ఒక విషాద ప్రదోష  రూపకం!

“చెమటచుక్క నేల రాలకుండా డబ్బులె ట్టొస్తయ్యిరా?”

నమ్ముకొన్న సేద్యం చట్టుబండలై చేసిన అప్పులు మెడకు గుదిబండలై వుమ్మడి కుటుంబం విచ్ఛిన్నమై తమవాటా పొలం తెగనమ్ముకొని బతుకు తెరువు కోసం పల్లె నుంచి పట్నానికి వలస వచ్చి కొత్త వంచనల వూబిలో కూరుకుపోయిన నిస్సహాయురాలైన వొక  స్త్రీ సంధించిన ప్రశ్న యిది.

సాహిత్యంలో  వాస్తవికత , సామాజిక వాస్తవికత వంటి పదాలు మన నోళ్ళలో బాగా నలిగిన పదాలే అయినప్పటికీ వాటిని లోతుగా అర్థం చేసుకొన్న రచయితల సంఖ్యతక్కువ. చాలామంది సమాజంలో చోటుచేసుకొన్న మార్పుల్ని యథాతథంగా చిత్రించడం దగ్గరే ఆగిపోతున్నారు. సమాజంలో భిన్నసమూహాల మధ్య యేర్పడుతోన్న/మృగ్యమౌతోన్న మానవసంబధాల్నిశాసించే శక్తుల్ని , సమాజ చలన సూత్రాల్ని కొద్దిమంది రచయితలు మాత్రమే సాహిత్యంలో ఆవిష్కరించగల్గుతున్నారు. తమచుట్టూ వేగంగా చోటుచేసుకొనే మార్పుకి కారణాలు తెలుసుకొనే లోపు దిగ్భ్రమకు గురిచేసే మరో మార్పు సంభవిస్తోంది. ఆ దిగ్భ్రమ నుంచి బయటపడవేసి మార్గదర్శనం చేయించగల సమ్యగ్ దృక్పథాలకు రచయితలు ఆమడ దూరంలో నిల్చుంటున్నారు. ఒక దృక్పథం కల్గి వుండటమే  సాహిత్యనేరం అన్న ఆధునికోత్తరవాదాలకు  లోబడి రచయితలు గందరగోళానికి గురౌతున్నారు. దృక్పథరాహిత్యాన్ని స్వేచ్ఛగా భ్రమింపజేయడంలో ఈ వాదాలు కొంత మేరకు సఫలమయ్యాయి. అటువంటి సందర్భంలో ప్రజాస్వామిక సంస్కృతితో కూడిన ఒక ప్రాపంచిక దృక్పథానికి నిబద్ధుడై సాహిత్య సృజన చేస్తోన్న రచయిత మంచికంటి.

ఇన్నాళ్ళూ తానూ నమ్మిన భావజాలాన్ని కవితద్వారా కథద్వారా మనతో పంచుకొన్న మంచికంటి యిదిగో యీ నవలతో రంగమ్మ వేసిన ప్రశ్నగా మనముందు నిలబడ్డాడు. ప్రశ్న చిన్నదే. సమాధానం అంత తేలికయిందేమీ కాదు. అదొక ‘చిదంబర రహస్యం’. రాత్రులకు రాత్రులే కోట్లకు పడగలెత్తే కార్పోరేట్ బడా బాబులకే తెలుసు ( అది అంబానీలు కావొచ్చు; జిందాళ్ళు కావొచ్చు; నిమ్మగడ్డ , రామోజీలు కావొచ్చు ). వీళ్ళే పాలకవర్గ రాజకీయాల్ని శాసిస్తున్నారు. క్విడ్ ప్రో కో లకు వూపిరిపోస్తున్నారు. దేశసంపదని సొంతం చేసుకొని బయటకు తరలిస్తున్నారు. బయట నుంచి  తెచ్చిన రుణాల్ని వుదారంగా పంచుకొంటున్నారు.

పోయిన శతాబ్ది చివరి దశకంలో మొదలైన వుదార ఆర్ధిక విధానం వుత్పత్తితో సంబంధంలేని ఆర్ధిక వ్యవస్థని బలోపేతం చేసింది. గ్లోబలీకరణ పేరుతొ దేశ సార్వభౌమత్వాన్ని వశపర్చుకొన్న సామ్రాజ్యవాదానికి జాతీయ బూర్జువా దళారిగా రూపొందింది. సాంప్రదాయిక పెట్టుబడీదారి వ్యవస్థ స్థానే ‘సేవారంగం’ బహుముఖాలతో ముందుకొచ్చింది.  దోపిడి రూపం మారింది. వ్యవసాయ – పారిశ్రామిక కార్మికుల ప్రత్యక్ష శ్రమతో సంబంధంలేని బ్యాంకింగ్ , ఇన్సూరెన్స్,   షేర్ మా ర్కెట్  వంటి రంగాలే ప్రధాన ఆర్ధిక వ్యవస్థ అని మేధావుల్ని సైతం భ్రమ పెట్టే స్థాయికి దేశీయ పెట్టుబడిదారులు దిగజారారు. వారికి తాబేదార్లైన పాలకులు అంతర్జాతీయ మార్కెట్ కి తలుపులు బార్లా తెరిచారు.ఇదే అదనుగా బహుళ జాతి కంపెనీలు దేశంలోని వుత్పత్తి – వుపాధి రంగాల్ని హస్తగతం చేసుకొన్నాయి. దీని ప్రభావం కేవలం నగరాలకూ పారిశ్రామికోత్పత్తులకూ పరిమితం కాలేదు. పల్లెల్లోకి సైతం పెట్టుబడులు ప్రవేశించాయి. విత్తనాలు, యెరువులు , పురుగు మందులు … అన్నీ యమ్మెన్సీల అధీనంలోనే వుండటంవల్ల వ్యవసాయం పెనుముప్పుని  యెదుర్కొంటుంది.  రైతుకు  సేద్యం బరువైంది.  వ్యవసాయ భూములు వ్యాపారపు సరుకయ్యాయి. భూమి పైనా  లోపలా వున్న ప్రకృతి సంపద పరాధీనమైంది. ఈ వ్యవహారామంతటికీ ముద్దుపేరు అభివృద్ధి. పాలకుల అవినీతి అభివృద్ధి ముసుగు తొడుక్కొంది. సమాజలోని అన్ని రంగాలనీ నాశనం చేసే ఈ విపత్తుని యెదిరించి నిలవరించి పోరాడే శక్తులకు నాయకత్వం వహించాల్సిన కార్మిక వర్గం ట్రేడ్ యూనియనిజానికి పరిమితమైంది. సమస్త అస్తిత్వాల్నీ కోల్పోతున్న బడుగు జీవులు బతికే హాక్కు కోసం చేసే పోరాటాలు పాశవికమైన అణచివేతకు గురవుతున్నాయి.

ఇదంతా వొక విషాద ప్రదోష రూపకం. ఈ విధ్వంసాల చీకటిని చూసి దృశ్యమానం చేయడానికి ముందువరసలో నిలబడ్డ రచయితల్లో మంచికంటి వొకడు. ఈ నవల్లో రంగమ్మ ముఖత: లేవనెత్తిన వొక్క ప్రశ్న ద్వారా రచయిత  దేశంలో పకడ్బందీగా అమలవుతోన్న వ్యవస్థీ కృత దౌష్ట్యం లోతుల్లోకి దృష్టి సారించేలా చేస్తున్నాడు. తన ప్రాంత ప్రజల మధ్య వుంటూ తన పల్లె మూలాల్ని కాపాడుకొంటూ జీవితాల్ని అతలాకుతలం చేస్తోన్న ఆధునిక ఆర్ధిక దోపిడీల స్వభావాన్ని బహిర్గతం చేయడానికి అతను సాహిత్యాన్ని వొక సాధనంగా యెన్నుకొన్నాడు.

ఒంగోలు పల్లె పట్టులు  మంచికంటి సాహిత్య – సామాజిక కార్య క్షేత్రాలు. మట్టిని తొలుచుకు వచ్చిన ఆ ప్రాంతపు మనుషులే అతని రచనలకు జీవం పోస్తారు. వారి నిత్య జీవిత సంఘర్షణే అతని సాహిత్యానికి ప్రధాన వనరు. విచ్ఛిన్నమౌతోన్న గ్రామీణ వ్యవస్థ , తలకు మించిన మదుపులతో కునారిల్లుతోన్న వ్యవసాయం , అప్పుల పాలైన రైతుల ఆత్మహత్యలు , బతుకులు బుగ్గై కొంపా గూడూ వొదులుకొని దగ్గర్లోని పట్టణానికో నగరానికో వలసపోయే రైతు కూలీల దుర్భర దారిద్ర్యం , కొత్త జీవనోపాధుల్లో , పరిసరాల్లో యిమిడే నేర్పు లేక వారనుభవించే మానసిక వేదన , పట్టణారణ్యంలో దారితప్పి క్రూరమృగాల బారిన పడే నిస్సహాయత – వీటన్నిటికీ మంచికంటి ప్రత్యక్ష సాక్షి. తాను విన్న కన్న స్వయంగా అనుభవించిన వాటి ద్వారా యేర్పరచుకొన్న ప్రాపంచిక దృక్పథం నుంచి ఆ కల్లోలాన్ని వొక సృజనాత్మక రచయితగానే గాక వొక సామాజిక శాస్తవేత్తగా కూడా మంచికంటి వ్యాఖ్యానిస్తాడు , విశ్లేషిస్తాడు. ఒంగోలు ప్రాంత నిర్దిష్టతలోంచి వచ్చినప్పటికీ అతని రచనల్ని ప్రపంచీకరణ నేపథ్యంలోంచే చూడాలి. ప్రపచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రతిఫలనాలు , ప్రకంపనలు స్థానీయ జన జీవితాల్ని అస్తవ్యస్తం చేసిన వైనాన్ని మంచికంటి అద్భుతంగా పట్టుకొన్నాడు. కథల్లో కంటే అది నవల్లో విస్తృతమైన కాన్వాస్ మీద ఆవిష్కారమైంది.

2005 లో అనుకొంటా –  తానా నవలల పోటీకి ‘గబ్బ గీము’ పేరుతొ వచ్చిన యీ నవలని నేను తొలిసారి చదివా. ముందుగా నన్ను కట్టిపడేసింది అందులోని భాష. తర్వాత నవలా నిర్వహణకి రచయిత యెన్నుకొన్నశిల్పం. బహుమతికి అర్హమైన  నవలని యెంపిక చేయడంలో బాధ్యులుగా అంపశయ్య నవీన్ కీ నాకూ మధ్య యీ నవలలోని భాషా శిల్పాలపైనే ప్రధానమైన చర్చ జరిగినట్టు జ్ఞాపకం( ఆ తర్వాత ‘చీకటి వలయాలు’ పేరుతొ యీ నవల చతురలో ప్రచురితమైంది).  ఒంగోలు – కర్నూలు రోడ్డు మీద పట్టణవిస్తరణలో కల్సిపోయిన పల్లె కాని పల్లె పేర్నమిట్టలో పాక హోటలు నడుపుకొనే రంగమ్మ అనే గ్రామీణస్త్రీ జీవితాన్ని బొమ్మకట్టించే క్రమంలో మూడుతరాల సామాజిక చరిత్రని రికార్డు చేయడం మంచికంటి ఈ నవల రాయడంలో ప్రధానలక్ష్యం కావొచ్చు; కానీ ఆ చరిత్ర అంత కష్టభూయిష్టంగానూ దు:ఖభాజనంగానూ వుండటానికి కారణాలేంటని అంతస్సూత్రంగా ప్రశ్నించడం నవల అంతటా  కనిపిస్తుంది. పుట్టినింట మెట్టినింట రంగమ్మ అనుభవించిన సుఖదు:ఖాల  వెనక – ఆమె జీవితాన్ని ఆ విధంగా నడిపించిన దృశ్యాదృశ్య శక్తుల అన్వేషణవైపు ఆలోచించేలా చేయడం మరో ఎత్తుగడగా అనిపించించింది.

రంగమ్మ పుట్టినింటి కంటే మెట్టినిల్లు అన్నివిధాలా మెరుగైందే. కానీ పల్లెల్లో ఎన్నో కుటుంబాల్లగానే ఆమె వుమ్మడికుటుంబం కూడా విచ్ఛిన్నమైంది. అయితే పచ్చికుండలా ఆ కుటుంబం అలా విచ్చిపోడానికి నిర్దిష్టమైన భౌతిక కారణాలున్నాయి. రొయ్యలచెరువులు ‘కమ్మని వొరి పండే పొలాల్ని నాశనం చేసాయి’. పచ్చని కాపురాల్ని కూలదోశాయి.  ఇంటిపట్టునుండి చిన్నదో చితకదో వుద్యోగం చేస్తూ వున్నకమతం చూసుకోనేవాళ్ళు – గ్రానైట్ తవ్వకల్లోకి దిగారు. ఆహార ధాన్యాల పంటలు తగ్గి పొగాకు పత్తి వంటి వ్యాపార పంటలు వ్యవసాయంలో పెట్టుబడుల్ని విపరీతంగా పెంచేశాయి. నకిలీ విత్తనాలూ పురుగుమందులూ కల్తీ యెరువులూ యేదీ రైతు చేతిలో లేకుండా పోయింది.ఆఖరికి నేలలో వేయాల్సిన పంటని కూడా యెవరో యెక్కడనుంచో తెలియకుండానే నిర్దేశిస్తారు. పండిన పంటకి సరైన ధర వుండదు.ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయం జూదమయ్యకా – నడ్డి విరిగిన రైతులకు పురుగు మందులు చావుకే వుపయోగపడతాయి. చేసిన అప్పులు పీకలమీదకొచ్చి అయినకాడికి పొలాలమ్ముకొని రైతు రోజువారీ కూలీగా మారతాడు. రంగమ్మ కుటుంబంలో జరిగిన ఈ హింస సమాజం అంతటా చోటుచేసుకొన్నదే.

ఓడిపోయిన జీవితాన్ని గెలవాలనే పట్టుదలతో పట్టణానికి ‘వలస’ పోయి – అక్కడ దిక్కులేని బతుకు బతకాల్సి వస్తుంది. ‘ఉండూళ్ళో పస్తులుండా నలుగురు మనోళ్ళ మధ్యన ఉండామన్న ధైర్యమన్నా ఉండేది. ఈడ చచ్చేమా బతికేమా అని విచారించేవాళ్ళు కూడా లేకపోతిరి.’   పట్టణ జీవితంలోని సంక్లిష్టతని అర్థం చేసుకొనే లోపే అన్ని విధాలా పతనం కావడం సంభవిస్తుంది.

శ్రమతో సంబంధంలేని డబ్బు చలనం పట్టణంలో ఎక్కువ. విపణి సంస్కృతి , యీజీ మనీ వెంపర్లాట , అవసరంలేని ఆడంబరాలు , కొత్త వ్యసనాలు – వెరసి  నాగరికత మనిషిని పణ్య వస్తువుని చేస్తుంది. అన్ని విలువల్నీ మింగేస్తుంది. అప్పులూ  వడ్డీలపై వడ్డీలు రోజువారీ వడ్డీలూ చిట్టీలూ మైక్రో ఫైనాన్స్ లూ షేర్ బ్యాంక్ లూ పొదుపు సంఘాలూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులూ పుట్టింటి పట్టుచీరా – మా ఇంటికిరా చెల్లీ స్కీం లూ గోల్డ్ గేట్లూ పీర్ లెస్ లూ బాండ్ లూ – ఇదంతా వొక విషవలయం( ఒక్క ఒంగోల్లోనే 500 ఫైనాన్స్ కంపెనీలు వున్నట్లు నవల్లోనే ఒక చోట రచయిత పేర్కొంటాడు ) .  వలపన్నే వేటగాళ్ళ దోపిడీ బహుముఖాలుగా సాగుతుంది. ఒకప్పుడు  ‘ ఫైనాన్సోళ్ళ దెబ్బకి మొగోళ్ళు  ఉరిబెట్టుకున్నట్టు ఇప్పుడు ఆడయ్యి కూడా రాలి ’ పోవడం నిత్య విషాదం. ఇది కొత్త పరిణామం. ఈ క్రమంలో ముఖ్యంగా స్త్రీలే యెక్కువ బలయ్యారు. రంగమ్మలా పల్లెనొదిలి వచ్చిన స్త్రీలందరిదీ వొకే హృదయవిదారమైన కథ. రమణమ్మ ,జయమ్మ, శేషమ్మ , పద్మ , సామ్రాజ్యం , సుశీల , నాగమ్మా – అందరూ తెలిసో తెలియకో పోగొట్టుకొన్నదాన్ని పొందాలనే ‘కసి’ తో అన్నివిధాలా వోడిపోయినవాళ్ళే. ఇంటా బయటా స్త్రీలు ‘వొళ్లిరగ దీసుకొని రూపాయి సంపాదించడానికి కష్టపడుతుంటే’ ‘కాలు కదపకుండా కడుపు నిండాలన్నట్టు’ మగవాళ్ళు నిర్వ్యాపారులై దుర్వ్యసనాలకు బానిసలై అనారోగ్యాల పాలై మృత్యుశకటాలవుతున్నారు .

మంచికంటి వర్ణించిన యీ చీకటి జీవితం కేవలం రంగమ్మది మాత్రమే కాదు. ‘ఒక బెట్ట ప్రాంతంనుంచి’ వచ్చిన రచయితగా అతను దీన్ని సాహిత్యీకరించినప్పటికీ – యిది  వొక్క ఒంగోలుకే పరిమితమైన చరిత్రా కాదు. దేశంలో యే మూలకెళ్ళినా యిదే పరిస్థితి.

మార్పు వొక్కసారిగా రాలేదు గానీ 90 ల నుంచి మార్పు త్వరితమైంది. ఆర్ధిక సంస్కరణల అమలు వేగవంతం అయ్యాకా సామాన్యుడు కన్స్యూమరిజం శ్లేష్మంలో ఈగగా మారాడు. విలాసాల్ని  అవసరాలుగా భ్రమింపజేయడంలో మార్కెట్ శక్తులు విజయం సాధించాయి. దేశం పెద్ద సరుకుల సంతయింది. లేని అవసరాల్ని సృష్టించడం – వాటిని తీర్చుకోడానికి ‘రుణ సదుపాయం’ కల్పించడం – దీంతో దేశపౌరుడు వొక వస్తువ్యామోహం వూబిలోకి కూరుకుపోయాడు. ఉన్నది తినడం కాకుండా అప్పు చేసైనా లేనిది కొని అనుభవించడం మధ్యతరగతి జీవిత విధానమైంది. బ్యాంకింగ్ రంగంలోకి డెబిట్ కార్డ్ కన్నా ముందు క్రెడిట్ కార్డ్ ని వినియోగంలోకి తేవడం వెనక పెద్ద మార్కెట్ కుట్ర వుంది. ప్రభుత్వ నూతన విధానాల అండతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలూ చిట్ ఫండ్ లూ వడ్డీ వ్యాపారాలూ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వెంటబడి అప్పులిచ్చేదీ – ‘ బళ్ళేసుకుని ఊళ్ళమీదబడి వొడ్డీలకు వొడ్డీలు వొడ్డీలకు వొడ్డీలు కట్టి బెదిరిచ్చి వొసూలు చేసుకొనేది.’   పల్లె పట్నం తేడా లేకుండా ‘ కూలికి విషం తాగే  మనుషులు’ తయారయ్యారు. మనుషులు అన్ని విలువలకీ దూరమయ్యారు.

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్ని  సూక్ష్మదృష్టితో విశ్లేషించడం – గడిచిన కాలంతో పోల్చడం నవల పొడవునా కనిపిస్తుంది.నవల్లో రంగమ్మ ఆలోచనలు గతానికీ – వర్తమానానికీ మధ్య ఆసులో కండెలా తిరుగుతూ వుంటాయి. కావలి – ఒంగోలు మధ్య బొగ్గు బస్సులు నడిచిన రోజుల దగ్గర్నుంచీ – యివ్వాళ కాలేజీ ఆడపిల్లల్ని మోసం చేసి బ్లూ ఫిల్ముల చిత్రీకరణ దశ వరకూ దాదాపు 60 , 70 యేళ్ళ పల్లెల – పట్నాల సామాజిక చరిత్రని రికార్డు చేయడానికి రచయిత యెన్నుకొన్న శిల్పం అపూర్వం కాదు గానీ గత – వర్తమానాల కలనేతలో కథాగమనాన్ని కుంటూ పడనీకుండా , వస్త్వైక్యత దెబ్బతినకుండా నవలని నిర్వహించడం బహుధా ప్రశంసనీయం.

వర్తమాన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడే రంగమ్మ ప్రతి సందర్భంలోనూ గతాన్ని నెమరేసుకొంటుంది – యిప్పటి పరిస్థితుల్నీ మనుషుల్నీ వెనకటి రోజుల్తో మనుషుల్తో బేరీజు వేసుకొంటుంది. గత – వర్తమానాల మధ్య చేసే యీ ప్రయాణంలో సామాజిక – ఆర్ధిక విషయాలే గాక సాంస్కృతిక అంశాలు కూడా అలవోకగా వచ్చి చేరాయి. అది రంగమ్మ బాల్య జ్ఞాపకం సింగరాయకొండ తిరణాల కావొచ్చు ; ఆమె పెద్దమనిషయినప్పటి సమర్త బంతి కావొచ్చు ; వూరంతా వొకటై సంబరంగా జరిపిన పెళ్ళి కావచ్చు – అప్పటికీ యిప్పటికీ సంస్కృతిలో వచ్చిన మార్పులు అద్భుతంగా ఆవిష్కారమయ్యాయి. ఈ టెక్నిక్ ద్వారా నవల ప్రకాశం జిల్లా స్థానీయ సామాజిక చరిత్రతోబాటు సాంస్కృతిక చరిత్రను నిర్వచించుకోడానికి సైతం చక్కగా దోహదపడుతుంది.

ఈ స్థానీయ సామాజిక – ఆర్ధిక – సాంస్కృతిక  చర్రిత్రని మనకందిచడానికి మంచికంటి అక్కడి సమాజంలోకి , ప్రజా సమూహంలోకి మనల్ని చెయ్యి పట్టి లాక్కుపోతాడు. అందుకతను స్థానీయభాషని మాధ్యమం చేసుకొన్నాడు.ఈ ప్రాంతపు జనుల జీవద్భాష యింతకు మునుపు సాహిత్యంలోకి యింతగా యెక్కిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతపు భాషే కాదు – ప్రామాణిక భాష ఆధిపత్యం కింద నలిగి ప్రజల సాంస్కృతిక భాషలు దశాబ్దాలుగా సాహిత్యంలో స్థానం పొందలేకపోయాయి. ఇదొక చారిత్రిక విషాదం. రెండున్నర జిల్లాల భాషా ఆధిపత్యం గురించి తెలంగాణా రాయలసీమ సాహిత్యకారుల ఆందోళన ప్రాంతీయ అస్తిత్వ స్పృహ కారణంగా వెలికి వచ్చింది గానీ అదే సమయంలో ఆ రెండున్నర జిల్లాల్లోనే అట్టడుగు వర్గాల భాష కూడా సాహిత్యంలో నిరాదరణకే గురైందన్నది గమనించాల్సిన విషయం . తెలంగాణా రాయలసీమా ఉత్తరాంధ్రాల నుంచి రచయితలు  తమ సొంత భాషల్లో గొంతు విప్పుకొన్న కాలంలో కోస్తా ప్రజల సాంస్కృతిక భాషని పలికించడంలో అక్కడి రచయితల గొంతులు మూగవోయాయి . ప్రజల నోటి భాషని యాసతో సహా మాగోఖలేలా శిష్ట సాహిత్యంలోకి వొంపిన వాళ్ళు ఇటీవలి కాలంలో కరువయ్యారు ( కొలకలూరి ఇనాక్ , కళ్యాణ రావు , పాపినేని  లాంటి వొకరిద్దరు యిందుకు కొంతమేరకు మినహాయింపు) . అందువల్ల జరిగిన అనర్థం అంతా యింతా కాదు. భిన్న ప్రజా సమూహాల భాషలకు ప్రామాణిక భాష దూరమైపోయింది. బడిపలుకులు – పలుకుబడులు వేరయిపోయాయి. ఆ కారణంగానే ప్రజల భాష ద్వారా వ్యక్తమయ్యే సాంస్కృతిక వైవిధ్యం కూడా మరుగున పడిపోయింది. అన్ని ప్రాంతాల – వర్గాల భాషల్ని తనలో కలుపుకొని  ఎదగాల్సిన ప్రామాణిక భాష – అందుకు విరుద్ధంగా కుదించుకుపోయింది. ప్రజా వుద్యమాలతో సంబంధం వున్న రచయితలు యీ లోటుని పూడ్చడానికి పూనుకొన్నారు. గ్రామీణ ప్రజా సంబధాలు కాపాడుకొన్న రచయితలు మాత్రమే ఆ యా స్థానీయ భాషల సొబగుల్ని సృజనాత్మక సాహిత్యం ద్వారా తక్కిన ప్రాంతాలకు అందించగలిగారు.

సాహిత్య భాషలో యేర్పడ్డ యీ ఖాళీని పూరించడానికి చొరవ చూపినవాళ్ళలో మంచికంటికి ప్రత్యేక స్థానం వుంది. కాట్రగడ్డ దయానంద్ , మంచికంటి లాంటి రచయితలు తమ కథల్లో వాడిన ప్రకాశం జిల్లా తూర్పు ప్రాంతపు ప్రజల భాష  తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేసింది. మంచికంటి యీ నవల్లో వుపయోగించిన భాష భాషా అస్తిత్వాల గురించి నాలో చాలా కాలంగా గూడు కట్టుకొని వున్న ఆలోచనల్ని మీతో పంచుకొనేలా చేసింది.

మంచికంటి భాష అక్కడి ప్రజల వ్యావసాయిక సంస్కృతిలోని మట్టి పరిమళాన్ని మోసుకొచ్చిన కమ్మ తెమ్మెరలా వుంది. స్వచ్ఛమైన ఆ పరిమళాన్ని గుండె నిండా పీల్చుకొనే అవకాశం యెంతో కాలం కోల్పోయాం గదా అని నవల చదివిన ప్రతిసారీ అనిపించించింది. తన భాషలోని యాసనీ వ్యక్తీకరణ రీతుల్నీ అక్షరీకరించడంలో కూడా మంచికంటి  యెంతో నేర్పు చూపాడు. రచయిత ప్రజల పక్షాన నిలబడ్డాడనడానికి అతని భాష కూడా ప్రమాణమే.

బతుకులో అనునిత్యం సంఘర్షించే ప్రజల ధిక్కారస్వరమే వాళ్ళ భాషలో వినిపిస్తుంది. అది మండే భాస్వరంలా వుంటుంది. తన చుట్టూ వున్న సమాజంలో నిప్పుల మీద నడుస్తూ మొండిగా జీవిస్తోన్న మనుషుల ఆ ధిక్కారస్వరాన్ని గట్టిగా పట్టుకొన్న మంచికంటి దాన్ని సాహిత్య రూపంలోకి తర్జుమా చేసి మనకందిస్తున్నాడు. తాను పుట్టి పెరిగిన నేల రుణం యీ విధంగా తీర్చుకొంటున్నాడు. చల్లారిన సంసారాలూ ఛిద్రమైన బతుకులూ బలవంతపు పడుపు వృత్తులూ డబ్బు ప్రధానమై చిట్లిపోయిన మానవ సంబంధాలూ మార్కెట్ మాయాజాలంలో మాయమపోతున్న మనిషితనం … సమాజం క్రూరంగా దుర్భరంగా తయారయినప్పుడు , ‘విలువిద్యగాళ్ళుసైతం నేల నాలుగు చెరగులా వేయికాళ్ళతో విస్తరించి ఉన్న స్వార్థ భూతం ప్రలోభాలకు లోనైపోతున్నప్పుడు నిజంగా ఒక మనిషి వైపు ఒక   సామాన్యుడి వైపు కదా నిలబడి కల కనాల్సింది’ యే సాహిత్యకారుడైనా! అలా విశ్వసించినందువల్లే మంచికంటి తన నవల్లో బాధితుల పక్షాన వాళ్ళ కడగళ్ళ జీవిత అస్తిత్వాల్ని రూపు కట్టించగలిగాడు. కుటుంబ నిర్వహణలో అనునిత్యం స్త్రీలు శారీరికంగా మానసికంగా  యెదుర్కొంటున్న దుర్భర హింసని గొప్ప ఆర్తితో చిత్రించగలిగాడు. రచయిత ఆర్తి మన గుండెలోకి కూడా పరివ్యాప్తమౌతుంది. ఆ స్త్రీల ఆవేదనలో మనం కూడా  మగ్నమౌతాం.

సుబ్బులమ్మ – రంగమ్మ – సుధారాణి,సుజాత – మూడు తరాల్లో స్త్రీలు తమ చేతుల్లో లేనిదాన్ని దేన్నో పట్టుకోవాలనే ప్రయత్నం చేసారు. కానీ జీవితం అందినట్టే అంది వారి చేజారి పోయింది. సుబ్బులమ్మ గతం, రంగమ్మ వర్తమానం , సుధారాణి,సుజాతల భవిష్యత్తు అంతా అంధకార బంధురమే. అందుకే నవలంతా తీవ్రమైన దు:ఖం పరచుకొని వుంటుంది. అయితే అడుగడుగునా యెన్ని యెదురుదెబ్బలు తగిలినా రంగమ్మ గుండె దిటవు కోల్పోదు. నైరాశ్యానికి గురికాలేదు( నిలవ నీడ కోసం లైంగిక దోపిడీకి గురైంది , భర్త దేశాలు పట్టి పోయాడు , కొడుకు అనారోగ్యంతో బాధపడుతూ వుంటాడు , ముక్కుపచ్చలారని వయస్సులోనే కూతుళ్ళు పురుషుల వంచనా ప్రపంచంలో అభద్రతా అంచుల మీద స్వారీ చేస్తుంటారు ). ఆమె పోరాటానికి అంతం లేదనే నవల ముగింపు చెబుతుంది. నిజానికి కథ పూర్తి  కాలేదు – మళ్ళీ మొదలైంది.

‘ఒక పక్క రైతుల చావులు , ఒక పక్క ఎన్ కౌంటర్లంటూ నక్సలైట్ల చావులు , మరో పక్క ఘోరంగా ఆడ కూతుర్లను చేర్చి శవాలుగా మార్చడాలు’   – వీటన్నిటి మధ్య ‘ తలగుడ్డలు రోడ్డెక్కినయి. పొలంలో ఉండాల్సిన తలగుడ్డల్ని గవర్నమెంటు రోడ్డెక్కేలా  చేసింది’. పల్లె నుంచి వలసపోకుంటే  రంగమ్మ భర్తతోపాటు తలగుడ్డలతో కల్సి నడిచేదేమో! ఎప్పటికైనా రంగమ్మయినా మనమయినా కలవాల్సిన సమూహం అదే. అటువంటి సామూహిక ప్రతిఘటన మాత్రమే రంగమ్మ లాంటి స్ర్తీలు ఆత్మగౌరవంతో తలెత్తుకు నడవడానికీ , అన్ని చావుల పరిష్కారానికీ తోవ చూపుతుందనీ చిమ్మచీకటిలో వెలుగు రేకల్ని ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం. ఈ నవల చదవడం ద్వారా నాకా నమ్మకాన్నికల్గించినందుకు మంచికంటికి అభినందనలు.

ఒంగోలు పక్కన పేర్నమిట్ట బాట పట్టే ముందు వొక్క మాట –

చీకటికి భయపడేవాళ్ళెవరూ చీకటిని గెలవలేరు. సెలవ్.

విప్లవంలో స్వేచ్ఛా సమానత్వాల సాహచర్యం

karuna

 

‘విప్లవ రాజకీయాలు చదువుకున్నవారికి చేరాలంటే మార్గం సాహిత్యమే’ అని నమ్మి ఆచరించిన  ఆమె అసలు పేరు పద్మ. పదిహేనేళ్ళ వుద్యమ జీవితంలో అన్నీ వొదులుకొన్నట్టే సొంత పేరును కూడా వదిలేసింది. 1994లో తాయమ్మ కథ రాసి కరుణగా సాహిత్య లోకానికి పరిచయమైంది. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి పదేళ్ళు కావొస్తున్నా , అటు తర్వాత మరో ముప్ఫైకి పైగా కథలు రాసినా ఆ తొలి  కథే  కరుణకు చిరునామా అయ్యింది. ‘తాయమ్మ’ ఆమె యింటి పేరయ్యింది. ఆ కథ పొడవునా వున్న కఠోర జీవన వాస్తవికత పాఠకుల బుద్ధిని రాపాడితే , ముగింపులోని తాయమ్మ దు:ఖం మాత్రం  గుండెను మెలిపెడుతుంది.  కరుణ చిత్రించిన తాయమ్మ , కవులమ్మ , లచ్చుమమ్మ మొదలైన గ్రామీణ స్త్రీ  పాత్రలు మన కళ్ళముందు కదలాడే  నిజ జీవితంలోని వ్యక్తులే  కావడం వల్ల వాటికి యెంతో  సహజత్వం అబ్బి  పది కాలాలపాటు నిలచిపోయేలా రూపొందాయి. ఒక రచయిత పేరు చెప్పగానే వాళ్ళ రచనల్లోని పాత్రలు వెంటనే స్ఫురించడం ఆ రచయిత సాధించిన విజయంగానే భావించాలి.

విప్లవాచారణలో తలమునకలై  సాహిత్యం  గురించి తీరిగ్గా ఆలోచించటానికీ, నగిషీలు చెక్కటానికీ వీలులేని జీవితంలో – నిత్య నిర్బంధాల మధ్య అణచివేతల మధ్య  కథా శిల్పానికి  మెరుగులు దిద్దడానికి సరైన వనరులు అందుబాటు లేని పరిస్థితుల్లో , యెవరికైనా చదివి వినిపించి దిద్దుకోడానికి సైతం వెసులుబాటు దొరకని సందర్భం లో కథ పట్ల అందులో తాను చెప్పదల్చుకొన్న విషయం పట్ల వొక ప్రత్యేక శ్రద్ధ, దాని రూపం పట్ల కూడా అంతర్గతంగా వొక అదృశ్య స్పృహ వుండటం వల్ల కరుణ కథలు విప్లవ సాహిత్యంలో సైతం ప్రత్యేకగా నిలుస్తున్నాయి. సరళమైన నిరాడంబర శైలి ,   కథనంలో సూటిదనం స్వీకరించిన వస్తువునే కాదు;  రచయిత దృక్పథాన్ని సైతం దీప్తిమంతం చేస్తాయి అనడానికి కరుణ యిటీవల రాసిన ‘సహచరులు’ కథ చక్కటి వుదాహరణ(అరుణతార, మే 2016).

[కథ లింక్ : http://virasam.org/article.php?page=57  ; పే.20 – 26]

విప్లవోద్యమాల్లో స్త్రీపురుష సంబంధాల గురించి లోపలా బయటా యెన్నో సందేహాలు , అపోహలు. వాటిలో  పాలక వర్గాలు పనిగట్టుకొని చేసే దుష్ప్రచారం వొక యెత్తయితే , వుద్యమ భావజాలాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక వుద్యమకారుల నైతిక వర్తనపై బురద జల్లడానికి మరీ ముఖ్యంగా  పితృస్వామ్య విలువలతో స్త్రీల శీల హననానికి చేసే కువిమర్శలు మరో యెత్తు. ఇవి గాక కొన్నాళ్ళు వుద్యమ జీవితం గడిపి బయటకు వచ్చిన స్త్రీలు జెండర్ పరంగా విధాన నిర్ణయాల్లో , యితరత్రా తామెదుర్కొన్న వివక్షతల గురించి లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించిన అంశాలు కూడా సాహిత్యంలో విస్తృతమైన చర్చలకి కారణమయ్యాయి.

ఆ నేపథ్యంలో వుద్యమాల్లో నూతన మానవ ఆవిష్కరణ లక్ష్యంగా  వొకే మార్గంలో పయనించే క్రమంలో యిద్దరు స్త్రీ పురుషుల మధ్య యేర్పడే సాన్నిహిత్యం సాహచర్యంగా మారినప్పుడు ఆ బంధం యెంత బలంగా వుంటుందో స్వేచ్ఛా సమానత్వ భావనలతో యెంత ప్రజాస్వామికంగా వుంటుందో అతి సున్నితంగా ఆవిష్కరించిన కథ ‘సహచరులు’.

విప్లవోద్యమ జీవితంలో సహచరులకి కష్టాలే గానీ సుఖాలుండవు. సొంత సుఖాలపైకి వారి ఆలోచనలు పోవు. అడవిలో కేంప్ లో డెన్ లో యెక్కడ యెన్నాళ్ళుంటారో తెలీదు. ఎప్పుడు కలిసుంటారో యెప్పుడు విడిపోతారో తెలీదు. ఒకే దళంలో వున్నా ప్రశాంతంగా మాట్టాడుకొనే అవకాశమే చిక్కకపోవచ్చు. శత్రునిర్బంధంలో అసలుంటారో పోతారో తెలీని అభద్ర జీవితం. కార్యాచరణకి అనుగుణంగా  సహచరుల మధ్య ప్రేమనీ యెడబాటునీ పార్టీయే ఆదేశిస్తుంది. వారి వుద్వేగాల్ని ఆలోచనల్నీ జీవన గమనాన్నీ  వుద్యమావసరాలే నిర్దేశిస్తాయి. అనుక్షణం ప్రమాదాల  కత్తి అంచున నిలబడి కూడా సాహచర్యంలోని సాధకబాధకాల్ని అర్థంచేసుకున్న దీప అనిల్ అనే యిద్దరు వుద్యమకారుల జీవిత శకలాల ద్వారా విప్లవోద్యమాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుద్వేగభరితంగా యెంత మానవీయంగా వుంటాయో యీ కథలో  కరుణ చాలా ‘ఆత్మీయం’గా పాఠకుల ముందుంచింది.

దీప, అనిల్ ఉద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తలుగా వచ్చాకనే సహచరులయ్యారు. దీప గ్రాడ్యుయేట్, అనిల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. పార్టీలోకి దీపకన్నా ఎనిమిదేండ్లు ముందు అనిల్ వచ్చాడు. అతను సెక్రటేరియట్ మెంబర్. ఆమె జిల్లా కమిటీ సభ్యురాలు. ఎవరి ఏరియాల్లో వాళ్ళు పని చేస్తున్నారు. పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం, ప్రేమ. ముఖ్యంగా దీపకు అనిల్ మీద గౌరవం.’ అతను ఆమెకి జీవితంలోనూ , వుద్యమంలోనూ వొక విధంగా మెంటర్ , మార్గదర్శకుడూ.  ‘అనిల్ దగ్గర ఉంటే దీప తల్లికోడి చుట్టూ తిరిగే పిల్లకోడే.’ రవికిరణం తాకిన పద్మమే. వారి మధ్య ఆధిపత్యాలకి తావులేదు.  అభిప్రాయాల్ని  పంచుకుంటారు. వాటిని పరస్పరం మన్నించుకుంటారు. డెన్ లో వుంటే యింటి పనులన్నీ ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. ఒకరి క్షేమం పట్ల మరొకరికి  లోలోపల వొక ఆతురత , కన్సర్న్.

అలా అన్జెప్పి వారి మధ్య వైరుధ్యాలు లేవని కాదు. ‘ఒకరికొకరు ఎంత అర్థమైనా కొన్నిసార్లు కొన్నిమాటలు ఇబ్బందిగానే ఉంటాయి. కాకపొతే ఆ ఇబ్బంది దీప అనిల్ ల మధ్య కొద్దిసేపే. పొరపాటును గుర్తించడం , క్షమాపణలు చెప్పుకోవడం .. లేదా క్షమాపణలు చెప్పుకోకున్నా లోపల బాధపడుతున్న విషయం ఇద్దరికీ అర్థమవడం …’  ఆ క్రమంలో వైరుధ్యాల్ని యే విధంగా పరిష్కరించుకుంటారన్నదే కథలో ప్రధానాంశం.

నిజానికి కథ వొక  వైరుధ్యంతోనే మొదలవుతుంది. అలా మొదలు పెట్టడంలోనే కథా నిర్మితిలో రచయిత పరిణతి తెలుస్తుంది. దళం నుంచి ‘సైడ్’ కి వెళ్ళినప్పుడు (అలా సైడ్ కి వెళ్ళాడానికి వుండే యిబ్బందుల్నీ దళ కమాండర్ కి తెలియజేయకుండా వెళ్తే  యెదురయ్యే ప్రమాదాల్నికూడా రచయిత కథలో ప్రస్తావించింది) వర్షంలో టెంట్ సరిగ్గా కట్టడం చేతకాలేదని  దీప అనిల్ పై విసుక్కుంటుంది. అక్కడనుంచి కథ గతంలోకి ప్రయాణం చేస్తుంది. రహస్య జీవితంలో వాళ్ళిద్దరూ నడిచిన తొవ్వలోకి రచయిత స్వయంగా మన చెయ్యిపట్టి యెటువంటి కుదుపూ లేకుండా నెమ్మదిగా  తీసుకెళ్తుంది.

అనిల్ మృదు స్వభావి. శారీరికంగా కూడా సున్నితంగా వుంటాడు. అంతర్ముఖుడు. పనిలో యెటువంటి వూగిసలాటా వుండదు. కేడర్ కు అతనంటే ప్రాణం. కేడర్ కి గానీ తన గార్డుకి గానీ పనులు చెప్పడు. నాయకత్వ స్థానంలో వుంటూ యెప్పటి కప్పుడు స్వయం విమర్శకి సిద్ధంగా వుండేవాడు.

దీపది బడాబడా మాట్లాడే స్వభావం. మాటల పోగు. మనసులో ఏదీ దాచుకోదు. కొద్దిపాటి అసహనాన్నైనా వెంటనే వ్యక్తం చేసేస్తుంది.  ఒక్కోసారి ‘పుసుక్కున మాట జారుతుంది.’ అసలు ‘లౌక్యం’ తెలీదు. ఆమెకు తన సహచరుడితో వీలైనంత యెక్కువసేపు గడపాలనీ మనసారా మాట్లాడాలనీ వుంటుంది.

కానీ అనిల్ కి ప్రేమని ప్రదర్శించడం రాదు. ఇంట్లో యిద్దరే వున్నా మాట్టాడేది తక్కువే. ఇక నలుగురిలోనో మూడో వ్యక్తి సమక్షంలోనో  భార్యాభర్తలుగా మెసలడానికి అతనికి యిష్టం వుండదు. మరీ ముడుచుకు పోతాడు. దీపతో కాసిన్ని మాటలు కూడా బందై పోతాయి. దాంతో చాలాసార్లు ఆమె నొచ్చుకుంటుంది. అవమానంగా భావిస్తుంది.  అతని యీ తత్త్వాన్ని యితరుల ముందు తనని లెక్కజేయనట్టు ప్రవర్తించే ‘మొగుడి అహంకారం’గా భావించి తప్పు పడుతుంది. ఒకసారి ఆ కారణంగా అనిల్ ఆమెని ‘బుద్ధిలేద’ని తిడడతాడు. బయట కుటుంబాల్లో స్త్రీ పురుషుల మధ్య వుండే  వుండే అసమ సంబంధాలని చూసి విసిగి  ‘వాటిని ఎదిరించి , మార్పును ఆశించి పార్టీలోకి వస్తే అక్కడా అదే పరిస్థితా’  అని ఆమె కోపించింది, బాధపడింది, దు:ఖించింది. ఆత్మాభిమానతో నిరసన ప్రకటించింది.  తన ప్రవర్తనకి అనిల్ సంజాయిషీ యిచ్చుకొంటే గానీ దీప శాంతించలేదు.

ఇటువంటి సంఘటనల్ని కేవలం మనస్పర్థగా భావించకుండా ఆత్మ విమర్శతో కుటుంబ సంబంధాల్లోని వైరుధ్యాల్ని అర్థంచేసుకొనే తమని తాము సవరించుకొనే ప్రయత్నం చేస్తారిద్దరూ. తమ ప్రవర్తనకి తాము పుట్టి పెరిగిన నేపథ్యాలెంత వరకు కారణమో విశ్లేషించుకుంటారు. అభివృద్ధి నిరోధకమైన భావజాలాన్ని వదిలించుకోడానికి సిద్ధంగా వుంటారు.  నిజానికి సహచరులు యిద్దరూ నిరంతరం యెంతో చైతన్యవంతంగా వుంటేనే గానీ వారి మధ్య అడపా తడపా చోటు చేసుకొనే వైరుధ్యాల్ని పరిష్కరించుకోలేరు.  అందుకు అవసరమైన పరిణతి కూడా వారికి వుద్యమభావజాలం నుంచే లభించిందని కథలో సూచ్యంగా పాఠకులకి తెలుస్తూ వుంటుంది. పురుషాధిపత్య భావజాలంతో నడిచే బయటి సమాజంలోని పరిస్థితికి భిన్నంగా ప్రగతిశీల శిబిరాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుదాత్తంగా ఆదర్శవంతంగా వుంటాయనీ – వుండాలనీ రచయితకున్న బలమైన ఆకాంక్ష వొకటి కథ పొడవునా అంతస్సూత్రంగా కనిపిస్తుంది.

భార్య మెత్తగా ఉంటే భర్త ఆడించడం, భర్త మెత్తగా ఉంటే భార్య పెత్తనం చెలాయించడం … ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలనుకోవడం … ఒకరిని మరొకరు అణచాలని చూడటం. భార్యాభర్తల సంబంధం ఇల్లనే చిన్న రాజ్యంలో అధికారపీఠం కోసం జరిగే యుద్ధంలా’  పరిణమించడానికి గల కారణాల్ని తాత్త్వికంగా అన్వేషించే ప్రయత్నం కూడా కథలో చోటుచేసుకొంది.

భార్యా భర్తలు కూడా యెవరి స్వేచ్ఛా పరిధుల్లో వాళ్లుండాలనీ , భార్య అయినా భర్త అయినా ఎవరైనా కావచ్చు కొన్ని ‘గిరులు’ ఉండాల్సిందేననీ ,  ఆ గీతలు దాటితే ‘నేను చెప్పినట్టల్లా అవతలి వ్యక్తి వినాలి’ అనే వరకు వెళ్లి ఒకరిపై మరొకరి ఆక్రమణ ఆధిపత్యాలు చోటు చేసుకోవచ్చనీ , అది మొదలయ్యేది ప్రేమ పేరుతోనే  అనీ అనిల్ ముఖత: రచయిత చేసిన సూత్రీకరణలు వుద్యమ జీవితంలోనే కాదు స్త్రీ పురుష సమభావనలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేని  యే కుటుంబానికైనా అన్వయించుకోవచ్చు. possessiveness లోనే వొకరిపై మరొకరు అధికారాన్ని ప్రకటించే వైఖరి దాగి వుంటుందని మరోకోణాన్ని చూడగలం.

‘విప్లవకారుల్లో పరిమితులు దాటిన ప్రేమ ఏవిధంగా చూసినా అనర్థమే. ‘తామిద్దరే’ అనే స్పృహ వస్తే విప్లవోద్యమాన్ని వీడటానికి కూడా వెనుకాడక పోవచ్చు. లేదా సహచరున్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళలేని  స్థితి రావచ్చు. పార్టీలో భార్యా భర్తలిద్దరూ ఒకే దగ్గర ఉండటం అనేది అసాధ్యం.’

అనిల్ మాటల్లో భార్యా భర్తల సంబంధం కన్నా వుద్యమావసరాలూ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని బలమైన ధ్వని వుంది. లొంగుబాటుల కారణాల విశ్లేషణ వుంది. ఉద్యమకారులకి వుండాల్సిన  కర్తవ్య నిష్ఠ త్యాగ నిరతి కూడా అతని మాటల్లో వ్యక్తమవుతాయి. అదీగాక యెప్పుడు యెవరికి యేమౌతుందో తెలీని వుద్యమ జీవితంలో హద్దుల్లేని  ప్రేమ మంచిది కాదని అనిల్ ఆలోచన. సాన్నిహిత్యం పెరిగితే వుద్యమ కార్యాచరణలో అది ఆటంకంగా పరిణమిస్తుందేమోనని అతని భయం. అనిల్ ఆలోచనతో భయంతో  ఏకీభావం వున్నప్పటికీ   ‘ఎప్పుడో ఏమో అవుతదని ఉన్నంతకాలమూ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటామా ?’ అని దీప వాదన.

జీవితం పట్ల ప్రేమాభిమానాల పట్ల స్త్రీ పురుషుల ఆలోచనల్లో సహజంగా వుండే తేడాని ఆవిష్కరించడానికి కరుణ కథలో యెంతో సున్నితమైన సన్నివేశాల్ని కల్పించింది.అనిల్ దీపల మధ్య యేకాంత సందర్భాల్ని చక్కగా వుపయోగించుకొంది. భావ వినిమయానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించింది. అందుకు యే మాత్రం కాఠిన్యానికి తావులేని మృదువైన  సంభాషణాత్మకమైన నిరాడంబరమైన శైలిని ఆశ్రయించింది.  కథాంశంలోని సంక్లిష్టతని కథచెప్పే పద్ధతిలోకి రానీయకుండా జాగ్రత్తపడింది.

సర్వసాక్షి కథనంలో రచయితే కథ చెప్పడంవల్ల అనిల్ దీపాల ప్రవృత్తిలోని మంచిచెడ్డల్ని, మనోభావాల్ని, బలాల్నీ బలహీనతల్నీ నిశితంగా విశ్లేషించగలిగింది. వారి అంతరంగాల లోతుల్ని తడమగలిగింది. సందర్భానుసారంగా వారి మాటల ద్వారా రాజకీయ సిద్ధాంత చర్చల్ని సైతం నడపగలిగింది. వారిద్దరి మధ్య సంభాషణలు సంవాదాలుగానో వివాదాలుగానో  పరిణమించకుండా వుద్వేగ ప్రధానంగా నడపడంలో గొప్ప సంయమనాన్ని ప్రదర్శించింది. కరుణ కంఠం దీపలో విన్పించకుండా తాటస్థ్యాన్ని పాటించింది. కానీ యిదంతా ఆమె అనుభూతిలోకి వచ్చిన విషయమేనని కథ చదువుతోన్నంతసేపూ  అనిపిస్తుంది.  జీవితాన్ని సిద్ధాంతాలతో గాక అనుభవాలతో వ్యాఖ్యానించడం వల్ల విప్లవోద్యమానికి చెందిన కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తూ కథ ఫ్రెష్ గా వుంది.

కరుణ స్వీయ వుద్యమ జీవితానుభవం నుంచే వచ్చిన కథ కావడం వల్ల ‘సహచరులు’ లో పార్టీ నిర్మాణంలో వుండే క్రమశిక్షణ గురించి దాన్ని పాటించడంలో వ్యక్తుల బలాబలాల గురించి లోటుపాట్ల గురించి , అడవిలోపల  దళాల కదలికల గురించి , బయట  డెన్  లో రహస్య పరిరక్షణ కోసం తీసుకొనే టెక్ జాగ్రత్తల గురించి పాటించాల్సిన  గోప్యత గురించి  ఆమె నిర్దిష్టంగా ప్రస్తావించిన అంశాలకు ప్రామాణికత లభించింది.    

ఆ క్రమంలో తాను నడిచి వచ్చిన వుద్యమాల బాటలో యెదురైన సవాళ్ళని చర్చకి పెట్టడానికి కూడా రచయిత్రి యెక్కడా వెనుకాడలేదు. పార్టీలో అమలయ్యే కేంద్రీ కృత ప్రజాస్వామ్య విలువల గురించి , పాత కొత్త ఆలోచనల మధ్య రేగే వైరుధ్యాల గురించి , దీర్ఘకాలిక ప్రజా యుద్ధం పట్ల నాయకత్వ స్థానంలో వున్న వారి తప్పుడు అవగాహన గురించి , క్రమశిక్షణ విషయంలో వైయక్తికంగా నాయకులు ప్రదర్శించే వుదార వైఖరి వల్ల కలిగే అనర్థాల గురించి , గ్రామాల నుంచి పట్టణాలకి వుద్యమ స్ఫూర్తి వ్యాపించాల్సిన అవసరాల గురించి దీపా అనిల్ ల మధ్య నడిచిన మాటలు సైద్ధాంతికంగా లోతుగా ఆలోచింపదగినవి. ఆ సందర్భంలో  ‘ఒక మనిషి జీవిత కాలంలో విప్లవ విజయాన్ని చూడాలి’   వంటి వ్యాఖ్యలు ప్రత్యేకంగా పరిశీలించాల్సినవి.

నిజమే అటువంటి బలీయమైన ఆశ వుంటేనే విప్లవాచారణలో స్థిరంగా నిలబడగల్గుతాం. కానీ రాజ్యాధికారమే అంతిమ విజయమైతే అది వొక మనిషి జీవిత కాలంలో సాధ్యం కావచ్చు – కాకపోవచ్చు. విప్లవ విజయాన్ని తమ జీవితంలో చూడలేక ఆచరణనే తప్పుబట్టే ప్రమాదం వుంది. అందుకే విప్లవాచారణలో స్వల్పకాలిక లక్ష్యాలనూ దీర్ఘకాలిక లక్ష్యాలనూ యెప్పటికప్పుడు నిర్వచించుకుంటూ ఫలితాల్ని మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు సాగాల్సి వుంటుంది.

రహస్యోద్యమాల్లో పనిచేసే ఆడ మగా మధ్య లైంగిక విశృంఖలత్వం గురించి జరిగే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కథలో వొక సందర్భాన్ని రచయిత ప్రత్యేకంగా సృష్టించుకొంది. వస్త్వైక్యత చెడకుండా అది కథలో వొదిగి పోయింది. కథకి లోతుతో పాటు విస్తృతిని కల్గించింది. నిండుదనాన్నిచ్చింది.

స్త్రీ పురుషులు విచ్చలవిడి సంబంధాలకోసం  చావుకు సిద్ధపడి విప్లవం బాట పట్టాల్సిన అవసరం లేదనీ , నిజంగా అటువంటి సంబంధాలు పార్టీలో ఉంటే అందులో పడి కొట్టుకుపోతారు తప్ప విలువలకోసం  ప్రజల తరపున నిలబడి పోరాడలేరు – నిర్బంధాన్ని తట్టుకోలేరనీ చెబుతూ దీప అటువంటి ‘సంబంధాల కోసమైతే బయటే ఉండొచ్చుగా’  అని మరో మాట అదనంగా అంటుంది.

‘ఉద్యమంలో దోపిడీ పీడనల అంతం ఒక్కటే కాదు. పురుషుడికి మల్లే స్త్రీకి స్వేచ్ఛా సమానత్వం ఉండాలని కోరుతున్నామంటే అర్థం  …  అనైతిక సంబంధాల విషయంలో కాదు. దంపతీ వివాహం ఉన్నతమైందని పార్టీ నమ్ముతుంది. అమలు చేస్తుంది.  ఊహల్లో ప్రేమతో కాదు , నిజమైన ప్రేమతో సహచరులు కలిసి ఉంటారు.’ అని ఆమె ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగింది.

పార్టీలో యెట్టి పరిస్థితుల్లోనూ అనైతిక సంబంధాల్ని అంగీకరించరని బలంగా చెప్పడమే  ఆమె వుద్దేశం. నిజానికి యే యిద్దరు స్త్రీ పురుషుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడినా వెంటనే వాళ్లకి పెళ్లి చేసేయడం కమ్యూనిష్టు వుద్యమాల్లో మొదటి నుంచీ వుంది. దీన్ని నైతికత విషయంలో భూస్వామ్య విలువల నుంచీ బయటపడక పోవడంగానే భావించే వీలున్నప్పటికీ బయటి వాళ్లకి వేలెత్తి చూపే అవకాశం యివ్వడం పార్టీకి కీడు చేస్తుందని వాళ్ళ నమ్మకం.

 విప్లవ పార్టీల రాజకీయ ఎజెండాలో స్త్రీల నిర్దిష్ట సమస్యలకి చోటులేకుండా పోతుందనే విమర్శకి కూడా రచయిత దీప ఆలోచనల ద్వారా సమాధానం చెప్పించి వుంటే బాగుండేది కానీ కథలో ఫోకస్ పాయింట్ పక్కకి పోయే ప్రమాదం వుంది. అది మరో కథకి వస్తువౌతుంది. కథ మాత్రమే చెప్పాలన్న స్పృహ కథా రచయితకి వుండటం వల్ల ప్రయోజనమిది.

 

దీప అనిల్ మధ్య మాటల్లో సాహిత్య విషయాలెన్నో చోటు చేసుకునేవి. నిజానికి మాటల్లో యెంతో పొదుపరి అయిన అనిల్ సాహిత్యం గురించి , సిద్ధాంతం గురించి మాట్టాడాల్సి వస్తే మాత్రం గొప్ప ప్రవాహ శీలి అయిపోతాడు. కథ గురించి అతనికి నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ‘ఎవరూ ఎన్నుకోని వస్తువుని ఎన్నుకున్నప్పుడే కథ నిలుస్తుందనేవాడు. వస్తువు పాతదాన్నే ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త ముగింపునో , కొత్త శైలినో ఎన్నుకోవాలి అనేవాడు. శిల్పం గురించి అవసరం లేదంటారు కానీ చెప్పే పధ్ధతి బాగుండాలి…’ కథలో వస్తు శిల్పాల ప్రాధాన్యాల గురించిన అనిల్ ఆలోచనలు రచయిత్రివే  ( వాటి వెలుగులో కరుణ కథల్ని ప్రత్యేకంగా  అధ్యయనం చెయ్యొచ్చు ).

అందుకే కథ ముగింపు విషయంలో కూడా కరుణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చివరికి సామరస్య వాతావరణంలో  ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ’ అని అనిల్ నవ్వుతూ అంటే  , ‘పితృస్వామ్యం నశించాలి’ అని దీప రిటార్ట్ యివ్వడంతో కథ ముగుస్తుంది. ఐక్యత – ఘర్షణ – ఐక్యత అన్న గతితార్కిక అవగాహనని అతి సున్నితంగా ఆవిష్కరించిన ముగింపు పెదాలపై నవ్వు పూయిస్తుంది. ఉద్యమాల్లోనే కాదు ; యెక్కడైనా స్త్రీ పురుష సంబంధాలు అసమానతలకీ ఆధిపత్యాలకీ తావులేకుండా సంతోషమయంగా వుంటే బావుంటుంది గదా అని అనుకోకుండా వుండలేం.

ఇప్పుడిహ  యిది యే అస్తిత్వ వాదానికి చెందిన కథో అని విమర్శకులు విద్యాత్మక పరిశోధనలు మొదలెట్టొచ్చు. ఇదంతా శత్రు వైరుధ్యమా మిత్ర వైరుధ్యమా అని తలలు బద్దలుకొట్టుకొనే వాళ్ళని వాళ్ళ  మానానికి  వొదిలేసి కరుణ తన యెరుకలోకి వచ్చిన  జీవితాన్ని కథలుగా మలిచే కృషిని యిలాగే నిరంతరం కొనసాగించాలని  కోరుకుంటున్నాను. విప్లవోద్యమ సాహిత్యానికి కరుణ లాంటి రచయితల అవసరం యెంతైనా వుంది.

 

 

 

అసలు  ‘హక్కుదార్లు’ యెవరు ?

painting: Rafi Haque

painting: Rafi Haque

 

“అమ్మా నాకు చలి వేస్తుందే , మంట వేయవూ?”

“నాయనా బొగ్గులు లేవురా”

“అమ్మా బొగ్గులెందుకు లేవే?”

“మీ నాన్నకు పని పోయింది, బొగ్గులు కొనడానికి డబ్బు లేదు బాబూ!”

“నాన్నకు పనెందుకు పోయిందమ్మా?”

“బొగ్గు ఎక్కువగా ఉందిటరా బాబూ!”

_ రాషెస్డల్

యెంతో వింతగానూ వైరుధ్యభరితం గానూ మినీ కథలానూ వున్న యీ ఆర్ధిక విశ్లేషణ మన సింగరేణికి అతికినట్టుగా సరిపోతుంది. అందుకే గత మూడున్నర దశాబ్దాలుగా సింగరేణి సామాజిక ఆర్ధిక శాస్త్ర వేత్తలకి  అధ్యయన వేదిక అయ్యింది. అక్కడి సమాజం రచయితలకి సాహిత్య పాఠశాల అయ్యింది. 1981 లో బొగ్గు గనుల్లో యాభై ఆరు రోజుల పాటు జరిగిన చారిత్రిక సమ్మె దరిమిలా  సింగరేణి కార్మికుల ‘బండ కింది బతుకులు’ సాహిత్యంలో వస్తువు లయ్యాయి. ‘బొగ్గు పొరల్లో …’ మొట్టమొదటిసారిగా ‘నల్లకలువ’ లెన్నో వికసించాయి. రాజయ్య  , రఘోత్తం రెడ్డి, పి చంద్ వంటి రచయితల సామూహిక కర్తృత్వంలో (కార్మిక పేరుతో ) , సొంత పేర్లతో  కార్మికోద్యమ కథలెన్నో వెలువడ్డాయి. హక్కుల కోసం , మెరుగైన జీవితం కోసం సెమ్మాసులు పట్టిన కార్మికుల చైతన్యం ‘నల్లవజ్ర’ మై  మెరిసింది. క్రూర నిర్బంధాల నేపథ్యంలో కార్మికుల్లో పోరాట స్ఫూర్తి నింపిన  ఆ నాటి సాహిత్యం అపూర్వమైనది.

తర్వాతి కాలంలో ’90ల్లో మొదలైన నూతన ఆర్ధిక సంస్కరణలు గనుల్లో ప్రైవేటీ కరణకి దారులు వేశాయి. ప్రభుత్వాల బొగ్గు పాలసీలు కాలరీల్లో పెను మార్పులు తెచ్చాయి. కార్మికుల మెడ చుట్టూ కనిపించని వురితాళ్ళు పేనాయి. అణచివేత – అభివృద్ధి అనే ద్విముఖ వ్యూహాన్ని కంపెనీ అమలుపరచింది. ప్రైవేటు కాంట్రాక్టర్లకి రెడ్ కార్పెట్ పరిచింది. ఔట్ సోర్సింగ్ కంపారటీవ్ అడ్వాంటేజ్ అని నమ్మి- నమ్మించి ఆచరణలో పెట్టింది. అవుట్ సోర్సింగ్ ని ‘ఒక కిల్లర్ అప్లికేషన్ గా – ఒక పనసియా (సర్వరోగనివారిణి) గా ప్రచారం చేసింది. డిపెండెంట్ వుద్యోగాల్ని కూడా రద్దు చేసింది. కార్మికులు రిటైర్ అయితే వాళ్ళ స్థానంలో కొత్తవాళ్ళని తీసుకోవడం మానేసింది. ఓపెన్ కాస్ట్ ల సంఖ్యని పెంచి  వాటిలో భారీ యంత్రాలని దించింది.  కార్మికులకు పని యివ్వకుండా నిర్వ్యాపారులుగా కూర్చోబెట్టి కృత్రిమమైన సర్ప్లస్ మేన్ పవర్ ని సృష్టించింది. వాళ్ళ శక్తిని మరో చోట ఉపయోగించుకొనే అవకాశం వున్నప్పటికీ వోవర్ బర్డెన్ రిమూవల్ తో పాటు నెమ్మదిగా వొక్కో రంగాన్నీ ప్రైవేటైజ్ చేస్తూ పనులు కాంట్రాక్టర్లకి అప్పజెప్పింది. సంస్కరణల హేతుబద్ధతని ప్రశ్నించే వాళ్ళపై  తీవ్రవాద ముద్ర వేసి అణచివేతకి పూనుకొంది. గుర్తింపు పొందిన కార్మిక సంఘాల మద్దతు కూడగట్టుకొని వారితోనే వొప్పందాలు  చేసుకొంటూ మిలిటెంట్ స్వభావంతో పనిచేసే  సికాస లాంటి సంఘాలని నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు రచించింది.

1 లక్షా 20 వేలు వుండే కార్మికుల సంఖ్యని  సగానికి పైగా కుదించివేసి లాభాల బాటలోకి నడిపిన గత పదిహేనేళ్ళ చరిత్ర రక్త సిక్తమై  యెంత అమానవీయంగా వుందో తెలియజేస్తూ  పి చంద్ లాంటి రచయితలు కథలు  (జులుం) , యండి మునీర్ లాంటి వాళ్ళు వ్యాసాలు  రాశారు. అయితే యీ క్రమాన్ని మరో దృష్టికోణం నుంచి పరిశీలించిన కథ  ఎం. రఘువంశీ రాసిన ‘హక్కుదార్లు’. ( అరుణతార : ఆగస్ట్ 2016)

[ కథ లింక్ : http://www.virasam.in/article.php?page=223  పే.11-20 ]

“వచ్చిన లాభాల పంపకం వాటికి కారణమైన వాళ్ళ మధ్య సజావుగా ఉందా ? అసలు వాటాదార్లు ఎవరు?” అని ప్రశ్నిస్తుంది యీ కథ. అసలు నష్టాల్లో నడిచే కంపెనీ లాభాల్లోకి యెలా ప్రవేశించింది? ఆ క్రమంలో యెవరి పాత్ర యెంత? శ్రమ యెవరిది ? సిరి యెవరిది? వాటాలు పంచుకొనే దారిలో కార్మికుల్లో యెటువంటి  మార్పులు వచ్చాయి? కార్మిక సంఘాల ధోరణి ఏమిటి? కంపెనీ క్షేమం – కార్మిక సంక్షేమం మాటల నిర్వచనాలు యెలా మారిపోయాయి? సంస్కరణల అమల్లో యాజమాన్యాల కాంట్రాక్టర్ల విధానాలేంటి? మిడిల్ మేనేజ్ మెంట్ లో అధికారుల రోల్ ఏంటి? ఈ అంతటిలో పాలకుల వైఖరి ఏంటి?పబ్లిక్ రంగ సంస్థ ప్రాథమిక లక్ష్యం లాభార్జనేనా? దాని సామాజిక బాధ్యతలేంటి? కంపెనీ అభివృద్ధి ప్రాంతీయ అభివృద్ధికి యే మేరకి దోహదం చేసింది? ఈ క్రీ నీడలో మగ్గి పోయిందెవరు ? అందరూ పల్లకిల్లో వూరేగుతున్న పంచరంగుల స్వప్నావిష్కారంలో అసలు బరువు మోసిందెవరు? మేక్రో లెవల్లో ప్రపంచీకరణకు మైక్రో లెవల్లో సింగరేణి యెలా అద్దంగా నిలబడింది? … యిలా సవాలక్ష ప్రశ్నలకు వొక సాహిత్య రూపం యివ్వడం అందునా వాటికి సమాధానాలు వెతికే బృహత్ కార్యాన్ని వొక  కథలోకి కుదించే ప్రయత్నం సాహసమే. ఆ సాహసాన్ని యిష్ట పూర్వకంగా యెత్తుకొన్న రచయిత రఘువంశీ. ఈ పేరు యింతకు ముందు విన్నది కాదు. కథా వస్తువు , కథా రచన అతనికి కొత్త కాదు అనిపిస్తుంది. కథ రాసింది చేయి తిరిగిన యిన్ సైడ్ రచయితేనేమో అని  అనుమానం కలుగుతుంది. కథ నడిపిన తీరు కూడా దాన్నిబలపరుస్తుంది.

కథని కార్మికులవైపు నుంచీ గాక మిడిల్ మేనేజ్ మెంట్ లో పనిచేసే ఉద్యోగుల దృష్టి కోణం నుంచీ నడిపి పై ప్రశ్నలకి సమాధానం వెతికే ప్రయత్నం మరీ కత్తి మీద సాము లాంటిదే. ఆ సాములో  రచయిత యే మేరకు సఫలమయ్యాడో చూద్దాం.

లాభాల్లో కార్మికుల వాటా నిర్ధారించడానికి మెయిన్ ఆఫీసులో మేనేజిమెంట్ గుర్తింపు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపడానికి మీటింగ్ పెట్టుకొనే సమయానికి (సంస్థ లాభాలు గడించడం మొదలైన తొలి నాళ్లలో లాభాల్లో కార్మికుల వాటా పది శాతం వుండగా రాను రానూ అది  యిరవై శాతం వరకూ పెరిగింది. ఈ సంవత్సరం అది 23 శాతం) ఆఫీసు ముందు ఔట్ సోర్స్డ్ కార్మికులు ధర్నాకి దిగడం దగ్గర కథ మొదలైంది. ధర్నా కారణంగా ఆఫీసులోకి పోలేని ఆఫీసర్లు , ఉద్యోగులు, రెగ్యులర్ కార్మికులు చిన్న చిన్న గుంపులుగా బయట యే చెట్టు నీడనో కూర్చొని ధర్నా పూర్తి కాగానే లోపలోకి పోదామని యెదురు చూస్తుంటారు.

వాళ్ళలో అన్ని స్థాయీలకి చెందిన వాళ్ళున్నారు.  మే డే  ఫ్లెక్సీ మీద కూర్చొని స్మార్ట్ ఫోన్లలో విమన్స్ డే ఫోటోలు చూసుకొంటూ ముచ్చట్లు పెట్టుకొనే ఉద్యోగినులున్నారు. రావాల్సిన ప్రమోషనో కోరుకొన్న పోస్టింగో  రాక మేనేజిమెంట్ మీద అలిగిన ఆఫీసర్లున్నారు. మీడియా కెమెరా ముందు స్లోగన్లు యిచ్చి  కవరేజి అయిపోయాకా ధర్నా చేసే వాళ్ళు సర్దుకుపోతారని భావించే అత్యాధునికులున్నారు.  అమెరికాలో వున్న  కూతురు దగ్గరికో కొడుకు దగ్గరికో పోయొచ్చి అక్కడి నుంచీ తెచ్చుకొన్న వస్తువుల్ని ప్రదర్శించుకొనే క్లర్క్ లున్నారు.

యెవరి సామాజిక నేపథ్యాలు వాళ్ళకున్నా కళ్ళ ముందు జరిగే ధర్నా పట్ల వాళ్ళ వైఖరి మాత్రం వొక్కటే. నిర్లిప్తత. దాన్ని ఎష్టాబ్లిష్ చేయడానికి రచయిత చక్కటి వాతావరణం సృష్టించాడు.  మే డే వుమెన్స్ డే వేడుకలుగా కేవలం వుత్సవాలగానో మొక్కుబడి కార్యక్రమాలగానో  పరిణమించిన వైనం వంటి కథాంశానికి పనికి వచ్చే యెన్నో విషయాలు వాతావరణ వర్ణన ద్వారా ప్రతీకాత్మకంగా వ్యక్తమయ్యాయి.

అయితే ఔట్ సోర్స్డ్ కార్మికుల పట్ల వాళ్ళ సమస్యల పట్ల సానుభూతి , వాళ్ళ  డిమాండ్ లో న్యాయ బద్ధత పట్ల సహానుభూతి వున్న సీనియర్ ఆఫీసర్లు కూడా అక్కడ వున్నారు. వాళ్ళ మాటల్లో  సంస్థ పని తీరు గురించి యెన్నో విషయాలు చర్చకు వస్తాయి. ఔట్ సోర్సింగ్ కార్మికుల శ్రమే లాభాలుగా మారుతుందన్న స్పృహ కూడా వాళ్లకు వుంది. దాన్ని అర్హులందరికీ  పంచకుండా స్వార్థంతో తామే  అనుభవిస్తున్నామన్న అపరాధ భావనకూడా వుంది (ఒక విధంగా అటువంటి అపరాధ భావనే నాతో యీ వ్యాసం రాయిస్తోంది). హెచ్ ఆర్డీ లో పని చేస్తున్న సుదర్శన్ ఆలోచనల కేంద్రంగా చర్చ నడుస్తుంది. అదే డిపార్ట్ మెంట్ లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ రవిప్రసాద్ చర్చల్లో వ్యక్తమైన  ఆలోచనల్ని తార్కికంగా విశ్లేషిస్తూ పబ్లిక్ రంగ సంస్థల లక్ష్యాల్ని నిర్వచిస్తూ ప్రగతిశీల భావజాలంతో వచ్చిన మార్పుల పట్ల సమగ్ర దృష్టి  ప్రదర్శిస్తాడు.  ఫైనాన్స్ అధికారి చక్రపాణి సమస్యలోని ఆర్ధిక కోణాల గురించి సందేహాలు లేవనెత్తుతూ వుంటాడు. వయస్సులో అనుభవంలో జూనియర్ అయిన ఎకనామెట్రిషియన్ ప్రతిభ మధ్యలో ప్రశ్నలు సంధిస్తూ వుంటుంది. సుబ్రహ్మణ్యం మోహన్ రావు లాంటి వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచీ మాటలు అందిస్తూ వుంటారు. వీళ్ళందరి మాటల్లో కార్మికోద్యమాల నేపథ్యంగా సంస్థ గత చరిత్ర  వర్తమాన పరిస్థితుల  మధ్య సేతు నిర్మాణం జరుగుతూ వుంటుంది.

ధర్నాలతో సమ్మెలతో పని స్తంభింప జేయలేమని ధర్నా చేస్తున్న వాళ్ళకి తెలుసు. బయట చెట్ల కింద కూర్చున్న ఆఫీసర్లు కొందరు  లాప్ టాప్ ల ద్వారా ఆన్ లైన్లో ఆఫీసు పని చేస్తూంటారు. వెన్యూ మార్చుకొన్న మీటింగ్ తో సహా  యేదీ ఆగలేదు.

లాప్ టాప్ లు వర్చ్యువల్ ఆఫీసులు నడపొచ్చేమో గానీ బొగ్గు తవ్వలేవని కూడా ధర్నా కార్మికులకు తెలుసు. ‘తుపాకులు బొగ్గు తొవ్వలేవని నల్లటి బొగ్గుతో రాసిన గోడమీది నినాదం మసకబారిందేమో గానీ వాళ్ళ మనసుల్లో నుంచీ మాత్రం చెరిగిపోలేదు. ‘టోపీల వర్తకుడు – కోతుల కథ లో లాగా వర్తకుడికే కాదు ; కోతులకూ వాళ్ళ తాత తమ అనుభవాలు , జరిగిన చరిత్ర చెబుతాడుగా !’ అని ఆ సందర్భంలో  రవిప్రసాద్ చేసిన  వ్యాఖ్యానం అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ రాబోయే చర్చలో అతని మాటల విలువని అంచనా కట్టడానికి తోడ్పడుతుంది.

కంపారటీవ్ అడ్వాంటేజ్ ప్రిన్సిపుల్ పేర్న అమల్లోకి వచ్చిన ఔట్ సోర్సింగ్ కొందరికే అడ్వాంటేజ్ గా పరిణమించడం గురించి , కార్మికులకీ మేనేజిమెంట్ కీ మధ్య వొకప్పటి ఘర్షణాత్మక వైఖరి పోయి  లాభాల పంపకాలు మొదలయ్యాకా  నెలకొన్న సామరస్య విధానాల  గురించి ,  ట్రేడ్ యూనియన్ల మారిన  ప్రాధమ్యాల గురించి,  ప్రైవేట్ కాంట్రాక్టర్ల యాజమాన్యపు పని తీరు  గురించి , లాభార్జనలో భాగంగా కార్మికుల సంఖ్యని తగ్గించడంలో చేపట్టిన చర్యల గురించి , ఉపరితల గనుల గురించి , మెకనైజేషన్ గురించి , ఉత్పత్తి పెంపు గురించి , పర్యావరణ పరిస్థితుల గురించి అనేక విషయాలు వారి మాటల్లో చర్చకు వస్తాయి.

ఇవ్వాళ మేనేజిమెంట్ కీ  కార్మికులకీ మధ్య వైరుధ్యాలు తొలగిపోయి సయోధ్య సామరస్యాలు ఏర్పడడంతో యిద్దరికీ  విన్ విన్ సిట్యుయేషన్ లా కనిపిస్తుంది అని వొకరంటే అది  ‘దొంగలూ దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకొన్నట్టుంది’ అని గనుల్లో పనిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన  సుబ్రహ్మణ్యం తన భాషలో బదులిస్తాడు .

తన పాతికేళ్ళ వుద్యోజీవితాన్ని వొక్క సారి వెనక్కి తిరిగి చూసుకొన్న సుదర్శన్ కి సంస్థ గమనమంతా కళ్ళముందు కదలాడింది. జరిగిన సంఘటనల సారాంశం చూస్తే అతనికి యేదీ యాదృచ్ఛికంగా జరిగినట్టు అనిపించలేదు. అతనిలో యెన్నో సమాధానాలు తెలిసిన ప్రశ్నలే పునరావృతమౌతూ వుంటాయి.

సంస్కరణల అంతరార్థం అతనికి తెలుసు.  స్వచ్ఛంద పదవీ విరమణ(వి ఆర్ ఎస్) స్వర్ణ కరచాలనాలు (గోల్డెన్ షేక్ హాండ్స్) వంటి పథకాల అమలు ద్వారా ‘మిగిలిన ఉద్యోగ కాలంలో వచ్చే జీతాల కన్నా ఇవ్వజూపే పరిహారం ఎక్కువయ్యింది’. అయినా కంపెనీ వాటిని అమలు చేసింది. ఆ కార్మికుల ఉద్యోగుల స్థానంలో ఔట్ సోర్స్ కార్మికుల్ని తీసుకొంది. ఆ రోజోల్లో ఉత్పత్తి ఉద్పాదకత యంత్రీకరణ లాభాలు అన్న మాటలు తప్ప యాజమాన్యం కార్మికుల దృష్టి యితర విషయాల మీదికి పోకుండా వూదరగొట్టింది. అయితే ‘గనుల్లో కార్మికులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న మాన్ రైడింగ్ సదుపాయాలూ . షాఫ్ట్ లు ఏర్పాటు అవుతూ వచ్చాయి. సెమి మెకనైజేషన్ లో భాగంగా భూగర్భ గనుల్లో చిన్న స్థాయి యంత్రాలు వచ్చాయి. గని కార్మికులకు పీడకల లాంటి భుజాలపైనో తలపైనో తట్టలో ఖనిజం మోసే పని దగ్గర దగ్గర అంతర్ధానమైపోయింది.’ 80 ల్లో సింగరేణి కార్మిక కథల్లో రచయితలు వర్ణించిన దుర్భర పరిస్థితులు యిప్పుడు లేవు.

ఇదంతా – సంస్కరణల వల్లే జరిగిందని మేనేజిమెంట్ గొప్పగా చెప్పుకోవచ్చేమో గానీ – దశాబ్దాల పాటు కార్మికుల పోరాటాల ఫలితమే. ఉద్యమాల ద్వారా సాధించిన విజయమే.

ఈ విషయాన్ని కూడా రచయిత స్పష్టంగానే చెప్పాడు. ‘ ఇప్పుడున్న చట్టాలు … అందులోనూ కార్మిక చట్టాలు గమనిస్తే అనేక డిమాండ్ల ద్వారా … పోరాటాల ద్వారా ఇప్పుడున్న స్థితికి వచ్చాయి.’ అని పేర్కొంటాడు. అదేవిధంగా  సంస్థను అభివృద్ధిబాటలో నడిపించడానికి కార్మికుల హాజరు శాతం పెంచడం , ఉత్పత్తి ఉత్పాదకత పెంచడం , ఉత్పత్తి వ్యయం తగ్గించడం , యంత్రాల సామర్థ్యం పూర్తిగా వినియోగించడం వంటి సంస్కరణలు ఉడత సాయం లాంటివేననీ , ‘కృష్ణుడు చేసిన సాయం లాంటిది మాత్రం అవుట్ సోర్సింగేనని’ సుదర్శన్  నిర్మోమాటంగా  ప్రకటించాడు. ఆ గొంతు రచయితదే. సుదర్శన్  అవగాహనే రచయిత దృక్పథం.

అయితే కార్మికుల సంఖ్య కుదించడంతో మిగిలివున్న వారికి  వసతులు సౌకర్యాలు పెరిగాయి. ఒకప్పుడు నీటికోసం నీడకోసం గనుల్లో రక్షణ కోసం  కూడా సమ్మె చేయాల్సిన పరిస్థితులుండేవి. పర్మినెంట్ కార్మికుల జీతాలతో గానీ సదుపాయాలతో  గానీ పోల్చి నప్పుడు  ఔట్ సోర్స్డ్ కార్మికులు యెంత దోపిడీకి గురవుతున్నారో తెలుస్తుంది (ఔట్ సోర్స్డ్ కార్మికుల జీతం కంటే కంపెనీ కార్మికుల జీతం యెనిమిది రెట్లు యెక్కువ) .

ఈ క్రమంలో అన్ని విధాల  బాగుపడి బలిసిపోయింది  మాత్రం కాంట్రాక్టర్లే అన్నది జగమెరిగిన సత్యమే కానీ సంస్థ సాధించలేని దాన్ని వాళ్ళెలా సాధిస్తున్నారన్నదే తేలని నిగ్గు.

ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ , యెంతో పెద్ద సెటప్ , దశాబ్దాల అనుభవం , ప్రొఫెషనల్ మానేజిమెంట్ , డెవలప్ మెంట్ ప్రోగ్రాములు , ట్రైనింగులు , విదేశీ స్టడీ టూర్లూ చేయలేని చేయించుకోలేని పనిని యే మాత్రం అనుభవం లేని కాలేజి డ్రాపవుట్ కాంట్రాక్టర్ – కెపాసిటీ తక్కువ మెషీన్లతో తక్కువ ఖర్చుతో  క్వాలిఫైడ్ కాని వాళ్ళతో సాంకేతిక నైపుణ్యం లేనివాళ్ళతో  చిన్న సైన్యంతో చాలెంజి చేసి యెలా సాధించగలుగుతున్నాడన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న మిడిల్ మేనేజ్ మెంట్ ని సైతం తొలుస్తూనే వుంటుంది. కాంట్రాక్టర్ అనుసరించే పద్ధతుల్నే కంపెనీ కూడా ఫాలో అవ్వొచ్చుగా అంటే సమాధానం లేదు. లోపం ఎక్కడ వుంది? చేసే వాళ్ళలోనా – చేయించుకొనే వాళ్లలోనా ? కార్మిక వర్గ ప్రతినిధి అడిగే ప్రశ్నకి సమాధానం యిచ్చే నాథుడు లేదు.

అనేకమంది సృష్టించింది అందరూ అనుభవించాలి కానీ సంపద సృష్టించినవాడికి దక్కకుండా వొకరే అనుభవించడం  – యాజమాన్యం వొకప్పుడు – ఆ స్థానంలో మరికొంత మంది కార్మిక వర్గానికి చెందినవారు కూడా తోడవ్వడంతో  కార్మిక సమైక్యతకి పెద్ద విఘాతం ఏర్పడింది. కార్మికుడు మధ్యతరగతిగా యెదిగి తన మూలాలు మర్చిపోయి  పెటీ బూర్జువాగా తయారయ్యాడని కూడా రచయిత కథలో గుర్తించాడు.

కార్మికులు , చిన్న స్థాయి ఉద్యోగులు ‘నీడ్స్ హైరార్కీలో ఒక స్టెప్ పైకెళ్ళారు. ఇదివరకు ఆఫీసర్ల మానసిక స్థితికి ఇప్పుడు వాళ్ళు వచ్చారు…  టేబుల్ కి ఆపోజిట్ సైడులో ఉండవలసిన వాళ్ళు రెండో వైపుకు వెళ్ళిపోయారు. ఒకప్పుడు మానేజిమెంటు పనిచేయించేది అనుకుంటే కార్మికులు పనిచేసేవారు. కొద్ది మినహాయింపులతో ఇప్పుడు సంస్థ ఉద్యోగులంతా పనిచేయించే వాళ్ళయ్యారు. అవుట్ సోర్సుడు కార్మికులు పనిచేసున్నారు.’ కార్మికులూ కార్మిక నాయకులూ వర్గస్పృహ కోల్పోయారనీ వాళ్ళ వర్గస్వభావమే మారిపోయిందనీ రచయిత రవిప్రసాద్ ముఖత: చెప్పిన మాటల్లో  నిజం బాధించినప్పటికీ  అతని  విమర్శనాత్మక దృష్టిని కాదనలేం.

‘ప్రపంచాకార్మికులారా ఏకం కండు’ అని నినదించే ట్రేడ్ యూనియన్లు తోటి కార్మికుల కష్టాలకు స్పందించని స్థితికి చేరుకొన్నాయి. దేశంలో ట్రేడ్ యూనియనిజం వూబిలోకి స్వచ్ఛందంగా దిగిన   కార్మికులు  వేతనశర్మలుగా మారారు. సింగరేణి అందుకు మినహాయింపు కాదు.

 ‘ఎలెక్టయిన యూనియన్ నాయకులు ఆల్ మోస్ట్ ఒక డైరెక్టరు హోదా అనుభవిస్తున్నారు. ఎస్ యూ వీ ల్లో తిరుగుతూ,  ఒక ప్రజా ప్రతినిధికో , పెద్ద కాంట్రాక్టరుకో తీసిపోనట్టు ఆకారం , డ్రెస్సింగు , బాడీ లాంగ్వేజ్ తో అనుచచరగణంతో కనిపిస్తున్నారు’ .

రఘువంశీ పేర్కొన్న యూనియన్ నాయకుల యీ ధోరణిని ’80 ల్లో వచ్చిన కార్మిక కథల్లోనే రచయితలు తీవ్రంగా  అసహ్యించుకొన్నారు. చైతన్య వంతులైన కార్మికులు వారికి బుద్ధి చెప్పడం కూడా ఆ కథల్లో కనిపిస్తుంది.

యమ్మెన్సీ ల్లో గానీ కార్పోరేట్ సంస్థల్లో గానీ ట్రేడ్ యూనియన్ల వునికినే లేకుండా చేసిన పరిస్థితే కనపడుతుంది. అక్కడ కలెక్టీవ్ బార్గెయినింగ్ వుండదు. ఉద్యోగి యిండివిడ్యువల్ గా సంస్థతో డీల్ చేసుకుంటాడు. అక్కడ ఎంప్లాయీ మొబిలిటీ కూడా ఎక్కువే. కానీ పబ్లిక్ సెక్టార్లలో పరిస్థితి అలా కాదు. సంస్థతో ఉద్యోగులకు పర్మినెంట్ రిలేషన్ వుంటుంది. వేతన వొప్పందాల్లాంటివి యూనియన్ల ద్వారా జరగాల్సిందే.  కానీ సింగరేణిలాంటి సంస్థల్లో కూడా  ట్రేడ్ యూనియన్లు కార్మికుల బదిలీలు   క్వార్టర్ ఎలాట్ మెంట్లు లాంటి వాటికే పరిమితమయ్యాయి.

తొలి రోజుల్లో ఔట్ సోర్సింగ్ కీ మెకనైజేషన్ కీ ప్రైవేటీకరణకీ  వ్యతిరేకంగా పోరాడుతూ వాటిలోని అవినీతిని యెండ గడుతూ స్ట్రైక్ లూ  నిరసనోద్యమాలూ నడిపిన కార్మికుల్లో  తర్వాతి కాలంలో మార్పు వచ్చింది. ఉపరితల గనుల్లో లాగానే భూగర్భ గనుల్లో సైతం పనులు అవుట్ సోర్సింగు చేసి ఉత్పత్తి పెంచి ఇంటెన్సీవ్ ఇస్తే బాగుండునని భావించే దిశగా వాళ్ళు నడుస్తున్నారు.

ఒకప్పుడు నష్టాల వల్ల బి ఐ ఎఫ్ ఆర్ కి వెళ్ళి పునర్నిర్మాణ పేకేజీ కొన్ని మాఫీలు కొన్ని రాయితీలు కొన్ని ఆంక్షలతో కంపెనీ లాభాల బాట పట్టాకా  రెగ్యులర్ ఉద్యోగులకూ కార్మికులకూ బోనస్ రూపంలోగానీ ప్రత్యేక ఇన్సెంటీవ్ రూపంలో గానీ అందుతున్న లాభాల్లో  ప్రైవేట్ /కాంట్రాక్ట్ / ఔట్ సోర్స్డ్ కార్మికుల పాత్ర బుద్ధిపూర్వకంగానే విస్మరణకి గురైంది.  ఒకరి లాభం మరొకరి నష్టం అన్న సూత్రం ప్రకారం ఆలోచిస్తే విషయం స్పష్టమౌతుంది. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమే లాభాలుగా మారుతున్న విషయం తెలిసీ రెగ్యులర్ కార్మికులతో పాటు వారిక్కూడా వాటా పంచడానికి కంపెనీ సిద్ధంగా వుందా అన్నది ప్రధానమైన ప్రశ్న. అయితే ‘కింద పడ్డ చిక్కుడు గింజను సైతం నలుగురూ పంచుకావాల’న్న స్ఫూర్తితో  తోటి కార్మికులకి భాగం యివ్వడానికి కంపెనీ కార్మికులు అంగీకరిస్తారా అన్నది దాని అనుబంధ ప్రశ్న.

ధర్నాకి నాయకత్వం వహిస్తున్న ‘లక్ష్మణ్’ సరిగ్గా యిదే అడుగుతున్నాడు. శ్రమ ఫలాలు అందరికీ దక్కకపోవడం గురించే అతనికి పేచీ.

‘గత దశాబ్ద కాలంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య ఎంత? అప్పటి ఉత్పత్తి ఎంత? ఇప్పటి ఉత్పత్తి ఎంత? పెరిగిన ఉత్పత్తి తగ్గిన మానవ వనరులతో ఎలా సాధ్యపడింది?? ఉత్పత్తిలోనూ లాభాలలోనూ పెరుగుదలకు ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత , అందులో కాంట్రాక్టరు ద్వారా పనిచేసే మా పాత్రేమీ లేదా?’ అని అతను నిలదీస్తున్నాడు. అందుకే కంపెనీ ఉద్యోగులతో పాటు లాభాలలో న్యాయబద్ధమైన  వాటాని డిమాండ్ చేస్తున్నాడు.

సాంకేతికంగా కంపెనీ యాజమాన్యానికి ప్రైవేటు కార్మికులతో సంబంధం లేదని కంపెనీ వాదన. నిజానికి కార్మిక కుటుంబాలకు విద్య – వైద్యం , వసతి సౌకర్యాలు , పి ఎఫ్ , గ్రాటిట్యుటి , ప్రమాదాల్లో నష్ట పరిహారాలు వంటి  కార్మిక  సంక్షేమాల  బాధ్యత నుంచి  తప్పించుకోడానికే ఔట్ సోర్సింగ్ వంటి నూతన విధానాల్ని కంపెనీలు అమల్లోకి తెచ్చాయి.

ఒకప్పుడు బర్మా క్యాంప్ , పంజాబ్ గడ్డ, ధనబాద్ కాలనీ లాంటి నరక కూపాల్లో నిత్య పీడననీ దోపిడీనీ యెదుర్కొన్న వలస కార్మికుల కంటే  ఔట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థితి మెరుగేనని రచయిత పేర్కొన్నప్పటికీ కార్మిక చట్టాల్ని నిర్వీర్యం చేయండంలో కాంట్రాక్టర్లు ఆరితేరి పోయారు.  ఔట్ సోర్సింగ్ కార్మికులకు అన్ని విధాలా  కాంట్రాక్టరే యజమాని. కంట్రాక్టర్ కనీస వేతనాలు చెల్లించాలనీ పి ఎఫ్ వంటి కార్మిక చట్టాలని వర్తింపజేయాలనీ కంపెనీతో వొప్పందాలు వుంటాయి. కానీ అవి సరిగ్గా అమలవుతున్నాయా అన్న పర్యవేక్షణ నామమాత్రమే. ఔట్ సోర్స్డ్ కార్మికులకి కంపెనీ  మేనేజ్ మెంట్  అదృశ్య శత్రువు. దాంతో చేసే పోరాటం మేఘనాథుడితో యుద్ధం చేసినట్టే. అందుకే  కాంట్రాక్ట్ కార్మిక నాయకుడికి రచయిత ‘లక్ష్మణ్’ అని పేరు పెట్టాడు.

కంపెనీ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల మధ్య చీలిక తెచ్చి  శత్రు వైరుధ్యం సృష్టించడంలో యాజమాన్యం యేదో వొక మేరకి సఫలమైంది. అందుకే ధర్నా పట్ల కార్మికులకీ వుద్యోగుగులకీ వొక రకమైన అనాసక్తి. నిర్లిప్తత. ఒకప్పుడు ఆ ధర్నా స్థలంలోనే తాము కూర్చుని యెన్నో డిమాండ్లు సాధించుకొన్నా మని కూడా వాళ్ళు మర్చిపొయారేమో! లేదా న్యాయబద్ధమైన ఔట్ సోర్సింగ్ కార్మికుల పోరాటానికి మద్దతిస్తే తమ వాటాలో కోత పడుతుందని స్వార్థంతో కూడిన  భయంకూడా కావొచ్చు.  యాజమాన్యానికి వ్యతిరేకంగా  కార్మికులందరి పోలరైజేషన్ జరిగితే సంస్థ ఉద్యోగులూ కార్మికులూ యెటు నిలబడతారన్న విషయంలో కొత్త సందర్భంలో సందేహానికి తావు లేదు.

కథ నిర్మాణం విషయానికొస్తే కథలో సంఘటనల్లేవు. కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాతో కథ ప్రారంభమైనప్పటికీ తోటి వుద్యోగుగులకూ కార్మికులక్కూడా అదొక సంఘటనలా అనిపించలేదు. ఏదో రొటీన్ గా  అలవాటైన కార్యక్రమంలా ‘పెద్ద ఉత్సుకత కలిగించలేదు’. కథ మొత్తం  ధర్నాకి కారణమైన పరిస్థితుల్నే చర్చించింది కానీ సారంలో కథాంశాన్ని పాఠకులకు చేరవేయడంలో వొక  వ్యాసంలా నడిచింది. రఘు వంశీకి యిదే మొదటి కథ కాకపోవచ్చని కథ చదువుతుంటే బలంగా అనిపిస్తుంది. వ్యాసంలో చెప్పాల్సిన విషయాల్ని కథలోకి తీసుకురావడంలో యిబ్బందుల్ని అధిగమించడానికి రచయిత పడిన స్ట్రగుల్ అడుగడుగునా కనిపిస్తుంది. కార్మికుల వైపు నుంచీ కాకుండా ఆఫీసర్ల చర్చలు సంభాషణలు వాదోపవాదాల ద్వారా నడిపిన టెక్నిక్ కొత్తది కాదు ;కానీ యీ జెనర్ లో కథా నిర్వహణ చాలా కష్టం. తుమ్మేటి రఘోత్తం రెడ్డి ‘చావు విందు’ గుర్తుకు వచ్చినప్పటికీ ముళ్ళపూడి సుబ్బారావు ‘రెండు నదుల మధ్య’ లో వాడిన  టెక్నిక్ కి యిది దగ్గరగా వుంది (శిల్ప పరంగా ఇంగ్లీష్  సినిమా ‘Bridge on the River Kwai’ , రావిశాస్త్రి కథ ‘ఆఖరి దశ’ లీలగా తన మనస్సులో మెదిలాయని రచయిత నాతో మాటల్లో ప్రస్తావించారు).

కథ చివరికొచ్చేసరికి జరిగిన సంఘటన – రైతు ఆత్మహత్య. దాంతో కథలోకి నూత్న కోణాలు వచ్చి చేరాయి. కథలో రచయిత తన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి ఆ యా సందర్భాలకు అనుగుణంగా అవసరమైన కంఠ స్వరాల్ని యెన్నుకొన్నప్పటికీ రైతు ఆత్మహత్య ద్వారా దాన్ని బలంగా ఆవిష్కరించగలిగాడు. అంతవరకూ కేవలం తర్కబద్ధ వాదనలకీ సంభాషణలకీ పరిమితమై ఇమోషనల్ కోషేంట్ కి అవకాశంలేక డ్రైగా వున్న కథలోకి వొక బలమైన  వుద్వేగపు అల చొచ్చుకువచ్చి పాఠకుణ్ని తాకుతుంది.

ఉపరితల గనుల  పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు  దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో యెక్కడికక్కడ వ్యవసాయ భూములు సాగు యోగ్యతను కోల్పోయాయి. ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలు వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం, చమురు కాలుష్యం పర్యావరణాన్ని ఎక్కువగా దెబ్బతీశాయి. జంతు జీవాలకూ ముప్పు యేర్పడింది. పంటపొలాల్లో భూసారం తగ్గిపోయి, ఎరువుల వినియోగం పెరిగిపోయింది. దీంతో రైతులకు సాగు ఖర్చులు పెరగడంతో పాటు , పంట దిగుబడులు కూడా తగ్గిపోతున్నట్లు , పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ రైతు మరణానికి అదృశ్య కారణాలే.

ఉత్పత్తి ప్రక్రియలో జరిగే పర్యావరణ విధ్వంసం గురించి , ఆ ప్రాంత ప్రజలు కోల్పోయిన మానసిక ప్రశాంతత గురించి , బొగ్గు రవాణా సందర్భంలో  చోటుచేసుకొనే యాక్సిడెంట్లు గురించి, ‘సోషల్ కాస్ట్’ గురించి , దాన్ని భరిస్తున్న పౌర సమాజం గురించి  లోతుగా ఆలోచించి  కంపెనీ లాభాల్లో న్యాయబద్ధమైన  యితర వాటాదార్లు గురించి ప్రస్తావించిన రచయిత దృష్టి యెందుకో రైతు చావుకి కారణాల పైకి , ఓపెన్ కాస్ట్ యజ్ఞంలో సమిధలైన  భూనిర్వాసితుల స్థితి గతులపైకి పోలేదు. అవన్నీ చెప్పాలంటే పెద్ద నవలే అవుతుందేమో! ఇప్పటికే కథ నిడివి పెరిగింది. కానీ సింగరేణి నిర్దిష్టత నుంచి మొత్తం దేశంలో కార్పోరేట్ కి అనుకూలంగా అమలయ్యే పారిశ్రామిక విధానంలోని అపసవ్యతని – పేద్ద భూతాన్ని చిన్న సీసాలో బంధించి చూపినట్టు – కథలోకి యిమిడ్చిన నేర్పు అభినందనీయం.

పాప పరిహారం లాంటి సి యస్ ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) లోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడానికి రచయిత వెనకాడ లేదు. దాన్ని చాటల కొద్దీ స్వయంపాకం తీసుకొని అందులో వొక గుప్పెడు గింజలు వొక కూరగాయ తిరిగి యిచ్చి రుణ విముక్తుడయ్యే యాయావార బ్రాహ్మణుడి వ్యవహారంతో పోల్చాడు. అది  కార్పోరేట్ సంస్థలు అపరాధ భావన నుంచి తప్పించుకొనే మొక్కుబడి  మాత్రమే. మళ్ళీ పాప పంకిలం లో దొర్లడానికి సిద్ధమయ్యే  గంగా స్నానం వంటి కంటి తుడుపు వ్యవహారం అది. అదొక పర – ఆత్మ వంచనల అందమైన మేళవింపు.

రైతు ఆత్మహత్య వుదంతాన్ని మరీ కథ చివర్లో కాకుండా కథ మధ్యలోనే చెప్పి దానికి కారణమైన పరిస్థితుల్నీ అందుకు వుపరితల గనుల్లో చోటుచేసుకొన్న రిగరస్ మైనింగ్ ప్రమేయాన్నీ ప్రస్తావించి కార్మికుల ధర్నానీ రైతుల వూరేగింపునీ సమాంతరంగా నడిపి వుంటే కథలో చిక్కదనం వచ్చేది. ‘ఒక వేళ కాంట్రాక్ట్ కార్మికులు పొందాల్సింది పొందితే తర్వాత మిగులులో వాటా కోసం రైతులే ధర్నాకి కూర్చుంటారేమో’ అని రచయిత ( సుదర్శన్ ద్వారా ) లేవనెత్తిన సందేహం మరింతగా జస్టిఫై అయ్యేది. కేవలం వాదోపవాదాలకే కాక ఉద్వేగ భరిత కథనానికి  కూడా కథలో చోటు దొరికేది. కథ పొడవునా వొక మూడ్ క్యారీ అయ్యేది. అల్లం రాజయ్య ‘అతడు’ కథలో యీ టెక్నిక్ ని గమనించవచ్చు.

యేది యేమైనా శ్రమజీవుల స్వేద ఫలం దాని నిజమైన ‘హక్కుదార్ల’కు  దక్కేవరకూ  మహాశ్వేతాదేవి బషాయి టుడు లాగా ‘అతడు’ -రమాకాంత్ కావచ్చు,  కథలోని లక్ష్మణ్ కావచ్చు, భూనిర్వాసితుడు కావొచ్చు , పర్యావరణ ప్రేమి కావొచ్చు  – మళ్ళీ మళ్ళీ పుడుతూనే వుంటాడు. ధర్నా చౌక్ రణస్థలి గానే వుంటుంది. పాత్రలు పాత్రధారులు మారినా అన్యాయానికి విరుద్ధంగా పోరాటాలు ఆగవు , పోరాడే శక్తులు యేదో వొక రూపంలో నిత్యం చలన శీలంగానే వుంటాయి-  అనే యెరుకని అంతిమంగా కల్గించినందుకు రచయితకి థేంక్స్.

 

  •                         

 

అసమ దాంపత్య బంధంలో ఎక్స్ ట్రా నాట్!

 

 

-ఎ . కె . ప్రభాకర్

~

 

స్త్రీవాద రచయితల్లో గీతాంజలి (డా. భారతి)ది విలక్షణమైన గొంతు. ప్రగతిశీలమహిళా వుద్యమాల్లో క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తగా స్వీయ జీవిత అనుభవ నేపథ్యం నుంచి ఆమె రచించిన ‘ఆమె అడవిని జయించింది’ నవల నూత్నవస్తు – శిల్పాల స్వీకృతి కారణంగా గొప్ప సంచలనం సృష్టించింది. కుటుంబంలో లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య భావజాల నిరసన   – స్త్రీల సమస్త శక్తి యుక్తుల్ని హరించి వాళ్ళను బోన్సాయ్ మొక్కలుగా మార్చే ఇంటి చాకిరీలోని అమానవీయ కోణాలు –  కనపడని గృహహింసకు బలయ్యే స్త్రీల ఆవేదన – పసిపిల్లలమీద జరిగే అత్యాచారాలు – ఆడదాని గర్భసంచి చుట్టూ అల్లుకొన్న రాజకీయాలు  గీతాంజలి తొలినాళ్ళలో రచించిన కథలకి (బచ్చేదానీ – 2004 ) ముఖ్య వస్తువు. ఓల్గా లాగానే స్త్రీ శరీరాన్ని కేంద్రం చేసుకొని అమలయ్యే పురుషాధిపత్య రాజకీయాలను బలంగా యెండగట్టడంతో గీతాంజలి ఆగిపోలేదు. ఒక డాక్టర్ గా , సెక్సాలజిస్టుగా ఫేమిలీ కౌన్సిలింగ్ కోసం తన దగ్గరకొచ్చే స్త్రీల హృదయవిదారకమైన జీవితాలను గొప్ప ఆర్తితో వర్ణించింది. ఆ కథల్లో ( పహెచాన్ – 2007) యెక్కువ భాగం ముస్లిం స్త్రీలకు చెందినవే కావడం విశేషం. దుర్భర దారిద్ర్యంలో నలిగిపోతూ కమ్యూనిటీ లోపలా బయటా పురుషాధిపత్య – మత భావజాలంతో పెనుగులాడే ముస్లిం మహిళల  దు:ఖ మూలాల్ని వెతికే క్రమంలో తనది కాని జీవితాలతో మమేకమౌతూ సాటిలేని సహానుభూతితో డా. గీతాంజలి కలం నుంచి వెలువడ్డ కథలు అనితర సాధ్యాలు. షాజహానా వంటి ఇన్ సైడ్ రచయితలు మాత్రమే రాయగలిగినవి.

ఇవన్నీ వొక యెత్తయితే  రైతుని నమ్ముకొన్న నేలకి దూరం చేసే సెజ్ లకు వ్యతిరేకంగా ఆమె కలం పదునెక్కింది. కరువు కోరల్లో చిక్కుకొని బతుకు తెరువు వెతుక్కుంటూ దేశాలు పట్టిపోయే పాలమూరు వలస కూలీల వెతల్ని జీవన్మరణ పోరాటాన్ని వాళ్ళ భాషలోనే (పాలమూరు వలస బతుకు చిత్రాలు – 2015) చిత్రించింది.

రచయితగా సామాజిక కార్యకర్తగా  సమాజంలో పాతుకుపోయిన సకల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే ‘మూసి ఉన్న తలుపులు వెనకాల పెళ్లి , దంపత్య జీవితం , రొమాన్స్ పేర్లతో … పెళ్లి , భర్త అనే చట్టబద్ధమైన లైసెన్సులతో  … స్త్రీల మనో దేహాల మీద జరిగే దాడి … సెక్సువల్ వయోలెన్స్’ ఎంత భయానకంగా ఉంటుందో తెలియ జేస్తూ ‘మగవాళ్ళను సెన్సిటైజ్ చేయాలనే’ వొక బలమైన ఆశతో స్త్రీల లైంగిక రాజకీయాల గురించి నిర్దిష్టమైన అవగాహనతో   గీతాంజలి రాస్తోన్న కథల పరంపరలో – శిలగాని శీల , ఫ్రిజిడ్ , నింఫోమేనియా మొదలైన  కథలు సాహిత్య ప్రపంచంలో తీవ్రప్రకంపనాలు సృష్టించాయి. ఆ క్రమంలో యింతకు మునుపు యే రచయితా స్పృశించని విలక్షణమైన వస్తువుతో వచ్చిన కథ ‘ హస్బెండ్ స్టిచ్’ ( విహంగ , మహిళా సాహిత్య మాస పత్రిక – జనవరి 2014) .

  కథ  లింక్   :  http://vihanga.com/?p=10972#sthash.25kbCw4h.dpbs

 

 

పాపినేని శివశంకర్ ‘మనుషులు వదులవుతారు’ (కథ – 1999) కథలో వొక  భర్త వయసు పెరిగిన భార్య వొదులై పోయిందని వేరే స్త్రీతో సంబంధం కోసం ప్రయత్నిస్తుంటాడు . అతనలా వెంపర్లాడుతున్నాడని తెలుసుకొని ‘నేనంటే నా ఒళ్ళు మాత్రమేనా’ అని ప్రశ్నించుకొని ఆమె వాపోతుంది. ‘మాయదారి సంసారాల్లో ఎక్కడో పెద్ద మోసం దాగుంది’ అని గ్రహిస్తుంది.

శివశంకర్ కథలో ‘సతీ సావిత్రి’ కి తన శరీరమ్మీద కనీసం గౌరవమైనా మిగిలి వుంది. సంసార సంబంధంలో యేదో మోసం వుందన్న యెరుక వుంది.  గీతాంజలి కథలో పాపం సుశీలకి ఆ రెండూ లేవు. ఆమె తనను నిర్లక్ష్యం చేసిన భర్త శంకర్రావుని మళ్ళీ తన దగ్గరకు రప్పించుకోడానికి పడరాని పాట్లు పడింది.

‘సంవత్సరం నుంచి మా మధ్య శారీరక సంబంధం లేదు’ … ‘నాతో సెక్స్ బాగోలేదట – నీది ఒదులైపోయింది అందుకే రావాలన్పించడం లేదంటాడు … ‘ఆయన మళ్ళీ నా దగ్గర్కి రావాలి. రావాలంటే నేను ఆపరేషన్‌ చేయించుకుని పెళ్ళికి ముందులా తయారవ్వాలి’ అని సుశీల తన  స్నేహితురాలు మంజులకి సిగ్గు విడిచి చెప్పుకొంది.

మాయదారి సంసారాల్లో దాగున్న మోసాన్ని గ్రహించలేక తన అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టక ఎక్స్ ట్రా నాట్ కి సిద్ధపడింది. అందుకు తాహతుకి మించిన అప్పుచేయడానికి సైతం వెనకాడలేదు. డాక్టర్ హెచ్చరించినా వినక ప్రాణం మీదకి తెచ్చుకొంటుంది. ఇదీ ‘ హస్బెండ్ స్టిచ్’ లో స్థూలంగా కథ .

సుశీల అభద్రతకీ భయానికీ దు:ఖానికీ  కారణాలని రచయిత కథ నుంచీ పక్కకు వెళ్లి యెక్కడా ప్రత్యక్షంగా పేర్కొనక పోవడంలో గొప్ప సంయమనం ప్రదర్శించింది. దాంపత్య జీవితంలోని లైంగికత గురించి –  నియంత్రణల గురించి – పురుషానుకూలగా యేక పక్షంగా పాతుకుపోయిన  సామాజిక చట్రాల గురించి – భావజాలం గురించి పాఠకుల్లో సవాలక్ష ఆలోచనలు , ప్రశ్నలు పుట్టాడానికి అవకాశం యిచ్చే విధంగా కథాగమనంలో  అనేక పొరలు నిర్మించింది. గీతాంజలి రచించిన యితర కథలనుంచి ఈ కథ ప్రత్యేకంగా రూపొందడానికి అందులో వాడిన విశిష్టమైన శిల్పమే కారణమైంది ( గీతాంజలి కథల్లో కథ పొడవునా వొక వొడవని దు:ఖం చెవులు హోరెత్తేలా గుండెలు అవిసేలా వినిపిస్తూ వుంటుంది. కానీ ఈ కథలో మాత్రం దు:ఖ కారణాలే అక్షరాల మాటున దాగి రహస్యంగా ధ్వనిస్తాయి) .

వస్తు స్వీకరణ దగ్గర్నుంచీ యెత్తుగడ , యితివృత్త నిర్వహణ,  పాత్రల యెంపిక , ముగింపు అన్నీ చక్కగా అమరిన కథ యిది. దాంపత్య సంబంధంలో లైంగిక ప్రక్రియలో మాధుర్యం గురించి పురుష దృష్టికోణం నుంచే నిర్వచించే భావజాలాన్ని నిరసిస్తూ పడక గదుల్లో అమలయ్యే పురుషాధిపత్య లైంగిక రాజకీయాల మూలాల్ని  స్త్రీవాద సాహిత్యం చాల చోట్ల చర్చకి పెట్టినప్పటికీ ‘‘ హస్బెండ్ స్టిచ్’’ లాంటి వస్తువుని యెవరూ యెక్కడా స్వీకరించిన దాఖలాల్లేవు. అందువల్ల గీతాంజలి కథల్లోనే కాదు ; స్త్రీ వాద సాహిత్యంలో సైతం యీ కథ ప్రత్యేకంగా నిలుస్తుంది.

బిడ్డ సైజ్ పెద్దగా వున్న కారణంగానో , సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేని కారణంగానో , బిడ్డకో తల్లికో ప్రాణాపాయం యెదురైన హడావిడిలో కాన్పు చేసే  కారణంగానో … ప్రసవ సమయంలో స్త్రీ జననాంగం చిరగడం వల్ల కావొచ్చు లేదా ప్రసవం తేలికగా కావడానికి కట్ (episiotomy ) చేయడం వల్ల కావొచ్చు ;  ప్రసవానంతరం మళ్ళీ పూర్వ స్థితి కోసం కుట్లు వేయాల్సిన అవసరం యేర్పడుతుంది.  అలా కుడుతూ – దాంపత్యంలో భర్తకి తృప్తి కలగడానికి వొకటి రెండు కుట్లు అదనంగా వేస్తారు. చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియలో ఆ స్త్రీ ప్రమేయం వుండదు. కోసినట్టుగానీ అదనపు కుట్లు వేసినట్టుగానీ ఆమెకు తెలియజేయడం జరగదు. ఒక్కోసారి యిది భర్త కోరిక మేరకు చేస్తారు. లేదా డాక్టరే స్వయంగా నిర్ణయం తీసుకొని చేస్తారు. భర్త కోసం వేసే అదనపు కుట్టు కాబట్టి దీన్ని హస్బెండ్ స్టిచ్ అనీ ఎక్స్ ట్రా నాట్ అనీ అంటారు. భర్తల్ని సుఖపెట్టడానికి ,మగవాళ్ళు పక్కదారులు పట్టకుండా దాంపత్య బంధాన్ని నిలుపుకోడానికి ఎక్స్ ట్రా నాట్ బలమైన సాధనం అని నమ్మే స్త్రీలు కూడా ఉంటారు. అయితే దీని వల్ల ప్రయోజనం వుండదనీ తర్వాతి కలయికల్లో స్త్రీలు నరకాన్ని అనుభవిస్తారనీ , భర్తలు కూడా సుఖపడరనీ సర్వేల ద్వారా పరిశోధనలద్వారా తెలుస్తోంది (వివ . Mama Birth – July 28 , 2013). వ్యాపార దృష్టి లేని మంచి  డాక్టర్లు ఈ ప్రొసీజర్ ని ప్రోత్సహించరు.

‘కాన్పులనీ , కుట్లనీ , సిజేరియన్లు , హిస్టెరెక్టమీలు – ట్యూబెక్టమీలు రీకేనలైజేషన్లనీ అన్ని గాట్లు, కాట్లు ఆడవాళ్ళకు అవుతూనే ఉంటాయనీ’ అలా స్త్రీ శరీరమ్మీద పెద్ద వైద్య వ్యాపారం జరుగుతోందని చెప్తూ  , అందాల అంగడిలోనూ –   ఆరోగ్య విపణిలోనూ స్త్రీ శరీరం సరుకైన వైనం చుట్టూ అల్లిన సాహిత్యం చదువుకొన్నాం. ఆ క్రమంలో వచ్చిన డా. గీతాంజలి ‘హస్బెండ్ స్టిచ్’  బలమైన కథగా రూపొందడానికి కారణం – వస్తు శిల్పాల చక్కటి సమన్వయమే. కథలో కథని మాత్రమే చెప్పాలన్న సూత్రాన్ని రచయిత నిక్కచ్చిగా పాటించింది.

కథకి అవసరమైన సాంకేతికమైన  వైద్య పరమైన విషయాల్ని  కథలో రచయిత్రి  నేరుగా ప్రస్తావించకుండా డాక్టర్ ముఖత: చెప్పించడంతో ప్రతిపాదితాంశాలకి   ప్రామాణికత విశ్వసనీయత లభించాయి. సుశీల దాంపత్య జీవితంలో యెదుర్కొనే సమస్యనీ , అందుకు ఆమె యెంచుకొన్న పరిష్కారాన్నీ , అందులోని సాధక బాధకాల్ని విప్పి చెప్పడానికి  గీతాంజలి కథని నెరేటివ్ స్టైల్లోగాక సంభాషణ శైలిలో నడిపింది. అందువల్ల కథలో రచయిత ప్రమేయం దాదాపు శూన్యమే. సుశీల తన బాల్య స్నేహితురాలు మంజులతో , పక్కింటి సుమతితో , డాక్టరమ్మతో చేసిన మూడు సంభాషణల్లో రచయిత్రి కంఠస్వరం డాక్టర్ పాత్రలో స్పష్టంగా వినిపిస్తుంది. రచయిత్రి నిజ జీవితంలో  తన దగ్గరకి కౌన్సిలింగ్ కోసం వచ్చే సుశీల లాంటి పేషంట్ల పట్ల చూపే సహానుభూతే డాక్టర్ మాటల్లో ప్రతిధ్వనించింది.

‘కాన్పు తర్వాత యోని కండరాలు మళ్ళీ సంకోచించి పోతాయి. వాటికి సాగే గుణంతో పాటు ముడుచుకునే గుణం కూడా ఉంటుంది. చాలా తక్కువ కేసుల్లో 10,12 మంది పిల్లల్ని కన్న వాళ్ళల్లో, నీలా పల్లెల్లో మంత్రసానులతో కాన్పులయిన వాళ్ళలో ఈ సమస్య వస్తుంది

‘నీ భర్తను ఒకసారి కౌన్సిలింగ్‌కి నా దగ్గర్కి తీసుకురా అతనికి అంతా వివరంగా చెప్పి నిన్నిలా వేధించద్దని చెప్తాను. నీకు కొన్ని ఎక్సర్‌ సైజులు చెప్తాను , అవి చేస్తే ఇంకా బిగుతయ్యే అవకాశం ఉంటుంది.

‘ఈ ఆపరేషన్‌ అయ్యాక అంతా బాగవుతుందనుకోవద్దు. నీ భర్తకు బాగుండచ్చు కానీ కుట్లు మరీ బిగుతై పోయి కలయిక భరించలేనంత నొప్పిగా ఉండి దాంపత్య జీవితం పట్ల భయం కలుగవచ్చు. మధ్య మధ్యలో యోని నించి రక్తప్రావం అవుతూ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి.’

డాక్టర్ చెప్పే మాటల్లోని సారాంశం భరోసా హెచ్చరిక  సుశీలకి యెక్కలేదు. జీవితంలోని అభద్రతే ఆమెని భయపెట్టింది. అందుకున్న యితరేతర కారణాలని కూడా రచయిత సుశీల అంతర్మథనం ద్వారా స్పష్టం చేస్తుంది. నిజానికి సుశీల ‘పెళ్ళైన వాడని తెల్సీ’ ఎందుకో శంకర్రావంటే  ‘పిచ్చి ఆకర్షణ కలిగి అతనితో పారిపోయి గుళ్ళో పెళ్ళి చేసేస్కుంది. అమ్మ, నాన్న వెళ్ళగొట్టారు. అతని మొదటి భార్య విజయ ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికింది . ఆమెకిద్దరు మగ పిల్లలు. తనకు కవల ఆడపిల్లలు పుట్టారు.’

సుశీలకి పెళ్లై నాలుగేళ్లే. కానీ దాంపత్య జీవితంలో ఎన్ని రకాల దు:ఖాల్ని మోసుకు తిరుగుతుంది? అందుకు కారణం తాను వొదులై పోవడమా? ఆడపిల్లల్ని కనడమా? రెండో భార్య కావడమా ?ఆమెకు అర్థం కాదు. అసలు కారణం శంకర్రావులోని చావనిస్ట్ మగాడు. కన్న బిడ్డలు తండ్రి ప్రేమకి దూరం కాకుండా వుండడానికి ఆమె తోటి స్త్రీతో పోటీకి దిగింది. భర్త తన కొంగు వదలకుండా వుండేలా చేసుకోడానికి దేనికైనా సిద్ధపడింది. తన శరీరాన్ని పణ్య వస్తువు చేసుకొని మొగుడిని ఆకర్షించే ఆలోచనలు చేసింది. ఆకట్టుకొనే దారులు వెతికింది. అటువంటి పరిస్థితుల్లో పక్కింటి సుమతి   [పేర్ల ఎంపికలో కూడా రచయిత్రి  దృక్పథం వ్యక్తమౌతుంది ; స్త్రీని కేవలం శరీరంగా , సెక్స్ అవసరాలు తీర్చే యంత్రంగా భావించే శంకర్రవులాంటి శృంగార పురుషుల్ని అన్నివిధాలా సుఖపెట్టడానికే అంకితమైన – పాతివ్రత్య ధర్మాలు జీర్ణించుకొన్న పురాణ పాత్రలు ]  మాటలు సుశీలకి అమృతోపమమయ్యాయి.

కాన్పు అయ్యాక మానం వెడల్పుగా సాగుతుంది కదా భర్తకు తర్వాత కలయిక బాగుండాలని, అక్కడ బిగుతుగా ఉండాలని ఒక కుట్టు ఎక్స్‌ట్రా వేస్తార్లే. నేను నా రెండు కాన్పులకీ వేస్కున్నానాకు ముందే తెల్సు. డాక్టరమ్మని ముందే అడిగా. ఎక్స్‌ట్రా మనీ అడిగిందనుకో, కాపురం కంటే ఎక్కువా చెప్పు? మా ఆయనా పోరు బెట్టాడనుకో డాక్టరమ్మ ఎంత డబ్బడిగితే అంతిచ్చాడు తెల్సా ? నువ్వూ అట్లా చేయించుకోవాల్సింది’

సుమతి సుశీలతో అన్న మాటల్లో కాపురాలు కాపాడుకోటానికి దాంపత్య సంబంధాల్ని సడలకుండా చూసుకోడానికి స్త్రీలు పడుతున్న అవస్తలే కాదు ; ఎక్స్ ట్రా నాట్ లు డాక్టర్లకి ఎక్స్ ట్రా మనీ మూటలు కట్టడానికి యెంతగా తోడ్పడుతున్నాయో తెలుస్తుంది. అందుకు భర్తలు యెంత వుదారంగా వుంటారో దూరదృష్టితో ప్రవర్తిస్తారో అర్థమౌతుంది.

నా దగ్గర్కి ఆయన రావాలి మేడమ్‌. పిచ్చెక్కుతోంది ఆయన రాకపోతే. సెక్స్‌ కోసం కాదు మేడమ్‌ నాకు ఆయనంటే ప్రేమ. పిల్లలు నాన్న కావాలంటారు. నా దగ్గర ఆకర్షణ లేకపోతే ఎందుకొస్తారు మేడమ్‌? నాకు ఎక్స్ ట్రా నాట్‌ కావాలి . పల్లెటూల్లో కాన్పు కావడం వల్ల అక్కడ మీ లాంటి డాక్టరమ్మ కాకుండా మంత్రసాని తో కాన్పు చేయించుకున్నా . అందుకే వదులై పోయింది మేడమ్‌. నేను టైట్‌ చేయించుకోవాలనుకుంటున్నా.

అని సుశీల డాక్టరమ్మని ప్రాధేయపడింది. సుశీల యెదుర్కొన్న హైన్యం మనస్సుని కలచివేస్తుంది. స్త్రీని యింతగా బలహీనురాల్ని చేసున్న సామాజిక – సాంస్కృతిక నిర్మాణాల పట్ల క్రోధం కల్గుతుంది.

డాక్టరమ్మ వద్దని యెంత కౌన్సిలింగ్ చేసినా వినకుండా  సుశీల చేయించుకొన్న ఆపరేషన్ సఫలం కాలేదు. సంసారాన్ని నిలబెట్టుకోడానికి వేయించుకొన్న ఎక్స్ ట్రా నాట్ తో ఆమె భర్తని కట్టివేయలేకపోయింది. భర్త మీద అలవికాని ప్రేమను చూపుతున్నాను  అనుకొని అసమ దాంపత్యంలో హింసని అనుభవించింది.

‘కలయికలో నొప్పి భరించలేక గావు కేకలు పెట్టలేక పళ్ళు బిగువన కన్నీళ్ళు కారుతుంటే భరించింది సుశీల. తర్వాత కలయిక అంటే చచ్చేంత భయం ఏర్పడినా భర్త కోసం ఆ భయంకరమైన నొప్పిని భరించసాగింది. భర్త కళ్ళ ముందుంటే చాలు అనుకుంది.’

పంచ కన్యల పురాణ గాథలు – వాత్స్యాయన కామసూత్రాలు మొదలుకొని ఇవ్వాళ్టి వయాగ్రా మాత్రలు , సిలికాన్ యింప్లాంటేషన్ లు వెజైనోప్లాస్టీ – ఎక్స్ ట్రా నాట్ ల వరకూ   అన్నీ లైంగిక తృప్తిని  పురుష కేంద్రంగానే నిర్వచించి డిజైన్ చేయడంలో భాగంగానే పడగ్గదుల్లోకి ప్రవేశిస్తున్నాయనే స్పృహ కథ చదువుతున్నంతసేపూ మనకు కలుగుతూనే వుంటుంది. దాంపత్యంలో సమ భావన , సమ భాగస్వామ్యం లేకుండా చేసిన పురుషస్వామ్య భావజాలంలోని హింస యెరుకవుతూనే వుంటుంది. ఒకరికి యిద్దరిని కట్టుకొని విలాసంగా రొమ్ము విరుచుకొని తిరిగే శంకర్రావుల కాళ్ళ దగ్గరే పడివుండాల్సిన అగత్యాన్ని , దుస్థితిని  స్త్రీలకు  కల్పిస్తున్న సమస్త  కారణాల పట్ల – భావజాలం పట్ల అసహనం కలుగుతుంది. కథ పొడవునా రచయిత వుద్దేశ్యం స్పష్టమౌతూనే వున్నప్పటికీ ముగింపు దగ్గరకొచ్చేసరికి  కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి.

నొప్పి భరించైనా భర్తతో బంధాన్ని కాపాడుకోవాలని సుశీల అనుకొన్నప్పటికీ ‘ఎక్స్ ట్రా నాట్ మహిమ’ తో లభించిన భోగం మూడు నెలల ముచ్చటే అయ్యింది. సమస్య మళ్ళీ మొదటికి రావడంతో భర్త తిరస్కారంతో సుశీల బీపీ పెరిగి పక్షవాతానికి గురై ఆసుపత్రి పాలయ్యింది.

కథని నిర్మాణ పరంగా కొంత ఎడిట్ చేసుకొంటే బాగుండేది అనిపించినా రచయిత తాను చర్చించదలచుకొన్న సమస్యకి (కథా వస్తువుకి) – సుశీలనీ , పాఠకులకి – సుశీల పట్ల సానుభూతి చూపే మంజులనీ , సమస్య చుట్టూ నిర్మితమైన సామాజిక విలువలకీ భావజాలానికీ – సుమతినీ , రచయిత్రి గొంతుకి – డాక్టరమ్మనీ ప్రతినిధులుగా యెంచుకొని కథ నడిపినట్టు తోస్తుంది. ఇది కథలో దాగి వున్న అంతర్గత నిర్మాణం.

సుశీల వైవాహిక జీవితాన్ని మొదట్నుంచీ యెరిగిన ఆమె స్నేహితురాలు మంజుల దయనీయమైన ఆ పరిస్థితిని చూసి చలించిపోయింది. పాఠకులకి కలిగే ప్రశ్నలే కథ ప్రారంభం నుంచీ మంజులకి కూడా కలుగుతాయి. టీచర్ గా పనిచేస్తున్న మంజులకి జీవితంలో కొత్త పజిల్  యెదురైంది.

ముఫ్పై నిండిన మంజుల మొన్నొచ్చిన సంబంధానికి అవునని చెప్పాలో, కాదని చెప్పాలో తేల్చుకోలేకుండా ఉంది.

 

ఇదీ రచయిత్రి కథకిచ్చిన ముగింపు. పాఠక దృష్టికోణం నుంచి యిచ్చిన యీ  యేక వాక్యపు ముగింపు   కథలో రచయిత్రి చెప్పిన విషయాల గురించే గాక చెప్పని విషయాల గురించి , మంజుల అంతరంగంలో మెదిలిన అనేక ప్రకల్పనల గురించి యెంతగానో ఆలోచించేలా చేస్తుంది. రేపు తన భర్త కూడా శంకరరావు లాంటి వాడే అయితే అన్న సందేహం ఆమెకు కల్గిందని వొక్క మాటలో తెల్చివేయలేం. అటువంటి  సందేహ ప్రస్తావన కథ మధ్యలో కూడా వచ్చింది. మంజుల మనస్సులో కల్గిన వూగిసలాటకి కారణాలు కేవలం వైయక్తికమైనవి కావు. సుశీల – సుమతి – తనూ వ్యవస్థీకృత విలువలకి బానిసలవుతున్న పరిస్థితులన్నిటి గురించీ  విమర్శనాత్మక దృష్టితో విశ్లేషిస్తూ క్రాస్ రోడ్ల కూడలిలో ఆమె నిలబడింది.

 

స్త్రీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే హింస పట్ల భయం ,  పెళ్లి అనే వ్యవస్థ పట్ల అనుమానమూ  , స్త్రీపురుష సంబంధంలో  అసమానతలని వైరుధ్యాలని  సృష్టించిన పితృస్వామ్య ఆధిపత్య భావజాలం వల్ల కాపురాల్లో సంభవించే  కల్లోలాల గురించిన  లోచూపూ ,  ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన అన్నీ వొక్కసారిగా ఆమెను చుట్టుముట్టి   వుంటాయి. పెళ్లి పేరున మొత్తం స్త్రీ జాతి అనుభవిస్తున్న బంధనాలు ఆమెను పెళ్లి గురించి పునరాలోచించేలా  చేశాయి.

 

సాధారణంగా ముగింపు వాక్యం రచయిత దృక్పథాన్ని బలంగా చెప్పడానికి ఉపయోగ పడుతుంది. గీతాంజలి యీ కథని కేవలం ఎక్స్ ట్రా నాట్ గురించి మాత్రమే వుద్దేశించి రాయలేదనీ ముడివడని అసమ దాంపత్య సంబంధాలన్నిటినీ చర్చకు పెట్టడమే ఆమె లక్ష్యమనీ , పురుష ఆధిపత్య వ్యవస్థీ కృత విలువల్ని ప్రశ్నించడానికి ప్రేరేపించడమే ప్రధానమైన ఆశయమనీ  ముగింపు ద్వారా నిరూపించింది. ఆ ప్రయత్నంలో ఆమె అన్ని విధాల సఫలమయ్యింది.

మగవాళ్ళనందరినీ శంకరర్రావు పక్కన నిలబెట్టి ప్రకృతి సహజమైన స్త్రీ పురుష సంబంధాన్నే తిరస్కరించే దిశగా గాక మనస్సుతో నిమిత్తం లేకుండా దేహభాషకే పరిమితమైన  శృంగారంలో  తృప్తి – భావప్రాప్తి వంటి పదాల చుట్టూ అల్లుకొని వున్న పురుష  లైంగిక రాజకీయాల గురించి పాఠకులు ఆలోచించడానికి ఆస్కారం కల్గించడానికే రచయిత యిటువంటి open ముగింపుని యిచ్చినట్లు  తోస్తుంది.

మగవాళ్ళని సెన్సిటైజ్ చేయడం కూడా తన యీ కథల రచనోద్దేశాల్లో వుందని రచయిత్రి చెప్పినప్పటికీ  స్త్రీలను అనేక రూపాల్లో కట్టిపడేస్తున్న “బంధాల” గురించి సరైన అవగాహన కల్గించడానికి యీ కథ బలంగా దోహదం చేస్తుంది. ప్రధాన స్రవంతిలో యిటువంటి కథలు మరెన్నో  రావాల్సి వుంది. ఆ దిశలో డా. గీతాంజలి చేస్తున్న కథా వ్యాసంగాన్ని మనసారా స్వాగతిస్తున్నాను.

 

రెండు సంఘటనలూ రెండు పాత్రలూ వొక నిరసన : థూ

 

 

-ఎ.కె. ప్రభాకర్ 

~

 

‘అందరూ నిర్దోషులైతే మరి చుండూరు దళితుల్ని చంపిందెవరు?’

చుండూరు దళితులపై అగ్రవర్ణాల మారణకాండ జరిగిన (1991 ఆగస్ట్ 6) యిరవై మూడేళ్ళకి హైకోర్ట్ డివిజినల్ బెంచ్ ఆ కేసులో యిచ్చిన తీర్పు ( 2014 ఏప్రిల్ 22) ని ప్రశ్నిస్తూ దళిత – హక్కుల – ప్రజా సంఘాలు వేసిన పెను కేక యిది. ఈ ప్రశ్నకి యింకా సమాధానం లభించాల్సే వుంది కానీ ఆ తీర్పుపై బలమైన నిరసనగా వెలువడ్డ సంచలనాత్మక కథ

( విశాలాంధ్ర – ఆదివారం, జూన్ 15 , 2014). రచయితగా పి వి సునీల్ కుమార్ తక్షణ స్పందన సాహిత్య లోకంలో చిన్నపాటి దుమారం లేపింది. కథ లోపలి , బయటి విషయాల మీదా చర్చలు జరిగాయి. కథలో ప్రస్తావితమైన సామాజికాంశాల గురించి సంఘటన పూర్వ పరాల గురించి రచయిత దృక్పథం గురించి దాన్ని కథలోకి తీసుకురావడంలో సాఫల్య వైఫల్యాల గురించి కళావిలువల గురించి రచనా శిల్పం గురించి కథ చదివాకా చదువరుల్లో కలగాల్సిన క్రియాశీల స్పందన గురించి స్థూలంగా సాహిత్య ప్రయోజనం గురించి వొక్క ఫేస్ బుక్ లోనే దాదాపుగా పాతిక పేజీల వరకు చర్చ జరిగింది. కథ యెంత ఆలోచింపజేసిందో ఆ చర్చలు కూడా అంతే తీవ్రంగా బుర్రకి పనిబెట్టాయి.

రచయిత కథలో తన దృక్పథాన్ని ఆవిష్కరించడానికి భిన్న పద్ధతుల్ని పాటిస్తాడు. సర్వసాక్షి దృష్టి కోణంలో కథ నడిపిపేటప్పుడు  కథనంలోనో ముగింపులోనో రచయితే తన ఆలోచనల్ని స్వయంగా ప్రకటిస్తాడు. ఆ తరహా కథల్లో పాఠకులకి పెద్ద పనేం వుండదు.  సర్వసాక్షి కథనాన్ని రచయితా పాఠకుల మధ్య జరిగే సంభాషణ అనుకొంటే అటువంటి  కథలు యేకముఖ సంభాషణల్లాంటివి. అప్పుడు పాఠకుడు కేవలం శ్రోతగా మిగిలిపోయే ప్రమాదం వుంది. దాన్నుంచీ తప్పించుకొని పాఠకుల ఆలోచనకి చోటూ వెసులుబాటూ వ్యవధి యివ్వడానికి తన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కథకుడు  అనుకూలమైన పాత్రల్ని – కంఠ స్వరాన్ని యెన్నుకొంటాడు. చాలా సార్లు సంభాషణల ద్వారా చెప్పిస్తాడు. లేదా పాత్రల బాహ్య అంతరంగ ప్రవృత్తుల ద్వారా  ఆవిష్కరిస్తాడు. అందుకు అనుగుణమైన సంఘటనల్ని సృష్టిస్తాడు. సంఘర్షణని చిత్రిస్తాడు. ఆ యా సందర్భాల్లో అవసరాన్నిబట్టీ ఆత్మాశ్రయ కథనాన్ని ఆశ్రయిస్తాడు. ప్రతీకలని నిర్మిస్తాడు. అన్యాపదేశాల్ని అడ్డం పెట్టుకుంటాడు. ఒక్కోసారి టెక్నిక్ పరంగా సరైన జాగరూకత లేకుంటే కథనంలో పాత్రల్లో రచయిత  చొరబాటు జరగొచ్చు. ప్రతిభా నైపుణ్యాలున్న రచయిత మాత్రమే స్వీకరించిన కథా వస్తువు డిమాండ్ చేసిన శిల్పంతో  పాఠకుడికి దగ్గరవుతాడు.

సునీల్ కుమార్ చుండూరు మారణకాండనీ దానిమీద పెద్ద  కోర్టులో వెలువడ్డ జడ్జిమెంట్ నీ కథలో ప్రధాన సంఘటనలుగా – కథాంశాలుగా తీసుకొన్నాడు. కులాలు కాలాలు మార్చలేదు గానీ స్థలాలు మార్చాడు. పాత్రల పేర్లు మార్చాడు. తణుకు ప్రాంతంలో జరిగినట్టు పేర్కొన్నాడు. స్థానికత కోసం  అయితంపూడి లాకులు దగ్గర శవాలు దొరికినట్టు వొకటి రెండు మార్పులు జోడించాడు. కామందు పేరుకి ప్రతీకాత్మకంగా రెడ్డీ నాయుడూ రెండూ తగిలించాడు. మిగిలిన కథంతా అదే.

దళిత కులానికి చెందిన జోసఫ్ కొడుకు సాల్మన్  రాజు అతన్తో పాటు తణుకు కాలేజీలో చదువుకొనే వూరి  ‘కామందుల ఆడపిల్లని యిష్టపడ్డాడు. ఆ పిల్లా ఆడ్ని ఇష్టపడింది… కామందులకి ఇది గిట్టలేదు.’ అది గొడవకి దారితీసింది. కామందుల కుర్రాళ్ళకి మండి ‘ఏరా మాలనాకొడకా’ అని కులం పేరుతో ఘర్షణకి దిగారు.

దీన్ని వూరి కామందు బసివిరెడ్డి నాయుడి మాటల్లో చూద్దాం:

‘మాటా మాటా పెరిగింది . అక్కడితో ఆగాలా ? ఆ రాజుగాడు ఆడికి తోడు మిగిలిన మాలమాదిగ కుర్రనాయాళ్ళు కలిసి కామందుల పిల్లల్ని, కనీసం పెద్ద ఇళ్ళ పిల్లలే అన్న ఇంగితం లేకుండా , పెద్దంతరం , చిన్నంతరం లేకుండా చేయ్యిచేసుకున్నారండి… ఎంత దారుణం.

రామరాజ్యం కోసం కలలు కన్న గాంధీగారు, ఇప్పుడు కలలు కంటున్న మోడీగారూ ఈ సంగత్తెలిస్తే ఎంత కుమిలిపోతారు?

ధర్మం ఇప్పటికే ఒంటికాలి మీద కుంటుతుంది. ఇలా వదిలేస్తే ఇంకేమీ మిగలదు కాబట్టి, ఈ కాస్త ధర్మాన్నన్నా నిలబెట్టడానికి ఈ కడజాతి కుక్కలకి బెత్తం దెబ్బ చూపిద్దాం అని పెద్దలంతా అనుకుని ఓ తీర్మానం చేసుకున్నామండి. అది కాస్త మోతాదు ఎక్కువైంది.’  

మోతాదు ఎంత యెక్కువైందో జోసఫ్ మాటల్లో చూద్దాం:

‘ ఆ రోజు రాత్రి చూడాలి బాబూ. రాములోరి రథ యాత్ర జరిగినట్టు మా మీద దండెత్తేరు. కత్తులు, కటార్లు, ఈటెలు, బళ్ళేలు పట్టుకుని వచ్చేరు… మా గుడిసెలకి నిప్పెట్టేరు. మా అమ్మల్ని మానాల మీద తన్నేరు. మా ఆడబిడ్డల్ని మళ్ళా పాడుచేసేరు. దొరికినోడ్ని దొరికినట్టు నరికేరు. ఎంటపడ్డారు. ఎగబడ్డారు. నరికేశారు. కిందేసి తొక్కేశారు. గోనెసంచుల్లో కుక్కేశారు. పంట కాలవలో పడేశారు.’

ఆ దాడిలో ఇరవై ఏళ్ళు అత్తారబత్తంగా పెంచుకున్న జోసఫ్ కొడుకు (రాజు)తో సహా మొత్తం పదిమందిని చంపేశారు. ఒక కుంటోడు జోసఫ్ కాలిరగ్గొట్టి అతన్ని కుంటి జోసఫ్ చేసాడు.

అదిగో … అప్పుడు … ఆ పాశవిక దాడిలోనే  ఇగిరిపోయింది జోసఫ్ నోట్లో తడి. అతనికి యెన్నోసార్లు  ‘ఉయ్యాలనుంది… దేవుళ్ళ మీదా … మమ్మల్ని మనుషులు కాదన్న వాళ్ళమీదా … కడజాతివాళ్ళని అన్నవాళ్ళమీదా …’ ఉయ్యాలన్నా ఉయ్యలేడు.

అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్యలో కింది కోర్టులో దాడిచేసినవారికి శిక్షలు పడ్డాయి(చుండూరు కేసులో విచారణకి సంఘటనా స్థలిలోనే స్పెషల్ కోర్టు యేర్పాటైంది – దళితులపై దమనకాండని  విచారించడం కోసం వొక ప్రత్యేక కోర్టు యేర్పడడం దేశంలో అదే తొలిసారి. సంఘటన జరిగిన పదహారేళ్ళకి  2007 లో యాభై ఆరు మందిని దోషులుగా నిర్ధారించి ఆ కోర్టు శిక్ష విధించింది).

కానీ పై కోర్టులో రెడ్డి తోక తగిలించుకొన్న జడ్జి యిచ్చిన తీర్పు దేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొన్న వారికి అశనిపాత విస్మయం కల్గించింది.

న్యాయమూర్తి అందరూ నిర్దోషులే అని తీర్పు చెబుతూ ‘ఇంకా కులాలెక్కడున్నాయి?’  అన్నాడు.

‘దొంగ కేసు’ అని తేల్చేసాడు.

జోసఫ్ ‘నోట్లోంచి మాట రాలే … మాట బదులు ఉమ్మొచ్చింది…’

‘ముంతలో పడాల్సింది పొరపాట్న ఆయన మొగాన పడింది …

థూ …’

అదీ కథకి ముగింపు.

p v sunil kumar

కథలో వాస్తవానికి రెండు దాడులు జరిగాయి. మొదటిది దళితులపై భౌతికంగా జరిగిన దాడి. రెండోది – దాని వ్యవస్థీకృత రూపం.  కులమే  రెండుచోట్లా కారణం. బాధితుడి నోట్లో తడి ఆరిపోయి ఉమ్మి రాకుండా నోరెండిపోయి నెరళ్ళు విచ్చుకున్న బీడు పొలంలా తయారయ్యే పరిస్థితికి కారణమైన సంఘటన మొదటిది. అది తరాలుగా అమలౌతున్న సామాజిక క్రౌర్యాన్ని ఆవిష్కరించిన భయావహ సంఘటన. అది ఆంధ్రప్రదేశ్, తమిళ్నాడు , బీహార్ , మహారాష్ట్ర, రాజస్తాన్ – దేశంలో యే మూలైనా దాడి చేసేది రెడ్డినాయుళ్ళు, భూమిహారుల రణవీర్ సేన , కుంబీలు , జాట్ లు వంటి ‘కులీను’లైతే   వేటాడబడేది బలయ్యేది మాత్రం ‘కులహీను’లైన దళితులే. రాజ్యాంగ బద్ధమైన సామాజిక న్యాయం కోరడమే ఆత్మగౌరవంతో పీడన లేకుండా బతకాలనుకోవడమే  వేటకి కారణం. మూడేళ్ళ పసి బిడ్డా    డెబ్భై యేళ్ళ వృద్ధులా – ఆడా మగా అని చూడకుండా విచక్షణా రహితంగా చంపేసిన  కిలవేన్మణి (1968) మొదలుకొని – బథానీ టోలా (1996)లో రణవీర్ సేన సాగించిన మారణహోమం , ఖైర్లాంజీ దురాగతాల  మీదుగా నిన్న మొన్నటి లక్షింపేట , యివాల్టి వేముల రోహిత్  హత్యల వరకూ అన్ని దారుణాలలో నేరస్తులంతా శిక్షలు లేకుండానే బయటపడతారు. హతులు వుంటారు – హంతకులుండరు.  హంతకుల కులం పాలకుల కులం న్యాయమూర్తుల కులం వొకటే కావడం యెంత చక్కటి రాజకీయ నీతి?

ఈ వ్యవస్థీకృత దుర్నయం పట్ల తీవ్రమైన అసహ్యాన్ని వ్యక్తంచేయడానికి ఛీత్కారాన్ని ప్రకటించడానికి జోసఫ్ నోట్లో  వుమ్మడానికి మళ్ళీ నోట్లో నీరూరాయి. ‘థూ …’ ఆ విధంగా రచయిత ధర్మాగ్రహ ప్రకటన రాజకీయ – సామాజిక  నిరసన.

వాస్తవ సంఘటనలు వాటికవే కథలు కావని కొందరు , బసివిరెడ్డి నాయుడు కుంటి జోసఫ్ యీ రెండు పాత్రల్ని తీసేస్తే యిది కేవలం వొక వార్త మాత్రమేననీ మహా అయితే వార్తాకథనం కావొచ్చేమోనని కొందరూ, సంఘటనలు జరిగిన సందర్భాల్లో తత్క్షణ ప్రతిస్పందనలుగా వచ్చే యిటువంటి రాతలకు సాహిత్య విలువని ఆపాదించలేమని  మరికొందరూ, బసివిరెడ్డి నాయుడి పాత్ర చిత్రణలో శిల్ప విషయికంగా జరిగిన పొరపాటు వల్ల మంచికథ కాలేకపోయిందని , ఆ విధంగా రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని యింకొందరూ విమర్శపెట్టారు. కథని బాధితుల పక్షం నుంచి చూడాలన్న వాదాన్ని కూడా యెద్దేవ చేసారు. జరిగిన ప్రతి సంఘటనా సాహిత్య వేషం ధరించి విసువు పుట్టిస్తుందని కొత్తదనం వుండడం లేదని అందువల్ల మూస కథలు మాత్రమే వస్తున్నాయని  కథా ప్రేమికులు బాధపడ్డారు. సున్నితమైన  సమకాలీన  సంఘటనల్ని వర్ణించినంత మాత్రాన కథని మెచ్చుకొని తీరాలా అని వాదించారు. శిల్పాన్ని ముందుకు తెచ్చి కథలో  స్వీకరించిన  వస్తువుపట్ల కూడా అసహనం వ్యక్తం చేసారు  (అట్రాసిటీ గురించి గాక అట్రాసిటీ చట్టాల దుర్వినియోగం గురించి కథ రాస్తే ఆహ్వానించడానికి వారికి అభ్యంతరం లేదు).

ముందుగా గుర్తించాల్సిన విషయం – సమకాలీన సామాజిక సంఘటనలు సాహిత్యంలోకి యెక్కకూడదని గిరిగీసుకోవాల్సిన అవసరం లేదు. అలా గీసుకొంటే చివరికి మనకి మిగిలేవి అలౌకికమైన దెయ్యాలు – భూతాల హారర్ కథలూ గ్రహాంతరవాసుల సూడో సైన్స్ ఫిక్షన్ కథలూ అభూతకల్పనా ప్రపంచపు కథలేనేమో!  [కిలవేన్మణి దళితుల వూచకోత – యథార్థ సంఘటన నేపథ్యం చేసుకొని  ఇందిరా పార్థసారథి రాసిన ‘కురుతిప్పునల్’ నవలకి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు (1977) వచ్చింది. ఆ తర్వాత అది సినిమాగా కూడా గొప్ప ప్రశంసలు పొందింది – వాస్తవాలు కళలై చరిత్రలోకెక్కడానికి యిదొక ఉదాహరణ మాత్రమే]

వాస్తవాన్ని కళగా రూపొందించడంలో శిల్ప వస్తువుల ప్రాధాన్యతల గురించి మాట్లాడుకోవాల్సిన అనివార్యమైన అవసరాన్ని మరోసారి ‘థూ…’ కథ కల్పించింది అనడంలో యెటువంటి సందేహం లేదు. నిజమే కథ వుపన్యాసంలానో వ్యాసంలానో వుండకూడదు. వస్తువుని వున్నతీకరించడానికి అవసరమైన శిల్పాన్ని సమకూర్చుకోవాలి. అది రచయిత దృక్పథాన్ని ఆవిష్కరించడానికి దోహదం చెయ్యాలే గానీ ఆటంకంగా పరిణమించ కూడదు. కథకి ఆత్మ దృక్పథమే. అది యే మేరకు  పాఠకులకి చేరింది అన్నదాన్ని బట్టీ కథ మంచి చెడ్డలని నిర్ధారించాలి.

థూ… కథలో కథ చెప్పిన రెండు పాత్రలు – బసివిరెడ్డి నాయుడు , జోసఫ్  భౌతికంగానే కాదు  గ్రామంలో సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా కూడా   సంఘర్షించుకొనేపాత్రలు. ఒక సామాజిక భీభాత్సానికి భిన్న దృక్పథాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిద్వంద్వి పాత్రలు. రెండు వైపుల అటు చివర యిటు చివర వైరి శిబిరాల్లో  నిలబడ్డ భిన్న పాత్రలు. వాటి గొంతు వేరు , భాష వేరు , జీవితానుభవాలు వేరు. వాటి సారం వేరు. వీటి మాధ్యమంగా కథ చెప్పదల్చుకొన్నప్పుడు సాంప్రదాయిక రచనా పద్ధతులననుసరించి  రచయిత యేదో ఒక వైపు వుండాలి ; ఒక నిర్దిష్ట కంఠ స్వరాన్ని  యెన్నుకోవాలి. కానీ ఈ కథలో రచయిత పాటించిన టెక్నిక్ ఇద్దరి ద్వారా కూడా తను చెప్పదల్చుకొన్న భావజాలాన్ని ప్రకటించడం. అదే విమర్శకి కారణమైంది. బసివిరెడ్డి నాయుడి సంభాషణలకి వ్యంగ్యాన్ని ఆశ్రయించడం  నప్పలేదనీ  , పాత్రౌచిత్యం దెబ్బతిందనీ  విమర్శకులు భావించారు.

అయితే యీ విమర్శలన్నిటికీ సమాధానమా అన్నట్టున్న రచయిత చెప్పిన మాటలు గమనార్హాలు :

‘బాణం గుండెలో దిగితే బాధలా ఉంటుంది. అదే బాణం గుండెలో దింపినవాడికి వినోదంలా ఉంటుంది. వస్తువు అదే, కానీ అది ఒకడికి సంతోషాన్ని, మరొకడికి చావుని ఇస్తోంది. వ్యవస్థ అయినా సంఘటన అయినా బలిసినవాడికి ఒకలా , బక్కోడికి మరోలా కనబడతాయి. వ్యవస్థలో ఏ ఒక్క సంఘటనా కారణం లేకుండా జరగదు. సామాన్యుడికి సత్యం తెలిస్తే వాడు వ్యవస్థని ఎలా సమ్మానిస్తాడో అదే … ఈ థూ…. ఇది కథ కాదు, వ్యవస్థ ఎక్స్ రే, సి.టి.స్కాన్ …’ (కథ 2014 , కథాసాహితి)

అవును కదా – ఎక్స్ రే, సి.టి.స్కాన్ పిల్మ్ లు కలర్ ఫొటోగ్రాఫ్ లంత అందంగా కనపడకపోతే టెక్నీషియన్ని తప్పుపట్టలేం.

నిజానికి సవర్ణులు మనసు లోపల అనుకొనే మాటల్నే రెడ్డినాయుడు బయటికి అన్నాడు. న్యాయాన్ని బలిమితో చెరబట్టినవాడు కోర్టు మెట్ల మీదే బసివిరెడ్డి నాయుడులా మాట్లాడగలడు. పాఠకులు ఆ మాటల వెనక వున్న అగ్రకుల అహంకారాన్నీ ఆధిపత్య స్వభావాన్నీ  రాజకీయ అధికారం ఇచ్చిన పొగరుమోతుతనాన్నీ చట్టాల్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన నిర్లక్ష్యాన్నీ  న్యాయవ్యవస్థ మొత్తం తమ కనుసన్నల్లోనే నడుస్తుందన్న  ధీమానీ స్పష్టంగా చూడగలరు. ఒకటి రెండు చోట్ల అవి అతిశయించిన దాఖలాలు యెత్తిచూపగలమేమో గానీ రెడ్డినాయుడి మాటలు అసహజాలు కావు ; ప్రస్తావితమైన అంశాలు అసత్యాలైతే అసలు కానే కావు.

ఇటీవల పాటియాలా కోర్టు ఆవరణలోనే కన్హయ్య మీద లాయర్లు దాడి చేయడం  , మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం , అందుకు సన్మానాలు చేయించుకోవడం , జైలుకెళ్ళి అక్కడకూడా అతన్ని కొడతామనీ అంతుచూస్తామనీ బహిరంగంగా మీడియా ముందు హెచ్చరించడం , కన్హయ్య నాలుక కోసినవాడికి లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఫత్వాలు జారీ చేయడం యివన్నీ చూసినపుడు బసివిరెడ్డి నాయుడు మాటల్లో అహంకారం గానీ వ్యంగ్యంగానీ కృత్రిమంగానో అనుచితంగానో అనిపించవు. తన ఫ్యూడల్ ఆలోచనలకి ఆచరణకీ ప్రజాస్వామ్యం ముసుగు వేసుకోవాల్సిన అవసరం సందర్భం అతనికి కనిపించలేదు. సమాజంలో రెడ్డినాయుళ్ళు బోరవిరుచుకొని తిరుగుతూ సాహిత్యంలోకి జబర్దస్తీగా తోసుకురావడంలో వైపరీత్యం యేమీ లేదు.

అందుకే  వర్ణ ధర్మ పరిరక్షణ అవసరం గురించి రామరాజ్య స్థాపన గురించి అందుకు పాలక వర్గాలు పడుతున్న కష్టాల గురించి స్వాతంత్ర్యం తర్వాత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయాధికార బాధ్యతలతో ప్రజా పాలన భారంతో పై కులాల ప్రభువులు చేస్తున్న త్యాగాల గురించి తాము దయతో జాలితో అమలు జేస్తున్న యస్సీ యస్టీ రిజర్వేషన్ల గురించి వోటేసి తమకు అధికారం కట్టబెట్టినందుకు ఔదార్యంతో తాము ప్రవేశపెట్టిన  మాల మాదిగల సంక్షేమ పథకాల గురించి    రెడ్డి నాయుడు తన దృష్టికోణం నుంచి చాలా విస్తృతంగానే యేకరువు పెట్టాడు. కథలో యివన్నీ యిమడతాయో లేదోనన్న ప్రశ్నని  కాసేపు పక్కనబెడితే బసివిరెడ్డినాయుడి ముఖత: వెలువడ్డ మాటల్ని  పదే పదే చదవగా అతడి portrait ని చిత్రించడం రచయిత వుద్దేశం కాదనీ –  అగ్రకుల పెత్తందారీ తనానినికి archetypical caricature గా అతణ్ణి బ్లాక్ అండ్ వైట్ లో గీయడమేననీ నాకు బోధపడింది. ఆ గీతల్ని పతంజలి వ్యంగ్యచిత్రాల్తో పోల్చడం సాహసమే గానీ , రాజు గారి బామ్మర్ది అయిన కారణంగా న్యాయస్థానంలో న్యాయాన్ని తిమ్మిని బమ్మి చేయడానికి పూనుకొన్న శూద్రకుడి శకారుడితో కొంతవరకు పోల్చవచ్చు.  అందువల్ల రెడ్డినాయుడి మాటల్లో ఆధునిక మనువాదం వికృతంగా వినిపించడం అసంగతమేం కాదు. శిల్పానికొచ్చిన లోటేం లేదు. ఆధునిక కథా నిర్మాణ సూత్రాలూ కొలతలూ పక్కనబెట్టి సంప్రదాయ దేశీయ కథా రీతుల వెలుగులో చూస్తే రచయితగా సునీల్ కుమార్ నడిచిన దారి తెల్లమౌతుంది.

చిందు కళాకారులు ప్రదర్శించే జాంబ పురాణం దాదాపు యీ టెక్నిక్ లోనే నడుస్తుంది. చిందు జాంబ పురాణం సంవాద రూపంలో వుంటుంది. రెండే పాత్రలు – వొకరు  బ్రాహ్మణుడు మరొకరు మాదిగ ఆదిజాంబవుడు. అందులో బ్రాహ్మణుడు వర్ణ దురహంకారానికీ  ఆది జాంబవుడు ఆత్మగౌరవానికీ ప్రతీకలు. అక్కడ కూడా బ్రాహ్మణుడు అచ్చు బసివిరెడ్డి నాయుడిలానే ప్రవర్తిస్తాడు. ఆది జాంబవుడు తార్కికంగా జవాబులు చెబుతాడు.  అయితే రెండు పాత్రలూ నటించేది చిందు మాదిగలే కాబట్టి బ్రాహ్మణుడి ఆలోచనల్లోకి సంభాషణల్లోకి అహంకార ప్రకటనల్లోకి ఆ కళాకారుడు తన జీవన నేపథ్యంతో సహా చొరబడతాడు. అప్పుడు అతని మాటల్లోకి వ్యంగ్యం హాస్యం అధిక్షేపం అసహనం అవహేళన  అన్నీ వచ్చి చేరతాయి. అవన్నీ ప్రదర్శన రక్తి కడటానికే దోహదం చేస్తాయి తప్ప ప్రేక్షకులకి యెబ్బెట్టుగా తోచవు. చిందు ప్రదర్శన జాంబవుడి విజయంతో అంతమైతే ‘థూ…’ కథ కుంటి జోసఫ్ నిరసనతో ముగుస్తుంది.

చిందు జాంబ పురాణంలో బ్రాహ్మణ జాంబవుల పాత్రలు రంగం మీదకి రావడానికి వొక ప్రవేశిక ( prologue ) వుంటుంది. దాన్ని సూత్రధారుడిలాంటి వారు నిర్వహిస్తారు. ‘థూ…’ కథ లో రచయిత పాత్ర కూడా రెడ్డి నాయున్ని , జోసఫ్ ని అలాగే ప్రవేశపెట్టి నిష్క్రమిస్తుంది. అయితే కథలో రచయిత – కథా రచయితా వొకరు కాదు. కథలో రచయిత వొక పాత్ర. అతడు కూడా  వొక వర్గానికి ప్రతినిధి. పేదల ఏడుపులూ పెడబొబ్బల కథలు అతనికి నచ్చవ్ , ప్రేమకతలు కావాలి. ఈ పాత్రని నెపం చేసుకొని సాహిత్యంలో పాతుకుపోయిన విలువల పైన నిలవ యీస్తటిక్స్ పైన కూడా సునీల్ కుమార్ వ్యంగ్యాన్ని గుప్పించాడు (కథలోని ఈ పొర కూడా కొందరికి వూపిరాడనివ్వలేదేమో!). తను ప్రతిపాదించే వస్తువు పట్లా వాడిన టెక్నిక్ పట్లా సాహిత్యకారుల ప్రతికూల స్పందనని అతను ముందుగానే వూహించినట్లున్నాడు.

తరతరాలుగా అనేక సామూహిక బృందాల గూడుకట్టుకొన్న దు:ఖానికీ ఆగ్రహానికీ అక్షరావిష్కరణ ‘థూ…’ . సంవత్సరాల తరబడి న్యాయం కోసం యెదురుచూసి భంగపడ్డ వారి క్రోధాక్రందన అది. ఏడుపు అందంగా లేదనో ఆలంకారికంగా లేదనో కళాత్మకంగా లేదనో యింకాస్త బాగా యేడవొచ్చుగదా అనో ఫిర్యాదు చేసేవాళ్ళకి యేదైనా అనుభవంలోకి వస్తేగానీ తత్త్వం బోధపడదు.

జోసఫ్ తాత మూతికి ముంత కట్టుకొని వుమ్మొస్తే నేల మీద వుయ్యకుండా ముంతలో వూసేవాడు. ముడ్డికి యేలాడే తాడూ దాని చివర తాటాకు – అతను నడిచించోట అది తుడిచేసేది. అంటరానివాడొత్తన్నాడు తొలగండని చేతిలో గంట వాయిస్తూ  బేపనవారికి హెచ్చరిక చేసేవాడు. జోసఫ్ కొడుకు తరానికి వచ్చేసరికి ఆ ‘మర్యాద’ నుంచీ బయటపడి ముడ్డి మీద మంచి గుడ్డ కట్టుకొని బడికెళ్ళి నాలుగక్షరాలు నేర్చుకొని మనిషిలా బతకాలని కోరుకోవడం  నేరమైంది. చావుకి కారణమైంది. దళితుల అటువంటి చావులు దేశంలో సగటున రోజుకి రెండు జరుగుతూ వుండగా అందుకు వ్యవస్థీకృతమైన మద్దతు ఆమోదం లభిస్తున్నప్పుడు ఆ సామాజిక విషాదాన్ని దురన్యాయాన్ని యిన్ సైడర్ గా వొక దళిత రచయిత మాత్రమే బలంగా ఆవిష్కరించగలడని చెప్పడానికి  ‘థూ …’ మంచి వుదాహరణ. సరైన సమయంలో అవసరమైన కథని యింత నిర్దిష్టంగా నిజాయితీగా  రాసినందుకు సునీల్ కుమార్ కి అభినందనలు.

తాజాకలం  : బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూనే పాలకులు ఆయన 125 సంవత్సరాల జయంతి వేడుకలు జరపడం గొప్ప ఐరనీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత గురించి అంబేద్కర్ ఆలోచనల గురించి  కరీంనగర్ బార్  అసోసియేషన్  ఏర్పాటుచేసిన సభలో చుండూరు కేసులో తీర్పు యిచ్చిన జడ్జి వుపన్యాసాన్ని కొందరు న్యాయవాదులు అడ్డుకొన్నారు(చూ. http://indiatoday.intoday.in/story/ex-hc-judge-faces-lawyers-protest-over-dalit-murder-verdict/1/593897.html). మర్నాడు అందుకు బాధ్యులైన నలుగురు  లాయర్లని బార్ అసోసియేషన్  సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వార్తకీ ఈ కథకీ చుట్టరికం వుండడం వల్ల యిక్కడ నమోదు చేయడమైంది తప్ప యిప్పుడు మనం చేయవలసిన పని వొక్కటే అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం యెదురుచూడటం లేదా కుంటి జోసఫ్ లోని తడిని ఫీలై అతని చేతికర్రగా మారడం.

*

ఇది ఆకలి కత కాదు – అవమానాల వెత

 

 -ఎ . కె . ప్రభాకర్

~

 

ఒక్కో కథ చదివాకా ఆ  కథ లో పాత్రలు చాలా కాలం గుర్తుండిపోతాయి.  కొన్ని పాత్రలైతే వెంటాడతాయి. పాత్ర పేరు చెప్పగానే కథంతా స్ఫురణకి వస్తుంది. కొన్ని కథల్లో సంఘటనలు కథని మరచిపోనివ్వవు. ఏక వాక్య కథలుగా కొన్ని మనసులో పాతుకుపోతాయి ; సారం చెప్పగానే కథ యాదికొస్తుంది. కొన్ని కథలు రచయిత శిల్ప కౌశలం కారణంగా కేవలం విలక్షణమైన టెక్నిక్ ద్వారా  మెదడు పొరల్లో జ్ఞాపకాలుగా కదులుతూ వుంటాయి. చాలా తక్కువ కథలు మాత్రమే శీర్షిక పేరు చెప్పగానే కథలోని పాత్రలూ వాటి ప్రవర్తన సంఘటనలూ సన్నివేశాలూ సంభాషణలూ యితివృత్తం దాని నిర్వహణా కథనపద్ధతీ భాషా వాటిని వాహికలుగా మలచుకొన్న రచయిత దృక్పథం అన్నీ వొక దాని వెంట మరొకటి కళ్ళముందు దృశ్యమానం అవుతాయి. అటువంటి అరుదైన కథల్లో వొకటి ఎమ్ ఎమ్ వినోదిని రాసిన

(తొలి ముద్రణ : అరుణతార  – జనవరి, 2015 ,  ‘బ్లాక్ ఇంక్’ సంపుటిలో పునర్ముద్రితం). ఆ కథ అరుదైనది కావడానికి మొదటి  కారణం స్వీకరించిన వస్తువు. రెండోది చెప్పిన వైనం.

***

చానాళ్ళ కిందట వూరినుంచి పనిమీద నగరానికి వచ్చి అక్కడ అభివృద్ధి చెందిన రాజపథాల్లో వుచ్చ పోసుకోడానికి మరుగు దొరకక విలవిల్లాడిన మహిళ  క్షోభని కథగా చదివి క్రోధంతో రగిలిపోయిన జ్ఞాపకం వుంది. దశాబ్దాలు నడిచి వచ్చాకా  యిప్పుడు వినోదిని కట్ట చదివినప్పుడూ అదే అనుభూతి. జపాన్ సింగపూర్ నమూనాల వర్తమాన చరిత్ర కూడా అంతే సంబడంగా వుందని గుండె జలదరించేలా ‘కట్ట’ మరోసారి నిరూపిస్తుంది.

దళితవాడ నుంచి పై చదువుకోసం హాస్టల్లో చేరి అక్కడ లెట్రిన్ సౌఖ్యం అనుభవించే పదహారు పదిహేడేళ్ళ అమ్మాయి ‘సొరూప’ సెలవలకి యింటికి వచ్చినప్పుడు మరుగుదొడ్డి సదుపాయం లేక రైలు పట్టాల మీదకి ‘దొడ్డికి’ పోవాల్సినప్పుడు అనుభవించిన బాధల పరంపర కట్ట.

ఆస్టల్లో వుప్పూకారం లేని కూరలు తినటం మూలాన నాలికంతా చప్పబడిపోయిన సొరూప అమ్మ చేసిన ‘గోంగోర పచ్చిమిరగాయాలు వుడకబెట్టి నూరిన పచ్చడి’ వేసుకొని యిష్టంగా రెండు ముద్దలు అన్నం యెక్కువే తింది. ఫలితంగా తెల్లారక ముందే ‘దొడ్డి నెప్పి’. కూర్చుంటే రెండు మడాలూ తడిసి పోయేంత పెద్ద యిరోచనం. ఇక తెల్లారుతూనే మొదలైంది నరకం.

కరుణామయుడు సినిమాలో ‘యేసయ్య సిలవ మీద చచ్చిపోయినపుడు – కొండరాళ్ళు దొర్లుతయ్ , సముద్రాలు వుప్పొంగుతయ్ , అగ్నిపర్వతాల కుండ మీద మూత పేలిపోయి , మంట యెక్కువైతే పప్పుచారు పొంగినట్టు లావా పొంగిపోద్ది . అట్టా వుంది నా కడుపులో.’  స్వరూప తన  శారీరిక బాధని తనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేయడానికి పడడిన అవస్థ యిది.

తలమీద ముళ్ళకిరీటం బెట్టి లోపలికేవరో గట్టిగా వొత్తుతున్నట్టున్న సొరూప పడ్డ బాధని ఆమెతో పాటు కథ చదివే వాళ్ళు కూడా అనుభవిస్తారు. కానీ అసలు సమస్య – పగటి పూట పదే పదే కట్ట మీదకి పోవాల్సి రావడమే.

‘చెంబు తీసుకొని యిళ్ళ మజ్జ నడుచుకుంటా బోవాల. ‘యెప్పుడొచ్చావమ్మాయ్?’– అని అందరూ పలకరిస్తావుంటారు. దానికి తోడు కట్టకి పొయ్యొచ్చే మా గేరి మొగోళ్ళు యెదురవుతావుంటారు. అన్నయ్యలూ , అంకుళ్ళు. నాతోపాటు మా లూథరన్ హైస్కూల్లో చదువుకున్న సీనియర్లు , జూనియర్లు కూడా వుంటారు. వీటన్నిటికీ మించి పగలు ఆడోళ్ళు కట్టమీద కూర్చోడానికి లేదు! కట్ట పక్కన డవున్లో వున్న ముళ్ళ కంచెల్లోపలికి వొంగొంగి నడుచుకుంటాబోయి కూర్చోవాల. అసలే పెంటలరొచ్చు. రోతగా వుంటది. దానికి తోడు రాత్రంతా వానబడివుంది. కుప్పలన్నీ చింది, చుట్టూ చెల్లాచెదరుగా యెగిరిపడి వుంటాయ్. యెంత కష్టమో నడవడం. తావు వెతుక్కోవడం.’

అందుకే సెలవలు వస్తే లేటుగా లేస్తామని చెప్పుకొనే వాళ్ళని చూస్తే స్వరూపకి అసూయ.  ‘తెల్లగా తెల్లవారడం’ గురించి పంచుకోలేని  భయం , చెప్పుకోలేని ఆందోళన.

‘స్వచ్ఛ భారత్’ ప్రాంగణాల్లో కెమెరాల ముందు చీపుర్లతో దర్శనమిచ్చి  ‘నమో’ వాక్యాల భజన చేసే రాజకీయ దుర్గంధ నాయుళ్ళందరూ కట్ట మీదినుంచి వీచే యీ గవులును వొక్కసారి పీల్చి సిగ్గుపడాల్సిన అవసరాన్ని గుర్తుచేసే యీ కథలోని  వస్తువుతో కొందరికి పేచీ అయితే రచయిత సొరూప ముఖత: వర్ణించిన చీదర కొంతమందికి కడుపులో కెలికినట్టు చేసింది.

‘నా యెడం పాదం ముందు నుంచి – నలుపు మీద నాలుగు యర్ర మచ్చలున్న పురుగు పోతావుంది. అది ముందుకాళ్ళతో కుంకుడు గింజంత పియ్యి వుండని దొర్లించుకుంటా పోతావుంది. దొర్లించుకుంటా పోటం వలనేమో , వుండ బో గుండ్రంగా , చూట్టానికి చిన్నసైజు లడ్డులాగా వుంది.

‘ … పాదాల్నిండా పియ్యి. కజాబిజి తొక్కానేమొ , అతుక్కుపోయింది. యేళ్ళ మజ్జ నుంచి పొడుచుకొచ్చి , అంచుల్లోకెల్లకొచ్చి …! చెప్పుల్లేకుండా నల్లమట్టి పొలంలో నడిస్తే మట్టి బూట్లొస్తాయే , అట్లొచ్చినయ్ పియ్యబూట్లు!’

యిటువంటి వర్ణనలు చాలా మంది కథా శిల్ప ప్రేమికులకి , సమీక్షకులకి మింగుడు పడలేదు. ఇది కథ కాదు అని కంగారు పడ్డారు. ఇన్నాళ్ళూ కథలకి గీసుకొన్న కొలతల్లో యిమడని  రచనా శైలి యిది. ఈ శైలే  ప్రధాన స్రవంతి పత్రికలకు ఈ కథ పట్ల అసహ్యం కలిగి ప్రచురించకపోటానికి కారణమయింది. మన యీ సభ్య నాగరిక సమాజం లోపలి – బయటి  కల్మషాన్నంతా పై నుంచీ కిందకి ‘చేపని కడిగినట్టు సుబ్బరంగా రుద్ది’ కడిగి పారేయడానికే రచయిత కావాలనే యీ ముళ్ళ దారిలో నడిచిందని  గ్రహించాలి. నిజానికి మనం యింకా  యిటువంటి సమాజంలో బతుకుతున్నందుకు దిగులుతో  సిగ్గుతో బెంగతో  ‘సిరిసెవట్లు’ పుట్టాలి గానీ పీతుర్ల వర్ణనల పట్ల అసహ్యం కలగనేల?

నాకైతే కథ చదివాకా చదివిన ప్రతిసారీ రోజుల తరబడి నిద్ర పట్టలేదు. కారణం యిదంతా – యీ చీదరంతా – చెరువు గట్టున పందుల కుమ్ములాటలోనో , కాలవ వొడ్డున రెల్లు దుబ్బుల చాటునో , రోడ్డు వార కంచె తుమ్మ కంపల మధ్యనో   కాలేజీ చదువు పూర్తయ్యేదాకా నేనూ అనుభవించా. అది కేవలం  స్వీయానుభవం మాత్రమే కాదు; నా చెల్లీ తల్లీ అక్క అవ్వ కుటుంబ స్త్రీలు మా వాడకట్టులోని ఆడవాళ్ళందరూ అనుభవించారు. వాళ్ళందరికీ చెంబట్టికొని వెళ్ళే ఆ చీకటి కార్యక్రమం యెంత అవమానాస్పదమైనదో యెంత లజ్జాభరితమైనదో యెన్ని యిబ్బందులకు హేళనలకు నెలవో యెంత హింసకు పాదో  ఆ వయసులో నాకు తెలీదు. ఆ తర్వాత తెలిసొచ్చింది. కానీ  వినోదిని కట్ట చదువుతుంటే ఆ అవమాన గాయాల్ని మళ్ళీ మళ్ళీ కెలికినట్టయింది. చాలా డిస్టర్బ్ అయ్యా.  అయాం అగైన్ యిన్  డీప్ షిట్ !

ఈ బహిర్భూమి కార్యక్రమం స్త్రీలకు అనునిత్యం చిత్రహింసే. కూర్చొని వుండగా అంతదూరంలో రైలు బండి వస్తుందంటే , యెవరైనా ‘మొగమనిషి కనబడ్డాడంటే లేచి నిలబడాల్సిందే!’. ఆడవాళ్ళకి మాత్రమే యీ  హింస. ‘యిట్లా మజ్జలో లేచి  నిలబడే అవసరముండ’ని మగపుటకకి ఆడజన్మలో లేని గొప్ప వెసులుబాటు వుందని అనుకొన్న స్వరూప పాయింట్ లోని చేదు ‘అనుభవించినోళ్లకే తెలుస్తది’.

అంతేకాదు అక్కడ పియ్యి తినడానికొచ్చే పందులతో కుక్కలతో యుద్ధమే చెయ్యాలి. అన్నిటికీ మించి తమ లేకి చూపులతో గాలి మాటలతో వెకిలి చేష్టలతో అత్యాచారానికి పూనుకొనే మగకుక్కల బారిన పడకుండా కాపాడుకోడానికి అనుక్షణం అప్రమత్తంగా వుండాలి.  ఒక విధంగా యిన్ని అవమానాల మధ్య ఆడదానికి  కాలకృత్యం తీర్చుకోవడం దినదిన గండమే , జీవన్మరణ సమరమే.

పగటి పూట కట్ట పక్కన ముళ్ళ కంచెల్లో సిగ్గుతో నొప్పితో సతమతమవుతున్న స్వరూప వొక పోకిరీ వేధింపుకి భయపడి ముళ్ళ కంచెల్లో పరుగెత్తినపుడు ఆమె అనుభవించిన శారీరిక – మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిది. పాపం అరికాళ్ళలో గుచ్చుకొన్న ముళ్ళని తీయగలిగినన్ని తీసి (యిరిగి లోపలే వుండిపోయినవి కాక యిరవైమూడు) పొట్లం కట్టి అమ్మకి చూపించిన సందర్భంలో స్వరూప యేడుపుకి కరగని పాఠకులుండరేమో! ఇక  ‘సెవిటి కరుణమ్మదొడ్డికెల్లి రైలు కిందబడి’ చనిపోయే ముగింపు అయితే హృదయవిదారకం.

***

జీవితాన్ని వున్నది వున్నట్టుగా యథాతథంగా చిత్రిస్తే అది కళ కాదు ; కేవల వాస్తవానికీ కళకీ మధ్య వున్న రేఖని స్పష్టంగా గుర్తించడంలోనే రచయిత మెళకువ చూపాలి – అని చెప్పే రొట్టకొట్టుడు విమర్శ సూత్రాలకి అందని కథ యిది. జీవిత సత్యావిష్కరణ కంటే మించిన కళ వుండదన్న స్పృహతో చెక్కిన మొరటు శిల్పం యిది. ఎటువంటి మేలి ముసుగులు అలంకారాల తొడుగులు లేకుండా వొక దు:ఖ భాజనమైన – అవమాన భరితమైన పేద దళిత జీవన పార్శ్వాన్ని సామాజిక బీభత్సంతో అన్వయించిన కథనం యిది. నోట్లో వెండి చెంచాల్తోనూ యింట్లో అటాచ్డ్ ప్రాచ్య – పాశ్చాత్య స్నానాగారాల ఫ్లషవుట్లతోనూ పుట్టి బతికే నాగరికులకు అర్థంకాని దుర్భరమైన వేదన యిది.

జుగుప్స కలిగించే పియ్యి పీతుర్ల వర్ణనల్లేకుండా యీ కథ రాయడం యిదే కథలో తెనాలి రామలింగడు వొకానొక విద్వాంసుడితో చాలెంజ్ చేసినట్టు పాస్ పొయ్యకుండా దొడ్డిక్కి కూర్చోవడమంత కష్టం అని రసజ్ఞులైన భావుక విమర్శకులు తెలుసుకోవాలి (ఈ చీదరని భరించలేని తనం నుంచి బయట పడటానికే జీవితంలో , కథలో దొడ్డికి చుట్టూ జోకులూ పిట్టకథలూ చోటుచేసుకొన్నాయేమో!).

అయితే రైలు కట్ట పట్టాల పక్కన పెంటలు ‘చూడ్డానికి ఇరగబూసిన బంతిపూల్లగా, చేమంతి పూల చెండుల్లాగా కనపడతయ్’ అని రచయిత వొకచోట చేసిన  ఆలంకారిక వర్ణన శుద్ధ కళా వాదుల ముఖమ్మీద రచయిత ఐచ్ఛికంగా విసిరి కొట్టిన అశుద్ధమే. సాహిత్య భావుకులకీ  సౌందర్య పిపాసువులకీ కళారాధకులకీ  చెంప పెట్టులా గబ్బిల దౌత్యం నెరపిన మహాకవి గుర్రం  జాషువా వారసత్వమిది. పదాల మాటునో అంతరార్థాల వెనకో దాక్కోకుండా ముక్కుసూటిగా మాట్లాడే దళిత తత్త్వమిది. కళ్ళముందు కనపడే వాస్తవాలతో  యెటువంటి దాపరికాలకీ తావులేని యింత సాదాసీదా కథని నేనిటీవల చదవలేదు.

కేవల యథార్థ జీవిత చిత్రణకి ప్రలోభపడి  వినోదిని కథానిర్మితి విషయంలో యెక్కడా యే మాత్రం అశ్రద్ధ చూపలేదు. కథ చెప్పేది యింటర్మీడియట్ చదివే అమ్మాయి. ఆమె సామాజిక నేపథ్యం పేద దళిత క్రైస్తవ జీవితం.  పదహారేళ్ళ ఆ  పిల్ల మౌఖిక కథనంలో అనేక  ఆర్ధిక – సాంస్కృతికాంశలనీ , వాటితో ముడివడి వున్న భాషనీ  అతి సహజంగా తీసుకువచ్చే విషయంలో  రచయితగా వినోదిని చూపిన నేర్పు ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.  కథా గమనంలో అనేక సామాజికాంశాలు ప్రస్తావనకొస్తాయి. ఆ యా సందర్భాల్లో రచయిత  దృక్పథం కూడా స్పష్టంగానే తెలుస్తుంది. కథ ప్రారంభమే అందుకు మంచి వుదాహరణ.

కాలేజికి సెలవలని వినగానే  స్వరూపకి అందరిలా సంతోషం కలగలేదు. ‘గుండెల్లో రాయి పడింది. ఆస్టల్ అన్నంలో దొరికేంత చిన్నసైజు కాదు. రైలుకట్ట మీదుంటదే , చేతిలో సరిపోయేంతది, అంతది.!’

మొదటి పంక్తుల్లోనే కథాంశం , కథా సారం రెండూ వొకేసారి  వ్యక్తమయ్యాయి. రచయిత ప్రతిపాదించదల్చుకొన్న విషయం హాస్టల్ అన్నం , అన్నంలో రాళ్ళ సమస్య కాదు – వాటిని మించిన భీతావహమైన సమస్య యింట్లోనో బయటో మరుగుదొడ్డి లేకపోవడం అని తెలుస్తుంది.  అందువల్ల యిది ఆకలి కత కాదు – అవమానాల వెత . ఆకలికే కాదు అవమానాలకి కూడా పాదు పేదరికమేనన్న స్పృహ  రచయిత  యే సందర్భంలోనూ మర్చిపోలేదు.

యూరియా సంచులు కలిపి కుట్టి నాలుగు మూలలా పాతిన బొంగుల ఆసరాతో మూడు గోడల్లా చుట్టి , తలుపు బదులు పాత చీర అడ్డంగా కట్టిన బాత్రూం , నున్నగా అలికిన నేలమీద బొంతేసుకొని పొణుకోవడం ,  ఇంటి తాటాకు కప్పులోంచి కురిసే వానకి కప్పుకున్న దుప్పటి తడవడం , నీళ్ళు కారిపోయే చిల్లు రబ్బరు చెంబు , కిరసనాయిలు దీపం బుడ్డీ , చిన్న చిన్న బట్టల సబ్బు ముక్కల్తో వొళ్ళు రుద్దుకోవడం , బయటుండి చదువుకొనే గేరి పిల్లలు సెలవలకి యిళ్ళకొచ్చినపుడు కూలి పనులకి పోయి పుస్తకాలకీ బట్టలకీ నాలుగు డబ్బులు సంపాదించడం … యిలా   కథావరణానికి అవసరమైన సామగ్రి యేదీ  ఆమె దృష్టి నుంచి తప్పించుకుపోలేదు.

నిజానికి వాస్తవ జీవిత చిత్రణ దానికదే కథ అయిపోదు. యథార్థతని గ్రహించడానికి , గ్రహించినదాన్ని సరైన మాధ్యమంలో ఆవిష్కరించడానికీ సమ్యగ్ దృక్పథంతో కూడిన సునిశితమైన పరిశీలన అవసరం. అది వినోదినిలో నిండుగా వుందని కట్ట నిరూపిస్తుంది. ఆమె కన్ను కెమెరా కన్ను. చూపు మైక్రోస్కోపిక్ చూపు. చిత్రణ మల్టీ డైమన్షనల్. వాడిన రంగులు సహజ సిద్ధమైనవి. కాన్వాస్ జీవితమంత విశాలమైనది.

అందుకే – బొట్టు బొట్టుగా యింట్లోకి కారే వాన నీళ్ళు గిన్నెలోకి పడుతున్నప్పుడు చేసే శబ్దానికి నిద్ర చెడకుండా వుండడానికి గిన్నెలో బన్నీ (బనియన్) వేయడం , కట్ట మీదకెళ్ళినపుడు చిల్లు చెంబులో నీళ్ళు కారిపోతే పక్కవాళ్ళనుంచి పంచుకోవడం , పీతుర్ల మధ్య చెంబు పెట్టడానికి బెత్తెడు చోటులేక పాదమ్మీదే పెట్టుకోవడం , దొడ్డిక్కూడా వొక్కచెంబులోనే నీళ్ళు తీసకపోయే సావాసాలు , పక్కపక్కనే కూర్చుని చెప్పుకొనే కతలు – కబుర్లు , దసరా సంక్రాంతి పండగలప్పుడు స్కూల్లకీ కాలేజీలకీ అన్నేసి రోజులు సెలవలిచ్చి క్రిస్టమస్ కి వొక రోజు సెలవివ్వడంలో కనిపించే ఆధిపత్య మత భావన గురించిన ప్రస్తావన , కూర్చుంటంటేనే తినడంకోసం కాసుకున్న పందుల ఆరాటం , కట్ట మీద నుంచి తిరిగొచ్చేటప్పుడు చెంబు కుడి చేత్తోనే పట్టుకురావాలని గుర్తుచేసుకోవడం , చెంబు మళ్ళీ గాబులో ముంచేముందు అడుగు కడగడం , యిరోచనాలు కట్టుకోడానికి మాత్తర్లేసుకొనే సొంత వైద్యాలు – సగ్గుబియ్యం గంజి తాగడం – పంచాదారేసుకొని యిడ్లీ తినడం , కాకెత్తక పోద్దని వొంటి సబ్బు యింట్లో దాచిపెట్టుకోవడం  … వంటి నిర్దిష్ట జీవితానికి సంబంధించిన అనేక సూక్ష్మాంశాలు కథలోకి అలవోకగా వొచ్చి చేరాయి. వాటితోబాటు యింటా బయటా గేరీ మనుషుల్లో మాటల్లో కనిపించే వినిపించే క్రైస్తవ సంస్కృతి కథకి మరింత సహజ పరిమళాన్ని అందించింది.

అయితే వీటిలో యేవీ రచయిత దృష్టికోణం నుంచి చూపినవి కావు. ఇంటర్ చదివే టీనేజి అమ్మాయి చూపు ద్వారా కథలోకి యెక్కినవే ( ఇస్లాం పేట మసీదు నుంచీ విన్పించే అజా తప్ప). ఆ వయసు పిల్లల ఆలోచనలు , భయం ఆందోళన సంతోషం దు:ఖం వంటి మానసిక వుద్వేగాలు , వాటి వ్యక్తీకరణ రీతులు , అందుకు వుపయోగించిన భాష – పదజాలం , వుచ్చారణా పద్ధతులు – అన్నిటినీ అపూర్వమైన నైపుణ్యంతో రచయిత ఆవిష్కరించి ఆత్మకథాత్మక  కథనానికి విశ్వసనీయతని సాధించింది. అదే యీ కథలో అంతర్గతంగా కనపడని శిల్పం. అదే ఈ కథలోని బలం కూడా. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతపు గేరీల భాషని వినోదినిలా యింత అద్భుతంగా సాహిత్యంలోకి యింతకుముందు యెవరూ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అందుకే అపూర్వమనడం.

***

నీళ్ళులేని కమ్యూనిటీ టాయిలెట్లకి సంబంధించిన విషయాన్ని యితివృత్తం చేసుకొని తీవ్ర క్రోధంతో  శాంతి నారాయణ రచించిన  ‘అసలవి లేనప్పుడు …’ కథ  దీని తర్వాతి  కాలంలోనే ( ప్రజాసాహితి , జూలై – 2015) వచ్చింది. మధ్యాహ్నం పూట చెంబు పట్టుకొని జొన్నతోట్లోకి వెళ్లి ఎలుగుబంటి కి చిక్కి చచ్చిపోయిన  మండల ప్రెసిడెంటు మాదిగ మారెక్క వుదంతాన్ని పేర్కొంటూ  ‘ఒక ఆడడానికి ఈ దేశంలో స్వేచ్ఛ కంటే మరుగుదొడ్డి చాలా ముఖ్యమని’ ఆత్మ గౌరవ ప్రకటన చేసిన పద్మావతి , ‘సాగునీల్ల కత దేవుడెరుగు , కడాకు తాగడానికి గుటికెడు మంచినీల్లూ ముడ్డి కడుక్కోడానికి చెంబెడు నీల్లూ ఈలేనప్పుడు ఈ రాట్రం బంగారుదైతే మాకేమొత్తది , యెండిదైతే మాకేమొత్తది?’ అని రాష్ట్రాన్ని సింగపూరో జపానో చైనానో చేస్తామని వూదరగొట్టే నాయకుల్ని ప్రశ్నించి రాజకీయ చైతన్యం చూపిన రామన్న , ‘నీల్లు ఎటూ దొరకవు , దినామూ బయటికి ‘దొడ్డికి’ పోయినంక ముడ్డి తుడుసుకుందేకి’ గులకరాళ్ళు పంపించమని కలెక్టర్ ని నిలదీసి అధిక్షేపించి హేళన చేసిన సుబ్బమ్మ యీ కథలో గొప్ప పోరాట యోధులుగా దర్శనమిస్తారు.

‘కట్ట’ కథలో యిటువంటి పాత్రలు లేవు. రాత్రిపూటే కావొచ్చు రోడ్డు పక్కనే కూర్చోవాల్సి వచ్చినప్పుడు యెల్తుర్లో ఆ యిబ్బంది నుంచి అవమానాల నుంచి తప్పించుకోడానికి ‘కరెంటు స్తంబం మీద లైటు పగల్నూకిన’  అంజమ్మత్త చేతిలోని రాయి కేవలం గౌరవం కాపాడుకొనే సాధనంగానే కాకుండా తమ దురవస్థకి కారణమైన వ్యవస్థపై ఆయుధంగా మార్చుకొంటే బాగుండుననిపిస్తుంది.

కథ మధ్యలోనో చివరనో  ఒక చూపుడు వేలి కోసం వెతుక్కోవడం తప్పుకాదేమో! సూచ్యంగానో వాచ్యంగానో అటువంటి భరోసానివ్వని కథ కంప్లైంట్ కథగా మిగిలిపోయే ప్రమాదముంది. దాన్నుంచి తప్పించడానికే రచయిత కరుణమ్మ మరణాన్ని కథకి ముగింపుగా మలచినట్టు అనిపిస్తుంది. చీకట్లో మొదలై చీకట్లోనే ముగిసే రోజువారీ బతుకు వెతలపై నిరసనే ఆగ్రహ ప్రకటనే ఆ అవ్వ మరణం. ఈ దేశంలో దొడ్డికెళ్ళడం కూడా చచ్చేచావు అన్న పచ్చినిజం కోపానికి కారణమవుతుంది. కట్ట మీద దొడ్డిక్కూర్చోడానికెళ్ళిన సెవిటి కరుణమ్మవ్వ రైలు కింద పడి చనిపోవడం పాఠకుల్లో ‘పెద్ద రైలుకూతలా  గుండెల్లో దుఖ్ఖాన్ని’ మాత్రమే కలిగించదు ;  ఆగ్రహాన్నీ ఆవేశాన్నీ సైతం  రగిలిస్తుంది.

ఫిర్యాదు కథల ముద్రకి గురికాకుండా వినోదిని తీసుకొన్న యిటువంటి జాగ్రత్తల గురించి పి. సత్యవతి స్పష్టంగానే గుర్తించారు. అందుకే  ‘కన్నీళ్లు  తెప్పించడం ఈ  కథల ప్రయోజనము లక్ష్యము ఏ మాత్రం కాదు … నిలవ నీటిలో ఆనందం పొందే మొద్దు చర్మాలని అంకుశంతో పొడవాల్సిందే – ఆ అంకుశాన్ని తన కలం చేసుకుంది వినోదిని’ ( ‘బ్లాక్ ఇంక్’ పుస్తకానికి ముందు మాటలో) అంటారామె. నిజానికి కథ పొడవునా రచయిత ప్రాపంచిక దృక్పథం పరచుకొని వుండడం వల్ల కూడా వినోదిని కథలు కేవలం ఫిర్యాదు కథల్లా మిగిలిపోవు. దళిత సామాజిక వాస్తవికత వినోదిని కథలకి ఆయువుపట్టు. దానికి క్రైస్తవ సంస్కృతీ , స్త్రీ చైతన్యం జోడించడంతో ఆమె కథలు విశిష్టతనీ  ప్రత్యేకతనీ అనితరతనీ సాధించుకొన్నాయి.

ఇళ్ళలో సరైన టాయిలెట్ల సదుపాయం లేని ‘గరీబు ముస్లిం ఆడోల్ల బతుకు’ దైన్యంలోని భిన్న కోణాన్ని పదేళ్ళ కిందే షాజహానా కథగా రాసింది( వతన్ – 2004). అప్పుడు అదేదో ఘోషాలోని మైనార్టీల కడుపు నొప్పి అని యే కొందరో వుపేక్షించారేమో గానీ   ‘ఊర్ల ముస్లింలు కానోల్లంతా ఊరి బైటికెల్తరు గదా .. వీళ్లు గూడ ఎల్తేంది ??’ అని సోచాయించే కొత్త దుల్హన్ , నయీ బహూ షమీమ్ బాధకి కారణమైన సామాజిక – ఆర్థిక నేపథ్యం చాలామందిని ఆలోచింపజేసింది.  సండాస్ లో షమీమ్ అనుభవించిన వేదన , కట్ట మీద స్వరూప పడిన యాతన వొకటే. రెండుచోట్లా అందుకు కారణం పేదరికమే.

ఇటువంటి  నిజాల్ని దాచిపెట్టి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు చేసినందుకు హేళనగా చప్పట్లు కొట్టే అడ్వర్టైజ్మెంట్ వొకటి యీ మధ్య టీవీ లో వస్తుంది. యెంత శాడిజం! మరుగుదొడ్డి లేని యింట్లో పిల్లనివ్వవద్దని చెప్పే విద్యాబాలన్ మరుగుదొడ్లు కట్టివ్వని పాలకులకు వోటెయ్యొద్దని ప్రచారం చేస్తే బావుణ్ణనిపిస్తుంది. కాంట్రాక్టర్లు అధికారులు రాజకీయ దళారులు లక్షలు స్వాహా చేసి కట్టిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ యెంత గొప్పగా వుంటుందో చూస్తే మొత్తం వ్యవస్థ మీదే రోతపుడుతుంది. పెయిడ్ పబ్లిక్ టాయిలెట్ల బాగోతం మళ్ళీ వేరే.

అంతర్జాతీయ మార్కెట్లో మెకిన్ యిండియా నినాదంతో  వూదరకొడుతోన్న పాలకులకి కట్ట , సండాస్ , అసలవి లేనప్పుడు … వంటి కథలు గొంతులో పచ్చి వెలక్కాయల్లా మింగుడు పడక పోవచ్చు. కంట్లో నలుసుల్లా మెరమెరలాడవచ్చు. దేశమంతటా వీస్తోన్న యీ గవులు వారికి పెద్ద విషయం కాకపోనూవచ్చు. కానీ సామాన్యుడికివ్వాళ కావాల్సింది – డిజిటల్ ఇండియా కాదు  టాయిలెట్స్ ఇండియా అని యీ కథలు ముక్కు మీద గుద్ది మరీ చెబుతున్నాయి. దేశభక్తుల పన్నులతో నడిచే వొక విశ్వ విద్యాలయంలో పనిచేస్తూ దేశ గౌరవాన్ని మంటగలిపే యిటువంటి కథ రాసినందుకు వినోదినిని  దేశద్రోహనేరం కింద విచారణ లేకుండానే అసహనంతో శిక్షిస్తారేమోనని అనుమానంగా వుంది. సృజనాత్మకతనే ఆచరణగా మార్చుకొన్న వినోదిని నిబద్ధతకు (దీన్నేFawzia Afsal-Khan ‘artivism’  అంటారు) సంఘీభావం ప్రకటించాల్సిన సందర్భమే యిది.

తాజా కలం : స్మార్ట్ సిటీల విశ్వ నగరాల అంచుల్లో కొత్తగా వెలిసే వెలివాడల్లో సిగ్గులేకుండా దొడ్డికి కూర్చోడానికి యెక్కడెక్కడ సదవకాశాలున్నాయో స్మార్ట్ ఫోనుల్లో క్షణాల్లో తెలుసుకొనేందుకు వీలుగా ‘మహిళా బహిర్భూమి యాప్’ తయారీకోసం  స్టార్టప్ మేధావులకి ప్రభుత్వాలు లోన్స్ సాంక్షన్ చేస్తాయనీ , అందులో భాగంగా పల్లె పల్లెకీ వాడవాడకీ వై ఫై సదుపాయం కలగజేస్తారనీ   మన్ కీ బాత్ లో ప్రధాని వరమివ్వబోతున్నట్టు యిప్పుడే  వార్త అందింది. ఇక  కూర్చున్నప్పుడు ‘పిర్రలమీద దోమలు కుట్టి దద్దుర్లు కట్టడానికి’ ఆస్కారం యివ్వని ఎ సి వాష్ రూమ్ ల కోసం గూగుల్ మేప్ లో వెతుక్కొని  చూడ్డమే యిప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యమ్. అంత వరకూ కట్టల మీద సెవిటి కరుణమ్మవ్వల సహజ / అసహజ  మరణాలు తప్పవు. ఆధునికీకరణ లో రూపాంతరం చెంది రైలు కట్టలన్నీ  బుల్లెట్ ట్రైన్ ట్రాక్ లుగా మారిపోబోతున్నాయి కాబట్టి  అటువంటి బహిరంగ ప్రదేశాల్లో మల/మూత్ర విసర్జనలు చేసినందుకు లోకల్ బాడీ అధికారులు విధించే జరిమానాలు కట్టుకోడానికి సిద్ధంగా వుండక తప్పదు. ఇతి శమ్ … బే షరమ్.

*

 

 

 

దేహ భాష తో మౌనంపై యుద్ధం – “కప్లెట్”

 

-ఏ.కె. ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

ఇద్దరు స్త్రీల మధ్య చోటుచేసుకొనే శృంగారానుభావాన్ని లైంగిక హక్కుల్లో భాగంగా ప్రతిపాదిస్తూ సాహిత్యీకరించడం  మన సమాజంలో సాహసమే.  స్థిరీకృత విలువల్నీ సాంప్రదాయిక ఆలోచనల్నీ వ్యవస్థీకృత భావనల్నీ ధ్వంసం చేసి కొత్త దృష్టికోణాన్ని ఆమోదయోగ్యం చేయడం అంత సులువేం కాదు. ఆ సాహసాన్ని యిష్టపూర్వకంగా చేయడానికి పూనుకొన్న రెంటాల కల్పన రాసిన కథ కప్లెట్. ఈ కథ రాయడానికి  వస్తు స్వీకరణ దశలోనే రచయిత సంఘర్షణ యెదుర్కొన్నట్టు తెలుస్తుంది. పాఠకులు అంగీకరిస్తారో లేదోనని సంకోచం వొకవైపు ,  లోతుగా పాతుకుపోయిన సామాజిక కట్టుబాట్లనీ బలమైన చట్టాల్నీ ప్రకటిత అప్రకటిత నిషేధాల్నీ అభేద్యమైన నిశ్చిత నిశ్చయాల్నీ అన్నిటికీ మించి ప్రాకృతిక నియమాల్నీ  సహజమైన సంబంధాల్నీ కాదని అతిక్రమించడానికి తన్నుతాను సంసిద్ధం చేసుకోవడం మరోవైపు , వీటిని బ్యాలన్స్ చేస్తూనే వొక నిర్దిష్ట దృక్కోణాన్ని ప్రతిపాదించే పనిలో కళాత్మక విలువలు దెబ్బతినకుండా కథని  తీర్చిదిద్దాల్సిన అవసరం యింకోవైపు  యిదంతా వొక ‘సోషియో లిటరరీ వార్’ లో భాగంగానే జరిగినట్టనిపిస్తుంది.

స్త్రీ పురుషుల శృంగారాన్ని ప్రణయ భక్తిగాథల మధ్య వర్ణించిన తెలుగు సాహిత్యంలో మాయ , వైష్ణవి మధ్య శృంగారానుభవం రాయటం రాసి మెప్పించటం , మెప్పించి లెస్బియన్ బంధం కూడా సక్రమ సంబంధమేనని ఒప్పించటం అంత సులువుగా ఏమీ జరగలేదు. నాకే తెలియకుండా నా లోపల ఉన్న అప్రకటిత సెన్సార్షిప్ ను ఎంతో కొంత వదిలించుకొన్నాకే ఈ కథ రాయగలిగాను … … … కప్లెట్ కథను ప్రచురించటానికి తెలుగు పత్రికలు ఇంకా సిద్ధంగా లేవు అని వెనక్కు తిప్పి పంపటం సమాజానికి , సాహిత్యానికి ఉన్న ఒక పెద్ద దూరాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.

(కల్పనా రెంటాల : ‘శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …’ (తెలుగు సాహిత్యంలో స్త్రీ పాత్రల పరిణామం)  20వ తానా సభలు – సాహిత్య సమావేశం,  జూలై 2 – 4 , 2015 లో చేసిన ప్రసంగ పాఠం నుంచి)

కల్పన చెప్పిన పై మాటలు చదివాకా కొత్త వస్తువుతో కొత్త కథ రాయడానికి రచయితకీ పాఠకులకీ మధ్య వున్న గోడల్ని అధిగమించడానికి రచయిత యెంత  వొత్తిడికి గురైందో తెలుస్తుంది. సాహిత్య వ్యవస్థ నిర్దేశించిన అలవాటయిన మార్గానికి భిన్నంగా కొత్త దారి పరుస్తూ  కప్లెట్ లాంటి కథ రాయడం , రాసి మెప్పించడం వొక యెత్తు అయితే తాను ప్రతిపాదించదల్చుకొన్న లెస్బియన్ సంబంధం ‘సక్రమమే’నని వొప్పించడం మరో ఛాలెంజ్. ఆ క్రమంలో కల్పన గుర్తించిన మరో అవరోధం సమాజానికీ సాహిత్యానికీ మధ్య వున్న దూరం , ఆ దూరాన్ని తొలగించాల్సిన పత్రికలు యింకా అందుకు పూర్తిగా సిద్ధంగా లేకపోవడం. ఇవన్నీ బయటికి కనిపించే  కారణాలైతే కనపడని లోపలి కారణం తనకు తాను విధించుకొన్న అప్రకటిత సెన్సార్ షిప్. ఏమైతేనేం వీటన్నినీ తెంచుకొని కథ మన ముందుకొచ్చింది.

మై బాడీ మై ఛాయిస్ అన్న భావనని  తెలుగు పాఠకులకి కల్పన మరీ కొత్తగా యేం పరిచయం చేయడం లేదు. స్త్రీ వాదం చేసిన ప్రయాణంలో యిదో మలుపేనన్న స్పృహ కూడా ఆమెకు వుంది. కాకుంటే స్త్రీల లైంగికతని ఆమె కేవలం  శరీర రాజకీయంగా మాత్రమే కాకుండా హక్కుల రాజకీయంగా కూడా  చూస్తుంది.

స్త్రీల శృంగారానుభవం గురించి ముద్దుపళని రాసిన రాధికాసాంత్వనం పుస్తకాన్ని నిషేధించి చదువుకున్న మేధావులు చేసిన కువిమర్శల దాడి మొదలుకొని ఇప్పటి వరకు స్త్రీలు లైంగికత్వం గురించి , లైంగికానుభావాల గురించి రాయటంలో ఎన్నో ఆటుపోట్లను , ఎదురు దెబ్బలను ఎదుర్కొని ఇంత దూరం ప్రయాణించారు. (‘శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …’)

అయితే తన దృక్పథాన్ని కథీకరించడంలో చాలా జాగరూకత వహించాలనే వొక యెరుక ఆమెకు వుంది. ఆ యెరుకవల్ల  కథ  కళాత్మకంగా రూపొందింది. అలా తీర్చి దిద్దడానికి రచయిత చేసిన  కాన్షియస్ ప్రయత్నం కథ పొడవునా కనిపిస్తుంది. లేకుంటే యే సపరి ‘వార’ పత్రికలోనో సెంటర్ స్ప్రెడ్ స్టోరీ గా యెవరూ చూడకుండా రహస్యంగా చదువుకొనే  సరస శృంగార కథగా తయారయి వుండేది. సరైన దృక్పథాన్ని సరైన రీతిలో బట్వాడా చేయగల కథా నిర్మాణ నైపుణ్యం వొక్కటే అటువంటి ప్రమాదం నుంచి కాపాడగలదు. అందులో భాగంగానే రచయిత్రి పాత్రల నిర్మితిలో గొప్ప నేర్పు ప్రదర్శించింది. కథలోని పాత్రల బయటి లోపలి స్వరూప స్వభావ ఆవరణల్ని ఆవిష్కరించింది. భిన్న ప్రవర్తనలకీ వుద్వేగాలకీ  సంఘర్షణలకీ అనుగుణమైన భిన్న నేపథ్యాలు నిర్మించింది. దేశ కాలాలు పాత్రల మధ్య లోపల సంఘర్షణకి కారణమౌతాయి.

స్వలింగ సంపర్కం గురించి అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వొకే విధమైన సామాజిక నియమాలూ నైతిక విలువలూ చట్ట నిబంధనలూ లేవు. యూరప్ అమెరికాల్లో చాలా మేరకు LGBT లకు చాలా వరకు స్నేహం – ప్రేమ – కలిసి జీవించడం – శారీరిక సంబంధం కల్గి వుండడం – గోప్యత అవసరం లేని స్వలింగ సంపర్కం- పెళ్లి చేసికోవడం – పిల్లల్ని పెంచుకోవడం  – సొంత కుటుంబం యేర్పరచుకోవడం వంటి స్వేచ్ఛ  వుంది. ఆసియా ఆఫ్రికా దేశాల్లో అవన్నీ నిషిద్ధాలు.  ఇండియాలోనే కాదు 80 శాతం కామన్వెల్త్ దేశాల్లో సైతం స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. కఠిన శిక్షకి కారణమయ్యే నేరం . ఒకే జెండర్ కి చెందినవారి మధ్య వైవాహిక హక్కులు లేవు. భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని  చట్ట బద్ధం చేయమని పిటిషన్లు (నాజ్ ఫౌండేషన్), చట్టసభల్లో ప్రైవేటు బిల్లులు , కొండొకచో వీథి ప్రదర్శనలు , సెక్షన్ 377 (నిషేధ చట్టం) ని రద్దు చేయమని న్యాయస్థానాల్లో హక్కుల పోరాటం వంటివి ఇటీవలి పరిణామాలు. చట్టాలని సైతం పక్కన పెట్టి ఖాప్ పంచాయితీలు సగోత్రీకుల మధ్య పెళ్ళిళ్ళకి కులాంతర వివాహాలకు క్రూరమైన శిక్షలు పరువు హత్యలు అమలు జరిపే పరిస్థితుల మధ్యే  ఫైర్ నుంచీ అఫైర్ వరకూ సినిమాలు తయారవుతున్నాయి. ఈ సందర్భాన్నుంచే కప్లెట్ కథని చూడాలి .

వైష్ణవి సంప్రదాయ భారతీయ హిందూ కుటుంబానికి చెందినది. ఆమె బాల్యం పదమూడేళ్ళ వరకూ ఇండియాలోనే గడిచింది. ఆ తర్వాత అమెరికా వచ్చేసినా చిన్నప్పటినుంచీ అనేక ఆంక్షల మధ్య పెరిగింది. వయసు పెరుగుతోన్న కొద్దీ వాటికి యెదురు తిరగడం మొదలైంది. కూచిపూడి డాన్సర్. కూచిపూడినీ ప్రపంచంలోని యితర నృత్యరీతులనీ తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి  తల్లిదండ్రుల కట్టడి నుంచి బయటపడి వారికి దూరంగా ఆస్టీన్ వచ్చింది. అక్కడ  సొంత ఇంటిలో మొదటిసారి స్వేచ్ఛని అందులోని ఆనందాన్నీ అనుభవిస్తోంది.

మాయ మెక్సికన్ అమెరికన్ అమ్మాయి (1871నుంచే మెక్సికోలో  LGBT లకి ప్రత్యేక హక్కులు వున్నాయి. ఆ విషయంలో అమెరికాకన్నా ముందుంది).  చిన్నప్పటి నుంచే స్వేచ్ఛగా పెరిగింది. ‘మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల అవగాహన ఉంది. మగపిల్లల కంటే ఆడపిల్లలంటేనే ఇష్టంగా ఉండేది.’ హైస్కూల్లోకి వచ్చాకా అబ్బాయిలతో డేటింగ్ చేసింది. ‘కానీ ఏనాడూ దాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది.’  ఎదిగే క్రమంలో ఫెమినిస్టు భావజాలాన్ని వొంటబట్టించుకొంది. ‘Woman’s Body-Feminism-Sculpture’  ని ప్రధానాంశంగా పరిశోధన చేయాలని ఆమె ఆకాంక్ష.

మాయా వైష్ణవీ ల అభిరుచులూ ఆసక్తులూ కలిసి అవసరాల రీత్యా యూనివర్సిటీ క్యాంపస్ కి దగ్గరగా వొకే యింటిని షేర్ చేసుకొంటారు. అదే విధంగా అభిప్రాయాల్నీ పంచుకొన్నారు. ఒకానొక సాయంత్రం  వొక ‘మోహపు ముద్దు’ వాళ్ళిద్దర్నీ శారీరికంగా దగ్గరచేసింది. చీరకట్టులో ‘సెక్సీ’ గా ‘స్పైసీ’ గా  వున్న వైష్ణవిని మాయ ‘ఆర్తిగా’ ముద్దు పెట్టుకొంటే వైష్ణవి ఆమెను ‘గట్టిగా అల్లుకుపోయింది’. ‘మాయ ముద్దు పెట్టుకున్నాప్పుడు అబ్బాయిలు ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అయిందో అలాగే లేదా అంతకంటే ఎక్కువ ఫీల్ అయింది .’ అది మొదలు యెన్నోసార్లు   మాయ వైష్ణవి ‘దేహంలోకి ప్రవహించింది’.

ఆ కలయికల్లో కలిగే ‘అనేక అందమైన అనుభవపు అనుభూతుల సుగంధం’ వైష్ణవి మనసుకి యిష్టంగానూ సహజంగానూ వున్నప్పటికీ ఆమె పుట్టి పెరిగిన  కుటుంబ సమాజ నేపథ్యం కారణంగా ప్రతిసారీ  ‘మాయా మోహపు మంత్రజాలం నుండి బయటకు వచ్చాకా’ ఏదో తెలీని అపరాధభావనకి గురయ్యేది. కానీ మాయ ‘చేతుల్లోని మంత్ర దండానికో చూపుల్లోని శక్తిపాతానికో వద్దు వద్దు అనుకుంటూనే పసిపాపలా’ లొంగిపోయేది.

అయితే తమ సంబంధాన్నిబాహాటం చేయకుండా  యింటి నాలుగు గోడలవరకే వుంచాలని వైష్ణవి , వైష్ణవి పట్ల ఇష్టాన్ని, ప్రేమ ను కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే చూపిస్తూ బయట తానెవరో పరాయి వ్యక్తి లాగా దూరం దూరం గా తిరగటానికి యిష్టపడని మాయ (‘ఇంట్లో ఒక లా, పబ్లిక్ లో మరోలా ఉండటం నాకు రావట్లేదు’ ) , యిద్దరి ఆలోచనల్లో  వున్న  యీ  వైరుధ్యమే సంఘర్షణకి కారణమౌతుంది . వైష్ణవికి లభించిన కొత్త మగ స్నేహం పట్ల కూడా మాయకి రిజర్వేషన్స్ వున్నాయి. వైష్ణవి తన చేజారిపోతుందేమోనని అనుమానం అభద్రతా ఆరాటం మాయని అసహనానికి గురిచేసాయి. దాంతో ఆరోపణలూ ప్రత్యారోపణల్తో యిద్దరి మధ్య మాటలు చురకత్తులయ్యాయి. ‘కలిసి ప్రేమనుపంచుకున్న ఇద్దరూ ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కత్తులతో సమూలంగా రెండువైపులా నుంచి నరికేసుకున్నారు’. గొడవ తెగేదాకా (బ్రేకప్) సాగింది . ఆ సంబంధాన్ని నిలుపు కోవాలా వద్దా నిలుపుకోడానికి యే ఆలోచనలు ప్రేరేపించాయి అన్నదే మిగతా కథ.

ఒకే జెండర్ కి చెందిన యిద్దరు వ్యక్తులమధ్య యేర్పడే శారీరిక ఆకర్షణ మానసిక వైవిధ్యమా మానసిక వైకల్యమా అన్న ప్రశ్న లోతుల్లోకి వెళ్ళకుండా లింగ భేదం లేకుండా తమకు నచ్చిన వ్యక్తితో కలిసి వుండే స్వేచ్ఛ ప్రతి వొక్కరికీ వుండాలనే హక్కులకోణం నుంచి రాసిన కథ కావడంతో చర్చకి తెరలేపినట్టైంది.

ఇద్దరు స్త్రీలు కావొచ్చు యిద్దరు పురుషులు కావొచ్చు వారి మధ్య చోటు చేసుకొనే యిటువంటి సంబంధాలు కేవలం ప్రైవేటు వ్యవహారాలేనా ? వాటికి సామాజిక కోణాలు లేవా ? అన్నది వొక ప్రశ్న.

ప్రకృతి విరుద్ధం అసాధారణమైన (uncommon) వికృతమైన అనారోగ్యానికి దారితీసే సెక్సువల్ పద్ధతులన్నిటినీ వ్యక్తి స్వేచ్ఛ పేరున ఆమోదించగలమా? వావివరసలు అక్రమ సంబంధాలు మొదలైన పదాల అర్థాలు భిన్న దేశ కాలాల్లో మారేవే అయినప్పటికీ విధి నిషేధాలు మనిషి కల్పించుకోనేవే అయినప్పటికీ  మానవ హక్కుల పేరున ఉల్లంఘించగలమా?  తిరుగుబాటు కోసమే తిరుగుబాటు చేయాలా? అని మరో ప్రశ్న.

పిల్లల్ని కనడానికి స్త్రీ పురుషులు  అవసరం అవుతారు కానీ ప్రేమకీ స్నేహానికీ వొకే జెండర్ కి చెందిన వాళ్లైనంత మాత్రాన తప్పేంటి? ఒకవేళ పిల్లల్ని కావాలనుకొంటే కలిసి పెంచుకొంటారు. సమాజంలో యెవరికీ యిబ్బంది కల్గించని అటువంటి సంబంధం మానవ హక్కులకు భంగం కలిగించేది కాదు కదా! అన్నది యెదురు ప్రశ్న.

ఇటువంటి ప్రశ్నల్ని కథ బయటి విషయాలుగా కొట్టిపారేయొచ్చునేమోగానీ కథ లోపలి విషయాలు కూడా  కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.

‘మనసుకి ఏ తొడుగు లేకుండా స్వేచ్ఛ’ గా వొకటైనప్పటికీ  మాయా వైష్ణవీల  మధ్య సైతం అసమ సంబంధమే యేర్పడినట్టు తోస్తుంది . వారిద్దరి భావాల్లో ఆలోచనల్లో వాటి వ్యక్తీకరణలో వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మాయ ప్రవర్తనలో పురుషాధిపత్య స్వభావం  , వైష్ణవి అనుభూతుల్లో స్త్రీ సౌకుమార్యం  గోచరిస్తుంది .  హోమో సెక్సువల్ రిలేషన్ లో కూడ వొకరికి   ఆధిపత్య స్వభావం  సహజమేనని అంగీకరించగలమా ?  ‘సమాన ఛందం’గా వుండాల్సిన ‘జంట’ (కప్లెట్ నానార్థాలు) సంబంధంలో సైతం యేర్పడే వైరుధ్యాల్ని పరిహరించే పరికరాలెలా యెక్కడ సమకూర్చుకోగలం?

మాయ స్థానంలో వైష్ణవి భర్త వుండి యింటో బయటో ఆమెకి ఇష్టం లేనప్పుడు దగ్గర కావడానికి ప్రయత్నిస్తే …. వేరే సంబంధంలోకి వెళ్తున్నావని అనుమానించి అవమానిస్తే … మరొకరితో ఆత్మీయంగా వున్నందుకు అసూయ పడితే … స్త్రీవాదులుగా మన స్పందన ఎలా వుంటుంది? గాఢమైన ప్రేమలో యివన్నీ సహజమేనని స్వీకరించగలమా?

వైష్ణవి కేవలం తనకు మాత్రమే చెందాలని ఆమె తన సొంత ఆస్తి అన్న విధంగానే మాయ ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలి (మాయ ఫెమినిస్టు అయినప్పటికీ వైష్ణవిపట్ల ఆమె ఆలోచనలూ స్పందనలూ మగవాడి ధోరణిలోనే వుండడం గమనించాలి)?

రాహుల్ తో వైష్ణవి సాన్నిహిత్యాన్ని స్నేహాన్ని అసూయతో చూసి అసహనానికి గురయ్యే కన్నా వైష్ణవి స్వభావంలోని ద్వంద్వాన్ని  బై సెక్సువాలిటీగా స్వీకరించవచ్చు కదా! లేదా మల్టిపుల్ రిలేషన్ ని గౌరవించి అంగీకరించ వచ్చు కదా!

మాయే వైష్ణవిని తన మాటలతోనూ చేతలతోనూ లోబరచుకొని చివరికి బ్లాక్ మెయిల్ చేసే స్థితికి వచ్చిందన్న ఆలోచన కూడా పాఠకుల్లో కలుగుతుంది . అందువల్ల కామన్ రీడర్ మాయ మోహం నుంచి వైష్ణవి బయట పడాలని భావించే అవకాశం వుంది .

అదే సందర్భంలో వైష్ణవి మాయల  మధ్య బంధం శారీరిక అవసరాల రీత్యా ఏర్పడిందా  మానసిక అవసరాలకోసం ఏర్పడిందా అన్న ప్రశ్న కూడా వుత్పన్నమౌతుంది. పురుషాధిపత్యం పై నిరసనగా లేదా ధిక్కారంగా   ఫెమినిస్టులూ ,  గర్భధారణ సమస్య లేని సురక్షిత సంబంధమనీ టీనేజి ఆడపిల్లలూ భావించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్ల సంఖ్య పెరుగుతోందని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.  హాస్టల్ మేట్స్ జైల్ మేట్స్ మధ్య  నిర్బంధమో అనివార్య ఆవశ్యకతో బలవంతమో హోమో సెక్సువల్ రిలేషన్ యేర్పడటానికి  కారణాలౌతున్నాయి . అటువంటి ప్రత్యేక కారణాలు  లేకుండానే  మాయా వైష్ణవీ యిద్దరూ ‘సహజంగా యిష్టంగా’ దగ్గరయ్యారని రచయిత్రి వైష్ణవి ముఖత: ప్రస్తావించింది .

అంతే  కాదు; స్త్రీ పురుషులమధ్య మాత్రమే సెక్సువల్ సంబంధాన్ని అంగీకరించడం స్టుపిడ్ నెస్ అని మాయ నమ్మకం. అది సంప్రదాయ శృంఖలాలను తెంచుకోలేక పోవడం అనికూడా ఆమె వుద్దేశం. అందుకే తనతో వున్న సంబంధాన్ని బాహాటం చేయడానికి యిష్టపడని వైష్ణవిని జాతి మొత్తంతో కలిపి స్టుపిడ్ ఇండియన్స్ అని మాయ తిడుతుంది. మాయకి తన మనసుతో లోపలి ఘర్షణతో వ్యక్తం చేసిన భయ సంకోచాలతో ప్రమేయం లేదనీ  యేక పక్షం వ్యవహరిస్తోందనీ వైష్ణవి బాధ. వెరసి కథ మనస్సు – శరీరం – సమాజం – స్వేచ్ఛ అనే నాలుగు నాలుగు స్తంభాల చుట్టూ సంచలిస్తూ చివరికి రాజకీయ ప్రకటన దిశగా పయనిస్తుంది.

శరీరం అనే అడ్డుగోడని కూడా దాటిన ప్రేమబంధం ది కప్లెట్. సెక్సువాలిటీ అనేది ఇవాళ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక పర్సనల్ బెడ్ రూమ్ వ్యవహారంగా ఎందుకు మిగలలేదని ప్రశ్నిస్తుంది వైష్ణవి. మాయా ఈజ్ మై ఛాయిస్ అన్న అవగాహనకు వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య మాత్రమే బంధాలను నియంత్రించే సామాజిక నియమాలను చట్టాలను ధిక్కరించే ఈ కథ లైంగిక హక్కుల అవగాహనకు ఒక ఉదాహరణ.(శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …)

kalpan.profile.photo.1

మాయా వైష్ణవీ ల మధ్య ప్రేమ శరీరాల్ని అధిగమించిందా? అన్నది ప్రధానమైన ప్రశ్న. కథలో వాళ్ళిద్దరి మానసికావసరాల గురించిన ప్రస్తావనలు లేవు. మగవాళ్ళతోగానీ ఆడవాళ్ళతోగానీ  అంతకు మునుపు వైష్ణవికి యెటువంటి సాన్నిహిత్యం లేదు , మాయకి మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల అవగాహన వుందనే విషయం గమనించాలి.

అందువల్లే మాయ దృష్టి ఎంత సేపూ వైష్ణవి శరీరం మీదే వుంది. వైష్ణవి అంగసౌష్టవం వంపు సొంపులే మాయని కవ్వించాయి. శిల్పకళ మీద పరిశోధన చేసే మాయని వైష్ణవి శారీరిక సౌందర్యమే ఆకర్షించింది. వైష్ణవి శరీరంతో ఆమె ఆడుకొంది. వైష్ణవికి స్నానం చేయించాలని ఆమె వుబలాటం. వైష్ణవి మనసుతో ఆమెకి పని వున్నట్టు కనిపించదు. నాట్యం చేసేటప్పుడు ‘ఎగిరెగిరిపడే’ ఆమె ‘వక్షోజాలూ’ , నాట్యం వల్ల చెమటతో తడిసిన దేహానికి అంటిపెట్టుకొన్న వస్త్రాలూ మాయలోనూ పాఠకుడిలోనూ కోరికలు వుద్దీప్తం కావడానికే దోహదం చేస్తాయి. చీర కట్టులో వైష్ణవినీ నల్లటి జలపాతం లాంటి ఆమె జుట్టునీ ‘శరీరాన్ని అంటిపెట్టుకున్న డిజైనర్ బ్లౌజ్ పైనా కిందా ఆమె అర్ధ నగ్నపు వీపునీ ఎడమవైపు నడుం వంపునీ’  చూసినప్పుడు ఆమె మీద మాయకి కంట్రోల్ చేసుకోలేని యేదో అలజడి అంటుకుంటుంది. ‘లోపలి నుంచి ఒక కాంక్ష మాయను నిలువెత్తునా ముంచెత్తుతోంది.’

అప్పుడే కాదు ప్రతి సందర్భంలోనూ మాయ వైష్ణవిని సెక్సువల్ ఆబ్జెక్ట్ గానే చూసింది.  రచయిత కూడా వైష్ణవిని మాయ దృష్టికోణం నుంచే చూపించింది. ‘వైషు  శిల్ప శరీరం’ పట్ల రచయిత్రికి కూడా మోహం పుట్టినట్టుంది. ఆమె దేహభాషతోనే ఆమె  చుట్టూనే కథ అనేకానేక వొంపులు తిరుగుతుంది. ‘దేహ తంత్రులు ఒకదానినొకటి కొనగోటితో మీటుకొనే,  కాంక్షలు అల్లరిగా ఆడుకొనే’   శృంగారానుభవ వర్ణన మగ రచయిత నుంచి వస్తే  మనం యెలా స్వీకరించే వాళ్ళం ? అన్న   ప్రశ్న పుడుతుంది. అయితే  వారిద్దరి పరస్పర స్పర్శలో ‘ఒకరికి ఊరట , సాంత్వన ; మరొకరికి ధైర్యం , నిశ్చింత అన్న వాక్యంతో  ఆ సన్నివేశం ముగిసింది . దాంతో  వారి సాన్నిహిత్యం శరీరాల్ని అధిగమించిందనీ సాంగత్య సౌరభం మనసుల లోతుల్ని తాకిందని వాచ్యంగానే తెలిపినట్టైంది.

రచయిత్రి ఆ సన్నివేశాన్ని వుద్వేగ భరితమైన సంఘటనకీ ఆలోచనాత్మకమైన సంఘర్షణ కీ మధ్య అల్లింది . ఆ విధంగా   ఇద్దరు స్త్రీల మధ్య శృంగారాన్ని బెడ్ రూమ్ నాలుగ్గోడల మధ్య జరిగే ‘ప్రవేటు వ్యవహారంగా’ చూడాల్సిన అవసరం వైపు ,  స్త్రీల లైంగిక స్వేచ్ఛకీ దాన్ని హరించే వ్యవస్థీకృత భావజాలానికీ మధ్య నెలకొన్న దూరాల్ని ఛేదించడానికి వ్యక్తిగా వైష్ణవి చేసే మానసిక యుద్ధంవైపు , తనకేం కావాలో తెలుసుకోలేక తాను స్ట్రైటో లెస్బియనో బైసెక్సువలో తేల్చుకోలేక తన్ను తాను assert చేసుకోలేక తల్లడిల్లే ఆమె అంతరంగ సంఘర్షణవైపు , ఆమె తనలోకి తాను  చూసుకొంటూ చేసే అస్తిత్వ అన్వేషణ వైపు , వ్యక్తి స్వేచ్ఛని నిరోధించే కౌటుంబిక సామాజిక శాసనాల వైపు , వాటి మధ్య వైరుధ్యాలవైపు , మాయా వైష్ణవిల మధ్య సంబంధంలో కూడా యెక్కడో తెలియకుండానే చోటుచేసుకొన్న అసమానతవైపు పాఠకుల దృష్టి మళ్లేలా చేసింది.

వైష్ణవి మనసులో సుళ్ళు తిరిగే సంఘర్షణే కథకి ఆయువుపట్టు. ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు బయట స్నేహితులు వాళ్ళ మధ్య తన పెర్సనల్ ‘ఇమేజి’ … అంతా లెస్బియన్ లేబుల్ అంటించి తనని బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నట్టు భావిస్తుంది. హోమో సెక్సువాలిటీ పట్ల వ్యక్తుల లైంగిక హక్కుల పట్ల తన భావాల్ని వ్యక్తం చేయడానికి రచయిత్రి వైష్ణవినే తన కంఠస్వరంగా యెన్నుకొంది. అందుకే చివరికి వైష్ణవి అన్నిటినీ ఛేదించుకొని  తన మనశ్శరీరాలు కోరుకున్నదాని వైపే మొగ్గింది.

‘మృత దేహాల్ని మార్చురీలో పెట్టినట్లు నేను కూడా ఈ దేహాగ్నిని ఐస్ గడ్డల మధ్య చల్లర్చుకోనా’ అన్న వైష్ణవి ఆవేదనని నెపం చేసుకొని  ‘కొన్ని లక్షల మంది’ (ప్రపంచ బాధిత స్త్రీల సంఖ్యలో యిది చాలా తక్కువ శాతమే కావొచ్చు) గొంతుకలకు ప్రాతినిధ్యం వహిస్తూ శరీర రాజకీయాలనుంచీ  లైంగిక రాజకీయాల దాకా స్త్రీవాద ప్రస్థానాన్ని రచయిత్రి నిర్వచించదల్చుకొన్నట్టు స్పష్టమౌతుంది.

ఇలా వొక భావజాలాన్నిప్రాతిపదిక చేసుకొని నిర్మించే  కథలో పాత్రలు ఫ్లాట్ గా తయారయ్యే అవకాశం వుంది . కానీ కల్పన  మాయ  వైష్ణవి పాత్రల్ని రౌండ్ క్యారెక్టర్స్ గా మలచడంలో గొప్ప  నేర్పు చూపింది . వ్యక్తికీ సమాజానికీ వ్యక్తికీ వ్యక్తికీ  వ్యక్తి  లోపలి  ద్వంద్వాలకి మధ్య చోటుచేసుకున్న వైరుధ్యాలూ వాదోపవాదనలూ వేదనలూ వాటి మాధ్యమంగా  చిత్రితమైన  బలమైన సంఘర్షణతో   కథకి కావాల్సిన అన్ని హంగులూ సమకూరాయి. వర్తమానం నుంచి గతానికీ గతం నుంచీ వర్తమానానికీ – వంటి రోటీన్ కథన శిల్పం కూడా కల్పనా చేతిలో కొత్త శోభని సంతరించుకుంది.

కథలో వైష్ణవి అనుభవించే యాతన పట్ల పాఠకులకు సానుభూతి లేదా  సహానుభూతి – ఆమె అంతిమంగా తీసుకున్న నిర్ణయం పట్ల యేకీభావం కలుగుతాయో లేదో గానీ కథ చదువుతోన్నంత సేపూ పైన లేవనెత్తిన ప్రశ్నలేవీ నిజానికి అడ్డురావు . రచయిత  వొక వుత్కంఠ భరితమైన కథావరణంలోకి తీసుకుపోయి ‘మంత్రదండం’ వుపయోగించి కదలకుండా కట్టిపడేస్తుంది . బయటికి వచ్చాకా అంతా  వొక వైష్ణవ మాయ అనిపిస్తుంది. అంతిమంగా కథ లెస్బియన్ సంబంధానికి లెజిటమసీ సాధించడానికి తోడ్పడుతుందో లేదో గానీ మౌనాన్ని బద్దలుగొట్టి ఆలోచనల్ని తట్టిలేపడానికి దోహదం చేస్తుందని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. తెలుగు కథలో వస్తు వైవిధ్యం కొరవడుతోందని ఆరోపించి బాధపడేవారికి యీ కథ  ఊరట , సాంత్వన , ధైర్యం , నిశ్చింత  కలగజేస్తుంది.

తాజా కలం   : కప్లెట్ కథ తర్వాత – ఇద్దరు స్త్రీల సహజీవనం చట్టబద్ధం కాకపోవడం వల్ల వాళ్ళిద్దరిలో వొకరు అకస్మాత్తుగా చనిపోతే రెండో వ్యక్తి యెదుర్కొనే  సామాజిక ఆర్ధిక అభద్రతని కేంద్రం చేసుకొని కుప్పిలి పద్మ రచించిన ‘మౌన’ కథ (  – చినుకు జూలై 2015 ప్రత్యేక సంచిక)  – లెస్బియన్ సంబంధం లోని మరో కోణాన్ని స్పృశించి యిదే వస్తువుకి  విస్తృతిని సాధించింది ; కానీ  గే ప్రేమని వస్తువుగా ఎండ్లూరి మానస రాసిన  ‘అదే ప్రేమ’ కథ   (సారంగ 24-9-15) మాత్రం చాపల్యంతో పనిగట్టుకు చేసిన ప్రయోగంలా అనిపించింది .

*

 

 

సంగమాలు సంగరాలౌతోన్న సందర్భంలో…

 

-ఎ.కె. ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

వివాహ వ్యవస్థలోని  ఆధిపత్యాల గురించి  అసమానతల గురించి అణచివేతల గురించి అభద్రత గురించి స్త్రీ పురుష సంబంధాల్లో చోటుచేసుకొనే   వైరుధ్యాల గురించి నైతిక విలువల గురించి చర్చిస్తూ యీ నేలమీద స్త్రీవాదం మాట పుట్టక ముందు నుంచి కూడా సాహిత్యం విస్తృతంగానే వెలువడింది. అయితే స్త్రీవాదం ఆ వ్యవస్థలో వేళ్ళూనుకొన్న పితృస్వామ్య భావజాలం జెండర్ రాజకీయాల లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేసి సైద్ధాంతిక పునాదినుంచీ కొత్త దృక్పథాల్ని – కొత్త డిక్షన్ తో సహా – జోడించింది. పెళ్లి వొక ప్రయోగం అనీ ఆ ప్రయోగంలో యెంత మంది యెన్ని సార్లు విఫలమైనా కొత్తవాళ్ళు మళ్ళీ అదే ప్రయోగం చేస్తున్నారనీ కథలు ( ఓల్గా ) వచ్చాయి. పెళ్ళికి   ప్రత్యామ్నాయంగానో  వికల్పంగానో సహజీవనం (లివింగ్ టూగెదర్) వొంటరి బతుకు (సింగిల్ లైఫ్ స్టైల్ ) అనే ఆలోచనా ఆచరణా యిటీవలి కాలంలో బలపడ్డాయి. సహజీవనంలో సైతం  వినిపించే అపశ్రుతుల్ని కనిపించని కట్టుబాట్లనీ బహిరంగంగా చెప్పుకోలేని భయసందేహాల్నీ  సంక్షోభాలనీ సమన్వయ లోపాల్నీ వొత్తిడికి గురౌతోన్న సందర్భాల్నీ కల్లోలానికి లోనయ్యే సున్నితత్వాల్నీ సంక్లిష్టమోతోన్న మానవసంబంధాల్నీ బలంగా ఆవిష్కరించిన కథ ‘శతపత్ర్రసుందరి’( ఆంధ్ర ప్రదేశ్ – మాస పత్రిక , జూన్ 2015). స్త్రీ పురుష సంబంధాల్లోని ఐక్యత ఘర్షణల్నీ కనిపించే పెత్తనాల్నీ కనిపించని హింసనీ మనుషులమధ్య – మనుషుల్లోపల యేర్పడుతోన్నఖాళీలనీ తనదైన శైలిలో చక్కటి నేర్పుతో సాహిత్యీకరిస్తున్న కె ఎన్ మల్లీశ్వరి దాని రచయిత. వస్తు శిల్ప నిర్వహణల్లో యెంతో సంయమనాన్నీ శ్రద్ధనీ గొప్ప పరిణతినీ చూపడం వల్ల యీ కథ మల్లీశ్వరి రాసిన కథల్లో ప్రత్యేకంగా నిలబడుతుంది. కథలో చెప్పిన అంశాలకంటే చెప్పదల్చి చెప్పకుండా వదిలేసిన అంశాలే పాఠకుల బుర్రకి పని పెడతాయి. చదివిన ప్రతిసారీ పాత్రల ప్రవర్తన విషయికంగా కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. వాటి అంతరంగాల లోపలి పొరలు ఆ పొరల్లోపల సంభవించే ప్రకంపనలు ఆవిష్కారమౌతాయి. సంభాషణల్లోని కాకుస్వరాలు  వాక్యాలమధ్య దాగున్న అంతరార్థాల్ని బోధపరుస్తాయి. ముగింపు ఓపెన్ గా వొదిలేయడం వల్ల అనేకార్థాలకీ విరుద్ధ వూహలకీ ఆస్కారం కల్గిస్తుంది. అది యీ కథకున్న బలమో బలహీనతో విశ్లేషించుకోవాలంటే వాచకం లోతుల్లోకి వెళ్ళాలి.

అలా వెళ్ళే ముందు కథా సారాన్ని నాల్గు ముక్కల్లో చెప్పుకుందాం:

క్రిమినల్ లాయర్ సదాశివ యేదో ఆఫీస్ లో వుద్యోగం చేసే నీలవేణి లివింగ్ టుగెదర్ జంట. కథాకాలానికి వొకరి స్వేచ్ఛని మరొకరూ వొకరి వ్యక్తిత్వాన్ని మరొకరూ గౌరవించుకోడానికి కావాల్సిన స్పేస్ ని కాపాడుకొంటూ పది సంవత్సరాలుగా కలిసి వుంటున్నారు. ఆమె వొక  సామ్రాజ్ఞిలా అతని హృదయాన్ని యేలుతూవుంటుంది.  నీలవేణి ఔత్సాహిక నటి కూడా. ఒకానొక నాటక ప్రదర్శన ద్వారా డైరెక్టర్ గౌతమ్ ఆమెకి దగ్గరవుతాడు. యెంతో సంస్కారవంతుడూ విప్లవ భావాలు కలవాడూ న్యాయంకోసం బాధితుల పక్షంలో సమస్త శక్తులూ వొడ్డి పోరాడే సాహసీ అయిన సదాశివ నీలవేణి అల్లుకొనే కొత్తసంబంధాన్నిఅంగీకరించలేడు. నీలవేణి శాశ్వతంగా తనకే – కేవలం తనకే – వుండాలనుకొంటాడు.

కానీ జీవితంలోకి కొత్తగా వచ్చిన గౌతమ్ ఆలోచలు నీలవేణికి ఎంతో హాయినిస్తాయి. వాళ్ళిద్దర్నీ ‘కలిపి ఉంచే మహోద్వేగపు ప్రవాహమే’ ఆమెని నడిపిస్తోంది. సదాశివ సమక్షంలో కూడా ‘సన్నని నూలుచీరలా వొంటికి చుట్టుకొన్నట్టు మనసుకి హత్తుకుపోయిన గౌతమ్ ఊహని విడదీయడం ఆమెకి సాధ్యం కావడం లేదు’. విడదీయాలని కూడా ఆమెకి లేదు. ఆమెకి అతను జీవితలోకి వచ్చేసిన సెలబ్రేషన్. అలా పండగలా వచ్చినతన్ని సదాశివ కోరినంత మాత్రాన పొమ్మనలేదు. పొమ్మన్నాఅతను పోడు. అదే సదాశివకి ఆమె స్పష్టం చేసింది.

సదాశివ  గింజుకొన్నాడు. అడ్డొచ్చిన వాటిని పగలదన్నాడు.  యేడ్చాడు. మొత్తుకొన్నాడు. వాపోయాడు. బతిమాలాడు. బెదిరించాడు. అంతకు ముందు తమ సహజీవనంలోకి తాత్కాలికంగానైనా యిద్దరు స్త్రీలను సదాశివ తీసుకువచ్చినప్పుడు ఆ చొరబాటులో  తానెంత వొత్తిడికి లోనైందీ దాన్ని అధిగమించి సంబంధాన్ని నిలుపుకోడానికి తానతన్ని వోర్పుతో యెంతగా ప్రేమించిందీ నీలవేణి స్పష్టం చేసింది. సదాశివ తప్పు వొప్పుకొన్నాడు. చేతులు పట్టుకొన్నాడు. కాళ్ళబడ్డాడు. ఆమె గాంభీర్యం ముందు భంగపడ్డాడు . చివరికి చస్తానన్నాడు. అతనిలోని ద్వంద్వ ప్రవృత్తి తెలుస్తోన్నా ఆ క్షణంలో ఆమె  గుండెలో యే సానుభూతి వీచిక కదిలిందో యే ప్రేమోద్వేగ పవనం వీచిందో పదేళ్ళ సాహచర్యంలో అనుభవించిన యెడతెగని యే మోహ తరంగం యెగసిందో రచయిత్రి చెప్పలేదు గానీ ఆమె అతణ్ణి “రా” అని దగ్గరకి తీసుకొంది. అయితే ఆ కలయిక ఆమెకి ఆనందాన్నివ్వదు. ‘ఎప్పట్లా తెల్ల పూలదండ అంచుల సముద్రుడిలా కాకుండా విలయం సృష్టించే సునామీలా’ వస్తాడతను. అతని ఆ రాకలో మనశ్శరీరాలని కుళ్ళగించి ఆమెకి ప్రియమైనవాడి వునికిని నిర్మూలించాలన్నలన్న క్రోధంతో చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. అదొక యుద్ధమే అని నీలవేణి భావించినప్పటికీ  ‘జీవితం నాటకం కాదు గదా తెర పడేలోపు యుద్ధం ముగియడానికి!’ అన్న వేదనకి గురౌతుంది. మరోసారి రసభంగమైంది. ఇదీ కథ.

దాంపత్య సంబంధాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం మాత్రమే కాదు సహజీవనంలో ఆశించే స్వేచ్ఛని   సైతం మగవాళ్ళు స్త్రీలపై ఆధిపత్య సాధనంగా వుపయోగిచుకొనే ప్రమాదం వుందన్న ప్రతిపాదన చుట్టూ అల్లిన కథ యిది.

ఒక దృక్పథాన్నే వస్తువుగా చేసుకొని కథ రాయడానికి రచయిత యెంతో జాగరూకతతో వుండాలి. అందుకు అనుగుణమైన పాత్రల్ని నిర్మించుకోవాలి. ఆ పాత్రల ప్రవృత్తుల్నీ స్వభావాల్నీ  ఆలోచనల్నీ వుద్వేగాల్నీ, అంతరంగ మథనాన్నీ , బాహిర శక్తుల ప్రమేయాన్నీ ,  ఆ పాత్రల మధ్య చోటుచేసుకొనే సంఘర్షణనీ దాన్ని ప్రతిఫలించే  సంభాషణల్నీ కొండొకచో నిర్దిష్టమైన ప్రతీకల్నీ  కథలోకి తీసుకురావడంలో  గొప్ప నేర్పు వుండాలి. ఆ నేర్పు మల్లీశ్వరిలో నిండుగా వుందని  యీ కథ నిర్ద్వంద్వంగా నిరూపిస్తుంది. నేపథ్య నిర్మాణం , పాత్ర చిత్రణ , ప్రతీకలతో కూడిన యెత్తుగడ – ముగింపులూ కథా నిర్మితిలో  కథనం అంతటా పరచుకొని వున్న అద్భుతమైన వొక craftmanship విభ్రమం గొల్పుతుంది. అలా అని  అది కథాంశంపై దృష్టి మరలిపోయే విభ్రమమైతే కాదు.

రచయిత్రి కథకి నేపథ్యంగా తీసుకొన్న జీవితం పై తరగతి వారిది లేదా యెగువ మధ్య తరగతి వారిది అన్న విషయం గమనంలో వుంచుకోవాలి (ఇంట్లో బార్ స్టూల్ , సహవాసులిద్దరూ కలిసి తాగడం వంటి వర్ణనలు చూడండి). నీలవేణి ప్రేమైక రూపాన్నీ స్థిర చిత్తాన్నీ గంభీర్యాన్నీ హుందాతనాన్నీ , సదాశివ ద్వంద్వ వైఖరినీ మనోవైకల్యాన్నీ వ్యక్తిత్త్వ విచ్ఛిత్తినీ భావజాల వైరుద్ధ్యాన్నీ ఆవిష్కరించడానికి ఆమె యెన్నుకొన్న కంఠస్వరం స్త్రీదేనని(మొత్తం కథంతా నీలవేణే చెబుతుంది) గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే కథ పారదర్శకమౌతుంది. పాత్రల ప్రవర్తన ప్రస్ఫుటమౌతుంది.

కథలో సదాశివకి అనేక ముఖాలున్నై. అతనిలో  ‘అనేక సదాశివలు’ నీలవేణి స్పష్టంగా  చూడగలుగుతుంది. అందుకు కారణాలు కూడా గుర్తిస్తుంది. ‘సదాశివ అంటే ఉత్తి చేతులతో సాయం కోరే వారికి మేలు చేసే మంచి లాయర్ అనీ , సంస్కారవంతుడనీ, లోకాన్ని మెరుగ్గా అర్థం చేసుకోగల సమర్థుడనీ’ నీలవేణి ప్రేమించింది. అతనూ అలాగే వుండటానికి ప్రయత్నిస్తాడు. కానీ స్వయంగా అతిచరించాడు. సహజీవన సంబంధంలో లాభించిన వెసులుబాటునీ స్వేచ్ఛనీ హాయిగా అనుభవించాడు.  నీలవేణి జీవితంలోకి గౌతమ్ రావడంతో పొరలన్నీ చిరిగిపోయి లోపలి మనిషి బయటకొచ్చాడు. అందుకే సదాశివని రచయిత్రి క్రిమినల్ లాయర్ చేసింది. ‘స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్’ వంటి వసుచరిత్ర పద్యాల్ని సందర్భోచితంగా గుర్తు తెచ్చుకొని ‘స్వైరిణి’ పదాన్ని దాని అర్థచ్ఛాయలతో సహా యెరిగి ప్రయోగించి  ‘రసభంగం’ చేయగల సాహితీ వేత్తకూడా అతను. ‘అన్ని స్వేచ్ఛలనీ గట్టిగా నమ్మిన’ వాడే ; కానీ  ‘మన ఆచరణ శక్తి ఎంతవరకో అంతవరకూ ఉన్నదే విప్లవమనే’ (యీ వాక్యాన్ని  కథకి టాగ్ లైన్ గా రచయిత భావించి వుండొచ్చు)  మేధావుల కోవకి చెందుతాడు. అందుకే గౌతమ్ విషయం వచ్చేసరికి వోర్చుకోలేక ‘వయొలెంట్’ గా ప్రవర్తిస్తాడు. పిచ్చివాడైపోతాడు. తన వొంటరితనపు వేదనని ఆమె ముందు గుమ్మరిస్తాడు. డ్రింక్ ఆఫర్ చేసి ఆమె వద్దన్నందుకు తనతో కల్సి తాగనన్నందుకు గౌతమ్ పరిచయం వల్ల కల్గిన ‘కొత్త పాతివ్రత్యమా?’ అని పరిహసించి గాయపరుస్తాడు. మరీ బెడిసికొడుతుందనుకొన్నాడో యేమో వెంటనే సారీ చెప్పాడు. అంతేకాదు ; ఆమె తనకే కట్టుబడి ఉండేలా యెత్తుగడలు వేశాడు. వ్యూహాలు పన్నాడు.

సదాశివ రచయిత్రి ‘సృజించిన’ పాత్ర కాదు. గురజాడ గిరీశాన్ని గుర్తించినట్టు మల్లీశ్వరి  మన సమాజంలో మగవాళ్ళలో సదాశివని గుర్తించింది. సదాశివలో దాగివున్న మగవాణ్ణి వెలికితీసింది. సదాశివ పాత్రలోని వైరుధ్యాల్ని బహిర్గతం చేయడం ద్వారా   స్త్రీపురుష సంబంధాల్లోని ఆధిపత్య రాజకీయాల్నివాటి భిన్న పార్శ్వాల్నీ ఆవిష్కరించింది.

చానాళ్లుగా నలుగుతోన్న వొక కేసు విజయాన్ని నెపం చేసుకొని సదాశివ పార్టీ యేర్పాటు చేస్తాడు. ఆ కేసులో తాను యెదుర్కొన్న వొత్తిళ్ళను యేకరువుపెట్టి వాటిని అధిగమించడంలో తనకు తోడుగా వుండి తన విజయం వెనక నిలబడ్డ స్నేహమయి నీలవేణి అని అందరిముందూ నాటకీయంగా ప్రకటించాడు. ఒక దెబ్బకి రెండు కాదు; మూడు పిట్టలు. పదిమందిలో ‘ఇన్స్టిట్యూషనల్ గౌరవాన్నిచ్చి’ నీలవేణితో సామాజికంగా తన సంబంధాన్ని పటిష్ఠపరచుకోవడం , తమ మధ్యకి చొరబడిన గౌతమ్ అడ్డు తొలగించుకోవడం ( ఆ పార్టీకి అతణ్ణి పనిగట్టుకు పిల్చింది కూడా అందుకే ) , అక్కడే వున్న లవ్లీ లాయరమ్మకి రాయల్ గా  గుడ్ బై చెప్పడం. నీలవేణి ‘జీవితంలోకెల్లా అత్యంత అవమానంతో సిగ్గుపడిన క్షణాలవి’.  ఇద్దరు స్త్రీల జీవితాలతో హృదయాలతో ప్రేమతో కుటుంబ అనుబంధాలతో పెనవేసుకొన్న వుద్వేగాలతో ఆటలాడే మగవాడి గడుసు పోకడకి , ‘రోదసి నుంచి భూకక్ష్య లోకి ప్రవేశించే వ్యోమనౌక ఫెయిలయ్యి పేలిపోయిన’ప్పటి భీభత్సాన్ని ఆడవాళ్ళ జీవితంలో నింపుతోన్న పురుషాధిపత్యానికి పరాకాష్టగా  రచయిత్రి ఆ సందర్భాన్ని రూపొందించింది. కథా రచనా శిల్పంలో , పాత్రచిత్రణలో  మల్లీశ్వరి సాధించిన  పరిణతికి గీటురాయిలా కనిపించే ఆ సన్నివేశం రచయిత్రి  ప్రాపంచిక దృక్పథానికి గొప్ప తార్కాణం. నీలవేణి పాత్రలోని గాంభీర్యం పాఠకుడిని కట్టిపడేస్తుంది. సాటి స్త్రీ పట్ల ఆమె చూపిన సహానుభూతి మనుషులమధ్య వెల్లివిరియాల్సిన మానవీయతకు నిండైన నిదర్శనం. స్త్రీ జాతి ఆలోచనల్లో కనిపించే సున్నితత్వానికి ప్రతీక – పతాక.

 

నీలవేణీ సదాశివల ఆలోచనల్లో ఆచరణల్లో తేడా వుంది. ఆ తేడా  స్త్రీ పురుషుల సహజ ప్రవృత్తుల్లోనే వుందేమోనని కథ చదువుతోన్నంతసేపూ అనిపించేలా రాయడంలోనే రచయిత్రి నేర్పు కనిపిస్తుంది (నిజానికి ఆ తేడా సామాజికం కూడానేమో ; అన్నిసమాజాల్లో సదాశివలు అలాగే ప్రవర్తిస్తారా? ) సహజీవనానికి మౌలికంగా నిర్మించుకొన్న విశ్వాసాల పునాదిగా (చేసుకొన్న వొప్పందం ప్రకారం?) ఆమె అతనికున్న అన్ని  హక్కుల్ని గౌరవించింది. ఇష్టాల్ని అంగీకరించింది. అతని స్వేచ్ఛకు యెక్కడా  ఆటంకం కాలేదు. బాదంకాయ కళ్ళపిల్ల అతని ప్రేమని కొరికి రుచి చూసి పోయినప్పుడూ  లవ్లీ లాయరమ్మని అతను స్వయంగా వెంటబెట్టుకొని హృదయంలోకి తీసుకువచ్చినప్పుడూ మొదట కొంత అభద్రతకి గురైంది భయానికి లోనైంది. కానీ తేరుకొంది. అతని మనసులో తాను ధీమాతో విశాలంగా పరచుకొని అధిష్టించిన చాప కుదించుకుపోయిందని యేడుస్తూ కూచోలేదు.   ఈర్ష్య పడలేదు. తగవులాడదల్చుకోలేదు. ద్వేషించి భంగపడలేదు. తట్టాబుట్ట సర్దుకొని పోలేదు. తనకు తానే సర్ది చెప్పుకొంది. అతని ప్రేమని పొందడానికి మరింతగా  ప్రేమించడమే దారనుకొంది.  ప్రేమిస్తూనే అతని మనసులో వొక మూల వొదిగి వుండడానికి సిద్ధపడింది.

అతన్నుంచి ( సదాశివ నుంచి) ఆమె తిరిగి అదే ఆశించింది. తన జీవితంలో గౌతంని కూడా ‘వో పక్కగా వుండనీయి’ (సదాశివని దాటి పోకుండానే) అని అడిగింది. కానీ సదాశివ అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఆమె శారీరికంగా మానసికంగా చివరికి సామాజికంగా కూడా తనకే విధేయంగా వుండాలనుకొన్నాడు. ఆమె జీవితంలో యే రూపంలోనూ తనతోపాటు మరోవ్యక్తిని అంగీకరించలేకపోయాడు. ‘బ్లాక్ హోల్’ లా గౌతమ్ ఆమెను లాగేసుకొంటున్నట్టు భావించాడు.  ‘ఉన్నంతలో ప్రాక్టికల్ గా ఇబ్బందులు లేకుండా కాస్త తెలివిగా’ తనతో బంధాన్నికొనసాగించామన్నాడు.  గౌతంతో ఎమోషనల్ గా బాహాటంగా ఓపెన్ కావద్దన్నాడు. డ్యూయల్ వాల్యూస్ ఉండకూడదని తాను ఆచరించని ఎథిక్స్ ఆమెకి బోధించాడు.  ‘ఆకర్షణ కలిగితే వన్  నైట్ స్టాండ్ తీసుకో … లేదూ కాదూ అంటే కాజువల్ రిలేషన్ షిప్ లో ఉండు…’ అని వొక తుచ్ఛమైన ఆప్షన్ యిచ్చాడు. మనుషులమధ్య వుండాల్సిన ‘అంతిమ విలువ – స్వేచ్ఛ’ విషయికంగా అతని దృష్టికోణం అదీ. సదాశివకి స్వేచ్ఛ ఆశయమే కానీ ఆచరణ కాదు( పైగా అది ముసుగు కూడానేమో! ).  ఆమెకి ‘నిలకడగా స్థిరంగా తదేకంగా  ఉండే బంధం కావాలి’. అది తానివ్వలేక పోయినా గౌతమ్ దగ్గర మాత్రం లభిస్తుందని హామీ వుందా  – అని లాయర్ లాజిక్కుతో యెదురు ప్రశ్నించి హెచ్చరించాడు సదాశివ.

స్త్రీ సొంత వ్యక్తిత్వాన్నీ స్వేచ్ఛనీ అభావం చేయడానికి అణచివేత రాజకీయాల్ని యెన్ని రూపాల్లోనైనా వుపయోగించగల మగవాళ్ళకి నమూనాగా సదాశివ పాత్రని చిత్రించడంలో రచయిత్రి నూటికి నూరు పాళ్ళూ సఫలమైంది. అయితే యెంతో చైతన్యవంతంగా ప్రవర్తించాల్సిన నీలవేణి – వొక్క క్షణమే కావొచ్చు – అతనికి లోబడిపోవడమే ఆశ్చర్యం.

సదాశివ ఆలోచనల్లోని వంచననీ  నైచ్యాన్నీ  అర్థం చేసుకొని కూడా – తన నొప్పినీ  కష్టాన్నీ దాచుకొని తనలో రగిలే అగ్ని పర్వతాల్ని కప్పిపెట్టుకొని అతని కష్టానికి దు:ఖిస్తూ నీలవేణి అతణ్ణి వోదార్చడానికి పూనుకొంది. అంత కరుణ ఔదార్యం ఎందుకని పాఠకుడిలో ప్రశ్న మొలకెత్తుతుంది.

స్త్రీలోని లాలిత్యమూ కారుణ్యమూ  ప్రేమైక జీవన తత్త్వమే  ఆమెకు సంకెళ్ళుగా పరిణమిస్తున్న వైనాన్ని రచయిత్రి నీలవేణి ఆచరణలో చూపించింది. ప్రేమకీ స్వేచ్ఛకీ సహజీవనానికీ స్థిరమైన అనుబంధాలకీ స్త్రీ పురుషులిచ్చే నిర్వచనాలు వేరని నిరూపించింది. అయితే –

అనేక ఆధిపత్యాల అసమ సమాజంలో పెళ్లయినా సహజీవనమైనా స్త్రీ పురుష సంబంధాల్లో మార్పేవీ ఉండదనీ , అభద్ర భావన కారణంగానో సంబంధాల్ని అంత త్వరగా వదులుకోలేని బలహీనత కారణంగానో  స్వేచ్ఛతో సహా సమస్తం  కోల్పోతుంది  స్త్రీలేననీ   రచయిత్రి మరోసారి నొక్కి చెప్పాలనుకొన్నట్లు  అనిపిస్తుంది. అదే ఆమె చెప్పాలనుకొన్న విషయమైతే పెళ్లి అనే వ్యవస్థ ( institution ) ని పగలగొట్టి సహజీవనమనే విప్లవకరమైన ఆచరణలోకి వెళ్ళాలనుకొనేవారిని అది కూడా స్త్రీ పురుష సంబంధాల్లో అంతిమ స్వేచ్ఛకి ఆస్కారమివ్వదని అక్కడకూడా యుద్ధం తప్పదని భయపెట్టి వెనక్కి లాగినట్లవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాన్ని మూసివేసినట్లవుతుంది. లేదా స్వేచ్ఛాసమానత్వాలకోసం జరిపే పోరాటంలో సహజీవనం వొక మెట్టే ; అక్కడ కూడా స్త్రీలకు భద్రత లేదనీ , మగవాళ్ళలో పాతుకుపోయిన పితృస్వామ్య ఆధిపత్య భావజాలంతో నిరంతరం పోరాడక తప్పదనీ  హెచ్చరించడమే రచయిత వుద్దేశ్యమైతే కథా ప్రయోజనం నెరవేరినట్లే.

అయితే ఆ యుద్ధాన్ని నీలవేణి సదాశివతో కలసి వుంటూనే చేస్తుందా – విడిపోయి గౌతమ్ దగ్గర చేస్తుందా – యేక కాలంలో యిద్దరితోనూ సంబంధాన్ని కొనసాగిస్తూ ( మల్టిపుల్ రిలేషన్ షిప్ లో) చేస్తుందా – హద్దుల్లేని అప్రమేయమైన ప్రేమతో  యిద్దర్నీ జయిస్తుందా – వోర్పుతో నెగ్గి మానవసంబంధాన్ని నిలుపుకోగలుగుతుందా  – రేపు గౌతమ్ అయినా మరో మగవాడైనా సదాశివలానే ప్రవర్తించవచ్చు కాబట్టి వొంటరిగా స్వతంత్రంగా జీవిస్తుందా – ఆమె తెరవేయలేని యుద్ధాన్ని కేవలం లైంగిక  స్వేచ్ఛ వరకే పరిమితం చేస్తుందా  – పితృస్వామ్య భావజాలానికి సంబంధించిన అన్ని రకాల అసమానతలకీ  వ్యతిరేకంగా నిలబడుతుందా – లేదా మరింత విస్తృతమై సమాజంలో పాతుకుపోయిన  సమస్త ఆధిపత్యాల్ని రూపుమాపే మార్గంలో నడుస్తుందా – అసలు దాంపత్యాలన్నీ యెడతెగని ద్వంద్వయుద్ధాలేనా – సహజీవనాలు సైతం సంగ్రామాలుగా యెందుకు మారుతున్నాయ్ –  బంధాల్ని తెంచుకోలేనితనం  స్తీలకు మనోధర్మమా, సామాజిక అభద్రతాభావన నుంచి వస్తుందా – ఆధిపత్యం పురుష ప్రవృత్తా , అసమ సమాజంలో అది అనివార్యమైన దృగంశమా – స్త్రీ పురుష సంబంధాల్ని మానవీయంగా వుంచగలిగే స్థిరమైన విలువలేంటి – దేశ కాల సంస్కృతులకి అతీతంగా వుపయోగపడే నమూనాలుంటాయా  …… యివన్నీ పాఠకుల ముందు రచయిత పరచిన మరికొన్ని  ప్రశ్నలు.

ఈ ప్రశ్నలు పుట్టడానికి కారణం రచయిత్రి కథని open ended గా వొదిలి వేయడం వొక కారణమైతే ; రెండో కారణం కథ ప్రారంభంలోనూ ముగింపులోనూ ఆమె వాడిన  ప్రతీకలు.

ప్రతీకల వెనకున్న అర్థాలు సులభగ్రాహ్యాలే కానీ పాఠకుడిలో గందరగోళానికి ఆస్కారమిస్తున్నాయి. కథ నీలవేణి నటించే నాటకంలో అంతిమ దృశ్యం యుద్ధంతో మొదలౌతుంది. ‘యుద్ధం ముగిసింది. ఒకరు విజేత. ఆ విజేతని నేనే గెలిచాన’ని  నాయిక ప్రకటిస్తుంది. గెలుపుకీ వోటమికీ మధ్య గీత చెరిగిపోయింది. యుద్ధంలో వోడి మరణించినవాడొకడు. గెలిచి మరణించినవాడొకడు. అదీ విషాదం. వాళ్ళిద్దరి నుంచీ విముక్తే ఆమె కోరుకొంటే మోదాంతం.

కథ మాత్రం విషాదాంతమే. కాకుంటే అది నీలవేణి జీవితం. నాటకంలోలా జీవితంలో ఆమె యెప్పటికి గెలుస్తుందో తెలీదు. యుద్ధం సదాశివ గౌతమ్ ల మధ్యా ? వాళ్ళిద్దరికీ నీలవేణికీ మధ్యా? గెలుపెవరిది , వోటమెవరిది? విముక్తికోసం నీలవేణి తనతో తానే తనలో తానే అంతర్యుద్ధం చేస్తుందా? మొత్తం పురుషసమాజంతో చేస్తుందా? గెలుపు వోటముల ఆటలో హింసని అనుభవిస్తూ కూడా  ఆమె సదాశివకి యెందుకు లొంగిపోయింది? స్వేచ్ఛ ఆమెకి అవసరం కాకుండా ఆకాంక్ష మాత్రమే అవడం వల్ల అలా జరిగిందా? సదాశివ యేడ్చి వోటమిని వొప్పుకొన్నందుకా? స్వేచ్ఛ అవసరంగా పరిణమించినప్పుడు ఆమె సమస్త శక్తులూ వుడిగిపోతే ఆ రోజున పోరాడే పరిస్థితి వుంటుందా? అప్పుడు సదాశివ ప్రవర్తన వూహకందనిదేం కాదు. తన పురుష నైజాన్నీ సమాజం యిచ్చిన బలాన్నీ బాహాటంగానే ప్రదర్శించక మానడు. నైతికంగా వోడిన సదాశివ శారీరికంగా ఆమెపై ఆధిపత్యాన్ని స్థాపించుకొనే ప్రయత్నం చేస్తూనే వున్నాడు కాబట్టి స్త్రీ పురుషులమధ్య జీవితయుద్ధంలో వైరుధ్యాలు యెప్పుడూ శత్రుపూరితంగానే వుంటాయని నిరంతర చైతన్యంతో మాత్రమే వాటిని పరిహరిచుకోగలం అని ప్రతిపాదించడమే రచయిత్రి అభిప్రాయమా? కాకుంటే యీ యుద్ధ ప్రతీకల ప్రయోజనం యేమిటి? ప్రయోజనం లేని ప్రతీకలెందుకు? ‘పంజరంలో సైతం పక్షులు యెందుకు పాడతాయో’ పాడాలో ఆమెకి తెలుసు. ‘కోపం భయం ద్వేషం పగ అన్నిటినీ విసిరికొట్టి ప్రేమించడమే’ యుద్ధాలకి శాంతిపాఠం. అయినా యుద్ధాలకు ముగింపు లేదు. ఆమె కోరుకొనే శాంతి యెక్కడుందో తెలుసుకొనే వరకూ పరిష్కారం రాదు.

కథలు పరిష్కారం చూపేవిగానే వుండాలని నియమం లేదుగానీ ఆ దిశగా ఆలోచింపచేసేవిగా వుండాలని కోరుకోవడం తప్పుగాదు. కానీ యిన్ని విరుద్ధమైన ఆలోచనలకి తావిచ్చేదిగా వుండడమే ‘శతపత్ర సుందరి’ ప్రత్యేకత.

 

తాజా కలం: హైదరాబాద్ – ఆలంబనలో ‘వేదిక’ సాహిత్య సమావేశం( జూలై 12, 2015 ) లో ‘శతపత్ర సుందరి’ పై చర్చ జరిగినప్పుడు కథా శీర్షిక అంతరార్థం గురించి ప్రస్తావనలొచ్చాయి. సహచరుడితో స్వైరిణి గా పిలిపించుకొన్న నీలవేణి లోపలి పొరల సౌందర్యానికి ఆ శీర్షిక ప్రతీక కావొచ్చని వొక ముక్తాయింపు. ఏదీ అంతిమ తీర్పు కాదు.

 *

 

 

పిలక తిరుగుడు పువ్వు: రాజ్యంపై పతంజలి లోచూపు

– ఎ . కె . ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎన్ కౌంటర్లు వుండవని కొండంత ఆశతో ఆలోచనలు చేసిన ప్రజాసంఘాల్లోని మేధావుల కన్నా తెల్లదొరలు పోయి దేశానికి స్వాతంత్ర్యం వస్తే కానిస్టేబుల్ తమ వూరినుంచీ బదిలీ అవుతాడా అని పిసరంత అనుమానంతో అమాయాకంగా ప్రశ్నించిన కన్యాశుల్కం నాటకంలోని జట్కా అబ్బీయే తెలివిమంతుడని యిటీవల నాకు చాలా బలంగా అనిపిస్తుంది. బూర్జువా ప్రజాస్వామ్యంలో పాలకులు మారినంత మాత్రాన ‘రాజదండం’ మారదు; రాజ్యానికి వుండే సహజ సిద్ధమైన కవచకుండలాలు కత్తి కటారులూ మారవుకదా! కాకుంటే వొకప్పటి లాఠీ సంస్కృతి స్థానే యివ్వాళ గన్ కల్చర్ విశృంఖలంగా స్వైరవిహారం చేస్తోంది. శాంతి భద్రతలు కాపాడాలంటే ఆ మాత్రం ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోక తప్పదు.

నాలుగు స్తంభాల దొంగాటలో ప్రజాస్వామ్యం ముసుగు చీల్చి రాజ్యం క్రూర స్వభావాన్నీ కర్కశ స్వరూపాన్నీ వాస్తవికత పరిధిని దాటి చిత్రించిన సాహిత్యం మనకు చాలా తక్కువ. వాస్తవికత కూడా భౌతిక సంఘర్షణ చిత్రణ వరకే పరిమితమైంది. ఉపరి తలాన్ని దాటి రావిశాస్త్రి లాంటి వాళ్ళు అరుదుగా పునాదుల్ని స్పృశించారుగానీ దాని లోతుల్లోకి వెళ్లి విమర్శనాత్మకంగా విశ్లేషించి మూలాల్ని తాత్వికంగా ఆవిష్కరించిన రచయిత పతంజలి వొక్కడేనేమో! అందుకు అతను యెన్నుకొన్న మాధ్యమం వ్యంగ్యం. ఆ వ్యంగ్యం డొక్కలో చక్కలిగింతలు పెట్టదు; గుండెలో ములుకై గుచ్చుకుంటుంది. వ్యవస్థ మొత్తం సిగ్గుతో తలదించుకొనేలా చేస్తుంది. అప్పటికే అపరాధ భావనతో వున్న వాళ్ళలో అగ్గి రగులుకొల్పుతుంది.

రాజ్యానికి వున్న నానార్థాల్లో పోలీసు వొకటని చానాళ్లు నాకొక అపోహ వుండేది. ‘ఇదేమి రాజ్యం – పోలీసు రాజ్యం’ అని గోడమీది నినాదం చూసాకా కూడా రాజ్యానికి పోలీసు వొక అంగమనే భ్రమలోనే వుండిపోయా. ఆ రెండిటిదీ కుక్క తోకల లాంటి అంగాంగి సంబంధం కాదనీ, అవి రెండూ పర్యాయ పదాలనీ, పోలీసూ రాజ్యం వ్యస్త పదాలు కాదనీ సమస్త పదమనీ, ఆ సమాసం అభేదరూపకమనీ యిరవై ఏళ్ళ క్రితం (ఇండియా టుడే సాహిత్య వార్షిక సంచిక 1995లో) కాకర్లపూడి నరసింహ యోగి పతంజలి రాసిన ‘పిలక తిరుగుడు పువ్వు’ కథ చదివాగ్గానీ అర్థం కాలేదు.
పతంజలి అవసరం లేకుండానే మన సినిమా వాళ్ళకి యీ విషయం యెప్పట్నుంచో బాగా తెల్సు. పోలీసు పాత్రలోని ఠీవీ గాంభీర్యం ఆధిపత్యం అధికార దర్పం శాసించే తత్త్వం వంటి అనేకానేక ‘ఉదాత్త’ లక్షణాలు నచ్చబట్టే నటులంతా జీవితకాలంలో యెప్పుడో వొకప్పుడు పోలీసుగా నటించి జన్మ సఫలం చేసుకొంటారు. వీళ్ళందరికీ మన జాతీయ చిహ్నంలో కనిపించే మూడు సింహాలేవి అన్నవిషయంలో అభిప్రాయ భేదాలుండొచ్చేమో గానీ కనిపించని నాలుగో సింహం మాత్రం పోలీసే. నిజానికి నాలుగు సింహాలూ పోలీసులే. పోలీసు న్యాయమే అంతిమ న్యాయం. కాదని అనుమానం వుంటే నాలాగే పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’ మరోసారి చదవండి.

న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనదనీ న్యాయస్థానాల తీర్పుల్ని చట్టసభల్లో కూర్చొని శాసనాలు చేసేవాళ్ళు సైతం శిరసావహించాలనీ వెర్రి నమ్మకం మనబోటి సామాన్యులకి వుంటుంది. కానీ వాస్తవానికి ప్రజాస్వామ్య సౌధానికి నాలుగు స్తంభాలన్న మాటే అబద్ధమనీ రాజ్యం వొంటి స్తంభపు మేడ అనీ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్య నిర్వాహక వ్యవస్థ మీడియా మొత్తంగా ఆ మేడలో సుఖాసీనుడైన పసిడిగలవాడి కాళ్ళ దగ్గర పడివుండే బానిసవ్యవస్థలనీ, ధనికస్వామికి కాపలా కుక్కలకన్నా లేదా పెరట్లో కట్టేసిన పెంపుడు జంతువులకన్నా హీనమనీ పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’కి ముందు నుంచే చెప్పినప్పటికీ యీ కథలో మాత్రం దాని విశ్వరూప దర్శనం చేయించాడు.

‘పిలక తిరుగుడు పువ్వు’ కథని విశ్లేషించడానికి నా దగ్గర పనిముట్లు లేవు. నిజానికి కథ దానికదే self explanatory – పరిపూర్ణం. వ్యాఖ్యలూ టీకా టిప్పణులూ అవసరం లేదు. కానీ ఆ కథ నాకిచ్చిన యెరుకని పదుగురితో పంచుకోవాలనే చాపల్యంతోనే యీ నాల్గు మాటలూ…

జ్ఞానం రాజద్రోహమనీ కుట్ర కేసుకి కారణం కావొచ్చనే హెచ్చరిక ఆ కథలోనే వున్నప్పటికీ పిలక తిరుగుడు పువ్వు వివిధ సందర్భాల్లో ప్రాసంగికంగా గుర్తొస్తూనే వుంటుంది. కారణం – రచయిత కథనంలో వాడిన అనుపమానమైన వ్యంగ్యం. సీరియస్ కథాంశాన్ని నాన్ సీరియస్ గా చెప్పడం అంత తేలికైన పని కాదు. నిజానికి వొక విధంగా చూస్తే యీ కథలో కథ లేదు. గోపాత్రుడు నవలకి పిలక తిరుగుడు పువ్వు కొనసాగింపు మాత్రమే. ఈ సీక్వెల్ శిల్పం కూడా తెలుగులో అరుదు. ఒక పాత కథనుంచీ దానికి కొనసాగింపుగా మరో కొత్త కథని సృష్టించడం మృత శిశువుకి జన్మనివ్వడం లాంటిదని విలియం గోల్డింగ్ మాట కేవలం ప్రయోగం కోసం రచనలు చేసే రచయితల విషయంలో నిజం కావొచ్చుగానీ కథా కళ మర్మం తెలిసిన పతంజలి విషయంలో మాత్రం కాదు.

భూమి గుండ్రంగా వుందా బల్లపరుపుగా వుందా అన్న వాదనతో మొదలైన ఆలమండ గ్రామస్తుల కథ కులాల విశ్వాసాల బోయినాల సంఘర్షణలో రాటుతేలి యుద్ధాన్ని తలపించే దొమ్మీగా పరిణమించి పోలీసు ప్రవేశంతో మున్సిఫ్ కోర్టుకొస్తుంది. మేజిస్ట్రేట్ గంగాధరం భూమి బల్లపరుపుగా వుందని తీర్పు చెప్తూ దానికి జీవితాన్ని అన్వయించి వుపపత్తి పూర్వకంగా వొక తర్క బద్ధమైన తత్త్వాన్ని ఆవిష్కరించి కేసు తేల్చేసాడు.

‘మన జ్ఞానానికి సార్థకత లేదు. మన విశ్వాసాల మీద మనకు విశ్వాసం లేదు. మన విలువల మీద మనకు గౌరవం లేదు. మన దేవుడి మీద మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మన తోటివాళ్ళ మీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహనగానీ గురిగానీ లేదు. మన జ్ఞానానికీ, విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ ఆచరణకీ పొందిక లేదు. భూమి బల్లపరుపుగా ఉన్నపుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్ళబడుతుంది.’

మేజిస్ట్రేట్ చేసిన వ్యంగ్యంతో కూడిన వ్యధాభరితమైన సత్యావిష్కరణే గోపాత్రుడు నవలకి ముగింపు. అక్కడితో ఆ కథ అయిపోయింది.

patanjali

గంగాధరం తీర్పు సమాజంలో జీవితాలు అస్తవ్యస్తంగా అబద్ధాలమయంగా తయారయ్యాయి – ప్రజలు ‘ఇష్టారాజ్యం’ గా వ్యవరిస్తున్నారన్న అర్థం వచ్చేలా వుంది. మరిక దండధారి అయిన పోలీసు అస్తిత్వానికి అర్థం యేమిటి – పోలీసు రాజ్యం యేమైపోవాలి అన్న సిఐ అంతర్మథనంతో కొత్త కథ మొదలైంది. ‘చూపున్న పాట’లోని పోలీసే గోముఖం తొడుక్కొని యిక్కడ దర్శనమిస్తాడు.
పోలీసువారి ‘నమ్మకానికీ – ఆచరణకీ తేడా లేదే. విశ్వాసానికీ జీవితానికీ వ్యత్యాసం లేదే.’ చెప్పిందే చేస్తున్నారు. దండం దశగుణం భవేత్ అని నమ్మి తంతానొరే అని చెప్పి తంతున్నారు. కేసుకింత అని చెప్పి అబద్ధానికి తావులేకుండా అంతే తీసుకుంటున్నారు. అంతా ఖుల్లం ఖుల్లా. సర్వ సామాన్య వ్యవహారమే. బహిరంగ వ్యాపారమే. నిత్య కృత్యమే. మరిక ‘భూమే కాకుండా జీవితం కూడా బల్లపరుపుగా ఉన్నాదని చెప్పడానికి’ ఆస్కారం లేదే! భూమి గుండ్రంగానో బల్లపరుపుగానో లేదు పోలీసు లాఠీ లాగా లేదంటే టోపీ లాగా వుందని యింకా కాదంటే తుపాకీ తూటాలానో బాయ్ నెట్ లానో వుందని పోలీసు నమ్మకం. ‘నల్ల గౌనేసుకున్నోడి నమ్మకం తీర్పయిపోయి’ మిగిల్నోళ్ళ నమ్మకాలు అందునా పోలీస్ నమ్మకానికి విలువ లేకుండా పోవడంలో, ఆ తీర్పుని పోలీస్ కూడా అంగీకరించవలసి రావడంలో మిక్కిలి ‘డేంజరున్నాది’- అనుకొన్నాడు జామీ స్టేషన్ సిఐ.

తమ యేలుబడిలోని వొక చిన్న రాజ్యంలో ప్రజా జీవితం సవ్యంగా లేనందువల్లే యిటువంటి అపసవ్యమైన పిలక తిరుగుడు తీర్పుని ఎస్. కోట మాజిస్ట్రేట్ యిచ్చాడనీ అందుకు ఆ యిలాకా సిఐ బాధ్యత వహించి జీవితంలోకి తొంగి చూసినందుకు అతనికి బుద్ధి చెప్పాలనీ డి యస్పీ దొరగారు భావించడంతో ధర్మ కర్మాచరణ దీక్షా బద్ధులైన వారి పరోక్ష నేతృత్వంలో కనుసన్నల్లో పోలీస్ యాక్షన్ మొదలైంది. పోలీస్ పవరేంటో పిలక తిరుగుడు మున్సఫ్ మాజిస్ట్రేట్ కి ఘరానా పోలీస్ సిఐ తెలియ జెప్పడమే యీ కథ.

గోపాత్రుడు (1992) నవల చదవకపోయినా ‘పిలక తిరుగుడు పువ్వు’ దానికదే నిండైన కథగా రూపొందడానికి పతంజలి కథని యెత్తుకొన్న విధానమే గొప్పగా దోహదం చేసింది. పాత కథలోని ముగింపు – గంగాధరం తీర్పు. దాన్ని సమీక్షించడం, కొత్త కథకి ప్రస్తావనగా వుపయోగపడగల పోలీసు అధికారాన్ని బేరీజు వేసుకోవడం – యీ రెండు పనుల్నీ కథ యెత్తుగడ నెరవేర్చింది. న్యాయవ్యవస్థ పోలీసుపై ఆధిపత్యం నెరపి శాసించడమనేది గొప్ప ప్రమాదం – ఆ ప్రమాదం కొనసాగనివ్వడానికి వీల్లేదు అన్న సూచనకి ప్రస్తావనలోనే బీజాలు పడ్డాయి. దాన్నెలా సాధిస్తాడన్నదే మిగతా కథ అంతా.

రాజు తల్చుకొంటే దెబ్బలకి కొదవేముంది? పోలీసు తల్చుకొంటే చేయలేనిది ఏముంది? సవాలక్ష అభియోగాలూ బైండోవర్లూ మిస్సింగ్ లూ చిత్రహింసలూ లాకప్ డెత్ లూ ఎన్ కౌంటర్లూ రాజద్రోహం కుట్ర కేసులూ … యేదైనా సాధ్యమే. ఆలమండ దొమ్మీలో మేజిస్ట్రేటు యెవరికీ శిక్ష వెయ్య లేదు. ‘అందర్నీ వొగ్గీసినాడు’. సి ఐ వాళ్ళందరి మీదా వైనవైనాలుగా రికార్డు స్థాయిలో కుట్ర కేసులు బనాయించి కోర్టుకి హాజరు పరుస్తాడు. భూమి బల్లపరుపుగా వుందని తీర్పునిచ్చి – దాన్నిధిక్కరించి నందుకు కొందరికి శిక్ష కూడా విధించిన గంగాధారమే అన్ని కుట్రకేసుల్లోనూ ప్రథమ సాక్షి.

ఇప్పటి దాకా మంచుతెర చాటున దాగిన సూర్యబింబంలా దోబూచులాడిన రచయిత దృక్పథం ఇక్కడ నుంచీ బాహాటమైంది. ఎండ చురుకు చర్మం లోపలి పొరల్ని సైతం తాకుతుంది. పాలకుల చేతిలో ప్రజల్ని అదుపులో వుంచడానికి ప్రజాస్వామ్యంలో యిన్ని ఆయుధాలున్నాయా అని ఆశ్చర్యపోతాం. ఏలినవారు కుట్రకేసులు ఆడా మగా తేడా చూపకుండా మనుషుల మీదే కాదు వీరబొబ్బిలి లాంటి కుక్క మీద కూడా పెట్టినట్టు చెప్పడం హాస్యానికి కాదు; అధిక్షేపానికే అని పాఠకులకి అర్థం కావడానికి ఆట్టే సేపు పట్టదు.

గంగాధరానికే విషయంలోని గాంభీర్యం కాస్త ఆలస్యంగా బోధపడింది. కుట్ర కేసుల అంతరార్థం ఏఏపి చెప్తే గానీ తెలుసుకోలేడు. ‘ఏటిదంతా’ అని యుద్ధం చేయలేని అర్జునుడిలా అడుగుతాడు.
ఏఏపి వువాచ:
“విది పోలీసు మాయ … గవర్నమెంటోడి లీల …”
పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్పాల్సిన సారం అంతా వొక్కముక్కలో తేల్చేశాడు. రచయిత ఏఏపిని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని గాక అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటర్ అనడంలో చమత్కారం, పోలీస్ కీ గవర్నమెంట్ కీ అభేదాన్ని పాటించడంలో చాతుర్యం గమనించాలి.
‘కేసులు దాఖలు చేసినవారు: భారత ప్రభుత్వము తరపున వారి ఘనత వహించిన ప్రతినిధులు … సర్కిల్ ఇన్స్ పెక్టర్ వారు.’ ప్రభుత్వం అమూర్తం. దానికి నిండైన రూపం పోలీసు. ఈ విషయంలో సందేహానికి యిక తావు లేదు.
“ఒక్క కుట్ర కేసైనా నిలబడదు …” కక్షగా అన్నాడు గంగాధరం. మాయా వినోదం లీలా క్రీడల పరమార్థం అర్థం కావాలంటే ప్రభువులు విశ్వరూపం చూపించాల్సిందే! [జాక్ లండన్ ‘ఐరన్ హీల్’ (తెలుగు అను: ఉక్కు పాదం) నవల్లో తన పరిధిని మర్చిపోయి పేదల కష్టాలకి కారణాలు తెలుసుకొనే ప్రయత్నం చేసిన మతాధికారిని చర్చి పిచ్చివాడని ముద్ర వేసి బహిష్కరిస్తుంది. ప్రజాస్వామ్యంలో పౌరులకి మంచి జీవితాన్ని కోరుకొన్న న్యాయాధికారి గంగాధరంది కూడా దాదాపు అదే పరిస్థితి.] కుట్రకేసులు నిలబడతాయని పోలీసులు వాట్ని పెట్టరు. అల్లరిపెట్టడానికి పెడతారు. ఆ మనుషులు పెట్రేగిపోకుండా కొంతకాలమైనా కంట్రోల్ లో ఉండటానికి పెడతారు. పిరికివాళ్ళని జడిపించడానికి పెడతారు – అన్న ఏఏపి సోయి తెలివి కూడా అతనికి లేవు.

రాంనగర్, సికింద్రాబాద్, పార్వతీపురం … యెన్ని చూడలేదు మనం. కతలూ కవితలూ రాసుకొనేవాళ్ళూ పత్రికలూ పుస్తకాలూ అచ్చేసేవాళ్ళూ ‘చట్ట బద్ధముగా ఏర్పడిన భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను కుట్ర పూరితముగా కుత్సిత బుద్ధితో సాయుధముగా కూల్చివేస్తార’నా కేసులు పెట్టేది? దశాబ్దాలపాటు కేసులు నడుస్తాయి. కేసు కొట్టేసే లోపు కొందరు సైద్ధాంతికంగా దూరమౌతారు. కొందరు దాటుకుంటారు. కొందరు దాటిపోతారు. కొందరు జారిపోతారు. కొందరు లొంగిపోతారు. కాదంటే కొంతమందిని లేపేయొచ్చు. కొందరు వాళ్ళే లేచిపోతారు.
పాపం ఎస్ కోట మేజిస్ట్రేట్ లాంటి వారికి జీవితం గందరగోళంగా వుందన్న భోగట్టా తెలుసు, అందుకు కారణాలూ తెలుసు. కానీ దాన్ని చక్కదిద్దే దారులే తెలీవు. తెలిసినా వ్యవస్థ ఫ్రేములో బిగుసుకొని మాత్రమే బతకాల్సిన – బతగ్గల గంగాధరాలు ఏం చేయలేరు. చేయడానికి ప్రయత్నించినట్టు యే మాత్రం వాసన వచ్చినా పిలక కత్తిరించే యంత్రాంగం వుండనే వుంది.
ఆ యంత్రాంగానికొక రీతి వుంటుంది. రివాజు వుంటుంది. సంప్రదాయం వుంటుంది. ఆచారముంటుంది. హైరార్కీ వుంటుంది. క్రమశిక్షణ వుంటుంది. విశ్వాసం వుంటుంది. విధేయత వుంటుంది (పై పెచ్చు దానికి శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ నూకాంబికాదేవి అనుగ్రహం కూడా తోడుంటుంది.) అంతిమంగా దానికొక పిలాసఫీ వుంటుంది. వాటన్నిటినీ ‘ఎక్సీడ్’ చేసి జీవితం గురించి ఆలోచించడం గంగాధరం చేసిన నేరం.
జీతాలు తీసుకొని పోలీసు వారి అభియోగాల్ని అనుసరించి వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాల ప్రకారం కేసులు విచారించి ముందుగానే రచించి యిచ్చిన స్క్రీన్ ప్లే ప్రకారం పరిష్కారాలు చెబుతూ వొక వుద్యోగిగా తన పరిమితులు గుర్తెరిగి న్యాయాధికారిగా పాలకులు నిర్దేశించిన విద్యుక్తధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ సుఖంగా వుండక పరిధులు దాటి ప్రమేయాలు మీరి జీవితంలోకి తొంగి చూసినందుకు వొక వేళ కుట్ర కేసంటూ పెడితే మున్సఫ్ మాజిస్ట్రేట్ గంగాధరం మీద పెట్టాలని సెషన్స్ జడ్జి అభిప్రాయం.

‘ప్రజాజీవితం పోలీసువారి చేతుల్లో సుఖంగా, శాంతంగా, చల్లగా ఉందని, భూమి ఒకవేళ బల్లపరుపుగా ఉన్నా కూడా పోలీసువారు దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పిండిలా నలిపి, గుండ్రంగా చేయగలరనీ …’ సెషన్స్ జడ్జి అనుభవ పూర్వకంగా యేర్పరచుకొన్న నమ్మకం కూడా.

ఆ నమ్మకం చాలా బలమైందనీ తిరుగులేనిదనీ అండర్ కవర్ కాప్ ల్ని సూపర్ కాప్ ల్ని సృష్టిస్తోన్న పూరీ జగన్నాథ్ లు శీనూ వైట్లాలు త్రివిక్రం శ్రీనివాస్ లూ … నిర్ధారిస్తున్నారు. దొరతనం వారు ఆచరించి చూపిస్తున్నారు. పోలీసుల శక్తి సామర్ధ్యాల ముందు న్యాయం, ధర్మం, చట్టం, రాజ్యాంగం పౌర హక్కులూ అన్నీ బలాదూరేనని తొడగొట్టి మరీ హెచ్చరిస్తున్నారు. కథలో ఆ హెచ్చరికని న్యాయాధిపతి నోట పలికించడమే గొప్ప ఐరనీ. మాట వుచ్చరించే వారి స్థాయిని బట్టీ విలువల్ని తొడుక్కొంటుంది.
కేసుల్ని దాఖలు చేయడానికి పోలీసువారు ఉపయోగించిన భాష న్యాయ పరిభాషా పాలక వర్గానికే ప్రత్యేకమైనవి. భాషకి వర్గ స్వభావం వుంటుంది. ఆయా వర్గాలకే పరిమితమైన విలక్షణమైన జార్గాన్ వుంటుంది. అత్యాధునిక యుగంలో సమస్త అవలక్షణాలతో రాచరిక వ్యవస్థ యింకా అమలౌతున్న రీతిని తెలియజెప్పడానికి పతంజలి ఆయా సందర్భాల్లో భాషని కూడా గొప్ప సాధనంగా స్వీకరించాడు.

పోలీసురాజ్యంలో న్యాయవ్యవస్థలోని వైకల్యాన్నీ బలహీనతనీ డొల్లతనాన్నీ బహిరంగ పరచడమే కథలో ప్రధానాంశమైనప్పటికీ మానవ ప్రవృత్తిలోని నైచ్యాన్ని ఆనుషంగికంగా విమర్శించే పని కూడా రచయిత వొక పూనికతో చేయడం గమనించాల్సిన విషయం.

పెట్టుబడుల విష పుత్రికలూ పాలకుల పెంపుడు జంతువులూ అయిన సువార్త దుర్వార్త కల్పన కంగాళీ లాంటి గబ్బు పట్టి పోయిన నేలబారు పత్రికల చౌకబారు జర్నలిస్టుల అనైతిక వర్తన గురించీ, స్ట్రింగర్లకీ కాంట్రిబ్యూటర్లకీ జీతాలైనా సరిగ్గా యివ్వని దగాకోరు పత్రికల యాజమాన్యాల దోపిడీ గురించీ, జలగల్లా డబ్బులు పీల్చి పార్టీలని దమ్ములగొండుల్లా పీక్కుతినే ప్లీడర్ల దందాల గురించీ, కండ బలంతోనో మంద బలంతోనో తమ మనోభావాల్ని మందిమీద రుద్దే అరాచక మూక క్షుద్ర రాజకీయాల గురించి కథలో పతంజలి చేసిన పరిశీలనలు ఆ వ్యవస్థల మీద అసహ్యం కలిగేలా చేస్తాయి. అయితే వస్త్వైక్యత దెబ్బ తినకుండా వాటిని కథలో యిమడ్చడంలో రచయిత ప్రతిభ కనపడుతుంది.

రాజుగారి బుల్లి గడ్డమ్మీదో పొడవాటి ముక్కు మీదో పజ్యాలు చెప్పుకొని అవార్డులూ సత్కారాలూ పొందకుండా గడ్డం కింద బొల్లి గురించో ముక్కుమీది మచ్చ గురించో యిలా కతలు రాసినందుకు పిలక పుచ్చుకొని కోర్టుకీడ్చి కుట్రకేసంటూ పెడితే రచయిత మీద పెట్టాలి. రచయితలు వీలయితే రెండు రెళ్ళు నాలుగు అంటూ యెక్కాల పుస్తకం రాసుకోవచ్చు. మహా అయితే అదొక గుణకారం అని నిర్వచించవచ్చు. కానీ అది కూడిక కూడా అని విప్పి చెప్పడం కన్నా మించిన రాజద్రోహం లేదు. జీవితంలోకి రాజకీయ విశ్వాసాల్లోకీ తొంగిచూసే తనది కాని బాధ్యత నెత్తికేసుకోవడమే రచయిత చేసిన నేరం అని పాఠకుడిగా నా నమ్మకం. రచయిత బోనులోనూ పాఠకుడు తీర్పరి స్థానంలోనూ వున్నప్పుడు పాఠకుడి జ్ఞానానికీ విశ్వాసానికీ యెక్కువ విలువుంటుంది గదా!
కమ్యూనిస్టు ప్రపంచంలో దేశాలకు సరిహద్దులుండవు; యుద్ధాలుండవు అదే కమ్యూనిజం అంతిమ ఫలితం అని చెప్పుకుంటాం. మరి రాజ్యం యేమౌతుంది – ఎటువంటి ఆధిపత్యాలు లేని రాజ్యాధికారం యెలా వుంటుంది – రాజ్యం అభావమయ్యే స్థితి సంభవిస్తుందా – సంభవిస్తే అది యెలా వుంటుంది?? పిలక తిరుగుడు కథ వొకటికి పదిసార్లు చదివినప్పుడల్లా యీ ప్రశ్నలు పదే పదే తొలుస్తుంటాయి. మానవీయ గుణాలు దయ, కరుణ, ప్రేమ, సమత్వ భావన లోపించిన రాజ్యమూ రాజ్యాధికారాలూ అవసరం లేదనీ మన తోటి వాళ్ళమీద మనకు మమకారం లేనప్పుడు భూమి బల్లపరుపుగానే వుంటుందనే గంగాధరం ముఖత: రచయిత బెంగటిల్లాడు. పరస్పర వైరుధ్యాలు లేకుండా మన సిద్ధాంతాలూ ఆచరణా వాదాలూ విలువలూ జ్ఞానం సత్యం సజావుగా సూటిగా యేకాత్మకంగా సాగినప్పుడు భూమి గుండ్రంగానే వుంటుంది. సమస్త ప్రజానీకానికీ సుఖంగా నివాసయోగ్యంగా వుంటుంది. ఆనంద ధామంగా వుంటుంది. జీవితం సవ్యంగా వుంటుంది. వికాసోన్ముఖంగానూ వుంటుంది. కథ ద్వారా పతంజలి పాఠకులతో పంచుకోదలచిన చూపు అదే – ఆశించిన ప్రయోజనం అదే.

*

కవిత్వం : వెంటాడే జ్ఞాపకం

 

         -ఎ . కె . ప్రభాకర్

~

జీవితపు రహదారుల్లో

వేలాడుతున్న నాకు

ఇంత నమ్మకాన్ని పోయండి

దోసిళ్ళతో నన్ను నేను నింపుకొంటాను (శూన్య దేహం )

 జీవితం మన చేతుల్లో వుండదు. వేళ్ళ సందుల్లోంచి యెప్పుడు జారిపోయిందో తెలీదు. స్థలకాలాలు మన అధీనంలో వుండవు. కాళ్ళ కింది నేల  కాపాడుకోవాల్సిన కాలాలు మన ప్రమేయం లేకుండానే మాయమైపోతాయి. మన కలల్నీ కన్నీళ్ళనీ యెవడో శాసిస్తుంటాడు. మనం మనలా కాకుండా యెవరిలానో బతుకుతూ అదే నిజమనే భ్రమలో సైతం వుండిపోతాం. ముఖానికి తొడుక్కొన్న మాస్క్ లే అసలనుకొని మురిసిపోతాం మురిపింప జేస్తాం – నమ్ముతాం నమ్మబలుకుతాం. సమస్త జీవన పార్శ్వాలూ పరాయీకరణకు గురైనపుడు యెక్కడో వొక కవిత్వం తునక వొక వాక్యం వొక భావ శకలం వొక పద చిత్రం గుండెని తాకి నిద్రిస్తోన్న జ్ఞాపకాల తేనె తుట్టెని కదుపుతుంది. వుద్వేగాల్తో మనసు అనేక ప్రకంపనాలకు గురౌతుంది. కాళ్ళు తడబడతాయి. పట్టు దొరకదు.  కోల్పోయింది తెలుస్తుంది. పొందాల్సింది అందదు. ఆసరా కోసం దిక్కులు చూస్తాం. వొక ఆప్త వాక్యం కోసం అలమటిస్తాం.

అప్పుడు – సరిగ్గా అప్పుడే కవిత్వమో కథో భుజం కాస్తుంది. వొక ఆలంబనై నిలుస్తుంది – అండనిస్తుంది – వోదార్పౌతుంది. ‘వెలుపలి అరణ్యాల్నీ లోపలి మృగాల్నీ చీల్చుకుంటూ వెళ్లి అదృశ్యమైన మనిషిని ఆకులమధ్య ప్రత్యక్షం’ గావిస్తుంది.  అలా మిగలాల్సిన మనిషిని మన ముందు ఆవిష్కరింపజేసేదే బండ్ల మాధవరావు ‘అనుపమ’.

‘అనుపమ ఒక జ్ఞాపకాల చెట్టు’. జ్ఞాపకాలు యెప్పుడూ వుద్వేగ భరితంగనే వుంటాయి. సంఘటనలు కావొచ్చు వ్యక్తులు కావొచ్చు స్థలాలు కావొచ్చు వుద్వేగాలతో ముడివడి వున్నప్పుడే బలగా స్థిరంగా వుంటాయి. ప్రేమ వియోగం దు:ఖం క్రోధం భయం యేదో వొక సహజాతం తీవ్ర ప్రకంపనాలకు లోనైనపుడు అందుకు కారణమైన దృశ్యాదృశ్య శక్తులూ వాటి ప్రమేయాలు కూడా మనిషిని వెంటాడుతూనే వుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి వైయక్తికాలుగా గోచరిస్తాయి కానీ నిజానికి అవి సామాజికాలు. బతుకు దారిలో వేలాడే ప్రయాణికులకు దిక్సూచికలు. గత వర్తమానాల మధ్య కట్టిన వారధులు.

ఎవర్ని పలకరించినా

గతం నెమరువేస్తాడు

అప్రస్తుతం కాని

వర్తమానాన్నే

ప్రస్తుతించాలిపుడు…

వర్తమానంలోనే

బతుకును వెదుక్కోవాలిపుడు

కొన్ని సమష్టి నిన్నల పునాదుల మీదే

నేను ఈ రోజు నిలబడ్డాను

…   …   …   …

ఇప్పుడు ఇక్కడ ఇలా బతకడం

అన్నికాలాలకూ విస్తరించడమే

మొలకెత్తితేనే కదా విస్తరించేది… ( ఇప్పుడే , ఇక్కడే )

 

తలపోతల తవ్విపోత వలపోత  దానికదే కవిత్వం కాదు; కవి ప్రాపంచిక దృక్పథం దానిలో ప్రతిఫలించాలి. అది  పాఠకుడికి అందాలి. అలా అందినపుడు మాత్రమే కవిత్వ  ప్రయోజనం నెరవేరుతుంది.

మాగిన జ్ఞాపకాల్ని

ఒకటొకటిగా పేర్చుకొంటుంటే

కడుపులో దేవుతున్న బాధ ( మిత్తవ)

ఆ బాధ వొక్కరిదే కాదు; అందరిదీ. అందరిదీ చేయమే కవి కర్తవ్యం. సాహిత్యంలో ప్రతి అనుభూతి వ్యక్తీకరణకీ రాజకీయ ప్రమేయాల్ని ఆపాదించడం తప్పని కేవల కవిత్వ వాదులు అభిప్రాయపడినప్పటికీ స్వీయానుభవాల పరంపరని సామాజికం చేయడంలోనే – వొంటరి వెతల్ని  సామూహిక సంవేదనలుగా సొంత సంతోషాల్ని మంది ఆనందాలుగా   తర్జుమా చేయడంలోనే – వాటికొక తాత్త్వికతని సాధించడంలోనే కవి ప్రతిభ బయట పడుతుంది. అటువంటి ప్రతిభ మాధవరావులో నిండుగా వుందని అతని తొలి మలి కవిత్వ సంపుటులు (చెమట చిత్తడి నేల – 1998,స్పర్శ – 2005) నిరూపించినప్పటికీ అనుపమకి వచ్చేసరికి అది మరింత పదునెక్కింది. అందుకే వూరి చెరువూ , అందులో దిసెమొలతో యీతలూ , జలగలూ , పుస్తకాల్లో దాచుకొనే నెమలీకలూ వంటి  సాధారణమైన బాల్యస్మృతుల్ని మాయమైపోతున్న మనిషికీ మనిషితనానికీ అన్వయించి అసాధారణత్వాన్ని సాధించగలిగాడు.

167fa204c80c3f82202da95bc1c1f63c

ఊరి చెరువులో

దిగంబరంగా ఈదుతున్నప్పుడు

పట్టుకున్న జలగల్లో ఒకటైనవాడు

పుస్తకాల్లో దాచుకొనే నెమలీక కోసం

నెమళ్ళనే వేటాడిన వాడు

దొరక్కపోడు                (అనుపమ)

జీవిక కోసం ఉపాధిని వెతుక్కొంటూ నగరానికి చేరినా పల్లె యీ కవికి నీడలా వెన్నంటే వుంటుంది. ఊరూ వూళ్ళో నడయాడిన స్థలాలూ వూరి పరిసరాలూ చేనూ తోటా కొండా గుట్టా వ్యక్తులూ వారితో స్నేహ బాంధవ్యాలూ వ్యక్తులతో పంచుకొన్న ఆత్మీయానుబంధాలూ  గుండెనిండా కమ్ముకొని వుంటాయి. దూరమైన మూలాలపట్ల వీడని మమకారం – తన నేలకి దూరమైనందుకు పరివేదన –  నగరంలో కొత్త వాతాతావరణంలో యిమడలేనితనం – యాంత్రికంగా తయారైన జీవనవిధానంపట్ల అసహనం …  యివన్నీ వుక్కిరిబిక్కిరి చేస్తాయి. యిదంతా రూరల్ డయాస్పోరా. వొక వొదలని మానేద. కోల్పోయినదాన్ని పొందాలనే వెతుకులాట. వెనక్కి తిరిగి చూసుకొన్నప్పుడు చేజేతులా పోగొట్టుకొన్నాననే అపరాధభావన కూడా ఏదో మూల వెంటాడుతూనే వుంటుంది.

నిజానికి అక్కడ వూరు కూడా వూరిలా లేదు. సామాజికంగానే కాదు భౌగోళికంగా కూడా యెన్నో మార్పులు చోటుచేసుకొన్నాయి. అతని జ్ఞాపకాల్లోని వూరికీ కొత్త చలనాలకి వేదికైన వూరికీ పొంతనలేదు. స్వరూప స్వభావాలన్నీ మారిపోయాయి. వూళ్ళో మానవ సంబంధాల్లో కొత్త సంక్లిష్టతలు చోటుచేసుకోన్నాయి. మనుషులమధ్య కనపడని కొత్త కంచెలు లేచాయి.  పంట పొలాలు రియల్ ఎస్టేటు వ్యాపార దురాక్రమణకి గురౌతాయి. మింగుడుపడని యీ మార్పులు పరాయీకరణ కుట్రలు తెలీని ఆవేదనకి కారణమౌతాయి. నిరసన గళం విచ్చుకొంటుంది.

అనాది ఆక్రమణల్లోనే

నా దేహాన్ని కోల్పోతున్నాను…

నా శరీరం లోంచి

నన్ను తరిమేసి వేలం వేస్తున్నాడు

అన్నం ముద్ద లాగేసుకొని

అక్కడే ఇనుప తోటలు పెంచుతున్నాడు…

నగరం నడిబొడ్డు

నా ఊరి పోలిమేరల దాకా నడిచి వచ్చింది ( దురాక్రమణ )

 

బండ్ల 2006లో రాసిన యీ కవితకి యిప్పుడు ప్రాసంగికత మరింతగా పెరిగింది. ఇందులో పేర్కొన్న ‘నగరం’ ముందు ‘రాజధాని’ విశేషణం తగిలించుకోవాలి. దురాక్రమణ అర్థం మార్చుకొని సమీకరణ కాదంటే  సేకరణ అవుతుంది. చట్టబద్ధమౌతుంది. ఇప్పుడు వూరే మాయమైపోతోంది.  ‘దస్త్రాలు చుట్టేసుకొన్న రాజధాని /నా గుమ్మంలో అడుగుపెట్టింది’ . 2015 నాటికి చివరి పంక్తులు మారిపోయాయి. ప్రైవేటు వ్యక్తుల చేతికి స్వాదుఫలాల్ని పాలకులే కోసి యిస్తారు. దాని పేరు అభివృద్ధి.

విచ్చలవిడి నగరీకరణని మాధవ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నాడు. నగరం మనుషుల మధ్య అభేద్యమైన గోడలు కడుతుంది. స్వార్థం కాంక్రీట్ బలంగా స్తంభాలై లేస్తుంది. మానవారణ్యంలో పులులు పంజాలు విసురుతూ తిరుగాడుతుంటాయి.  సమూహంలో కూడా కవి వొంటరౌతాడు.

కొత్తగా మొలుస్తున్న నగరంలో

హఠాత్తుగా అంతెత్తున లేచిన

ఆకాశ హర్మ్యాలలోంచి

జన సంచారం లేని

ఇళ్ళ గుట్టల మధ్య

నేనొక్కడిని నిలిచి

విచ్చుకుంటున్న చేతుల కోసం

అన్వేషిస్తున్నాను… ( వలస పక్షుల గూళ్ళు )

అంటూ మానవీయ స్పర్శకోసం అలమటిస్తాడు. వొక స్నేహ హస్తం కోసం దిక్కులు చూస్తాడు.  లోపలి గదుల్లో మూసి వుంచిన అరల్లోని రహస్యాలు విప్పి చెప్పి కలబోసుకొనే పరిమళం కోసం వెతుకుతాడు. మాటల నిచ్చెనలతో మాటల వంతెనలతో  మాటల ప్రవాహాలతో మనుషులు కలవడాన్ని గురించి కలగంటాడు. కానీ నగరం అన్నిటినీ ధ్వంసం చేసుకొంటూ పెరుగుతుంది. అక్కడ  పచ్చి కట్టే పామై కరవడం చూసి విస్తుపోతాడు. ఇటుకమీద ఇటుక పేర్చినవాడే స్వార్థ ఆయుధాలతో నిలువునా కూల్చేయడంతో విభ్రాంతుడౌతాడు. నిర్మాణానికి రాళ్ళందించిన చేతులే పునాదుల్తో సహా పెళ్లగించివేయడాన్ని జీర్ణం చేసుకోలేడు. సుందర నిర్మాణ ఆకృతులు శిధిలాలై కూలిపోతే దిక్కు తోచక కుంగిపోతాడు.

మూడు కాలాల్లోనూ రక్షించాల్సిన ఇళ్లు

రూపాయల మారకాలయ్యాయి ( నగరం )

అని వాపోతాడు. అయితే అతను కేవలం తన దు:ఖాన్నే మనకు పంచడం లేదు. నిస్సహాయంగా నిరాశలో కూరుకుపోవడం లేదు. మనిషి కూలిన శిధిలాల్లోంచి లేచి నిలబడి శిఖరాల వైపు చేసే ప్రయాణాల గురించిన ఆశని ప్రోదిచేసుకొంటున్నాడు. రహదారుల్లో సేద తీర్చే చెలమలున్నాయని భరోసానిస్తున్నాడు. శోకాన్ని క్రోధంగా మల్చుకొని జరుగుతున్న విధ్వంసానికి జవాబివ్వడానికి బిగించిన పిడికిలౌతున్నాడు. నేలని ఉత్పత్తికి దూరంచేసి విపణి వస్తువుగా మార్చిన వాళ్లకి వ్యతిరేకంగా గొంతు విప్పిన ప్రజా శ్రేణులకి దన్నుగా తన కవిత్వాన్ని నిలబెడుతున్నాడు. దానికొక సామూహిక స్వరాన్నిస్తున్నాడు. పరాధీనపు సంకెళ్ళని తెంచే పనిముట్టుగా కవిత్వానికి సానబెడుతున్నాడు.

 

ఇప్పుడు

మట్టిలో గింజలకు బదులు

రాళ్ళు నాటుతున్నారు

పాతిన రాళ్ళ మధ్య నేల

తల్లి బందీ అవుతుంది

పరధీనమైన దానిని

స్వాధీనం చేసుకోడానికే

పిడికిళ్ళు బిగుస్తున్నాయి

చేతులు కలుస్తున్నాయి

గొంతులు కలిసి లేస్తున్నాయి. ( వామన పాదం )

ఇల్లూ వాకిలీ ముంగిలీ లోగిలీ వూరూ వూరి పొలిమేరా నగరం దాని ఔటర్ రింగురోడ్డూ దేశం దేశ సరిహద్దూ సర్వం అన్యాక్రాంతమయ్యే ప్రక్రియకు వొక ప్రణాళిక వుందనీ స్థానిక వ్యాపార ఆధిపత్య రాజకీయాలకీ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శక్తులకీ విడదీయరాని సంబంధం వుందనీ బండ్లకి స్పష్టంగా తెలుసు. ఆ యెరుకలో నుంచే

ఎవడో

మట్టిని పణంగా పెట్టి

రాజ్యాల్ని కొంటున్నాడు

విశాల సామ్రాజ్యాల మీద కాలుమోపుతున్నాడు

ఆకలిని అవమానిస్తున్నాడు ( దు:ఖ ధూళి )

వంటి కవిత వెలువడింది. మాధవరావులో వున్న యీ రాజకీయ పార్శ్వాన్ని చూడగల్గినప్పుడే అనుపమలోని కవిత్వం యెంత స్థానీయమో అంత సార్వత్రికమనీ యెంత వ్యక్తిగతమో అంత సార్వజనీనమనీ అర్థం చేసుకోగలం. అస్తిత్వవాద సాహిత్యం వైయక్తిక తీరాల అంచుల్లోకి పయనించి అక్కడే విలవిల్లాడుతోన్న సందర్భంలో వ్యక్తి భూమిక మీద నిలబడి సమాజాన్ని ఆవాహన చేసుకోగలిగిన అవగాహన లేకుంటే అనుపమ కేవలం జ్ఞాపకాల చెట్టుగా మిగిలిపోతుంది. చెట్టు ఆకుల్నీ కొమ్మల్నీ మాత్రమే కాకుండా భూమి పొరల్లోకి చొచ్చుకుపోయిన వేళ్ళని కూడా చూడగల్గినపుడే సారాన్ని గ్రహించగలం.

‘చేలను పంటలతోనూ

నేలను మనుషులతోనూ

నింపాలనుకొన్న నాకు

ఇప్పుడు వస్తువులెదురౌతున్నాయి

నా దేహాన్ని ఖాళీ చేసుకొని నన్ను

తిరిగి తిరిగి

వస్తువులతో నింపుకొంటున్నాను’ (శూన్య దేహం)

అన్నప్పటి పరాయీకరణ  ఖాళీతనపు సిండ్రోంతో  సహానుభూతిని పొందగలం. వ్యక్తులు అంగడి సరుకులౌతోన్న విషాద సందర్భాన్ని చీదరించుకోగలం. ‘నింపడం ఎప్పుడూ మరొక ఖాళీకి చిహ్నమే’ అన్న తాత్వికధారలో తడవగలం. అప్పుడు మాత్రమే వొక నేను అనేక నేనుల సమాహారం అవుతుంది. వైయక్తిక సామాజిక స్తరాల  మధ్య యేక కాలంలో ముందుకీ వెనక్కీ షటిల్ చేసే పుష్ అండ్ పుల్ టెక్నిక్ ద్వారా మాధవరావు తన కవిత్వంలో విమర్శనాత్మక సామాజిక వాస్తవికతని సాధించగలిగాడు. ‘అనంతారం’ దానికి పాదయిన అంశాన్ని దేవీప్రియ నిర్దిష్టంగా యెత్తిచూపినప్పటికీ అనంతారం ప్రపంచ పటంలో చిన్న చుక్కే అయినప్పటికీ అది విస్తృతార్థంలో అభివృద్ధి పరుగులో ముక్కలైన మూడో ప్రపంచమౌతుంది.

ముక్కలై రోడ్లు రోడ్లుగా విస్తరిస్తున్న  ‘ముచ్చబోడు’ కొండ మీది ‘జీవన ఉనికి కంకర యంత్రాల శబ్దాల మధ్య రాతి దుమ్ములో కలిసిపోయింది’ అని ఆర్తితో అన్నప్పుడు కేవల పర్యావరణ విధ్వంసాన్ని మాత్రమే మాధవరావు దృశ్యమానం చేయడం లేదు. అభివృద్ధి పేర్న జరిగే  విధ్వంసంలోని అమానవీయ కోణాన్ని సైతం ఆవిష్కరిస్తున్నాడు. ఇది యిలా జరక్కూడదని యెలుగెత్తి అరుస్తున్నాడు. ప్రకృతిలో అనివార్యంగా భాగమైన మనిషినీ మనిషితనాన్నీ కాపాడుకుందాం అని భుజమ్మీద చెయ్యేసి నచ్చచెబుతున్నాడు. మనిషిని యాంకరింగ్ పాయింట్ గా స్వీకరించిన అతని ప్రాపంచిక దృక్పథం  మో , నాగిరెడ్డి , చిన్నమ్మల మీద రాసిన ఎలిజీల్లో ఆర్ద్రంగా యెదను తాకుతుంది. ఆకురాలిన అడవి , ఆత్మహత్యల ఋతువు , కొరివికారం , దు:ఖధూళి , అంతరించిపోతున్న జాతి , బులెట్ , లేపనం  వంటి కవితల్లో అది  దూరాల్ని అధిగమించడానికి విశాలమైన రెక్కలు విప్పి  ఆకాశంలో యెగిరే పక్షవుతుంది. ఆ పక్షి ఫీనిక్స్. చావుల్నీ శిశిరాల్నీ దు:ఖాల్నీ కన్నీళ్ళనీ సమస్త పరాజయాల్నీ జయించే శక్తినిస్తుంది.

మొత్తంగా అనుపమలో ఉద్వేగ భరితమైన స్వీయ జ్ఞాపకాల్ని నెపం చేసుకొని బండ్ల మాధవ రావు దేన్ని గురించి మాట్టాడుతున్నాడో తెలుస్తుంది కదా! మనిషి గురించి మాట్టాడుతున్నాడు. మనిషి లోపలా బయటా జరుగుతున్న విధ్వంసం గురించి మాట్టాడుతున్నాడు. అందుకు కారణమౌతోన్న రాజకీయ శక్తుల గురించి హెచ్చరిస్తోన్నాడు. బహిరంగంగా విచారణ చేసి ఆ శక్తులకి బుద్ధి చెప్పమంటున్నాడు. అందుకు అవసరమైన ఆయుధాలు సమకూర్చుకోమంటున్నాడు. దిగుళ్ళకి వీడ్కోలు పల్కమంటున్నాడు.

బతకడాన్ని గూర్చి ప్రశ్నించినప్పుడల్లా

నాలుగు అన్నం ముద్దల్ని వాడు

అద్దంలో మన ముందుంచుతాడు

ఆయుధాలు మత్తుగా పడివున్నంతకాలం

కుప్పపోసిన జీవితం

కదలదు

మెదలదు.(అకాలం)

అని మేల్కొల్పు గీతం పాడుతున్నాడు. ప్రశాంతంగా కనిపించే యీ కవిలో యింత అగ్గి రాజుకొంటుందా అని మనం ఆశ్చర్యపోతాం. కేవలం జ్ఞాపకాల్లా కనిపించే కవితల వెనక యింత దు:ఖం వుందా యింత క్రోధం వుందా అని ఆలోచనలో పడతాం. మనం కూడా క్రియాశీలులం కావడానికి సమాయత్తమౌతాం. కవీ కవిత్వం కోరుకొనేది అదే కదా!

‘అక్షరమే దిక్కులు పిక్కటిల్లేలా పేలే ఆయుధం

పదం సమూహాన్ని చైతన్యపరిచే పాశుపతం

కవిత్వం అనన్య సాహసోపేత విన్యాసం

ఎప్పటికైనా సమస్త ఆయుధాల్నీ జయించే అంతిమ ఆయుధం

అక్షరమే’

ఆ అక్షరం పేరు అనుపమ. చదివాకా మనమే అక్షరం కాక తప్పదు.

*

 

 

నిర్దిష్టత నుంచి నిర్దిష్టత లోకి . . .హరికిషన్ ప్రయాణం!

10491252_637115716394991_6117679910662129997_n
( ఆదివారం నాడు కర్నూల్లో  డా.హరికిషన్ కొత్త కథల సంపుటి ‘ కందనవోలు కథలు’ ఆవిష్కరణ)

సీమ సాహిత్యమే సీమ జీవితం – సీమ వెతలే సీమ కతలు : ఇదొక నానుడిగా చెలామణి అవుతున్న రోజుల్లో కర్నూలు కథని ప్రత్యేకంగా యెత్తి చూపిన రచయిత డా. హరికిషన్. నిర్దిష్టంగా కర్నూలు జీవితాన్నీ కథల్నీ అర్థం చేసుకోడానికి 2005 లో హరికిషన్ సంకలనం చేసిన ‘కర్నూలు కథ’ యెంతగానో తోడ్పడింది. ఆ సంకలనం ద్వారానే గొప్ప తవ్వకం పనిమంతుడుగా హరికిషన్ తో నాకు తొలి పరిచయం. రాయలసీమలో మరీ ముఖ్యంగా కర్నూలు ప్రాంతలో కొత్తగా ‘పరుగులు తీస్తున్న పెట్టుబడుల పదఘట్టనల కిందపడి నలుగుతున్న సామాన్యుడి జీవితాన్ని’ గురించి ఆ సంకలనం ముందుమాటలో ప్రస్తావించిన అంశాలు  నన్నెంతగానో ఆలోచింపజేయడమే గాక  హరికిషన్ సాహిత్య వ్యక్తిత్వాన్నీ ప్రాపంచిక దృక్పథాన్నీ యెరుకపరిచాయి.

నిజానికి హరికిషన్  కథారచనాప్రస్థానం తొలి అడుగుద్వారానే (పడగ నీడ – 1997) అతను పయనించబోయే తోవా నడక తీరూ అవగతమయ్యాయి. సీమ నేలని పట్టి పీడించే ఫ్యాక్షనిజం బహుముఖ పార్శ్వాల్ని అతను ఆ కథలో ఆవిష్కరించగలిగాడు. పార్టీ రాజకీయాలూ  కులాధిపత్యపోరాటాలూ  సారా వ్యాపారాలూ రియల్ ఎస్టేట్ దందాలూ చోటా బడా కాంట్రాక్టులూ భూగర్భ వనరుల దోపిడీ అటవీ సంపద అక్రమ తరలింపు . . . ఇవన్నీ ఫ్యాక్షనిజం పెంచుకొన్న కోరలేనని తెలియజేసాడు. అంతేకాదు వీటికి ప్రత్యామ్నాయంగా  మొగ్గతొడుగుతోన్న భూపోరాటాల్ని ప్రస్తావించాడు. పల్లెల్లో  విస్తరిస్తోన్న బి.సి.ల , దళితుల చైతన్యాన్ని ( ఎబిసిడి ల వర్గీకరణతో సహా ) గుర్తిస్తూనే పాలక వర్గాలు దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం  వాడుకొంటున్న వైనాన్ని సైతం వ్యాఖ్యానించాడు. వీటన్నిటినీ – నీళ్ళు లేక  పంటల్లేక పనుల్లేక రోడ్లులేక … ఎడారులై పోతున్న బీళ్ళతో… బీళ్ళవుతున్న పచ్చిక బయళ్ళతో … హత్యలు ఆత్మహత్యలు వలసలతో కునారిల్లుతున్న రాయలసీమ నిర్దిష్టత లోంచే అతను విశ్లేషించాడు. స్వీయ జీవితానుభవానికే అక్షర రూపంలా కనిపించినప్పటికీ  తన నేల మీద బలంగా కాళ్ళూని హరికిషన్ నిలబడ్డాడని  ‘పడగ నీడ’ నిరూపించింది. ఈ నిర్దిష్టత రాను రానూ అతనిలో మరింత పదునుదేరిందని యీ కొత్త కథల సంపుటి ‘కందనవోలు కథలు’ స్పష్టం చేస్తుంది. హరికిషన్ యిటీవల (2012–13ల్లో) రాసిన  ‘జై తెలంగాణ’ , ‘కొత్త కల’ కథలు అందుకు నిలువెత్తు సాక్ష్యాలు.

సీమ సాహిత్యకారుల్లో యింతకుముందు కన్పించిన ప్రాంతీయ స్పృహ తెలంగాణ రాష్ట్రోద్యమం నేపథ్యంలో రాజకీయ ఆర్ధిక రంగాల్లో ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంగా పరిణమించాల్సిన అవసరాన్ని యీ కథలు నిర్దేశిస్తున్నాయి. ఈ చైతన్యం సీమలోని తక్కిన జిల్లాల్లో కంటే ముందుగా కర్నూలు ప్రాంతంలోనే మొదలు కావడం యాదృచ్ఛికం కాదు; అదొక సామాజిక యథార్థత. ఆ యథార్థాన్ని ‘కర్నూలు సాహితీ మిత్రులు’ లో వొకడిగా డా. హరికిషన్ గుండె గొంతుకలోకి తెచ్చుకొని బలంగా వినిపిస్తున్నాడు. కృష్ణా నికర జలాల పంపిణీలో న్యాయబద్ధమైన వాటా గురించి డిమాండ్ చేయడం దగ్గరో హైదరాబాద్ ని స్విస్ బ్యాంక్ గా మార్చుకొన్న సీమ ఫ్యాక్షనిష్టుల వరకో  యీ రచయిత ఆగిపోవడం లేదు. ‘శ్రీబాగ్ ఒడంబడికను చిత్తుకాగితంగా మార్చిన పెద్దమనుషులతో కలసి నడవడం’ గురించి , ‘నాలుగు కాసుల కోసం భాషను సంస్కృతిని రాక్షసంగా మార్చి వెక్కిరించిన వారితో – పదవులు విసిరి ప్రాజెక్టులు కొల్లగొట్టిన పెద్దన్నలతో సహజీవనం చేయడం’ గురించి ‘మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టడం మాని గంజి మెతుకుల కోసం గలం విప్పి ప్రశ్నిద్దాం’ (ఒక ఆలింగనం కోసం) అని హెచ్చరిస్తున్నాడు. కోస్తా వలస ఆధిపత్యాలకి తలుపులు తెరచి వాళ్ళు విసిరిన అదనపు పెట్టుబడులకు  అమ్ముడుపోయిన అన్ని రాజకీయ నాయకత్వాల ద్రోహాల్నీ  (అప్పటి నీలం సంజీవరెడ్డి దగ్గర్నుంచి నిన్నటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ – మధ్యలో సందుకో వైన్ షాపు తెరిపించి , ఇటీవలే బెల్ట్ షాపుల రద్దుకి ‘మూడో సంతకం’ చేసిన చంద్రబాబు నాయుణ్ణి కలుపుకొని ) హరికిషన్   ప్రశ్నిస్తున్నాడు. అయితే అతనీ ప్రశ్నల్ని కేవలం రాయలసీమ చైతన్యం నుంచే అడగడం లేదు; మరింత నిర్దిష్టంగా కర్నూలు గడ్డని కేంద్రంగా చేసుకొని బైరాపురం కాలువ కింద నీరందక యెండిపోయి నెర్రెలిచ్చిన పొలాల జాడల్లోంచీ , కొండారెడ్డి బురుజు సాక్షిగా నడచిన బూటకపు ‘సమైక్య ఉద్యమాల’ నీడల్లోంచీ సంధిస్తున్నాడు. ద్రోహాల చరిత్రని తవ్వితీసి – మరోసారి మోసపోవద్దనీ   తెలంగాణ వుద్యమం నుంచీ స్ఫూర్తి పొందమనీ  యెండు డొక్కల సీమప్రజలకు వుద్బోధిస్తున్నాడు. ఛిద్రమైన రాయలసీమ ముఖచిత్రాన్నీ శిధిలమైన బతుకుల్నీ సామాజిక ఆర్ధిక రాజకీయ కోణాలనుంచి అధ్యయనం చేయడంవల్ల మాత్రమే అతనీ కథలు రాయగలిగాడని నేను నమ్ముతున్నాను. నా నమ్మకానికి బలమైన ఆధారాలు యీ సంపుటిలోనే ‘బతుకు యుద్ధం’ కథలో కనిపిస్తాయి.

‘బతుకు యుద్ధం’ రాసింది కూడా 2013 లోనే. సీమ కరువు వెతలు కథలుగావడం కొత్త కాదు గానీ  దాన్ని సమస్త విలువల్నీ నాశనం చేసే  కఠోర వాస్తవికతగా అభివర్ణిస్తూ యింతకుముందు పి.రామకృష్ణారెడ్డి ‘కరువు పీల్చిన మనుషుల్ని’  హృదయవిదారకంగా సాక్షాత్కరింప జేశారు. కరువులో  బతుకులు బుగ్గైన వ్యక్తుల నైతిక పతనాన్నే మరో రూపంలో చూపిన కథ ‘బతుకు యుద్ధం’. వరస కరువుల్తో ‘అప్పు కట్టలేక , అవమానం తట్టుకోలేక ఆఖరికి పొలంలోనే చింతచెట్టుకి వురేసుకొన్న’ బోయగేరి శంకరప్ప, ‘యవసాయం చేసేదానికన్నా కూలిపనికి పోవడమే మేలు’ అనుకొనే రైతు సుంకన్న , ఆ పనికూడా లేక ‘సూస్తూ సూస్తూ పస్తులతో సావలేక – నాలుగు వేళ్ళు నోట్లోకి పోవాలంటే ఏదో ఒగటి సెయ్యాల ‘ గాబట్టి ఫ్యాక్షనిష్టు రాజారెడ్డి కింద పనిచేస్తూ వ్యసనాల పాలైన సుంకన్న పెద్దకొడుకు వీరేష్ , వూరి బైట కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీ కింద భూమిని కోల్పోయి వచ్చిన దుడ్లు కరిగిపోయి ‘పుట్టినూళ్ళో గంజినీళ్ళు గూడా పుట్టక’ వూరుగాని వూరుపోయి దారిదొంగగా మారిన బలిజగేరి గోవిందయ్య …  యీ కథలో వీళ్ళంతా బతకడమే యుద్ధమైన చోట మంచీ చెడుల గురించి  నీతీ న్యాయాల గురించి ధర్మాధర్మాల గురించి లేవనెత్తే ప్రశ్నలకు జవాబులిమ్మంటారు.

పల్లెలన్నీ ప్లాట్లుగా , సెజ్జులుగా మారిపోయాక గ్రామాల్లోని సాలు సక్కగ వచ్చేటట్లు గొర్రు పట్టి విత్తనమేసే మొనగాళ్ళు , వంచిన నడుం ఎత్తకుండా చక చక నాట్లు వేసే పనిగత్తెలు , కొడవలి పడితే చాలు ఒక్కరోజే ఎకరాలకు ఎకరాలు పంటకోసే పాలెగాళ్ళు , గడ్డివాముల్ని ఎంతటి గాలివానకైనా చెక్కు చెదరకుండా నిర్మించే నేర్పరిగాళ్ళు’    మాయమైపోతున్నారనికూడా యీ కథలోనే రచయిత వాపోతాడు. అయితే యీ పరిస్థితి కేవలం రాయలసీమకే పరిమితం కాదు; కానీ వర్ణించిన భౌతిక/భౌగోళిక వాస్తవికత మాత్రం ఆ ప్రాంతానిదే.  ఆళ్లగడ్డ దున్నపాడు గూళ్యం బైరాపురం ఆలంపూర్  తర్తూరు గాజులదిన్నె కొండారెడ్డి బురుజు  కాల్వబుగ్గ యస్ టి బి సి కాలేజి కండేరి బండిమిట్ట   సి క్యాంప్  … యీ ప్రాంతాలన్నీ కథల్లో అత్యంత సహజంగా వొదిగిపోయి ఆ వాస్తవికత సాధిస్తాయి. రాయలసీమ అనగానే గుర్తొచ్చే అనావృష్టి పరిస్థితులకు భిన్నంగా తుంగభద్ర వరదల్లో కర్నూలు ప్రాంతం ముంపుకి గురికావడానికి కారణమైన పాలకుల నిర్లక్ష్య వైఖరిని పచ్చి కరువు (2004) వరద (2009) కథల్లో నిశితంగా విమర్శించినప్పుడు గానీ , పల్లెల్లో కులం బలంతో ఫ్యూడల్ న్యాయాన్నే అమలుపరుస్తోన్న రెడ్డి దొరతనానికి యెదురొడ్డి నిలవాలని మానసిక ప్రతిన తీసుకొన్న బోయ వెంకటేశ్వర్లు ( చిచ్చు – 2006 ) తెంపరితనాన్నివర్ణించినప్పుడు గానీ , ప్రాణాలకు తెగించి బ్రిటిష్ రాజ్ నెదిరించి కొండారెడ్డి బురుజు మీద మువ్వన్నెల జెండా యెగరేసి జైలు పాలైన విశ్వనాథం వంటి వారి త్యాగభరితమైన పోరాట చైతన్యాన్నీ , వారు సాధించిన స్వాతంత్ర్యం దాని ఫలాలు అవినీతిపరులు హంతకులూ అయిన ఫ్యాక్షనిస్టు రాజకీయ నాయకుల చేతిలో అపహాస్యం అవుతున్న ప్రస్తుత సందర్భాన్నీ బేరీజు వేసినప్పుడు గానీ ( గాయపడ్డ నమ్మకం – 2014 ) , ప్రజల్లో పాతుకు పోయిన మూధవిశ్వాసాల్ని అడ్డం పెట్టుకొని భూదురాక్రమణకు పాల్పడే పెదరెడ్డి కుతంత్రాలకు గురైన ఉలిగమ్మ దైన్యానికి పరిష్కారం చూపేందుకు ప్రయత్నించినప్పుడు గానీ ( బసివిరాలు బరితెగించింది – 2014 )  కర్నూలు స్థానీయతని వొక పరిమళంలా అద్దాడు హరికిషన్.

రచయిత సమకూర్చిన  స్థానీయతా నేపథ్యమే  యీ కథలని ‘కందనవోలు కథలు’ గా తీర్చిదిద్దదానికి ముఖ్యమైన వనరుగా తోడ్పడింది . కథల్లో సందర్భోచితంగా వాడిన కర్నూలు ప్రాంత మాండలికం కూడా అందుకు అదనపు హంగుని జోడించింది.  సూక్ష్మంగా  పరిశీలించినపుడు రాయలసీమ  నాలుగు జిల్లాల్లోనూ వొకే విధమైన జీవితం లేదనీ సమస్యల స్వభావం వేరనీ వాటిని పరిష్కరించుకోడానికి దారులు తీసే చైతన్య భూమిక ప్రత్యేకమైనదనీ వొకే కాలంలో ఆర్ధిక రాజకీయ సామాజిక రంగాల్లో చలనం భిన్నంగా ఉందనీ గతి తార్కికంగా నిరూపించడానికి యీ కథల సంపుటి వొక ఆకర గ్రంథంగా వుపయోగపడుతుంది. రాయలసీమ జీవితాన్ని యథాతథంగా చిత్రించడం దగ్గర ఆగిపోకుండా ఆ జీవితం అలా వుండడానికి కారణమైన  ఆర్ధిక భౌతిక సామాజిక  రాజకీయ శక్తుల్ని దృశ్యమానం చేయడానికి ప్రయత్నించడంవల్ల మాత్రమే అది సాధ్యమైంది.

ఉన్నత విద్యనభ్యసించిన వుపాధ్యాయుడిగా స్వీయ అనుభవాల్నీ, సామాజిక అవగాహననీ కథలుగా మలిచే సందర్భాల్లో సైతం హరికిషన్ తన నేల వాసనని వదులుకోలేదు. మన విద్యా వ్యవస్థలో రోజురోజుకీ పెరిగిపోతున్న అసమానతల్నీ జడలు విచ్చుకొన్న అమానవీయతనీ పాతుకుపోయిన అవినీతినీ అసంబద్ధమైన  పోటీనీ   దగ్గరగా చూస్తూ అందులో యిమడలేని  వూపిరాడనితనంలోంచీ తీవ్రమైన ఆవేదనకి లోనై అతనురాసిన కథలు వొక డజను వరకూ  వున్నాయి. ‘బాల్యంలోనే యుద్ధ ఖైదీలై చదువుల బోనుకు బందీలై’ శిక్షలు అనుభవించే పిల్లల్ని ప్రేమించేవాళ్ళ కోసమే’ ప్రచురించిన ‘ఒక చల్లని మేఘం’  కథల సంపుటి (2008) ద్వారా లోపలి వ్యక్తిగా హరికిషన్ నేటి విద్యా వ్యవస్థలోని సమస్త అస్తవ్యస్త పరిస్థితుల్నీ నిశితంగా చర్చకు పెట్టాడు. చాలామంది వుపాధ్యాయ – రచయితలు చేయని పనిని వొక సామాజిక ఆచరణలో భాగంగా నిర్వర్తిస్తున్నందుకు       డా. హరికిషన్ ని నావరకు నేను బహుధా అభినందిస్తున్నాను. ఈ సంపుటిలోకి యెక్కిన  ‘సదవకురా చెడేవు’ (2001) ‘ఒక చల్లని మేఘం’ (2002) ‘ఒక మైనార్టీ కాలేజి కథ’ (2005) విద్యారంగానికి చెందిన భిన్నపార్శ్వాలను విమర్శకు పెట్టిన  కథలు.

సదవకురా చెడేవు’ బహుముఖీన కథ. పరీక్ష హాల్లో యిన్విజిలేటర్ గా పనిచేసే వుపాద్యాయుడి అంతరంగంలో చెలరేగే సంఘర్షణకి అక్షర రూపమైన యీ కథలో ప్రభుత్వ విద్యా విధానాలు కార్పోరేట్ చదువులు పట్టణ గ్రామీణ విద్యార్థుల విద్యా ప్రమాణాల్లో అనివార్యంగా చోటు చేసుకొనే వ్యత్యాసాలు – వాటికి కారణాలు  ప్రైవేటీకరణలో పేద దళిత విద్యార్థులు  యెదుర్కొనే నిరుద్యోగ సమస్యలు రిజర్వేషన్ పాలసీలు మాతృభాషోద్ధరణ వాదాలు సినిమాల్లో సీమ ఫ్యాక్షనిజం . . . వంటి సవాలక్ష విషయాలు వొడ్డును కోసే వరద ప్రవాహ వేగంతో కదులుతూ వుంటాయి. పది వ్యాసాల పెట్టు యీ కథ. చైతన్య స్రవంతికి దగ్గరగా వుండే టెక్నిక్ ని ఆశ్రయించడంవల్ల యెన్నో విరుద్ధ అంశాలు కథలోకి యెక్కాయి. తానూ బోధించే చదువుల పరమార్థం తన చేతి నుంచి జారిపోయిన కారణంగా కల్గిన వొక విధమైన కసి యీ కథలోని వుపాద్యాయుడి ప్రవర్తనలో చూస్తాం , కానీ  నిజానికి ఆశక్తతలోంచీ పుట్టిన దుర్భరమైన ఆవేదన అది. పోటీ చదువుల్తో బాల్యానికీ ప్రకృతికీ దూరమౌతోన్న పిల్లలపట్ల అపారమైన ప్రేమతో రాసిన కథ ‘ఒక చల్లని మేఘం’. అనివార్యంగా కంట తడి పెట్టించే కథ యిది. పేదలకి విద్యనందకుడా చేసే మైనార్టీ గుట్టుని ‘ఒక మైనార్టీ కాలేజి కథ’ రట్టు చేస్తే , ‘నాలుగో స్తంభం’ కథ విద్యని లాభసాటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిన  కార్పోరేట్ కాలేజీల మధ్య నెలకొన్నఅనారోగ్యకరమైన పోటీనీ , పెట్టుబడులకు పెంపుడు జంతువైన మీడియా క్రూర దౌష్ట్యాన్నీ యేకకాలంలో యెండగట్టింది.  ఇదంతా మన చదువుల కుట్ర. దాన్ని ఛేదించడానికి పూనికతో కథనొక సాధనంగా యెన్నుకొన్న రచయిత  హరికిషన్. ఇప్పుడు కావల్సింది సంస్కరణలు కాదు – సమూలమైన మార్పు అని యీ కథలు చదివాకా అనుకోకుండా వుండలేం.

ఈ సంపుటిలో స్త్రీల ముఖత: వినిపించిన రెండు అద్భుతమైన మౌఖిక కథనాలు ( నిశ్శబ్ద ఆర్తనాదం – 2000 , పొద్దుపోని పంచాయితీ – 2010 ) నన్ను కట్టిపడేశాయి. వాటిలో గుక్కతప్పుకోకుండా పలికిన సాంద్ర దు:ఖ – క్రోధ భాష గుండెను బలంగా తాకుతుంది. కుటుంబ హింస , జెండర్ రాజకీయాల వస్తువా – వర్గ ప్రాంతీయ భాషా – మోనోలాగ్ శిల్పమా యేది ఆకట్టుకుంటుందో నేను చెప్పేకన్నా మీరే స్వయంగా చూసి తెలుసుకోండి. వస్తు శైలీ  శిల్పాల మేలు కలయికకి అవి అమోఘమైన సాక్ష్యాలు అని తప్పక అంగీకరిస్తారు.

ప్రపంచీకరణ ద్వారా మనం కోల్పోతున్నదాన్నీ కాపాడుకోవాల్సిన వాటిని కూడా  హరికిషన్ స్పష్టంగా గుర్తించాడు. గ్లోబల్ సందర్భంలో సాంస్కృతిక పరాయీకరణ అతణ్ణి ఎక్కువగా బాధించింది. రోజుల తరబడి మహా కథనాల్ని గానం చేసి సాంస్కృతిక వారసత్వ సంపదని కాపాడుకొస్తున్న  వుపకులాలకు చెందిన కళాకారులు తమ కళకి దూరమై  పూట గడవక బిచ్చగాళ్ళుగా మారిపోగా, టీవీ పెట్టెలకి అతుక్కుపోయి వొక మత్తులో కూరుకుపోయి చివరికి వూకుడు కథలు చెప్పేవాళ్ళూ కరువై మన పాటా కథా నశించిపోతున్న సందర్భాన్ని  మాయమైన గానం(2006), ఒక్క కథ(2010) ల్లో హరికిషన్ రికార్డు చేసాడు. అందుకే అతను రాయల సీమ పల్లె పట్టుల్లో లభించే జానపద గేయాల్నీ కథల్నీ పిల్లలకోసం సేకరించి ప్రచురిస్తున్నాడు. మనదైన అచ్చమైన దేశీయ  సాహిత్య  సంపదని కాపాడే లక్ష్యంతో చేస్తున్న ఆ పని చొచ్చుకొస్తున్న  సాంస్కృతిక సామ్రాజ్య వాద  ఆధిపత్యాన్ని ఎదుర్కొనే సాధనంగానే భావించాలి. మౌఖిక కథనాల్ని యథాతథంగా అందించడం వల్ల ఆ సాహిత్యలో వినిపించే కర్నూలు మాండలిక భాషా విశేషాలు అట్టడుగు కులాల సామాజిక చరిత్రని తెలుసుకోడానికి సైతం దోహదపడతాయి.

హిందూ ముస్లిం – భాయ్ భాయ్’ (2005) కథ నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడుగున వున్న దళితులు వున్నతీకరణని కోరుకొన్నప్పుడు వారిని అణగదొక్కడానికి మత విద్వేషంతో వొకరిపై మరొకరు కత్తులు నూరే హిందూ ముస్లింలు వొకటౌతారన్న చేదు వాస్తవాన్ని విప్పి చెబుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా చేజారిపోయే సంక్లిష్టమైన వస్తువుని హరికిషన్ యెంతో సంయమనంతో నిర్వహించాడు. ఇదే జాగ్రత్త ‘జవా’ నిర్వహణలో కూడా చూస్తాం. ఇనాయతుల్లా దాదా హయాత్ షరీఫ్ లాంటి ఇన్ సైడర్స్ మాత్రమే రాయగల కథ యీ కథ ముస్లిం మతం లోపల ముల్లాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తుంది.

కులం – మతం – ప్రాంతం – జెండర్ నిర్దిష్టతల్లోంచి వస్తు  వైవిధ్యంతో తీర్చిదిద్దిన యీ  కథలకి  ప్రాణభూతమైన అంతస్సూత్రం (యాంకరింగ్ పాయింట్) మాత్రం వొక్కటే – వ్యవస్థీ కృతమైన అసమానతలపై తీవ్రమైన క్రోధం , సమస్త ఆధిపత్యాలపై నిరసన. అదే రచయితగా హరికిషన్ ప్రాపంచిక దృక్పథం. ఆ దృక్పథం వల్లే అతను ఐక్యత –  సంఘర్షణ సూత్రాన్ని అన్వయించుకొంటూ అనేక నిర్దిష్టతల్లోంచీ సాధారణీకరణం వైపు పయనిస్తూ గడ్డిపరకల్తో తాడు పేనుతున్నాడు.

సంపుటిలోని కథలన్నీ తడమలేని  అశక్తుణ్ని. చివరిగా వొక్క ముచ్చట చెప్పి మాత్రం ముగిస్తా –

మంచి కథలో పాత్రలు పాఠకుల్ని వెంటాడతాయి – లోపలా బయటా సంఘర్షణ ప్రధానంగా నడిచే కథల్లోని పాత్రలే పదికాలాలు గుర్తుంటాయి. బహుముఖీన (మల్టీ లేయర్డ్) కథల్లో పాత్రలు పాఠకుడిని వూపిరి తీసుకోనివ్వవు – సుఖంగా నిద్రపోనివ్వవు. అటువంటి బలమైన పాత్రల్ని కథల్లోకి తీసుకురావడానికి అనువైన సమాజమే మన చుట్టూ వుంది . హరికిషన్ కథల్లో యెక్కువ భాగం సింగిల్ పాయింట్ కథలు కావడం వల్ల పాత్రల వ్యక్తిత్వంలోని అనేక పొరలు ఆవిష్కారమవడానికి ఆస్కారం తక్కువ;  అయినప్పటికీ  ‘బతుకు యుద్ధం’లో గోవిందయ్య ,‘చూపు’లో ‘నేను’ , ‘ఒక చల్లని మేఘం’ లో హరి , ‘రాజమ్మ’లో రాజమ్మ , ‘బసివిరాలు బరితెగించింది’లో ఉలిగమ్మ , కోటయ్య  వంటి గుర్తుండే పాత్రల్ని మనముందు సాక్షాత్కారింపజేయగలిగాడు. బాధ్యతనెరిగిన రచయితగా  సమాజంలోని సంక్లిష్టతల్నీ సంక్షోభాల్నీ సాహిత్యీకరించే ఆచరణలో ముందువరసలో నడుస్తున్నాడు కాబట్టి హరికిషన్ నుంచి  ముందు ముందు మల్టీ లేయర్డ్ కథలూ పాత్రలూ తయారవుతాయని యీ సంపుటి భరోసానిస్తుంది. కథానిర్మాణం పై అతను తీసుకొనే శ్రద్ధ ముచ్చటగొలుపుతుంది.

నిరాడంబర శైలీ , ముక్కుసూటి కథనం , వస్తు వైవిధ్యం , శిల్పం పేరున ప్రయోగాలు చేయకపోవడం , పాత్రోచితమైన భాషాప్రయోగం చేస్తూనే కథనంలో సైతం తనదైన ప్రాంతీయ ముద్రని చూపే నైపుణ్యం , తనచుట్టూ వున్న సమాజం లోని గతిశీలతని భిన్నపార్శ్వాలనుంచి విశ్లేషించగల యెరుక , స్వీయ జీవితానుభావాలను  ప్రగతిశీల ప్రాపంచిక దృక్పథం నుంచి వ్యాఖ్యానించే నేర్పు , స్థానీయతకి పెద్దపీట వేసి వొక వాతావరణాన్ని నిర్మించే జాగరూకత,   మానవీయ స్పందనల్ని- వుద్వేగాల్ని నిర్దిష్ట సామాజిక సందర్భం నుంచి చూడగల సంయమనం , ‘కథా సమయం’ వంటి సంస్థలద్వారా పెంచుకొన్న సదసద్వివేచనా   రచయితగా హరికిషన్ కూడగట్టుకొన్న బలాలు. ఇవి భవిష్యత్తులో మరింత పదునెక్కుతాయని ఆశంస.

కర్నూలు జిల్లా చరిత్ర కారుడిగా , బాల సాహిత్య కర్తగా , జానపద సాహిత్య సేకర్తగా – పున: స్రష్టగా , కథా రచయితగా తనకంటూ వొక గుర్తింపు తెచ్చుకొన్న డా. హరికిషన్ నుంచి కర్నూలు ప్రాంత సమగ్ర సామాజిక చరిత్రకి అద్దం పట్టే మంచి నవలని ఆశించడం తప్పు కాదేమో! సీమ నవల అనకుండా కర్నూలు నవల అనటానికి కారణం – కర్నూలు నుంచి హరికిషన్ ని విడదీయలేకపోవడమేనని నివేదిస్తూ … కందనవోలు కథలకు సాదర స్వాగతం పలుకుతూ . . . సెలవ్.

                                                                 -ఎ.కె.ప్రభాకర్ 

 

తాడిగిరి పోతరాజు: అగ్నిసరస్సున వికసించిన వజ్రం

10922018_1044900048857391_1205721763_n

( తాడిగిరి పోతరాజు : 1937-2015 )

 తాడిగిరి పోతరాజు అనగానే వెంటనే ఆయన రాసిన ‘ఎర్రబుట్ట’ కథ గుర్తొస్తుంది. తెలుగు కథ నుదుట దిద్దిన ఎర్రబొట్టు ఎర్రబుట్ట. ఆ కథని ప్రచురించిన కారణంగా విజయకుమార్ , యం.వి. తిరుపతయ్యల సారథ్యంలో కరీంనగర్   సాహితీ మిత్రులు నిర్వహించిన ఉద్యమ మాసపత్రిక ‘విద్యుల్లత’ నిషేధానికి గురైంది. ఆ తర్వాత 1971 లో ‘మెజార్టీ ప్రజలకి మనదేశంలో జరుగుతున్న అన్యాయాలతో , సాహిత్యరంగంలో , రాజీలేని పోరాటం సాగించటం , నిజాయితీని నిర్మాణ మార్గంలో మళ్ళించడం’ లక్ష్యంగా యేర్పడ్డ న్యూవేవ్ సంస్థ ప్రచురించిన ‘హోరు’ సంకలనం ద్వారా ‘ఎర్రబుట్ట’ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని యెలక్షన్ల సాక్షిగా యెండగట్టిన ఆ కథ అప్పట్లో గొప్ప సంచలనం. నిషేధించడానికి పాలకులకి కావాల్సిన వనరులన్నీదిట్టంగా దట్టించిన కథ అది. దేశంలో జరిగే యెలక్షన్లకి ‘పిచ్చగుంట్ల’ విశేషణం తగిలించి , అవి వొట్టి బోగస్ అనీ ప్రతి మూడు సంవత్సరాలకు వచ్చే జాతర్ల లాంటివనీ – జాతర్లకు మేకలు , గొర్రె పోతులు బలయితే యెలక్షన్ల జాతర్లకి మనుషుల పుర్రెలు యెగిరి పోతుంటాయనీ అపహసించిన పోలీస్ కానిస్టేబుల్ సత్తెయ్య చెప్పిన కథ అది. ఆ తర్వాత చానాళ్ళకి నిద్ర లేచిన పతంజలి ‘ఖాకీ వనం’కీ , స్పార్టకస్ ‘ఖాకీ బతుకులు’ కీ నిప్పు అందించాడు. నిప్పు రవ్వగా వున్నప్పుడే నిషేధించాలని గద్దెలెక్కిన ప్రభువుల ఆరాటం. అది ఉక్రోషంగానో భయంగానో మారి ఎమర్జెన్సీ నాటికి రచయితని నిర్బంధించే వరకు వెళ్ళింది. విప్లవోద్యమలో ఎన్నికల బహిష్కరణ పిలుపుకి సైద్ధాంతికంగా వత్తాసు పల్కిన ఆ కథ ఇప్పటికీ బూటకపు ప్రజాస్వామ్యం అరికాళ్ళ కింద మంటలు పెట్టేదిగానే కనిపిస్తుంది.

‘రచయితలారా మీరెటువైపు?’ అన్న విశాఖ విద్యార్థుల ప్రశ్న సున్నిత మనస్కులైన కవుల్నీ రచయితల్నీ బుద్ధిజీవుల్నీ కుదురుగా కూర్చోనివ్వలేదు. అది కేవలం శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భం మాత్రమే కాదు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం క్రూరమైన అణచివేతకి గురైన సందర్భం. పసి పిల్లల్ని కూడా వదలకుండా కాల్చి చంపి ప్రజా ఉద్యమాన్ని నెత్తుటి మడుగుల్లో ముంచిన సందర్భం. ప్రజల పక్షంలో అక్షరాన్ని సాయుధం చేసిన పాణిగ్రాహి శ్రీకాకుళ పోరాట వారసత్వం ఉత్తర తెలంగాణాకి వ్యాపించడానికి రాజకీయంగా రంగం సిద్ధమైన కాలం. ఉద్దానం మహాదేవపూర్ లో రెక్కలు విప్పుకొంటున్న రోజులు. శ్రీకాకుళం ‘కాక’ శ్రీశ్రీ , కొకు , రావిశాస్త్రి , కారా లాంటి ఆ ప్రాంతపు రచయితల్తో పాటు కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ తాలూకాలో మారుమూలన ‘కోతులనడుమ’ ( వల్లభాపూర్ శివారు గ్రామం) లాంటి పల్లెటూరి వ్యవసాయ కుటుంబం ( తల్లి సారమ్మ – తండ్రి రాయపరాజు) నుంచి వచ్చిన పోతరాజు ని సైతం తాకింది. 1970 నుంచీ విరసంతో కలసి నడుస్తూ – పీడితుల విషాదాశ్రువుల్ని కాదు ; విలాపాగ్నుల్ని అక్షరీకరించాలని అతను నిశ్చయించుకొన్నాడు.

‘1969 తరువాత దేశంలోని రాజకీయ సంక్షోభాల కారణంగా నాలో మానసికమైన మార్పు వచ్చింది. కన్నీటి సాహిత్యం చదువుతూ , కన్నీటి సాహిత్యం సృష్టిస్తూ అన్ని వర్గాల ప్రజలను కదిలించలేమని అభిప్రాయపడ్డాను. కన్నీటికి కారకులైన దోపిడదారులను శిక్షించాలని , ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా మార్చివెయ్యాలన్న సంకల్పంతో కరీంనగర్ జిల్లాలోని ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాను. తత్ఫలితంగా ఉద్యోగరీత్యా ఎన్నో ఇబ్బందులుపడ్డాను.’( పాతికేళ్ళ క్రితం – 1981 నవంబర్ స్వాతి సచిత్ర మాసపత్రిక కథల పోటీ లో ‘ఆరోహక గీతం’ కథకి బహుమతి వచ్చినప్పుడు చెప్పిన మాటలు).

ఎర్రబుట్ట రాయడానికి పది పన్నెండేళ్లకి ముందునుంచే ఆయన రాసిన కథలు ( తొలి కథ ‘గృహోన్ముఖుడు’ కథ 1958లో భారతి లో వచ్చింది) యెన్నోప్రసిద్ధికెక్కాయి. గాజుకిటికీ (1963) , ‘చివరి అంచున’ (1964) కథలు ఆంధ్ర ప్రభ కథలపోటీల్లో అవార్డులు పొందాయి. ‘మట్టి బొమ్మలు’ నవల ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక (1966) పురస్కారాన్ని గెలుచుకొంది( సరిగ్గా కారా యజ్ఞం కథ రాసింది యీ రోజుల్లోనే ). ఎర్రబుట్ట కారణంగా విద్యుల్లత మీద విధించిన నిషేధమే ఆన్నిటికన్నా ‘నాకు పెద్ద అవార్డ’ని ఆయన పేర్కొన్నాడు. నిషేధ – నిర్బంధాలని అవార్డు రివార్డులుగా భావించిన నిబద్ధరచయిత తాడిగిరి పోతరాజు.

అందువల్ల తాడిగిరి రచనాప్రస్థానాన్ని ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాతగా విడదీసి చూడాలి. తాడిగిరి రచనా ప్రస్థానాన్నే కాదు; మొత్తం తెలంగాణా కథనే ‘ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాత’ అని అంచనా వేయాల్సి వుంటుంది. కవిత్వంలో ఝంఝా – మార్చ్- తిరగబడు ల్లాగా తెలుగు కథకి అందునా తెలంగాణా కథకి ఎర్రబుట్ట కూడా ఒక మైలురాయి. ఆ తర్వాతే కరీంనగర్ ఉద్యమ సాహితి నుంచి ‘బద్ లా’ కథా సంకలనం (1973) వెలువడింది. అందులోని ‘బ్లాక్ అండ్ వైట్’ కథ ఎర్రబుట్టకి కొనసాగింపులా కనపడుతుంది. ‘బద్ లా’ కోసం అల్లం రాజయ్య రాసిన ‘ఎదురు తిరిగితే…’ ఎమర్జెన్సీ తర్వాత సృజనలో అచ్చయింది. ఉత్తర తెలంగాణా రైతాంగ పోరాటాన్నీ , చరిత్రనీ , చైతన్యాన్నీ సాహిత్యంలోకి సాధికారంగా తీసుకొచ్చిన రాజయ్య లాంటి వాళ్ళు రాసిన కథలకి స్ఫూర్తి ఎర్రబుట్ట ద్వారానే లభించింది. ‘బద్ లా’ కథా సంకలనంలోని రచయితలంతా – ఒక్క పోతరాజు తప్ప – కొత్తవాళ్ళే.

పోతరాజు లాగానే ఎమర్జెన్సీ ‘చీకటి రోజుల్లో’ జైలుకెళ్ళిన  యం.వి. తిరుపతయ్య రాసిన ‘న్యాయం’ కథ కూడా ఈ సంకలనంలోనే వుండడం యాదృచ్ఛికమేమీ కాదు. ఎన్నో కలలతో ఈ నేల ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఆశగా దృష్టి సారించింది అనడానికీ , ఆ కలల్ని రాజ్యం పాశవికంగా చిదిమివేయడానికి పూనుకొంది అనడానికీ వుదాహరణ మాత్రమే. ఆ తర్వాత రాజయ్య , సాహూ , రఘోత్తం , రాములు , పి చంద్ … వీళ్ళంతా విప్లవోద్యమ సాహిత్యంలో పోతరాజుకి కొనసాగింపే. సాహిత్య రచనని సామాజిక బాధ్యతగానే కాదు విప్లవాచరణలో భాగంగానూ స్వీకరించిన పోతరాజుకి సాహూ (శనిగరం వెంకటేశ్వర్లు / వెంకన్న) అన్నివిధాలా శిష్యుడే. ముందస్తు జాగ్రత్తల ( పి డి ఆక్ట్ కింద ) కోసమో – భవిష్యత్తుల భద్రత కోసమో (ఎమర్జెన్సీలో) ఇద్దరూ అరెస్టయి జైలుని తరగతి గదిగా మార్చుకొన్నారు.

రెండు రెళ్ళు నాలుగంటే జైళ్ళు నోరు తెరిచిన రోజులవి. దేశమే జైలయిన ఆ కాలంలో ప్రగతి శీలమైన ఆలోచనలుండటమే నేరం. అధ్యాపకులూ న్యాయవాదులూ డాక్టర్లూ పౌరహక్కుల గురించి మాట్లాడే బుద్ధి జీవులూ కవులూ రచయితలూ కార్మికులూ విద్యార్థులూ … ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రశ్నించిన ప్రతి వొక్కర్నీ రాజ్యం శత్రువుగానే పరిగణించింది. తల మీద ఎర్రబుట్ట పెట్టుకొన్న పోలిస్ కానిస్టేబుల్ పాత్రముఖత: తీవ్రవాదులుగా పరిగణించే పీడితుల భాషని పలికించిన పోతరాజు పొలిటికల్ డెటిన్యూ కావడంలో వింతేమీ లేదు. జైలు జీవితం పోతరాజుని రచయితగా మరింత నిబద్ధుడయ్యేలా చేసింది. ఆయన ఎంతగానో అభిమానించే శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ‘అగ్ని సరస్సున వికసించిన వజ్రమ’య్యాడతను.

వరంగల్ సెంట్రల్ జైల్లో గడిపిన స్వీయ అనుభవాలనూ , తోటి డెటిన్యూల ఖైదీల ఆవేదనలనూ, నిండా రెండు పదుల వయస్సులేని బిడ్డలు జైలు పాలైనప్పుడు వారిని చూడటానికి వచ్చే తల్లుల తండ్రుల మనోవ్యధనూ , భర్తలతో మిలాఖత్ కోసం నెలల తరబడి ఎదురుచూసే భార్యల దైన్యాన్నీ , డబ్బుతో పెరోల్ కొనుక్కొనే బూర్జువా రాజకీయ ఖైదీల డ్రామాలనూ, క్షమాభిక్ష అడిగితే కేసు మాఫీ చేస్తామన్నా తిరస్కరించిన యువకుల ధీరోదాత్తతనూ (ఆరోహక గీతం లో విద్యార్థి ఖైదీ అంభయ్య పాత్ర – సాహూనే కావొచ్చు) , మార్సిస్ట్ లెనినిస్టు రాజకీయ భావజాలాన్ని విశ్వసించిన వాళ్ళని జైలునుంచి మాయం చేసి అడవుల్లో ఎన్ కౌంటర్ పేర్న చంపేసే పోలీసు దురాగతాలనూ వొక రచయితగా , పౌర హక్కుల కార్యకర్తగా తర్వాతి కాలంలో ( 1980ల్లో) పోతరాజు కథలుగా మలిచారు. వట్టికోట ఆళ్వారు స్వామి ‘జైలు లోపల’ కథల్లా కాల్పనికతకి చోటులేకుండా యథార్థ జీవిత గాథల్లాంటి వాటిని ‘కెటిల్(ఎమర్జెన్సీ కథలు)’ పేరుతో హుజూరాబాద్ జనసాహితి సంపుటిగా వేసినప్పుడు (2009) సాహూకి అంకితం యివ్వడం గమనిస్తే విప్లవసాహిత్యోద్యమంతో పోతరాజుకి ఆజీవితం వున్న అనుబంధం , ఉద్యమ సహచరుడై తనతో నడిచిన విద్యార్థికి నివాళి ఘటించడంలో ఆయన వుదాత్త వ్యక్తిత్వం వ్యక్తమయ్యాయి. పాలకుల ఫాసిస్టు స్వభావాన్నీ , రాజ్య హింస వికృత రూపాన్నీ యెంతో బలంగా చెప్పిన యీ కథలు పోతరాజు ప్రాపంచిక దృక్పథాన్ని వెల్లడిస్తాయి.

విద్యార్థి దశలో శ్రీ శ్రీ మహాప్రస్థానం గీతాల స్ఫూర్తితో మార్క్సిజం చదవకుండానే మార్క్సిస్టునయ్యానని చెప్పుకొనే తాడిగిరి పోతరాజు తాను నమ్మిన రాజకీయ భావజాలాన్నే జీవితాంతం విశ్వసించి ఆచరించారు. నాజర్ బుర్రకథలూ , సుంకర ‘మాభూమి’ , వల్లం సాంస్కృతిక ప్రదర్శనలూ విని చూసి తాను కూడా రంగస్థల నటుడు కావాలని ఆశించారు. నటుడికి కావాల్సిన అన్ని హంగులూ ఆయనకున్నాయి. చెయ్యెత్తు మనిషి. స్ఫురద్రూపం. దృఢకాయం. ఉరుము లాంటి కంఠస్వరం. ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్షన్ , తెలుగులో అనర్గళంగా వుపన్యసించగల వాగ్ధోరణి ( మధ్యలో శ్రీశ్రీ కవితా పంక్తుల్ని వుటంకిస్తూ) యివన్నీ ఆయన్ని మంచి నటుణ్ణి చేసేవి. ఏ కారణంగానో నటుడు కాలేక రచనా రంగానికి పరిమితమై పోయారు.

అయితే నాటక శైలి ఆయన కథలకి అదనపు మెరుగులు తెచ్చింది. దారికి అడ్డొచ్చిన వాణ్ని ఎవర్నయినా ‘నగ్జలైటని కాల్చి పారేస్తే మాత్రం మనని అడిగేవాడెవడు’ అని బహిరంగంగా ప్రకటించే ‘బ్లాక్ అండ్ వైట్’ కథలో పోలీస్ హెడ్ నరసింహం సుదీర్ఘ సంభాషణలు రావిశాస్త్రి తర్వాతి కాలంలో అనితర సాధ్యం అనిపించేలా సృష్టించిన గవర్రాజెడ్డు( రత్తాలూ-రాంబాబు) , సూర్రావెడ్డు (మూడుకథల బంగారం) లకి సైతం పాఠం చెప్పే స్థాయిలో వుంటాయి. పోలీసు రాజ్యం లోతు పాతుల్ని , ధాష్టీకాన్నీ దగ్గరగా చూసి స్వయంగా చవి చూసిన యిద్దరు రచయితల మధ్య యీ పోలికలు సహజమే. 2008లో రాచకొండ రచనా పురస్కారం తీసుకొంటూ రావిశాస్త్రి రచనా శైలి పట్ల తన అభిమానాన్ని పోతరాజు చాలా స్పష్టంగానే పేర్కొన్నారు.

1963లో వొక లంపెన్ పాత్ర సుదీర్ఘ స్వగతంగా గుంటూరుజిల్లా మాండలికంలో రాసిన ‘గాజు కిటికీ’ పోతరాజు రచనా శిల్పానికి నిలువెత్తు నిదర్శనం. మాగోఖలే తర్వాత గుంటూరు భాషని కథల్లో యింత అద్భుతంగా పట్టుకొన్నది పోతరాజేనేమో. ఆ భాషా సౌందర్యానికి ముచ్చటపడే పాపినేని శివశంకర్ తమజిల్లా రచయితగా ఆయన్ని own చేసుకొన్నాడు (దక్షిణ తీరాంధ్ర కథ – నిశాంత , పే.105). ఎర్రబుట్ట రాసేదాకా ఆయన్ని ‘గాజుకిటికీ పోతరాజ’ని పిల్చేవారంటే ఆ కథ వస్తు శిల్పాలు యెలాంటివో అర్థమౌతుంది.

నిజానికి తెలంగాణలో ‘కోతుల నడుమ’ లాంటి కుగ్రామం తన సొంతూరు అని చెప్పుకొన్నప్పటికీ పోతరాజు జీవితం కోస్తా ప్రాంతంతో యేదో వొక మేరకి ముడివడి వుంది ( బాల్యం తణుకు లో గడిచిందనీ , గుంటూరులో చదువులు నడిచాయనీ ఆయనే యెక్కడో పేర్కొన్నట్టు గుర్తు). అందుకే కథల్లో అవసరానుగుణంగా పాత్రోచితమైన కోస్తా భాషని గొప్ప మెలకువతో వుపయోగించడం చూస్తాం.

పోతరాజు కథల్లో యెత్తుగడలూ ముగింపులూ ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు. చాలా కథలు యెత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. కథల్లో యిటువంటి ముగింపుల్ని తాడిగిరి మార్కు ముగింపులని పేర్కోవడం కూడా వుంది. మంచి కథల్లో రచయిత దృక్పథం ముగింపుల్లో స్పష్టమోతుంది. అయితే దృక్పథాన్ని ఆవిష్కరించే పనిలో ఆయన కళాత్మక విలువలతో యెక్కడా రాజీ పడలేదు. ఏ ముగింపూ స్లోగన్ లానో అవాస్తవికంగానో వుండడమో చూడం.

నికార్సైన రాజకీయ దృక్పథంతో ప్రజాస్వామ్య హక్కులకోసం పిడికిలి బిగించే గొంతులు బలపడాల్సిన యివాల్టి సందర్భంలో మత ఫాసిస్టు శక్తులు సామ్రాజ్య వాద గూండాలూ కొత్త పొత్తుల కోసం దారులు వేస్తున్న దశలో వొక పూనికతో పీడిత జన పక్షం వహించి నూతన మానవ ఆవిష్కరణ కోసం తన సాహిత్యాన్ని అంకితం చేసిన తాడిగిరి పోతరాజుని స్మరించుకోవడం అంటే ఆయన నమ్మిన రాజకీయ భావజాలానికి పునరంకితం కావడమే.

రెండు తరాల విప్లవ రచయితకి ఎర్రెర్రని పూల నివాళి.

  • -ఎ.కె.ప్రభాకర్

 

 

అదనపు విలువపై అధికారం నిర్ధారించే ‘తీర్పు’

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

తీర్పు వొక రాజకీయ కథ. అదొక పాఠం కూడా . శ్రామిక వర్గ దృక్పథం ఆ కథకి ఆయువుపట్టు.

రచయిత తాను నమ్మిన భావజాలాన్ని గానీ, తన ప్రాపంచిక దృక్పథాన్ని గానీ సాహిత్యంలో చెప్పడం వల్ల కళాత్మక విలువలు దెబ్బతింటాయని వొకప్పుడు కేవల అనుభూతి వాదులూ, ఆ తర్వాత శుద్ధ రూపవాదులూ , యిటీవల వామపక్ష ప్రగతిశీల దృక్పథాన్ని వ్యతిరేకించడమే ఫ్యాషన్ గా మార్చుకొన్న కొంతమంది పోస్ట్ మాడర్నిస్టులూ సణిగే సణుగుళ్ళూ  కూసే కూతలూ రాసే కొక్కిరాయి రాతలూ పస లేనివని నిర్ద్వంద్వంగా తిరస్కరించడానికి నిండైన వుదాహరణ 64 లో కాళీపట్నం రామారావు మాష్టారు రాసిన ‘తీర్పు’ కథ . నేనీ మాటలు యింత నిక్కచ్చిగా చెప్పడానికి బలమైన కారణాలే వున్నాయి. ‘తీర్పు’ కథలో కారా ప్రతిపాదించదలచుకొన్న సారం రూపానికి హాని చెయ్యలేదు. వస్తు నిర్వహణకి శిల్పం యెలా దోహదం చేస్తుందో లోతుగా తెలిసిన రచయితగా మాష్టారీ కథలో దర్శనమిస్తారు. వస్తువుకి విధేయమైన శిల్పం మాత్రమే పాఠకుణ్ణి యెటూ మెదలనివ్వక కట్టి పడేస్తుంది. వస్తు ప్రధానమైన యీ కథలో దృష్టి యెంతసేపూ సారం మీదే వుండేలా చేయడానికి కథా నిర్మాణ విషయంలో రచయిత తీసుకొన్న శ్రద్ధ ప్రతి పదంలోనూ  గోచరిస్తుంది.

పెట్టుబడులు – వనరులు – వుత్పత్తి సాధనాలు – శ్రమ – వుత్పత్తి ఫలాల గురించి , వాటి అదుపు గురించి మార్క్సిజం చెప్పిన సూత్రాలను అర్థం చేసుకోడానికి ‘తీర్పు’ కథ వొక పాఠంలా నాకెంతో తోడ్పడింది. తరగతి గదిలో భాషాధ్యాపకుడిగా సామాజిక శాస్త్రాంశాల్ని అన్వయిస్తూ సాహిత్యాన్ని బోధించే స్వేచ్ఛ వుండడం వల్ల ‘ తీర్పు’ కథని యెన్నో సందర్భాల్లో పిల్లలకి చదివి వినిపించాను, చేతిలో కథ లేనప్పుడు మౌఖికంగా చెప్పాను. ప్రతిసారీ కథలోని సారం మీద చర్చలు జరిగేవి. సుందర రామయ్య రెండో కొడుకు ఇచ్చిన తీర్పుకే అంతిమంగా ఆమోదం లభించేది. మాష్టారి తీర్పు కథని తొలిసారి నేనెప్పుడు చదివానో గుర్తులేదు కానీ – కథలోని ‘ రెండోవాడు’ నన్ను జీవితం పొడవునా ఆవహించిన హీరో అయ్యాడు. అతని నిర్ణయాత్మక ధోరణి , తర్కబద్ధమైన వాదనా పటిమ , చూపులో చురుకుదనం , మాటలో నైశిత్యం, ముక్కుసూటిదనం , హేతుదృష్టి , అభిప్రాయ వ్యక్తీకరణలో నిక్కచ్చిదనం, ఆశయసాధన పట్ల సడలని పట్టుదల , ఆధిపత్య నిరసన , తిరుగు బాటు తత్త్వం వంటి అనేకానేక గుణాలు నాకాదర్శమయ్యాయి.

మానవ శ్రమే సమస్త సంపదల సృష్టికి కారణమైనప్పుడు దానిమీద సర్వ హక్కులూ – అనుభవించడం, పరిరక్షించడం, పంచడం యేవైనా కావొచ్చు – అవి శ్రమ చేసినవారికే చెందుతాయన్న మార్క్సిజం మౌలిక సూత్రాన్ని అతి సరళంగా కళాత్మకంగా ఆవిష్కరించిన ‘తీర్పు’ కథ వొక విధంగా అన్యాపదేశ కథ.  అన్యాపదేశ కథల్లో అంతరార్థం తెలిసీ తెలియనట్టుగా దాగుడుమూతలాడుతూ మంచుపొర కింది పువ్వులా గోచరం కావడం వొక టెక్నిక్. అయితే వొక్కోసారి రచయిత చెప్పదల్చుకొన్న అంతరార్థం పాఠకుడికి అందదు. అలా అందక పోయినా రచయిత ప్రతిభ కారణంగా ఆ లోటు కనపడదు. పాత్రలూ సన్నివేశాలూ సంభాషణలూ సంఘటనలూ అన్నీ కలిసి వొక కథగా హాయిగా చదువుకోడానికి యెటువంటి  యిబ్బందీ కల్గదు. అంతరార్థం ద్యోతకం కాపోయినా అది కథగా మనగల్గుతుంది – యిది మరో టెక్నిక్. ‘తీర్పు’ కథలో అర్థం నిగూఢం  కాదు. అలా అని పూర్తిగా బహిరంగం కాదు. చదివిన ప్రతిసారీ పదాలపైనా పాత్రలపైనా  కొత్త కాంతి ప్రసరిస్తుంది. పదాల మధ్య, వాక్యాల మధ్య , నిశ్శబ్దంలోనూ దాగివున్న లోతుని ఆనందించగలం. పాత్రలు ప్రతీకలుగా గాక నమూనాలుగా కళ్ళముందు నిలుస్తాయి. జీవిత సత్యాల్ని బోధపరుస్తాయి. ఒక యింట్లో దేశం, వొక కుటుంబంలో సమాజం , అందులోని భిన్న వ్యవస్థలూ ఆవిష్కారమౌతాయి. ఆ యా సన్నివేశాల్లో పాత్రల మాటలూ చేతలూ ఆలోచనా సరళీ నడవడికా అందుకు దోహదం చేస్తాయి. వాటిని విశ్లేషించుకొనే  ముందు స్థూలంగా వొకసారి కథలోకెళ్దాం :

సుందర రామయ్యకి నలుగురు మగపిల్లలు. కడగొట్టుది ఆడపిల్ల. పెద్దవాళ్ళు ముగ్గురూ హైస్కూలుకు పోతున్నారు. రెండోవాడికి బళ్ళో అట్టలు చేయడం నేర్పేరు. అలాంటివి బళ్ళో చేసి అమ్మేరు. ఒక్కొక్కటి ముప్ఫై నయా పైసలకమ్మేరు. పెద్దవాడు అర్థరూపాయి ఖర్చుతో అరడజను చేయవచ్చని కనిపెట్టేడు. బజారులో ఆ అట్టలే ఒక్కొక్కటి ఆరణాలని చెపితే వాళ్ళ అమ్మ అర్థ రూపాయి యిచ్చింది. ఉన్నవాళ్ళు ఐదుగురే కాబట్టి అయిదు అట్టలే చేసుకుందామన్నారు. మిగిలిన డబ్బు – ఒక అట్టమీద అధికంగా పెడితే అది అందమయిన కాలికో అట్ట అయింది.

తాను పెద్దవాడు కాబట్టి, తనది పెద్ద క్లాసు కాబట్టి, ఆ అందమైన అట్ట తాను తీసుకుంటానన్నాడు పెద్దవాడు. అలా వల్ల కాదు నేను తీసుకుంటానన్నాడు రెండోవాడు – తల్లి మొదట పెద్దవాడికే యిచ్చేయమంది. రెండోవాడు వాదిస్తే వాడికే ఇచ్చేయబోయింది. తగువు తెగకపోవడంవల్ల తండ్రి దగ్గరకు వచ్చింది.

ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. కుటుంబం దానికదే వొక యూనిట్ అయినప్పటికీ  సమాజం లోని అన్ని దృగంశాలూ అక్కడా వుంటాయి. కుటుంబంలో అందరూ సమానమేగానీ కొందరు ఎక్కువ సమానం. దానికి కారణాలు సవాలక్ష. పాతుకుపోయిన భూస్వామ్య విలువలు, అయాచితంగా ప్రవహిస్తూ వచ్చే పితృస్వామ్య భావజాలం, ప్రశ్నించరాని సంప్రదాయాలూ ఆచారాలూ,  జెండర్ వివక్ష, వ్యక్తుల బలాలు – బలహీనతలు, ప్రత్యేక ప్రేమాభిమానాలూ, నిర్వచించలేని వుద్వేగాలూ యిటువంటివన్నీ అక్కడ సంబంధాల్నిశాసిస్తాయి. నిర్ణయాల్ని నిర్దేశిస్తాయి.

కుటుంబ పెద్దగా సర్వాధికారాలూ సొంతం చేసుకొన్న సుందర రామయ్య న్యాయమూర్తి స్థానంలో కూర్చొని సమస్యని తన పెద్దరికంతో సులువుగా పరిష్కరించొచ్చు అనుకొన్నాడు. అయితే అతను ప్రజాస్వామ్య పద్ధతిని యెంచుకొన్నాడు. అసమానతల వ్యవస్థలో ప్రజాస్వామిక సంప్రదాయం యేమేరకు సరైన న్యాయం చేయగల్గుతుందో అతనికి తెలియదు. నిజానికతనికి యీ తగువు అంతగా నచ్చలేదు. అతను వర్తమానంలో యెంతగా జీవించాలనుకొంటాడో అంతగా వెనకటి కాలాన్ని ప్రేమిస్తాడు.

‘తన పిల్లలు త్రేతాయుగం నాటి శ్రీరామచంద్ర సోదరులను తలపిస్తూ, ఒక్కటిగా ఉండాలని అతని అభిమతం.’

ఎంత ప్రజాస్వామికంగా వుందామనుకొన్నా సుందరరామయ్య రక్తంలో దాగున్న ఫ్యూడల్ విలువల అవశేషాలు అతన్ని యిబ్బంది పెడ్తూ వుంటాయి. పెద్దకొడుకు తన ఔరసుడన్నభావన అతనిలో బలీయంగానే వున్నట్లుంది. వాడికి తన తండ్రి పేరే పెట్టుకొన్నాడు. వాడి పట్ల ప్రత్యేకంగా పక్షపాతం చూపించినట్లు కనపడకూడదని ప్రయత్నపూర్వకంగా ప్రజాస్వామిక కండువాని సర్దుకొంటూ వుంటాడు.

పెద్దవాడు – తెల్లగా నాజూగ్గా స్టయిలుగా వుంటాడు. కళ్ళల్లో కొంత తెలివి కూడా కనపడుతుంది. పెద్దకొడుక్కే వారసత్వపు హక్కులు వుంటాయన్నసంప్రదాయం వాడికి తెలిసినట్టే కనపడుతుంది. అందువల్ల పెద్ద అట్ట తనకే  దక్కాలని వాడి అభిమతం. తమ్ముడి ప్రతిఘటనతో వాడి అభిమానం దెబ్బతింది. దాన్ని దాచుకోడానికి బేలగా ప్రయత్నిస్తూ వున్నాడు. కానీ తండ్రి ప్రేమ తనవైపే మొగ్గుతుందని గట్టి నమ్మకం. తండ్రి తీర్పు తనవైపేనని వాడికి  భరోసా .

రెండోవాడు కాస్త బండగా వుంటాడు. వాడి మూసి వుంచిన పెదవుల్లో పట్టుదలా, తెరచి ఉంచిన కళ్ళల్లో నిబ్బరం కనిపిస్తాయి. చూసేవాళ్ళకి, వాడితో కొంచెం జాగ్రత్తగా వుండడం మంచిదనిపిస్తుంది. వాడి గురించి తండ్రికి ముందే కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి.

‘వాడు ప్రతిదానికీ యిట్టే సీరియస్ అయిపోయే రకమని సుందర రామయ్య అంతకుముందే వాడిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొన్నాడు.’

నిజానికి న్యాయమూర్తికి యిటువంటి పూర్వ నిశ్చయాలు – ప్రిజుడీస్ వుండకూడదు. కానీ వాడిని కన్నతండ్రిగా అలా అభిప్రాయపడే హక్కు కూడా అతనికి సహజంగానే వుంటుంది. ఈ ద్వైధీభావం, సంఘర్షణా కథ పొడవునా అతనిలో కనిపిస్తూనే వుంటాయి. ప్రజాస్వామిక విలువలు వొక వైపు, భూస్వామ్య భావజాలం మరొకవైపు అతను మధ్యలో వేలాడుతూ వుంటాడు. అయితే తనలోని యీ వైరుధ్యాన్ని కనపడనివ్వని గాంభీర్యం కూడా అతను ప్రదర్శిస్తాడు. మార్క్సిస్ట్ పరిభాషలో – జార్గాన్ అనుకోకుంటే – అతణ్ణి సెమీ ఫ్యూడల్ అనొచ్చు.

అందరికీ సమన్యాయం ప్రసాదించిన రాజ్యాంగం వంటిది తల్లి. అర్థ రూపాయి పెట్టుబడి పెట్టిన కారణంగా పరిష్కారాన్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చుగానీ ఆమె స్వేచ్ఛకీ పరిమితులున్నందువల్ల తగువుని వున్నత న్యాయపీఠానికి తీసుకువచ్చింది.  ఆమె నిర్ణయం చెయ్యలేక పోడానికి ఆడబిడ్డ – సుందరరామయ్య అక్క – కూడా కొంతవరకు కారణం కావొచ్చు.

సుందర రామయ్య అక్క పాత్రని రచయిత రాజ్యాంగేతర శక్తికి నమూనాగా తీర్చిదిద్దారు. అది మత ధార్మిక శక్తి కావొచ్చు;  ఆధునిక న్యాయ గ్రంధాల్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చే కాలం చెల్లిన స్మృతులు కావొచ్చు.  చాలా సందర్భాల్లో యీ శక్తులు న్యాయవ్యవస్థని శాసిస్తాయి. అనూచానంగా వస్తున్న సంప్రదాయాల్నీ రీతీ రివాజుల్నీ ధర్మం పేర్న న్యాయంగా చెలామణీ చేయించాలని కంకణం కట్టుకొని ప్రయత్నిస్తాయి. అందుకే –

‘చిన్నప్పుడు తమ పుట్టింట్లో వారాలబ్బాయే యివ్వాళ తను హాజరయిన కోర్టులో జడ్జిగా కనిపించినట్టు ఆ అప్పగారు తమ్ముడి వంక ధీమాగా చూస్తోంది.’

విచారణ ప్రారంభమయ్యేసరికి  – దాదాపు అనగనగా కథలా మొదలైన కథ నాటకంగా రూపొందుతుంది. వాదాలూ ప్రతివాదాలూ సంభాషణలూ ఆంగిక సాత్త్వికాల్తో నిండిన పాత్రల హావభావాల్తో పాఠకుడి కళ్ళముందు వొక కోర్టు దృశ్యం సాక్షాత్కారమౌతుంది. ఇది శిల్పానికి సంబంధించిన అంశం. ఈ కథలో శిల్ప చర్చ అంత ప్రధానం కాదు. వస్తు నిర్వహణ ముందు అది గౌణమైపోయింది. వస్తువుకి శిల్పంతో  స్వచ్ఛందంగా వూడిగం చేయించడం కారా కథల్లో విశిష్టత. ‘ఈ తగువులింక నే తీర్చలేను’ అన్న వుత్కంఠభరితమైన వాచికంతో కథ యెత్తుగడ దగ్గరే  ఆ చాకిరీ మొదలైంది.  మళ్ళీ కథలోకెళ్తే …

నాల్గో పిల్లడు – తానందరికంటే చిన్నవాడు కాబట్టి యెంచుకొనే అవకాశం తనకివ్వాలంటాడు. ఇది బలహీన వర్గాల రిజర్వేషన్ విధానంలా వున్నప్పటికీ నిజానికి యింకా చిన్నది ఆడపిల్ల వుంది – రిజర్వేషన్ అమలు కావాలంటే  – అట్ట ఆ పిల్లకు చెందాలి. అయితే ఆ పిల్లకి తన హక్కులు వినియోగించుకొనే / సాధించుకొనే తెలివీ చొరవా యింకా యేర్పడలేదు.

మూడోవాడి దృక్పథం, ఆచరణా యిందుకు భిన్నం. అట్టల తయారీలో వాడి శ్రమ కూడా కొంత వుంది. ‘అవసరం’ దృష్ట్యా పెద్ద అట్ట తనకివ్వమంటాడు. లేదంటే అన్నివిధాలా శ్రమ చేసి అట్టలు సృష్టించినవాడు రెండవవాడే కాబట్టి వాడికివ్వడమే న్యాయమంటాడు. ప్రజాసంఘాల వాళ్ళు న్యాయానికి వత్తాసు పల్కినట్టు రెండోవాడి తరపున వకాల్తా తీసుకొన్నాడు. అట్టల ఐడియా పెద్దవాడిదే అయినప్పటికీ ‘ఒట్టి ఐడియా’లకు అట్టలు పుట్టవన్న భౌతికోత్పత్తి రహస్యాన్ని  వెల్లడించాడు. వనరులూ పెట్టుబడులూ యెవరికైనా సమభావంతోనే రాజ్యం సమకూర్చాలనే రాజ్యాంగ నైతికతని కూడా గుర్తు చేసాడు. రెండోవాడికి యింతకు ముందే తల్లి యిచ్చిన నైతిక బలం వుంది. ఇప్పుడు తమ్ముడి న్యాయబద్ధమైన తోడ్పాటు లభించింది. నిజానికి వాడికి అన్న పెద్ద ప్రతిద్వంద్వి కూడా కాదు. ఇక తన శ్రమఫలం మీద అధికారాన్ని స్థాపించుకోవాలంటే రెండు అడ్డంకుల్ని అధిగమించాలి. ఒకటి న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న తండ్రి – రెండు తండ్రి  నోటినుంచి తీర్పు వచ్చేలోపే దాన్ని ప్రభావితం చేసే మేనత్త.

తండ్రి మొఖానికి తగిలించుకొన్న  ప్రజాస్వామ్యంతోనే అతనిలో దాగివున్న ఫ్యూడల్ విలువలకి గండికొట్టాలి,  మొత్తం న్యాయప్రక్రియ పైనే ధాష్టీకం చేయగల మేనత్త యేకరువు పెట్టే ధర్మపురాండాలని కట్టడి చేయాలి. లేకపొతే తనకు న్యాయం దక్కదని రెండోవాడు గ్రహించాడు. ఇంటికి పెద్దవాడూ తండ్రి తర్వాత తండ్రంతటి వాడూ లేదా తండ్రికి తల కొరివి పెట్టేవాడూ కాబట్టి తీర్పు పెద్దవాడికి అనుకూలంగా మారకుండా జాగ్రత్తపడ్డాడు.

‘ఇంటికి పెద్దవాడు కదా – ఎప్పటికైనా – మీ తరువాత ….’ అన్న అసంపూర్ణ వాక్యంతో తండ్రి ముందు కాళ్ళకి బంధం వేశాడు. పెద్ద కొడుకు వైపు తీర్పునిస్తే అది పక్షపాతంతో కూడినదన్న అపవాదునెదుర్కొవాల్సి వస్తుంది కాబట్టి సుందర రామయ్యకి తన  ‘ధర్మ నిబద్ధత’ని నిరూపించుకోక తప్పని పరిస్థితి కల్పించిందీ వాక్యం. న్యాయ ప్రక్రియపై రెండోవాడి తొలి పట్టు యిది.

ఇప్పటిదాకా సుందర రామయ్య యెదుర్కొన్నది బాహిరమైన సంఘర్షణే. ఇక యిప్పుడు అంతరంగ మథనం ప్రారంభమైంది. అతని హృదంతరాళాల్లో గూడు కట్టుకొని వున్న ఫ్యూడల్ నీతి వొళ్ళు విరుచుకొంది. రెండోవాడికి అందమైన అట్ట దొరకుండా చేయడానికి దారులు వెతుకుతున్నట్టు ప్రవర్తిస్తాడు.

మేనత్త  ‘లోకాచారాలూ, సబవులూ’ మాట్లాడడంతో  – తల్లి మౌనంగా వుండలేకపోయింది. ‘పెద్దవాడి వంతు వాటా వేయడం – చిన్నవాళ్ళు ఎత్తుకోవడం రివాజు’ అని నోరు విప్పింది. మేనత్తకి కౌంటర్ యిచ్చేటప్పుడు రెండోవాడి గొంతులో ధ్వనించిన వెటకారం, కరకుదనం,  న్యాయమూర్తి పట్ల చూపే వొక విధమైన అవిధేయత సుందరరామయ్యకి విసుగు పుట్టించాయి. వాడి ధిక్కారం నెగ్గకూడదని అతను నిర్ణయించుకొన్నట్టు చూపుల్లో మాటల విరుపుల్లో తెలుస్తూ వుంటుంది. వాడి దేహ భాషా, వచో వైఖరీ, ప్రవృత్తీ అతనికి భయం కల్గించాయేమో కూడా. సంభాషణల్లో వినిపించే కాకువూ పాత్రల స్పందనల్లో రచయిత చెక్కిన సున్నితమైన భాషాశిల్పం ఆయా సందర్భాల్లో వ్యక్తుల మనస్తత్వాన్ని కళ్ళకు కట్టడానికి అమోఘంగా వుపయోగపడ్డాయి.

భార్య చెప్పినట్టు  నాలుగో వాడికిద్దామని సుందర రామయ్య  ప్రతిపాదించాడు. ఆడపిల్లకి – అందరికన్నా చిన్నదైనా – యీ పంపకంలో వాటా గురించి అతను ఆలోచించడు.

‘ఆడపిల్ల కదా అని ఆడపిల్లకిచ్చేయడం ఆడదాని వ్యవహారమనిపించింది సుందరరామయ్యకి.’ అతనిలోని ఫ్యూడల్ మనస్తత్వానికి యిక్కడికొచ్చేసరికి దాపరికాలక్కరలేకపోయాయి.

అప్పటికే నాల్గోవాడు సాదా అట్టకి సర్దుకొన్నాడని రెండోవాడు చెప్పినప్పుడు –

‘చదరంగం ఆడే ఆసామి ‘ఆటకట్టు’ ఎత్తువేశాకా చూసే చూపు వాడి కళ్ళల్లో కనిపించింది’  సుందర రామయ్యకి.

ఇది న్యాయాన్ని తనవైపు  తిప్పుకొనే క్రమంలో రెండోవాడి మలి విజయం. తాననుకొన్న తీర్పు యివ్వలేకపోతున్నందుకు న్యాయమూర్తికి ‘క్రమంగా చిరాకు ప్రారంభమైంది.’

సుందర రామయ్యలో వున్న సమస్త వైరుధ్యాలూ మూకుమ్మడిగా అతని మీద దాడిచేశాయి.

పెట్టుబడి తనదే కాబట్టి – సంపదనంతా జాతీయం చేసయినా తన ఆధిపత్యం నిలుపుకోవచ్చన్న వూహ కూడా అతనికి వస్తుంది. ‘అట్టలెవరివీ కావని దాచేస్తే’ అనుకొంటాడు. ‘లాటరీ వేస్తే?’ అతనిలో యెక్కడో మిగిలివున్న బలహీనమైన ప్రజాస్వామ్యవాది ఆలోచన. క్యాలికో అట్ట కన్నా మంచి అట్ట తను స్వయంగా చేసి పెద్దవాడికిస్తే  – అని వుద్వేగంతో నిండిన అతని గుండె చప్పుడు చేస్తుంది. ఒక అట్ట వేరుగా చేసినందుకు కోపం వస్తుంది. రెండోవాడు ‘అన్నీ ఒకలాటివే చేసుకుందామ’ని చెప్పినా పెద్దవాడే ప్రత్యేకమైన అట్ట ప్రతిపాదన తెచ్చాడని విన్నాకా అతనికి సమస్య మరింత జటిలమైంది. మొదట్నుంచీ  రెండోవాడే న్యాయమార్గం లో వున్నాడని తేలడంతో దిక్కు తోచలేదు. అలా అని తీర్పు వాడి వైపు చెప్పడానికి కూడా మనసొప్పలేదు. ‘ఎటుపోయినా ఓటమి ఎదురవడం చిరాకుని పెంచుతుంది’. అతని మౌనంతో కోర్టు హాల్లో ‘ఆర్డర్’ దెబ్బతింది.

ఆ బలహీన క్షణాల్ని ఆసరా చేసుకొని గ్రంథాలయాలమీదా ఆర్ట్ మ్యూజియంల మీదా దాడిచేసే మనువాద సాంస్కృతిక సైన్యంలా మేనత్త రెచ్చిపోయింది. ‘చిన్నంతరం – పెద్దంతరం’ గురించి మాట్లాడింది. ఇవ్వాళ అన్నని కాదన్నవాడు రేపు తండ్రిని కాదంటాడని రెచ్చగొట్టింది. పొరుక్కి ఉపకారమంటే పొయ్యార్పుకునే రకమని శీలహననం చేసింది. పరోపకార గుణం గురించి నీతి సూత్రాలు యేకరువు పెట్టింది. న్యాయం కోరేవాణ్ణి నేరస్తుడిగా తీర్మానించింది. వాడు జన్మలో బాగుపడడనీ పుట్టగతులుండవనీ భయపెట్టింది. పాపం చేస్తే పాపం; పుణ్యం చేస్తే పుణ్యం తప్ప యింకేదీ వెంటరాదని సిద్ధాంతీకరించింది.

ఇప్పుడు రెండోవాడు సమస్త కార్మిక వర్గానికీ ప్రాతినిధ్యం వహిస్తూ తీర్పు యివ్వబోతున్నాడు. మేనత్త వూదరగొడుతోన్న అశాస్త్రీయ భావజాలాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాల్సిన సందర్భం వచ్చింది.

‘ – ఒక్క అట్టలు తప్ప’ అని ఆమె మాటలకి ముక్తాయింపు పలికాడు.  యుగాలుగా సంకెళ్ళుగా మారిన విశ్వాసాలను తెంచుకొన్న సవ్వడి ఆ మాటల్లో వొక విలక్షణతతో వినిపిస్తుంది.

తమ హక్కుల్ని స్థిరీకరించుకోవాలన్నా సాధించుకోవాలన్నా తరాలుగా పాతుకుపోయిన అభౌతిక భావజాలాన్ని కూకటివేళ్ళతో పెళ్ళగించాలి – అప్పుడు మాత్రమే కార్మికవర్గ నియంతృత్వాన్ని స్థాపించుకోగల అంతిమ తీర్పుని యివ్వగలం – అన్న చైతన్యం, వుద్బోధ రెండోవాడు పల్కిన మాటల్లో అక్కడందరితోబాటు పాఠకుల చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి.

న్యాయ పోరాటంలో విజయం సాధించాలంటే పితృస్వామ్యం చుట్టూ పాత బూజుపట్టిన  సంప్రదాయాల చుట్టూ అల్లుకొన్న సమస్త సాంఘిక – సాంస్కృతిక కట్టుబాట్లని తెంచుకోక తప్పదు.  రాజ్యం, దాని పరిరక్షకులూ సరైన న్యాయం చేయలేరని నిర్ధారణ అయ్యాకా లేదా తీర్పు యేకపక్షంగా అధర్మబద్ధంగా వెలువడవచ్చని అనుమానించాకా బాధితులు తమకేం కావాలో తామే నిర్ణయించుకొని దాన్ని అమలు చేసే అధికారాన్ని సొంతం చేసుకోక తప్పదు.

తన శ్రమ ఫలంపై అధికారాన్ని  స్వయంగానే ప్రకటించడానికి సిద్ధమయ్యాడు రెండోవాడు. తానే తీర్పరి అయ్యాడు.

మొత్తం అయిదు అట్టల్లో రెండు సాదా అట్టలు – వొక్కో దానికీ  పావలా లెక్కన ధర కట్టి – పెట్టుబడి పెట్టినందుకు యిచ్చేశాడు. మిగతా మూడు అట్టలూ పెట్టుబడి పోగా – అదనపు విలువ ( కార్మికుడి శ్రమే యీ విలువకి మూలం – అది  లాభం పేరుతో పెట్టుబడిదారుల పెట్టెల్లోకి చేరుతోంది). దాని న్యాయబద్ధమైన పంపిణీని కూడా తానే నిర్ణయించాడు. ఐడియా యిచ్చినందుకు (బౌద్ధిక శ్రమకి) పెద్దవాడికి పావలా అట్ట వాటా , పనిలో సాయం చేసినందుకు మూడోవాడికి మరో పావలా అట్ట వాటా ప్రతిఫలంగా ( అది ఎక్కువేనని చెబుతూనే) యిచ్చేశాడు. క్యాలికో అట్ట తనకిష్టమైంది కాబట్టి తానుంచుకొన్నాడు. ఇది  తిరుగులేని అంతిమ తీర్పు.

కార్మిక వర్గ నియంతృత్వంలో వుండే  సమత్వ భావననీ, ప్రజాస్వామిక లక్షణాన్నీ , వుత్పత్తి సంబంధాల్లో పరిఢవిల్లే మానవీయతనీ , సమ న్యాయాన్నీ, శ్రమఫలం పై దాని సామాజిక పంపకంపై శ్రామికులకు లభించే సాధికారికతనీ రెండోవాడి తిరుగుబాటు ద్వారా ప్రతిపాదిస్తూనే రచయిత కథ ముగింపుని తెరచి వుంచారు.

రెండోవాడి ‘అఘాయిత్యాన్ని’ సుందరరామయ్య యెలా స్వీకరించాడన్నది ప్రశ్న. తరతరాల సంప్రదాయాలు , విలువలు వాటిద్వారా సంక్రమించిన అధికారాలు, సౌకర్యాలు , పెద్దరికం తల్లకిందులయ్యాకా ‘ఎర్రగా చాలా ఎర్రగా జేవురించిన  ముఖం’ యెటువంటి ప్రతిక్రియకి పూనుకొంటుందో కాలం నిర్ణయిస్తుంది. ఈ తీర్పునిచ్చిన రెండోవాడే శ్రీకాకుళం కొండల్లో పుట్టిన నిప్పందుకొని సత్యంవైపు నిలబడి వుంటాడు. వాడి గురించిన సుందర రామయ్య భయాలు ఆ విధంగా నిజమయ్యాయి. ఈ కథ పుట్టిన మరో పుష్కరానికి  42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్యాక్టరీల నిర్వహణలో కార్మికులకి భాగస్వామ్యం కల్పించే చట్టం రూపొందింది. దానిద్వారా నిర్వహణలో కార్మికుడు అభిప్రాయ వ్యక్తీకరణకి పరిమితమై అధికారానికి యెప్పటికీ దూరంగానే వుండిపోయాడు.

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి... చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు  అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి.   కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి… చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి. కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

50 యేళ్ళ తర్వాత యివ్వాళ సుందర రామయ్యలు ప్రజాస్వామ్యపు ముసుగుల్ని సైతం వదిలేశారు. ఫ్యూడల్ విలువలకే సాంస్కృతిక జాతీయవాదం టాగ్ తగిలించి చెలామణి చేస్తున్నారు.  చట్టాలకీ న్యాయాలకీ అతీతంగా యెటువంటి విచారణలకీ తావులేకుండా దేశ విదేశ ధనికస్వాములకు దాస్యం చేస్తూ ప్రకృతి వనరులతో సహా సమస్త సంపదని స్వయంగా స్వాహా చేస్తూ ఆశ్రితులకి అడ్డగోలుగా పందేరం చేస్తూ నిర్లజ్జగా స్వైరవిహారం చేస్తున్నారు. కాదంటే – దుడ్డుకర్రనుపయోగించి రెండోవాడి మూడోవాడి నోళ్ళు మూయిస్తున్నారు. నిజానికి కార్పోరేట్ కల్చర్ లో యివాళ తాను చేస్తున్న  వుత్పత్తి తుది రూపం కూడా రెండోవాడికి తెలీదు. శ్రమ పరాయీకరణ పరాకాష్టకి చేరుకొన్న దశలో శ్రమఫలం పై అధికారం గురించి ఆలోచించే స్థితిలో లేడు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకొన్న హక్కులకి వాడు దూరమయ్యాడు. తల్లి పాపం అమాయిక – ఆమె యెప్పుడూ మౌన ప్రేక్షక స్థానంలోనే వుంది. మేనత్తలు సుందర రామయ్యల తెలివికీ తెంపరితనానికీ మురిసిపోతున్నారు. అందువల్ల ‘తీర్పు’ కథ 64 లో అందించిన  చైతన్యాన్ని యివ్వాళ కొత్త తరం అందిపుచ్చుకోవాల్సిన అవసరం మరింత యెక్కువగా వుంది.

1948 – 55 మధ్య చేసిన రచనల తర్వాత , దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత 64 లో వెలువడ్డ  తీర్పు దాదాపు అదే కాలంలో రాసిన యజ్ఞానికి కృత్యాద్యవస్థలానో డ్రెస్ రిహార్సల్ లానో డ్రై రన్ లానో వుంటుంది. శ్రీరాములు నాయుడికి సుందరరామయ్య చిన్న మోడల్ లా వుంటాడు. శిల్ప పరంగా తీర్పులో నాటకీయతే యజ్ఞంలో  విశ్వరూపం ధరించి పెద్ద రంగస్థలం మీదికెక్కింది. సుందర రామయ్య యింట్లో వెలసిన కోర్టు హాలే యజ్ఞంలో న్యాయమంటపమైంది. రెండుచోట్లా అది కూలుతున్న దృశ్యమే. అయితే తీర్పు సింగిల్ పాయింట్ కథ. యజ్ఞం బహుముఖీన కథ.

తీర్పు న్యాయబద్ధం కానప్పుడు కుహనా అభివృద్ధిపై ఫ్యూడల్ ఆధిపత్యంపై  నిరసనగా బానిస బతుకు మీద తిరుగుబాటుగా సీతారాముడు కన్న కొడుకుని చంపుకొన్నాడు. సీతారాముణ్ణి అటువంటి వున్మాద స్థాయికి నడిపించిన పరిస్థితుల్ని యజ్ఞం కథలో విస్తృతంగానే వర్ణించినప్పటికీ – దాని బీజాలు తీర్పు కథలోనే వున్నాయి. సమస్య పరిష్కారానికి ‘అట్టలన్నీ చించేస్తే పీడా పోతుంద’ని భార్య అనొచ్చన్న వూహ వొకానొక దశలో సుందర రామయ్యకి కల్గుతుంది. ఆ వూహే సీతారాముడిలో ధ్వంస రచనాత్మకమైన నిరసన రూపం ధరించిందేమో!

సీతారాముడికి తనకేం కావాలో తెల్సు; కానీ సాధించుకొనే దారి లేదు. తన కొడుకు కంబారిగా వుండకూడదంటే తాను తీర్పరి స్థానంలోకి రావాలని సీతారాముడికి తెలుసో లేదో గానీ తీర్పులో సుందర రామయ్య రెండో కొడుక్కి మాత్రం స్పష్టంగా తెలుసు. వాడికి మొదట్నుంచీ తనకేం కావాలో తెల్సు. దాన్ని సాధించుకోడానికి వున్న ఆటంకాలేవో తెల్సు. వాటినెలా అధిగమించాలో వాద ప్రతివాదాల క్రమంలో నేర్చుకొన్నాడు. న్యాయాన్నో చట్టాన్నో తన చేతుల్లోకి తీసుకొంటేగానీ సరైన తీర్పు లభించదనే యెరుక పొందాడు. ఉత్పత్తిలో న్యాయబద్ధమైన భాగస్వామ్యం కోరుకోవడం దగ్గర మొదలైన అతని పోరాటం సమ న్యాయం కోసం మొత్తం వ్యవస్థ పైనే తిరుగుబాటుగా పరిణమించింది. కార్మికవర్గ నియంతృత్వ స్థాపన దిశగా ప్రయాణించింది. అప్పుడు  వుత్పత్తి ఫలాలమీదే కాదు – పెట్టుబడులు, వనరులు, వుత్పత్తి సాధనాలమీద కూడా శ్రామికుడికే సర్వాధికారాలూ దక్కుతాయి. ఇదంతా వొక గతి తార్కిక క్రమం.  విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ. ఆ సంఘర్షణ క్రమాన్ని, శుద్ధ సిద్ధాంతాన్నీ కథగా మలచిన కారా మాష్టారి నేర్పు అద్వితీయం. పైకి సరళంగా కనిపించే యీ తీర్పూ నేర్పూ రెండూ నిజానికి యెంతో సంక్లిష్టమైనవి. తన తీర్పుని అమలు పరచడానికి కథ చివర్లో రెండోవాడు పడిన యాతన వంటి యాతనే కేవల సిద్ధాంతాన్ని కళాత్మకంగా జీవితానికి అన్వయించడంలో  రచయిత కూడా అనుభవించి వుండొచ్చు. అయితే కథ పూర్తయ్యేసరికి సంక్లిష్టత విడిపోయి పాఠకుడికి చేరువై రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరింది. ప్రయోజనోద్దిష్టమైన సాహిత్యానికి వొక పాఠంలా కథ రూపొందింది.

కారా 64 తర్వాత రాసిన కథల్లో ప్రతిపాదించిన సామాజిక – ఆర్ధిక – రాజకీయ దృక్పథానికి సైద్ధాంతిక భూమికనేర్పరచిన కథ ‘తీర్పు’. మాష్టారి సృజనాత్మక రచనా మార్గంలో పెద్ద మలుపు. తర్వాతి తరానికి ఆయన అందించిన ముందుచూపు.

 [తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన ఎ.కె. ప్రభాకర్ ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలు , జాంబ పురాణం , రెండు దశాబ్దాలు కథ , బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది , నోబెల్ కవిత్వం , తొవ్వ ముచ్చట్లు  జూలూరి గౌరి శంకర్ గారి యుద్దవచనం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పుస్తకం ఇటీవలే వచ్చింది. అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జనవిముక్తికి దారి తీయాలని ప్రభాకర్ కోరుకుంటున్నారు.  ]

 

 వచ్చే వారం: అప్రజ్ఞాతం కధ గురించి ముళ్ళపూడి సుబ్బారావు 

 

తీర్పు  కథ: