అసలు సూత్రం..ఆ జీవితమే!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshగోరటి వెంకన్న పాట విన్నారా?
‘గల్లి చిన్నది గరీబోని కథ పెద్దదీ’ అన్న పాట.

ఆ పాట ఒక గాథ.
అందులో ఎన్నో ఉదాహరణలు. మరెన్నో ఉపమానాలు. ఇంకెన్నో పోలికలు.
పగిలిన అద్దం. పండ్లు విరిగిన దువ్వెన. ఇంకా ఎన్నో…ఇంకెన్నో…

ఒక్కో దృశ్య సమాసం ఒక స్థితిని పంచుతూ ఉంటే మొత్తంగా అనేక దృశ్యాదృశ్యాలుగా ఆ పాట గల్లీ జీవితాన్నిఅద్దంలో కొండవలే చూపిస్తుంది. అయితే, జీవితాన్ని పరిపరి విధాలుగా… పదచిత్రాలుగా, జానపదాలుగా ఆయన గానం చేసిన తీరు అపూర్వం. కానీ, ఆ పాట నిజానికి ఒక దుస్థితి.

జీవితంలో అన్నీ ఉంటై. కష్టం- సుఖం. లాలనా- పీడనా…అన్నీ ఉంటై.
అయితే, అదొక పార్శ్వం మాత్రమే. ఆ కథ పెద్దది.
కానీ, దురదృష్టం ఏమిటంటే నా కథ చిన్నదనుకుంటారు.
కాదనే ఈ చిత్రం.

అసలు ఆర్థిక పార్శ్వం మినహాయిస్తే పేదవాడి జీవితం ఎంతటి భాగ్యవంతమో అని ఎలుగెత్తి చెప్పాలనిపిస్తుంది.
వెంకన్న కన్నా ఇంకా ఎత్తుకు ఎగిరి దుంకి ఆడి పాడి చెప్పాలనిపిస్తుంది. అవన్నీ చేయలేకే ఇలా చిన్నచిన్న దృశ్యాలు. దృశ్యాదృశ్యంగా గల్లీ జీవితాన్ని ఒకానొక జీవనదిలా మీలోకి ప్రవహింపజేయాలని ప్రయత్నం.

ఒక మహా రచయితా, దర్శకుడు అననే అన్నాడు, ఎప్పుడో!
‘చీకట్లో పాటలుండవా?’ అని.
పాడితే, చీకటి పాటలే పాడతామని!

కానీ, ముందే అన్నట్టు, ఆర్థికాంశాలే జీవితాన్ని నిర్ణయించవని వేల యుగాలుగా మానవ జీవితం చెబుతూనే ఉన్నది. మానవ సంబంధాలన్నీఆర్థిక సంబంధాలు కానే కావని మర్క్సిస్టులకు తప్పా మిగతావాళ్లకు ఎన్నడో తెలిసిపోనే పోయింది. ఇంకా చాలా ఉన్నాయని తేలిపోయి కూడా చాలా కాలమైంది. కానీ, కార్యకర్త తాలూకు జీవితమే అన్ని కార్యారంగాలను డామినేట్ చేస్తూ ఉండటం మూలాన ఒక్కోసారి జీవితాన్ని యధాతథంగా అంగీకరించడం ఆపేసి చాలా కాలమే అయింది.

అందుకే విచారం.

ఆర్థికాంశం మినహాయిస్తే జీవితంలో ఏ లోటూ లేదు.
అది ఉన్నంత మాత్రాన మనుషులను పేదవాళ్లుగా చూడటం అసలైన భావదారిద్ర్యం.

మనుషులు గల్లీలో ఉండవచ్చు, ఢిల్లీలో ఉండవచ్చు.
ధనవంతులు కాకపో్తే భాగ్యవంతులు కారా? అన్న సందేహం నాది.
అందుకే గల్లీ జీవితాన్ని ఒక అందమైన పాటగా చిత్రిస్తూ ఉండటం నాకొక అభిరుచి.

చిత్రిస్తూ ఉంటే, నిజానికి అటువంటి సందేహమే అక్కర్లేదని, జీవితం అందంగా హామీ ఇస్తూనే ఉన్నది.

అక్కడ అందం ఉంది. సౌందర్యం ఉంది.మనుషులకు తీరుబడి ఉంది.
గల్లీ ఒక పెద్దబడి. దాన్ని పూర్తిగా చూసేందుకు విద్యార్థులం కావాలి. కార్యకర్తలమే కాదు.

అందుకే ఈ చిత్రం.

నిజానికి మనకే తీరుబడి లేదు. సౌందర్యం లేదు. నిజం.
అక్కడ కళా ఉంది. పోషణా ఉంది. సరసం ఉంది. సంగీతం ఉంది. అన్నీ ఉన్నయ్.ఉపరితలం ఉంది. భూమికా ఉంది.
అర్థం చేసుకుంటే పగిలిన అద్దం ఒక స్థితి మాత్రమే.
దాంట్లో మనిషి కానరాకుండా పోలేదని గమనించాలి.అంతెందుకు?
ఒక మనిషిని చూశాను.
భార్యకు మాంగళసూత్రం కొంటున్నాడు. చిన్నదుకాణం అది. చూస్తే పసుపు తాడు.
ఫొటో తీయాలని ప్రయత్నిస్తే వారించాడు. భార్య కూడా కళ్లతో వద్దని సూచించింది.
అదొక మర్యాద. కొన్ని బంధాలను ఎవరు పడితే వాళ్లు, ఎప్పుడు పడితే అప్పుడు చూడకూడదు. తీసి దాయకూడదు. నలుగురికీ చూపనే కూడదు. వాళ్ల మాట మన్నించి గమనించసాగాను, ఒక మనిషిగా.ఆ పసుపుతాడు కొన్నాక ‘అది వట్టి పసుపు తాడే కదా…అంత సంతోషం ఏమిటి’ అన్నాను ఆయనతో.
నవ్వి చెప్పాడాయన…’బాబూ…నీకే కాదు, ఎవరికైనా ముందు సూత్రం తెలియాలి. తెలిస్తే ఏదైనా మంగళప్రదమే అవుతుంది’ అన్నాడు. అని ఊరుకోలేదు. ‘అది వట్టి తాడు కాదు. పసుపు తాడు’ అన్నాడు. ‘ ఆ తాడుకు పసుపుకొమ్మూ ఉందన్న అర్థంలో! ‘ఇంకేం కావాలి?’ అని కూడా అన్నాడు.

అసలు విషయం పవిత్రబంధం అని వాళ్లిద్దరూ అలా అర్థం చేయించారు.

వాళ్లు నిరుపేద కూలీలు.
ఇంకా పని నుంచి గల్లీలో ఉన్న తమ ఇంటికి వెళ్లలేదు.
దారిలో దుకాణంవద్ద ఈ కొనుగోలు. ఆ మట్టి మనుషులను చూస్తే ‘బంగారం’ అనిపించింది.

నిజం.

ఆమెను చూశాను. తృప్తిగా ఉందామె.
అందమంటే ఏమిటో అర్థమైంది.

అతడ్ని చూశాను, మోటుగా ఉన్నాడాయన.
మగసిరి అంటే ఏమిటో గమనించాను.

ఇద్దర్నీ కలిపి చూశాను.
భాగ్యవంతులు అనిపించింది.

పసుపుతాడు…పసుపు కొమ్ము కళ్ల ముందు మెదులుతుంటే – ఆర్థిక విషయాలతో మనుషులను దరిద్రులుగా చూడటం మానేయకపోతే మనం చాలా నిరుపేదలుగా మిగులుతామనే అనిపించింది. అందుకే పగిలిన అద్దాన్ని చూడవద్దంటున్నాను. బంగారు మాంగళసూత్రాన్నే చూడ ప్రయత్నించ కూడదంటున్నాను.

+++

ఈ చిత్రం అందుకే.  ఆమెను చూడండి.
గలగలలాడే ఆమె గాజుల చేతులు. ధృడంగా ఆ అద్దాన్ని పట్టుకున్నతీరు. ఇంకో చేతితో గాలికి ఎగిరే ఆ ముంగురులను నిదానంగా సవరించుకునే తీరూ చూడండి.

ఆమెను చూడమంటున్నాను.
అద్దం జీవితాన్ని ప్రతిఫలిస్తుంది. అంతే.
కానీ అద్దమే జీవితం కాదు.

గొప్ప పాటలు పూర్తి జీవితాలు కాదు.
జీవితమే పాట.
~

అమ్మ యాది

కందుకూరి రమేష్ బాబు

 

Kandukuri Rameshఎవరిది వాళ్లకు మామూలుగానే ఉంటుంది.
కానీ, ఒక చిత్రం వల్ల ఎవరెంతగా కనెక్ట్ అవుతారో తెలుస్తున్న కొద్దీ అది మామూలు అనుభవం కాదు!
అపురూపం.

ఈ చిత్రం అటువంటిదే.

ఇందులో ఉన్నది మా పొరుగింటి అక్కా, అతడి కొడుకూ.
వీళ్లను రోజూ చూస్తూనే ఉంటాం. కానీ, నేను చూసి వదిలేయకుండా ఉండటం వల్ల వీళ్లు మీ దాకా చేరుకున్నారు.
నిజం. ‘మామూలే’ అని అనుకోకపోవడమూ ఒక రహస్యమే.

చిత్రమేమిటంటే, ఏ కొంచెం సమయం దొరికినా చాలు, తల్లో పేలు చూడటం వాడకట్టు మనుషుల్లో పరిపాటే.
అలాంటి మామూలు దృశ్యమే ఇది. కానీ ఒక మధ్యాహ్నం రుస్తం అన్న చిత్రకారుడు కలిసినప్పుడు ఈ చిత్రం మామూలు స్థాయిని దాటిపోయింది…నా వరకు నాకు!

ఆయన అడిగారు, “ఏం చేస్తున్నారని!”
యధాలాపంగానే అడిగాడు.

‘మామూలే. ఉద్యోగం, ఇలాం చిన్నగా ఫొటోగ్రఫి’ అన్నాను నేను.
చూపమంటే కొన్నిచిత్రాలు చూపాను.

ఈ చిత్రం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఒక్కపరి ఉద్వేగానికి గురయ్యిండు.
తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కంట నీరు ధార కట్టింది.
అర్థం కాలేదు.

కొన్ని క్షణాల మీదట కుర్చీలోంచి లేచి హృదయపూర్వకంగా కావలించుకున్నాడాయన.
“మా అమ్మను గుర్తు తెచ్చినావు భయ్యా” అన్నాడు.

అప్పుడర్థమైంది.
అతడు ఎంత దూరం వెళ్లాడో లేదా ఎంత దగ్గరగా వెళ్లాడో అని!

ప్రేమతో, జ్ఞాపకాల తడితో భారంగా మారి, కాసేపట్లో తేరుకుని, చిన్ననాడే తాను తల్లిని కోల్పోయిన విషయాన్ని ఆయన పంచుకున్నారు. తర్వాత అన్నారు, “ఇంతకన్నా…బాబుకన్నా అదృష్టవంతుడెవరుంటారు” అని కూడా అన్నారు. అని, మళ్లీ ఆ పిక్చర్ ను ఆనందంగా చూసి ముచ్చటపడ్డారాయన.

నిజానికి ఇది మామూలు చిత్రమే. కానీ అతడన్నాక నాకు మరింత ప్రియంగా మారిందీ చిత్రం.
దృశ్యాదృశ్యం అంటే ఇదే కాబోలనిపించింది!
మనదాకా రావడం, హత్తుకోవడం అంటే ఏమిటో బోధపడింది.

ఇంకా ఆలోచిస్తే అనిపించింది, అతడు స్వయంగా కళాకారుడు. చిత్రకారుడు. కానీ, ఒక వర్ణ చిత్రం కన్నా మరొక చాయా చిత్రం విలువైందేమో అనిపించింది, ఒక రకంగా!

అవును మరి. ఛాయా చిత్రలేఖనంలో కల్పనకు తావులేదు. జీవన ఖండిక అది.
అందుకే మనిషి తన జ్ఞాపకాల ఒడిలోకి వెళ్లి జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవడంలో కళ కన్నా జీవకళ అయిన ఛాయాచిత్రలేఖనం మరింత దగ్గరేమో!

పెయింటర్ రుస్తుం భాయ్ కలిసినప్పటినుంచీ ఒక ఫొటోగ్రాఫర్ గా ఇదే అనుకుంటూ ఉన్నాను.

~

నదిని చేరుకోవాలన్న దాహం

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshమళ్లీ పుట్టడం.
కొత్తగా జన్మించడం ఎంత బావుంటుంది!

అవును.
ఒక్కోసారి రచయిత ఎవరైనాగానీ, తమదైన శైలీ, శిల్పాలకు భిన్నమైన రచన చేస్తున్నప్పుడు కొత్తగా ఉంటుంది. వస్తువును బట్టి అవి మారుతూ ఉన్నప్పుడు ఆ రచన కళ కళం రేపుతుంది.
ముందు తనలో…తర్వాత బయటా.

అయితే, లోవెలుపలా కొన్నికొత్త చిత్రాలు జరుగుతూ ఉంటై.
కొందరు చూపుతారు. కొందరు చూపరు. కానీ. నేను చూపాలనే అనుకున్నాను.
కానీ, భయం.

అవును. భయం ఉంది. భక్తీ ఉంది. పనిమీద.
అందువల్లే చూపి నడవడం.

కదా!

+++

ఎవరికైనా ఒక్కొక్కరికీ ఒక శైలి ఉంటుది.
ఆ శైలి ప్రకారం నడుచుకోవడం మామూలే.
కానీ భయపడాలి. కదా!

నువ్వయినా, నేనయినా, ఎవరయినా సరే.
కదా!

మొదట్లో సాహసంగానే ప్రయాణించవచ్చు. ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదుగానీ, తర్వాత అలవోకగానే ఆ సాహస కృత్యాన్ని నిర్వహిస్తూ ఉంటాం. బహుశా ఎవ్వరికీ చెప్పంగానీ – అంతకు ముందు ఎవరూ నడవని తోవలో నడుస్తున్నప్పుడు కూడా ఒక మేలు జరుగుతుంది. తన నడక వల్ల కూడా ఒక చిన్న పాటి బాట పడనూవచ్చు. ఆ బాట పడుతూ ఉండగా తన అరికాళ్లు కూడా సాపు అవుతూ ఉండవచ్చు. నొప్పి మెలమెల్లగా తగ్గిపోనూ వచ్చు. ఆ పాదాలూ…ఆ అలవాటైన నడకా…హాయిగా ఉంటుంది. అంగీకరించడానికి ఇబ్బంది గానీ ‘పాత ఒక హాయి. కొత్త ఒక భయం’. అందుకే ‘ఆ అలవాటైన నడక’కు ‘అలవాటు’ పడి ఇక కొత్త చూపుకు దూరం అవుతాం. నేర్చుకోవడం ఆగిపోతుంది.

నిజం.
భయం ఉండదు. ఇక భక్తీ ఎక్కడుంటుది?
కదా!

అయినా…ఎంత పెద్ద పెద్ద వాళ్లు ఆగిపోలేదు, తన దారిలో తాను పడి!
కానీ, నేను భయపడతాను. కొత్తగా చిత్రాలు పోతాను.

ఎందుకూ అంటే, శైలి స్వయంకృతం. జీవితం బహుముఖం అని తెలుస్తున్నది గనుక!
కొత్త కొత్తగా కూడా నడుస్తున్నాను, భయపడుతూనే కాబట్టి కూడా.

అవును. బహుముఖ జీవితంలోకి నిర్భయంగా రావాలంటే ఖండఖండాలుగా వేరు పడాలి.
మళ్లీ పుట్టడానికి బయలుదేరాలి. తప్పదు.

కానీ, మళ్లీ పుట్టడం, కొత్తగా జన్మించడం ఎంత బావుంటుందో!
కదా!

ఇక రండి. ఈ చిత్రం వద్దకు.

+++

నిజం.
నా వలెనే లేదా మీ వలెనే ఈ చిత్రంలో ఎన్ని ముఖాలున్నాయో చూడండి.

వ్యక్తులున్నారు, వారి వ్యక్తిత్వాలున్నాయి.
బంధాలున్నాయి, అనుబంధాలూ ఉన్నాయి.
కనబడుతారు. కనబడరు.

అయితే ఇది ఒక సమూహం కాదు, ఒక కుటుంబం.
ఒకే ఒక కుటుంబాన్ని ఒక చ్ఛాయలో సంక్షిప్తం చేసిన సంఘం.

ఒకచోట నిలుచుని, మనసును నిబ్బరం చేసుకుని, అక్కడ కూడిన వారందరినీ చూస్తూ, వారి దృష్టిలో పడకుండా తప్పించుకుంటూ, అభిమానంతో వారందరినీ ఒకే ఫ్రేంలోంచి జారకుండా చూసుకుంటూ చేసిన చిత్రం ఇది. జాగ్రత్త ఇది. కానీ, ఒకరిద్దరు నావైపు చూస్తూనే ఉన్నారు. అందుకే భయపడాలంటాను. ఇంకా కష్టపడాలంటాను. ఇదొక ప్రయత్నం.

చిత్రమేమిటంటే, సహజంగానే బయట మనం చూసే జీవితంలో చాలా నది ఉంటుంది. కానీ, కళగా చేయాలనుకుంటే ఒక మేఘం చాలనుకుంటాం. సంక్షిప్తం చేస్తూ ఉంటాం. కానీ కవులు  కూడా ఒక్కోసారి దీర్ఘ కవిత రాయకపోతే చచ్చిపోతారు. ఆ లెక్కన ఇప్పటిదాకా నేను చేసినవి మేఘాలే అయితే ఇది నది.  లేదా ఇదివరకంతా ఒక చినుకులో మేఘం చూపాలన్న తలంపు అయితే ఇదొక మేఘం. మేఘమాల అనాలి.

కానీ, ఎవరికైనా, నదిని చేరుకోవాలన్న దాహం చినుకుతో మొదలవుతుందా!
ఏమో!

ఏమైనా కానీ…. చూడండి.
ఇదొక క్రిస్ క్రాస్.

కదా!

+++

ఇందులో ఎవరూ ఒకే ధ్యాసలో ఉండరు. ఎవరి లోకంలో వారుంటారు.
ఒకరు కాదు, పదీ కాదు, పదహారుమంది ఉన్నారు, చిన్న బాబుతో కలిపి.
నిజానికి వెనకాల గేటుకున్న దిష్టిబొమ్మతో కలిపితే పదిహేడు.

కానీ, అందరికీ తమదైన ఒక expression ఉంది. energy ఉంది.  అది వ్యక్తమైతున్న తీరు ఈ వారం దృశ్యాదశ్యం. అయితే, దాన్ని ఆస్వాదించాలంటే ఈ ఒక్క ఛాయను చాలా సార్లు చూడాలి. ఒక్కొక్కరినీ ఒకసారైనా చూడాలి. కనీసం పదహేడు సార్లయినా చూడాలి. పదే పదే అక్కర్లేదు. ఒక్కసారి చూడండి. కానీ చూపు ఒక్కొక్కరిపై నిలుపుతూ వెళ్లండి.

నిజం.చినుకులన్నీ కలిస్తే మేఘం అయినట్లు వాళ్లందరిపై మీ చూపులను సారిస్తూ ఈ దృశ్యాదృశ్యంలో నిమగ్నం అవండి. జస్ట్ ఫర్ చేంజ్. ఒక లాంగ్ షాట్. విశాలమైన దృశ్యం.

మరి ఇది మేఘమాల.
నది ఒడిలో!

~

అలా వీధిలోకి వెళ్లి వద్దామా?!

కందుకూరి రమేష్ బాబు 

………………

Kandukuri Rameshఒక అలవాటుగా చూసినప్పుడు ఏ విశేషమూ గోచరించదు.
కానీ, తరచి చూసుకుంటే విశేషాలు కానవస్తూ ఉంటై.

ఉదాహరణకు నైటీ.

ఉన్నత వర్గాలా నిమ్నవర్గాలా లేదా వర్గాలెందుకుగానీ…
నగర జీవులా గ్రామీణులా లేదా తేడాలెందుకుగానీ…
అసలు మహిళలైతే చాలు, నైటీలు లేకపోవడం ఉండదిప్పుడు.

అవును.
నైటీలూ అని గనుక మనం అనుకుంటే ఒక ప్రశ్న.
‘నైటీ’ అంటే రాత్రి ధరించేదేనా?

కాదని తెలుస్తూనే ఉంది.
రేయింబవళ్లూ, రాత్రుల్లూ ఇప్పుడు నైటీయే మహిళను ధరిస్తూ ఉంది.
అది గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.

ఎన్ని జీవన వ్యాపకాల్లో చూసినా చీరను దాటేసి నైటీ కానవస్తూనే ఉంది.
ఇప్పుడు చీర నిజానికి ఒక దృశ్యాదృశ్యం.
నైటీ రాత్రల్లే కాదు, దివారాత్రుల దస్తూరీ.ఒక జీవనచ్ఛాయ.
అది తన ధారణను దాటింది. పరిపరివిధాలా ఆవరిస్తూ ఉన్నదని గమనించారా?

ఏదైనా అంతే.
సౌకర్యవంతమైందిగా మారిన తర్వాత దాని విస్త్రృతి పెరుగుతుంది వాడకంలో.
నైటీ అందులో ఒక అందమైన ఉదాహరణ మాత్రమే.

ఈ చిత్రమే చూడండి.
ఆమె తల్లి. ఇద్దరు పిల్లల తల్లి.
నైటిలో వీధిలోకి వస్తుంది.

పిల్లల్ని బడికి తీసుకెళ్లినా నైటీలోనే.
బడినుంచి పిల్లల్ని ఇంటికి తీసుకు రావాలన్నా నైటీలోనే.
లేదా పిల్లలకు ఏదైనా కొనివ్వాలన్నా అట్లా వచ్చేసి ఇట్లా ఇంట్లోకి వెళ్లిపోతుంది, నైటీలోనే.

ఉదయాలూ, మధ్యాహ్నాలూ, సాయంత్రాలూ- నైటీయే.
ఎండపొడలోనైటీయే. వెన్నలరేయిలోనూ నైటీయే.
మనకు కానవచ్చినా కానరాకపోయినా ఉన్నది నైటీలో అన్నది చిత్రం.

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఎవరైనా సరే,
అమ్మా -వదినా …ఆలి- చెల్లీ…ఇలాగే.
ఇరుకిరుకు గల్లీల్లో ఇట్లా మహిళలు నైటీల్లో కనిపిస్తూ ఉండటం నగరజీవితంలోనే కాదు, గ్రామాల్లోనూ మామూలే!  మెడలో బంగారు తాళి, కాళ్లకు వెండి పట్టగొలుసులు. చేతికి గోరింటాకు. ఒంటిపై నైటీ.
అదీ విశేషం. అట్లా అన్నీ ఉంటై.

ఇంట్లోంచి అట్లా వీధిలోకి రావడం అంటే ఆ మహిళ బయటి ప్రపంచంలోకి వెళ్లినట్లేమీ ఉండదు.
అసహజంగా ఏమీ ఉండనే ఉండదు. అందుకు కారణమూ ఉంది. ఒక రకంగా వీధి జీవితంలోని సౌకర్యం ఇది.
అందుకే అనడం వీధి అంటే ఇంటికి ఒక ఎక్స్ టెన్సన్ – అంతే అని!

వీధి అంతానూ ఇల్లూ వాకిలీ అయిన వాళ్లకు నైటీ అన్నది దివారాత్రులతో పనిలేనిదే అనడం.
వీధిలోని మనుషులంతా వావివరసల మాదిరే ఒక అనుబంధాలశాల అయినప్పుడు…మనిషి యధేచ్ఛగా నడవటంలో ఎటువంటి ప్రయాసా లేదని చెప్పడం. యవ్వనవతులైనప్పటికీ కడు వృద్ధులైనప్పటికీనూ మొత్తంగా మహిళలకు పెద్ద పట్టింపూ ఏమీ ఉండని సమయాలే ఇవన్నీ అనీనూ. ఊరికే మర్యాదను పాటిస్తూ, ఇట్లా నైటీ అన్నది చున్నీ ఆధారంగా బయటకు వస్తుంది!

ఇప్పుడు చూడండి.
పిల్లాపాపలతో ఆ తల్లి అట్లా హాయిగా అందంగా, ఆనందంగా నడిచి వెళుతుంది.
కాళ్లకు చెప్పుల్లేకుండా హాయిగా!

వెళుతుంటే ఒక సంగీతం వుంటుంది. నడుస్తుంటే ఒక విలాసం ఉంటుంది.
అదంతానూ- వీధంతానూ తమది అనుకోవడంలో కనిపించే ఒక విశ్వాసం. ఒక ఆత్మీయ సరాగం.
అందుకే street photography అన్నది మెయిన్ రోడ్డుకే పరిమితం అవుతుంటుంది చాలామంది ఫొటోగ్రఫిలో. ఇట్లా లేన్స్ లోకి- వీధుల్లోకి వస్తే గల్లీలోని జీవితం ఒక రకంగా ఇల్లు వాకిలిగా కనిపిస్తుంది.

అందుకే అనడం, ‘గ్రామాల్లోకి తరలండి’ అన్నట్టే వీధుల్లోకి తరలండని!
జీవన విలాసం ఏమిటో చూద్దురు, రండిలా అని!

విండోస్ 2015

 కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshగ్రామీణ జీవితంలో పెరిగిన వాళ్లకు తెలిసిందే.
మళ్లీ తెలియజెప్పడం కష్టమే.
కానీ, ఒక ప్రయత్నం.బాగా చదివుకున్నాం. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం. గ్లోబల్ విలేజ్ నివాసులం.
ఉండవచ్చు. కంప్యూటర్ విండోస్ గుండా మనకొక తెరుచుకున్నగవాక్షం ఇవ్వాళ ఉండవచ్చుగాక.
కానీ, నాడే కాదు, నేటికీ ఇట్లా – ఇంట్లో పనిపాటా చేసుకునేవాళ్లకూ తలుపులున్నాయి.
తలుపుల గుండా విండోస్ ఇలా తెరిచే ఉన్నాయి. ఆదొక సిస్టమ్.

అక్కడే కూచుని, మనకంటే కులాసాగా కాళ్లు జాపుకుని హాయిగా పనిచేసిన పనిగంటలు గంటలకు గంటలు ఉన్నాయనే ఈ చిత్రం. అవును. వాళ్లట్లా కూచుని, బయటి నెట్ వర్క్ తో కనెక్ట్ అవుతూనే చకచకా  పనులు చేసుకోవడం నేటికీ ఉందనే ఈ దృశ్యాదృశ్యం. ఒక టీవీ, ఒక కంప్యూటర్ అంతానూ ఒక వీధి. అది వాళ్లకు అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. ఒకానొక సోషల్ నెట్ వర్క్ జీవితంలోని ప్రతి ఘడియలో ఉండనే ఉందన్నది సత్యం. అంతేకాదు, పూర్తిగా ఆవిష్కరించని ప్రొఫైల్ పిక్ ఒకటి మనం పెట్టుకున్నట్లే, వాళ్లూ అలా కనీకనపడకుండా అగుపించడమూ ఉందనే ఈ పిక్. ఒక ప్రొఫైల్. చిత్రమూ!అయితే, ఇంకో మాట లేదా అనుభవం.
రెండేళ్ల క్రితం ఒకతను మెసేజ్ పెట్టాడు, ‘కొన్ని చిత్రాలు నేను ఫేస్ బుక్ లోంచి కాపీ చేసుకోవచ్చా?’ అని!
‘ఒకే’ చెప్పడానికి ముందర ‘ఎందుకో కనుక్కోవచ్చా?’ అంటే అతనన్నాడు, తాను నగరంలోని దిగువ ప్రాంతంలో ఉంటానని!  అంటే తార్నాక పరిసరాల్లోనట! అక్కడ ఇంటీరియర్ కాలనీలో తానొక చోట నివసిస్తాడట!  అక్కడ్నుంచి రోజూ హైటెక్ సిటీకి వెళ్లి సాప్ట్ వేర్ నిపుణుడిగా పనిచేసి వస్తాడట. ఒక రోజట. తన టీమ్  మేనేజర్ అన్నాడట. ‘ఎందుకు అక్కడే ఉంటావు, ఇక్కడ సైబరాబాద్ ఏరియాలో వుండొచ్చు కదా’ అని! దానికతను జవాబు చెప్పలేక పోతున్నాడట. అందుకని కొన్నిఫొటోలు కావాలట!

కొన్నిమధ్య  తరగతి, దిగువ మధ్య తరగతి, ఇంకా దిగువ తరగతి పనీపాటల్లో ఉన్న జీవనచ్ఛాయలు, వారు నివసించే వీధులు, ఆ జీవన కోలాహాలం…అదంతా కాపీ చేస్కొంటాడట. వాటిని అతడికి చూపిస్తాడట.

ఒక హార్డ్ డిస్కుకు సాఫ్టువేరు ఎర!

నిజంగానే చూపాడట.
తర్వాత ఆ అధికారికి అర్థమైందట.

ఇతని విండోస్ అతడికి తెరుచుకోవడం ఒక చిత్రమే.
అప్పట్నుంచి మల్లెప్పుడూ అతడు ఇతడ్నితన నివాసాన్ని మార్చమని అనలేదట.
తననే కాదు, ఎవ్వర్నీ కూడా.

చిత్రం.
దృశ్యం ఒక అనుసంధానం.
ఒక సాప్ట్ వేర్!

గ్రామీణ జీవితంలోంచి వచ్చిన వాళ్లకు లేదా బీడీలు చుట్టిన తల్లుల బిడ్డలకు ఊరు కావాలి. పట్నంలో ఉన్నా కూడా. వాళ్లు ఎంత దూరం వెళ్లినా ఆ తలపులు వీడిపోవు. ఎంతటి ఆధునిక జీవన వ్యాపకాల్లో ఇమిడినా గతం మారిపోదు. మరెన్ని కొంగ్రత్త పనులు నేర్చినా గానీ, ఆ చేతి వేళ్ల మధ్య కత్తెర చేసే ఒక సంగీత రవళి ఒకటి, చేటలోని తంబాకు వాసన ఒకింత వాళ్లను పట్నంలోంచి సరాసరి ఇంట్లోని మల్లెసార్లకు అడుగుపెట్టేలా చేస్తది. అక్కడ్నుంచి గడప దగ్గర కూచున్న నాయినమ్మ దగ్గరకో, చిన్నమ్మ చెంతకో చేరుస్తుంది. ఆ చ్ఛాయ పదిలం. అవన్నీ ఇంకా దిగువన ఉన్నాయి. పైకి వెళ్లేకొద్దీ అవి కావాలి.

విండోస్ అందుకే.
ఈ చిత్రం చేసింది మరి ఈ ఏడే.

అందుకే అనడం లేదా చూపడం, విండోస్ 2015 వర్షన్.
*

 

తాదాత్మ్యత…. దిల్ సే….

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఈ నడుమే. వేసవి ఉదయాన్నే అబ్బురపడి చేసిన చిత్రం ఇది.
ఐదారు రోజులుగా ఎపుడెపుడు మీకు చూపాలా అని ఎంతో ఇదిగా ఎదురు చూస్తున్నాను.

దీన్ని తీసింది మా వీధిలోనే.
ఇదొక దృష్టాంతం. an exemplary image.
జనసామాన్యం తాలూకు జీవకళను అలవోకగా ఒడిసిపట్టుకున్నప్పటి ఒక దృశ్యాంతం.

రెండు విషయాలకు. అవును.
ఒకటి తమ వ్యాపారం సజావుగా, దిష్టి కొట్టకుండా సాగాలన్న ఆకాంక్షా..
అదే సమయంలో ఒక Display…అందంగా ఆకర్షించి కట్టి పడేయడం, మనల్ని అక్కడికి లాక్కోవడమూ!
ఈ రెంటిలోనూ ఒకానొక తాదాత్మ్యత దాగున్నదన్న భావన ఎట్లా చెప్పడం అని మనసు కొట్టుకుంటూ ఉంటే ఇలా ఈ దృశ్యం కనిపించింది. Physical, Metaphysical, అంతిమంగా Spiritual..అన్నీకలగలసిన  People’s aesthetics గా ఈ మామిడి దృశ్యాదృశ్యం ఒక పండుగ!

+++

మీరు చాలామందినే చూస్తూ ఉంటారు.
తోపుడు బండిమీద వ్యాపారం చేసుకునే వాళ్లను ఎందరినో చూస్తూనే ఉంటారు.
లేదా రెక్కల కష్టం మీద ఆధారపడే వాళ్లు, కాయాకష్టంతో జీవనం గడిపేవారు, బక్కజీవులు – వీళ్లందరి జీవితంలో ఎదురీతను తప్పక గమనిస్తూనే ఉంటారు.
కానీ, వాళ్ల aesthetics?
వాటిని గమనించడంలో ఒక దివ్యమైన అనుభవం ఉందని మీరు గమనించారా అంట!
ఈ చిత్రం అటువంటి ఒక అనుదిన జీవకళ అనే ఈ చ్ఛాయ.

మంచిగనిపించే విషయం ఏమిటంటే, ఆ తోపుడు బండ్ల వాళ్లలో ఒక అనుకువ ఉంటుంది. తమకే ప్రత్యేకమైన ఒకానొక అందమైన అనుసరణా ఉంటుంది. common sense తాలూకు లాక్షాణికత ఒకటి subtleగా వాళ్లలో అంతర్లీనంగా, దృశ్యాదృశ్యంగా compose అయే ఉంటుంది. నిజం. వాళ్లకంటూ నియమమూ, నిష్టా ఉంది.  ఉదర పోషణార్థం చేసే ఎంత చిన్న పనైనా సరే, దానిపట్ల వాళ్లకొక అవ్యాజ్యమైన అనురాగం ఉంది. తమ పనిని ఆకర్షణీయంగా ప్రదర్శిస్తూ, వాళ్లట్లా తమ జీవితాన్ని ఉల్లాసంగా నెట్టుకురావడంలో ఎంతో శ్రద్ధా, అభిమానమూ, ఆత్మాభిమానమూ నిండుగ ఉంది. అది రమణీయం అనీ ఈ చిత్రం.

+++

నిజానికి జీవన వ్యాపారంలో సౌందర్యంతో ఆకర్షించడం అన్నది ఒక కళ. అది వ్యాపార కళ కూడా.
దానికి కావలసింది ఒక ఇగురం. ఉదాహరణకు తాళాలు రిపేరు చేసే వాళ్ల డబ్బాలు చూడండి. అవి ముదురు రంగులతో ఇట్టే ఆకర్షిస్తాయి. ఎందుకూ అంటే – ‘ఆ రంగులతో మిమ్మల్ని మా దగ్గరకు గుంజుతాం సర్’ అంటాడు ఒకతను. నిజమే. వాళ్లకంటూ ఒక సౌందర్యశాస్త్రం ఒకటుంటుంది. అది మోటుగానే కాదు, ఒక్కోసారి ఎంతో సుకుమారంగా, సుతారంగా మనల్ని లోబర్చుకుంటుంది.

మా దగ్గరే. నగరంలోని పార్సీగుట్టలో చాలామంది వలస జీవులున్నారు. కానీ వాళ్ల కళ చూడాలి. అది తమదైన ఉన్నతస్థాయిలో ఉంటుంది. సైకిళ్ల మీద ఒక చిన్నపాటి పెట్టెలు పెట్టుకుని మామిడితాండ్ర అమ్మే వాళ్లను గమనిస్తే వారి డబ్బాలు టేకుతో తయారై ఉంటాయి. ఒకసారి ముట్టుకోవాలనిపించేలా ఆకర్షిస్తాయి. వాటిలో బంగారంలా మెరిసిపోతూ మామిడి తాండ్ర -తీయగా – తెరతీయగా- అన్నట్టు లాగుతూ ఉంటుంది.

పిల్లల్ని ఆకర్షించడానికి వాళ్ల పద్ధతులు వాళ్లకున్నాయి మరి! అయితే, వాళ్లంతా ఉదయాన్నే సైకిళ్లు తీసుకుని ఒక్కొక్కరూ పట్నంలోని ఒక వీధిలో తిరుగుతారు. వెళ్లేముందు నల్లపోచమ్మ గుడివద్దకు చేరుకుంటారు. ఆ తల్లికి మొక్కి, గర్భగుడి వద్దనుంచి ఇంత కుంకుమ తీసుకుని పెట్టెలకు దిద్దడమూ ఉంటుంది? అదేమిటి?
అంతేకాదు, వాళ్ల వద్ద బాట్లు ఉంటాయి. ఆ కుంకుమను వాటిపై చల్లడమూ ఉంటుంది. వాటి సంగతేమిటి? భయమా, భక్తా? తాదాత్మ్యతా?ఇలా – జనసామాన్యం అంతానూ- ఒక కార్యంలో నిమగ్నమయ్యేవాళ్లందరికీనూ – తమదైన జీవన వ్యాపారం ఉంది. ఆ వ్యాపార చింతనలో జనించే ఒకానొక సౌందర్యాత్మక తాదాత్మ్యత అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని చెప్పడంలో ఆ వేలాడే మామిడికాయ ఒక లీల అనీ, అదొక్కటి చాలు, వాళ్లందరి గురించిన ఒక దివ్యమైన దృష్టాంతాన్ని ఉల్లాసంగా చూపడానికీ అనీ -ఇదంతానూ, దృశ్యాదృశ్యంగా పరుచుకుంటూ పోవడం!ఇంకా చాలా కనబడతాయి.  ఎండాకాలం పుచ్చకాయలు అమ్మేవాళ్లను చూడండి. వాళ్లు ఒక పుచ్చకాయను అందంగా కత్తిరించి విచ్చుకున్న తామరలా నిలపడం చూస్తాం.జామకాయల్ని అమ్మేవాళ్లను చూడండి. వాళ్లూ ఒక భాగాన్ని కోసి ఉంచుతారు.
అదట్లే ఉంటుంది, దినమంతా, వ్యాపారం అయ్యేంత దాకా. దాంతో పాటు ఆకులనూ వాటితో వుంచుతారు, సహజ తోరణాల్లా.

టీ బంకులూ అంతే. తెరవగానే మొదట ఆ షాపు యజమాని ఈడ్నుంచి ఆడికి ఒక ఛాయను గ్లాసుతో పోయడమూ ఒక ఛాయ. ఒక ritual. కొందరు ఒక టీని గ్లాసులో పోసి దేవుడి ఫొటో ముందు అగర్బత్తీలు వెలిగించి అట్లా ఉంచేస్తారు. అంతే.

ఈదుళ్లకు పోయినప్పుడు  గౌడు కల్లుబొట్టు వొంపేప్పుడు ఒక రెండు మూడు చుక్కల్ని నేలరాల్చడం లేదా అలా బొట్లు బొట్లుగా భూదేవికి అర్పించమా? ఇట్లా…అర్పించడంలోనూ ఎన్నో అంశాలున్నాయి. ఆరోగ్యం ఉంది. ఆనందం ఉంది. తృప్తీ ఉంది. దిష్టి తీయడమూ ఉంది.

అంతెందుకు? ఇంట్లోనే. ఒక రకంగా అన్నం తినేముందు ఒక ముద్దను మనం దేవుడికి వదిలినట్లు వీళ్లంతా ఏదో ఒక దాన్ని ప్రకృతికి నివేదించడమూ ఉందే, అది ఒక కాయే. మనల్ని హత్తుకుంటుంది. ఆకర్షిస్తుంటుంది, మామిడిలా!

-ఇట్లా కొన్ని కార్యాలు సుందరంగా మనల్ని కట్టి పడేస్తాయి. కొన్నేమో భక్తినే కాదు, భయాన్నీ కలిగిస్తాయి. అయితే, ఈ చిత్రం మాత్రం రసన.  ఇది మా ఇంటిపక్కనే ఉండే ఒక ముస్లిం చిరు వ్యాపారి display…దిల్ సే.

inside photo (1)+++తాను సీజనల్ వ్యాపారి.
అతడికి ఒకే ఒక తోపుడు బండి ఉంది.
బళ్లు తెరిస్తే అతడు దగ్గర్లోని ఇస్కూల్ కు వెళతాడు. జామకాయలు అమ్ముతాడు. తాటి గేగులు అమ్ముతాడు. రేగుపండ్లు అమ్ముతాడు. అట్లే అంగూర్లూ అమ్ముతాడు. ఇప్పుడు మాత్రం మామిడిపండ్లు అమ్ముతున్నాడు.ఒకానొక ఉదయం …ఆయన బండి తయారుగా ఉండగా… పైన మామిడి పండు వేలాడుతుండగా… కింద అగర్ బత్తీ వెలుగుతూ ఉండగా…ఆత్మా పరమాత్మలా వాటిని చూస్తే మనసు నిండిపోయింది.
ఒక నయనానందం..పరిమళభరిత రాగం…ఎంతో పవిత్రంగా అనిపించింది.
మోకాళ్లు వంచి వినమ్రంగా తొలి ఫొటో తీశాను. తర్వాత అడ్డంగా( హారిజాంటల్) కొన్ని…అటు తర్వాత నిలువుగా (వర్టికల్) మరికొన్ని చిత్రాలు చేశాను.

వేలాడే ఆ పండు, పైన నీడకోసం వేసిన అచ్చాదన, కింద ఆ కోత మామిడి కాయ తాలూకు ముక్కలు, రూపాయికి రెండు…వాటిపై చల్లడానికి వుంచిన ఉప్పూ కారం కలిపిన డబ్బా, ఇంకా గల్లపెట్టే – అన్నీనూ చూశాను. విడివిడిగా తీశాను.

మొత్తం ఒక పది చిత్రాలు. అందులో రెండింటిని మీకు  పంచడం ఒక సూత్రం కోసం.
అవును. సామాన్యుల జీవితానికీ ఒక సున్నితపు త్రాసు ఉంది.
అది జీవకళను, జీవన వ్యాపారాన్ని రెడింటినీ సహజంగా కలుపుతుంది.
దృశ్యాదృశ్యం అంటే అదే!

తాదాత్మ్యత. దిల్ సే.
మా పొరుగింటి తోపుడుబండి యజమానికి సలాములతో…

~  

ఆ కురులు…ఆనందాల రెపరెపలు!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshకొందరిని చూస్తే పూల మొక్కలు గుర్తొస్తాయి.
మొక్కలు, శాఖలు, ఆకులు, రెమ్మలు, పిందెలు, పూలు.
తర్వాత పండ్లు.

కానీ, చూశారా కేశాలు? వెంట్రుకలను?
అవి చిత్రాలను అద్వితీయం చేస్తాయి, పలుమార్లు!

పిల్లలైనా పెద్దలైనా, వారి కురులను చూస్తే, ఆ కురుల్లో తురిమిన పూవులను చూస్తే పూల మొక్కలు గుర్తొస్తాయి. ఉదాహరణకు ఈ పిల్లనే చూడండి.
గులాబీ బాల.

ఈ పాప అందం ఆ నవ్వు, ఆ పువ్వు వల్లనా?
కాదనే ఈ దృశ్యాదృశ్యం.

నిజం.
చాయాచిత్రాల్లో కురులు నిజంగానే ఒక విశేషం.
వాటిని విడమర్చి చెప్పడం బహుకష్టం.
నిజానికి ఛాయా చిత్రాల్లో వాటిని అలవోకగా పట్టుకోవడమూ అంత తేలిక కాదు.
ఇక. వాటిని వెలుగునీడల్లో సహజంగా బంధించి చూపడం ఇంకా కష్టం. కానీ, అందమైన ఎన్నో చిత్రాలను చూస్తుంటాం. కానీ, వాటిల్లో కురుల పాత్ర అదృశ్యంగా ఉంటుందంటే నమ్ముతారా?
నమ్మాలనే ఈ చిత్రం.

+++

ఛాయా చిత్రం పరిభాషలో గ్రేన్స్ అని వాడుతూనే ఉంటాం.
బ్లాక్ అండ్ వైట్…నలుపు తెలుపు గ్రేన్స్ అంటారు. అట్లే రంగులు.
కానీ, మనిషికి అనువణువూ ఒక ఛాయ.
సూక్ష్మంగా చూస్తే స్వేదగ్రంథులూ, రోమాలూ అన్నీ ఉంటై – కలగలసి ఉంటై.
కానీ, మనసును హత్తుకునే చిత్రాల్లో కొన్నిసార్లు కేశ సంపదా అద్వితీయ పాత్ర పోషిస్తుంది!
ఉదాహరణకు ఈ పాప. ఛాయ.

ఇందులోని అందమంతా ఆ పాప జుత్తే.
తర్వాత ఆ పుష్పమే లేదా చిరునవ్వే.
నవ్వే అలా పుష్పించిందా అనిపించేంత అందం ఈ చిత్రం.
కానీ, ఒక చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ చిత్రానికి వేర్లు ఆ పాప జుత్తే అని నా భావన.

కానీ, అమ్మాయిలు, నడి వయసు స్త్రీలు, తల్లులు… ఏ వయసు వాళ్లయినా సరే, చిత్రంలో కురులదే మహత్తర పాత్ర.  కొందరికి ఒత్తయిన జుత్తు… మందార పువ్వువలే. మరికొందరికి నెరిసిన జుత్తు…కలువల్లా.
కానీ, ఎవరైనా తలంటుపోసుకున్నాక గుడిలోని దీపంలా,  తీర్థంలా, దివ్యంగా అలౌకికంగా కనిపిస్తారు.
నవ్వితే ఆత్మలు శాంతించేంత బావుంటారు.

అలా వారిని చిత్రాలు తీయడం ఒక దివ్యానుభవం. అదొక పవిత్రం.
పొరబాటుగా వాళ్ల బాహ్య సౌందర్యానికే మీరు తలొగ్గి తీశారా?
తీస్తే తీశారు గానీ ఆ తర్వాత వాటిని ఫొటోషాప్ లోకి వెళ్లి కొంచెం లెవల్స్ పెంచారా?
ఇంకేమైనా కరెక్షన్స్ చేస్తూ పోయారా? లాభం లేదు. ఆ ఫొటో కాస్త ఇంప్రూవ్ కావచ్చును. కానీ, ఆ కురులు పంచే అనురాగం, దయ, కరుణా, లాలస, మాయ, అమాయ- మటుమాయమైపోతుంది. క్షణంలో ఆ కురుల మెరుపు అదృశ్యమైపోతుంది. తర్వాత నవ్వూ, పువ్వూ మిగులుతుంది.

వెంట్రుక వాసి తేడాతో ఆ వెంట్రుకలన్నీ గాఢ నీలిమలోకో లేదా నలుపులోకో దాగిపోయి ఇల్లంతా చీకటైనట్టు తల మాడిపోతుంది. అట్లా ఆ కురులు తమ ఆధ్యాత్మక శోభనుంచి వైదొలగి- చిత్రంలో తెలిసిందే చూస్తూ ఉంటాం. చూసిందే చూస్తూ ఉంటాం కూడా.  అదొక వైచిత్రి.
అందుకే సహజ చిత్రం విలువ సహజంగానే అధికం.

మళ్లీ పాప.
దాని కురులు చూడండి. ముంగురులూ చూడండి.
రెపరెపలు పోయే ఆనందంలా ఉన్న ఆ బాలిక జుత్తు చూడండి.
ఇది ఇంకా ఫలించలేదుగానీ, వెంట్రుక పోగులన్నీ లెక్కబెట్టగలిగేలా తీయడం నిజమైన చిత్రం.

+++

ఇంకా చెప్పాలి.
కురులంటే బొమ్మలు కూడా.
అవును.
మనకు కళ్లుంటాయి. అందరికీ తెలుసు.
కానీ, కళ్లపై కనుబొమ్మలుంటాయి. చూశారా? మీరెప్పుడైనా?
ఫలానా వాళ్ల ‘బొమ్మలు’ బావున్నాయని అన్నారా ఎప్పుడైనా? పోనీ ఎవరైనా అనగా విన్నారా?

బొమ్మలు!
అవును. ఒక బొమ్మకు ఆ వంపులు తిరిగిన ఇంద్రధనుస్సు అర్ధభాగాలు రెండు బొమ్మలు.
కలిపితే ఈ బాల. పూబాల.
అవీ కేశాలే కదా. వాటితో కూడిందే కదా ముఖం. చ్ఛాయ. జీవకళ!
అదీ నా పాయింట్.

బొమ్మల కింద కనులే కాదు, కనురెప్పలే కాదు, ఆ రెప్పలపై విప్పారిన నవ్వులా ఆ రోమాలు. వాటినేమంటారు? ఆ ‘ఐ లాషెస్’ కూడా చిత్రంలో ముఖ్యభాగం అని ఎవరైనా గుర్తిస్తారా? అవీ నవ్వుతూ ఉంటాయి, పాపతోపాటు.
అంతేకాదు, బుగ్గ మీసం – సైడ్ లాక్స్ – వాటికీ ముంగురులూ ఉంటై.
అట్లే కొందరికి పుట్టమచ్చ మీద రోమం ఉంటుంది.
అదీ మాట్లాడుతుంది. కవ్విస్తుంది. ఇంకా చాలా.

+++

ఓపికా, శ్రద్ధా.
కుంకుడు కాయలు – షాంపూలు.
కొబ్బరి నూనెలు – సుగంధ ద్యవ్యాలూ – ఇంకా ఎన్నో.
ఎన్నో డొమెస్టిక్ ఈస్తటిక్ సరంజామా. వాటన్నిటితోనూ ఎదిగిన ప్రపంచం, ఈ సిరులు.
దృశ్యాదృశ్యం ప్రతి చిత్రం, జీవకళా.

-ఇట్లా చాలా. అందుకే చిత్రంలో అన్నీ కూడుతాయంటాను, ముఖ్యంగా కురులు చిత్రనిర్మాణంలో్ అవిభాజ్యమైన గ్రేన్స్ అంటాను. వాటితో ఛాయాచిత్రంలో జీవకళ శోభిస్తూ ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించండి.

ముఖ్యంగా స్త్రీలను ఛాయాచిత్రాల్లో చేసేప్పుడు, వాళ్లను సహజంగా చిత్రించేటప్పుడు, ఏ టచింగ్ లేకుండా బొమ్మను చూస్తే అందులో అచ్చెరువొందించే అందమంతా కురులతో కూడిందే అని నా భావన. ఈ చిత్రమే కాదు, స్త్రీల చిత్రాలు ఏవైనా సరే…వారి కట్టూబొట్టూ ఎలాంటిదైనా కేశసౌందర్యం ఒక మోహం. దాహం. అది అణువణువునూ సౌందర్యవంతం చేస్తుంటుంది. అది నిజమైన చ్ఛాయకు బలిమి అనే నా అభిప్రాయం.

కొన్నిసార్లు మహిళల సౌందర్యం తాలూకు అందం అంతానూ వారి ఉంగరాల జుట్టు లేదా నుదుటిపై పడే ముంగురుల నుంచి విరబూస్తుందని అనుకుంటాం. కానీ, విరబోసుకున్న జుత్తు లేదా అల్లుకున్నజడలు, కొప్పులు, చేత్తో వేళ్ల వెనుక భాగంతో.. జడపాయలను నిదానంగా సాపు చేస్తూ చిక్కులు తీయడం…ఇదంతానూ ఒక దృశ్యాదృశ్యం. ఒక్కోసారి శిఖముడి లేదా ఆ ముడి విప్పినప్పుడు పడే జలపాత సోయగం…అంతానూ ఒక వింతైన ఛాయాంజలి.

నిజానికి ఒక్కమాటలో కురులు ఒక గ్రంథం అయితే ముంగురులు, జడకొప్పులు ఇవన్నీనూ అందలి అధ్యాయాలు. తురిమిన ఒక పుష్ఫం ఒక కూర్పు. శీర్షిక.

ఒక లోచన

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఆమె చేపలు అమ్మే బెస్తామె.
మా బస్తీలో ఒకానొక ఉదయం అలా తప్పించుకుంది.

తల వంచుకుని, నవ్వునూ చేయినీ అడ్డు పెట్టుకుని – అలా తప్పించుకుందనే అనుకుంది!

నిజమే.
ఎవరైనా ముఖం కనపడకుండా చేతులు అడ్డు పెట్టుకుంటే చాలు, చాలావరకు వాళ్ల ఆనవాళ్లను కనిపెట్టలేం. మాట వరుసకు కాదుగానీ నిజంగానే ‘ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్!’.

అయితే ఒక విషయం పంచుకోవాలనే ఈ చిత్రం.
కనపడీ కనపడని ఈ దృశ్యం – దృశ్యాదృశ్యం.

ఒకటి నవ్వు. దాంతో కూడా తప్పించుకోవచ్చు.అయితే, అది ఇక్కడ కనిపిస్తూనే ఉంది.
నవ్వు తాలూకు విస్త్రుతి కూడా విశిష్టమైందే. నవ్వుతో మనిషి ఎట్లా సంభాషిస్తాడో, ఆ సంభాషణను మరెట్లా కట్ చేస్తాడో లేదా ఆ పెదాలు దాటిన నవ్వుతో లేదా పెదవి విరుపులతో ఎలా సున్నితంగా తప్పుకుంటారో అది మరొక దృశ్యాదృశ్యం. కానీ, నవ్వునూ అంటే నోటిని – చూపునూ అంటే కళ్లను – కనపడకుండా సిగ్గుపడి దాచిన ఈ మగువ చేపపిల్లలా కెమెరా బుట్టలో పడొద్దని ప్రయత్నించనైతే ప్రయత్నించింది.
అందుకే, ఈ చిత్రం దృశ్యాదృశ్యమే. ఉందీ – లేదు. అయితే ఇక్కడే ఒకమాట!

అసలు మనిషి తన ముఖానికి ఇచ్చే ప్రాధాన్యం మరే దానికీ ఇవ్వడనే అనిపిస్తుంది. అందుకే తన ఒంటిపై ఎంత శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా, ముఖాన్ని మాత్రం మనిషి శ్రద్ధగా అద్దంలో చూసుకుంటాడు. కనుముక్కుతీరు, తలకట్టు, బొట్టు, జుట్టు – అన్నింటినీ గమనించి, దిద్దుకుని, సరిచేసుకుని లేదా తయారై బయటకు వెళతాడు. అయితే, ముఖంపై అంత శ్రద్ధ వుండటానికి కారణం ముఖంలో చూపుకు కారణమైన లేదా దృశ్యాదృశ్యానికి మౌలికమైన ‘కళ్లుండటమే’ కదా అనిపిస్తోంది!

పంచేంద్రియాల్లో నయనం ప్రధానం కదా!

అసలు కళ్లే కదా ముఖంలో ప్రధానం. ఆ కళ్లతోనే కదా చూపు ఆనేది. అందుకనేనా, ఎవరి చూపుల్లో పడకుండా ఉండాలంటే ముఖం దాచుకుంటాము. అంటే చూపుకు సంబంధించిన ముఖ్యభాగం అన్నది తలలో కళ్లుగా ఉన్నందునేనా ముఖానికి అంత ప్రాధాన్యం? ముఖం దాచుకోవడంలో కళ్లు దాగుతాయనేనా అలా దాక్కోవడం! కళ్లలో పడకుండా ఉండాలంటే ముఖం చాటేస్తే చాలనా – ఇదంతా?

కావచ్చు.
మనకిష్టం ఉంటేనే కళ్లు కలుపుతాం.
ఇష్టం లేకపో్తే కళ్లు తిప్పుకుంటాం కూడా.
కళ్లతో పాటు ముఖాన్నీ చాటేస్తాం కదా!

ఇంకో విషయం.
ముఖంలో కళ్లు చూపకుండా మిగతా భాగాన్ని చూపినా కూడా మనిషిని పోల్చుకోలేం.
నిజం. నవ్వుతో కూడా పూర్తిగా ఫలానా మనిషిని గుర్తు పట్టలేం.

ఈమె ప్రయత్నమంతానూ అదే – అసంకల్పితంగా.
నవ్వుతున్నాగానీ, కళ్లను దాచి మొత్తం ముఖాన్నీ చాటేసింది.
కానీ, నా ప్రయత్నమంతా ముఖం దాచుకోవడంలో ‘నయనం ప్రధానం’ అని చెప్పడమే!

గమనించండి. ఒక లోచన.

~

అదృశ్యంగా ఇంకెంతో!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshమనుషుల చిత్రాలు చేస్తూ ఉండగా ఎన్నో సమస్యలు. మరెన్నో మెలకువలు.
ఎవరూ హర్ట్ కాకుండా వాళ్లను మరే విధంగా చూపాలీ అనుకున్నప్పుడు ఒక్కోసారి వారి ముఖాలు కనపడకుండా చెప్పడం ఒక అలవాటుగా అభ్యసించాలి.  మరికొన్నిసార్లు వాళ్లు యాక్టివిటీలో మునిగి ఉండగా వాళ్లను చిత్రిస్తూ ఉండాలి. మరికొన్ని సార్లు వాళ్ల వాళ్ల బాడీ లాంగ్వేజ్ ద్వారా మానవ జీవనచ్ఛాయలను వ్యక్తం చేయడమూ అలవాటుగా పెట్టుకోవాలి. ఇంకా కొన్నిసార్లు వాళ్లను అస్సలు చూపకుండానూ వాళ్లేమిటో చెప్పడమూ ఒక కుతూహలం. సరదా. ఒక చిత్రమైన ఎక్సర్ సైజ్!
ఇది అటువంటిదే!

సరే, ఈ చిత్రం.
సరసరా మెట్లెక్కి డాబాపైకి వెళితే ఈ దృశ్యం.
దండెం మీద ఒక చిన్నకుటుంబం.

భర్తా, భార్యా. కింద కూతురు.
జీన్స్ ప్యాంట్లు, నైటీ, బొంత.

చిన్నకుటుంబం ఒకటి అట్లా డాబాపై కనిపిస్తుంటే, ఆ ఐదంతస్తుల అపార్టమెంట్లో ఆ కుటుంబం ఏ ప్లోర్లో మరే ప్లాట్ లో నివాసం ఉందో చూడాలనిపించింది. కానీ, అక్కర్లేదు.

డాబాపైనో లేదా బాల్కనీలోనో ఆరవేసిన బట్టల్లో నగర జీవితం తన ఆధునికతను, అట్లే తన పాత సంప్రదాయాన్ని కలగలిపి బతకడం ఒకటి దృశ్యాదృశ్యంగా గోచరిస్తూనే ఉంటుంది.

బావుందనిపించింది.

బ్లూ, వైట్ -జీన్స్.
పూల డిజైన్ నైటీ.
ఒక రింగురింగుల వెలుతురు ఛార.

ఆమె మధ్యలో.
తనను ప్రేమగా దగ్గరకు తీసుకున్నట్లు- భుజంపై అభిమానంగా చేయేసినట్లు ప్యాంట్లు.
కింద నిద్రిస్తూ అన్నట్టు  పాప!

కాంక్రీట్ పిల్లర్ల మధ్య మధ్యతరగతి జీవితం.
వెనకాల ఎవరో ఒక మనిషి. భవనాలు.
అదృశ్యంగా ఇంకెంతో!

కానీ, ఏదో బాగుందనిపించింది.
అయితే ఒక మాట.
ఇట్లా చిత్రించడం అన్నది ఎట్లా మొదలైందో చెప్పాలని ఉంది.
అసలు ఇట్లా మనిషి లేకుండానే ఆ మనిషి లేదా ఆ కుటుంబం తాలూకు ఆనవాళ్లను చెప్పడం ఎందుకూ అంటే ఒక చిద్విలాసం. ఒక ప్రయోగాకర్షణ అని వివరించాలని ఉంది. అంతేనా? కాదేమో కూడా!

నిజానికి కొన్నిసార్లు బెదురుతాం. మరికొన్నిసార్లు భంగపడుతాం. ఇంకొన్నిసార్లు పని మానేస్తాం.
తీయ్యమని బతిమిలాడినా వాళ్ల ఫొటోలు తీయం. అంతగా ఆశాభంగానికి గురవుతాం. విచారపడుతాం.

మనం ఏ ఉద్దేశ్యంతో కెమెరా పట్టామో చెప్పినా అవతలి వారికి అర్థంకాని స్థితి ఉన్నప్పుడు, వాస్తవికత మింగుడు పడని స్థితి ఒకటి అవతల నిలుచున్నదీ అన్నప్పుడు లొంగిపోవాలని ఉండదు. అప్పుడు వాస్తవికత స్థానంలో అధివాస్తవికతను ఆశ్రయిస్తూ ఉంటాం. ఏ రచనలోనైనా అంతే. ఛాయా చిత్రణంలోనూ ఇది ఉందేమో అనిపిస్తోంది!

ఇట్లా ఒక కుటుంబం ఇంత అందంగా ప్రతీకగా ఒక చిత్రంలో బంధీ కావడం నిజంగానే దృశ్యాదృశ్యం.
ఉంది. లేదు. ఎంత బాగుంది!

ఇలా ఒక ఛాయాచిత్రంలో ‘అధివాస్తవికత’ ఒడుపుగా వచ్చి చేరడంలో సాంఘిక నియంత్రణ ఒకటి ఏదో రూపంలో పనిచేస్తూ ఉంటుందని మాత్రం చెప్పగలను. ఇది బలమా అంటే బలమే. బలహీనతా అంటే అవును.

ఫొటోగ్రఫీ అన్నది సబ్జెక్టివ్ కాదని, అది అబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ నుంచి డిఫైన్ అవుతూ ఉంటుందనీ ఎవరైనా బలంగా చెప్పాలి. ఆ క్రమంలో ఆ బలా – బలహీనతల్లోంచి నైపుణ్యంగా బయట పడటం అన్నది అద్భుతంగా ఉంటుంది. అదంతానూ ఒక చక్కటి ప్రయాస.

అవును. నిత్య జీవితంలో మనుషుల జీవన చ్ఛాయలను తీయడం ఒక వ్యాపకంగా పెట్టుకునే వారికి కొన్ని చిత్రమైన సమస్యలూ ఉంటై. చిత్రమైన పరిష్కారాలూ ఉంటై.  చాలాసార్లు జీవితమే లేదా చిత్రమే చిత్రమైన పరిష్కారాలను ప్రసాదిస్తుంది.

అదే ఈ ‘దృశ్యాదృశ్యం’ అనిపిస్తోంది!

*

ఈ బతుకమ్మ ఒక Incredible Goddess!

 ~ కందుకూరి రమేష్ బాబు

 

 

‘కారు కిటికీ తలుపుల్లోంచి చూడటం’ అని ఒక మాటల రచయిత రాస్తాడు, జీవితాన్ని గురించి!
సినిమాలో!
నిజమే.
నిజంగానే కిటికీ నుంచి చూసినట్లు చూడటం ఒకటి ఉన్నది!

కిటికీ నుంచి చూసినట్లే, ఏదో వాహనంలోంచో లేదా టూ వీలర్ మీంచో… పోనీ నడుచుకుంటూనో వెళుతూ ఉంటే బాటకి ఇరవైపులా కాలిబాటా కనిపిస్తుంది.అక్కడ ఇలాంటి మనుషులెవరో…ఎక్కడివారో…ఏవేవో తమవైన జీవన వ్యాపకాల్లో నిమగ్నమై ఉండనే ఉంటారు.

మామూలుగా చూస్తే ఈ చిత్రం లేదా చ్ఛాయ- మామూలే!
కానీ, కాదనే చెప్పడం!

+++

‘మామూలే’ అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్లు మనకోసం ఏదో చిన్న దుకాణం నడుపుతుంటారు.
తాత్కాలికంగానో, శాశ్వతంగానో ఒక గుడారం వలే జీవిస్తారు.
వాళ్లెప్పుడు ఆ జాగలోంచి వెళ్లిపోతారో వాళ్లకే తెలియదు.
వెళ్లిపోతే…జస్ట్ ఒక ఉనికి… చెట్టుకింద వాళ్లు అదృశ్యమైన దృశ్యం ఒకటి -ఒక క్షణం మన కంట్లో పడి మాయమైతుంది! అంతే!
ఇక ఉంట – వాళ్లు ఉన్నారని కూడా మనకు గుర్తుండదు.
ఏదో పోస్టర్ల మాదిరి కళ్లకు తాకడం – అంతే కదా!

ఉన్నాలేకున్నా మన కళ్లకు ఆనని దృశ్య ప్రపంచంలో వాళ్లు మాత్రం ఉండనే ఉంటారు.
కానీ, కొన్నిసార్లు వాళ్లు తమ ప్రపంచంలోకే తాము వెళ్లి -ఇలా బంగారానికి పుటం పెట్టినట్టు – తమ జీవితాన్ని తాము విచారిస్తారని తెలియదు!
అదీ ఒక రకంగా చూడటమే. దృష్టి సారించడమే! దృశ్యాదృశ్యమే!
అందుకే ఈ చిత్రం.

చూడండి. ఆమెను.
ఆమె వేలుంచి ఆ దేవత పటాన్ని అమిత శ్రద్ధతో ఎట్లా చూస్తున్నదో!

అక్కడికి వచ్చే ముందు మళ్లీ వెనక్కి…
నిజానికి రోడ్డుపై అధికంగా ప్రసారమయ్యే జీవితాలకు ఇండ్లుంటాయి. వాకిళ్లూ ఉంటాయి.
బిల్డింగులూ ఉంటాయి. కానీ, కాలి బాట మీద నివసించే ఇలాంటి వారికి చెట్లుంటాయి. కానుగ చెట్టు నీడ ఒకటి తోడుంటుంది. కొందరికి గుడిసెలూ ఉంటాయి. కానీ, ఫొటోగ్రఫీలో వాడుకలో ఉండే street life మటుకు ఒక అభాస.
paradox.

నిజానికి అది రెండింటి సమ్మేళనం!
ఆ వీధి జీవితంలో రోడ్డూ, కాలిబాటా కలగలసి వుంటుంది, వాస్తవంలా!
కానీ ఆయా ఫొటోగ్రాఫర్లకు ఏ తేడా వుండదు. ఏ పట్టింపూ ఉండదు.
అదే వారి ఛాయా చిత్రణం.

కానీ, వారికి ఎన్నడు అర్థమైతుందో, జీవితం వీధిలో ఉండదని!
వాళ్లు తీస్తున్నది వీధి కానే కాదనీనూ!
చిల్లర దేవుళ్లని కానే కాదనీనూ!

బహిరంగంగా కనిపించే జీవన వ్యాపకమంతా street lifeగా ఎంచే ఫొటోగ్రాఫర్లకు ఈ చిత్రం street కాదని చెప్పడం, life అని గుర్తు చేయడం! అంతకుమించి ఒక కేశవరెడ్డిలా అంచున వున్న జీవితంలో ఒక భీభత్సరస ప్రధానమైన పదును వుంటుందని. అది చూపుడువేలుతో కోస్తుందనీనూ. అదొక devotion అనీనూ. కెమెరా పట్టడమూ అటువంటి ఒక చూపుడు కోతే అనీనూ! లీల అనేనూ!!
అదే ఈ వారం దృశ్యాదృశ్యం.

+++

ఇక మళ్లీ అక్కడికి!
ఆమె వద్దకి వస్తే…

నిజం.
వీధి ఒక టెంపుల్.
ఆమె అందునా ఒక incredible goddess.

ఈ తల్లి భాగ్యనగరంలో, దక్కన్ క్రానికల్ కార్యాలయం ఎదురు బాటలో, కాలిబాటపై పోస్టర్లు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. పిల్లలు, సీనరీలు, దేవతల పోస్టర్లు- చిన్నవి, మధ్యరకంవి, పెద్దవీ – అమ్ముతూ ఉంటుంది.

ఎపుడైనా చూస్తే, ఆమె కనిపించదు. చుట్టూ మూగి ఉంటారు.
లేదా కనిపిస్తే ఆమె ముందు ఎవరో ఒకరిద్దరు బేరం చేస్తూ ఉంటారు.
ఎవరూ లేనప్పుడు చూస్తే ఆమె దేవత.

అవును.
పనిలో ఉండగా ఆమెలో ఏ విశిష్టతా కనిపించదు.
కానీ, పనిలేనప్పుడు ఆమె తల్లి అవుతుంది. బిడ్డ బొమ్మను చూస్తుంది.
భావుకురాలూ అవుతుంది, సీనరీలో తలమునకలు అయి సంతషిస్తుంది.
కానీ, ఈ చిత్రం తీసేప్పుడు మాత్రం ఆమె ఒక దేవతామూర్తిని లేదా లక్ష్మీదేవి పటాన్ని అమిత శ్రద్ధగా చూస్తోంది. తన దారిద్ర్య రేఖ దిగువ జీవితాన్ని అట్లా ఎత్తి, ఆ పటంపై చేయుంచినట్లు వుంచి, ఆ దేవత ఆసీనమైన తామర పుష్పం కిందుగా వుంచి మరీ తదేకంగా చూస్తోంది.

చూడటం అంటే విచారణ.
జీవితాన్ని విచారిస్తుందేమో అనిపిస్తోంది.

ఎప్పుడూ ఒక మనిషి ఇంత విచారణ చేయగా నేను చూడలేదు.
ఒక ఫొటోను! లేదా చిత్రాన్ని!!

కావచ్చు, అది దేవతా పటమే కావచ్చు.
కానీ, గర్భగుడిలో ఒక భక్తురాలు అలా నిలబడి తదేక ధ్యానంలో దేవతకు తన మొర ఆలకించుకోవడం చూశాను. తన దుస్థితి నివేదించుకుని తల్లడిల్లే భక్తులనూ చూశాను. కన్నీరువలే ఆనందబాష్పం విడవటమూ కన్నాను. కానీ, అది గుడి. కానీ, ఇలా -వీధిలో ఒక వనిత… తన జీవన వ్యాపారంలోనే ఉన్న ఒకానొక పటాన్ని ఏకాంతంలో తన ముందే పెట్టుకుని – అలా తల పూర్తిగా వంచుకుని – తన తలరాత ఎలా వుందో అన్నట్టు ఆ తల్లితోనే విచారణ చేస్తున్నట్లు చూడటం –  చూపుడు వేలుతో చూడటం- ఇది మాత్రం ఇదే తొలిసారి- బహుశా మళ్లీ చూడాలనీ లేదు, ఇలా ఎవర్నీ!

రాత!

ఒక సుద్దరామె. శూద్రురాలు.
కడు పేదరాలు. అబాగ్యురాలు.
నమ్మశక్యం కాని బతుకునొకదాన్ని భరిస్తూ ఉన్న బతుకమ్మ.
క్షుద్ర జీవితంలో ఒక స్త్రీ – Goddess.
an incredible moment.

మొత్తంగా ఒక విచారణ ఈ వారం – దృశ్యాదృశ్యం.

Kandukuri Ramesh

ఒక రచన… రెండు కవితలు..!

 

పుట్టుమచ్చలు సరే.
వాటిని ఎందుకు తీయాలో, ఎలా తీయాలో, తీస్తూ ఏం చెప్పగలుగుతామో అంతుపట్టనే లేదు.
ప్చ్. కానీ, పచ్చబొట్టు తీయడం మాత్రం ఒకటి మెలమెల్లగా ఆవరిస్తున్నది.

ఒక పదేళ్ల క్రితం.
‘సామాన్యుడి ఆటోగ్రాఫ్’ అన్న కార్యక్రమం ఒకటి ఒక టెలివిజన్ కోసం వారం వారం చేసేవాడిని.
ఆ పనిలో భాగంగా పోచంపల్లి వైపు వెళ్లి ఆ ఊరి నుంచి తిరిగి వస్తుంటే, జీపు కిటికీలోంచి బయటకు చూస్తే, ఆమె. ఒక మధ్య వయస్సు స్త్రీ.

ఏదో చేసంచి పట్టుకుని ఉండగా ఆ చేయి బలంగా కిందికి జార్చి ఉండగా ఒక చిత్కళ.
చేతిపై పచ్చబొట్టు.

చూస్తే అది వంకీలు వంకీలుగా రాసి ఉంది.
‘జానకి’ అని ఉంది.

బహుశా అది తన పేరే కాబోలని మాటలు కలపగా నోటికి కొంగు అడ్డుగా పెట్టుకుని నవ్విందామె.
అర్థం కాలేదంటే, ‘అది నా స్నేహితురాలు పేరు’ అని చెప్పింది. తన పేరు ‘మాలక్ష్’మి అట. ‘జానకి చేయిపై తన పేరుంటుందట! చెప్పి మళ్ల నవ్విందామె. సిగ్గుతో!

కాస్త గడిచాక ఇంకా చెప్పిందామె. ఒకానొక పున్నమి నాడు జరిగే జాతరలో ఇద్దరు స్నేహితులు ఒకరి పేరు ఒకరు పచ్చబొట్టుగా వేయించుకున్నారట! అది కూడా తమ పెళ్లి కాక ముందర నట!
నాటి విశేషాన్ని యాది చేసుకుంటూ నేనడిగిన వాటన్నిటికీ ఆమె సంబురంగా జవాబిస్తుంటే మా జీపులోంచి కెమెరా మెన్ అన్నాడు, ‘సామాన్యుడి ఆటోగ్రాఫ్’ అంటే ఇదే గదా అని!

ఆమె ‘ఆ సంగతేందోగానీ మేమైతే ఏడాదికొకసారి కలుస్తూనే ఉంటామయా’ అంది.
ఇద్దరికీ తర్వాత పెళ్లిళ్లయ్యాయట. వీళ్ల పిల్లలకూ పెళ్లిళ్లయినాయట. తమ దోస్తాన్ గురించి చాలా  చెప్పింది. విశేషం ఏమిటంటే, ఆ పచ్చబొట్టు గురించి ఆమె మాట్లాడుతుంటే మళ్లీ ఆమె యవ్వనవతి వలే సిగ్గిల్లి జవాబిస్తుంటే చూడాలి! ఎంత బాగా ఉన్నదో ఆమె!

బహుశా ఆమెకు నలభై ఏదేళ్లుంటాయి. ఇప్పటికీ వాళ్లిద్దరూ ఆ ఫలానా గ్రామంలో జాతరకు తప్పక వెళుతారట. పున్నమి వెన్నెల్లో మనసు విప్పి మాట్లాడుకుంటారట. కష్టసుఖాలు చెప్పుకుని కంటతడి పెట్టుకుంటారట. పేర్లు, జిలేబీల పొట్లాలతో, పంచుకున్న తీయటి జ్ఞాపకాలతో, సేదతీరిన మనసుతో ఇంటికి తిరిగి వెళతారట. వెంట ఎవరు వచ్చినా, రాకపోయినా ఆ స్నేహితులిద్దరూ వెళ్లడం ఖాయం అట!

+++

అంతిమంగా పచ్చబొట్టు అన్నది చెదరని తమ స్నేహానికి తీపి గురుతుగా చెప్పిందామె. చెప్పి, వెళ్లిపోయిందామె.తర్వాత నా చేయి చూసుకున్నాను. బోడగా కనిపించింది. నాకంటూ ఎవరైనా అంత ప్రేమగల స్నేహితులున్నారా? అని క్షణం ఆలోచించి భంగపడ్డాను. నేనే కాదు, చాలామంది భంగపడతారేమో! అలా పచ్చబొట్టు వేయించుకుని జ్ఞాపకాల్లో పదిలంగా వుంచుకోలేనందుకు! రెక్కల్లో రెక్కయి తమ స్నేహం ఎగరడం అన్నది క్రమేపీ తరగిపోతున్న స్థితికి చేరువైతున్నందుకు!

అనిపించింది, అదంతా ‘జానపదం’ అనీ అనిపించింది.
ఆ పచ్చబొట్టు అచ్చమైన, ఆత్మగల్ల – నవనాగరికతా వ్యామోహాలు లేని –  తీరుబడితో కూడిన జీవితంలోని – ఒకానొక మేలు కవిత్వం- అనిపించింది. ఒక రాగం, మరొక శోకమూ అనిపించింది. ఒక రచన రెండు కవితలూ అనిపించింది, వాళ్లిద్దరిని అర్థం చేసుకుంటుంటూ!

+++

చకచకా పదేళ్లు.
గడిచాయా అంటే గడిచాయనే చెప్పాలి.
కానీ, నగరం నట్టనడుమ ఎన్నో చిత్రాలు చూశాను. ‘జానకి’ పచ్చబొట్టు చూసిన పిమ్మట ఇక అలాంటి ‘జానపదాలు’ చూడటం సాగుతూనే ఉన్నది. ఛాయాచిత్ర యాత్రణంలో ఇలాంటి అరుదైన సంతకాలెన్నో చూస్తూ ఉండటం అలవడింది.

కానీ, అందరిలాగే – ఆధునిక సాహిత్య పోకడ తెలిసి, కావ్యం ఏమిటో, నాటకం, నవల, కథ, కథానికా ఇంకా కవిత్వం ఏమిటో మెలమెల్లగా అభ్యాసం చేసుకుంటూ అక్షర ప్రపంచంలో కాటగలసి పోతూ ఉండగా, అనుభవాలు, అనుభూతులూ కేవలం తెరిచిన పుస్తకాల్లోంచే చూసి ఆనందిస్తూ ఉంటూ ఉండగా -హఠాత్తుగా దృశ్యాదృశ్య ప్రపంచం ఒకటి ఐదేళ్లుగా ఆవరించడం నా అదృష్టం. దాంతో మళ్లీ సజీవంగా మనుషులు, కథలు కథలుగా కనిపిస్తూ ఉన్నారు. అలా, కెమెరాతో తిరిగి మనిషిని చదవడం అభ్యాసం చేసుకుంటూ ఉండగా ‘జానపదం’ అన్నది ఒక కవితలా అరుదెంచిన అద్భుత ఛాయా చిత్రణ ఘడియలు ఇవి.


నిజానికి రెండు చిత్రాలూ చేశాను.  కాంపొజిషన్ పరంగా ఇవేమీ గొప్పవి కాకపోవచ్చు. కానీ క్షణం గడిస్తే అదృశ్యమయ్యే దృశ్య ప్రపంచంలో వాటిని ఒడిసి పట్టుకోవడం నా రచనా స్రవంతిలో మేలిమి వ్యక్తీకరణలే అని నా భావన. మరి ఎప్పుడంటారా? గత ఏడు, ఒకానొక సాయంత్రం తీశాను. వెలుతురు తగ్గుముఖం పడుతూ ఉండగా… అది హైదరాబాద్ లోని సెంట్రల్ చౌరస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్ మధ్య… జనం బాగానే ఉండగా జరిగింది.

బండ్లు…యాక్సిలేటర్లు ‘ఝుమ్..ఝుమ్’ అంటూ మనసు ఒకదానిపై చూపు నిలిపేంత శాంతినీ ఇవ్వడంలేదు. కానీ, నా భుజానికి ఉన్న బ్యాగ్ లో కెమెరాకు ఎప్పుడూ కన్నంటుకోదు. అది మేలయింది! దాని కన్నుతెరిచే ఉంది.ఒకతను లూనామీద వెళుతూ ఆ జనసమ్మర్థంలో కొన్ని క్షణాలు ఆగి ఉండగా అతడి చాపిన చేయిని అలా చూసి చూడగానే….అతడి ‘ కవిత’ ను చూడగానే, ఆ పచ్చబొట్టు చప్పున ఆకర్శించి నా చేత కెమెరా ఒక చిత్రం తీయించింది. అది తొలి రచన.

+++

అతడెవరో తెలియదు.
ఆ ‘కవిత’ తన అర్థాంగో, ప్రియురాలో? ఏమో.
తల్లో, చెల్లెలో, స్నేహితురాలో, మరేమో!
కానీ, బాగ్యనగరంలో ఒక జానపద వైఖరి ఒకటి ఆధునిక కవిత్వంలా శోభించి నా గుండె పులకించింది.
అంతకన్నా ఎక్కవ అతడ్ని ‘కవి’ని చేసిన ఛాయాచిత్రం నేను చేసిన మలి రచన.
అవును. దాంతో నా మది ఆనంద తాండవమే చేసింది.

ఆ రెండో చిత్రం మరింత కవిత్వం.
అవును మరి. అతడి హ్యాండిల్ బార్ మీద పుష్పం ఒకటి మరి!
అది మల్లెపూవా?  కావచ్చు. కాకపోవచ్చు. కానీ పుష్ఫం!
కానీ, అది ఏకాంతంగా అతడి హృదయాన్ని అపూర్వంగా నగరం మీద ఒక ప్రేమగీతికలా ఊరేగిస్తూ ఉన్నది.
చేయిపై ఆ ‘కవిత’ తనతో ఊసులాడుతున్నట్టే ఉన్నది.

ఇక ఒక లోటు భర్తీ అయినట్టే అయింది.
నగరంలో జానపదం.

ఇప్పుడు నా చేయిపై స్నేహానికీ, ప్రేమకీ గురుతుగా ఒక పచ్చబొట్టు లేని భావనే లేనే లేదు.
పోయింది.
బహుశా- కెమెరా భుజానికి ఉన్న కారణంగానో ఏమో, ఒక ‘కవిత’ నాలో పలు రచనలు చేయిస్తూనే ఉంది.
దృశ్యాదృశ్యం అంటే ఇదేనేమో!

Kandukuri Ramesh

‘ప్రగతి’ ఆయన వేలిముద్ర

2
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వారి బాడీ లాంగ్వేజీతోనే కాదు, సదరు వ్యక్తి నవ్వును బట్టి కూడా చక్కగా అంచనా వేయవచ్చును. ఆరోగ్యం నిండిన నవ్వు, హాయిగా నవ్వే తీరు ఆ వ్కక్తి తాలూకు సంతృప్తికరమైన జీవితాన్నే కాదు, సాఫీగా సాగుతున్న సంస్థ తీరుతెన్నులనూ పట్టిస్తుంది. ప్రగతి ఆఫ్ సెట్ ప్రింటర్స్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మెన్ పరుచూరి హనుమంతరావు విషయంలో ఇదే నిరూపితం అవుతోంది. ఆయన గుండెనిండా నవ్వుతూ మాట్లాడుతుంటే వారు సాధించిన ‘ప్రగతి’ సప్తవర్ణ ఇంద్రధనుస్సు వలే ఆవిష్కారం అవుతున్నది.

ఆరు దశబ్దాల ప్రగతి రథ సారథి అయిన హనుమంతరావు లాల్చీ పైజామా ధరిస్తారు. ఆయనది సుఖం, శాంతి, సంతృప్తులను ఇముడ్చుకున్న ఛామన ఛాయ, మేను. రెడ్ హిల్స్ లోని వారి ప్రధాన కార్యాలయంలో సందర్శకుల కోసం వేసిన ఒక సోఫాలో కూచుని ఆయనతో ముఖాముఖి మాట్లాడుతుంటే, తెలుగు ప్రజలు అంతర్జాతీయంగా స్థిరంగా వేసిన కొన్ని ముద్రల్లో వీరిదీ ఒకటా అన్న సోయి కలగనే కలగదు. అంత సింప్లిసిటీ వారిది.

మాటల్లో మధ్యలో సందేహం కలిగి, ‘ మీరు రెగ్యులర్ గా కూచునే ప్లేస్ ఏది?’ అంటే, ‘ నా కంటూ కుర్చీలేదు. నిజమే. నేను చెయిర్ లేని చైర్మెన్ ను’ అంటూ నవ్వేశారు.

నవ్వుతూనే ఆయన లేచి నిదానంగా ముందుకు దారి తీశారు. ఆయనతో పాటు నడుస్తూ ప్రింటింగ్ కార్యాలయాన్ని, పని జరిగే చోట్లను చూస్తుంటే, యంత్రాలన్నీ ఒక్క క్షణం గౌరవ వందనం చేసి మళ్లీ పరుగందుకున్నాయా అన్నట్టు చలిస్తున్నాయి.

సన్నటి చప్పుడుతో ఆ యంత్రాలు పనిచేస్తుంటే ఒక్కో మిషను వద్ద ఆగి, జరుగుతున్న పని క్వాలిటీని అంచనా వేస్తూ హనుమంతరావు ముందుకు వెళ్లసాగారు. ఆకస్మాత్తుగా ఆయన ఒక చోట ఆగి, మిషన్ ఆపరేటర్ బసవరాజును పరిచయం చేశారు. ‘ ఈయన మా తొలి ఉద్యోగుల్లో ఒకరు. పైన, బైండింగ్ సెక్షన్ లో మహ్మద్ మెయినుద్దీన్ ఉన్నారు. ఆమయనా అంతే. సంస్థ స్థాపించిన తొలి రోజుల్నుంచీ మా కుటుంభంలో దాదాపు ఐదొందల సిబ్బంది పనిచేస్తున్నారు’ చెప్పారాయన.

‘మా వర్క్ ఫోర్స్’ ఘనత ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం ఒక్కటే కాదు, కస్టమర్లకు ప్రింట్ చేసిన మెటీరియల్ ను సప్లై చేసే కంపెనీగా కాకుండా ఆయా సంస్థల భాగస్వామిగా  సజీవ సంబంధాలు నెరుపుతాం. మా ‘ప్రగతి’కి ఇదే సూత్రం’ అని వివరించారాయన.

+++
1
‘ప్రగతి’కి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. 1979లో ప్రగతి దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఫొటో టైప్ సెట్టింగ్ సర్వీసులను ప్రారంభించింది. 1985లో మొదటి కలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 1988లో తొలిసారిగా కంప్యూటర్డ్ కంట్రోల్డ్ రిజిస్టర్, ఇంక్ కీ సెట్టింగ్ ను ఇన్ స్టాల్ చేసిన ఘనత కూడా వీరిదే. అలాగే, కంప్యూటర్ టు ప్లేట్ టెక్నాలజీని ప్రారంభించి, మ్యాన్యువల్ గా ప్లేట్లు తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పడం వీరితోనే ప్రారంభం. అలా ప్రగతి క్వాలిటీ ముద్రణలోకి వెళ్లింది. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ నాణ్యతగల సేవలు అందించే ప్రింటర్స్ గా ‘ప్రగతి’ దేశవిదేశాల్లో పేరు గడించింది.

ఆ విషయాలను వివరించి చెబుతూ, ‘నలభై ఐదేళ్లక్రితం పన్నెండువేల రూపాయలతో ప్రగతిని ప్రారంభించాను. ఒకే ఒక ట్రెడిల్ మిషన్ తో నేను ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాను. తర్వాత నా కుమారులు నరేంద్ర, మహేంద్రలు వచ్చారు. ప్రగతికి కావాల్సిన ఆఫ్ సెట్ మిషనరీలు తెచ్చారు. క్రమంగా ఐ.టి.పరిజ్ఞానాన్ని అనేక విధాలుగా ఇమిడ్చారు. ఇంతలో అమెరికాలోని రాఛెస్టర్ యూనివర్సిటీలో చదువుకున్న నా పెద్ద మనవడు హర్ష వచ్చి చేరాడు. తను ప్రింటింగ్ పరిజ్ఞానానికి అవసరమైన సైంటిఫిక్ అప్రోచ్ ను జోడిస్తున్నాడు. త్వరలో మరో మనవడు హేమంత్ ( మెకానికల్ ఇంజనీర్) జతకావచ్చు’ ఉత్సాహంగా చెప్పారాయన.

అంటే, ఈ సంస్థది మూడు తరాల ప్రగతి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో దశను వేగవంతం చేశారు. అందరూ నమ్మింది ఒకటే. ఫోకస్, కమిట్ మెంట్, డెడికేషన్.  ఇవి కాకుండా టెక్నాలజీ, మౌలిక వసతులు, నిపుణులను సమకూర్చుకోవడం- వీటితో ప్రీప్రెస్, ప్రింటింగ్, ఫినిషింగ్, బైండింగ్ రంగాల్లో అమితశ్రద్ధ తీసుకుంటూ భారతదేశంలోనే కాదు, ప్రపంవ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు హై క్వాలిటీ ప్రింట్ సర్వీసులు అందిస్తున్న సంస్థగా ప్రగతి పురోగమిస్తోంది.

‘ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ ప్రింటింగ్ ప్రెస్ గా ప్రారంభమై ఐటి సర్వీసులు అందించే మేటి సంస్థగా ప్రగతి నేడు పేరొందింది’ అని సంక్షిప్తంగా ఆయన వివరించారు.

ఏదో  ఫోన్ వస్తే మాట్లాడుతూ ఆయన మిషన్లన్నీ దాటుకుంటూ మళ్లీ మొదటి అంతస్థులోని కార్యాలయానికి తిరిగి వచ్చారు. వస్తూ, అక్కడి టేబుల్ పై ఉంచిన ఏనుగు విగ్రహం వద్ద ఆగి, ‘ప్రింటింగ్ కమ్యూనిటీ యావత్తూ కలగనే పురస్కారం ఇదే’ అంటూ ఆగారాయన.

నిజం. ‘సౌత్ ఆఫ్రికన్  పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్ వారు ప్రతి ఏడాది ప్రింటింగ్ కాంపిటిషన్లు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో గత సంవత్సరం కేటలాగ్ విభాగంలో ప్రగతి ‘ఇంటర్నేషనల్ ప్రింటర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కించుకుంది. ఏనుగు ప్రతి రూపం అదే’ అని చెప్పారాయన. అంతటితో ఊరుకోకుండా, ఏనుగు పురస్కారం వచ్చాక తొట్టతొలి మిషనుతో ( ట్రెడిల్ ప్రెస్) తాను దిగిన ఫొటోను కూడా తెప్పించి చూపించారాయన. ‘ ఈ పురస్కారంతో మేం ప్రింటింగ్ టెక్నాలజీలో ఉన్నత శిఖరం అధిరోహించాం. ఇక, ఆ శిఖరంపై నిలదొక్కుకోవడమే మా ముందున్న కర్తవ్యం’ చెప్పారాయన. చెబుతూ, మరింత సన్నిహితంగా ఆయన నిర్మించిన ‘ ప్రగతి’ని చూపించారు.

అదేమిటో కాదు, అంగుటి. వేలిముద్ర. ‘థంబ్ ఇంప్రెషనే మా లోగో’ అని వేలెత్తి చూపారాయన. విజిటింగ్ కార్డు అందిస్తూ, ఆ ముద్ర తనదే అని హాయిగా నవ్వుతూ చెప్పారు. చూస్తే, ఆ లోగోలో సప్తవర్ణాలున్నాయి. తాము ఇముడ్చుకున్న సాంకేతిక ప్రతిభ, శ్రమశక్తికి సంకేతంగా అది మెరిసిపోతుండగా ఆయన తన కుమారులు నరేంద్ర, మహేంద్రలను, మనవడు హర్షలను పరిచయం చేశారు, ఇక ముందు వారిదే ‘ప్రగతి’ అని!

– కందుకూరి రమేష్ బాబు

( 18 మార్చి 2007 వార్త దినపత్రికలో ప్రచురితమైన ‘అంతర్ముఖం’ శీర్షికా వ్యాసం)

3
పూర్తిపేరు: పరుచూరి హనుమంతరావు
మారుపేరు: ‘ప్రగతి’ హనుమంతరావు
స్వస్థలం: చిట్టూర్పు, కృష్ఝాజిల్లా
చదువు: బిఎ
అభిరుచి:బాస్కెట్ బాల్
ఇష్టమైన రంగు: ఎరుపు
అభిమానించే వ్యక్తులు: లెనిన్, మావో
‘ప్రగతి’ స్థాపన: 1962
ప్రగతికి ముందు: సారథి స్టూడియో మేనేజర్, విశాలాంధ్ర విలేకరి, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి నేత, మూడేళ్ల జైలు జీవితం.
ప్రగతి కార్యాలయాలు: హైదరాబాద్, బెంగుళూర్,కోల్ కోత్తా, ముంబై, న్యూఢిల్లీ, న్యూయార్క్.

కస్టమర్లు: బజాజ్, ఇన్ఫోసిస్, ఫోర్ట్ ఇండియా, మెర్సిడెస్, పాన్ అమెరికా, ఐటిసి, తాజ్ గ్రూప్, బిబిసి, రెడ్డి ల్యాబ్స్, ఎల్ అండ్ టి, హచ్, ఇంకా చాలా…
ఇష్టమైన జాబ్ వర్క్:  పెళ్లి పత్రిక అచ్చేయడం.

ఆ పిల్లాడు నాకు వేసిన మంత్రం….

hanuman finalఒక్కొక్కసారి తెలిసిందే.
కానీ, మళ్లీ చూస్తాం.
చూసి అబ్బురపడతాం.
ఎంత అద్భుతం అని మళ్లీ అవలోకించుకుంటాం, మన జ్ఞానాజ్ఞనాలని, దృశ్యాదృశ్యాలని!విషయం ఒక దివ్య దర్శనం.

అది నగరంలోని రాంనగర్.
ఒక ఎటిఎం సెంటర్ లోంచి బయటకు వస్తూ ఉంటే ఈ పిల్లవాడు.

అది ఆంజనేయ స్వామి దేవాలయం.
ఆ గోడపై చక్కగా చిత్రించిన హనుమాన్ పెయింటింగ్.
అంత దూరంనుంచే ఆ పిల్లవాడు నడుస్తూ నడుస్తూ, చూస్తూ వస్తున్నాడు. చూశాను. కెమెరా తీయనే తీశాను.

వాళ్ల అమ్మ ఎప్పుడో ఆ గుడి దాటింది.
కానీ, ఇతడు ఇక్కడే ఆగిపోయాడు.

నిజం.
ఇతడు ఎంత ఆసక్తితో చూస్తున్నాడో చెప్పాలంటే నాకు భాషా లోపం కలుగుతున్నది.

విస్మయం. విడ్డూరం.
విచిత్రం. సందేహాస్పదం.

వాడిది అది ఆసక్తా? ఆశ్చర్యమా?
లీనమా? సమ్మోహనమా?

చిత్రమా? విచిత్రమా?
ఏమో!
అసలు ఆ పెయింటింగ్ ను, అందలి హనుమంతుడిని, ఆ సంజీవనీ పర్వతాన్ని హనుమాన్ అట్లా చేతులతో ఎత్తుకుని వెళ్లిపోవడం గురించి నాకెప్పుడో తెలుసు. కానీ, వీడికి తెలుసో లేదో! తెలియదు. కానీ తెలిసింది.వాడికీ, నాకూనూ!
ఆ బాలుడు మంత్ర ముగ్ధుడై చూస్తుంటే, గుడిగోడలపై బొమ్మలు ఎందుకు చెక్కుతారో కూడా తెలుస్తోంది నాకు!  కానీ, ఆ పిల్లవాడు ఆగి చూస్తుంటే, ఆగి, ఆగి, ఆగి, చూస్తుంటే మొత్తం పది చిత్రాలు చేశాను నేను.ప్రతి చిత్రం ఒక మంత్రముగ్ధం.

ఒకటి దూరంగా ఉన్నప్పుడే చూస్తున్నది. రెండు దగ్గరకు వచ్చి చూస్తున్నది.
మూడు అనుమానంగా చూసేది. తర్వాత అర్థం చేసుకుంటూ చూస్తున్నది.
తర్వాత ఆ పెయింటింగ్ పై చేయించి తడిమి చూసేది. అటు తర్వాత చిర్నవ్వుతో చూసేది.
అనంతరం ఆ పెయింటింగ్ ను వదిలలేక వదిలి వెళుతూ, వెనక్కి చూస్తూ…చూస్తూ వెళ్లేది.
ఇట్లా పది దాకా చేశాను.

చిత్రమేమిటంటే, దూరంగా వాళ్ల అమ్మ ఉన్నది. ఆగి ఉన్నది.
వాడు ఎంత దీర్ఘంగా, మరెంత పరిశీలనగా, ఇంకెంతటి ఆసక్తితో చూసిండో ఆమె చూడలేదు.
కేవలం వాడికోసం వేచి ఉన్నది.

ఆమెనూ చిత్రం చేయాలనుకున్నాను.
కానీ, ఎందుకో నాకు ఈ పెయింటింగ్ ను చూడాలనిపించింది.

ఏముందీ అందులో చూడాలని అక్కడకు బాలుడిగా చేరేసరికి వాడెళ్లి పోయాడు
నేను మిగిలాను.అదొక అద్భుత దృశ్యాదృశ్యంఇక చూడసాగాను.
ఇదివరకు లేని ఆసక్తి ఏదో కలిగిన సమయం అది.

నన్నెవరైనా చూశారో లేదో తెలియదుగానీ, నిజం.
తొట్ట తొలి సారిగా గోడలపై ఉన్న దేవుడి చిత్రం ఒకటి భక్తితో చూడసాగాను.

చూస్తుంటే, అంతకుముందు నా జ్ఞానంలో పెరిగిన పెయింటర్స్ ఎవరూ లేరు.
అసలు పెయింటర్ అన్నవాడెవడూ లేడు. ఒట్టి హనుమాన్ మిగిలాడు.

ఆ పెయింటింగ్ తాలూకు రంగులూ, చిత్రలేఖనా మహత్యం, విమర్శా దృక్పథం, అది కాదు, అసలు చిత్రం.
కేవల చిత్రం. ఆ చిత్రంలో అందలి వీర హనుమాన్ సంజీవనీ పర్వతాన్ని లాఘవంగా తీసుకెళుతూ ఉండటం, అదే చూశాను.

ఒక సూపర్ మ్యాన్, తన ఫ్లయిట్లో, అలా తోకతో ఉండటం, అద్భుతంగా తోచి తొలిసారి చూశాను.
ఆ అద్భుతాన్ని ఫీలయ్యాను. దివ్యంగా ఫీలయ్యాను.

అంతకుముందు తెలిసిందే. కానీ, కొత్తగా చూడటం.
బహుశా ఆ పిల్లవాడు నాకు వేసిన మంత్రం ‘సంజీవని’ అనిపిస్తోంది.

ఛాయా చిత్రలేఖనంతో ‘చేయడానికి’ బదులు ‘చూడటం’ కూడా ఒకటి ఉంటుందా?
దాన్ని మన సబ్జెక్టే మనకు నేర్పుతాడా?
ఏమో!

నాకైతే నేర్పిన బాలుడు వీడు.

– కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

 

మొక్కాలి, కనబడాలంటే…

devotionఒక శివరాత్రి చిత్రం ఇది.
వేములవాడలోని రాజన్న సన్నిధిలో తల్లీబిడ్డలు.ఒక సాన్నిధ్యం.
భగవంతుడూ… తల్లీ…బాలుడూ…
ఒక్కమాటలో మొక్కు.
అదే ఈ దృశ్యాదృశ్యం.

గుర్తుకొస్తున్నాయి. ఏవేవో.
తరతరాలు.

చిన్నప్పటి కాలువలు. బంగారు పురుగులు. చీమచింతకాయలు.
గోడను పట్టుకుని నాన్న కాళ్లు తొక్కడం.
రెండు జడల జె.పద్మ. లెక్కలు చెప్పే నారాయణ రెడ్డి సార్.
హైపో. ఇంకా చాలా.

నిజానికి అవన్నీ కాదు, తరతరాలు.

నాకు ‘పసకలు’ అయ్యాయి. అయ్యాకేమో, ఒక వర్షపు రాత్రి మా తాతమ్మ నన్ను తీసుకుని ఊర్లోని ఒక చోటుకు, ఎక్కడికో తీసుకెళ్లినట్టు గుర్తు. చాలా రోజులు నడిచినట్టనిపించే జ్ఞాపకం.
నడుస్తున్నంత సేపూ హోరున వర్షం. నిజానికి వర్షం అంటే గుర్తున్నది కూడా అదే తొలి అనుభవం.
అట్లా ఆ వర్షపు రోజు ఒక సుదీర్ఘ ప్రయాణం. చేతుల్లో చేయించుకుని!

అనంతరం ఎవరితోనో ఏమో, అది ఎటువంటి వైద్యమో ఏమో – ఇప్పించనైతే ఇప్పించింది మా తాతమ్మ.
వివరం తెలియదుగానీ అదొక సుదీర్ఘ ప్రయాణ ప్రాణ దృశ్యం. దృశ్యాదృశ్యం.
లీలగా గుర్తున్నది.

చిత్రమేమిటంటే చిన్నప్పుడు తిరిగిన ఇండ్లు, వీధులు, కూడళ్లు, ఆ పరిసరాలు అప్పటి వైశాల్యంతో ఉంటాయి.
పెరిగాక వాటిని చూస్తే అవి చిన్నబోతై.

అప్పుడు అంత దూరం నడవడం నిజంగా దూరం.
కానీ, తర్వాత అంత దూరం లేదు. దగ్గరే.
కానీ ఆ బుడిబుడి నడకలు, నా నడక కోసం తాతమ్మ ఆగి ఆగి వేసిన అడుగులూ…అన్నీనూ సుదీర్ఘమైనవి.
అట్లా ప్రతి ఒక్కరికీ ఏవో కొన్ని.జ్ఞాపకాలు చిన్నతనంలో పెద్దబడిలా ఉండనే ఉంటాయి.
అవన్నీ ఆయా స్థలకాలాల్లో ఫ్రీజ్ అయ్యే లీలలు.

చిత్రం. ఇల్లు చిన్నగా అనిపిస్తుంది. విశాలమైన బడి ఆవరణ కూడానూ అంత విశాలం కాదని తెలుస్తుంది.
అప్పుడు ఇరుకిరుగ్గా అనిపించిన గల్లీలు మరీ అంత ఇరుకేమీ కాదనీ ఇప్పుడు ఆశ్చర్యపోతాం.
అంతేకాదు, పవిత్రంగా ఆలయాలుంటాయి. ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది. అది అంత ఎత్తుకాదని తెలిసి ఒక దివ్యానుభవం ఏదో మిస్ అవుతాం కూడా.
కానీ, తప్పదు. చాలా నిజాలు అబద్ధం అని తెలిసి విస్తుపోతూ ఉంటాం, ఇప్పుడు!

ధ్వజ స్తంభమే కాదు, గుడి గంట కూడానూ అప్పుడు ఎంతో ఎత్తు!
కానీ తర్వాత విజిట్ చేస్తే, నాయినమ్మ చనిపోయినప్పుడు ఆ దేవాలయంలోనే ఒక రాత్రి నిద్ర చేస్తే, అప్పుడు బాల్యపు వర్షం తాతమ్మతో సుదీర్ఘ నడకా అంతానూ కల లాగా తలంపుకొచ్చి ‘ఏదీ ఎత్తు కాదు, బాల్యమే సమున్నతం’ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చూసిన దృశ్యమే తొలి తలుపు అనిపిస్తుంది.

నవ్వూ వస్తుంది.
గర్భగుడిలోకి వెళ్లాలంటే తల వంచుకుని వెళ్లే ఎత్తు ఏమీ బాగుండదు. విచారం కలుగుతుంది.
చిన్నప్పుడే బాల్యంతో ఈజీగా దేన్నయినా ముట్టుకోగలం. పెద్దయ్యాక ప్రతి దానికీ బహుముఖ దృశ్యం.
అంటూ ఉంటుంది. ముట్టూ ఉంటుంది. దూరం పెరుగుతూ ఉంటుంది.

ఈ చిత్రంలో ఉన్నది అటువంటిదే. దగ్గరితనం.
మూపు. చూపు. ఒక ఎక్స్ పోజ్. దృశ్యాదృశ్యం.

ఆమె కళ్లు మూసుకుని చూస్తోంది, చూడాల్సినది.
ఆ బాలుడు తెరుచుకుని చూస్తున్నాడు, కొత్తగా తెరుచుకుంటున్న లోకాలకేసి!

వారిద్దర్నీ కలిపిన చూపు, ఆ చేతులు. అవి చూడాలి.

చిత్రంలో అదే చిత్రం.

ఆ తల్లి చేతుల్లో బిడ్డ.
బిడ్డ చేయి.
అదీ ఒక చూపు.చూపించు దృశ్యాదృశ్యం.నిజానికి ఆ తల్లి దర్శిస్తున్నది వేరు. ఆ కుమారుడు వీక్షిస్తున్నదీ వేరు.
అది తల్లికి అది దివ్య దర్శనం అయివుంటుంది. కొడుక్కి మాత్రం ఒక అనుభవం. ఒక కుతూహలంతో కూడిన వీక్షణం. లేదా బిత్తరి చూపూ అయివుండవచ్చు.

కానీ, అవతల తల్లి అంతటి ఏకాగ్రతతో, లీనమై చూస్తున్నదేదో బాలుడికి తెలియదు.
వాణీ, విను. అసలు ఎటు చూడాలో కూడా తెలియని బాల్యం వాడిది.
అయినా తల్లి వెంట బాల్యం ఎన్నో చూస్తుంది.

అది తల్లే కానక్కర్లేదు, తండ్రీ కావచ్చు, నానమ్మా, తాతమ్మా కావచ్చు.
మా రమణమ్మ నన్ను ఎట్లయితే మా ఊర్లో చివరాఖరికి, దుబ్బ దాటాక…ఇంకా ఇంకా నడిస్తే వారంతపు అంగడి ఎక్కడైతే జరుగుతుందో అక్కడిదాకా…ఎలా నన్ను నడిపించుకు వెళ్లిందో అలా పిల్లల్ని ఎవరో ఒకరు ఎందుకో ఒకందుకు తీసుకెళుతూ ఉంటారు. అప్పుడు తెలియదు. ఎప్పుడో తెలుస్తుంది.

మొట్టమొదట వర్షాన్నిచూసిన రోజు అదే అని నాకెలా తెలిసిందో మీకెలా తెలుస్తుంది.

బహుశా అప్పుడు తాతమ్మకు  తెలియదేమో! వీడు ఏం గుర్తించున్నాడో అన్న ఆలోచనా తనకు రాలేదేమో!
కానీ, ఒక్కటి మాత్రం అనుకుంటుంది. ఎట్లయినా ‘పస్కలు’ తగ్గాలని అనుకుని ఉంటుంది!

కానీ నాకు వేరే దృశ్యం ఉంటుంది.
ఈ ఈ చిత్రంలో మల్లే.

ఇందులో ఈ అమ్మా ఆ భగవానుడిని ధ్యానిస్తూ ఏదో అనుకుంటూనే ఉంటుంది.
వాడి గురించి కూడానూ ఏదో కోరుకునే ఉంటుంది. కానీ, వాడికేమీ తెలియకపోవచ్చు.

ఆ రోజో -మరో రోజో- ఇంకో రోజో వాడు కొత్తగా ఒకటి చూస్తాడు.
తర్వాత అది ఎప్పుడు చూశాడో కూడా గుర్తు రాదు.

కానీ, మీరు చూడండి.
మీ దృశ్యావరణంలోకి వర్షమూ, వెన్నెలా ఎప్పుడు వచ్చిందో!
లేక పక్షీ, పామూ ఎలా వచ్చిందో గమనించండి.
లేదంటే పుస్తకమూ, డిగ్రీ సర్టిఫికెట్టూ, ఒక ప్రశంసా పత్ర.
ఇంకా దేవుడూ, దయ్యమూ. ఇంకేవో!
లేదా కొన్ని ప్రియరాగాలు.

‘లవ్యూ రా’ అన్న పదం!
అది తొలిసారిగా వినికిడిగా వచ్చిందా లేక దృశ్యంగా హత్తుకున్నదా చూడండి.
ఏమీ లేకపోతే గుడిగంటలా మీలోపల మీరు రీ సౌండ్ కండి.
దృశ్యాలు రీళ్లు కడతాయి.

కాకపోతే తొలి అనుభూతి కోసం మీరు ఈ చిత్రంలోని తల్లిలా మొక్కు కోవాలి.
నిశ్శబ్దం కావాలి. దేవుడి సన్నిధిలా మీరూ మీ సన్నిధిలోకి వెళ్లాలంటే ఏకాంతంగా, పక్కన ఉన్నది బాల్యం అన్నంత ప్రేమతో ఎవరి డిస్టర్బెన్సూ లేకుండా వెళ్లండి. తెరుచుకున్న వాడి కన్నుల కేసి చూస్తూ మీ జీవితంలో దృశ్యాదృశ్యం కండి.

~ కందుకూరి రమేష్ బాబు
Kandukuri Ramesh

ఎప్పుడైనా, ఎక్కడైనా మిగిలే చిత్రం -బాల్యం!

MAIN PHOTO
సాధారణంగా ఒక అందమైన దృశ్యం చేస్తాం. లేదా ఒక ఆసక్తికరమైన దృశ్యం చేస్తుంటాం.
కానీ, నాకేమిటో ఏమీ లేనిదాన్ని చూడాలనిపిస్తుంది. చూసి ఏదైనా తెలుసుకోవాలని కాదు.
అలా చూడాలని, చూస్తూనే ఉండాలని!అందుకే ఏం చూడాలా అని చూస్తూ ఉంటాను. చిత్రమేమిటంటే, ఎవరో దేన్నో చూపిస్తూనే ఉంటారు.
ఒక్కోసారి బాలుడిగా..ఒక్కోసారి కాదు, అత్యధికంగా అన్నింటినీ అంగీకరించి, ప్రతిదానికీ పొంగిపోయే అల్ప సంతోషిలా, కొత్త బొమ్మ …కొత్త బొమ్మ అని కోరే బాలుడిగా చూస్తూ ఉంటాను.చూస్తే, ఒక మధ్యాహ్నం.
కారులో వెళుతూ ఉంటే కిటికీ గుండా బయటకి చూస్తే, ఆటో.
అందులో పిల్లవాడు. చూసి నవ్వాను. నవ్వుతూ చూశాను.
వాడు చూశాడు. చేతులు ఊపసాగాడు.

అటు ఆటో, ఇటు కారు.
మధ్యలో బాలుడు.

నేనూ వాడూ పరస్పరం కలిశాం.
ఒక ఐడెంటిటీ. బాల్యం.

songs of innocence
songs of experienceనిజానికి మొత్తం ఫొటోగ్రఫియే ఒక బాల్య చాదస్తం. నిజం.+++

ఒక చిత్రాన్ని చేస్తున్నప్పుడు బాల్యం ఉన్నంత స్వచ్ఛంగా, బాల్యం స్పందించినంత నిర్మలంగా, బాల్యం వ్యక్తమైనంత నిర్భయంగా ఇంకేమీ స్పందించదు. యవ్వనం అపలు స్పందించదు. వృద్ధాప్యమూ కొంచెం బెటరు. అనుభవంతో ఏమిటా అన్నట్టు చూస్తుంది. అందుకే పై చిత్రంలో కళ్లు కళ్లూ కలియగానే, ఆ బాలుడిలో ఒక స్పందన. ఉల్లాసం. చిద్విలాసం. ఎందుకో తెలయదు. చిర్నవ్విండు. ఒళ్లంతా తన్మయత్వం.

ఎలా బయటపడాలో నాకు తెలియనట్ల నేనేమో చిత్రాలు చేస్తుంటే వాడేమో అంతకుముందే నేర్చుకున్నందువల్లో ఏమో- తన వెంటపడిన వ్యక్తి కేసి ఇలా ‘టాటా’ చెబుతూ చేతులూ ఊపసాగాడు.

ఒకటి కాదు, వాడు నన్ను లేదా నేను వాడిని చూసిన క్షణాంతరం నుంచి చకచకా కొన్ని ఫొటోలు తీశాను.
స్పష్టంగా నాకేసి విష్ చేస్తున్న ఈ ఫొటో వాటన్నిటిలో బాల్యానికి దర్పనం. బింబం.
నిర్మొహమాటంగా వ్యక్తమైన వాడి తీరుకు సంపూర్ణ చ్ఛాయ.
టాటా.

అంతేకాదు, ఇక ఈ రెండో చిత్రం చూడండి.
ఇందులో ఆ బాలుడితో పాటు వాళ్లమ్మ ఉంది. లోపల ఆటోలో ఉంది. కొంచెం సిగ్గిల్లి, ఫొటో తీస్తున్నవ్యక్తి అపరిచితుడు కాబట్టి ముఖాన్నంతా చూపకుండా ఓరగా దాగుంది.

కొంచెం సంశయం, కుతూహలం.
అయితే, ఆమె ‘ఆ మాత్రం’ చూస్తున్నదీ అంటే తన ఒడిలో బిడ్డ – అంటే బాల్యం ఉన్నందునే.
అంతేకాదు, ఆ బిడ్డ తన అదుపు లేకుండా అంతకుముందే నా కంట పడి కేరింతలు కూడా కొట్టిండు గనుక!
అయినా గానీ, రక్షణగా తన చేయిని అలా వుంచి ఆ బిడ్డ ఆనందానికి అడ్డు రాకుండా ఉంటూనే ఓరగా అలా చూస్తున్నది.

అకస్మాత్తు.
అవును. ఒక surprise.
ఎవరైనా అలా అనుకోకుండా చూస్తే, ఫొటో తీస్తే ఎవరిలోనైనా ఒక కుతూహలం.
ఆ కుతూహల రాగమే ఆమె కళ్లళ్లోనూ పాడ సాగింది.
అది కూడా నా దృష్టిలో ఒక బాల్యం. కానీ, కుతూహలం స్థానే అనుమానం, సంశయం మరికొన్ని క్షణాల్లో కలగనంత వరకూ బాగానే ఉంటుంది. ఆ లోగానే నా బాల్యం నన్ను ఈ చిత్రం తీయించింది.
లేకపోతే ఇది దొరకదు. దొరికిందంతానూ బాల్యమే. అందుకే ఆమె కళ్లలో ఆ అందం తళుక్కున మెరుస్తున్నది.

INSIDE PHOTOఇక ఆమె పక్కనున్న ఆవిడ. తన చెల్లెలు.
ఆమె కూడా అంతే. కొంత దాగుంది. కానీ, కనులు మెరుస్తునే ఉన్నయి.
అవీ బాల్య  ఛ్ఛాయలే అంటాను నేను. అయితే, ఆమె ఇంకొంచెం ఈ అపరిచితుడికి దూరంగా ఉన్నందున ఆ ఛ్ఛాయలోంచి చూస్తూ ఉన్నందున తన మొఖం కాస్తంత విప్పారి ఉన్నది.ఇక ఆ ఇద్దరు పిల్లలు.
వాళ్లిద్దరూ బాల్యానికి ముద్దుబిడ్డలు.
అందుకే వాళ్ల కళ్లే కాదు, ముఖాలూ మెరుస్తున్నవి.

ఇక వాడు.+++వాడిని చూడాలంటే మొదటి చిత్రమే మేలు.
అందులో చేతులూ, కళ్లూ, పెదాలూ అన్నీ నవ్వుతుంటై. ఆనందంతో శుభకాంక్షలు చెబుతూ ఉంటై.
తెలిసీ తెలియక, అవతలి వ్యక్తిని చందమామలా చూస్తూ ఎందుకో తెలియకుండానే చేతులూపే ఆ బాల్యం ఎంత ఆనందం! మరెంత అందం! అంతే అందమైనది ఈ చిత్రం. మచ్చ ఉందన్న సత్యమూ తెలియనంత అందాల చందమామంత బాలరాజు వాడు. వాడికి నా ముద్దులు.

ఇదంతా ఏందుకూ అంటే బాల్యం.
అవును. ఆ నిర్మలత్వం చెప్పనలవి కానంత బాల్యం. ఒక చిత్రంలో అది పలు ఛ్ఛాయలుగా వ్యక్తం అవుతూ ఉన్నదీ అంటే, క్రమేణా ఆ బాల్యం వయసు పెరిగిన కొద్దీ అనుభవాలతో నిండి ఏ మనిషి నైనా ఇక ఆశ్చర్యానికీ ఆనందానికీ స్పందనకూ దూరం చేస్తూ.. చేస్తూ ఉంటుందీ అంటే అది ఈ రెండో చిత్రం. అందుకే ఈ చిత్రం బాల్యం స్థాయి భేదాలను అపూర్వంగా ఆవిష్కరించే చిత్రం నా దృష్టిలో.

చూస్తూ ఉండండి. ఒక్కొక్కరిని కాసేపు. ఒకరి తర్వాత ఒకరిని కాసేపు.
ముఖ్యంగా ఆ చిత్రంలో ఉన్న ఆటో డ్రైవర్ నీ చూడండి
అతడూ మనకేసి చూడకున్నా చూస్తూనే ఉన్నాడు.
రోడ్డు మీదే దృష్టి పెట్టి బండి తోలుతున్నా అతడు అన్నీ చూస్తూనే ఉన్నాడు.
తాను పూర్తి కాన్షియస్ లో ఉన్నాడు. అందుకే అతడి బాల్యపు చ్ఛాయలు చిత్రంలో కానరావు.
అంతా adulthood.  కానీ, మళ్లీ ఈమెకు రండి. womanhood.
తల్లి. అందుకే అంత అందం.

ఆ తల్లి కొంగు చూడండి. దానిమీద పువ్వులను చూడండి. నిండుగ విరిసిన ఆ మోము చూడండి. అందలి సిగ్గులు చూడండి. ఆఖరికి కనులు చూడండి. గర్వంగా ఆనందంగా నిండుగా, అదీ తల్లి అంటే. మాతృత్వపు -బాల్యపు శ్రద్ధ, దృశ్య- ఆ ఛాయ.

తర్వాత తప్పకుండా దయవుంచి ఈ రెండో చిత్రంలోని పిల్లవాడిని జాగ్రత్తగా చూడాలి,
ఆశ్చర్యం. వాడి దృష్టి ఇప్పుడు నా నుంచి -మీ నుంచి -వేరే దానిమీద పడింది.
గమనించారా? ఇప్పుడు వాడు వేరే దాన్ని చూస్తున్నడు.

చేతులు చూడండి- అవి ఇంకా మనవైపే ఉన్నాయి.
కానీ, కన్నులు? అవి వేరే వైపు చూస్తున్నాయి.
వాడి దృష్టి మారింది.

అదే చిత్రం.
నిజం. బాల్యం.

+++

బాల్యం ఎంత చక్కగా చూస్తుందో!  ప్రతిదీ, నిత్యమూ కొత్తగా. ఎప్పుడూ అంతే.
అంతకుముందు చూసిందానిపై ఎంత ప్రేమతో ఆ బాల్యం చూపులు సారిస్తుందో అంతే ప్రేమతో అది మరోదానికేసి చూడటం దృశ్యాదృశ్యం. ఛాయా చిత్రలేఖనము లేదా బాల్యం.

మన adult egoకు నచ్చదుగానీ అదే బాల్యం బలిమి.
ఎదుగుతున్నకొద్దీ దృష్టి ఒకదానిపై నిలుస్తుంటే అది బాల్యానికి సెలవు.
ఎప్పుడూ నిలిచే దృష్టే. ఒకదానిపై కాకపోతే మరొకదానిపై నిలిపే దృష్టే బాల్యం.

అందుకే ఎప్పుడైనా, ఎక్కడైనా తొలి చిత్రం -బాల్యం.
ఎవరికైనా, ఎందుకైనా మలి చిత్రం – బాల్యానికి టాటా.

~ కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

ఒక కన్ను నా వైపు తిరిగి చూస్తున్నదని…

drushya drushyam -main photoసంభాషణ పలు రకాలు.
మాటలుంటాయి. మౌనం ఉంటుంది.
అరుపులుంటాయి. గుసగుసలూ ఉంటాయి.
చూపులుంటాయి. పరిశీలనలుంటాయి.
తొలి చూపుల్లోనే చెప్పవలసిందంతా చెప్పడమూ ఉంటుంది.
ఒక్కోసారి ఎంతకూ తెగని బంధమూ, అనుబంధమూ ఉంటుంది.
మొత్తంగా కమ్యూనికేషన్ అని మనం మాట్లాడుకుంటున్నదంతా ఒక స్పర్శ. అయితే, మానవీయ స్పర్శ ఒక్కటే అత్యున్నతమైంది అనుకుంటూ ఉంటాం. కానీ, కాదు. అసలు మనిషిగా కంటే ఒక ‘మూగ మనసు’ ఎక్కువ మాట్లాడుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక జంతువు మరింత బాగా మాట్లాడుతుంది.

నిజం.

The Man Who Listens to Horses: The Story of a Real-Life Horse Whisperer అన్న పుస్తకాన్ని సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో కొన్ననాడు తెలియదు. నేనెంత సెన్సిటివ్ అవుతానో, మున్ముందు అని!

అవును. ఆ పుస్తకం మాంటీ రాబర్ట్స్ అనే గుర్రాల శిక్షకుడి ఆత్మకథ. మనకు ‘కామన్ సెన్స్’ అన్నది ఎంత ముఖ్యమో, ఆయనకు ‘హార్స్ సెన్స్’ అంత ముఖ్యం. అలా భావించే మనిషి చూపు పుస్తకం అది. స్పర్శ పుస్తకం అది. అతడి పుస్తకం ఒక సంభాషణ.

అనాదిగా మనిషి అనాగరీకత నుంచి నాగరీకతలోకి వస్తున్న తీరు తెన్నుల్లో మొత్తం జంతుజాలం ఎంత ఇబ్బందిపడిందో కూడా తెలిపే పుస్తకం. అదే సమయంలో మనిషి ఎంత సున్నితంగా వ్యవహరిస్తే జంతువు తనతో మాట్లాడుతుందో చెప్పే పుస్తకం. మాటలాడిందా ఇక మౌనం వీడి అది మనిషికి ఎంత దగ్గరౌతుందో కూడా ఆ పుస్తకం చెబుతుంది.ఒక రకంగా ‘మనిషి మనీషి’గా మారడం వల్ల ప్రయోజనం లేదు. ‘జంతువుల విషయంలో జంతువు’గా మారడంలోనే అసలైన కిటుకు ఉంది. తెలివిడీ. వివేకమూ ఉంది’ అని ఆయన తన స్వీయానుభవంలో రుజువైన దాన్ని ఎంతో హృద్యంగా వివరిస్తాడు. ఒక్క మాటలో ఈ పుస్తకం గుర్రాలను మచ్చిక చేసుకునే వాళ్లకంటే కూడానూ మనిషి తనను తాను అర్థం చేసుకుంటూ ఎదుటి వాళ్లను అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డలతో, బిడ్డలు పెద్దలతో, సోదరులు సోదరీమణులతో, ప్రేమికులు తమ జీవన సహచరులతో ఎలా మసులుకోవాలో చెప్పే ఉద్గ్రంథం అనాలి. జీవిత వికాసానికి ఈ పుస్తకం బహు చక్కటి గైడ్ అని నా భావన. అనుభవం. పుస్తకం చదువుతుంటే ఆయన సాధుగుణం అతడినే ఎంత సాధుజంతువుగా మార్చిందో తెలిసి వస్తూ ఉంటుంది. ఒకటొకటిగా ఆయా అధ్యాయాల పొంటి మనం పరుగులు పెడుతుంటే గుర్రాలన్నీ నిలుచుండి మనకు స్వాగతం పలుకుతాయి. ఎందుకంటే, ప్రతి పేరాగ్రాఫ్ లో ఆయన మనకట్లాంటి శిక్షణ ఇస్తూ పో్తాడు. పుస్తకం చదివాక “మనకూ ఒక గుర్రం ఉంటే బాగుండు’ అనిపిస్తుంది. లేదా మనమే ‘ఒకరికి మాలిమి అయితే ఎంత బాగుంటుందీ’ అనిపిస్తుంది.చిత్రమేమిటంటే ఆయన గుర్రాలను ఎలా మచ్చిక చేసుకోవాలో ఎవరి వద్దో నేర్చుకోలేదట! ‘మరి ఎక్కడా?’ అంటే, ‘గుర్రాల వద్దే’ అంటాడు. అందుకే తానంటాడు, ‘నేర్పు అన్నది బయట నుంచి రాదు, నేర్చుకోవడం నుంచే అని! అలాగే మనం ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటే, వాళ్ల మనసెరిగి ప్రవర్తిస్తే చాలు, ఆ నేర్పు మనలో బహునేర్పుగా కొత్త పాఠాలెన్నో నేర్పుతుందీ అంటాడు.

‘ఇంత ఉపోద్ఘాతం ఎందుకూ?’ అంటే ఆయన్ని నేను ఫొటోగ్రఫిలో అనుసరించాను గనుక. ఎవరి ఫొటో తీసినా నేను వాళ్ల పర్మిషన్ తీసుకుని తీయను. మాటలాడను. వాళ్ల ‘చిత్తాన్ని’ ఎరిగి ‘చిత్రిస్తాను’. అంతే. తోటకు మాలి ఎట్లో -నేనట్లా ‘చిత్రమాలి’నవుతూ ఉంటాను.

సరే, ఇక ఈ చిత్రం. ఇందులో గాడిద. అది నా వంక… వాళ్లవంకా చూస్తున్నదీ అంటే ‘చదవడం’ కాదు. నిజం. చూడండి. చూస్తూ ఉండండి. నేను ఏం చెబుతున్నానో చూడండి. నేను ఏం చేస్తున్ననో దానికి తెలుసు. అంతేకాదు, నా చిత్రంలో ఉన్న మిగతా ఇద్దరు. ఆమె… ఆ పాపా…వాళ్లేం చేస్తున్నారో కూడా దానికి తెలుసని! అంతా తెలిస్తేనే చిత్రం. లేకపోతే అది నా వంక అలా చూడదు. అందుకే అంటాను, ఒక తెలివిడి. దానికీనూ ఒక చిత్రలిపిలోకి తానూ వస్తున్నదన్న ఒక ‘ఎరుక’ ఉందనీనూ! లేకపోతే ఈ దృశ్యాదృశ్యం వుట్టి దృశ్యమే.

+++

ఎరుక. అది లేకపోతే అది దృశ్యం కాదు. వట్టి ‘చూపు’ అవుతుంది.
ఎర్కలేకపోతే అది చూడదు. వినదు. వెనుక కాళ్లతో తంతుంది కూడానూ.
అందర్నీనూ. అలా నిలకడగా నిలబడిందీ అంటే అదే ఒక సంభాషణ. దృశ్యాదృశ్యం.

అవును. ఇక్కడనే కాదు, ప్రతి దృశ్యంలో మాటలకందని ఇంగితం మహత్తరంగా గోచరిస్తుంది.  ఆ పుస్తకం చదివాక నాకు ఆ సంగతే మెల్లగా తెలియనారంభించింది. ఆ వివేకం నాకు ఎంత ఉపకరించిందీ అంటే చిత్రాల్లో మానవ సంభాషణ ఒక్కటే కాదు, జంతుజాలాన్నీ చూడసాగాను. అనేకంగా చేయసాగాను. ఉదాహరణకు ఈ గాడిద చిత్రం తీసుకొండి. అందులోని ఆ యజమానురాలు మా వాడకట్టులోనే కాదు, మా వీధి అనే కాదు, మొత్తం ముషీరాబాద్ లో గాడిద పాలు అమ్మే మనిషి. రిషాల గడ్డలో ఆమె నివాసం. ఆమె ‘గాడిద పాలో’ అని అరుస్తుంటే మగవాళ్లు పట్టించుకోరు. ఆడవాళ్లు మాత్రం తప్పక పట్టించుకుంటారు. అంటే ఏమిటని అర్థం? మహిళలే ఆమె అరుపును ఆలకిస్తారని. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం గురించి తాపత్రాయం తల్లికే ఎక్కువ కనుక!:

గాడిద వస్తుంటే ఆ వీధిలోని తల్లులకు ఎట్లా ముందుగా తెలుస్తుందో పిల్లలకూ తెలిసిపోతుంది. ఒకసారి తల్లలు గాడిద పాలు పిల్లలకు పట్టించారే అనుకోండి. ఇక ఆ పిల్లలు నెలకోసారి తమ వీధిలోకి వచ్చే ఆ గాడిద అన్నా, ఆ గాడిదను తెచ్చే ఆ తల్లి అన్నా ఒక అభిమానం. పరిచిత ప్రాణం. దాంతో ‘గాడిద పాలో’ అనగానే ఇండ్లలోంచి పిల్లలు ఒక స్టీలు గిలాస పట్టుకుని బయటకు పరుగెత్తుతారు. తల్లులకన్నా ముందే ఆ పిల్లలు గాడిద దగ్గరకు చేరుకుంటారు. నిజం. ఈ దృశ్యాదృశ్యం అదే. అప్పుడు ఆ గాడిదా చూస్తుంది, అన్నింటినీ. అదే చిత్రం.

+++

నేను చెప్పదల్చుకున్నది ఇదే. ఒక దృశ్య వాతావరణంలో కనిపించే తల్లి, గాడిదా, పిల్లవాడూ అంతానూ ఒక స్పర్శ. ఖర స్పర్శ. అవగాహన. ఒక పరిసరాల విజ్ఞానం. సంభాషణ. ఇదంతానూ వాచకంలో చెప్పవచ్చు.కానీ, ఒక చిత్రంలో చెప్పినప్పుడు దాన్ని చూడటం రావాలంటే ఒక అనుభవాన్ని విస్తరించి చెప్పవలసే వస్తుంది కూడా. ఇలా కొంత వినికిడి జ్ఞానం రచించవలసే వస్తుందేమో!

ఇంకా గమనించండి. వొంగి ఆ తల్లి ఆ బిడ్డ చేతిలో చిల్లర వుంచడం, పాలు గ్లాసులో పట్టిచ్చాక ప్రేమగా ఆ చిల్లరను ఆ చిన్ని చేతుల్లో పెట్టడం, అలా ఇవ్వడం…ఆ సంగతంతా ఆ గాడిద గమనిస్తూ ఉండటం. చూడండి. గాడిద కేసి మళ్లీ చూడండి.

అదీ ఓరగా చూస్తుంది. వెనకనుంచి దానికన్నీ కనబడతాయి. అందుకే అనడం, ఇది తన ఉనికి. తనకు తెలిసిన ఉనికి… దృశ్యాదృశ్యం.

monty roberts ( if you like use it inside the matter)

మాంటీ రాబర్ట్ చెప్పిందీ అదే. జంతువుకు జ్ఞానం ఉంటుంది. దృష్టీ ఉంటుంది. కనీసం ఎనిమిది విధాలుగా అది మనతో సంభాషిస్తుందనీనూ. అది గుర్రమైనా, గాడిద అయినా… ఒక జంతువు అవతలి జంతువును ప్రేమగా చూడాలంటే దానికి విశ్వాసం కావాలి. తన యాక్టివిటీ అవతలి వాళ్ల యాక్టివిటీ కనెక్ట్ కావాలి. ఆ యాక్టివిటీ పట్ల తనకు భరోసా కావాలి. అది లేనప్పుడు ఆందోళనగా చూస్తుంది. ఉంటే అది నిమ్మలంగా ఉంటుంది. చూస్తుంది. ఎవరైనా ఒక కొత్త పని చేస్తుంటే దానివల్ల తనకు ఏ హాని లేకుంటే అది కుతూహలంగానూ చూస్తుంది. ఎంజాయ్ చేస్తుంది. చూడండి.

మరో మాట. గాడిదకు అన్నీ తెలుసు. అలాగే వాళ్లకూనూ. దాని పాలు ఎంత అవసరమో ఆ పిల్లలకు తెలుసు. ఆ పాలు పట్టివ్వడం పిల్లలకు ఎంత అవసరమో తల్లులకూ తెలుసు. అలాగే, ఆ పాల అమ్మకం ఆ యజమానికీ, ఆ తల్లులకు వేర్వేరు అవసరాలే అయినా ఎంత అవసరమో కూడా గాడిదకు తెలుసు. అంతేకాదు, ఇదంతానూ నాకూ తెలుస్తూ ఉండటం, ఈ చిత్రం.

ఎరుక అవుతూ ఉండటాన్ని నేను నమ్ముతాను. ఎందుకంటే గుర్రానికీ ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ గురించి తన ఆత్మకథలో మాంటి రాబర్ట్ రాసుకున్నందువల్ల! అతడెన్నో దృశ్యాదృశ్యాలను రచించాడు, ఆ పుస్తకంలో. ఒక ఉదాహరణ చూడాలి…

ఆ రో్జు ఎలిజబెత్ క్వీన్ అతడ్ని తమ గుర్రపుశాలకు ఆహ్వానిస్తుంది. మాంటి రాబర్ట్ వెళతాడు. అరగంటలో ఆ నాటు గుర్రాలన్నీ అతడికి మాలిమి అయిపోతాయి. ఆశ్చర్యపోతుందామె. ‘ఎన్ని రోజులొ పడుతుందో’ అనుకుంటుంది. కానీ ఆయన ఒక్క రౌండ్ ఇలా కలియతిరిగే సరికి అవన్నీ అతడి పెంపుడు జంతువుల్లా మారిపోతాయి. ‘ఇదెలా సాధ్యం’ అంటుందామె. ‘సింపుల్’ అంటాడతను. మరేం లేదు. ‘గుర్రాలతో మనిషిలా బిహేవ్ చేయను’ అంటాడాయన.

మనిషిలా బిహేవ్ చేయక పోవడం!
‘అవును.. ఎన్నడు కూడా మీరు పశువులతో మనుషుల్లా బిహేవ్ చేయకూడదు’ అని ఆయన హెచ్చరిస్తాడు. దానర్థం ‘మిగతా జంతువులకన్నా మనిషి ఉన్నతమైనట్టు అస్సలు వ్యక్తం కాకూడదు’ అని! ఈ సంగతి ఆయన రహస్యం చెబుతున్నట్టు చెబుతాడాయ. ఇంకా ఇలా అంటాడు…’మనిషిలాగా అస్సలు ప్రవర్తించకండి. అవి భయపడతాయి. బెదురుతాయి. ఇక ఎన్నడూ మీకు మాలిమి కూడా కావు’ అంటాడు. ఇదంతా హార్స్ సెన్స్ లో భాగంగా చెబుతాడాయన. ఈ చిత్రంలో నాకు కొంత అనుభవం ఉంది. పిల్లలూ, తల్లులూ, ఆ జంతువును జంతువుగానే చూడగలిగే జంతువూ ఉండటం వల్ల ఈ ఫ్రేంలో దృశ్యం ఒద్దికగా ఇమిడింది. అయితే, మనం జీవిస్తున్న పరిసరాల్లో మనిషిగానే అధికంగా ప్రవర్తించడం వల్ల మనకు జంతువులను చూడ్డం రాదు. వాటిని మనం గ్రహించం. కానీ, అవి మనల్ని గ్రహిస్తున్న తీరూ ఒకటుంటుంది. దాన్ని మనం చూడం. చూడనప్పుడు ఇక ఎంజాయ్ చేయడం అన్నది అత్యాశ. కానీ, ఇప్పుడు చూడండి. ఆ గాడిదను చూడండి. మిమ్మల్ని చూస్తోందది!

దృశ్యాదృశ్యం. చూడాలి.

+++

‘నా వరకు నేను చెబుతాను, నేను గుర్రంతో గుర్రం అయిపోతాను. మనిషి తాలూకూ అధికారం, ఆధిపత్యం అహంకారం ఇవేవీ లేకుండా జెంటిల్ గా ప్రవర్తిస్తాను. ‘జెంటిల్ మెన్’ అంటే అవతలి వ్యక్తికైనా, జంతువుకైనా అతడిష్ఠం. ఎందుకూ అంటే “నేను లోకువ’ అన్న ఫీలింగేదీ అతడికి ఉండదు. అందుకే నా గుర్రాలు నన్ను ప్రేమిస్తాయి. అవి నన్ను క్షణాల్లో స్వారీ చేయమని ఆహ్వానిస్తాయి. నేను రాజులా ఊరేగుతాను. ఎలిజబెత్ రాణి కూడా మొదటిసారిగా గుర్రంపై స్వారీ చేస్తూ, రాణిలా ఫీలైందీ అంటే ఆమె తన అధికారాన్ని ఒదిలిందనే! ఆ జంతువుపట్ల తానూ ఒక జంతువులా..ఒక అనుబంధాల జాలంలో కలబోతై ప్రేమగా ఇమిడినందువల్లే! అందువల్లే గుర్రానికీ ఆమె రాణి అయింది’ అని కూడా మాంటీ రాబర్ట్ వివరిస్తాడు పుస్తకంలో.

ఇక, ఇప్పుడు నా వరకు నేను చెబుతాను. ఇదంతా నిజం. నా వరకూ నాకు నిజం. ఎందుకూ అంటే నేను మనుషులను చిత్రిస్తున్నప్పుడు మనిషిని. ఆడా మగా  కాదు. మనిషిని. జంతువును చిత్రిస్తున్నప్పుడు జంతువునే. అందుకే నేరుగా దాని కళ్లను చూడగలను. చిలుకను చిత్రించినా ఎలుకను చిత్రించినా చూపు నాకు ఆనుతుందీ అంటే అర్థం నాకు అది దృశ్యం. నా సంభాషణా మాధ్యమం అది. నాకే కాదు, నా సోదర చిత్రసీమలో ఉన్న వాహకులదంతానూ ఇదే దృక్పథం. అందుకే అనడం, సంభాషణ ఉంటుంది. అది కళ్లనుంచి మొదలవుతుంది. ఆ తర్వాత అది ఎన్నో గ్రహిస్తుంది. అందుకే ఏ చిత్రాన్ని చూసినా మీరు కళ్లెక్కడ ఉన్నాయో చూడండి. ఇంకా దృశ్యం బాగా అర్థమౌతుంది. నిజానికి ఆమె కళ్లూ, గాడిద కళ్లూ నాకు తెలుసు. చీకటిగా ఉంటాయి. రెండింట్లోనూ ఒక దయ ఉంటుంది. ఒక గాఢమైన లోయలో కురిసే ఒక కను పాప ధార ఉంటుంది. పాల ధార ఉంటుంది. ప్రేమధార ఉంటుంది. అందుకే నేను ఆమెనేమీ అడగను. గాడిదను కూడా అడగను. కానీ, చిత్రించుకుంటాను, చిత్రాలు.

అయితే చిత్రించాకో చిత్రణకు ముందో ఒకసారి ఒక మాట వ్యక్తమైంది మా మధ్య.
ఒకనాడు ఆమెను అనుకోకుండా అడిగాను. ‘అమ్మా ఈ తల్లికి ఏ పేరు పెట్టావూ’ అని!
‘తండ్రీ అని పెట్టాను’ అంది.
అర్థం కాలేదు.
ఏసు’ అని పిలుస్తాను బిడ్డా’ అని వివరించింది.

ఏసు!
అప్పట్నుంచి ఇక ఆ గాడిద చిత్రం తీస్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఆ నల్లటి ఛార ఏదో నాకు శిలువ లాగా తోయడం మొదలైంది.
ఆ నాడు మొదలు, ఇక చిత్రంగా నా చూపు మరింత దయగా, ప్రేమగా మారింది. గాడిదను చిత్రిస్తున్నప్పుడల్లా ‘ఏసు’ గుర్తొస్తాడు. పాల ధార వంటి ఒక ఛార…ఎప్పుడూ ఉండనే ఉంటూ ఉన్నది నా ప్రతి చిత్రంలో.

అయితే ఒక ఆశ్చర్యం!
మాంటీ రాబర్ట్స్ నాకు ఎప్పుడూ గుర్తొస్తాడు. నాలోని జంతువును మెలకువలో వుంచుతూ ఉంటాడు.
అవును మరి. అతడేమో జంతువును మనిషిలా చూడకూడదని చెప్పిన గురువు మరి!
ఈమె మాత్రం జంతువును ‘ఏసు’ అని భావిస్తున్నమనీషి.
అందుకే నాకు చిత్రం విస్తృతం అవుతూ ఉంటుంది.

‘దృశ్యాదృశ్యం’లో ఒక కన్ను నా వైపు తిరిగి చూస్తున్నదీ అంటే అది ఏసు.

~ కందుకూరి రమేష్ బాబు

బోయవాడి నూకలు

drushya drushyam sparowsనక్షత్రాలు మిణుక్కు మిణుక్కుమంటున్నాయి అనుకుంటాం.
కానీ అవి ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయట!

మిణుక్కు మిణుక్కు…
అదొక ఊహ. భావన. అనుభూతి.
అదే దృశ్యంగా జ్ఞాపకాల్లో ఉండిపోవడం చిత్రమే.

నిజం. చీకటి విశాలాకాశంలో ఆ కాంతి ఒకటి నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందని మాత్రం అనుకోం.
అనుకోకుండానే ఒక జ్ఞాపకం –  నక్షత్రం ఒక దృశ్యమై ఒక వెలుతురును మిణుక్కు మిణుక్కు మనిపిస్తుంది.

ఈ చిత్రమూ అటువంటిదే.
ఇందులో కనిపించేవన్నీ పిట్టలు. పిచ్చుకలు.
నేల మీది నక్షత్రమండలం.
చిన్న స్థలమే.
అయినా…

ఇవి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటై, చీకట్లో.
కానీ, ఉదయం తెలియదు.
ఒకసారి ఇలా చూశాక అవెప్పుడూ మిణుక్కు మిణుక్కు మంటూ ఇలా వెలుగుతూ ఆరుతూ ఉంటై అనుకుంటం. ఇదీ ఒక ఊహే. అధివాస్తవిక జ్ఞప్తి.
అంతే.

అవును.
అవి వెలుగులో వెలగవు.

అసలింతకీ, పిచ్చుకలు..

ప్రతి వ్యక్తి జ్ఞాపకంలో ఒక ఊరు ఉంటే గనుక ఆ ఊర్లో ఇల్లు ఉంటే గనుక ఆ ఇంట్లో దూలాల వద్దా… సూర్ల వద్ద, అక్కడ యాలాడగట్టిన వరి కంకులూ ఉంటే…అక్కడా.వాకిట్లో…కిచకిచ మని పిచ్చుకలు అరవడమూ…ఒకచోటు నుంచి ఇంకో చోటుకు దుంకుడమూ…అక్కడక్కడ్నే తిరుగుతూ…చిన్న చిన్న గుంపులుగా చేరి ముచ్చటిస్తూ..తుర్రున ఎగరడమూ…ఆ పిచ్చుకల జ్ఞాపకాలూ మనకు ఉండనే ఉంటై. ముఖ్యంగా అవి ఆ రెండు కాళ్లతో దుంకడం…అందంగా ఉంటుంది.

వాటి తెలుపు. గోధుమ రంగూ. ఆ కళ్లూ, తోకా…
అంతానూ ఒక చిరు సందడి. మనసులో ఒక సంతోషాన్ని పూయించే పిట్టలవి!

ఆవి ఆడుతూ ఉంటై. పాడుతూ ఉంటై.
మన గుండెల్లో తెలియని శబ్దమై నిశ్శబ్దమై…దృశ్యమై అదృశ్యమయ్యే ఉంటయి.

మనకిప్పుఉ పట్నంలో బాల్కనీలు. అయినా ఒకట్రెండు పిట్టలు.
అయినానూ రాను రానూ అవి తగ్గిపోతున్నాయని ఆందోళన.
ఎండాకాలంలో అయితే వాటికి కాసిన్ని నీళ్లు అందుబాటులో వుంచాలని ఎస్ఎంఎస్ లూనూ…
కానీ, వాటి జ్ఞాపకం ఒకటి వాస్తవంలో ఉండనే ఉంటుంది.

ఎక్కువ పిట్టలు ఉన్న రోజులే జ్ఞాపకాలు.

కానీ, కొత్తగా ప్రతిదీ మారినాక పాతది మరీ జ్ఞాపకంగా మారిపోయి మరెన్నో పిట్టలై వాస్తవంలో అవి ఎగిరిపోతాయ్. మాయమైపోతాయ్.  కానీ, ఆ మాయం మనలో ఒక ‘నాస్టాల్జియా’ లేదా “తేనెతుట్టెలా’ ఏర్పడుతుంది. ఒక వలలాగా మళ్లీ పిట్ట మనకు పడుతూ ఉంటుంది. ఇదీ అదే.కానీ, వేరు.
సిటీ లైట్స్.

అవును. ఇది బతుకు దెరువు పిట్ట.
ఒక మిణుక్కు…మిణుక్కు..
ఒక వ్యక్తి ప్లాస్టిక్ పిచ్చుకల -బ్యాటరీ మెరుపుల – జీవన వాకిలి – ఈ చిత్రం.

అవును.

ఒకానొక చీకటైన సాయంత్రం వెలుతురైన దృశ్యం.
భాగ్యనగరంలోని రాంనగర్ చౌరస్తా చేరకముందే ఒకప్పటి ‘ఉదయం’ పత్రికా కార్యాలయం.
దాని భవనం ముందు ఒక వ్యక్తి నేలమీద ప్లాస్టిక్ పిచ్చుకలను చిచ్చుబుడ్లలా పూయిస్తున్నాడు.

ముందు అవి కనిపించలేదు.
‘ఆన్’ …”ఆఫ్’… అవుతూ… వెలిగి ఆరిపోతూ… వెలుతురు.
అవి మిణుగురులు..కాంతి పుంజాలు. ఎరుపు, ఆకుపచ్చ,.నీలం కాంతులు.

గుప్పిట ముడిచీ తెరిచినట్టు… అవి వెలుగూ… ఆరూ.
అలా-ఇలా.. ఆ వెలుతురు పక్షులు కనిపించాయి.

ముందవి పక్షులని అనిపించలేదు. బ్యాటరీ పిట్టలని తట్టనే తట్టలేదు.
బ్యాటరీతో నడిచే వెలుతురు వర్ణ రాగాలుగా తెలియరాలేదు.

దగ్గరకు వెళ్లి ఆగిచూస్తే కుతూహలం.
పిట్టను చూస్తే మనసు పొందే రెక్కల ఆనందం.
ఎగిరే కుతూహలం.

చిత్రమేమిటంటే ఒక యాభై అరవై పిచ్చుకలు.
కానీ, మరీ చిత్రమేమిటంటే అందులో అన్నీ కానరావు లేదా కొన్ని కానరావు.
ఒకసారి దృశ్యంలో కొన్ని మాయం. మరోసారి దృశ్యంలో మరికొన్ని మాయం.
కానీ, అక్కడ ఉంటై. కానరావు. కానవచ్చిన వాటి పక్కనా పైనా ఖాళీలుంటాయి.
అక్కడా వుండొచ్చు పిచ్చుక.
అదే దృశ్యాదృశ్యం.

+++

చిత్రం చేయడం ప్రారంభిస్తే ఒకటి వెలుగుతూ ఉంటే ఒకటి ఆరుతూ ఉందా అనిపించింది..
మరొకటి వెలుగుతూ ఉంటే ఇంకొకటి ఆగిపోతూ ఉందా అన్నడౌటూ వచ్చింది.

ఒక్క మాటలో దృశ్యం వెలుతురు. అదృశ్యం చీకటి.
లేదా అదృశ్యం చీకటి. దృశ్యం వెలుతురు అన్న భావనా పుట్టింది.
కానీ, వాస్తవం వేరుగా ఉన్నది.

చూస్తానికి ఎక్కువే కనిపిస్తున్నాయి.
వెలుగులో ఉన్నవే ఎక్కువ. కొన్ని మాత్రం కనిపించవు.
కానీ అక్కడ అన్నీ ఉన్నయి. అదే చిత్రం.

ఉన్నవన్నీ దృశ్యం కాదు, లేనివి అదృశ్యమూ కాదు.
అదే దృశ్యాదృశ్యం.

+++

అన్నిటికన్నా విచిత్రం – ఆ పిచ్చుకలతోపాటు ఆ బోయవాడు…లేదా ఆ చిరువ్యాపారి లేదా ఆ కథకుడు ఇరవై రూపాయలకు ఒక జత చొప్పున ఆ పిచ్చుకలను రచనల వలే అమ్ముతున్నాడు.
అమ్మేవాడికి అన్నీ వెలుగే. కొనే వాడికి మాత్రం నచ్చిందే వెలుగు.

ఒకరికి ఆకుపచ్చ నచ్చి మరొకరి నీలం నచ్చి ఇంకొకరికి ఎరుపు నచ్చి కాంతులు మారుతున్నయి. చూస్తుండగానే కొన్నివెలుతుర్లు ఖాళీ అవుతున్నయి.

ఇంతలో ‘కీ’ ఇవ్వనివి కొన్ని ఉన్నయి. అక్కడే ఉన్నయి.
అవి కనిపించడం దృశ్యాదృశ్యమే.

అంతేకాదు, ఒక సంచీ ఉంది.
అందులోంచి అతడు తీసి పెట్టాక మరికొన్ని వెలుగుతూ ఉన్నాయి.
మరి అంతదాకా ఆవి లేవా అంటే ఆ కాంతి దానిలో లేదనాలి. అంతే!

నిజమే. ఒక దృశ్యం దగ్గర ఆగినప్పుడు అదృశ్యాలు దృశ్యమైతాయి.
అదే ప్రేక్షణ. దృశ్యం అర్థమౌతూ ఉండటం.

మన పనిలో మనం ఉండగానే కొన్ని దృశ్యాలు ఇక కంటికి అంటుకొని మదిలో వెలుగుతూ ఉంటై.
అదే ప్రేక్షణ. జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ పిట్టలు వెలుగుతూ ఉంటై, నక్షత్రాల్లా.

కానీ, ఇవన్నీ పట్నం పిచ్చుకలు.
బ్యాటరీ పిచ్చుకలు . ‘కీ’ ఉండే పిచ్చుకలు..

అతడికి డబ్బులు కురిపించే పిట్టలు మరి!
అతడు కనిపించేలా చిత్రంచలేకపోవడం ఈ చిత్రం.+++

ఉప్పల్ లో ఉంటాడట.
ఒకచోటే ఇలా పెట్టుకుని కూచోడట. ఎక్కడ వీలైతే అక్కడ ఆ పక్షులను పరుచుకుంటాడట. స్థలం కన్నా జనసమ్మర్థం ముఖ్యమట. కొంచెం జాగా ఉంటే చాలు, చీకటి అయితేనే వెలిగిస్తాడట. అవును మరి. చీకటే అతడికి కావాలి. వెలుగుతో అవి అమ్మాలి.
అదే దృశ్యాదృశ్యం అతడికి.

అవి వెలుగుతూ ఉంటే ఆగి వచ్చి కొనుక్కునే మనుషులతో అతడి ముఖం వెలుగుతూ ఉంటే చూడాలి.
పిచ్చుకలా ఉన్నాడని పిచ్చిగా అనిపించింది. ఇంత చిన్నసంతోషాలా? ఆ పిచ్చుకకు అనీ అనిపించింది!:

ఎవరూ కొనకపోతే మాడ్పు ముఖం- అంటే చీకటి. అది బాధిస్తుంది మరి!
అందుకే అల్ప సంతోషంలా పిచ్చుకలూ, ఈ మిణుక్కు మిణుక్కులూ.

+++

నచ్చిందేమిటంటే, పంచతంత్ర కథల్లో మిత్రలాభం..
అనగనగా బోయవాడి నూకలకు ఆశపడ్డ పక్షుల కథ.
ఆ పక్షులన్నీ తెలివిగా వలతో సహా లేచిపోవడమూ ఆ కథ.

ఇప్పుడు ఆ వల ఏదో పక్షులతో సహా వచ్చి వాలినట్టయింది నాకు.
అది దృశ్యం.

కానీ బోయవాడు నగరంలో విసిరిన ఒక వల.
అది అదృశ్యం.

మొత్తానికి, భాగ్యనగరంలో. రాం నగర్లో.
ఒక చిరువ్యాపారి కూటికోసం, తన కుటుంబం కోసం పక్షి ఎర.
పిచ్చుక ఒక అస్త్రం.

ఆ నూకలను ఒకటి కాదు, పది చిత్రాలు చేశాను. ఎలా తీయాలో తెలియడం లేదు.
చూస్తుంటే అవి నేల మీది నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి.

మిణుక్కు మిణుక్కు.
బాగుంది.

– కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

రాత్రి పగలుతో అన్నది

PORRAIT OF A WOMEN
రాత్రి పడుకునే ముందు రాసుకున్న రచనల వేడినుంచి గుండెకు ఉపశమనంగా సిగరెట్టు కాల్చుకుంటూ బయట వాకిట్లో నిలబడి చీకటిని, గేటు క్రీనడల్ని, చూసుకుంటూ ఒక బ్లర్ ఇమేజీలా ఉండగా ఒక అంతుపట్టని “ఇమేజీ’ ఒకటి మాటల్లోకి వచ్చింది.గోడ పక్కనే ఇల్లు. చిన్న చిన్న ఇండ్లు. అదంతా స్లమ్ లొకాలిటీయే. నిరుపేదలు అధికంగా జీవించే వాడకట్టు.
భర్తలూ భార్యలూ తరచూ గొడవపడే వీధి. పిల్లలు అస్తమానూ ఇది కొనిపెట్టమని అది కొనిపెట్టమని అరిచి గీపెట్టే వీధి. సకల షాపింగ్స్ మాల్లూ చిన్న చిన్న తోపుడు బండ్లయి వచ్చీపోయి, వారి వారి రకరకాల అరుపులతో వీథి అంతా మారుమోగే సంగీత నిలయం. గోరటి వెంకన్న పాటలా ‘గల్లి చిన్నది… గరీబోళ్ల కథ పెద్దది’ అన్న పాటలోని దృశ్యాదృశ్యాలన్నీ నిండుగ ఎక్స్ పోజ్ చేసి ఒక గొప్ప ప్రదర్శనగా పెట్టతగిన గ్యాలరీ అది. ఆ వీథిలో మా పొరుగునుంచి వినిపిస్తున్న మాటలకు నా కళ్లు ఆనలేదు. చెవులే సాగి చూడసాగాయి.చీకటి చిన్నచిన్న ముద్దలుగా వినిపిస్తోంది,.
వాటిపై కన్నీటి ఛారలు వెలుతురులా మెరిసినట్టనిపించాయి.

ఒక స్త్రీ ఎదురుగా భర్తను పెట్టుకుని స్థిరంగా అంటున్న మాటలే వినిపించసాగాయి.

+++

మాట్లాడకు.
నీతో నాకు మాట్లాడలని లేదు.

నవ్వకు.
నాకు నవ్వస్తలేదు.

సూడకు.
నీ మొఖం సూడలేను.

..

ఏం తందనాలాడుతున్నవా?
సస్త.

సచ్చి నీ పేరే చెబ్త.

ఏందనుకున్నవో!

…నవ్వకు
నా మొగడే నా సావుకు కారణమని చెప్పి సస్త….

ఏమనుకుంటున్నవో!
నా సంగతి నీకింక తెల్వదు.

వద్దు.

రాకు.

మాట్లాడకు.

నవ్వకంటె…

( ఒక్క దెబ్బ)

చెంపపై వేసిందో ఎక్కడ వేసిందోగానీ తర్వాత “న్నిశ్శబ్దం’.

+++

సిగరెట్టు ఆయిపోయింది. ఇంకొకటి లేదు. ఇట్లాంటప్పుడు గుండెకు నిప్పుపెట్టుకోవడానికి ఇంట్లో ఉన్నఒక ట్రేలో వెతుకులాడుతాను. హ్యాంగర్లకు వేలాడుతున్న అన్ని ప్యాంటు జేబుల్లో వెతుకులాడి నిరాశపడతాను.

వెతుకుతుంటే నా భార్య ‘ఇంకా పండుకోలేదా?’ అంటుంది, నిద్రలోనే!
‘ఇగొ..పడుకుంట’ అనుకుంటూ మళ్లీ వెతుకులాడి నిరాశ పడతాను.

మళ్లీ బయటకు వచ్చిచూస్తే చిమ్మచీకటి.
రాత్రి ఒక్కత్తే ఉంటుంది. మాటలే…అవి మళ్లీ గుండెల్లో వినిపిస్తూ ఉంటై.

ఎగదోస్తున్న మంట ఏదో లోపల ఆ మాటల్ని ఆరిపోకుండానే లోపలంతా నిశ్శబ్దంగా చేస్తుంటే మళ్లీ అదే చిమ్మచీకటి. దృశ్యాదృశ్యం.

+++

ఆ మాటలు…
ఆ స్త్రీ ఎంత స్థిరంగా, ఎంత వేదనతో, ఎంత గంభీరంగా పలికిందంటే అవతలి వైపు అలకిడి లేదు.
చిత్రమేమిటంటే రాత్రి మాత్రమే, ఇట్లా ఏకాంతంలో మాత్రమే వినిపించే కఠిన నిజాలవి.
మెత్తని మమతలవి.అనుబంధాల ఆరోపణలవి. ఆశల హెచ్చరికలవి.
తెల్లవారిందా…మళ్లీ ఇద్దరూ ఎవరి పనిలో వారు పడతారు. రాత్రి అయ్యేదాకా మళ్లీ కానరారు.
తర్వాత ఒక రోజు నవ్వులు. ఏడ్పులు. ఎప్పుడో ఒకసారి ఇట్లా గంభీరంగా మాటలు.

చిత్రమేమిటంటే, ఆ గోడ వెనకాలి ఆ చిత్రాలేమిటో అర్థం కావు.
‘సస్తె నేను ఒకటే చెప్పి సస్తాను…’.
ఆ మాటలు అన్నప్పుడు అతడెలా ఉన్నాడు?
ఏమో!

ఈ లోకంలో విషాదం కన్నా ఆనందాలే ఎక్కువ.
విషాదాలే ఆనందాలు. బాధలే సంతోషాలు. లేకపోతే ఏం మాటలవి!

“ఏం. తందనాలాడుతున్నవా?’
ఎంత బాగున్నయి!
“సస్త’ అంటుంది.సస్తే వాడి పేరే చెప్పి సస్తుందట.
చచ్చి కూడా సాధిస్తుందట!నవ్వు.

నిజంగ నవ్వాలి. విచారంగా.
ప్రేమ గురించి మంచి సాహిత్యం చదువుతాం. కానీ, గోడల వెనకాల దాగిన ఇట్లాంటి దృశ్యాదృశ్యాలను ఎట్లా చిత్రిస్తాం? వారిద్దరూ ఎట్లా కూచుండి ఇలా మాట్లాడుకున్నారు. ఆమె గొంతు అలా క్షణం క్షణం పెరిగి ఒక జీరగొంతును పులుముకుంటూ అతడిపై విరుచుకు పడి అటు తర్వాత ఎక్కడ ఎలా లీనమై ఆగిపోయిందో ఎట్లా తెలుస్తుంది? ఎక్కడ ఆగిపోయి ఘనీభవించిందో ఎలా చూస్తాం?తెలియదు. దృశ్యాదృశ్యం.ఫలానా ఆమె ఎవరో కూడా తెలియదు.
నిజం.

కానీ ప్రయాస.

+++

అన్ని మాటలన్నాక, విన్నాక… తెల్లవారి ఆమె ఎట్లా ఉంటుందో చూడాలనిపిస్తుంది!
కానీ, ఆమె ఎవరో అర్థం కాదు. ఆ గల్లీలో..ఆ ఇరుకిరుకు ఇండ్లలో ఏ ఇంటినుంచి ఆ మాటలు వినవచ్చాయో అంతుపట్దదు. నా ఇంటినుంచే వచ్చాయా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంత నిజంగా ఉంటాయా మాటలు.
బహుశా అది అందరి ఇళ్లల్లోంచి వచ్చిన మాటలా? ఏమో!

రాత్రి మహిమ అది.
రాత్రి పగలుతో చెప్పిన మాటలవి.

కానీ, ఉదయం చూస్తే ఒకరు!.
ఆమె అచ్చం రాత్రివలే అనిపించింది.

ఒక రాత్రి తనను తాను పగటీలి వెలుతురుతో పంచుకున్న వేదనాలా అనిపించింది!

చూడండి. కుంకుమా పసుపూ – ఆమె.
పున్నమి అమాసా –  ఆమె.

ఒక్కత్తే. రాత్రి.

– కందుకూరి  రమేష్ బాబు 

ఒక చారిక

drushya drushyam-5

భుజానికి వేలాడే కన్నుతో రోడ్డుమీదో లేదా వీధిలోనో తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో చేయగలం.
ఒక సీతాకోక చిలుక మరణం కలచివేస్తుంది. ఒక దృశ్యాదృశ్యం.
ఒక కప్ప మట్టిలో అణిగిపోయి, విగతజీవి అయి, ఉట్టి దొప్ప కానవస్తూ ఉంటుంది. అదొక దృశ్యాదృశ్యం.
ఎలుకే కాదు, ఒక పిల్లి కూడా నల్లగా మరణిస్తుంది. అదీ దృశ్యాదృశ్యం.
బతికిన క్షణాలే కాదు, మరణించిన క్షణాలూ బతికిస్తూ ఉంటై, కాళ్లకు తగులుతూ ఉంటై.
నడుస్తూ ఉంటే నడకను మించిన చూపు లేదు.
నడువు, కనిపిస్తుంది జీవన రహదారి.

ఇదీ అదే.
ఒక నడక.

చారిక.

నేను నడుస్తూ ఆగిపోయాను.
అది నడుస్తూ ఉంది, నా వైపు.

గల్లీలో ఒక వైపు.
అది ఇటు…నేను అటు.
అప్పటికే అది దెబ్బ తిని ఉన్నట్టుంది.
రెండు అడుగులు వేసి మళ్లీ అగుతున్నట్టు అడుగు వేయక ఆగుతుంది.

మన దృష్టిలో అడుగు చిన్నదే. కానీ దాన్ని అడిగితే తెలుస్తుందేమో!
అడుగుదామనే ఆగాను.
ఆగిందీ. తీస్తే ఇది.
దృశ్యాదృశ్యం.

+++

అడుగడుగునా దాని కదలిక వేరు.
నిశ్శబ్దంగా ఒక చిన్నప్రాణినే చూస్తూ ఉంటే, దాని ఆయసాన్నే గమనిస్తూ ఉంటే….కెమెరా వ్యూ ఫైండర్ లో అది నాకు ఏనుగే అయింది. దాని మహా విగ్రహాన్ని అర్థం చేసుకుని దాని మహాభినిష్క్రమణం ఎప్పుడో తెలియక, బతుకు జీవుడా అన్నట్టు అది కదులుతూ ఉంటే దాన్ని కనులతో పరికిస్తూ ఆ చారలో గుండా దాన్నికెమెరాతో వెంబడించడానికి నాకు పట్టింది ఒక యుగం.

కదలదే!

ఈ మనిషి దానిపై వేసే వేటు చిత్రమే అని దానికి తెలియక ఆగిందనిపించి, వెనక్కి జరిగి, జ్యూమ్ లెన్స్ ఉందని తోచి వెనుకడుగు వేసి మళ్లీ చిత్రంలో అవసరమైనంత బొమ్మను పట్టడమూ ఒక గ్రఫి. ఫొటోగ్రఫి.

చిత్రమేమిటంటే అది ఆ పగిలిన వాకిలిలోని ఒక సన్నని చారను, ఆ ఛాయను ఆశ్రయించి కదులుతూ ఉండటం. ఆగి ఉండటం. నిలబడిందా కూచుందా చెప్పలేను. కానీ, అప్పుడు తీశానీ చిత్రాన్ని.

ఆ తర్వాత కొన్ని అడుగులే వేసింది.
తర్వాత కుడివైపు తిరిగి ఒకరింట్లోకి వెళ్లింది.
ఆ తర్వాత అదృశ్యం. మిగిలిందే ఈ దృశ్యం.

+++

ఇక మనింట్లో వినిపించేవే. మామూలే.
ఎలుక కనబడుతోంది. బోను వెతకాలి.
ఎలుక వచ్చి పడింది. ర్యాట్ పాడ్ కొనాలి. దాని సంగతి చూడాలి.
ఎన్ని మాటలో. ఎంత చికాకో.
కానీ దానికి వినపడుతుందో లేదోగానీ, ఆ ఇంట్లో అది తప్పక కనిపిస్తుంది వాళ్లకు.
అంటూనే ఉంటారు, ఏవేవో!

కానీ చిత్రం.
ఈ చిత్రం వాళ్లింట్లో ఉండదుగానీ మీ ఇంట్లో ఉంటుంది.
మీరు వేరే తరీఖ చూస్తారు. అది నా అదృష్టం. దాని అదృష్టమూ.
అదే దృశ్యాదృశ్యం.

కానీ, చిత్రాతి చిత్రం పాత ఇళ్లు.
పాత వీధులు. పాత నగరాలు…అక్కడే ఇవి ఎక్కువ.
కానీ, కొత్తగా అవి ఎప్పటికప్పుడు తమ సర్వైవల్ గురించి ఆలోచిస్తాయి.
వాటికీ రంగు తెలుసు. వాసనా తెలుసు. ఎక్కడ నుంచి నడవాలి. ఎలా కదలాలి. ఎలా తప్పించుకోవాలీ…అన్నీ తెలుసు. అందుకే చార అనడం. చారలో ఎలుక నిలకడ అనడం.

అయినా గానీ, ఎంత కొత్త నగరమైనా ఎప్పటికైనా పాతబడేదే కదా!
మరి ఎలుక ఖాయం. ఎప్పటికైనా.

అందుకే అనడం, మనుషుల ప్రపంచంలో మనుషులే వద్దని ఈ చిత్రం.
చావుబతుకుల జీవితంలో బతుకూ ఒక చిత్రమే అని ఈ చిత్రం.
ఒక రహస్యం…వీధుల్లో నడిచేటప్పుడు ఎవరి దిష్టి లేకుండా దృష్టి లేకుండా తనను తాను కానరాకుండా చేసుకోవడం ఒక దృశ్యాదృశ్యం.

మన జీవావరణంలో తప్పించుకోలేని వర్ణం ఈ చార- చిత్రమనీ చెప్పడం.

అయితే ఒక మాట.
ఎలుక, సుందెలుక, పందికొక్కు…
ఏదైనా కానీ, కనిపించడం గురించి ఒక మాట.

మనం కాళ్లతో నడవడం, చక్రాలున్న మోపెడ్ పై వెళ్లడం, మూడు లేదా నాలుగు చక్రాల వాహనంపై పయణించడం -బాగానే ఉంది. కానీ, ఎలాగో ఒకలాగ కాదు, నడిచినప్పుడు కనిపించేవి వేరు. ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్లేప్పుడు వేరు. ఎవరైనా తోడు ఉన్నప్పుడు వేరు.  ఇక కార్లలో ప్రయాణించేటప్పుడు ఇంకా వేరు. దృశ్యాదృశ్యం వేరువేరని!

మనం ఉన్నస్థితి ఒక్కటే ప్రధానం కాదు.
మనం వాహికగా ఉండటంతోనే సరిపోదు.
నడవాలి. నడిచినప్పుడు కనిపించేవి వేరు.
నడక వేరుగా ఉంటుందనడానికీ ఈ చిత్రం ఒక ఉదాహరణ.

నా వరకు నేను మనుషులనే చిత్రిస్తానని అనుకోలేదు.
ఎలుకలని కూడా. పిల్లులని కూడా చిత్రిస్తూ ఉన్నాను..
నా నడక ఇది.

ఐతే,, నడక చిత్రం ఒక చెలగాటం.
అవును. ఒక్కోసారి పిల్లీ ఎలకా చెలగాటం.
చూశారా ఎప్పుడైనా.
అదొక సర్కస్.

పట్టుకుని వదిలి… మళ్లీ పట్టుకుని వదిలి…
పిల్లి ఎంత సాధిస్తుందో, ఎంత ఆనందిస్తుందో తెలుసా, ఎలుకని!
దానికి పిల్లలు పుట్టవచ్చుగాక. అది ఆహార సముపార్జనే కావచ్చు. కానీ ఎలుక ఒక ప్రాణి. దానికీ కథ ఉంది.
అది దాచుకుని దాచుకుని బతకడం…ఒక చీకటి చారను చూసుకుని దానిగుండా బిక్కు బిక్కుమంటూ వెళ్లడం ఒక ఛాయ. అందుకే మనిషికి చెప్పడం. నీలాగే దానికీ క్రీనీడల్లోంచి వెళ్లడం తెలుసని!.

ఇంకా చెబితే…
నడిచి చూడు. దానిలాగా అని!
ఆగిఆగి. మెలమెల్లగా కదిలి చూడు…బతుకుతావు పదికాలాలు.
ఇక ఇంట్లోకి వెళ్లు. అదే దృశ్యాదృశ్యం.

 

–  కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

See you soon..

drushya drushyam
[‘సారంగ’ కోసం వారం వారం కందుకూరి రమేష్ బాబు  రాస్తోన్న ‘దృశ్యాదృశ్యం’ ఛాయా చిత్రలేఖనంలో సరికొత్త సింగిల్ నరెటివ్. సాహిత్య ప్రక్రియలో ఒక ‘చిత్రలిపి’. ‘సామాన్యత’ నుంచి తాను విశాలం కావడంలో కెమెరా ప్రధానం అయిందంటున్నాడు.Click by click తన చూపు విస్తరిస్తున్నదీ అంటున్నాడు. నిజమో కాదో మున్ముందు మీరే చెప్పాలి.]
*
 ఏది ముందు? ఏది వెనక?ఒక్కోసారి దృక్పథాలు ఎంత దూరం తీసుకెళ్తాయి అంటే ఒకటే చూసేంత.
కానీ, ఎవరైనా తమ నుంచి తాము ముందుకు నడవడం ఒక ప్రయాస. ఒక వినిర్మాణం.

స్రక్చరల్ అడ్జస్ట మెంట్లోనూ ఒక ఒక పొసెసివ్ నెస్. అందలి డిసగ్రిమెంట్.

మళ్లీ అగ్రిమెంటూనూ. విల్లింగ్లీ సస్పెండింగ్ ది డిస్ బిలీఫ్ అంటాంగానీ, సస్పెండ్ చేయకుండా ఉండటం అసలైన చిత్రం.

+++

దృశ్యాదృశ్యంగా లోన ఉన్నది బయట…. బయట ఉన్నది లోన……ఇంకిపోవడం.
అర్బన్ రియాలిటీ. అదే ఈ దృశ్యం. అపనమ్మకాల నమ్మకాలం ఒక చిత్రం.

ఇందలి బొమ్మలు లేదంటే అదృశ్యంగా ఉన్నఆ మెట్రోరైలు నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులు…
అంతా ఒకే బొమ్మ.

బొరుసు ఏదీ? అంటే తెలియదు.
ఏది చిత్తో, ఏది బొత్తో తెలియని దృశ్యాదృశ్య ప్రపంచం…ఈ నగరం. ఈ జీవితం.

మన కాంప్లెక్సులు, అఛీవ్ మెంట్సూనూ.
అవును. చిత్రం.
నగర జీవితంలో వేగంగా ఇమిడిపోతున్న ఆధునికత లేదా నగరమంటేనే ఆధునికత.
అది వేగంగా అర్థమౌతున్న భావన. ఆభివృద్ధి నీడన మెల్లగా ఇమిడిపోతున్న సమస్తం. లేదా నీడలన్నీ జారిపోయి మనిషే నగ్నంగా  నిలబడుతున్న వైనం. అందుకే చిత్రాలు సరికొత్తగా చేయాలంటే ఫోకస్ మార్చుకుని చూడవలసి వస్తోంది. జీవితాన్ని అంగీకరించాలంటే చిత్తు చిత్తుగా ఓడిపోయి మళ్లీ గెలవాల్సి వస్తోంది లేదా గెలవకుండా చూసుకోను ఓడిపోవాల్సి వస్తోంది.+++నడిచివచ్చిన దారంతానూ ఒక ఐడెంటిటీ క్రైసిస్.+++విశేషం ఏమిటంటే దృశ్య మాధ్యమంలో ఒక స్టిల్ లైఫ్ చెప్పగలిగే కాంట్రాస్ట్ చాలా ముఖ్యం.
అది నిలబడుతుంది. నిలబెట్టి చూపును నిలబెడుతుంది. విస్తరింపజేస్తుంది. కన్నుల్ని కలియతిప్పేలా చేస్తుంది. ముందుకు దృష్టి సారించేలా చేస్తుంది.అయితే నమ్మవలసింది మరొకటి ఉంది. ఎవరికీ ఏదీ తెలియదు. ఒక్క దృశ్యానికి తప్ప!
నిజం. ఏది ముందు ఏది వెనకా అన్నది మన సమస్య గానీ దృశ్యంలో చిత్రం అంతా ఒక్కపరి ముద్రితం అవుతుంది. నమోదూ అవుతుంది. అన్నీ ఒకేసారి అచ్చవుతాయి. కానీ చూసుకోము. అది సిసలైన విషాదం.

విషాదమే నిజమైన చిత్రం.
కానీ చూడం.నిరాకరిస్తం.గుడ్డిగా ఆనందస్తం. ఆరాధిస్తం. యవ్వనాన్ని చూసినట్టు.

అందుకే చెప్పడం, దృశ్యాదృశ్యం అంటే చదవడం, ఒక అభ్యాసం.

పిల్లవాడై పలకాబలపం పట్టుకుని అక్షరాలు దిద్దడం, తుడుచుకోవడం. మళ్లీ దిద్దడం.
+++మళ్లీ ఈ పిల్లగాడి చిత్రానికి వస్తే, ఇలాంటి చిత్రాలెన్నో పోయే నగరావరణంలోని ఒక నవ్య చిత్రిక ఇది.
నా వరకు నాకు ఇది కొత్త చిత్రం. మీరు చూసి వుండవచ్చు. కానీ నేను తీసి ఉండలేదు. అదే చిత్రం.ఒకటే చూసి అన్నీ వదిలేయడం.
తలుపులన్నీ మూసి కిటికీలు తెరవడం. లేదా కిటికీలన్నీ మూసి తలుపులు తెరవడం.
కానైతే కావలసింది గోడలన్నీ లేని ఇంటిని విశ్వాన్ని దర్శించడం. అందులో ఇదే నా తొలి చిత్రం.షో కాదు, రియాలిటీ.
అనుకుంటాంగానీ, ప్రతిదీ రియాలిటీ షోగా మారుతున్న స్థితీ గతీ. బొమ్మలు, మనుషులు.
ఈ చిత్రం మటుకు హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట సెంట్రల్ నుంచి చేసిన దృశ్యం.+++సెంట్రల్.
అవును, ఒకప్పటి చౌరస్తాల్లో ప్రతీకలు వేరు. ఇప్పుడు సెంట్రల్ లు ప్రధాన కూడలి. సెంట్రలే ఒక కూడలి.
ఇక్కడా కార్మికులున్నరు. కానీ, అలా అనుకోరు. అక్కడా ఉన్నారు. కానీ వాళ్లూ అనుకోరు,
ఎవరికి వారు నవనిర్మాణంలో ఇనుప రజనులా తాము రాలిపోతున్నామని ఎవరూ అనుకోరు.

అసలు దృశ్యం ఇంత మాట్లాడదు. అదే చిత్రం.
చిత్రంలో చిత్రం అది.మనం అనుకున్నదే చిత్రం కాదు. అది వేరు.
కానైతే, తెలియకుండానే బొమ్మలైపోతున్న జీవితంలో ఏది మొదలు, ఏది ఆఖరో అర్థం కాని ప్రశ్నేలే వద్దు.
అన్నీ చిత్తరువులే. బొమ్మలే. ఒక భిన్నమైన అనుభవం కోసం నేనే ఇటువైపుకు మారి తీసిన అటువైపు చిత్రం. కానీ, ముందే చెప్పినట్టు అన్నీ అచ్చయిన చిత్రం నిజమైన చిత్రం.See you soon…
మరింత చిత్రంగా.
  – కందుకూరి రమేష్ బాబు

ఈమె…అలిశెట్టి ప్రభాకరూ…

drushya drushyam-alisetti

అదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల ఎన్ని చిత్రాలని!
కానైతే, ఉంటున్నఈ ‘సిటిలైఫ్’ ని ఎంత చూసినా, మరెంత చదివినా, ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలుగా చేసినా ఒకరు మాత్రం రోజూ గుర్తుకు వస్తూనే ఉంటారు.

ప్రతి ఛాయాచిత్రం ముగింపులో ఆయన్ని తల్చుకుంటూనే ఉంటాను.
ఆయనే ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్.

‘మరణం నా చివరి చరణం కాదు’ అన్న కవి కావడం వల్ల కాబోలు, జీవితంలోని ఏ ఘడియను చిత్రించినా, సామాన్యుడి స్థితీ, గతీని ఎలా చిత్రికపట్టినా ఆయన గుర్తుకు వస్తూనే ఉంటాడు.

ఇదొకటే కాదు, ఇలాంటి నా దృశ్యాదృశ్యాలను జీవితంగా చదువుకోవడానికి నేను చాలు.
కానీ, ఇవే చిత్రాలను విప్లవీకరించడానికి మాత్రం అలిశెట్టిని మించిన దృశ్యకారుడిని తెలుగు నేల ఇంకా కనలేదు. చూడనూ లేదు.

నిజానికి అతడు ఒకరే.
పేరుకు కవీ, చిత్రకారుడూ. ఫొటోగ్రాఫరూ.
కానీ, ఆయన పనంతా ఒకటే. ఒక దృశ్యం పరచడం.

కవిత్వంలోనూ, చిత్రాల్లోనూ, తీసిన ఛాయాచిత్రాల్లోనూ ఒకే ఒక అంశం అంతర్లీనం.
అదేమిటీ అంటే కళ్లకు కట్టడం. మంట పెట్టడం. మన లోవెలుపలి నెగడు ఆవరణ అంతా కూడా కాలిపోయేటట్టు అందులోంచి మన ఆత్మలు లేచి శత్రువు మెడను పట్టుకునేటట్లు చేయడం.

దృశ్యాన్ని విప్లవీకరించడం.
మనలో జీవితాన అదృశ్యంగా ఉన్న విప్లవశక్తిని చేతనలోకి తేవడం.
అవును మరి. ఆయన ఒక దృశ్య పాతర.

చిత్రమేమిటంటే, తీస్తున్న నా ప్రతి చిత్రంలో జీవితాన్ని మించి విప్లవం కనిపిస్తే నేను చిత్రించడం ఆపేస్తాను.
ఎందుకూ అంటే అది వేరు. అది ఆయన పని. ప్రతి ఒక్కరూ విప్లవకారులు కాలేరు. నిజం.
alisetti photo frame ion his home
ఇంకో విషయం. ఎవరు కూడా ఆయనంత ఆరోగ్యంగా ఉండలేరు. నమ్మండి.
కావాలంటే ఆయన కవిత్వాన్ని చదవండి. బొమ్మలు చూడండి. తీసిన ఫొటోలనూ గమనించండి.
అతడొక లైఫ్. రెడ్ సల్యూట్.

నిజానికి తెలుగు నేలపై ఒక మనిషి విప్లవాన్ని జీవితం స్థాయిలో బతికించాడూ అంటే అది ఆయనే. ఆయనకు నా దృశ్యాంజలి.

ఒక్కమాటలో ఆయన సామాన్యత విప్లవం
నా పరిమితి సామాన్యతే.
అందుకే దృశ్యాదృశ్యం వేరు. ఒక విప్లవ దృశ్యాదృశ్యం వేరు.
అది ఆయన.

క్లుప్తంగా చెప్పాలంటే…ఎర్ర పావురాలు. మంటల జెండాలు. చురకలు. రక్తరేఖ, సంక్షొభగీతం, సిటీలైఫ్. మరణం నా చివరి చరణం కాదు- ఇవన్నీ ఆయన కవితా సంపుటులు. చిత్రలేఖనాలు. ఛాయా చిత్రణలు.

ఒక పరంపరగా ఆయన రచనా దృశ్యాలు ఒక శర పరంపర.

+++

తాను ఒక కవిత రచించినా, చిత్రం గీసినా, ఛాయాచిత్రం చేసినా దాన్ని కొల్లోజ్ చేసి మరొకటి చేసినా ఒకటే చేశేవాడు. ఆ వస్తువు ఇతివృత్తం మార్చేవాడు. దాన్నికొత్త అర్థాలతో విప్లవీకరించేవాడు. అందుకే అనడం, నేను చిత్రిస్తున్న ప్రతి చిత్రం ప్రభాకర్ ను గుర్తు చేస్తుందని!  కానీ ఆయన దాన్ని ఎంత గొప్ప కవితగా మలిచేవాడూ అంటే అది చదివితే మళ్లీ నేను చూపే దృశ్యాదృశ్యాలను పదే పదే చూడాల్సిన అవసరమే లేదు.

ఉదాహరణకు వేశ్య గురించి ఆయన రాసింది ఎవరైనా మర్చిపోయారా?
లేదు.

నిజం.
ఎందుకంటే ఆయనది విజువల్ మీడియం.
చలనగీతం.

నాది జీవితం.
నిశ్చలన చిత్రం.

+++

చిత్రం ఒకటి చేస్తుంటే ఆ చిత్రంలో జీవితం యధాతథంగా ప్రతిఫలించడమే పనిగా పెట్టుకుని రచన గావిస్తుంటే అది దృశ్యాదృశ్యం. నేను.

కానీ, అదే దృశ్యాన్ని విప్లవీకరిస్తే అది వేరు. ఇక్కడే మనిషికీ విప్లవకారుడికీ ఉన్న తేడా అవగతం అవుతుంది. అది అలిశెట్టి ఫ్రభాకర్.

ఇద్దరిదీ జీవితమే.
కానీ, ఆయనది కల. నావంటి వారిది ఇల.

మొహమాటం లేదు. గులాంగిరీ లేదు. భద్రజీవి కానేకాదు.
అందుకే అతడు లేడు. ఉంటాడు. బతికే చరణం.

సమాజంలో వర్గకసిని ఆయన అంత తీవ్రంగా చెప్పనోడు మరొకడు కనిపించడు.
అట్లే, జీవితంలోని ద్వంద స్వభావాన్ని ఆయన అంత నిశితంగా ఎద్దేవా చేసినవాడూ మరొకడు లేడు.
అయినా ఆయన ఎంచుకున్నది మాత్రం సామాన్యమైన వస్తువును. మనిషిని. అధోజగత్ సహోదరులను.

జనవరి 12 న ఆయన జయంతీ, వర్థంతి.
ఒకటే రోజు చావు పుట్టుకల మనిషాయన.
ఆయన్ని గుర్తు చేసుకోవాలి.

జీవితాంతం తన వాక్యాన్ని, చిత్రాన్ని, ఛాయాచిత్రాన్ని పూర్తిగా దృశ్యాదృశ్యాల పరంపరగా రచించాడని చెప్పడానికి కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాలి.

కొత్త సంవత్సరమే. కానీ, ప్రతి కొత్త చిత్రం తీస్తున్నప్పుడూ ఆయనుంటాడని చెబుతూ, దినదినం మరణించకుండా జీవిస్తున్న ప్రతి చిత్రంలోనూ ఆయనుంటాడని గుర్తుచేస్తూ, ఆయన సారస్వతాన్ని దృశ్యాదృశ్యంగా భావించడం నాకు ఎప్పటినుంచో తెలుసని కూడా మనవి చేస్తూ ఈ మహిళ ఛాయా చిత్రం ఈ వారం.

చూస్తూనే ఉండండి.
దారికి ఇరుపక్కలా ఇలాంటి చిత్రాలను చూస్తూనే ఉండండి.
అవి విప్లవిస్తే అలిశెట్టి లేకపోతే ఇవే. ఇంతే.

కానీ, ఈ వేళ, ఈ మహిళా మూర్తిని చూస్తూ ఉంటే, ‘మరణం నా చివరి చరణం’ కాదన్న అలిశెట్టి ప్రభాకర్ ఆమెనే కాబోలనే అనిపిస్తుంది.

ఒక నిద్ర. దీర్ఘనిద్ర.
ఎర్రగా మేలుకొలుపే చిత్రం.

కందుకూరి రమేష్ బాబు

(షొటో క్యాప్షన్…అలిశెట్టి ఇంట్లో అలిశెట్టి ప్రభాకర్ ఫొటోఫ్రేం)

Adam and Eve

drunken coupleతెలిసి కాదు, తెలియకనే.

ఒక కారణంగా తీసిన చిత్రాలన్నిటినీ చూసుకుంటూ వస్తున్నాను.

ప్రతిదీ బావుంటుంది. ప్రతీదీ ఒక కథ చెబుతుంది. అసలు మనిషి తన బతుకు తాను బతుకుతుండగానే వేరే వాళ్ల బతుకులను అలవోకగా ఇలా జాగ్రత్తచేసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది! ‘మంచిదే’ అని మురిసిపోతూ మళ్లీ చూడసాగాను. సడెన్ గా ఈ చిత్రం కనిపించింది మళ్లీ.ఎంత బాగుంది.
తెలిసి కాదు, తెలియకనే తీశాను.మొదట వాక్యం ఉందనీ తెలియదు.
నిజానికి వాక్యం కన్నా ముందు దృశ్యమే ఉండి ఉంటుందనీ తెలియదు.
తెలిసీ తెలియక తీశాను.
వాళ్లిద్దరూ ఆడమ్ అండ్ ఈవ్ లని కూడా తెలియదు. కానీ, తీశాను.

తీసిన చిత్రాలన్నిటినీ చూస్తుంటే, బహుశా ఇది ఈ సంవత్సరం తీసిన ఒక గొప్పఛాయా చిత్రమా ఏమిటీ అని పొరబాటుగా అనుకున్నాను. ‘గొప్ప’ అనడం ఎందుకూ అంటే ఇందులో వాళ్లిక్కడ లేరు.
వాళ్లను మనం కనిపెట్టలేం. ఎక్కడో  ఉన్నారు. లేదా వాళ్లిద్దరూ ఒకరిలో ఒకరున్నారు.

కౌగిలి సుఖం ఎరిగిన వాళ్లకు తెలుసు. వాళ్లు ఎక్కడున్నారో.
లేదా కౌగిలి అనంతరం కాళ్లు పెనవేసుకుని నిద్రలోకి జారుకున్న వాళ్లందరికీ తెలుసు వాళ్లెక్కడున్నారో.
ఏకమైంతర్వాత మళ్లీ ఏకం చేసేదేమీ ఉండదు. ఇక ఎవరికి వారు తమతో ఉండటంలోనూ ఒక ప్రశాంతత.
అదీ ఈ చిత్రం. ఇవన్నీ కలిసి ‘వాళ్లు ఎక్కడుండాలో అక్కడున్నారూ’ అని చెప్పడం.

గొప్పలు పోవడం కాదుగానీ, నా చిత్రాల్లో ఇదొక అద్వితీయ చిత్రం
ఇది చూస్తే దిగులు చెందని జీవుడు ఉండడు. వీళ్ల బతుకు గురించి విచారించని మానవుడూ ఉండడు.
అదే సమయంలో తమలోకి తాము చూసుకుని, తమ భద్ర జీవితం ‘ఒక జీవితమేనా’ అనుకోని మానవుడూ ఉండడు. అనుకుంటున్నానుగానీ అంతకన్నా ఎక్కువే అనుకుంటారేమో!
అందుకే ఈ దృశ్యాదృశ్యం ఒక అనాది చిత్రం. ఆది మూలం. నిరంతర చలచ చిత్రం కూడా.
అందుకే, నా దృశ్యాదృశ్యాల్లో ఇదొక స్పెషల్. ఒక మత్తులో జోగిన ఘజల్.నిజం. అత్యంత సామాన్యమైన, అత్యంత సరళమైన, సహజమూ సుందరమూ అయిన, మిక్కిలి విచారాన్నో లేదా ఆనందాన్నో పంచే ఒక ఛాయను మనలోంచి మనం ఏరుకోవడమే ఛాయా చిత్రకళ. దృశ్యాదృశ్య కళ. ఆ చిత్రం నాది కావచ్చు, మీది కావచ్చు. కానీ అది మనందరనీ పట్టిస్తుందని మాత్రం ఈ సందర్భంగా దయచేసి చెప్పనివ్వండి. మరోమాట. మిమ్మల్ని ఎవరైనా చిత్రం చేస్తున్నారూ అంటే ఒప్పుకొండి. మీ సొమ్మేం పోదు. అది ప్రపంచ ఆస్తిగామారి మిమ్మల్ని అమరులను చేస్తుంది. వీళ్లకు మల్లే.నిజం. తెలిసీ తెలియక, తప్పతాగి. ఒకరి కౌగిళ్లో ఒకరు అదమరచి, తెల్లవారినప్పటికీ, సూర్యుడి కిరణాలు వాడిగా వేడిగా గుచ్చుతున్నాకూడా లేవనంతటి అలసట, బడలిక, సుషుప్తి ఈ చిత్రం.
ఇంకా తెలవారని జీవితాల ఛాయ ఈ చిత్రం.
చూస్తే మనుషులు తెల్లబోవాలి. ‘ఇదిరా జీవితం’ అనుకోవాలి.
అంత నిర్భయంగా, నిర్లజ్జగా, అభద్రంగా సొమ్మసిల్లాలి.

చిత్రం చేశాక నేనూ అలాగే అయ్యాను. నెకెడ్ అయ్యాను. కొద్దిసేపు ఏం చేయాలో తోచలేదు. ‘నేనెలా జీవిస్తున్నాను. నాకెలాంటి ప్రియసౌఖ్యం’ వుంది అనిపించింది. ఈ భూమ్మీది సరళ రేఖను, మధ్యరేఖను పట్టుకున్నానే భలే అనుకున్నాను. ‘అవి రెండూ కలిసిన రేఖల్ని ఛాయగా బంధించాను కదా’ అనుకున్నాను.
అసలు భూగోళాన్ని చిత్రికపట్టే వృత్తలేఖిని ఏదైనా ఉంటే అది కెమెరానే కదా అనిపించి, ఆనందంగా వీళ్లనుంచి సెలవు తీసుకున్నాను. ఇపుడు, ఇలా, ఒక వారం ముందుగానే ఈ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ,. ‘ఓ మానవులారా…మీ జన్మధన్యం నా వల్ల. నా జన్మ ధన్యం మీ వల్ల’ అనుకుంటూ మనుషులందరికీ కృత.జ్ఞతలు చెబుతున్నాను. మరింత పాత దృశ్యాదృశ్యాలకు భరోసానిస్తూ కొత్త కాలానికి స్వాగతం పలుకుతున్నాను.

హ్యాపీ ఇయర్ ఎండింగ్ ఫ్రెండ్స్…~   కందుకూరి రమేష్ బాబు

ముఖమే రంగస్థల వేదిక!

DSC_0261ఎందుకో, ఎవరినైనా చూడాలంటే ముఖమే.
ముఖమే చ్ఛాయ.ప్రారంభం, ముగింపూ ముఖమే.
ముఖమే సముఖం.ముఖం.
ఇండెక్స్.

వాస్తవిక జీవితంలో ముఖమే అధివాస్తవిక చ్ఛాయ.
కల్పన వంటి జీవితంలో ముఖమే రంగస్థల వేదిక.

ముఖమెంత చ్ఛాయ.

+++

కానీ, ఎవరిది వాళ్లకు తెలుసు. ముఖం అన్నింటినీ పట్టిస్తుందని!
అందుకే చిత్రిస్తుంటే దాక్కుంటరు.  చిన్నాపెద్దా అన్న తేడా లేదు. సిగ్గిల్లుతరు.
లౌవ్లీ. అప్పుడు చిత్రించడం నిజంగా ఒక అందమైన బాధ.

ఆ బాధల మరాఠీని నేను.

+++నిజం. చిత్రమే. ముఖమే.మనిషికి తమ ముఖాన్ని పోలిన ముఖం మరొకటి లేనందువల్ల నిజంగా ఇదొక సంబురం.
ఆ సంబురాన్నిఎవరు పడితే వాళ్లు, ఎక్కడ పడితె అక్కడ, ఎందుకు పడితె అందుకు పంచడం ఇష్టంలేకపోవడమూ ఒక అందం. అందుకే ముఖాన్ని చిత్రించకుండా ఎన్ని విధాలుగా అడ్డుపడతారో, దాక్కుంటారో! ఎంత లాఘవంగా తప్పుకుంటారో…
నిజంగా అదెంత చిత్రం.ఇంకా ఎన్నో. కానీ ఇన్ని కారణాల వల్లే ఛాయా చిత్రకళలో ముఖచిత్రానికి ఉన్నన్ని దాగుడు మూతలు మరెక్కడా కానరావని గుర్తు చేయడం.. అదే దృశ్యాదృశ్యం.

+++

అన్నట్టు, ముఖాన్ని చిత్రిస్తున్నకొద్దీ అది సెలబ్రేషన్.
కాకపోతే, ముఖాన్ని కనబడనీయకుండా దాచుకుంటే ఆ చిత్రం ఎప్పటికీ పూర్తికాదని మనిషికి ఎలా తెలుసోగానీ, భగవంతుడా…అందరి ముఖాలూ నీవే చిత్రించావా?
నీకెన్ని కన్నులు?

అడగాలి. తీయాలి.ముఖాలు.
కానీ అనిపిస్తుంది, తప్పించుకోలేని ఏకైక ముఖం భగవంతుడిదే అని!
అందుకే తీయబుద్ధి కాదు.
+++సరే. స్త్రీ.
ఆమె హృదయం ఒక్కటే కాదు, ఎవరి హృదయంలోనైనా భావుకత ఉంటుంది.
అది వ్యక్తమౌతుంది. కళ్లల్లో, ముఖంలో. దాన్ని బంధించాలంటే అవతలి వారికి ఇవతలి వారికి మధ్య ఆ కవిత వినిపించేంత దగ్గరితనం ఉండాలి. సాన్నిహిత్యం ఏర్పడాలి. అప్పుడే ఒక పాట ఇద్దరిమధ్య ప్రవహిస్తుంది. ఆ పాటలో ముఖమే తన కవితై అది అనేక భావ వీచికలతో పడవలా ఇవతలి వారికి కానుకగా చేరుతుంది. అదే చిత్రం. ప్రేమలేఖ. జీవనచ్ఛాయ. ముఖ చిత్రం. చిత్రముఖి.అయితే, ఇది మాత్రం మహిళది కాదు. బాలుడి చిత్రం..
అవును మరి. బాలబాలికలూ దాక్కుంటారు.
స్త్రీకు మల్లే వారిదీ నిర్మల హృదయం..
తమ నిర్మలత్వాన్ని అనుభవంగా భద్రపర్చడానికి వారు ఇష్టపడరు.
అందుకే ఈ దాగుడు మూతలు.+++

విశేషం ఏమంటే, ఎవరినైనా చిత్రిస్తున్నట్టు తెలిసిందా ఇక కెమెరా కంటికి అందకుండా పరుగు పెడతారు. కొందరు కనిపిస్తారు. మరికొందరు కనిపించరు. కానీ అందరూ పరుగులు పెడతారు.
గోడ మాటునుంచి తొంగి చూస్తారు.
అది కనిపించవచ్చూ లేకనూ పోవచ్చు.
కానీ ఒక కూతూహలం. చూపాలని!

అదే సత్యం శివం సుందరం.
కాకపోతే, ఉన్నచోటునుంచే దాక్కోవడానికి ఏమీ లేనప్పుడు ఇదిగో ఇలా చేతులతో ముఖం దాచుకుంటారు.
కానీ క్షణమే. మళ్లీ తర్వాతి క్షణమే అవే చేతులను తొలగిస్తారు.

అప్పుడొక అందమైన కవిత.
వికసిత పుష్ఫం. ఉదయరాగం.

ఆత్మానందం. అదే ముఖం.
ఇలాంటి బ్లర్ అయిన చిత్రాల సంపుటి కూడ ముఖ్యమనే ఈ దృశ్యాదృశ్యం.
అలాంటి చిత్రాల సంగీత ఆల్భం నా దగ్గర ఒకటి ఉందని మహా గర్వం.
చూడవచ్చినప్పుడు మిమ్మల్నీ చిత్రించాలనే, ఈ కుట్ర.
ముఖారవిందాలకు నా పాద ముద్దులు.
– కందుకూరి రమేష్ బాబు

స్త్రీలు మాత్రమే…

DSC_0611

కొన్ని మాటలు థియరీ నుంచి కాదు, అనుభవం నుంచి కూడా కాదు. ఛాయల నుంచి మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే ఛాయాచిత్ర ప్రపంచంలో వాస్తవం చిత్రంగా ఉంటుంది.చిత్రమే అనుభవచ్ఛాయగా మారే మూర్తిమత్వం ఛాయా చిత్రకారుడిది.
ఇదీ అలాంటి ఒక అనుభవ దృశ్యాదృశ్యం.+++

మహిళ.
పేరు ఏదైనా కానీయండి.
ఆమె కేవలం నామవాచకం కాదు. క్రియా- విశేషం.

అయితే, మహిళలు అందరూ ఒక్కరు కాదు.
కష్టజీవి స్వేదంలో మెరిసే అందం వేరు. సుఖవంతుల జీవితాన విరిసే ఆనందమూ వేరు.

చదువూ సంద్యలు ఉన్నంత మాత్రాన మహిళలందరికీ గొప్ప సంస్కారం ఉంటుందనేమీ లేదు.
ఉత్తమాభిరుచులు ఉన్నంత మాత్రాన ఆ మనుషులు సాహసీకులుగా. ధైర్యవంతులుగా,. పరిపూర్ణ ఆనందంతో జీవిస్తారనీ లేదు. కానీ, సామాన్య మహిళలను ‘సామాన్యం’ అని మాత్రం అనుకోవడం మామూలే.
కాదనే ఈ దృశ్యాదృశ్యం.

+++

వారి అభిరుచి వేరు. వారి సంస్కారమూ వేరు.
వారిది మరో ప్రపంచం. అందలి తమ సృజనాత్మకతలూ వేరు. వారి జీవన ధారుడ్యం కూడా వేరు.

వాళ్ల కళ గురించి చెప్పడానికి వారి కట్టూబొట్టూ, పనీపాటా, అనేకం అనేక విషయాలు చెబుతాయి.
ముఖ్యంగా వారి ఈస్తటిక్ సెన్సిబిలిటీస్ కూడా ఎన్నో చెబుతాయి.

చీర కూడా చెబుతుంది.

+++

ఈ చిత్రంలో శ్రామిక మహిళ ధరించిన చీర ఉందే. అది వర్కర్స్ సారీ.
లంగా ఓణి సారీ. అది ఒక వంద మంది శ్రామికులను కలిస్తే పదుగురికైనా ఉంటోంది.
వేయి మందిని చూస్తే వందమందికి ఉంటోంది. పదివేలమందిలో వేయి మందికి ఉంటోంది.
ఛాయా చిత్రకారుడి అనుభవ చిత్రం ఇది.

దానిపై చాలా పని చేశాను.
worker’s saree అన్న శీర్షిక ఒకటి మనసులో పెట్టుకుని,
ఒక వందకి పైగా వేర్వేరు మహిళలు అదే చీరలో ఉండగా భిన్న జీవన ఘడియలను చిత్రించి పెట్టాను.

అది ఆకుపచ్చా ఎరుపులో, తమ నెత్తిలో అలవోకగా ధరించే పువ్వులా…
ఆ పువ్వు పొంటి వుండే ఆకులా వాళ్లకొక ఆనందం.
అందుకే ఈ చిత్రంలోనూ ఆ శ్రామిక మహిళను తీసింది ఆ చీరతోనే.

సరే.
మళ్లీ స్త్రీలు.

వాళ్లు వేరు వేరు.
ఒక్క మాటలో పురుషుడితో సమవుజ్జీగా ఉండాలనుకునే ఆధునిక స్త్రీ వేరు.
తన సామర్థ్యం తనకు తెలిసి, తన బలహీనతా తాను గ్రహించి, పురుషుడికి తనకూ తేడా ఉందని మసలుకునే జానపద శ్రామిక స్త్రీ వేరు.

ఈ తేడాలు సైతం ఛాయా చిత్రలోకంలో నిరాటకంగా కనపడి చిత్రిస్తున్నప్పుడు సహజమూ సౌందర్యమూ అయిన శ్రామిక చిత్రాలు కాలంతో పాటు నిలుస్తూ ఉంటయని, మిగతా ఆధునిక స్త్రీ తాలూకు విశేషమైన చిత్రాలు తరచూ మారిపోతూ వాళ్లేమిటో వాళ్లకూ తెలిసినట్లు అనిపించకుండా ఉంటుందేమో అనిపిస్తుంది.

ఏమైనా, ఎర్రచీర.
అది శ్రమ చీర.

ఎరుపు, ఆకుపచ్చా కలగలసిన చీర.
అది వాడిపోని జీవకళ.

అవి అందానికి నిలబడతాయి.
మాసిపోకుండానూ కాపాడుతాయి.

అయితే, అది విప్లవ బాణీలు పాడేప్పుడు ధరించే చీర కాదు, వర్కింగ్ యూనిఫాం.
పని చేసుంటుంటున్నప్పుడు మాసిపోని చీర. ఒక అలసిపోని శ్రమకు సంకేతంగా పనిలో ఆనందం పెంచే చీర.

దోపిడీకి గురవడం గురించిన దృష్టి కాదు, తలవంచి తన మనాన తాను పనిచేసుకుంటూ విధి రాతను చెమటకొంగుతో తుడుచుకుని శ్రమచీర.
అవసరం అయినప్పుడు నడుం భిగించగలిగే ఛేవనిచ్చే చీర.

అయితే పట్టణంలో చీరలు తక్కువేమీ కాదు. ఎక్కడైనా మహిళలే. కానీ వారిని చిత్రిస్తూ ఉంటే, ఏది సహజమూ ఏది కృతిమమో అవే తెలియజేస్తూ ఉంటై. ఒక్కోసారి ఇద్దరి చిత్రాలూ కలిపి చేయడంతో కొన్ని ఆలోచనలు రగులుతుంటై…

+++

అయితే, ఈ దృశ్యం. ఒక గ్రామం. ఒక సిటీ.

కానీ, చదువుకుని ఉద్యోగాలు చేసే స్త్రీలు కూడానూ కష్టం చేసుకుని బతికే స్త్రీలను ఈసడింపుగా చూడటం మామూలే. మేధోశక్తికి వారిచ్చే గౌరవం రెక్కల కష్టం మీద బతికేవాళ్లను చూస్తే వారికి ఇవ్వబుద్ది కాదనీ తెలుసు.

కానీ, నవ్వు వస్తుంది.
ఇద్దరూ సమాజంలో ఒక రకంగా విక్టిమ్సే! పురుషాధిపత్యానికి ఇద్దరూ ఒకటే.
ఇద్దరూ పని మనుషులే. కానీ, మహిళలను మరో మహిళ జెలసీతో కాకుండా చూసే మరో దృష్టి ఒకటుంటే బాగుండు. అది మనిషిది కావాలి. మగవాడిది కూడా కాదు. మనిషిగా చూడగలగడం.

స్త్రీలకు చాలా కష్టం.
అందుకే, స్త్రీలను స్త్రీలు చిత్రాలు చేయడంలో మహిళ శ్రమశక్తికి విలువ అంత తేలిగ్గా దొరకదు.
అందుకే పురుషులుగా చిత్రాలు చేయడం ఒక రకంగా లాభమే.

మనిషిగా చిత్రించలేనప్పుడు పురుషుడిగా అయినా చేయడం ఎందుకూ అంటే తనకు శ్రమ తెలుసు. రెక్కల కష్టం తెలుసు. తానూ ఒక పనిముట్టే…ఆమే ఒక పనిముట్టే అని అతడికి గ్రహింపు అధికం.
అది నేర్పిన పాఠం ఒకటి తనలో తెలియకుండానే శ్రమను చూపిస్తుంది.
కాబట్టే ఒక చిత్రాన్ని పురుషుడు స్త్రీని చిత్రంచడంలో వెసులుబాటు ఎక్కువ అనిపిస్తుంటుంది.

కానీ, ఇది మనిషి చిత్రం.
ఈ చిత్రంలో ఇద్దరూ స్త్రీలే ఉన్నారు.

విశాలంగా చేతులు చాపిన స్త్రీ ఉంది. ఆమె ఒక మోడల్. ఒక అవసరం కోసం చాచిన చేతులు.
కింద ఒక స్త్రీ ఉంది. ఆమె మట్టిని ఒక తట్టలో ఎత్తి అక్కడ గుమ్మరిస్తోంది. శ్రమలో లేచిన మట్టిచేతులవి.

పైన చూసుకుంటూ పోతారు. అదెప్పుడూ ఉంటుంది. hording.
కింద మారుతారు. కానీ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు. surviving.

పైన మాదిరే ఈమె కూడా పని చేస్తున్నది. పెయిడ్ వర్కరే. దినసరి కూలి.
కానీ, పైనున్న ఆమెను తీయడం కన్నా ఈమెను తీయడం దృశ్యం. ఇష్టం.

ఎందుకూ అంటే ఈమె దృశ్యాదృశ్యం.
ఉంటుంది. ఉండదు. కనిపిస్తుంది. కానరాదు.

అభివృద్ధిలో భాగస్వామి అయి, pride ఫీలయ్యే మనిషి కాదు కాబట్టి కూడానూ.
అభివృద్ధిలో అనివార్యంగా తానొక పునాదిరాయి అయి,  తనను తాను నిలబెట్టుకోవడమే ముఖ్యం అయిన మనిషి అయినందువల్లానూ…

అందుకే చిత్రం చేయడం.
దృశ్యాదృశ్యం.

~ కందుకూరి రమేష్ బాబు

a tale of winter…

DRUSHYA DRUSHYAM

హైదరాబాద్ నగరంలో మింట్ కాంపౌండ్ సమీపంలో ఈమె.
ఒక బట్టల మూటలా ఆమె.

ఏమీ కానివారిని
ఈమె అంటామా ఆమె అంటామా?

ఎపుడూ నిర్లిప్తంగా ఉంటుందామె.
ఏ ఆలోచనా ఈమె చేస్తూ ఉన్నట్టుండదు.
కానీ, తనదైన ఉనికి ఒకటి థింకర్ శిల్పం వలే మనల్ని కట్టి పడేస్తుంది.
పీడిస్తుంది కూడానూ.

ఈమె ఒక తల్లి వేరు.
కూతురుంది. భర్తా ఉన్నాడు.

దాదాపు రెండు దశాబ్దాలుగా ఫుట్ పాత్ మీదే జీవిస్తున్న కుటుంబం ఆమెది.
అక్కడి ఎండా వానా చలీ ఆ చెట్టు నుంచి పడే ఎండపొడా అంతానూ కలగలసిన స్థలపురాణం ఈమె.

సరే. ఒక దృశ్యం.
ఈమె అక్కడే ఆ మూల మలుపులో ఇలా కూచుంటుంది.
ఒక రోజు మట్టిని నేలమీద సాపు చేస్తూ ఉంటుంది. మరో రోజు ఆ మట్టిని తలపై చల్లుకుంటూ స్నానం చేస్తూ కనిపిస్తుంది. ఇంకోరోజు ధ్యానంలో కూచున్నట్టు కూచుంటుంది. మధ్యలో చిన్న డివైడర్ లాంటిది ఉంది. అడ కూచుంటుందోసారి.

ఇవి ఉదయాలు.
సాయంత్రాలు దగ్గర్లోని మజీద్ ముందు కూచుని ఉంటుంది.
ఒక్కోసారి మజీద్ పక్కనున్న ఇరానీ కేఫ్ లో ఛాయ కావాలన్నట్టు నిలబడి ఉంటుంది.

భర్త ఉన్నాడు. ఆయన స్థిమితంగానే ఉంటాడు. ఈమెనైతే అందరూ పిచ్చిదనే అనుకుంటారు.
ఆయన ఆకు నములుతూ ఉంటాడు. ఈమె కూడా ఏదో నముల్తుందిగానీ అర్థం కాదు.

ఒక మూసిన తలుపుల ఇంటి ముందరి ఒక చప్టా వంటిది ఒకటి ఉంటుంది.
ఈమెకు కాస్త దూరంలో ఆయన కాలుమీద కాలు వేసుకుని అక్కడ కూచుంటాడు.

బిడ్డా ఉంది. ఇరవై ఏళ్లుంటుంది. ఇప్పటికి మూడుసార్లు కానుపయింది.
పోయిన ఏడు ఎవరో కానుపు చేయిస్తామని, కాన్పు అయ్యాక బిడ్డను తమకే ఇవ్వాలని ఒప్పించి హాస్పిటల్ కు తీసుకెళ్లారట. బిడ్డ పుట్టగానే వీళ్లను బయటకు గెంటేశారట. ఆ దినాల్లో ఆమెను చూస్తే, గుండె తరుక్కుపోయింది. డైజెస్ట్ కానీ జీవన వాస్తవికత వల్ల వాంతి రావడం తక్కువ. ఒక కవిలా రాయవలసి వస్తే, వాళ్ల దీనావస్థకు గుండెలు అవిసిపోయి ఇక మళ్లీ ప్రపంచంపై స్పందనలుండవిక…

బిడ్డ బాలింతగా ఉన్నా ఈ తల్లిది పిచ్చినవ్వే.
డెలివరీ అయినా అంతే. అయి వచ్చాకా అంతే.

ఒక నిర్లిప్త గాయం.
ఆమె. ఈమె. ఆకాశంలో సగం అనిపించదు.మట్టిలో మెట్టిన భూదేవి అనిపిస్తుంది.

బిడ్డ. ఆమె కాన్పుకు ముందు వారం కనిపించలేదు. కాన్పు అయిన మూడో రోజు మళ్లీ ఇక్కడే…ఇదే వీధిలో…

అమాయకంగా నవ్వుతూ కనిపించింది. ఆ నవ్వు ముడతల్లో తెగని బొడ్డుతాడు కనిపించి మనసు కమిలిపోయింది.భర్తా, బిడ్డా కాకుండా అప్పుడప్పుడూ ఇంకో మహిళ కనిపిస్తుంది. ఆమె వీళ్లకు బంధువట.
ఇద్దరు పిల్లల్ని వేసుకుని వస్తుంది. కనిపిస్తే చేయి చాపుతుంది. కానీ వీళ్లెవరూ చేయి చాపరు.అడుక్కునే మనుషులు కాదు. బతుకులు.
అంతే.ఆంజనేయస్వామి దేవాలయం టర్నింగ్ నుంచి వీళ్లు మొదలవుతారు.
ముందు భర్త…పక్కనే కూచుని నవ్వుతూ బిడ్డ.
పది అడుగులు దాటాకా పూర్తిగా నేలపైనే కూచుని ఈ పిచ్చి తల్లి.ఈ చిత్రం ఈ వారం తీసిందే.
ఒక వాటర్ కలర్ చిత్రంలా ఆమె ఇలా కూచుండి కనిపించింది.
కన్నీరు రాదు. వస్తే ఆ చిత్రం ఇక చిత్రంచలేం.

ఎందుకో ఈ వారం వాళ్లిద్దరూ కనిపించలేదు. ఒక్కత్తే, ఇలా మోకాళ్లలో తల వంచుకుని ఉంది.
చలికాలం అయినందువల్లో లేక బయట ఉన్నది… లోన లేనిదీ ఏమీ లేదన్నట్టు ముసుగు తన్నినట్టూ ఈ మూట.తోడుగా మరికొన్ని మూటలు. ఒక గిలాస. అందులో ఒలిచిన బత్తాయి ఆకలిని, రుచినీ గుర్తు చేస్తూ…

మొత్తంగా మనిషి..ఆ మనిషి మూటలు.
ఈ మూటల్లో ఏముంటాయన్న కుతూహలం కాకుండా చెట్లు నీడలోంచి పడుతున్న నీరెండ వెలుతురు విస్తర్లు.. అవి అధికంగా అవి ఆకర్శించాయి. మనుషులు ఎలాగైనా బతకనీయండి. కానీ, వెలుతురు ఉంది. వెలుతురులో ఉన్నారు. చీకట్లోకి తలవంచుకున్నా వెలుతుర్లోనే ఉండటం జీవితపు రహస్యం అనిపిస్తుంది.

రోడ్డు మీద రహదారిని చెప్పే తెల్లటి మరకా ఒకటి. అదీ ఏదో చెబుతుంది.
బహుశా మన గురించి.

విశేషం ఏమిటంటే, వీళ్లను ఒక ఆశ్రమంలో వుంచడానికి ప్రయత్నం ఒకటి చేశాను. కానీ ఉండలేమన్నారు.
ఇరానీ కేఫ్ యజమాని కూడా చెప్పాడు. ఆ పని తామూ గతంలోనే చేశామని. ఉండరని!

ఇల్లు వాళ్లకు అలవాటు లేకపోవడం ఒకటి చిత్రంగానూ, విచిత్రంగానూ అనిపిస్తుంటే, ఒక పదేళ్లుగా ఈ దారి వెంట వెళుతూ వాళ్లను గమనిస్తూ ఉన్నందువల్లో ఏమో ఇక వాళ్లను ఎక్కడైనా చేర్చాలన్న ఆలోచన చచ్చిపోయింది.

కానీ అక్కడికి రాగానే గుండె మూలుగుతుంది.
ఆ బాధలోంచే ఈమెను, అతడిని, బిడ్డనూ ఎన్ని చిత్రాలు చేశానో.
విచారకరమైనవే కాదు, నవ్వు తెప్పించేవి కూడానూ.

బిడ్డ తండ్రి మోకాళ్లపై నిలబడటం…
తన ఎత్తున్న బిడ్డ అతడి మొకాళ్లపై నిలబడి నవ్వుతూ ఒకసారి కనిపించింది.
పిచ్చిగా అనిపించింది. కానీ, ఆ పాప నవ్వు చూసి ఆ నవ్వులో శృతికలప వలసే వచ్చింది.
చిత్రమేమిటంటే, బిడ్డ చేష్టలు చూసి ఈ తల్లి పళ్లన్నీ కనబడేలా నవ్వినప్పుడు ‘వీళ్లు నవ్వుతారు’ అనిపించి నవ్వు వచ్చింది. ‘చిత్రం’ చేశాను.

ముగ్గురూ కూచుండి మౌనంగా మాట్లాడుకున్నప్పుడూ ఎన్నోసార్లు చూశాను.
ఏం మాట్లాడుకుంటారో అర్థం కాదు. కానీ పరిపరి విధాలుగా వాళ్లను ‘చిత్రాలు’గా చేశాను.

రాత్రిళ్లు మజీద్ దగ్గరే ఉన్న చప్టాపై వాళ్లు ముగ్గురూ కూచుండి కనిపిస్తే, ‘త్రీ మంకీస్’ వలే అనిపించి గాంధీ సమాధి ఏదో గుండెలో కదులుతుంది.
కానీ. నిజం. వీళ్లు ఇక్కడి వారందరికీ తెలుసు. ఇలా వెళ్లేవారందరికీనూ తెలుసు.
వాళ్లు నవ్వుతారు. చిర్నవ్వు చిందిస్తారు. చల్లగా అనిపిస్తుంది. వింటర్ టేల్.
లోపల మృత్యువును తడిమే  జీవితపు దరహాసాలు. అందరికీ తెలుసు.

కానీ, ఒకటి మాత్రం నిజం.
రహదారి సాహిత్యం ఒకటి ఉన్నందువల్ల ఈ కాలిబాట మీది జీవితాలు అగోచరంగా ఉన్నాయి.
వాళ్లను చూసి మనం తోవలో ఆగి ఫొటో తీసినట్టు ఒక కథ రాయడం కాదు. వాళ్ల జీవితాలు ఎలా తెల్లారుతున్నాయో మరెలా నిద్రిస్తున్నాయో, మూగన్నుగా కలవరిస్తున్నది ఏమిటో ఎవరైనా రాయాలి.

ఎండకూ చలికి గాలికీ వాళ్లు అలా చెదలు పట్టని పుస్తకంలా ఎలా గంభీరంగా మన ప్రపంచ షెల్పుల్లోనే పడి ఉండటం పట్ల మనం దయ చూపాలి. వాళ్లను కనిపెట్టి చదవాల్సిందే. అందుకు చలికాలం మంచిది.

ఒక దుప్పటి కప్పి సేవానిరతిని ప్రదర్శించడం సులభం.
కానీ, ఒక్కో పువ్వును తెంపి కొంగులో వేసుకున్నట్టు, ఒక్కో చిత్రాన్ని రచించి గుండెతడి చేసుకున్నట్టు, సాహిత్యకారులు ఎవరైనా ఒకరు వీళ్ల బతుకుల్ని మూటగట్టాలి. లేదా ఆ మూటలు తెరవ ప్రయత్నించాలి.

భరద్వాజలా కాదు. జీవన సమరంలా కానే కాదు.
శ్రీశ్రీలా మార్పు కోసమూ కాదు. అధోజగత్ సహోదరుల్లా చూడటం కోసం కానైతే కాదు.
ట్యాంక్ బండ్ నడుం కింద చేతులేసిన తిలక్ లా కాదు. సుషుప్తిలోని మనిషి మృగచేతన చీకట్లో కరేల్మని కదిలే విధంగానూ కాదు.

సమాజం గురించి కలవరపడే బుద్ధిజీవుల్లా కానే కాదు. వ్యక్తిగతంగా శ్రద్ధ చూపే సామాన్యుల్లా.
ప్రజలుగా కాదు, మానవులుగా…

అంతదాకా చలికాలమే.
ముడుచుకుని ఆమె, మూటలో ఈమె.

a tale of winter…
నేను చిత్రిస్తూనే ఉంటాను, కాలిబాట మీది దృశ్యాదృశ్యాలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

ఆరేసిన చేయి

drushya drudshyam

మనకెన్నో పనులు.
నిజానికి చిన్నచిన్న పనులను గమనించం.
బట్టలు ఉతకడం గురించి కూడా ఆలోచించం.
ఇప్పుడు వాషింగ్ మెషీన్ వాడుతున్నాం అనుకుంటాం గానీ, అందునా ఎంతో పని.
ఆరేయడమూ ఒక తప్పనిసరి పనే.

ఉదయం వంటపని అయ్యాక పిల్లాజెల్లా బయటకు వెళ్లాకా మహిళలు చేసే పనులు ఎన్నో చిత్రాలు.
అందులో ఒకటి ఇది. బంగారు అంచుచీర.

కానీ. ఒకటైతే చెప్పాలి ఇక్కడ.
అమ్మ. వదిన, అక్క, భార్య, చెల్లె…బిడ్డ- వాళ్లు ఎవరైనా కానీయండి.
తల్లి వలే పని చేయడం ఒక కలనేత.

ఆఖరికి పనిమనిషి అయినా సరే, ఆమె అమితశ్రద్ధగా పనిచేసే తల్లే.
మనం ధరించే దుస్తులన్నిటా కనిపించని స్వేదం, తడి ఆరిన శ్రమైక గీతికా ఆమే!

ఆమెవి ఉతికి ఆరేసే చేతులే
అవి చలికి వానక ఎండకు వెరవని చేతలు.

చిత్రమేమిటంటే, బట్టలు ఉతకడమూ, వాటిని ఆరేయడమూ మనం చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాము.
కానీ, పెద్దయ్యాక దైనందిన జీవన సమరంలో పడిపోయాక వాటి గురించి ఆలోచించనే చించం.
అందులోని కవిత్వం గురించి గమనించనే గమనించం, జీవన గ్రంథమంతా మనమే అనుకుంటే, దుస్తులను మరచి!

+++

అంగీ గుండీలు దెబ్బతినవు.
లాగు జేబులో ఒక్కోసారి ఐదు రూపాయల కాగితం మడత దొరుకుతుంది.
కానీ, రోజూ దొరకవంటే ఏమిటీ అర్థం?

అమిత శ్రద్ధగా జేబుల్లో చేతులు పెట్టే ఆ తల్లి ఇగురమే అందుకు కారణం.
కానీ అది గమనించం.

బాగా మైల పట్టిన ప్యాంటు ఒక ఉతుకుతో శుభ్రం కాదని తెలుసు.
కానీ, మళ్లీ మళ్లీ నానబెట్టి ఉతకిన విషయమూ గుర్తురాదు.

అన్నిటికన్నా చిత్రం. బట్టలు ఉతకడం, ఉతికిన వాటిని వడివెట్టి పిండటం, అవసరమైతే అటు నువ్వు ఇటు నేనూ నిలబడి వడివెట్టి పిండటం. మళ్లీ మన మానాన మనం.
ఆమె మళ్లీ ఉతుకులో, ఆరేయడంలో నిమగ్నం.

+++

కానీ, తీరుబడి విలువ తెలిసిన వాళ్లకో మాట.
బట్టలు ఉతకడం ఒక జీవకళ.
ఉతికిన బట్టల్ని జాడీయడం..తర్వాత వాటిని దులిపి ఆరేయడమూ చిత్రమే.

అయితే, ఆ దుస్తులను ఆరేయడానికి కూడా కొన్ని చోట్లు ఉంటాయి.
తీగల మీద, దండేలా మీదా ఇంకా చాలాచోట్ల.
అయితే, గాలికి కొట్టుకు పోకుండా క్లిప్పులు పెట్టడం సరే!
కానీ, బంగ్లామీద ఇట్లా ఈ దృశ్యంలో ఆమె చీరను ఆ సందునుంచి వదిలి పైకి తీయడం ఉన్నదే అలా…
ఎండ పొడలో వెచ్చని దృశ్యం ఒకటి గమనించనే గమనించం. కానీ, ప్రతిదీ ఒక చిత్రం.
ఒక తెలివిడి, అమరిక. సుతారమైన శైలి. మహిళల జీవన మాలికా సంపుటిలో దాగిన అనురాగ దొంతర.
మన దృష్టిలో పడని నెమలీక.
దృశ్యాదృశ్యం.

+++

ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టుకోవడం ఒక చిత్రమే.
అయితే, అసలు సంగతి అది కాదు. తల్లి.
అవును. మనం ఒంటిమీద ధరించే దుస్తులన్నీఇక్కడ మీరు కూర్చున్న చోట మీతో ఉన్నాయిగానీ అవన్నీ అక్కడ తడిసాయి. ఆరాయి. బలంగా వడితిప్పబడినాయి. ఒక్క ఉదుటున దులుపబడి తీగల మీద నిశ్చలంగా ఆరవేయబడినాయి. అవి గాలి మాటుకు రెపరెపలు పోయినా పోయాయి. నీడలోనూ అవి సేద తీరే ఉంటాయి.

ఇక ఇంట్లోని మనుషుల్లా లేదా ఒక పుస్తకంలోని కవితల్లా అవన్నీ ఒకదాంతో ఒకటి రహస్యంగా అనుభూతులు పంచుకునే ఉంటాయి. ప్యాంటు, షర్టు, చీర. రవిక…ఏమైనా కావచ్చు

అవన్నీ వయోభేధాల జీవన వలువలు. విలువలు.+++ఒక్కమాటలో కుటుంబ సభ్యులందరికీ చెందిన దుస్తులన్నీఒకరి చేతిలో పిండి వారి చేతిలో ఆరేయబడినవే అని తెలిస్తే, అవే మన ఒంటిపై నిలిచినవీ అని గనుక గమనిస్తే, ఆఫీసుకు వచ్చేముందు దండెం మీదికి చూపు వాలవలసిందే.  వీధుల్లోకి వచ్చాక బంగ్లాపైకి చూడవలసిందే.

తల్లులు కనిపిస్తూనే ఉంటారు.
అపుడు మన ఒంటిపై స్పృహ కలిగి, ‘ఓహో’ అనుకుంటే మన మనసుకు నిజంగా శాంతి.

ముఖ్యంగా ఈ చలికాలంలో ఒకమాట చెప్పాలి. మన దుస్తులన్నీనూ వెచ్చగా ఉన్నయి అనుకుంటే…
బహుశా పైన ఒక సుదీర్ఘ కవితలాగా తల్లి ఆ చీరను ఆరేస్తున్నదే…ఆమె స్వేదంతో మరింత గాఢంగా మారి ఉండటం వల్లని?  ఏమో! అవి ఈ చలికాలాన వెచ్చగా అందుకే మారి ఉన్నాయి కాబోలు అనిపిస్తోంది.
వాటిని చిత్రంలో పటం కట్టలేకే ఈ ‘దృశ్యాదృశ్యం’ అనీ చెప్పబుద్ధవుతున్నది.

~ కందుకూరి రమేష్ బాబు

The Old Man and the Sea

drushya drushyam

అనుకుంటాం గానీ కొన్నిసార్లు అవతలి వాళ్ల దుస్థితి చూసి బాధపడతాం.
వాళ్ల కష్టాలకు అవేదన చెందుతాం. జాలి పడతాం. సానుభూతి చూపుతాం. ఓదార్చుతాం కూడా.
కొన్నిసార్లు ఆ కష్టాల్ని తొలగించడానికి వీలైతే మన వంతు సాయమూ చేస్తాం.

కానీ, అవతలి వ్యక్తి కష్టం మనకు తెలిసే విధానాలు పరిపరి విధాలు.
చాలాసార్లు విని తెలుసుకుంటాం. ఫీలయి బాధపడతాం.
అర్థం చేసుకుని స్పందిస్తాం.
కానీ, కొన్నిసార్లు స్వయంగా చూసి తెలుసుకుంటాం.
ఇంకా కొన్ని సార్లుంటాయి. అవి అసంకల్పితం.

అసంకల్పిత ప్రతీకార చర్య అనడం బాగోదు గానీ ప్రతిచర్యే.
అవును. ఈ చిత్రమే చూడండి.

ఉదయపు నీరెండలో ఒక పెద్ద మనిషి నడుస్తున్న దృశ్యం.
అంతే. కానీ, ఈ చిత్రం చూడండి అనడంలో ఇక్కడ ‘చూసి’ అన్న పదం ప్రత్యేకం.

నిజం.
ఆ రోజు, ఉదయం చిత్రణ ఇది.

నల్లకుంట బస్టాఫ్ లో ఒక్కరు కాదు, పదులు.
పదులు కూడా కాదు, పాతిక మంది దాకా ఉన్నారు.

ఒక పెద్ద మనిషి అతి కష్టంగా నడుచుకుంటూ పోతుంటే వారంతా చూస్తున్నారు.
అతడి బాధ సరే. వారూ అతడితోసహా ఫీలవుతున్నారు. అదీ చిత్రం.

ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే అతడిని చూస్తూ, తమ ముందు ఆయనొక్కరే అత్యంత ప్రయాసతో అడుగు తీసి అడుగు వేస్తుంటే…
నిజానికి అడుగు వేయలేక ఆగి నిలబడి మళ్లీ అడుగు వేసే ప్రయత్నంలో ఉండగా వారు చూస్తున్నారు.

నడుస్తున్నాడంటే నడుస్తున్నాడు.
అక్కడిదాకా వచ్చాడంటే నడిచాడనే కదా అర్థం.
కానీ, వారు చూస్తున్నారు. అదీ దృశ్యం. కాలు తీసి కాలు వేయడానికి…ఒక అడుగు తీసి మరో అడుగు వేయడానికి
ఆయన పడుతున్న కష్టాన్ని చూస్తున్న వాళ్లెవరూ చూస్తున్నట్టు లేరు.
తామూ ఆయనతోపాటు నడవ ప్రయత్నిస్తున్నట్టే ఉంది.

ఆ ముసలాయన అమిత కష్టంగా తన నవనాడులూ స్వాధీనంలోకి తీసుకుని నడవ ప్రయత్నిస్తుంటే
వారూ ఆయన అడుగులో అడుగవడం గమనించాను.

అదే దృశ్యాదృశ్యం.
చూపు. చూపుతో ఫీలవడం.

నిజానికి వారంతా ఒక రకంగా తనతోపాటు వేల వేల యోజనాలు నడుస్తున్నట్టే అనిపించి ఆశ్చర్యం.
అప్పుడనిపించింది, మనుషులు చూస్తారని!
ఎప్పుడంటే అప్పుడు కాదు. అవతలి వ్యక్తి సాఫీగా నడుస్తున్నప్పుడు కానే కాదు. వారి నడక సాగనప్పుడు చూస్తారని!

ఏదీ సులువుగా లేనప్పుడు చాలామంది చూస్తారు.
ఇది అదే అనిపించింది.ఈ వయోవృద్ధుడు చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నప్పటికీ, ఆయనలొ శక్తి వుడిగిపోయింది. కానీ. ఒక పాదం తీసి మరొక పాదం వేయడానికి పడుతున్న ఆ ప్రయాస…అందరిలోనూ తామే అతడై శక్తిని కూడదీసుకునేలా చేస్తూ ఉన్నది.

ఇంతలో బస్సు వచ్చింది.
చిన్నగా కలకలం. ఆయన పూర్తిగా ఆగిపోయాడు.
ఇప్పుడు ఎవరికి వారు ‘దృశ్యం’ నుంచి తప్పుకుని చకచకా ఎక్కేసి సీట్లో కూచుండ ప్రయత్నించడం మరో దృశ్యం.
తర్వాత ఒక చిన్న జెర్క్ తో బస్సు కదలడం ఇంకో దృశ్యం.
అటు తర్వాత ఆయనే మిగిలారు మళ్లీ.

చిన్నగా దుమ్ము లేచినట్టుంది.

ఆయన ఒక్క క్షణం నడక ఆపి మళ్లీ ప్రారంభించారు.walker అప్పటిదాకా నాకు కనిపించలేదు.
ఎవరి సహాయం అవసరం లేకుండా ఆయన తనను తాను కూడగట్టుకుని నడవ ప్రయత్నిస్తున్నారు.

~ కందుకూరి రమేష్ బాబు

సిగ్గొచ్చి దాక్కుంది నా చిట్టి చిలకమ్మ !

DSC_0238

సిగ్గు సిగ్గు

ఎవరు నేర్పుతారోగానీ పిల్లలకు, దాచుకున్నముఖంతో వాళ్లు ఎన్నిమాట్లాడుతారో.
దాచుకోవలసింది ముఖమే కాబోలనుకునే ఆ దాగుడు మూతల చిలిపి దృశ్యాలను ఎవరైనా ఇలా తీస్తూ పోతే ఎంత బాగుంటుంది?
మనమూ పిల్లలం కామూ?

గంభీరమైన మన జీవితావరణంలో పిల్లలు వదిలే వలువలు…
మనం అయిష్టంగా ధరించిన వలువలన్నీ వాళ్లను చూస్తుంటే చిరునవ్వుతో సహా జారిపోవూ?
వాళ్లు మన భద్రజీవితపు విలువలను ఈడ్చి పారేసే దయామయులు.

ఇలా చూస్తామో లేదో
చప్పున జాక్కుంటరు.
తర్వాత మన్నలి వెతుక్కుంటరు.
బహుశా చూడాలనే కాబోలు.

ఇదొక అలాంటి కవ్వింతకు ముందరి దృశ్యం.
దృశ్యాదృశ్యం.

నిజంగానే చెప్పుకోవాలి.
ఎవరికైనా భుజాన కెమెరా ధరించి బజార్లోకి అడుగుపెడితే ముందు పిల్లలే తగులుతారు.
ఇరుకిరుకు వీధుల్లో ముందు వాళ్లే మనకి పెద్ద తోవ వదులుతారు.
కానీ పట్టించుకుంటామా?

వాళ్లను దాటేయకుండా ఇలాంటి చిత్రాలు చప్పున చేజిక్కించుకుంటూ వెళితేనే మన బాల్యానికి విలువ.
లేదూ ఆ వీధిని దాటి కూడళ్లను దాటి ఆకాశహర్మాల నీడన మనం పెద్దమనుషులం అవుతాం.
కానీ ఏం ఫాయిద?
సిగ్గు సిగ్గు.

పిల్లలు పెద్దగైనట్టే మనం పెద్దగై కోల్పోయేదే ఎక్కువ.
అందుకే సిగ్గు సిగ్గు అనడం.

అయినా మన ఖార్కానాల్లో, కార్యలయాల్లో మనల్నెవరూ చూడరనుకుంటాం.
కానీ, మనమూ పిల్లలమే చాలా సార్లు. పిల్ల చేష్టలు చాలా ఉంటై మన కార్యాలయాల్లోనూ.

అక్కడా ఒక కెమెరా తప్పక ఉంటుంది.
సిసి కెమెరాలు ఉండనే ఉంటై. కానీ, వాటినీ ఎవరైనీ విప్పదీసి ఇలా పబ్లిష్ చేస్తే ఎంత బాగుంటుంది?
దాచుకోమా మనమూ ఇలా?

కానీ, బాగోదు.
పెరిగాం కనుక వద్దు.

కానీ, ఒకటి మాత్రం నిజం.
పెద్దరికం ఎప్పుడూ పిల్లలంతటి అభిమాన దృశ్యం కాదు.
సహజం కానే కాదు. ఎంత లేదన్నా బాల్యం నిజమైన చ్ఛాయ.

ఇంతకన్నా లేదు,
సిగ్గు సిగ్గు.

-కందుకూరి రమేష్ బాబు

ramesh

అనాది సంభాషణా రూపకం ఆమె!

drushya drushyam-54

ఒకానొక దృశ్యం మనం దైనందిన జీవితంలో ఇమిడిపోయి, అదృశ్యంగా ఉండిపోయిన జీవన ఖండికను మళ్లీ యాది చేస్తుంది. టీకాతాత్పర్యాలు కోరుతుంది. వ్యాఖ్యాన సహిత ప్రవచనం డిమాండ్ చేస్తుంది.

మరొక దృశ్యం ఏమీ చెప్పదు.
రంగులతో మెరుస్తుంది. సుహాసినిగా దర్శనం ఇస్తుంది.
ముక్కెరలా మెరుస్తుంది. గంతే.

అది కిరసనాయిల్ స్టవ్ లేదా బ్యాచిలర్ స్టవ్.
ఇక్కడైతే అది స్టవ్ కాదు. చిన్న ఇడ్లీ బండీ నడిపే ఆమె జీవన సమరం.

కానీ, కాదు.
ఆమె పోస్తున్నది కిరసనాయిలూ కాదు.

ప్రేమ. అభిమానం.
తల్లి ఆమె. భార్య ఆమె. ప్రేయసి ఆమె. స్నేహిత ఆమె.
వదిన, మరదలు. పిల్ల. మనిషి.

నీకూ నాకూ మధ్య ఏ గోడలు లేని, మరే ప్రవర్తనా నియమాలు అడ్డురాని, ఏకైక మాధ్యమంలో ఆమె ఒక నిండు మనిషి. మొబైల్ సంభాషణ వినాల్సిన అవసరం లేదు. ఆమె నిఖార్సయిన ఇండివిడ్యువల్.

లైఫ్.

అలవోకగా చెవికి మొబైల్ ఆనించుకుని స్టవ్ లో కిరసనాయిలు పోస్తున్నఆమె ‘నీ- నా’ కాదు.
తన.

మమత. సమత. దయ. అనురాగ పారవశ్యం.
జీవన లాలస.

పోక రంగు. నీలి రంగు.
ఆకుపచ్చ. నలుపు తెలుపు.
ఆఖరికి మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీవనచ్ఛాయ.

+++

ఒక దరహాసం.
సంభాషణ. దృశ్యాదృశ్యం.

ఆమెను చూశారా?
మళ్లీ మళ్లీ చూశారా?

నేను చూశాను.
వందలు వేల చిత్రాలు తీసి చూశాను.

సంభాషణలో ఆమె సాధించేది, సామకూర్చుకునేది, పొందేది ఎంతో.
చిత్రం వాస్తవం.

అమె ఇప్పుడు పరధ్యానంలో లేదు.
ధ్యాసతోనే రెండు పనులూ చేస్తోంది.

సముఖం.
స్వయంవరం.

+++

జీవన వ్యాపకాల్లో ఇప్పుడు ఆమె ఆమెనే కాదు, అతడు అతడే కాదు, వారు వారే కాదు.
మనిషి ఇప్పుడు ఏకవచనం కానేకాదు. నిజం. మనిషిప్పుడు సహవాసి.

ఎవరి జీవన వ్యాపకాల్లో వారు ఎంత నిమగ్నమైనప్పటికీ, మరెంత ఒత్తిడిలో ఉన్నాగానీ
మనిషి మరొక మనిషి సన్నిధిలో ఉండటం ఇప్పటి దృశ్యం. దృశ్యాదృశ్యం.

+++

ఆమె సామాన్యురాలే.
తనది సామాన్యమైన సంభాషణే అనుకుంటాం.

కానీ, సరసం, పరిహాసం.
సహృదయత, సౌశీల్యం.
సమర్థన, ప్రోత్సహాం.
కోపం, తాపం. ఇంకా ఎన్నో.

మాట్లాడి చూడండి.
మీరు ఎరిగిన మనిషి మీకెంత కొత్తగా అర్థమౌతాడో, లేదా అర్థం చేయిస్తుందో.

తన.
తనతో  మాట్లాడారా?- అదే సంభాషణలోని సౌలభ్యం.
మొబైల్ ఇప్పుడు మానవ సంబంధాలని మానవీయం చేస్తున్న అపురూన వైనం.

ఆమె రంగులు చూడండి. ముక్కెర మెరవడం చూడండి.
పనిలో ఉంది. పాటలోనూ ఉంది.ఏదీ ఆగదు.
జీవితాన్ని క్షణం క్షణం అనుభవంలో వుంచుకోవడం ఒక్క స్త్రీతోనే సాధ్యం.
పరిపూర్ణ జీవన లాలస ఆమె వద్దే పదిలం.

పురుషుడి బిజినెస్ కాదీ చిత్రం.
స్త్రీ పురుషుడిని ఎంగేజ్ చేసే చిత్రం.

పురుషుడంటే ప్రపంచం అనుకుంటే స్త్రీ ప్రకృతి.
ఆమె విశ్వజనీనంగా మాట్లాడుతూనే ఉంది.

వినలేక స్విచ్ఛాఫ్ అవడం సమస్య.
అలా అని ఈ చిత్రం ఆమెదే అనుకోవద్దు.

ఒక సహజమైన జీవనచ్ఛాయకు ఆధునిక రూపం.
అనాది సంభాషణా రూపకం.

దృశ్యాదృశ్యం.
+++అనుకుంటాంగానీ తనలో తాను మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మనిషి వ్యక్తి కాదు, సహచరే.
ఏదో ఒక సహజాతం. దాని వలపోత.

ఆమెనే కాదు, అతడ్ని, వారినీ, వీరిని కూడా, చివరాఖరికి మిమ్మల్ని మీరు కూడా చూసుకొని చూడండి.
ఇలాంటి దృశ్యాదృశ్యాల జాడ మీలోని నవయవ్వనాన్నిగుర్తు చేయదూ? గాంభీర్యాన్ని చెదరగొట్టదూ?

మనిషెప్పుడూ వ్యక్తి కాదు.
సాహచర్యంలోనే మనిషి వ్యక్తిత్వం నిండుగా మూర్తీభవిస్తుంది.

ఛాయ చిత్రాలు అవే చూపుతున్నై మరి!

అన్నట్టు, భుజం ఇప్పుడు మీ చెవికి మరీ దగ్గర.
అది సుతారంగా మొబైల్ ఫోన్ ను ఇముడ్చుకుని వయ్యారాలు పోవడం ఒక చిత్తరువే.

ఒకరంటారు, నా చొక్కా అంతా నీ కన్నీళ్లతో తడిసి పోయిందీ అని.
దానర్థం ఇవతలి వ్యక్తి అవతలి వ్యక్తిని ప్రత్యక్షంగా ఓదార్చినట్టు కాదు.
మొబైల్ పరామర్శ. ఆత్మీయ ఆలింగనం.

అవును.
మానవ సంబంధాలన్నీ ఇప్పుడు మొబైల్ బంధాలు కూడా.

ఒప్పుకుంటే మంచిదే. లేదన్నాసరే.
కానీ చూడండి.

ఒక చేయి మునుపటిలా వెనుకాడట్లేదని చూడండి. నిజం.
అది కన్నీళ్లను తుడిచేందుకో, ఆసన్నహస్తంగా మారేందుకో, ఆసరాగా నిలిచేందుకో, ప్రేమగా చుబుకం ఎత్తడానికో పరాకు చూపనే చూపదు.

ఈ జీవన సాదృశ్యం అదే.
కిరసనాయిలు వలే ఒక చక్కటి పరిమళం. ఒద్దికగా కొంచెం కొంచెం ఇటువంటి దృశ్యాలు మీలోకి వొంపాలనే నా  చాదస్తం. చిరునవ్వులు. ధన్యవాదాలూ.

– కందుకూరి రమేష్ బాబు

ఆమె అప్పుడూ …ఇప్పుడూ…

drushya druhsyam 53

మొదట దృశ్యం.
అటు పిమ్మట అదృశ్యం.
నిజం.

+++

కొంతమంది పొట్రేచర్ చేస్తున్నప్పుడు అప్పుడేమీ తెలియదు.
మెడలో నల్లపూసలున్నయా లేవా అన్నది చూడం.
కానీ, ఏడాది గడిచిన తర్వాత మళ్లీ ఆమెను చూసినప్పుడు బోసి మెడ కనబడింది.
భర్త మరణించిండట!

పండుగకు పువ్వులు అమ్మే ఈమె గత ఏడాది ఇలా కనిపించింది.
ఈ ఏడాది విచారం కమ్ముకుని ఫొటో తీయలేని స్థితి కల్పించింది.

తొలుత మనిషిని నేరుగా ఎదుర్కుంటం.
ఏ భావమూ ఉండదు. తర్వాత ముభావం అవుతాం.

మధ్యలో ఉన్నది, అదే.
between the lines.

దృశ్యాదృశ్యం.
అది ఆది అంతాల నడిమంత్రం.

+++

పోట్రేచర్ – రూప చిత్రణం.
అందులో లావణ్యం కనిపిస్తుంది. విషాదమూ మూర్తీభవిస్తుంది.

ఒక లోవెలుపలి నావ ఒకచోట లంగరు వేయడమూ తెలుస్తుంది.
దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడటమూ తెలుస్తుంది.

ఇది గతం.
వర్తమానం అగమ్యం..

+++

చిత్రమేమిటంటే, ఒక ఫొటో తీస్తున్నప్పుడు తెలియదు.
తీసినాక ఆ వ్యక్తి పరిచయం అవుతుంది.
మళ్లీ కలిసినప్పుడు గతంలో తీసిన చిత్రం తాలూకు శోభ ఉన్నదా లేదా అని తెలియకుండానే దేవులాడుతాం.
ఉంటే మరింత ముచ్చటగా ఇంక ఫొటో తీస్తాం. లేకపోతే కలవర పడతాం.

చిత్రమేమిటంటే, ఫొటోగ్రఫి అన్నది ఫొటోగ్రాఫర్ పొట్రెయిటే!
దీపం అరకుండా చేతులు వుంచే ఒక రెపరెపలు పోకూడదన్నఅసంకల్పిత చేతన.

కానీ, ఎన్ని చెప్పినా తొలి చిత్రమే అసలు చిత్రం.
అద్వితీయం. మిగతావన్నీ ద్వితీయమే.

నిజానికి మనం తీసిన చిత్రమే కావచ్చు. కానీ, ఆ చిత్రంతోని- మనమే ఆ మనిషిని మరలా మరలా పోల్చుకోవడమే విచిత్రం. ఆ భావం, అనుభవం, తొలి నుంచి మలికి ప్రసరిస్తుంది. అటు తర్వాత బాగున్నా బాగలేకపోయినా మొదలే తుదికంటా కొలమానం అవుతుంది.

ఇదంతా తెలియకుండానే జరిగే ఒక చిత్రం.
అందుకే అనిపిస్తుంది,, గతం వర్తమానాన్నినిర్దేశిస్తుంది. అది క్రమేణా భవిష్యత్తు గురించి ఆలోచింపచేస్తుంది.
చిత్రంలో కూడా అదే ఒరవడి అని!
ప్రతిసారీ ఇంతే.
first impression is the best impression. చిత్రం.

+++

తొలి ఫొటో తీయడం అన్నది నిజానికి చాలా కీలకమైంది, ఫొటోగ్రఫీలో, పోట్రేచర్లో.
తొలి చూపుల వంటిదే ఇదీనూ.

తొలి పరిచయం, తొలిచూపులు,
ఏవైనా – ఎవరికైనా – ఎందుకైనా – కీలకమే.

మలిచూపులో ఆ కన్నుకు లేదా చూపుకు కొత్త చిత్రంలో ఏదో ఒక లోటు కనిపిస్తే ఇక మాట అవసరం పడుతుంది. అప్పటిదాకా కంటితో సరిపెట్టిన వారెవరైనా నోరు తెరిచి మాటాడక తప్పదు.
అట్లాంటి స్థితే ఎదురైతే, మలి చిత్రం అన్నది తొలి చిత్రానికి కొనసాగింపే అవుతుంది.
ఆ లెక్కన అదొక పొట్రెయిట్ కాదిక. విడి ఇమేజ్ కిందికి రాదిక.

ఫాలోఅపే.

+++

మొన్న పండుగకు, బతుకమ్మ పూలు కొన్నాక ఆ విచార వదనాన్నిఅడిగితే తెలిసింది, భవనం పై నుంచి పడిపోయి భర్త మరణించిండట. అప్పటికే కుడి కన్ను అదిరింది. అయినా వ్యూ ఫైండర్లో కన్నువుంచితే నిలబడలేదు. రూపం హత్తుకోలేదు.

నిజానికి, పొట్రేచర్ అంటే వ్యక్తి రూప చిత్రణ.ముఖ చిత్రణ.
ఇక ఆమెను చేయలేం. ఏం చేసినా ఆమె రూపం ఆమె జీవితంతో ముడిపడి ఉన్న రూపం గుర్తొచ్చి., కేవలం దేహాన్ని తీయడం అంటే కాదిక. కుదరనే కుదరదు. తనని వదిలిన దేహం ఒకటి మనకు కనిపించడుగానీ, వుండనైతే ఉంటుంది ఆ లోటు. .

దాంతో ఒకట్రెండు పోట్రయిట్ల చేశానుగానీ, లాభంలేదు.
నిజానికి పోట్రేచర్ చేస్తుండగానే అనుమానం వచ్చింది.
మొదలు చెప్పినట్టు, గతంలోలా లేదేమిటా అన్న శంక కలిగింది.
అడిగితే చెప్పింది.

“ఆయన పోయాడు గదా. ఇక మాకు పండుగలు లేవు.
కేవలం పువ్వులు అమ్మడమే’ అందామె.

ఇక వల్ల కాలేదు.

10723593_744834935588896_1602093144_n
పోట్రేచర్ ఆపి, ఆమెను, ఆమె ఇద్దరు కూతుళ్లనూ కూర్చోబెట్టి విచారంగానే మరో చిత్రం చేశాను.
అయిష్టంగా, భయంతోనే చేశాను. మళ్లీ వచ్చే సంవత్సరం ఆమె ఇలాగైనా ఉంటుందో లేదో అని!
పిల్లలు ఈ మాత్రం ఆనందంగానైనా ఉంటారో లేదో అని!

వెళుతుంటే అంది  ‘పనిమనిషిగానైనా చేస్తాను, ఎక్కడైనా చూడరాదూ’ అంది!
ఒక నిర్లిప్తమైన నవ్వు.

-ఇట్లా ఒక నవ్వు వాడిపోతుంది, మలి చిత్రం చేశాక.
అందుకే తొలి చిత్రాలకు ఫాలోఅప్ చేయడం నిజానికి చిత్రవధే.

– కందుకూరి రమేష్ బాబు