన దృక్పథం కూడా అనుకోవాలి.

నిజానికి అక్కడ ఆకాశమూ మారుతుంది. పక్షీ మాయమైతుంది.
నిశ్చలంగా ఉన్న ఆ భవనం కూడా వెలుగును బట్టి కాంతివంతమై చివరికి చిమ్మచీకటౌతుంది.
నిదానంగా ఆకాశమూ ఆ చీకట్లో కలిసిపోతుంది. అప్పుడేమీ ఉండదు.
ఉన్నా కనిపించదు. కనిపించని ఆ స్వేచ్ఛ ఎంత నిశ్చయం. అదీ చిత్రమే.
తీయలేని చిత్రం.

అందుకే దృశ్యం అన్నది మన పరిమితి.
మన పరిమిత ఉనికి. సాచినంత మేరా సాగే ఊహాశక్తి, అందినంత అనుభవం.
అంతే.

ఒకానొక పట్ట పగలు తీసిన ఈ చిత్రం అట్లా ఛాయాచిత్రణంలోని స్వేచ్ఛను నాకు నిదానంగా తేటతెల్లం చేయడం ఈ చిత్రం. దృశ్యాదృశ్యం.

అయితే, ఆ భవనం నిజానికి ఆర్ట్స్ కాలేజీ.
చివరి నిజాం నిర్మించిన ఆ గొప్ప భవనం హైదరాబాద్ లోని అపూర్వ కట్టడాల్లో ఒకానొక అద్భుతం.
బెల్జియం ఆర్కిటెక్ట్ జాస్పర్ డిజైన్ చేసిన ఈ నిర్మాణం ఒక చూడముచ్చట. దీని నిర్మాణాన్ని పర్యవేక్షించింది నవాబ్ యార్ జంగ్.

ఇది కాదు విశేషం. విశాలమైన ఆర్ట్స్ కాలేజీలోకి ప్రవేశించేందుకుగాను ఆ భవంతిలోకి వెళ్లేందుకు ఒకటొకటిగా మెట్లెక్కిపోగానే ఒక పెద్ద డోమ్…ఆర్చ్ ఉంటుంది. ఆ విశాలమైన ఆర్చ్ లోకి నడిచాక వెనక్కి తిరిగి బయటకు చూస్తే ఈ చిత్రం.

ఆకాశం, పక్షి.
భవనం. అంతేనా?

కాదు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అస్తిత్వం.
అదే ఈ దృశ్యాదృశ్యం.

ఆ ఆర్చిలోంచి బయటకు చూస్తే, ఒక ఇన్ సైడర్ మల్లే, చూస్తే ఈ పట్నం, ఈ ప్రాంతం, ఈ రాజ్యం. ఉద్యమం. పిడికిలెత్తిన విద్యార్థులు. బలిదానాలు..అన్నీ కళ్లముందు తారాడాయి.
అదొక దృశ్యాదృశ్యం.

కానీ, ఒక చివరాఖరికి ఒక స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛా కాముకత్వానికి ఏదైనా ఒక ప్రతీకగా ఒక చిత్రం చేయగలనా అనుకున్నప్పుడు వేచి ఉన్నాను. ముందే చెప్పినట్టు గుంపులుగా పక్షులు. తర్వాత ఒక పక్షి జంట.

ఎలా చేయాలో అర్థం కాలేదు.

చివరకు ఒక పక్షి ఒంటరిగా కనిపించినప్పుడు వ్యూ ఫైండర్ లోంచి చూస్తూ చూస్తూ ఉండగా తట్టింది. ఇంకా వెనక్కి జరిగి ‘ఆ ఆర్చ్ కనబడేలా చేద్దామా’ అని చూశాను.
చూస్తే ఆకాశం తెల్లబోయి కనిపించింది.

పక్షి లేదు.
మళ్లీ వేచి ఉన్నాను.

ఇంకొక పక్షి ఒంటరిగా వచ్చింది.
ఒకటి చేశాను. మధ్యలోకి వచ్చేదాకా చూసి చేశాను. ఇంకొకటి చివరన చేశాను.

తర్వాత పక్షి ఉన్నది.
కానీ చిత్రం లేదు.

స్వేచ్ఛ.

+++

అవును.
ఫ్రేంలో ఇమడనిది, అందనిది ‘స్వేచ్ఛ’అని అర్థమైంది.
అందుకే నేను ప్లాన్ చేసుకుని చేయను.

అప్పుడప్పుడు ఇలా చేస్తే అసలు ‘స్వేచ్ఛ’ ఏమిటో తెలుస్తున్నది.
అదే దృశ్యాదృశ్య – అందనంత అనుభవంలోకి వచ్చే స్వేచ్ఛ.

 

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

ఇది open university..

drushya drushyam 47ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ sebastiao salgado పంచుకున్న ఒక అనుభవాన్ని మరచిపోలేం.

అదొక పాఠం.

+++2004లో ఆయన ‘Genesis’ అన్న ఒక అరుదైన ఫొటోగ్రఫి ప్రాజెక్టును చేపట్టి 2011లో పూర్తి చేశారు.
అదేమిటీ అంటే, ప్రకృతి ఇంకా వికృతి గాని స్థితి ఎక్కడుందో అక్కడకు పోయి ఫొటోలు తీయడం.

పర్వతాలు, సముద్రాలు, ఎడారులు, మైదాన ప్రాంతాలు…వీటన్నిటినీ సంచరిస్తూ పురాతన, అనాది లేదా ‘ఓం ప్రథమం’ అన్న అంశాన్ని ఇముడ్చుకున్న ప్రకృతిని, జీవజాలాన్ని పరిశుద్ధ స్థితిని తన కెమెరాతో ఒడిసి పట్టుకుని మనకోసం ఆవిష్కరించడం. ఆ పనిలో ఆయన ఎనిమిదేళ్ల సుదీర్ఘకాలం భూగోళంలో సగభాగాన్ని చుట్టివచ్చారు. పని పూర్తయ్యాక ఆయన చెబుతారు, తన ప్రాజెక్టు ప్రారంభంలో తాను నేర్చుకున్న ఒక అపూర్వమైన పాఠాన్ని, అదీ ఒక తాబేలు నుంచి నేర్చుకున్న విధానాన్నితాను ఎంతో బాధ్యతతో వివరిస్తారు.

+++

ఫొటో షూట్ ప్రారంభంలో తాను ముందుగా ఒక తాబేలును ఫొటో తీయాలని నిశ్చయించుకున్నరట.
దానికి ఎదురుగా వెళ్లి నిలబడ్డాడట.
చిత్రం.
దాన్ని తాను ఎంతటి కుతూహలంతో చూస్తున్నాడో అదీ అంతే కుతూహలంతో తనను చూస్తున్నదట.
ఇరువైపులా కుతూహలం.
అప్పుడనిపించిందట! ‘జెనిసిస్’ లేదా ‘సృష్టి…తాను చేయబోతున్న పనికి తాను అలా పేరు పెట్టుకున్నాడు గానీ తాను మళ్లీ ‘సృష్టి’ మొదలుకు వెళ్లవలసిందే అని!
అవును. తన పని ప్రారంభం కావాలంటే తాను చాలా మారాలనీ అవగతం అయిందట.
నిజం. తాను జంతుజాలాన్ని గనుక ఫొటోగ్రఫీ చేయాలంటే ‘నేను మనిషిని’ అన్న భావన వదిలి, సృష్టిలో ‘నేనూ ఒక జంతువునే’ అన్న సంగతిని యాది చేసుకోవాల్సి వచ్చిందట.
తాబేలు వల్ల కలిగిన ఆ మెలుకువతో ఆయన ఫొటోగ్రఫి చేయడం మొదలెట్టి నిజంగానే గొప్ప కుతూహలం కలిగించిండు మానవాళికి. అది అదృష్టమే. తన జీవితంలో ఒక యాభై ఏళ్లు ఛాయాచిత్రణంలో ఉన్నప్పటికీ, ఆ వయసులో మళ్లీ తానొక పాఠం నేర్చుకుంటేగానీ ఒక గొప్ప ప్రాజెక్టు పూర్తి చేయలేనని గ్రహించగలగడం. అదీ తాను ‘మనిషిని’ అన్న స్పృహను కోల్పోవడంతోనే సాధ్యం అని అంగీకరించగలగడం. అదృష్టం.
ఇలాంటి అదృష్టాలు మన ప్రపంచంలో కూడా చాలా అవసరం.

+++

అవును.
మనిషి గురించి ఫొటోగ్రఫీ చేస్తున్నప్పుడు మనిషిగా ప్రవర్తించడం మామూలు విషయం కాదు
ఒక వీధి మనిషిని, చెత్త కాగితాలు ఏరుకునే మనుషులను తీస్తున్నప్పుడు మనదైన ప్రపంచంలోంచి ఆ మనుషులను చూస్తాంగానీ కేవలం మనిషిగా తోటి మనిషిగా వాళ్లను చూడగలగడం కష్టం.

అందుకోసమూ మారాలి.

నా స్వీయానుభవం ఏమిటంటే వారిని ‘అధోజగత్ సహోదరులు’ అన్నభావం నుంచి చూడటం మనం చెరిపేయగలగాలి.
రావూరి భరద్వాజ గారిలా వారిది ‘జీవన సమరం’ అన్న దృక్పథం కూడా వదలాలి.
మనం ‘పైన’, వాళ్లు ‘కింద’ …అన్నఅభిప్రాయమూ తొలగించుకోవాలి..
అంతేకాదు, ‘మనం భద్రజీవులం’ – ‘వాళ్లు కాదు’ అన్న ఆలోచనా కూడదు.

జస్ట్. మనిషిగా ప్రవర్తించడం మంచిది.
sebastiao salgado అనుభవం నుంచి మనం అదే గ్రహించాలి.
జంతుజాలాన్ని చేస్తున్నప్పుడు ఎట్లాగైతే జంతువు కావాలో మనిషిని చేస్తున్నప్పుడు మనిషే కావాలి.
ఎక్కువా తక్కువా వద్దు.

పాఠం అని కాదుగానీ ఒక పరామర్శ.
‘హ్యూమన్ డిగ్నిటీ’ ఎక్కడున్నా దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి.
అప్పుడే వాళ్లూ మనం ఉన్నది ‘ఒకే విశ్వం’ అన్న సంగతి తెలుస్తుంది.
‘తారతమ్యం’ అన్నది ‘ధనికా- పేదా’ అన్నది వాస్తవమేగానీ, నేటి గురించి తెలుసుకోవడం, రేపటి గురించి ఆశ పడటం అన్నది, ఒక కూతూహలం అన్నది ఇంకా సత్యం.

+++

పఠనం. అది దిన పత్రికా పఠనం.
అది దెబ్బతీయని చిత్రం కోసం మనిషిగా ఎంతో హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి.
అప్పుడే ఇలాంటి చిత్రాలు- ఏ న్యూనతా లేని అన్యోన్య చిత్రాలను ఒడిసి పట్టుకోగలం.

నా వరకు నాకు ఈ చిత్రం ఒక ఓపెన్ యూనివర్సిటీ.
ఒక సారస్వత విశ్వవిద్యాలయం.
వీధి బాట  నిశ్చయంగా ఒక విశ్వవిద్యాలయమే.

+++

మన చదువూ సంధ్య సరేగానీ, వాళ్ల జీవన సారస్వతమూ ఒకటున్నదన్న గ్రహింపుతో చేసిన చిత్రం ఇది.
వాళ్లు చెత్త కాగితాలే ఏరవచ్చుగాక. కానీ, అదే వారి దైనందిన జీవితం కాదన్న స్పృహతొ కూడిన చిత్రణ ఇది.
నేటి పేపర్ రేపటి చిత్తు కాగితమే అవుతుంది. నిజమే. అది వారికి ఉపయోగమే కావచ్చుగాక. కానీ, రేపటి విలువ తెలిసిన వాళ్లే నేటి విలువనూ గ్రహిస్తారు. అదే ఈ చిత్రం. అదే వాళ్లనూ, మననూ కలిపే దృశ్యాదృశ్యం. Genesis.

~  కందుకూరి రమేష్ బాబు

ramesh

‘చేప మా కులదేవత’

drushya drushyam 46

రోజూ మనం నడిచే వీధిలో ఒక దృశ్యం ఉంటుంది.

అది సాయంత్రానికి అదృశ్యం అవుతుంది.

మళ్లీ ఉదయం. మరొక ముగ్గు.
అదీ మళ్లీ మాయం.

దృశ్యాదృశ్యం అంటే ఇదేనేమో!
ఉంటుంది, ఉండదు!

దైనందినమూ – నిత్యనూతనం.
అంతే కాబోలు.

కానీ, అదెంత చిత్రం.
మరెంతటి రుజువు.

+++

ఇంటి ముంగిలినే కాన్వాసు చేసుకుని, ప్రతి దినమూ ఒకటి చిత్రించి మళ్లీ రేపు ఉదయం మరొక దానికోసం పాతదాన్ని చెరపడం అంటే…అది నిజంగానే చిత్రలిపి. ఏ ఆధునిక చిత్రకారుడికీ మనసొప్పని చిత్రకళా రహస్యం.

బహుశా అనాదిగా సాంస్కృతిక రాయబారిగా ఉన్న ‘ఒక్క మహిళకు’ తప్పించి ఇంతటి సాహసోపేత కళా సాధన పురుషుడికి సాధ్యం కానేకాదేమో! కావచ్చు. ఇప్పడు ఆధునిక మహిళలూ చేరినప్పటికీ, ఇవ్వాళ్టికీ ఆర్ట్ గ్యాలరీలు ఇంటి ముంగిళ్ల ముందు దిగదుడిపేనేమో!

చెరిపి కొత్తది వేయడం..
వేసింది సృష్టి అనుకోకపోవడం.
అదే దృశ్యాదృశ్యం.

+++

మహ్మద్ ప్రవక్త అనేవారట,. నీటిని నిలువ చేసుకోకూడదని!
చెలిమెలో తవ్వుకుని ఆ ఊటకు దోసిలి పట్టాలట.

బహుశా అంతటి ప్రవక్త తాత్వికత ఏదో మగువ మనసుకు తెలిసే ఉంటుంది.
అందుకే, వారి కళలో పిట్ట ఇంకా ఎగిరి పోలేదు.
పక్షి లేదా ఆ చేప ఇంకా సజీవంగా ఉన్నది.

అందుకే అనిపిస్తుంది,
ముగ్గులు చిత్రకళాధి దేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు
సృష్టి స్థితి లయకు సహజ పర్యవసనాలూ అని!

ఏమైనా, ఆమె నిత్య కళామతల్లి అని!

+++

ఆమె పోట్రేయట్ ( ఫోటో తీస్తుంటే సిగ్గుపడి ...)

ఆమె పోట్రేయట్ ( ఫోటో తీస్తుంటే సిగ్గుపడి …)

పల్లెటూరులోనే కాదు, పట్నంలోనూ ఆమెది అదే ధోరణి.
అడుగడుగూ ఆమెకు కాన్వాసే!
కేవలం హస్తమాత్ర సహాయంతో తనదైన ప్రజ్ఞాపాటవాలతో ఆమె ఉనికి ఒక చిత్కళ.

సౌభాగ్యం, సఫలతలకు నెలవు.
సాంప్రదాయం, సాంస్కృత సౌజన్యం,

తానే ఒక బొడ్డుతాడు.
టోటమ్.

ఒకే ఒక తెరిచిన కన్ను.
కేంద్రకం.మూడు చేపలు.
అవి కాలరేఖలే.గతం, వర్తమానం, భవిత.
అంతే.మా ఇంటిముందరి బెస్త మహిళ సంక్షిప్తత, విస్తృతికి ఈ చిత్రమే నిదర్శనం.
ఆమె ఒక సర్వనామం.
+++ఎంత చెప్పినా, ఆమె సామాన్యురాలే.
తన సృజనాత్మకతకు, కళకు, ప్రతిభకు సరైన గౌరవం ఇప్పటికీ లభించలేదు.
అందుకు ఎవర్ని నిందించాలీ అంటే ముందు నన్నే.అవును.
కొడుకును, భర్తను, సోదరుడిని, స్నేహితుడిని…మొత్తంగా పురుషులందరినీ నిందించవలసే ఉంది.
ఆ నిందను కాస్తంతైనా తొలగించుకునే ప్రయత్నంలో ఒక చిన్న ప్రయత్నం నా చిత్రలిపి.
దృశ్యాదృశ్యం

ఆమె ఇంటి ముందు ఉన్నందుకు మేల్కొన్నాను.
మా ఇల్లు మొదలు అనేక ఇండ్లు కలియ తిరిగాను. ఒకటెనుక ఒకటిగా ముంగిట్లోని చిత్రాలను వాడకట్టంతా తిరగాడ, ఇరుగు పొరుగు గల్లీలు చుట్టుముట్టి, ముషీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా ఒర రెండేళ్లు పనిచేసి చూశాను. చూస్తే, వాళ్ల చేతివేళ్లనుంచి జాలువారే కళను కమ్మటి చిత్రాలుగా మలిచి సంక్రాంతికి ఒక ప్రదర్శన పెట్టాను. అందులో ఈ చిత్రం మకుటం.+++

కానీ, ఈ చిత్రం గురించి పెద్ద ఎత్తున చెప్పాలనుకుని మీడియాకు అర్థం చేయించలేక విఫలమయ్యాను.
ఈ వారం ఆ ప్రయత్నం చేసి మరొకసారి భంగపడాలని ఉంది.

బాలామణి ఈ year (2014) మల్లి అదే ముగ్గు సంక్రాంతికి వేసారు. ఆ చిత్రం క్లోజుప్ షాట్.

బాలామణి ఈ year (2014) మల్లి అదే ముగ్గు సంక్రాంతికి వేసారు. ఆ చిత్రం క్లోజుప్ షాట్.

అవును. నిజం.
ఎంత చెప్పినా…జరిగేది పెద్దగా లేకపోయినా ప్రతిసారీ భంగపడి, అలసిపోతూ కూడా మళ్లీ పని చేయబుద్దవుతుంది.
అందులో ఒక బాధ, తృప్తీ.

నిజమే మరి. ఒక రకంగా ఛాయా చిత్రలేఖనమూ మగువల ముగ్గువంటిదే, నా వరకు నాకు.
ఏ ఉద్దేశ్యం ఉన్నట్టు లేకుండా ప్రజల్ని, వారి జీవనచ్ఛాయల్ని చేసుకుంటూ వెళ్లడం అన్నది ప్రతిరోజూ వాకిలి ఊడ్చి అలుకు చల్లి ముగ్గు పెట్టడం వంటిదే.
ఆ పని ఒకటి నిత్యం జరగాలి.
దైనందిన అవసరం, శోభ.

+++

మహిళలు చేస్తున్నది అదే. నిజానికి వారు ఎన్నడూ ఏదీ ఆశించరు. ప్రశంస కూడా కోరుకోకుండా పనిచేస్తరు.
వాళ్లనుంచి ఇంకా నేర్చుకోవలసింది ఉందనుకుంటూనే ఈ చిత్రం గురించి ముఖ్యంగా మూడు మాటలు.

+++

స్త్రీ తన మనోభావాలను, ఆకాంక్షలను ఎట్లయితే చిత్రలిపితో రంగరిస్తుందో అట్లే ఒక సామూహిక అస్తిత్వాన్ని, సాంస్కృతిక ఉనికిని కూడా అపూర్వంగా చిత్రీకరిస్తుందన్న భావన కలిగింది. అందుకు ఈ చిత్రమే ఆధారం.

మూడు చేపలు.
అవును. మా ఇంటిముందువే.
హైదరాబాద్ లోని పార్సీగుట్టలో, గంగపుత్ర కాలనీలో నివసించే బాలమణి గారు వేసిన ముగ్గు ఇది.

ఆమె బెస్తామె. ‘ఒకే కన్ను…మూడు చేపల’ ఈ ముగ్గును తాను స్వయంగా ఊహించి చిత్రించిందట.
పదేళ్ల క్రితం తొలిసారి వేసిందట.
అప్పటినుంచి ఆమెను చూసి కొందరు, ఇంకొందరు.
మా కాలనీలో అనేక చేపలు ఇట్లా వాకిట్లో కనిపిస్తుంటే, వాళ్లంతా గీస్తుంటే అందుకు కారణం ‘మా ఎదురింటి పెద్ద మనిషి’ అని తెలిసి ఆశ్చర్యం.
అదే ఆశ్చర్యంతో వెళ్లి అడుగగా, అందులో ఏ విశేషం లేనట్టు చిన్నగా నవ్వింది.

‘ఇది మీరే సృష్టించారా?’ అని ఆశ్చర్యపోతూ అడిగితే, ‘సృష్టికాదు’ అని అంది.
‘మనం దేన్నయినా సృష్టించగలమా?’ అనీ అన్నది.
ఆ మాట అంటూ,  ‘మేం గంగపుత్రులం’ అన్నది.

+++

‘చేప మా కులదేవత’ అన్నది.
‘చేపల్ని మనం సృష్టిస్తమా?’ అనీ అన్నది.

+++

చాలా తక్కువగా మాట్లాడింది.
ఆ మాటల్లో తాను నిలుపుతున్న సాంస్కృతిక అస్తిత్వం, చాటుతున్న ఘన వారసత్వం …ఇవేవీ కానరాలేదు. ఒక మహిళ ఉన్నది. జానపదం అని అనడం ఇష్టంలేదు. ఆధునీకమూ అనలేను. జీవితమంత భక్తితో, ప్రేమతో ఆమె అన్న మాటలతో మనుషులను అంచనావేసుకునే ప్రయత్నానికి స్వస్తి పలకబుద్ధయింది.
అంతే.

+++

ముఖాముఖి అన్నది రద్దయింది.
సుముఖం. అంతే.

+++

04

ఆమెనూ, ఆమె ముగ్గునూ చూస్తుంటే అది ప్రదర్శన కాదని తెలిసింది.
ఒక అంతర్వాణి అని తెలిసింది.
చెప్పలేను. తెలియనివేవో అన్నీ అర్థమైన రీతి.
ఏ విశేషమూ లేని సహజత్వం తాలూకు విశిష్టత ముందు మోకరిల్లడం తప్పా మరేమీ వదిలించుకోలేని స్థితి.

స్వల్ప రేఖలే. కానీ, తమ జీవికకు మూలమైన అనాది ఛాయను ఆమెను భద్రపరచిన తీరుకు ముగ్దుడినై మౌనం దాల్చి,  దాని దృశ్యాదృశ్యాలను…గతాన్ని, భవితనూ, వర్తమానాన్నీఒకే కన్నుతో కలుపుతున్నట్టు ఆమె చిత్రంచి వాకిట్లో వుంచిన తీరుకు, చూసిన అనుభవంతో ధన్యుణ్నే అయ్యాను

+++

సరిగ్గ సంక్రాంతి రోజున ఆమె ఈ చిత్రం వాకిట్లో గీసింది.
ఆ రోజు అందరి వాకిళ్లలో రథం ముగ్గు ఊరేగుతుండగా బాలమణి గారి ఇంటి ముందు మాత్రం ఈ ‘మత్య్సం’ మూడు పువ్వులుగా ఆగుపించి ఆ ఇంటికి సిసలైన సంపద ఏమిటో చాటింది.

అంతే.
అంతకన్నా ఏమీ లేదు.

ఆమెను చూడటం కాదు, ఆమె ముగ్గును చూడటమూ కాదు, పదులు, వందలు, వేలు, లక్షలు, కోటానుకోట్ల మత్యకారుల జీవన సమరమూ, వారి జీవన లాలసా- బాలమణి గారి మునివేళ్ల నుంచి ఇట్లా అలవోకగా, ముగ్గు పిండి ద్వారా జాలువారి ఒక సాంస్కృతిక చిహ్నంగా ఆ ఉదయం శోభిల్లడం మినహా మానవేతిహాసంలో ఆ రోజుకు ఇంకో ప్రత్యేకత కనిపించలేదు.

అంతే.
అదే సంక్రాంతి.

ఆ తర్వాత ఆ చిత్రం అదృశ్యం.
అదే ఈ వారం దృశ్యాదృశ్యం.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

ఉద్యమాలకూ అవే పనిముట్లు!

DRUSHYA DRUSHYAM 45

ఒక్కోసారి కొన్ని చిత్రాలు అసలు వాస్తవికతను సరిపోల్చి పిదప వచ్చిన ప్రతీకలను పూర్వపక్షం చేస్తయి.

అది సుత్తీ కొడవలి కావచ్చు, ఇంకొకటి కావచ్చును.

పనిముట్లే. కానీ, ఉద్యమ ప్రతీకలే అయ్యాయి.
విచారం ఏమిటంటే, ఉద్యమాలకూ అవే పనిముట్లు కావడం.

వీళ్లా వాళ్లా అని కాదు…
అందరికీ పనిముట్లే కావాల్సి వచ్చాయి.

చిత్రమేమిటంటే, కెమెరా ముందు ఎవరైనా, ఏదైనా ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది.
ఏది బతుకో ఏది సమరమో అర్థమయ్యి కానట్లు కానవస్తుంది.

తెరతీయ వలసిందేమీ లేనంతటి చిత్రం బహుశా ఛాయాచిత్రణం వల్ల కానవస్తుంది.
అదొక అదృష్టం.

+++

అది ఎవరైనా కానీ, ఉద్యమం ‘ముందు’. మనుషులు ఆ ‘తర్వాత’ అన్నట్లు చేశారు.
‘ప్రజలు’ కాదు, ‘నాయకులే’ ముందు అన్నట్లూ చేశారు.

కానీ అచ్ఛమైన జీవితం ఇట్లా తారాడుతుంది.
పనిముట్టుగా.

ఈ చిత్రం
ఎవరి పని వారిదే అని కూడా చెబుతుంది.

అది సుత్తికొడవలి కావచ్చు ఇంకొకటి కావచ్చు..
ప్రజల చేతుల్లోంచి తీసుకున్న ఆయుధాలు ఎవైనా కావచ్చును.
అవి ఎక్కడికి పోయినా ఉండవలసిన వాళ్లకు ఉండనే ఉన్నయి.
అది కూడా చెబుతుంది చిత్రం. నిజం.

నిజం.
జీవితం మాత్రం ఎక్కడిదక్కడే ఉన్నది.
పనిముట్టుగా…

– కందుకూరి రమేష్ బాబు

ramesh

on death

death of a cat

on death……………………..

అనిపిస్తుంది.
ఒక కన్ను మూసి ఇంకో కన్ను తెరిచినప్పుడు జీవితం నిశితం అవుతుందని!
అట్లని అన్నీ కానరావు. ముఖ్యంగా మృత్యువు.

+++

అనిపిస్తుంది.
అన్నీ చివరికంటా తెలుసుకోవడమే మృత్యువు అని!
కానీ, కాదు.

లేదా తెలుసుకోక పోవడమా అనిపిస్తుంది.
అది కూడా కాదు.

ఏదీ వదలకపోవడమే మృత్యువు.
అందుకే జీవిని పట్టుకుంటుంది.
జీవితం కడదాకా వెన్నాడుతుంది.

పట్టు. అదే మృత్యువు.

అది లేని జీవితం కల్ల.

+++నేనైతే ఏదీ వదలను.
రోడ్డు మీద పాద ముద్రలను, పాదాలను.
ఆకులు అలములను, అన్నీనూ.

ఒక పక్క పోగు చేసిన చెత్తను, అట్లే ఆ పక్కనే ఉన్న ఒక రాలిన ఆకును, ఇక ఆ నల్ల పిల్లి పార్థివదేహాన్ని.
అవును. చీకటిని, ఆ పిల్లి వాల్చిన కన్నుల మరణించిన వెలుగును. దేన్నీ వదలను.

నేను మృత్యువును మరి.

+++

నేను యమపాశాన్ని.
జీవితం పట్ల అపరిమితమైన ప్రేమను.
అంతే దయచేసే మృత్యువును నేను.

జీవితాన్ని అనుక్షణం గ్రహించే దీర్ఘదర్శిని, సూక్ష్మదర్శిని నేనే.
నేను ఛాయా చిత్రాన్ని. బతుకులోని విశ్వదర్శనాన్ని.

కనురెప్పలు కాదు, ఒక కన్ను మూసి ‘చేసే’ జీవితాన్ని.
ఖండఖండాల చిత్రణలతో కలిపే విశ్వంభరాన్ని.

నేనొక దున్నపోతును. భుజానా కెమెరా పాశాన్ని.
ఇక నేను నిశ్చయంగా విధిని. నా ధర్మం నన్ను నిర్వహించనీయండి.

+++

చిత్రమేమిటంటే జీవన లాస్యనర్తనాన్ని, మృత్యువు పరిహాసాన్ని నేను దారి పొడవునా గమనిస్తూనే ఉంటాను.
వింటూనే ఉంటాను. అవును. చూస్తున్నారుగా. నేను ఇలాగే చూస్తాను. చిత్రిస్తాను.
ఎవరైనా అది మృత్యువనే అనుకుంటారు. కానీ, చూస్తే అది శవం.

నవ్వొస్తుంది.నేను జీవితం వెంట పడతాను.

మృత్యువును మరి.
+++ఇక్కడే కాదు, ఎక్కడైనా వట్టి శవమే ఉంటుంది.
అంత్యక్రియ అంటే ఆఖరి దృశ్యం. అటువంటిదే ఇది.
అయితే అది ఆదిఅంతాల మధ్య ఎడతెగని దృశ్యం. దృశ్యాదృశ్యం.
అది మృత్యువు కాదు.

+++

చివరగా మళ్లీ మొదలు.
జీవం వొదిలిన దశ అయితే కాదు, మృత్యువు అంటే.
పోనీ, చీమలు పట్టినప్పుడు కనిపించేది మృత్యువు కానే కాదు,
అది కేవలం మృత కళేబరం.

+++

death వేరు, dead body వేరు.
అదే దృశ్యాదృశ్యం.+++

అవును. నడుస్తుంటే కాలికి తగిలే దృశ్యాలెన్నో…
కానీ, అవి చనిపోయినప్పుడు లేదా మరణించినప్పుడు కనిపిస్తే అది మృత్యువనే భ్రమ.
వాస్తవానికి వాటిని చిత్రించడం ఎట్లాగో తెలియాలంటే చనిపోయిన చోట కాదు, జీవించిన చోటే వెతుకులాడాలి.
జీవన సమరంలో అనుక్షణం పిల్లినే కాదు, ఎలుకనూ చూడాలి.
అదే మనిషి విధి.

let me live.

~ కందుకూరి రమేష్ బాబు

ఆ పిల్ల చూస్తూనే ఉంటుంది!

drushya drushyam 43f

హైదరాబాద్ లో లక్డీ కపూల్ నుంచి మసాబ్ ట్యాంక్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు వీళ్లు మీకు కనబడే ఉంటారు.
బాధపడే ఉంటరు. కానీ, వీళ్లనే కాదు, ఎవరినైనా, అంధులను చూసినప్పుడు ఇబ్బందే.
కాకపోతే కొన్ని తప్పవు. చిత్రించడం కూడా తప్పదు.

నిజానికి ఈ చిత్రంలో ఎన్ని ఉన్నా, ‘యాచించే చేతులు’ అన్నశీర్షికను మాత్రం ఆ రోజే పెట్టుకున్నాను.
అవి ఎవరివైనా సరే, మనం ప్రయాణిస్తున్న వీథిలో యాచించే చేతులు విస్తరిస్తూ ఉంటే అది యాతనే.
అందుకే, ఒకానొక యాతన నుంచి ఈ వారం.

+++

వీళ్లిద్దరికీ కళ్లు లేవు. కానీ, ఆ బిడ్డ వాళ్లిద్దరినీ ఇంటినుంచి తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతుంది.
ఇక వాళ్లు చేతులు చాపుతారు.

+++

వచ్చే పోయే జనం దయతలచి వాళ్ల చేతుల్లో రూపాయో, రెండు రూపాయలో వుంచుతారు.
చేతులు చాపి వేయలేనప్పుడు వాళ్ల కాళ్ల దగ్గరకి విసురుతారు.

అప్పుడప్పుడూ ఈ బిడ్డ వాళ్లతోనే, ఇలా మధ్యలో కూచుండి ఆడుకుంటూ కనిపిస్తుంది.
కింద పడ్డ నాణాలను ఏరుకుని జాగ్రత్త చేస్తుంది. మరుక్షణం తన ఆటలో తాను మళ్లీ నిమగ్నం అవుతుంది.

డబ్బులు కాదు విశేషం, ఆ బిడ్డ.
అవును. అక్కడ్నుంచి దూరంగా వెళ్లినా దాని గురించే మనసు బెంగటిల్లుతుంది.

బహుశా చిన్నప్పటి నుంచే దానికి చూపు ఉండి ఉంటుంది.
అది దృష్టి కాదు. చూపు. అవును. ఆ చూపుతో తల్లిదండ్రుల అంధత్వాన్ని ఆ పాప చూస్తూ ఉంటుంది.
అంధులుగా వాళ్లు చేయి చాపినప్పుడు మనుషుల కళ్లల్లో కనిపించే జాలి చూపులనూ ఆ పిల్ల చూస్తూ ఉంటుంది.
కానీ, అనిపిస్తుంది, ఒకరి వైకల్యం ఇంకొకరిని కూడా సెన్సిటివ్ చేస్తుంది కదా అని!
ఇక్కడ ఇద్దరి వైకల్యం ఆ బిడ్డను ఎంత సెన్సిటివ్ చేసిందో అనిపిస్తుంది.
లేదా ఆ బిడ్డను ఇంకెంత బండబారేలా చేసిందో కదా అని భయమేస్తుంది.

బండి దిగి ఆ మాట అడగాలనే ఉంటుంది.
కానీ, ఆ మాట మాత్రం ‘పాపను ఇబ్బంది పెట్టదా’ అనిపించి అడగటం మానేస్తూ ఉంటను.

+++

ఎందుకో చాలారోజులు ఆ దారిలోనే వెళ్లినా చాలా ఆలస్యంగా వాళ్లను చూశాను.
చూపు వేరు, దృష్టి వేరు.

ఏడాది క్రితం,  ఒకానొక ఉదయం వాళ్లను చూడగానే ఎందుకో ‘Statue of Liberty’గుర్తొచ్చింది.
ఆకాశం వంక చేతులు చాపి నిలబడ్డ ఆ స్వేచ్ఛా దేవత ప్రతిమ తలంపు కొచ్చింది.
నిజం. వీళ్లూ ప్రతిమలే. ఆ కదిలే బొమ్మ పాప తప్ప!
కదలక మెదలక వాళ్లట్లా నిలబడితే అది యాతన.
కానీ, తప్పదు.

వారు స్వేచ్ఛా దేవతలే కావచ్చు. కానీ. స్థాణువైన స్థితి కదా అనిపించింది.
ఒక వైకల్యం చాలు కదా, స్వేచ్ఛ నుంచి దూరం జరిగి యాచనలో పడటానికి అనిపించింది.
కెమెరా గుండా చూస్తుంటే గుండె లయ తప్పింది. ఆ చేతులు…విస్తరిస్తున్నట్టనిపి

ంచే ఆ చేతులు.ఆ విచారం ముప్పిరిగొని ఉండగానే చాలా యాంగిల్స్ లో ఫొటోలు తీశాను.
ఏ చిత్రం ఎంత మంచిగా కంపోజ్ చేసినా ‘ఆ చేతులే’ నన్నుకట్టి పడేసాయి.
లాంగ్ షాట్లో…అమ్మా నాన్నా..వాళ్లిద్దరూ అట్లా స్టిక్స్ను ఆసరా చేసుకున్నప్పటికీ, అలా వాళ్లు ఆ చేతులు చాపే దృశ్యం ఎంతో యాతన పెట్టింది.
చిత్రమేమిటంటే, మధ్యలో కూచున్న ఆ పాపాయి ‘నేనే’ అనిపించడం.అవును. ఆ పాప ఒక కాగడా.
లిబర్టీ స్టాచ్యూ చేతిలో ఎప్పుడూ ఒక టార్చ్ వెలుగుతూ ఉంటుంది.
ఆ వెలుగు దివ్వె… కాగడా…ఈ పాపే అనిపిస్తుంది.
లేదా ‘నేను’ అని కూడా అనిపించింది.

+++

నేను.
నా పనిలో తలమునకలై ఉన్న’నేనే’ అనిపించింది.
ఒక్కోసారి తలెత్తి వాళ్ల బరువూ బాధ్యతలూ పంచుకునే ‘నేను’ అనే అనిపించింది.

ఎంతైనా, మనకో లోకం ఉంటుంది. ఆ పాప ఇవ్వాళ చిన్నది. కానీ, దానికో లోకం తప్పక వుంటుంది.
రేపురేపు… దానికి వీళ్లిద్దరినీ విడిచిపెట్టి బతికే రోజూ వస్తుంది. కానీ, ఎక్కడున్నా ఏం చేసినా మనసులో ఒక అప్రమత్తత…’వాళ్లకు తన అవసరం తప్పదు’ అన్న గ్రహింపుతో కూడిన వ్యాకులత.
అది బాధిస్తూ ఉంటుంది. అదే ‘నేను’.

ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డే కానక్కరలేదు. ఎవరైనా కావాలి.
ఆ ‘నేనే’ ఆ ‘ఎవరు’.

ఆ బిడ్డ వాళ్లిద్దరి మధ్యనుంచి తల పైకెత్తి వాళ్లను ఓసారి పరికించినట్టూ ‘ఎక్కడో’ ఉండగా సాధ్యం కాదు.
అలా సాధ్యం కానప్పుడు తలదించుకోవడమే ఉంటుంది.
నాకు మల్లే.

అవును. ఏం చేసినా చేయకపోయినా సామాన్య ప్రపంచం పట్ల ఒక ఇష్టం. బాధ్యత.
కానీ, ప్రతిదీ అటెండ్ చేయలేని స్థితి గురించిన విచారం.

ఆ బిడ్డ కావచ్చు లేదా ఇంకొకరు.
ఒకసారి ఒకరు. ఇంకోసారి ఇంకొకరు.
ఒక్కొక్కరూ ఒకచోట తమ బాధ్యతను విస్మరించకుండా గుర్తు చేసేటందుకే ఈ బిడ్డ, తల్లీదండ్రుల దృశ్యం.
దృశ్యాదృశ్యం.

~ కందుకూరి రమేష్ బాబు

మన అసలు సిసలు ‘నాయిన’!

drushys drushya 42William Wordsworth అన్న ఆంగ్ల కవి రాస్తడు. నా హృదయం ఆనంద తాండవం చేస్తుందని.
పిల్లల్ని చూసినప్పుడు సింగిడిని చూసినంత ఆనందం అని! దాన్ని గుండెల్లో పొదువుకున్నప్పుడు, అప్పుడు గెంతులు వేసే హృదయమే ప్రమాణం అనీ!
ఆ హృదయోల్లాసం అన్నది మరేమిటో కాదు, పిల్లవాడినవడమే అనీనూ!పిల్లవాడిగా ఉన్నా పెద్దవాడిగా ఎదిగినా ఇదే అనీ!
అదీగాక., ఏనాడైతే ఆ ఆనందాన్ని పొందలేడో, అప్పుడు పెద్దా చిన్నా అన్న తేడా లేదు, ఇక అదే మృత్యువూ అని}

అప్పుడే రాస్తడు. ఆ పాపాయి లేదా ఆ పసివాడు ‘నేనే కాదా’ అన్నంత ఆనందంలో రాస్తాడు.,
రేపటి పౌరులకు మూలం నేటి బాల్యం అని, మానవ నాగరికతకు పిల్లవాడే తొలి ముద్దూ, మురిపెమూ అనీనూ.

+++

My heart leaps up when I behold
A rainbow in the sky:
So was it when my life began;
So is it now I am a man;
So be it when I shall grow old,
Or let me die!
The Child is father of the Man;
And I could wish my days to be
Bound each to each by natural piety.

+++

ఈ చిత్రమూ అదే.
అంతే.

ఆ పాప ఉన్నది చూడండి.
అది పాపాయేనా?

దాని కన్నులు…ముఖ్యంగా ఆ కన్ను…ఆ కనుగుడ్డు..
అది పాపాయిదేనా?

చిత్రమే. విస్మయం.
దాని కన్ను చిత్రమే.

అది పెద్దమనిషిలా చూస్తుందనే విస్మయం.

విశేషమే.

నిశ్చయంగా, నిమ్మలంగా, తల్లి ఒడిలో ఆ తండ్రి లేదా బిడ్డ…
అది పసికూనలా మాత్రం లేదు.
లేదా ఆ పసిగుడ్డులో ఎంతమాత్రం లేని ఒకానొక వయోభారం….
జీవితాన్ని స్థితప్రజ్ఞతతో విచారించే, పరిశీలించే ఏదో ఒక వివేకంతో  కూడిన ప్రవర్తన…ఎటో చూస్తుండగా ఇది కానవచ్చింది. చప్పున ఈ చిత్రం బందించాను…
అదీ నిన్నా ఇవ్వాళా కాదు, గత ఏడాది.
ఒకానొక వీధిలో…ఒకానొక పిల్లవాడినై. తండ్రినై- అకస్మాత్తుగా.

చూడగా చూడగా అది నా తల్లి… తండ్రి అనిపిస్తూ ఉన్నది.
ఒక గమనింపులో అది గమనింపయింది.

తాతముత్తాతలు.
ఆదమ్మ, ఈదయ్య..అందరూ దాని చూపుకేసి చూడాలి.
విస్మయమే. చిత్రమే.

అందుకే కవి కావలసి వచ్చింది నాకు.
చిన్న పద్యమే రాసిండు గానీ, అదీ చిత్రమే.
ప్రకృతిలో దినదినం ఒక ఆకాంక్ష. కానీ, చెరగని ఆకాంక్ష బాల్యం అని, దానికి వినమ్రంగా ఒక గంభీరమైన కవిత్వం కానుకగా అందించి వెళ్లిండు ఆయన.

+++

అనుకుంటాం గానీ, ఆ మహాకవి చెప్పినట్టు ఎప్పుడూ పిల్లవాళ్లమై ఉండటంలోనే జీవితం దాగి ఉన్నది. మరణం అంటే పెద్దవాడవటమే.
అందుకే…తండ్రీ… ఈ విశ్వంలో… మానవేతి హాసంలో…బిడ్డా…మన అసలు సిసలు ‘నాయిన’ ఎవరయ్యా? అని గనుక మీరెవరైనా గనుక ఒక ప్రశ్నార్థకం వంటి మొఖం పెట్టి చూశారా… నేను ఈ చిత్రాన్నే మీ ముందుంచుతాను.

ఇంతకంటే ఇంకేమీ లేదు.
కను-బొమ్మ. అంతే.

పిల్లలే ప్రాణం అని, సమస్త జీవితానుభవానికి బాల్యావస్థే అపూర్వ అనుభవ చ్ఛాయ అనీ చెప్పడమూ వృధా ప్రయాసే.

మీ హృదయం గంతులు వేసే ఆ అనుభవానికి పిల్లలు తప్ప ఇంకే ఇంధ్రధనుస్సూ సరిరాదు.
మరే రచనా ఆస్వాదనా చెల్లదు. ఇంకే విధమైన చరిత్ర మరణసాదృశ్యమే అని వ్యాఖ్యానించడమూ అనవసరమే.

అందుకే ఈ బొమ్మ- కనులారా చూడమని.
దృశ్యాదృశ్యం.

మరి అభివాదం.

 ~ కందుకూరి రమేష్ బాబు

చీకటి

DRUSHYA DRUSHYAM 41

చీకటి
……………

‘చీకటి కరేల్మని కదులుతుంది’ అంటాడు తిలక్.
ఒంటరి ప్రపంచంలో, ఏకాంతంలో ఇది మెదులుతుంది, ఎందుకో!

+++

తెలియదు గానీ ఒకానొకసారి ఎందుకో మేలుకుంటుంది నిద్ర.
లేచి అటూ ఇటూ తిరుగుతుంటే ఒక శునకం ఆవళించుకుంటూ వెళుతుంది.
లేదా నీలి నీడల్ని కాల్చుకుంటుంది లోలోనే.

అర్థం కాదు. లోపలి కోర్కెలు అలా రెక్కలు చాపుకుని మృగంలా సంచరిస్తాయా? అంత తేలిగ్గా అర్థం కాదు.
లేక నీడ రూపం ధరించి అదట్లా నాలుగు కాళ్ల జంతువై మనిషే అలా సంచరిస్తాడా? తెలియదు.
కానైతే, ఒక్కోసారి మనిషి తనను తాను పశువులో చూసుకుంటూ ఉంటాడేమో!

ఒక రాత్రి. రెండింటికి…గేటు బయటకు చూస్తే ఇది.
అది నిదానంగా నడిచి వస్తుంటే లోపలికి…లోలోపలికి వెళ్లినట్లు వెళ్లి,
నా నుంచి మీ అందరికీ పంచి పెట్టేందుకా అన్నట్టు నాలోని సామాజికుడు మళ్లీ నిద్రలేచి కెమెరా చేతబట్టాడు.
తీసి, దీన్నిలా తీసి పెట్టాను ఒకసారి.

నాకైతే ఇదొక చిత్రం. ఆ రంగు, చ్ఛాయా…అంతా కూడా ‘కొర్కె’ అనిపిస్తుంది.
కామమూ అనిపిస్తుంది. బహుశా చిత్ర ప్రవృత్తిలో మానవీయ అనుభవంలో అమానుషంగా ‘ఇదీ’ ఒకటి దాగి ఉంటూనే ఉంటదేమో!

చూసినప్పుడల్లా బహుశా ఏదైనా ఒక అంతర్జాతీయ పోటీకి పంపదగ్గ ఫొటో ఏమో అని అనుకున్నాను… దీన్నొకసారి.
ఎందుకూ అంటే, దాచుకుని బతికే భారతంలో ఇది అదృశ్యం. దాటిపోతేగానీ ఈ దృశ్యానికి సరైన అర్థం కానరాదని కాబోలు.

+++

ఏమైనా, ఒక్కోసారి అదృశ్యమైన దేహరాగాలని దృశ్యమానం చేసే చిత్రాలూ మనలోనే పుడతాయి.
నిజం. అందులో ఇదొకటని నా భావన.

గమనిస్తారని, మన లోవెలుపలా దాగే కోటి దహనాల కాంతిని ఇముడ్చుకునే చిమ్మ చీకటి మన ముందే ఇట్లా సంచరిస్తుందని, దాన్నిఒడిసి పట్టుకునేందుకే ఈ చిత్రమని నమ్ముతారనే ఇది.
ఈ వారం. చీకటి కరేల్మని…

~ కందుకూరి రమేష్ బాబు

అలసిన వేళల చూడాలీ…

drushya drushyam 40

నీడ గురించి మాట్లాడుకుంటాం ఫొటోగ్రఫీలో.
వెలుగుతో పాటు నీడ గురించి ఎంతైనా చర్చించుకుంటాం.
సరికొత్తగా అర్థం చేసుకునే ప్రయత్నమూ చేస్తాం.

కానీ, మనల్ని వెంటాడేది నీడ మాత్రమేనా?
కాదు. విశ్రాంతి కూడా.

నిజం. జీవితాన శ్రమతో పాటు విశ్రాంతీ ఒక వెలుగు. అది నీడలా వెన్నాడుతూనే ఉంటుంది
లేదా సమ్మిళితమై జీవితం పొడవునా నిశ్శబ్ద రాగాలు ఒలుకుతూ ఉంటుంది.
వాటిని పట్టుకున్నఒకానొక బంగారు క్షణం ఈ చిత్రం.

ఒకపరి చూసి, మళ్లీ చదవరారండి,.

+++

మీకు తెలియంది కాదు. కానీ చెప్పడం. నిజానికి శ్రమైక సౌందర్యం అంటం. అది కూడా కేవలం శ్రమ గురించి మాత్రమే కాదు! అది విశ్రాంతిలో విరిసే ఇంధ్రధనుస్సే. విశ్రాంతి నీడన పెరిగే కానుగ చెట్టు నీడ కూడా.
ఈ తల్లి చిత్రం అదే.

ఇది ఒక మిట్ట మధ్నాహ్నపు జీవన చ్ఛాయ.
మనందరం కార్యాలయాల్లో ఉండగా, కార్యభారం నుంచి వైదొలిగిన ఒక చిన్నపాటి కునుకు.
నీడ. ఒక స్వప్నలిపి. అలౌకిక ధార.

ఇంకా చెబితే, ఒక తెలంగాణ తల్లి.
పనంతా అయినాక జారగిలబడి, నిమ్మలంగా సేదతీరిన ఒక ‘అమ్మ’ నవల.
ఒక అత్తమ్మ లీల. ఒక గృహిణి స్వతంత్రంగా ఊపిరి తీసుకునే జీవన లాలస.

+++

చిత్రం ఇంకా చాలా మాట్లాడుతుంది.
చూస్తూ వుంటే చదవనక్కరలేదు. చదివి చూస్తే కూడా కొత్త చిత్రమే.

స్థలం గురించి కూడా చూడాలి.
ఆమె అట్లా ఒరిగినప్పుడు ఆ ఇల్లు కాస్త ఎత్తుమీదన ఉన్నది.
నాలుగు గజాల దూరం నుంచి తీశాను. నా ఎత్తున ఉన్నది ఆమె తల.
దగ్గరకు వెళ్లితే కొంచెం వొంగిని తీయాలి. కానీ, ఉన్నచోటు నుంచే, చూసిన కాడనుంచే తీశాను.
తర్వాత మళ్లీ ఏమి తీసినా ఇంత విశ్రాంతి ఉండదు.
అందుకే వెనుదిరిగాను.

+++

అయితే, మళ్లీ చూశాను.
ఆమె ఒరిగిన గడప, కిందన ఉన్నది అరుగు. అవును. అది ఎత్తైనది. కిందుగా అటూ ఇటూ మెట్లు.
నడుమ మళ్లీ కాసింత జాగా. అక్కడ ముగ్గు. తర్వాత గడప. ద్వారం. దాటితే మల్లెసార. ఇంకా అన్నీ.

ఇల్లు అంటే అన్నీ.
స్త్రీ నిర్మాణ కౌశలం.

ఇక్కడ అన్నిటికీ అంతటా ఒక నిర్మాణం ఉన్నది.
ప్రతి దానికీ ఒక వాస్తు ఉన్నది. అన్నిటికన్నా మిన్నకళ ఉన్నది. ఆమే ఉన్నది. కళావతి.
బయట ఉన్నఇంట్లో లేకపోవచ్చు. కానీ, నా లెక్కన ఆమెనే వెలుతురు. వెలుగు…నీడా.
ఇక భయం లేదు.

ఆమె ఒక ఇల్లాలు.
బహశా కోడలు… కాదు కాదు… అత్తమ్మ లేదా తల్లి.
నిర్వాహకురాలు.

తనకు పిల్లల భారం తీరవచ్చు, తీరకనూ పోవచ్చు.
కోడలూ రావచ్చు రాకనూ పోవచ్చు. కానీ వయసు మీద పడ్డా పడకపోయినా ఆమె ఒక ఇల్లు.
తనంతట తాను ఒక సౌందర్యం. పోషణ. సాంస్కృతిక సౌజన్యం.

ఇవన్నీకానవస్తుండటం ఈ చిత్రం మహిమ.
ఈ చిత్రాన్ని బంధించినాక ఒక తృప్తి.

+++

నిజానికి ఆ తల్లి కాసేపు అలా ఒరిగింది గానీ, బహుశా ఆమెకు కన్నంటుకున్నదిగానీ, అదమరచి నిద్రపోలేదు. ఏమరుపాటుగానే ఉన్నది. అందుకే, ఆమె దర్వాజ దగ్గరే గడప మీదే తల వాలుస్తది.

ఒక చేయి ఇల్లు.
ఇంకొక చేయి వాకిలి.

ఆ చేతి గాజుల సవ్వడి…అది జీవన సంగీతం.
ఇలాంటి ఘడియలో ఆ గాజుల నిశ్శబ్దం…అదీ సంగీతమే.
కొమ్మమీది ఒక సీతాఫలం వంటి చేయి.
ఒక మధుర జీవన ఫలం తాలూకు గాంభీర్యం.

కష్టమూ సుఖమూ…
అక్కడే ఇంటిద్వారం మధ్యే నడుం వాల్చడంలో ఒక ధీమానూ…
ఇవన్నీకానవస్తుంటే ఇంటిముఖం పట్టాను.
ఇంట్లోకి వెళితే మళ్లీ ఆమె.
ఇంకో స్త్రీ.

అప్పుడర్థమైంది. అంతటా ఉన్నదే.
చూడగా తెలిసిందీ అని!

బహుశా ఒకసారి చూడాలి.
తర్వాత ఆ చూపు మనల్ని విస్తరింపజేస్తుందేమో!

ఇదలా వుంచితే, మళ్లీ ఆ చిత్రం.

+++

అలంకరించబడ్డ గడప. పసుపుతో వేసిన చిత్రలిపి. పక్కన ఏదో మొక్క. చేతులకు నిండైన గాజులు.
అవిశ్రాంతగా పనిచేసే మనిషని చెప్పకనే చెప్పే ఆ బంగారు తల్లి కన్నుల చుట్టూరా క్రీనీడలు. వలయాలు.
అయినా శాంతి. విశ్రాంతి.

నాకైతే ఎందుకో ఒక వేపచెట్టు రెల్లలులా ఆమె శాంతిని పంచుతున్నట్టనిపించింది.
బహుశా ఇది బోనాల సమయం కదా… అందుకే ప్రకృతే అలా సేద తీరిందా అన్నప్పటి చిత్రం లాగున్నది.
అంతకన్నా ముఖ్యం, ఆమె అమ్మవారిలా అలా ఒరిగి కనిపించింది.

ఈ రీతిలో తల్లి దర్శనభాగ్యం కలిగినందుకు ధన్యుణ్ని.

+++

నిజం. ఒక్కోసారి భగవంతుడిని దర్శించుకుంటాం.
కానీ, జీవితాన్ని కూడా దర్శించుకున్నప్పటి విశ్రాంతి ఇది.

 

– కందుకూరి రమేష్ బాబు

ramesh

Between the Lines

Drushya drushyam 39

చాలాసార్లు దూరతీరాలకేసి చూస్తం.
కానీ, దగ్గరే మన కోరికలు తీర్చేవి ఉంటై.చూపుకు మామూలుగా అందవు. తేలికగా కనపడవు. కొద్దిగా శ్రమించాలి.
ఒక్కోసారి ‘చంకలో బిడ్డలాగా’ మరపు వల్ల ఉన్నదాన్ని ఉన్నచోటే వెతుక్కోవలసే వస్తుంది.కానీ చిత్రం.
ఒకానొక శుభవేళ ఒకరు దయతో చెప్పారు. తల్లి చుట్టు మూడు చుట్లు తిరిగితే చాలని! తులిసమ్మ పూజ చేసినట్లే అనీనూ! కొద్దిగా మేలుకున్నట్టయింది.

ఇక కన్నతల్లి చుట్టూ కొంగు పట్టుకుని తిరిగే పిల్లవాడివలే ఉన్నఊరును, పట్టణంలోని బస్తీలను కిలోమీటరు పరిధిలో తిరగడం మొదలెట్టాను, అవును. కెమెరా చేత బట్టుకునే. ఇదొక అధ్యయనం. అన్వేషణ. సఫలత.

కెమెరాతో రోజురోజుకూ మెలమెల్లగా విస్తరించాను.
పది, పదిహేను, ఇరవై కిలోమీటర్ల మేరా తిరగసాగాను.

అట్లా తిరగాడటంలో చూపు నిదానించింది.
ఉన్నది ‘ఉన్నది’ అనిపించడం మొదలైంది.
లేనిది “లేదులే’ అన్న విచారమూ మటుమాయం అయింది.

ఒక రోజు, ఆరున్నరకు హైదరాబాద్ లోని పార్సిగుట్ట నుంచి బయలుదేరి ఇందిరా పార్కుకు చేరుకున్నాను.
కొన్ని రాలి పడిన పువ్వులు తీశాను. ఎంత బాగా వచ్చాయో! దూరంగా కొలను ఆకర్శించింది. సరోవరమా? ఏమో!
బాతులు ఎంత ముద్దుగ వచ్చాయో! యు అన్న ఆంగ్ల అక్షరంలో ఒకదాంతో ఒకటి ఇమిడినట్టు వాటి నీడలు కూడా కొత్త భాషలు పోయేట్టు తీశాను. చూసిన మిత్రులు ఇవి నీ చిత్రాలేనా అన్నారు. మురిసిపోయాను.

ఇంకా కొన్ని అడుగులు వేశాను. మరీ దగ్గరయ్యాను అనుకుని వెనక్కి వెనక్కి నడిచి ఈ చిత్రాన్ని చిత్రీకరించాను.
ఆశ్చర్యం. కోనసీమలో ఉన్నట్లుంది, సీనరీ!
నాకూ అదే అనుభవం. చూసిన వారికీనూ.

పెద్ద ప్రింట్ వేసి ప్రదర్శిస్తే ఒకరిద్దరు ఇంట్లో వుంచుకున్నారు.
వారి దృష్టిలో నేను లేను. ఒక పరిధి పెట్టుకుని తిరుగాడే ఫొటోగ్రాఫర్ అస్సలు లేడు. వారి అనుభవమే అట్లా చల్లగా, హాయిగా ఉదయం వలే ఆ డ్రాయింగ్ రూములు.

ఒక రోజు చూసిన వాళ్లు అది, ‘కేరళనా?’ అని అడిగారు.
ఇంకొకరు అడిగారు, ‘ఆడమ్ అండ్ ఈవ్ కదా!’  అని.

దృశ్యాదృశ్యం.

అవును. నిజం. ఒకరు ఆ దృశ్యంలోని ప్రకృతిని ఇదివరకు తమ దృక్పథంలోంచి పోల్చుకుని చూసి కేరళకు వెళ్లినట్లుంది అన్నారు. ఇంకొకరు ఆ సరోవరంలో అట్లా నిశ్చలంగా ఉన్న ఆ పడవల కేసి చూసి, పక్కపక్కనే ఉన్న వాటి ఉనికిని గాఢంగా ఫీలయి, ఒక పురాతన దృశ్యం… ఎపుడో అదృశ్యమైన మన పరంపరకు మూలం, జీవం అన్నట్టు, అవి రెండూ మన ఆదిమ వారసత్వానికి ప్రతీకలా అని అడిగినారు.
అచ్చు’ఆడం ఈవ్ వలే ఉన్నార’నీ అన్నారు.

ఆశ్చర్యం.
ఆ కొబ్బరి చెట్ల నీడలు సరేసరే…
ఆ పడవల నీడలూ వారిని సరాసరి అక్కడకు తీసుకెళ్లాయనీ అన్నరు.

అప్పుడర్థమైంది, చిత్రానికి పరిధి లేదని!
జీవనచ్ఛాయలు మనుషుల వల్లే ఏర్పడవని!
మనిషిని పయణింపజేసే ప్రతి ఆవిష్కరణలోనూ మనిషి ఉన్నడని!

మరో అనుభవం.
ఒకాయన అన్నరు, ఈ చిత్రంలో హ్యూమన్ ఎలిమెంట్ లేదని!
దానికి జవాబుగా మరొకరు చెప్పనే చెప్పారు…. ‘ఈ చిత్రంలో మనిషి లేకపోవచ్చు. కానీ, ఈ ‘చిత్రీకరించడం అన్నది ఉన్నదే…అదే మానవ అంశం…హ్యుమన్ ఎలిమెంట్’ అని!

అలా ఇలా పరిపరి విధాలు. చిత్రవిచిత్రాలు.
పాఠక ప్రపంచం మాదిరే ప్రేక్షక ప్రపంచానికి ఒక చదువు వుంటుందన్న నమ్మకం క్రమంగా అనుభవంలోకి వచ్చింది.
ప్రేక్షకుడికి అనుభవం నుంచి ఒక చదువు వుంటుంది. వారిదైన చదువరితనం వల్ల ఆ వస్తువు లేదా దృశ్యం అందులోని ప్రతి అంశం విభిన్నం, విస్తృతం, విశేషమూ అవుతుందని!

‘బిట్విన్ ది లైన్స్’ మాదిరే ‘బిట్వీన్ ది ఇమేజ్’ ఒకటున్నదని అనిపించడం మొదలైంది.
అన్నిటికీ మించి ఒక ‘విస్తృతి’ పరిచయం అయింది.
నేను ఒక స్థలం పెట్టుకుని తిరగాడటం ఒకటి ఉన్నది. కానీ, ఆ ఒకదానితో చిత్రానికి సంబంధం ఉండవచ్చూ ఉండకపోవచ్చును.
ఈ చిత్రానికి వస్తే, అది తీసిన స్థలం ఇందిరాపార్కు అని అనుకోవడం నా కథనం.
కానీ, అది ప్రేక్షకుడి అనుభవంలో ఇంకొకటి గుర్తు చేస్తే అదీ రీడింగే!
ప్రేక్షక సమయం అది. వారి సందర్భమూ ముఖ్యమే.

చిత్రమేమిటంటే, ఈ చిత్రం చూస్తూ ఒకరు కేరళకు వెళ్లడం. ఇంకొకరు మనిషి పుట్టిన కాడికి వళ్లడం.
నేనేమో మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకుని ఊరు చుట్టూ తిరిగి ఒక తులసీదళం వంటి చక్కటి చిత్రం తీద్దామనుకుంటే, వారు మహత్తరంగా విస్తరించారు. నన్నూఅసాధారణంగా విస్తారం చేశారు.
ఇదంతా బిట్విన్ ది ఇమేజ్.

అందుకే చిత్రాలు చదవరారండి…
దయవుంచి నన్ను మా ఊరునుంచి బయట పడేయండి.

 

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

లైఫ్- స్టడీ

drushya drushyam 38reality
art.

అప్రమత్తత
సంసిద్ధత

చప్పున ఒకటి కనిపిస్తుంది.
చిత్రీకరించకపో్తే అ స్థితి జారిపోతుంది.
ఈ గ్లాసులే తీసుకుంటే. అవి ఉన్నవి. క్షణంలో తీసుకెళతారు. వాటిని మళ్లీ అమర్చి చిత్రీకరిస్తే అది చిత్రలేఖనం.
ఉన్నది ఉన్నట్టు, ఉన్న కాడనే… మన కాళ్లు కదపకుండానే.. అట్లే చిత్రించి వదిలితే అది ఛాయా చిత్రణం.

అరేంజ్ చేసేది ఏదైనా ‘లైఫ్ స్టడీ’.
మనం ‘స్టడీ’గా ఉండి దృశ్యమానం చేసేది లైఫ్.

మేలుకుని పలవరించడం చిత్రలేఖనం.
అదమరచి కలవరించడం ఛాయా చిత్రణం.

-ఫొటోగ్రఫీ తాలూకు లైఫ్ లైన్ ఇదే.

ఒకటి సంసిద్ధత
రెండోది అప్రమత్తత

+++

చిత్రాలే.

జీవితానికి చిత్తూబొత్తూ వలే కళా-నిజం. వన్ బై టూ.

లైఫ్ స్టడీలో రెండూనూ.
జీవితాన్ని దూరంగా నిలబడి పరికించే మెలుకువ ఒకటి – అది చిత్రలేఖనం.
జీవితమే మనల్ని లీనం చేసి మెలుకునేలోగా తప్పుకునేది చిత్రం- అది ఛాయ.రెండూ చిత్రాలే.
కానీ భిన్నం.

ఒక్క మాటలో…క్షణభంగుర జీవితానికి తెరిచిన డయాఫ్రం. ఒడిసిపట్టుకున్నస్పీడ్. తన చిత్రం. ఛాయా చిత్రణం.
అది ఛాయా చిత్రకారుడికి!
తీరుబడితో జీవితాన్ని కళాత్మకం చేయగలిగి ఓర్పు నేర్పు.
అది చిత్రకారుడిది!

ఇంకా.

తడి ఆరని ముద్దు వంటిది ఛాయా చిత్రలేఖనం.
గాఢ ఆలింగనం వంటిది చిత్రలేఖనం.

ఇంకా నగరంలో రాంనగర్ లో.
అందలి ఆంధ్రా హోటల్. వైన్ బై టూ. నేనూ నా మిత్రులు చంద్రశేఖర్ సారూ.

చాయ తాగి ఆడ పెట్టగానే అయిపోలేదు.  కాళీ సీసాలు మాదిరి మళ్లీ ఊరిస్తది.
ముఖ్యంగా ఆ గ్లాసులు…చీకట్లో కందిలి మాదిరి వెలుగుతున్నయి.
స్నేహితాన్ని అందలి బాంధవ్యాన్ని సామీప్యాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నయి.
కెమెరా గుండా ఆ అనుభూతిని, ఆ వెచ్చటి సాయంత్రాన్ని మళ్లీ కాచుకుని తాగవచ్చును, చాయగ. ఛాయలో.
ఛాయా చిత్రణంలో. అందుకే ఈ లైఫ్ స్టడీ భిన్నమైందంటూ కొన్ని ముచ్చట్లు.. ఒక రకంగా కొన్ని ముందు మాటలు.

+++

అది ఫలమో పుష్ఫమో మనిషో ఏదైనా సరే. దాని పొజిషన్ ను, కాంపోజిషన్ గమనంలోకి తీసుకుని తాము ఎంతో నైపుణ్యంగా రూపకల్పన చేసే కళాఖండం లైఫ్ స్టడీ.
ఇది చిత్రకారుడి విషయం.

తాను ఎంతో నిశిత పరిశీలనతో, మరెంతో ఓపికతో అవతలి జీవితం ఇవతలికి… అంటే తాను మాధ్యమంగా ఎంచుకున్న దాని మీదికి తెచ్చి చూపడం అతని ఒక వరం. ఒక గొప్ప కళ. కానుక. కాకపోతే, ఆయా చిత్రకారులు దేన్నయితే చిత్రీకరించదలిచారో దాన్ని తమ ముందు వుంచుకుంటరు లేదా ముందున్నదాన్ని చిత్రీకరించి పెడతారు. కంటి చూపుతోనే ముందు దాని కొలతలు తీసుకుంటరు. మనసులోనే బాహ్యరేఖలన్నీ గీసేసుకుంటరు.
ఎలా వర్ణచిత్రం చేయాలో యోచిస్తరు. క్రమక్రమంగా పలు దశల్లో చిత్రం పూర్తవుతుంది.

ఇదంతా ఒక పరిశ్రమ. తమ ముందున్న వస్తువును దృశ్యంగా మలచడానికి వారు ఎంతో పరిశ్రమిస్తరు. ఇంకా చాలా ఆలోచనలు చేస్తరు. వెలుగు నీడల పట్ల అంచనాకు వస్తారు. వాడవలసిన వర్ణాల గురించిన ఆలోచన చేస్తరు. రంగుల సమ్మేళనం గురించీ మథన పడుతరు. ముందూ వెనకాలు… ఏమైనా… వారిలో ఒక కల్పన జరుగుతుంది. ఆ తర్వాతే ఆ వస్తువు కళగా మన ముందు సాక్షాత్కరిస్తది.

కానీ ఛాయా చిత్రకారుడికి జీవితమే కల్పన.
ఊహా ప్రపంచంలోకి వెళ్లడానికి లేదు. తన కళకు కసరత్తు లేదు అందుకే అది నిజం.

చిత్రకారుడు మాత్రం ఫలానా వస్తువు తాలూకు అందానికి ముగ్డుడై చిత్రీకరణలోకి దిగవచ్చు. లేదా ఆయా వస్తువుల గుణాన్ని చెప్పదల్చుకుని సిద్ధపడవచ్చు. లేదా మరేదో పారవశ్యంతో ఆ పనిలో నిమగ్నం కావచ్చును.
అయితే ఆ పనితనంలో తనదైన సాంకేతికత కూడా ఒకటుంటుంది. దాని నుంచి కూడా ఆ చిత్రం వన్నెలు పోతుంది. అంతేకాదు, తన నైఫుణ్యానికి, సాంకేతిక ప్రతిభకు తోడు నిర్ణయాత్మకత కూడా అవశ్యం. వస్తువును ఏంత మేరకు గ్రహించాలి. దాన్ని ఎంత విస్తీర్ణంలో రచించాలి. ఎంత గాఢంగా చిత్రీకరించాలి, ఇన్ని విదాలా ఆలోచనలు సాగుతై.
నిజానికి ఇవన్నీ గడిస్తేగానీ చిత్రం.

ఇంకో విచిత్రం, ఒక చిత్రం గీయాలనుకోవడానికీ… పూర్తవడానికీ పట్టే సమయం కూడా చిత్రాన్ని నిర్ణయిస్తుంది.
అంతా కలిస్తే లైఫ్ స్టడీ.

కానీ, ఛాయాచిత్రకారుడికి అంత పని కుదరదు. ఉండదు. పట్టదు.
అదొక సఫలత. స్పాంటానిటీ.

కనిపించగానే క్లిక్ మనిపించాలి.
కనిపిస్తుండగానే ఆ వస్తువే చెబుతుంది, దించమని. దింపమని. దించరా అని.

కాలయాపన చేశాడా లైఫ్ తన స్టడీ నుంచి తప్పుకుంటుంది.
అదొక చిత్రం.

ఇక తాను విఫల మనస్కుడవడం, వగచడంవల్ల ఏ ఫాయిదా లేదు.
అయితే ఛాయా చిత్రకారుడికీ చిత్రకారుడికీ మధ్యన ఇంకొక మంచి తేడా ఉన్నది. చిత్రకారుడి విషయంలో తాను గీసిన వస్తువు చివరకు తాను చిత్రీకరించిన వస్తువు ఒకటే అని మనం అనుకోలేం. కానీ ఛాయా చిత్రకారుడు మాత్రం ఖచ్చితంగా తాను చూసిందానికన్నా నిజమైన వస్తువును పట్టుకుంటడు. తాను ఊహించనైనా లేని వాస్తవాలన్నీ తన చిత్రంలోకి వచ్చి చేరడాన్ని గమనించి విచిత్రపోతడు.

అట్లా తన అనుభవాన్ని మించిన చిత్రం ‘ఛాయా చిత్రం’ కాగా, తాను చూసిన నిజాన్ని దాటిన కల్పన ‘చిత్రం’ అవుతుంది.
ఇట్లా చిత్రకారుడూ ఛాయా చిత్రకారుడూ ఇద్దరూ భిన్నం. వాళ్ల జీవనశైలులు చాలా ఎడం.

ఇంకా ఇంకా రాణించే జీవితం చిత్రకారుడిదైతే, జీవితాన్ని యధాతథంగా ఒడిసి పట్టే పని ఛాయాచిత్రకారుడిది.

+++

నిజం.
ఎంత లేదన్నా ఫొటోగ్రఫీ నిజంగా భిన్నం. నిజ వస్తువును చూపే నిజమైన మాధ్యమం. అవును, ఛాయా చిత్రణం అన్నది ‘ఉన్నది ఉన్నట్టు’ చూపడంలో అత్యంత నిబద్దతను చూపే మాధ్యమం.

చూడండి. వెలుగునీడలు. రంగులు ప్రతిఫలణాలు.
వస్తువుతో పాటు సమయం, స్థలం అన్నీ కూడా గోచరం అవుతుంటాయి.

+++

నిజానికి ఒకనాడు చిత్రకళ ద్వారా ఉన్నది ఉన్నట్టు చూపించే పరిస్థితి ఉండేది. తర్వాత అది వ్యక్తిగత ప్రతిభా పాటవాలను ప్రతిఫలించేదిగా మారింది. కానీ ఇప్పటికీ, మ్యాన్యువల్ నుంచి డిజిటల్ దాకా ప్రయాణించినా ఫొటోగ్రఫి మాత్రం జీవితంలోనే ఉన్నది. ఇంకానూ లైఫ్ స్టడీకి ఉత్తమమైన ఉదాహరణగా, సదవకాశంగా నిలుస్తునే ఉన్నది.

అందుకే జీవితం అంటే కళ కాదు, నిజం. ఫోటోగ్రఫిలో.
వన్ బై టూ ఛాయ తాగి తెలుసుకున్న నిజం కూడా.
ఈ చిత్రం అదే.
మామూలు చాయ గిలాసలే. కానీ ఒక పాతదనం. నాస్టాల్జియా. సరికొత్తగా. గాజు వలే కొత్తగా.

రంగు, రుచి, పరిమళం యధాతధంగా.
అదే లైఫ్.
కనీకనిపించకుండా చిత్రంలోనే ఉన్న ఈగతో సహా!
నిజం. ఇదే లైఫ్ స్డడీ.

దృశ్యాదృశ్యం.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

 

మ్యాచీస్

drushya drushyam 37..
పంచుకునే క్షణాలు.అవి మామూలు క్షణాలే కావచ్చును. అత్యంత సర్వసామాన్యమైన క్షణాలే కావచ్చును.
కానీ, విలువైన సమయాలు. ఏదైనా ‘పంచుకునే’ ఆ కొన్నిఘడియలు అపూర్వమైనవి.

క్షణకాలమే కావచ్చు.
కానీ, అవి బతికిన క్షణాలు. తర్వాత మామూలే.

అవసరం ఉన్నప్పుడు మాత్రం అవి మామూలు క్షణాలు కావు.

జీవితంలో అంత ప్రాధాన్యంగా తోచని ఆయా క్షణాలను సహజంగా, అవలీలగా ఛాయా చిత్రాల్లో పదిల పరచడం నిజంగా ఒక భాగ్యం.
సంబురం. సవాల్ కూడా.

ఈ చిత్రం చూడండి.
సిగరెట్టు లేదా బీడీ కాల్చడం.
అందుకు అగ్గిపెట్ట అవసరం కావడం.
ఇద్దరు. మ్యాచీస్.
అదే ఈ చిత్రం. ఒక లఘు చిత్రం.

+++

‘మ్యాచీస్ ఉందా?’
జవాబు ఉండదు. వినిపించదు.
కానీ, క్షణం తర్వాత చేతికి అగ్గిపెట్టె అందుతుంది.
అంతే.

చిత్రం పూర్తవుతుంది.
వారిద్దరూ సినిమా విడిచి పెట్టినాక ఎవరి దోవన వారు పోయే ప్రేక్షకుల్లా మళ్లీ మాయం.
మామూలే.

ఏమీ జరగనట్టు.

నిజానికి ఇటువంటి క్షణాలను బంధించడానికి సారస్వతం బాగుండదు.
కవిత్వం ‘అతి’ అవుతుంది.
దృశ్యమే పదిలం.

అవును.
కొన్నింటి అనుభూతి మాటల్లో చెబితే తేలిపోతయ్.
అక్షరాల్లోకి అనువదిస్తే భారమైతయ్.
ఛాయాచిత్రమే మేలు. పదివేలు.

ఈ వారం అదే. మ్యాచీస్. అడగ్గానే అగ్గిపెట్టెను అందిస్తున్నప్పటి అనుభూతి.

+++

నిజానికి చాలా ఉంటై.
ఇలాంటి ఔదార్యపూరిత క్షణాలు చాలా ఉంటై.
వాటిని అలవోకగా పదిల పర్చడానికి దృశ్యమానమే మహత్తరం.

కాకపోతే సమ్మతి ఉండాలి.
ఒక అలవాటును అంగీకరించే చేవ….ఒక అనుభూతిని అర్థం చేసుకోగల సమ్మతి. సానుకూలత తప్పనిసరి.
అప్పుడు మాటలేమీ ఉండవు, అభిమానంగా పంచుకునే క్షణాలు తప్ప!.

అందుకే అనడం…
ఒక మాధ్యమంగా లేదా యానకంగా ఛాయాచిత్రలేఖనం నిజంగా బతికిన క్షణాలను పదిలపర్చే అద్భుతమైన రచన అని!

+++

మరొక్కసారి ఈ ఛాయాచిత్రం చూడండి.
ఆ కళ్లు.
చిత్రంలో మూసుకున్నకళ్లు దేనికి చిహ్నం?

మళ్లీ మళ్లీ చూడండి.
అగ్గిపెట్టె తగిలినప్పటి దృశ్యం కదూ అది!

మీరు కళ్లు మూసుకున్నా లేదా తెరిచినా
జేబులోకి చేయుంచగానే ఆ వస్తువు తగిలితే అది చూపు.
కళ్లు అక్కడ తగులుతై.
అందుకే మూసుకున్న ఆ కళ్లు వస్తువు దగ్గర తెరుచుకోవడం ఒక దృశ్యం.

గమనించి చూడండి.

దృశ్యం దగ్గర చూపు ఆగనవసరం లేదు. స్పర్శ తగిలినా అది చూపే.
అప్పుడు కళ్లు అరమోడ్పులైతయి. మూసుకుంటై.
ఆనందానికీ, విషాదానికీ స్పందిస్తయి.
అట్లే ఒక సాహచర్యం. ఒక ఔదార్యం. పంచుకోవడం.
ఆ సమయంలోనూ కళ్లు జేబులోకి వెళుతై.
అప్పటి చిత్రమే ఇది.

మ్యాచీస్.

+++

అయితే, సాధారణంగా ఇద్దరి అనుభవంలో ఉన్నదే ఇది.
అగ్గిపెట్టెను షేర్ చేసుకోవడం ఎవరికైనా తెలిసిందే.
ముఖ్యంగా స్మోకర్స్ కు.

చిత్రమేమిటంటే, అదొక అదృశ్యం.
బయటకు తెలియనే తెలయదు.
అయితే, ఇద్దరి అనుభవంలో ఉన్నదాన్ని మూడవ అనుభవంలోకి తేవడమే ‘దృశ్యాదృశ్యం’.

పంచుకోవడం. ఆ క్షణాలు.
ఏమైనా ‘పంచుకునే’ ఆ కొన్నిఘడియలు అపూర్వమైనవి.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

ఒక పరి ఆనందమూ, ఇంకొక పరి విషాదమూ…

drushya drushyam 36

ఎందుకో తెలియదు, తీసినప్పుడు.
ఏ విచిత్రమూ గోచరించదు, చూసినప్పుడు.
కానీ, లోపల ఆనందం ఉన్నట్టే విషాదం ఉంటుంది.
ఒలుకుతుంది ఒక్క పరి, మరొక స్థితి కలవరపెడితే, ఇంకొక గతి తన్మయం చేస్తే.
కళ్లు మూసుకుని హారతిని కళ్లకు అద్దుకున్నట్టు ఛాయా చిత్రలేఖనమూ అంతే.
స్వీకారం, తెలిసీ తెలియక.
అందువల్లే అందులో అన్నీ ఉంటై. దృశ్యం అదృశ్యం జమిలిగ.

అవును, దృశ్యాదృశ్యం.

+++

దేశ రాజధాని ఢిల్లీలో, కుతుబ్ మినార్ గార్డెన్లో ఒక చోట కనిపించిన ఈ రిక్షా, అక్కడే చిగురిస్తున్నట్లు కొన్ని మొలకలు…ఒక గొప్ప రిఫ్రెషింగ్ ఫీలింగ్.
అప్పటిదాకా ఎంతోమంది మానవమాత్రులను మోసి, వారి వస్తువులను ఒక చోట చే్ర్చిన ఆ వాహనం ఇప్పుడు విగతరూపంలో ఉంది. మనిషిని వదిలిన ఆత్మలా పడి ఉన్నది. నిశ్వాసం వలే ఉన్నది.
అలా అని దిగులేమీ అవసరం లేదన్నట్టు అది ఎక్కడైతే శిథిలం అవుతున్నదో అక్కడే ఆకుపచ్చ జీవితం పుష్పం వలే చిగిరించి శోభిస్తున్నది. ఒక కల వంటి మొక్కల పుష్ఫలతలు…

చూస్తుంటే తెలియలేదుగానీ ఒక  కాల ఖండికగా తెచ్చుకున్న తర్వాత ఈ ఛాయా చిత్రాన్ని తిరిగి చూసుకుంటే ఇదొక దృశ్యాదృశ్యం.
ఒక ఆశయం. సహజాతి సహజంగా జీవితంపై నమ్మికను కలిగించే ఒక సామాన్యమైన స్థితీ గతీ.

నిజమే. ఇలా కనిపించే దృశ్యాలు తక్కువే.
కదా! జీవితమూ మరణమూ వేర్వేరు కాదనిపించే సందర్భాలు బహు తక్కువ.

అసలుకి, వెలుగూ నీడా ఒక వస్తువు తాలూకువే అయినా వెలుగు కావలిస్తే వెలుగును, నీడ కావలిస్తే నీడను ఆశ్రయించి బతకడం అలవాటు మనిషికి.
కానీ, రెండూ ఉన్నయని, రెండూ ఒకటే అని నమ్మడు. ఇష్టపడడు.. అట్లే జీవితమూ మరణమూ ఒకే ఇతివత్తం తాలూకు వస్తుగతాలు అని చెబితే ఇష్టపడడు. నమ్మడంటే నమ్మడు.
కళ్లారా చూసినప్పుడు ఒక్కొక్కసారి ఒక ఆశ కలుగుతుంది. ఆశయం అంటే సుదీర్గం కనుక అనడం. ఒక ఆశ… నాగరీకత అంత విస్తారమై ఆశయంగా చిగురిస్తుంది.
ఏమీ బాధ లేదు. ఉన్నది ఉండదుగానీ ఉండనే ఉంటది, వేరే రీతిగా.

+++

కృంగి కృషించి క్షీణిస్తున్న ఒక వస్తువునూ, మొలకలేస్తున్న ఒక చిగురునూ ఒకే చోట చూసినప్పుడు ఒక ఆశ…గొప్ప ఉపశమనం.
ఆకు పచ్చ రిక్షా ఆశ.

భీతి.
అందునా ఒక దట్టమైన నీడ వంటి ఆలంభన.

రెండూ ఉన్నయి.
కానీ, అదంతా ఒకటే జీవితం.
క్రమానుగతంగా నూతన రూపాల్ని సంతరించుకుని జీవితమై ప్రవహిస్తూనే ఉండే కాలం.
లేదా గత వర్తమాన భవిష్యత్ కాలమై విభిన్నంగా ప్రవహించే జీవితం.

అందుకే వస్తువు, ప్రదేశమూ, కాలమూ , ఈ మూడింటి సమన్వయం
లేదా కవితాభివ్యక్తి ఏదైనా ఉందీ అంటే అది దశ్యమే.

దృశ్యంలోనే అదృశ్యం నిభిడీకృతమై ఉన్నది.
చూడగా చూడగా కానవస్తుంది ఒకసారి.
టక్కున ఆగుపించి ఆశ్చర్య చకితులను చేస్తుంది మరోసారి.

ఇక్కడైతే సుస్పష్టం.
అదృశ్యమవుతున్న దృశ్యం. దృశ్యమానమవుతున్న అదృశ్యం.
వాహనమూ, మొలక.
వినిర్మాణమూ, నిర్మాణము.
మొత్తంగా పునరుజ్జీవనము.

ధన్యవాదం.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

తిలకము దిద్దరుగా…!

drushya drushyam-35

ఛాయా చిత్రలేఖనంలో వస్తువు ‘జీవితం’ అయినప్పుడు అది ఫొటోగానే మిగిలిపోదు. అనుబంధం అవుతుందని తెలిసిన కొద్దీ ఆశ్చర్యం, ఆనందం. గొప్ప విశ్వాసం.మానవ సంబంధాలను మనుషులు ఎంత బాధ్యతాయుతంగా మలుస్తారో తెలిసిన కొద్దీ ఒక అనురాగం, ఆప్యాయత.నిజం.
ఒకానొక సాయంత్రం, ఒక కిరాణా దుకాణం దగ్గర ఆ ముసలమ్మ నన్ను పట్టుకుని అభిమానంగా అడిగింది, ‘మొన్న నువ్వు కనిపించావుగానీ మందలించలేదు. తప్పే అయింది బిడ్డా..తర్వాత చాలా బాధయింది’ అని!

‘అదేందమ్మా?’ అంటే, ‘అవును బిడ్డా. నువ్వు బండి మీద పోతుంటె చూశాను. పిలుద్దామని అనుకున్నాను. కానీ, పోనీలే…అనుకున్న. తర్వాత గంట సేపటిదాకా ఒక్క మనిషీ సహాయానికి రాలేదు. అప్పుడనిపించింది. అయ్యో…పిలిస్తే మంచిగుండు గదా అనిపించింది!’ అని వివరించిందామె.

అప్పటికీ అర్థం కాలేదు. వివరంగా చెప్పమంటే ఆమె ఇలా చెప్పింది. తన భర్తకు అకస్మాత్తుగా దెబ్బతగిలి పడిపోయాడట. చాపల మార్కెట్ దగ్గర ఎవఎవలో యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయాడట. ఆయన లేవలేని స్థితిలో తాను ఆటో తీసుకుని గాంధీ దవాఖానకు పోదామని అనుకుందట. కానీ, చేతుల చిల్లిగవ్వ లేదట. అప్పుడు కనిపించానట. అడుగుదామనే అనుకుందిట. కానీ, ఆగిపోయిందట. తీరా నేను వెళ్లిపోయిన తర్వాత గంట సేపటిదాకా తెలిసిన వ్యక్తులెవరు కనబడలేదట. ఎంత కష్టమయిందో అంది. అప్పుడనిపించిందట, నన్ను అడిగితే పోయేది గదా అని!

ఇవన్నీఆమె విచారంగా చెబుతుంటే విన్నాక ఆమెతో అన్నాను, ‘అంతటి పరిస్థితిలో ఎందుకు పిలవలేదమ్మా’ అని!
అందుకు ఆమె చిన్నగా అంది, ‘ఒకసారి నువ్వు పోతూ పోతూ మా ఇంటిముంగట ఫొటో తీసింది గుర్తున్నది. అంత మాత్రాన నిన్ను సహాయం అడగటం ఏం బాగుంటుందని అడగలేదు. కానీ, నువ్వు వెళ్లాక తెలిసింది. కొన్ని సమయాల్లో కొద్ది పరిచయం అయినా ఫరవాలేదని!’ ఇట్లా చెప్పిందామె.

ఆమె చెబుతుంటే విన్నాను. విని ఒకింత కోపానికి లోనయి అడిగాను. “అదేంటిదమ్మా? అంత ఇబ్బంది పరిస్థితి ఎదురైతే అడగకుండా ఎట్లా ఉంటవమ్మా? నేను బుల్లెట్ నడుపుతున్న అంటే ఏమిటని అర్థం. చప్పుడు వింటేనే నా దగ్గరకు రావాలె కదా? అంత అవసరం ఉన్నప్పుడు రెండోసారి ఆలోచిస్తరా?’ అని కొప్పడ్డాను. ‘అదీగాక నేను నల్ల షర్టు వేసుకునేదే అందుకాయె! నా పని అవసరం పడితె ఎవరైనా ఆజ్ఞాపించాలి! నువ్వు తప్పు చేసినవు అమ్మా’ అని మందలించాను.

ఇది కాదు ఆశ్చర్యం. అవును. నేను మందలించగానే ఆమె ఒప్పుకుంది. ‘నిజమే బిడ్డా’ అని ఒప్పుకుంది. ఒప్పుకుని ఒక సత్యం చెప్పింది. అప్పటిదాకా అది నాకు తెలియదు.’నిజమే బిడ్డా’….నువ్వు నేను తిలకం పెట్టుకుంటున్నప్పుడు ఫొటో తీశావు. నా భర్తకే ఆపద వచ్చినప్పుడు నిన్నుగాక ఇంకెవరిని అడగాలి. అడగవలసే ఉండె. తప్పే జరిగింది నాయినా’ అని అన్నది.

+++

నాకు నోట మాట రాలేదు. ఆమె ఏమి అంటున్నది? నేను తిలకం పెట్టుకుంటున్నప్పుడు ఫొటో తీశాను గనుక ఆ తిలకానికే ఇబ్బంది ఎదురైతే నేను సహాయం చేయవలసి ఉండిందట!
ఎంత గొప్పగా చెప్పింది. ఎంత బాధ్యత పెట్టింది.

+++

ఈ సంభాషణ గత వారం జరిగింది. అప్పటినుంచీ పదే పదే ఆమె మాటలు గుర్తొస్తున్నాయి. ఎంత బాగా చెప్పింది. నిజానికి తాను నన్ను చూడగానే పిలవాలని ఆనుకున్నది కూడా అందుకేనేమో! తిలకం.

అవును మరి. ఒక జీవనచాయను దృశ్యీకరిస్తున్నప్పుడు, పవిత్రమైన బంధానికి ప్రతీకగా ఆ తిలకం ఉన్నప్పుడు ఒక చూపు అది. ఆ చూపులో ఒక మానవీయత ఉన్నది. మనిషి మరొక మనిషి తాలూకు స్థితిని పట్టిస్తున్నది. ఆ స్థితిని వర్తమానంలోనే కాదు, భవిష్యత్తులోనూ గమనింపులో వుంచుకోవాలి. ఒకవేళ దాని చుట్టూ ఉన్న మంచీచెడుకూ బాధ్యుడనై కూడా ఉండాలి.

– ఇట్లా ఆమె మాటల్లోని తాత్వికత. బోధన అర్థమయింది . అంతేగాదు, హార్డ్ డిస్క్ లో ఉన్న ఈ ఫొటోకూ మళ్లీ జీవితం వచ్చినట్టయింది. తీశాను. పదే పదే చూశాను. ఎంత బాగున్నది. నిజంగా ఆ ముసలమ్మను, వీపు వంగిపోయి ఉంటుంది. నడుస్తున్నప్పుడు ముంగాళ్ల మీద నడుస్తున్నట్టే ఉంటుంది. అటువంటిది కూచున్నప్పుడు తనలో ఎంత ఠీవీ ఉన్నది. తిలకం దిద్దుకుంటున్నప్పుడు ఎంత నిండుగ ఉన్నది. ఎంత కళ ఉన్నది. మరెంత ఆరోగ్యం ఉన్నది. పరిసర ప్రపంచంలో గడ్డి,  ఆ గుడిసె వంటి గృహం తాలూకు పేదరికం…ఇదేలా ఉన్నా ఏమి చెప్పినా తన దుస్తులు, వస్త్రధారణ అంతా కూడా ఒక నిండైన తొణకని తన వ్యక్తిత్వాన్ని చూపెడుతున్నయి. ఈ చిత్రం చూస్తుంటే తన జీవన సహచరుడిని చూడటం అనీ అర్థమైంది. ఒక ముత్తయిదువను చూడటమూ అన్న సంగతి ఇలా నిదానంగా తెలిసి వచ్చింది.

మొత్తంగా నాకొక పిలుపు. అది ఇక ఎప్పుడూ వినిపిస్తుంది.

వెళుతుంటే ఆమెలో ఒక భరోసా.
ఇక ముందు నన్నే కాదు, ఎవరినైనా పిలుస్తుంది కాబోలు, తక్షణం ఏదైనా అవసరం అయినప్పుడు, ముఖ్యం అయినప్పుడు! అనిపించింది.

కానీ నాకైతే ఆమె గొప్ప మేలుకొలుపు. ఫొటోలు తీయడం ఎంతటి పనో తెలిసిన మలుపు.
ముఖ్యంగా జీవితాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఒక అనుబంధం. అది భవిష్యత్తులో నీ బాధ్యతను గుర్తు చేసే బంధమూ కావచ్చని తెలియడం.

తిలక ధారణ అంటే ఇదే!

~ కందుకూరి రమేష్ బాబు

చిన్న గది…మనసు ఆకాశం!

drushya drushyam 34

చిన్న చిన్నవే.
గూడు కట్టుకున్న పదాలే.
కానీ, గొప్ప అర్థాలు.

‘ఖాన’ అంటే ఇల్లు.
‘ఖబూతర్’ అంటే పావురం.
‘కబూతర్ ఖాన’ అంటే భాగ్యనగరం.
అవును మరి. పావురాల కోసం ఇండ్లను నిర్మించిన మనసున్న మారాజుల నగరం ఇది.

నిజంగానే ఇంకొక పదం ఉన్నది.
తెలంగాణలో ‘పావుఁరం‘ అన్న పదమూ ఉన్నది.
దానర్థం ప్రేమ, అభిమానం. అంతకన్నా ఎక్కువ పలికే అనురాగం.
అందుకే మాటల్లో ‘పావుఁరం‘ గల మనిషి’ అని ఎంతో ఇదిగా చెప్పుకుంటాం!
అటువంటి తరీఖా గల మనుషులు నిర్మించిన నగరం హైదరాబాద్, అందులోని ఈ ‘ఖబూతర్ ఖాన’ ఈ వారం.

+++

అబిడ్సులో ఒకానొక ఉదయం…. పావురాల కువకువల మధ్య గడిపితే ఈ దృశ్యం ఒకటి నచ్చింది నాకు, క్లిక్ మనిపించాను.
ఎన్నో తీశాను. చాలా బాగా ఉన్నయి. కానీ, ఇందులో ఒకే ఒక పావురం హాయిగా స్వేచ్ఛగా ఎగురుతుంటే మిగతావి ఇంట్లో ఉండటం ఉన్నది చూడండి.
ఇదొక అద్భుతమైన సన్నివేశం…’మన ఇల్లు మన ఇష్టం’ అన్నప్పుడు ఇట్లా పోయి అట్లా రావడం…ఇష్టానుసారం.గా ఎగరడం..ఎంత హాయి.
ఏదో ఒక హాయి. అంతకన్నా ఎక్కువే అది.
స్వేచ్ఛ, శాంతి.. ఇవి రెండూ ఉన్నందువల్లే కాబోలు ఈ చిత్రం నాకు మహా ఇష్టం

నిజానికి ఇలాంటి ఖబూతర్ ఖానాలు పట్నంలో చాలా ఉన్నయి.
మీరు చూస్తున్నది గోకుల్ చాట్ వెనకాల ఉన్న ఖబూతర్ ఖాన.

నిజానికి కొన్ని వందల పావురాలు నివాసం ఉండటానికి కట్టించిన చిన్న మినార్ వంటిది ఇది.
దానికింద విశాలంగా వదిలిన స్థలం. దూరంగా నిలబడి చూడటమూ ఒక ముచ్చట. దగ్గరకొస్తే సవ్వడి…అదొక వినముచ్చట.

చిన్న చిన్న గదులు.
ప్రేమకు చిహ్నం అన్నట్టుగా గుండె గదుల వంటి అరలు.
మంచి మంచి రంగులు. అందులో కువకువ మంటూ పావురాలు. హాయిగా సేద తీరుతూ సరాగాలు.
వాటికి ఇష్టమొచ్చినప్పుడు స్వేచ్ఛగా ఎగురుతుంటాయి.

ఇక రాత్రుల్లు. నిద్రిస్తయి.
తెల్లవారంగనే రెక్కల్ని టపటప లాడించుకుంటూ ఎటో ఎగిరిపోతై.
ఒకటి లేనప్పుడు ఇంకొకటి వస్తది. అట్లా పదులు, వందలుంటయి.
ఆరామ్ సే అవి అక్కడ ‘మా ఇల్లు.. మా ఇష్టం’  అన్నట్టు దర్పం ఒలికిస్తూ ఉంటే ఒకటి తుర్రుమని ఇలా ఎగురుతుంటది.
అందుకే ఇది బాగ్యనగరం. ఒక ప్రతీక.

ప్రతి నిమిషానికి ఒకసారి అవన్నీ చప్పున లేస్తయి. ఆ చప్పుడు వినాలి.
మళ్లీ అన్నీ ఒక్కపరి వాలుతై. ఆ సద్దుమణగడమూ సవ్వడి. అదీ వినాలి.

ఒక గంటసేపైనా ఉంటేగానీ వాటి శబ్దం..నిశ్శబ్దం…
గీతమూ సంగీతమూ అందలి సరిగమలు…వాటి ఒరవడీ అర్థం కాదు.

+++

మరి పదం. అది పావుఁరం.
1942లో నిర్మితమైన ఈ ఖబూతర్ ఖాన జన జీవన పా(వురానికి సుతారమైన నిదర్శనం.
ఇంకొకటి పాతబస్తీల ఉన్నది. అది హుస్సైనీ ఆలంలో…చార్మినార్ కు  కొద్ది దూరంలోనే.
రెండొందల ఏండ్ల కిందట కట్టించింది అది. అందులో 135 అరలున్నయి.
దాన్ని సిద్ది ఇబ్రహీం అనే పెద్ద మనిషి కట్టించిండట.

ఇట్లా ప్రతి ఇంటికి ఒక చరిత్ర ఉన్నది.
ఆ ఇంటి దగ్గర నివసించే పక్షులకు ఆహారం, వసతి కూడా ఏర్పాటు చేసిన మనుషులున్నరు.
అక్కడే లక్ష్మీనారాయణ గుడి దగ్గర ఇంకొకటి ఉన్నది.
నేనైతే ఈ మూడింటినీ ఛాయాచిత్రాలుగా పదిల పర్చాను.
ఇంకొన్ని కూడా ఉన్నయి.
వెతకాలి. చూడాలి. చిత్రీకరించి వదలాలి.

అయితే, ఈ చిత్రాన్ని లేదా ఈ పావురాలను ఈ వారం వదలడంలో ఒక విశేషం ఉన్నది.
అదే దృశ్యాదృశ్యం.

+++

ముఖ్యంగా ఈ దృశ్యంలో దిగువన ఒక పావురం ఎగురెళ్లుతున్నది చూడండి.
అది నివేదిత.
అవును. ఆ ఎగిరే పావురాయికి మన మనసులో ఉన్నది నివేదించుకుంటే అది తప్పక నెరవేరుతందట!
ఇదొక విశ్వాసం. మరి నేను నిజంగానే నివేదించుకుంటున్నాను.

నా నగరం ఒక ప్రేమ నగరం. సుతారమైన అపురూపమైన విశ్వాసాల కూడలి.
తరతరాలుగా మనిషిని, పక్షిని, చెట్టును, పుట్టను కలుపుకుని జీవిస్తున్న ఆత్మగల్ల నగరం.
ఇదిప్పుడు స్వేచ్ఛ పొందుతున్నది. పావురాయి అవుతున్నది. ఇది నిలబడాలి. ఈ ఇల్లు సుఖ శాంతులతో వర్థిల్లాలి.
ముఖ్యంగా అశాంతికి గురికావద్దు, ఎవరివల్ల కూడా.
అంతే! అవును మరి. ఒక రాష్ట్రంగా తెలంగాణతో పాటు, రాజధానిగా హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఏర్పడటం అన్నది నిజంగానే పా(వురం.
ఉద్యమం తర్వాతి సన్నివేశ కదంబం. ఒక స్వేచ్ఛాదృశ్యం.
ఖబూతర్ ఖానా.

అది తిరగి తమదే అవుతున్నప్పుడు ఆ భూమిపుత్రుల మానసం ఎలాగుంటుంది?
ఈ చిత్రం మాదిరే ఉంటుంది.

మరి అభినందనలు.
కృతజ్ఞతలు.

 

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

ఆమె ఒక కరుణ కావ్యం!

drushya drushyam 33

పేరు తెలియదు.

కోల్ కతా నగరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కు చెందిన ఒక నన్ ఈవిడ.
నన్ అంటారో సిస్టర్ అంటారో కూడా తెలియదు గానీ, అమ్మ వెనుక అమ్మ.

+++

సుప్రసిద్ధ ఛాయాచిత్రకారులు రఘురాయ్ చిత్రించిన మదర్ థెరిస్సా ఛాయా చిత్రాల ప్రదర్శన ఒకటి రెండేళ్ల క్రితం జరిగింది.
ఆ సందర్భంగా సిస్టర్ నిర్మలతో కూడి వచ్చిన ఒక సోదరి తాను.

ఆమె అందం, హుందాతనం ఆ కార్యక్రమంలో గొప్ప ఆకర్షణ.
బాధ.

సామాన్యమైన మనిషైతే అందరూ చేతులు కలిపేవారు.
కబుర్లు చెప్పేవారు.
కానీ, తాను సోదరి.

అంతకన్నాముఖ్యం, తాను కదులుతుంటే ఒక దేవదూత వలే అనిపించడం.
దాంతో మనిషిగా అందరూ వినమ్రంగా పక్కకు జరగడం మొదలైంది.
కానీ, ఏదో బాధ.

సేవానిరతి తప్పా మరో విషయం లేని…లేదా విషయాసక్తి అస్సలు లేని…ఒక అలౌకికమైన సేవా తరుణిగా తాను.
దాంతో ఒక బాధ. విచారం.

ఆంత అందమైన మనిషిని చూస్తే తెలియకుండానే ఒక జాలి.

సేవకు అంకితమైన సిస్టర్ గా, జీవితమంతా అందాన్ని, ఆనందాలను ఫణంగా పెట్టి, సుఖమూ సౌకర్యవంతమూ అయిన జీవితాన్ని పూర్తిగా వొదిలి, రోగగ్రస్థులను స్వాంతన పరచడమే జీవితం చేసుకున్న ఈ మనిషి చూస్తే, ఆమె సాహసానికి ఆవేదనా కలిగింది.

ఎందుకని చెప్పలేనుగానీ ఒక చెప్పలేని విచారంతోనే ఉంటిని.
గుండె గొంతుకలోన కొట్లాడినప్పటి నా నిశ్శబ్ద బాధకు ఈ చిత్రం ఒక ఉదాహరణ.

+++

చిత్రమేమిటంటే, ఈ చిత్రం తీసి ఊరుకోలేదు.
ఆ బాధను అణచుకోలేక తన దగ్గరకు వెళ్లి వ్యక్తం చేస్తిని కూడా.
కానీ, తాను చిరునవ్వు నవ్వింది.

నవ్వు కూడా కాదు, ప్రేమను పంచింది.
‘అందమైన ప్రపంచం కోసం తప్పదు’ అని చిన్నగా, ప్రేమగా అని ఊరుకున్నది.

అంతే!
ఇంతకన్నాఎక్కువ మాట్లాడటం విజ్ఞత అనిపించుకోదని ఆమె అనుకున్నట్టున్నది.
ఈ రెండు ముక్కలు చెప్పి తప్పుకున్నది.

అర్థమైంది.
ఇక ఆ నాటి నుంచి నా చిత్రాల్లో వ్యక్తి అందం అన్నది ద్వితీయం అయిపోయింది.
అందమైన మనుషులంటే నాకు అప్పట్నుంచీ ఆసక్తీ పోయింది.

బహుశా ఈ చిత్రంతోనే నేను వ్యక్తులను చిత్రించడం ఆగిపోయింది.

ఒక స్త్రీ తాలూకు సౌందర్యం అన్నది పురుషుడి తాలూకు దృష్టి అయినట్టు, సొత్తు అయినట్లు అనిపించి ఆసక్తి చెడింది.
ఇక నాటి నుంచీ స్త్రీలను మనుషులుగా చూడటం మొదలైంది.
జీవితంగా దర్శించడం ప్రారంభమైంది.

ఆమె తన మొత్తం బతుకును సమాజానికి ఇచ్చిన మనిషి అయినప్పుడు ఇక ఆమె అందం చందం సేవా అంతా కూడా వ్యక్తిత్వం, స్త్రీ వ్యక్తిత్వం అవడం మొదలైంది.
అది నాలోని పురుషుడిని దాటేసి మనిషిని కలుసుకునే అపూర్వ చాలనంగా మారింది.
అప్పట్నుంచీ జీవితాల చిత్రణం మొదలైంది.

+++

దృశ్యాదృశ్యం అంటే అదే.
మనిషిని చేయడం.

+++

మీరూ గమనించి చూడండి.
నా వలే మీలోని పురుషుడిని దాటేసే చిత్రణలు జరిగినయా అని!
ఉంటే అదృష్టం, జీవితానికి దారి దొరుకుతుంది.
లేకుంటే వ్యక్తులే జీవితం అవుతుంది.

నిజం.
అందంతోనే ఇదంతా.
సోదరి నేర్పిన పాఠం ఇది.

ధన్యుణ్ని.

 

– కందుకూరి రమేష్ బాబు

ramesh

బతుకమ్మ పాట

drusjua drisjua 32నగరం అన్నది అలిశెట్టి ప్రభాకరుడికి ఒక రకం.
చార్లెస్ డికెన్స్ కు మరో రకం.అది ఎవరైనా, వారికి ఏమైనా
బతుకు మాత్రం సాహిత్యం, అది నగరమైనప్పటకినూ.నా వరకు నాకు హైదరాబాదు ఒక బతుకమ్మ.
చెరువులు కుంటలు తోటలు విస్తారంగా ఉన్న పల్లెటూరు.
ముఖ్యంగా బతుకును పువ్వు వలే చూసుకుంటూ ఉన్నందున ఇదొక ఆటా పాటా కలగలసిన పండుగ, సాహిత్యం అయినందున నా బోటి బిడ్డకు పట్న జీవనమూ తీరొక్క పూవుల దృశ్యాదృశ్యం.రానైతే, పండుగలో సంబురమే కాదు, విషాదమూ ఉన్నది, ఈ చిత్రం వోలె!

+++

ఎందుకో తార్నాక వెళ్లి తిరిగి రాం నగర్ గుండు వైపు వస్తుంటే పోలీస్ స్టేషన్ ముందరి ఇల్లనుకుంట…ఇట్ల ఆ పెద్ద మనుషులు ఒకరి వెతలు మరొకరికి చెప్పుకుంటూ ఉన్నరు. కళ్ల నీళ్లు తీసుకుంటూ కనిపించారు. మాటలు వినరానంత దూరంలో ఉన్నానుగానీ, అర్థమవుతున్నది ఒక యాతన…

ఆగి పోయాను.

తాతమ్మ కనిపించింది. నాయినమ్మ యాదికొచ్చింది. సంతోషం వేసింది…ఇంకా వీళ్లున్నరని!
ఇట్లా ఒకరికొకరు తోడుగా ఎవరో ఒకరున్నరని.
అదే సమయంలో విచారంతో గుండె కునారిల్లింది, వాళ్లు ఎప్పట్లాగే తమ బాధల్ని వెళ్లగక్కుకోవడానికి అని ఇలా తమ వయస్కులను వెతుక్కుని ఇట్లా ఒక అరుగు మీద కూచొని ఒకరి వెతలు మరొకరికి చెప్పుకుంటూ సేద తీరుతూ ఉన్నరని!
తప్పదా అనిపించింది.
తప్పదనీ అర్థమైంది.

ఇదొక స్రవంతి.
కన్నీళ్ల స్రవంతి.
బతుకు పాటల ఒరవడి.

ఎవరైనా అన్ని దశలూ గడిపాక చివరి అంకంలో ఇలాగే ఉంటారు కదా అనిపించింది.
ఎన్ని అనుభవాలో…అన్నిటికీ ఒక కథ ఉంటుంది కదా… వెత ఉంటుంది గదా అనిపించింది కూడా…
తరగని గనిగా జీవితం ఎప్పుడూ చెప్పుకోవాలనుకుంటూనే ఉంటుందనీ అనిపించింది, వినేవాళ్లకూ ఉంది కనుక ఇదే కథ!

అట్ల నిలబడి వాళ్లను ఎంతమాత్రం డిస్ట్రబ్ చేయకుండా చాలా ఫొటోలు తీసుకున్నాను.
తీసుకుంటుంటే ఎన్నో విషయాలు.

నెరసిన జుట్టు…
వాళ్ల కట్టూ బొట్టూ…
ఆ చీరలు…అంచులు.
ఆధునికతలోకి వచ్చిన వాళ్ల కాలి చెప్పులు.

ఇంకా అరుగులు.

సన్నిహితంగా వాళ్లు కూచున్నతీరు.
ఒకరు చెబుతుంటే ఒకరు వింటున్నరీతి.
శ్రద్ధ, సహానుభూతి. ఓదార్పు. ఆత్మగల్ల జీవన సాహచర్యం.చూస్తుంటే వెనక్కి వెనక్కి వెళ్లని వాళ్లుండరు.
తమ పెద్దలను, తల్లులను యాది చేసుకోకుండా ఉండలేరు.ఒకటొకటిగా చిత్రీకరించసాగాను.
ఒకనాడు తాతమ్మలు ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు చూశానుగానీ అది సానుభూతితో! నిస్సహాయంగా!
కానీ, ఈసారి మాత్రం బాధ్యతగా తీశాను.
ఎందుకంటే, నిదానంగా విషయాలూ అర్థమవుతూ ఉన్నయి గనుక.
ఇది నా ఇంటి కథే కాదు గనుకా.అసలికి మనిషిగా ఉండాలంటే ఇదంతా ఉంటుందని తెలిసిపోయింది.
ఇట్లా పంచుకోవడంలోనే బతుకు ఉన్నదని అర్థమయింది.
అందుకే పాటలు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…
+++అయితే, ఈ చిత్రానికి వచ్చినప్పుడల్లా నాకు అర్థం కాని దొకటే. కానీ, ప్రయత్నించాను.
ఏది ఉత్తమ చిత్రం?చాలా తీశాను మరి.
అందులో ఇద్దరూ దగ్గరగా ఉన్న చిత్రం ఒకటి.
అందులో మరింత స్పష్టంగా అవతలి పెద్ద మనిషి కన్నీళ్లు కానవచ్చే చిత్రం అది.
ఆమె ఉబ్బిన కన్నుల నుంచి విషాదంగా కన్నీళ్లు రాలబట్టిన, జాలువారబట్టిన చిత్రం అది.ఒక లాంగ్ షాటూ ఉంది.
అందులో వాళ్లిద్దరూ చక్కగా కంపోజ్ అయి ఉన్నారు.
వాళ్ల ప్రపంచంలో కన్నీళ్లు తప్పా మరేవీ లేనట్టు ఉన్న చిత్రం అది.ఇంకా ఒక లాంగ్ షాట్, మీరు చూస్తున్న ఈ చిత్రమూ ఒకటి. దాన్నీ తీశాను.
ఇందులో వాళ్లతో పాటు మరి ఇద్దరూ ఉన్నారు.

+++

ఇందులో చిత్రానికి సంబందించిన ప్రధాన ఇతివృత్తమే కాదు,
వీళ్ల వెనకాల ఒక నడి వయస్కురాలు, బట్టలు ఆరవేస్తూ ఉన్నది.
ఆమెకు కాస్త ముందు ఇంకొక అమ్మాయి, చేతిలో ఫోన్ ధరించి ఉన్నది.
ఈ చిత్రం ముఖ్యం అనుకున్నాను. ఎందుకంటే, తరతరాలు ఉన్నాయి గనుక.

వృద్ధతేజం. ముదిమి, యువతి.
అందరూ స్త్రీలే.

కంపోజిషన్ లో మూడు తరాలు ఉండగా తొలి తరం కన్నీళ్ల పర్యంతమై ఉన్నది.
ఇదే నా ఉత్తమ చిత్రం అనుకుంటూ ఈ వారం దృశ్యాదృశ్యం ఇదే అనుకుంటున్నాను.

+++

కానీ, ఇదొక చిత్రమే కాదు. బతుకుల ఖండిక.
ఇందులోంచి పది పదిహేనేళ్లలో లేదా క్రమక్రమంగా ఈ వృద్ధులు అదృశ్యమైతరు.
వెనుక ఉన్న ఆమె మిగులుతుంది.
తనకూ స్నేహితులుంటరు. తానూ ఇలాగే కాకపోతే కొద్ది తేడాతో ఇంకొకరితో ముచ్చటిస్తూ ఉంటుంది.
అటు తర్వాత యువతి రంగంలోకి వస్తుంది.

ఒక పరంపర.

ఏ చిత్రమైనా పరిసరాలతో కూడిన విస్త్రుతిని, అలాగే ప్రధానాంశంలోని విశేషాన్ని పదిలపరిస్తే చాలు.

ఇది అసొంటిదే అనుకుంటను.
+++నిజానికి ఆ వృద్దులు ఒంటరిగా లేరు.
వారి ఆలనా పాలనా చూసుకుంటున్న కోడళ్లూ బిడ్డలూ మనవరాండ్లూ ఉండనే ఉన్నరు.
అయినా ఇది తప్పదు.  ఇలా అరుగుల మీద రెండు పక్షులు వాలడమూ అవి కిచకిచమని ఏవో చెప్పుకోవడం చీకటి అవుతున్నదని తప్పుకోవడమూ మామూలే. కానీ అన్నీ చూసే వాళ్లుంటరు. చూస్తూ ఉండగానే ఇవన్నీ జరుగుతయి. ఈ సంగతి చెప్పడానికి కూడా ఈ చిత్రం ఉపకరిస్తుందనే అనుకోవడం!అయితే, ఏదీ రద్దు కాదు.
ఆధునికులం అనుకుంటాం గానీ చోటు దొరుకుతూనే ఉంటుంది.
ముఖ్యంగా వెతలు పంచుకునేందుకు మనిషి దొరుకుతూనే ఉంటడు.స్త్రీకి తప్పదు.
పురుషుడు తన లౌకిక ప్రపంచంలో ఎన్నో విధాలుగా పలాయనం చిత్తగిస్తడు.
కానీ స్త్రీ చెప్పుకుంటుంది. తనకు జరిగినవన్నీ చెప్పుకుంటూనే ఉంటది.
పాటలుగా కట్టుకుని ఆడుతది, పాడుతది.జగమెరిగిన సత్యం ఇది.
దానికి ఒక సుందరమైన ఆవిష్కరణ ఇది.

అందరూ స్త్రీలే.
బతుకమ్మ పాటలే.
ఒక్కో స్థితిని బట్టి ఒక్కో పాట.
వినవచ్చిన వాళ్ల వింటరు. లేకపోతే లేదు.

అందులో దుఃఖం ఒక ఉపశమనం.
కన్నీళ్లు ఒక ఆలంభన.’city life’కి వందనం.
హైదరాబాదు, సికింద్రాబాదులు – జంట నగరాల… ‘A Tale of Two Cities’కి,
ఈ బతుకమ్మలకీ అభివందనం.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

సురసురమని వెలుగు…

drushya drushyam -31
బతుకు చిత్రాలు బహుకొద్ది దొరుకుతాయి.
చాలాసార్లు వెలుతురులో. కానీ అరుదుగా చీకటిలో దొరుకుతాయి, వెలుతురు బతుకులు.అవును.
వెలుగు నీడల మధ్య కొన్ని జీవితాలు.
గాలిలో పెట్టిన దీపంలా కాదు, దీపం చుట్టూ గాలి గోడలా.
కాసేపైనా అట్లా జీవితం నిలబడి ఉంటున్నప్పుడు, జీవితానికి ఆధారం పొందుతున్నప్పుడు – ఇట్లా చిత్రాలు లభించడం ఒక అదృష్టం.
+++ఒక కుటుంబం బతకాలంటే ఒక చిన్న ద్వారం.
కిటికీ మాత్రం గా తెరుకునే వెలుగు.
ఆ వెలుగు నించే అంతానూ. సురసురమంటూ చేప కాలుతుంటే ఒక వెలుగు. నీడ. అదే ఆధారం. జీవనం.దీన్ని తీసింది మా ఇంటి దగ్గరే.
హైదరాబాద్ లోని పార్సిగుట్టలో, కమాన్ దగ్గర కల్లు డిపో ముందర.+++

నిజానికి చీకట్లో మాత్రమే వెలిగే చిన్న షాపది.
చేప ముక్కల్ని వేయించి మద్యపానంలో మునిగితేలే కస్టమర్లకు వేడివేడిగా రుచికరంగా అందించే మనిషి బండి అది.
నిలబడి నిలబడి నడిచే బండి. చీకటి గడుస్తుంటే వెలుగులు తరిగే సమయం అది
ఏడు నుంచి పన్నెండున్నర. అంతే
మళ్లీ తెల్లారితే- రాత్రయితేనే పని.
అదీ ఈ చిత్రం విశేషం.

+++

దీన్ని చిత్రీంచేదాకా నాకు తెలియదు.
ఒక చిన్న వెలుగు నీడలో జీవితం సాఫీగా గడచిపోతున్నదని.
ఆ మాత్రం చీకట్లో గడిపితే తనకు మొత్తం దినమంతా గడచిపోతుందని!

ఈ చిత్రం తీసి చూసుకున్న తర్వాత ఒకటొకటిగా అటువంటి జీవితాలన్నీ తెరుచుకున్నయి.
ఏడు దాటిందంటే బతికే  జీవితాలన్నీ కానరావడం మొదలయ్యాయి.

మొదలు  ఇదే. అందుకే అదృష్ట ఛాయ అనడం.

+++

ఈ చిత్రంలో ఒక చిన్న శబ్ధం, సంగీతం ఉంటుంది.
ఆకలి కేకల రవళి ఉంటుంది. అది తీరుతున్నప్పుడు సేద తీరుతున్న కమ్మని కడుపు శాంతిజోల ఉంటుంది.
కస్టమరుకు, తనకూనూ…

+++

మనందరం చిమ్మ చీకట్లో ఫొటోలు చాలా తీస్తుంటాం. కానీ, ఒక దీపం వెలుతురులోనో లేదా ఒక చిన్న బల్బు వెలుగులోనో, చుట్టూ గాలినుంచి పొయ్యిని కాపాడుకుంటూ కాస్తంత నిప్పును రాజేసి సరాతంతో అలా సుతారంగా చేపల్ని వేయిస్తుంటే, వాటిని అమ్మే ఈ మనిషిని చూశాక….ఇట్లాగే కందిలి పెట్టుకుని రాత్రంతా కోఠి బస్టాండులో దానిమ్మ పండ్లు అమ్మే ఇంకొకాయన్ని చూశాను. రవీంద్రభారతిలో కీబోర్డు ప్లెయర్ ను తీశాను. ఇట్లా చాలామందిని.

అన్నీ వ్యాపకాలే. ఒకరి తర్వాత ఒకరిని. కనిపించినప్పుడల్లా ఒక వెలుగును నీడలో. ఒక నీడను వెలుగులో…
అంతదాకా తెలియనివి తెలిసి ఆశ్చర్యంతో చూసి చిత్రీకరించడం అలవాటు చేసుకున్నాను.

చూడగా చూడగా చూస్తే, అదొక సిరీస్. జీవితపు ఆసరా.
నిర్వ్యాపకంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడాలనుకుంటే మా ఇంటికి రండి.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

కనువిప్పు

DSC_0421
చాలా కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. ఫొటో తీయాలంటేనే కాదు, చూడాలంటేనూ.

కానీ, వాస్తవం ఏమిటంటే, చూడగా చూడగా తెలుస్తుంది, కష్టమేమీ లేదని!నిజం.
ఈ తల్లి మాదిరి, ఇలా ఒక కన్నో ఒక కాలో లేదా ఏదో ఒకటో రెండో బాలేవని తెలిసి, చూడాలంటే బాధ.
కానీ, ఏదో ఒక వైకల్యమో మరో దురదృష్టమో వెంటాడిన కారణంగా ఆ మనిషిని చూడ నిరాకరిస్తే మరి ఆమె సంగతేమిటి?
ఆమెను కళ్లారా చూస్తే కదా! అసలు దృష్టిలోపం అన్నది తనకున్నదో లేదో తెలిసేది!
ఒక కన్ను లేకపోతే కానవస్తుందా రాదా అన్నది తెలిసేది?

చూడటం అన్న మౌలిక విషయం గురించి లోతైన చింతన నాది.
వారినుంచి తప్పించుకు పోవడమేనా పరిష్కారం అన్న బాధ నుంచే ఇదంతా?
కాదనే ఈ దృశ్యాదృశ్యం.

+++

నిజానికి ఛాయాచిత్ర లేఖనంలో ఒక కన్ను మూసి మరో కన్ను తెరిచి దృశ్యబద్దం చేయడమే సిసలైన కళ.
చూడగా చూడగా దృష్టి నిశితం అవుతుంటుంది. లోకమంతా కన్ను మూయగానే అంతర్లోకాలు తెరుచుకుంటయి. ద్వారాలను కాసేపైనా మూయగానే విశాలంగా తెరుచుకుంటుంది వాన. ఈదురుగాలి. విషాదం. అలాగే ఆనందమూనూ.

కళ్లు ఆర్పకుండా చూడటంలో కాసేపైనా అలా దృక్పథాన్ని పట్టుకుని ఈదులాడినప్పుడే జీవన నావ గురించిన అలుపు సొలుపు లేదంటా విశ్రాంతి అవిశ్రాంతి కాదంటే చేతనం అచేతనం…ఇవన్నీ తెలిసి వస్తయి.
అప్పటిదాకా అవగాహనకు రానివెన్నో కానవస్తూ ఉంటయి. మరింత విస్తృతంగా లోవెలుపలా కనెక్ట్ అయి నిదానంగా అవలోకనంలోకి వస్తూ ఉంటయి.

మనోఫలకంపై పడే చిత్రలేఖనంలో కెమెరా ఉండకపోవచ్చు. కానీ, నేత్రాలున్నయి కదా మనకు.
వాటిలోంచి ఒక జత మనవైన ఒక జత గురించి ఒకమాట.

నిజానికి ఒక కన్ను మూసి, మరొక కన్ను తెరిచి కెమెరా గుండా చూస్తున్నప్పుడు ఆ జతలో ఒకటి పనిచేయడం మరొకటి పనిచేయక పోవడం ఏమీ లేదు. తెరవడం ఒక పని, మూయడం ఒక పని. అలా రెండూ పనిలోనే ఉండగా మరొక కన్నూ ఉంటుంది.
అదే వ్యూ ఫైండర్. దానితో కలిసి చూపును సవరించుకుంటేనే అవతలినుంచి ఇవతలికి ఒక ప్రసరణ. తెలిసీ తెలియక లోన ఏర్పడిన గ్రహణాలన్నీ తొలిగే ఒకానొక జీవస్పర్శ. అదే చిత్రణం. కెమెరా ఉన్నా లేకపోయినా, కళ్లుంటే చాలు. ఆ మాటకంటే చూపుంటే చాలు దర్శనం అవుతుంది.

ఇక్కడా అంతే.
వెలుగునీడల్లో ఉన్న ఆమెను చూడండి.
ఒక వైపు ఆమెను చూస్తే తెరిచి ఉన్న జీవితం. మరొక పక్క చూస్తే తెలియని జీవితం.
కానీ, ఈ పక్కే తన బిడ్డ తల్లి ఆసరాతో తన అమాయకపు కుతూహలపు కళ్లతో ప్రపంచాన్ని చూస్తు ఉండటం నిజంగా ఒక ఆసరా.
తల్లికే.

అవును. నా వరకు నాకు ఒక మనిషి తన పాలిటి జీవన సాహచర్యంతోనో లేదా రక్త సంబంధం తాలూకు కన్నపేగుతోనో లోకాన్ని పరిశీలిస్తరని!
ఆ లెక్కన ఆమె తెరిచిన కన్ను, మూత కన్నూ, బిడ్డ తాలూకు వ్యూ ఫైండరూ కలిసి ఆమె ఎంత చూపరో కదా, జీవితానికి అనిపించి ఒక చెప్పనలవి కాని ఆత్మవిశ్వాసం.

నిజానికి ఈమె కూడా అంతే. ఒక విశ్వాసం. ఒక ధీమా.
అసలైతే తాను భాగ్యవంతురాలు.

ఒక వైపు మెరుస్తున్న ముక్కెర చూడాలి. మెరుపంటే అదే కాదు, ఇటువైపు కూడా ఉంది. అది సూర్యరశ్మి.
అదంతా కూడా ఆమె మొహంపైన.

అదీ వెలుగునీడల రహస్యం.
తానూ పూర్తిగా వెలుతురులోనే ఉందన్న ఆత్మవిశ్వాసం తాలూకు అవగాహన.

సూర్యోదయంతో పనికి బయలుదేరి సూర్యాస్తమయానికి ఇంటికి చేరడంలో ఆమె కన్నుపైనే ఆధారపడి లేదు.
సూర్యుడినీ కళ్లు చేసుకుంది. ఆ సంగతి తెలిస్తే కలిగే విశ్వాసం మహత్తరమైంది.

+++

నాకా అదృష్టం కలిగించే మహిళ తాను.
తానే కాదు, ఎందరో మహానుభావులు…విధి వక్రించి జీవితంలో గాయపడి ఎందరెందరో మనకు కనిపిస్తూనే ఉంటరు.
వారిని చూసి తప్పుకోకుండా అలాగే నిలిస్తే వారు నిజంగా అపూర్వంగా కనిపిస్తరు. అనివార్య  జీవన ప్రస్థానంలో వారు తమకున్నదాంతో అలాగే లేనిదాంతో జీవిస్తూ మెరిసిపోతూ ఉంటరు.
మనకు అంతుపట్టని లోపాలతోనే వాళ్లు జీవితాన్ని అలవోకగా జీవిస్తూ సామాన్యశాస్త్రాన్ని అర్థవంతం చేస్తూ అగుపిస్తరు.

అనిపిస్తుంది, కాసేపు మన కంటికి పని చెబుతేనే లోకం రహస్యంగా తన అపరిమిత రహస్యాలను మన పరిమితులను చెదరగొడుతూ చూపిస్తుందే!
మరి తన కంటిని సంపూర్ణంగా వాడుకునే ఇలాంటి నేత్రధారులను గనుక పదే పదే చూస్తే మనమెంతగా కళ్లు తెరుచుకుంటామని!
ఎవరు సంపూర్ణం, మరెవరు అసంపూర్ణం అని తెలిసిపోతుంటే కళ్లు తెరుచుకోవూ!

అదే ఆశ్చర్యం నాకు. ఆ ఆశ్చర్యంనుంచే తనను పలుసార్లు చూస్తూ ఉంటాను. ఒకసారి నేరుగా కన్ను కన్నూ కలిపితే చిర్నవ్వింది. ఫొటోలు తీస్తుంటే నా శ్రద్ధకు ఆమె సహకరించింది. ఆ సమయంలో బిడ్డ ధిలాసాగా చంకలో ఒదిగి ఉన్నది.

తనలో ఏమాత్రం తడబాటు లేదు. ఇటు నా వైపు నుంచి. ఒక శాంతి.
ఆమెలో మరే మాత్రం న్యూనతా లేదు. ఇరువైపులా అదే అయింది. దాంతో ఒక ఆనందం.
అంతకుమించి ఒక హృదయపూర్వకమైన ఆలింగనం. దాంతో వైకల్యం అన్నమాట దేవుడెరుగు. ఒక చిద్విలాసంగా ఒక తీయటి పండును పంచుకున్నట్టు శుభ్రమైన ఆనందం. కల్మషం లేని ఆ చిరునవ్వు చూడండి. కళ్లు నవ్వినట్టు.

అనుకుంటాం గానీ, ఆ బిడ్డ కనులూ పనిచేస్తున్నయి.
అదొక గమ్మత్తు. అదొక తన్మయత్వం.

చిత్రమేమిటంటే, చంకలో ఉన్న బిడ్డకు ఊహ లేదు. కానీ, ఉనికి తెలుసు.
అదీ నిజంగానే ఒక చూపు. అందుకే ఈ చిత్రం చిత్రమే.

+++

మనం చూడగా చూడగా అన్నీకనపడుతూ ఉంటయి.
అందుకే అభ్యర్థన. దయుంచి మనుషులను తప్పించుకోవద్దు. వైకల్యం పేరిట వికల మనస్కులు కానేవద్దు. వాళ్లు మీరనుకున్నది కాదు. వాళ్లు జీవించిందే జీవితం. అదెట్లో తెలుసుకునేందుకే మన కళ్లు. రెండు చాలకపోతే ఒక కన్ను మూసుకుని చూద్దాం.
అదే కళ. జీవకళను చూపించే కళ.

నేరుగా చూడండి.
ఒక రకంగా ఇదీ సాహిత్య పఠనమే.
మానవేతిహాసాన్ని చదవడానికి చూపూ అవసరం అని చెప్పే సాహిత్య అవలోకనం, ఛాయాచిత్ర లేఖనం.

~  కందుకూరి రమేష్ బాబు

ramesh

భారతరత్న

drushya drushyam 29

అత్యంత సామాన్యమైన చిత్రాల్లో ఇదొకటి.
ఒక గుమస్తా దేశరాజధాని అయిన ఢిల్లీలో ఉదయాన్నే తన కార్యాలయానికి బయలుదేరుతున్నప్పుడు తీసిన ఫొటో.

ఇందులో ఏమీ లేదు.
నిజమే.

కానీ, ఇది పబ్లిక్ పరేడ్లో ప్రదర్శనకు పెట్టదగ్గ ఫొటో.
కానీ, ఏముందని పెడతారు?

నిజమే.
ఇందులో ఏమీ లేదు.
సామాన్యం. సాధారణత్వం.
అంతే.

నిజానికి మీరు కోటిరూపాయలు ఇవ్వండి. ముఖ్యమంత్రి చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు చిత్రీకరించమనండి.  పారిపోతాను. ఒక కోటీశ్వరుడు ధీమగా తన సామ్రాజ్యం ముందు ఫోజు ఇస్తున్నప్పుడు తీయమనండి. అవకాశం ఉంటే చంపేస్తానుగానీ తీయను. పోనీ, రేపు తెలంగాణ జెండా పండుగ రోజు ఉద్యమ ఫలితంగా అధికారం చేబూనిన అధినేతను చిత్రీకరించమని అసైన్మెంట్ ఇవ్వండి. లాభం లేదు. చేతులు రావు.
క్షమాపణలు చెప్పి ఊరుకుంటాను.

ఇదొక చిత్రమే.
ఇదీ చిత్రమనే ఈ దృశ్యాదృశ్యం.

నిజం. సంబురంగా ఉన్నప్పుడు ఊరేగే మనుషులను చిత్రీకరించడం కన్నా ఆ సంబురానికి ముందర జీవితాన్ని చెప్పడం చిత్రం. ఆ మందరి కాలాన్ని పోరాటమయం చేసిన మానవుల గురించి రాగం తీయమంటే అది శ్రావ్యం, ఆనందదాయకం.

అంతెందుకు? ఒక పెళ్లి ఫోటో తీయడం కన్నా ఒక అమ్మాయి తన కలల్ని సఫలం చేయమని దేవుడి ముందు చేతులు జోడించిన దృశ్యం తీయాలనిపిస్తుంది. తలలో ఒక పువ్వు తురుముకుని, తప్పక తన ప్రార్థన ఫలిస్తుందని గిరుక్కున వెనుదిరిగేప్పుడు తీయాలనిపిస్తుంది. అంతేగానీ, తీయమంటే తీయడానికి వాళ్లు మనుషులైతే సరిపోదు. మాన్యులు కావాలి. నిర్మలం సామాన్యం అయి ఉండాలి. అంటే ప్రదర్శనకు పెట్టని సాధారణత్వం.

నిజమని నమ్మండి. నాలుగు స్తంబాలాటలో అన్నీ అధికారాన్ని కాపాడేవే అయినప్పుడు అందులో అనివార్యంగా తలదాచుకున్న వాళ్లను పురుగుల్లాగా తీయమంటే తీయడం కూడా అయిష్టమే.
హీరోల్లాగా తీయాలని ఉంటుంది.

తాము ఎటువంటి పరిస్థితిలోనైనా ఉండనీయండి, దైనందిన జీవితంలో ప్రతి క్షణాన్నీ సుందరమయం చేసుకునే ఎదురీతల జీవితాలను తీయడమే నిజమైన బుద్ది. సహ్రుదయత.
అంతేగానీ, తీయమంటే తీయడానికి ఇవి జీవనచ్చాయలా ఇంకొకటా?
జీవితాలు. రక్తమాంసాలతో, చీమూ నెత్తురుతో వెలిగే ఆత్మనిగ్రహాలు.

తడి ఆరని గొంతులకోసం ఒక ఆర్తిగీతం పాడే జయరాజును తీయమంటే తీయబుద్ధవుతుంది.
తరతరాల దైన్యాన్ని మానని గాయంలా రాజేసే గోరటిని తీయమంటే తీయాలనిపిస్తుంది.
సామాన్యం, సాధారణత్వం. ఇవే చిత్రాలుగా తీయబుద్ధవుతుంది.

+++

ఈ ఫొటో అట్లాంటిదే.
తీసి పెద్దది చేసి ప్రదర్వనకు పెట్టినపుడు ఎవరూ అభినందించలేక పోవచ్చు.
కానీ, అంతకన్నా పెద్దది జరుగుతుంది.

ఒకరోజు అదే జరిగింది. ఇటువంటిదే ఒక రిక్షాను ప్రదర్శించినప్పుడు ఒక దళిత కవి, విద్యార్థి సోదరుడు వచ్చి అడిగాడు, కావాలని! ‘అది మా నాయిన కష్టాన్ని గుర్తు చేస్తున్నది అన్నా, కావాలి’ అన్నడు. ఇచ్చి రుణం తీర్చుకున్న.

ఒక రకంగా తాను తన తండ్రిని గుర్తుచేసినందుకు తీర్చుకున్నరుణం కూడా అది.
అలాగే, తరతరాలుగా రిక్షాలో పయనించిన మానవజాతి రుణం అట్లా సులువుగా తర్చుకున్నతరుణం అది.
ఒక పరేడ్లో పెట్టే ఫొటో అట్లా ముందు ఒక ఇంటికైతే పంపిన తృప్తి నాది.

సామాన్యమైనదే తీయాలి. ప్రదర్శించాలి. మామూలు మనుషులనే తీయాలి. అప్పుడు తాను గొప్పవాడు అవుతాడు.
సామాన్యం అసామాన్యం అవుతుంది. ఇదంతా ఒక నిదానం. చినుకు చినుకు కురవడం. వర్షమే కురుస్తుందునుకుని భూమి తడిని ఆస్వాదించే అదృష్టం. ప్రతి దృశ్యాదృశ్యంతో.

+++

తీయబుద్ధవుతుంది.
సామాన్యుల జీవనచ్ఛాయలను తీసుకుంటూ పోయే ఒక పని అవిరళంగా జరగాలనీ, దాన్ని నిరాటంకంగా రాయాలనీ అనిపిస్తుంది.

ఈ ఫొటో చూడండి. చక్కగా ఉతికిన దుస్తులు. మల్లెపువ్వసొంటి అంగి. కాఖీ ప్యాంటు. నీట్ గా తుడిచిన సైకిలు. సీటు చెమటకు ఇబ్బంది పెట్టకుండా నిండుగా ఖర్చిఫ్ రక్షణ.  కోడలు ఉదయాన్నే లేచి మామయ్యకు సిద్ధంచేసిన లంచ్ బాక్సు. దాన్ని శ్రద్ధగా అమర్చుకున్న తీరు. భార్య తన అభిమానాన్ని ఏ మాత్రం ప్రదర్శనకు పెట్టకుండా తాను వెళుతుంటే అట్లా చూసి పంపడమూ ఉంటుంది, ఈ చిత్రానికి ముందు. అంతే. ఇక ఈ చిత్రం ఇట్లానే బయలుదేరుతుంది. చేతి గడియారం చూసుకుంటుంది. సమయం మించకుండా వెళ్లి తన పని తాను చేసుకుని మళ్లీ సాయంత్రం చిత్రంగా ఇంటికి తిరిగి వస్తుంది.
మళ్ళీ ఈ సైకిల్ చిత్రం రేపూ ఇట్లే పయణిస్తుంది. మళ్లీ గూటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటుంది.
ఇంత చిత్రజీవితం ఇంతే. మామూలే.

ముఖం లేదు ఎందుకూ అంటే ముక్కూమొహం తెలియకుండానే కోట్ల మంది మనకిట్లా కనిపిస్తారు, కార్యాలయాలకు వెలుతూ,  ఫ్యాక్టరీలకు పోతూ, భూమిని దున్నుతూ…అయినా ఈ మనిషి తనను తాను ప్రదర్శించుకోడు.

తానొక్కడే ఈ భూమ్మీద లేడు మరి! అందువల్లే తన మొహం అంత ముఖ్యం కాదనుకుంటాడు.
నేనూ అదే అనుకుంటాను. మొహంతో సహా చెప్పవచ్చు. కానీ, ఇది ఒక వ్యక్తి చిత్రం కాదు. సామూహిక వ్యక్తీకరణకు ఒక చిహ్నం. అందుకే తానూ, తన సైకిలూ, తన జీవన పయణం. ఉద్యోగ ధర్మం… అంతా ఒక చిత్రాచిత్రం. దృశ్యాదృశ్యం.
క్రమశిక్షణతో, నియమబద్ధంగా అంతా ఒక పద్ధతిలో జరిగిపోతూ ఉండే పరంపర చిత్రం.

+++

వీళ్లను “ఆమ్ ఆద్మీ’ అని చెప్పి ఒకరు తాజాగా రాజరికానికి వస్తరు. కానీ, విడిచిపెడతారు.
ఇంకొకరు “నమో ఛాయ’ అని బయలుదేరుతారు. రాజ్యానికి చేరుకుంటరు. కానీ, విడిచిపెడతరు.

ఇట్లా వచ్చిన వాళ్లు… పోయిన వాళ్లు ఉండనే ఉన్నరు.
కానీ, స్వాతంత్ర్యానంతరం ఇతడు మాత్రం తన మానాన తాను పనిచేసుకుంటూనే ఉన్నడు.
బహుశా ఓటు వేయడానికీ కూడా ఈయన ఇట్లే బయలుదేరుతాడు.

తెలుసు. ఏమీ కాదనీ తెలుసు.
కానీ, ఓపిగ్గా తన పయణాన్ని తాను చేబూనే మహానుభావులు వీళ్లు.
వీళ్ల చిత్రాలను తీసినందుకుగానూ నాకు “భారతరత్న’ ఎప్పుడొస్తుందో అప్పుడు నేను ఈ పని నిజంగానే మనేయాలి.
అంతదాకా విరామమెరగక నా కలం, కన్నూ పనిచేయవలసిందే.

నాలాగా ఎందరో, గుమస్తాలు. పాత్రికేయులు. కవులు, రచయితలు.
విజ్ఞులు. అందరికీ అభినందనలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

చిత్రాంగి

drushya drushyam 28మన దిష్టి తగులుతుందిగానీ చూడగలిగితే ఎన్ని అందాలో…
అస్పష్టంగానూ, నిగూఢంగానూ ఉండే అనురాగాలూ హృద్యమైన వ్యక్తీకరణలలూ కనుల ముందు దృశ్యబద్ధమైతే మానవులు ఎంత హాయిగా ఉంటున్నారో తెలిసి రాదు!నిజానికి మనుషులు ఏకాంతంలో లేదా తమ వ్యక్తిగత ప్రపంచంలో ఎంత బాగుంటరు?
తమను తాము ఆవిష్కరించుకుని ఆనందించడంలో, తమలో తాము లీనమై ముచ్చట్లాడటంలోవాళ్లు ఎంత ముద్దుగుంటరు!నిజానికి ఈ చిత్రం ఆమెదే.
కానీ, ఇద్దరిని కాంపోజ్ చేస్తూ నేను మరో ఇద్దరు పురుషులనూ ఫ్రేంలోకి తెచ్చాను, గమనించగలరు.

ఎందుకూ అంటే, మరేమీ లేదు. అపోజిట్ సెక్స్ కారణంగా చిత్రానికి ఒక విస్త్రుతి. ఇరువురూ ఇరువురితో సంభాషణలోఉండటంలో ద్యోతకమయ్యే ఒక మోహనం. దానికి సూచికగానే ఇది!
అది ఫోన్ సంభాషణ కావచ్చు. ఏమైనా, అంది వచ్చిన సౌకర్యంలోని సుఖమూ శాంతి, విలాసమూ, అభివ్యక్తిలోని ఆ అలవోకనూ చూస్తారనే ఈ చిత్రం.పరిపరి చూపుల్లో పలు విషయాలూ పలుకుతయనే చూడమనడం!పురుషుల నుంచి విడివడి ఆ ఇద్దరిని మళ్లీ చూడండి. వాళ్లిద్దరూ కాసేపు లంచ్ టైమ్ లో అట్ల కూచున్నప్పుడు తీసిన ఈ ఫొటోను చూడండి. ఆమెనే కనిపిస్తుంది. ఆ రూపసి, ప్రేమమయి, శ్రామికురాలు చిలకపచ్చ రంగు వస్త్రాల్లో తెరతీయగ చూడండి. తనలో లోపలి భావనలకు రూపమీయడంలో లీనమవడంలో ఏదో ఒక ప్రియమైన సంభాషణలో ఉండగా అవతలి ప్రాణంతో ప్రాణమై కలబోసుకోవడంలో ఎంత ఏకాగ్రత ఉన్నది.

బాపు బొమ్మలను ఎన్ని వందలుగా నేను స్వయంగా దర్శించానో.
ఇదొక చిత్రం.

+++

మనుషులు ఏ తెరలూ లేకుండా మరే గోడలూ అడ్డు లేకుండా గొంతు ఒక్కటే ప్రాణం అయినట్లు సంభాషణ పావనం చేసే తీరు ఒక చూడ ముచ్చట. ఆ స్థితిని దర్శిస్తే ఎవరికైనా ఈర్శ కలగక మానదు. చిత్రమేమిటంటే, ఇంతటి సౌజన్యం పెంచింది మాత్రం మొబైల్ ఫోనే!

అది ఫోనే సంభాషణే కావచ్చు. కానీ, ఇరువురి మధ్యా అదొక చెలియలి కట్ట.
బహుశా ఆ గొంతు నిండా ధ్వనించే ఆప్యాయత అభిమానాలతో ఒకర్నొకరు ప్రేమగా పలకరించుకోవడం. క్షేమ సమాచారాలు పంచుకోవడం, అటు పిదప నిదానంగా సంభాషణలోకి దిగడం, పరాచకాలాడటం, నిందా పూర్వకంగా మాట్లాడుకోవడం, అలక వహించడం – అన్నీనూ. అవును. పెదవులు దాటిన పదనిసలకు అంతూ పొంతూ ఉండదు. కానీ, చూడటం కూడా ఒక రొమాన్స్.

+++

ఫోన్. అవును. ఇవ్వాళ మానవ సంబంధాలన్నిటినీ ఒక్కటి చేసిన సందర్భం….ఈ సాఫల్యాన్ని నేనొక్కడినే చూడటం లేదు. అందరి అనుభవంలోనూ ఈ సరాగాలూ ఉన్నవే! ఆ ఉల్లాస సల్లాపాలు ఎక్కడి కక్కడ ఉన్నవే.
వేష బూషణాలు, సహజ సౌందర్యం, లావణ్యమూ, సరస పరిజ్ఞానము, ఇంకా చాలా…అవన్నీ ఉన్నతీకరించబడేవి అనుబంధాలతోనే కదా! అందుకే ఈ బంధం గురించిన చిత్రం.  ఇదొక శ్రమైక జీవుల విలాస సోయగంలో ఒక చిరు ఖండిక.

+++

ఇదివరకు ఎన్నో కట్టుబాట్లు. కులం, మతం, లింగం, ప్రాంతం, ఆర్థిక తారతమ్యాలు.
వీటన్నిటితో కూడి ఇంకెన్నో సాంఘిక కట్టుబాట్లు. ముఖ్యంగా మహిళలకు.

తాను తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడమే అరుదు. అలాంటిది ఇప్పుడు తాను తన దగ్గరి వాళ్లతో, దూరపు బంధువులతో, అపరిచితులను పరిచయం చేసుకుని, పరిచయస్తులనూ ప్రియం చేసుకుని, తక్షణపు పలకరింపులతో ఒక హృదయపూర్వక చాలనం.

ఇపుడు ఏ అడ్డూ లేదు. ఉన్నదల్లా తానే. తనను తాను అధిగమించడమే. తన పరిమితి. తనను తాను అదుపులో పెట్టుకోవడమే..అదే ఇవ్వాళ్టి సమస్యా, పరిష్కారం.

+++

ఒకానొక మధ్యాహ్నం.. ఇద్దరు కూలీ చేసుకునే మహిళలు అట్లా లంచ్ టైం అయ్యాక కాసేపు అలా విశ్రాంతిగా కూచున్నరు. ఇంతలో ఒకామె ఫోన్ మోగింది. ఇంకేం? సంభాషణలోకి దిగింది.
మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆమె అలవోకగా ఆ నేలను చిన్నగా సాపు చేస్తున్నది. ఏవో ఉంటయి, ఏరుతుంటది. ఇంకేవో కనవడుతై. తీసి పారేస్తది. ఇంకా ఎన్నో.

క్రమంగా ఆమె కళ్లు అరమోడ్పులైతయి. పెదవులు గారాబాలు పోతయి.  నవ్వు, పరిపరి విధాలై వికసిస్తది. ఒళ్లు సిగ్గుల మొగ్గవుతది. మనసు తేలిపోతుంది…అంతా మొబైల్ ఫోన్ మహిమ.

చూస్తుంటే ఆమె ఇక్కడ ఉన్నదనుకోవడం ఒట్టి భ్రమ. తన మనసు అవతలి వ్యక్తి మీదే ఉన్నది.
కేవలం ఆ శరీరం ఇక్కడుందన్నమాటేగానీ తాను అక్కడే ఉన్నది.
మాట్లాడుతూ మాట్లాడుతూ చేతుల్తో కింద నేల మీద అలవోకగా ఏదో రాస్తుంది. అది కవిత్వం కాదా? మునివేళ్లతో ఏదో ముడుతది. ఒక చిన్న పుల్లను తీస్తది. దాంతో చిన్నగా రాళ్లనూరప్పలను కదుపుతూ కదుపుతూ ముచ్చట్లను రాజేస్తది.

అర్థవంతమైనవో కావో మనకేమి ఎరుకగానీ, తీయటి పలుకులేవో వింటూ చెబుతూ తానేదో అనల్పమైన మాధుర్యంలో తేలియాడుతూ ఉండగా బిబూతీ బూషణుడు అన్న మాట గుర్తుకొస్తుంది. స్త్రీ ఒకసారి తన హృదయ ద్వారాలు తెరిచిందా ఇక స్వర్గమే అని!

నిజమే కాబోలు. కానీ ఎంతమందికా అదృష్టం.

చిత్రంలో ఆ సంగతీ చూడవచ్చు. సంభాషణలో ఉన్నప్పుడు వాళ్ల హావభావాలను, కదలికలను, శరీరపు భంగిమలను చూస్తుంటే భువన విజయం అంటే ఇదే అనిపిస్తుంది.మనిషిని సాధించడం. అవును. ఆడవాళ్లని కాదు, ఎవరైనా సరే, మనిషి ఎవరైనా సరే. ప్రేమతో దర్శించండి. వాళ్లను వాళ్లుగా వదిలినప్పుడు వాళ్లెంత బాగుంటరు. ఒకరినొకరు సాధించుకోవడంలో ఎంత దివ్యంగా కానవస్తరు.

+++

అన్నట్టు, ఆ యువతి అవతలి ఎదపై ఊసులాడుతుండగా ఆ మాటల్ని చిన్నగా వింటూ, అదంతా తనకూ తెలుసు లేదా నేనూ అనుభవించినదే అన్నట్టు ఆ సోదర మహిళ! ఒక అంగీకారం గల మనిషి పక్కన ఉన్నందువల్లో ఏమో ఈ యువతి కూడా హాయిగా లీనమైపోవడం…ఇదంతా చిత్రమే, చూస్తే! లీనమే అనుభవిస్తే.

వెలుగునీడల ఛాయా చిత్రణలో ఒక చిత్రం ఇట్లా కూడా.

తానెవరూ అని అడిగి చిన్నబుచ్చకండి. అలా తీయడం తప్పే కదా అని పెద్దరికాలు పోకండి.
మీ మనసులో ఉన్న మీ మనుషులను దర్శించమని, ప్రియమైన పరష్వంగం కోసం సంభాషించమని, ఫోన్లో అయినా ఇంత కథనం ఉందనీ అనీ ఈ చిత్రం.

కృతజ్ఞతలు,

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

The God of Small Things

drushya drushyam-27చూడటానికీ, దర్శించడానికీ ఉన్న తేడా గురించి చాలా చర్చ చేయవచ్చు.
కానీ, చూడండి. ఇప్పుడు ఇక్కడే ఆ ఎములాడ రాజన్న సన్నిధిలో ఉన్న ఈ తల్లిని చూడండి.
అది నిజంగా దర్శనమే.నిజం.
మనుషులను దైవానికి మోకరిల్లగా చూడాలి.
అదీ దర్శనమే.

ఎంత నిండుదనం.
ప్రేమా, శాంతీ.
తపస్సూ!

+++

విశేషం ఏమిటంటే, దైవ సన్నిధిలో కనిపించినంత నిండుగ మనుషులు మరెప్పుడూ ఇట్లా కనిపించరు!
సకలాంగులూ వికలాంగులూ అని కాదు, ఎవరైనా సరే, దేవుడి ముందు దీపమై వెలుగుతారు.
దీపం కింది చీకటి గురించిన బెంగ లేదు. దాన్ని ఆ భగవంతుడు చూసుకుంటాడనే ఈ ముద్ర.
నిమగ్నత. లీనం. కదలకుండా అట్లా ఆ కాసిన్ని క్షణాలు నిశ్చలమై నిలవడం.

మళ్లీ కదిలితే జీవితం. భక్తి ఆవిరైపోయి మళ్లీ మామూలే. మామూలు చిత్రమే.
అందుకే అనిపిస్తుంది, ఆరిపోని జీవితంలో రెండు చేతులారా ఆ భగవంతుడికి నమస్కరించడంలో ఒక ఆత్మశాంతి.

కానీ, ఒకటి మాత్రం నిజం.
ఆ దైవ సన్నిధిలో ఎవరైనా అసంపూర్ణమే.
బహుశా అందుకే ఆ నిండుదనం కావచ్చును!

+++

నిజానికి దైవ సన్నిధిలోనే కాదు, ఎవరైనా సరే, కళ్లు మూసుకుని తమలోకి తాము చూసుకునే ఏ చిత్రమైనా గమనించి చూడండి. అది ఆ మనిషి స్థాయిని పెంచినట్లే ఉంటుంది. ఒక అలౌకిక స్థితిని దర్శనం గావిస్తుంది. కారణం, లోపలికి చూసుకోవడమే! వెలుపలి నుంచి లోపలికి చేరుకోవడమే. తమ పరిమితిని దర్శించడమే. అందుకే కాబోలు, కళ్లు మూసుకోగా జీవితం విస్తరించి కనబడుతుంది,

ఇక్కడ విస్తరణ, వాకర్.

+++

అవును. వాకర్.
ఆ తల్లి మోకరిల్లడంలో భగవంతుడే కాదు, ఆ వాకర్ పక్కనున్నది. చూడండి.
మూడు కాళ్ల ముసలమ్మకు ఆ వాకరే నాలుగోకాలు. పంచభూతాల్లో కలిసేదాకా కన్నబిడ్డలు వెంటున్నా లేకున్నా ఇప్పుడు ఆ వాకరే తనకు ఆలంబన. గుడి దాటాకా దేవుడు.

ఆమె కళ్లు మూసుకుని దండం పెట్టుకుంటున్నప్పుడు ఆమె నుంచి ఆ వాకరే కంట పడుతున్నది.
ఆమె స్థితీ గతీని ఆవిష్కరిస్తున్నది.

తన పేదరికానికి చిహ్నం అది. అతుకులు వేసుకుని తన రైక కుట్టుకున్నట్టే ఆ వాకర్నీ ఆమె జాగ్రత్త చేసుకున్న తీరు ఒక మహిమ. జీవన లాలస. మానవ ప్రయత్నం.

ఉన్నదాన్ని తనతో పాటు ఉంచుకుని ఈ జీవన సమరాన్ని జయించేదాకా బహుశా అదే తన ఆధారం.
అందుకే కాబోలు, ఆమె ఎంత శ్రద్ధగా దాన్ని చూసుకుంటున్నదో చూడండి.

దాని కాళ్లు చూడండి.
ఆమె కాళ్లూ చూడండి.

ఒక జత ప్రాణాలనిపించవూ అవి!

సరిగా లేవు. అయినా సరి చేసుకున్న తీరు చూడండి.
ఆ ప్లాస్టర్ అతికింపులూ…ఆ సుతిల్ తాడు ప్రయత్నం,
అంతా ఒక శక్తిమేరా ప్రయత్నం.

ఒకప్పుటి ఆమె ధారుడ్యానికి చిహ్నంగా ఉన్న తన చేతులు…
వాకర్ చేతులూ, బాహువులూ చూడండి. అతుకులు పడ్డవన్న భయం లేదు.
ఆమె జాగ్రత్తగా ఉందని చెప్పే ఆ చిన్న చిన్న రిపేర్లనూ చూస్తుంటే మానవ ప్రయత్నం ముందు ఆ దేవుడు చిన్నబోడూ…
లేదూ హమ్మయ్య…తన ప్రయత్నం అక్కర్లేదని ఆనందించడూ!

నిజమే కాబోలు.
భగవంతుడి సన్నిధిలో ఆమె కళ్లు మూసుకుని ఉన్న ఆ దృశ్యం… అనివార్యంగా తనకు రక్షణగా నిలిచిన ఆ వాకర్ తో కలిసి ఒక అపూర్వ సన్నివేశాన్ని వ్యక్తం చేస్తున్నది.

చూడటం కాదు, దర్శించడం. కనిపించేది ఒక్కటి కాదు, రెండు.

అదీ విషయం.

ఒక కన్ను మూసుకుని వీక్షించే ఛాయా చిత్రకారుడి ధ్యానమంతా ఇటువంటి చిత్కళను ప్రదర్శించడమే కదా!
దృశ్యాదృశ్యం అంటే ఇదే మరి!

మరి చిల్లర దేవుళ్లకు వందనం.
వారికి ఊతమిచ్చే వాటన్నిటికీ అభివందనం!

ప్రార్థించే కళ్లు!

drushya drushyam 26
ప్రశాంతి ….బహుశా ప్రార్థనా సమయం విద్యార్థిగా ఉన్నప్పుడే ఉంటుందా?
ఏమో!కానీ, నిత్య విద్యార్థిగా భుజానికి కెమెరా వేసుకుని, ఉదయాన్నే వాడకట్టులన్నీ తిరుగుతూ ఉంటే, పరిసర ప్రపంచంలోని మనుషులు ఒక్కరొక్కరుగా తెరిచిన పుస్తకమై హత్తుకుంటుంటే, ఒక మావవేతిహాసం దానంతట అది ఆహ్వానించి సరికొత్త జీవన మాధుర్యాన్ని పంచుతూ ఉంటే, జనగనమన అక్కరకు రాదు.
అప్పుడనిపిస్తుంటుంది! ప్రార్థించే పెదవులకన్నా కళ్లు గొప్పవేమో అని, రాయాలనీ అనిపిస్తుంది!’కాంతి వాచకం’ అనదగ్గ ఫొటోగ్రఫీ కారణంగా కళ్లు అత్యున్నతమైన ప్రార్థన కోసం చికిలించుకుని నిదానంగా తెరుచుకుంటూ ఉన్నప్పుడు ఒక గొప్ప భావం కలిగేను….అదే శాంతి. అవును. శాంతి… అందలి ప్రశాంతి….పీస్ ఆఫ్ మైండ్.

మైండ్ అని అనడమే గానీ అది హృదయం.
ఈ జగద్ధాత్రిలో వికసించే హృదయరాగం. అదే ప్రార్థన.

ఈ చిత్రం అటువంటిదే అని మనవి చేస్తూ మొదలు….

+++

ఆ రోజు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దాటానో లేదో ఆ మూల మలుపులో గుడెసెల వద్ద ఆగక తప్పలేదు. వరుసగా ఉన్న గుడిసెల్లో ఒకానొక గుడిసె ముందుకు రాగానే కళ్లు అతడిపై వాలాయి. ఒక సషుప్తిలో ఉన్నటువంటి అనుభవం వైపు ఏకాగ్రం అయ్యాయి. చప్పున కెమెరా తెరిచి ఒక కన్ను మూసి ఈ ఛాయను ఒడిసి పట్టుకున్నాక ధన్యుణ్నయ్యాను.

గుడిసె అంటే ఒక గుడి.
ఈ హృది నివాసం గనుక అది గుడి.

కాషాయం కాదు, చల్లగా ఉండేందుకా అన్నట్టు దళిత జీవితపు సుఖమయ ఆరాటానికి ప్రతీకా అన్నట్టు ఆ నీలం రంగు వరక్కాయితాలు పరిచిన గుడిసె…దాని ముందు… నీలం రంగు షర్టే వేసుకున్న ఆ మనిషి…
తాను తలపై అట్లా చేయించుకుని ఎంతసేపైందో!

క్షణాలు దొర్లుతున్నా కదలక మెదలక అట్లా నిశ్భబ్దంగా…

చూడగానే ఆగిపోయాను. దగ్గరకు సమీపించాను. ముందొక ఫొటో తీసుకుందాం అనుకున్నాను.
కానీ, ఆ ఒక్క ఫొటో తీసుకుని చూసుకుంటే, ఇక ఇంకా వద్దనే అనిపించింది.
అది చక్కగా రావడంతో సంతషించి ఇక వెనుదిరిగాను.

వెనుదిరుగుతుంటే మళ్లీ ఒక భావం. వీళ్లను ఎవరైనా ఇట్లా చూస్తున్నారా?
పదులు, వందలు, వేలు, లక్షల మంది ఇట్లా ఇంత హాయిగా, ఇంత నిర్భయంగా, ఇంత స్తైర్యంతో ఇట్లా ఉండగా లక్షలు, వేలు, వందలు, ఒక్కరు…అవును, ఒక్కరైనా ఇట్లా ఉండగా చూస్తున్నారా? అనిపించిందొక క్షణం.
తక్షణం ప్రార్థన అనుకున్నాను.

అందరికీ లభించే అదృష్టం కాదిది! అనిపించింది.
జనసామాన్యంలోని దారిద్ర్యాన్ని, ఎదురీతను మాత్రమే చూసే సమస్త లోకంపై ఒక చిన్న మందహాసం.
ఆ వెంటనే నన్ను నేను తమాయించుకుని వెనుదిరిగాను.

వెనుదిరిగినా అతడే. ఎన్నోసార్లు చూసుకున్నాను.
పదే పదే ఈ చిత్రాన్ని చూస్తుంటే ఎంత బాగుంటుంది!

అది ఎండాకాలమే. కానీ, తన ముందర నీళ్ల చెంబు.
స్టీలుదే!  కానీ, దాహం తీర్చుకోవడం ఎంత ముఖ్యమో, మంచినీళ్ల ఆనవాలు చెప్పే ఆ ఒక్క చెంబు మొత్తం కంపోజిషన్ ను హాయిగా మలిచిందనిపించింది. నిజానికి ఆ నీలం రంగు వరకు చినిగింది. రంధ్రం ఉన్నది. కానీ, అది చేసిన గాయాన్ని ఈ చెంబు తీర్చిందనే అనిపించింది.

ఇక తన కింద ఆ చెద్దరు. తల గడపలా ఆ ఎర్రెర్రని చెద్దరు.
రంగుల సమ్మేళనం చూడవస్తే కిందికే పోవాలి. అధో జగత్తు సహోదరుల వద్దే నేర్చుకోవాలి.
ఏం జీవన సమ్మేళనం అని ఆచ్చెరువొందవలసిందే!

అప్పుడు ఉదయం ఏడెనిమిది అవుతున్నది. తాను అప్పటికే నిద్రలేచి చాలా సమయం అయిందేమో. మల్లొక కనుకు తీస్తూ ఉన్నాడేమో…లేదా… ఏదో ఆలోచించి స్థిమిత పడ్డాడేమో!

ఏమైనా ఒక శాంతి.
లోవెలుపలా ప్రశాంతి.

తన ముందర ఒక ఎండ పొడ తాలూకు చిన్న వెలుతురు క్రీడ, నీడ…
అదొక కాంతి. చీకటి లేదని చెప్పే చిరుదీపమూ…

అనుకుంటాం గానీ, పేదవాళ్లు చీకూ చింతా లేకుండా ఉంటారని!
ఉంటారు. అయితే, ఒక చిత్రమైన విషయం…భగవంతుడు మనకొక ముఖాన్ని ఇస్తాడు. కానీ, దాన్ని వికృతం చేసుకోకుండా నిద్రపోం కదా మనం! కానీ, నిరుపేదలు అలా కాదు. వాళ్లకు ఆర్థిక సామర్థ్యం అంతగా ఉండదన్న మాటేగానీ, మిగతా వాటన్నిటిలో వాళ్లు ధనవంతులు. భాగ్యవంతులు….
అందుకే వాళ్ల ముఖాల్లో కృతకం ఉండదు., నైర్మల్యం తప్ప!
భీతి ఉండదు, స్థిమితం తప్ప!
చిత్రమే.కానీ వాస్తవం.

అధికారం, హోదా వాళ్లకు బహు తక్కువ. అందువల్ల కూడా వాళ్లు అదృష్టవంతులు.
అందువల్లే వాళ్ల సహజ ప్రవృత్తి ఇట్లాగే నిరాడంబరంగా, నిఖార్సంగా ఉంటుంది.

తలపై చేయించుకున్న విధానమే చూడగలరు.
ఒక చేయిని ఆలంబన చేసుకుంటే మరో చేయిని అభిమానం చేసుకున్న విధానం…
చూడగలిగితే మనిషంత మహత్తరమైన జీవగ్రంథం ఇంకేదైనా ఉంటుందా, చదవడానికైనా!
అందుకే వాళ్ల చిత్రాలు సజీవగ్రంథాలు. ప్రపంచ సాహిత్యంలో ఎల్లవేళలా చదవతగ్గవే!
కాలదోషం పట్టని జీవధాతువులే.

విషయం ఏమంటే, ఆ మట్టి మనుషులకు వందనం అని!
తల దాచుకోవడానికి పక్కా ఇల్లయినా లేని ఎందరో మహానుభావులు…వాళ్లింకా శాంతమూర్తులే!
అందుకూ ధన్యవాదాలే!+++ప్రార్థించవలసింది ఏదైనా ఉంటే ఇదే.
కళ్లతో చూసి, వాళ్లు ఇంత చల్లగా ఇంకా ఉన్నందుకే!
సేవ చేయడం అంటే ఇదే. వాళ్లను అశాంతిలోకి నెట్టకుండా ఉండటమే!మరి, నా గీతం విన్నందుకు కృతజ్ఞతలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

రఘురాయ్ చిత్రం

drushya drushyam-25
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం, ఢిల్లీ.
సుప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ ఫొటోగ్రఫీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.ఆయన సంతోషంగా ఉన్నారు. తన ముందు ఉత్సుకతతో నిలబడ్డ పిల్లలందరినీ ఒకమారు చూసుకుని చిరునవ్వుతో ప్రసంగం ప్రారంభించటానికి ఉద్యుక్తులయ్యారు. చిత్రంగా ‘మీ కోసం ‘ఒక పాట పాడుతా’ అంటూ ఆయన ప్రారంభించారు.చిన్నగా గొంతు సవరించుకుంటుంటే అందరూ ఆయన పాట పాడుతారనే అనుకుంటున్నారు.
కానీ, ఆయన పాడలేదు. కొన్ని మాటలు మాట్లాడారు. అంతే!
కానీ, వాటిని విన్నవాళ్లు, ప్రసంగానంతరం హాయిగా ‘ఈల’ వేసుకుంటూ ఆ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వెళుతుంటే నేను చూశాను. ‘వారెవ్వా రఘురాయ్ ‘ అనుకున్నాను మనసులో!

ఇంతకీ ఆయన ఏం మాట్లాడారూ అంటే ఇదే…
ఈ చిత్రంలోని ఒక పిల్లవాడి ఏడుపు ఉన్నది చూశారూ…దాని గురించే మాట్లాడారాయన.
కారులో ఆ సమావేశానికి వెళ్లేముందు, ‘మీరు ఫొటోగ్రఫీ ప్లాన్ చేసుకుంటారా?’ అని అడిగితే ఆయన నవ్వారు.
నా అజ్ఞానానికి సమాధానం అన్నట్టు ఆయన తన ప్రసంగాన్ని ఇలా అందుకున్నారు…

+++

‘పిల్లల్లారా? మీరింకా నిజంగానే పిల్లల్లానే ఉన్నారా?’ సూటిగా అడిగారాయన!ఒక్క క్షణం నిశ్శబ్దం.’అడుగుతున్నాను, మీరు పిల్లలేనా? అని!
మీరంతా ఫొటోగ్రఫీలో ఉన్నవాళ్లు. ఛాయాచిత్రలేఖనాన్ని కళగానూ చూసేవాళ్లు.మరి, మీరంతా పిల్లవాడి తాలూకు సృజనాత్మకతను మీలో కాపాడుకుంటున్నారా అని అడుగుతున్నాను’ అన్నారాయన.

‘అర్థం కాలేదా? అయితే వినండి.’

‘మీరెప్పుడైనా పిల్లల్ని గమనించారా?’
‘ఫలానా దాని కో్సం మారాం చేసే పిల్లల్ని గమనించి చూశారా?’ అని గుచ్చి గుచ్చి అడిగారాయన.

పిల్లలంతా మ్రాన్పడి పోయారు.

మళ్లీ చెప్పసాగాడాయన.  ‘తల్లిని ఆకర్శించేందుకు పిల్లవాడు చాలా చేస్తాడు.  కావాలనుకున్నది తల్లి ఇవ్వకపోతే ఏడ్చి గోల చేస్తాడు. ముందుగా ప్రేమగా చెబుతాడు. గోముగా అడుగుతాడు. తర్వాత అలుగుతాడు. అదీ అయ్యాక అరిచి గీపెడతాడు. కాళ్లను తాటిస్తూ కింద పడి పొర్లుతాడు. తలుపులు దబదబా బాదుతూ తన అసహనాన్ని ప్రదర్శిస్తాడు.
అవసరమైతే కొరికినా కొరుకుతాడు. ఒకటని కాదు, అన్ని ప్రయత్నాలూ చేస్తాడు. ఒక్కమాటలో ‘విశ్వ ప్రయత్నం’ చేస్తాడు.’

‘అది తప్పా ఒప్పా అని కూడా లేదు. మంకుపట్టు పడతాడు. ఏదో రీతిలో తల్లిని సాధించి సమకూర్చుకుంటాడు. మరి, ఒక మంచి ఫొటో తీయడానికి మీరేం చేస్తున్నారు?’

’ఎప్పుడైనా ఆకలయిందీ అని తల్లిని అడిగినట్లు ‘ఇది కావాలి’ అని ప్రకృతి మాత ముందు మనవి చేసుకున్నారా? చేతులు జోడించి ప్రార్థించారా? దయ చూపమని అభ్యర్థించారా? మరేం చేస్తున్నారు?’

’ఒక ఫొటో చక్కగా రావాలంటే మీరు పిల్లవాడికి మల్లే ఆ ప్రకృతి మాతను శరణు వేడవలసిందే!  ఓపిగ్గా వేచి ఉండి కాదంటే దయతలచూమా అని వేడుకోవలసిందే. లేదంటే వెంటపడి వేధించి సాధించుకోవాల్సిందే!  పిల్లలంటే అది!’

+++

’మీరు పిల్లల్లేనా అని అందుకే అడగుతున్నాను.
అమాయకంగా అధికారికంగా ముందూ వెనుకలతో నిమిత్తం లేకుండా తక్షణం, అప్పటికప్పుడు ఏదైనా సాధించుకోవాలంటే తప్పదు…నానా యాతన పడాలి. పిల్లవాడు ఒక తల్లిని ఒప్పించి ఆ క్షణాన సాధించుకున్నట్టు మీరూ సాధించుకోవలసిందే! మీరూ మారాం చేయవలసిందే. మహత్తరమైనజీవిత రహస్యాలు బోధపర్చమని ఆ కళామతల్లిని ప్రాధేయ పడవలసిందే!’

కరాతాళ ధ్వనులు.

రఘురాయ్ ప్రసంగం ఇలా ముగిసేసరికి విద్యార్థినీ విద్యార్థులు, ప్రొఫెసర్లూ, చుట్టూ చేరిన ఇతర ఉద్యోగులు చప్పట్లతో తమ హర్షాతిరేఖాన్ని వ్యక్తం చేస్తున్నారు.కొద్దిమంది కళ్లళ్లోనైతే ఆనందమో దుఃఖమో తెలియని కన్నీళ్లు, ఆనంద బాష్పాలూ…

అంతా పిల్లలైన తరుణం అది. ‘గుర్తుగుంచుకోండి. మీ కోసం ఒక పాట పాడినట్లు కాసిన్ని మాటలు చెబుతున్నాను. ఎల్లవేళలా మీరు ఆ పిల్లవాడితో ఉండండి. ఆ పసిప్రాయపు జీవితంలోనే సృజనాత్మకత దాగి ఉన్నదని గ్రహించండి.
బుడిబుడి నడకలు పోయే పసిపిల్లవాడిలా ఎవరు తోడున్నా లేకున్నా నడుస్తూనే ఉండండి. పడ్డారా? ఫర్వాలేదు. మళ్లీ పిల్లవాడిలా లేచి నడిచేందుకు ప్రయత్నించండి. పడుతూ లేస్తూ మున్ముందుకే పొండి. ఆ పిల్లల మాదిరే delightful mistakes చేస్తూనే వెళ్లండి. ఏమీ కాదు.’

‘జీవితం కరుణించాలంటే పిల్లలే దిక్కు.
ప్రకృతి మాత ముందు ఏడ్చే పిల్లలే ధన్యులు.’

‘మరి ప్రియమైన విద్యార్థినీ విద్యార్థుల్లారా…పిల్లలు కండి.
all the best…’

+++

– ఇదీ రఘురాయ్ గారి ఉపన్యాసం. బాల్యాన్ని నిద్రలేపే గురుబోధ.

ఏడాదిన్నర దాటింది. పుస్తకం కోసం తనతో సంభాషిస్తున్న రోజులవి. ఎందుకో ఏమో…ఒకరోజు హఠాత్తుగా ఫోన్  చేసి, ‘వచ్చేవారం ఢిల్లీ రాగలవా?’ అని అడిగారాయన. ’తప్పకుండా’ అని వెళితే, విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లారు. కారులో వెళుతూ వెళుతూ సంభాషణలో ‘మీరు ఫొటోలు తీసేముందు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా?’ అని అడిగితే నవ్వి, నా ప్రశ్నకు సమాధానం అంటూ సభాముఖంగా పై విషయమంతా ’పాడి’ వివరించారు.

నిజమే! ఆయన ఏదీ ప్లాన్ చేసుకోరు.
ఎందుకూ అంటే ఆయన నిజమైన బాలుడు! తనని ప్రకృతే కరుణిస్తుంది!!

ఈ పాఠం విన్నవాడిని కనుక మా వీధిలో ఏడుస్తున్న ఈ పిల్లవాడిని చూడగానే రఘురాయ్ కనిపించారు.
చప్పున చిత్రించాను. అంతే!

~ కందుకూరి రమేష్ బాబు

‘ఈగ’ చెప్పే కథనం

drushya drushyam 24

 

ఏదీ ముందుగా తెలియదు. అదే చిత్రం.

అవును మరి. మనుషులను చిత్రీకరిస్తున్నప్పుడు మొదట్లో తెలియలేదు గానీ, వారిపై వాలిన ఈగలు నిదానంగా కనిపించడం మొదలైంది. చిత్రానికి సంబంధించిన సిసలైన వాస్తవికతను అవే బహు చక్కగా ఆవిష్కరిస్తున్నవి!

ఇదే కాదు, గత వారం ముసలమ్మ వెన్నుపై కూడా ఈగలు ముసిరినవి. అయినా అంతా ఒక అనివార్య ప్రస్థానంగా ఆ ముసలమ్మ వొంగి అలా నడుస్తూనే ఉండింది. తప్పదు మరి!

ఈ చిత్రంలోనూ అంతే. ఆ మహిళ ఎంత ముద్దుగున్నది. ఎంత హాయిగా నిద్రిస్తున్నది. గదువపై, పెదవి మీద
వేలుంచుకుని ఆ నిద్రాదేవే విస్మయపోయే రీతిలో ఆ తల్లి ఎంత హాయిగా సేద తీరుతున్నది!

కాళ్లు రెండూ చాపుకుని నిద్రించే జాగా కూడా లేని ఆ మహిళ.. ఆ పట్టపగలు…ఇంత తిన్నాక…అట్లే…ఆ ఎండ వడలోనే కాసేపు కునుకు తీయడానికని అట్లా వొరిగి ఉంటుంది! కానీ, ఎంత మంచిగున్నది. ఆ స్థితి గురించి ఈ చిత్రమే మాట్లాడుతుంటే ఎంత బాగున్నది!

ఇదే ఈ చిత్రం విశేషం అనుకుంటే, తలను అలవోకగా చుట్టుకున్న ఆ చేతిపై ఈగ వాలడమూ ఇంకో విశేషం!
ఎట్లా? అంటే కొంత చెప్పాలి.

మొదట్లో ఆయా మనుషుల జీవన స్థితిగతులను – వాళ్లు నిలుచున్న చోటు, కూర్చున్న చోటు, లేదా ఇలా విశ్రమించిన చోటును బట్టి తెలియజెప్ప వచ్చని అనుకున్నాను. కానీ, నగరంలోని అనేక బస్తీలను చుడుతూ ఫోటోగ్రఫి చేస్తూ ఉండగా, ఒక్కో చిత్రాన్ని నాకు నేనే చూసుకుంటూ ఉండగా మరెన్నో రహస్యాలు తెలుస్తున్నవి- ఈ చిత్రంలో మాదిరే!  అవును, వాలిన ఈగ -మనుషుల సమస్థ దుస్థితిని చెప్పకనే చెబుతుందని తెలిసి వస్తున్నది.

ఇదొక అనుభవ పాఠం. అవును. ఇదే మొదటి పాఠం కాదు, అంతకు ముందు ఢిల్లీలో చిత్రించిన ఒక ఫోటో ఈ సంగతిని మొదటిసారి తెలియజెప్పింది. అప్పుడు ఒక మగాయన  చిత్రం తీశాను. అతడొక వర్కర్….చిరునవ్వుతో నా కెమెరా వైపు చూస్తూ ఉంటాడు. తనకూ నాకూ మధ్య ఒక పల్చని ఇనుప స్తంభం ఉంటుంది. దానిపై వాలిన ఒక ఈగ ఆ చిత్రంలో కనబడతుంది. ఆ ఈగ ఔట్ ఫోకస్ లో ఉండగా అతడి చిరునవ్వు మాత్రం క్లియర్ గా కానవస్తూ ఉండగా ఆ చిత్రాన్ని క్లిక్  చేశాను. అందులో నేను తెలియకుండానే చెప్పిందేమిటంటే, అది ఎవరైనా కావచ్చును, ఎక్కడైనా కావచ్చును, వాళ్ల స్థితిగతులు ఎంత దుర్భరంగానైనా ఉండనీయండి. కానీ, పెదవులపై దరహాసం మాత్రం చెక్కు చెదరదు.  అదట్లే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ చిరునవ్వు ఆరిపోక పోగా జీవన తాత్వికతను అర్థం చేసుకున్న అనుభవంతో, ఆ చిరునవ్వు మరింత హృద్యంగా మనల్ని హత్తుకుంటుంది. మన సంపద్వంతమైన జీవితాన్ని ఆ చిరునవ్వు కసిగా కాటువేస్తుంది. ఉదాహరణకు ఈ చిత్రమే చూడండి.

అదమరచిన ఆ యువతి, పెదాలపై వేలుంచుకుని విస్మయపోతూనే నిద్రించడం. ఆ కళ్లు, కనురెప్పలు, నుదుటిపై పచ్చబొట్టు, చేతికి ఏదో కట్టుకున్న విశ్వాసం…అట్లే తన ఒంటిపైన రంగుల చీర, డిజైన్… అంతా కూడా ఆ స్త్రీ తాలూకు సౌందర్యాభిలాష, సఖమయ జీవన లాలస, వదనంలో ఒకవైపు తొణికే ఉల్లాసం అదే సమయాన రవంత విచారం. చిన్న భయవిహ్వలత…ఏదో తెలియని భీతి.

పదే పదే ఆమె మొహాన్ని చూడండి. అది వాతావరణం వల్ల కావచ్చు, అక్కడి తక్షణ పరిసరాల వల్ల కావచ్చు, లేదా దశాబ్దాల తన ఉనికి వల్లా ఏర్పడిన అసంబద్ధ స్థితి వల్లా కావచ్చును, కాసింత అభేదం. అస్తిత్వ ఘర్షణ…బయట  రోడ్డుమీద జీవిస్తున్న యువతి తాలూకు జీవన నిర్వేదం…అంతా కూడా ఆ చిన్న బండిలోనే..ముడుచుకున్న దేహంలోనే…మూసుకున్న కళ్లతోనే అంతా చెప్పడం…

నిజమే, తప్పదు మరి. ఎందరో ఉన్నారు. వీరిలో కొందరు కాలిబాట మీద బతుకుతారు. మరికొందరు వీధిలొ కాసింత జాగాలో ఎలాగోలా తల దాచుకుని జీవిస్తారు. ఇల్లూ వాకిలీ లేకుండానే ఎంతో మంది పట్టణంలో ఇట్లా జీవించే వాళ్లున్నరు. రేషను కార్డు, ఆధారు కార్డుల అవసరాలూ వీళ్లకు ఉంటాయి. కానీ, అంతకన్నా అవసరమైనది ఒక భద్రత. తల దాచుకునేందుకు ఇల్లు. అది లేనప్పుడు ఎక్కడో ఒక చోట ఎంత మైమరపించే నిద్రే అయినా కొద్దిగా కలవరాన్ని, అపశృతిని పలకనే పలుకుతుంది.అదే బహుశా ఆమెలో నేరుగా కానరాని అశాంతినీ ఆవిష్కరిస్తున్నది. అందుకు ప్రబల సాక్షం – ఈగ.

అవును.  అంత హాయిగా ఒరిగినా, ఉన్న స్థలంలో ఒదిగినా, విశ్రమించిట్లే ఉన్నా, ఏ మూలో ఒక అస్తిరత్వం. అభద్రత. అసహజత్వం. ఆ ఒక్కటి చెప్పడానికి ఈ చిత్రం తప్పక ప్రయత్నిస్తుందేమో అని మనసులో అనుకుంటూ ఉండగా, తనని చట్టుముట్టి బాధించే ‘ఈగ’ రానే వచ్చింది…. చేతిపై వాలనే వాలింది. దాని ఉనికి నాకప్పుడు తెలియలేదుగానీ తర్వాత చూస్తే అది చాలా మాట్లాడుతున్నది. చూస్తూ ఉండగా నాకు అది చాలా విషయాలను వివరిస్తున్నది. అప్పుడనిపించింది, నా వరకు నాకు -అధోజగత్ సోదరసోదరీమణుల జీవితాలను చూపించే క్రమంలో ఒక్క ఈగ చాలు, వాళ్ల నిద్రని అనుక్షణం వాలి దెబ్బతీసేందుకూ అని!

మీరూ ఒప్పుకుంటారనే అనుకుంటాను. లేదంటే ఇంకాసేపు చూడండి…ఇంకొన్ని క్షణాల్లో…ఇంకాసేపు చూస్తే, ఆ మహిళ చేతుల్తో ఆ ఈగను చప్పున కొట్టి మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. కానీ, ఈగ మళ్లీ ప్రత్యక్షమవుతుంది.

అదే సిసలైన వాస్తవం. ఈ చిత్రం.

~ కందుకూరి రమేష్ బాబు

కనుగొంటి కనుగొంటి…

drushya drushyam-23తీసిన కన్నే అయినా కొన్ని చిత్రాలు జరూరుగా మళ్లీ కళ్లల్లో పడి కలవరపెడతాయి. గుండెను కలుక్కుమనిపిస్తాయి.
‘మో’ అన్నట్టి “బతికిన క్షణాల’ను యాతనకు గురి చేస్తూ ఉంటాయి. ‘అజంతా’లా ఒకే కవితను పదే పదే చెక్కినట్టు, ఒక ఫొటోయే మనిషిని గతం కోసం వర్తమానం కోసం భవిష్యత్తు కోసం కూడా కొద్దికొద్దిగా చెక్కి విడిచిపెడుతుంది! కనాలని, వినాలని!

‘వెన్నుపూస’ కనిపిస్తున్న ఈ ముసలమ్మ ఫొటో నావరకు నాకు అలాంటి జలదరింపే.
ఉదయం లేవగానే నా పాదాలకు నేను నమస్కరించుకున్నాననే కవి సమయం వంటిదే!
ఒక ప్రాతఃస్మరణీయ అస్తిత్వం.

చివరాఖరికి ఎవరి చిత్రమైనా ఇదే.
అనాధగా ఉన్న స్థితిని చెప్పే ఈ ఫొటో, అదే సమయంలో-తానే కాదు, ఎవరికి వారు ఆత్మస్థైర్యంతో నిలబడతారనీ చెబుతుంది. చెప్పక తప్పక చూపడం. అంతే!

+++

ఎందుకనో తిరిగి తిరిగి ఈ చిత్రం వద్దకే వచ్చి నా చూపు ఆగిపోతుంది.
మన బుగ్గలని తన గరుకు చేతులతో తడిమిన ముసలమ్మలు ఒకరొకరుగా గుర్తుకు వస్తారు, చూస్తూ ఉంటే.

అంతెందుకు చూస్తూ ఉంటే, మా ఇంట్లో మా తాతమ్మ రమణమ్మ యాదికొచ్చి ఆమె దేవుడి అర్ర తలుపు తెరుచుకుంటుంది. లేదంటే తన పాన్ దాన్ తెరుచుకుంటుంది, ఆ వెన్నుపామును కన్ను తడుముతుంటే!
చూడగా చూడగా ఆ రయిక, ఎర్రెర్రని చీర. వయసు పెరుగుతుంటే మెలమెల్లగా బాబ్డీ హెయిర్ అయిన జుట్టు…అట్లట్ల మనుషులు తప్పుకుని, గొడ్డో గోదో…పశుపక్ష్యాదులో రక్షణగా లేదంటే జీవస్పర్శగా మారిన వైనం తెలిసి వస్తంది. లోపలి చీకట్లని చీల్చే ఒక బైరాగి తత్వాన్ని ఆలపిస్తుంది.

+++

అట్లా చూస్తూ ఉంటే, తెలిసిన ముసలివాళ్లు, వాళ్ల జీవన వ్యాపకాలన్నీ కళ్లముందు తారాడి, వాళ్ల దగ్గరి తంబాకు వాసనో, పాన్ వాసనో…ఇంకేవో ముసురుకున్న జ్ఞాపకాలై మెదిలే ఏదో పచ్చటి జీవధాతువు స్పర్శ….
మనిషిని పొయ్యిమీంచి పెనంపైకి చేర్చినట్లాంటి ఒక చిత్రమైన కల్పన…
నేను తీసిన చిత్రమే ఒక అధివాస్తవిక చిత్రంగా మారిపోతుంది చిత్రంగా,.

చాలాసార్లు మనిషి ఉండడు. తప్పుకుంటాడు, ఏదో కారణంగా.
కానీ, ఒక వెన్నుపామైతే ఉంటుంది, బతికినంత కాలం, ఎవరికైనా, జీవచ్ఛవంగా బతికినప్పటికీ!
దానిపై చూపు నిలపడం అన్నది నా చేతుల్లో లేదు. నా ప్రణాళికలో లేదు. కానీ ఇదెలా వచ్చింది?
అదే చిత్రం.

ఒక స్థితీ గతీ ఆవిష్కరిస్తూ, ఎలాగో ఎలా తెలియదు. కానీ, హఠాత్తుగా ఒక దృశ్యం నా చేతుల్లో అలా బందీ అయి నన్ను విడుదల చేస్తుంది, గతంలోకి! తద్వారా నాతో మీరు, మీతో నేను. మనందరం ఒక చిత్రం వద్ద ఆగి ‘ఓ హెన్రీ’ కథలోలా ‘ఆఖరి ఆకు’ను చిత్రించాలేమో ఇలా. ఈ ముసలమ్మలు దీనంగా చావకుండా.

+++

నిజానికి, ఎలా బయలుదేరుతాం? చిన్నప్పుడు కాదు, పెద్దయ్యాక. చాలా మామూలుగా బయటకు బయలు దేరుతాం. మనసులో ఎన్నో తిరుగుతాయి. ఆయా పనుల గురించి, ఎటునుంచి ఎటు వెళ్లి ఆ పనుల్ని చక్కబెట్టుకోవాలో కల్పించుకుంటూ బయలుదేరుతాం. అలాగే పనిచేసే చోటుకు వెళ్లాక అక్కడ కూచుని ఏం పనులు చక్కబెట్టుకోవాలో కూడా సోంచాయించుకుంటం. దానికి తగ్గట్టు బయట ఎవర్ని కలవాలో ముందుగానే కలుసుకుంటూ వెళతాం. అయితే, ఇదంతా ఇంట్లోంచి వెళ్లడానికి ముందు మనసులో చేసుకునే గునాయింపు. కానీ, అడుగు బయట పెట్టగానే లోకంలో అప్పటిదాకా మనమెంత మాత్రం ఊహించనివి మనకు కానవస్తాయి.

అంతా మంద. గుంపు. అందులో ‘కాటగలవకుండా ఉండేందుకా’ అని ఇంట్లోనే కొన్ని అనుకుని బయలు దేరుతాం. కానీ ఏమవుతుంది? కొత్తవి కనబడతాయి. పాతవే సరికొత్తగా తారసపడతాయి. తెలియకుండానే అవి మళ్లీ పరిచయం అవుతాయి. మెలమెల్లగా మరింత సన్నిహితం అవుతాయి. కొన్ని పరిచయాలు ఇంకాస్త దగ్గర అయి మనతో ఉంటాయి. కొన్నేమో అలా వచ్చి ఇలా వెళతాయి. కానీ, ఏదీ మనం ప్లాన్ చేసుకోం. నిజానికి మనం ప్లాన్ చేసుకున్నవి సఫలమయ్యాయో, విఫలమయ్యాయా విచారించుకుంటే నూటికి తొంభై లేదంటే యాభైశాతం ఫెయిల్ అవుతాయి. మొత్తంగా ప్లానింగ్ వృథాయే అవుతుంది. కానీ, అంగీకరించం. వేరే కొత్తవేవో ముందుకు వచ్చి పడతాయి. వాటితో ఆ క్షణాలు, ఘడియలు సరికొత్త గంతులేసుకుంటూ అట్లా దొర్లిపోతాయి. కానీ ఆ కొత్తవాటిని సరిగ్గా చూసి, అభిమానంగా దర్శించుకుంటే ఎన్నో పాత విషయాలు. నా వరకు నాకు, అందులో ఈ వృద్ధతేజం కూడా ఉంటుంది.

సరిగ్గా చూస్తేగానీ తెలియదు. అప్పటిదాకా మన నాయినమ్మని మనం సరిగ్గా చూడం. మన తాతమ్మను మనం సరిగ్గా కానం. కానీ, బయట చూసింతర్వాత లోపలికి చూసుకోవడం పెరిగిందా అది మళ్లీ కొత్త జీవితానికి చిగుర్లు తొడుగుతుంది.
అందుకు దారిచూపేది కళే.

+++

నృత్యమా గానమా సంగీతమా సారస్వతమా ఛాయాచిత్రమా అని కాదు, ఏదో ఒక కళ.
జీవితం ఆవహించిన కళ.

కళ ఒక సూక్ష్మ దర్శిని.
ఇందులో చూడగా కలగలసి పోతున్న, కాటగలసి పోతున్న జీవనదృశ్యాలన్నీ వేరుపడతయి.
మళ్లీ నిర్ధిష్టమై మనల్ని మనకు అప్పజెప్పుతయి.

ఈగలు ముసిరిన కొట్టమే కాదు, అక్కడొక శునకమే కాదు, ఆవు మాత్రమే కాదు, వెనకాల మనిషి మాత్రమే కాదు, మన నాయినమ్మ కూడా కనబడుతుంది.
నాయినమ్మో తాతమ్మో ఆమె తనని తాను నిలదొక్కుకునే చేవను కోల్పోయినప్పటికీ, వొంగి నడుస్తున్నప్పటికీ- ఆమె వెన్నుపూస తళుక్కున మెరుస్తుంది, క్షణమాత్రమే!
ఆ క్షణం కెమెరాకు చిక్కడం ఎప్పుడు జరిగుతుందీ అంటే బయటకు వెళ్లినప్పుడు! ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు! మనలో మనమే ఉండకుండా ఏమీ కాకుండా, ఊరికే ప్రయాణిస్తూ ఉండినప్పుడు. అదే కళ.

+++

మనకెన్నయినా పనులు ఉండనీ, పనిలో పనిగానైనా మనల్ని చకితుల్ని చేసే జీవన ధాతువుకోసం విరామంలో ఉండాలి. లక్ష్యం కన్నా గమ్యంలో, గమనంలో ఉండటమే కళ. అలా అనుకున్నప్పుడు, ఈ చిత్రం నా నిర్లక్ష్య అసంకల్పిత యానంలో ఒకానొక క్షణభంగుర రహస్యం. హైదరాబాద్ లోని లోయర్  టాంక్ బండ్ దిగువన ఉన్న మార్వాడీ గోశాల దగ్గర ఆఫీసు ఎగ్గొట్టి ఒక పూట ఉండిపోయినప్పటి చిత్రం ఇది. ఏవేవో మనసులో అనుకుని బయలుదేరి,  ఇక్కడి స్థల మహత్యానికి నేను బలహీనుడ్ని అయిపోయి, ఈ బలమైన శక్తివంతమైన జీవితాన్ని కనుగొన్నాను. అందుకు ధన్యుణ్ని.

-తొలుత కెమెరా ప్రపంచాన్ని చూపిన నాన్నకు, అటు తర్వాత జీవితంలో ఉండేందుకు అలక్ష్యంగా ఉండటమే మేలని నేర్పిన రఘురాయ్ గారికి, నా ‘వెన్నుతట్టిన’ ఇటువంటి ఎందరో తల్లులకూ వందనాలు, అభివందనాలు.

మొదటికి, మళ్లీ మళ్లీ జీవితాన్ని కనుగొనాలనే ఇదంతా.

~ కందుకూరి రమేష్ బాబు