ఒకానొక రూఫ్‌ గార్డెన్‌ కథ

 

– ఒమ్మి రమేష్‌బాబు

~

ఇటీవల ఒక ఉదయంపూట తుమ్మేటి రఘోత్తమరెడ్డిగారి ఇంటికి వెళ్లాను. చాన్నాళ్ల తర్వాత ఆయన కరస్పర్శ… స్నేహపూర్వక స్వాగతం పలికింది. ఆత్మీయ పలుకరింపు ఆతిథ్యపు మర్యాదలు చేసింది. ఆయన సామీప్యంలో నా మానసం కొత్త చివుర్లు తొడిగింది. కొన్ని కుశల ప్రశ్నలు. మరికొన్ని తేరిపార పరామర్శించుకునే చూపులు. తదేకంగా ఆయన్ని చూస్తున్నంత సేపు తొలి పరిచయం నాటి గురుతులు… జ్ఞాపకాల దొంతరలు. రెండు దశాబ్ధాల కాలచక్రం తెచ్చిన మార్పులను పోల్చుకునే ప్రయత్నం చేశాను. చెట్టులాంటి మనిషి కనుక ఎదుగుదల సహజమే. నా కనుల గ్రహణశక్తికి హరిత సొబగుల అందమేదో లీలగా మెదిలింది కూడా. అది భ్రమ కాదు కదా అని ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్నని నేను అడగకపోయినా దానికాయన ఆచరణాత్మక శైలితో బదులిచ్చారు.

హైదరాబాద్‌లో కొత్త చిరునామాని చేరుకోవడం కొంత కష్టమే. కానీ రఘోత్తమరెడ్డిగారి విషయంలో ఆ సమస్య రాలేదు. నారపల్లె… నల్లమల్లారెడ్డి కాలేజి రోడ్డులో సుమారు కిలోమీటరు సాగింది ప్రయాణం. రోడ్డుకి కుడివైపున ఎర్రటి సున్నం వేసిన ఇల్లు. మిద్దె మీద ఆకుపచ్చటి కుచ్చుటోపీ. ఆ ఇల్లే ఆ ప్రాంతపు కొండగురుతు. ఎవరికైనా సరే తొలి చూపులోనే ఆకట్టుకనే తీరు. నేను ఆ ఇంట ప్రవేశించగానే మనసు నెమ్మదించింది. వాతావరణంలో చల్లదనం నాలోకి కూడా ప్రవహించింది. ఆ అనుభూతి గొప్ప కథ చదివినప్పుడు కలిగే అనుభూతికి సరిసాటి అనే చెప్పాలి.

రఘోత్తమరెడ్డిగారి నట్టింట కూర్చుని పలహారం తింటూ నలు మూలలూ పరికించాను. అంతటా నిరాడంబరత పరివేష్టించి ఉంది. దరహాస వదనంతో ఎదురుగా ఆయన జీవిత సహచరి రూప. ఆ ఇంట కుటుంబ సభ్యుడిగా మారిపోయిన గూఫీ అనే కుక్క కూడా పరిచితగా మారిపోయింది. ఇల్లు బాగుంది అన్నాను అభినందనపూర్వకంగా. “అప్పుడే ఏమైంది.. ఇంకా చూడాల్సింది చాలా ఉంది” అన్నారు రఘోత్తమ్‌. ఆయనకి ఇష్టమైన పుస్తకాలో, సంగీతం సీడీలో చూపిస్తారనుకున్నాను. రఘోత్తమ్‌ తమ వాకిట్లో మెట్ల దారివైపు నడిచారు. నేను అనుసరించాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటి అంతస్తులోకి చేరుకోగానే అక్కడ అకుపచ్చనిలోకం పలుకరించింది. అదొక చిట్టి వనం. రూఫ్‌ గార్డెన్‌! అందులోనే కూరగాయల పెరడు. పందిళ్లకు పాకిన రకరకాల పాదులు. అక్కడక్కడ పూల మొక్కలు. ఏపుగా పెరిగిన పళ్ల చెట్లు. మధ్యమధ్యలో ఆకుకూరల మడులు. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక అందమైన పార్క్‌. చెట్ల మధ్య కూర్చోవడానికి వీలుగా చిన్న ఏర్పాటు. ఆకర్షణ కోసం పెట్టిన టెర్రకోట బొమ్మల కొలువులు. చూపు ఎటు తిప్పినా చిత్రవర్ణాల కూర్పులు!

raghu1

రఘోత్తమరెడ్డిగారి రూఫ్‌గార్డెన్‌లో జామ, పంపరపనస, బొప్పాయి, సపోటా, సీతాఫలం, బత్తాయి, దానిమ్మ, నిమ్మ వంటి చెట్లను చూస్తే చకితులమైపోతాం. ఆకాశపు నిచ్చెనమెట్లు ఎక్కినట్టుగా కొన్ని చెట్లు నిటారుగా ఎదిగిపోయాయి. నేల విడిచి చేసే సాగులో ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే… రఘోత్తమ్‌ నవ్వారు. చేయాలనుకుంటే సాధ్యంకానిదేముంది అన్న అర్థముంది ఆయన నవ్వులో. రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మొక్కలతో గడుపుతారు. నీరు పెడతారు. వాటిని పరిశీలించి బాగోగులు తెలుసుకుంటారు. ఇదీ ఆయన తన మాటల ద్వారా చెప్పిన దినచర్య. కానీ ఆ క్షణాన నాకు ఆయన “మొక్కల నాడి చూడగల వైద్యుడిలా” అనిపించారు. అంతేకాదు.. ఆ తోట అంతటి హరితశోభని సంతరించుకోవడానికి ఆయన పంచే ప్రేమ కూడా కారణమని అనిపించింది.

మిద్దెపైన రఘోత్తమ్‌ సృష్టించిన ఈ తోట.. ఆయన అభిరుచికి ఆవిష్కరణ. నిజానికి ఈ వర్ణన బట్టి ఇదంతా విశాలమైన జాగాలో పెంచిన తోట అని మీరనుకుంటే పొరపాటే. నారపల్లెలో ఆయనకున్నది సుమారు 170 గజాల స్థలమే. అక్కడే ఇల్లు కట్టుకుని, అందులోనే చిరకాల స్వప్నమైన సాగుపనులు చేసుకోవడం కొంత కష్టతరమే. కానీ రఘోత్తమ్‌ తన ఆలోచనకి పదునుపెట్టి… రూఫ్‌ గార్డెన్‌ ఏర్పాటుతో తన కల నెరవేర్చుకోవచ్చునని భావించారు. ఐదేళ్ల క్రితంనాటి ఆయన పూనికే ఇప్పుడు హరిత సౌందర్యానికి నిలయంగా మారింది. తోటల్లో ఎంత చేవగా పెరుగుతాయో అంతే మిసమిసతో, ఆరోగ్యంతో పెరిగాయి ఈ రూఫ్‌గార్డెన్‌లో చెట్లు, మొక్కలు..!

పాడైపోయిన కూలర్ల కింద ఉండే ఇనుప చట్రాలే కొన్ని మడులకు ఆధారం. శ్లాబ్‌ మీద బండరాళ్లు పేర్చి.. వాటిపై ఇటుకల కూర్పుతో కొన్ని మడులు తయారుచేశారు. వాటిలో మట్టి నింపారు. విత్తు నాటారు. పెద్దపెద్ద కుండీల్లో చెట్లను నాటారు. రెక్కల కష్టంతోనే అన్నీ చేశారు. నీటికి లోటు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించారు. అవసరమైన కాలువలు ఏర్పాటుచేశారు. ఇలా నగరపు నడిమధ్యన రైతుగా మారి సాగుబడితో జీవితానందం పొందుతున్నారు. ఇప్పుడు వారు తమ అవసరాల కోసం కూరగాయలు, ఆకుకూరలు కొనడం లేదు. (దుంప కూరలు ఒక్కటే ప్రస్తుతానికి మినహాయింపు) వారి పంట దిగుబడే ఇంటి అవసరాలకు మించి వస్తోందని చెప్పారు. అప్పుడప్పుడు ఇతరులకూ పంచుతున్నారు. పెరటి మొక్క వైద్యానికీ, కూరకీ కూడా పనికొస్తుందని ఆచరణపూర్వకంగా నిరూపించారు. 30 శాతం వరకూ పళ్లు తమ తోటలోనే పండుతున్నాయట. మరికొన్ని పళ్ల చెట్లు కాపుకి వస్తే.. ఆ లోటు కూడా పూడుతుందని నమ్మకంగా చెప్పారు రఘోత్తమ్‌. ప్రతిచెట్టునీ ఆయన బిడ్డ మాదిరే పరిపోషిస్తున్నారు. ఆ చిట్టి వనాన్ని చూసి మురిసిపోయి పిట్టలు అక్కడక్కడే సందడి చేస్తున్నాయి. సీతాకోకచిలుకలు పూవ్వుపువ్వునీ పలుకరిస్తూ సంబరపడుతున్నాయి. తేనెలూరు ఆ దృశ్యాలు కన్న కనులకి అంతకంటే ఏముంటుంది సార్ధక్యం..!?

ఎడాపెడా పురుగుమందులు వాడటం, కృత్రిమంగా నేల సారాన్ని పెంచాలన్న యావతో యద్ధేచ్చగా ఎరువులు వెదజల్లడం వంటివి రఘోత్తమ్‌కి నచ్చవని ఆయన సాగు పద్ధతిని చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఆహార పంటల వల్ల ఆరోగ్యం ఎంతగా కలుషితమవుతుందో ఆయనకు తెలుసు. గతంలో అనారోగ్య చీడపీడల బారిన పడినవారే ఆయన కూడా. అందుకే ప్రకృతికి చేరువగా ఉండే సహజ సాగుపద్ధతులనే తన రూఫ్‌గార్డెన్‌కి పెట్టుబడిగా మార్చుకున్నారు. ఒక రచన చేసేటప్పుడు ఎంత దీక్ష, ఒడుపు, నిబద్దత, నిజాయితీ పాటించేవారో రూఫ్‌గార్డెన్‌ విషయంలోనూ రఘోత్తమరెడ్డి ఇదే పంథాని అనుసరిస్తున్నారు. ఆయన ముఖంలో తాండవిస్తున్న ప్రశాంతతకీ, ఆ ఇంట పరుచుకున్న చల్లదనానికీ కారణం ఏమిటో నాకప్పుడే బోధపడింది. ఒకానొకనాడు సాహితీ సేద్యం చేసిన ఆయన ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. అంతే తేడా! ఇల్లు పీకి పందిరేసినట్టు అన్న ఎత్తిపొడుపుని తిరగరాసి… ఇల్లు కట్టి, ఆ పైన పందిరి కూడా వేశారు.

raghu2

వ్యవసాయం చేయాలన్న కోరిక రఘోత్తమ్‌కి ఈనాటిది కాదు. చిన్ననాటిది. చదువుకునే రోజుల్లోనే తమ పెరటిలో కూరగాయలు పండించేవారు. అయితే ఆనాడది ఆటవిడపు వ్యాపకం మాత్రమే. హైదరాబాద్‌ వచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత సాగుని పూర్తికాల విధిగా మార్చుకున్నారు. ఇందులో ఉన్న ఆనందం, ఆరోగ్యం మరెక్కడా దొరకదని చెబుతున్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌ వంటి నగరాల్లో వాతావరణం చక్కబడాలంటే… రూఫ్‌గార్డెన్‌ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధన విధిస్తే మేలని రఘోత్తమరెడ్డి సలహా ఇస్తున్నారు. ఆకుపచ్చదనం మనసుని ఆహ్లాదపరుస్తుంది. హరిత సంపదే కాలుష్యానికి నిజమైన విరుగుడుమంత్రం. ఈ సూత్రం కూడా రఘోత్తమ్‌ మాటల్లో అంతర్లయగా ధ్వనించింది.

ఐదేళ్లుగా రూఫ్‌గార్డెన్‌ వ్యవసాయం ద్వారా రఘోత్తమ్‌ మంచి ఉపాధ్యాయుడిలా మారారు. అందులో ఉన్న సాధకబాథకాలను తేలిక మాటల్లోనే ఆయన ఇతరలతో పంచుతున్నారు. ఇలాంటి విషయాలను ప్రోత్సహించే విషయాల్లో మన వ్యవసాయశాఖకి ఆయన వేసింది సున్నా మార్కులే. “మనది వ్యవసాయిక దేశం కదా.. ఇన్నేళ్ల బట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా…? తమ తమ భూముల లక్షణాలను కొలిచే చిన్నపాటి పరికరం కూడా రైతులకు తయారుచేసి ఇవ్వలేకపోయాం..” అని రఘోత్తమ్‌ అన్నారు. నేల సారం కొలిచే పరికరం ఉంటే రైతులకు తమ పొలంలో ఏ పంట వేస్తే మంచిదో గ్రహించగలుగుతారు. తద్వారా అనవసరపు ఖర్చులు, జంజాటాలు, నష్టాలు తప్పుతాయి అన్నది ఆయన భావన. ప్రభుత్వాలు, వ్యవసాయరంగ నిపుణులు తలుచుకుంటే ఇదేమంత కష్టమైన ఆవిష్కరణ కాదు. కానీ తలుచుకోరు అంతే!

తమ ఇంటికొచ్చే మిత్రులు, బంధువులకు తన రూఫ్‌గార్డెన్‌ని చూపిస్తున్నప్పుడు ఆయన ముఖంలో తొంగిచూసే ఆనందం వర్ణనాతీతం. చివరిగా వారి అభిప్రాయం రాయడానికి ఒక నోటుబుక్కు అందిస్తారు. ఆ పుస్తకం పుటలు తెరిస్తే అపురూప స్పందనలెన్నో! గ్రామసీమలు స్వయంపోషకత్వం సాధిస్తేనే దేశం సుభిక్షమవుతుందని పాలకులు చెబుతారు. నిజానికి ఎవరికి వారు కూడా స్వయంపోషకత్వం సాధించాలన్నది ప్రస్తుతం రఘోత్తమ్‌ తన జీవితాచరణ ద్వారా చాటిచెబుతున్న సిద్ధాంతం. “ఎటువంటి ఆహారం భుజిస్తే సుఖ విరేచనం అవుతుందో అదే నీ ఆహారం” అన్న ఆయన మాట కూడా అక్షర సత్యం! నిజానికి రఘోత్తమ్‌గారి ఇంటినీ, సాగునీ దర్శించక ముందు వరకూ నాతో సహా చాలామందికి ఆయన కేవలం సాహిత్యకారుడిగానే సుపరిచితులు. రైతుగా మారిన రఘోత్తమ్‌ని కూడా చూస్తేనే ఆయన సంపూర్ణ వ్యక్తిత్వ దర్శనం అవుతుందేమోనని ఇప్పుడు నాకనిపిస్తోంది.

ఇక రఘోత్తమరెడ్డి సాహిత్య జీవిత విశేషాలకు వస్తే… తెలుగు కథాసాహిత్యం గర్వకారణంగా భావించే విలక్షణ రచయితలలో ఆయనొకరు. పరిచయం అక్కరలేనంత దొడ్డవారు. రాసినవి ఇరవై మూడు కథలు. అందులో పనిపిల్ల కథమీద సుదీర్ఘ చర్చ జరిగింది. నల్లవజ్రం అనే నవలిక రాశారు. కొత్త తరానికి కథలపై మక్కువ పెంచే ప్రయోగంగా “తుమ్మేటి రఘోత్తమరెడ్డి చెప్పిన ఏడు ఆశు కథలు” పేరుతో ఒక డీవీడీ వెలువరించారు. అందులో ఉన్న సెజ్‌ కథ మీదకూడా చర్చోపచర్చలు సాగాయి. అల్లం రాజయ్య, తుమ్మెటి రఘోత్తమరెడ్డి సృజించిన సాహిత్యాన్ని చదువుకుని పెరిగిన ఒక తరం ఉంది తెలుగునాట. వారుగానీ, వీరుగానీ ఒప్పినా ఒప్పకున్నా ఈ మాట నిజం. అంతటి చేవకలిగిన, చేయి తిరిగిన రచయిత ఈ మధ్య ఏమీ రాయడం లేదు. అదీ నా లోపల గూడుకట్టి ఉన్న బెంగ. ఎప్పుడేనా ఆయన ఎదురుపడితే తప్పక అడగాలనుకున్న ప్రశ్న. నిజంగానే ఈ రోజున ఆయన ముందు నేను.. నా ఎదుట ఆయన ఉన్నాం. అయినా అడగటానికి ఎక్కడో నాలో బెరుకు. తోటలో ఆహ్లాదంగా గడిపి వచ్చిన తర్వాత ఆ మహిమ వల్ల కాబోలు- నాలో బెరుకుపోయింది. “ఈ మధ్య ఏమీ రాయడంలేదెందుకు..?” అని అస్త్రం సంధించా.

raghu3మితభాషి కనుక తన తాజా వ్యాసంగం గురించి క్లుప్తంగా వివరించారు. పుస్తక రూపం దాల్చిన ఆ రచనలు నాచేతికిచ్చారు. అవి చూసిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవు. జీవన తరుశాఖల నుంచి ఫలసేకరణ చేస్తున్న వనమాలిలా నా కనులకు కనిపించారు. తన జీవితాన్ని మధించి… వచ్చిన సారాన్ని… మహావాక్యాలుగా తీర్చి సూక్తులు రచిస్తున్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర కోట్స్‌ రచన చేపట్టి… దానిని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. “జీవించు- నేర్చుకో- అందించు” శీర్షికన 2011లో తొలి పుస్తకం విడుదల చేశారు. దరిమిలా రెండవ సంపుటి వెలువడింది. మరో నాలుగు సంపుటాలకు సరిపడా కొటేషన్స్‌ తయారుచేశారు. గత నాలుగేళ్లుగా తొమ్మిదివేలకు పైగా కొటేషన్స్‌ రాశారు. ఆయన నిరాడంబరుడు కావడం వల్ల ఈ ప్రయోగానికి రావాల్సినంత ప్రచారం రాలేదేమో అనిపించింది.

గోదావరిఖని బొగ్గుగనుల్లో కూలీగా చేరి సూపర్‌వైజర్‌ ర్యాంకులో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు రఘోత్తమరెడ్డి. అది కూడా పదమూడేళ్ల సర్వీసు ఉండగానే. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన కొడుకు సీషెల్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం రఘోత్తమ్‌, రూప దంపతులు నారపల్లిలోని సొంత ఇంటిలో సొంత వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో హాయిగా, ఆనందంగా బతుకుతున్నారు. ఉన్న దానితో తృప్తిపడే విశాల మనసు ఉంటే అనవసరపు ఆరాటాలకు తావుండదని నిరూపిస్తున్నారు.

ఆయనని ఉపాధ్యాయుడు అని మధ్యలో ఎందుకు సంబోధించానంటే రఘోత్తమ్‌ మాటల నుంచీ, చేతల నుంచీ నేర్చుకోవలసింది ఎంతో ఉందని తెలియచెప్పడానికే!

*

 

తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయితగా సాహిత్య వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం కూడా ఎంత సౌందర్యవంతంగా, ఈస్టటికల్‌గా చేస్తారో ఈ డాబా (రూఫ్‌గార్డెన్‌) చూస్తే తెలుస్తుంది. ఒక ఎకరంలో ఎంత వైవిధ్యంగా పెంచవచ్చో… ఇంత చిన్న స్థలంలో చేసి చూపిస్తున్నారు… ప్రకృతి వ్యవసాయం…. ప్రకృతితో సహజీవనం… ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేదదీరడం… ఎంత చల్లని నీడో..! ఇందుకు పడే కష్టంలో ఎంత ఆనందం ఉంటుందో అభిరుచి ఉన్నప్పుడే తెలుస్తుంది…
– బి.ఎస్‌. రాములు
(రూఫ్‌ గార్డెన్‌పై స్పందన)

జై భీమ్‌ డ్రమ్‌..రిథమ్ ఆఫ్ బహుజన్స్‌!

ఒమ్మి రమేష్‌బాబు

 

1. ఒక అద్భుతం..

2015 మే 3వ తేదీ రాత్రి. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆర్ట్స్‌ కాలేజీ మైదానం బాగమతి తారామతి ప్రాంగణంగా పేరు మార్చుకుంది. భీమ్‌ డ్రమ్‌ అనే వినూత్న ఆర్కెష్ట్రాకి వేదికగా మారింది. రిథమ్ ఆఫ్ బహుజన్స్‌ అన్నది ఆ కార్యక్రమ ట్యాగ్‌లైన్‌. అదే ఇప్పుడు ప్రత్యామ్నాయ సాంస్కృతిక, రాజకీయాలకు దారిచూపబోతున్న టార్చిలైట్‌.

రిధమ్ ఆఫ్ బహుజన్స్‌ అనేది ఒక కొత్త ప్రకటన. నవీన భావావేశపు వెల్లువ. ఉద్విగ్నభరిత సంబరం. అగ్రకులేతర అసంఖ్యక సమూహాల పాదాల జడి. లబ్‌డబ్‌లబ్‌డబ్‌ చప్పుడుగా మారిన డప్పుల పెనుప్రకంపన. చాతీలో వేడిపుట్టించిన గిటార్ వైబ్రేషన్. కదంతొక్కించిన కీబోర్డ్‌ హోహోహోరు. నరాల తంత్రుల్లోకి చిమ్మిన నల్లని నెత్తుటి కేరింత. ఆ రాత్రి ఆ గానాబజానా దళితం దళితం దళితం అని దళిత శతకోటిని దద్దరిల్లేలా ధ్వనించింది. యువతని దరువేయించింది. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య వంటి మేధావినే హైలయ్యగా మార్చి ఆడీ పాడించింది.

అవును.. ఆ రాత్రి ఓయూ ప్రాంగణం కొత్త ఉద్యమానికి తెరతీసింది. కొత్త అజెండాకి పల్లవిగా మారింది. కొత్త దర్శనానికి చూపుని పదునెక్కింది. ఆ రాత్రి… చీకటి కూడా తన నలుపుని చూసుకుని మరొక్కసారి మనసారా మురిసిపోయింది. నిశి మెరుపుల ఆకాశాన్ని ప్రశంసిస్తూ నేలతల్లి ఉరిమింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక నల్ల తటాకంగా మారారు. వారి మనస్సుల్లో నల్లకలువలు విరబూశాయి. బ్లాక్ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అని ఐలయ్య నినదిస్తే అక్కడ చేరిన గొంతులన్నీ ఏకమై ఆ నినాదాన్ని అందిపుచ్చుకున్నాయి. ఆ రేయి ఒకానొక జాగృదావస్థకి పీఠికగా మారింది.

ఇదంతా 3వ తేదీ సాయంత్రం నుంచి నడి రాత్రి వరకూ సాగిన భీమ్‌ డ్రమ్‌ మహిమ. నలిగంటి శరత్ అనే ఒక బక్కపల్చని కారునల్లాటి యువకుడు చేసిన మాయ. ఉన్నదున్నట్టు చెప్పాలంటే- ఉస్మానియానే “శరత్‌ మానియా”గా మార్చేశాడు. ప్రత్యామ్నాయ సాంస్కృతిక, సామాజిక, విద్యా, రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వాగ్గేయకారులను, అతిథులను, బహుజన నేతలను రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌ కార్యక్రమంలో ఏకం చేశాడు. విభిన్న సంస్థల ప్రతినిధులతోపాటు పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఆర్కెష్ట్రాతో గొంతు కలిపారు. భిన్నత్వం ఉన్నప్పటికీ బహుజనతత్వం ముందు ఐక్యసంఘటన సాధ్యమేనని దీనిద్వారా శరత్‌ నిరూపించాడు. సంఘ పరివర్తన ద్వారా బహుజన రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమే నిజమైన వాగ్గేయకారుడి లక్ష్యం అని ప్రకటించాడు. ఇందుకు స్ఫూర్తినిచ్చేలా డయాస్‌ని డికరేట్‌ చేశాడు. గౌతమ బుద్దుడు, పెరియార్‌ రామస్వామి, జ్యోతిరావ్‌ పూలే, సావిత్రీబాయ్‌ పూలే, అంబేద్కర్‌, కెజీ సత్యమూర్తి అలియాస్‌ శివసాగర్, కాన్షీరామ్‌, మైకేల్ జాక్సన్‌, మారోజు వీరన్న, బెల్లి లలిత తదితర స్ఫూర్తిప్రదాతలు ఫ్లెక్సీ మీద ఆశీనులై ఆద్యంతం ఆ కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయారు.
2 నేపథ్య స్వరం…

ఓయూ క్యాంపస్‌లో జరిగిన భీమ్‌ డ్రమ్‌ని కట్టెకొట్టెతెచ్చే చందంగా చెప్పడం అంటే కుట్రతో సమానం. ఎందుకంటే అది ఒక చారిత్రక సందర్భం. ఒక మార్పుకి సంకేతంగా నిలవబోతున్న నూతన కూర్పు. ఆ కార్యక్రమానికి కర్త కర్మక్రియ నలిగంటి శరత్‌. చాలామందికి ఆ యువరక్తపు నవతేజం పరిచయమే అయినా రెండు ముక్కల్లో మళ్లీ చెప్తాను. నలిగంటి శరత్‌ చమర్‌ అనే ఆ యువకుడు దళిత్‌ బహుజన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ఉద్యమకారుడిగా, రచయితగా బాగా పాపులర్‌ అయ్యాడు. సాంసృతిక సైనికుడి అవతరించాడు. అతనిదొక విలక్షణ స్వరం. మెరిసే నల్లని మేనిచ్ఛాయతో సంధించిన విల్లులా ఉంటుంది రూపం.

ఉస్మానియాలో బీఫ్‌ ఫెస్టివల్‌ జరిగినా, ఇఫ్తార్‌ పాటతో హిందూ- ముస్లింలతో అలాయి బలాయి పాడించినా… అది అతనికే చెల్లింది. ‘బీఫ్‌ ఈజ్‌ సీక్రెట్‌ ఆఫ్‌ మై నాలెడ్జి’ అనే అతని గీతం ఇతర రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. నలిగంటి శరత్‌కి స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది. తన వర్ణం, వర్గం గురించిన స్ఫృహ కూడా కావలసినంత ఉంది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఎంఐఎం శరత్‌కి తమ పార్టీ టిక్కెట్‌ ఇచ్చి అంబర్‌పేట అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అంబర్‌పేట నియోజకవర్గం జనరల్‌ సీటు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పోటీచేసిన స్థానం. నలిగంటి శరత్‌ దళితుడు. అప్పటికి శరత్‌ ఓయూలో పరిశోధక విద్యార్థిగా ఉన్నాడు. ఆ ఎన్నికల్లో కిషన్‌రెడ్డికి చుక్కలు కనిపించిన మాట వాస్తవం. నలిగంటి శరత్‌ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితేనేం… తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. ఇది జరిగిన కొద్ది నెలలకే అంటే గత సెప్టెంబర్‌ మాసంలో శరత్‌ రూముపై దాడి జరిగింది. అతని పుస్తకాలు, బట్టలు, సర్టిఫికెట్లు సహా అన్నింటినీ తగులబెట్టారు. పగలనకా రేయనకా ఎంతో శ్రమపడి పిహెచ్‌డి కోసం అతను తయారుచేసుకున్న రాతప్రతి కూడా ఆ ఘటనలో కాలి బూడిదయ్యింది.

ఈ దుర్మార్గాన్ని ఎవరు చేసి ఉంటారో విడమరిచి చెప్పాల్సిన పని లేదు. శరత్‌ కట్టుబట్టలతో మిగిలాడు. సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగితే.. పిల్లలు కుంగిపోతారు. నిరాశకి గురవుతారు. ధైర్యం కోల్పోతారు. కానీ శరత్‌ నిలబడ్డాడు. అదే క్యాంపస్‌లో నిలబడ్డాడు. భయపడితే బతుకెక్కడ…? అందుకే మరింత బలంగా, మనోనిబ్బరమే శిఖరంగా మారినట్టు నిలబడ్డాడు. అతనికి మేథావులు, అధ్యాపకులు, విద్యార్థులు అండగా నిలిచారు. అప్పుడెప్పుడో జార్జిరెడ్డి… ఇదిగో మళ్లీ ఇప్పుడు శరత్‌ అనిపించుకున్నాడు. (జార్జిరెడ్డిని భౌతికంగా అంతం చేయగలిగారు కానీ అతని భావాలను మాత్రం అంతంచేయలేకపోయారు) అతనికి చెడు చేయాలనుకున్న వారు మాత్రం కలుగుల్లో దాక్కున్నారు. భీమ్‌ డ్రమ్‌ కార్యక్రమం ద్వారా శరత్‌ తన శక్తి ఏమిటో చాటుకున్నాడు. దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం, మహిళల రాజకీయాధికార లక్ష్య ప్రకటన చేశాడు. దాని సాంస్కృతిక అభివ్యక్తే భీమ్‌ డ్రమ్‌..!

sarat1

3. దళిత సాంస్కృతిక దర్శనం

భీమ్‌ డ్రమ్‌ ఒక విలక్షణ ప్రయోగం. అభ్యుదయ, విప్లవ, జానపద, తాత్వగీత, కవ్వాలీ రాగాల సమ్మేళనం. బహుభాషలలో సాగిన స్వరమాలిక. ఈ సందర్భంగా పాడిన పాటలు, ఆలపించిన రాగాలు, దరువుకి తగ్గట్టుగా విద్యార్థి బృందం లయబద్ధంగా వేసిన అడుగులు… ఒకదానికొకటి చేర్పుగా ఒక కూర్పుగా మారాయి. మరొక్కసారి మరొక్క పాట అని అడిగిమరీ పాడించుకున్నారు ఆహూతుల చేత. బీఫ్‌ యేంతమ్‌, బఫెల్లో సోల్జర్‌ గీతాలు “రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌” కాన్సెప్టుని ప్రతిఫలించాయి. గొడ్డు మాంసం తిన్న బుద్ధుడు, జీసస్‌, ఐన్‌స్టీన్‌, కారల్‌ మార్క్స్‌, అంబేద్కర్‌లే ఈ ప్రపంచాన్ని మార్చగలిగారనీ, వారే తమకు ఆదర్శప్రాయులనీ కంచ ఐలయ్య ఈ వేదిక మీదనుంచి విస్పష్ట ప్రకటన చేశారు.

అక్షరాలు ఉన్న చోట ఆలయాలా అని హేళనగా ప్రశ్నించారు. ఇకపై దళిత, బహుజనుల కళాకారులు నిండు వస్త్రధారణతోనే ప్రదర్శనలు ఇవ్వాలని ఐలయ్య పిలుపునిచ్చారు. ఇంగ్లీష్‌ చదువుల అభ్యాసం, దేశ విముక్తి అనే లక్ష్యం తమ ముందున్న కర్తవ్యాలని చెప్పారు. ఫ్యూడల్‌, మతోన్మాదశక్తులను ఎదుర్కొంటూ ఈ ఆశయ సాధన కోసం పునరంకితమవుతామని అన్నారు. ఉత్పత్తి కులాలు ఏకమైతే అధికారం తమదే అన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కొద్ది మాటలు కూడా ఆటపాటల మధ్య ఆటవిడుపుగా చెప్పినవే. ప్రధాన వక్తలుగా వచ్చిన కొద్దిమంది మినహా మిగతా అందరూ పాటలతోనే తాము చెప్పదలుచుకున్నది చెప్పారు.

భీమ్‌ డ్రమ్‌ జరుగుతుందని తెలిసి… ఇందులో పాల్గొనడానికి పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా వచ్చారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి నుంచి మార్పు కళామండలి వ్యవస్థాపకులు ప్రత్యేకంగా విచ్చేసి అంబేద్కర్‌, ఫులేలపై పాటలు పాడారు. తన పాటతో అంబేద్కర్‌ని జయరాజ్‌ అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న మరోసారి దళిత చిందేశాడు. భీమ్‌ డ్రమ్‌ ఈవెంట్‌ కోసమే కామ్రేడ్‌ మిత్ర రాసిన గీతాన్ని విమలక్క బృందం గానం చేసింది. ధీమ్‌ సాంగ్‌గా స్కైబాబా రాసిన కవ్వాలీ ఓయూ క్యాంపస్‌లో అలాయి బలాయిని మళ్లీ ఆడించింది. భీమ్‌ బోలోరె మీమ్‌ కొ లేకే మీమ్‌ బోలోరె భీమ్‌ || భీమ్‌ || ఖాందా మిలాలే – దిల్‌ సె లగాలే || ఖాందా || బోలోరె బోలో భీమ్‌ భీమ్‌ భీమ్‌ || అంటూ సాగిన ఆ గీతానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ కోరస్‌ ఇచ్చారు. జిలుకర శ్రీనివాస్‌, కోట శ్రీనివాసగౌడ్‌, పసునూరి రవీందర్‌, గుర్రం సీతారాములు,సూరేపల్లి సుజాత వంటి దళిత థింకర్స్‌, రైటర్స్‌ కార్యక్రమంలో హుషారుగా పాల్గొని ఊపునిచ్చారు. కొత్త చూపుని అందించారు.

ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే… ఓయూ సాక్షిగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇంతటితో ఆగబోవడం లేదు. ఇదే తరహా కార్యక్రమాలను తెలంగాణలోను, ఇతర రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల్లో కూడా నిర్వహించాలని నలిగంటి శరత్‌ ప్రభృతుల ఆలోచన. విద్యార్థి, యువజనుల ముందు తమ ప్రణాళికను ఉంచాలనీ, కవిగాయక బృందాలను కదిలించి రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌లో కలుపుకు రావాలనీ వారి తాపత్రయం. తదనంతర కాలంలో దీనినొక రాజకీయ అభివ్యక్తిగా తీర్చిదిద్దాలన్నది వారి సంకల్పం. శరత్‌ అనే మొండిఘటానికి, ఐలయ్య అనే జగమెరిగిన దళిత మేధావి తోడవడంతో సమీప భవిష్యత్‌లోనే ఇందుకు వారు ఉద్యుక్తులు అవుతారన్న నమ్మకం కలుగుతోంది. ఇదీ మొత్తంగా భీమ్‌ డ్రమ్‌ అనే సాంస్కృతిక మహాప్రదర్శన తాలూకు అంతస్సారం…!

2009లో ఉస్మానియా విద్యార్థుల గర్జన తెలంగాణ ఉద్యమాన్ని ఏ మలుపు తిప్పిందో చూశాం. 2015 మే 3న కూడా ఉస్మానియాలో రిథమ్‌ ఆప్‌ బహుజన్స్‌ పేరుతో విద్యార్థులు గర్జించారు. దీన పరిణామ ప్రభావాలను ముందు రోజుల్లో చూడబోతాం.

*

చరిత్రకి దర్పణం “కొల్లేటి జాడలు”

kolletiకొల్లేరు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొల్లేటి సమస్య మెడకి చుట్టుకున్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో నివసించేవారికి “కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గించి.. మిగిలిన భూముల్లో మీకే పట్టాలు ఇస్తాం” అని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. తీరా ఇప్పుడు పరిస్థితి రివర్స్‌ అయ్యేలా ఉంది.

ఎందుకంటే… కొల్లేరు అభయారణ్యం పరిరక్షణకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సుప్రీం కోర్టు నుంచి రాష్ట్ర పెద్దలకు నోటీసులు అందాయి. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. నిజానికి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే సావధానంగా ఆలోచిస్తే, చిత్తశుద్ధి ఉంటే ఎంచక్కా దొరుకుతుంది. కానీ అంత ఓపిక, తీరిక, సహనం పాలకులకు ఉండటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూస్తే అక్కినేని కుటుంబరావు తాజా నవల “కొల్లేటి జాడలు”కి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నవల గురించి మాట్లాడుకోవడం సందర్భోచితం కూడా..!

ప్రకృతిని నమ్ముకుంటే మనిషికి మనుగడ సమస్య రాదు. కానీ, అదే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే, విధ్వంస పోకడలతో పర్యావరణాన్ని నాశనం చేస్తే మాత్రం కష్టాలు తప్పవు. అక్కినేని కుటుంబరావు “కొల్లేటి జాడలు” నవల సారాంశం ఇదే. పైకి సింపుల్‌గా అనిపిస్తున్న ఈ విషయాన్ని అర్థంచేయించడం అంత తేలిక కాదు. క్లిష్టమైన ఈ కసరత్తుని సునాయాసంగా చేస్తూ పాఠకులకు ఈ ఎరుక కలిగించగలిగారు రచయిత.

ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉన్న ఆ సరస్సు చుట్టూ వందలాది లంక గ్రామాలు.. అందులో నివసించే లక్షలాది ప్రజలు.. ఇదీ కొల్లేటి సరస్సు నిజ స్వరూపం! మరి, ఆరు దశాబ్దాల క్రితపు రోజుల్లో కొల్లేరు ఎలా ఉండేది..? అక్కడి జీవకళ ఏ తీరుగా ఉట్టిపడేది..? లంకగ్రామాల ప్రజలు ఎలా బతికారు..? వారి వృత్తులు, జీవనాధారాలు ఏమిటి? కొల్లేటితో, అక్కడి ప్రజలు ఎలాంటి సాంగత్యం కలిగి ఉండేవారు? ఆ జీవనచిత్రం ఇచ్చిన సందేశం ఏమిటి..? అన్న విషయాలు విపులంగా తెలుసుకోవాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొల్లేటి జాడలు నవల చదువుకోవడం ఉత్తమం. ఈ నవల చదువుతున్నంతసేపు పాఠకులు కొల్లేటి యాత్ర చేస్తారు. అక్కడి గతంలోకి జారుకుంటారు. తలమున్కలవుతారు. నవల ముగిసే సరికి చిక్కిశల్యమవుతున్న కొల్లేటి సరస్సు వర్తమానస్థితిని తలుచుకుని నిట్టూర్పు విడుస్తారు. ఇదీ ఈ నవల ద్వారా అక్కినేని కుటుంబరావు సాధించిన పరమార్థం.

akkineni kutumba rao

శ్రీనివాసరావు, రాధాకృష్ణలనే రెండు పాత్రల ద్వారా పాఠకులను కొల్లేటి తీరంలోకి ప్రవేశపెడతారు కుటుంబరావు. వారిద్దరూ అరవయ్యేళ్లు పైబడినవారు. చిన్నప్పుడు అక్కడి లంకల్లో పెరిగి పెద్దయి వేరే ప్రాంతాలలో స్థిరపడిన వారిద్దరూ తిరిగి కొల్లేటి ఒడ్డును దర్శించుకుని… అక్కడి పరిస్థితిని చూసి చిన్నబోతారు… బాధపడతారు. తమ బాల్యస్మృతులలోకి జారుకుంటారు. ఆ స్పందనల పరంపరే ఆసాంతం నవలలో ప్రతిఫలిస్తుంది.. ఒక్కసారి ఆ లోకంలోకి ప్రవేశించాక.. ఒక తేరుకోవడం సులువు కాదు. సహజసిద్ధమైన పరవళ్లతో అలరించే కొల్లేరు… అందులోని జీవరాశి…అక్కడి జీవన సరాగాలు… వలస పక్షుల గానాలు.. కొల్లేటి లంకల్లోని బతుకు లయలు నిలువెల్లా అల్లుకుపోతాయి. ఎంతగా ఈ నవల మనల్ని సంలీనం చేసుకుంటుందంటే.. చదువుతున్నంత సేపు కొల్లేటి తరంగాలు మనసు నిండా ముసురుకుంటాయి.

శ్రీనివాసరావు, రాధాకృష్ణలతో మొదలైన ఈ కథలో తర్వాత్తర్వాత పదులకొలదీ పాత్రలు పలుకరిస్తాయి. వాటి ద్వారా వందలాది తలపోతలు సంగమిస్తాయి.  అందులో కులమతాల రంగులంటాయి. కలుపుగోరు కబుర్లుంటాయి. వెలివేతల గాయాలుంటాయి. ఊరుమ్మడి కథలుంటాయి. అమాయక పిల్లల ఆటపాటలుంటాయి. పెత్తనాలు చేసే పెత్తందారులు, ఔదార్యం చూపే పెద్దమనుషులు ఉంటారు. కష్టాలు ఇష్టాల కలనేతగా వారి బతుకులు సాగిపోతుంటాయి. ఇలా రకరకాల పాయలుగా ఉన్నవారికి, భిన్న సమూహాలుగా ఉన్నవారికి సాగరాన్ని తలపించే కొల్లేరే పెన్నిధి. అదే వారి భుక్తికి ఆధారం. అక్కడే పంటలు పండిస్తారు. అక్కడే చేపలు పడతారు. అక్కడ మేత మేసి పశువులు జీవిస్తాయి. సాగినంతకాలం ఆ చల్లని తల్లిని నమ్ముకుని సుఖంగా, సంతుష్టిగా బతికేస్తారు. సాధరణ రోజుల్లో ఇదీ కొల్లేటి వాసుల ఆనాటి బతుకు చిత్రం.

అబ్బు! ఎంత హాయో కదా ఇలాంటి జీవితం అనుకుని సంబరపడకనక్కర లేదు. ఎందుకంటే… అప్పుడప్పుడూ కొల్లేరు ఉగ్రరూపం దాలుస్తుంది. వానలు, వరదలు ముంచుకొచ్చి… కొల్లేటి లంకలు జలదిగ్బంధానికి గురవుతాయి. అలాంటి సమయంలో అక్కడి ప్రజల కడగండ్లు చెప్పతరం కాదు. చేతికి అంది వస్తుందనుకున్న పంటని కొల్లేరు తన గర్భంలో కలిపేసుకుంటుంది. ప్రజలకి నిద్రాహారాలు లేకుండా చేస్తుంది. బతుకు తెరువుకి భరోసా దొరకదు. అయినా సరే కొల్లేటి వాసులు నిబ్బరం కోల్పోరు. ఆ విపత్తు తగ్గుముఖం పట్టగానే ఆ కొల్లేటి తల్లికి ఓ దండం పెట్టి మళ్లీ దైనందిన జీవితంలోకి అడుగుపెడతారు. ఇదీ సాధారణంగా అక్కడి ప్రజల అనుభవంలో మరో పార్వ్శం.

మనిషి ప్రకృతిశక్తి ఎదుర్కొంటూ సహజీవనం చేసే అద్భుత సాహస కృత్యమే కొల్లేటి లంకల్లోని జీవితమని ఈ నవల ద్వారా చెప్పుకొచ్చారు అక్కినేని కుటుంబరావు. ఇచ్చే శక్తితోపాటు తీసుకునే శక్తి కూడా ఒక సహజ వనరుకి ఉంటుందన్న ప్రకృతి ధర్మాన్ని సుబోధకంగా తెలియజేశారు. ఈ సహజ సూత్రంలో ఎక్కడ సమతౌల్యం లోపించినా అది మొదట ప్రకృతి మీద… ఆ తర్వాత మనిషి మనుగడ మీద ప్రభావం చూపుతుంది. ఈ చారిత్రక దృక్పథం లోపించిన స్వార్థపర శక్తుల చర్యలు కొల్లేటి జీవలయని ఎలా ధ్వంసం చేస్తూవచ్చాయో ఈ నవల చివరి అంకంలో ఆవిష్కరించారు రచయిత. తొలినాళ్లలో తమకు ఎన్ని కష్టాలు వచ్చినా కొల్లేరునే నమ్ముకుని బతుకు తెరువు సాగించారు అక్కడి లంకగ్రామాల ప్రజలు. అయితే అదంతా గతం. ప్రస్తుత పరిస్థితి వేరు. వర్తమాన సందర్భంలో మనుషులకి నిగ్రహం లేదు.

సొంత లాభం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చెట్టూ పుట్టా చెరువులు సరస్సులు అనే విచక్షణ లేకుండా ధ్వంసం చేస్తున్నారు. వ్యాపార, లాభాపేక్షల కోసం పచ్చని కొల్లేటిలో చేపల చెరువుల పేరిట చిచ్చుపెట్టారు. సహజ మత్స్య సంపదకి నిలయమైన కొల్లేటి ఒడ్డునే చెరువులు తవ్వి… చేపల పెంపకం చేపట్టడం అనే వికృత చర్యలను ఏమనాలి చెప్పండి..? ఏది జరగకూడదో అదే జరిగింది. చేపల అధిక దిగుబడుల కోసం మందులు- మాకులు వాడి నీటిని కలుషితం చేశారు. సహజ మంచినీటి సరస్సు అయిన కొల్లేటికే చేటు తెచ్చారు. ఈ విపరిణామానికి తోడు మరోవైపు కొల్లేటి అభయారణ్యం చాలా మేరకు ఆక్రమణలకు గురైంది. ఫలితంగా సరస్సు పరిధి కుంచించుకుపోయింది. ఈ మొత్తం పరిస్థితికి కొల్లేటి జాడలు నవల అద్దంపట్టింది. ఇక ప్రస్తుతంలోకి వస్తే ఇప్పుడు కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గించి.. ఆక్రమణలకు గురైన ప్రాంతంలో ఇళ్లపట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌ స్థానికుల నుంచి వినిపిస్తోంది. రాజకీయలబ్ది కోసం కొందరు నాయకులు ఆ డిమాండ్‌ని సమర్థించడంతో సమస్య మరీ జటిలంగా మారింది. ఇదీ ప్రస్తుతం కొల్లేటి తాజా చిక్కుముడి.

ఈ సమస్యకు పరిష్కారం దొరకడం కొంత కష్టమే కావచ్చు కానీ… అక్కినేని కుటుంబరావు తన నవలలో ఓ ప్రతిపాదన చేశారు. ప్రకృతి ప్రసాదితమైన కొల్లేరుకి ఏ హాని కలుగకుండానే… దానిపై ఆధారపడి ఎలా బతకవచ్చునో వివరించారు. అట్లూరి పిచ్చేశ్వరరావు పాత్ర ద్వారా చెప్పించిన అంశం అదే. కొల్లేటిలో సమష్టి వ్యవసాయం చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునన్నదే ఆ ప్రతిపాదన. నిజంగా జరిగిందో…. కల్పనో తెలీదు కానీ…అది నిజంగానే కొల్లేటి కాపురాలను నిలబెట్టగలిగే గొప్ప ఆలోచన.

దానికి అధికారికమైన ఒక కట్టడి లేకపోబట్టి… కొనసాగలేదేమో అనిపించేలా నవలలో ఆ ప్రయోగం ముగిసింది. కానీ ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకుని చూస్తే కొల్లేటి సమస్యని తీర్చగలిగే ఉపాయం మాత్రం తప్పక దొరుకుతుందని ఈ నవల ద్వారా అక్కినేని కుటుంబరావు సూచించారు. అంటే అదే తరహా ప్రయోగం ఇప్పుడు చేపట్టమని అర్థం కాదు. ఉభయ కుశలోపరిగా ఉండే ఆలోచన చేస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుందన్నదే రచయిత ఉద్దేశం కావచ్చు. మొత్తంగా చెప్పాలంటే.. అక్కినేని కుటుంబరావు రాసిన కొల్లేటి జాడలు నవల… ఆ ప్రక్రియా పరిధిని అధిగమించి ఒక హిస్టారికల్‌ డాక్యుమెంట్‌గా కూడా కనిపిస్తోంది.

(నవల: కొల్లేటి జాడలు
రచయిత: అక్కినేని కుటుంబరావు
వెల: 100 రూపాయలు
నవోదయ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, కినిగె
పుస్తకాల షాపులలో ప్రతులు లభిస్తాయి)

– ఒమ్మి రమేష్‌బాబు