డారియో ఫో – అతని నాటకరంగం

dario1[వ్యాసానికి చిన్న పరిచయం:

13 అక్టోబరు 2016 నాడు మరణించిన డారియో ఫో కు 1997లో నోబెల్ బహుమతి వచ్చింది.

ఆ సందర్భంగా కన్నడ రచయితా, నాటకకర్తా – ఎస్. బాబురావు – ఓ విపులమైన వ్యాసం వ్రాసి “మెయిన్‌స్ట్రీమ్” పత్రికలో 1998 జనవరిలో ప్రచురించారు.

డారియో ఫో నిష్క్రమించిన సందర్భంగా ఆ వ్యాసపు అనువాదం అందిస్తున్నాం]

*

ఈ ఏడాది సాహిత్యపు నోబెల్ బహుమతిని ఇటాలియన్ నాటక రచయితా, రంగస్థల కళాకారుడూ, రాజకీయ కార్యకర్త అయిన డారియో ఫో కు ప్రకటించడం ద్వారా స్వీడన్‌కు చెందిన నోబెల్ ఫౌండేషన్ సంస్థ వాళ్ళు చరిత్ర సృష్టించారనే అనాలి; ఇప్పటివరకూ సాహిత్యానికి ఇచ్చిన నోబెల్ బహుమతుల్లో ఇది అత్యంత వివాదాస్పదం మరి!

ఈ ప్రకటన పడమటి దేశాలలోని ‘ఉన్నత తరగతి’ సాహితీ వ్యవస్థలను ఒక కుదుపు కుదిపి వదిలిపెట్టింది. ఇది కలిగించిన అలజడిని అంచనా వెయ్యడానికి ఒక మార్గముంది: ఓ శుభోదయాన మన కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు  ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ‘నౌటంకీ’ నాటకకర్తకు ఎవార్డు ప్రకటిస్తే మన కాకలు తీరిన రచయితలంతా ఎలా స్పందిస్తారూ? – అదిగో ఆ బాపతు స్పందన వచ్చింది – పాశ్చాత్య దేశాల సాంస్కృతిక సాహిత్య రంగాల్లో ‘డారియో ఫో కు నోబెల్ బహుమతి’ అన్న వార్త విని. సమకాలీన నాటకరంగపు తీరుతెన్నుల గురించి అంతగా పట్టించుకోని పెద్దమనుషులు అడిగినా అడిగి ఉంటారు – “అసలీ డారియో ఫో అనే మనిషి ఎవరూ?” అని! సాహిత్యానికి సంబంధించి ఎన్‌సైక్లోపీడియాలలోనో, చరిత్ర గాథలనో తిరగేసినా…  రచయితల జీవిత చరిత్రలూ, అకారాది క్రమ వివరాలు ఉన్న నిఘంటువులూ తిరగేసినా వాళ్ళకి డారియో ఫో గురించి వివరాలు తెలిసే అవకాశం అతి తక్కువ. ఒక వేళ కాస్తో కూస్తో వివరాలు ఉన్నా,  ‘అతనో హాస్య నాటక రచయిత, నాటకరంగపు జోకరు’ – అన్న అంటీ ముట్టని వివరం తప్పించి సమగ్రమైన సమాచారం దొరకదు. ఇంకెవరైనా మరికాస్త రాస్తే – అతనో షోమాన్, ఒక బఫూనూ అనవచ్చు. నిజమే. అతను షోమాన్, క్లౌన్ అన్న మాట నిజమే. కానీ అతని పరిచయానికి ఈ మాటలు చాలవు. మరింకెన్నో చెప్పుకోవాలి.

డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడం వల్ల నొచ్చుకొని, కోపం తెచ్చుకొన్న వ్యవస్థల్లో ఇటలీకి చెందిన ఘనత వహించిన ‘రోమన్ కాథలిక్ చర్చి’ ఒకటి. ఈ నిర్ణయం తమకెంతో విస్మయం కలిగించిందనీ, ఇది అత్యంత ఊహాతీతమైన నిర్ణయమనీ ఈ చర్చివారు ఇప్పటికే అంగీకరించి ప్రకటించి ఉన్నారు.

కానీ విశ్వవ్యాప్తంగా ఉన్న – మరో ప్రపంచానికి చెందిన – రంగస్థల అభిమానులకు ఈ ప్రకటన ఆనందహేతువే. ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ (The Accidental Death of an Anarchist) లాంటి విజయవంతమైన తన ప్రముఖ నాటకాల ద్వారా డారియో ఫో ఇండియాలాంటి తృతీయ ప్రపంచపు దేశాలలో ఎనభైల నాటి నుంచీ బాగా పేరు నలిగిన మనిషే; కానీ ఈ అభిమానులు కూడా ‘ఇలాంటి అద్భుతం ఎలా జరిగిందా’ అని ఆశ్చర్యపడక మానరు.

ఇలాంటి విభిన్న విపరీత స్పందనలకు కారణం సుస్పష్టం. మనం ఆలోచించే బాణీలోంచీ, మనం అంగీకరించే పద్ధతిలోంచి చూస్తే డారియో ఫో ఒక రచయితా, నాటకకర్తా కానే కాదు. అమెరికాకు చెందిన ఆర్థర్ మిల్లర్, బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్ బాండ్, జర్మనీకి చెందిన పీటర్ హండ్కే ల లాంటి నాటక రచయిత గాదు. అసలు అన్నిటికీ మించి డారియో ఫో ముఖ్యంగా ఒక రాజకీయ కార్యకర్త. తను తన మిగతా పార్టీ సహచరుల కన్నా ‘అతి ఎక్కువ ఎరుపైన’ కమ్యూనిస్టు. ఆయన దృష్టిలో నాటకాలు రాయడమన్నది – ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాటకాలకు స్క్రిప్టు తయారు చెయ్యడమన్నది – ఒక గమ్యం కానేగాదు; ఓ గమ్యం చేరడానికి ఉన్న ఒకానొక మార్గం మాత్రమే. షేక్‌స్పియర్, మొలిరే (MOLIERE), బ్రెక్ట్ లాంటి అప్పటి, ఇప్పటి గొప్ప నాటక రచయితలందరి లాగానే డారియో ఫో కూడా రంగస్థలంతో అత్యంత సన్నిహిత ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి. తన నాటకాలలో ప్రముఖ భూమికలను పోషించిన మనిషి. అంతే గాకుండా ఆయన రంగస్థల కార్యకలాపమంతా అసలు సిసలు రాజకీయ కార్యకలాపమే. చుట్టూ అనుదినం జరిగే సంఘటనలూ, అసంఘటనలూ అతని నాటకాలకు ముడిపదార్థాలు. అవి అతనిపై కలిగించే ప్రభావమూ, ఒత్తిడుల ఫలితమే అతని నాటకాల స్క్రిప్టులు. ఆ స్క్రిప్టులని – ఆయా నాటకాల రిహార్సళ్ళలో, తన భార్య ఫ్రాంకా రమే (Franca Rame) సాహచర్యంలో మరింత నిర్దుష్టంగా రూపొందించి పదును పరుస్తాడు డారియో ఫో.

జీవితపు ప్రయోజనం, బతుకు పరమార్థం, మానవాళి గమ్యం – ఇలాంటి గంభీరమైన, ఘనమైన విషయాల గురించి గాఢంగా ఆలోచించే మేధావి రచయితల వర్గానికి చెందిన మనిషి కాడు డారియో ఫో. అతి వేగంగా క్షీణించి పోతోన్న మానవ సంబంధాల గురించీ, తన నుంచీ, తన పరిసారాల నుంచీ క్రమక్రమంగా దూరమైపోతున్న ఆధునిక మానవుని అసహాయత గురించీ డారియో ఫోకు పట్టదు. గతంలోకి శోధించుకుంటూ వెళ్ళి ఈనాటి సమస్యలకు అలనాటి చరిత్రలోనో, పురాణాలలోనూ సమాధానాలు వెతకడం కూడా ఫో కు చేతగాదు. రచయితగా ఆయన ధ్యేయం ఒక్కటే! సమాజంలోని కాపట్యాన్ని ఎండగట్టడం… ధనవంతులూ, మతాధికారులూ దొరతనంవారితో చేతులు గలిపి సామాన్య మానవుడ్ని ఎన్ని రకాలుగా హింసలకు గురి చేస్తున్నారో – ఆ తతంగాన్ని బయటపెట్టడం. తన రచనల ద్వారా, తన రంగస్థల కార్యకలాపాల ద్వారా ప్రపంచాని కాస్తో కూస్తో మార్చి దాన్ని మాములు మనుషులు మరికాస్త సుఖంగా బతకగల ప్రదేశంగా రూపొందించడమే ఫో అభిమతం. ‘ఇది జరగాలంటే మనకు మరికాస్త మంచి ప్రభుత్వం అవసరం… మంచి రాజకీయ వ్యవస్థ అవసరం… సాంఘిక వ్యవస్థ అవసరం’ అని డారియో ఫో అంటున్నట్టు అనిపిస్తుంది.

***

dario2డారియో ఫో 1926లో ఇటలీ దేశపు లంబార్డీ ప్రాంతంలో సాన్‌జియానో అన్న చోట పుట్టాడు. వాళ్ళ నాన్న రైల్వేలో స్టేషన్ మాస్టారు; తన తీరిక సమయాల్లో సరదాగా స్థానిక నాటకల్లో పాత్రలు పోషించేవాడు. బాగా చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నని నాటకాల్లో వేషాలు వేయడం గమనించిన డారియో ఫోకు సహజంగానే నాటకరంగమంటే ఆసక్తీ, గాఢ అనురక్తీ కలిగాయి. 1950లో – తన ఇరవై నాలుగో ఏట – ఫో మిలన్ నగరం వచ్చి అక్కడే ఓ నాటక సమాజంలో చేరాడు. ఆ సమాజం వాళ్ళు తమ సంగీత రూపకాలకు వ్యంగ్య వ్యాఖ్యానాలు రాసే పని అతనికి అప్పజెప్పారు. వాటి ఉద్దేశమల్లా ప్రేక్షకులను రంజింపజెయ్యడమే. అక్కడ పని చేస్తున్నప్పుడు అతనికి ఫ్రాంకా రమే అన్న సమమనస్కురాలితో పరిచయం అయింది. అది 1953లో పరిణయానికి దారితీసింది. ఫ్రాంకా రమే ఇటలీ దేశపు ‘గిల్లారీ’ అన్న సంచార నాటక ప్రదర్శకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. జానపద నాటక కళారీతుల బాగా తెలిసిన కుటుంబాలవి. అప్పటికప్పుడు ఆశువుగా నాటకాలు రూపొందించి ప్రదర్శించడంలో నిష్ణాతులు ఆ కుటుంబాల వాళ్ళు. వాళ్ళలో ఎక్కువగా చదువు ఉండకపోవడంతో వాళ్ళు తమ నాటకాలను రాత ప్రతుల మీద కన్నా తమ తమ (ఆశు) సృజనాత్మక శక్తి మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవారు. నటులంతా తమ తమ శక్తియుక్తులన్నీ నటనా ప్రావీణ్యాన్నీ జోడించి రంగస్థలం మీదనే అప్పటికప్పుడు ఓ నాటకాన్ని రూపొందించేవారు.

ఫ్రాంకా రమేతో పరిణయం ఫో కు ఓ వరంగా పరిణమించింది. నాటకరంగం సహజమూ, శక్తివంతమూ అవ్వాలంటే అది తన సంప్రదాయ రంగస్థల రీతులను అవగాహన చేసుకుని ఆ అవగాహన లోంచి పెరిగి పెద్ద అవడం అత్యవసరం అన్న విషయాన్ని ఫో అర్థం చేసుకొన్నాడు. తన భార్య ద్వారా జానపద రంగస్థల కళారీతుల్ని తెలుసుకొన్నాడు. మెళకువల్ని తెలుసుకొన్నాడు. ఆ  ఎరుక సాయంతో తన కళకు మెరుగులు దిద్దుకొన్నాడు.

సిద్ధాంతపరమైన భావ స్పష్టతకూ, తన రచనలు సాధికార రాజకీయ ప్రమాణాలు సంతరించుకోవడం కోసమూ – లెనిన్, మార్క్స్‌ల తర్వాత అంత గొప్ప వామపక్ష సిద్ధాంతవేత్త అని పేరు పడ్డ – గ్రామ్‌స్కీ అన్న ఇటాలియన్ సోషలిస్ట్ మేధావి రచనలను ఫో అధ్యయనం చేశాడు. ఐతిహాసిక సంప్రదాయాలలోనూ బ్రెక్ట్ ప్రతిపాదించిన ‘అన్యాక్రాంత ప్రభావం’ (Alienation effect) అన్న సూత్రంతోనూ పరిచయం ఏర్పరుచుకొన్నాడు. అలాగే మయకోవ్‍స్కీ నాటకాలనూ అధ్యయనం చేశాడు. వీటన్నిటి వల్ల డారియో ఫో లో గణనీయమైన పరిణామం సంభవించింది… ఒక కొత్త అభిజ్ఞత (Awareness) రూపుదిద్దుకుంది. ఆ మిలన్ నగరపు నాటక సమాజంలో పని చేయడం ద్వారా తన శక్తియుక్తుల్ని వృధా చేసుకుంటున్నానీ, మార్పుని నిరోధించే బూర్జువా వర్గపు ఆనందం కోసం సంగీత రూపకాల చెళుకులు రాయడం శుద్ధ పనికిమాలిన వ్యవహారమనీ గ్రహించాడు. 1968లో ఆ సమాజం నుంచి బయటపడి తన భార్యతోనూ, మరికొద్దిమంది కమ్యూనిస్టు మిత్రులతోనూ కలసి నువో సినా (Nuova Scena) అన్న మరో నాటక సమాజం స్థాపించాడు. అప్పటికే తను గ్రహించి, జీర్ణించుకొన్న అనేకానేక ప్రభావాల నేపథ్యంలో – అవసరమైతే ఆయా ప్రభావాలనూ, భావాలను మరి కాస్త మెరుగులు దిద్దుకుంటూ తన సాంఘిక, రాజకీయ, వ్యంగ్య నాటకాలకు రూపకల్పన చేశాడు. ‘మిస్ట్రియో బఫో’ (Mistero Buffo – 1969), ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ (The Accidental Death of an Anarchist – 1970), ‘ఇవ్వలేమూ, ఇవ్వం కూడానూ’ (Can’t Pay, Won’t Pay – 1974) – ఆ నాటకాలలో కొన్ని.

ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క నాటకరంగాన్ని నిర్మించడమన్నది డారియో ఫో లక్ష్యం. తన నాటక ప్రదర్శనల కోసం రంగస్థలాలనూ, నాటకాల హాళ్ళను అద్దెకు తీసుకోవడం మానేసి, వాటిల్ని కార్మికుల క్లబ్బుల్లో, పారిశ్రామిక ఆవరణల్లో ప్రదర్శించడం మొదలెట్టాడు. క్రమక్రమంగా తన రంగస్థల కార్యకలాపాల్లో కార్మికులని భాగస్వాములుగా చెయ్యగలిగాడు. వారి సాంస్కృతిక స్పృహను ఆ రకంగా పెంపొందించగలిగాడు.

డారియో ఫో తన నాటకాలకు ఇతివృత్తాలను తన పరిసరాల లోంచీ, సమకాలీన సమాజంలోంచీ గ్రహిస్తాడు. పోలీసుల క్రూరత్వం, రాజ్యపాలనలో ‘చర్చి’ జోక్యం, స్త్రీవాదం, తీవ్రవాదం, అవకతవక ఆర్ధిక విధానాల వల్ల పెరుగుతోన్న ద్రవ్యోల్బణం – ఇవీ, ఇలాంటివీ ఆయన ఇతివృత్తాలు. ఈ నాటకాల సాయంతో ఆయన వ్యవస్థలోని కాపట్యాలను బహిరంగపరచి ఎగతాళి చేస్తాడు. మతాధికారులూ, ధనాధికారులూ చేతులు కలిపి జనాన్ని ఎలా దోచుకొంటున్నారో చూపిస్తాడు. ఆ చూపించడం కూడా మళ్ళీ కరవవచ్చే వ్యంగ్యంతోనూ, పొట్టచెక్కలయ్యే హాస్యంతోనూ కలగలిపి చూపిస్తాడు. దాంతో ప్రేక్షకులందర్నీ నవ్వించడమూ, అలరించడమూ మాత్రమే కాకుండా వాళ్ళతో ఆయా విషయాలను గురించి గాఢంగా ఆలోచింపజేస్తాడు, కార్యాచరణకు సిద్ధపడేలా చేస్తాడు.

కాలం చెల్లిన ఊహాజనితమైన విషయాలనెప్పుడూ తీసుకోడు డారియో ఫో. ప్రజా బాహుళ్యానికి చెందిన ఏదేనీ విషయంగానీ సంఘటనగానీ జరిగినప్పుడు – దాని వాడీ వేడీ ఇంకా తగ్గకముందే – ఆ నేపథ్యంలో ఓ నాటకానికి రూపకల్పన జేసి ప్రదర్శిస్తాడు ఫో. ఉదాహరణకు పినో ఫినెల్లీ ( Pino Pinelli) అనే ప్రముఖ కమ్యూనిస్టు కార్యకర్తను అరాచకవాది అన్న ఆరోపణల మీద పోలీసులు అరెస్టు చేసి ‘లాకప్పు డెత్తు’కు గురి చేసినప్పుడు ఫో వెంటనే స్పందించాడు. పోలీసులు ఆ కేసును అణచిపెట్టి, ఆత్మహత్యగా వక్రీకరించి, తమ తమ ఆత్మరక్షణా… పధకాల రూపకల్పనకు పాల్పడినప్పుడు – ఆయా వివరాలు క్షుణ్ణంగా తెలిసిన డారియో ఫో ఇంకా ఆ కేసు కోర్టు గదుల్లో ఉండగానే ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ అన్న నాటకాన్ని రూపొందించి విజయవంతంగా ప్రదర్శించాడు. ఆ ప్రదర్శన జరిగిన చాలా రోజుల తర్వాత కోర్టువారి తీర్పు వచ్చింది. ఫో తన నాటకంలో చూపించిన విషయం నిజమని ఆ తీర్పు నిర్ధారించింది. పినెల్లీ నిర్దోషి అనీ, పోలీసు జులుం వల్లనే మరణించాడనీ ధృవీకరించింది.

తన నాటకాల ప్రదర్శనలలో ఫో – ఆ ప్రదర్శన ముగిసిన తరువాత – నాటకం గురించి చర్చ నిర్వహిస్తాడు, ప్రేక్షకులందరినీ ఆ చర్చలో భాగస్వాములు చేస్తాడు. ఆ రకంగా ప్రతి ప్రదర్శనా ప్రజాప్రదర్శనగా పరిణమిస్తుంది.

***

dario3తమ నువో సినా సమాజాన్ని స్థాపించిన కొద్ది సంవత్సరాలకే ఫో, ఫ్రాంకా రమేలు ఆ నాటక సమాజ స్థాపనా ప్రయోగం విఫలమయిందన్న సంగతి గ్రహించారు.  ఆ సమాజంలో ఉన్నది తమ తోటి కమ్యూనిస్టులే అయినా వాళ్ళు అధికారగణంతో కుమ్ముక్కై నువో సినా ధ్యేయాలనూ, లక్ష్యాలనూ దెబ్బతీస్తున్నారని ఆ దంపతులు గ్రహించారు. నువో సినా నిర్వహణలో కమ్యూనిస్టు పార్టీ అధినేతల నిరంతర జోక్యం కూడా వీళ్ళకి దుస్సహమయింది. అలా విడివడి మరో నలుగురు అతి సన్నిహితులతో కలసి ‘ల కమ్యూన్’ (LA COMMUNE) అన్న మరో చిన్న సమాజాన్ని స్థాపించారు వారు. ఆ విడివడటం పుణ్యమా అని అన్నేళ్ళుగా శ్రమపడి సంపాదించిన సంపత్తిని – లారీ, వ్యాన్లూ, ఎలక్ట్రికల్ పరికరాలు – ఫో వదులుకోవలసి వచ్చింది.

తన భావాలూ నాటకాల పుణ్యమా అని ఓ రంగస్థల సమాజాన్ని స్థాపించి కొనసాగించడమన్నది ఫోకు ఒక ఒడిదొడుకు వ్యవహారంగా పరిణమించింది. శక్తివంతమైన శత్రువర్గం ఏర్పడిందతినికి – మతాధికారులు, ప్రభుత్వ గణం, కాపిటలిస్టులు – అతను ఎవరినయితె ఎండగడుతున్నాడో వాళ్ళంతా సహజంగానే అతని మీద ధ్వజమెత్తారు. అతడినీ అతడి నాటక సమాజాన్నీ సమూలంగా నాశనం చెయ్యాలని వాళ్లంతా కంకణం కట్టుకొని ప్రయత్నించారు. అతని రాతప్రతులు ముందస్తుగా గవర్నమెంటు వారి అనుమతి పొంది తీరాలన్నారు. ఆ అనుమతి పొందే ప్రక్రియలో విపరీతమైన మార్పులకూ, కోతలకూ గురి అయ్యేవి. అలా సెన్సారయిన నాటకాలను మళ్ళీ ఏ మార్పులు చేర్పులూ చెయ్యకుండా ప్రదర్శిస్తున్నారని నిర్ధారించడం కోసమూ, అప్పటికప్పుడు రంగస్థలం మీద ఆశువుగా చేర్పులు చెయ్యడాన్ని అరికట్టడం కోసమూ ప్రేక్షక సముదాయంలో ప్రతీసారీ ఓ పోలీసు అధికారి ఉంటూ ఉండేవాడు. అయినా ఇలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు డారియో ఫో.

సంభాషణల సెన్సారు కత్తిరింపుల వల్ల కోల్పోయిన నాటక భాగాలను శరీరపు కదలికల ద్వారా, ముఖ కవళికల ద్వారా పూరించుకోడమూ నేర్చాడు. పెరోల్ మీద విడుదలయిన నేరస్థులు తమ తమ అనుదిన కదలికలను పోలీసులకు ముందస్తుగా విన్నవించుకోవలసిన రీతిలో డారియో ఫో కూడా తన నాటక సమాజం ఏ రోజు ఏ ఊర్లో ప్రదర్శన ఇవ్వబోతోందో – ఆ వివరాలు పోలీసులకు చెప్పి అనుమతి తీసుకోవలసి వచ్చేది. ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురవుతామన్న భయం వల్ల థియేటర్ల యజమానులు తమ ప్రాంగణాలను డారియో ఫో కు అద్దెకివ్వమనేవాళ్ళు. మిస్ట్రియో బఫో లాంటి ‘చర్చి వ్యతిరేక’ నాటకాలను ప్రదర్శించినపుడు ఆయా బిషప్పులు ఆ నాటకాల పోస్టర్లను గోడల మీద నుంచి చించెయ్యమని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఇవన్నీగాక భౌతిక దాడీ, హింసా ఉండనే ఉంది. అరెస్టులూ, నిర్బంధాలూ, జైళ్ళూ, లాకప్పులూ – వీటికి అంతే లేదు. డారియో ఫో నలభైసార్లు అరెస్టుకు గురయ్యాడు. కొన్నిసార్లు హత్యాప్రయత్నాలకూ గురయ్యాడు. ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’  నాటక ప్రదర్శనలో ఓసారి బాంబు పేలింది. మరోసారి ఫాసిస్టు ముఠాల వాళ్ళు ఫ్రాంకా రమేను కిడ్నాప్ చేసి నిర్బంధంలో ఉంచారు. మరొకరూ మరొకరూ అయితే ఇవన్నీ చూసి బెంబేలెత్తిపోయేవారేమో గానీ డారియో ఫో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎంతో నిబ్బరంతో ఎదుర్కున్నాడు. తన ఆదర్శాలకూ, రంగస్థల నమ్మకాలను సడలనివ్వకుండా నలభై సంవత్సరాల పాటు నిలచి ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన ఈ నోబెల్ బహుమతి అతని శత్రువుల్ని నిర్వీర్యం చేసి డారియో ఫో ను మరింత శక్తిమంతుడిని చేసే అవకాశం ఉంది.

డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడమన్నది రంగస్థల ప్రపంచానికి అనేక విధాలుగా ముఖ్యమైన విషయం. సాహిత్య రంగంలో నాటక రచన అన్నది చిన్నచూపుకు గురవుతోంది; కవిత్వం, నవల లాంటి ప్రక్రియలకున్న గౌరవం నాటక రచనకు లేదు. గత అరవై ఏళ్ళుగా సాహిత్యానికి నోబెల్ బహుమతి అందుకొన్న వాళ్ళ పట్టికను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 1936లో యుగెనీ ఓ నీల్, 1969లో శామ్యూల్ బెకెట్ – ఇప్పుడు డారియో ఫో. అంతే. అంతా కలసి ముగ్గురు. ఒక్కొక్కరికీ మధ్య దాదాపు ముప్ఫై ఏళ్ళ వ్యవధి.  బ్రెక్ట్ లాంటి లబ్దప్రతిష్ఠులు సైతం ఆ నోబెల్ ‘గౌరవాన్ని’ అందుకోలేకపోయారు; అది గౌరవమే అయిన పక్షంలో నాటకాలు రాయడం మరింత కష్టమయిన పని అవ్వడం వల్లనో లేదా ఆ నాటక రచన కళాప్రదర్శనకు ఉన్న మార్గాలు అతి పరిమితం అవ్వడం వల్లనేమో – అంకితభావంతో కథా కవిత సృష్టి చేసే వాళ్ళున్నంత విరివిగా నాటకకర్తలు ఎప్పుడూ లేరు మనకు. ఇప్పుడు ఇలా డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడమన్నది నాటక రచన ప్రక్రియకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని మనం ఆశించవచ్చు.

అలాగే డారియో ఫో బాణీ నాటకాలను ‘మోటు నాటకాలు’గా పరిగణించేవాళ్ళకూ కొదవేం లేదు. రాజకీయాలు, సాంఘిక ప్రయోజనాలు, వ్యంగ్యం, ఫార్సు, అసంబద్ధత, శ్రుతిమించిన హాస్యమూ కలగలసిన ఆయన నాటకాలను చాలామంది ఇప్పటిదాక ‘అశ్లీల’ (vulgar) నాటకాలని నిరసించారు. ఈ బహుమతి పుణ్యమా అని పరిస్థితులలో కొంత మార్పు రావచ్చు. వాటికి మరికాస్త ఆదరణా, ‘గౌరవం’ లభించవచ్చు. సాంఘిక సమస్యలను ఎత్తి చూపడానికీ, సామాజిక చైత్యన్యాన్ని కలిగించడానికీ నాటకరంగం ఒక ప్రముఖమైన మార్గం అన్న కనీస స్పృహ ప్రజల్లో రావచ్చు. సమస్యల గురించి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించడానికీ, ఆ ఆలోచనల సాయంతో సమాజంలో మార్పును తేవడానికీ రంగస్థలం ఒక శక్తివంతమైన ఆయుధం అన్న గుర్తింపు కలగవచ్చు.

మన దేశం విషయానికి వస్తే దీని ప్రాధాన్యత ఇంకా ఎక్కువ. ఇటలీ లాగానే మన దేశంలో కూడా సాంఘిక సమస్యలు అనేకం. రాజకీయ సమస్యలకి కొదవు లేదు. ఇటలీలో ‘గిల్లారీ’ బాణీ జానపద నాటక కళారూపాలు ఉన్నట్టే మనకూ మన మన శక్తివంతమైన జానపద నాటక సంప్రదాయాలు ఉన్నాయి. నిజానికి మన ప్రతీ భాషకు తమ తమ విస్పష్ట జానపద నాటక సంప్రదాయాలున్నాయి. ఇటలీలానే మనకూ రాజకీయ నేపథ్యం గల, చైతన్యవంతమైన ‘రంగస్థలం’  ఉంది; అది ఇంకా బాల్యావస్థలోనే ఉందన్న సంగతి వేరే మాట. డారియో ఫో కు ఈ విశిష్ట పురస్కారం లభించడమన్న విషయం మనకూ మన రాజకీయ నేపథ్యపు రంగస్థల వ్యవస్థకూ; మన మన జానపద నాటక కళారీతులకూ ఒక నూతన స్ఫూర్తిని కలిగించగలగాలి.

మన రంగస్థలాన్ని మరింత చైతన్యవంతం చెయ్యాలి, శక్తివంతం చెయ్యాలి. అలా అని మనమంతా డారియో ఫో ను గుడ్డిగా అనుకరించాలనీ గాదు; అతని ధోరణీ, అతని బాణీ, అతని పద్ధతులూ పరిశీలించి వాటిని మన పరిస్థితులకు అనుగుణంగా మలచుకొని స్వీకరించాలి. అలాగే మన సాహితీవేత్తలు నాటక రచనను కూడా చేపట్టవలసిన అవసరం ఉంది. డారియో ఫో రచన పద్ధతులను అధ్యయనం చెయ్యడం ద్వారా మన మన సామాజిక సమస్యల మీద విరివిగా నాటక రచన చేసి ఓ  ‘నాటకాల నిధి’ని సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ నిధి రూపకల్పన అన్నది రంగస్థలానికి ఎంతో అవసరం. దేశానికి ఇంకా అవసరం.

 

ఆంగ్లం: ఎస్. బాబూరావు

తెలుగు: దాసరి అమరేంద్ర

*