పెద్ద దర్వాజా

20140602_162427

రెండు చేతులు చాచి

ఆప్యాయంగా తడమటం

ఎంతిష్టమో

ఎన్ని జ్ఞాపకాలు

ఎన్నెన్ని అనుభూతులు

మౌనంగా ఉన్నా

వేన వేల అనుభవాలు దాచుకున్న

నువ్వంటే ఎంతిష్టం

మొదటిసారి నిన్ను తాకిన జ్ఞాపకం

ఇంకా వెచ్చగానే ఉంది.

ఉరుకులు పరుగుల వేగం

ఆశ నిరాశల దాగుడు మూతలు

చెప్పుల్లోకి కాళ్లు పరుగెత్తిన ప్రతీసారీ

దిగాలుగా వేళాడిన నీ చూపు

నేను చూసుకుంటానులే వెళ్లు

అంతలోనే భరోసా

నిన్ను బంధించిన ప్రతీసారి ఏదో

తప్పు చేస్తున్న భావన

ఎవరికీ నేను గుర్తులేకపోయినా

నువ్వు మాత్రం నన్ను మరిచిందెప్పుడు

నాకోసం ఎదురుచూపులతో అలా

నిలబడింది నువ్వే కదా!

అలసిన మనసుతో

నిస్సత్తువ కాళ్లతో

నిన్ను పట్టించుకోకపోయినా

నువ్వు అలిగింది లేదు

క్షేమంగా చేరాననే తప్తి

నీ దేహమంతా ఉండేది

నీకు అలసట లేదు

అనురాగం తప్ప

కోపం లేదు

ప్రేమ తప్ప

పలాయనం లేదు బాధ్యత తప్ప

నిన్న విసురుగా తోసేసినా

అదే ప్రేమ…. ఎలా

రాగద్వేషాలు నాకే కాని

నీకు లేవు కదా!

ఎలా ఉంటావు అలా

అసలు ఇంత బాధ్యత ఎందుకు నీకు

ఎక్కడ పుట్టావో

ఎలా పెరిగావో

ముక్కలు ముక్కలుగా చేసి

నిను మా వాకిట్లో బంధించి

బాగున్నావు అని మురిపెంగా చూసుకున్నా

నీ కన్నీటి చుక్కలని ఏ రోజూ

తుడిచింది లేదు

10656520_722722464466810_1289381775_n

నా చిట్టితల్లి ఇంట్లో ఒంటరిగా ఉంటే

నువ్వే కదా భరోసా

అలసిన నా కళ్లు విశ్రాంతి కోరితే

అసలు నాకు రక్షణ నువ్వే కదా!

పండగొస్తే నీకే సంతోషం

చుట్టాలొచ్చినా నీదే ఆనందం

ఏమీ మాట్లాడవు – మౌనంగానే ఉంటావు.

నిన్ను ఆప్యాయంగా తడిమి ఎన్నాళ్లయిందో

నిన్ను సింగారించి ఎన్ని నెలలు గడిచాయో

నీకోసం ఒక్క క్షణమైనా ఆలోచించానా

ఊహూ.. గుర్తు కూడా లేదు

నిన్ను ఆప్యాయంగా నిమిరి

నీ రెండు రెక్కల్ని

ప్రేమగా ముద్దాడి

దగ్గరగా చేర్చి

మనసారా చూసుకొని

భరోసాతో ఇంట్లోకి నేను

నా వెనకాలే అలా

చిరునవ్వుతో నువ్వు…

(తెలంగాణ పల్లెల్లో ఇంటిముందు తలుపుని దర్వాజా అని పిలుస్తారు)

-ఎస్.గోపీనాథ్ రెడ్డి

ఫోటో: కందుకూరి రమేష్ బాబు